కొత్త నిబంధన

రచయిత: జి. బిబు

mathew 2

విషయసూచిక

2:1, 2:2, 2:3, 2:4, 2:5, 2:6, 2:7, 2:8, 2:9, 2:10, 2:11, 2:12

వచనం 1 : రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి- 

 
'రాజైన హేరోదు దినముల యందు'
 
యేసు ఎప్పుడు పుట్టాడు అనే ప్రశ్నకు ఇది మత్తయి ఇస్తున్న సమాధానం. ఆయన రాజైన హేరోదు దినములలో పుట్టాడు. ఈ హేరోదుకు సంబంధించిన అనేక వివరాలు జోసెఫస్ రాసిన "The Antiquities of the Jews" అనే పుస్తకంతో పాటు, అతని సమకాలీకులైన ఇతర యూదా రచననలో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ హేరోదు అగస్టస్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అతని చేత యూదయ దేశానికి రాజుగా నియమించబడ్డాడు. Antipater కుమారుడైన ఈ హేరోదు ఒక ఎదోమీయుడు. 37 సంవత్సరాలు ఇతను కొనసాగించిన కౄరపరిపాలన దాదాపుగా ముగిసే సమయంలో యేసుక్రీస్తు జననం జరిగింది. ఒక అన్యుడు యూదా రాజ్య సింహాసనాన్ని అధీష్టించడం సిలోహు రావాల్సిన సమయం ఆసన్నమైనపుడు జరుగుతుందని యాకోబు చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది (ఆదికాండము 49:30).
 
కాబట్టి మత్తయి యేసుక్రీస్తు రాజైన హేరోదు దినములలో పుట్టాడని చెప్పడం ఆయన జన్మకు చారిత్రక నిర్థారణతో పాటుగా యాకోబు చెప్పిన ప్రవచన నెరవేర్పుకు కూడా ఎంతో కీలకమైన సమాచారం. యేసు జన్మ ఒక చారిత్రక వాస్తవం కాబట్టి అది కల్పిత దేవుళ్ళకు కేటాయించే చరిత్రాతీత కల్పితకాలాలకు కాకుండా తరచి చూసి రూడీ చేసుకోగల చరిత్ర పరిధిలోనే జరిగిందని బైబిల్ చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే యేసుక్రీస్తు జననాన్ని పరిశీలించడానికి హేరోదు దినాలలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే సరిపోతుంది. ఏ ద్వాపరయుగంలోనో, త్రేతాయుగంలోనో జరిగుంటుందిలే అని సరిపెట్టుకోవలసిన అగత్యమేమీ యేసు చరిత్రకు లేదు. అంతేకాదు సిలోహు వచ్చేవరకూ యూదాయొద్ద నుండి రాజదండం తొలగిపోదని ప్రవచించింది క్రైస్తవులు కాదు, యూదుల చరిత్ర గ్రంథమే.
 
యేసుక్రీస్తు జన్మించే సమయానికి యూదులను అన్యుడైన హేరోదు పరిపాలించడం వారియొద్ద నుండి రాజదండం తొలగిపోయిందని తెలియచేస్తుంది. ఈ సమయంలో ప్రజలు విధేయులయ్యుండే షిలోహు ఒక్కడు రావాలనే ప్రవచనం కేవలం యేసుక్రీస్తులో మాత్రమే నెరవేరుతుంది. నాటి జ్ఞానులు మొదలుకుని నేటి విశ్వాసుల వరకూ లెక్కిస్తే ఇంతమంది ప్రజలు ప్రపంచంలో మరే పరిపాలకుడికీ విధేయులు కాలేదు; యాకోబు చెప్పిన ఆ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరకపోతే అది విఫలమైందని యూదులు కూడా ఒప్పుకోక తప్పదు.  అయితే దేవుని వాక్యం నిరర్థకం అవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి యేసే ఆ సిలోహు, వాగ్దానం చేయబడిన మెస్సీయ.
 
'యూదయ దేశలు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట'
 
యేసు ఎక్కడ పుట్టాడు అనే ప్రశ్నకు ఇది మత్తయి ఇస్తున్న సమాధానం. జెబులూనులో కూడా బెత్లెహేం అనే ఊరు ఉంది కాబట్టి (యెహోషువా 19:15) యేసుక్రీస్తు పుట్టింది యూదయలోని బెత్లేహేములో అని అతను ప్రత్యేకంగా చెబుతున్నాడు.
ఈ గ్రామం యెరుషలేము నుండి సుమారు ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది మెస్సీయ ఈ ప్రాంతంలోనే జన్మిస్తాడనే  ప్రవచనం ‌ఉంది (మీకా 5:2) యూదులకు కూడా మెస్సీయ ఈ ప్రాంతంలోనే పుడతాడని స్పష్టమైన అవగాహన ఉంది (మత్తయి 2:4-6, యోహాను 7:41-42) యేసుక్రీస్తు ఇక్కడే జన్మించాడని లూకా కూడా నిర్థారిస్తూ అందుకు దారితీసిన పరిస్థితులు కూడా వివరించాడు (లూకా 2:1-7). బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అనీ, మాంసపు ఇల్లు అనీ రెండు అర్థాలు చెబుతారు. ఈవిధంగా యేసు పుట్టుక స్థలం, ఆయన కోసం లేఖనాలు వాడిన అలంకారాలకు వివరాలకు కూడా సరిగ్గా సరిపోయింది.  ఆయన పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం (యోహాను 6:35) అలాగే ఆయన రక్త మాంసాలతో పాలివాడు అయ్యాడు (హెబ్రీ 2:14). ఇలా యేసు పుట్టుక ద్వారా బెత్లెహేము దాని పేరుకు తగిన సార్థకత పొందింది.
 
'ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు'
 
యేసు పుట్టిన తరువాత అయనను ఆరాధించటానికి తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చారని ఇక్కడ తెలుపబడింది. గ్రీకు భాషలో అక్కడ జ్ఞానులు అన్నపదం ఉన్నచోట μάγοι (magoi) అనే పదం వాడబడింది; అరామిక్ భాషలో అయితే (magoshi). పర్షియా దేశంలో ఈ పేరుతో (maguš) ఒక పండితవర్గం ఉండేదని కొన్ని ప్రాచీన రచనల ఆధారంగా  Dr.John Gill, Adam Clarck మరియు Matthew Henry వంటి వ్యాఖ్యానకర్తలు నిర్థారించారు (magoi,magoshi అనే పదాలు పర్షియా భాషలోని maguš అనే పదం నుండి ఉద్భవించినవే).
 
పర్షియా దేశం యూదయ దేశానికి తూర్పుగా ఉంది కాబట్టి తూర్పుదేశపు జ్ఞానులు అనే సంబోధన ఆ దేశం నుండి వచ్చిన జ్ఞానులకు సరిగ్గా సరిపోతుంది. చరిత్ర ఆధారంగా కోరేషు మరియు దర్యావేషు చక్రవర్తుల కాలం నుండి ఈ magoi వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నట్టు తెలుస్తుంది. వారికి మతసంబంధమైన జ్ఞానం ప్రధానంగా ఉండేది కాబట్టి యాజకత్వం వారి ప్రధాన వృత్తి. దర్యావేషు తన సమాధి మీద ఆ వర్గానికి ప్రముఖుడనని రాయించుకున్నాడు. magoiలకు సంబంధించిన పాండిత్యం లేనిదే పర్షియా దేశానికి రాజు అవ్వడం సాధ్యం కాదు అనేది వారి నియమం. జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం వీరు అభ్యసించే విధ్యలో ఒక భాగం. 
 
