విషయసూచిక:- 3:1 , 3:2 , 3:3 , 3:4 , 3:5 , 3:6 , 3:7 , 3:8,9 , 3:10 , 3:11 , 3:12 , 3:13 , 3:14 , 3:15 , 3:16 , 3:17 .
మత్తయి 3:1 ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి-
"ఆ దినములయందు"
యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా నజరేతుకు కొనిపోబడిన తర్వాత గడిపిన ఆయన బాల్య దినాల గురించి మత్తయి ఏమీ రాయలేదు. నేరుగా ఇక్కడ ఆయన దాదాపు 30 యేళ్ళవానిగా బాప్తిస్మం పొందిన సందర్భాన్ని వివరిస్తున్నాడు. కాబట్టి "ఆ దినములయందు" అనే మాట ఆయన బాప్తిస్మానికి సమీపదినాలకు సంబంధించిన ప్రస్తావన అని అర్థం చేసుకోగలం. ఈ కాలాన్ని మరింత నిర్ధిష్టంగా నిర్థారించుకోగల వివరాలు లూకా మనకు అందిస్తున్నాడు (లూకా 3:1,2).
"బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి"
పాపాలు ఒప్పుకుని మారుమనస్సు పొందినవారు తన వల్ల బాప్తిస్మం పొందాలని నియమించిన కారణాన్నిబట్టి యోహానుకు "బాప్తిస్మం ఇచ్చు యోహాను" అనే గుర్తింపు లభించింది. ఈయన జెకర్యా ఎలిజబెత్ యాజక దంపతులకు వారి వృద్ధాప్యంలో అద్భుతంగా అనుగ్రహించబడిన కుమారుడు. మన ప్రభువు కంటే 6 నెలల ముందు యోహాను జన్మించాడు. ఈయన జననానికి సంబంధించిన సుధీర్ఘ వృత్తాంతం లూకా గ్రంథస్థం చేసాడు (లూకా 1 వ్యాఖ్యానం చూడండి) అయితే యోహాను తన యాజక ధర్మాన్ని ఆలయంలో కాకుండా అహరోను అసలు క్రమం చొప్పున అరణ్యంలో నిర్వర్తించాడు.
బాప్తిస్మం అనే మాట కొత్త నిబంధనలో మొదటి ప్రస్తావించబడిన సందర్భం ఇదే కాబట్టి ఇక్కడే ఆ మాట అర్థం ఏంటో చెప్పుకోవడం అవసరం. "బాప్టిజో" అనే గ్రీకు పదానికి "ముంచడం" అని అర్థం వస్తుంది. అయితే ఆ పదాన్ని అనువదించకుండా గ్రీకు పదాన్నే స్వల్ప మార్పుతో ఆంగ్లం, హిందీ, తెలుగు తదితర భాషల్లోకి మార్చుకున్నారు. బహుశా చిలకరించే పద్ధతిని అనుసరిస్తున్న వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా అలా చేసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. కాని నీటిలో ముంచడమే సరైన బాప్తీస్మ విధానమని, ఆ మాటను బట్టి, అది బైబిల్లో నమోదు చెయ్యబడ్డ వివిధ బాప్తిస్మ సన్నివేశాల వివరాలను బట్టి మరియు అది సాదృశ్యపరచే అంతరంగ మార్పునుబట్టి కచ్చితంగా తెలుసుకోగలం. తమ పాపాలు ఒప్పుకుని మారుమనస్సుతో యోహాను సందేశాన్ని అంగీకరించినవారిని నీటిలో ముంచే ఆచారం ద్వారా అదే వారి నూతనజీవితానికి నాంది అని బహిరంగంగా సాక్ష్యమివ్వడమే దీని ఉద్దేశం. ఇది మనుషులు కల్పించిన ఆచారం కాదు, దేవుని సంకల్పం (లూకా 7:30).
మత్తయి 3:2 పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
"పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని"
ఇది బాప్తిస్మమిచ్చు యోహాను చేసిన ప్రకటన. ఈ ప్రకటన సువార్తను అర్థం చేసుకోవడానికి ఎంతో కీలకమైనది. ఎందుకంటే బాప్తిస్మమిచ్చు యోహానుతో ప్రారంభమైన ఇదే సందేశాన్ని యేసు ప్రభువు కూడా కొనసాగించాడు (మత్తయి 4:17). తన అపోస్తలులను కూడా అదే ప్రకటించమని ప్రభువు ఆజ్ఞాపించాడు (మత్తయి 10:7). నేటికీ మన రక్షణ కొరకు దేవుడు మననుండి కోరేది ఇదే (లూకా 24:47), అపో.కా 17:30). అందుకే ఈ మాట భావం తెలుసుకోవడం ఎంతో అవసరం. "పరలోక రాజ్యం" అంటే ప్రజలు పరలోకరాజు చేత పరిపాలించబడే ఒక వ్యవస్థ అనేది ఆ మాటనుండే మనకు స్ఫురించే భావం. పరలోక రాజు అంటే దేవుడే. దేవుని చేత పరిపాలించబడే ప్రజలు ఆయనవలే పరిశుద్ధులయ్యుండాలి (లేవీకాండము 11:44, 19:2, 20:7, మత్తయి 5:48, 1 పేతురు 1:15,16). అందుకే పాపం చేసేవారికి ఆయనరాజ్యంలో పౌరసత్వం లేదు. అయితే పాపియైన మానవుడు దేవుణ్ణి సమీపించి ఆయనతో సంధి కుదుర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి పరలోక రాజ్యమే మానవుని వెదుక్కుంటూ వచ్చింది. అది ఎంతో సమీపంగా ఉంది. అయితే ఏ పాపంవల్ల ఆ రాజ్యం నుండి మనకు ఎడబాటు కలిగిందో, దానిని ఒప్పుకుని, విసర్జించి, దానినుండి దేవుని తట్టుకు తిరగడమే ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి, అంటే ఆయనతో సమాధానపడి, ఆయన ప్రజలం అవ్వడానికి దేవుడు కృపతో ఇచ్చిన సదావకాశం. అలాంటి యథార్థమైన మార్పు మనసులో కలగాలన్నదే "మారుమనస్సు పొందండి" అని ప్రకటించబడిన ఈ మాటలో ఉన్న తాత్పర్యం. దేవుని రాజ్య వారసత్వానికి ఏ అర్హతా లేని మానవుడికి ఇప్పుడు ఆ భాగ్యం ఎంతో సమీపంగా ఉంది. దానిని అందిపుచ్చుకోవాలంటే మారుమనస్సు పొందాలి అనేది ఈ సువార్త ప్రకటన సారాంశం. అయితే ఈ మారుమనస్సు వల్ల ప్రజలు తమ పాపంనుండి స్వనీతి వైపు కాదు, లోక పాపాన్ని తీసివెయ్యడానికి పంపబడిన మెస్సియా వైపు త్రిప్పబడి, ఆయన ద్వారా దేవుని రాజ్యాధికారాన్ని పొందేలా చెయ్యాలన్నదే యోహాను పరిచర్యలో ఉన్న అసలు ఉద్దేశం (యోహాను 1:29).
"యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను"
అరణ్యంలో ప్రకటించాడు అన్నప్పుడు యోహాను చెట్లకు, వన్య మృగాలకు ప్రకటించాడని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూదయ అరణ్యం నిర్జనమైన ఎడారి కాదు. అక్కడ యెహోషువా కాలంలోనే కనీసం 6 పట్టణాలు స్థిరపడియున్నట్టు చదువుతాం (యెహోషువా 15:61-62). అక్కడ స్థిరపడినవారికి, ఆ ప్రాంతం నుండి సంచరించేవారికి యోహాను బోధించాడు. అరణ్యం నుండి ఇశ్రాయేలీయులు గతంలో చాలా పొందారు. అలా పొందినవాటి విషయమై యూదులు ఇచ్చిన జాబితాను డా.జాన్ గిల్ ఈ వచన వాఖ్యానంలో మనకు అందించారు. అరణ్యం నుండే ధర్మశాస్త్రం వచ్చింది, అరణ్యం నుండే సమాజపు గుడారం వచ్చింది, అరణ్యం నుండే యాజక వ్యవస్థ వచ్చింది, అరణ్యం నుండే లేవీయుల పరిచర్య వచ్చింది, అరణ్యం నుండే దేవునిరాజ్యం వచ్చింది, అరణ్యం నుండే దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఎన్నో ఈవులు వచ్చాయి. "అరణ్యం నుండే" అని యూదులు చెప్పుకునే ఈ జాబితాలో కలుపుకోవడానికి ఇదిగో మరో వినూత్న వరం. మారుమనస్సుకు ఆహ్వానం, అవకాశం కూడా వచ్చింది అరణ్యం నుండే. దానిని అందిపుచ్చుకున్నవారు ధన్యులు, అలక్ష్యపెట్టినవారు అన్యులు.
మత్తయి 3:3 ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
యోహాను అరణ్యంలో చేసిన పరిచర్య కారణంగా నెరవేరిన ఒక ప్రవచన ఆధారంగా మత్తయి మనకు అతన్ని పరిచయం చేస్తున్నాడు. ప్రభువు మార్గం సరాళం చెయ్యమని అరణ్యంలో కేకవేసే ఒక ప్రవక్త వస్తాడని యెషయా చేసిన ప్రవచనం యోహాను గురించి అని ఇక్కడ స్పష్టం చేయబడింది (యెషయా 40:3. ఈమాట స్వయంగా యోహాను కూడా తన పరిచయంగా చెప్పుకున్నాడు (యోహాను 1:23).
అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావొచ్చు; యోహాను "మారుమనస్సు పొందుడి" అని చేసిన ప్రకటనకూ "ప్రభువు మార్గం సిద్ధపరచి ఆయన త్రోవను సరాళం చేయుడి" అని కేక వేసే స్వరానికి ఏం సంబంధం? ఈ ప్రకటన వల్ల ఆ ప్రవచనం ఎలా నెరవేరినట్టు? ఇది అర్థం చేసుకోవడం సులభమే. రాజు వస్తున్నప్పుడు అతనికి ముందుగా ఒక సందేశహరుడు పంపబడి రాజుకు అసౌకర్యం కలిగించేదేదైనా మార్గమధ్యం నుండి తొలగించాలని చాటింపు వేయించే ఒక ప్రాచీన పద్ధతి నుండి ఈ అలంకారాన్ని తీసుకున్నారు. ఇక్కడ మెస్సీయ రాజుగా బయల్దేరి వస్తుండగా ఆయనకు మార్గమధ్యంలో అభ్యంతర కారణమయ్యేవి తొలగించమని ఎలుగెత్తి చాటింపు వెయ్యడానికే ఈ యోహాను పంపబడ్డాడు. అలా ఆ రాజు మార్గం సరాళం చెయ్యడానికి మారుమనస్సు పొందడం అవసరమన్నది యోహాను సందేశం. ఎందుకంటే ప్రభువు తన ప్రజల జీవితాల్లోకి ప్రవేశించడానికి పాపమే ప్రధానమైన ఆటంకం కాబట్టి వారు దానిని విసర్జించి ప్రభువును అంగీకరించి ఆయన రాజ్యవారసులు కావాలి.
మరి ప్రభువు మన జీవితాల్లోనికి ప్రవేశించడానికి మార్గం సిద్ధపరచి, త్రోవను సరాళం చేసామా? అంటే ఆయనకు అసౌకర్యం కలిగించేవన్నీ మార్గమధ్యం నుండి తొలగించి ఆయనను చేర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తపరిచిన అనుభవం మన జీవితంలో కలిగిందా? అది లేకపోతే మనం ఆయన చేత పరిపాలించబడడానికి ఇష్టపడడం లేదని, ఆయన రాజ్యంలో మనకు పాలు లేదని అర్థం.
