కొత్త నిబంధన

రచయిత: జి. బిబు

విషయసూచిక:- 1:1, 1:2, 1:3 , 1:4, 1:5 , 1:6 , 1:7 , 1:8 , 1:9 , 1:10 , 1:11 , 1:12 , 1:13-15 , 1:16 , 1:17 , 1:18 , 1:19 ,1:20 ,1:21 , 1:22 ,1:23 , 1:24 , 1:25 .

మత్తయి 1:1 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.

"అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన"

మత్తయి ఈ ప్రారంభ అధ్యాయంలో మొదటి 17 వచనాలలో ఒక పెద్ద పేర్లపట్టికను మన ముందుంచాడు. అతను అబ్రాహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎవరు ఎవరిని కన్నారు అనే వివరాలు ఇక్కడ మనకు అందిస్తున్నాడు. యేసు క్రీస్తు అబ్రాహాము సంతతివాడని, దావీదు వంశానికి చెందినవాడని నిరూపించడమే ఈ చరిత్రంతా చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఎందుకంటే సర్వలోకానికి ఆశీర్వాదంగా ఉంటాడని వాగ్దానం చెయ్యబడిన మెస్సీయా అబ్రాహాము సంతానమయ్యుండాలని, దావీదు సింహాసనాన్ని నిత్యం కొనసాగించే వారసుడయ్యుండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది మెస్సీయాకు ఉండి తీరవలసిన మొదటి గుర్తు.

క్రీస్తు శకం 70వ సంవత్సరం తర్వాత పుట్టిన ఏ ఇశ్రాయేలీయుడికి కూడా తాను దావీదు సింహాసనానికి వారసుడని నిరూపించుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే టైటస్ అనే రోమీయులకు అధిపతి ఇశ్రాయేలును ఆక్రమించుకుని వారిని భూదిగంతములవరకూ చెదిరిపోయేలా చేసాడు. ఇది వారి వంశావళులను ప్రామాణీకరించుకునే అవకాశాన్ని పూర్తిగా చెల్లాచెదరు చేసేసింది. దాదాపు 1878 సంవత్సరాల వరకూ మళ్ళీ వారు తమ స్వదేశానికి తిరిగి సమకూర్చబడడం సాధ్యం కాలేదు. మే నెల,1948 మొదలుకొని ఇశ్రాయేలు దేశానికి తిరిగి సమకూర్చబడినవారు చెప్పుకునే వంశావళి పట్టికలు ఒకవేళ ఏవైనా ఉన్నా సరే వాటికి ప్రామాణికత ఏముంటుంది? వారు ఒక్కదేశంగా ఉన్నప్పుడు నమోదు చెయ్యబడిన వంశావళి పట్టికలకున్న ప్రామాణికత, ఎక్కడో రాసుకుని తెచ్చిన పత్రాలకు ఉందని ఎలా నిరూపించగలరు? అయితే వీరు చెదిరిపోయిన సంఘటనకు ముందు అందుబాటులో ఉన్న వంశావళుల్లో యేసుక్రీస్తులో నిరూపించబడిన మెస్సీయా లక్షణాలు ఉన్న వేరెవ్వరూ కనిపించరు. కాబట్టి ఈ వంశావళి జాబితా యేసుక్రీస్తే రానైయున్న మెస్సీయాగా నిరూపించడానికి అనుకూలపడే విధానంగా దేవుడు చరిత్ర సంఘటనలను నిర్దేశించాడు. నేటివరకూ యేసే మెస్సీయా అని నిరూపించే ఇంత బలమైన ఆధారాన్ని భద్రపరచిన మన దేవునికి వేలాది స్తోత్రములు.

17 వచనాలున్న ఈ వాక్యభాగం, కొత్త నిబంధన అంతటిలో అత్యధికంగా నిర్లక్ష్యానికి గురి అయ్యే భాగం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పేర్లే కదా అందులోనూ నోరు తిరగని పేర్లే ఎక్కువ; వీటిని దాటేసి సందేశం ఉన్న భాగాలు చదివితే చాలులే అని తలంచడం సహజమే. అయితే ఈ మాటలతోనే కొత్త నిబంధన ప్రారంభం ఔతుందని మరచిపోవొద్దు. భయభక్తులతో వాటిని మనం చదవాలి. మన ముందు ఉంచబడిన ఈ పుస్తకంలోనివి మానవుల మాటలు కావు, దేవుని మాటలు. వ్యర్థంగా ఉచ్ఛరించే ప్రతి మాటకూ లెక్క అడిగేవాని వాక్యంలో వ్యర్థమైన ఒక్కమాటైనా ఉండటం సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరితమైన ఏ వాక్యభాగమైనా వ్యర్థమని తలంచే సాహసం ఎవ్వరూ చెయ్యకూడదు. అనవసరమైనవిగా మనకు తోచే వాక్యభాగాలను కూడా ప్రార్థనపూర్వకంగా పరిశీలిస్తే వాటి ద్వారా దేవుడు ఉద్దేశించిన గొప్ప లాభాన్ని మనం పొందగలం.

దేవుడు నమ్మకంగా తన వాక్యాన్ని నెరవేర్చేవాడని ఈ వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. అబ్రాహాము సంతానం వల్ల భూమి యొక్క సమస్త వంశాలూ ఆశీర్వదించబడతాయి అని దేవుడు వాగ్దానం చేసాడు (ఆదికాండం 12: 3) రక్షకుడు దావీదు వంశం నుండి వస్తాడని కూడా దేవుడు మాట ఇచ్చాడు (2సమూయేలు7:16, యెషయా 11: 1). దేవుడు ఆ మాటలు నెరవేర్చాడని నిరూపించేవే ఈ 17 వచనాలు.

కొన్ని వేల సంవత్సరాల ముందు అబ్రాహాముకు, అలాగే కొన్ని వందల సంవత్సరాల ముందు దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాల నెరవేర్పును ఇక్కడ మనం చదువుతున్నాము. ఇంత ఆలస్యమని మనకు తోచినా దేవుడు సకాలంలో తన మాటలన్నిటినీ నెరవేర్చేవాడని ఈ భాగం మనకు నేర్పిస్తుంది. దేవుని మాటలను అలక్ష్యపెట్టే భక్తిహీనులకు ఈ మాటలు చదివినప్పుడు భయం కలగాలి. వారేమనుకున్నా సరే దేవుడు తన మాటలు నెరవేర్చేవాడు. వారు మారుమనస్సు పొందకపోతే నశిస్తారన్న మాటను కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నిజ క్రైస్తవులు కూడా ఈ మాటలు జ్ఞాపకముంచుకుని ఆదరణ పొందాలి. పరలోకమందున్న తమ తండ్రి తాను చెప్పిన ప్రతి మాటకు ఆయన కట్టుబడియుంటాడు. క్రీస్తునందు విశ్వసించినవారందరినీ రక్షిస్తానని ఆయన సెలవిచ్చాడు. సెలవిస్తే దానిని తప్పక నెరవేరుస్తాడు. అబద్దమాడడానికి ఆయన నరుడు కాదు. ఆయన నమ్మదగినవాడు; తన స్వభావానికి విరోధంగా ఏమి చెయ్యలేడు (2తిమోతి 2: 13)

"యేసు క్రీస్తు వంశావళి"

తెలుగు అనువాద క్రమంలో "యేసు క్రీస్తు వంశావళి" అనే మాటలు ఈ వచనం చివరిలో ఉన్నప్పటికీ మూలభాషలో ఈ మాటలతోనే ఈ గ్రంథం ప్రారంభమౌతుంది. అదే ఈ గ్రంధానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో మత్తయి పెట్టిన పేరు. "యేసు క్రీస్తు వంశావళి గ్రంథం" అన్నప్పుడు, కేవలం వంశావళి పట్టికకు మాత్రమే అది పరిమితం అని అర్థం కాదు. ఆయన పుట్టుక, జీవితం, మరణం, పునరుత్థానం, బోధలు, క్రియలు - అన్నీ అందులో భాగమే. పూర్తి చరిత్రను వంశావళి గ్రంథంగా పిలిచే ప్రాచీన లేఖన పద్ధతినే మత్తయి ఇక్కడ కొనసాగిస్తున్నాడని గుర్తించగలం. ఉదాహరణకు "ఆదాము వంశావళి గ్రంథం" (ఆదికాండము5:1) అని ఉన్న అదే శైలిలో మత్తయి ఈ మాటలు రాసాడు. అక్కడ మొదటి ఆదాము వివరాలన్నీ పొందుపరచబడిన విధంగా ఇక్కడ రెండవ ఆదామైన క్రీస్తు వివరాలు రాయబోతున్నాడు. దేవునిగా ఆయనకు వంశావళి ఉండడం సాధ్యం కాదు. అయితే మానవుడిగా ఆయనకున్న వంశావళి ఇక్కడ తెలపబడింది.

ఇక్కడ కొట్టొచ్చేలా కనిపించే మరో ఆసక్తికరమైన సంగతేంటంటే మత్తయి తన పుస్తకాన్ని ఈ వంశావళితో ప్రారంభించడం ద్వారా పాతనిబంధన ప్రత్యక్షతకు కొనసాగింపును రాస్తున్నానని చెప్పకనే చెబుతున్నాడు. దావీదు వంశావళి క్రమంలో అభిషిక్తుడు రావాలనే వాగ్దానం నెరవేరే చరిత్ర జెరుబ్బాబెలు వరకు వచ్చి హఠాత్తుగా ఆగిపోయినట్టు పాతనిబంధన చివరి గ్రంథాల్లో గమనిస్తాము. జెరుబ్బాబెలును తన ముద్రాఉంగరంగా చేసుకుంటానని దేవుడు హగ్గయి ద్వారా సెలవిచ్చిన మాట అతని జీవితకాలంలో నెరవేరలేదు (హగ్గయి2:23). కాబట్టి అబ్రాహాము మరియు దావీదుకు చేసిన వాగ్దానసంతానం, అంటే సమస్త జనములకూ ఆశీర్వాదంగా ఉండి, దావీదు సింహాసనం నుండి నిత్యం ఏలుబడి చేసే దేవుని "ముద్రా ఉంగరం" జెరుబ్బాబెలు వంశావళి క్రమం నుండి వస్తాడని ఇక్కడ గ్రహిస్తున్నాము. ఆదాము మొదలుకొని జెరుబ్బాబెలు వరకూ దేవుడు క్రమంగా రాయిస్తూ వచ్చిన ఈ విమోచనాగాథకు కొనసాగింపును మత్తయి ఇక్కడ రాస్తున్నాడు. అంటే తాను రాసేది లేఖన కొనసాగింపు అనే పూర్తి అవగాహనతోనే మత్తయి ఈ మాటలు రాస్తున్నాడు. మత్తయి సువార్త దేవుని లేఖన కొనసాగింపు అనడానికి ఇదొక బలమైన ఆధారం.

మత్తయి 1:2 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను.

"అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను"

ఇస్సాకును కనకముందు అబ్రాహాము ఇష్మాయేలును కన్నాడు. ఇస్సాకును కన్న తర్వాత కూడా చాలా మంది పిల్లలను కన్నాడు. కానీ ఇక్కడ వారెవ్వరూ ప్రస్తావించబడలేదు. ఎందుకంటే మెస్సీయా రావలసింది వారెవ్వరి వంశావళి క్రమంనుండి కాదు కానీ "ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును" అని లేఖనం సెలవిస్తోంది (ఆదికాండము 21:12). అదేవిధంగా ఇస్సాకు యాకోబుతో పాటు అతనికి కవలగా పుట్టిన ఏశావును కూడా కన్నాడు. అయితే ఏశావు జ్యేష్ఠుడైనప్పటికీ దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడు. కాబట్టి ఈ వాగ్దాన వారసత్వంలో ఏశావుకు పాలు లేదు.

ఇస్సాకును ఎన్నుకుని ఇష్మాయేలును విడిచిపెట్టడం, అలాగే యాకోబును ఎన్నుకుని ఏశావును తృణీకరించడాన్ని, నిత్య రక్షణ విషయమై దేవుడు కొందరిని తన సర్వాధికారంలో ఎన్నుకున్నాడనడానికి నిదర్శనాలుగా పౌలు ప్రస్తావించాడు (రోమీయులకు 9:8-23). అంటే ఈ వంశావళి వరసలో ఉన్నవారందరూ రక్షింపబడినవారని లేదా దీనికి వెలుపల ఉన్న వారందరూ తిరస్కరించబడినవారని దీని అర్థం కాదు కాని, రక్షణతో సహా ఎలాంటి ఆధిక్యతైనా దేవుని సార్వభౌమ కృపను బట్టే కలుగుతుందని ఇక్కడ తప్పక నేర్చుకుంటాము. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించి ఆయన కృపకే మహిమను ఆపాదించాలి.

"యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను"

యాకోబుకు యూదా జ్యేష్ఠకుమారుడు కాకపోయినప్పటికీ వాగ్దాన సంతానం అతని నుండే రావాలని దేవుడు సంకల్పించాడు (ఆదికాండము 49:10, 1 దినవృత్తాంతములు 5 :2 ). నిర్వివాదంగా మన ప్రభువు ఈ గోత్రమందే శరీరధారిగా పుట్టాడు (హెబ్రీయులకు 7 :14 ). అయితే ఇస్సాకు మరియు యాకోబులా కాకుండా ఇక్కడ యూదా అన్నతమ్ముళ్ళు కూడా ప్రస్తావించబడడం గమనించదగిన విషయం. ఎందుకంటే క్రీస్తు యూదా గోత్రం నుండి పుట్టినప్పటికీ ఆయన ఇశ్రాయేలు జాతంతటికి అనుగ్రహించబడిన వాగ్దాన సంతానం (ద్వితీయోపదేశకాండం 18:15-18. అందుకే ఆయన యూదుడైనప్పటికీ "శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను" అని పూర్తి ఇశ్రాయేలుకు ఈ ఆధిక్యత ఆపాదించబడడం గమనిస్తున్నాము (రోమీయులకు 9:4-5).

మత్తయి 1:3 యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను.

"యూదా తామారునందు"

వంశావళులు నమోదు చేస్తున్నప్పుడు స్త్రీల పేర్లు దాఖలా చెయ్యడం యూదుల పద్ధతి కాదని, మత్తయి ఆ పద్దతికి భిన్నంగా కొంతమంది స్త్రీలను పేర్కొన్నాడని కొందరు వ్యాఖ్యానకర్తలు అభిప్రాయబడుతుంటారు. కానీ దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్న వంశావళి పట్టికను పరిశీలించినప్పుడు అక్కడ చాలా మంది స్త్రీల ప్రస్తావన కూడా కనిపిస్తుంది (1దినవృత్తాంతములు 1:32-33, 39, 2:3-4, 6, 26 ఇందుకు కొన్ని ఉదాహరణలు). అయితే మత్తయి పేర్కొన్న స్త్రీలు ఒక నిర్దిష్టమైన సందేశాన్ని వ్యక్తపరిచేవిధంగా ప్రస్తావించబడ్డారని గుర్తించడం, వారి చరిత్ర తెలిసిన వారికీ కష్టమేమి కాదు.

యేసు తల్లియైన మరియ తప్ప మత్తయి పేర్కొన్న మిగతా నలుగురు స్త్రీలు కూడా నైతికంగా లేదా సామాజికంగా ఎంతో దిగజారిన నేపథ్యం నుండి వచ్చినవారే. తన మామతో వ్యభిచరించిన తామారు, వేశ్యయైన రాహాబు, మోయాబీయురాలైన రూతు, మరియు దావీదుతో వ్యభిచరించిన బత్షెబా (మత్తయి 1:3,5,6). ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా నైతికంగా దిగజారిన స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయని ఇక్కడ స్పష్ఠం ఔతుంది. ఈ పేర్లు చెప్పడం ఒకవేళ యేసుకు అపకీర్తి కలుగుతుందని దేవుడు అనుకునుంటే యేసు వంశంలో ఘనులైన శారా, రిబ్కా, రాహేలు వంటి సాధు స్త్రీలను పేర్కొనియుండేవాడు. ఆయన వంశావళిని కలుషితం చేసిన ఈ నలుగురు స్త్రీలనే ఎందుకు పేర్కొన్నట్టు? ఇది పాపులకు యేసు చూపించే కరుణను, క్షమాపణను ప్రకటించే వంశావళి పట్టిక. ఏ పాపమూ లేని ప్రభువు, ఎంత పాపినైనా చేర్చుకోవడానికి సంసిద్ధుడు కాబట్టి, అంతగా దిగజారిన వంశావళిని తన కొరకు స్వీకరించడానికి వెనుదీయలేదు. ఇందులో ఆయన త్యాగం, తగ్గింపు, మరియు కృపాసహితమైన రక్షణ మిళితమై, ఎలాంటి ఘోరపాపికైనా నిరీక్షణ, అంగీకారం మరియు నూతన జీవితానికి ఆహ్వానం పలుకుతున్నాయి.

ప్రవక్తలు, ఘనులు, మహాత్ములతో సహ మనుష్యులందరూ పాపులే. నీతిమంతుడొక్కడూనూ లేడు. దేవుని వద్దనుండి కలిగే ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ మరియు పరిపూర్ణ నీతి ప్రాప్తిస్తాయి. అయితే ఆ కృప, క్షమాపణ మరియు నీతి, యేసుక్రీస్తుతో సంబంధం కలిగియుండడం వల్ల మాత్రమే లభిస్తాయి. యూదా, లోతు, దావీదు వంటి వ్యభిచారులు మరియు నరహంతకులు సహితం యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నట్టు నమోదు చేసిన వెంటనే "ఆయన తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును" (మత్తయి1:21 ) అని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఎంతో ఆదరణతో కూడిన ఉపదేశం దాగియుంది. ఎంత ఘోరపాపి అయినా యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ద్వారా పాపమాలిన్యం మరియు పాపశిక్ష నుండి రక్షించబడతాడు (యోహాను 1:12యోహాను 1:7-9).

"పెరెసును జెరహును కనెను"

పెరెసు నుండే యేసు వంశావళి కొనసాగినప్పుడు జెరహును ప్రస్తావించడం ఎందుకు అనేది వ్యాఖ్యానకర్తలకు ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. వారు కవలలు కాబట్టి ప్రస్తావించి ఉంటారేమో అనుకోలేము. ఎందుకంటే ఏశావు యాకోబులు కూడా కవలలే అయినా యాకోబు మాత్రమే పేర్కొనబడ్డాడు. అయితే పెరెసు మరియు జెరహు జనన సమయంలో చోటు చేసుకున్న వింత సంఘటన వెనుక ఒక మర్మం దాగియుందని (ఆదికాండము 38:28-30), జెరహు మొదట చేయి చాచిన విధంగా ఇశ్రాయేలు మొదట స్పందించినప్పటికీ పెరెసువలే సంఘం సందు చేసుకుని మొదట పుట్టిందని, అన్యులకాలం సంపూర్ణమైన తర్వాత జెరహు పుడతాడని, అంటే ఇశ్రాయేలు రక్షింపబడుతుందని (రోమా11:25-26) కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇది అతి అలంకారీకరణకు తావిస్తుంది. బహుశా చిన్నవానికి పెద్దవాని జ్యేష్ఠాధిక్యాన్ని ప్రసాదించగల దేవుని ఏర్పాటును ఇది సూచిస్తుందని సరిపెట్టుకోవడం ఇక్కడ మరింత ఉత్తమం. నిజానికి ఇది దాదాపు ఈ వంశావళి అంతటిలోనూ సామాన్యంగా కనబడే వాస్తవం.

"పెరెసు ఎస్రోమును కనెను"

ఎస్రోము హెస్రోను అని కూడా పిలవబడ్డాడు (రూతు 4:18).పెరెసు హామూలును కూడా కన్నాడు (1దినవృత్తాంతములు 2:5). అయితే వాగ్దాన సంతానం మాత్రం ఎస్రోము వంశావళి నుండి రావాలని దేవుడు నిర్ణయించాడు.

"ఎస్రోము అరామును కనెను"

అరాము రాము అని కూడా పిలవబడ్డాడు (రూతు 4:19). ఎస్రోము ఇతనితో పాటు యెరహ్మెయేలు, కెలూబై లేదా కాలేబు, మరియు సెగూబులను కూడా కన్నాడు ( 1దినవృత్తాంతములు 2:9,21). అయితే వీరెవ్వరు యేసు క్రీస్తు వంశావళిలో పాలివారు కాదు. యోబుతో సంభాషించిన ఎలీహు రాము కుటుంబానికి చెందినవాడని చదువుతాము. అయితే అక్కడ చెప్పబడిన రాము ఇక్కడ ఉన్న అరామేనా అన్నది పరిశీలించవలసిన విషయం.

మత్తయి 1:4 ​పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీమనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను.

రూతు 4:19లో కూడా సరిగ్గా ఇదే వంశావళి క్రమం నమోదు చెయ్యబడింది. యూదులు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పలేని ఆధారాన్ని మత్తయి వారి ముందు ఉంచాడు. ఇక్కడ గమనించదగిన మరో విషయం ఏంటంటే ఈ వంశావళిలో ప్రతి వ్యక్తి ఒకే విధంగా కీర్తి ప్రతిష్టలుగలవారు కాదు. కొందరు బాగా ప్రఖ్యాతిగలవారైతే కొందరి గురించి, వారి పేరు తప్ప మరేమీ తెలపబడలేదు. దేవుని రాజ్యవిస్తరణలో కూడా ఇదే వాస్తవాన్ని మనం గమనిస్తాము. ఎంత ప్రఖ్యాతి గడించామన్నది కాదు, దేవునికై ఎంతగా వినియోగించబడ్డాం అన్నదే మన ధన్యత.

మత్తయి 1:5 నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను.

శల్మాను బోయజును కన్నాడని పాత నిబంధన ధృవీకరిస్తుంది (రూతు 4:211 దినవృత్తాంతములు2:11). అయితే రాహాబు నందు కన్నాడని ఇక్కడ తప్ప బైబిల్ లో ఇంకెక్కడా కనిపించదు. అయినా ఇది యూదుల మధ్య సామాన్యంగా అంగీకరించబడిన వాస్తవం కాకపోతే మత్తయి దానిని వారి ముందు ప్రస్తావించి తన ఆధారాన్ని బలహీనపరచియుండేవాడు కాదు. వేశ్యయైన రాహాబు యెహోవాను విశ్వసించడం ద్వారా ఇశ్రాయేలులో స్థిరనివాసంతో పాటు, యేసుక్రీస్తు వంశావళిలోనూ విశ్వాసవీరుల జాబితాలోనూ చిరస్మరణీయంగా నిలిచిపోయింది (యెహొషువ 6:25 హెబ్రీ 11 :31). పాపుల్లో ఇంత గొప్ప మార్పు కలుగచెయ్యగల మన దేవునికే మహిమ.

"బోయజు రూతునందు ఓబేదును కనెను"

ఈ చరిత్ర రూతు గ్రంథంలో స్పష్టంగా నిర్ధారించబడింది. రూతు అన్యురాలు మాత్రమే కాదు, లోతు కుమార్తె పాపఫలితంగా కలిగిన మోయాబు వంశీయురాలు. వేశ్యయైన రాహాబు, మోయాబీయురాలైన రూతువంటి నేపథ్యం గల స్త్రీలను యేసుక్రీస్తు వంశావళిలోనికి దేవుడు ఎందుకు అనుమతించాడనడానికి ఇదివరకే వివరణ ఇచ్చాము (మత్తయి 1:3 వ్యాఖ్యానం చూడండి). ఈమె వంశావళిలో పుట్టిన దావీదును రాజుగా అంగీకరించిన యూదులు, దావీదు కుమారుడైన మెస్సీయాకు అభ్యంతరంగా ఈ వంశావళిని విమర్శించటం సాధ్యం కాదు.

"ఓబేదు యెష్షయిని కనెను"

ఓబేదుకు మరియు యెష్షయికి మధ్య కనీసం నాలుగు తరాల ఎడం ఉండి ఉండొచ్చని కొందరు యూదా వ్యాఖ్యానకర్తలు అభిప్రాయబడుతుంటారు. అది ఒకవేళ నిజమైనా ఓబేదు తన మునిమనవడిని కన్నాడని మత్తయి చెప్పడాన్ని, అంటే వంశావళి క్రమంలో కొన్ని తరాలను దాటవేసి ముఖ్యమైన పేర్లను మాత్రమే ప్రస్తావించడాన్ని, యూదులు ఒక అభ్యంతరంగా చూపించడం సాధ్యం కాదు. ఎందుకంటే రూతు గ్రంథంలో కూడా ఇదే పద్ధతి పాటించినట్టు, ఓబేదుకు యెష్షయికి మధ్య ఉన్న పేర్లు దాటవెయ్యబడినట్టు గమనిస్తాము. బబులోను చెరకు వెళ్ళిన హిజ్కియా వంశస్థులకు అతనితో ఎన్నో తరాల ఎడం ఉన్నప్పటికీ వారిని ఆయన కన్నట్టు చెప్పబడింది (యెషయా 39:7). కాబట్టి ఫలానా వారు కన్నారు అని చెప్పినంత మాత్రాన వారి కుమారులే అయ్యుండనవసరం లేదని, వారి వంశానికి చెందిన వారనే అర్థం కూడా వస్తుందని యూదుల లేఖనాల పరిభాషలోనే వివరణ ఇవ్వగలం.

యెష్షయి ఈ వంశావళిలో చాలా ముఖ్యమైన పేరు. మెస్సీయాను యెష్షయి కుమారుడనే పేరుతో గుర్తించి యూదులు ఇప్పటికీ వారి సమాజమందిరాలలో ఆయన రాక కొరకు ప్రార్థిస్తారని డా.జాన్ గిల్ ఈ వచనంపై తన వ్యాఖ్యానంలో తెలియచేసారు. ప్రవచనంలో మెస్సీయా యెష్షయి మొద్దు నుండి పుట్టే చిగురుగా వాని వేరుల నుండి పుట్టే అంకురంగా అభివర్ణించబడడం ఇందుకు కారణం అయ్యుండవచ్చు (యెషయా11:1).