యేసును వెదకుతూ వచ్చిన జ్ఞానులు ఈ పర్షియా దేశపువారే అయ్యుండాలి. కొందరు భావించినట్టు వీరు కల్దీయులు కారు.  కల్దీయులలో కూడా అనేకమంది జ్యోతిష్యులూ, మంత్రగాళ్ళు ఉన్నప్పటికీ (దానియేలు 2: 2,10, 27 4:7) కల్దీయుల దేశం యుదయాకు తూర్పున కాదు ఉత్తరాన ఉంది (యిర్మియా 1: 14-15, 4:6, 6:22, 10:22, 25: 9). ఇంకొందరైతే వారు అరేబియా నుండి ముఖ్యంగా షేబ దేశం నుండి వచ్చిన జ్ఞానులు అని అభిప్రాయపడ్డారు. బహుశా వారు కీర్తనలు 72:10,15 వచనాల ఆధారంగా అలా భావించియుండవచ్చు. అయితే అరేబియాలో కొంతభాగం యూదయ దేశానికి తూర్పుగా ఉన్నప్పటికీ షేబ దేశం మాత్రం దక్షిణంగా ఉంది. షేబ దేశపు రాణి, దక్షిణ దేశపురాణి అని సంబోధించబడడం ఇందుకు ఆధారం (మత్తయి 12:42). 
కాబట్టి వారు యూదయకు తూర్పున ఉన్న‌ పర్షియా దేశం నుండి వచ్చినవారే అని మనం తేల్చి చెప్పవచ్చు.
 
'యెరుషలేమునకు వచ్చి'
 
యెరూషలేము యూదయా దేశానికి రాజధానిగా ఉంది. రాజైన హేరోదు పరిపాలనాకేంద్రం అదే. అందుకే యూదుల రాజుగా పుట్టిన శిశువు అక్కడే పుట్టుండాలని వారు అంచనా వేసి ఉండవచ్చు. అందుకే వారు యెరూషలేమును వచ్చి నేరుగా రాజైన హేరోదును సంప్రదించి, యూదుల రాజుగా పుట్టినవాని గురించి ఆరా తీయసాగారు.
 

వచనం 2: "యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి".

 
'యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు?'
 
వారు హేరోదును యూదుల రాజు పుట్టాడా లేదా అని అడగడం లేదు, ఆ విషయంలో వారికి సందేహమే లేదు. ఆయన పుట్టాడు, కాని ఎక్కడ పుట్టాడు అన్నదే వారి ప్రశ్న ఈ ప్రశ్నే వారిని హేరోదు దర్బారుకు నడిపించిందని  సందర్భం తెలియజేస్తుంది. రాజు రాజభవనంలోనే పుట్టుంటాడు అని వారు తలంచి ఉండవచ్చు. అయితే, అలాంటి ఒక రాజు పుట్టిన సంగతి వారికెలా తెలుసు? ఈ ప్రశ్నకు వారి మాటలలోనే జవాబు ఉంది.
 
'తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రం చూసి'
 
వారు ఒక‌ నక్షత్రం చూసారు, వారు తూర్పు దిక్కున అంటే తమ దేశంలోనే ఆ నక్షత్రాన్ని చూసారు. అయితే అది యూదుల రాజు పుట్టుకను ప్రకటించే నక్షత్రమని వారికెలా తెలిసింది? ఆ వివరాలు మత్తయి తన సువార్తలో నమోదు చేయలేదు. కానీ, అప్పటి యూదా మరియు రోమా చరిత్రకారుల రచనలు మనం పరిశీలించినప్పుడు ఆ కాలంలో ఒక గొప్పరాజు పుడతాడనే నమ్మకం ఆ ప్రజల్లో సర్వసాధారణంగా ఉండేదని తెలుస్తుంది.
 
Suetonius, Tacitus వంటి రోమా చరిత్రకారులనూ, కొన్ని యూదుల చరిత్ర పుస్తకాలనూ ఆధారం చేసుకుని అనేకమంది బైబిల్ వాఖ్యానకర్తలు ఈ నిర్థారణకు వచ్చారు. అయితే ముఖ్యంగా పర్షియా దేశస్తులైన ఈ జ్ఞానులకు యూదుల రాజుగా పుట్టబోయే మెస్సీయ గురించిన అవగాహన ఉండడంలో‌ ఆర్చర్యం ఏమీలేదు. ఎందుకంటే యూదుల మెస్సీయ జన్మించే సమయాన్ని ఎంతో కచ్చితంగా ప్రవచించిన దానియేలు దినాలలోనే పర్షియా సామ్రాజ్యం బబులోనును కూలదోసి అధికారంలోకి వచ్చింది. మెస్సియాకు సంబంధించిన ఆ ప్రవచనం దానియేలులో 9:24-26లో స్పష్టంగా ప్రకటించబడింది. ఆదేశంలోనే మొదటిగా వెల్లడిచేయబడిన ఆయన ప్రవచన వాక్కులు ఆ దేశస్తులకు ముఖ్యంగా వారి మేథావి వర్గానికి తెలిసుండే అవకాశం ఎంతైనా ఉంది.
 
దీనికి తోడుగా ఈ దేశస్తులు అబ్రాహాము ఉపపత్నుల సంతానమని (ఆదికాండము 25:6) ఇశ్రాయేలీయులను దీవించిన బిలాము ఈ దేశపువాడే అని (సంఖ్యాకాండము 23:7) చెప్పడానికి లేఖన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మెస్సీయకు సంబంధించిన నిరీక్షణ వీరికి‌ కొత్త కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచునని (సంఖ్యాకాండము 24;17) బిలాము చెప్పిన ప్రవచనం ప్రకారం వారు చూసిన ఆ నక్షత్రమే రాజు పుట్టాడని భావించడానికి కారణమైయ్యుండాలి. అది దానియేలు సూచించిన కాలంతో సరిగ్గా సరిపోయింది కాబట్టి ఈ విశేష నక్షత్రం యూదుల రాజు పుట్టుకను ప్రకటించడానికే ప్రత్యక్షమైందని వారు నిర్థారించుకుని ఉండవచ్చు.
 
పర్షియాలోని జ్ఞానుల (magoshi) వర్గానికి వ్యవస్థాపకుడైన జొరాస్టర్ యూదా నేపథ్యం నుండి వచ్చినవాడని, యూదుల లేఖన అవగాహన అతనికి ఉందని  Dr.John Gill తన వ్యాఖ్యానంలో పేర్కొంటూ అందుకు కొన్ని ఆధారాలను తన వ్యాఖ్యాన ఫుట్ నోట్ లో జతచేసారు. నక్షత్రాన్ని చూసి యూదుల రాజును వెదుకుతూ వచ్చిన జ్ఞానులు ఆ వర్గానికి చెందిన magoiలే కాబట్టి వారి ఈ అవగాహనకు ఆధారాన్ని కొంతవరకూ మనం అంచనా వేయవచ్చు.
 