మత్తయి 3:4 ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
"ఈ యోహాను"
యెషయా చేత ప్రవచించబడిన ఈ బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క జీవనశైలిని మత్తయి ఇప్పుడు మనకు పరిచయం చెయ్యబోతున్నాడు. మెస్సియా రాజ్యానికి రాయబారిగా పంపబడ్డ ఈ యోహాను, గొప్ప వైభవంతో ఆర్భాటంగా రంగప్రవేశం చేస్తాడనుకుంటే పొరపాటు. అతను ప్రభువు దృష్టికి గొప్పవాడైనప్పటికీ మనుషులదృష్టిలో బహుధీనుడు.
"ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు"
ఇది సాధారణంగా ప్రవక్తలు ధరించిన చవకగా లభించే గొంగళి వస్త్రం. అందుకే ప్రవక్తలమని చెప్పి మోసగించేవారు కూడా అలాంటి వస్త్రధారణను అవలంభించేవారు (జెకర్యా 13:4). ఏలియా ప్రవక్త ధరించిన ఇలాంటి వస్త్రాన్నే (2 రాజులు 1:8). అతని ఆత్మ మరియు శక్తి కలవాడై వచ్చిన యోహాను కూడా ధరించడం, అదే స్వీయ ఉపేక్ష పద్దతులను ఆచరించడం వింతేమీ కాదు (మలాకి 4:5, లూకా 1:17) కాబట్టి సన్నని వస్త్రాలు ధరించి రాజగృహాలలో నివసించే సుకుమారమైన జీవితానికి భిన్నంగా సహజ సుఖాలకు సౌకర్యవంతమైన వాసులకు దూరంగా ఒక సన్యాసత్వపు జీవిత శైలిని యోహాను అవలంభించినట్టు మనకు అర్థం ఔతుంది (మత్తయి 11:8), మొలచుట్టు ధరించుకున్న అతని తోలుదట్టి కూడా ఏలీయా వస్త్రధారణలో భాగమే (2 రాజులు1:8). ఇలా నడుము కట్టుకోవడం, అప్పగించబడిన పని విషయమై సిద్ధమనస్సును సూచిస్తుంది (లూకా 12:35, 1 పేతురు 1:13)
"మిడతలును అడవి తేనేయు అతనికి ఆహారము"
అంటే ఇవి తప్ప అతను ఇంకేమి తినేవాడు కాదని కాదు, ఇది అతని సాధారణ భోజన ఆలవాటు అని మనం అర్థం చేసుకోవాలి. మిడతలు యూదయ అరణ్యంలో విరివిగా అందుబాటులో ఉండే పురుగులు. ఇవి ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రంలో అనుమతించబడిన ఆహార జాబితాకు చెందినవే (లేవీకాండము 11:22) ఇవి సులువుగా జీర్ణమయ్యే తేలికైన ఆహారం. అందుకే ముసలితనంలో కలిగే ఇబ్బందులను వర్ణిస్తూ మిడత బరువగును అని చెప్పబడింది, అంటేవారు మిడతను తిన్నా అరగదని అర్థం (ప్రసంగి 12:5). అలాగే యూదయలో అడవి తేనె కూడా విస్తారంగా లభించేది (1సమూయేలు 14:26). ఇలా ఎవ్వరికీ భారమవ్వకుండా ఉచితంగా లభించే అతి సాధారణమైన భోజనంతోనే యోహాను సరిపెట్టుకున్నాడు. అతను అందరూ తినే సాధారణ భోజన పద్ధతులకు భిన్నంగా "యోహాను తినకయు త్రాగకయు వచ్చెను" (మత్తయి 11:18) అనే యేసుక్రీస్తు సాక్ష్యానికి తగిన విధంగా తన జీవితాన్ని కొనసాగించాడు.
అయితే ఇలాంటి ఆహారశైలికి లేదా వస్త్రధారణకు ఆధ్యాత్మిక విలువలను అంటకట్టకుండా మనం జాగ్రత్త వహించాలి. ఇలాగే అందరూ జీవించాలని లేదా పరిచారకులందరూ ఈ జీవనశైలిని అవలంభించాలని నేర్పించడం ఈమాటల ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రభువు కానీ ఆయన అపోస్తలులు కానీ ఇతర సువార్త పరిచారకులు కానీ ఇలాంటి జీవన విధానాన్ని అవలంభించినట్టు వాక్యంలో ఎక్కడా నమోదు చెయ్యబడలేదు. సన్యాసత్వపు పద్ధతులకు భిన్నంగా ప్రభువు సాధారణ జీవన శైలినే పాటించినట్టు వాక్యం స్పష్టంగా చెబుతుంది (మత్తయి 11:18-19). దేవుడు ఇలా భిన్నమైన పరిచర్య విధానాల ద్వారా మాట్లాడినప్పటికీ యూదులు మాత్రం మారుమనస్సు లేని అవిశ్వాసులుగానే మిగిలిపోయారు అనే పాఠం తప్ప, ఈ భిన్న శైలులనుండి వేరే అన్వయింపేమీ వాక్యం నేర్పడం లేదు (మత్తయి 11:16-19). కాబట్టి భక్తి జీవితం కోసం సన్యాసత్వపు నిష్ఠ పాటించాలని, పేదరికంలో గొప్ప ఆధ్యాత్మిక కథ ఉందని నేర్పించే రోమన్ క్యాథలిక్ మరియు ఇతర క్రైస్తవ మతశాఖలు బాప్తిస్మమిచ్చు యోహాను జీవనశైలిని ఒక నియమంగా ప్రజలపై రుద్దడం లేఖన సమ్మతం కాదు. అలా అని విలాసవంతమైన జీవనశైలి కొరకు కొందరు విశ్వాసులు మరియు పరిచారకులు చూపించే వెంపర్లాటను, వేసుకున్న వస్త్రాల వెలను బట్టి విశ్వాసులకు విలువకట్టే లోకానుసారమైన సంఘాల్ని బైబిల్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని కూడా మర్చిపోవద్దు సుమా! ( ఎఫెసీ 6:10, యాకోబు 2:1-6).
మత్తయి 3:5 ఆ సమయమున యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి-
యోహాను దేవునిపట్ల కనపరచిన విశేష ధైర్యం, అతని వ్యత్యాసమైన జీవన శైలి, పరిశుద్ధతపై అతనికున్న ఆసక్తి మరియు అతని వినూత్న బాప్తిస్మ సిద్ధాంతం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో మెస్సియా వస్తాడనే నిరీక్షణ ప్రజలలో అత్యధికంగా ఉండడం కారణంగా ఇతనే బహుశా ఆ మెస్సియా కావొచ్చునేమో అనే అనుమానం కూడా అనేకులు ఆయన వద్దకు రావడానికి కారణం అయ్యింది (యోహాను 1:19-27). ఆ నోటా ఈ నోటా అతని గురించిన సమాచారం దేశం అంతా విస్తరించింది. యూదులకు రాజధానిగా ఉన్న యెరుషలేములో మాత్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలూ ఆయన గురించి విని తండోపతండాలుగా తరలి వచ్చారు. యొర్దాను నదీ ప్రాంతాల వారందరు కూడా వచ్చారు అని చెప్పబడింది. బహుశా ఇది "యోర్దాను అవతల" అని చెప్పబడిన అదే ప్రాంతం అయ్యుండవచ్చు (మత్తయి 4:25).
అయితే పైన పేర్కొన్న మూడు ప్రాంతాలవారందరు ఆయన వద్దకు వచ్చారని చెప్పినప్పుడు, యే మినహాయింపు లేకుండా అందరూ వచ్చారని అర్థం కాదు. ఏ వ్యత్యాసం లేకుండా అనగా స్త్రీ-పురుషులు, గొప్ప-బీద, యజమాని-దాసులు, వృద్ధులు-యవ్వనస్తులు తదితర బేధాలు ఏమీ లేకుండా అందరూ ఆయన వద్దకు వచ్చారని అర్థం. ఎందుకంటే ఈ వచ్చినవారందరూ ఆయన చేత బాప్తిస్మం పొందారని తరువాత వచనం స్పష్టం చేస్తుంది. కానీ ఈ ప్రాంతాలకే చెందిన శాస్త్రులు మరియు పరిసయ్యులు ఆయన వద్ద బాప్తిస్మం పొందలేదని మరో చోట స్పష్టం చేయబడింది (లూకా 7:30). కాబట్టి "అందరు" అన్నప్పుడు, ఏ మినహాయింపు లేకుండా అని కాదు, ఏ భేదం లేకుండా అందరు అనే ఈ వివరణను ఇది నిర్థారిస్తుంది.
ఏది ఏమైనా ఒక గొప్ప జనసమూహాన్నే యోహాను పరిచర్య ఆకర్షించింది. దేవుని రాజ్యంలోకి ప్రతివాడూ బలవంతంగా చొరబడేంతగా ఇది ప్రజలను ప్రభావితం చేసింది (లూకా 16:16) ఇంత ఫలవంతమైన సువార్త పరిచర్య జరగడం చరిత్రలో చాలా అరుదు. అయితే అనేకమంది యోహాను దగ్గరకు వచ్చినా అందులో అనేకులు వారి సమర్పణను అంతం వరకు కొనసాగించలేదు. యోహాను వద్దకు వెళ్ళినవారిని ఉద్దేశించి స్వయంగా ప్రభువే చెప్పిన మాటలు గమనించండి. "అతడు మండుచు ప్రకాశించు దీపమయ్యుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంత కాలం ఆనందించుటకు ఇష్టపడిరి" (యోహాను 5:35) అంతకు ముందు వచనంలో "మీరు రక్షించబడుటకు ఈ మాటలు చెప్పుచున్నాను" (యోహాను 5:34) అని ప్రభువు సెలవియ్యడం, కొందరు సంతోషంగా యోహాను పరిచర్యను అంగీకరించి, కొంత కాలం అందులో కొనసాగినప్పటికీ ఇంకా రక్షణ లేని స్థితిలోనే ఉన్నారని సూచిస్తుంది. ఈమాటలను జాగ్రత్తగా గమనించండి. వాక్యానుసారమైన బోధ ఇచ్చే సంఘానికే మనం వెళ్తుండవచ్చు. నమ్మకంగా వాక్యబోధను అందించే పరిచారకుని వద్ద నేర్చుకుంటూ ఉండవచ్చు. ఆ బోధ మనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుండవచ్చు. కానీ ఇవి నిజంగా మనం రక్షించబడ్డామని నిర్థారించడానికి సరిపోవు. ఈ అవకాశాలు మనలను చివరకు క్రీస్తును హత్తుకుని, చివరి వరకూ ఆయనకు చెందినవారిగా జీవించడానికి నడిపించకపోతే ఎవరి వద్దకు వెళ్ళినా ఏం విన్నా ఎన్ని చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. వాక్య పరిచర్యకు ఆకర్షించబడినవారందరూ రక్షించబడినవారు కారు కానీ రక్షించబడినవారందరూ ప్రభువును అంతం వరకు హత్తుకుంటారు. ఈ రోజు ఉండి రేపు అవిరైపోయే ఆసక్తి రక్షణార్థమైన మార్పు కాదు. నమ్మకమైన పరిచారకుల ఆదరణ కొరకు కూడా ఈ మాటలు ఎత్తి చెప్పడం అవసరం. అనేకులు మీరు బోధించిన సత్యంలో నిలకడగా కొనసాగకపోవడాన్ని బట్టి విభ్రాంతి చెందవద్దు. అలాంటి చేదు అనుభవానికి స్త్రీలు కనినవారిలో అతి శ్రేష్ఠుడైన ప్రవక్త పరిచర్య కూడా మినహాయింపు కాదు.
