విమర్శలకు జవాబు

రచయిత: వి. సామ్యూల్

ముందుమాట: ఇటీవల Fight on Cults అనే యూట్యూబ్ ఛానల్‌ Posts విభాగంలో “కలవరపరుస్తున్న CALVINISM” అనే శీర్షికతో July 08, 2025 నుండి Aug 09, 2025 వరకూ 25 పేజీల ఆర్టికల్‌ను విడతలవారీగా విడుదల చేశారు.

అలాగే “hithabodha” అనే యూట్యూబ్ ఛానల్‌లో ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే “క్రైస్తవ స్పందన” అనే ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమంలో Sam from Vizag అనే Zoom Participant ఈ ఆర్టికల్‌లోని అనేక ప్రశ్నలను వివిధ సమయాల్లో అడగగా హితబోధ పరిచర్య బ్రదర్. బిబు గారు వాటికి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలు ఎపిసోడ్ నెం.157 (28 Oct 2025) నుండి ఎపిసోడ్ నెం.176 (10 Mar 2026) వరకూ hithabodha యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉన్నాయి (ఎపిసోడ్ నెం.158, 159, 171, 172 & 173 మినహా). ఈ రచనలో ప్రధానంగా బ్రదర్. బిబు గారు చెప్పిన సమాధానాలనే సంకలనం చెయ్యడం జరిగింది.

ఈ రచనను రాయడానికి ప్రధాన కారణం — కాల్వినిజంగా పిలవబడే బైబిల్ బోధలను వక్రీకరిస్తూ అనేకమంది విశ్వాసులలో గందరగోళం కలిగించే విధంగా ప్రచారం జరుగుతున్నందున, ఇలాంటి వక్రీకరణల ద్వారా బైబిల్ అసలు బోధను అబద్ధంగా చిత్రీకరించవద్దు అనే హెచ్చరికను ఇవ్వడం, అలాగే గందరగోళంలో ఉన్న విశ్వాసులు అసలైన బైబిల్ బోధను గ్రహించి సత్యంలో నిలిచేలా సహాయం చెయ్యడం. ఈ ఉద్దేశంతోనే ఈ రచన సిద్ధపరచబడింది.

అందువల్ల, వారి ఆర్టికల్‌లో ఉన్న ప్రధాన అంశాలను ఆధారంగా తీసుకొని, వాటిని ప్రశ్నల రూపంలో క్రమబద్ధంగా రూపొందించి, వాటికి బైబిల్ ఆధారంగా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమాధానాలు వ్యక్తిగత అభిప్రాయాల మీద కాకుండా — వచనాల సందర్భం, బైబిల్ సమగ్ర బోధ, మరియు సంబంధిత ఇతర వచనాల సాక్ష్యాల ఆధారంగా ఇవ్వబడినవి. వాస్తవ నిర్ధారణ మరియు ఖచ్చితత్వం కోసం, Fight on Cults వారు అడిగిన ప్రశ్నల భావాన్ని యథాతథంగా ఉంచడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రశ్నల పొడవు మరియు పునరావృతాన్ని తగ్గించడానికి మాత్రమే సంక్షిప్తంగా రూపొందించాము; అయితే అసలు భావానికి ఎలాంటి లోటు రానీయలేదు. అలాగే ఒకే అంశానికి సంబంధించి వారు అనేక వచనాల రిఫరెన్స్‌లు ఇచ్చిన చోట్ల, వాటిని సంబంధిత ప్రశ్నలలో సముచితంగా చేర్చి, ప్రతి అంశాన్ని బైబిల్ ఆధారంగా పరిశీలిస్తూ సమాధానాలు ఇవ్వడం జరిగింది.

ఈ Fight on Cults యూట్యూబ్ ఛానల్ వారు రాసిన ఆర్టికల్‌ను పరిశీలించినప్పుడు, అనేక వచనాలు వాటి తక్షణ సందర్భం, విస్తృత సందర్భం, మరియు బైబిల్ సమగ్ర బోధకు అనుగుణంగా కాకుండా ఉపయోగించబడినట్లు స్పష్టమౌతుంది. కొన్ని చోట్ల వారు ఏమాత్రం బైబిల్ పరిజ్ఞానం లేకుండా ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని సమర్థించడానికి వచనాలను సందర్భానికి విరుద్ధంగా ఉపయోగించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల కాల్వినిజం నిజంగా ఏం బోధిస్తుందో సమతుల్యంగా చూపించకుండా దాని బోధను వక్రీకరించిన రూపంలో ప్రశ్నలు రూపొందించబడినట్లు తెలుస్తుంది. అనేక అభ్యంతరాలు కూడా వచనాల సంపూర్ణ భావాన్ని పరిశీలించకుండా భావోద్వేగపూరితమైన నిర్ధారణలపై ఆధారపడి నిర్మించబడినట్లు కనిపిస్తున్నాయి.

బైబిల్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ప్రతి వచనాన్ని దాని సందర్భంలోనే పరిశీలించాలి. సందర్భాన్ని ప్రక్కనపెట్టి వచనాలను ఉపయోగించినప్పుడు, ఎవరైనా తమకు నచ్చిన సిద్ధాంతాన్ని బైబిల్ మీద రుద్దగలరు. ఈ ఆర్టికల్‌లో పదేపదే కనిపించే ప్రధాన సమస్య కూడా ఇదే.

పాఠకులు Fight on Cults వారు ప్రచురించిన ఆర్టికల్ విషయాలను కూడా పరిశీలించి, ఇక్కడ ఇవ్వబడిన సమాధానాలతో సరిపోల్చి, ఏది నిజంగా బైబిల్ సమగ్ర బోధకు అనుగుణమో జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రచన యొక్క ఉద్దేశం వ్యక్తులను దూషించడం కాదు; కానీ దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా మరియు సమగ్రంగా వివరించడం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించడం చిన్న విషయం కాదు. కాబట్టి ఇక్కడ పొందుపరిచిన విషయాలను పాఠకులు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మరియు బైబిల్‌ను పరిశీలించే మనస్సుతో అధ్యయనం చేయాలి.

ప్రశ్నలు మరియు జవాబులు:

ప్రశ్న 1: దేవునికి రెండు చిత్తాలు ఉన్నాయని కాల్వనిస్టులు అంటారు. ఆదాము హవ్వలతో పండు తినవద్దు అని చెప్పడం బాహ్య వ్యక్తీకరణ చిత్తం. వారు పండు తినాలి అని దేవుడే నిర్ణయించాడు. ఇది రహస్య చిత్తం. పండు తినాలి అని దేవుడు రహస్యంగా నిర్ణయించాడు కాబట్టి, దేవుడు సార్వభౌముడు కాబట్టి, ఆయన రహస్య చిత్తం చెయ్యడానికి బహిరంగ చిత్తాన్ని అతిక్రమించాల్సిందే కదా. ఇందులో ఆదాము తప్పేముంది? దేవుని నిర్ణయాన్ని నెరవేర్చాడు కదా.. ఆదాము పండు తినకపోతే దేవుని రహస్య చిత్తాన్ని ఎదిరించినట్లవుతుంది. అది పాపం. పండు తింటే దేవుని బహిరంగ చిత్తాన్ని ఎదిరించినట్లవుతుంది. అదీ పాపమే. దేవుడే కావాలని ఆదాముని పాపంలో ఇరికించిన దుర్మార్గునిగా చూపిస్తుంది ఈ కాల్వనిజం బోధ. (ఆర్టికల్ పేజి నెం.03)

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా కనిపిస్తున్నది ఒక తప్పుదారి పట్టించే నిర్ధారణ: దేవుని ‘రహస్య చిత్తం’ నెరవేర్చాలంటే ఆయన ప్రకటించిన ‘బహిరంగ చిత్తాన్ని’ అతిక్రమించాల్సిందే అన్న భావన. బైబిల్ బోధ ప్రకారం ఇది సరైనది కాదు. దేవుడు మనుష్యులకు వెల్లడించిన చిత్తం—అంటే ఆయన ఆజ్ఞలు—మనుష్యులు పాటించాల్సినవే. అదే సమయంలో దేవుడు తన సార్వభౌమ ప్రణాళికలో జరిగేందుకు అనుమతించే విషయాలు మనుష్యులకు ముందుగా తెలియవు (ద్వితీయోపదేశకాండము 29:29). ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి కావు; ఒకటి మన బాధ్యతను సూచిస్తే మరొకటి దేవుని అధికారం మరియు ప్రణాళికను సూచిస్తుంది.

ఆదాము విషయానికి వస్తే దేవుడు స్పష్టంగా “తినవద్దు” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది దేవుని బహిరంగ చిత్తం. ఆదాము ఆ ఆజ్ఞను తెలిసికొని, దానిని స్వచ్ఛందంగా అతిక్రమించాడు. కాబట్టి అతని పాపం దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసిన స్పష్టమైన తిరుగుబాటు. దేవుడు పండు తినమని ఆజ్ఞాపించలేదు; ఆయన ఆజ్ఞ స్పష్టంగా నిషేధాత్మకమైనది. అందువల్ల ఆదాము చేసింది దేవుని రహస్య చిత్తాన్ని నెరవేర్చడం కాదు, ఆయన ఆజ్ఞను ప్రత్యక్షంగా ధిక్కరించడం.

ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి: దేవుడు ఏదైనా జరిగేందుకు అనుమతించడం, అదే పనిని చెయ్యమని ఆజ్ఞాపించడం కాదు. బైబిల్ స్పష్టంగా బోధించేది ఏంటంటే దేవుడు ఎవ్వరిని పాపం చెయ్యమని ప్రేరేపించడు. ప్రతి మనిషి తన స్వకీయమైన దురాశల చేత ఆకర్షింపబడి పాపం చేస్తాడు (యాకోబు 1:13–14). దేవుడు ఆ సంఘటనలను తన ప్రణాళికలో ఉపయోగించగలడు, కానీ పాపానికి కర్త కాదు (ఆదికాండము 37:18,28, 50:20). అందువల్ల “దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆదాము చేసింది సరైనదే” అనే వాదన బైబిల్ బోధకు విరుద్ధం.

“ఆదాము పండు తిన్నా తినకపోయినా పాపమే ఔతుంది” అనే వాదన కూడా తప్పు. ఎందుకంటే మనిషి బాధ్యత దేవుడు వెల్లడించిన ఆజ్ఞను పాటించడమే. దేవుని రహస్య చిత్తం మనిషికి తెలియదు, కాబట్టి దానిని పాటించాలనే బాధ్యత కూడా మనిషిపై ఉండదు. ఆదాము చెయ్యాల్సింది ఒకటే—దేవుడు చెప్పినట్లు పండు తినకపోవడం. తినకపోవడం విధేయత, తినడమే పాపం. అతను దానిని అతిక్రమించినందునే పాపం జరిగింది.

కాబట్టి, కాల్వినిజం దేవుడిని దుర్మార్గునిగా చూపిస్తుందని చెప్పడం పూర్తిగా అసత్యమైనదే కాకుండా బైబిల్ బోధను వక్రీకరించే ఆరోపణ. దేవుడు తన సార్వభౌమ ప్రణాళికలో అన్ని విషయాలను నియంత్రిస్తూనే మనుష్యులను వారి చర్యలకు బాధ్యతగలవారిగా ఉంచుతాడు. ఆదాము పాపం దేవుని బలవంతం వల్ల కాదు, అతని స్వచ్ఛంద అవిధేయత వల్ల జరిగింది. దేవుని సార్వభౌమత్వం మరియు మనిషి బాధ్యత రెండూ బైబిల్‌లో సమన్వయంతో నిలుస్తాయి.

ప్రశ్న 2: ఆదాము పండు తినకపోతే దేవుని సార్వభౌమాధికారం ఏమౌతుంది? దేవుడు అనుకున్నది జరిగితీరుతుంది అని కాల్వినిస్టులు చెబుతారు కదా. (ఆర్టికల్ పేజి నెం.03)

జవాబు: ముందటి ప్రశ్న కొంతవరకు చర్చించదగినట్లుగా కనిపించినా ఈ ప్రశ్న మాత్రం సండే స్కూల్ పిల్లలు అడిగే ప్రశ్నలను తలపిస్తుంది. “ఆదాము పండు తినకపోతే ఏమౌతుంది?”, “హవ్వ మాత్రమే తిని, ఆదాము తినకపోతే ఏమవుతుంది?” వంటి ఊహాత్మక ప్రశ్నలు ఇలాగే కొనసాగించవచ్చు. ఈ ఒక్క ప్రశ్నకే పరిమితం కాకుండా “ఇలా జరిగి ఉంటే?” “అలా జరిగి ఉంటే?” అంటూ అనేక విధాలుగా ఊహించి ప్రశ్నలు రూపొందించవచ్చు.

కానీ బైబిల్ అధ్యయనంలో ఈ విధమైన ఊహాగానాలకు స్థానం లేదు. దేవుడు తన వాక్యంలో ఎంతవరకు వెల్లడించాడో మనం అంతవరకే మాట్లాడాలి. వాక్యం చెప్పని విషయాలను మన ఊహలతో నింపడం వాక్యానుసారం కాదు; అది వాక్యానికి వెలుపల ఉన్న అనవసర కల్పన మాత్రమే. అలాంటి ఊహాత్మక నిర్ధారణలను బైబిల్ బోధగా చూపించడం సరైన విధానం కాదు.

అందువల్ల, “పండు తినకపోతే ఏమౌతుంది?” అనే ప్రశ్న వాక్యం స్పష్టంగా వెల్లడించిన విషయాలను ప్రక్కనపెట్టి, లేని పరిస్థితులను ఊహించి నిర్మించిందే. బైబిల్ మనకు ఏం జరిగిందో స్పష్టంగా చెబుతుంది—దానినే ఆధారంగా తీసుకొని నిజాన్ని అర్థం చేసుకోవాలి; ఏం జరిగి ఉండేదో అని ఊహించడం ద్వారా కాదు.

బైబిల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా బోధిస్తుంది: “రహస్యమైన సంగతులు యెహోవా దేవునివి, ప్రకటింపబడిన సంగతులు మనవి” (ద్వితీయోపదేశకాండము 29:29). అలాగే “లిఖింపబడిన దానికంటె మించినదానికి వెళ్ళకూడదు” (1 కొరింథీయులకు 4:6) అని హెచ్చరిస్తుంది. కాబట్టి “ఇలా జరిగి ఉంటే ఏమవుతుంది?” అనే ఊహాత్మక ప్రశ్నలు వాక్యపరమైన పరిశీలనకు ఉపయోగపడవు; అవి సత్యాన్ని స్పష్టపరచడం కంటే గందరగోళం సృష్టించే అవకాశమే ఎక్కువ. అందువల్ల, దేవుని సార్వభౌమాధికారాన్ని ఈ విధమైన ఊహాత్మక ప్రశ్నలతో కొలవడం సరైన పద్ధతి కాదు; అది వాక్యబోధను ప్రక్కనపెట్టి మన ఊహలకు ప్రాధాన్యం ఇచ్చినట్టే అవుతుంది.

ప్రశ్న 3: వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్ హీన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేనువారికాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు’ (యిర్మీ 32:35). ఈ వచనం దేవుని బహిరంగ చిత్తం, అంతరంగ చిత్తం ఒకటే అని చెబుతుంది. దేవుడు అనుకోని, కోరుకోని వాటిని మనుషులు చేస్తున్నారు అనే విషయం కూడా చెబుతూ, ఈ కాల్వనిస్టుల సార్వభౌమ సిద్ధాంతం తప్పు అని సూటిగా ఖండిస్తుంది. (ఆర్టికల్ పేజి నెం.03)

జవాబు: ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఛానల్ వారు ఏమంటున్నారంటే—యూదావారు తమ పిల్లలను మోలెక్‌కు ప్రతిష్టించడానికి బయలునకు బలిపీఠాలు కట్టారు. అలా చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించలేదు; ఇది దేవుని బహిరంగ చిత్తం. అలాగే “నా కెన్నడును తోచలేదు” అని ఉన్నందున, దేవుడు అనుకోని, కోరుకోని పనిని యూదావారు చేశారని; కాబట్టి దేవునికి రహస్య చిత్తం అనేదే లేదని, కాల్వినిస్టుల సార్వభౌమ సిద్ధాంతం తప్పు అని నిర్ధారిస్తున్నారు.

కానీ ఇక్కడ మొదట గమనించాల్సిన విషయం ఏంటంటే—ఈ వచనంలోని తెలుగు అనువాదం భావాన్ని పూర్తిగా స్పష్టంగా ఇవ్వలేదు. ముఖ్యంగా “నా కెన్నడును తోచలేదు” అనే పదబంధం, తెలుగులో చదివినవారికి “దేవునికి అది తెలియదు”, “అది ఆయన ఊహకు కూడా రాలేదు” అనే భావాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే మూల హెబ్రీ భాషలో ఆ భావం లేదు.

అసలు భావం ఏమిటంటే— “అలాంటి హేయకార్యాన్ని చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు. అలాంటి ఆలోచన నా మనసులోనికి రాలేదు / నా మనసుకు తట్టలేదు.” అందుకే కొన్ని ఆధునిక అనువాదాలు దీనిని మరింత స్పష్టంగా ఇస్తున్నాయి. ఉదాహరణకు Grace Ministries Telugu Study Bible ఇలా అనువదించింది:

“తమ కొడుకులను కూతుళ్ళను మోలెక్‌ దేవుడికి అగ్నిద్వారా దాటిస్తామని చెప్పి బెన్‌హిన్నోం లోయలో బయల్‌ దేవుడికి ఎత్తు పూజాస్థలాలను కట్టారు. వాళ్ళు అలాంటి నీచమైన పని చేసి, అలాంటి పాపానికి యూదాప్రజ ఒడికట్టేలా చేయాలని నేను వారిని ఎన్నడూ ఆదేశించలేదు. అలాంటిది నా మనసుకు తట్టలేదు.”

కానీ ఈ వచనం, ఆ సంఘటనలు దేవుని సార్వభౌమ నియంత్రణకు వెలుపల జరిగాయని ఎక్కడా చెప్పడం లేదు. ఈ ఛానల్ వారి వ్యాఖ్యానాన్ని అంగీకరిస్తే దేవునికి రహస్య చిత్తం లేదు అని చెప్పడమే కాకుండా ఆయన సర్వజ్ఞుడు కాడు అని చెప్పినట్లూ ఔతుంది. అదేవిధంగా ఆయనకు తెలియకుండానే ఆయన నియంత్రణకు వెలుపల మనుషులు అనేక కార్యాలు చేస్తున్నారని కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యానం, వాక్యాన్ని సందర్భానుసారంగా కానీ మూలభాష ఆధారంగా కానీ పరిశీలించలేదని స్పష్టంగా చూపిస్తుంది. ఒక సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించాలనే ఉద్దేశంతో ఈ వచనాన్ని సందర్భానికి విరుద్ధంగా వ్యాఖ్యానించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

అదేవిధంగా ఇదే భావప్రకటన యిర్మీయా 7:31 మరియు 19:5 వచనాలలో కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా దేవుడు “అలాంటిది నా మనసులోనికి రాలేదు” అనే భావాన్ని ఉపయోగించాడు. కాబట్టి ఇది దేవునికి ముందుగా తెలియదని లేదా ఆయన అవగాహనలో లోపం ఉందని చెప్పే వాక్యం కాదు; ఆ హేయమైన పాపకార్యంపై దేవుని తీవ్రమైన అసహ్యాన్ని వ్యక్తపరిచే భావప్రకటనగా అర్థం చేసుకోవాలి. అందువల్ల, ఈ వచనాన్ని ఆధారంగా తీసుకొని “దేవుని బహిరంగ చిత్తం, అంతరంగ చిత్తం ఒకటే; కాబట్టి కాల్వినిస్టుల సార్వభౌమ సిద్ధాంతం తప్పు” అని చెప్పడం సరైన వ్యాఖ్యానం కాదు.

ప్రశ్న 4: కాల్వనిజం అనే బోధ యొక్క ఐదు మూల సిద్ధాంతాలను ‘T.U.L.I.P.’ అంటారు. అనగా ‘T’ for Total depravity (సంపూర్ణ పతనం) మరియు Unconditional election (బేషరతు ఎన్నిక), Limited atonment (పరిమితం ప్రాయశ్చిత్తం), Irresistable grace (ఎదిరించలేని కృప), Perseverance of saints (పరిశుద్దుల పదిలత). విచిత్రం ఏంటంటే ఇందులో ఒక్క పదం కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో లేదు. ఈ పదాలకు తెలుగు తర్జుమా చేసిన పదాలు కూడా తెలుగు బైబిల్ లో లేవు. మీరు పదే పదే వాడే “SOVEREIGN” అనే పదం కూడా బైబిల్లో లేదు. సార్వభౌమ అధికారం అనే మాట తెలుగు బైబిల్లో లేదు. ‘రహస్య చిత్తం’ అనే పదం కూడా బైబిల్లో లేదు. దేవుడు పాపానికి కర్త అని కానీ రక్షణ పోదు అని కానీ దేవుడు కొందరి కొరకే చనిపోయాడని కానీ దేవుడు కొందరిని నాశనం కొరకు సృష్టించాడు అని కానీ దేవుడు పాపం వల్ల జరిగే నాశనాన్ని కోరుకున్నాడని కానీ ఆయన అనుమతితోనే పాపం వచ్చిందని కానీ బైబిల్లో ఒక్కచోట కూడా రాయబడలేదు. కాల్వనిజం అనే అబద్దం, కేవలం మనుషులుకల్పించే చాతుర్య మాటలు ద్వారా అశాస్త్రీయమైన, అతార్కికమైన వాదనలతో అల్లిన ఒక వల. అందులో చిక్కితే నాశనమే... (ఆర్టికల్ పేజి నెం.04)

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా కనిపిస్తున్న వాదన ఏంటంటే—“ఒక పదం బైబిల్లో లేకపోతే ఆ సిద్ధాంతం కూడా బైబిల్ సంబంధమైనది కాదు” అన్నది. కానీ ఈ తర్కాన్ని నిజంగా అనుసరిస్తే క్రైస్తవ లోకంలో ఉపయోగించే అనేక ముఖ్యమైన పదాలను కూడా తిరస్కరించాల్సి వస్తుంది. ఉదాహరణకు “త్రిత్వం”, “సర్వవ్యాపకత్వం”, “సర్వజ్ఞత్వం” వంటి పదాలు కూడా బైబిల్లో ప్రత్యక్షంగా కనిపించవు. అయినప్పటికీ ఆ పదాలు సూచించే బోధలు మాత్రం బైబిల్ అంతటా స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి ఒక పదం బైబిల్లో ఉందా లేదా అన్నది కాకుండా ఆ పదం సూచించే భావం బైబిల్ బోధతో సరిపోతుందా లేదా అన్నదే అసలు ప్రశ్న.

అదేవిధంగా, “Sovereign”, “సార్వభౌమాధికారం”, “రహస్య చిత్తం” వంటి పదాలు కూడా బైబిల్ బోధలను వివరించడానికి వాడే వేదాంతపరమైన (theological) పదాలు మాత్రమే. ఉదాహరణకు దేవుడు తన చిత్తానుసారం సమస్తాన్ని నిర్వహిస్తాడని, ఆయన సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఆయన ప్రణాళిక స్థిరంగా నిలుస్తుందని బైబిల్ అనేక చోట్ల బోధిస్తుంది (కీర్తనలు 115:3, దానియేలు 4:35, ఎఫెసీ 1:12). ఈ బోధలను సమగ్రంగా వివరించడానికి “సార్వభౌమాధికారం” అనే పదాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి “ఆ పదం బైబిల్లో లేదు కాబట్టి ఆ బోధ తప్పు” అని చెప్పడం సరైన తర్కం కాదు.

అలాగే ఈ ప్రశ్నలో కాల్వినిజంపై అనేక ఆరోపణలు ఒకే చోట కలిపి చెప్పబడ్డాయి. అయితే ఆ ఆరోపణలు కాల్వినిజం అసలు బోధను వక్రీకరించి, తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. “దేవుడు పాపానికి కర్త” అని చారిత్రాత్మక కాల్వినిజం ఎక్కడా బోధించదు. అదే విధంగా “దేవుడు నాశనం కోసమే మనుష్యులను సృష్టించాడు” అనే రూపంలో కూడా కాల్వినిజం తన సిద్ధాంతాలను వివరించదు. “దేవుడు పాపాన్ని కోరుకున్నాడు”, “పాపానికి దేవుడే కారణం”, “మనుష్యులను బలవంతంగా నాశనానికి నెడతాడు” వంటి ఆరోపణలు కూడా కాల్వినిజం సిద్ధాంతాలను అతిశయోక్తిగా లేదా వక్రీకరించి చెప్పినవే. అలాగే “రక్షణ పోదు”, “క్రీస్తు కొందరి కొరకే చనిపోయాడు” వంటి విషయాలు కూడా వాటి సిద్ధాంతపరమైన సందర్భంలో కాకుండా సరళీకరించి మరియు వక్రీకరించి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఒక సిద్ధాంతాన్ని ఖండించాలంటే ముందుగా ఆ సిద్ధాంతం నిజంగా ఏం బోధిస్తుందో సరిగ్గా చూపించాలి; లేనిపక్షంలో అది వాదన కాకుండా వక్రీకరణ మాత్రమే అవుతుంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ప్రశ్నలో ఉపయోగించిన “అశాస్త్రీయమైన”, “అతార్కికమైన” వంటి పదాలు కూడా బైబిల్లో కనిపించవు. అయితే వాటిని వాడుతున్నందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే అవి ఒక భావాన్ని వివరించడానికి ఉపయోగించే పదాలు మాత్రమే. అదే విధంగా వేదాంతపరమైన పదాలను కూడా వాటి భావం ఆధారంగా పరిశీలించాలి; కేవలం ఆ పదం బైబిల్లో ప్రత్యక్షంగా లేదని చెప్పి తిరస్కరించడం సరైన విధానం కాదు.

చివరగా, ఒక సిద్ధాంతాన్ని “అబద్ధం”, “నాశనానికి దారితీసే వల” అని పిలవడం ద్వారా అది తప్పు అయిపోదు. ఆ బోధ నిజంగా బైబిల్ వచనాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నదే పరిశీలించాల్సిన అసలు విషయం. కాబట్టి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు, భయపెట్టే పదజాలం, లేదా వక్రీకరించిన ఆరోపణలకంటే వాక్యాధారిత పరిశీలనకే ప్రాధాన్యం ఇవ్వాలి. అదే నిజమైన బైబిల్ పరిశీలన విధానం.

