పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

లేవీయకాండము 20:1
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.

ఇప్పటివరకూ అనగా 18,19 అధ్యాయాల్లో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయంలో వాటిని ఉల్లంఘించినవారికి విధించవలసిన శిక్షల గురించి ఈ అధ్యాయంలో చూస్తాం. అలానే కొన్ని ఆజ్ఞలు ఇక్కడ మరలా జ్ఞాపకం చెయ్యబడ్డాయి.

లేవీయకాండము 20:2
ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏ మాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.

ఈ మోలెకు అనేవాడు కనానీయుల దేవుళ్ళలో ఒకడు. ఇతనికి వారు పసిపిల్లలను బలులుగా అగ్నిలో దహించేవారు. దానికి పురావస్తు ఆధారాలు కూడా లభించాయి.‌ ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వస్తూ అతని గుడారాన్ని కూడా మోసుకువచ్చినట్టు రాయబడింది (ఆమోసు 5:26). అంటే ఇశ్రాయేలీయుల్లో అవిధేయులైన కొందరు అతన్ని పూజించాలనే ఉద్దేశంతో ఉన్నారు. దానికి పసిపిల్లలను బలిగా అర్పించాలి. అందుకే అలాంటి క్రూరమైన కార్యానికి ఇశ్రాయేలీయులు కానీ వారిలోని పరదేశులు కానీ పాల్పడితే వారిని రాళ్ళతో కొట్టి చంపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు (లేవీకాండము 18:21 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 20:3
ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును.

ఇశ్రాయేలీయుల్లో ఎవరైనా తన సంతానాన్ని మోలెకుకు బలిగా అర్పిస్తే వారి మధ్యలో ఉన్న ప్రత్యక్షగుడారం కూడా ఆ పాపాన్ని బట్టి అపవిత్రపరచబడుతుంది. అందుకే ఆ వ్యక్తికి మరణశిక్ష విధించడం ద్వారా అతన్ని ప్రజల్లోనుండి కొట్టివెయ్యాలి. ఆవిధంగా ప్రత్యక్షగుడారం ప్రాయశ్చిత్తం చెయ్యబడుతుంది.

లేవీయకాండము 20:4,5
మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక, చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరిని ప్రజలలో నుండి కొట్టివేతును.

ఈ వచనాల ప్రకారం; మోలెకుకు తన సంతానాన్ని అర్పించిన వ్యక్తిని దాచిపెట్టకూడదు‌. దానిని చూసినవారు ఆ వ్యక్తికి మరణశిక్ష పడేలా సంబంధిత న్యాయాధికారులకు విషయం తెలియచెయ్యాలి. లేకుంటే వారు కూడా ఆ పాపంలో పాలివారై ప్రజల్లోనుండి కొట్టివెయ్యబడతారు‌.

లేవీయకాండము 20:6
మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టి వేతును.

కర్ణపిశాచి, సోదె అనేవి అపవాది శక్తితో పనిచేసే విద్యలు. అందుకే దేవుని ప్రజలు భవిష్యత్తును తెలుసుకోవడానికి వారిని ఆశ్రయించకూడదు. "వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో" అంటే వారిని ఆశ్రయించడం అని అర్థం. ఉదాహరణకు సౌలులా (లేవీకాండము 19:31 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 20:7,8
కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహో వాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను.

"మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి" అంటే ఆయనకు ప్రత్యేకంగా ఉండమని అర్థం. ఆయన కట్టడలను ఆచరించి వాటిని గైకొన్నప్పుడే అది సాధ్యమౌతుంది. ఆయన ఆ కట్టడలను బోధించింది ఆవిధంగా వారిని తనకోసం ప్రత్యేకించుకోవడానికే.

లేవీయకాండము 20:9
ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.

ఈ వచనం ప్రకారం; తల్లినైనా తండ్రినైనా దూషించిన వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇది ఒక వ్యక్తి తన తల్లితండ్రులకు ఉద్దేశపూర్వకంగా అవిధేయుడై ఆ పాపానికి పాల్పడినప్పుడు విధించవలసిన శిక్ష. అయితే అదే తల్లితండ్రులు దేవుని కట్టడలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి కుమారుడు వారికి అవిధేయుడైతే ఉదాహరణకు; వారు మోలెకుకు వారి సంతానమైన ఇతన్ని అర్పించాలని చూసినప్పుడు ఇతను తిరుగబడి వారిని దూషిస్తే ఇతన్ని శిక్షించకూడదు. శిక్షించవలసింది ఆ తల్లితండ్రులనే‌.

లేవీయకాండము 20:10-12
పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమునుతీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.

ఈ వచనాల ప్రకారం పరుని భార్యతో వ్యభిచరించినవాడికీ ఆ వ్యభిచారిణికీ అలానే వావి వరసలు తప్పి వ్యభిచరించినవారికీ మరణశిక్ష విధించాలి.

లేవీయకాండము 20:13
ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

ఈ వచనం ప్రకారం స్వలింగసంపర్కానికి పాల్పడినవారికి మరణశిక్ష‌ విధించాలి. ఎందుకంటే అది దేవుని సృష్టికి విరుద్ధమైన పాపం.

లేవీయకాండము 20:14
ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.