మత్తయి 3:6 తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
యోహాను చేత బాప్తిస్మం పొందినవారు తమ పాపాలనుబట్టి పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా మారుమనస్సు అనుభవంతో ఈ పరిశుద్ధ ఆచారంలో పాలుపొందారు. అలాంటి అనుభవం లేనివారికి యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి నిరాకరించాడని తరువాత వచనాలు స్పష్టం చేస్తున్నాయి. బాప్తిస్మం కేవలం ఒక ఆచారంగా పొందితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ నియమాన్ని మరచిపోయి, సంఘసభ్యత్వానికో పెళ్ళికనో అందరితో పాటు తీసుకోకపోతే బాగుండదనో ఇంకెలాంటి కారణాలను బట్టి తీసుకున్నా అది బాప్తిస్మం కాదు. పాపుల రక్షణ కోరకు క్రీస్తు పొందిన మరణాన్ని, వారిని నీతిమంతులుగా తీర్చడం కొరకు ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేవడాన్ని బాప్తిస్మం సాదృశ్యపరుస్తుంది. అందుకే తమ పాపాల విషయమై మరణించి, సమాధి చెయ్యబడ్డవారు క్రీస్తునందు నూతనత్వంలో జీవిస్తామని ప్రభువుకు తమను తాము సమర్పించుకున్నవారు, అంతరంగంలో జరిగిన ఈ మార్పుకు బహిరంగ సాదృశ్యంగా తీసుకునే పవిత్ర ఆచారమే బాప్తిస్మం (రోమా 6:3-5). ఈ సత్యం యోహాను బాప్తిస్మం ఇస్తున్న సమయంలో మర్మంగా ఉన్నప్పటికీ తమ పాపాలను బట్టి మారుమనస్సు పొందినవారికి మాత్రమే బాప్తిస్మం అనే నియమానికి యోహాను నమ్మకంగా కట్టుబడి పరిచర్య చేసాడు. ఈ రోజు బాప్తిస్మం గురించిన సంపూర్ణ సత్యం తెలిసిన మనం మరింత జాగ్రత్తగా ఈ ఆచారాన్ని పాటించాలి. ఇచ్చేవారికీ పొందేవారికీ బాప్తిస్మం వెనుక ఉన్న నియమాలపై పూర్తి అవగాహన ఉండి, దేవునితో జరిగే ఈ బహిరంగ ఒడంబడికలో యధార్థమైన మారుమనస్సు మరియు విశ్వాసంతో పొందేవారికి మాత్రమే అది బాప్తిస్మం. మిగతావారికి అది కేవలం నీటిలో మునిగిలేవడం మాత్రమే ఔతుంది. దానివల్ల ఆత్మకు కాదు కదా కనీసం శరీరానికి కూడా ఏ ప్రయోజనం ఉండదు.
ఇక యొర్దాను నది గురించి మాట్లాడుకుంటే దీని ప్రవాహం దాను గోత్రపు సరిహద్దుల నుండి ప్రారంభమౌతుంది కాబట్టి దీనికి "యోర్దాను" అనే పేరు ఉందని కొందరు పండితుల అభిప్రాయం. ఇది పడవలూ ఓడలూ సంచరించడానికి అనువైన నదియని యూదుల రచనల నుండి మనం గ్రహిస్తాము. ఈ నది గురించి పాతనిబంధనలో ఎంతో ప్రస్తావించబడింది. అంతే కాకుండా ప్రభువే స్వయంగా ఈ నదిలో బాప్తిస్మం పొందిన కారణాన్ని బట్టి ఈ నదికి ఎంతో పవిత్రతను ఆపాదించడం పరిపాటి. యెరుషలేముకు తీర్థయాత్రలు చేసే కొందరైతే ఈ నదిలో పునఃబాప్తీస్మం కూడా తీసుకుంటారు. అయితే అలా చేసేవారు, బాప్తిస్మం కంటే ఎక్కువ పవిత్రతను ఆ నదికి ఆపాదిస్తున్నారు. అలాంటి కృత్రిమ భక్తికి బైబిల్లో తావు లేదు. ఒకవేళ అలాంటి ప్రాధాన్యత ఏదైనా ఈ నదికి ఉంటే అందరూ యొర్దానులోనే బాప్తిస్మం పొందాలనే నియమం కూడా బైబిల్లో ఉండేది. అయితే అలాంటిది ఎక్కడా లేకపోగా అందుకు భిన్నమైన సాక్ష్యం బైబిల్ లో కనిపిస్తుంది. ఫిలిప్పు సమరయలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు (అపో.కా 8:12), నపుంసకునికి ఏడారిలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు (అపో.కా 8:26, 36), పౌలు దమస్కులో బాప్తిస్మం పొందినప్పుడు (అపో.కా 9:18-19), కైసరయలో కోర్నేలీ ఇంటివారు బాప్తిస్మం పొందినప్పుడు (అపో.కా 10:1, 48), అనేక అన్యుల ప్రాంతాలలో పౌలు మరియు అతని సహచరులు బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు (అపో.కా 16:12-15, 33, 18:8, 19:1, 5), యోర్దానుకు కాదు బాప్తీస్మానికే ప్రాధాన్యతను ఇచ్చి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ బాప్తీస్మాలు ఇచ్చినట్టు చదువుతాము. బాప్తిస్మం ఎక్కడ పొందామన్నది కాదు, ఎలా పొందామన్నాదే అసలు విషయం. బైబిల్ నేర్పించని కృత్రిమ భక్తిని ప్రక్కన పెట్టి, బైబిల్ నేర్పించే నియమాలను పాటించడమే నిజమైన క్రైస్తవ్యం.
మత్తయి 3:7 అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచిసర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
"అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి"
పరిసయ్యులు మరియు సద్దుకయ్యుల ప్రస్తావన వాక్యంలో ఇక్కడ మొదటిసారి కనిపిస్తుంది కాబట్టి, వారు ఎవరో అర్థం చేసుకోవడానికి అవసరమైన కొన్ని వివరాలు పంచుకుంటాను. ముందు పరిసయ్యుల గురించి మాట్లాడుకుంటే ఈ తెగ ఎప్పుడు ప్రారంభమయ్యిందో దాని వ్యవస్థాపకుడు ఎవరో చెప్పడం సులభం కాదు. అయితే ప్రభువు పరిచర్య చేసే సమయానికి వీరు బాగా గుర్తింపు మరియు పలుకుబడి సంపాదించుకున్న ఒక వర్గంగా స్థిరపడి మత, రాజకీయ మరియు సామాజిక రంగాలలో ఎంతో ప్రభావాన్ని మరియు ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. పరిసయ్యులు అనే పేరు "పెరెసు" అంటే "బేధించుకుని వచ్చుట" (ఆదికాండము 38:28-29) అనే మాట నుండి వచ్చింది. వీరు సాధారణ ప్రజలతో అన్ని విషయాలలోనూ విబేధించి వారికి భిన్నంగా ఉంటూ వారి నుండి తమను తాము ప్రత్యేకించుకుని, అధిక భక్తి ప్రదర్శిస్తూ అందరికీ మించిన పరిశుద్ధతను తమకు తామే ఆపాదించుకుని వేరుగా ఉండడం కారణంగా వారికి ఈపేరు పెట్టబడింది. రానురానూ ఇది స్వనీతికీ ఆధ్యాత్మిక గర్వానికీ అతిశయానికీ మారుపేరయ్యింది. వీరు దేవుని వాక్యానికి అధనంగా వారి స్వీయ నియమాలను కల్పించుకుని, వాటిని దైవోపదేశంతో సమానంగా పాటిస్తూ అలా చెయ్యనివారిపై వివక్ష మరియు చిన్నచూపు కలిగియుండేవారు. వీరి వేషధారణ మరియు కృత్రిమమైన భక్తి గురించి మత్తయి సువార్త 5-7,15,19,21-23 తదితర అధ్యాయలలో మరింత ప్రస్ఫుటంగా తెలుసుకోగలం. మతాధిపత్యం చాలదన్నట్టు రాజకీయ వ్యవహారాలలో కూడా వీరి జోక్యం అంతా ఇంతా కాదు. యూదా చరిత్రకారుడైన జోసెఫస్ అలెగ్జాండ్రియా రాణి గురించి మాట్లాడుతూ "ఆమె ఇతరులను పరిపాలిస్తే వీరు (పరిసయ్యులు) ఆమెను పరిపాలించేవారు" అని పేర్కొన ఒక సందర్భాన్ని డా. జాన్ గిల్ తన మత్తయి 3:7 వ్యాఖ్యానంలో ప్రస్తావించాడు. ప్రభువు మరణ సమయంలో యాజకులతో కలిసి పిలాతు మీద వీరు తెచ్చిన ఒత్తిడి వీరి రాజకీయ పలుకుబడికి ఒక తార్కాణం.
ఇక సద్దూకయ్యుల విషయానికొస్తే వీరు సాదోక్ అనే ఒక మతగురువు అనుచరులు. అందుకే వారికి సద్దూకయ్యులు అనే పేరు పెట్టబడింది. ఈ సాదోకు యాంటీగోనస్ అనే ఒక మత గురువు వద్ద శిష్యరికం చేసాడు. యాంటిగోనస్ తన శిష్యులకు చేసిన బోధలలో ఒక ప్రత్యేక బోధ సాదోకు గమనాన్ని ఆకర్షించింది. "ప్రతిఫలం కొరకు కాకుండా ఏ ప్రతిఫలం కోరకుండా మీ యజమానికి సేవ చేసే వారయ్యుండండి. మీరు దేవుని భయం కలిగినవారైయుండండి" అని అతను బోధించాడు. ఈ మాటలను సాదోక్ మరియు బైతుస్ అనే అతని శిష్యులు అపార్థం చేసుకుని, ఈ జీవితానంతరం ఇక ప్రతిఫలాలు, శిక్షావిధులు ఇవేవీ ఉండవు అనే సిద్ధాంతాన్ని తయారుచేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇంకా అనేక వాక్య వ్యతిరేక బోధనలను వారి ఈ నూతన విశ్వాస విధానంలో కలుపుకున్నారు. విశ్వాసం అనేదేమీ లేదని, అంతా మనిషి స్వేచ్ఛాయుత నిర్ణయంపై ఆధారపడియుంటుందని, శరీరంతో పాటు ఆత్మ కూడా చనిపోతుందని, మృతుల పునరుత్థానం అనేదేమీ ఉండదని, ఆత్మ, దేవదూతలు అనేవి కూడా లేవని, ఇలా ఎన్నో వాక్య వ్యతిరేక బోధనలను వీరు ప్రారంభించారు. వీరి అనుచరులు సద్దూకయ్యులు అని కానీ బైతుశీయులు అని కానీ పిలువబడ్డారు. వీరి నమ్మకాలలో కొన్నిటి ప్రస్తావన మత్తయి 22:23-33 మరియు అపోస్తలుల కార్యములు 23:8 లో చూస్తాము.
ఈ రెండు తెగలకు సంబంధించినవారిలో అనేకులు బాప్తిస్మం పొందాలని యోహాను వద్దకు వచ్చారు. కానీ వీరి నేపథ్యాలు, బోధలు మరియు వైఖరి బాగా తెలిసిన యోహాను, వారికి బాప్తిస్మం ఇవ్వడానికి త్వరపడలేదు. మారుమనస్సు పొందినవారికి మాత్రమే బాప్తిస్మం. అది లేనప్పుడు ఊరికే ఎవరినైనా నీటిలో ముంచి తీయడం యోహానుకు అప్పగించబడిన పరిచర్య కాదు. ఎలాగూ వచ్చేసారు కాబట్టి ముందు పని కానిచ్చేద్దాం అనే తొందర యోహానుకు అస్సలు లేదు. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు తాము జన్మతః పరలోక రాజ్యానికి హక్కుదారులు అని నమ్మే స్వనీతిపరులు అని తర్వాత వచనాలలో మనకు అర్థం ఔతుంది. అందుకే యోహాను వారి పతన, పాప, భ్రష్ట స్థితిని వారు గుర్తెరిగి, మనసు మారి దేవుని తట్టు తిరగడానికి అవసరమైన హెచ్చరికలను బాధ్యతగా ధైర్యంగా మరియు యథార్థతతో వారికి వినిపించాడు.