ప్రశ్న 5: Total depravity:- మనిషి పండు తిన్న తర్వాత పూర్తిగా పతనం అయిపోయాడు, ఇక అతడు మంచి అనేది ఎన్నుకోలేడు. ఏ మంచి చెయ్యలేడు అనేది ఈ మాటకు అర్థం. కానీ పండు తిన్న ఆదామే తర్వాత కాలంలో యెహోవా నామమును బట్టి ప్రార్ధన చెయ్యడం ప్రారంభించాడు. అతడి వంశంలోనే దేవునితో నడిచిన హనోకు, దేవుని చేత నీతిమంతుడు అనిపించుకున్న నోవహు జన్మించారు. ఆ తర్వాతి కాలంలో యోసేపు, యోబు, దానియేలు వంటివారెందరో జన్మించారు. మనిషి కేవలం చెడును మాత్రమే చేస్తాడు అనడం వాక్య వ్యతిరేకం. మనిషి పండు తిన్నప్పుడు చెడుకు సంబంధించిన జ్ఞానం మాత్రమే రాలేదు. మంచి చెడ్డలను గూర్చి జ్ఞానం వచ్చింది. (ఆర్టికల్ పేజి నెం.04)

జవాబు: ఈ ప్రశ్నలో “Total Depravity” అనే కాల్వినిజం సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకొని దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాల్వినిజం “మనిషి పతనమైన తర్వాత లోకపరంగా మంచిగా కనిపించే పనులు కూడా చెయ్యలేడు” అని బోధించదు. “సంపూర్ణ పతనం” అనే బోధ యొక్క అసలు భావం ఏమిటంటే—పాపం మనిషి స్వభావమంతటినీ పతనం చేసింది. అంటే మనస్సు, హృదయం, సంకల్పం, ఆలోచనలు అన్నీ పాపం చేత కలుషితమయ్యాయి. అందువల్ల దేవుని వైపు స్వయంగా తిరిగి, ఆయనను రక్షణార్థంగా వెదకగల ఆత్మీయ సామర్థ్యాన్ని మనిషి కోల్పోయాడు.

అందుకే “ఏనోషు కాలంలో యెహోవా నామమును బట్టి ప్రార్థన చెయ్యడం ఆరంభమైంది”, “హనోకు దేవునితో నడిచాడు”, “నోవాహు నీతిమంతుడు”, “యోబు యథార్థవంతుడు” వంటి ఉదాహరణలను చూపించి Total Depravityను ఖండించడం సరైనది కాదు. బైబిల్‌లో కనిపించే నీతిమంతులు తమ సహజ మానవ శక్తిచేత కాదు, దేవుని కృపచేతనే దేవునితో నడిచారు. కాల్వినిజం ప్రకారం, దేవుని కృపయే మనిషిలో విశ్వాసాన్ని కలుగజేస్తుంది (ఎఫెసీ 2:8); ఆ విశ్వాసం ద్వారానే ఒకడు నీతిమంతునిగా ఎంచబడతాడు (రోమా 5:1) ఉదాహరణకు, నోవాహు “యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను” (ఆదికాండము 6:8) అని ముందుగా చెప్పబడింది; ఆ తర్వాతనే అతని నీతి గురించి మాట్లాడబడింది.

అలాగే “మనిషి మంచి చెడులను తెలిసికొన్నాడు కాబట్టి దేవుని దృష్టిలో నిజమైన ఆత్మీయ మంచి చెయ్యగలడు” అనేది కూడా సరైనది కాదు. మంచి గురించి జ్ఞానం కలిగి ఉండడం, దేవునికి ఇష్టమైన ఆ మంచిని చెయ్యగల సామర్థ్యం కలిగి ఉండడం రెండూ ఒకటి కావు. సత్యం తెలిసినవాడు కూడా అబద్ధం చెప్పగలడు. అలాగే మనిషి మంచి గురించి తెలిసినా పాప స్వభావం కారణంగా రక్షణార్థంగా దేవుని వద్దకు స్వయంగా తిరగలేడు.

బైబిల్ కూడా పతనమైన మనిషి స్థితిని తీవ్రమైనదిగా వర్ణిస్తుంది. “నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు… దేవుని వెదకువాడు లేడు” (రోమా 3:10–11), “శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధము” (రోమా 8:7), “అపరాధములచేతను పాపములచేతను మృతులై యుండిరి” (ఎఫెసీయులకు 2:1) వంటి వచనాలు మనిషి ఆత్మీయ పతనాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.

కాబట్టి Total Depravity అంటే “మనిషి లోకపరంగా మంచిగా కనిపించే పనులు కూడా చెయ్యలేడు” అనే అర్థం కాదు; “మనిషి పాపం వల్ల సంపూర్ణంగా పతనమై, దేవుని కృప లేకుండా రక్షణార్థంగా దేవుని వైపు స్వయంగా తిరగలేని స్థితిలో ఉన్నాడు” అనే అర్థం. ఈ ప్రాథమిక తేడాను గుర్తించకుండా ఈ సిద్ధాంతాన్ని ఖండించడం, కాల్వినిజం అసలు బోధను అర్థం చేసుకోకుండా విమర్శించడమే ఔతుంది.

ప్రశ్న 6: Unconditional election:- దేవుడు తన ఇష్టాన్ని బట్టి నిష్కారణంగా కొందరిని పరలోకం వెళ్ళడానికి, కొందరిని నరకానికి వెళ్ళడానికి సృష్టించాడు అనేది వీరి బోధలో ముఖ్యాంశం. అందుకు రోమా 9:16లో ఏశావు, యాకోబుల గురించి వచనం చూపిస్తారు. రోమా 9వ అధ్యాయం దేవుని యొక్క సంకల్పం కోసం మాత్రమే రాయబడింది. రక్షణ కోసం కాదు. దేవుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో పని కోసం ఏర్పరచుకుంటాడు. అబ్రాహామే ఎందుకు? మోషేనే ఎందుకు? దావీదే ఎందుకు? పౌలే ఎందుకు? వారిని దేవుడు ఆయా పనుల కోసం నిర్ణయించాడు. వారితో అవి చేయించుకున్నాడు. అంతమాత్రాన వీరు మాత్రమే పరలోకం వెళ్తారని కాదు. ఇవి భూమి మీద ఆయన చెయ్యాలనుకున్న పనుల కోసం మాత్రమే చేసిన నిర్ణయాలు. రక్షణ పూర్తిగా వేరు. ఒకరిని ధనవంతునిగా దేవుడు చేస్తాడు. లాజరును బీదవానిగా దేవుడు చేశాడు. ఇది దేవుని నిర్ణయం. ఇవి భూమిపై వీరి స్థితులు. ధనవంతుడు దేవుడిని మరచి పాతాళానికి పోవాలని, లాజరు దేవుని ప్రార్థిస్తూ పరదైసుకుపోవాలని దేవుడు నిర్ణయించలేదు. వారిద్దరూ నిత్యజీవానికి వెళ్ళాలి అనేది దేవుని ఆశ. అందుకే ఈ ఉపమానం ద్వారా ధనవంతులందరిని హెచ్చరించాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏది నిర్ణయిస్తాడో ఏది ఆశిస్తాడో తేడా తెలియకే ఈ దుర్బోధ పుట్టింది. (ఆర్టికల్ పేజి నెం.05)

జవాబు: ఈ ప్రశ్నలో కూడా కాల్వినిజం అసలు బోధను వక్రీకరించి, తరువాత దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా “దేవుడు నిష్కారణంగా కొందరిని పరలోకానికి, మరికొందరిని నరకానికి వెళ్ళడానికి సృష్టించాడు” అనే విధంగా చెప్పడం, కాల్వినిజం బోధను వాస్తవానికి విరుద్ధంగా అత్యంత కఠినమైన రూపంలో చిత్రీకరించడమే. చారిత్రాత్మక కాల్వినిజం “దేవుడు నిరపరాధులను బలవంతంగా నరకానికి నెడతాడు” అని బోధించదు. మనుష్యులందరూ పాపపుస్థితిలో ఉన్నారని, రక్షణ పూర్తిగా దేవుని కృప వల్లనే లభిస్తుందని బోధిస్తుంది.

అలాగే, రోమా 9వ అధ్యాయాన్ని కేవలం “భూమిపై కొన్ని పనుల కోసం దేవుడు వ్యక్తులను ఎన్నుకొన్నాడు” అని చెప్పడం, ఆ అధ్యాయం యొక్క ప్రధాన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకపోవడమే. నిజమే, దేవుడు అబ్రాహాము, మోషే, దావీదు, పౌలు వంటి వారిని ప్రత్యేక కార్యాల కొరకు ఉపయోగించాడు. అయితే రోమా 9లో పౌలు ప్రధానంగా చర్చిస్తున్న అంశాలు దేవుని ఎన్నిక, కృప, కనికరం, మరియు రక్షణకు సంబంధించినవే.

ఉదాహరణకు, “ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,” (రోమా 9:11), “కనికరింపవలెననుకున్నవారిని కనికరించుదును” (9:15), “కాబట్టి పొందగోరువానివలననైనను, ప్రయాసపడువానివలననైనను కాదు, కనికరించు దేవునివలననే” (9:16) వంటి వచనాలు దేవుని కృపాధారిత ఎన్నికను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా “కుమ్మరివానికి మట్టిమీద అధికారము లేదా?” అని చెబుతూ “నాశనమునకు సిద్ధపరచబడిన ఉగ్రతాపాత్రమైన ఘటములు”, “ మహిమ పొందుటకు ముందుగా సిద్ధపరచబడిన కరుణాపాత్ర ఘటములు” (రోమా 9:21–23) గురించి మాట్లాడిన పౌలు, తర్వాత ఆ కరుణాపాత్ర ఘటములే “రక్షింపబడుదురు” (9:27) అని కూడా ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి రోమా 9 అధ్యాయాన్ని భూమిపై పనులకు పరిమితం చేసి, రక్షణ అంశంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఆ అధ్యాయం యొక్క సందర్భాన్ని వక్రీకరించినట్టవుతుంది.

అదేవిధంగా, లాజరు మరియు ధనవంతుని ఉపమానాన్ని తీసుకొని “దేవుడు వారి నిత్యగమ్యాన్ని నిర్ణయించలేదు” అని చెప్పడం కూడా ఈ చర్చకు ప్రత్యక్ష సమాధానం కాదు. ఆ ఉపమానం ప్రధానంగా ధనప్రేమ, పశ్చాత్తాపం లేకపోవడం, మరియు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడం గురించి హెచ్చరిస్తుంది. కానీ కాల్వినిజం బోధించే ఎన్నిక సిద్ధాంతాన్ని ఖండించడానికి అది నేరుగా ఉపయోగపడదు.

“దేవుడు ఏది నిర్ణయిస్తాడు, ఏది ఆశిస్తాడు అన్న తేడా తెలియకే ఈ దుర్బోధ పుట్టింది” అని చెప్పడం కూడా సరైన విమర్శ కాదు. ఎందుకంటే కాల్వినిజం బోధలో కూడా ఈ రెండు విషయాల మధ్య తేడా ఉందని అంగీకరిస్తారు. ఉదాహరణకు, దేవుడు మనుష్యులు పాపం చేయకూడదని ఆజ్ఞాపిస్తాడు — ఇది ఆయన నైతిక చిత్తం. అదే సమయంలో తన సార్వభౌమ ప్రణాళికలో కొన్ని విషయాలు జరిగేందుకు అనుమతిస్తాడు — ఇది ఆయన సార్వభౌమ చిత్తం. కాబట్టి ఈ తేడా కాల్వినిజానికి తెలియదు అని చెప్పడం సరైన నిర్ధారణ కాదు. కాబట్టి ఈ భావనను ‘దుర్బోధ’ అని ప్రకటించడం వాక్యాధారిత ఖండన కాదు; కాల్వినిజం బోధను సరిగా అర్థం చేసుకోకుండా చేసిన విమర్శ మాత్రమే.

కాబట్టి ఈ ప్రశ్నలో రోమా 9 అధ్యాయంలోని ప్రధాన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకుండా అలాగే కాల్వినిజం బోధ నిజంగా ఏం చెబుతుందో పూర్తిగా చూపించకుండా ఖండించడానికి ప్రయత్నించారు. ఒక సిద్ధాంతాన్ని నిజంగా ఖండించాలంటే ముందుగా అది ఏమి బోధిస్తుందో న్యాయంగా మరియు సంపూర్ణంగా వివరించాలి.

ప్రశ్న 7: రోమా 9:18-22 వచనం చూపించి దేవుడే కావాలని కొందరిని ఉగ్రత పాలవడానికి నియమించాడు అని కాల్వనిస్టులు అంటారు. కానీ ఆ పాత్రలు తమకు తామే నాశనమునకు సిద్ధమైనవి అని ఈ వచనం చెబుతుంది. అందుకే 9:32 లో ‘వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి’ అని చెబుతూ వారే తమ తప్పిదాన్ని బట్టి నశిస్తున్నారు అని చెప్పాడు. దేవుడు ఈ లోకంలో మనలను రకరకాల పాత్రలుగా చేసినప్పటికీ మనం ఎలా మారాలి అనే అవకాశం, స్వేచ్ఛ మనకు ఇచ్చాడు. ఒకచోట ఉన్న వచనాన్ని బట్టి ఒక సిద్ధాంతాన్ని మనం తయారు చేసుకోకూడదు. (ఆర్టికల్ పేజి నెం.06)

జవాబు: ఇక్కడ ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇదే ఛానల్ వారు ముందటి ప్రశ్నలో “రోమా 9వ అధ్యాయం రక్షణ గురించి కాదు; భూమిపై పనుల కోసం దేవుడు వ్యక్తులను ఎన్నుకోవడం గురించి మాత్రమే” అని వాదించారు. కానీ ఇప్పుడు అదే రోమా 9 అధ్యాయంలోని వచనాలను ఉపయోగిస్తూ “వారు నశిస్తున్నారు”, “విశ్వాసమూలంగా అందుకోలేదు” అంటూ రక్షణ, నాశనం, విశ్వాసం వంటి అంశాల గురించి మాట్లాడుతున్నారు. తమ వ్యాఖ్యానంలో తామే వైరుధ్యానికి లోనవుతున్నారు. ఒకసారి రోమా 9ను భౌతిక పనులకు పరిమితం చేసి, మరోసారి అదే అధ్యాయాన్ని ఆత్మీయ నాశనం మరియు విశ్వాసానికి అన్వయించడం వారి వ్యాఖ్యానంలో ఉన్న వైరుధ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఈ ప్రశ్నలో రోమా 9:18–22 వచనాలపై ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ఆ అధ్యాయం యొక్క సంపూర్ణ సందర్భాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా “ఉగ్రతాపాత్రమైన ఘటములు తమకు తామే నాశనమునకు సిద్ధమైనవి” కాబట్టి దేవుని ఎన్నిక లేదా సార్వభౌమ నిర్ణయం ఇందులో లేదని చెప్పడం, పౌలు ఉద్దేశించిన సమగ్ర సందర్భాన్ని ప్రక్కనపెట్టడం అవుతుంది.

మొదటగా రోమా 9లో పౌలు దేవుని సార్వభౌమ అధికారాన్ని చాలా స్పష్టంగా మరియు బలంగా బోధిస్తున్నాడు. “కనికరింపవలెననుకున్న వారిని కనికరించుదును” (9:18), “కుమ్మరివానికి మట్టిమీద అధికారము లేదా?” (9:21) వంటి వచనాలు దేవుడు తన చిత్తానుసారంగా సమస్తాన్ని నిర్వహించే సార్వభౌముడని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా కుమ్మరి–మట్టి ఉపమానం ద్వారా సృష్టికర్తకు తన సృష్టిపై సంపూర్ణ అధికారం ఉందని పౌలు వివరిస్తున్నాడు. కాబట్టి రోమా 9 అధ్యాయాన్ని మనిషి స్వతంత్ర నిర్ణయంపైనే ఆధారపడినట్టు వివరించడం, ఆ అధ్యాయం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని వక్రీకరించినట్టవుతుంది.

అదేవిధంగా “నాశనమునకు సిద్ధమైన ఉగ్రతాపాత్రమైన ఘటములు” అనే వాక్యభాగాన్ని తీసుకొని “వారు తమకు తామే సిద్ధమయ్యారు” అని చెప్పడం ఆ వచనానికి సరైన అనువాదం కాదు. ఎందుకంటే రోమా 9:22లో “సిద్ధమైన” అని అనువదించబడిన పదం మూల గ్రీకు భాషలో passive రూపంలో ఉంది. అందువల్ల అక్కడ “తమకు తామే సిద్ధపడ్డారు” అనే భావం రాదు; “సిద్ధపరచబడిన” అనే భావమే వ్యాకరణపరంగా సహజంగా వస్తుంది. అంటే ఆ పాత్రలు దేవుని సార్వభౌమ ప్రణాళికలో నాశనానికి సిద్ధపరచబడినవిగా పౌలు మాట్లాడుతున్నాడు. అయితే అదే సమయంలో మనుష్యులు తమ పాపం మరియు అవిశ్వాసం వల్ల తీర్పుకు పాత్రులవుతారని కూడా బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. రోమా 9:32 ప్రకారం వారు విశ్వాసమూలంగా కాకుండా క్రియల మూలంగా వెంబడించారు. కాబట్టి వారి నాశనానికి వారు తమ పాపం వల్ల బాధ్యులు; దేవుడు వారి పాపానికి కర్త అని అర్థం కాదు. అందువల్ల రోమా 9లో పౌలు రెండు సత్యాలను ఒకేసారి నిలబెడుతున్నాడు—దేవుని సార్వభౌమాధికారం మరియు మనిషి బాధ్యత. ఈ రెండింటిలో ఒకదానిని అంగీకరించి మరొకదాన్ని బలహీనపరచడం పౌలు ఉద్దేశం కాదు.

“దేవుడు మనలను రకరకాల పాత్రలుగా చేసినప్పటికీ మనం ఎలా మారాలి అనే స్వేచ్ఛ ఇచ్చాడు” అనే మాట వినడానికి సమతుల్యంగా కనిపించినప్పటికీ రోమా 9లో పౌలు ప్రధానంగా ఆ దిశగా వాదించడం లేదు. అక్కడ పౌలు దేవుని ఎన్నిక, కనికరం, మరియు సార్వభౌమ అధికారంపై లేవనెత్తబడే అభ్యంతరాలకు సమాధానం ఇస్తున్నాడు. అందువల్ల ఆ అధ్యాయాన్ని “మనిషి స్వేచ్ఛ” కోణంలో చదవడం సరైనది కాదు.

చివరగా “ఒకచోట ఉన్న వచనాన్ని బట్టి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకోకూడదు” అనే మాట నిజమే. కానీ అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాల్వినిజం రోమా 9 మీద మాత్రమే నిర్మించబడలేదు; యోహాను 6, ఎఫెసీయులకు 1, అపొస్తల కార్యములు 13:48, రోమా 8:29–30 వంటి అనేక వచనాల సమగ్ర అధ్యయనంపై ఆ సిద్ధాంతాలు నిర్మించబడ్డాయి. కాబట్టి రోమా 9ను ఒకే కోణంలో పరిమితం చేసి కాల్వినిజాన్ని ఖండించడం, సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 8: 2తిమోతీ 2:20,21.. ‘గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును’. ఎవరు రక్షణ పొందాలి అనేది దేవుడు నిర్ణయించడు. అందరూ రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షించబడాలా శిక్ష తెచ్చుకోవాలా అని ఎన్నుకునే అవకాశం, స్వేచ్చ మనకే ఇచ్చాడు. నేడు జీవమార్గమును మరణమును నీ యెదుట ఉంచాను. (ద్వితీయోపదేశకాండము 30:19). ఎలాంటివారు రక్షించబడతారు అని దేవుడు షరతులు పెట్టాడో అలా జీవించినవారే రక్షించబడతారు. ఆయన షరతులను పాటించకుండా నిత్యజీవాన్ని పొందుకునే శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు... ఇదే దేవుని సార్వభౌమాధికారం... (ఆర్టికల్ పేజి నెం.06)

జవాబు: ఈ ప్రశ్నలో 2 తిమోతి 2:20–21 వచనాలను ఉపయోగిస్తూ “మనిషి తనను తాను పవిత్రపరచుకుంటే ఘనత నిమిత్తమైన పాత్రగా మారుతాడు; కాబట్టి ఎవరు రక్షించబడాలి అనేది పూర్తిగా మనిషి నిర్ణయమే” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల సందర్భాన్ని పూర్తిగా పరిశీలిస్తే పౌలు ఇక్కడ ప్రధానంగా ఎన్నిక సిద్ధాంతాన్ని చర్చించడం కానీ రక్షణ మనిషి స్వతంత్ర నిర్ణయంపైనే ఆధారపడి ఉందని బోధించడం కానీ చెయ్యడం లేదు. ఈ అధ్యాయం యొక్క సందర్భాన్ని పూర్తిగా పరిశీలిస్తే పౌలు తిమోతీకి అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తూ దేవునికి ఇష్టమైన సేవకునిగా ఎలా ఉండాలో బోధిస్తున్నాడు.

ప్రత్యేకంగా 2 తిమోతి 2:17–18లో హుమెనైయు, ఫిలేతు వంటి వారు సత్యమును విడిచిపెట్టి అబద్ధ బోధలు చేస్తున్నారని పౌలు చెబుతున్నాడు. ఆ తరువాతే “గొప్పయింటిలో బంగారు, వెండి పాత్రలు మాత్రమే కాక కఱ్ఱ, మట్టి పాత్రలు కూడా ఉంటాయి” అనే ఉపమానాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు ప్రధానంగా మాట్లాడుతున్నది సంఘంలో ఉన్న భిన్న రకాల మనుష్యుల గురించి, మరియు దేవుని సేవకు ఉపయోగపడే పరిశుద్ధమైన పాత్రగా ఉండాల్సిన అవసరాన్ని గురించి. “తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల ఘనత పాత్రయై యుండును” అనే మాట కూడా ఈ సందర్భంలోనే చెప్పబడింది. కాబట్టి ఈ వచనం “మనిషి తన స్వశక్తిచేత రక్షణ సంపాదించుకుంటాడు” అనే భావాన్ని బోధించడం కాదు; అబద్ధ బోధలు మరియు అపవిత్ర జీవితం నుండి వేరుపడి, దేవునికి ఉపయోగపడే పరిశుద్ధమైన పాత్రగా ఉండాలని ఇచ్చిన హెచ్చరిక.

అంతేకాకుండా ఇదే అధ్యాయంలో కొద్దిగా ముందుకు వెళ్తే పౌలు “దేవుడు వారికి సత్యజ్ఞానము కలుగునట్లు మారుమనస్సు దయచేయునేమో” (2 తిమోతి 2:24- 25) అని చెబుతున్నాడు. అంటే మనిషి సత్యాన్ని గ్రహించి మారుమనస్సు పొందడం కూడా చివరికి దేవుని కృపపైనే ఆధారపడి ఉందని పౌలు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కాబట్టి 2 తిమోతి 2:20–21 వచనాలను తీసుకొని, “రక్షణ పూర్తిగా మనిషి నిర్ణయం; దేవుని ఎన్నికకు స్థానం లేదు” అని నిర్ధారించడం, ఆ అధ్యాయం యొక్క సంపూర్ణ సందర్భాన్ని పక్కనపెట్టడమే ఔతుంది.

అదేవిధంగా “నేడు జీవమార్గమును మరణమును నీ యెదుట ఉంచాను” (ద్వితీయోపదేశకాండము 30:19) అనే వచనాన్ని చూపించి, “అందువల్ల దేవుడు ఎవరినీ ఎన్నుకోడు; పూర్తిగా మనిషి స్వేచ్ఛే నిర్ణయిస్తుంది” అని చెప్పడం కూడా పూర్తి బైబిల్ బోధను పరిగణలోకి తీసుకోకపోవడమే. దేవుడు అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు (అపొ.కార్యములు 17:30). అదే సమయంలో దేవుని కృప లేకుండా ఎవరూ నిజంగా దేవుని యొద్దకు రాలేరని కూడా బోధిస్తుంది (యోహాను 6:44, 65).

కాల్వినిజం కూడా మానవుని బాధ్యతను నిరాకరించదు. దేవుడు మానవులను యంత్రాలలా బలవంతంగా రక్షించడు; కానీ పాపపుస్థితిలో ఉన్న మనిషి దేవుని కృపచేతనే నిజమైన మారుమనస్సు పొందగలడని బోధిస్తుంది. కాబట్టి ‘మానవుని బాధ్యత’ మరియు ‘దేవుని కృప’ పరస్పర విరుద్ధాలు కావు.

“ఇదే దేవుని సార్వభౌమాధికారం” అని చివరలో చెప్పబడిన నిర్వచనం కూడా బైబిల్ బోధించే దేవుని సార్వభౌమాధికారాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించదు. ఎందుకంటే బైబిల్‌లో దేవుని సార్వభౌమాధికారం అంటే కేవలం “దేవుడు నియమాలు పెట్టాడు, ఇక మనిషి తన ఇష్టప్రకారం నిర్ణయం తీసుకుంటాడు” అనే అర్థం కాదు. దేవుడు తన సంకల్పానుసారంగా సమస్తాన్నీ నిర్వహిస్తాడని, తన ప్రజలను తనయొద్దకు ఆకర్షిస్తాడని, తన చిత్తప్రకారం రక్షింపదలచినవారిని రక్షిస్తాడని బైబిల్ బోధిస్తుంది.

ఒక వచనంలో మానవుని బాధ్యత మాత్రమే కనిపించిందని చెప్పి, దేవుని ఎన్నిక మరియు కృప గురించి మాట్లాడే ఇతర వచనాలను ప్రక్కనపెట్టడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

కాబట్టి 2 తిమోతి 2:20–21 లేదా ద్వితీయోపదేశకాండము 30:19 వచనాలను చూపించి ఎన్నిక సిద్ధాంతాన్ని ఖండించడం సరైన సమగ్ర వాక్యపరిశీలన కాదు. బైబిల్ దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు మానవుని బాధ్యతను రెండింటినీ ఒకేసారి బోధిస్తుంది; ఒక సత్యాన్ని నిలబెట్టడానికి మరొక సత్యాన్ని తిరస్కరించదు.

