పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

లేవీయకాండము 10:1
అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా-

ఈ వచనంలో అహరోను కుమారులైన నాదాబు అబీహులు "యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని" ఆయన సన్నిధికి తెచ్చినట్టుగా మనం చూస్తాం. దీనిని మనం రెండు కోణాల్లో అర్థం చేసుకోవచ్చు.

1. ధూపం వేసే పనిని దేవుడు వారికి ఆజ్ఞాపించలేదు. ఆ పని ప్రధానయాజకుడైన అహరోనుకు మాత్రమే అప్పగించబడింది (నిర్గమకాండము 30:7,8) కానీ వారు తెగించి "యెహోవా తమ కాజ్ఞాపింపని" కార్యానికి పూనుకున్నారు. దానికి కారణాలేంటో ముందు ముందు చూద్దాం.

2. వారు ధూపార్తులలో నింపిన అగ్ని కూడా దేవుడు ఆజ్ఞాపించింది కాదు. అందుకే "యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని" అని రాయబడింది. ధూపం వేసే అగ్నిని బలిపీఠం నుండి తీసుకోవాలి (సంఖ్యాకాండము 16:46), ఆ అగ్ని స్వయంగా దేవుని యొద్దనుండి దిగివచ్చింది (లేవీకాండము 9:24) కానీ వారు కృత్రిమంగా తయారుచేసిన వేరొక అగ్నిని వినియోగించబోయారు.

ఇంతకూ వారు ఎందుకిలా చేసారో ఆలోచించే ప్రయత్నం చేద్దాం;

1. దేవుడు అహరోనుతో పాటు వీరిని కూడా ఘనపరుస్తూ వచ్చాడు. దేవుణ్ణి చూసే భాగ్యం కూడా వీరికి ఆయన అనుగ్రహించాడు (నిర్గమకాండము 24:1). ఈవిధంగా వారికి లభించిన ఘనతను బట్టి మేమేం చేసినా చెల్లిపోతుంది అనే అహం వీరిలో చోటుచేసుకుని ఉండవచ్చు.

2. దేవునికోసమే చేస్తున్నాము కాబట్టి మనం ఎలా చేసినా ఆయన అంగీకరించేస్తాడు ఆయన ఆజ్ఞతో నిమిత్తం లేదు అనే ఆలోచన వీరిలో పుట్టియుండవచ్చు.

3. 8,9 వచనాల ప్రకారం ఆ సమయంలో వీరు మద్యం సేవించియుండవచ్చు. అందుకే విచక్షణ కోల్పోయి "యెహోవా తమ కాజ్ఞాపింపని" కార్యానికి పూనుకుని, పైగా "వేరొక అగ్నిని" ఆయన సన్నిధిలోకి తీసుకువచ్చారు. అది ఆయన దృష్టికి ఘోరపాపంగా ఎంచబడింది. అందుకే ఆయన వారిని ఏం చేసాడో చూడండి.

లేవీయకాండము 10:2
యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.

పై వచనంలో నేను వివరించిన కారణాలను బట్టి ఆయన నాదాబు అబీహుల మీదకు తన అగ్నిని పంపి వారు చనిపోయేలా కాల్చివేసినట్టు ఈ వచనంలో మనం చూస్తాం. ఆయన సన్నిధిలోకి వీరు వేరొక అగ్నిని అనగా అన్యాగ్నిని తీసుకువచ్చారు కాబట్టి ఇప్పుడు అదే దేవుని సన్నిధినుండి అగ్ని దిగివచ్చి వీరిని కాల్చివేసింది.