మత్తయి 1:6 యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.

ఈ వంశావళి క్రమంలో చాలా మంది రాజులు ఉన్నప్పటికీ దావీదు మాత్రమే "రాజైన దావీదు " అని పిలవబడ్డాడు. ఎందుకంటే దావీదును దేవుడే రాజుగా ఉండడానికి ఏర్పరచి అతని సింహాసనం నిరంతరం నిలుస్తుందని వాగ్దానం చేసాడు. అందుకే ఆ సింహాసనం పై తర్వాత ఎంతమంది కూర్చున్నా సరే అది దావీదు సింహాసనంగానే పిలువబడింది. ఆ నిత్యరాజ్యాన్ని నిలబెట్టే వారసుడే దావీదు సంతానంగా ఉండడానికి వాగ్దానం చెయ్యబడిన మెస్సీయా. అందుకే ప్రవచనంలో మెస్సీయా తరచుగా దావీదు అనే పేరుతో కూడా సంబోధించబడ్డాడు (యెహెజ్కేలు 34:23-24, యెహెజ్కేలు 37:24-25, హొషేయ 3:5). అందుకే దూత మరియతో యేసు పుట్టుక విషయం మాట్లాడుతున్నప్పుడు, "ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును అతనికిచ్చును" అంటూ ఆయన నిత్య ఏలుబడిని ప్రకటించినట్టు గమనిస్తాము (లూకా 1:32-33). "దావీదు కుమారుడు" అనేది తరచుగా యూదులు మెస్సీయా కొరకు వాడిన బిరుదు. అయితే మన ప్రభువు ఒక అడుగు ముందుకు వేసి క్రీస్తు దావీదుకు కుమారుడు మాత్రమే కాదు దావీదుకు ప్రభువు కూడా అని లేఖనానుసారంగా నిర్ధారించాడు ( మత్తయి 22:42-45, కీర్తనలు 110:1). దావీదు విషయమై చెప్పబడిన అనేక ప్రవచనాల నెరవేర్పును, అతని నిత్యవారసుడైన యేసుక్రీస్తులోనే చూడగలమని అపొస్తలులు కూడా సాక్ష్యమిచ్చారు (అపొస్తలుల కార్యములు 2:24-36). ఈ వంశావళి క్రమంలో అబ్రాహాముతో పాటు దావీదుకున్న ప్రాముఖ్యత గురించి ఇది వరకే వివరంగా చెప్పుకున్నాము (మత్తయి 1:1 వ్యాఖ్యానం చూడండి).

"ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను"

ఊరియా భార్యగా ఉండిన బత్షెబాయందు దావీదు సొలొమోనును కన్ననాటికి ఆమె ఇంకా ఊరియా భార్యగానే ఉందని దీని అర్థం కాదు. అయితే ఊరియా భార్య దావీదు భార్య అవ్వడం వెనుక ఉన్న పాప చరిత్రంతటినీ ఒక్కసారి గుర్తు చేసే విధంగా మత్తయి ఈ మాట ప్రస్తావించాడు. మత్తయి అలా చెయ్యడానికి గల కారణం ఇదివరకే వివరించబడింది (మత్తయి 1:3 వ్యాఖ్యానం చూడండి). దావీదుకు చేసిన నిత్య రాజ్య వాగ్దానం సొలొమోను వంశావళి క్రమంలో నెరవేరుతుందని దేవుడు ముందే తెలియచేశాడు (2 సమూయేలు 7:12-16).

మత్తయి 1:7 సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను.

"సొలొమోను రెహబామును కనెను"

ఈ రెహబాము హయాం లోనే ఇశ్రాయేలు రెండు దేశాలుగా విడిపోయింది (1 రాజులు 12:19-24). కానీ వాగ్దానం చెయ్యబడిన దావీదు కుమారుడు వచ్చేంతవరకూ దేవుడు యూదా గోత్రాన్ని, ప్రత్యేకంగా దావీదు గృహాన్ని భద్రపరచినట్టు పాతనిబంధన చరిత్ర తెలియచేస్తుంది.

"రెహబాము అబీయాను కనెను"

దేవుడు మార్పులేని నిబంధన ద్వారా సింహాసనాన్ని దావీదు సంతానానికి స్థిరపరచాడని నమ్మి, దానిని తన ప్రత్యర్థులకు నిరూపించింది ఇతడే (2 దినవృత్తాంతములు 13:5).

"అబీయా ఆసాను కనెను"

ఆసా నీతిమంతుడైన రాజు. దావీదుగృహం నుండి చీలిపోయిన ఇశ్రాయేలు రాజ్యం యరొబాము, ఆహాబువంటి దుష్టరాజుల పరిపాలన క్రింద కృశిస్తూ దిగజారింది. అలా అని యూదాదేశాన్ని పరిపాలించిన రాజులందరూ నీతిమంతులని కాదు కానీ దేవుడు ఆసావంటి విశ్వాసవీరులను లేవనెత్తి యూదాదేశాన్ని ఉజ్జీవపరుస్తూ మెస్సీయా వచ్చేంత వరకూ వారిని అంతరించిపోకుండా నమ్మకంగా భద్రపరచాడు (2 రాజులు 8:19).

మత్తయి 1:8 ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను.

"ఆసా యెహోషాపాతును కనెను, యెహోషా పాతు యెహోరామును కనెను"

దుష్టుడైన అబీయా నీతిమంతుడైన ఆసాను కంటే నీతిమంతుడైన ఆసా నీతిమంతుడైన యెహోషాపాతును కంటే నీతిమంతుడైన యెహోషాపాతు దుష్టుడైన యెహోరామును కంటే దుష్టుడైన యెహోరాము నీతిమంతుడైన ఉజ్జియాను కన్నాడు. కృప రక్తంలో ప్రవహించదనీ అది వారసత్వంగా రాదనీ ఇది నిరూపిస్తుంది. కృప దేవునికే సొంతం కాబట్టి దానిని ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి ఆయనకే పూర్తి అధికారం ఉంటుంది.

"యెహోరాము ఉజ్జియాను కనెను"

ఈ ఉజ్జియా అజర్యా అని కూడా పిలవబడ్డాడు (2 రాజులు 14:21, 1 దినవృత్తాంతములు 3:12, 2 దినవృత్తాంతములు 26:1). యెహోరాముకు మరియు ఉజ్జియాకు మధ్య ఉన్న మూడుతరాలు ఇక్కడ దాటవెయ్యబడ్డాయి. యెహోరాము అహజ్యాను కన్నాడు, అహజ్యా యోవాషును కన్నాడు, యోవాషు అమజ్యాను కన్నాడు, అమజ్యా ఉజ్జియాను కన్నాడు అని రాసియుండవలసింది (1 దినవృత్తాంతములు 3:9-12). అయితే ఇలా ఆ పేర్లు దాటవెయ్యడం పొరపాటుగానో జ్ఞాపకశక్తి లోపం వల్లనో జరిగింది కాదు. వంశావళి నమోదు చేసేటప్పుడు అలా కొన్ని తరాలను దాటవెయ్యడం యూదులకు అంగీకరమైన పద్ధతే అని, కాబట్టి మత్తయి నమోదు చేసిన వంశావళిలో ఎదో పొరపాటుందని ఆరోపించడం యూదులకు సాధ్యం కాదని ఇప్పటికే చర్చించుకున్నాము (మత్తయి 1:5 వ్యాఖ్యానం చూడండి). ఒకవేళ అలా కొన్ని పేర్లు దాటవెయ్యడంలో ఏదైనా న్యాయమైన అభ్యంతరం ఉంటే ఎదో ఒక వంక యేసు మెస్సీయా కాదని నిరూపించాలని చూసే యూదులకు ఇది బలమైన ఆధారంగా దోహదపడుండేది. మత్తయి చెప్పే వంశావళి తప్పని నిరూపిస్తే అతను పరిచయం చేసిన యేసు మెస్సీయా కాదనడానికి అదొక్కటే సరిపడుండేది. కానీ కొన్ని తరాలను దాటవెయ్యడం వంశావళులను లెక్కించే క్రమంలో ఒక సాధారణమైన పద్ధతే అని వారికి బాగా తెలుసు. వారు అంగీకరించిన లేఖనాలలో కూడా ఆ పద్ధతిలో వంశావళులు నమోదు చెయ్యబడిన వాస్తవాన్ని వారు నిరాకరించలేరు. ఉదాహరణకు అజర్యా మెరాయోతు కుమారుడుగా పిలవబడినప్పటికీ (ఎజ్రా 7:3) వారిద్దరికీ మధ్య ఆరుతరాల వ్యత్యాసం ఉన్నట్టు చెప్పబడింది (1 దినవృత్తాంతములు 6:7-9). అలాంటి స్వేచ్ఛనే మత్తయి కూడా తీసుకున్నాడు. మత్తయి ఒకవేళ తప్పు చెప్పియుంటే దస్తావేజులతో సహా దానిని నిరూపించగల అవకాశమున్న అప్పటి యూదులే చెయ్యలేని సాహసం, నేటి విమర్శకులు ఆ దస్తావేజులేమి లేకుండానే చెయ్యాలనుకోవడం నిజంగానే హాస్యాస్పదం.

మత్తయి 1:9 ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను.

"ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను"

ఈ ఆహాజుతో సంభాషిస్తున్నప్పుడే మెస్సీయాకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ప్రవచనం యెషయా ద్వారా ప్రకటించబడింది (యెషయా 7:14).

"ఆహాజు హిజ్కియాను కనెను"

దేవుడు దావీదు గృహానికి అనుగ్రహించిన మంచి రాజుల్లో హిజ్కియా పేరు చాలా ప్రత్యేకమైనది. దేవుడు కటాక్షం చూపించి 15 సంవత్సరాల వరకూ ఆయుష్షును పొడిగించిన రాజు ఇతడే (యెషయా 38:5).

మత్తయి 1:10 ​హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను.

ఈ రాజుల చరిత్ర 2 రాజులు 20వ అధ్యాయం నుండి ఉన్న వాక్యభాగం నుండి తెలుసుకోగలం. వీరిలో చెప్పుకోదగిన వ్యక్తి యోషీయా అనే గొప్ప దేవభక్తి గల రాజు. ఇతని పుట్టుక గురించీ ఇతని పరిపాలనలో దేవుడు రప్పించబోయే ఉజ్జీవం గురించీ ఇతను పుట్టడానికి వందల సంవత్సరాల ముందే ప్రవచించబడింది (1రాజులు 13 :2).

మత్తయి 1:11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

"యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమందు"

యూదులు బబులోనుకు కొనిపోబడడాన్ని యేసుక్రీస్తు వంశావళిని లెక్కించేటప్పుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. దాదాపుగా ఆ దేశం దాని ఉనికినే కోల్పోయి ఉండాల్సినంత ప్రమాదం గురించి మనమిక్కడ మాట్లాడుతున్నాము. అయినా అంతటి అపాయంలో కూడా దేవుడు ఆ దేశాన్నే కాదు, వారి వంశావళి పట్టికల ప్రామాణికతను కూడా కాపాడి, క్రీస్తు రాకడ వాగ్దానాన్ని, దాని నెరవేర్పును గుర్తించగలిగే ఆధారంతో సహా భద్రపరచినట్టు ఇక్కడ గమనిస్తాము. ప్రతికూల పరిస్థితులు దేవుని ప్రణాళికలను తారుమారు చెయ్యలేవు కానీ అవి ఆయన శక్తిని, నమ్మకత్వాన్ని మరింత ప్రస్ఫుటంగా వెల్లడి చేస్తాయి. ఆయన ఇశ్రాయేలీయుల తిరుగుబాటును బట్టి వారిని అన్యదేశానికి అప్పగించినప్పటికీ శరీరాన్ని బట్టి క్రీస్తు వారియందు పుట్టాలి కాబట్టి వారిని మరలా ఉజ్జీవింపచేసి, శేషాన్ని మళ్ళీ వాగ్దానదేశానికి తిరిగి రప్పించాడు. (రోమా 9:4-5), వారియందు ఈ ఆశీర్వాదము ఉండింది కాబట్టి (యెషయా 65:8-9), ఆ దేశం నశించిపోకుండా కాపాడి, అబ్రాహాము మరియు దావీదుకు చేసిన నిబంధనను దేవుడే నమ్మకంగా నిలబెట్టుకున్నాడు.

"యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను"

ఈ అధ్యాయం11వ వచనంలో పేర్కోబడిన యెకొన్యా మరియు 12వ వచనంలో కనబడే యెకొన్యా ఇద్దరూ ఒక్కరు కారు. ఆడమ్ క్లార్క్ తన మత్తయి సువార్త వ్యాఖ్యానంలో సూచించిన విధంగా అనేక గ్రీకు చేవ్రాత ప్రతుల్లో "యోషీయా యెహోయాకీమును అతని సహోదరులను కనెను" అని సరిగ్గానే రాయబడింది (2 రాజులు 23:34). తరువాత వచనంలో ఉన్న "యెకొన్యా" ఈ యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను (2 రాజులు 24:6). septuagent లో ఈ పేర్లు కొన్ని సందర్భాలలో దాదాపు ఒకేలా రాయబడడం మరియు కొన్ని చేవ్రాత ప్రతుల్లో కూడా ఈ ఇరువురూ ఒకే పేరుతో ప్రస్తావించబడడమే దీనికి కారణం. దీన్ని మరింత బలపరిచే ఆధారాలు మనకు ఉన్నాయి. యోషీయా కన్న యెకొన్యా (యెహోయాకీము) కాలంలో యూదులు బబులోను చెరకు కొనిపోబడలేదు (2 రాజులు 24:6 ). అయితే తర్వాత వచనంలో ఉన్నటువంటి యెకొన్యా (యెహోయాకీను) యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు షయల్తీయేలును కన్నాడని చెప్పబడింది (మత్తయి 1:12). అలాగే 11వ వచనంలో ఉన్నటువంటి యెకొన్యాకు సహోదరులు ఉన్నారు (1 దినవృత్తాంతములు 3 :15). కానీ 12వ వచనంలో ఉన్నటువంటి యెకొన్యాకు సహోదరులు లేరు. సిద్కియా అతని సహోదరుడిగా పేర్కోబడినప్పటికీ (1 దినవృత్తాంతములు 3 :16) నిజానికి సిద్కియా అతని తండ్రి సహోదరుడు. అయినా సిద్కియా కూడా కొంతకాలం రాజ్యపరిపాలన చేసిన కారణాన్ని బట్టి కేవలం వారసత్వంలో యెహోయాకీనుకు సహోదరుడయ్యాడు (2 రాజులు 24:15-18 2 దినవృత్తాంతములు 36:10). ఒకే పేరుతో పిలిచినప్పటికీ మత్తయి ఇద్దరు వేరువేరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడని ఈ వ్యత్యాసాలు నిరూపిస్తున్నాయి. వీరిరువురు ఒక్కరే ఐతే మత్తయి పేర్కొన్న వంశావళులు మొత్తం 42 (మత్తయి 1:17) కాకుండా 41 తరాలు మాత్రమే అయ్యుండేవి. కానీ ఇప్పుడు ఆ కలవరం అవసరం లేదు.

మరో చిన్న మాట: "యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమందు యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను" అంటే బబులోను చెరకు వెళ్ళిన రోజు వరకూ యోషీయా ఇంకా కంటూనే ఉన్నాడని అర్థం కాదు. యెహోయాకీము కాలంలోనే యూదులు బబులోనుకు కొనిపోబడనప్పటికీ అందుకు దారితీసిన పరిస్థితులు యోషీయా కాలంలోనే ప్రారంభమయ్యాయి. కాబట్టి బబులోను చెర సమీపకాలంలో యోషీయా యెహోయాకీమును అతని సహోదరులను కన్నాడు అన్నదే మత్తయి మాటల భావం అని స్పష్టం ఔతుంది. ఇది ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ లో "About the time they were carried to Babylon" అని సరిగ్గా అనువదించబడింది.

మత్తయి 1:12 బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను.

ఇక్కడ పేర్కొనబడిన "యెకొన్యా" యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను ( 2 రాజులు 24:6-8). ఈ ఇరువురు ఒకే పేరుతో యెకొన్యాగా పిలవబడడానికి కారణం ముందు వచనంలో వివరించబడింది (మత్తయి 1:11 వ్యాఖ్యానం చూడండి). ఈ యెహోయాకీను "యెకొన్యా" (1 దినవృత్తాంతములు 3:16) మరియు "కొన్యా" (యిర్మీయా 22:24,28) అనే పేర్లతో పిలవబడ్డాడు.

ఈ యెకొన్యా షయల్తీయేలును కన్నాడు అని చెప్పబడింది. అయితే దేవుడు ఇతని విషయంలో పలికిన శాప వచనాన్ని బట్టి ఆలోచిస్తే ఇతడు సంతానహీనుడవ్వాలి (యిర్మీయా 22:30). దాని అర్థం అతనికి పిల్లలే పుట్టరని కాదు కానీ అదే వచనంలో స్పష్టం చెయ్యబడిన విధంగా అతని సంతానంలో ఇంక ఎవ్వరూ దావీదు సింహాసనం మీద కూర్చోరని ఆ శాపం యొక్క భావం. ఆ భావంలో మాత్రమే అతడు సంతానహీనుడు. అంటే పిల్లలనే వారసత్వం విషయంలో సంతానహీనుడితోనే సమానం.

అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య తలెత్తుతుంది. మెస్సీయా రావలసిన వంశావళి క్రమం ఇంతటితో నిర్వీర్యమైపోతుంది. కానీ ఇది కృత్రిమంగా కొందరు తయారు చేసుకున్న సమస్య మాత్రమే. ఎందుకంటే షయల్తీయేలు దావీదు సింహాసనంపై కూర్చోలేదు. అలాగే యెకొన్యాకు పుట్టిన ఇతర కుమారులెవ్వరూ పరిపాలన చేసే అవకాశం రాలేదు. అంతమాత్రన, ఆ తరంలోనే నెరవేరిన శాపం భవిష్యత్ తరాలన్నిటికీ వర్తించాలని నియమమేమి లేదు (నిర్గమకాండం 20:5-6). ఈ శాపం అతని కాలానికే పరిమితమనడానికి ఆ శాపవచనంలోనే ఆధారముంది. "అతని దినములలో వర్ధిల్లని వాడు" అని అక్కడ ఉన్న మాటను ప్రత్యేకంగా గమనించాలి (యిర్మీయా22:30). అతనూ అతని సంతానం బయటకు విసిరివేయబడిందనే మాట బబులోను చెరలోనుండి తిరిగి రాని అతనికీ అతని పిల్లల తరానికీ మాత్రమే పరిమితమని ఆ సందర్భం స్పష్టం చేస్తుంది (యిర్మీయా 22:26-28). కాబట్టి ఆ వంశావళి నుండే మెస్సీయా రావాలన్న వాగ్దానంతో దీనికి సంబంధం లేదు. దావీదుకు చేసిన వాగ్దానం యెకొన్యాకు పెట్టిన శాపంతో నిమిత్తం లేకుండానే నెరవేర్చబడుతుంది. అది తర్వాత రాయబడిన మాటనుండి స్పష్ఠంఔతుంది.

"షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను"

ఈ జెరుబ్బాబెలుకు దేవుడు చేసిన వాగ్దానం వల్ల ఆ వంశావళి నుండి మెస్సీయా వస్తాడనే నిరీక్షణ నిర్వీర్యం కాలేదని రూఢిచెయ్యబడింది ( హగ్గయి2:23).

జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడని చెప్పే అనేక వాక్యభాగాలు పాతనిబంధనలో కనిపిస్తాయి (ఎజ్రా 3:2, ఎజ్రా 5:2,నెహెమ్యా 12:1, హగ్గయి 1:1,12,14, హగ్గయి 2:2, 23). అయితే ఒక్క చోట మాత్రం జెరుబ్బాబెలు పెదాయా కుమారుడని చెప్పబడింది (1 దినవృత్తాంతములు 3:19). కానీ ఇది వరకు అనేక సందర్భాలలో వివరించిన విధంగా బహుశా షయల్తీయేలు మనుమడైన జెరుబ్బాబెలు అతని కుమారుడిగా పరిగణించబడి ఉండవచ్చు. ఇది యూదుల వంశావళి పట్టికలో ఎంతో సాధారణంగా కనబడే విషయమే (మత్తయి 1:5 వ్యాఖ్యానం చూడండి).

మత్తయి 1:13-15 జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను.

"జెరుబ్బాబెలు అబీహూదును కనెను"

జెరుబ్బాబెలు కుమారుల పేర్లు దినవృత్తాంతములలో ఉన్న వంశావళి పట్టికలో నమోదు చెయ్యబడ్డాయి (1 దినవృత్తాంతములు 3:19-20). కానీ ఇక్కడ మత్తయి పేర్కొన్న అబీహూదు పేరు ఆ జాబితాలో మనకు కనిపించదు. అయితే ఈ అబీహూదు ఆ పట్టికలో లెక్కించబడని వేరొక కుమారుడై ఉండాలి, లేదా వారిలో ఒకరికి అబీహూదు అనే మారుపేరైనా ఉండుండాలి. బబులోను చెర సమయంలో ఒకరికి ఒకటికంటే ఎక్కువ పేర్లుండటం సర్వసాధారణమే ( దానియేలు 1:7). అలా కాకుండా ఒకవేళ అతడు జెరుబ్బాబెలు మనమడు కానీ మునిమనమడు కానీ అయ్యుంటే ఇక పాతనిబంధన వంశావళిలో అతని పేరు కనిపించడం సాధ్యం కాదు. ఎందుకంటే పాతనిబంధన ప్రత్యక్షత దాదాపు జెరుబ్బాబెలు తరంలోనే ముగించబడింది.

అందుకే ఇక్కడనుండి 16వ వచనంలో ఉన్న మరియ భర్తయైన యోసేపు వరకూ కూడా మత్తయి పేర్కొన్న తరాల వంశావళి పట్టిక పాతనిబంధనలో కనిపించదు. అయినా వంశావళులతో కూడిన ఎన్నో లేఖనేతర బహిరంగ దస్తావేజులు యూదులు కలిగియుండేవారు. ఇవి వారి స్వాస్థ్యానికి వంశపారంపర్యానికి అత్యంత కీలకమైన దస్తావేజులు. న్యాయంగా తమది కానీ పారంపర్యాన్ని ఎవ్వరూ తమకు తాము ఆపాదించుకోకుండా సహాయపడే ధృవీకరణ దస్తావేజులే ఈ వంశావళి పట్టికలు (సంఖ్యాకాండము 36:7-9). కాబట్టి మెస్సీయా కొరకు మత్తయి ప్రకటించిన వంశావళి యూదుల దస్తావేజులతో సరిపోనివైతే అదే వారి సువార్త తిరస్కారానికి బలమైన, న్యాయమైన కారణంగా చూపించియుండేవారు. కానీ మత్తయి చెప్పింది కల్పిత వంశావళి కాదు. వారి ప్రామాణిక దస్తావేజులలో ఉన్నవే అతను చెప్పాడు. యూదులు అలాంటి ప్రామాణిక దస్తావేజులు కలిగుండేవారని ఎన్నో బైబిలేతర రచనల్లో నుండి డా.జాన్ గిల్ తన మత్తయి సువార్త వ్యాఖ్యానంలో ఆధారాలతో సహా నిరూపించారు.

మత్తయి 1:16 యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

"యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను"

ఇక్కడ మరియ భర్తయైన యోసేపును కన్నది యాకోబు అని చెప్పబడింది. కానీ లూకా పేర్కొన్న యేసుక్రీస్తు వంశావళిలో ఈ యోసేపు హేలీకి కుమారుడని చదువుతున్నాము (లూకా 3:23). ఆ మాటకొస్తే ఇక్కడ మత్తయి పేర్కొంటున్న యేసుక్రీస్తు వంశావళికీ లూకా రాస్తున్న వంశావళిలో ఉన్న పేర్లు ఎంతో భిన్నంగా కనిపిస్తాయి. దావీదు తర్వాత నుండి యేసుక్రీస్తు వరకూ వీరిద్దరు చెప్పిన తరాల జాబితా ఒకదానితో మరొకటి పొంతన లేనివిగా ఉంటాయి. ఈ వ్యత్యాసాలు కొందరు విశ్వాసులను ఎంతో కలవరానికి గురిచేశాయి. అంతేకాకుండా అవి విమర్శకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాయి. పరస్పర భిన్నమైన రెండు వంశావళి పట్టికలలో ఏది నమ్మశక్యమైనదో ఎలా నిర్ధారిస్తారని వీటిలో ఎదో ఒకటి నిజమని సర్ధుకుపోయినా మరొకటి అబద్ధమని ఒప్పుకోక తప్పదని, అయినా బైబిల్ అంతా దేవుని వాక్యమని విశ్వసించేవారు దేవుడే ఇలాంటి వైరుధ్యాలను ప్రేరేపించి రాయించాడా అని విమర్శకులు గట్టిగా దబాయిస్తారు. ఇక్కడ క్రైస్తవులు దొరికిపోయారని, వారిని గలిబిలి చేసి తమ సువార్త తిరస్కారాన్ని సమర్థించుకునే మంచి అదును దొరికిందని వారు సంబరపడిపోతుంటారు.