ప్రశ్న 9: కాల్వినిస్టులు “విశ్వాసము ద్వారా కృపతో రక్షించబడతాం.. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు..” అనే రెండు వచనాలు తీసుకుని విశ్వాసం ఉంది కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం అని, కృప ఉంది కాబట్టి రక్షణ పోదు అని వీరు వాదిస్తారు. బైబిల్ని వ్యాఖ్యానించేవారికి తెలియాల్సిన ఒక ప్రాధమిక విషయం ఏంటంటే ఒక విషయాన్ని గూర్చిన సమాచారం ఒక చోట ఉండదు. కొంత ఒక చోట కొంత ఒక చోట దొరుకుతుంది (యెషయా 28:10,13). రక్షణ కొరకు మొట్ట మొదట కనిపించే వచనం, రక్షణ పొందినవారు మొట్టమొదట కనిపించే సందర్భం అపో.కార్యములు 2:36-41 ఇందులో మారుమనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ పొందాలి అని రాయబడింది కాని విశ్వాసం కోసం రాయబడలేదు. అంటే విశ్వాసం అవసరం లేదని అర్ధమా? నా శరీరము తిని, నా రక్తము త్రాగువారిని అంత్య దినమున లేపుదును అని రాయబడింది. ఇక్కడ బాప్తిస్మం, విశ్వాసం, మారుమనసు.. ఇలా వేటి కోసం రాయలేదు. ఇవేవి అవసరం లేదని అర్ధమా? క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి రక్షింపబడడానికి ఏవేవి పరిగణలోనికి తీసుకోబడతాయో అవన్నీ చేస్తేనే నిత్యజీవ ప్రవేశం. (ఆర్టికల్ పేజి నెం.07)

జవాబు: ఈ ప్రశ్నలో ఒక సరైన అంశాన్ని ప్రస్తావించారు—బైబిల్ బోధ ఒకే వచనంలో పూర్తిగా ఇవ్వబడదు; వివిధ వచనాలను సమగ్రంగా పరిశీలించాల్సిందే. యెషయా 28:10,13 ఆధారంగా చెప్పిన ఈ సూత్రం కొంతవరకు సరైనదే. అయితే అదే సూత్రాన్ని కాల్వినిజంపై వర్తింపచేసేటప్పుడు, కొన్ని విషయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా ఈ నిర్ధారణకు వచ్చారు.

మొదటిగా “విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడితిరి” (ఎఫెసీయులకు 2:8), “నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును” వంటి వచనాలను చూపించి కాల్వినిస్టులు “విశ్వాసం ఉంది కాబట్టి పరలోకం వెళ్తాం” అని మాత్రమే బోధిస్తారని చెప్పడం, కాల్వినిజం నిజంగా ఏమి బోధిస్తుందో పూర్తిగా చూపించడం లేదు. చారిత్రాత్మక కాల్వినిజం నిజమైన రక్షణ విశ్వాసం ఎల్లప్పుడూ మారుమనస్సు, విధేయత, పరిశుద్ధ జీవితం వంటి ఫలితాలను కలిగిస్తుందని బోధిస్తుంది. “రక్షణ పోదు” అని చెప్పడం కూడా “ఎలా జీవించినా పరవాలేదు” అనే అర్థంలో కాదు; నిజంగా దేవునిచేత రక్షింపబడినవారు అంతమువరకూ విశ్వాసంలో నిలిచేలా దేవుడు కాపాడుతాడనే భావంలో చెబుతుంది.

అపొస్తల కార్యములు 2:38–41లో మారుమనస్సు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించబడింది కాబట్టి “విశ్వాసం గురించి చెప్పలేదు” అని నిర్ధారించడం కూడా పూర్తి సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకపోవడమే. ఎందుకంటే అదే సందర్భంలో పేతురు ప్రకటించిన సువార్తను “అంగీకరించిన వారు” బాప్తిస్మము పొందారు (అపొ.కా. 2:41). సువార్తను అంగీకరించడం అనేది విశ్వాసంతో సంబంధమున్న చర్యే. అలాగే క్రొత్త నిబంధనలో అనేక చోట్ల విశ్వాసం, మారుమనస్సు, బాప్తిస్మం, క్రీస్తునందు నిలిచియుండడం. ఇవి అన్నీ రక్షణ అనుభవానికి పరస్పర సంబంధమున్న అంశాలుగా కనిపిస్తాయి. కాబట్టి ఒక వచనంలో ఒక అంశం ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదని చెప్పి, అది అవసరం లేదని నిర్ధారించడం సరైన వ్యాఖ్యానం కాదు.

అదేవిధంగా “నా శరీరము తిని, నా రక్తము త్రాగువారిని అంత్యదినమున లేపుదును” అనే యోహాను 6:54 వచనాన్ని తీసుకొని “ఇక్కడ విశ్వాసం లేదా బాప్తిస్మం గురించి లేదు” అని చెప్పడం కూడా అదే సమస్యను కలిగి ఉంది. యోహాను 6 అధ్యాయం యొక్క సంపూర్ణ సందర్భాన్ని పరిశీలిస్తే, యేసు తనయందు విశ్వాసం ఉంచడం గురించే పదేపదే బోధిస్తున్నాడు (యోహాను 6:35,36,41,48). అందువల్ల “నా శరీరము తిని, నా రక్తము త్రాగువాడే” అనే మాటలను అక్షరార్థంగా కాకుండా యేసుక్రీస్తును విశ్వసించి ఆయన యొద్దకు రావడాన్నీ సూచించే అలంకార భాషగా అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తును విశ్వసించి ఆయనయొద్దకు వచ్చే వారికే నిత్యజీవం కలుగుతుందని ఆయన బోధిస్తున్నాడు.

అయితే ఈ ప్రశ్న చివర చెప్పిన ఒక విషయం మాత్రం సరైనదే: కొత్త నిబంధనలో రక్షణకు సంబంధించిన అన్ని బోధలను సమగ్రంగా పరిశీలించాలి. కానీ అదే సూత్రం కాల్వినిజం గురించి కూడా వర్తిస్తుంది. కాల్వినిజం కేవలం “రెండు వచనాలు” మీద నిర్మించబడిన సిద్ధాంతం కాదు; విశ్వాసం, కృప, ఎన్నిక, మారుమనస్సు, పరిశుద్ధ జీవితం మరియు పరిశుద్ధుల పదిలత గురించి మాట్లాడే అనేక వచనాల సమగ్ర అధ్యయనంపై అది నిర్మించబడింది.

కాబట్టి “కొత్త నిబంధనలో కనిపించే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి” అనే మాట నిజమే. కానీ అదే సమయంలో ఒక అంశాన్ని బలపరచడానికి మరొక అంశాన్ని బలహీనపరచడం కూడా సరైన విధానం కాదు. బైబిల్ రక్షణను పూర్తిగా దేవుని కృపపైనే ఆధారపడి ఉన్నదిగా చూపిస్తూనే మనుష్యులు విశ్వాసం, మారుమనస్సు, విధేయత, మరియు పరిశుద్ధ జీవితంలో కొనసాగాలని కూడా బోధిస్తుంది.

ప్రశ్న 10: Limited Atonement:- యేసుక్రీస్తు కేవలం కొందరి ప్రాయశ్చిత్తం కోసమే చనిపోయాడు, దేవుడు కొందరిని మాత్రమే ప్రేమిస్తున్నాడు, మిగతావారిని నరకానికి పంపాలని దేవుడు నిర్ణయించాడు అనేది వీరి వాదన. ఒక చిన్న ప్రశ్న... ఒక కసాయివాడు తన మందలో పుట్టిన మేకల్లో ఒక దానిని ఇంట్లో పెంచుకోగలడు. మిగతా వాటి అన్నిటిని చంపి వ్యాపారం చేసుకోగలడు. కానీ ఆ కసాయివానికి ముగ్గురు చిన్న పిల్లలు ఉంటే అందులో ఒకడిని బాగా పెంచి మిగిలిన ఇద్దరినీ చంపేసి, అవయవాలు అమ్మి వ్యాపారం చేస్తాడా? కసాయివాడైనప్పటికీ ఒక వ్యాపారస్తుడిగా మేకల్ని చంపగలడు కాని పిల్లల్ని చంపలేడు. అలాంటిది ప్రేమాస్వరూపి అయిన దేవుడు నరకంలో వేయడానికి కొందరిని సృష్టిస్తాడని ఎలా చెబుతారు? ఇది దేవుని స్వభావానికి వ్యతిరేకం. బైబిల్లో ఇందుకు ఒక్క ఆధారం కూడా ఉండదు. కాల్వనిస్టులు ఎప్పటిలాగే అశాస్త్రీయమైన, లాజిక్ లేని వాదనతో వచనాలను వక్రీకరిస్తుంటారు. వీళ్ళ చెత్త లాజిక్ ఎలా ఉంటుంది అంటే.. అందరికోసం చనిపోతే అందరి పాపాలు పోవాలి కదా అందరూ పరలోకం వెళ్ళాలి కానీ కొందరు నరకమెందుకు వెళ్తున్నారు అని అడుగుతారు. దేవుడు అందరికీ రక్షణను ఆఫర్ చేశాడు. అందరికీ అవకాశం ఇచ్చాడు. ఎవరు వినియోగించుకంటే వారు విమోచించబడతారు. ఎవరు విమోచింపబడతారో ఆయనకు ముందే తెలుసు. అది ఆయన భవిష్యత్ జ్ఞానమే కానీ నిరంకుశ నిర్ణయం కాదు. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో Limited Atonement (పరిమిత ప్రాయశ్చిత్తం) సిద్ధాంతాన్ని భావోద్వేగపూరిత ఉదాహరణలతో ఖండించడానికి ప్రయత్నించినప్పటికీ కాల్వినిజం నిజంగా ఏమి బోధిస్తుందో సరిగ్గా చూపించడం లేదు. ముఖ్యంగా “దేవుడు కొందరిని నరకంలో వేయడానికే సృష్టించాడు”, “దేవుడు కొందరినే ప్రేమిస్తాడు” అనే భావనను కాల్వినిజం బోధిస్తుందని ఈ ప్రశ్న ఆరోపిస్తుంది. అయితే కాల్వినిస్టులు తమ సిద్ధాంతాన్ని సాధారణంగా ఆ విధంగా వ్యక్తపరచరు. వారు మనుష్యులందరూ పాపపుస్థితిలో ఉన్నారని, దేవుడు వారిలో కొందర్నీ కనికరించి రక్షిస్తాడని బోధిస్తారు.

అయితే Limited Atonement అనే సిద్ధాంతం ప్రధానంగా ఏమి బోధిస్తుందంటే—క్రీస్తు మరణం విలువ అందరిని రక్షించడానికి సమర్థమైనదే కానీ దాని రక్షణ ఫలితం దేవుడు రక్షించదలచినవారిని మాత్రమే రక్షిస్తుంది. అంటే “క్రీస్తు మరణం అందరిని రక్షించడానికి సరిపోదు” అని కాదు; “ఆయన మరణం తన ప్రజల రక్షణను నిశ్చయంగా సాధిస్తుంది” అనే భావనను బలపరచడమే.

అలాగే కసాయివాడు–పిల్లల ఉదాహరణ భావోద్వేగపూరితంగా వినిపించినప్పటికీ అది దేవుడు మరియు పాపస్థితిలో ఉన్న మనుష్యుల గురించి బైబిల్ బోధను సరైన విధంగా చూపించడం లేదు. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనుష్యులందరూ పాపులు, నరకానికి పాత్రులైనవారు (రోమా 3:23; 6:23). కాల్వినిజం ప్రకారం దేవుడు నిరపరాధులను నరకానికి నెడతాడు అని కాదు; పాపులలో కొందర్నీ కనికరించి వారిని రక్షిస్తాడు అని బోధిస్తుంది. కాబట్టి “దేవుడు అమాయకులను చంపుతున్నాడు” అనే విధంగా ఈ సిద్ధాంతాన్ని చిత్రీకరించడం సరైనది కాదు.

“అందరికోసం చనిపోయి ఉంటే అందరూ రక్షించబడాలి కదా?” అనే ప్రశ్నను కూడా ఈ ఆర్టికల్ లో కొంత వ్యంగ్యంగా ప్రస్తావించారు. కానీ ఆ ప్రశ్న వెనుక ఉన్న theological issue ఏంటంటే—క్రీస్తు మరణం కేవలం రక్షణకు అవకాశం కల్పించిందా లేక నిజంగా తన ప్రజల రక్షణను సాధించిందా అన్నది. కాల్వినిజం రెండవదానిని బలపరుస్తుంది. అంటే క్రీస్తు తన గొఱ్ఱెల కొరకు ప్రాణం పెట్టాడు (యోహాను 10:11), తన ప్రజలను వారి పాపాలనుండి రక్షించును (మత్తయి 1:21) అనే వచనాలను ఆధారంగా తీసుకొని, ఆయన మరణం తన ప్రజల రక్షణను ఖచ్చితంగా సాధిస్తుంది అని బోధిస్తుంది.

అదేవిధంగా “దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు; ఎవరు వినియోగించుకుంటే వారు రక్షింపబడతారు” అనే భావన, మానవ బాధ్యతను బలంగా చూపించినప్పటికీ మనిషి పతనస్థితి గురించి బైబిల్ బోధించే ఇతర అంశాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కాల్వినిజం ప్రకారం కూడా దేవుడు సువార్తను అందరికీ ప్రకటించమని ఆజ్ఞాపిస్తాడు; అయితే నిజంగా ఎవరు విశ్వసిస్తారో అది చివరికి దేవుని కృపపైనే ఆధారపడి ఉంటుంది.

చివరగా “దేవునికి ముందే తెలుసు; కానీ అది ఆయన నిర్ణయం కాదు” అనే వాదన కూడా చాలా లోతైన వేదాంతపరమైన చర్చకు సంబంధించింది. బైబిల్ ప్రకారం దేవుని ముందస్తుజ్ఞానం (foreknowledge) కేవలం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే చూసే నిష్క్రియాత్మక జ్ఞానం కాదు; అది ఆయన సంకల్పం, ఎన్నిక, మరియు సార్వభౌమ ప్రణాళికతో సంబంధముంది. ముఖ్యంగా రోమా 8:29–30లో “ఎవరిని ఆయన ముందుగా ఎరిగెనో వారిని తన కుమారుని స్వరూపమునకు సమానులగుటకు ముందుగా నిర్ణయించెను” అని చెప్పబడింది. ఇక్కడ “ముందుగా ఎరిగెను” అనే పదాన్ని కేవలం “భవిష్యత్తులో ఎవరు విశ్వసిస్తారో దేవుడు ముందుగానే చూశాడు” అనే అర్థానికి పరిమితం చెయ్యడం సరిపోదు. ఎందుకంటే అదే వచనంలో ముందస్తుజ్ఞానం, ముందుగా నిర్ణయించడం, పిలచుట, నీతిమంతులుగా తీర్చుట, మహిమపరచుట— ఇవి అన్నీ దేవుని ప్రణాళికలో పరస్పర సంబంధమున్న కార్యాలుగా చూపించబడుతున్నాయి.

అదేవిధంగా బైబిల్‌లో ‘ఎరుగుట’ అనే పదం కేవలం తెలిసి ఉండడం మాత్రమే కాదు, ప్రత్యేకమైన సంబంధాన్ని లేదా ప్రేమపూర్వక ఎంపికను కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, “భూమిమీదనున్న సమస్త వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను” (ఆమోసు 3:2) అని దేవుడు ఇశ్రాయేలును గూర్చి చెప్పినప్పుడు, అది ఇతర జనాంగాల గురించి దేవునికి తెలియదు అనే అర్థం కాదు; ప్రత్యేకమైన సంబంధం మరియు ఎన్నిక భావాన్ని సూచిస్తుంది. అదేవిధంగా రోమా 8:29లోని ‘ముందుగా ఎరిగెను’ అనే మాటను కూడా కేవలం ముందుగానే తెలుసుకోవడం అనే అర్థంలో కాకుండా దేవుడు తనవారిగా ప్రేమపూర్వకంగా ఎన్నుకొని తెలిసికొనడం అనే భావంలో అర్థం చేసుకోవాలి.

అందువల్ల “దేవుడు కేవలం ముందుగానే చూసాడు; కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని చెప్పడం బైబిల్ బోధించే foreknowledge భావాన్ని చూపించదు. బైబిల్ ప్రకారం దేవుని ముందస్తుజ్ఞానం ఆయన సార్వభౌమ సంకల్పానికి వేరైనది కాదు; ఆయన నిర్ణయంతో సంబంధముందే. అయితే దీని అర్థం దేవుడు మనుష్యులను బలవంతంగా పాపంలోకి నెడతాడు లేదా వారి ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడు అని కాదు. దేవుని సార్వభౌమ ప్రణాళిక మరియు మానవుని బాధ్యత రెండూ బైబిల్‌లో సమాంతర సత్యాలుగా నిలుస్తాయి.

ఇంకా ఒక విషయం గమనించాలి. ఈ ఆర్టికల్‌లోనే “ఎవరు విమోచింపబడతారో, ఎవరు నశించిపోతారో దేవునికి ముందే తెలుసు; కానీ ఆయన నిర్ణయించలేదు. ఇదే ఆయన భవిష్యత్‌జ్ఞానం” అని వ్రాయబడింది. అయితే ఒక చిన్న ప్రశ్న — ఒకవేళ దేవునికి ఎవరు నరకానికి వెళ్తారో ముందే తెలిసి కూడా వారిని సృష్టించాడా? ముందే తెలిసి సృష్టించినట్లయితే అందులో ప్రేమ ఎక్కడ ఉంది. దీనికి ఈ ఛానల్ వారే సమాధానం చెప్పాలి.

అందువల్ల Limited Atonement సిద్ధాంతాన్ని ఖండించాలంటే ముందుగా అది నిజంగా ఏమి బోధిస్తుందో న్యాయంగా మరియు సందర్భానుసారంగా వివరించాలి; తర్వాత దానిని ఖండించాలి. భావోద్వేగపూరిత ఉదాహరణలు లేదా అతిశయోక్తులతో కాకుండా సమగ్ర వాక్యపరిశీలన ఆధారంగా విషయాన్ని పరిశీలించడం అవసరం.

ప్రశ్న 11: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ మత్తయి 11:28 వచనం ప్రభువు సమస్త జనులకు విశ్రాంతి కలుగ చేస్తుందని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో మత్తయి 11:28 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “యేసుక్రీస్తు సమస్త జనులను పిలుస్తున్నాడు కాబట్టి Limited Atonement తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ వచనం యొక్క సందర్భాన్ని మరియు కాల్వినిజం నిజంగా ఏం బోధిస్తుందో పరిశీలిస్తే ఈ అభ్యంతరం నిలబడదు.

మత్తయి 11:28లో ప్రభువు ఇలా అంటున్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” ఈ వచనంలో యేసు నిజంగానే సమస్త మనుష్యులకు పిలుపునిస్తున్నాడు. కాల్వినిజం కూడా సువార్త పిలుపు సమస్త జనులకు ప్రకటించబడాలని బోధిస్తుంది. “సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి” అనే ఆజ్ఞను కాల్వినిస్టులు కూడా అంగీకరిస్తారు. కాబట్టి “సమస్త జనులకు పిలుపు ఉంది” అనే విషయాన్ని కాల్వినిజం ఖండించదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మత్తయి 11:28 ప్రధానంగా సువార్త పిలుపు యొక్క విశాలతను చూపిస్తుంది; కానీ క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క ఉద్దేశ పరిధి గురించి చర్చించడం లేదు. Limited Atonement సిద్ధాంతం ప్రకారం కూడా సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. కానీ క్రీస్తు మరణం దేవుని ప్రణాళికలో ఉన్నవారి రక్షణను నిశ్చయంగా సాధించుటకై ఉద్దేశించబడిందని బోధిస్తారు.

అదేవిధంగా మత్తయి 11:28 వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్న 25–27 వచనాల సందర్భాన్ని కూడా పరిశీలించాలి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు, “పరలోకమునకును భూమికిని ప్రభువైన తండ్రీ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి, పసివారికి బయలుపరచితివి గనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఇది నీ దృష్టికి అనుకూలమై యుండెను” (మత్తయి 11:25–26) అని చెప్పాడు. అంటే దేవుని సత్యం ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా బయలుపరచబడడం లేదు; దేవుని చిత్తప్రకారమే కొందరికి అది బయలుపరచబడుతోంది అనే భావం ఈ సందర్భంలో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత 11:27లో “తండ్రి కుమారునికి అప్పగించినవారికే కుమారుడు ఆయనను బయలుపరచును” అని ప్రభువు చెప్పడం ద్వారా క్రీస్తును నిజంగా ఎరగడం అనేది దేవుడు బయలుపరచే కార్యమని మరింత స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాతే, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి” (11:28) అని పిలుస్తున్నాడు. కాబట్టి 11:28లోని “సమస్త జనులారా” అనే మాటను మాత్రమే తీసుకొని, ముందున్న సందర్భంలో ఉన్న దేవుని చిత్తం, క్రీస్తును గూర్చిన దైవిక బయలుపాటు, మరియు కుమారుడు ఎవరికీ బయలుపరచబడుతున్నాడు అనే అంశాలను పూర్తిగా ప్రక్కనపెట్టడం సరైన వ్యాఖ్యానం కాదు.

ఇంకా ఒక విషయం గమనించాలి: “సమస్త జనులారా నా యొద్దకు రండి” అని పిలుపు ఇవ్వబడినందువల్ల, అందరూ నిజంగా వస్తారు అనే నిర్ధారణ బైబిల్ ఎక్కడా చెయ్యదు. ఎందుకంటే బైబిల్ ప్రకారం మనుష్యులు ‘అపరాధములచేతను పాపములచేతను మృతులై యున్నారు’ (ఎఫెసీయులకు 2:1). అంటే వారు ఆత్మీయంగా పతనమైన స్థితిలో ఉన్నారు. అందువల్ల తండ్రి ఆకర్షించితే తప్ప ఎవరూ నిజంగా క్రీస్తు యొద్దకు రాలేరు (యోహాను 6:45).

అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని Limited Atonement సిద్ధాంతాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు. బైబిల్ ఒకవైపు సువార్త పిలుపు సమస్త జనులకు ప్రకటించబడుతుందని బోధిస్తూనే మరోవైపు క్రీస్తు తన ప్రజలను నిశ్చయంగా రక్షిస్తాడని కూడా బోధిస్తుంది.

ప్రశ్న 12: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ యోహాను 12:32 వచనం అందరినీ ఆకర్షించుకొందును అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో యోహాను 12:32 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “యేసుక్రీస్తు అందరినీ తనయొద్దకు ఆకర్షిస్తాడు కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనం యొక్క సందర్భాన్ని మరియు కాల్వినిజం నిజంగా ఏం బోధిస్తుందో పరిశీలిస్తే ఈ అభ్యంతరం అంత సులభంగా నిలబడదు.

యోహాను 12:32లో ప్రభువు ఇలా అన్నాడు: “నేను భూమిమీదనుండి ఎత్తబడిన తర్వాత అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును.” ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే దాని తక్షణ సందర్భాన్ని ముందుగా పరిశీలించాలి. యోహాను 12:20–21లో కొందరు గ్రీసుదేశస్తులు యేసును చూడాలని వచ్చారు. అంటే యూదులు మాత్రమే కాదు, అన్యజనులు కూడా క్రీస్తు యొద్దకు వస్తున్నారు అనే విషయం ఈ సందర్భంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ నేపథ్యానికే స్పందిస్తూ యేసు “అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందును” అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ “అందరు” అనే పదాన్ని ఏ మినహాయింపూ లేకుండా అందరు అనే అర్థంలో కాకుండా ఏ భేదమూ లేకుండా అందరు అని, అంటే అన్ని జనాంగాలవారు—యూదులు మరియు అన్యజనులు—అనే విస్తృత భావంలో అర్థం చేసుకోవడం సందర్భానికి మరింత సరిపోతుంది.

అదేవిధంగా “అందరిని ఆకర్షించుకొందును” అంటే ఆయన ప్రణాళికలో ఉన్న వారందరినీ రక్షించుకొనును అనే అర్థమే గానీ లోకంలోని ప్రతి వ్యక్తి ఖచ్చితంగా రక్షించబడతాడు అనే అర్థం కాదు. అలా అర్థం చేసుకుంటే చివరికి universalism వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అదే యోహాను సువార్తలో చాలామంది క్రీస్తును తిరస్కరించినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది (యోహాను 5:40, 6:66). కాబట్టి “ఆకర్షించుట” అనే పదాన్ని ప్రతి వ్యక్తి తప్పక రక్షించబడతాడు అనే అర్థంలో తీసుకోవడం సరైనది కాదు.

ఇంకా ఒక విషయం గమనించాలి: యోహాను సువార్తలో “ఆకర్షించుట” గురించి మాట్లాడిన మరొక ముఖ్యమైన వచనం యోహాను 6:45 — “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు.” అక్కడ తండ్రి ఆకర్షించినవారే నిజంగా క్రీస్తు యొద్దకు వస్తారని చెప్పబడింది. అదే విధంగా యోహాను 6:38,40లో “తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వచ్చుదురు” మరియు “ఆయన నాకు అనుగ్రహించిన వాటిలో దేనిని నేను పోగొట్టుకొనక” అని కూడా చెప్పబడింది. కాబట్టి యోహాను 12:32లోని “అందరిని ఆకర్షించుకొందును” అనే మాటను యోహాను సువార్త యొక్క సమగ్ర సందర్భంలో అర్థం చేసుకోవాలి.

కాల్వినిజం కూడా సువార్త పిలుపు అన్ని జనాంగాలకు విస్తరించబడిందని అంగీకరిస్తుంది. యేసుక్రీస్తు కేవలం యూదులకే కాదు, సమస్త జనాంగాలవారికి కూడా రక్షణ ద్వారం తెరిచాడు అని కూడా బోధిస్తుంది. కానీ అదే సమయంలో నిజంగా ఎవరు క్రీస్తునందు విశ్వాసంతో వస్తారో అది దేవుని కృపచేత జరుగుతుందని బోధిస్తుంది.