ముందటి అధ్యాయంలో ఆయన ఇదే అగ్నిని పంపి బలి అర్పణలను దహించడం ద్వారా అహరోను యాజకత్వాన్ని అతని పరిచర్యను అంగీకరించడం మనం చూసాం (లేవీకాండము 9;24). ఇప్పుడు అతని కుమారులైన నాదాబు అబీహులు చేసినదాని పట్ల తిరస్కారాన్ని తెలియచెయ్యడానికి కూడా ఆయన అదే అగ్నిని వినియోగించుకున్నాడు. వారి అవిధేయతకు ఆ అగ్నితోనే భయంకరమైన తీర్పు తీర్చాడు. ఒకే అగ్ని రెండు విధాలుగా పనిచేసింది. పరిశుద్ధాత్ముడి గురించి కూడా ఇలాంటి వర్ణననే మనం చూస్తాం (యెషయా 4:4). ఆయన దేవుని పిల్లలను పరిశుద్ధపరుస్తూ వారి అంతరంగంలోని కల్మషాన్ని దహిస్తాడు, అలానే దేవుని పిల్లలు కాని వారికి దహించు అగ్నిగా తీర్పు తీరుస్తాడు.

గమనించండి; నాదాబు అబీహులు దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఆయనను ఘనపరచలేదు కాబట్టి అగ్నిచేత కాల్చబడి చనిపోయారు. వారి పేరు నిలపడానికి సంతానం లేకుండానే చనిపోయారు (సంఖ్యాకాండము 3:4). అంటే దేవుని నామాన్ని వారు ఘనపరచలేదు కాబట్టి దేవుడు కూడా ఇక వారి పేరు లేకుండా తుడిచిపెట్టేసాడు. గతంలో వీరు దేవుణ్ణి చూసారు (నిర్గమకాండము 24:1). యాజకప్రతిష్టిత జరిగిన ఏడురోజులూ ఎంతో నిష్టగా అందులో పాల్గొన్నారు. ఆవిధంగా వీరికి ప్రజల మధ్యలో ఎంతో ఘనత సంతరించుకుంది. అయినా సరే దేవుని‌న్యాయం వీరిని దహించివేసింది. యాజకులుగా పిలవబడిన అహరోను నలుగురు కుమారులలో వీరిద్దరూ చనిపోతే మిగిలినవారికి పని ఎక్కువ ఔతుంది కదా, భవిష్యత్తు యాజకులుగా ప్రతిష్టించబడవలసిన అహరోను సంతానం తక్కువ ఔతుంది కదా అనే కారణాలేవీ ఆయన న్యాయన్ని అడ్డుకోలేకపోయాయి‌. వారు యవ్వనస్థులు కదా అనుభవం లేదు కదా, ధూపం వెయ్యడం వారికి ఇదే మొదటిసారి కదా అనే కారణాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోలేదు. ఆయన తన ఆజ్ఞల ఉల్లంఘన విషయంలో దహించు అగ్ని.

అయితే ఈవిషయంలో కొందరు వారు కేవలం వేరొక అగ్నిని తీసుకువచ్చారు అది చాలా చిన్న విషయం కదా ఆ మాత్రానికే వారిని చంపెయ్యాలా అనుకోవచ్చు. కానీ అది ఆయనకు మాత్రం చిన్న విషయం కాదు. ఎందుకంటే అది ఆయన ఆజ్ఞకు సంబంధించిన విషయం. ఆయన ఆజ్ఞకు సంబంధించినదేదీ ఆయనకు చిన్న విషయం కాజాలదు. దేవుని పిల్లలకు కూడా అలా కాకూడదు. ఆజ్ఞ పరిశుద్ధమైనది (రోమా 7:12).

అప్పుడే నూతనంగా ప్రత్యక్షగుడారం ఏర్పడింది. నూతనంగా యాజకపరిచర్య ప్రారంభించబడింది. ఈ సమయంలోనే ఆయన తన ఆజ్ఞకు విరోధమైన పద్ధతిని శిక్షించకుంటే మానవ పతనస్వభావాన్ని బట్టి దేవుడేమీ పట్టించుకోడులే అన్నట్టుగా ఇంకా అనేకమైన స్వీయపద్ధతులు ఆ పరిచర్యలో చోటుచేసుకునే ప్రమాదం ఉంది. అందుకే దేవుడు తన న్యాయాన్ని కుమ్మరించి అహరోనుకూ అతని మిగిలిన సంతానానికీ భయం పుట్టించాడు‌. ఆవిధంగా తనను తాను మహిమపరచుకున్నాడు (దీని గురించి 3వ వచనంలోనూ చూద్దాం). చూస్తున్న ప్రజలకు కూడా దేవుడు తన ఆజ్ఞల విషయంలో ఎంత తీవ్రంగా స్పందిస్తాడో ఇది తెలియచేస్తుంది. ఇలాంటి సంఘటనే మనం ప్రారంభ సంఘస్థులైన అననీయ సప్పీరాల విషయంలోనూ చూస్తాం (అపొ.కా 5:1-10). ఒక అబద్ధం చెప్పినందుకు వారు మరణానికి గురయ్యారు‌.