"సర్ప సంతానమా"
గౌరవ మర్యాదలు, అగ్రస్థానాలకు మాత్రమే అలవాటుపడిన ఈ మతగురువులకు యోహాను చేసిన ఈ సంబోధన అస్సలు మ్రింగుడు పడకపోవొచ్చేమో కానీ నిర్మొహమాటంగా నిజం చెప్పడమే యోహానుకు అప్పగించబడిన పరిచర్య. వారు అబ్రాహాము సంతానం కాబట్టి పరలోకరాజ్యానికి వారే హక్కుదారులని ఇతరుల ముందు చలామణి ఔతూ తమ సొంత మనఃసాక్షిని కూడా మోసగించుకుంటున్న వీరికి ఇది ఎంతో అవసరమైన హెచ్చరిక. ఇలా మాట్లాడటం క్రైస్తవ ప్రేమ కాదని, సర్పసంతానం అని పిలవడం దేవుని స్వరూపంలో చెయ్యబడిన మనుష్యులను కించపరచడం ఔతుందని ఈ రోజు కొందరు అంటుంటారు. మాట కఠినమైనంత మాత్రాన అది ప్రేమరాహిత్యం అనుకోవడం సరి కాదు (సామెతలు 27:6). చేదు మందు చికిత్సకు అవసరమైనట్టే గద్దింపు ఆధ్యాత్మిక మేల్కొలుపుకు అవసరం. మనిషి పశుప్రాయునిగా మారినప్పుడు దానిని ఎత్తి చూపించకపోతే తాను దేవుని స్వరూపంలో చెయ్యబడ్డాడని, అందుకు తగిన విధంగా జీవించడం లేదని ఎలా తెలుసుకుంటాడు? అందరిలా వారికి పెద్దపీట వేసియుంటే వారి వల్ల యోహానుకు ఎంతో కొంత ప్రయోజనమే కలిగియుండేది. కానీ అతడు మనుష్యులనుండి కలిగే ప్రయోజనాల కొరకు కాదు, దేవుడు ఆమోదించే పరిచర్యకు యథార్థంగా కట్టుబడి, వారికి మారుమనస్సు కలిగించడానికి సహాయపడే మాటలు సెలవిస్తున్నాడు. ఈ మాటలతోనే తరువాత ప్రభువు కూడా వీరిని గద్దించినట్టు మనం చదువుతాం (మత్తయి 12:34, 23:33). "సర్పసంతానమా" అని పిలవడం ద్వారా వారు దుష్టుని సంబంధులని (ఆదికాండము 3:15), నిలువెల్లా విషంతో నిండిన వీరు అబ్రాహాము వారసత్వానికి ఎంతమాత్రం హక్కుదారులు కాదని వారిని యోహాను హెచ్చరిస్తున్నాడు. వారిని అపవాది సంతానమని తరువాత ప్రభువు సంబోధించడం ఈ భావాన్ని నిర్ధారిస్తుంది (యోహాను 8:44).
"రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు?":
ఉగ్రత రాబోతుంది అన్నది నిజమే. కానీ భక్తి ప్రదర్శించే పరిసయ్యులు వారి మీదకు అలాంటిదేదీ రాదని అతిశయిస్తుంటారు. భక్తివిరోధ బోధలు చేసే సద్దూకయ్యులు, అలాంటిదేమీ ఉండదనే భ్రమలో ఉంటారు. అలాంటి వీరు ఆ ఉగ్రతకు అలా ఎందుకు భయపడుతున్నారు? దానిని తప్పించుకోవడానికి ఇక్కడికి రావాలని వారిని ఎవరు మేల్కొలిపారు? ఈ ఆశ్చర్యాన్ని వారి ముందు వ్యక్తపరుస్తూ వాస్తవానికి వారు అలాంటి దైవిక భయంతో అక్కడికి రాలేదని, వారి అంతరంగంలో నిజానికి ఎలాంటి మార్పు లేదని ఈ మాటల భావం. అదే నిజమని మనం ముందుకు చదివినకొద్దీ అర్థం ఔతుంది. కానీ అదే నిజమైతే వారు యోహాను దగ్గరకు ఎందుకు వచ్చారు అనే ప్రశ్న మనకు రావొచ్చు. అది ఊహించడం కష్టమేమీ కాదు. ప్రజలందరూ యోహానును ప్రవక్తగా అంగీకరించి, ఆయన బోధకూ బాప్తీస్మానికీ లోబడ్డారు. యోహానును ఆమోదిస్తే ప్రజాధారణ కోల్పోకుండా మతగురువులు తమ పరపతిని కాపాడుకోగలరు (మత్తయి 21:25-26). నిజానికి వారు యోహాను ద్వారా బయలుపరచబడిన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు (లూకా 7:30).
"మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి"
వారు నిజంగా మారుమనస్సు కలిగి, దేవునితో సమాధానపడి, ఆయన సంకల్పించిన బాప్తిస్మానికి హృదయపూర్వకంగా లోబడే ఆలోచనతోనే వచ్చియుంటే, అందుకు తగిన ఫలం ఫలించాలని, అంటే అలాంటి మార్పును బాహాటంగా కనపరచే క్రియలను చూపించి వారి యథార్థతను రుజువు చేసుకోవాలని యోహాను మాటల భావం. ఎందుకంటే మారుమనస్సు అనేది ఎవ్వరూ చూడలేని, ఎవ్వరికీ చెప్పుకోలేని ఏదో వింత అనుభూతి కాదు. మారుమనస్సు కలిగినప్పుడు దానికి తగిన ఫలం కనిపిస్తుంది. ఆ ఫలం: పాపం నుండి దేవుని వైపుకు, స్వనీతి నుండి దేవుని క్షమాపణ వైపుకు, భక్తి ప్రదర్శన నుండి పరిశుద్ద జీవితం వైపుకు తిరగడమే. అంతరంగంలో జరిగే మారుమనస్సు అనుభవానికి ఇవి బాహ్యరుజువులు. ఈ మార్పునే యోహాను "మారుమనస్సుకు తగిన ఫలం" అంటున్నాడని అతని బోధలన్నీ పరిశీలించినప్పుడు (లూకా 3:10-19), అలాగే తరువాత అపొస్తలులు మారుమనస్సును గురించి తెలియచేసిన నిర్వచనాన్ని (అపొ. కా 26:18-20) గ్రహించినప్పుడు మనకు అర్థం ఔతుంది. అలాంటి మార్పుకు సమర్పించుకోకుండా ఇతరేతర కారణాలను బట్టి వచ్చిన ఎవరికైనా బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను నిరాకరించాడు. పేతురు ప్రకటనలో కూడా మొదట మారుమనస్సుకు పిలుపు, ఆ తర్వాతే బాప్తిస్మానికి ఆహ్వానం కనిపిస్తాయి (అపొ. కా 2:38). ఈ నియమాన్ని మరియు క్రమాన్ని బాప్తిస్మము ఇచ్చేవారూ పొందేవారూ సదా జ్ఞాపకం ఉంచుకోవాలి.
మత్తయి 3:8,9 అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు. దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
"అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు":
అబ్రాహాము సంతానం అయ్యుండడం కారణంగా వారు దేవుని ఆశీర్వాదాలు అన్నిటికీ సహజవారసులు అని యూదులు, మరిముఖ్యంగా వారి మతగురువులు గర్వించేవారు. వారి పాపస్థితిని బట్టి వారు అపవాది సంబంధులని వారిని ఒప్పించే ప్రయత్నం ఎవరు చేసినా అందుకు అభ్యంతరంగా "మేము అబ్రాహము పిల్లలం" అని వాదించేవారు (యోహాను 8:33). వారికున్న ఈ వైఖరి బాగా తెలిసినవాడిగా యోహాను వారిని హెచ్చరిస్తున్నాడు. మారుమనస్సు పొందడం తప్ప మరేదీ వారిని దేవుని రాజ్యవారసులుగా చెయ్యలేదు. మారుమనస్సు తప్ప మరేదీ వారిని రాబోవు ఉగ్రత నుండి తప్పించదు. అబ్రాహాముకు పుట్టినవారందరు అబ్రాహాము వాగ్దాన సంతానం కాదని వారి లేఖనాలు చెప్పిన సత్యాన్ని వారు గ్రహించియుంటే (ఆదికాండము 21:12, యెషయా 10:22-23), యోహాను చేస్తున్న ఈ హెచ్చరిక వారికి వింతగా అనిపించియుండేది కాదు. అబ్రాహాముకు పుట్టినంతమాత్రాన ఎవ్వరూ అబ్రాహాము వాగ్దానానికి వారసులు కాలేరు కాబట్టి అలాంటి తలంపులు మానుకుంటే మారుమనస్సు అవసరాన్ని వారు మరింత బాగా గుర్తించగలరు అన్నది యోహాను హెచ్చరికలో ఉన్న ఉద్దేశం. ఇదే సత్యాన్ని ప్రభువు కూడా నిర్థారించాడు. "మా తండ్రి అబ్రాహాము" అని ఆయనతో వాదించిన యూదులకు ప్రభువు చెప్పిన సమాధానంలో ఇదే ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. "మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము క్రియలు చేతురు" అని ప్రభువు వారికి సెలవిచ్చాడు (యోహాను 8:39). ఇప్పుడు యోహాను కూడా అదే చెబుతున్నాడు. వారు చేసేవి అబ్రాహాము క్రియలు కాదు కాబట్టే వారు మారుమనస్సు పొందవలసిన అవసరం ఉంది. అబ్రహాము చేసిన విశ్వాస సంబంధమైన క్రియలే తప్ప స్వనీతి క్రియలు దేవునికి అంగీకారం కావు. కాబట్టి స్వనీతిపరులైన వీరు మారుమనస్సు పొందనిదే అబ్రాహాము సంతానం కాలేరు.
మారుమనస్సుకు దేవుని వాక్యం ఇచ్చే పిలుపును అడ్డగించే ఇలాంటి స్వీయసమర్థనలు ఎన్నో మానవులలోని పతన స్వభావం వారికి నేర్పిస్తుంది. సువార్తపరిచారకులు వీటిని గుర్తించి వాటిపై ఆధారపడేవారిని మేల్కొలపాలి. వాటిపై వారికున్న నమ్మకాన్ని ధ్వంసం చెయ్యాలి. "మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాం", "మాది పాస్టరుల, పరిచారకుల వంశం", "మేము పుట్టు(క) క్రైస్తవులం" లాంటివి, మారుమనస్సు అనుభవానికి ప్రత్యమ్నాయంగా చెప్పుకునేవారిని చూసినప్పుడు యోహాను చేసిన ఈ హెచ్చరిక జ్ఞాపకం తెచ్చుకోవాలి. వారిని అలాంటి ఆలోచనల నుండి క్రీస్తునందు మాత్రమే లభించే రక్షణ వైపు తిప్పాలి. "అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు". మీ మొదటి జన్మకు ఒకవేళ అబ్రాహాము అంతటివాడే మూలమైనప్పటికీ "శరీర మూలముగా పుట్టినది శరీరం" మాత్రమే (యోహాను 3:6). పరిశుద్ధాత్మ మూలంగా కలిగే రెండవ జన్మ మాత్రమే ఎవరినైనా దేవుని రాజ్య సంబంధులుగా అబ్రాహాము వాగ్దానానికి వారసులుగా చేస్తుంది. "మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమయ్యుండి, వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు" (గలతీ 3:29). ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించేలా చెయ్యడమే ఒక సువార్త పరిచారకుని బాధ్యత. ప్రియ చదువరి నీవు దేవుని రాజ్యానికి వారసుడవని విశ్వసిస్తే ఆ విశ్వాసానికి ఆధారం ఏంటో పరిశీలించుకో. క్రీస్తునందలి విశ్వాసం మరియు మారమనస్సు కాకుండా మరేది నీ నిరీక్షణకు ఆధారమైనా నీ విశ్వాసం వ్యర్థమే, నీ రక్షణ నిశ్చయత వట్టి బూటకమే.
"దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను"
"అబ్రాహాముకు పిల్లలను పుట్టించడం" అనే మాట, చనిపోయిన ఒకని పేరు, లేదా వారసత్వం నిలబెట్టడం కోసం అతని కొరకు సంతానాన్ని కలుగచేసే యూదుల సాంప్రదాయం నుండి తియ్యబడింది (ఆదికాండము 38:8, ద్వితియోపదేశకాండము 25:7, రూతు 4:10). "దేవుడు అబ్రాహాము సంతానానికి చేసిన వాగ్దానం మాలో కాకపోతే ఇంకెలా ఇంకెవరిలో నేరవేర్చుకోగలడు? కాబట్టి దేవుని రాజ్యం మాకే చెందుతుంది" అన్నది ఈ యూదుల ధీమా. అయితే తన వాగ్దానాన్ని నేరవేర్చుకోవడానికి దేవుడు వారిపై ఎంతమాత్రం ఆధారపడి లేడని, ఆయన తలచుకుంటే రాళ్ళనుండి సైతం అబ్రాహాముకు సంతానాన్ని కలుగచేసి తన వాగ్దానాన్ని నేరవేర్చుకోగలడని దేవుని శక్తిని వారికి యోహాను గుర్తు చేస్తున్నాడు.
రాళ్ళు అంటే యూదేతరులైన అన్యులని, ఎందుకంటే వారు రాతి హృదయం కలిగి రాళ్ళను, రప్పలను మ్రొక్కేవారని యూదుల స్థానంలో దేవుడు అన్యుల నుండి కూడా అబ్రాహాముకు సంతానాన్ని కలుగచెయ్యగలడని చెప్పడమే యోహాను హెచ్చరికలో ఉన్న అంతరార్థం అని కొందరి అభిప్రాయం. యోహాను ఈ మాటలు చెబుతున్నపుడు అన్యులైన రోమా సైనికులు కూడా అక్కడుండే అవకాశం ఉంది కాబట్టి (లూకా 3:14), "ఈ రాళ్ళు" అని అక్కడ ఉన్న అన్యులను ఉద్దేశించే అలా అని ఉండవచ్చని వారి వాదన. అలాగే దేవుడు తర్వాత యూదుల స్థానాన్ని భర్తీ చేసే అబ్రాహాము సంతానంగా అన్యులకు అవకాశం ఇచ్చాడు అనేది కూడా కాదనలేని వాస్తవమే. కానీ ప్రత్యమ్నాయాలను సృష్టించుకోవడంలో దేవుని అపరిమిత శక్తిని వారికి జ్ఞాపకం చెయ్యడమే ప్రస్తుత సందర్భంలో యోహాను ఉద్దేశం కాబట్టి, అక్షరాలా రాళ్ళ నుండి కూడా దేవుడు ఆ కార్యాన్ని చెయ్యగలడనే భావంలోనే బహుశా అతను ఈమాటలు చెప్పియుండవచ్చు. ఈ విధంగా దేవుని అపరిమిత శక్తిని జ్ఞాపకం చేసుకునే విధానం యూదుల సాధారణవాడుక అయ్యుండవచ్చు. ఎందుకంటే ప్రభువు కూడా ఒక సందర్బంలో వారిని అలాంటి మాటలతోనే హెచ్చరించినట్లు చదువుతాము (లూకా 19:40). మట్టి నుండి మనిషిని నిర్మించినవానికి, శూన్యం నుండి సమస్తాన్నీ కలుగచేసినవానికి, రాళ్ళనుండి అబ్రాహాముకు సంతానం కలుగచెయ్యడం పెద్ద విషయమేమి కాదు కాబట్టి వారు కాకపోతే ఇంకెవర్లోనూ ఏ విధంగానూ దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని నేరవేర్చుకోలేడనే యూదుల ధీమాను యోహాను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నవారు దేవునిపై ఆధారపడి రక్షణ పొందుతారు తప్ప తన ప్రణాళికను నెరవేర్చుకోడానికి దేవుడు ఎవ్వరిపై ఆధారపడి లేడు.
మత్తయి 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
దేవుని ఉగ్రత కింద నాశనం అవ్వబోయే రాజ్యాలను, జాతులను లేదా వ్యక్తులను, ఇలాంటి అలంకార భాషతో హెచ్చరించడం, అనేక పాతనిబంధన ప్రవక్తల మాటలలో తరచుగా గమనిస్తాం (యిర్మియా 46:22-23, యెహెజ్కేలు 31:3,11-12). ఇశ్రాయేలు నాశనం కూడా అతి సమీపంలో ఉందని, మారుమనస్సు పొంది దేవునితో సమాధానపడితే తప్ప వారు ఆ ఉగ్రతనుండి తప్పించుకోలేరని యోహాను ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇదే ఉగ్రత గురించి తరువాత ప్రభువు కూడా పలు సందర్బాలలో వారిని హెచ్చరించాడు (మత్తయి 21:43, లూకా 13:6-9). అయినా ఆ హెచ్చరికలను బేఖాతరు చేసిన కారణాన్ని బట్టి చివరికి దేవుడు వారి మీదకు ఆ న్యాయ తీర్పు రప్పించాడని అపోస్తలుడైన పౌలు నిర్థారించాడు (రోమా 11:20-21). క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీయుల చేత ఇశ్రాయేలు దేశం నాశనం చెయ్యబడి, దేవుని ఆలయం ద్వంసం కాబడి, ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడి, దేవుని సన్నిధి నుండి వారు వెలివెయ్యబడడం ద్వారా ఈ దైవోగ్రత లోకం ముందు బహిరంగంగా ప్రదర్శించబడిందని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది.
మారుమనస్సు పొందనివారందరికీ ఇది దేవుని హెచ్చరిక. ఫలం ఫలించని ప్రతీచెట్టూ ఇంధనానికే తప్ప మరెందుకూ పనికిరాదు. ప్రతీచెట్టూ అన్నప్పుడు ఈ హెచ్చరిక ఇశ్రాయేలీయులకో లేదా ఎదో ఒక వర్గం వారికో పరిమితం కాదు, మారుమనస్సు లేని ప్రతి ఒక్కరూ దేవుని ఉగ్రత కింద ఉన్నారని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అన్నప్పుడు, యే క్షణమైన ఆ చెట్టు నరికి వెయ్యబడే ప్రమాదానికి లోనయ్యుందని అర్థం. ఇప్పుడే ఈ క్షణమే దేవుని తీర్పు మారుమనస్సు లేని నీపైకి రాగలదు. ఆ గొడ్డలి తడవు చెయ్యడానికి కేవలం నరుకువాని దీర్ఘశాంతం ఒక్కటే కారణం. కానీ ఆ దీర్ఘశాంతం ముగిసే రోజు వస్తుంది. ఇప్పుడు నీతో వాదించే దేవుని ఆత్మ ఇక వాదించడు (ఆదికాండము 6:3) ఇప్పుడు నిన్ను గద్దించే సువార్త స్వరం ఇక వినిపించదు. అందుకు లోకాంతం వరకు ఎదురు చూడనవసరం లేదు. నీ అంతం అంతకుముందే రావొచ్చు యే క్షణమైనా రావొచ్చు. ఇప్పుడే రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. దేవుని తట్టుకు నువ్వు తిరగకపోతే అది నిన్ను నరకడం ఖాయం.
మత్తయి 3:11 మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
"మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను"
ఈ మాటలు చదివేటప్పుడు రెండు అపార్థాలను తొలగించుకోవడం అవసరం. మొదటిగా ఇక్కడ యోహాను పరిసయ్యుల మరియు సద్దుకయ్యులతో మాట్లాడుతూ నేను మీకు బాప్తీస్మం ఇస్తున్నాను అని అంటున్నాడు. అంతమాత్రాన ఆ మతగురువులకు కూడా యోహాను బాప్తీస్మం ఇచ్చాడని దీని భావం కాదు. ఎందుకంటే వారు ఆయన చేత బాప్తిస్మం పొందడానికి నిరాకరించారని వాక్యం స్పష్టం చేస్తుంది (లూకా 7:30). నిజానికి వారితో మాట్లాడుతున్న ఈ మాటలు ఆయన జనసముహాన్ని కూడా ఉద్దేశించి పలికాడని లూకా తెలియచేస్తున్నాడు (లూకా 3:7). కాబట్టి ఈ మతగురువులు కూడా బాప్తిస్మం తీసుకున్నారనే భావంలో యోహాను ఈ మాటలు చెప్పలేదని స్పష్టమౌతుంది.
రెండవదిగా; "మారుమనస్సు నిమిత్తం బాప్తిస్మం" అనే మాటలను పట్టుకుని, యోహాను మారుమనస్సు కలిగించడం కొరకు బాప్తిస్మం ఇచ్చాడని అర్థం చేసుకోకూడదు. వారు మారుమనస్సు పొందిన కారణాన్ని బట్టి, లేదా వారి మారుమనస్సు ఆధారంగా బాప్తీస్మం ఇచ్చాడనే అర్థం చేసుకోవాలి. ఒకవేళ మారుమనస్సును పుట్టించేది బాప్తిస్మమే అయితే మారుమనస్సు లేకుండా తన వద్దకు వచ్చిన ఆ మతగురువులను గద్దించడం ఎందుకు? బాప్తీస్మం ఇచ్చేస్తే వారికి మారుమనస్సు వచ్చేసి ఉండేది కదా? విషయం ఏంటంటే ఇక్కడ "నిమిత్తం" అని అనువదించబడిన "εἰς" అనే గ్రీకు మూలపదాన్ని "కొరకు, బట్టి, కారణాన, ఆధారంగా" ఇలా పలు విధాలుగా అనువదించవచ్చు. సందర్భాన్ని బట్టి అనువాదంలో ఏ పదం వాడాలో నిర్ణయించుకోవాలి. ఇక్కడ సందర్భంలో చూస్తే యోహాను మారుమనస్సుతో తమ పాపాలు ఒప్పుకున్నవారికే బాప్తిస్మం ఇచ్చి (మత్తయి 3:5), అది లేనివారికి బాప్తిస్మం నిరాకరించాడు (మత్తయి 3:7) కాబట్టి "మారుమనస్సును బట్టి" లేదా "మారుమనస్సు ఆధారంగా" అనేవే ఇక్కడ సరైన అనువాదాలు.
"అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు":
యేసుక్రీస్తు ప్రభువునే ఉద్దేశించి యోహాను ఈ మాటలు చెప్పాడని తరువాత వచనాలలో స్పష్టమౌతుంది. ప్రభువు తన పరిచర్యను దాదాపు 30 సంవత్సరాల వయస్సులో ప్రారంభించాడు (లూకా 3:23). అది ధర్మశాస్త్రంలో బహిరంగ పరిచర్య కొరకు నిర్ణయించబడిన వయస్సు కావడం చేత (సంఖ్యాకాండము 4:3) యోహాను కూడా అదే వయస్సులో పరిచర్య ప్రారంభించి ఉండాలి. అలా అయితే ప్రభువు కంటే 6 నెలల ముందు యోహాను పరిచర్య ప్రారంభించాడు (లూకా 1:36). ప్రభువుకు ముందుగా ఆయన మార్గం సిద్ధపరచేవానిగా యోహాను పంపబడ్డాడు (మలాకి 3:1-2). ఈ కారణాన్ని బట్టి " నా వెనుక వచ్చుచున్నవాడు" అని ప్రభువును సంబోధిస్తున్నాడు.