కాబట్టి యోహాను 12:32 వచనం క్రీస్తు యూదులను మాత్రమే కాకుండా ఏ భేదం లేకుండా అందరినీ తనయొద్దకు ఆకర్షిస్తాడని బోధిస్తుంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని Limited Atonement లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 13: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ తీతుకు 2:11 వచనం సమస్త మనుషులకు రక్షణకరమైన కృప అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో తీతుకు 2:11 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమైంది కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనం యొక్క సందర్భాన్ని మరియు “సమస్త మనుషులు” అనే పదప్రయోగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ అభ్యంతరం సందర్భపరంగా నిలబడదు.

తీతుకు 2:11లో ఇలా వ్రాయబడింది: “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయెను.” ఈ వచనాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్న సందర్భాన్ని గమనించాలి. తీతుకు 2వ అధ్యాయంలో పౌలు వృద్ధులు, వృద్ధస్త్రీలు, యౌవనపురుషులు, యౌవనస్త్రీలు, దాసులు వంటి భిన్న వర్గాల మనుష్యుల గురించి వరుసగా బోధిస్తున్నాడు (2:1–10). ఆ తర్వాతే “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయెను” అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ “సమస్త మనుషులు” అనే భావం ఏ మినహాయింపు లేకుండా ప్రతి వ్యక్తి అనే అర్థంలో కాకుండా అన్ని వర్గాల మనుష్యులకు—వృద్ధులు, యౌవనులు, పురుషులు, స్త్రీలు, దాసులు వంటి వారందరికీ దేవుని కృప ప్రత్యక్షమైందనే భావంలో ఉపయోగించబడినట్టు సందర్భం సూచిస్తోంది.

అదేవిధంగా "సమస్త మనుషులకు” అనే పదాన్ని ప్రతి వ్యక్తి తప్పక రక్షించబడతాడు అనే అర్థం కాదు. ఎందుకంటే అదే బైబిల్‌లో చాలామంది నశించుదురు, కొందరు మాత్రమే జీవమార్గంలో ప్రవేశిస్తారు అని కూడా స్పష్టంగా చెప్పబడింది (మత్తయి 7:13–14). కాబట్టి “సమస్త మనుషులకు” అనే మాటను ప్రతి వ్యక్తి తప్పక రక్షించబడతాడు అనే అర్థంలో తీసుకోవడం సరైనది కాదు.

కాబట్టి తీతుకు 2:11 వచనం దేవుని రక్షణకరమైన కృప ఏ ఒక్క వర్గానికీ పరిమితం కాలేదని, సమస్త వర్గాల మనుష్యులకు సువార్త ప్రకటించబడుతోందని బోధిస్తుంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని Limited Atonement లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 14: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ 1 యోహాను 2:2 వచనం ఆయన సర్వలోకమునకు శాంతికరమైయున్నాడు అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో 1 యోహాను 2:2 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమైయున్నాడు కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనం యొక్క సందర్భాన్ని మరియు “సర్వలోకము” అనే పదప్రయోగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అభ్యంతరం సందర్భపరంగా నిలబడదు.

1 యోహాను 2:2లో ఇలా వ్రాయబడింది: “ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు కూడ శాంతికరమై యున్నాడు.”

యోహాను రచనల్లో యూదులు మాత్రమే కాకుండా యూదులు కాని వారిని కూడా చేర్చుతూ మాట్లాడే రచనా శైలి అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు, యోహాను 11:51-52లో యేసు “ఆ జనము కొరకే కాక, చెదిరిపోయిన దేవుని పిల్లలను కూడ ఏకముగా సమకూర్చుటకై” మరణించబోవుచున్నాడని చెప్పబడింది. అక్కడ “ఆ జనము” అంటే యూదులు, “చెదిరిపోయిన దేవుని పిల్లలు” అంటే యూదులు కాని విశ్వాసులను సూచిస్తున్నట్లు సందర్భం తెలియజేస్తుంది. అలాగే యోహాను 10:16లో “ఈ దొడ్డికి చెందని వేరే గొర్రెలు” అని చెప్పడం ద్వారా యూదులు కాని జనులను సూచిస్తున్నాడు. యోహాను 1:11-12లో కూడా “తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అయితే ఆయనను అంగీకరించిన వారందరికిని…” అని చెప్పడం ద్వారా యూదులు మరియు యూదులు కాని వారిని వేరుచేసి చూపిస్తున్నాడు. అదేవిధంగా గలతీయులకు 2:8-9 ప్రకారం యోహాను ప్రధానంగా సున్నతి పొందినవారి మధ్య సేవచేసిన అపొస్తలులలో ఒకడిగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రచనా శైలిని బట్టి 1 యోహాను 2:2లో “మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు కూడ” అని చెప్పినప్పుడు, అది యూదులకే కాదు సమస్త జనాంగాల ప్రజల కొరకు కూడ క్రీస్తు శాంతికరమై ఉన్నాడనే భావాన్ని సూచిస్తున్నట్లు సందర్భపరంగా అర్థం చేసుకోవచ్చు.

ఈ వచనంలో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే యోహాను “మన పాపములకు మాత్రమే కాదు” అని చెప్పి, క్రీస్తు ప్రాయశ్చిత్తం యూదులకే పరిమితం కాదని సర్వలోకమునకు అని తెలియచేస్తున్నాడు. అంటే ఇక్కడ “సర్వలోకము” అనే పదాన్ని ఏ మినహాయింపూ లేకుండా ప్రతి వ్యక్తి అనే అర్థంలో కాకుండా లోకమంతటా ఉన్న ప్రజలందరికీ—అంటే అన్ని జనాంగాల వారికి—క్రీస్తు శాంతికరమై ఉన్నాడని అర్థం చేసుకోవాలి.

అదేవిధంగా “సర్వలోకమునకు శాంతికరమై యున్నాడు” అనే మాటను ప్రతి వ్యక్తి నిజంగా రక్షించబడ్డాడు లేదా తప్పక రక్షించబడతాడు అని అర్థం కాదు. ఎందుకంటే అదే యోహాను రాసిన సువార్తలో విశ్వసించనివారు శిక్షకు లోనౌతారని, జీవాన్ని చూడరని స్పష్టంగా చెప్పబడింది (యోహాను 3:18,36). కాబట్టి “సర్వలోకము” అనే పదాన్ని ప్రతి వ్యక్తి నిశ్చయంగా రక్షింపబడతాడు అనే అర్థంలో తీసుకోవడం సరైనది కాదు.

అలాగే యోహాను రచనల్లో “లోకము” అనే పదం ఎల్లప్పుడూ ఓకే అర్థంలోనే ఉపయోగించబడలేదు. ఉదాహరణకు, 1 యోహాను 5:19లో “లోకమంతయు దుష్టుని ఆధీనములో ఉంది” అని చెప్పబడింది. అక్కడ “లోకము” అంటే ప్రతి వ్యక్తి కాదు; దేవునికి విరోధంగా ఉన్న మానవ సమాజాన్ని సూచిస్తుంది. కాబట్టి 1 యోహాను 2:2లోని “సర్వలోకము” అనే పదాన్ని కూడా దాని సందర్భానుసారంగానే అర్థం చేసుకోవాలి.

కాబట్టి 1 యోహాను 2:2 వచనం క్రీస్తు ప్రాయశ్చిత్తం ఏ ఒక్క జనాంగానికీ లేదా సమూహానికీ పరిమితం కాలేదని, అన్ని జనాంగాలవారికీ విస్తరించబడిందని బోధిస్తుంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని Limited Atonement లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 15: యోహాను 3:16 లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడిని పంపాడని రాయబడింది కదా! మరి యేసుక్రీస్తు లోకమంతటి కొరకూ ప్రాణం పెట్టలేదా? (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: “దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించె‌ను” అన్నప్పుడు మనం ఆలోచిస్తున్నట్టుగా అది ఈ లోకమంతటి కోసమూ చెప్పబడుతుందని కాకుండా ఒక పరిధిలో చెప్పబడిన మాటగా అర్థం చేసుకోవాలి. “దేవుడు ప్రేమించిన లోకం” వేరే ఉంది. ఆయన నిర్ణయంలో ఉన్నవారే ఆ లోకం “యేసుక్రీస్తు ఆ లోకం కోసమే తన ప్రాణం పెట్టాడు”. ఒకవేళ మనం ఆలోచిస్తున్నట్టుగా ఆ సందర్భంలో లోకం అనగానే మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతుండి, యేసుక్రీస్తు ఆ లోకమంతటికోసమూ ప్రాణం పెడితే యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో ఒకసారి చూడండి.

యోహాను 17:9 నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; “లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు”, నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు “నేను లోకం కొరకు ప్రార్థన చెయ్యడం లేదు” అంటున్నాడు. అంటే ఆయన తండ్రి ప్రేమించిన లోకం కోసం ప్రార్థన చెయ్యకుండా తండ్రి ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడా? లేదు. ఆయన ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నాడో వారే దేవుడు ప్రేమించిన లోకం (ఆయన నిర్ణయంలో ఉన్నవారు). అయితే దీనికి కొందరు, అప్పటికి లోకంలో ఇంకా చాలామంది మారుమనస్సు పొందలేదు, అందుకే యేసుక్రీస్తు వారికోసం కాకుండా మారుమనస్సు పొందినవారికోసమే ప్రార్థన చేస్తున్నాడని వాదించవచ్చు. కానీ యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేస్తుంది కేవలం అప్పటికి ఆయనను విశ్వసించినవారికోసమే కాదు. భవిష్యత్తులో ఆయనను విశ్వసించబోయే అందరికోసమూ అక్కడ ప్రార్థన చేసాడు. అందులో నేటి విశ్వాసులమైన మనం‌ కూడా ఉన్నాము.

యోహాను 17:21 వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; “వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను”.

ఈ మాటల ప్రకారం; యేసుక్రీస్తు అప్పటికి తనను విశ్వసించినవారికోసం మాత్రమే కాదు, అపోస్తలుల బోధను బట్టి భవిష్యత్తులో విశ్వసించబోయే అందరికోసమూ ప్రార్థన చేసాడు. వారే తండ్రి ప్రేమించిన లోకం, ఆ లోకం‌ కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రార్థించకుండా విడిచిపెట్టిన లోకం వేరే ఉంది, వారే తండ్రి నిర్ణయంలో లేనివారు. తండ్రి వారిని ప్రేమించలేదు, యేసుక్రీస్తు వారికోసం ప్రాణం పెట్టనూ లేదు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించె‌ను” అని‌ తన సువార్తలో ప్రస్తావించిన యోహాను, తండ్రి ప్రేమించిన అదేలోకం కోసం తన పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తాడు.

1 యోహాను 2: 2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

ఇక్కడ యోహాను తండ్రి ప్రేమించిన లోకాన్ని ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు ఆ సర్వలోకానికి శాంతికరంగా ఉన్నాడు అంటున్నాడు. అంటే యూదులకు మాత్రమే కాదు‌ కానీ తండ్రి నిర్ణయం చొప్పున యేసుక్రీస్తు ఎవరికోసమైతే ప్రాణం పెట్టాడో వారందరి పాపాలకూ (అన్యజనులకు సహా) ఆయన శాంతికరంగా ఉన్నాడని ఈ మాటలభావం. ఇప్పుడు చెప్పండి, ఈలోకంలో ఎంతోమంది నశించిపోయి, నరకానికి పోతున్నారు. వారందరి పాపాలకూ యేసుక్రీస్తు శాంతికరంగా ఉన్నాడా? ఉంటే వారి పాపాలను బట్టి నశించిపోగలరా? యేసుక్రీస్తు ఎవరి పాపాలకైతే శాంతికరంగా ఉన్నాడో వారు నశించిపోవడం అసాధ్యం. ఈ మాటలు కూడా “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను” అని రాయబడిన వాక్యభాగంలోనే ఉన్నాయి. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16). కాబట్టి యోహాను మాటల్లో లోకం, సర్వలోకం (1 యోహాను 2:2) అన్నప్పుడు “తండ్రి నిర్ణయంలో ఉన్నవారికోసమే” “యేసుక్రీస్తు ప్రార్థన చేసినవారికోసమే” “ఆయన ప్రాణం పెట్టినవారికోసమే” అని అర్థం.

“లోకం” అనేమాటను యూదులు పరిధులతో (ఒక సమూహాన్ని సూచించడానికి) కూడా ఉపయోగిస్తారని అర్థమయ్యేందుకు ఒక స్పష్టమైన ఆధారం పెడుతున్నాను చూడండి.

యోహాను 12:19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. “ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని” చెప్పుకొనిరి.

ఇక్కడ యూదులలో పరిసయ్యులు అనబడే ఒక గుంపు, యేసుక్రీస్తును‌ వెంబడిస్తున్న సమూహాన్ని ఉద్దేశించి వారిని “లోకం” అని ప్రస్తావించింది. లోకం అని రాయబడినప్పుడల్లా అది ప్రపంచం మొత్తం కోసమూ అనుకుంటే ప్రపంచం‌ మొత్తంలో అప్పుడు ఆయనను వెంబడించింది యూదయ మరియు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న‌ కొంతమందే కదా! చివరికి ఆ మాటలు పలుకుతున్న పరిసయ్యులు కూడా ఆయనను వెంబడించలేదు.

ప్రశ్న 16: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ 1 తిమోతి 2:4 వచనం మనుషులందరూ రక్షణ పొందవలెనని ఇచ్చయించుచున్నాడు, 1 తిమోతి 2:6 వచనం ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో 1 తిమోతి 2:4-6 వచనాలను ఆధారంగా తీసుకొని, “దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు, అలాగే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా సమర్పించుకున్నాడు కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల యొక్క సందర్భాన్ని మరియు “అందరు” అనే పదప్రయోగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అభ్యంతరం సందర్భానుసార వ్యాఖ్యానానికి సరిపోదు.

1 తిమోతి 2:1–2లో పౌలు ముందుగా “సమస్త మనుష్యులకొరకు”, ముఖ్యంగా “రాజులకొరకు మరియు అధికారములోనున్న వారందరికొరకు” ప్రార్థనలు చెయ్యాలని చెబుతున్నాడు. పౌలు ఇక్కడ దేవుని రక్షణ ఒక నిర్దిష్ట వర్గానికే పరిమితం కాలేదని, అన్ని వర్గాల మనుష్యులకు విస్తరించబడిందని తెలియచేస్తున్నాడు. ఆ సందర్భంలోనే “మనుషులందరూ రక్షణ పొందవలెనని” (2:4) అని చెప్తున్నాడు.

కాబట్టి ఇక్కడ ‘మనుషులందరూ’ అనే పదాన్ని ఏ మినహాయింపు లేకుండా ప్రతి వ్యక్తి అనే అర్థంలో కాకుండా అన్ని వర్గాల మనుష్యులు—రాజులు మరియు అధికారములోనున్నవారు సహా—దేవుని రక్షణ పరిధిలో ఉన్నారని అర్థం చేసుకోవడం సందర్భానికి సరిపోతుంది.

“దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును” (1తిమోతి 2:5,6). “అందరి కొరకు విమోచ క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు” అనే మాటలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. లేఖనంలో “అందరు” అనే మాట మానవజాతి విషయంలో రెండు విధాలుగా ఉపయోగించబడింది. కొన్ని సందర్భాల్లో “అందరు” అంటే ఎలాంటి మినహాయింపూ లేకుండా మానవజాతిలో ప్రతీ ఒక్కరూ అని అర్థం. ఇతర సందర్భాల్లో ఎలాంటి బేధమూ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరూ అని అర్థం. ఏ వాక్యభాగంలోనైనా “అందరు” అనే మాటకు ఈ రెండు అర్థాల్లో ఏది వర్తిస్తుందో అనే విషయం సందర్భాన్ని బట్టి, సమానాంతర వాక్యభాగాల్ని బట్టి నిర్థారించబడుతుంది. ఎలాంటి భేదమూ వివక్ష లేకుండా ‘అందరూ’ అనే అర్థాన్ని సూచించే కొన్ని వాక్యభాగాలని ఉదాహరణగా చూద్దాం –

“అంతట యూదయ దేశస్థులందరును యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి” (మార్కు 1:5). యూదయ యెరూషలేము ప్రాంతాల్లో ఉన్న ప్రతీ స్త్రీ, ప్రతి పురుషుడూ యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందారని దీని అర్థమా? కానే కాదు! లూకా 7:30 ఇలా చెబుతోంది, “పరిసయ్యులును ధర్మశాస్తోపదేశకులనును అతని చేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి”. మరైతే ‘అందరును అతని బాప్తిస్మం పొందారు’ అంటే అర్థం ఏంటి? ఎలాంటి మినహాయింపూ లేకుండా అందరూ అని అర్థం కాదు కానీ ‘ఎలాంటి బేధమూ, వివక్ష లేకుండా అన్ని వర్గాలవారు’ అని అర్థం. లూకా 3:21కి ఇదే వివరణ వర్తిస్తుంది.

“తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను” (యోహాను 8:2). “ప్రజలందరు” ఆనే ఈ మాటను మనం ఖచ్చితంగా (absolutely) తీసుకోవాలా? సందర్భానుసారంగా (relatively) తీసుకోవాలా? ప్రజలందరూ అంటే ఎలాంటి మినహాయింపూ లేకుండా ప్రతీ ఒక్కరూ అని అర్థమా? లేక ఎలాంటి బేధమూ లేకుండా అన్ని వర్గాలవారు, అన్ని స్థాయిలకు చెందినవారు అని అర్థమా? రెండవ అర్థమే సరైనది; ఎందుకంటే పర్ణశాలల పండుగ సమయంలో దేవాలయ ప్రాంగణంలో ప్రతీ ఒక్కరూ పట్టేంత స్థలం ఉండదు.

కాబట్టి 1 తిమోతి 2:4–6 వచనాలు దేవుని రక్షణ ఏ ఒక్క వర్గానికీ పరిమితం కాలేదని, సమస్త వర్గాల మనుష్యులతో సంబంధమున్నదని బోధిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని Limited Atonement సిద్ధాంతాన్ని లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 17: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ 2 పేతురు 3:9 వచనం అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుతున్నాడు అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో 2 పేతురు 3:9 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “దేవుడు అందరూ మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాడు కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనం యొక్క సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అభ్యంతరం సందర్భానుసార వ్యాఖ్యానానికి సరిపోదు.

2 పేతురు 3:9లో ఇలా వ్రాయబడింది: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలెనని ఇష్టపడక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీయెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” ఇక్కడ “మీయెడల” అనే పదాన్ని మూలభాష ప్రకారం “మన యెడల” అని అనువదించాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పేతురు “మన యెడల” అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అన్నది. ఈ పత్రిక మొత్తం విశ్వాసులను ఉద్దేశించి రాయబడింది (2 పేతురు 1:1). కాబట్టి “ఎవడును,” “అందరు,” మరియు “మన యెడల” అనే పదాలను సందర్భానికి వేరుచేసి, లోకంలోని ప్రతి వ్యక్తిని ఉద్దేశించినట్లుగా అర్థం చేసుకోవడం సరైనది కాదు.

అంటే ఈ సందర్భంలో పేతురు ప్రధానంగా చెప్పేది ఏంటంటే—దేవుడు తనవారిలో ఎవ్వరూ నశించకుండా వారందరూ మారుమనస్సు పొందే వరకు దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడు అనే విషయం. ఇది దేవుని సహనాన్ని మరియు తన ప్రజలపట్ల ఉన్న కృపను చూపిస్తుంది.

అలాగే 2 పేతురు 3 అధ్యాయం యొక్క ప్రధాన సందర్భం ప్రభువు రాక ఆలస్యం‌ ఔతోందని అపహాస్యం చేస్తున్నవారికి సమాధానం ఇవ్వడమే. పేతురు చెప్పేది ఏంటంటే—ప్రభువు ఆలస్యం చేస్తున్నట్టు కనిపించినా అది బలహీనత వల్ల కాదు; తన ప్రణాళికలో ఉన్నవారందరూ లేదా తన వారందరూ మారుమనస్సు పొందడానికి ఆయన దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడనే విషయం.

కాబట్టి 2 పేతురు 3:9 వచనం దేవుని దీర్ఘశాంతాన్ని మరియు తన ప్రజలు మారుమనస్సు పొందుట పట్ల ఆయన కృపను బోధిస్తుంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని Limited Atonement లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 18: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ 2 కోరింది 5:14 వచనం అందరి కొరకు ఒకడు మరణించాడు అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో 2 కొరింథీయులకు 5:14 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “క్రీస్తు అందరి కొరకు మరణించాడు కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనం యొక్క సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అభ్యంతరం సందర్భానుసార వ్యాఖ్యానానికి సరిపోదు.

2 కొరింథీ 5:14లో “ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను” అని మనం చదువుతాము. అయితే ఈ వచనం బోధిస్తున్నది అపరిమితమైన ప్రాయశ్చిత్తాన్ని కాదు. మొత్తం వచనాన్ని, వాక్యభాగాన్ని సందర్భానుసారంగా పరీక్షించి చూస్తే క్రీస్తు మరణం కేవలం ఎన్నికైనవారికి మాత్రమే పరిమితమైందనే బోధను నొక్కి చెబుతున్నట్లు మనం గ్రహించగలుగుతాం. మొత్తం వచనం ఇలా ఉంది “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతి పొందారు”. గ్రీకులో రెండవసారి ఉపయోగించబడిన “అందరును” అనే పదం ముందు ఒక డెఫినెట్ ఆర్టికల్ ఉంది, క్రియ Aorist Tenseలో ఉంది, అందువల్ల దాన్ని మనం ఇలా చదవాలి – “అందరి కొరకు ఒకడు మరణిస్తే, వాళ్ళు అందరూ మరణించారు”. అంటే ‘ఎవరికోసమైతే ఆ ఒకడు మరణించాడో వాళ్ళు కూడా మరణించారని’ అపొస్తలుని ఉద్దేశం. ఆ తర్వాత వచనం ఇలా చెబుతుంది “జీవించువారిక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినవాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము”. క్రీస్తు మరణించడమే కాదు తిరిగి లేచాడు కూడా. అదే విధంగా ఆయన ఎవరికోసమైతే మరణించాడో వాళ్ళు కూడా మరణించారు, తిరిగిలేచారు; ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్నారు అని ఈ వచనం చెబుతుంది.

ఎవరికి ప్రతినిధిగా ఇంకొకరు పనిచేస్తారో వారే ఆ పని చేసినట్టు చట్టం పరిగణిస్తుంది. చట్టం దృష్టిలో ప్రతినిధి, అతను ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, ఇద్దరూ ఒక్కటే. ఆ చట్టం మరెవరో కాదు దేవుడే. క్రీస్తు తన ప్రజలతో ఒకటిగా పరిగణించబడ్డాడు, తన ప్రజలు క్రీస్తుతో ఒకటిగా పరిగణించబడ్డారు. అందువల్ల ఆయన మరణించినప్పుడు చట్టబద్ధంగా వాళ్ళు కూడా చనిపోయారు. ఆయన తిరిగి లేచినప్పుడు వాళ్ళు కూడా ఆయనతో లేచారు. ఈ వాక్యభాగంలో మరొక విషయాన్ని పౌలు మనకు చెబుతున్నాడు (వ.17). “ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి”: వాస్తవంలోనూ చట్టం దృష్టిలోనూ అతడు నూతన జీవాన్ని పొందుకున్నాడు; అందువల్ల క్రీస్తు ఎవరి కోసమైతే మరణించాడో వాళ్ళు “అందరూ” తమకోసం కాక తమ నిమిత్తం మరణించి తిరిగి లేచినవాని నిమిత్తం జీవించాలని ఆదేశించబడుతున్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే ఈ వచనంలో ప్రస్తావించిన “అందరు” అనేవారి కోసం క్రీస్తు మరణించాడు. వాళ్ళందరూ తమ అనుదిన జీవితాల్లో తమ కోసం మరణించిన క్రీస్తు నిమిత్తం జీవించాలి, చట్టబద్ధంగా వాళ్ళ విషయంలో ఏది సత్యమో ఆ సత్యాన్ని వాళ్ళు తమ జీవితాల్లో ప్రదర్శించాలి.

“అందరి కొరకు ఒకడు మృతి పొందెను” అనే మాట మనకొరకు నిర్వచించబడింది. క్రీస్తు ఎవరి నిమిత్తమైతే మరణించాడో ఆ “అందరు” జీవిస్తున్నారని, వాళ్ళు ఆయన కోసం జీవించాలని తెలియచెయ్యబడింది. అందువల్ల ఈ వాక్యభాగం 3 ముఖ్యసత్యాలను బోధిస్తుంది. కొంతమందిని తమ కోసం కాకుండా క్రీస్తు నిమిత్తం జీవించమని పౌలు ఆదేశిస్తున్నాడు; ఈ విధంగా ఆదేశించబడినవాళ్ళు ఆత్మీయంగా జీవించేవాళ్ళు, అంటే దేవుని బిడ్డలు. ఎందుకంటే మానవజాతిలో వాళ్ళకు మాత్రమే ఆత్మసంబంధమైన జీవం ఉంది. మిగిలినవాళ్ళందరూ తమ అపరాధాల్లోనూ పాపాల్లోనూ చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ విధంగా జీవించేవాళ్ళే ఆ “అందరూ”. క్రీస్తు మరణించి మరలా లేచింది వాళ్ళ కోసమే. అందువల్ల క్రీస్తు మరణించింది ఎన్నిక చెయ్యబడి, తండ్రి చేత తనకు అనుగ్రహించబడిన తన ప్రజలందరి కొరకే అని ఈ వాక్యభాగం బోధిస్తుంది. ఆయన మరణపునరుత్థానాల ఫలితంగా వాళ్ళు జీవిస్తున్నారు, అలా జీవించేవాళ్ళు కేవలం ఎన్నికైనవారు మాత్రమే; క్రీస్తు ద్వారా వాళ్ళు పొందిన జీవితాన్ని ఆయన కోసమే జీవించాలి, అలా జీవించడానికి క్రీస్తు ప్రేమ ఇప్పుడు వారిని బలవంతపెట్టాలి.