ఇక నాదాబు అబీహుల విషయంలో జరిగిన ఈ సంఘటనను బట్టి మనం ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. ఆయన ఆరాధనకు సంబంధించిన విషయంలో ఆయన ఆజ్ఞాపించని ఏ ఆచారాన్నీ మనం సంఘంలో ప్రవేశపెట్టకూడదు పాటించకూడదు. అలా చేస్తున్నవారందరూ నాదాబు అబీహులు చేసిన పాపమే చేస్తున్నారు. దేవునికోసమే చేస్తున్నాము కదా, భక్తితోనే చేస్తున్నాము కదా అనే సాకులకు ఇక్కడ తావులేదు. నాదాబు అబీహులు కూడా దేవునికేగా ధూపం వెయ్యబోయారు? అగ్ని మారినంత మాత్రాన ధూపద్రవ్యాల వాసన ఏమీ మారిపోలేదుగా? కానీ ఏమైంది? కాబట్టి దేవుణ్ణి దేవుడు ప్రవేశపెట్టిన పద్ధతిలోనే అనగా ఆయన ఆజ్ఞానుసారంగానే సేవించాలి. స్వేచ్చారాధనలనూ పతనస్వభావియైన మనిషి ఊహనుండి పుట్టిన పద్ధతులనూ ఆయన ఆరాధనగా అంగీకరించడు. పైగా దానిని ఆయన అవిధేయతకు సంబంధించిన ఘోర పాపంగా ఎంచి తీర్పు తీరుస్తాడు. కయీను అర్పణ నుండే ఈ హెచ్చరికను మనం పొందుకున్నాం. అందుకే పౌలు "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి" (2థెస్సలొనికయులకు 2:15) అని హెచ్చరిస్తున్నాడు. ప్రస్తుతం సంఘంలో క్రిస్మస్, లెంట్, గుడ్ ఫ్రై డే, ఈస్టర్ వంటి వాక్యాధార రహిత ఆచారాలనూ అన్యాచారాలనూ సంఘంలో ప్రవేశపెడుతున్నవారూ పాటిస్తున్నవారూ ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. "దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు" (ప్రసంగి 8:11) అని రాయబడినట్టుగా అలాంటివారిని దేవుడు వెంటనే శిక్షవిధించకపోవడం చూసి నిర్భయంగా ఇలాంటి ఆచారాలన్నీ ప్రవేశపెడుతున్నారు, పాటిస్తున్నారు. కానీ "నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు" (కీర్తనలు 73:18) అని రాయబడినట్టుగా అవిధేయత విషయంలో ఆయన లెక్క అడగకమానడు. సరిచేసుకోకుండా ఆయన దీర్ఘశాంతాన్ని అంగీకారంగా భావిస్తే శిక్షించకా మానడు.

ద్వితియోపదేశకాండము 32:35 వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.

లేవీయకాండము 10:3
అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను ఇది యెహోవా చెప్పిన మాట - నాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును.

ఈ వచనంలో దేవుడు కుమారులు చనిపోయిన బాధలో ఉన్న అహరోనుకు మోషే ద్వారా "నాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును" అని పలకడం మనం చూస్తాం. అంటే; అహరోను కుమారులు ఆయన ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకువచ్చి ఆయన పరిచర్యను అపవిత్రం చేయబోయినా ఆయన వారికి శిక్షవిధించడం ద్వారా తన పరిచర్యను పరిశుద్ధపరుచుకున్నాడు. ప్రజలముందు తనను తాను మహిమపరచుకున్నాడు. ఈ మాటలను బట్టి దేవునికి రెండు విధాలుగా మహిమ‌‌‌ కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి.