అయితే ఇక్కడ విశ్వాసులను బలపరిచి, విమర్శకులను నిరాశపరిచే చక్కటి వివరణ ఉండనే ఉంది. ప్రతి వ్యక్తికీ ఒకటి కాదు రెండు వంశావళులు ఉంటాయి. ఒకటి తండ్రి తరపు నుండి, మరొకటి తల్లి తరపు నుండి. అలాగే మత్తయి యేసు తండ్రిగా ఎంచబడిన యోసేపు వంశావళిని, లూకా మరియ వంశావళిని ప్రస్తావిస్తున్నారు కాబట్టి, యాకోబు యోసేపుకు, హేలీ మరియకు తండ్రి అని గుర్తించగలం. మత్తయి మరియు లూకా రాసిన యేసుజనన వృత్తాంతం ఇందుకు రుజువు . మత్తయి 1:18-25 యేసు జననాన్ని యోసేపు కోణం నుండి తెలపగా, లూకా 1:26-56 యేసు జననాన్ని పూర్తిగా మరియ కోణం నుండి వివరిస్తుంది.

అదే నిజమైతే లూకా మరియ హేలీ కుమార్తె అని కాకుండా యోసేపు హేలీ కుమారుడని ఎందుకు రాసాడానే ప్రశ్న రావొచ్చు. అలా రాసే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మరియ తండ్రికి కుమారులెవ్వరూ లేని పక్షంలో అతని వారసత్వం, అదే గోత్రంనుండి మరియ చేసుకునే అతని అల్లుడు ద్వారా కొనసాగుతుంది (సంఖ్యాకాండము 36:7-9). ఒకరు కనక పోయినా వారసత్వభావంలో కుమారులుగా పరిగణించబడిన ఎన్నో సందర్భాలు మనం మత్తయి నమోదు చేసిన వంశావళిలో కూడా చూసాము .అంతేకాకుండా స్త్రీలు తమ భర్తల పేరును గుర్తింపుగా భావించే పద్ధతి హెబ్రీయుల మధ్య లేకపోలేదు (యెషయా 4:1).

లూకా యోసేపును మరియకు బదులుగా పేర్కొన్నాడనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. గ్రీకు తెలిసినవారెవరైనా మనకు దృవీకరించగలిగే మొదటి రుజువేమిటంటే లూకా తన జాబితాలోని ప్రతి వ్యక్తికి, అతడు పలానావారికి కుమారుడు అని తెలుపుతూ వాడిన ఉపపదం "యోసేపు హేలీకి" అని చెప్పినప్పుడు వాడలేదు. కాబట్టి తెలుగులో లేదా ఆంగ్లంలో స్పష్టంగా తెలియకపోయినా గ్రీకు చదివేవారు, యోసేపు మరొకరి స్థానంలో పేర్కొనబడుతున్నారని ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తించగలరు.

పై వాదనను బలపరచే రెండవ వాస్తవమేంటంటే యాకోబు యోసేపును కనెను అని మత్తయి తెలుపగా హేలీ యోసేపును కన్నాడు అని లూకా చెప్పడం లేదు. యోసేపు హేలీకి కుమారుడని మాత్రమే చెబుతున్నాడు. అంటే యోసేపు యాకోబుకే కన్న కుమారుడైనప్పటికీ మరియతో వివాహం ద్వారా హెబ్రీయుల వాడుక చొప్పున ఆమె తండ్రికి కుమారుడనబడ్డాడు. కోడళ్ళను కుమార్తెలుగాను, అల్లుళ్ళను కుమారులుగానూ పరిగణించడం, గౌరవించడం హెబ్రీయుల సాంప్రదాయం (రూతు 1:11).

మూడవదిగా క్రీస్తును తమ బద్ధశత్రువుగా భావించిన రబ్బీయుల యెరూషలేము తాల్ముడ్ (talmud) లో మరియను వారు హేలీ కుమార్తెగా సంబోధించిన దాఖలాలు మనకు అందుబాటులో ఉన్నాయి (Haggiga 2:4, Fruchtenbaum 1993:1013). బైబిలేతర సాక్షాలతో మనకు పనిలేనప్పటికీ శత్రువునోట వెలువడిన సత్య వాంగ్మూలానికున్న ప్రాధాన్యత ఇలాంటి ఆధారాలకు ఎలాగూ ఉంటుంది కదా. కాబట్టి యేసు తండ్రిగా భావించబడిన యోసేపు దావీదు కుమారుడైన సొలొమోను వంశావళి క్రమంలో పుట్టగా (మత్తయి 1:6) యేసు తల్లియైన మరియ దావీదు కుమారుడైన నాతాను వంశావళి క్రమంలో పుట్టింది (లూకా 3:31). యోసేపు వైపు నుండి వచ్చిన వంశావళి యేసు చట్టరీత్యా దావీదు వారసుడని, మరియ వైపు నుండి వచ్చిన వంశావళి యేసు శారీరకంగా దావీదు సంతానమని, ఈ రెండు వంశావళులు ఆయన దావీదు కుమారుడని నిరూపిస్తున్నాయని స్పష్టం ఔతుంది. ఈ వివరణ మత్తయి మరియు లూకా నమోదు చేసిన యేసుక్రీస్తు వంశావళులలో ఉన్న వ్యత్యాసాలన్నిటికీ చాలిన సమాధానం. 

"ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను"

మత్తయి ఈ వంశావళి పట్టికలో సాధారణంగా అందరి విషయంలో వాడిన శైలినే కొనసాగిస్తూ "యోసేపు మరియ యందు యేసును కనెను" అని చెప్పలేదు. ఎందుకంటే ఆమెయందు పుట్టింది పురుషుని సంతానం కాదు వాగ్దానం చెయ్యబడిన స్త్రీ సంతానం (ఆదికాండము 3:15, గలతీ 4:4). అలాగే ఇక్కడ క్రీస్తు అని చెప్పబడిన మాట అభిషిక్తుడు అనే భావంలో దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్తలు, యాజకులు మరియు రాజులకు పాతనిబంధనలో ఎన్నోసార్లు గౌరవప్రదంగా వాడబడింది (యెషయా 45:1, కీర్తనలు 105:14,15, లేవీయకాండము 4:3, లేవీయకాండము 6:20, 1 సమూయేలు 2:10). "మషియాక్" (క్రీస్తు) అనే మాట "melec" (రాజు) అనే మాట పర్యాయపదాలుగా కూడా వాడబడిన సందర్భాలు తరచుగా కనిపిస్తాయి (1 సమూయేలు 2:10, కీర్తనలు 2:2,6, లూకా 23:2). అయితే వాగ్దానం చెయ్యబడిన ఒక క్రీస్తు కొరకు ఇశ్రాయేలీయులు ఎదురు చూసారు (మత్తయి 2:4-6, మత్తయి 22:43-45, మత్తయి 27:63, లూకా 3:15, లూకా 7:26-27,31, యోహాను 7:41-42). క్రీస్తుగా ఆయనకున్న స్థానం వేరెవ్వరికి లేదు. ఆ క్రీస్తే యేసు. అది నిరూపించడమే ఈ వంశావళి పట్టిక వెనుక ఉన్న ఉద్దేశం.

మత్తయి 1:17 ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదునాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.

ఈ మాటలకు అబ్రాహాము మొదలుకొని యేసు క్రీస్తు వరకూ 42 తరాలు మాత్రమే ఉన్నాయని మత్తయి యొక్క భావం కాదు. అనేక తరాలను లెక్కించకుండా దాటవేసిన సందర్భాలను మనం ఇదివరకే విశ్లేషించుకున్నాము. మత్తయి తాను లెక్కించిన తరాల గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమానసంఖ్య గల విభాగాలుగా తరాలను విభజించడం, యూదుల వంశావళి పట్టికలలో కూడా సాధారణంగా కనబడే పద్ధతి. కంఠస్థం చేసుకోవడానికి అనువుగా ఇలా ముఖ్య తరాలను మాత్రమే నమోదు చేసి, కొన్ని ప్రాముఖవ్యక్తుల లేదా సంఘటనల ఆధారంగా వాటిని సమాన సంఖ్యగల విభాగాలుగా విభజించేవారు. మత్తయి కూడా అలాగే అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు 14, దావీదు మొదలుకొని బబులోను చెర వరకు 14, మరియు ఆ తరువాతనుండి క్రీస్తు వరకు14 తరాలు అంటూ ఈ పట్టికను విభజించాడు.

ఇలా ఈ వంశావళిలో మత్తయి గీసిన మూడు విభజన రేఖలు, యూదుల చరిత్రలోని మూడు ప్రధానమైన కాలాలకు సరిగ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మొదటిది పితరులు, ప్రవక్తలు మరియు న్యాయాధిపతుల కాలం, రెండవది, రాజుల కాలం, చివరిది అధిపతులు మరియు యాజకుల కాలం.

మత్తయి లెక్కించిన వంశావళులు మొత్తం 42 కాదు 41 మాత్రమే అనే సందేహానికి ఇది వరకే జవాబు చెప్పుకున్నాము (మత్తయి 1:11-12 వ్యాఖ్యానం చూడండి). అయితే ఈ విషయంలో సందేహమేమీ మిగలకుండా ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ ద్వారా ఈ మూడు పద్నాలుగుల లెక్కను మరొకసారి గమనించండి:

1. అబ్రాహాము 1. సొలొమోను 1. యెహోయాకీను
2. ఇస్సాకు 2. రెహబాము 2. షయల్తీ యేలు
3. యాకోబు 3. అబీయా 3. జెరుబ్బాబెలు
4. యూదా 4. ఆసా 4. అబీహూదు
5. పెరెసు 5. యెహోషాపాతు 5. ఎల్యా కీము
6. ఎస్రోము 6. యెహోరాము 6. అజోరు
7. అరాము 7. ఉజ్జియా 7. సాదోకు
8. అమ్మీనాదాబు 8. యోతాము 8. ఆకీము
9. నయస్సోను 9. ఆహాజు 9. ఎలీహూదు
10. శల్మాను 10. హిజ్కియా 10. ఎలియాజరు
11. బోయజు 11. మనష్షే 11. మత్తాను
12. ఓబేదు 12. ఆమోను 12. యాకోబు
13. యెష్షయి 13. యోషీయా 13. యోసేపు
14. దావీదు 14. యెహోయాకీము 14. యేసు క్రీస్తు

ఒక శుభవార్త: యేసు క్రీస్తు వంశావళి ఇంతటితో ఆగిపోలేదు. రక్షణార్థంగా ఆయనను అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలే కాబట్టి ఆయన తరం భూమ్యంతం వరకూ నిలిచియుంటుంది (యోహాను 1:12-13, యెషయా 53:10-11). అయితే ఈ ఆధిక్యత వ్యక్తిగతమైనది. కుటుంబ, సంఘ, సామాజిక నేపధ్యాలతో దీనికి సంబంధం లేదు. నీ నేపధ్యమేమైనా నీ మతమేదైనా నీ గతం ఈ వంశావళి పట్టికలో ఉన్న కొందరిలా అతి నీఛమైనదైనా యేసు క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా చెయ్యబడగలవు. యేసు క్రీస్తు మరణ పునరుత్థానాల వల్ల దేవుడు సిద్ధపరచిన మార్గం మాత్రమే నిత్య జీవానికి మార్గమని విశ్వసించి మారుమనస్సు పొందితే ఆయన తప్పక తన కుటుంబంలో నీకు స్థానం అనుగ్రహిస్తాడు (యోహాను 6:37). ఇదే ఆయన నీతో మాట్లాడే స్వరం. దీనిని నిర్లక్ష్యం చెయ్యవద్దు. నేను క్రైస్తవుడనే కదా అని నీ హృదయంలో అనుకోవొద్దు. క్రైస్తవ కుటుంబానికి చెందినంత మాత్రాన నువ్వు క్రీస్తు కుటుంబానికి కూడా చెందినట్టు కాదు.

మత్తయి 1:18 యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

"యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా"

యేసు క్రీస్తు వంశావళి క్రమాన్ని తెలియచేసాక ఇప్పుడు‌ ఆయన మానవ స్వభావాన్ని ధరించుకున్న అద్భుతాన్ని మత్తయి వివరించబోతున్నాడు. ఆయన జననవిధం ఎంతో ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. సహజాతీతంగా మానవ ప్రమేయమేమీ లేకుండా ఆయన జన్మించాడు. ఆయన తల్లియైన మరియ ఒక కన్యక. ఆ కన్యక గర్భమునందు యేసు క్రీస్తును ప్రవేశపెట్టిన అద్భుతం పరిశుద్ధాత్ముని కార్యం. యేసు శరీరధారణ మరియు మరియ యొక్క గర్భధారణ మనకు అంతుచిక్కని మర్మాలని ఒప్పుకోక తప్పదు. ఒక సహజజన్మ విషయంలోనే "చూలాలి గర్భమందు ఎముకలు ఎట్లు ఎదుగునో" మనకు తెలియనప్పుడు (ప్రసంగి 11:5), దేవుని కుమారునికి మరియ గర్భంలో ఒక "శరీరాన్ని అమర్చిన" (హెబ్రీ 10:5) దేవుని కార్యాన్ని ఎలా అర్థం చేసుకోగలం? కీర్తనాకారునితో ఏకీభవిస్తూ "నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి" (కీర్తనలు 139 :13-16) అని మనమందరమూ ఒప్పుకుంటాము. అలాంటిది సహజాతీతమైన యేసు జననంలో జరిగిన పరిశుద్ధాత్మ అద్భుతాన్ని వివరించడం ఎవరి తరం? మన బుద్ధి పరిమితులకు మించిన దానిని గురించి తార్కికంగా వివరించడం ఎలా సాధ్యం? ఏదీ అసాధ్యం కానివానికి ఇదెందుకు సాధ్యం కాదు అన్నదే దీనిని వివరించడానికి చాలిన తర్కం (లూకా1 :37). అందుకే ఆయన జననవిధం, తర్కంతో ఆరా తీయడానికి కాదు, తగ్గింపుతో ఆరాధించడానికే మనల్ని నడిపించాలి.

"ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత"

ఈ మరియ, గలిలయ పట్టణంలోని నజరేతు గ్రామవాస్తవ్యురాలు. ఈమె దావీదు గృహానికి చెందిన యోసేపుకు వివాహం కొరకు ప్రధానం చెయ్యబడింది (లూకా1:26,27). యోసేపు ఒక వడ్లవాడు (మత్తయి 13:55). రాజ్య పరిపాలన చెయ్యవలసిన దావీదు గృహం, ఈ సమయానికి సామాజికంగా ఎంత దిగువ స్థాయిలో ఉండిందో ఇక్కడ తెలుస్తుంది.

వివాహానికి ముందు ప్రధానం చెయ్యబడడం అనేది యూదుల ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారం. ఫలానా స్త్రీ ఫలానా పురుషుడికిచ్చి వివాహం చెయ్యబడుతుందని వారిరువురి మధ్య జరిగే ఒప్పందమే ఈ ప్రధానం. అయితే ఇది కొన్ని సంస్కృతుల్లో కనబడే నిశ్చితార్థం లాంటిది కాదు. ప్రధానం చెయ్యబడిన ఇరువురు కూడి ఏకశరీరం అవ్వకపోయినా అన్ని విధాలుగానూ ఈ ఒడంబడిక వివాహమంత పవిత్రమైనదిగానూ చట్టబద్ధమైనదిగానూ పరిగణించబడింది. అందుకే ప్రధానం చెయ్యబడినవారి నమ్మక ద్రోహం చట్టరీత్య వ్యభిచారంగానే పరిగణించబడి అలాగే శిక్షించబడింది (ద్వితీయోపదేశకాండం 22:23,24). వివాహవ్యవస్థను దేవుడే గొప్పగా ఘనపరచిన ఒక సందర్భాన్ని ఈ వాక్యభాగం మన ముందు ఉంచుతోంది. క్రీస్తు పుట్టింది కన్యకకే అయినా ఆమె ప్రధానం చెయ్యబడిన కన్యక. వివాహాన్ని నిషేధించే దయ్యపు బోధను ఇది ఖండిస్తోంది (1 తిమోతి 4 :3). మరియ అన్యాయంగా అవమానానికి గురి కాకుండా అలాగే దేవుని కుమారుని మీద అక్రమ సంతానమనే అపనింద పడకుండా కాపాడడానికి దేవుడు వివాహవ్యవస్థను వాడుకున్నాడు. ఒక ప్రాచీన రచయిత చెప్పిన విధంగా లోకులు "ఇతడు జారిణి కుమారుడు కాదా" అని అడగడం కంటే "ఇతడు వడ్లవాని కుమారుడు కాదా" అని అడిగింది ఎంతో మేలు. దేవుడు ఇంత ఘనంగా వాడుకుని హెచ్చించిన వివాహం ఎంత ధన్యకరమైన వ్యవస్థ.

"వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగానుండెను"

ప్రధానం చెయ్యబడిన స్త్రీ వివాహం ద్వారా తన భర్త ఇంటికి చేర్చుకోబడేంత వరకూ తన తండ్రి గృహంలో లేదా తన సొంతగృహంలోనే ఉండేది (ద్వితీయోపదేశ కాండం 20:7, న్యాయాధిపతులు 14:7-8). ఈ సమయంలో గర్భవతి కావడం సహజంగా ఆమెను అనుమానించడానికి తావిస్తోంది. కానీ ఇక్కడ మరియ గర్భవతి అవ్వడానికి కారణం యోసేపు కానీ మరో పరపురుషుడు కానీ కాదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది (లూకా1:35 ).

ఇది దేవుని కార్యం అని స్పష్టంగా చెప్పబడినప్పటికీ విమర్శకులు ఎంతో అసభ్యకరమైన భాషలో పరిశుద్ధాత్మను దూషించడం మనం తరచుగా వింటుంటాం, చదువుతుంటాం. దేవుడు సహజ లైంగిక పద్ధతులకు అతీతుడైనవాడు. మరియ గర్భంలో యేసు క్రీస్తు శరీరధారణ జరిగించడానికి పరిశుద్ధాత్ముడు ఆమెతో ఎలాంటి లైంగిక సంబంధం కలిగియుండవలసిన అవసరం లేదు. తాను కన్యక అని తెలిసి, తాను గర్భం ధరించడం ఎలా సాధ్యమని మరియ అడిగినప్పుడు దూత ఆమెతో, "పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును" అని బదులిచ్చాడు. . ఈ మాటలను పట్టుకుని చాలా మంది ఇక్కడేదో శారీరక సంబంధముందని ఆక్షేపించే ప్రయత్నం చేస్తారు. అయితే "పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అని చెప్పబడిన మాట, పరిశుద్ధాత్మ ఎవరిని, ఏ కార్యం జరిగించడానికి ఆవరించిన దానిని వివరించడానికి లేఖనాలు సాధారణంగా వాడే పదజాలం మాత్రమే అని బైబిల్ చదివేవారికి తెలుసు (సంఖ్యాకాండం 24:2, న్యాయాధిపతులు 3:10, 1సమూయేలు10:6,10, 1సమూయేలు11:6, 2 దినవృత్తాంతములు 15:1-2, 2 దినవృత్తాంతములు 24:20, అపొ. కా 1:8). ఆమెను కమ్ముకున్న సర్వోన్నతుని శక్తికి అసాధ్యమైనదేదీ లేదు. ఆమె సహాజతీతంగా మానవ ప్రమేయమేమీ లేకుండా పరిశుద్ధాత్ముని సర్వోన్నత శక్తి ద్వారా గర్భం ధరించడం కారణంగా యేసుక్రీస్తు పరిశుద్ధత మానవ పతన స్వభావం వల్ల కలుషితం కాకుండా భద్రపరచబడింది. ఆయన దేవుని కుమారుడని పిలువబడడానికి ఈ జనన విధం కూడా ఒక కారణం (లూకా1:35).

మత్తయి 1:19 ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

"ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి"

ప్రధానం చెయ్యబడడం కారణంగా ఇక్కడ యోసేపు మరియ భర్తగా పిలవబడ్డాడు. తనకు ప్రధానం చెయ్యబడిన స్త్రీ గర్భవతి అని తెలుసుకున్నాడు. మరియ తనతో దూత చెప్పిన సంగతులు యోసేపుకు తప్పక చెప్పియుంటుంది కాని యోసేపు అనుమానాన్ని అది నివృత్తి చెయ్యలేదు. ఆమెను విడనాడాలని తీర్మానించుకున్నాడు. అయితే, అతడు ఉద్రేకంతో కాకుండా ఎంతో సున్నితంగా ఈ విషయంతో వ్యవహరించిన తీరు ఎంతో ఆదర్శవంతమైనది. అలా చెయ్యడానికి కారణం అతడు నీతిమంతుడైయుండడమే అని లేఖనం అతని గురించి సాక్ష్యం ఇస్తుంది.

"ఆమెను అవమానపరచనొల్లక"

వ్యభిచారానికి శిక్ష అవమానం కాదు మరణం ద్వితీయోపదేశకాండం 22:23-24. అయితే, "చంపనొల్లక" అనకుండా "అవమానపరచనొల్లక" అని ఎందుకు రాయబడింది? ఎందుకంటే రోమీయుల పరిపాలన క్రింద యూదులకు మరణదండన విధించే అధికారం లేదు (యోహాను 18:31). ఇది తెలియక కొందరు, మరణదండనను తప్పించాలనుకున్న యోసేపు నీతిమంతుడైతే మరణ దండన విధించాలని కోరిన ధర్మశాస్త్రం నీతిరహితమయ్యుండాలి కదా అంటూ విమర్శిస్తుంటారు. కానీ అమలులో లేని దండన నుండి తప్పించాలనుకోవడం ఏంటని కనీసం ఆలోచించరు.

అయినా తప్పు చేసినవారిని అవమానం నుండి కాపాడడమ్ ఎందుకు? అలా చెయ్యడంలో నీతి ఏముంది? ఇది మరో ఆక్షేపణ. బహుశా మరియ చెప్పిన వివరణ నమ్మశక్యంగా లేకపోయినా దాని సత్యాసత్యాలు నిర్థారించే అవకాశం లేదు కాబట్టి యోసేపు ఆమెపై నింద మోపడానికి ఇష్టపడుండక పోవచ్చు. నీతిమంతుడు తన అనుమానాలను అపనిందలుగా మార్చడానికి త్వరపడడు. యోసేపు అలా త్వరపడలేదని తర్వాత వచనంలో స్పష్ఠం ఔతుంది (మత్తయి1:20 వ్యాఖ్యానం చూడండి).

"రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను"

యోసేపు చట్టరీత్యా అవసరమైన ఇద్దరు సాక్షుల సమక్షంలో పరిత్యాగ పత్రం ఇచ్చి ఆమెను రహస్యంగా విడిచిపెట్టేయ్యాలనుకున్నాడు. ఆమె తప్పు చేసుంటే అది తెలియాల్సిన సమయంలో తెలియాల్సినవారికి ఎలాగూ తెలుస్తుంది. కానీ తన వల్ల తెలియకూడదని రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ఆమె తప్పు చేసిందని తెలియదు కాబట్టి అవమానపాలు చెయ్యకపోవడం ఎంత న్యాయమో తప్పు చెయ్యలేదనీ తెలియదు కాబట్టి ఆమెను విడిచిపెట్టాలనుకోవడం కూడా అంతే న్యాయం. ప్రతి అనుమానిత సందర్భంలోనూ మనం పాటించవలసిన సమతుల్యతను ఈ ఆదర్శం మనకు నేర్పిస్తుంది. నిందించకపోవడం నిర్దోషి అని ఎంచడం కాదు, అవమానించకపోవడం అవసరమైన చర్య తీసుకోకుండా ఊరుకోవడం కాదు. చెయ్యని తప్పును కట్టపెట్టడం చేసిన తప్పును కప్పిపుచ్చడం, ఈ రెండూ నీతి సమ్మతమైనవి కావు.

ఏది ఏమైనా ఈ వచనంనుండి ఒక పాఠం స్పష్టంగా నేర్చుకోగలం. నీతిమంతుడైన వ్యక్తి, తనకు వ్యతిరేకంగా తప్పు చేసినవారిని అవమానపరచడు. చర్య తీసుకోవలసి వచ్చినా అది రహస్యంగా చేస్తాడు (సామెతలు 25:9-10). అయితే ఇది వ్యక్తిగత తప్పిదాలకు, ద్రోహాలకు మాత్రమే పరిమితమైన సత్ప్రవర్తన. అందరిని బాధించే తప్పిదాలు, తప్పుడు బోధలు, తప్పుడు నడవడి, బహిరంగంగానే గద్దించబడాలి (1 తిమోతి 5:20).

మత్తయి 1:20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును

"అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా"

అనాలోచితంగా తీసుకునే తొందరపాటు చర్యలు ఎంత ప్రమాదకరమైనవి? కానీ నీతిమంతుడైన యోసేపు తొందరపడలేదు. ఒకవేళ మరియ చెప్పిన సంగతులు నిజమైతే ఆమెను విడిచిపెట్టడం అన్యాయం ఔతుంది. కానీ ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఈ సంగతులను ఎందుకు నమ్మాలి? అతడు ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇది మనకు గొప్ప ఆదర్శం. తొందరపడితే అపార్థాలు అనర్థాలకు దారి తీస్తాయి. నిదానించి ఆలోచిస్తే తర్వాత చింతించవలసిన పనుండదు (సామెతలు 14:29, 19:2, 25:8, ప్రసంగి 7:9). సత్యం తెలిసిన తర్వాత ఎన్నోసార్లు మన అపార్ధాలను బట్టి మనమే సిగ్గు పడవలసి ఉంటుంది. అసలు విషయం తెలియక ఇతరులపై మోపిన నిందలు, తెలిసాక మన మనస్సాక్షికే మనల్ని నిందించే అవకాశాలుగా మారతాయి.

"ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై"

బహుశా జెకర్యాకు ప్రత్యక్షమై బాప్తిస్మమిచ్చు యోహాను జననం గురించి, అలాగే మరియకు ప్రత్యక్షమై యేసు జననం గురించి బయలుపరచిన గాబ్రియేలు దూతే యోసేపుకు కూడా ప్రత్యక్షమై ఉండాలి (లూకా 1:11,19,36). దేవుడు కాని, ఆయన దూత కానీ స్వప్నమందు ప్రత్యక్షమై బయలుపాటు అనుగ్రహించడం పాతనిబంధన కాలంలో కూడా ఎన్నో సందర్భాలలో కనిపిస్తుంది (ఆదికాండము 31:111 రాజులు 3:5, 1 సమూయేలు28:6,15). కొత్త నిబంధన ప్రామాణీకరణ పూర్తి అయ్యేంతవరకు కూడా దేవుడు అనేక సందర్భాల్లో తన దూత ద్వారా తన సేవకులతో మాట్లాడినట్టు చదువుతాము ( అపొస్తలుల కార్యములు 8:26, 10:3-7, 27:23). కొన్నిసార్లు ఇలా కలలు లేదా దర్శనాల ద్వారా కాకుండా నేరుగా దేవదూతలు ప్రత్యక్షమైన కొన్ని సందర్భాలు కూడా రాయబడ్డాయి (అపో. కార్యములు 12:7-11).

మనకు కూడా ఈ రోజు యోసేపుకు లభించిన విధంగా కలల ద్వారా నడిపింపు వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇక్కడ సందర్భానికి మన అనుభవాలకు ఎలాంటి సంబంధం లేదు. స్వప్నంలో మనకు ఎవరెవరో కనిపిస్తుంటారు. అవన్నీ కల్పిత చిత్రాలు. కానీ ఇక్కడ యోసేపు స్వప్నంలో చూసింది ఒక ఊహా చిత్రం కాదు. నిజంగానే ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. ఇది సాధారణమైన ఒక స్వప్నం కాదు. విస్తారమైన పనిపాటల వలన పుట్టే స్వప్నం అంతకంటే కాదు (ప్రసంగి 5:3). ప్రవచన నెరవేర్పును నిర్ధారించే ప్రక్రియలో భాగంగా యోసేపుకు ఈ స్వప్నం కలిగింది. ఇది దేవుని విమోచన చరిత్రతో నిమిత్తం లేకుండా కేవలం యోసేపుకున్న ఒక సందిగ్ధాన్ని మాత్రమే తీర్చడానికి కలిగిన స్వప్నం కాదు. అలాగే యోసేపు ఆ స్వప్నాన్ని విశ్వసించే విధంగా అతనికి దేవుడు ఆధారాలను కూడా అనుగ్రహించాడు. జెకర్యా మరియు మరియతో కూడా దూత మాట్లాడాడు. వారికి చెప్పిన విషయాలు వాస్తవికతకు భిన్నంగా లేవు. ఇవన్నీ జరిగే అవకాశాలను నిర్ధారించే పాత నిబంధన ప్రవచనాలు కూడా లేకపోలేదు (యెషయా 7:14, 9:6, మలాకీ 3:1-2. ఈ దూత ఒక్కసారి కాదు, అనేకసార్లు యోసేపుకు స్వప్నమందు అనేక సంగతులు తెలియచేస్తూ వచ్చాడు ( మత్తయి 2:13, 20, 22). అతను చెప్పిన సంగతులన్నీ వాస్తవాలతో సరిగ్గా సరితూగాయి.

అనేకులు చెప్పుకునే కలలూ దర్శనాలకు ఇక్కడ చెప్పబడిన అనుభవానికి ఎలాంటి సంబంధం లేదు. మనకున్న సందేహాలన్నిటిని తీర్చడానికి ఆయన స్వప్నమందు ఒక దూతను ప్రత్యక్షపరుస్తానని ఎక్కడ వాగ్దానం చెయ్యలేదు. వాక్యాన్ని ప్రత్యక్షపరచడానికి, లేదా దానిని నిర్ధారించడానికి దేవుడు వాడిన పద్దతులు, మన అనుదిన నిర్ణయాల విషయంలో కూడా అందుబాటులో ఉంటాయని కాని కలలను, దర్శనాలను ఆధారం చేసుకుని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని కానీ బైబిల్ బోధించడం లేదు. బైబిల్ ప్రత్యక్షత పూర్తియైన తర్వాత వచ్చే కలలు మరియు బైబిలేతర ప్రత్యక్షతలను నిర్ధారించడానికి అపోస్తలీయ ధృవీకరణ అందుబాటులో ఉంచబడలేదు కాబట్టి అవి అనిశ్చితమైనవి. మాట్లాడింది ఆయనో కాదో తెలుసుకోలేని అనిశ్చిత మాధ్యమాల ద్వారా దేవుడు మాట్లాడడు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం (బైబిల్) మనకు అందుబాటులో ఉంది (2పేతురు 1:19). జీవితంలో "ప్రతి మంచి కార్యమునకు" అందులో ఉన్న నడిపింపు చాలినది (2తిమోతి 3:16-17). ఆ వాక్యాన్నే పరిశుద్ధాత్మ తన నడిపింపును అనుగ్రహించడానికి సాధనంగా మాధ్యమంగా వాడతాడు (యోహాను16:13-15). కాబట్టి కలలు, కలల భావాలు అంటూ తప్పుత్రోవ పెట్టేవారు వాక్యభావంపై మనస్సు నిలపగలిగితే ఈ రోజు సంఘం ఎదుర్కొంటున్న సగం మూఢభక్తికి, అనేక విశ్వాసులు గురయ్యే కలవరాలకు అదే గొప్ప విరుగుడు (యిర్మీయా 23:25-32).

"దావీదు కుమారుడవైన యోసేపూ"

దూత యోసేపును దావీదు కుమారుడని జ్ఞాపకం చెయ్యడం ద్వారా అతనికి మెస్సీయాతో ఉన్న సంబంధం ఎంత ఆశ్చర్యంగా తోచినా అది అసంభవం కాదని నిర్ధారిస్తున్నాడు. ఎందుకంటే మెస్సీయా దావీదు వంశం నుండే రావాలి. వడ్లవాడైన ఈ పేదవాడు, తన రాజవంశ ఘనతను ఎప్పుడో మరచిపోయుండవచ్చు. కాబట్టి అతడు దావీదు కుమారుడని, అతని నుండే మెస్సీయా రావాలని జ్ఞాపకం చెయ్యడం అవసరమయ్యింది. యోసేపు నిజంగా దావీదు కుమారుడే అని పైన రాయబడిన వంశావళి పట్టిక నుండి స్పష్టం ఔతుంది. అప్పటి యూదులకు వారి వంశావళి తెలుసు. కాబట్టి దూత చెప్పేది నమ్మశక్యమైనదే అని యోసేపుకు తెలుసు.

"నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము"

అప్పటి వరకు యోసేపు మనసు నిండా ఎన్నో భయాలు కలవరాలు ఉన్నాయి. ఒకవేళ మరియ వ్యభిచారం వల్ల గర్భం ధరించియుంటే ఆమెను చేర్చుకోవడం వల్ల దోషాన్నీ అవమానాన్నీ కొని తెచ్చుకుంటాడు. ఒకవేళ మరియ చెప్పిన విధంగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించియుంటే ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆమెను "స్త్రీలలో ఆశీర్వదింపబడిన" దాని, "నా ప్రభువు తల్లి" అని సంబోధించింది నిజమైతే (లూకా1:41) అంతటి ఘనురాలిని భార్యగా పొందే అర్హత తనకు ఎక్కడిది? కానీ ఇక్కడ దేవుడు తన దూత ద్వారా ఆమెను భార్యగా చేర్చుకొమ్మని ఆజ్ఞ ఇచ్చి, అతని భయాందోళనలన్నిటినీ పారద్రోలాడు.

"ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది"

మరియ గర్భం ధరించిన శిశువు ఆమె గర్భమందు పరిశుద్ధాత్మ వల్ల కలుగచెయ్యబడ్డాడు. తన దైవత్వపు ఉనికిలో ఆయన నిత్యమూ ఉన్నవాడైనప్పటికీ యేసు క్రీస్తుగా ఆయన మానవ శరీరం దేవుడు సృష్టించి అమర్చిన శరీరం ( హెబ్రీ10:5, ప్రకటన 3:14). పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించడం గురించి ఇదివరకే చర్చించాము (మత్తయి 1:18 వ్యాఖ్యానం చూడండి).

మత్తయి 1:21 ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

"ఆమె ఒక కుమారుని కనును"

ఆమె గర్భవతి అని చూసేవారికి తెలుస్తుంది. కానీ ఆమె గర్భంలో ఉన్న శిశువు ఒక కుమారుడు అని చెప్పడం ప్రవచనాత్మకమైన బయలుపాటు. అది నిజమవ్వడం, యోసేపు విశ్వాసాన్ని బలపరచే గొప్ప నిదర్శనం. మనకు వాగ్దానం చెయ్యబడిన "కుమారుడు" (యెషయా 9:6) ఆయనే అని గుర్తెరగడం మన విశ్వాసాలను బలపరిచే గొప్ప నిజం.

"తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును"

ఈ కుమారుడు ఒక సాధారణమైన శిశువు కాదని నిరూపించేది ఆయన జనన విధం మాత్రమే కాదు. ఆయన చెయ్యడానికి వచ్చిన గొప్ప కార్యం కూడా ఆయన శరీరధారియైన దేవుడే అనడానికి గొప్ప ఆధారం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. దేవదూత ఈ మాట చెప్పడం మరో గొప్ప ప్రవచనాత్మకమైన బయలుపాటు. ఈ కుమారునికి "ప్రజలు" ఉన్నారు. ఆ ప్రజలు కేవలం ఇశ్రాయేలుకు చెందినవారు మాత్రమే కాదు (యోహాను 1:9, రోమీయులకు 9:4-5) వారు జగత్పునాది వెయ్యబడక ముందే తండ్రి తన ఏర్పాటు చొప్పున ఆయనకు అనుగ్రహించిన తన నిబంధన ప్రజలు (యెషయా 53:8, జెకర్యా 9-11, యోహాను 10:16, 12:32-33, ఎఫెసీయులకు 1:3-5 , 2:12 తీతుకు 1:2)

"తన ప్రజలను" ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించనివారు "తన ప్రజలు" కారు. కాబట్టి మనుష్యులందరూ ఆయన ప్రజలే అనే ఆలోచన సరికాదు. సృష్టి నియమాన్ని బట్టి మనషులందరూ ఆయన ప్రజలే అయినప్పటికీ (కీర్తనలు 95:6-7), పాపం కారణంగా వారు ఆయనకు దూరస్థులయ్యారు. ఇప్పుడు యేసు క్రీస్తులో సమాధానపరచబడినవారు మాత్రమే ఆయన ప్రజలు. ఈ నియమం యూదులకు యూదేతరులకు ఒకే విధంగా వర్తిస్తుంది. తన ప్రజలకు రక్షణ అవసరమైయ్యుంది. వారు పాపం కారణంగా చనిపోయి దేవుని ఉగ్రత పాత్రులైయున్నారు (ఎఫెసీ 2:1-3) . ఈ పరిస్థితి నుండి వారికి రక్షణ అనుగ్రహించడానికే ఆయన మానవునిగా జన్మించబోతున్నాడు అని దూత చెప్పిన ఈ మాటలకు తాత్పర్యం.

గమనించండి, ఆయన తన ప్రజలను నరకం నుండి రక్షిస్తాడని కాకుండా పాపం నుండి రక్షిస్తాడని ఈ వాక్యం సెలవిస్తోంది. ఆయన పాపమాలిన్యం నుండి, పాపపు ప్రభావం నుండి, పాపపు ఏలుబడి నుండి, చివరికి పాపస్వభావం నుండి కూడా వారిని కాపాడతాడు కాబట్టి, ఆ పాపానికి పర్యవసానమైన శిక్ష నుండి, అంటే నరకం నుండి కూడా వారిని కాపాడతాడు. ఆయన శరీరధారియై, సిలువపై మరణించి పునరుత్థానుడవ్వడం వల్ల, తన ఆత్మను తన ప్రజలలోనికి పంపడం వల్ల, చివరికి వారిని తన సారూప్యంలోనికి మార్చడం వల్ల ఈ రక్షణ కార్యం సంపూర్ణం చెయ్యబడుతుంది. ఇది యేసుక్రీస్తు అనుగ్రహించడానికి వచ్చిన రక్షణ ( లూకా 19:10, యోహాను 10:15, రోమీయులకు 7:25  8:1, 29-30).