కాబట్టి 2 కొరింథీయులకు 5:14–15 వచనాలు క్రీస్తు మరణం తన ప్రజల జీవితాలను మార్చే ప్రభావవంతమైన కార్యమని బోధిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని Limited Atonement లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 19: కాల్వినిస్టులు ఏసుక్రీస్తు కొందరి ప్రాయశ్చిత్తం కొరకే చనిపోయాడు కొందరినే రక్షిస్తున్నాడు అని చెబుతారు. కానీ మత్తయి 28:19 వచనం సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెబుతుంది. (ఆర్టికల్ పేజి నెం.10)

జవాబు: ఈ ప్రశ్నలో మత్తయి 28:19 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “సమస్త జనులను శిష్యులుగా చేయుడి” అని యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు కాబట్టి Limited Atonement లేదా కాల్వినిజం తప్పు అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనం యొక్క సందర్భాన్ని మరియు అది నిజంగా ఏమి బోధిస్తుందో పరిశీలిస్తే ఈ అభ్యంతరం సందర్భానుసార వ్యాఖ్యానానికి సరిపోదు.

మత్తయి 28:19లో ప్రభువు ఇలా అన్నాడు: “కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వచనం ప్రాయశ్చిత్త పరిధి గురించి చర్చించడం లేదు; సువార్త ప్రకటనా పరిధి గురించి మాట్లాడుతోంది. అంటే సువార్త యూదులకు మాత్రమే కాకుండా అన్ని జనాంగాలకు ప్రకటించబడాలని ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు.

ముఖ్యంగా “సమస్త జనులు” అనే మాట గ్రీకు మూలంలో “అన్ని జనాంగాలు” (all nations) అనే భావాన్ని కలిగి ఉంది. మత్తయి సువార్త యొక్క సందర్భంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుని ప్రకటన ప్రధానంగా ఇశ్రాయేలుతో సంబంధమై ఉండేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సువార్త అన్ని జనాంగాలకు విస్తరించబడుతోంది. కాబట్టి ఈ వచనం ప్రధానంగా సువార్త అన్ని జనాంగాలకు ప్రకటించబడాలని బోధిస్తుంది.

అదేవిధంగా మత్తయి 28:19లో “సమస్త జనులు” అనే పదం అన్ని జనాంగాలను సూచించే భావంలో ఉపయోగించబడినట్లే ప్రకటన 7:9, 14:6, 14:8 వచనాలలో కూడా అదే భావంలో ఉపయోగించబడింది. కాబట్టి ఆ పదాన్ని ప్రతి సందర్భంలో ఒకే విధంగా “లోకంలోని ప్రతి వ్యక్తి” అనే అర్థంలో తీసుకోవడం సరైన విధానం కాదు; సందర్భానుసారంగానే అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ప్రకటన 7:9లో “ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రజలలోను, భాషలలోను” అనే పదాలు ఉపయోగించబడ్డాయి. అక్కడ ఉద్దేశం ఏ మినహాయింపు లేకుండా లోకంలోని ప్రతి వ్యక్తి రక్షించబడ్డాడు అని చెప్పడం కాదు; అన్ని జనాంగాల మధ్య నుండి దేవుని ప్రజలు రక్షించబడ్డారని చూపించడం. అలాగే ప్రకటన 14:6లో “భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాటలాడువారికిని, ప్రతి ప్రజకును” నిత్యసువార్త ప్రకటించబడుతోందని చెప్పబడింది. అక్కడ కూడా లోకంలో ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించబడింది అనే భావం కాదు; సువార్త అన్ని జనాంగాలకు ప్రకటించబడిందనే భావం. అదేవిధంగా ప్రకటన 14:8లో “సమస్త జనములకు తన జారత్వమను ఉగ్రతాద్రాక్షారసము త్రాగించెను” అని ఉంది. ఈ వచనాన్ని ఏ మినహాయింపు లేకుండా లోకంలోని ప్రతి వ్యక్తి ఆ ఉగ్రతాద్రాక్షారసము త్రాగాడు అనే అర్థంలో ఎవరూ తీసుకోరు. అక్కడ కూడా జనాంగాలు లేదా ప్రజల సమూహాలను సూచించే భావంలోనే అర్థం చేసుకుంటారు. కాబట్టి “సమస్త జనులు” అనే పదాన్ని ప్రతి సందర్భంలో సందర్భానుసారంగానే అర్థం చేసుకోవాలి; లేకపోతే అనేక వచనాలకు అసంబద్ధమైన అర్థాలు వస్తాయి.

అదేవిధంగా “సమస్త జనులను శిష్యులుగా చేయుడి” అని చెప్పబడినందువల్ల ప్రతి వ్యక్తీ తప్పక రక్షింపబడతాడు అనే అర్థం కాదు. ఎందుకంటే అదే మత్తయి సువార్తలో అనేకులు విశాల మార్గములో ప్రవేశించి నాశనమునకు పోతారని కూడా ప్రభువు చెప్పాడు (మత్తయి 7:13–14). కాబట్టి సువార్త సమస్త జనాంగాలకు ప్రకటించబడడం అనేది, ప్రతి వ్యక్తీ నిజంగా రక్షింపబడతాడు అనే అర్థాన్ని ఇవ్వదు.

ఇంకా ఒక విషయం గమనించాలి: కాల్వినిజం కూడా ప్రపంచమంతటికి సువార్త ప్రకటించాలని బలంగా బోధిస్తుంది. ఎందుకంటే కాల్వినిజం ప్రకారం కూడా దేవుడు తన ప్రజలను సమస్త జనాంగాల మధ్య నుండి రక్షించుకుంటాడు (ప్రకటన 5:9). అందువల్ల “సమస్త జనులను శిష్యులుగా చేయుడి” అనే ఆజ్ఞ కాల్వినిజానికి విరుద్ధం కాదు.

అలాగే, మత్తయి 28:19లో ప్రభువు “శిష్యులుగా చేయుడి” అని చెప్పడం ద్వారా కేవలం ఒక సాధారణ పిలుపు కాదు; బోధించడం, బాప్తిస్మమివ్వడం, ఆయన ఆజ్ఞలను గైకొనుటకు నేర్పించడం వంటి సంపూర్ణ శిష్యత్వ ప్రక్రియను ఉద్దేశిస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా సువార్త ప్రచారం మరియు శిష్యత్వ ఆజ్ఞ గురించే మాట్లాడబడుతోంది; ప్రాయశ్చిత్త పరిధి గురించి కాదు.

కాబట్టి మత్తయి 28:19 వచనం సువార్త సమస్త జనాంగాలకు ప్రకటించబడాలని, అన్ని జనాంగాల మధ్య శిష్యులను తయారుచెయ్యాలని బోధిస్తుంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని Limited Atonement లేదా కాల్వినిజాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 20: Irresistible grace:- దేవుడు ఎవరికైతే తన కృపను అనుగ్రహిస్తాడో ఆకృపను వారు ఎదిరించలేరు. ఆ కృప నుండి తప్పించుకోలేరు. దేవుడు రక్షించుకోవాలి అని ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిలో పరిశుద్ధాత్ముడు దేవుని సార్వభౌమధికారం చొప్పున విశ్వాసమును కలిగించేస్తాడు. అది దేవుడిచ్చే బహుమానం. ఇది ఎవరి చేతుల్లోనూ లేదు. దేవుడు నిర్ణయించనివారికి ఆయన తన కృపను ఇవ్వడు. ఇది ఈ వీరి వాదన. కానీ బైబిల్ ఇందుకు భిన్నంగా మాట్లాడుతుంది. “అబ్రాహాము దేవునిని విశ్వసించెను” అని రాయబడింది. కానీ అబ్రాహాముకు దేవుడు విశ్వాసం ఇచ్చాడు అని వ్రాయబడలేదు. అబ్రాహాముకే కాదు బైబిల్లో ఎవ్వరికీ దేవుడు విశ్వాసాన్ని ఇవ్వడు. విశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాడు. వాక్యాన్ని బోధిస్తాడు, సూచక క్రియలు చేస్తాడు. అయినా నమ్మకపోతే బాధపడతాడు. అంతేకాని విశ్వాసాన్ని ఇవ్వడు. “నమ్ముట నీవలన అయితే” అనే మాట నమ్మడం మన పని అని చెప్పడం లేదా? “నాయందు విశ్వాసముంచుడి” అని ప్రభువే చెప్పాడు (యోహా 14:1). (ఆర్టికల్ పేజి నెం.11)

జవాబు: ఈ ప్రశ్నలో “Irresistible Grace” (ఎదిరించలేని కృప) అనే కాల్వినిజం సిద్ధాంతాన్ని, “దేవుడు బలవంతంగా విశ్వాసాన్ని కలిగిస్తాడు; మనిషికి ఎలాంటి స్పందనా బాధ్యత ఉండదు” అనే రూపంలో చూపించి ఖండించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కాల్వినిజం అసలు బోధను పూర్తిగా మరియు సమతుల్యంగా చూపించడం కాదు.

కాల్వినిజం ప్రకారం “ఎదిరించలేని కృప” అంటే దేవుడు మనుష్యులను యంత్రాల్లా బలవంతంగా లాగి రక్షిస్తాడు అనే అర్థం కాదు. పాపములో మృతులై ఉన్న మనుష్యునిని పరిశుద్ధాత్ముడు తిరిగి జన్మింపచేసి, అతడు స్వచ్ఛందంగా క్రీస్తునందు విశ్వాసముంచేలా కృపచేత నడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనిషి చిత్తానికి విరుద్ధంగా బలవంతం చెయ్యడు; అతని హృదయాన్ని మార్చి, అతడు నిజంగా క్రీస్తును కోరుకునేలా అతనిలో మార్పు కలిగిస్తాడు.

అందుకే బైబిల్‌లో దేవుని కృప మరియు మానవుని విశ్వాసం రెండూ కలిసి కనిపిస్తాయి. ఉదాహరణకు, “ప్రభువు లూదియ హృదయమును తెరిచెను” అని అపొస్తల కార్యములు 16:14లో వ్రాయబడింది. ఫలితంగా ఆమె పౌలు చెప్పిన సంగతులను ఆలకించింది. అలాగే యోహాను 6:45లో “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించినయెడల తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు” అని ప్రభువు చెప్పాడు. అంటే విశ్వాసం చివరికి దేవుని కృపతో సంబంధముందని బైబిల్ బోధిస్తుంది.

అదేవిధంగా “అబ్రాహాము దేవునిని విశ్వసించెను” అని వ్రాయబడింది కాబట్టి, “దేవుడు విశ్వాసాన్ని కలిగించడు” అని నిర్ధారించడం సరైన తర్కం కాదు. ఎందుకంటే బైబిల్ అనేక చోట్ల విశ్వాసం దేవుని కృపతో సంబంధమున్నదని చెబుతుంది. ఉదాహరణకు ఫిలిప్పీయులకు 1:29లో “క్రీస్తునందు విశ్వసించుట మీకు అనుగ్రహింపబడెను” అని ఉంది. అలాగే ఎఫెసీయులకు 2:8 ప్రకారం రక్షణ “కృపచేత విశ్వాసముద్వారా” కలుగుతుంది; అది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పబడింది.

ఇంకా ఒక విషయం గమనించాలి: కాల్వినిజం కూడా దేవుడు వాక్యాన్ని బోధిస్తాడని, సూచక క్రియలు చేస్తాడని, సువార్త ద్వారా మనుష్యులను పిలుస్తాడని అంగీకరిస్తుంది. నిజానికి దేవుడు నియమించిన సాధనాలే ఇవి. “విశ్వాసము వినుటవలన కలుగును” (రోమా 10:17) అని బైబిల్ చెబుతుంది. అయితే పతనమైన మనిషి హృదయం స్వతహాగా దేవునికి విరోధంగా ఉన్నందున (రోమా 8:7), పరిశుద్ధాత్ముని కార్యం వాని హృదయంలో జరగకుండా నిజంగా క్రీస్తునందు రక్షణార్థకముగా విశ్వసించలేడు.

“నమ్ముట నీవలన అయితే” లేదా “నాయందు విశ్వాసముంచుడి” వంటి వచనాలు మానవుని బాధ్యతను స్పష్టంగా బోధిస్తున్నాయి. కాల్వినిజం కూడా ఆ బాధ్యతను తిరస్కరించదు. అయితే బైబిల్ అదే సమయంలో పాపపుస్థితిలో ఉన్న మనిషి దేవుని కృపచేతనే నిజంగా స్పందించగలడని కూడా బోధిస్తుంది. కాబట్టి దేవుని కృప మరియు మానవుని విశ్వాసం పరస్పర విరుద్ధాలు కావు; దేవుని కృపే మనిషిని విశ్వాసమునకు నడిపిస్తుంది అని కాల్వినిజం బోధిస్తుంది.

అలాగే “దేవుడు నమ్మకపోతే బాధపడతాడు; అంతేగాని విశ్వాసాన్ని ఇవ్వడు” అనే వాదన, బైబిల్ బోధించే దేవుని కృపకార్యాన్ని ప్రక్కనపెడుతుంది. ఎందుకంటే బైబిల్‌లో దేవుడు ఒకవైపు పాపుల అవిశ్వాసం మరియు తిరుగుబాటుపై తన విచారాన్ని వ్యక్తపరుస్తూనే మరోవైపు తన ప్రజల హృదయాలను మార్చి వారిని తనయొద్దకు ఆకర్షిస్తున్నట్లు కూడా బోధించబడింది (యెహెజ్కేలు 36:26–27, యోహాను 6:38,45).

కాబట్టి Irresistible Grace సిద్ధాంతం “దేవుడు బలవంతంగా మనుష్యులను రక్షిస్తాడు” అని అర్థం కాదు; దేవుడు తన కృపచేత పాపి హృదయాన్ని ప్రభావవంతంగా మార్చి, అతడు స్వచ్ఛందంగా క్రీస్తునందు విశ్వాసముంచునట్లు కార్యం చేస్తాడనే భావంలో అర్థం చేసుకోవాలి. అయితే ఈ సిద్ధాంతాన్ని వక్రీకరించి ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 21: పరిశుద్దాత్ముడు ఒకనిలోనికి ప్రవేశించి విశ్వాసాన్ని కలిగిస్తాడు అంటూ వీరు చేసే బోధ ఎంత వాక్యవిరుద్దమో ఇప్పుడు చూద్దాం.. దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఎలా ఇస్తాడు? యేసుక్రీస్తు నందు విశ్వాసముంచడం వలన (యోహా 7:39), విశ్వాసంతో ప్రార్ధన చెయ్యడం వలన (లూకా 11:13; యాకోబు 1:6), విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందుకుంటాం (గలతీ 3:2). ఆత్మను పొందాకా విశ్వాసం రావడం కాదు.. విశ్వాసం వలనే ఆత్మని పొందుకోగలం.. అలా మనం పొందుకున్న విశ్వాసంలో వెనక్కి వెళ్ళకుండా బలంగా నిలబడడం అనేది పరిశుద్దాత్మ వరం (1కొరి 12:9) (ఆర్టికల్ పేజి నెం.11).

జవాబు: ఈ ప్రశ్నలో “పరిశుద్ధాత్ముడు ముందుగా ఒక వ్యక్తిని పాపపుస్థితిలో నుండి తిరిగి జన్మింపజేసి విశ్వాసమునకు నడిపిస్తాడు” అనే కాల్వినిజం బోధను ఖండించడానికి కొన్ని వచనాలు చూపించబడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే — పరిశుద్ధాత్ముని కార్యం గురించి బైబిల్ చెప్పే విభిన్న అంశాలను ఒకటిగా కలిపి చూడడం.

ఈ ప్రశ్నలో చూపించిన యోహాను 7:39, లూకా 11:13, గలతీయులకు 3:2 వంటి వచనాలు ప్రధానంగా విశ్వాసులు పరిశుద్ధాత్ముని పొందడం గురించి మాట్లాడుతున్నాయి. అయితే కాల్వినిజం “పరిశుద్ధాత్ముడు ముందుగా ఒక వ్యక్తిని పాపపుస్థితిలో నుండి తిరిగి జన్మింపచేసి విశ్వాసమునకు నడిపిస్తాడు” అని చెప్పినప్పుడు, అది పరిశుద్ధాత్ముడు ముందుగా చేసే అంతరంగ కార్యం గురించి మాట్లాడుతోంది. కాబట్టి “విశ్వాసమువలన పరిశుద్ధాత్మను పొందుతాము” అనే విషయాన్ని చూపించి, “పరిశుద్ధాత్ముడు విశ్వాసానికి ముందుగా ఎలాంటి కార్యమూ చెయ్యడు” అని నిర్ధారించడం సరైన వ్యాఖ్యానం కాదు.

ఎందుకంటే అదే బైబిల్ మనిషి “అపరాధములచేతను పాపములచేతను చచ్చినవాడై యున్నాడు” (ఎఫెసీయులకు 2:1), “శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధము” (రోమా 8:7) అని కూడా చెబుతుంది. కాబట్టి పాపపుస్థితిలో ఉన్న మనిషి స్వతహాగా దేవునియొద్దకు రాలేడని, పరిశుద్ధాత్ముడు ముందుగా అతని హృదయంలో కార్యం చేసి తిరిగి జన్మింపచెయ్యడం అవసరమని బైబిల్ బోధిస్తుంది.

కాబట్టి బైబిల్ ప్రకారం మనుష్యులు విశ్వాసమువలన పరిశుద్ధాత్ముని పొందుతారనే విషయం నిజమే. అయితే అదే సమయంలో పాపపుస్థితిలో ఉన్న మనిషిని క్రీస్తునందు విశ్వాసమునకు నడిపించే పరిశుద్ధాత్ముని అంతరంగ కార్యం కూడా బైబిల్ బోధలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలను పరస్పర విరుద్ధాలుగా చూపించి కాల్వినిజం సిద్ధాంతాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 22: కృప అందరికీ ప్రత్యక్షమయింది. అందరినీ ఆహ్వానిస్తుంది. ఎందరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారందరు కృపను పొందుకుంటారు. అనగా దేవుని నుండి క్షమాపణ పొందుకుంటారు. కృప ఈ లోకానికొచ్చి మనకు నచ్చినట్లు బ్రతకమని చెప్పడం లేదు. ‘సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి.. ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది’ (తీతుకు 2:11-14). ఒక వ్యక్తి దేవుని కృప పొందుకున్న తర్వాత అతడు దేవునికి విధేయుడుగా ఉండకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో నిలిచియుండకపోతే విశ్వాసాన్ని కాపాడుకోకపోతే అతడు దేవుని కృపను కోల్పోయి, శిక్షకు పాత్రుడౌతాడు. కృప మనం చేసే మంచి క్రియలను ఆధారం చేసుకుని మనం పొందుకోము. కానీ కృప పొందుకున్న తర్వాత మంచి క్రియలు చెయ్యకుంటే కృపను కోల్పోతాం. ఈ వచనాలు గమనించండి... క్రీస్తును విశ్వసించిన తరువాత ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే కృపనుండి తొలగిపోతారు (గలతీ 5:4). మీరు పొందిన దేవుని కృపను వ్యర్ధము చేసుకొనవద్దు (2 కొరింధీ 6:1). మీలో ఎవడైనా దేవునికృపనుండి తప్పిపోతాడేమో అని జాగ్రత్తగాచూచుకొనుడి (హెబ్రీ 12:15) (ఆర్టికల్ పేజి నెం.11, 12).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా “కృపను పొందిన తర్వాత కూడా ఒక వ్యక్తి దానిని కోల్పోవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) లేదా రక్షణస్థిరత్వం గురించి కాల్వినిజం చెప్పేది తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ చూపించిన వచనాలను వాటి సందర్భంలో పరిశీలిస్తే ఈ అభ్యంతరం అంత సులభంగా నిలబడదు.

మొదటగా తీతుకు 2:11–12 వచనాలు నిజంగానే దేవుని కృప పరిశుద్ధమైన జీవితం వైపు నడిపిస్తుందని బోధిస్తున్నాయి. కాల్వినిజం కూడా అదే విషయాన్ని బలంగా అంగీకరిస్తుంది. రక్షణార్థమైన కృప మనిషిని పాపంలోనే కొనసాగనివ్వదు; భక్తిహీనతను విడిచి, దేవునికి విధేయుడిగా జీవించమని బోధిస్తుంది. కాబట్టి “కృప పొందిన తర్వాత సత్ క్రియలు అవసరం” అనే విషయాన్ని కాల్వినిజం ఖండించదు. వాస్తవానికి, నిజంగా రక్షింపబడినవారి జీవితంలో పరిశుద్ధ జీవితం మరియు విధేయత ఫలితాలుగా కనిపిస్తాయని బోధిస్తుంది.

అయితే ఈ ప్రశ్నలో ప్రధాన సమస్య ఏంటంటే — “సత్ క్రియలు లేకపోతే కృపను కోల్పోతాడు” అనే నిర్ధారణను, చూపించిన వచనాలు నిజంగా అదే అర్థంలో బోధిస్తున్నాయా అనే విషయాన్ని పరిశీలించకుండా ముందుగానే నిర్ణయించుకోవడం.

ఉదాహరణకు, గలతీయులకు 5:4లో “కృపనుండి తొలగిపోయియున్నారు” అని చెప్పబడింది. ఈ సందర్భంలో పౌలు ప్రధానంగా చెప్పేది ఏంటంటే — క్రీస్తునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి బదులుగా ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతులమవుదామని ప్రయత్నిస్తున్నవారు క్రీస్తునందలి కృప మార్గం నుండి తొలగిపోతున్నారు అనే విషయం. అంటే ఇక్కడ “రక్షణ పొందినవాడు తిరిగి నశించిపోయాడు” అనే అంశాన్ని చర్చించడం లేదు; కృపాధారిత సువార్తను విడిచి ధర్మశాస్త్ర ఆధారిత నీతి వైపు తిరుగుతున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది.

అలాగే 2 కొరింథీ 6:1లో “దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు” అని చెప్పబడింది. అంటే దేవుని కృపను పొందినవారు దానికి తగిన విధంగా జీవించాలి, నిర్లక్ష్యంగా లేదా అవిధేయతలో కొనసాగకూడదు అనే హెచ్చరిక. ఈ వచనం “నిజమైన రక్షణ పొందినవాడు తప్పకుండా రక్షణ కోల్పోతాడు” అని బోధించడం లేదు. బైబిల్‌లో దేవుడు తన ప్రజలకు అనేక హెచ్చరికలు ఇస్తాడు. ఆ హెచ్చరికల ఉద్దేశం వారిని భయపెట్టడం కాదు; విశ్వాసంలో నిలిచియుండేలా జాగ్రత్తగా జీవించేలా హెచ్చరించడం.

హెబ్రీయులకు 12:15లో “దేవుని కృపనుండి తప్పిపోతాడేమో” అని చెప్పబడిన సందర్భాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి. హెబ్రీ పత్రిక మొత్తం విశ్వాసంలో నిలిచియుండాలని, బాహ్యంగా విశ్వాసుల సమూహంలో ఉన్నప్పటికీ నిజమైన విశ్వాసం లేక వెనుదిరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. కాల్వినిజం ప్రకారం కూడా సంఘంలో కనిపించే ప్రతి వ్యక్తి నిజంగా తిరిగి జన్మించినవాడని చెప్పలేం. బాహ్యంగా విశ్వాసుల సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజమైన రక్షణ అనుభవించినవారే అని బైబిల్ ఎక్కడా బోధించదు. అందువల్ల ఈ హెచ్చరిక వచనాలను ఆధారంగా తీసుకొని ‘నిజమైన రక్షణ పోతుంది’ అనే నిర్ధారణకు రావడం సరైన సమగ్ర వ్యాఖ్యానం కాదు.

అదేవిధంగా బైబిల్ మరోవైపు దేవుడు తన ప్రజలను కాపాడతాడని కూడా స్పష్టంగా బోధిస్తుంది. “నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.” (యోహాను 10:28), “మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.” (ఫిలిప్పీ 1:4), “దేవుని శక్తిచేత విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు” (1 పేతురు 1:5) వంటి వచనాలు దేవుడు తన ప్రజలను అంతము వరకు కాపాడుతాడని తెలియచేస్తున్నాయి.

కాబట్టి బైబిల్ ఒకవైపు పరిశుద్ధ జీవితం, విశ్వాసంలో నిలకడ, హెచ్చరికలు, జాగ్రత్తలను బోధిస్తూనే మరోవైపు దేవుడు తన ప్రజలను అంతము వరకు కాపాడతాడని కూడా బోధిస్తుంది. కాల్వినిజం ఈ రెండింటినీ అంగీకరిస్తుంది. రక్షణార్థమైన కృప మనిషిని నిర్లక్ష్య జీవితం వైపు కాకుండా పరిశుద్ధ జీవితం వైపు నడిపిస్తుంది; మరియు అదే కృప అతనిని అంతం వరకూ నిలుపుతుంది. కాబట్టి కొన్ని హెచ్చరిక వచనాలను మాత్రమే తీసుకొని పరిశుద్ధుల పదిలత సిద్ధాంతాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 23: దేవుని ఏర్పాటులో ఉండి రక్షించబడిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకం వెళ్ళిపోతాడు. అతడు ఏ విధంగానూ తప్పిపోడు. ఇదీ వీరి సారాంశం. బైబిల్ ఈ విషయాన్ని కూడా ఏమాత్రం ఒప్పుకోదు. దేవుడు ఎవరు పరలోకం వెళ్ళాలి అనేది నిర్ణయించడు. ఎలాంటివారు పరలోకం వెళ్తారు అనేది నిర్ణయించాడు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటిని నా చేతుల నుండి అపహరించు వాడు ఎవడు లేడు అని ప్రభువు చెప్పారు (యోహా 10:27-29). ఈ వచనాన్ని కాల్వనిస్టులు చూపిస్తుంటారు. ఒకవేళ ఆయన గొర్రెల్లో ఏదైనా ఆయన స్వరము వినకపోతే? ఆయనను వెంబడించకపోతే? అప్పుడు ప్రభువే మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఆయనను వెంబడిస్తే మాత్రం మనలను ఎవ్వరూ అపహరించలేరు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన గొర్రెలకు వంకరమాటలు చెప్పి దారితప్పించేవారు కూడా ఉంటారని దేవుడు చెప్పలేదా (అపొ.కార్యములు 20:28) (ఆర్టికల్ పేజి నెం. 12).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా “ఒకసారి రక్షింపబడినవాడు తప్పకుండా అంతము వరకు రక్షింపబడతాడు” అనే పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) సిద్ధాంతాన్ని ఖండించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యోహాను 10:27–29 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “గొర్రెలు ప్రభువును వెంబడించకపోతే ఏమౌతుంది?” అనే అభ్యంతరాన్ని లేవనెత్తుతున్నారు. అయితే ఈ ప్రశ్నలో కూడా కాల్వినిజం నిజంగా ఏమి బోధిస్తుందో పూర్తిగా చూపించకుండా విమర్శిస్తున్నట్టు కనిపిస్తుంది.