1. మనుషులు ఆయనను తన ఆజ్ఞానుసారంగా ఆరాధించినప్పుడు.
2. అవిధేయులకు ఆయన శిక్ష విధించినప్పుడు.

ఇలా రెండు విధాలుగా కూడా ఆయనకు మహిమ కలుగుతుంది. ఏవిధంగానైనా ఆయనను ఆయన పరిశుద్ధపరచుకుంటాడు.

అహరోనుకు ఈ మాటలు హెచ్చరికగా చెప్పబడుతున్నప్పటికీ ఇందులో ఆయన ఓదార్పు కూడా కనబడుతుంది. అహరోను కనుక దేవుడు ఏం చేసినా న్యాయంగానే చేస్తాడని తన మహిమ కోసమే చేస్తాడని అందులో భాగంగానే అవిధేయులైన తన కుమారులను దహించివేసాడని అర్థం చేసుకున్నప్పుడు అది అతనికి ఓదార్పే. అందుకే క్రింది వచనంలో అతనిని ఆయన ఏడ్వవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు.

లేవీయకాండము 10:4
అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.

ఈ వచనంలో మోషే చనిపోయిన నాదాబు అబీహులను సమాధి చేసే కార్యక్రమాన్ని ఉజ్జీయేలు కుమారులకు అప్పగించడం మనం చూస్తాం. ఇక్కడ "అహరోను మౌనముగా నుండగా" అనే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అంటే అతను బాధలో అలా ఉన్నాడని మాత్రమే కాదు. చనిపోయిన తన కుమారుల విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఏదీ మాట్లాడకుండా కూడా ఉన్నాడు. ఇందుకేనా నేను ఇంత కష్టపడింది, ప్రధానయాజకుడిగా ఏర్పరచబడింది అని పిర్యాధులు చెయ్యడం కానీ కనీసం సణుగుకోవడం కానీ అతను చెయ్యడం లేదు. ఆవిధంగా అతను తన నోటితో ఎలాంటి పాపమూ చెయ్యకుండా జాగ్రత్తపడ్డాడు. ఎందుకంటే అతను దేవుడు చేసిన ఆ కార్యం న్యాయమని భావించాడు. ఇదే నిజమైన దేవుని పిల్లల లక్షణం. దేవుడు న్యాయంగా స్పందించినప్పుడు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకున్న భక్తులెవ్వరూ దానికి వ్యతిరేకం కాలేరు. అది వారికి ఎంత బాధకలిగించేదిగా ఉన్నప్పటికీ అహరోనులా మౌనంగానే ఉంటారు. "నాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును. ప్రజలందరియెదుట నన్ను మహిమపరచుకొందును" అనే ఆయన మాటలను తలచుకుని ఓదార్పు పొందుతారు.

అదేవిధంగా ఇక్కడ దేవుడు అవిధేయులుగా చనిపోయిన వారి దేహాలు కూడా మర్యాదగా పాతిపెట్టబడడానికి ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. "పాళెము వెలుపలికి" మోసుకుపోండి అంటే అర్థం అదే. చనిపోయినవారికి అక్కడే సమాధి చేస్తారు. కాబట్టి వారు అవిధేయులైనప్పటికీ తన పోలిక తన స్వరూపంలో సృష్టించబడిన నరులు మరియు యాజకులుగా ప్రతిష్టించబడినవారు కాబట్టి వారి దేహాల విషయంలో ఆయన అలాంటి శ్రద్ధను చూపిస్తున్నాడు. ఇది మానవులందరి పట్లా ఉండే ఆయన సహజ గౌరవాన్ని తెలియచేస్తుంది. ఉదాహరణకు ఆయన దుష్టుడైన ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేసినవారికి కూడా తీర్పు తీర్చాడు (ఆమోసు 2:1).

లేవీయకాండము 10:5
మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి.