ఇలా నక్షత్రం ద్వారా యూదుల రాజు పుట్టుక నిర్థారించుకోవటం సాధ్యమైతే, జోతిష్య శాస్త్రానికి ఎంతో కొంత సమర్థన బైబిల్ నుండి లభించినట్లే అని కొందరు పొరబడుతుంటారు. కాని జ్యోతిష్యులు ఒకడు పుట్టిన సమయాన్నిబట్టి అతని నక్షత్రమేదో తెలుసుకుంటారు తప్ప నక్షత్రాన్ని చూసి ఒకడు పుట్టాడని నిర్ధారించరు. వారి అంచనాలు కొరకు నక్షత్రాలను పంచాంగంలో చూస్తారు తప్ప ఆకాశం వైపుకు తేరి చూడరు. కాబట్టి, ఇది దేవుడు తాను ఎన్నుకున్న కొందరు అన్యులైన జ్ఞానులకు మెస్సియా పుట్టుకను తెలిపే ఒక సూచక క్రియగా ఆకాశంలో ప్రత్యక్షపరచిన ఒక వింత నక్షత్రమని అర్థం చేసుకోగలం.
 
ఈ నక్షత్రం గొర్రెల కాపరులకు దూత ప్రత్యక్షమై యేసు జ్ఞానాన్ని ప్రకటించినప్పుడు ఆకాశంలో వెలిగిన దేవుని మహిమ అని (లూకా 2:9), అది దూరంనుండి ఈ జ్ఞానులకు ఒక నక్షత్రమువలె కనిపించిందని కొందరు భావించారు. కాని ఈ నక్షత్రం జ్ఞానులకు మళ్ళీ ప్రత్యక్షమై దారి చూపించిందని (మత్తయి 2:9) చదువుతాము కాబట్టి ఈ భావన సరికాదు.
 
అందుకే ఈ వింత నక్షత్ర ప్రత్యక్షత జ్యోతిష్యశాస్త్రానికి కూడా ఎంతో అతీతమైన అద్భుతమని పూర్తి సందర్భంలో స్పష్టం ఔతుంది. అయితే తూర్పు దేశపు జ్ఞానులకు యూదుల రాజుతో ఏంపని? వారెందుకు ఆయనను వెదుకుకుంటూ రావాలి? ఈ ప్రశ్నకు కూడా వారి మాటలలోనే సమాధానం ఉంది.
 
"ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి":
 
యూదుల రాజు యూదులకు మాత్రమే పరిమితమని తలంచివుంటే వారు ఈ ప్రయాసకు పూనుకోవాల్సిన అవసరమే లేదు.
యూదుల రాజుగా పుట్టిన మెస్సియా ద్వారా సర్వజనులకు రక్షణ వస్తుందని నమ్మితే తప్పక ఆయనను పూజించాల్సిందే.
ఈ గొప్ప విశ్వాసం అన్యులైన ఈ జ్ఞానుల హృదయాల్లో దేవుడు పుట్టించాడు కాబట్టి వారు వచ్చారు.
 
ప్రాచీన కాలంలో దూరదేశ ప్రయాణాలు అంత సురక్షితమైనవి కావు. ఇప్పుడు ఉన్న రవాణా సౌకర్యాలు అప్పుడు లేవు.
ఎన్నో శ్రమలు, అపాయాలు, మరియు ఖర్చులతో కూడుకున్న సుదీర్ఘ ప్రయాణం తప్పనిసరి అనుకుంటే తప్ప ఎవ్వరూ బయలుదేరరు. క్రీస్తును విశ్వసించినవారు ఆయన కొరకు కలిగియుండాల్సిన పట్టుదల, ప్రేమ, మరియు భక్తి వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎంతో నేర్పరులైన ఈ జ్ఞానులు వారి విద్య అంతటికంటే ఉన్నతమైనదేదో క్రీస్తునందు చూసుంటే తప్ప ఈ ప్రయాసకు పూనుకునేవారు కాదు. మంచి విద్వాంసులు మంచి క్రైస్తవులైయ్యుండాలి. క్రీస్తును నేర్చుకున్నప్పుడు వారి నేర్పు సంపూర్ణం ఔతుంది (Maththew Henry).
 
ఈ జ్ఞానులలాగే, మనం ఊహించని స్థలాలలో క్రీస్తుకు దాసులుండటం నేటికి సాధ్యమే. మెల్కీసెదెకు, యిత్రో మరియు యోబు వలే వారి చరిత్ర మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. క్రీస్తు ప్రత్యక్షమయ్యే దినమందు వారు ఆయనతో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవడం మంచిది. చుట్టూ చూసి అంతా బంజరు భూమి అనటానికి తొందరపడకూడదు, దేవుని కృప స్థలాలతో, కుటుంబాలతో ముడిపడినది కాదు (J.C.Ryle).
 

వచనం 3: హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి

 
"హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు."
 
యూదుల రాజు పుట్టాడని, ఆయన నక్షత్రం కనిపించిందని యూదేతరులైన జ్ఞానులు సైతం ఆయనను పూజించటానికి వచ్చారని హేరోదు విన్నప్పుడు అతడు, అతనితో ఉన్నవారు స్పందించిన తీరు గమనించదగినది.
 
 
"అతడును, అతనితో కూడా యెరూషలేమువారందరును కలవరపడిరి"
 
వారు విశ్వసించలేదు, దానిని పట్టించుకోలేదు, దానిని విస్మరించారు అని చెప్పుంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండేది కాదు.
కాని వారు కలవరపడ్డారు అని రాయబడింది. రావలసిన యూదుల రాజు ఒకడు ఉన్నాడని వారు నమ్మకపోతే కలవరమెందుకు? ఆ సమాచారాన్ని తిరస్కరించి, హేళన చేసి, దానితో సరిపెట్టుకునేవారు. కానీ నిజంగానే యూదుల రాజు పుట్టాడు కాబట్టే ఎక్కడ తన స్థానాన్ని ఆక్రమించుకుంటాడో అని హేరోదు కలవరపడ్డాడు. అతనితో ఉన్నవారికి అతని కౄర ప్రవృత్తి తెలుసు కాబట్టి ఇందుకు ప్రతిస్పందనగా ఎలాంటి అఘాయిత్యాలు చూడాల్సి వస్తుందో అని కాబోలు, వారు కూడా కలవరపడ్డారు. అయితే వారి కలవరం యూదుల రాజు రాకపై తమ విశ్వాసాన్ని ధృవీకరిస్తుంది. కాబట్టి వారు అవిశ్వాసులు కాదు, సత్యతిరస్కారులు.
 
సత్యాన్ని తెలిసి తెలిసి తిరస్కరించటం అనే ప్రమాదం ఒకటి ఉంది. వారికే కాదు ఎవరికైనా ఆ ప్రమాదం ఉంది.
ఈ రోజు యేసు గురించి తెలిసీ కూడా తమ జీవితాలలో ఆయనకు చోటు ఇవ్వని అన్యులు మరియు ఆయనను విశ్వసించామంటూ ఆయన ప్రభుత్వానికి తమ జీవితాలను సమర్పించుకోలేని క్రైస్తవులు, వీరంతా ఈ కోవకు చెందినవారే. వీరు సత్యం తెలుసుకుని విభ్రాంతినొందుతారు కానీ విమోచన పొందరు. ఇంతకంటే భయంకరమైన స్థితి వేరొకటి లేదు.
 