అయితే ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే యోహాను ప్రభువును తనకంటే శక్తిమంతుడని పరిచయం చేస్తున్నాడు. యోహాను కూడా గొప్ప శక్తిగలవాడే. "అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు" అని "ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును" అని యోహాను గురించి రాయబడింది (లూకా 1:15,17). కానీ తనకంటే శక్తిమంతుడని తన ప్రభువును యోహాను పరిచయం చేస్తున్నాడు. "స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు" (మత్తయి 11:11) అని స్వయంగా ప్రభువే సాక్ష్యమిచ్చిన యోహాను, తన ప్రభువు ఎదుట తాను ఎంత అల్పుడో తనకంటే ప్రభువు ఎంత గొప్పవాడో గుర్తించి దానిని ఒప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఎందుకుంటే ప్రజలను మారుమనస్సుకు నడిపించి వారికి బాప్తిస్మం ఇవ్వడం యోహానుకు ఇవ్వబడిన దీవెనకరమైన పరిచర్య అయినప్పటికీ అంతవరకే పరిమితమైన యోహాను పరిచర్య దేవుని రక్షణ ప్రణాళికను సంపూర్ణం చెయ్యదు. యోహాను బాప్తిస్మం ఒక్కటే దేవుని రాజ్యస్థాపనకు సంపూర్ణత చేకూర్చదు. అంతకు మించింది, అంతకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన వేరొక కార్యం అవసరం. ఆ శక్తివంతమైన రక్షణ కార్యాన్ని నిర్వహించబోయే ప్రభువునకు మార్గం సిద్ధపరచడమే యోహానుకు అప్పగించబడిన పరిచర్య. తన పరిచర్య ఇంతకే పరిమితమని, అయితే తన వెనుక వచ్చువాడు దేవుని రక్షణ కార్యాన్ని, ఆయన శిక్షావిధిని పుర్తిగా అమలు చేస్తాడు కాబట్టి, తన వల్ల మారుమనస్సుకు నడిపించబడి బాప్తిస్మం పొందినవారు ఆయన వైపు చూసి రక్షించబడాలని ఇక్కడ యోహాను ఉద్దేశం. ఇలా ప్రభువును పరిచయం చేసి యోహాను తన పరిచర్యను నమ్మకంగా నిర్వర్తించాడు.
"ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను"
ఎంతో ప్రజాధారణ పొందిన ప్రచారకుడిగా యోహానుకు తన గొప్పతనాన్ని చాటుకునే అవకాశం ఎంతైనా లేకపోలేదు కానీ యోహాను దేవుని నమ్మకమైన దాసుడు. ఆయన తనను తాను ఘనపరచుకోవడానికి కాదు, తన ప్రభువును ఘనపరచుకోవడానికి తనను తాను సమర్పించుకున్నాడు. అయితే ప్రభువు చెప్పులు కూడా మొయ్యడానికి తనకు అర్హత లేదని పలికింది తన తగ్గింపును ప్రదర్శించడానికి ఊరికే చెప్పిన అతిశయోక్తి కాదు. "ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని" అని యోహాను పలు సందర్బాలలో పలువిధంగా ధ్వనించిన వైఖరి, వట్టి నిస్వార్థ సేవ దృక్పథం నుండి పుట్టిన ధోరణి కాదు. నిజంగా ప్రభువు గొప్పతనాన్ని, శక్తిని, గ్రహించినవారు, యథార్థమైన హృదయంతో యోహాను వలే తమను తాము తగ్గించుకుని, ఆయనను మాత్రమే హెచ్చించే పరిచర్య చేస్తారు. అందుకు కారణం కూడా యోహానే తెలియచేసాడు. యోహాను మొదలుకుని, ప్రభువు సేవకులందరు, ఆయన చేసే రక్షణ కార్యాన్ని, అమలు చెయ్యబోయే శిక్షావిధిని ప్రచురించేవారిగా మాత్రమే పంపబడ్డారు. అయితే వారు ప్రకటించే ఆ కార్యాలను చెయ్యగల సమర్థుడు మరియు నిజంగా వాటిని చేసేవాడు ప్రభువు ఒక్కడే. ఇంతకూ యోహాను ఎందుకు ఆయనను అంత శక్తిగలవాడని పరిచయం చేస్తున్నాడు? ఆయన చెయ్యబోయే ఏ కార్యాలను బట్టి యోహాను ఆయన శక్తివంతుడని ప్రకటించాడు?
"ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును"
యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చాడు. కాని తాను ఎవరిని ఇశ్రాయేలీయులకు పరిచయం చెయ్యడానికి పంపబడ్డాడో, ఆయన పరిశుద్ధాత్మలోను, అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. యోహాను ఆయనను తనకంటే శక్తిమంతుడని పరిచయం చెయ్యడానికి కారణం ఇదే. యెహోవా తన ప్రజలందరిపై పరిశుద్ధాత్మను కుమ్మరించబోతున్నాడని, ఆ మేరకు ఒక కొత్త నిబంధన ఆయన తన ప్రజలతో చేస్తాడని పాతనిబంధనలో అనేక ప్రవచనాలు కనిపిస్తాయి (యిర్మియా 31:31, యోవేలు 2:27-32). అదే విధంగా యెహోవా తన నిబంధనకు లోబడని తన శత్రువులకు తీర్పరిగా ఉండి వారిని నాశనం చెయ్యబోతున్నాడని కూడా పలు సందర్భాలలో లేఖనాలు ప్రవచిస్తున్నాయి (యెషయా 63:1-6). అయితే ఈ రెండు ప్రవచనాలు నేరవేర్చబోయేది తన వెనుక వచ్చుచున్నవాడే అనగా యేసుక్రీస్తు ప్రభువే అని యోహాను ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారని, ఆయన చేతనే లోకానికీ శిక్షావిధి కూడా రాబోతుందని ఇక్కడ యోహాను స్పష్టం చేస్తున్నాడు.
ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ప్రభువు ఇచ్చే రెండు బాప్తీస్మాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మొదటిది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, రెండవది, అగ్నితో బాప్తిస్మం. ఈ రెండు ఒక్కటే అని, పరిశుద్ధాత్మను పొందే అనుభవాన్ని ఇక్కడ అగ్ని బాప్తిస్మం అని కూడా పిలిచారని అనేకులు భావిస్తారు. పరిశుద్ధాత్మ కల్మషాన్నీ దోషాన్నీ దహించివేసే ఆత్మగా పిలవబడ్డాడు కాబట్టి (యెషయా 4:4), ఆయన సంఘం పైకి మొదట దిగినప్పుడు అగ్ని జ్వలల వంటి నాలుకల రూపంలో వచ్చాడని చెప్పబడింది కాబట్టి (అపో. కా 2:2-3), ఇక్కడ "పరిశుద్ధాత్మ బాప్తిస్మం" అన్నా "అగ్ని బాప్తిస్మం" అన్నా ఒక్కటే అని చాలా మంది పొరబడుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినవారిలో జరిగే పరిశుద్ధపరచబడే ప్రక్రియను దహించు అగ్ని చేసే శుద్ధీకరణతో పోల్చినంతమాత్రాన (మలాకీ 3:2-3), పరిశుద్ధాత్మ బాప్తీస్మం మరియు ఆయన శుద్ధి చేసే కార్యం ఈ రెండు ఒక్కటే అనుకోవడం సరి కాదు. అలాగే పరిశుద్ధాత్మ ఒక సందర్భంలో అగ్నిజ్వాలల వంటి నాలుకల రూపంలో దిగివచ్చినంత మాత్రాన అగ్ని బాప్తీస్మం అంటే పరిశుద్ధాత్మ బాప్తీస్మమే అనుకోవడం కూడా సరి కాదు. ఎందుకంటే ఆయన వేరొక సందర్భంలో పావురం ఆకారంలో దిగివచ్చినట్టు చదువుతున్నాము (లూకా 3:22). కాబట్టి ఆయన ప్రత్యక్షమైన రూపానికి ముడిపెట్టి అగ్ని బాప్తిస్మాన్ని నిర్వచించే ప్రయత్నం వాక్యానుసారమైనది కాదు.
ఇక్కడ యోహాను రెండు వేరు-వేరు బాప్తీస్మాల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రభువు ఇచ్చే రక్షణలో భాగంగా ఆయన ప్రజలు పొందబోయే ఆశీర్వాదం (అపో.కా 1:5, 2:16-21, 11:16-18). అగ్ని బాప్తీస్మం, మారుమనస్సు పొందకుండా ఆయనను విశ్వసించడానికి నిరాకరించేవారికి విధించబడే శిక్షావిధి. అగ్ని బాప్తిస్మానికి ఇదే సరైన భావమని ముందు మరియు తర్వాత వచనాల వెలుగులో ఎంతో స్పష్టంగా నిర్థారించుకోవచ్చు. మారుమనస్సు ఫలం ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వెయ్యబడుతుందని (మత్తయి 3:10), ఆరని అగ్నితో పొట్టు కాల్చి వెయ్యబడుతుందని (మత్తయి 3:12) ప్రకటిస్తున్న సందర్భంలో ఈ "అగ్ని బాప్తిస్మం" ప్రస్తావించబడింది కాబట్టి, దేవుని ఉగ్రతతీర్పు అనేదే దాని సరైనభావం. ప్రభువు వచ్చినప్పుడు (మలాకి 3:1) మండుతున్న కొలిమిలో ఆయన దుష్టులను నాశనం చెయ్యబోతున్నాడనే ప్రవచనం (మలాకి 4:1-2) ఈ భావాన్ని మరింత బలపరుస్తుంది. ఈ లేఖన అధారాలతో పాటు నరకాగ్నిలో పడవెయ్యబడడాన్ని అగ్నిలో ముంచివెయ్యబడడమని అనేక యూదా రచనలలో రబ్బీయులు కూడా పిలిచారని Dr. John Gill తన వ్యాఖ్యానంలో ఆధారాలతో పేర్కొన్నారు. కాబట్టి వారికి బాగా అర్థమయ్యే భాషలోనే యోహాను ఇక్కడ వారిని హెచ్చరిస్తున్నాడని స్పష్టం ఔతుంది. ప్రభువు సర్వలోకానికి బాప్తిస్మం ఇస్తాడు. అయితే అందులో కొందరు ఆయన చేత రక్షించబడినవారిగా పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందుతారు. మిగిలినవారు ఆయన శిక్షావిధికి లోనై, నిత్యనరకాగ్ని బాప్తీస్మం పొందుతారు. ఈ విధంగా ఆయన సర్వలోక రక్షకుడు మాత్రమే కాదు, సర్వలోక తీర్పరి కూడా కాబట్టి ఆయన యోహాను కంటే మాత్రమే కాదు, మనుషులందరికంటే శక్తిమంతుడు, సర్వాధికారియైన దేవుడు (ప్రకటన 1:8).
మత్తయి 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
ఈ మాటలు 11వ వచనానికి మనం చెప్పుకున్న వ్యాఖ్యానాన్ని నిర్థారిస్తున్నాయి. గోధుమలను పొట్టునుండి వేరు చేసే ఈ పద్ధతిని అలంకారంగా చూపిస్తూ ప్రభువు తన ప్రజలను, తన ప్రజలు కానివారి నుండి వేరుచేసి, గోధుమలను కొట్టులో భద్రపరిచే విధంగా తన ప్రజలను తన నిత్యరక్షణలో భద్రపరుస్తాడని, మారుమనస్సు పొందడానికి నిరాకరించినవారందరినీ పొట్టు కాల్చివెయ్యబడే విధంగా నిత్యనరకానికి అప్పగిస్తాడని ఇక్కడ యోహాను మాటల భావం. ఇక్కడ మనుష్యులు రెండు విధాలుగా విభజించబడినట్టు గమనిస్తాము. ఒక వర్గంవారు, మారుమనస్సు పొంది ప్రభువుతో సమాధానపడి పరిశుద్ధాత్మలో బాప్తీస్మం పొందినవారిగా ఆయన చేత నిత్యం భద్రపరచబడతారు. మరో వర్గంవారు దేవుని రాజ్యాన్ని బేఖాతరు చేసి, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడకుండా తమ స్వంత మార్గాలలో కొనసాగుతారు కాబట్టి, వారికి ఆయన ఆరని అగ్నితో బాప్తీస్మం ఇస్తాడు. అంటే వారిని నిత్యనరకాగ్నికి అప్పగిస్తాడు. ఇక మూడవ ప్రత్యామ్నాయం ఏదీ ఉండదని గమనించాలి.
మత్తయి 3:13 ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.