ఈ వచనంలో ఉజ్జీయేలు కుమారులు మోషే చెప్పినట్టుగానే నాదాబు అబీహుల శవాలను పాళెం వెలుపలికి తీసుకుపోవడం అనగా సమాధి చెయ్యడానికి తీసుకుపోవడం మనం చూస్తాం. అయితే దేవుని అగ్ని వారిని దహించివేసినప్పుడు వారి చొక్కాయిలు కూడా కాలకుండా ఎలా ఉన్నాయి అనే సందేహం ఇక్కడ కలగొచ్చు. కానీ దేవుని అగ్ని వారినేమీ భస్మం చేసెయ్యలేదు. కేవలం వారు చనిపోయే స్థాయిలో ఒక మెరుపులా మాత్రమే వారిని తాకింది. అందుకే లేఖనంలో వారు అగ్ని చేత భస్మం అయ్యారు అని కాకుండా ఆ అగ్ని వల్ల చనిపోయారు అనీ రాయబడింది (లేవీకాండము 16:1). ఆ సమయంలో ఎంతో నాణ్యతతో అల్లబడిన వారి యాజకవస్త్రాలు పూర్తిగా కాలిపోయే అవకాశం ఉండదు. అక్కడ దేవుడు వారిపైకి తన అగ్నిని పంపిన ఉద్దేశం వారిని చంపడమే తప్ప భస్మం చెయ్యడం కాదు.

లేవీయకాండము 10:6
అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో - మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజము మీద ఆగ్రహపడకుండు నట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటి వారందరు ఏడవవచ్చును.

ఈ వచనంలో మోషే ద్వారా దేవుడు అహరోనుకూ అతని కుమారులకూ "మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజము మీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. సాధారణంగా ఆ సంస్కృతిలో చనిపోయినవారికోసం అలాంటి కార్యక్రమాలు చెయ్యడం సాధారణం. కానీ వీరు అభిషేకించబడిన యాజకులు కాబట్టి అలా చెయ్యకూడదు. చేస్తే ఆయన దృష్టికి అవిధేయత చూపించి మరణశిక్షను తెచ్చుకోవడమే ఔతుంది. ఎందుకంటే వీరు ప్రస్తుతం ప్రజలకూ దేవునికీ మధ్యలో మధ్యవర్తులుగా ఉండి నిర్విరామంగా తమ తమ పరిచర్యను జరిగించాలి. దానికి ఆటంకం కలిగేలా వీరు ఏడుస్తూ కూచుంటే ప్రజలపైకి కూడా ఆయన ఆగ్రహం దిగివచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. పైగా దేవుడు చేసింది న్యాయమని వారు భావించినప్పుడు అలా చెయ్యవలసిన అవసరం లేదు. వారి బలి అర్పణలను అంగీకరించిన అగ్నినే వారి అవిధేయతను బట్టి శిక్షనూ విధించింది. ఆయన అంగీకారాన్ని బట్టి ఆనందించిన వీరు ఆయన శిక్షను కూడా అంగీకరించాలి.

"యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటి వారందరు ఏడవవచ్చును"

ఇక్కడ చనిపోయినవారు తమ అవిధేయతను బట్టే చనిపోయినప్పటికీ దేవుడు వారికి దక్కవలసిన గౌరవం దక్కకుండా చెయ్యడం లేదని‌ మరోసారి గమనిస్తున్నాం.

లేవీయకాండము 10:7
యెహోవా అభిషేకతైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ల కూడదనెను. వారు మోషే చెప్పినమాట చొప్పున చేసిరి.