వచనం 4: కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజలలోనుండి శాస్త్రులును అందరిని సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను

 
"కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజలలోనుండి శాస్త్రులును అందరిని సమకూర్చి...":
 
ఇక్కడ హేరోదు తాను విన్న సంగతులను మరింత కూలంకషంగా తెలుసుకునే పనిలో పడి యూదుల మతపరమైన సంగతులు బాగా తెలిసిన పెద్దలను పిలువనంపాడు. ఆ పెద్దలను మత్తయి 'ప్రధాన యాజకులు' మరియు 'ప్రజలలోనుండి శాస్త్రులు' అని పేర్కొన్నాడు. ఒక సంవత్సరానికి ఒకే ప్రధాన యాజకుడు ఉంటాడు కదా, మరి బహువచనం ఎందుకు వాడాడు అనే సందేహం ఇక్కడ అక్కరలేదు. ఒకే ప్రధాన యాజకుడు ఉండాలని నియమమేమి లేదు. బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య ప్రారంభమైన సమయంలో కూడా ఇద్దరు ప్రధాన యాజకులు ఉన్నట్లు చదువుతాము (లూకా 3:2). అలాగే, పదవీ విరమణ అయిన ప్రధానయాజకులును కూడా అదే గౌరవ బిరుదుతో సంబోధిస్తారు.
 
అంతే కాకుండా 1 దినవృత్తాంతములు 24వ అధ్యాయంలో దావీదు యాజకులను విభాగించిన 24 తరగతులకు కూడా ప్రధానులు ఉంటారు. ఇలా ఎన్నో వివరణల అవకాశం ఉంది కాబట్టి మత్తయి చేసిన బహువచన ప్రస్తావనను తప్పు పట్టటం సాధ్యం కాదు. ఇక ప్రజలలోనుండి శాస్త్రులు విషయానికొస్తే, లేఖనాల ప్రతులు తయారు చేయటం, లేఖనాలను బోధించటానికి ప్రజలకు అందుబాటులో ఉండటం వారి పని. వీరు యాజకులలా లేవిగోత్రం నుండి మాత్రమే కాకుండా, అంటే గోత్రాలతో నిమిత్తం లేకుండా ప్రజలలో నేర్పరులైనవారు. ఈ కారణాలనుబట్టి వారు అలా సంబోధించబడి ఉండవచ్చు. పరిపాలకులకు మతపరమైన విషయాలలో ఆలోచన చెప్పే ఈ సలహాదారుల బృందాన్ని 'సన్హేద్రిన్' అంటారు. ఇందులో 70నుండి 72 వరకు సభ్యులు ఉండవచ్చు.  ఇక్కడ హేరోదు వారందరినీ సమావేశపరిచాడు.
ఇంతకు అతనికి వారి నుండి కావలసిన సమాచారం ఏమిటి?
 
"క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను"
 
"యూదుల రాజు" అంటే ప్రవచించబడిన "క్రీస్తు" (మెస్సియా) అని గుర్తించటంలో హేరోదు ఎలాంటి పొరపాటు చేయలేదు.
అయితే క్రీస్తు పుట్టుక విషయంలో విఫలం కాని లేఖనం ఆయన రాజ్యవిస్తరణ విషయంలో కూడా తప్పక వర్థిల్లుతుందని గ్రహించలేకపోయాడు. దేవుని సంకల్పాన్ని నిరర్థకం చేసే వ్యర్థ సాహసానికి పూనుకుంటున్నాడు. లేఖన సహాయంతో క్రీస్తును వెదకి ఆయనను చంపాలనుకోవటంకంటే గొప్ప ధిక్కారం ఇంకోటి ఉండదు. ప్రవచన నెరవేర్పు నిరూపించి, చారిత్రక ఆధారాలను కనపరిస్తే భక్తిహీనులు మారుతారనుకోవటం కంటే మూర్ఖత్వం కూడా ఇంకొకటి ఉండదు. మార్పు దేవుడు చేసే అద్భుతం. అందుకు సాధనాలుగా ఆయన ఆధారాలను వాడవచ్చేమో కాని ఆధారాలే ఆ అద్భుతాన్ని పుట్టించజాలవు.
 

వచనం 5: అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి. 

 
" అందుకు వారు"
హేరోదు అడిగిన ప్రశ్నకు ఆ ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ఎలాంటి సంకోచం లేకుండా ఇలా సమాధానం చెప్పారు.
 
"యూదయ బేత్లెహేములోనే"
వారు యూదయ బెత్లెహేము అని ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఇదివరకే మొదటి వచనపు వివరణలో తెలియచేయడం జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులలా యూదయ బేత్లెహేములోనే యూదుల రాజు పుడతాడని నక్షత్రం చూసి అంచనా వేయాల్సిన పరిస్థితిలో యూదులు లేరు. అది ప్రకటించే స్పష్టమైన లేఖనాలు వారి వశం చేయబడ్డాయి. లేఖన సమర్థనతో కచ్ఛితంగా సమాధానం ఇచ్చిన వీరికి పుట్టిన ఆ శిశువు వాగ్దానం చేయబడిన మెస్సియా అని, అప్పటి వరకూ వారు నిరీక్షించిన ఆ నెరవేర్పు ఇదే అని కచ్చితంగా నిర్థారించుకోగలిగే అవకాశం ఉండింది. అయినప్పటికీ, అన్యులైన ఈ జ్ఞానులకు యూదుల రాజుపై ఉన్న భక్తి ఈ యూదులకు లేకపోయింది. ఇక్కడ మనం నేర్చుకొదగిన గొప్ప పాఠం ఉంది. మొదట గొర్రెల కాపరులు యేసు పుట్టుక సమాచారం దేవదూత ద్వారా తెలుకున్న తరువాత వారు విన్న గొప్ప సంగతులను వెళ్లి యెరూషలేములో ప్రచురపరిచారు. అది విన్నవారందరూ ఆశ్చర్యపోయారు (లూకా 2:15-18).
 