మొదటగా కాల్వినిజం “ఒక వ్యక్తి ఎలా జీవించినా దేవునిని విడిచిపెట్టినా అవిధేయతలో కొనసాగినా చివరికి పరలోకానికి వెళ్తాడు” అని బోధించదు. నిజమైన రక్షణ పొందినవారు అంతం వరకూ విశ్వాసంలో నిలిచియుంటారని, దేవుడు వారిని కాపాడతాడని బోధిస్తుంది. అంటే పరిశుద్ధుల పదిలత అనేది పాపంలో నిర్లక్ష్యంగా జీవించడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు; నిజమైన విశ్వాసం నిలకడగా కొనసాగుతుందని చెప్పే బోధ.

యోహాను 10:27–29లో ప్రభువు స్పష్టంగా మూడు లక్షణాలు చెప్తున్నాడు: “నా గొర్రెలు నా స్వరము వినును,” “నేను వాటిని ఎరుగుదును,” “అవి నన్ను వెంబడించును.” తర్వాతే “వాటికి నిత్యజీవము ఇస్తున్నాను; అవి ఎన్నటికిని నశింపవు” అని చెబుతున్నాడు. అంటే ప్రభువు రక్షణ వాగ్దానం తన స్వరం వింటూ ఆయనను వెంబడించే గొర్రెల గురించే ఉంది. కాబట్టి “వెంబడించకపోతే?” అనే ప్రశ్న, ప్రభువు చెప్పిన నిజమైన గొర్రెల లక్షణాన్ని అర్థం చేసుకోకుండా అడుగుతున్న ప్రశ్న అవుతుంది.

అదేవిధంగా “ప్రభువే మీరెవరో నాకు తెలియదు అంటాడు” అనే మాట (మత్తయి 7:23) కూడా గమనించాలి. అక్కడ ప్రభువు “ఒకప్పుడు మీరు నా వారై ఉన్నారు, తరువాత తప్పిపోయారు” అని చెప్పలేదు; “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను” అని చెప్పాడు. అంటే వారు బయటకు విశ్వాసుల్లా కనిపించినా నిజంగా ప్రభువుకు చెందినవారు కారనే భావం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

అలాగే అపొస్తల కార్యములు 20:28–30లో సంఘములో “వంకర మాటలు చెప్పి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవువారు” వస్తారని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరికలు నిజమైనవే. కాల్వినిజం కూడా తప్పుడు బోధకుల ప్రమాదాన్ని తిరస్కరించదు. అయితే బైబిల్‌లో హెచ్చరికలు ఉన్నాయనే కారణంతో దేవుడు తన ప్రజలను అంతం వరకూ కాపాడడు అని నిర్ధారించకూడదు. వాస్తవానికి, దేవుడు తన ప్రజలను విశ్వాసంలో నిలపడానికి వాక్య పరిచర్య, హెచ్చరికలు, ఉపదేశాలు వంటి సాధనాలను ఉపయోగిస్తాడని బైబిల్ బోధిస్తుంది.

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్‌లో దేవుడు తన ప్రజలను కాపాడతాడనే వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. “ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు” (యోహాను 10:28), “మీలో సత్కార్యమును ఆరంభించినవాడు దానిని పూర్తిచేయును” (ఫిలిప్పీ 1:6), “దేవుని శక్తిచేత విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు” (1 పేతురు 1:5) వంటి వచనాలు దేవుని కాపాడే కృపను తెలియచేస్తున్నాయి.

కాబట్టి బైబిల్ ఒకవైపు విశ్వాసంలో నిలిచియుండాలని హెచ్చరిస్తూనే మరోవైపు దేవుడు తన ప్రజలను అంతము వరకూ కాపాడతాడని కూడా బోధిస్తుంది. కాల్వినిజం ఈ రెండింటినీ అంగీకరిస్తుంది. నిజమైన గొర్రెలు ప్రభువుయొక్క స్వరం విని ఆయనను వెంబడిస్తారు; మరియు వారిని అంతం వరకు నిలపడం దేవుని కృప కార్యమే. కాబట్టి కొన్ని హెచ్చరిక వచనాలను ఆధారంగా తీసుకొని పరిశుద్ధుల పదిలత సిద్ధాంతాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 24: దేవుడు మనుషులను పరలోకానికి లేక నరకానికి పంపేటప్పుడు ఆయన ముందస్తు నిర్ణయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అని ఒక్కచోట కూడా బైబిల్ చెప్పదు (ఆర్టికల్ పేజి నెం. 12).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా “దేవుడు మనుష్యులకు తీర్పు తీర్చేటప్పుడు తన ముందస్తు నిర్ణయాన్ని ఆధారంగా చేసుకొని తీర్పు తీర్చడు; కాబట్టి కాల్వినిజం బోధ తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి — కాల్వినిజం “తీర్పుదినాన దేవుడు మనుష్యులను వారి క్రియలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం రహస్య నిర్ణయం ఆధారంగా మాత్రమే తీర్పు తీరుస్తాడు” అని బోధించదు.

బైబిల్ స్పష్టంగా దేవుడు మనుష్యులకు వారి క్రియల ప్రకారమే తీర్పు తీర్చుతాడని బోధిస్తుంది (రోమా 2:6, ప్రకటన 20:12–13). కాల్వినిజం కూడా దీనిని పూర్తిగా అంగీకరిస్తుంది. అవిశ్వాసులు తమ పాపం, అవిధేయత, మరియు దేవునికి విరోధమైన జీవితం కారణంగానే తీర్పుకు పాత్రులౌతారు. దేవుడు నిరపరాధులను అన్యాయంగా నరకానికి నెడతాడు అని కాల్వినిజం బోధించదు.

అయితే అదే సమయంలో బైబిల్ దేవుని సార్వభౌమ నిర్ణయం మరియు ఎన్నిక గురించి కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. ఉదాహరణకు, “ఆయన తన చిత్త ప్రకారము సమస్తమును జరిగించుచున్నాడు” (ఎఫెసీ 1:11), “ముందుగా నిర్ణయించినవారిని పిలిచెను” (రోమా 8:29–30), “లోకము పునాది వేయబడకమునుపే మనలను ఎన్నుకొనెను” (ఎఫెసీ 1:4) వంటి వచనాలు దేవుని ముందస్తు నిర్ణయాన్ని తెలియచేస్తున్నాయి. కాబట్టి “బైబిల్ ఎక్కడా దేవుని నిర్ణయం గురించి మాట్లాడదు” అని చెప్పడం సరైనది కాదు.

ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే — దేవుని సార్వభౌమ నిర్ణయం మరియు మనిషి బాధ్యతను బైబిల్ పరస్పర విరుద్ధాలుగా చూపించదు. ఉదాహరణకు, యేసుక్రీస్తు సిలువ వేయబడడం “దేవుని నిర్ణయము మరియు భవిష్యద్‌జ్ఞానము చొప్పున” జరిగిందని అపొస్తల కార్యములు 2:23 చెబుతుంది. అయినప్పటికీ అదే వచనంలో ఆయనను సిలువ వేసినవారినే దోషులుగా నిలబెడుతుంది. అంటే దేవుని సంకల్పం నెరవేరినందువల్ల మనుష్యుల బాధ్యత తొలగిపోలేదు.

అదేవిధంగా తీర్పుదినాన కూడా దేవుడు మనుష్యులను వారి క్రియల ప్రకారమే తీర్పు తీరుస్తాడు. కానీ అదే సమయంలో ఎవరు రక్షింపబడతారు అన్నది దేవుని కృప, ఎన్నిక, మరియు సంకల్పంతో కూడా సంబంధముందని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ ఈ రెండు సత్యాలను బోధిస్తుంది; కాల్వినిజం కూడా వాటినే అంగీకరిస్తుంది.

కాబట్టి “దేవుడు తీర్పుదినాన ముందస్తు నిర్ణయాన్ని బట్టి తీర్పు తీర్చుతాడు అని బైబిల్ చెప్పదు” అనే వాదన, కాల్వినిజం బోధను సరైన సందర్భంలో అర్థం చేసుకోకుండా చేసిన విమర్శ మాత్రమే. బైబిల్ ప్రకారం దేవుడు సంపూర్ణ న్యాయంతో మనుష్యులను వారి క్రియల ప్రకారమే తీర్పు తీరుస్తాడు; అదే సమయంలో ఆయన సార్వభౌమ సంకల్పం కూడా నెరవేరుతుంది. ఈ రెండు సత్యాలను పరస్పర విరుద్ధాలుగా కాకుండా సమాంతర సత్యాలుగా అర్థం చేసుకోవాలి.

ప్రశ్న 25: దేవుడు సృష్టికి ముందే జీవగ్రంధంలో రక్షించబడువారి పేర్లు రాసేసాడు, అవి చెరగవు అని వీరంటారు. కానీ జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము (కీర్తనలు 69:28). జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక.. (ప్రకటన 3:1,5). ఈ వచనాలను బట్టి జీవగ్రంధంలో పేరు తీసెయ్యడానికి అవకాశం ఉంది అని స్పష్టమవుతుంది (ఆర్టికల్ పేజి నెం. 15).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా “జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) లేదా ఎన్నిక సిద్ధాంతం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాలను వాటి సందర్భంలో మరియు మొత్తం బైబిల్ బోధలో పరిశీలిస్తే, ఈ నిర్ధారణ అంత సులభంగా నిలబడదు.

మొదటిగా కీర్తనలు 69:28 వచనం ఒక కవితాత్మక మరియు శాపసూచక ప్రార్థన సందర్భంలో ఉంది. ఈ కీర్తనలో దావీదు తనను హింసిస్తున్న శత్రువుల గురించి దేవునిని వేడుకుంటూ వారిపై తీర్పు రావాలని ప్రార్థిస్తున్నాడు. ఆ సందర్భంలోనే “వారిని జీవగ్రంథంలో నుండి తుడిచివేయుము; నీతిమంతులతో కలిసి వారిని వ్రాయకుము” అని చెబుతున్నాడు. ఇక్కడ “జీవగ్రంథము” అంటే భూమిమీద జీవించువారి జాబితా లేదా సజీవుల జాబితా అనే భావంలో ఉపయోగించబడింది. కాబట్టి ఈ వచనాన్ని నేరుగా “నిజమైన రక్షణ పొందినవాడు తప్పకుండా నిత్యరక్షణ కోల్పోతాడు” అనే సిద్ధాంతానికి ఆధారంగా ఉపయోగించడం సరైన సమగ్ర వ్యాఖ్యానం కాదు.

అలాగే ప్రకటన 3:5 వచనాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. అక్కడ ప్రభువు, “జయించువాడు... అతని పేరును జీవగ్రంథములోనుండి తుడిచిపెట్టను” అని చెబుతున్నాడు. ఈ వాక్యం జయించేవారికి ఇవ్వబడిన ధైర్యపరచే వాగ్దాన రూపంలో ఉంది. అంటే క్రీస్తునందు నిలిచియుండే వారికి ఆయన నిశ్చయమైన భద్రతను ప్రకటిస్తున్నాడు. ఇదే విధమైన భాషను బైబిల్‌లో ఇతరచోట్ల కూడా చూస్తాము. ఉదాహరణకు, “ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపలేడు” (యోహాను 10:28) అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ప్రకటన 3:5ను “కొంతమంది నిజంగా రక్షింపబడిన తరువాత వారి పేర్లు జీవగ్రంథం నుండి తుడిచివేయబడతాయి” అని వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఎందుకంటే ఆ వచనంలో ప్రభువు ఉద్దేశం ‘జయించువారికి భద్రతను ధృవీకరించడం’, కానీ ‘నిజమైన విశ్వాసులు తప్పక జీవగ్రంథం నుండి తొలగించబడవచ్చు’ అనే సిద్ధాంతాన్ని బోధించడం కాదు.

ప్రశ్న 26: ఒకసారి రక్షణ పొందితే ఇక పోదు అని కాల్వినిస్టులు చెబుతారు. కానీ “భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి” (ఫిలిప్పీ 2:12) అనే వచనం, రక్షణను మనం పోగొట్టుకునే అవకాశం ఉందని స్పష్టంగా చూపిస్తుంది (ఆర్టికల్ పేజి నెం. 15).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా “భయముతోను వణుకుతోను మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి” (ఫిలిప్పీయులకు 2:12) అనే వచనాన్ని ఆధారంగా తీసుకొని, “భయంతో మరియు వణుకుతో రక్షణను కొనసాగించాలి అని చెప్పబడింది కాబట్టి, రక్షణ పోయే అవకాశం నిజంగానే ఉంది; అందువల్ల పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) సిద్ధాంతం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాన్ని దాని సందర్భంలో పరిశీలిస్తే పౌలు ఇక్కడ “రక్షణ కోల్పోవడం” గురించి కాకుండా రక్షణ ఫలితంగా పరిశుద్ధ జీవితం ఎలా కొనసాగాలో బోధిస్తున్నట్టు స్పష్టమౌతుంది.

మొదటగా “మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి” అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు ‘మీ రక్షణను సంపాదించుకొనుడి’ లేదా ‘రక్షణ పోకుండా కష్టపడి కాపాడుకొనుడి’ అని చెప్పడం లేదు. ‘దేవుడు మీలో కలుగచేసిన రక్షణ ఫలితాన్ని జీవితంలో కనబడేలా జీవించండి’ అనే భావంలో మాట్లాడుతున్నాడు. అందుకే చాలా ఆంగ్ల అనువాదాలు దీనిని “work out your salvation” అని అనువదించాయి; “work for your salvation” అని కాదు.

అంతేకాకుండా ఈ వచనానికి వెంటనే వచ్చే 13వ వచనం చాలా ముఖ్యమైనది: “ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగచేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే.” అంటే విశ్వాసి పరిశుద్ధ జీవితం కొనసాగించడం వెనుక చివరికి దేవుడే అతనిలో పనిచేస్తున్నాడని పౌలు స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి 2:12ను మాత్రమే తీసుకొని “రక్షణ మన చేతుల్లో ఉంది; అది తప్పిపోవచ్చు” అని నిర్ధారించడం, వెంటనే వచ్చే వచనాన్ని ప్రక్కనపెట్టడమే ఔతుంది.

అదేవిధంగా ఫిలిప్పీ పత్రిక మొత్తం విశ్వాసులకు ధైర్యం మరియు స్థిరత్వాన్ని ఇచ్చే స్వరంతో నిండి ఉంది. అదే పత్రిక ప్రారంభంలోనే పౌలు, “మీలో సత్కార్యమును ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీ 1:6) అని చెబుతున్నాడు. కాబట్టి అదే పత్రికలో తర్వాత ‘భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించుకొనుడి’ అని చెప్పినప్పుడు, అతడు ముందే చెప్పిన దేవుడు తన ప్రజలను అంతం వరకూ కాపాడతాడనే సత్యానికి విరుద్ధంగా మాట్లాడడం లేదు.

ఇక్కడ “భయముతోను వణుకుతోను” అనే మాట కూడా గమనించాలి. ఇది “రక్షణ పోతుందేమో అని ఎప్పుడూ భయపడుతూ ఉండండి” అనే అర్థంలో కాదు; దేవుని పరిశుద్ధత మరియు మహిమ పట్ల గంభీరమైన గౌరవభావంతో జీవించండి అనే భావంలో చెప్పబడింది.

కాల్వినిజం కూడా విశ్వాసులు పరిశుద్ధ జీవితం గడపాలని విశ్వాసంలో నిలిచియుండాలని బలంగా బోధిస్తుంది. పరిశుద్ధుల పదిలత అంటే “ఏలా జీవించినా పరవాలేదు” అనే బోధ కాదు. నిజమైన రక్షణ పొందినవారు దేవుని కృపచేత అంతం వరకూ విశ్వాసంలో కొనసాగుతారని బోధిస్తుంది.

కాబట్టి ఫిలిప్పీ 2:12 వచనం విశ్వాసులు పరిశుద్ధతతో గంభీరతతో తమ రక్షణ ఫలితాన్ని జీవితంలో వ్యక్తపరచాలని బోధిస్తుంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని “నిజమైన రక్షణ తప్పక పోవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత తప్పు” అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 27: ఒకసారి రక్షణ పొందితే ఇక పోదు అని కాల్వినిస్టులు చెబుతారు. కానీ “ఆ దినమున అనేకులు నన్ను చూచి — ప్రభువా, ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా?” అని చెప్పుదురు. అప్పుడు ప్రభువు “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను” అని చెప్పాడు (మత్తయి 7:22–23). అంటే వారు ఒకప్పుడు విశ్వాసులు అయినప్పటికీ ఆయన మాట ప్రకారం జీవించకుండా రక్షణ కోల్పోయారని స్పష్టమౌతుంది. (ఆర్టికల్ పేజి నెం. 15)

జవాబు: ఈ ప్రశ్నలో మత్తయి 7:22–23 వచనాన్ని ఆధారంగా తీసుకొని, “ఒకప్పుడు ప్రభువును నమ్మినవారు కూడా చివరికి తిరస్కరించబడవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) సిద్ధాంతం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రభువు ఇక్కడ “నిజంగా రక్షింపబడినవారు తరువాత రక్షణ కోల్పోయారు” అని చెప్పడం లేదు.

మొదటగా, ప్రభువు చెప్పిన మాటను గమనించాలి: “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను” (మత్తయి 7:23). ఇక్కడ ప్రభువు “ఒకప్పుడు మిమ్మును ఎరిగితిని, తరువాత మీరు తప్పిపోయారు” అని చెప్పలేదు. “ఎన్నడును ఎరుగను” అని చెప్పాడు. అంటే వారు బయటకు విశ్వాసుల్లా పరిచర్య చేసేవారిలా కనిపించినప్పటికీ నిజంగా ప్రభువుకు చెందినవారు కారనే భావం స్పష్టంగా కనిపిస్తుంది.

అదేవిధంగా ఈ వ్యక్తులు తమ రక్షణకు ఆధారంగా చూపింది తమ క్రియలనే — “ప్రవచింపలేదా?”, “దయ్యములను వెళ్ళగొట్టలేదా?”, “అనేక మహత్కార్యములు చెయ్యలేదా?” అని. కానీ ప్రభువు వారి అద్భుత కార్యాలను కాదు, ఆయనతో వారికి ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తున్నాడు. అందుకే “అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొండి” అని చెప్పాడు. వారి సమస్య ఏంటంటే — బయటకు అద్భుత కార్యాలు మరియు పరిచర్య కనిపించినప్పటికీ వారి జీవితంలో నిజమైన విధేయత మరియు దేవుని చిత్తానుసార జీవితం లేకపోవడం.

ఈ సందర్భాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, వెంటనే వచ్చే 24వ వచనాన్ని కూడా గమనించాలి: “నా ఈ మాటలు విని వాటిని జరిగించువాడు బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.” అంటే ప్రభువు ఇక్కడ నిజమైన శిష్యత్వం మరియు పైపై భక్తి జీవితం మధ్య తేడాను చూపిస్తున్నాడు. కేవలం మాటలతో ప్రభువును ఒప్పుకోవడం కాదు, ఆయన చిత్తానుసారంగా జీవించడమే నిజమైన శిష్యత్వానికి గుర్తు.

కాల్వినిజం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. పరిశుద్ధుల పదిలత అంటే “ఒకసారి విశ్వాసం ప్రకటిస్తే తర్వాత ఎలా జీవించినా పరవాలేదు” అనే అర్థం కాదు. నిజమైన రక్షణ పొందినవారు అంతం వరకూ విశ్వాసంలో మరియు విధేయతలో కొనసాగుతారని బోధిస్తుంది. బయటకు విశ్వాసుల్లా కనిపించే వారందరూ నిజమైన విశ్వాసులు కారు అని కూడా బైబిల్ హెచ్చరిస్తుంది.

అదేవిధంగా బైబిల్‌లో తాత్కాలిక లేదా పైపై విశ్వాసం గురించి కూడా చెప్పబడింది. ఉదాహరణకు విత్తనమువిత్తువాని ఉపమానంలో కొందరు “కొంతకాలము విశ్వసించి శోధనకాలమందు తొలగిపోవుదురు” (లూకా 8:13) అని ఉంది. అంటే బయటకు స్పందన కనిపించినా నిజమైన వేరు లేకపోవచ్చు.

కాబట్టి మత్తయి 7:22–23 వచనం “నిజమైన రక్షణ పొందినవారు తర్వాత రక్షణ కోల్పోతారు” అని కాకుండా బయటకు ఆత్మీయుల్లా కనిపించినా నిజంగా ప్రభువుకు చెందని వారి గురించి హెచ్చరిస్తోంది. అయితే అదే వచనాన్ని ఆధారంగా తీసుకొని పరిశుద్ధుల పదిలత సిద్ధాంతాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 28: ఒకసారి రక్షణ పొందితే ఇక పోదు అని కాల్వినిస్టులు చెబుతారు. కానీ “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది… నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే…” (1 పేతురు 4:17–18) అనే వచనాలు చూస్తే రక్షణ అంతము వరకు నిలబడడం కష్టమైన విషయం అని, కాబట్టి రక్షణ పోయే అవకాశమూ ఉందని తెలుస్తుంది. (ఆర్టికల్ పేజి నెం. 15)

జవాబు: ఈ ప్రశ్నలో 1 పేతురు 4:17–18 వచనాలను ఆధారంగా తీసుకొని, ‘నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే’ అని చెప్పబడింది కాబట్టి, రక్షణలో అంతము వరకు నిలిచియుండడం కష్టమైన విషయం; అందువల్ల పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) సిద్ధాంతం తప్పు అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల సందర్భాన్ని పరిశీలిస్తే పేతురు ఇక్కడ “నిజమైన విశ్వాసులు చివరికి రక్షణ కోల్పోవచ్చు” అని బోధించడం లేదు.

మొదటగా ఈ వచనాల మొత్తం సందర్భం హింసలు, శ్రమలు, మరియు విశ్వాసుల పరీక్షల గురించి ఉంది. 1 పేతురు 4 అధ్యాయంలో పేతురు విశ్వాసులు అనుభవిస్తున్న శ్రమలు మరియు పరీక్షల గురించి మాట్లాడుతూ వాటిని ఆశ్చర్యకరమైన విషయంగా భావించవద్దని చెబుతున్నాడు (4:12). ఆ తర్వాతే “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది” అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ‘తీర్పు’ అనే మాట చివరి నాశన తీర్పు గురించి కాకుండా దేవుడు తన ప్రజలను శ్రమలు మరియు పరీక్షల ద్వారా పరిశుద్ధపరచే కార్యాన్ని సూచిస్తోంది.

అదేవిధంగా ‘నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే’ అనే మాటను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ‘రక్షించబడుట దుర్లభము’ అనే భావం రక్షణ అనిశ్చితమని కాదు; అనేక శ్రమలు మరియు పరీక్షల మధ్యగానే విశ్వాసి తన రక్షణ గమ్యానికి చేరుతాడనే భావంలో చెప్పబడింది. ఇదే భావాన్ని అపొస్తల కార్యములు 14:22లో కూడా చూస్తాము: “అనేక శ్రమలు పొందిన తరువాత మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని” అని చెప్పబడింది.

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పేతురు సామెతలు 11:31లోని భావాన్ని ఉపయోగిస్తున్నాడు. అక్కడ ఉద్దేశం “నీతిమంతుడి రక్షణ అనేక శ్రమలు మరియు పరీక్షల మధ్య జరుగుతున్నది; అయితే భక్తిహీనుల పరిస్థితి ఎంత తీవ్రమై యుండును!” అనే contrast ను చూపించడం. అందుకే వెంటనే “భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుచును?” అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రధాన ఉద్దేశం విశ్వాసుల రక్షణ అనిశ్చితమని చెప్పడం కాదు; దేవుని తీర్పు యొక్క గంభీరతను చూపించడం.

కాల్వినిజం కూడా విశ్వాసుల జీవితం శ్రమలు, పరీక్షలు, మరియు అంతము వరకు విశ్వాసంలో కొనసాగవలసిన ప్రయాణమని అంగీకరిస్తుంది. పరిశుద్ధుల పదిలత అంటే “ఎలాంటి పోరాటం లేకుండా పరీక్షలు లేకుండా సులభంగా పరలోకానికి చేరిపోతారు” అనే అర్థం కాదు. దేవుడు తన ప్రజలను శ్రమలు మరియు పరీక్షల మధ్య కాపాడి, అంతం వరకూ విశ్వాసంలో నిలుపుతాడని బోధిస్తుంది.

అదేవిధంగా 1 పేతురు పత్రికలోనే దేవుడు తన ప్రజలను కాపాడుతాడనే బలమైన భరోసా కూడా కనిపిస్తుంది. “కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ కొరకు, దేవుని శక్తిచేత విశ్వాసముద్వారా కాపాడబడుచున్నారు” (1 పేతురు 1:5) అని పేతురు ముందే చెప్పాడు. కాబట్టి అదే పత్రికలో తర్వాత ‘నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే’ అని చెప్పినప్పుడు, అతడు ముందే చెప్పిన దేవుడు తన ప్రజలను కాపాడుతాడనే సత్యానికి విరుద్ధంగా మాట్లాడడం లేదు.

కాబట్టి 1 పేతురు 4:17–18 వచనాలు విశ్వాసుల రక్షణ అస్థిరమని కాకుండా శ్రమలు మరియు పరీక్షల మధ్యగానే వారు రక్షణ గమ్యానికి చేరుతారని బోధిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని పరిశుద్ధుల పదిలత సిద్ధాంతాన్ని ఖండించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 29: ఒకసారి రక్షణ పొందితే ఇక పోదు అని కాల్వినిస్టులు చెబుతారు. కానీ “వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవజ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును…” (2 పేతురు 2:20–22) అని వ్రాయబడింది. అంటే ఒకప్పుడు రక్షణ మార్గంలో ఉన్నవారు తర్వాత తిరిగి పాపంలో పడిపోయి నశించవచ్చని స్పష్టమౌతుంది (ఆర్టికల్ పేజి నెం. 15).