ఈ వచనంలో అహరోను మరియు అతని మిగిలిన ఇద్దరు కుమారులు వారు అభిషేకించబడిన కారణాన్ని బట్టి బయటకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించబడడం వారు మోషే చెప్పినట్టుగానే చెయ్యడం మనం చూస్తాం. వారు మోషే చెప్పినట్టుగానే "తల విరియబోసుకోకుండా బట్టలను చింపుకోకుండా ప్రత్యక్షగుడారపు ద్వారం దాటి బయటకు వెళ్ళకుండా" ఉన్నారంటే వారు దేవుడు చేసింది న్యాయమని అంగీకరించారు. ఈరోజు నాదాబు అబీహుల చరిత్రను చదువుతున్న ఎంతోమంది అంత చిన్నతప్పుకే దేవుడు చంపేసాడా అని ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడు అహరోను మరియు అతని ఇతర కుమారులు ఇంకా ఎక్కువగా అభ్యంతరపడే అవకాశం ఉంది. కానీ వారెవ్వరూ అలా ఆలోచించట్లేదు. ఎందుకంటే పైన తెలియచేసినట్టుగా దేవుడు చేసింది న్యాయమని వారు గుర్తించారు. ఈ లక్షణం దేవుని పిల్లలు అందరూ సంతరించుకోవాలని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను.

లేవీయకాండము 10:8
మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు-

ఇంతవరకూ మోషే ద్వారా అహరోనుతో మాట్లాడిన దేవుడు ఈ వచనం మరియు క్రింది వచనాలలో స్వయంగా అహరోనుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం అతను ప్రధానయాజకుడిగా ప్రతిష్టించబడ్డాడు. అలానే ఈ సమయంలో దేవుడే స్వయంగా అతనితో మాట్లాడడం అతనికి గొప్ప ఓదార్పు కూడా. కష్టసమయంలో ఆయన పిల్లలకు ఆయన మాటలకు మించిన ఓదార్పు మరేం ఉంటుంది? ఆ సమయంలో ఆయన హెచ్చరికలు కూడా మనకు ఆదరణ కలిగించేవే. ఆయన మాటలతో హెచ్చరికలతో నిండిన వాక్యాన్ని (బైబిల్ ను) కలిగిన మనమందరం ఎంతో ధన్యులం.

కీర్తనలు 119:50 నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

లేవీయకాండము 10:9
మీరు చావ కుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.

ఈ వచనంలో దేవుడు అహరోనుకూ అతని సంతానానికీ "ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దానికి కారణమేంటో క్రింది వచనాలలో వివరించబడింది. బహుశా నాదాబు అబీహులు కూడా ఆ సమయంలో‌ ద్రాక్షారసం సేవించియుంటారు అందుకే ఆయన వారిని శిక్షించిన సందర్భంలోనే ఈ మాటలు చెబుతున్నాడు.

లేవీయకాండము 10:10,11
మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదాని నుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును, యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.

ఇవే మాటలు మరో సందర్భంలో కూడా జ్ఞాపకం చెయ్యబడ్డాయి (యెహెజ్కేలు 44:21-24). ఈ యాజకులు ప్రత్యక్షగుడారంలో పరిశుద్ధమైన పరిచర్య చేస్తూ ప్రజలకు ఏది అపవిత్రమో ఏది పవిత్రమో ఇలా దేవుని ఆజ్ఞలన్నిటినీ బోధించాలి కాబట్టి వాటి విషయంలో విచక్షణ కోల్పోకుండా ఉండేలా మద్యాన్ని కానీ ద్రాక్షారసాన్ని కానీ త్రాగకూడదు. ఎందుకంటే ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ప్రజలకు బోధిస్తూ వారి పాపాలకు వివిధరకాల బలులను అర్పించవలసిన బాధ్యత కలిగినవీరు మత్తులుగా మారితే ఆ కార్యాలను సమర్థవంతంగా నిర్వహించలేరు, దానివల్ల ప్రజలపైకి దేవుని ఆగ్రహం వస్తుంది కాబట్టి మధ్యవర్తులైన వీరు "ప్రత్యక్షపు గుడారములోనికి" పరిచర్య నిమిత్తం వచ్చేటప్పుడు వాటిని త్రాగకూడదు. ఎలాంటి విధులు నిర్వహించేవారైనా మద్యం సేవించి చెయ్యరు కదా అలాంటిది ఎంతో భక్తితో శ్రద్ధతో పవిత్రతతో చెయ్యాల్సిన దేవుని మద్యం సేవించి ఎవరైనా ఎలా చెయ్యగలరు. నాదాబు అబీహులు కూడా ఆ మద్యం మత్తులోనే విచక్షణ కోల్పోయి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకువచ్చి ఉంటారు. అందుకే అలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఆయన ఈ మాటలు చెబుతున్నాడు. తదుపరి అధ్యాయం నుండి ప్రజలకు ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ఏ అపవిత్రతకు ఎలాంటి బలులు అర్పించాలో ఈ జాబితానంతా మనం చదువుతాం.