ఆ తరువాత సుమెయోను మరియు అన్న ఆలయంలో ఆ శిశువును గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అనేకులు విన్నారు (లూకా 2:38) ఇశ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూసినవారు రెండు చేతులతో ఆ మెస్సియాను స్వీకరించి ఆయన వలన దేవుడు జరిగించబోయే సంగతులపై దృష్టి కేంద్రీకరించి ఉండాల్సింది. కాని దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా అలాంటిదేమి జరగకపోగా, ఎక్కడి నుండో అన్యులు వచ్చి అడిగేంతవరకూ ఇది యూదా పెద్దల దృష్టిని సైతం ఆకర్షించలేదు. ఇప్పుడైనా, అడిగిన ప్రశ్నకు సమాధానంగా లేఖనాలు వళ్లించటమే తప్ప వారు దానిని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. 
లక్ష్యపెట్టుంటే, వెంటనే వారు కూడా ఆ శిశువుకు సాగిలపడటానికి ఆ జ్ఞానులతోపాటు బయలుదేరి వెళ్ళుండేవారు.  "ఆయన తన స్వకీయల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు (యోహాను 1:10)"  అన్నది ఎంత విడ్డూరమైన వాస్తవమో ఇది మనకు తెలియజేస్తుంది. నిర్లక్ష్య వైఖరిగల వారిని మేల్కొల్పటం సాధ్యం కాదు, వారు యూదులైనా సరే, క్రైస్తవులైనా సరే. మొదటి రాకడను నిరీక్షిస్తూ అది వచ్చినప్పుడు నిర్లక్ష్యపెట్టిన ఆ తరంలాంటిదే రెండవ రాకడను నిరీక్షిస్తూ నిర్లక్ష్యంగా జీవించే నేటి తరం కూడా.
 
   "ఏలయనగా":
 
యూదుల రాజు యూదయలోని బేత్లెహేములోనే పుడతాడని చెప్పటానికి గల కారణాన్ని ఈ మత పెద్దలు ఇక్కడ తెలియజేస్తున్నారు. మీకా 5:2లో ఉన్న ప్రవచన లేఖనమే వారి సమాచారానికి ఆధారం. 
 
"యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదయ ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును."
 
మత్తయిలో ఉదాహరించబడిన ప్రవచనానికి మీకా 5:2లో ఉన్న లేఖనానికి స్వల్ప భాషాపరమైన వ్యత్యాసాలు ఉన్నాయి. దీనిని కొందరు పెద్ద వైరుధ్యంగా ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు, ఇక్కడ "యూదయ దేశపు బెత్లహేము" అని ఉంటే మీకాలో "బేత్లెహేము, ఎఫ్రాతా" అని ఉంది. అయితే, హేరోదు నాటికి ఎఫ్రాతా అనే పేరు వాడుకలో లేని కారణంగా ఆ పేరును వారు ఆయన ముందు ప్రస్తావించి ఉండకపోవచ్చు. కాని ఈ రెండూ ఒకే ప్రాంతం గురించే ప్రస్తావిస్తున్నాయి. బెత్లేహేం, ఎఫ్రాతా యూదయలో ఉన్న బేత్లెహేము అని మీకా ప్రవచనంలో కూడా స్పష్టం ఔతుంది. ఇతర లేఖనభాగాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి (రూతు 1:2 , సెప్టువజింట్ లో యెహోషువ 15:60). అలాగే ఇక్కడ "యూదా ప్రధానులలో" అని ఉంటే, మీకాలో "యూదావారి కుటుంబములలో" అని ఉంది. తెలుగు అనువాదంలో ఉన్నట్లు "కుటుంబములు" అని కూడా కాదు, మూల భాషలో "వేలలో" అని ఉంది. అంటే ఇశ్రాయేలీయులను పరిపాలనా సౌలభ్యం కొరకు వేయి-వేయిమందిగా విభజించించి ప్రతి వెయ్యి మందికి ప్రధానులను నియమిస్తారు. ఇది మోషే కాలం నుండి కొనసాగుతున్న ఆనవాయితీ.
 
కాబట్టి యూదా వారి "వేలలో" అని చెప్పినా, "ప్రధానులలో" అని చెప్పిన భావం ఒక్కటే. అలాగే ఇక్కడ "నీవు సల్పమైన దానవు కావు" అని ఉంటే మీకాలో "నీవు స్వల్పమైన గ్రామమైనా" అని ఉంది. నిజమే, ఇది దావీదు పుట్టిన గ్రామమైనప్పటికీ, మీకా సమయానికి స్వల్పమైన గ్రామంగా దిగజారి ఉండవచ్చు. కానీ మెస్సియా అందులో పుట్టబోతున్నాడు కాబట్టి అది స్వల్పమైనది కాదు అని చెప్పటమే ఆ ప్రవచన ఉద్దేశం. కాబట్టి ఇక్కడ వ్యత్యాసాలు భాషా సంబంధమైనవే తప్ప భావ సంబంధమైనవి కానే కావు. ఎదోమీయుడైన హేరోదుకు అర్థమయ్యే భాషలో హెబ్రీ లేఖనాన్ని భావానువాదంగా తెలియజేసే ప్రయత్నమే ఈ భాషాపరమైన వ్యత్యాసాలకు కారణమయ్యుండాలి.
 
"అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి"
 
ఏ ప్రవక్త రాసాడో ఇక్కడ చెప్పబడలేదు. అయితే లేఖనం సెలవిస్తోంది, ప్రవక్త వ్రాసాడు, ధర్మశాస్త్రంలో చదువుతాం లాంటి మాటలు, పాతనిబంధనను ఉదాహరించే అనేక సందర్భాలలో యూదులు కానీ, అపొస్తలులు కానీ వాడటం మనం గమనిస్తాము. ఇది యూదుల మధ్య లేఖనాలను ఉదాహరించే సాధారణ పద్ధతి అయ్యుండవచ్చు. అయితే, ఎంత విచారం, ఎంత భయంకరం! ఇది ప్రవక్త రాసిన మాట అని తెలిసినా, దాని నెరవేర్పును వారి చెవులారా విన్నా, అది ఆ మతపెద్దలను క్రీస్తు సన్నిధికి నడిపించలేదు. హృదయ కాఠిన్యమని దేనిని అంటారో ఇక్కడ నేర్చుకోగలం. ఎన్ని ఆధారాలు చూపించినా దేవుడు కృప చూపించకపోతే ఫలితం శూన్యం అని కూడా ఇక్కడ నేర్చుకోగలం.
       

వచనం 6: 'అంతటా హేరోదు రహస్యముగా ఆ జ్ఞానులను పిలిపించి'

 
యూదుల రాజు పుట్టే స్థలాన్ని తెలుసుకున్న తరువాత హేరోదు ఆ జ్ఞానులను తన సమక్షానికి రప్పించాడు. ఇది రహస్యంగా చేసాడని రాయబడింది. అంటే అతను వారితో సంభాషిస్తున్న మాటలు యూదులు ఒకవేళ వింటే, అతని వేషధారణ మరియు మోసపూరిత ఆలోచనలు వారికి బాగా తెలుసు కాబట్టి, అతని ప్రణాళికను అంచనా వేసి, ఆ జ్ఞానులకు తగిన సూచనలు ఇస్తే, యూదుల రాజును నాశనం చేయాలనే తన ఆలోచన భంగపడుతుందేమో అని ఈ జాగ్రత్త తీసుకున్నాడు.
 