"ఆ సమయమున"
అంటే యోహాను ఇంకా తన బాప్తిస్మ పరిచర్య కొనసాగిస్తున్న ఆ సమయమున, లేదా ఆ దినాలలో యేసు అతనివద్దకు వచ్చాడు. ఒకవేళ యోహాను తన 30వ యేట ఈ పరిచర్య ప్రారంభించి ఉంటే ఈపాటికి దాదాపు ఆరు నెలల సమయం అయ్యుండవచ్చు. యెరూషలేము, యూదయ మరియు యొర్దాను పరిసర ప్రాంతాలలో ఉన్నవారందరికీ మారుమనస్సు ప్రకటించి వారికి బాప్తిస్మం ఇవ్వడానికి కనీసం ఆమాత్రం సమయం పడుతోంది. అప్పటికే యోహాను మెస్సీయ రాజు, అంటే దేవుని రాజ్యాన్ని స్థాపించే ప్రభువు తన వెనుక వస్తున్నాడని ప్రకటించాడు. ఆయన కొరకు మారుమనస్సుతో సిద్ధపడి ఉండాలని బోధిస్తూ దేవుని రాజ్య పరిచర్య వేదికపై ప్రభువు ప్రత్యక్షం అవ్వడానికి మార్గం సరాళం చేస్తూ ఉన్నాడు. ఇలా ఆయన త్వరలో రాబోతున్నాడనే ఆశ, నిరీక్షణ, నమ్మకం యోహాను ఆ ప్రజల మనసులో రేకెత్తిస్తున్న ఆ సమయాన యేసు అతని వద్దకు వచ్చాడు.
"యోహానుచేత బాప్తిస్మము పొందుటకు"
యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు అతనివద్దకు వచ్చాడు. ప్రజలందరూ వారి పాపాలను ఒప్పుకుని, మారుమనస్సుతో యోహాను చేత బాప్తిస్మం పొందారు. మరి యేసు లోకపాపాలను పరిహరించడానికి వచ్చిన పాపరహితుడైతే అనగా ఆయనలో ఏ పాపమూ లేదన్నది నిజమైతే ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాగలదు. ఇందుకు లేఖనాలు ఎంతో విస్ఫష్టమైన సమధానాలను మనకు అందిస్తున్నాయి. యోహాను ఆయనను గుర్తెరిగి ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికే పంపబడ్డాడని గుర్తించడానికి దేవుడు బాప్తిస్మాన్ని ఒక మాధ్యమంగా వాడుకున్నాడు. యోహాను బాప్తీస్మం ఇస్తుండగా ఎవరిమీదకు పరిశుద్ధాత్మ పావురంవలే దిగడం చూస్తాడో ఆయనే ఆ మెస్సీయ అనే సూచన అతనికి ఇవ్వబడింది (యోహాను 1:29-34). అంతేకాకుండా నీతియావత్తూ నెరవేర్చబడడానికి కూడా ఇది అవసరం అనేది ప్రభువు తన బాప్తీస్మానికి తానే స్వయంగా సెలవిచ్చిన కారణం (మత్తయి 3:15 వ్యాఖ్యానం చూడండి). కాబట్టి ప్రభువు బాప్తిస్మం తీసుకోవడానికీ ఇంకెవరైనా బాప్తిస్మం తీసుకోవడానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉందని రెండింటికీ లేఖనాలు వేరు-వేరు కారణాలు చూపిస్తున్నాయని, కాబట్టి బాప్తిస్మం పొందినంత మాత్రాన ప్రభువులో పాపం ఉందని అనుకోవడానికి ఏమాత్రం తావులేదని ఎంతో స్పష్టంగా అర్థమౌతుంది. అంతేకాకుండా ప్రభువు బాప్తిస్మం పొందడం ద్వారా యోహాను ఇస్తున్న బాప్తీస్మం పరలోక సంబంధమైనదని స్వయంగా ఆయనే దానిని ధృవీకరించాడు. బాప్తీస్మం పొందడం ద్వారా బాప్తీస్మ కట్టడకు లోబడడంలో స్వయంగా ప్రభువే మనకు మాదిరి అయ్యాడు.
"యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను"
యేసు గలలియలోని నజరేతు నుండి వచ్చాడని మార్కు ఇదే సందర్భంలో తెలియజేస్తున్నాడు (మార్కు 1:9). ఆయన శిశువుగా ఉన్నప్పుడే తన తల్లియైన మరియ మరియు యోసేపుతో పాటు నజరేతులో స్థిరపడినట్టు మనం ఇదివరకే చూసాం (మత్తయి 2:23 వ్యాఖ్యానం చూడండి). అక్కడ నుండి యెరుషలేముకు మూడు రోజుల ప్రయాణమంత దూరం ఉందని కొందరు బైబిల్ పండితుల అంచనా. యొర్దాను యెరుషలేముకు కొంత సమీపంలో ఉంటుంది. స్వచ్ఛందంగా ఎంతో దూరం నుండి, ఎంతో శ్రమతో కూడుకున్న ప్రయాణానికి పూనుకుని, స్వయంగా ప్రభువే బాప్తిస్మం తీసుకోవడానికి యొర్దాను వద్దకు వచ్చాడు. దేవునికి సంబంధించిన విషయాలలో దూరం, కష్టం అనే సాకులు చెప్పేవారు, సమర్పణ అంటే ఏంటో ప్రభువు నుండి నేర్చుకోవాలి. యోహాను ప్రభువుకు దాసుడు అయినప్పటికీ ప్రభువు అతణ్ణి పిలువనంపలేదు. ఆయనే స్వయంగా యోహాను దగ్గరకు వచ్చాడు. సంఘంలో తాము పోషించే పాత్రలను పదవులుగా చేసుకుని ఇతరులపై అధికారం చెలాయించేవారిలో క్రీస్తు ఆత్మ లేదని ఇక్కడ స్పష్టమౌతుంది (1 పేతురు 5:3).
మత్తయి 3:14 అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని-
"అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా? అని"
ఈ మాటలను బట్టి యోహానుకు యేసుతో ముందే పరిచయం ఉండడం మాత్రమే కాదు, ఆయన తనకంటే శ్రేష్ఠుడు అనే అవగాహన కూడా ఉందని స్పష్టమౌతుంది. ఎందుకంటే యోహాను తల్లియైన ఏలిసబెతుకు యేసు తల్లియైన మరియ దగ్గర బంధువని, యేసు అద్భుత జనన వృత్తాంతం దూత ప్రకటించిన తరువాత మరియ ఎలిసబెతు వద్దకు వెళ్ళిందని, యోహాను అప్పుడే తన తల్లి గర్భంలో నుండి పరిశుద్ధాత్మపూర్ణుడై స్పందించాడని మనకు తెలుసు (లూకా 1:36,38-42). ఆ అవగాహనను బట్టే యేసు తన చేత కాదు, తానే యేసు చేత బాప్తిస్మం పొందవలసి ఉంది అంటూ యోహాను తనను తాను తగ్గించుకుంటున్నాడు. అంతమాత్రాన, ఈ మాట పలికిన సమయంలో తాను ఎవరికి మార్గం సిద్ధపరచడానికి వచ్చాడో ఆ మెస్సీయ యేసే అనే నిర్ధారణ యోహానుకు లేదు. బహుశా అతనికి ఆ అంచనా లేదా అనుమానం ఉండియుండవచ్చు. ఎందుకంటే తన తల్లి కూడా మరియను "నా ప్రభువు తల్లి" (లూకా 1:43) అని సంబోధించిన సంగతి అతనికి తెలిసేయుండవచ్చు, కానీ ఆ నిర్థారణ మాత్రం పరిశుద్ధాత్మ పావురం వలె యేసు మీదకు దిగిరావడం చూసినప్పుడే కలిగింది (యోహాను 1:29-34). అప్పటి వరకు బహుశా యేసు తన వలే లేదా తనకంటే గొప్పగా దేవుని చేత వాడబడడానికి పంపబడిన సహదాసుడని భావించి యోహాను ఆయనను గౌరవించియుండవచ్చు. కానీ దేవుడు చెప్పిన ఆ సూచన నేరవేరిన తర్వాత, ఆయన గురించి సాక్ష్యమివ్వడానికే తాను పంపబడ్డాడనీ ఆయన తన సహదాసుడు కాదు కానీ స్వయంగా ప్రభువే అని యోహాను గుర్తెరిగాడు. కాబట్టి ఇక్కడ కొందరు విమర్శిస్తున్న విధంగా యోహాను యేసును గుర్తుపట్టి తనతో సుపరిచితుడిగా సంభాషించడాన్ని, మరియు ఆ సూచన చూసేంతవరకూ "నేను ఆయనను ఎరుగనైతిని" అని తాను మరోచోట (యోహాను 1:31) చెప్పినదానినీ పరస్పర వైరుధ్యంగా చూడడానికి తావు లేదు.
"ఆయనను నివారింపజూచెను గాని"
ఇక్కడ యోహానుకు ఉన్న గొప్ప తగ్గింపు స్వభావం మరోసారి కనబడుతున్నప్పటికీ ఆ తగ్గింపు దేవుని వాక్యపరిధిలోనే ప్రదర్శించబడాలని, అవధులు దాటే తగ్గింపు దేవుని చిత్తనుసారమైనది కాదు అని ఈ సందర్భం మనకు నేర్పిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే తన తగ్గింపు కారణంగా ఇక్కడ యోహాను యేసును తన చేత బాప్తిస్మం పొందకుండా నివారించే ప్రయత్నం చేసాడని చదువుతున్నాము. కానీ దేవుడు యోహానుకు ఇచ్చిన నిర్ధేశాల ప్రకారం, తాను బాప్తీస్మం ఇస్తున్నప్పుడు జరిగే సూచన ఆధారంగానే మెస్సీయ ఎవరో నిర్థారించబడుతుందని అతనికి తెలుసు. అలాంటప్పుడు, తన ముందు నిలబడింది సాక్షాత్తూ మెస్సియాయే అని యోహానుకు తెలిసినప్పటికీ ఆ సూచన నేరవేర్పు కొరకు ఆయనకు బాప్తీస్మం ఇచ్చి తీరాల్సిందే. తన తగ్గింపు దేవుని ఈ సంకల్పానికి, ఆజ్ఞకు, వ్యతిరేకంగా ఉందని యోహాను బహుశా వివేచించలేకపోయాడు. కాని ప్రభువు అతణ్ణి సరిచేసి, తన బాధ్యత నేరవేర్చే విధంగా సహాయపడ్డాడని తరువాత వచనంలో చదువుతాం.
మత్తయి 3:15 యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.
"యేసు ఇప్పటికి కానిమ్ము. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను"
ఇక్కడ యేసు యోహాను తగ్గింపును ఆమోదించాడు కానీ ఆయనను తన చేత బాప్తిస్మం పొందకుండా నివారించడాన్ని మాత్రం ఆమోదించలేదు. తన అర్హతను బట్టి చూసినప్పుడు యోహాను యేసుకు బాప్తిస్మం ఇవ్వడానికి సంకోచించడం సరైనదే కావొచ్చు కానీ ఇప్పుడు మాత్రం అలా చెయ్యవలసిన అవసరం ఉంది. ఇది యోహాను అర్హతను బట్టి కాదు కానీ ప్రస్తుత అవసరాన్ని బట్టి తప్పక జరిగించాల్సిన విధి అని ప్రభువు యోహానుకు సెలవిస్తున్నాడు. యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడం, నీతి యావత్తూ నెరవేర్చడానికి అవసరం అని ఆయనే స్వయంగా సెలవిస్తున్నాడు మోషే మొదలుకుని (లూకా 2:22-24, 39) యోహాను వరకూ (మత్తయి11:13) దేవుడు ఆజ్ఞాపించిన ప్రతీ ఆచారానికీ కట్టడకూ యేసు సంపూర్ణ విధేయత చూపవలసిన అవసరం ఉంది. అందులో ఏ ఒక్కటి తప్పినా ఆయన దేవుని నీతి ఎదుట దోషి ఔతాడు. అయితే ఎవ్వరూ ఎప్పుడూ చూపించలేని పరిపూర్ణ విధేయత కనపరచడం ద్వారా యేసు దేవుని నీతిని నేరవేర్చాలి. ఆ ప్రక్రియలో యేసుతో సహకరించి, ఆయనకు బాప్తీస్మం ఇవ్వడం ప్రస్తుతం యోహాను బాధ్యత. అందుకే ఇప్పటికి ఇది అవసరం అని అందులో తగనిదేమీ లేదని ప్రభువు యోహానుకు సెలవిస్తున్నాడు. సున్నతి మొదలుకుని సిలువ మరణం వరకూ ఏదీ యేసు తనకు అవసరం అయ్యుండి చెయ్యలేదు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి పాపమూ లేదు. అయితే దేవునికీ మరియు తన ప్రజలకూ మధ్యవర్తిగా వారి పక్షంగా ఆయన దేవుని నీతిని తన సంపూర్ణ విధేయత ద్వారా సంతృప్తిపరిచాడు. తాను యోహాను చేత బాప్తీస్మం పొందడం కూడా అందులో భాగమే అని సెలవిస్తున్నాడు.