ఈ నియమం సంఘ పరిచర్యలో ఉన్నవారికీ (1 తిమోతీ 3:3), విశ్వాసులు అందరికీ కూడా (ఎఫెసీ 5:18) వర్తిస్తుంది. ఎందుకంటే పరిచర్యలో ఉన్నవారు ప్రతీరోజూ దేవుడు అప్పగించిన వివిధ బాధ్యతల్లో సమర్థవంతంగా పని చెయ్యాలి కాబట్టి, విశ్వాసులు కూడా సువార్త భారం కలిగియుండి ప్రజలకు మాదిరిగా జీవించాలి కాబట్టి దుర్వ్యాపారం కలిగిన మద్యానికి దూరంగా ఉండాలి. వాక్యం ఆదేశిస్తున్నట్టుగా "ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యాన ముంచుకోవాలంటే" (ఫిలిప్పీయులకు 4:8) మత్తులో విచక్షణ కోల్పోయే వారంగా కాకుండా ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడం తప్పనిసరి.

ఎఫెసీయులకు 5:18 మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మపూర్ణులైయుండుడి.

ఇక్కడ మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే; "మద్యముతో మత్తులైయుండకుడి ఆత్మపూర్ణులైయుండుడి" అన్నప్పుడు ఆత్మపూర్ణులంగా కాకుండా చేసే దేనితోనూ మనం నిండియుండకూడదు అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు మద్యంతో నిండియునప్పుడే కాదు ధనాశతో నిండియున్నా కోపంతో నిండియున్నా కామంతో నిండియున్నా ఇలా దేవుడు పాపంగా పరిగణించిన దేనితో మనం నిండియున్నప్పటికీ విచక్షణ కోల్పోతాం. అలాంటి వారు వాక్యానుసారంగా పరిచర్య చెయ్యలేరు, వాక్యానుసారమైన జీవిత మాదిరిని చూపించలేరు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం బాగా గుర్తుంచుకోవాలి.

లేవీయకాండము 10:12,13
అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్ల నెను మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.

ఈ వచనాల్లో మోషే అహరోను మరియు అతని కుమారులు యెహోవా హోమ ద్రవ్యంలోనుండి తినవలసిన భాగం గురించి తెలియచెయ్యడం మనం చూస్తాం. దానిని పరిచర్య చేస్తున్న వారు మాత్రమే అదే స్థలంలో తినాలి (లేవీకాండము 2:10). కుటుంబసభ్యులకు అందులో భాగం ఉండదు. దానిని బయటకు తీసుకువెళ్ళకూడదు. ఇక్కడ దేవుడు వారికి ఆంక్షలను విధించడమే కాదు వారిని పోషించే పోషకుడిగా కూడా మనం చూస్తున్నాం. ఇక "నేను అట్టి ఆజ్ఞను పొందితిని" అంటే ప్రస్తుతం మోషే అహరోనుకు అన్నీ నేర్పిస్తున్నాడు కాబట్టి అతనికి మొదటినుండీ దేవుడు ఆజ్ఞాపించిన విషయాలన్నీ వరుసగా తెలియచేస్తున్నాడు.

లేవీయకాండము 10:14
మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠిత మైన జబ్బను మీరు, అనగా నీవును నీతో పాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు.

ఈ వచనంలో దేవుడు అహరోను మరియు అతని కుమారులు తమ కుటుంబంతో కలసి తినవలసిన భాగాల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ భాగాలను వారు ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబంతో కలసి తినవచ్చు (లేవీకాండము 7:31-34). అయితే వాటికి ఉన్న ఘనతను బట్టి శుభ్రంగా ఉన్న ప్రదేశంలోనే అనగా పవిత్రస్థలములోనే వారు వాటిని తినాలి.