వచనం 7: 'ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలిసికొని'

 
ఆ జ్ఞానులు యూదుల రాజు నక్షత్రం చూసి వచ్చారని చెప్పారు కాబట్టి, ఆ నక్షత్రం కనబడిన కాలాన్ని హేరోదు వారిని అడిగి తెలుసుకున్నాడు. ఇది ఆ రాజు పుట్టి ఎంత కాలం ఔతుందో అంచనా వేయటానికి సహాయపడుతుంది. ఆ శిశువును గుర్తించలేని పక్షంలో బేత్లెహేములో ఉన్న మగ శిశువులనందరిని చంపాలి. అయితే ఎంత వయస్సులోపు ఉన్న శిశువులను చంపాలి? అది నిర్థారించుకోడానికే ఈ సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అప్పటికే హేరోదు దాదాపు 35 సంవత్సరాలు పరిపాలించిన ముసలివాడు. అప్పుడే పుట్టిన శిశువు వల్ల అతనికి కానీ అతని అధికారానికి కానీ కలిగే నష్టమేమీ లేదు. అయినప్పటికీ ఆ రాజ్యానికి అసలు హక్కుదారుడు పుట్టాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ శిశువు వాగ్దానం చేయబడిన మెస్సియా అయితే, అతనిని నాశనం చేయాలని ఆలోచించడం, దేవునికే విరోధంగా పోరాడటం ఔతుందని, అలా చేయడం నిష్ప్రయోజనం మాత్రమే కాదు ఎంతో ప్రమాదకరం కూడా అని హేరోదు ప్రయత్నపూర్వకంగానే మరచిపోయాడు. అసూయ ఆలోచనను చంపేసింది. మెస్సియాను మట్టుపెట్టాలనే మౌఢ్యం మనస్సాక్షిని మొద్దుబారేలా చేసింది. కేవలం పశుప్రాయంగా తనను తాను రక్తదాహానికి అప్పగించుకున్నాడు.
 

వచనం 8: మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. 

 
'మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే'
 
హేరోదు మెస్సియా కొరకు వేట ప్రారంభించాడు. అందుకు ఆయనను ఆరాధించాలని వచ్చిన ఆ జ్ఞానులనే పావులుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శిశువు బేత్లెహేములో పుడతాడని తెలుసు. కానీ బేత్లెహేములో అంటే, ఏ కుటుంబములో, ఏ గృహంలో, అనేది ఎలా తెలుస్తుంది? అదే జాగ్రత్తగా విచారించి తెలుసుకుని రమ్మని హేరోదు ఆ జ్ఞానులను పంపిస్తున్నాడు. బేత్లెహేము ఎంతో దూరంలో లేదు. కావాలంటే తాను స్వయంగా వారితో వెళ్లియుండవచ్చు. లేదా రహస్యంగా వేగులవారిని వారి వెంట పంపించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ అతడు అలా చేయలేదు. ఎందుకంటే తన ఉద్దేశాన్ని పసిగడితేనే తప్ప జ్ఞానులు అతనికి కావలసిన సమాచారాన్ని ఇవ్వక మానరు. అందుకే వారికి అనుమానం కలగకుండా తన కుయుక్తికి భక్తి ముసుగు తొడుగుకున్నాడు. ఈ వేటలో వీరికి మించిన వేగులవారు అవసరం లేదని హేరోదు అతి తెలివి ప్రదర్శించి తనను తానే మోసగించుకున్నాడు. ఆ శిశువును కాపాడటంలో ఇదంతా దేవుని ఏర్పాటు. విరోధుల అతి తెలివిని కూడా వారి ఉరి నుండి తన బిడ్డలను విడిపించడానికి వాడే దేవునికి స్తోత్రము.
 
'నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను'
 
దుర్మార్గతను కప్పిపెట్టడానికి భక్తి నటించడంకంటే మెరుగైన ముసుగు వేరొకటి లేదు. అబ్షాలోము తన రాజ్యద్రోహానికి మ్రొక్కుబడి సహాయం తీసుకున్నట్లు (2 సమూయేలు15:7-10) ఇక్కడ హేరోదు తన దుష్ట ప్రణాళికకు 'పూజ' రంగు పులిమాడు. ఇలా ఆ జ్ఞానులను మోసగించివారినుండి ఆ శిశువు ఆచూకీ రాబట్టొచ్చని తనను తాను మోసగించుకున్నాడు. భక్తి ప్రదర్శించే వారందరూ భక్తిపరులు కారని అర్థం చేసుకోవాలి. మాటలు చెప్పినంత మాత్రాన భక్తి ఉన్నట్లు కాదు. చెప్పే మాటలకు చేసే పనులతో పొంతన లేనప్పుడు అది వేషధారణ ఔతుందని గుర్తు పెట్టుకుంటే, ఈ రోజు మన సంఘాలలో కూడా ఉన్న అనేక మంది హేరోదులను యిట్టె గుర్తు పట్టేయగలము.
 

వచనం 9: వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.

 
'వారు రాజు మాటవిని బయలుదేరి పోవుచుండగా'
 
జ్ఞానులు ఆ శిశువు యూదయ బేత్లెహేములోనే పుట్టియుండాలని హేరోదు వారికి ఇచ్చిన సమాచారాన్ని, ఆయన ఆచూకీ తనకు కూడా తెలియజేయాలని హేరోదు చెప్పిన మాటలను విని అక్కడనుండి బేత్లెహేముకు బయలుదేరారు. యూదుల రాజును కనుగొని ఆయనను పూజించాలనే వారి సంకల్పం ధృడమైనది. ఆ శిశువు పుట్టిన గ్రామమే వారికి తెలిసింది తప్ప ఖఛ్చితంగా ఆయన కోసం ఎలా వెదకాలో, ఎలా ఆయనను కనుగొనాలో వారికి కూడా తెలియదు. అయినా విశ్వాసంతో వారు ముందుకు సాగారు. అయితే, వారు మాత్రమే వెళ్ళడం, వారితో ఎవ్వరూ వెళ్ళకపోవడం, దర్బారు నుండి కానీ, యాజక వర్గం నుండి కానీ, యెరూషలేము పౌరులనుండి కానీ, మనఃస్సాక్షినిబట్టి కాకపోయినా, కనీసం మర్యాదపూర్వకంగా లేదా అసలు ఏమి జరుగుతుందో చూసొద్దాం అనే ఉత్సుకతతో అయినా, కనీసం ఒక్కరు కూడా వారితో వెళ్ళకపోవడం నిజంగా వింత అనాలో, విడ్డురం అనాలో తెలియదు. అయితే, విమర్శ దినమందు నీనెవె పట్టణస్థులవలే, దక్షిణ దేశపు రాణివలే (మత్తయి12:41-42), ఈ జ్ఞానులు కూడా  నిలువబడి ఈ తరం వారిమీద నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే అన్యులు అయినప్పటికీ వారు వచ్చారు కానీ, స్వకీయులు అయ్యుండి వీరు వెళ్ళలేదు.
 