జవాబు: ఈ ప్రశ్నలో 2 పేతురు 2:20–22 వచనాలను ఆధారంగా తీసుకొని, “ఒకప్పుడు నిజంగా రక్షింపబడినవారు కూడా తర్వాత పాపంలో పడిపోయి నశించవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) సిద్ధాంతం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల మొత్తం సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పేతురు ఇక్కడ ‘నిజంగా తిరిగి జన్మించినవారు రక్షణ కోల్పోతారు’ అని బోధించడం లేదు.

మొదటగా 2 పేతురు 2 అధ్యాయం మొత్తం అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తోంది. ప్రారంభం నుండే పేతురు వారిని “అబద్ధ ప్రవక్తలు”, “నాశనకరమగు భిన్నాభిప్రాయాలను బోధించువారు”, “లోభముచేత కల్పితమాటలతో వ్యాపారము చేయువారు” అని వర్ణిస్తున్నాడు (2:1–3). అంటే ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందర్భం నిజమైన విశ్వాసులు రక్షణ కోల్పోవడం గురించి కాకుండా బయటకు భక్తిగలవారిలా కనిపించినప్పటికీ నిజమైన అంతరంగ మార్పు లేని అబద్ధ బోధకుల గురించి ఉంది.

అదేవిధంగా, 20–22 వచనాలలో ఉపయోగించిన భాషను కూడా జాగ్రత్తగా గమనించాలి. పేతురు “కుక్క తన వాంతికి తిరిగినట్టు”, “కడుగబడిన పంది మళ్లీ బురదలో దొర్లుటకు వెళ్ళినట్టు” అని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే — కుక్క బయటకు మారినట్టుగా కనిపించినా తిరిగి తన వాంతికే వెళ్ళింది; పంది కడుగబడినా తిరిగి బురదలోనే దొర్లింది. వాటి బాహ్య పరిస్థితి కొంతకాలం మారినట్టుగా కనిపించినా వాటి స్వభావం మారలేదు. ఇదే పేతురు point. బయటకు కొంతకాలం ఆత్మీయ మార్పు కనిపించినా వారి అంతరంగ స్వభావం నిజంగా మారలేదు.

ఈ వచనంలో వారు నిజంగా తిరిగి జన్మించినవారని ఎక్కడా చెప్పబడలేదు. “ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత” అని మాత్రమే చెప్పబడింది. అంటే వారు సువార్త సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, కొంతకాలం పాపపు జీవితం నుండి దూరంగా ఉన్నారు. కానీ అది తప్పనిసరిగా వారు నిజంగా తిరిగి జన్మించి రక్షింపబడ్డారని నిరూపించదు.

ఇదే భావాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి 12:43–45లో కూడా బోధించాడు. అక్కడ ఒక అపవిత్రాత్మ మనుష్యునిలోనుండి బయటకు వెళ్ళిన తర్వాత, ఆ మనుష్యుడు బాహ్యంగా శుభ్రమైన స్థితిలో కనిపించినప్పటికీ చివరికి ఆ ఆత్మ తనకంటె చెడ్డవైన మరి ఏడు ఆత్మలను వెంటబెట్టుకొని తిరిగి వచ్చి అతనిలో నివసించిందని ప్రభువు చెప్పాడు. ఫలితంగా “ఆ మనుష్యుని కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును” అని చెప్పారు (మత్తయి 12:45). అయితే అక్కడ ఆ మనుష్యుడు నిజంగా తిరిగి జన్మించాడు, దేవునిచేత అంతరంగముగా మార్పు పొందాడు అని ఎక్కడా చెప్పబడలేదు. బయటకు కొంత శుభ్రత, కొంత మార్పు కనిపించినా అంతరంగం నిజంగా దేవునికి చెందలేదు.

అందుకే పేతురు చివరలో వారిని “కుక్క తన వాంతికి తిరిగినట్టును” మరియు “కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును” అని పోల్చుతున్నాడు. అంటే వారి అంతరంగ స్వభావం అసలు మారలేదని ఈ ఉపమానాలు సూచిస్తున్నాయి. ఇది మత్తయి 7:22–23లో ప్రభువు చెప్పిన విషయంతో కూడా సరిపోతుంది. బయటకు అద్భుత కార్యాలు మరియు పరిచర్య కనిపించినప్పటికీ నిజంగా ప్రభువుకు చెందినవారు కాకపోవచ్చు. అందుకే 1 యోహాను 2:19లో కూడా “వారు మనలోనుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు” అని చెప్పబడింది. అంటే బయటకు విశ్వాసుల సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా తిరిగి జన్మించినవారై ఉండనవసరం లేదు.

కాల్వినిజం కూడా బైబిల్‌లో తాత్కాలిక, పైపై, లేదా బాహ్య విశ్వాసం గురించి హెచ్చరికలు ఉన్నాయని అంగీకరిస్తుంది. కానీ నిజంగా తిరిగి జన్మించిన వారిని దేవుడు అంతం వరకూ కాపాడతాడని కూడా బోధిస్తుంది. అందుకే యోహాను 10:28లో ప్రభువు “వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు” అని చెప్పాడు.

కాబట్టి 2 పేతురు 2:20–22 వచనాలు సువార్త సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకొని, కొంతకాలం లోకమాలిన్యములను విడిచినట్టుగా కనిపించినప్పటికీ నిజమైన అంతరంగ మార్పు లేక తిరిగి పాపంలోకి వెళ్ళిపోయిన అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని “నిజమైన రక్షణ పొందినవారు తప్పక రక్షణ కోల్పోవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత తప్పు” అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 30: ఒకసారి రక్షణ పొందితే ఇక పోదు అని కాల్వినిస్టులు చెబుతారు. కానీ “విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ.. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవ జ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్పలులైనను కాకుండ చేయును. ఇవి ఎవనికిలేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ది కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుయొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును” (2 పేతురు 1:5–11) అని వ్రాయబడింది. అంటే రక్షణలో నిలిచియుండడానికి విశ్వాసి జాగ్రత్తగా జీవించాలి; లేకపోతే తొట్రిల్లి నశించవచ్చు అని స్పష్టమౌతుంది. (ఆర్టికల్ పేజి నెం. 15, 16)

జవాబు: ఈ ప్రశ్నలో 2 పేతురు 1:5–11 వచనాలను ఆధారంగా తీసుకొని, “విశ్వాసి సద్గుణములలో కొనసాగకపోతే రక్షణ కోల్పోవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత (Perseverance of the Saints) సిద్ధాంతం తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పేతురు ఇక్కడ “నిజమైన రక్షణ పొందినవారు తప్పక నశించవచ్చు” అని కాకుండా నిజమైన పిలుపు మరియు ఏర్పాటు (election) ఉన్నవారి జీవితంలో ఆత్మీయ ఫలితాలు కనబడతాయని బోధిస్తున్నాడు.

మొదటిగా ఈ వచనాల ప్రారంభ సందర్భాన్ని గమనించాలి. 2 పేతురు 1:3–4లో పేతురు, దేవుని శక్తి జీవమునకును భక్తికిని అవసరమైన సమస్తమును మనకు అనుగ్రహించిందని, విశ్వాసులు “దైవస్వభావములో పాలివారైరి” అని చెబుతున్నాడు. అంటే పేతురు ముందుగా దేవుని కృప మరియు దేవుడు విశ్వాసులలో చేసిన రక్షణకార్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ తర్వాతే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ వంటి లక్షణాలను అభివృద్ధి చేసుకొనమని ఉపదేశిస్తున్నాడు. ఈ లక్షణాలు ఎవరిలో కలిగి విస్తరించునో వారు “సోమరులైనను నిష్పలులైనను కాకుండ” ఉంటారని చెబుతున్నాడు. అంటే పరిశుద్ధ జీవితం ఎన్నికకు కారణం కాదు; ఎన్నికకు ఫలితం మరియు సాక్ష్యం.

అదేవిధంగా “ఇవి ఎవనికిలేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును” అనే మాటను కూడా సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. పేతురు ఇక్కడ “నిజమైన రక్షణ పోయింది” అని చెప్పడం లేదు; పరిశుద్ధ జీవితం మరియు ఆత్మీయ ఎదుగుదల లేకుండా జీవించే వ్యక్తి ఆత్మీయ అంధత్వంలో ఉన్నాడని, అతడు నిజంగా తిరిగి జన్మించని వ్యక్తి అని ఈ సందర్భం సూచిస్తోంది. “పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి” అనే మాట, అతడు ఒకప్పుడు సువార్త సత్యాన్ని తెలిసికొని, క్రైస్తవ సమాజంలో భాగమై, పాపమునుండి శుద్ధి పొందినవాడనుకొని జీవించినప్పటికీ ఇప్పుడు ఆ రక్షణ సత్యానికి తగిన జీవితం లేకుండా ఉన్నాడనే భావాన్ని సూచిస్తుంది. అందుకే అతడు “గ్రుడ్డివాడు” మరియు “దూరదృష్టిలేనివాడు” అని చెప్పబడుతున్నాడు — అంటే దేవుని రాజ్య గమ్యాన్ని మరియు ఆత్మీయ సత్యాలను స్పష్టంగా చూడలేని స్థితిలో ఉన్నాడు.

ఆ తర్వాతే పేతురు “మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి” అని చెబుతున్నాడు. ఇక్కడ “మీ ఎన్నికను సంపాదించుకొనుడి” అని కాదు; దేవుడు మీలో చేసిన రక్షణకార్యం నిజమైనదని మీ జీవితం ద్వారా కనపరచండి అనే భావంలో మాట్లాడుతున్నాడు. అందుకే “మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు” అని చెబుతున్నాడు. అంటే నిజమైన విశ్వాసులు దేవుని కృపచేత పరిశుద్ధతలో కొనసాగించబడతారని పేతురు బోధిస్తున్నాడు.

ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే పేతురు తన మొదటి పత్రికలో “దేవుని శక్తిచేత విశ్వాసముద్వారా కాపాడబడుచున్నారు” (1 పేతురు 1:5) అని ముందే చెప్పాడు. కాబట్టి పేతురు ఒకచోట దేవుడు తన ప్రజలను కాపాడుతాడని చెప్పి, మరోచోట “రక్షణ అనిశ్చితమైనది” అని బోధిస్తున్నట్టు అర్థం చేసుకోవడం సరైనది కాదు.

కాల్వినిజం కూడా నిజమైన విశ్వాసి పరిశుద్ధ జీవితం గడపాలని, విశ్వాసంలో ఎదగాలని, జాగ్రత్తగా నడుచుకోవాలని బలంగా బోధిస్తుంది. పరిశుద్ధుల పదిలత అంటే “ఏలా జీవించినా పరవాలేదు” అనే బోధ కాదు. నిజంగా దేవునిచేత పిలువబడి ఏర్పాటులో ఉన్నవారి జీవితంలో ఈ ఆత్మీయ ఫలితాలు కనబడతాయి; దేవుని కృప వారిని అంతం వరకూ కాపాడుతుంది. అయితే ఎవరి జీవితంలోనూ ఈ ఆత్మీయ ఫలితాలు కనబడక, వారు శాశ్వతంగా అవిధేయతలోనే కొనసాగితే వారు నిజంగా తిరిగి జన్మించినవారే కాదని స్పష్టమౌతుంది.

కాబట్టి 2 పేతురు 1:5–11 వచనాలు విశ్వాసులు తమ పిలుపు మరియు ఎన్నికకు తగిన ఫలితాలను జీవితంలో కనబరచాలని, పరిశుద్ధ జీవితంలో ఎదగాలని బోధిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని “నిజమైన రక్షణ పొందినవారు తప్పక రక్షణ కోల్పోవచ్చు; కాబట్టి పరిశుద్ధుల పదిలత సిద్ధాంతం తప్పు” అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 31: కాల్వినిస్టుల సిద్ధాంతం అంతటికీ మూలవచనాలుగా ఎఫెస్సి 1:5–6 మరియు 1 పేతురు 1:20లను చూపుతారు. “జగత్తు పునాది వేయబడకమునుపే” దేవుడు మనలను నిర్ణయించుకున్నాడని చెప్పి, కొందరిని రక్షణకు, మరికొందరిని నరకానికి ముందే నియమించాడని బోధిస్తారు. కానీ ఎఫెస్సి 1 అధ్యాయం ప్రకారం దేవుడు ప్రేమచేత మనలను ఏర్పరచుకున్నాడు. “సమస్తమును క్రీస్తులో ఏకంగా కూర్చవలెనని” (ఎఫెస్సి 1:10) ఆయన సంకల్పించాడు. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమతోనే ఏర్పరచుకున్నాడు; ద్వేషంతో ఎవ్వరిని నాశనానికి నియమించలేదు. అలాగే 1 పేతురు 1:1–2 ప్రకారం ఏర్పరచబడుట అనేది దేవుని భవిష్యద్ జ్ఞానమును బట్టియే జరిగింది. అంటే దేవుడు ముందుగానే ఎవరు విశ్వసిస్తారో తెలిసికొని వారిని ఎన్నుకున్నాడు; కానీ నిరంకుశంగా కొందరిని రక్షణకు, కొందరిని నాశనానికి నిర్ణయించలేదు (ఆర్టికల్ పేజి నెం. 16, 17).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా ఎఫెస్సీయులకు 1 అధ్యాయం మరియు 1 పేతురు 1:1–2 వచనాలను ఆధారంగా తీసుకొని, “దేవుని ఎన్నిక అనేది కేవలం ముందుగానే ఎవరు విశ్వసిస్తారో తెలిసికొన్న భవిష్యద్‌జ్ఞానం మాత్రమే; కానీ దేవుడు సార్వభౌమంగా రక్షణకు ఎన్నుకోవడం కాదు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలు మరియు పేతురు చెప్పేది కేవలం “ముందుగా తెలుసుకోవడం” మాత్రమే కాదు; దేవుని సంకల్పం, ఎన్నిక, మరియు కృపకార్యంతో సంబంధమున్న విషయం అని స్పష్టమౌతుంది.

మొదటిగా ఎఫెస్సీయులకు 1 అధ్యాయం మొత్తాన్ని గమనిస్తే పౌలు ప్రధానంగా దేవుని సార్వభౌమ కృపను స్తుతిస్తున్నాడు. “జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను” (1:4), “తన చిత్తప్రకారమైన సంకల్పముచొప్పున ముందుగా నిర్ణయించెను” (1:5), “తన చిత్తప్రకారం సమస్తమును జరిగించుచున్నాడు” (1:11) వంటి వచనాలు దేవుని ఎన్నికను కేవలం భవిష్యత్తును ముందుగా చూడడంగా కాకుండా ఆయన చిత్తం మరియు సంకల్పానుసారంగా జరిగే కార్యంగా చూపిస్తున్నాయి.

అదేవిధంగా “ప్రేమచేత” మనలను ఏర్పరచుకొనెను అని చెప్పబడింది కాబట్టి, “దేవుడు ఎవ్వరినీ తీర్పుకు విడిచిపెట్టడు” అని నిర్ధారించడం కూడా సరైన తర్కం కాదు. కాల్వినిజం కూడా దేవుని ఎన్నిక ప్రేమపూర్వకమైనదే అని బోధిస్తుంది. దేవుడు తన ప్రజలను ప్రేమచేత ఎన్నుకొన్నాడని అంగీకరిస్తుంది. అయితే అదే సమయంలో బైబిల్ దేవుడు అందరినీ ఒకే విధమైన రక్షణార్థక ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని ఎక్కడా చెప్పదు. ఉదాహరణకు రోమా 9లో “యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని” అని చెప్పబడింది. కాబట్టి దేవుని ప్రేమను చూపించే వచనాలను తీసుకొని, ఆయన సార్వభౌమ ఎన్నికను తిరస్కరించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

“సమస్తమును క్రీస్తులో ఏకంగా కూర్చవలెనని” (ఎఫెస్సి 1:10) అనే వచనాన్ని కూడా సందర్భంలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు దేవుడు సమస్తాన్ని క్రీస్తులో ఏకం చెయ్యాలనే తన సంకల్పాన్ని చూపిస్తున్నాడు — యూదులు మరియు అన్యజనులు సహా పరలోకంలోనివి మరియు భూమిమీదనున్నవి అన్నీ చివరికి క్రీస్తు ఆధిపత్యంలో ఏకీకరించబడతాయని. కానీ ఈ వచనం ప్రతి వ్యక్తి తప్పక రక్షింపబడతాడు అని, లేదా దేవుడు ప్రతి వ్యక్తిని రక్షణార్థకంగా ఎన్నుకున్నాడు అని చెప్పడం కాదు. అదే పత్రికలోనే పౌలు “ఉగ్రత పిల్లలమై యున్నాము” (ఎఫెస్సి 2:3) అని కూడా చెప్పుతున్నాడు.

అదేవిధంగా 1 పేతురు 1:20లో “జగత్తు పునాది వేయబడకమునుపే క్రీస్తు నియమింపబడెను” అని చెప్పబడింది. ఈ వచనం కూడా దేవుని ముందస్తు ప్రణాళికను చూపిస్తుంది. కాల్వినిజం కూడా ఈ వచనాన్ని ప్రధానంగా దేవుని విమోచన ప్రణాళిక యొక్క నిత్యసంకల్పాన్ని చూపించేదిగా అర్థం చేసుకుంటుంది. అంటే క్రీస్తు సిలువబలి యాదృచ్ఛికమైనది కాదు; సృష్టికి ముందే దేవుని ప్రణాళికలో భాగమై ఉంది. అయితే అదే సమయంలో ఈ విమోచన ప్రణాళిక వెనుక దేవుని ఎన్నిక మరియు కృప కూడా ఉన్నాయి. కాబట్టి 1 పేతురు 1:20 వచనం తీసుకొని “దేవుని ఎన్నిక అనే భావమే లేదు” అని నిర్ధారించడం సందర్భానుసార వ్యాఖ్యానం కాదు.

అలాగే 1 పేతురు 1:1–2లోని “భవిష్యద్‌జ్ఞానమునుబట్టి” అనే మాటను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాల్వినిజం ప్రకారం “భవిష్యద్‌జ్ఞానం” అంటే కేవలం “దేవుడు భవిష్యత్తులో ఎవరు విశ్వసిస్తారో ముందే చూశాడు” అనే అర్థం కాదు. దేవుడు తన సంకల్పప్రకారము ముందుగా నిర్ణయించుకున్న వారిని పరిశుద్ధాత్ముని కార్యం చేత విశ్వాసానికి మరియు విధేయతకు నడిపించాడు అని అర్థం. బైబిల్‌లో “ఎరుగుట” అనే పదం తరచుగా ప్రత్యేకమైన సంబంధం, ప్రేమ, లేదా ఎన్నిక భావాన్ని కూడా సూచిస్తుంది. ఉదాహరణకు, “భూమిమీదనున్న సమస్త వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను” (ఆమోసు 3:2) అని దేవుడు ఇశ్రాయేలును గూర్చి చెప్పినప్పుడు, అది ఇతర జనాంగాల గురించి దేవునికి తెలియదు అనే అర్థం కాదు; ప్రత్యేకమైన ఎంపిక మరియు సంబంధాన్ని సూచిస్తుంది.

అదేవిధంగా రోమా 8:29–30లో “ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను” అని చెప్పబడింది. అక్కడ ముందస్తుజ్ఞానం, ముందుగా నిర్ణయించుట, పిలుచుట, నీతిమంతులుగా తీర్చుట, మహిమపరచుట — ఇవన్నీ దేవుని రక్షణ ప్రణాళికలో పరస్పర సంబంధమున్న కార్యాలుగా చూపబడుతున్నాయి. కాబట్టి “భవిష్యద్‌జ్ఞానం”ను కేవలం నిష్క్రియాత్మకంగా భవిష్యత్తును చూసే జ్ఞానంగా పరిమితం చెయ్యడం, ఆ వచనాల సంపూర్ణ భావాన్ని తగ్గించడం ఔతుంది.

కాబట్టి ఎఫెస్సీయులకు 1 అధ్యాయం లేదా 1 పేతురు 1:1–2, 20 వచనాలను ఆధారంగా తీసుకొని, “దేవుని ఎన్నిక అనేది కేవలం భవిష్యత్తును ముందుగా చూసిన జ్ఞానం మాత్రమే; ఎలాంటి సార్వభౌమ నిర్ణయం లేదు” అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు. ఈ వచనాలు దేవుని ప్రేమను, కృపను, మరియు ఆయన సార్వభౌమ రక్షణ ప్రణాళికను కలిసి బోధిస్తున్నాయి. అదే సమయంలో బైబిల్ ఎక్కడా దేవుడు నిరపరాధులను అన్యాయంగా నాశనానికి నియమించాడని బోధించదు; పాపులలో కొందరిని కృపచేత రక్షించుచున్నాడని బోధిస్తుంది.

ప్రశ్న 32: క్రీస్తును ముందుగా ఎందుకు ఏర్పాటు చేశాడు? అంటే పాపం వస్తుందని దేవునికి ముందే తెలుసా? ముందే తెలిస్తే ఎందుకు ఆపలేదు? కాల్వినిజాన్ని విమర్శించేవారు, ఈ సిద్ధాంతం దేవుడు పాపం జరగాలని నిర్ణయించినట్టుగా చూపిస్తుంది అని అంటారు. కానీ దేవుని భవిష్యత్‌జ్ఞానం మరియు దేవుని నిర్ణయం రెండూ ఒకటి కావు. దేవుడు ముందుగానే జరిగే విషయాలను తెలుసుకొని చెప్పాడు గాని, అవి జరగాలని నిర్బంధంగా నిర్ణయించలేదు. ఉదాహరణకు ప్రకటన గ్రంథంలో యుద్ధాలు, వినాశనాలు, అక్రమము, దేవుని ప్రజల హింస గురించి ముందుగానే చెప్పబడింది. కానీ దేవుడు అవి జరగాలని కోరుకున్నాడు అని కాదు; జరగబోయేది ముందే చెప్పాడు. అలాగే యూదా ప్రభువును అప్పగించబోతున్నాడని ముందుగానే చెప్పబడింది. కానీ యూదా అలా చెయ్యాలని దేవుడు బలవంతం చెయ్యలేదు. దేవుడు ముందుగానే చూసి తెలియచేశాడు అంతే. దేవుడు సృష్టికి ముందే పాపం వస్తుందని, అపవాది మోసగిస్తాడని చూశాడు. అయినప్పటికీ సృష్టిని విడిచిపెట్టకుండా ముందుగానే పరిష్కారాన్ని సిద్ధపరిచాడు. అదే క్రీస్తు. దేవుడు పాపానికి కర్త కాదు; పాపానికి పరిహారం. మనుష్యులు పడిపోతారని తెలిసినా వారిని ప్రేమించాడు. వారిని రక్షించడానికి క్రీస్తును నియమించాడు. కానీ కాల్వినిజం మాత్రం దేవుడు మనుష్యులను తోలుబొమ్మల్లా ముందే నిర్ణయించి నడిపిస్తున్నట్టు చూపిస్తుంది. ఇది దేవుని ప్రేమను మరియు మనిషికి ఇచ్చిన విలువను అవమానించడమే ఔతుంది. (ఆర్టికల్ పేజి నెం. 17, 18, 19)

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా “దేవుని ముందస్తు జ్ఞానం” మరియు “దేవుని నిర్ణయం” మధ్య తేడాను చూపిస్తూ “దేవుడు పాపం జరుగుతుందని ముందే తెలుసుకున్నాడు కాని, అది జరగాలని నిర్ణయించలేదు; కాబట్టి కాల్వినిజం దేవునిని పాపానికి కర్తగా చూపిస్తుంది” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా కాల్వినిజం నిజంగా ఏం బోధిస్తుందో పూర్తిగా మరియు సమతుల్యంగా చూపించడం లేదు.

మొదటిగా కాల్వినిజం దేవుడు పాపానికి కర్త (author of sin) అని బోధించదు. బైబిల్ ప్రకారం దేవుడు పరిశుద్ధుడు; ఆయనలో పాపం లేదు (యాకోబు 1:13). మనుష్యుల పాపానికి వారే బాధ్యులు. అదే కాల్వినిజం కూడా అంగీకరిస్తుంది. అయితే అదే సమయంలో దేవుడు తన సార్వభౌమ సంకల్పానికి వెలుపల ఏదీ జరగదని కూడా బోధిస్తుంది. అంటే దేవుడు పాపాన్ని సృష్టించడు, దుష్టత్వాన్ని ప్రేరేపించడు; కానీ పాపపూరితమైన మనుష్యుల కార్యాలను కూడా తన ప్రణాళిక నెరవేర్చుటకు ఉపయోగిస్తాడు.

ఉదాహరణకు, అపొస్తల కార్యములు 2:23లో “దేవుని నిర్ణయము మరియు భవిష్యద్‌జ్ఞానము చొప్పున అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి” అని చెప్పబడింది. ఇక్కడ రెండు సత్యాలు ఒకేసారి కనిపిస్తున్నాయి:

క్రీస్తు సిలువబలి దేవుని నిర్ణయం ప్రకారమే జరిగింది.

అయినప్పటికీ ఆయనను సిలువ వేసినవారు తమ దుష్టత్వానికి బాధ్యులే.

అంటే దేవుని సార్వభౌమ సంకల్పం నెరవేరినందువల్ల మనుష్యుల బాధ్యత తొలగిపోలేదు. కాల్వినిజం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది.

అదేవిధంగా “దేవుడు ముందే తెలిసినా ఎందుకు ఆపలేదు?” అనే ప్రశ్న చాలా లోతైన తాత్విక మరియు వేదాంతపరమైన అంశం. బైబిల్ దీనికి ప్రతి వివరాన్ని వివరించదు. అయితే బైబిల్ స్పష్టంగా చూపించే విషయం ఏంటంటే — దేవుడు పాపాన్ని అనుమతించినప్పటికీ చివరికి తన మహిమను మరియు విమోచన ప్రణాళికను బయలుపరచడానికి దానిని ఉపయోగిస్తున్నాడు. ఉదాహరణకు, ఆదాము పతనము భయంకరమైనది అయినప్పటికీ అదే నేపథ్యములో క్రీస్తు ద్వారా దేవుని కృప, నీతి, మరియు జీవం సమృద్ధిగా ప్రత్యక్షమయ్యాయి (రోమా 5:18–21).