లేవీయకాండము 10:16-18
అప్పుడు మోషే పాపపరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలము లోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయ ముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.

పాపపరిహార్థ బలుల్లో అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తాన్ని తీసుకుపోయే పశువును యాజకులు తినకూడదు, దానిని మొత్తంగా కాల్చివెయ్యాలి (లేవీకాండము 6:30, హెబ్రీ 13:10,11), కానీ ప్రజలు అర్పించే పాపపరిహారార్థ బలుల్లోని భాగాలను "సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై" వారు తినాలి (లేవీకాండము 6:25,26). కానీ ఇక్కడ అహరోను మరియు అతని కుమారులు అలా తినవలసిన మేకను తినకుండా కాల్చివేసారు. అందుకే మోషే వారిని గద్దిస్తూ సరిచేస్తున్నాడు. అయితే వేరొక అగ్నిని తీసుకెళ్ళినందుకే దేవుడు నాదాబు అబీహులను చంపేస్తే ఈ విషయంలో వీరిని ఎందుకు చంపలేదనే ప్రశ్న కొందరికి తలెత్తవచ్చు. దానికి క్రింది వచనాల్లో సమాధానం చూద్దాం.

లేవీయకాండము 10:19,20
అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలిపశువును దహనబలిద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన యెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.

ఈ వచనాల్లో అహరోను ఆ మేకను ఎందుకు తినలేదో కారణాన్ని మోషేకు తెలియచెయ్యడం మనం చూస్తాం. నాదాబు అబీహులు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తెగింపుతో వేరొక అగ్నిని తీసుకెళ్ళారు. అందుకే చనిపోయారు. ఒకవేళ యాజకులు పొరపాటుగా అలా ఏదైనా చేసుంటే దానికి ఏం చెయ్యాలో ఆయన ముందే పరిష్కారం సూచించాడు (లేవీకాండము 4:3,4). వారి విషయంలో ఆ పరిష్కారం అనుమతించబడలేదంటే వారు ఉద్దేశపూర్వకంగానే తెగింపుతో అలా చేసారు‌ (మత్తులుగా). కానీ అహరోను అదేరోజున అనగా అదే మేక అర్పించబడిన రోజున దానిని తీసుకువచ్చిన తన కుమారులు చనిపోవడం చూసి ఇప్పుడు తాను ఆ మేకను తింటే దేవుని దృష్టికి మంచిది ఔతుందా అనే సందేహంతో మాత్రమే తినకుండా ఉన్నాడు. అంటే ఆ మేకను అర్పించడం విషయంలో సహకరించినవారు అవిధేయులుగా చనిపోయినప్పుడు ఇప్పుడు దానిని తింటే దేవుని దృష్టికి మంచిది కాదేమో అని అతను ఆలోచించాడు. ఇక్కడ అతను తెగింపుతో ఎలాంటి అవిధేయతా చూపించలేదు కానీ దేవుని దృష్టికి ఏది మంచి అనేదే ఆలోచిస్తున్నాడు. మరోవైపు కుమారులు చనిపోయిన బాధ కూడా అతనికి ఉంటుంది. అందుకే దేవుడు అతన్నీ అతని మిగిలిన కుమారులనూ శిక్షించలేదు. ఆ విధంగా అతను తినకుండా ఉన్నది మంచి ఉద్దేశంతో కాబట్టే "మోషే ఆ మాట విని ఒప్పుకొనెను" అని రాయబడింది. మోషే ఒప్పుకోవడమంటే దేవుని మాటను బట్టే అహరోను ఇచ్చిన సంజాయిషీని అంగీకరించాడని అర్థం. ఆయన మానవ బలహీతనలను అర్థం చేసుకునే దేవుడు. ఆయన తిరుగుబాటును శిక్షిస్తాడు, పొరపాటును క్షమిస్తాడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.