ఈ వచనం ప్రకారం ఒకడు తల్లీ కూతుర్లు ఇద్దరినీ వివాహం చేసుకుంటే ఆ ముగ్గురినీ అగ్నితో కాల్చివెయ్యాలి. కూతురుని వివాహం చేసుకుని అత్తతో అక్రమసంబంధం పెట్టుకున్నప్పటికీ ఇది వర్తిస్తుంది. అయితే అప్పుడు వారిద్దరిని మాత్రమే కాల్చివెయ్యాలి.

లేవీయకాండము 20:15,16
జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.

ఈ వచనాల ప్రకారం జంతుశయనం చేసేవారికీ ఆ జంతువుకు కూడా మరణశిక్ష విధించాలి. ఎందుకంటే ఇది కూడా దేవుని సృష్టికి విరుద్ధమైన నీచమైన పాపం. గమనించండి; ఆ పాపానికి జ్ఞాపకంగా ఉన్న జంతువునే చంపితీరాలి అంటే ఉద్దేశపూర్వకంగా ఆ జంతువుతో పాపానికి పాల్పడిన వ్యక్తి మరెంత ఘోరపాపినో దేవుని దృష్టిలో మరెంత శిక్షార్హుడో కదా.

లేవీయకాండము 20:17
ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.

ఈ వచనం ప్రకారం అన్నాచెల్లెళ్ళు వ్యభిచరిస్తే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. గమనించండి ఇలా వావివరసలు తప్పిన వారు కానీ లేక సాధారణంగా వ్యభిచరించినవారు కానీ తప్పించుకునే సాకులు ఎన్నో‌ చెబుతారు‌. లొంగిపోయానని లొంగదీసుకున్నారని అవతలి వ్యక్తే ప్రేరేపించారని‌ ఇలా. కానీ వారిని ఉపేక్షించకూడదు. ఇద్దరికీ మరణశిక్ష విధించాలి. ఒకవేళ నిజంగానే బలవంతం (అత్యాచారం) జరిగితే ఉదాహరణకు దావీదు కుమారుడైన అమ్నోను చేసినట్టు (2 సమూయేలు 13) బాధితురాలు ఆ శిక్షనుండి మినహాయించబడుతుంది.

లేవీయకాండము 20:18
కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదన మును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.

ఈ వచనం ప్రకారం‌ రుతుస్రావంతో ఉన్న స్త్రీతో వ్యభిచరించినవాడినీ అలానే ఆ స్త్రీనీ ప్రజల్లోనుండి కొట్టివెయ్యాలి. అంటే మరణశిక్ష విధించాలి (లేవీకాండము 18:19 వ్యాఖ్యానం చూడండి).

లేవీయకాండము 20:19,20
నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా చ్ఛాదన మునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు. పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

ఈ వచనాల్లో కూడా వావివరసలు తప్పి పాపం చేసినవారి శిక్ష గురించి చూస్తాం. "సంతానహీనులై మరణమగుదురు" అంటే వారి సంతానం ప్రజల్లో లెక్కించబడదు అని అర్థం.

లేవీయకాండము 20:21
ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.

ఈ వచనం ప్రకారం సహోదరుని భార్యతో వ్యభిచరించిన వాడూ ఆ వ్యభిచారిణీ "సంతానహీనులై యుందురు". అంటే వారి సంతానం ప్రజల్లో లెక్కించబడదు.

లేవీయకాండము 20:22
కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను.

ఈ వచనంలో దేవుడు తన కట్టడలనూ విధులనూ అనుసరించి నడుచుకోవాలని లేకుంటే ఆ దేశం వారిని కక్కివేస్తుందని హెచ్చరించడం మనం చూస్తాం. ఆయన చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయులు ఆయన కట్టడలకూ విధులకూ అవిధేయులై ఆయన ఇంతవరకూ చెయ్యవద్దని ఆజ్ఞాపించిన పాపాలు చేసినప్పుడు వారిని ఆ దేశం నుండి చెదరగొట్టాడు.

లేవీయకాండము 20:23
నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.

ఈ వచనం కనానీయులు చేసిన పాపాన్ని తెలియచేస్తుంది. ఇంతవరకూ దేవుడు నిషేధించిన పాపాలన్నీ వారు జరిగించారు. అందుకే ఆయన వారిని నాశనం చేసాడు.

లేవీయకాండము 20:24
నేను మీతో చెప్పినమాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్య ముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవ హించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

"జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే" ఆయన ఆజ్ఞలను బట్టే వారు జనములలో నుండి వేరుచెయ్యబడ్డారు.

లేవీయకాండము 20:25
కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువల ననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

లేవీకాండము 11వ అధ్యాయంలో ఆయన పవిత్రజంతువులకూ అపవిత్ర జంతువులకూ విభజన చేసాడు. ఆ విభజనను బట్టే ఇశ్రాయేలీయులు నడుచుకోవాలి.

లేవీయకాండము 20:26
మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకున్నప్పుడే ప్రజలు పరిశుద్ధంగా ఉండడం సాధ్యం. వారు అలా ఉండాలనే ఆయన తనకోసం వారిని వేరుపరిచాడు.

లేవీయకాండము 20:27
పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

కర్ణపిశాచి, సోదె అనేవి అపవాది శక్తితో పనిచేసే క్రియలు కాబట్టి అవి ఉన్నవారికి మరణశిక్షవిధించాలి. అవి సాధారణంగా ఎవరిలోకీ రావు ఆహ్వానిస్తేనే వస్తాయి. అందుకే తమ శిక్షకు తామే కారకులు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.