"గనుక అతడాలాగు కానిచ్చెను."
అంటే ప్రభువు సెలవు మేరకు యోహాను ఆయనకు బాప్తిస్మం ఇచ్చి తన విధి నిర్వర్తించాడు. ఏ తగ్గింపు కారణంగా ఆతను మొదట ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వడానికి సంకోచించాడో అదే వినయ వైఖరి ఇపుడు అతణ్ణి విధేయతకు నడిపించింది.
మత్తయి 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
"యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను"
యేసు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన వెంటనే నీటిలోనుండి ఒడ్డుకు వచ్చాడు. ఇది బాప్తిస్మం తీసుకున్న ఎవరైనా చేసే పనే. ఎవ్వరూ నీటిలోనే ఉండిపోరు కదా! కానీ యేసు ఒడ్డుకు వస్తుండగా (మార్కు 1:10) జరిగిన విశేషమైన సంగతులు తెలియపరచబోతున్నారు కాబట్టి మత్తయి కానీ ఇతర సువార్త రచయితలు కానీ దానిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
"ఇదిగో ఆకాశము తెరవబడెను"
మార్కు ప్రకారమైతే ఆకాశం చీల్చబడింది (మార్కు 1:10). అంటే ఒక తెర చిరిగి దాని వెనుక ఉన్నది బయలుపడే రీతిలో దేవుడు చేసిన ఒక అద్భుత సూచన యోహానుకు కనిపించే విధంగా ఆకాశం తెరవబడింది.
"దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను"
లూకా ప్రకారమైతే పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలే దిగి రావడం జరిగింది. యోహానుకు పరిశుద్ధాత్మ కనిపించాలంటే ఆయన ఏదో ఒక రూపం సంతరించుకోవడం అవసరం. బహుశా మానవరూపం త్రిత్వంలోని రెండవవ్యక్తికి ప్రత్యేకించబడింది కాబట్టి పరిశుద్ధాత్మ వేరొక రూపంలో ప్రత్యక్షం అవ్వడానికి ఇష్టపడి ఉండవచ్చు. ఆకాశం నుండి దిగివచ్చే సన్నివేశం కాబట్టి ఒక పక్షి ఆకారమే అందుకు సరిగ్గా సరిపోతుంది. అయితే పక్షులలో పావురం మాత్రమే నిష్కళంకతకు సూచనగా దేవుని వాక్యం గుర్తించింది. బలి అర్పణకు ధర్మశాస్త్రం అనుమతించిన రెండు రకాల పక్షుల్లో ఈ పావురం ఒకటి (లేవీకాండము 1:14). ప్రభువు స్వయంగా పావురం వలే తన శిష్యులు నిష్కపటులుగా ఉండాలని సెలవిచ్చాడు (మత్తయి 10:16). ఇది దేవుని ఆత్మకు ఉన్న పవిత్రత, నిష్కాపట్యం, మరియు నిష్కళంకతను వ్యక్తపరచడానికి తగిన రూపం కాబట్టి, ఈ ఆకారంలో ఆయన దిగి యేసు మీద వ్రాలాడు. ఇది చూసింది ఆయనకు బాప్తిస్మం ఇచ్చిన యోహానే అని యోహాను 1:29-34 లో ఉన్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. యోహాను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఎవరి మీదకు పరిశుద్ధాత్మ పావురం వలే దిగి రావడం చూస్తాడో ఆయనే మెస్సియా అని దేవుడు యోహానుకు చెప్పిన సూచన ఇక్కడ నెరవేరింది. ఈ విధంగా యోహాను యేసే మెస్సియా అని, ఆయన మార్గం సిద్ధపరచడానికి తాను పంపబడ్డాడని ధృవీకరిస్తున్నాడు. ఆయనను వేలెత్తి చూపించి "ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని" విశేష ధైర్యంతో అందరిముందూ ప్రకటించాడు.
మత్తయి 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
"మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు"
ఇక్కడ పరలోక తండ్రి యేసును గురించి సాక్ష్యమిస్తూ "ఈయనే నా ప్రియకుమారుడు అంటున్నాడు". అంటే యేసు మనుష్యస్వభావాన్ని సంతరించుకున్న దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే దేవదూతలు మరియు మానవుల్లా దేవుని చేత సృష్టించబడ్డాడని కానీ లేదా విశ్వాసులవలే దత్తపుత్రత్వం పొందాడని కానీ లేదా న్యాయాధిపతుల్లా ఆయన చేసే పనిని బట్టి ఆ బిరుదు పొందాడని కానీ దాని భావం కాదు. దేవుని స్వరూపమయ్యుండి (2 కొరింథీ 4:4, కొలస్సీ 1:15, హెబ్రీ 1:3), నిత్యత్వం నుండి దేవుని అదే స్వభావం మరియు సమాన గుణలక్షణాలు ఉన్నవానిగా ( యోహాను 17:5, ఫిలిప్పీ 2:6), ఇంకెవ్వరికీ దేవునితో లేని ఒక అద్వితీయ బాంధవ్యం కారణంగా (యోహాను 1:18) ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. క్రీస్తు కుమారత్వాన్ని లేఖన సమగ్రబోధ వెలుగులో పరిశీలించినప్పుడు ఈ భావాన్ని గ్రహించగలం. ఈ భావంలోనే యేసు తాను దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడని యూదులు కూడా ఎలాంటి వ్యాఖ్యాన సహాయం లేకుండా అర్థం చేసుకోగలిగారు. అది దైవ సమానత్వాన్ని సూచిస్తుంది కాబట్టే వారు దానిని దేవదూషణగా పరిగణించారు (లూకా 22:70-71, యోహాను 10:36, 19:7). అంతే కాకుండా, ఆయన తన మధ్యవర్తిత్వపు పాత్రలో సంతరించుకున్న అసాధారణమైన శరీరధారణ ( లూకా 1:35) మరియు సర్వశక్తితో సాధించిన పునరుత్థాన విజయం (రోమా 1:5) కారణంగా కుడా దేవుని అద్వితీయ కుమారునిగా పిలువబడ్డాడు (యోహాను 3:16).
"ఈయనయందు నేనానందించుచున్నాను"
ఇది తండ్రి తన కుమారుని గురించి పలికిన సాక్ష్యంలో ఉన్న ఎంతో ప్రాముఖ్యమైన కొనసాగింపు. గత నిత్యత్వమంతటిలో తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనకు అత్యంత ప్రియుడు. అయితే ఆయనయందు తండ్రి ఆనందించడానికి కేవలం ఈ నిత్య బాంధవ్యం ఒక్కటే కారణం కాదు. క్రీస్తు శరీరధారిగా తన ప్రజలకు మరియు దేవునికి మధ్యవర్తిగా నిర్వర్తించిన పరిచర్య అంతటినీ ఆమోదిస్తూ తండ్రి ఈ మాట పలికాడు. ఆయన మానవస్వభావమునందు, ధర్మశాస్త్రానికి ఆయన చూపిన సంపూర్ణ విధేయతయందు, దాని శాపాన్ని వహించి అది విధించిన శిక్షను తన ప్రజల పక్షంగా సహించి, మరణం పొందునంతగా కనపరిచిన ఆయన తగ్గింపునందు తండ్రి ఆనందించాడు. ధర్మశాస్త్రాన్ని నేరవేర్చి దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచిన ఆయన నీతి, ప్రాయుశ్చిత్తం మరియు బలిని బట్టి ఆయనయందు ఆనందించాడు. అందుకే ఈ స్వరం ఆయన పరిచర్య కాలంలో మళ్ళీ మళ్ళీ వినబడి ఆయన గురించి ఇదే విధమైన సాక్ష్యం పలికింది (మత్తయి 17:5, యోహాను 12:28-30), నీతి యావత్తు నేరవేర్చి, తన ప్రజల పక్షాన దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచి, వారి పాపాల విషయమై దేవుని ఉగ్రతను శాంతింపజేసిన యేసు మధ్యవర్తిత్వాన్ని బట్టి తండ్రి ఆయనయందు ఆనందిస్తున్నాడు. దీనిబట్టి మనకు అనుగ్రహించబడిన నిశ్చయత ఏంటంటే క్రీస్తు చేసిన ఈ పరిచర్య ఆధారంగా ఎవరైతే ఆయన ద్వారా దేవునితో సమాధానపరచబడ్డారో వారు క్రీస్తునందు ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వారియందు కూడా ఆనందిస్తున్నాడు (రోమా 8:1). క్రీస్తు వెలుపల దహించు అగ్నియై ఉన్న దేవుడు, క్రీస్తునందు సమాధానపడిన తండ్రి అయ్యున్నాడు. అందుకే, క్రీస్తుకు వేరుగా ఎవ్వరూ దేవునికి అంగీకారం కాలేరు (యోహాను 14:6, అపో. కా 4:12). కానీ ఆయనయందు ఉన్నవారు ఆయనను బట్టి దేవునితో సమాధానపడినవారిగా వారియందు తండ్రి ఆనందిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన ఉగ్రత పాత్రలైన వీరు, ఇప్పుడైతే తన ప్రియునియందు అంగీకరింపబడిన కారణాన్ని బట్టి (ఎఫెసీ 1:4-7) తండ్రి వారియందు ఆనందిస్తున్నాడు. "ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను" అని క్రీస్తుకు తండ్రి సాక్ష్యమిస్తుండగా "ఈయనే మా ప్రియ రక్షకుడు, ఈయనయందు మేము ఆనందించుచున్నాము" అని ఆయనయందున్న వారందరూ బదులు చెప్పాలి.
"అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.":
ఇది తండ్రియైన దేవుని స్వరమని వేరే చెప్పనవసరం లేదు. పరిశుద్ధాత్మడు పావురం రూపంలో ప్రత్యక్ష్యం కాగా తండ్రి తన స్వరం ద్వారా బయలుపడ్డాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు కూడా వారు రూపమేదీ చూడకుండా కేవలం ఒక స్వరం మాత్రమే విన్న విధంగా ( ద్వితియోపదేశకాండము 4:12), ఇప్పుడు ఈ అద్భుత సువార్త కూడా ఒక స్వరం ద్వారానే ప్రత్యక్షపరచబడింది. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ప్రభువు బాప్తిస్మం పొందిన ఈ సందర్భం పరిశుద్ధ త్రిత్వంలో ఉన్న సభ్యులు ముగ్గురు వేరు-వేరు వ్యక్తులు అని చెప్పడానికి బలమైన ఆధారం. కుమారుడు బాప్తీస్మం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆకాశం నుండి పావురం వలే కుమారుని పైకి దిగి వస్తున్నాడు, పరలోకం నుండి తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. ఒకే వ్యక్తి పాత నిబంధనలో తండ్రి పాత్ర పోషించి కొత్తనిబంధనలో యేసుగా అవతరించి, ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మగా మన మధ్య నివసిస్తున్నాడనీ చెప్పే బోధ ఎంత వాక్య వ్యతిరేకమైనదో చూపించడానికి ఇది బలమైన ఆధారం. దేవుడు ఒక్కడే అని నిర్వివాదంగా ప్రకటించే లేఖనాలు ఆ ఒక్క దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వేరు-వేరు వ్యక్తులుగా, ఉనికి కలిగియున్నాడని కూడా అంతే స్పష్టంగా బోధిస్తున్నాయి. ఈ అంశాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
త్రిత్వ సిద్ధాంతం
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
మత్తయి సువార్త అధ్యాయము 3 పై వ్యాఖ్యానం

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"