దేవుని భవిష్యద్‌జ్ఞానం గురించి ముందున్న ప్రశ్నలలో ఇప్పటికే వివరించబడింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ విస్తరించకుండా, ఆ వివరణను గమనించాలి.

అదేవిధంగా యూదా ఉదాహరణను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూదా చేసిన ద్రోహం దేవుని విమోచన ప్రణాళికలో భాగమైనప్పటికీ యూదా తన స్వంత దురాశ మరియు అవిశ్వాసం వల్లే ఆ పని చేశాడు. దేవుడు అతన్ని బలవంతంగా ద్రోహం చేయించలేదు. అయినప్పటికీ బైబిల్ ప్రకారం ఆ సంఘటన దేవుని ప్రణాళిక వెలుపల జరగలేదు (యోహాను 17:12, అపొ.కా. 1:16).

“దేవుడు పాపానికి పరిహారం” అని చెప్పిన విషయం మాత్రం నిజమే. బైబిల్ మొత్తం దేవుడు పాపులను రక్షించడానికి క్రీస్తును ఇచ్చాడని బోధిస్తుంది. కాల్వినిజం కూడా అదే విషయాన్ని బలంగా అంగీకరిస్తుంది. దేవుడు పాపులను ప్రేమించి, తన కుమారుని ద్వారా విమోచన మార్గాన్ని సిద్ధపరిచాడని బోధిస్తుంది. అయితే అదే సమయంలో ఈ విమోచన ప్రణాళిక కూడా దేవుని నిత్యసంకల్పంలో భాగమని చెబుతుంది.

అలాగే “కాల్వినిజం మనిషిని తోలుబొమ్మగా చూపిస్తుంది” అనే విమర్శ కూడా కాల్వినిజం అసలు బోధను చూపించకపోవడమే. కాల్వినిజం ప్రకారం మనుష్యులు యంత్రాల్లా బలవంతపరచబడరు; తమ స్వంత కోరికలు మరియు స్వభావానుసారంగానే నిర్ణయాలు తీసుకొని ప్రవర్తిస్తారు, మరియు తమ పాపాలకు బాధ్యులే. అయితే పాపపతనంలో ఉన్న మనిషి దేవుని కృప లేకుండా నిజంగా దేవుని యొద్దకు రాలేడని బోధిస్తుంది.

కాబట్టి బైబిల్ దేవుని భవిష్యద్‌జ్ఞానాన్ని, సార్వభౌమ సంకల్పాన్ని, మరియు మానవ బాధ్యతను ఒకేసారి బోధిస్తుంది. దేవుడు పాపానికి కర్త కాదు; అయినప్పటికీ ఆయన సంకల్పానికి వెలుపల ఏదీ జరగదు. అదే సమయంలో మనుష్యులు తమ పాపాలకు బాధ్యులుగానే నిలుస్తారు. ఈ రెండు సత్యాలలో ఒకదాన్ని నిలబెట్టడానికి మరొకదాన్ని తిరస్కరించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 33: ‘క్రియలు లేకుండా విశ్వాసం ద్వారా రక్షించబడతాం, మంచి పనులు చెయ్యడం దేవుని బహిరంగ చిత్తం కాబట్టి మంచి పనులు చెయ్యండి, ఒకవేళ మంచి క్రియలు చేయకపోయినా రక్షణ పోదు’ అని కాల్వనిస్టులంటారు. కానీ విశ్వాసం, క్రియలు లేనిదైనప్పుడు మృతం. ఆ విశ్వాసం అతనిని రక్షించలేదు. (యాకో 2:14-16). ఇలాంటి వచనాలు చూపిస్తే కాల్వనిస్టులు మరో వింత బోధచేస్తారు. విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి అనే బోధ కేవలం యూదుల్లో నుండి ప్రభువు దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే అని, హెబ్రీ పత్రిక మరియు యాకోబు పత్రిక యూదా క్రైస్తవులకు మాత్రమే చెందుతాయని వీరంటారు.. కానీ క్రీస్తులోనికి వచ్చినవారిలో యూదా క్రైస్తవులు, అన్య క్రైస్తవులు అని భేదం ఉండదు. ఇద్దరూ సమానమే. యూదుడని, గ్రీకు దేశస్తుడని బేధం లేదు (రోమా 10:12, గలతీ 3:28, కొలస్సీ 3:11) (ఆర్టికల్ పేజి నెం. 21).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా యాకోబు 2 అధ్యాయాన్ని ఆధారంగా తీసుకొని, “క్రియలు లేని విశ్వాసం మృతమైనది కాబట్టి, కేవలం విశ్వాసం ద్వారా రక్షణ అనే కాల్వినిజం బోధ తప్పు” అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా కాల్వినిజం నిజంగా ఏం బోధిస్తుందో పూర్తిగా మరియు సమతుల్యంగా చూపించడం లేదు.

మొదటిగా కాల్వినిజం “సత్ క్రియలు అవసరం లేదు” లేదా “ఎలా జీవించినా పరవాలేదు” అని బోధించదు. నిజమైన విశ్వాసం ఉన్నవారి జీవితంలో సత్ క్రియలు ఫలితంగా కనబడతాయని బలంగా బోధిస్తుంది. ఎఫెస్సీ 2:8–10 ప్రకారం మనము కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడినవారమే; అయితే అదే సమయంలో “సత్ క్రియలకొరకు సృష్టింపబడినవారము” కూడా. కాబట్టి కాల్వినిజం ప్రకారం సత్ క్రియలు రక్షణకు కారణం కాదు; నిజమైన రక్షణకు ఫలితం మరియు సాక్ష్యం.

యాకోబు 2:14–17లో కూడా యాకోబు “క్రియలు లేని విశ్వాసము మృతమైనది” అని చెప్పినప్పుడు, “సత్ క్రియలు కలిపితేనే రక్షణ సంపూర్ణమవుతుంది” అని బోధించడం లేదు. మాటల్లో మాత్రమే ఉండి, జీవితంలో సత్ క్రియలు కనిపించని విశ్వాసం నిజమైన విశ్వాసం కాదని బోధిస్తున్నాడు. అందుకే “అట్టి విశ్వాసము అతనిని రక్షించగలదా?” అని అడుగుతున్నాడు. అంటే యాకోబు ఖండిస్తున్నది నిజమైన జీవం గల విశ్వాసాన్ని కాదు; సత్ క్రియలు లేని మృత విశ్వాసాన్ని.

అదేవిధంగా పౌలు మరియు యాకోబు పరస్పర విరుద్ధంగా బోధించడం లేదు. పౌలు “క్రియలవలన కలిగినది కాదు” (ఎఫెస్సీ 2:9, రోమా 3:28) అని చెప్పినప్పుడు, రక్షణ మనిషి చేసే ఏ క్రియలచేతనైనా సంపాదించబడదు; అది దేవుని కృపచేత విశ్వాసం ద్వారా లభిస్తుంది అని బోధిస్తున్నాడు. యాకోబు మాత్రం “నిజమైన విశ్వాసం జీవితంలో సత్ క్రియలు కనబరుస్తుంది” అని బోధిస్తున్నాడు. కాబట్టి పౌలు రక్షణకు మూలాన్ని గురించి మాట్లాడితే యాకోబు ఆ రక్షణ యొక్క ఫలితాన్ని మరియు సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు.

ఇంకా “యాకోబు మరియు హెబ్రీయులకు పత్రికలు కేవలం యూదా క్రైస్తవులకే చెందుతాయి” అనే వాదనను కాల్వినిజానికి ఆపాదించడం కూడా సరైనది కాదు. కాల్వినిజం సాధారణంగా యాకోబు మరియు హెబ్రీయులకు పత్రికలను దేవుని ప్రేరేపిత వాక్యంగా సంఘమంతటికి వర్తించేవిగా అంగీకరిస్తుంది.

అలాగే “క్రీస్తులో యూదుడు, గ్రీకుదేశస్తుడు అనే భేదం లేదు” (రోమా 10:12, గలతీ 3:28; కొలస్సీ 3:11) అనే విషయం నిజమే. కాల్వినిజం కూడా దీనిని పూర్తిగా అంగీకరిస్తుంది. రక్షణ యూదులకు మాత్రమే కాదు, సమస్త జనాంగాలకు విస్తరించబడిందని బోధిస్తుంది.

కాబట్టి యాకోబు 2 అధ్యాయం సత్ క్రియలు రక్షణకు మూలకారణం అని కాకుండా నిజమైన విశ్వాసం జీవముగలదై సత్ క్రియలు కనబరుస్తుందని బోధిస్తుంది. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని “కాల్వినిజం సత్ క్రియలను తిరస్కరిస్తుంది; కాబట్టి అది తప్పు” అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 34: హెబ్రీ 10:26-29... కాల్వనిస్టులకు మింగుడుపడని వచనం.. మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాప ములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ? ఈ వచనం కాల్వనిజాన్ని సూటిగా ఖండిస్తుంది. అందుకే వీరు ఇలా వక్రీకరిస్తారు... ‘ఇది సువార్తను తిరస్కరించిన ఇశ్రాయేలీయుల కోసం రాయబడింది. అందుకే మోషే ధర్మశాస్త్రం గురించి చెప్పబడింది. ఇది ఇశ్రాయేలీయుల కోసం’. ఇదీ వీరి వంకర బోధ. హెబ్రీ 10:26లో ‘మనము’ అని ఎవరికోసం అన్నాడో తెలిస్తే.. ఈ కాల్వనిష్టుల వక్రీకరణ స్పష్టంగా అర్ధం అయిపోతుంది (ఆర్టికల్ పేజి నెం. 21).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా హెబ్రీయులకు 10:26–29 వచనాలను ఆధారంగా తీసుకొని, “నిజమైన విశ్వాసులు కూడా తర్వాత రక్షణ కోల్పోయి నాశనమునకు పోవచ్చు అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, హెబ్రీయులకు రచయిత ఇక్కడ “నిజంగా తిరిగి జన్మించినవారు తప్పక నశించిపోతారు” అని బోధించడం లేదు.

మొదటిగా హెబ్రీయులకు పత్రిక యొక్క మొత్తం సందర్భాన్ని గమనించాలి. ఈ పత్రిక ప్రధానంగా యూదా నేపథ్యం కలిగినవారికి రాయబడింది అనేది నిజమే. ఎందుకంటే ఇందులో యాజకత్వం, బలులు, మోషే ధర్మశాస్త్రం, పాత నిబంధన ఆరాధన వంటి విషయాలు విస్తృతంగా చర్చించబడుతున్నాయి. అయితే అందువల్ల ఈ పత్రిక “కేవలం యూదులకే వర్తిస్తుంది” అని కాల్వినిజం బోధిస్తుంది అని చెప్పడం సరైనది కాదు. కాల్వినిజం కూడా హెబ్రీయులకు పత్రికను దేవుని ప్రేరేపిత వాక్యంగా సంఘమంతటికీ వర్తించేదిగా అంగీకరిస్తుంది.

అయితే హెబ్రీయులకు 10:26–29లో రచయిత హెచ్చరిస్తుంది ఏంటి అన్నది సందర్భంలో అర్థం చేసుకోవాలి. “సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత” అని చెప్పబడింది కాని “నిజంగా తిరిగి జన్మించి రక్షింపబడిన తర్వాత” అని చెప్పబడలేదు. హెబ్రీయులకు పత్రికలో చాలాసార్లు సంఘ సమాజంలో ఉండి, సువార్త సత్యాలను విని, దేవుని కార్యాలను అనుభవించినప్పటికీ చివరికి క్రీస్తును తిరస్కరించే ప్రమాదం గురించి హెచ్చరికలు కనిపిస్తాయి.

ఇంకా “మనము” అనే పదాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్ రచయితలు అనేకసార్లు తమ శ్రోతలతో తామూ కలిసి హెచ్చరిక మరియు ప్రోత్సాహ భాషను ఉపయోగించారు. ఉదాహరణకు, పౌలు “ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో” (1 కొరింథీయులకు 9:27) అని చెప్పాడు. అలాగే “భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించుకొనుడి” (ఫిలిప్పీయులకు 2:12) అని కూడా బోధించాడు. అక్కడ పౌలు నిజంగా “నిశ్చయంగా రక్షణ కోల్పోవచ్చు” అని కాకుండా విశ్వాసులు జాగ్రత్తగా పరిశుద్ధతతో నడుచుకోవలసిన అవసరాన్ని తెలియచేస్తున్నాడు. అదే విధంగా హెబ్రీయులకు 10:26లో రచయిత “మనము” అని చెప్పినందువల్ల, అక్కడ చెప్పబడిన ప్రతి వ్యక్తి నిజంగా తిరిగి జన్మించినవాడే అని కాదు. రచయిత సంఘ సమాజాన్ని మొత్తంగా ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికను ఇస్తున్నాడు.

అదేవిధంగా ఈ హెచ్చరిక వచనాలను అదే పత్రికలోని ఇతర భరోసా వచనాలతో కలిసి కూడా పరిశీలించాలి. ఉదాహరణకు హెబ్రీయులకు 10:14లో “ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు” అని చెప్పబడింది. ఇక్కడ క్రీస్తు బలి తాత్కాలికమైనది కాదు; తన ప్రజల కొరకు సంపూర్ణమైన మరియు శాశ్వతమైన ఫలితాన్ని సాధించినదిగా చూపబడుతోంది. అదే పత్రికలో క్రీస్తు యాజకత్వం మరియు ఆయన బలి పాత నిబంధన బలులకంటే శ్రేష్ఠమైనదని పదేపదే వివరించబడింది. కాబట్టి 10:26–29లోని హెచ్చరికలను, “నిజంగా రక్షింపబడినవారు తప్పక నశించిపోతారు” అనే భావంలో అర్థం చేసుకుంటే అదే అధ్యాయంలో క్రీస్తు బలి యొక్క సంపూర్ణత గురించి చెప్పబడిన విషయాలతో విరుద్ధత ఏర్పడుతుంది. కాబట్టి హెబ్రీయులకు పత్రిక ఒకవైపు తీవ్రమైన హెచ్చరికలను ఇస్తూనే మరోవైపు నిజమైన విశ్వాసుల కొరకు దేవుని కాపాడే కృపను కూడా బోధిస్తుంది.

కాబట్టి హెబ్రీయులకు 10:26–29 వచనాలు సువార్త సత్యాన్ని తెలిసికొని కూడా క్రీస్తును తిరస్కరించే భయంకరమైన ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని “నిజమైన రక్షణ పొందినవారు తప్పక రక్షణ కోల్పోవచ్చు అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

ప్రశ్న 35: హెబ్రీ 6:4-6 లో ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్దాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. ఈ వచనం చాలా స్పష్టంగా ఒక వ్యక్తి రక్షణ నుండి తప్పిపోవడానికి అవకాశం ఉంది అని చెబుతుంది. కానీ వీరు ‘కృపలో నుండి తప్పిపోవడం కోసం’ ఈ వచనం చెబుతుంది, కృప లేకపోతే భూమిపై ఆశీర్వాదం రాదు అని 7వ వచనాన్ని చూపిస్తారు. హెబ్రీ 6:7 ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అసలు 6వ అధ్యాయంలో కృప అనే మాటే లేదు. భూమిపై ఆశీర్వాదాలు అనే మాట కూడా లేదు. ఈ గ్రుడ్డి దుర్బోధకులు 7వ వచనంతో ఆ సంభాషణ ఆగిపోయిందనుకుంటారు. కానీ 8వ వచనంలో... అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని ‘విసర్జింపబడి’ ‘శాపము పొందతగినదగును’. తుదకది ‘కాల్చివేయబడును’ అని రాయబడింది. తప్పిపోతే భూమ్మీద ఆశీర్వాదాలు పోవడం కాదు, నరకంలో త్రోయబడతారు. దేవుని కృపను ఒకడు ఎదిరించలేడు అని వీరే చెప్తారు. కృపనుండి తప్పిపోతే ఆశీర్వాదం మాత్రం పోతుంది అనీ వీరే చెప్తారు (ఆర్టికల్ పేజి నెం. 23).

జవాబు: ఈ ప్రశ్నలో ప్రధానంగా హెబ్రీయులకు 6:4–8 వచనాలను ఆధారంగా తీసుకొని, “ఒకసారి నిజంగా రక్షింపబడినవారు కూడా తర్వాత తప్పిపోయి నశించవచ్చు అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వచనాల సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే హెబ్రీ రచయిత ఇక్కడ “నిజంగా తిరిగి జన్మించినవారు తప్పక రక్షణ కోల్పోతారు” అని బోధించడం లేదు.

మొదటిగా ఈ వచనాలలో ఉపయోగించిన భాషను గమనించాలి. రచయిత “వెలిగింపబడి,” “పరలోక సంబంధమైన వరమును రుచిచూచి,” “పరిశుద్ధాత్మలో పాలివారై,” “దేవుని దివ్యవాక్యమును అనుభవించి” అని చెబుతున్నాడు. ఇవన్నీ అత్యంత తీవ్రమైన ఆత్మీయ అనుభవాలను సూచిస్తున్నాయి. అయితే అదే సమయంలో, ఇక్కడ “వారు నిజంగా తిరిగి జన్మించారు,” “నీతిమంతులుగా తీర్చబడ్డారు,” లేదా “నిత్యజీవము పొందారు” అని చెప్పబడలేదు. హెబ్రీయులకు పత్రిక యొక్క మొత్తం సందర్భంలో సంఘ సమాజంలో ఉండి దేవుని కార్యాలను అనుభవించినప్పటికీ చివరికి క్రీస్తును తిరస్కరించే ప్రమాదం గురించి రచయిత హెచ్చరిస్తున్నాడు.

అదేవిధంగా, “రుచిచూచుట” అనే పదాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్‌లో ఆత్మీయ అనుభవాలు లేదా దేవుని కార్యాల ప్రభావాన్ని పొందడాన్ని, ఒక వ్యక్తి నిజంగా తిరిగి జన్మించి నిత్యరక్షణను అనుభవిస్తున్నాడని నిర్ధారించదు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుని కార్యాలను చూశారు, పరలోక ఆహారాన్ని రుచిచూశారు, అయినప్పటికీ వారిలో అనేకులు అవిశ్వాసములోనే నిలిచారు (1 కొరింథీ 10:1–5). కాబట్టి బాహ్యంగా గొప్ప ఆత్మీయ అనుభవాలు ఉన్నాయనే కారణంతో ఆ వ్యక్తి నిజంగా తిరిగి జన్మించినవాడే అని కాదు.

అలాగే 6:7–8లోని భూమి ఉదాహరణ కూడా చాలా ముఖ్యమైనది. ఒకే వర్షం రెండు భూములమీద పడుతుంది. కానీ ఒక భూమి పంటను ఫలించగా మరొకటి ముండ్లతుప్పలను పుట్టిస్తుంది. సమస్య వర్షంలో లేదు; భూమి స్వభావంలో ఉంది. ఇదేవిధంగా సువార్త మరియు పరిశుద్ధాత్ముని కార్యాల ప్రభావం ఒక సమాజంలో అనేకులపై పడవచ్చు. కానీ అందరిలో ఒకే విధమైన ఆత్మీయ ఫలితాన్ని కలిగించదు. అందుకే ఒక భూమి ఆశీర్వాదాన్ని పొందగా మరొకటి “విసర్జింపబడి,” “శాపము పొందతగినది,” “కాల్చివేయబడును” అని చెప్పబడింది. కాబట్టి ఈ ఉదాహరణ నిజమైన విశ్వాసం మరియు నకిలీ విశ్వాసం మధ్య తేడాను చూపిస్తుంది.

ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ తీవ్రమైన హెచ్చరిక తరువాతే రచయిత 6:9లో “అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.” అని చెబుతున్నాడు. అంటే 4–8 వచనాలలో చెప్పబడిన పరిస్థితిని, తన పాఠకుల నిజమైన రక్షణ స్థితితో పూర్తిగా సమానంగా చూడడం లేదని తెలుస్తోంది. రచయిత తీవ్రమైన హెచ్చరికను ఇస్తున్నప్పటికీ తన పాఠకులు నిజంగా రక్షణను అనుసరించే స్థితిలో ఉన్నారని మంచి నిరీక్షణను వ్యక్తపరుస్తున్నాడు.

కాబట్టి హెబ్రీయులకు 6:4–8 వచనాలు సువార్త సత్యాన్ని లోతుగా అనుభవించి కూడా చివరికి క్రీస్తును తిరస్కరించే భయంకరమైన ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. అయితే అదే వచనాలను ఆధారంగా తీసుకొని “నిజమైన రక్షణ పొందినవారు తప్పక రక్షణ కోల్పోవచ్చు అని నిర్ధారించడం సమగ్ర వాక్యపరిశీలన కాదు.

చివరి మాట: Fight on Cults వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏదైనా ప్రశ్నను తప్పుగా అడిగారు లేదా కొన్ని ప్రశ్నలను వదిలేశారు అని మీరు భావించినట్లయితే వాటిని కూడా మీరు తెలియజేయవచ్చు. మీరు కాల్వినిజం యొక్క అసలు బోధను చూపించకుండా వక్రీకరించిన విధంగా కాకుండా ఈ రచనలలో ఉన్న సమాధానాలను వాటి సందర్భంలో సమగ్రంగా అర్థం చేసుకుంటూ చదవాలని మనవి చేసుకుంటున్నాము.

ఈ రచనలో “కాల్వినిజం ప్రకారం” లేదా “కాల్వినిజం ఇలా బోధిస్తుంది” అని చెప్పినప్పుడు మేము ఏదో కాల్వినిజాన్ని కాపాడదామనో లేకపోతే కాల్విన్‌కు మేము శిష్యులమనో దీనిని ప్రస్తావించలేదు. మీరు వక్రీకరించి విమర్శిస్తున్నది ‘కాల్వినిజం’ అనే పేరుతో పిలవబడుతున్న బైబిల్ బోధనే. అందుకే బైబిల్ ఈ విధంగా బోధిస్తుంది అని చూపిస్తూ అదే సమయంలో కాల్వినిజం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది అని పేర్కోవడం జరిగింది. అంతేకాని కాల్విన్ మీద ప్రేమతోనో లేక కాల్వినిజాన్ని కాపాడదమనో కాదు. వాస్తవానికి కాల్విన్ ఈ విషయాలను చెప్పకముందే దేవుడు తన ప్రవక్తల ద్వారా అపొస్తలుల ద్వారా ఈ విషయాలను బైబిల్లో పొందుపరిచాడు. కాల్విన్ అనే వ్యక్తి ఈ విషయాలను బోధించిన తర్వాత, అవి మరింత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆయన తర్వాత వచ్చినవారు, ఆయన బోధనలను గుర్తించడానికి ఈ పేరును ఉపయోగించారు. కాబట్టి కాల్విన్ బోధించకముందే ఈ బోధలు బైబిల్లో ఉన్నాయి. అందువల్ల మీరు వక్రీకరించి చెబుతున్నది కాల్వినిజం గురించే అయినప్పటికీ కాల్విన్ చెప్పకముందే బైబిల్లో ఉన్న బోధే కాబట్టి, మీరు విమర్శిస్తున్నది చివరికి దేవుని వాక్యాన్నే అవుతుంది.

“కాల్వినిస్టులు ఇలా అంటారు, అలా అంటారు” అని మీ ఆర్టికల్‌లో సంబోధించారు. అయితే బైబిల్లో ముందునుండే ఉన్న బోధలను కాల్విన్ కూడా బోధించాడు అనే కారణంతో ఆ బోధలను నమ్మి బోధించే వారందరినీ కేవలం “కాల్వినిస్టులు” అని పిలవడం సరైన విధానం కాదు. అలాంటి విమర్శ చెయ్యడానికి ముందు, ఈ బోధలు నిజంగా మొదటి నుంచే బైబిల్లో ఉన్నవా లేక కాల్విన్ క్రొత్తగా తీసుకొచ్చినవా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మేము బోధించేది ఒక వ్యక్తికి సంబంధించిన బోధ కాదు; అది దేవునికి సంబంధించిన, దేవుని గ్రంథంలో పొందుపరచబడిన బోధ. అయినప్పటికీ మీరు దేవుని వాక్యంలోని ఈ బోధలను గుర్తించడానికి “కాల్వినిజం” లేదా “కాల్వినిస్టులు” అనే పదాలను ఉపయోగిస్తామని అన్నట్లయితే అందులో కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కాల్విన్‌ సంబంధులం కాము; దేవుని సంబంధులము.

Fight on Cults వారు మరియు వారి లాగానే చాలామంది ప్రముఖ బోధకులు కూడా కాల్వినిజం ఒక 'దుర్బోధ' అనే అపోహలోనే ఉండి దానినే ప్రచారం చేస్తున్నారే కానీ దానిని సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం మాత్రం చెయ్యడం లేదు. ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని తప్పు అని ప్రకటించే ముందు, దాని యొక్క అసలు బోధను వాక్య సందర్భంలో సమగ్రంగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి. కానీ దానిని పరిశీలించకుండానే వక్రీకరించి చూపిస్తున్నారు.

కాబట్టి మా విమర్శకులకు మేము విన్నవించుకునేది ఏంటంటే — కాల్వినిజంగా పిలవబడుతున్న బైబిల్ బోధ యొక్క లోతైన సమాచారం మరియు సమగ్ర వివరణ కొరకు మా hithabodha.com లోని క్రింద సూచించిన పుస్తకాలనూ వ్యాసాలనూ చదవండి.

దేవుని సార్వభౌమత్వం

కృప చేత మాత్రమే

రక్షణ యెహోవాదే

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

అప్పటికీ మీకు ఏమైనా అభ్యంతరాలు లేక సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మేము చెప్పిన "hithabodha” అనే యూట్యూబ్ ఛానల్‌లో ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారమయ్యే “క్రైస్తవ స్పందన” అనే ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నించవచ్చు.

చివరగా — ఈ రచన మనుష్యులను గెలవడానికి కాదు; సత్యాన్ని స్పష్టపరచడానికి రాయబడింది. దేవుని వాక్యం మన అభిప్రాయాలకు అనుగుణంగా మారదు; మన అభిప్రాయాలే దేవుని వాక్యానికి లోబడాలి. కాబట్టి ప్రతి పాఠకుడు పక్షపాతం లేకుండా వినయంతో, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి, దేవుని చిత్తాన్ని గ్రహించునట్లు ప్రభువు కృపనివ్వునుగాక.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.