వారు మైళ్ళు ప్రయాణం చేసి వస్తే, వీరు పొరుగూరిలో ఉండి కూడా వెళ్ళలేదు, వారు నక్షత్రం చూసి వచ్చారు కానీ, వీరు లేఖనాలు చదివి కూడా కదల్చబడలేదు. సౌకర్యం ఉండి కూడా ప్రభువు సన్నిధికి వెళ్ళని, సమీపంగా ఉన్నప్పటికీ ప్రభువు బిడ్డల సహవాసానికి చేరని, లేఖన జ్ఞానం ఉండి కూడా ప్రభువు తట్టుకు తిరగని నేటి 'క్రైస్తవులు' నామకార్ధ భక్తిలో నాటి యూదులకు ఏ మాత్రం తీసిపోలేదు. యూదుల ఈ వైఖరి ఆ జ్ఞానులను ఎంతో నిరుత్సాహపరిచే విధంగా ఉంది. మేము అంత దూరం నుండి వెదుకుకుంటూ వచ్చింది యూదులే పట్టించుకోని యూదుల రాజునా' అనుకుని వెనుదిరిగి వెళ్ళిపోయే ఆలోచనకు కూడా ఇది తావిస్తోంది. అయినా, ఆ జ్ఞానులు తమ నిర్ణయంలో నిలకడగా ఉన్నారు. యూదుల రాజును పూజించాలనే వారి పట్టుదలతో ధృడంగా ముందుకు కొనసాగారు. ఎవరి స్పందన ఎలా ఉన్నా మనం మాత్రం క్రీస్తును వెంబడించాలి. ఆయన రాజ్యాన్ని వెదకడంలో ఒంటరిగా అయినా సరే, ముందుకే కొనసాగాలి.  'వారు మనతో పరలోకానికి రాకపోయినా మనం వారితో నరకానికి వెళ్ళిపోకూడదు' (Matthew Henry). 
 
'ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను'
 
ఇలా ఆకాశంలో సంచరిస్తూ దారి చూపించే నక్షత్రం, ఈ సంఘటనకు ముందు కానీ తరువాత కానీ ఎప్పుడూ, ఎక్కడా, ఎవ్వరికీ, కనిపించిన దాఖలాలు లేవు. ఒక నక్షత్రం ఇలా మార్గదర్శి కావడం అనేది సహజాతీతమైన సంఘటన అని, దేవుడే చూపించిన గొప్ప సూచన అని స్పష్ఠం ఔతుంది. (ఈ నక్షత్రానికి సంబంధించిన వివరణ కొరకు మత్తయి 2:2 వాఖ్యానం చూడండి). 
 
మొదటి సారి ఈ నక్షత్రం వారికి ప్రత్యక్షమైనప్పుడు, ఆ రాజును వారు ఏ దేశంలో వెదకాలో సూచించి కనుమరుగైపోయింది. ఆ తరువాత వారు సాధారణ అన్వేషణా పద్ధతులపైనే ఆధారపడి ఇంత దూరం వచ్చారు. సహజంగా చేసుకోగలిగే పనుల కొరకు సహజాతీత దైవిక సహాయం రావలసిన అవసరం లేదు. కాబట్టి వారు అన్వేషించగలిగినంత దూరం వచ్చారు. కానీ ఇక ముందుకు కొనసాగడానికి వారికి దేవుడే సహాయం చేయాలి, అలాగే చేసాడు కూడా. రెండవసారి ఆ నక్షత్రం ప్రత్యక్షమై, ఆ శిశువు ఉండే చోటివరకు వారిని నడిపించింది. మన వంతు బాధ్యతను మనం నమ్మకంగా చేస్తే, దేవుడు నుండి రావాల్సిన సహాయాన్ని న్యాయంగా అపేక్షించవచ్చు. ఎంత ప్రతికూల పరిస్థితులలో అయినా, మన ప్రయత్నాలు మానకుండా ప్రభువు పనిలో ప్రయాసపడమని, గమ్యం వరకూ ప్రయాణాన్ని ఆయనే కొనసాగిస్తాడని ఇది మనకు ప్రబోధిస్తోంది, ప్రోత్సహిస్తుంది.
 

వచనాలు 10-11: వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 

 
'వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై'
 
యూదుల రాజు పుట్టాడని జ్ఞానులకు తెలిపిన ఆ నక్షత్రమే మళ్ళీ కనిపించడం, దారి చూపిస్తూ వారికి ముందుగా వెళ్ళడం వారికి ఎంతో ఊరట ఇచ్చింది. అప్పటి వరకూ వారు ఎదుర్కొన్న ప్రతికూల స్పందనంతా కేవలం వారికి కలవరాన్ని, నిరాశను కలిగించేవిగానే ఉండుండాలి. అయితే, ఒక్కసారిగా మళ్ళీ ఆ నక్షత్రాన్ని ప్రత్యక్షపరచి దేవుడు వారి హృదయాలను అత్యానందంతో నింపాడు. ఎవ్వరూ వారితో వెళ్ళకపోయినా దేవుడు ఆ ప్రయాణంలో వారికి తోడు నడుస్తున్నాడనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలి? వారు మోసపోలేదని, ఈ సుదీర్ఘ ప్రయాణం, ప్రయాస వ్యర్థం కాలేదని వారిని ఒప్పించడానికి ఇంతకన్నా ఏ అద్భుతం చూడాలి? దేవుని వెదకువారు సిగ్గునొందరు. అత్యానందం, నిత్యానందం వారి స్వంతం.  గమనించండి, ప్రభువుకు మనలను దగ్గర చేసే ప్రతి సాధనాన్నిబట్టి మనం ఆనందించాలి.
 
 'ఇంటిలోనికి వచ్చి'
 
జ్ఞానులు ఆ శిశువును కనుగొన్న నాటికి ఆయన ఇంకా పశువులుశాలలోనే ఉన్నాడని చాలామంది భావిస్తారు. ప్రభువు పుట్టుకకు సంబంధించిన చలనచిత్రాలు, లఘునాటికలు సాధారణంగా అలాంటి సన్నివేశాన్ని మనకు చూపిస్తాయి. కానీ ప్రభువు పుట్టుకకు, జ్ఞానుల రాకకు మధ్య చాలా రోజులు లేదా కొన్ని నెలల వ్యవధి ఉందని గుర్తించాలి. స్థలం లేనప్పుడు చేసుకున్న తాత్కాలిక ఏర్పాటుతోనే అంత కాలం వారు ఉండిపోరు కదా! అందుకే వారు ఒక ఇంటిలో ఉన్నట్లు చదువుతున్నాము. వారు ఆ ఇంటిలోకి ప్రవేశించి, 'యూదుల రాజు ఇల్లు ఇదేనా' అని ఎవర్నీ ప్రశ్నించలేదు. ఆ అవసరం లేకుండా నక్షత్రం వారికి ఖఛ్చితంగా, నిర్ధిష్టంగా ఆ ఇంటికి నడిపించింది.
 
'తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి ఆ శిశువును పూజించి'
 
తల్లిని, శిశువును చూసినప్పటికీ, శిశువును మాత్రమే వారు ఆరాధించారని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మరియమ్మకు దేవునితో సమాన స్థానాన్ని ఆపాదించేవారు ఇది ప్రత్యేకంగా గమనించాలి. అయితే, వారు ఎందుకు ఆ శిశువుకు సాగిలపడి పూజించారు? అది ప్రతి రాజునూ గౌరవించే వారి సంస్కృతి అని సరిపెట్టుకుపోవడం సాధ్యం కాదు. అలాంటి పూజ వారు హేరోదుకు చేసినట్టుగా రాయబడలేదు. నిజానికి ఇది వారి విశ్వాసానికి పరాకాష్ట. క్రీస్తును చూడకయే వారు విశ్వసించారు, కానీ అంతటితో ఆగిపోలేదు. తన స్వజనులు ఆయన పుట్టుకను అలక్ష్యపెట్టినప్పటికీ వారు విశ్వసించారు, కానీ అంతటితో కూడా ఆగిపోలేదు. ఒక పేద గృహంలో, తన తల్లి ఒడిలో పరుండిన ఒక నిస్సహాయ శిశువును చూసి, విశ్వసించి, ఆయనను పూజించారు. ఇదే వారి విశ్వాసంలో పతాక స్థాయి. ఒక శిశువును తప్ప ఎలాంటి సహజాతీత లక్షణాలు వారు ఆయనలో చూడలేదు. ప్రతీ శిశువు లాగే తన తల్లి పైన ఆధారపడిన ఒక సాధారణ శిశువుగా ఆయనను చూసారు. కానీ ఆ శిశువును చూసినప్పుడు, ఇతడే ఆ వాగ్దానం చేయబడిన యూదుల రాజని, లోక రక్షకుడని విశ్వసించారు. సాగిలపడి ఆయనను వారు పూజించారు. ఇది సిలువ మీద రక్షణ పొందిన ఆ దొంగకు కలిగిన విశ్వాసంతో సమానమైన విశ్వాసం. ఒక నేరస్థుని చావు అనుభవిస్తున్న ఒకనిని చూసి, విశ్వసించి, ఆయనను ప్రభువా అని ఆ దొంగ సంబోధించాడు. అలాగే ఈ జ్ఞానులు కొత్తగా జన్మించిన ఒక శిశువును ఒక బీద స్త్రీ వడిలో చూసి అతనే యూదుల రాజని విశ్వసించి పూజించారు. ఇలా విశ్వసించిన వారు ధ్యనులు. ఇలాంటి విశ్వాసాన్నే దేవుడు అత్యధికంగా ఘనపరుస్తాడని మరచిపోవొద్దు. 
 
యేసే క్రీస్తు అని ఒప్పించడానికి వారికంటే వేయి రెట్లు అధిక ఆధారాలు, అవకాశాలు మనకు లేవా? అయినా వారివలె ఆయనకు తమను తాము సమర్పించుకోడానికి సంకోచించేవారు ఆలోచించాలి. ఏది మన విశ్వాసం? ఏది మన సమర్పణ? ఏది మన ఆరాధన?
 
'తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి'
               
ఇవి వారి దేశంలో ప్రశస్తమైనవిగా పరిగణించబడి, గౌరవానికి చిహ్నాలుగా ఇవ్వబడే కానుకలు అయ్యుండాలి. ప్రభువును విశ్వసించేవారు, ఆరాధనలో తమతో పాటుగా, తాము ఇవ్వగలిగే శ్రేష్టమైనవి ప్రభువుకు అర్పిస్తారు. వీరి సమర్పణ, అర్పణ, వాక్యం చదివే ప్రతి చోటా జ్ఞాపకం చేయబడే ధన్యతనును అనుగ్రహించి వారి ఆరాధనను దేవుడు చిరస్మరణీయం చేసాడు. 
రండి, మనం కూడా వారి అడుగుజాడలలో నడిచి నిజంగా జ్ఞానులు అనిపించుకుందాం. జ్ఞానులు ఈ మూడు కానుకలు ఇచ్చారు కాబట్టి వారు ముగ్గురని, ఒక్కొక్కరూ ఒక్కో కనుక ఇచ్చారని కొందరు భావిస్తారు. కానీ అలా భావించాల్సిన అవసరం లేదని వేరే చెప్పనవసరం లేదు. వారి సంఖ్య మనకు తెలియదు.
 

వచనం 12: తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. 

 
'తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని'
 
ఆ శిశువు ఆచూకీ తనకు కూడా తెలియజేయాలని హేరోదు వారిని ఆదేశించిన సంగతి మనకు తెలుసు. అయితే అందులో అతనికున్న దురుద్దేశం గురించి జ్ఞానులకు తెలియదు కాబట్టి వారు హేరోదుకు సమాచారం చేరవేసి ఉండేవారు. ఇతరులు కూడా తమవలే యథార్థవంతులే అని పొరబడటం యథార్థవంతులకు సాధారణంగా ఉండే ఒక బలహీనత.  హేరోదు దుష్ట ప్రణాళికలో వారిని కూడా పావులుగా వాడుకుంటున్నాడని ఆ జ్ఞానులకు తెలియదు. కానీ తన అభిషిక్తునిని ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు.
 
'స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై' 
 
ఆ జ్ఞానులు బహుశా అక్కడే ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉండవచ్చు. నిద్రలో కలిగే స్వప్నాలను తన ప్రత్యక్షతలకు దేవుడు సాధనంగా వాడుకున్న ఎన్నో లేఖన సందర్భాలలో ఇది కూడా ఒకటి. మనం ముందు చెప్పుకున్న విధంగా, హేరోదు చేయాలని అనుకున్న కీడు గురించి ఆ జ్ఞానులకు ఏమీ తెలియదు కాబట్టి బహుశా వారు ఆ శిశువు గురించిన సమాచారంతో అతని వద్దకు తిరిగి వెళ్ళుండేవారే. కాని దేవుడే వారిని వెళ్ళవద్దని హెచ్చరించి ఆ ప్రమాదాన్ని తప్పించాడు. దానితోపాటు ఈ స్వప్నం ఆ శిశువు పుట్టుక దేవుని ప్రణాళికే అని కూడా మరోసారి వారికి ధృవపరచింది. అన్యులైన జ్ఞానులతోనే దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడాడు కాబట్టి మాకు కలిగిన స్వప్నాలను కూడా దైవ ప్రత్యక్షతలుగా అంగీకరించాలని ఈ రోజు అనేకులు వాదిస్తారు. అయితే, ఆ జ్ఞానుల స్వప్నం విశ్వసనీయమైన దేవుని వాక్య సాక్ష్య ఆధారంగా అంగీకరిస్తున్నాం.
 
  "కల కంటిని, కలకంటిని" అని చెప్పుకునే వారందరి స్వప్నాలను ధృవీకరించే విశ్వసనీయ ప్రమాణం ఏది లేదు కాబట్టి మనం వాటిని అంగీకరించాల్సిన అవసరం లేదు  (యిర్మియా 23:25-27). 
  
దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథమే అంతిమ ప్రత్యక్షత.
 
'వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి'
 
ఆ జ్ఞానులు సమాచారంతో 'తిరిగి వస్తాం' అని హేరోదుకు మాట ఇచ్చినట్లు ఎక్కడా చదవము. ఒకవేళ ఇచ్చినా, వారు ఆ మాట నిలబెట్టుకుంటే కీడుకు సహకరించడమే ఔతుంది. నష్టం కలిగినా మాట తప్పకూడదు అనే తప్ప పాపం జరిగినా మాట తప్పకూడదని వాక్యం ఎక్కడా బోధించడు. ఏదిఏమైనా, వారు ఇచ్చిన మాటకంటే, దేవుడు సెలవిచ్చినమాటే శ్రేష్ఠమైనది కాబట్టి వారు ఇక్కడ సరైన నిర్ణయమే తీసుకున్నారు. వేరొక మార్గాన వారి దేశానికి వెళ్ళిపోయి దేవుని మాటపై వారి విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.