ఈ రోజు అనేకులు పొరపడుతున్న విధంగా కేవలం నరకం నుండి మాత్రమే కాపాడి, అందుకు కారణమైన పాపంలో కొనసాగనిచ్చే రక్షణ గురించి బైబిల్ బోధించడం లేదు. యేసుక్రీస్తు నన్ను రక్షిస్తే‌ నా పాపాల నుండి నన్ను రక్షించాడన్నదే దానికి నిజమైన రుజువు. యేసుక్రీస్తు నన్ను రక్షిస్తే అప్పటివరకూ పాపాన్ని ప్రేమించిన నేను దానిని అసహ్యించుకుంటాను. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా పోరాడే నూతనస్వభావం నాకు అనుగ్రహించబడుతుంది. అప్పటివరకూ నీతి విషయంలో ఏ ఆసక్తి లేని నేను, ఇప్పుడు నీతిని ప్రేమించి, భక్తిహీనతను ద్వేషించే నూతనత్వాన్ని అనుభవిస్తాను. ఇలా క్రొత్త పాత స్వభావానికి మధ్య జరిగే ఈ పోరాట ప్రక్రియ, యేసు క్రీస్తు నాలో తన రక్షణ కార్యాన్ని జరిగించాడనడానికి ఖచ్చితమైన నిదర్శనం. అది లేనివారికి రక్షణ అనుభవం లేదు. ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపములలో కాదు, వారి పాపముల నుండి రక్షిస్తాడు. వారిని పాపం చెయ్యడానికి స్వతంత్రులుగా చెయ్యడు కానీ పాపపు బానిసత్వం నుండి స్వతంత్రులుగా చేస్తాడు (యోహాను 8:34-36). పాపులలో చేరని ఆయన కొరకు (హెబ్రీ7:26-27 ) పాపం లేనివారిగా ప్రత్యేకించబడడానికి (1 పేతురు 2:9, ) సమస్త పాపాల నుండి వారిని రక్షించి (తీతుకు 2:14) మనుషుల్లో నుండి వారిని కొని రక్షిస్తాడు (ప్రకటన14:4) ఇదే యేసుక్రీస్తు సువార్త సారాంశం. సువార్త పాపాన్ని భరించదు, దానిని పరిహరిస్తుంది. సహించదు, దానిని సంహరిస్తుంది.

"గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను"

ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాలి. ఎందుకంటే అది ఆయన రాకడ యొక్క ఉద్దేశాన్ని సరిగ్గా సూచించే పేరు. యేసు అంటే రక్షకుడు, విమోచకుడు, విడిపించేవాడు అని అర్థం. "యాఃషువా" అని మూలభాషలో ఉన్న ఈ పేరుకు "యెహోవాయే నా రక్షణ" లేదా "యెహోవాయే రక్షించును" అని అక్షరార్థం. ఇది పాత నిబంధనలో యెహోషువా మరియు హోషేయ అనే పేర్లతో సమానం.

మత్తయి 1:22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు

"ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును"

ఇది దూత యోసేపుకు చెప్పిన మాట కాదు కానీ మత్తయి ఈ సంఘటన ద్వారా ఒక పాతనిబంధన ప్రవచనం నెరవేరిందని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రవచనం యేసు పుట్టుకకు కనీసం 500 సంవత్సరాల ముందు దేవుడు యెషయా ప్రవక్త నోట పలికించాడు (యెషయా 7:14). అయితే ఇది యేసు పుట్టుకకు సంబంధించిన ప్రవచనం కాదని నిరూపించడానికి విమర్శకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి విమర్శలను అర్థం చేసుకుని, మత్తయి ఈ సూచన మెస్సీయాకు అన్వయించడం న్యాయమే అని నిరూపించడానికి ఈ ప్రవచనం చెప్పబడిన సందర్భాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. అది క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

యెషయా ఈ ప్రవచనం ఆహాజు రాజుకు ఒక సూచనగా చెప్పాడు. సిరియా రాజైన రెజీనుతో కలసి ఇశ్రాయేలు రాజైన పెకహు, యూదా దేశాన్ని నాశనం చేసే ప్రమాదం పొంచియున్న సమయంలో (యెషయా 7:1-3) అలాంటి నష్టమేది రాదని, వారి ఆలోచన నిలువదని, వారికి భయపడొద్దని అభయమివ్వడానికి దేవుడు యెషయాను ఆహాజు దగ్గరికి పంపించాడు (యెషయా 7:4-9 ) దేవుడు చెప్పిన ఈ మాటలను నిర్ధారించడానికి ఎలాంటి సూచన అడిగినా అది ఇవ్వబడుతుంది అని యెషయా చెప్పినప్పుడు, ఆహాజు అతిభక్తి ప్రదర్శించి, నేను అలాంటిదేదీ అడిగి దేవుణ్ణి శోధించనని బదులు చెప్పాడు (యెషయా 7:10-12) అతడు సూచన ఏది అడగకపోయేసరికి, దేవుడు తానే ఒక సూచన ఇస్తాడని చెప్పి, కన్యకగర్భం ధరించి ఇమ్మానుయేలును కనే సూచనను యెషయా ప్రకటించాడు (యెషయా 7:13-14) అయితే ఇక్కడున్న సూచన ఏంటంటే ప్రవచనంలో చెప్పబడిన ఆ శిశువు పుట్టి, పెరుగు, తేనె తినడం ప్రారంభించక ముందే, అతనికి మంచి చెడులను వివేచించగలిగే తెలివి రాకముందే ఈ పేర్కొన్న శత్రువుల ప్రణాళికలు తారుమారైపోతాయి (యెషయా 7:15-16) ఆ సూచన ఆ కాలంలోనే నెరవేరితే అర్ధవంతంగా ఉంటుందని, రేజీను, పెకహు, ఆహాజు, మరియు యెషయా చనిపోయి, ఆ ప్రమాదం కూడా దాటిపోయిన 500 సంవత్సరాల తరువాత నెరవేరితే ఆ సూచనకు దాని ఉద్దేశానికి సంబంధం లేకుండా ఔతుందన్నది విమర్శకులు లేవనెత్తే మొదటి అభ్యంతరం.

ఈ అభ్యంతరాన్ని ఆధారం చేసుకుని, ఈ ప్రవచనంలో ఉన్న "కన్యక" మరియ కాదని, అక్కడ సూచనగా చెప్పబడిన "ఇమ్మానుయేలు" యేసుక్రీస్తు అయ్యుండే అవకాశమే లేదని విమర్శకులు వాదిస్తారు. ఈ వాదనను బలపరిచేలా కనబడే మరో వాస్తవమేంటంటే యెషయా గ్రంథంలోనే ఈ ప్రవచన నెరవేర్పు కూడా కనిపిస్తుంది. యెషయా భార్య గర్భవతియై ఒక కుమారుని కంటుంది (యెషయా 8:3) ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యేలోపే సూచనలో పేర్కొన్న విధంగా ఈ శత్రురాజుల ప్రణాళికలు తారుమారైపోతాయి (యెషయా 8:4) ఆ శిశువుకు "మహేరు షాలాల్‌ హాష్‌ బజ్" అనే పేరు పెట్టబడినప్పటికీ అతడు ఇమ్మానుయేలని సంబోధించబడినట్టు అర్థం చేసుకునే అవకాశం లేకపోలేదు (యెషయా 8:8)

అయితే యెషయా ద్వారా అతని భార్య ఒక శిశువును కంటే ఆమె కన్యక అని పిలవబడడం సాధ్యం కాదు కాబట్టి విమర్శకుల ఈ అభ్యంతరం సరైనది కాదని మనం బదులు చెప్పవచ్చు. కానీ "పార్థేనోస్" (కన్యక) అని గ్రీక్ భాషలో మత్తయి వాడిన పదం సరైన అనువాదం కాదని, యెషయాలో వాడబడిన "అల్మాహ్" అనే హీబ్రూ పదానికి "యువతి" లేదా "యవ్వన స్త్రీ" అనే భావం మాత్రమే వస్తుందని, కాబట్టి ఈ ఇమ్మానుయేలు కన్యకకే పుట్టాలన్న క్రైస్తవవాదన సరి కాదని విమర్శకులు వ్యాఖ్యానిస్తారు.

ఈ అభ్యంతరాలకు జవాబుగా మనం గమనించవలసిన మొదటి వాస్తవమేంటంటే ఆహాజు రాజు సమయంలో యెషయా చెప్పిన సూచన ప్రకారమే ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న సమస్య "మహేరు షాలాల్‌ హాష్‌ బజ్" అనే శిశువు పెరిగి పెద్దవాడవ్వక ముందే సమసిపోయింది. కానీ ఆ సందర్భానికి మాత్రమే ఆ ప్రవచనాన్ని పరిమితం చెయ్యడం న్యాయమైన వ్యాఖ్యానం కాదు. ఎందుకంటే వాగ్దానం చెయ్యబడిన ఈ శిశువు దావీదు సింహాసనానికి నిత్యవారసుడైన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు (యెషయా 9:6-7) ఇది "మహేరు షాలాల్‌ హాష్‌ బజ్" అనే యెషయా కుమారునిలో నెరవేరలేదు. ఎందుకంటే "మహేరు షాలాల్‌ హాష్‌ బజ్" రాజవంశీయుడు కాదు. దావీదు సింహాసనాన్ని ఎప్పుడు అధిష్టించనూ లేదు. కాబట్టి, అప్పటి తాత్కాలిక పరిస్థితికి మాత్రమే ఈ ప్రవచనం పరిమితం కాదు. ఆ ప్రవచనంలో ఉన్న దావీదు వారసత్వ కోణం నెరవేర్చే వేరొక శిశువు కొరకు ఎదురుచూడాలి. యెషయా ఈ సూచన ఆహాజుకు వ్యక్తిగతంగా కాకుండా దావీదు గృహాన్ని ఉద్దేశించి చేసాడని గమనించాలి (యెషయా 7:13) దావీదు సింహాసనాన్ని నిత్యం నిలబెట్టే వారసుడు వచ్చేంత వరకూ దావీదు గృహానికి ఏ నాశనం రాదనీ జ్ఞాపకం చేసుకోవడం అన్ని ప్రతికూల పరిస్థితుల్లోను దావీదుగృహానికి గొప్ప భరోసా ఇచ్చిన నిరీక్షణ అని అనేక సందర్భాలలో గమనిస్తాము (2 దినవృత్తాంతములు13:5 , కీర్తనలు 132:17, 110:1, యెషయా 11:1). ఈ వాగ్దాన శిశువు ఇంకా రాలేదు కాబట్టి రెజీను లేదా పెకహు మాత్రమే కాదు ఎవ్వరు అనుకున్నా దావీదు గృహాన్ని నిర్మూలం చెయ్యడం సాధ్యం కాదని ఇక్కడ భరోసా ఇస్తూ అందుకు తాత్కాలికంగా "మహేరు షాలాల్‌ హాష్‌ బజ్" నందు కూడా ఒక సూచనను దేవుడు నెరవేర్చాడు. కానీ ఆ ప్రవచన పూర్తి నెరవేర్పు మాత్రం దావీదు వంశీయుడైన మెస్సీయాలోనే జరుగుతుంది.‌ అంతే కాదు, ఈ వాగ్దాన శిశువు "అల్మాహ్" అంటే "యవ్వన స్త్రీకి" పుట్టాలని విమర్శకుల వ్యాఖ్యానం సరి కాదు. ఎందుకంటే మత్తయి తన అనువాదంలో వాడిన "కన్యక" అనే అర్థం ఇచ్చే "పార్థేనోస్" అనే పదం తన సొంతంగా వాడింది కాదు. (యెషయా 7:14)ని మొదట యూదులు గ్రీకులోనికి అనువదించిన Septuagint కూడా "పార్థేనోస్" అనే పదాన్నే వాడారు. మత్తయి దాని ఆధారంగానే "కన్యక" అన్నాడు తప్ప అది అతని సొంత వ్యాఖ్యానం కాదు. "అల్మాహ్" అంటే "కన్యక" అనే అర్థం వస్తుందనడానికి యూదుల ఈ అనువాదం బలమైన ఆధారం. మహేరు షాలాల్‌ హాష్‌ బజ్ కన్యకకు పుట్టలేదు కాబట్టి ఈ ప్రవచనం "స్త్రీ సంతానంగా" వాగ్దానం చెయ్యబడిన సర్ప సంహారకునిలోనే నెరవేరాలి (ఆదికాండము 3:15,గలతీ 4:4, హెబ్రీ 2:15. )

"అల్మాహ్" అంటే "దాచబడినది" అని అర్థం. అంటే కొందరు భావించిన విధంగా స్త్రీలను వారి వివాహం వరకు పరపురుషులు చూడకుండా ఇంటిలోనే దాచిపెట్టే సంస్కృతి ఆధారంగా ఈ మాట వాడుకలోనికి వచ్చిందనుకోవడం సరికాదు. రిబ్కా (ఆదికాండము 24:43) రాహేలు (ఆదికాండము 29:6 ) మిరియాము ( నిర్గమకాండం 2:8 ) మరియు నాట్యం చేసే కన్యకలుగా చెప్పబడిన స్త్రీలు (విలాపవాక్యములు 1:4) తదితర ఉదాహరణలు అలాంటి ఆలోచనను సమర్థించవు. అవివాహితులైన యవ్వనస్త్రీలు, బహిరంగంగా బావుల్లో నీళ్ళు తోడుకోవడం, గొర్రెలను కాయడం, పొలం పనులు చెయ్యడం వంటి ఎన్నో సందర్భాలు, బైబిల్లోనూ బైబిలేతర రచనల్లోనూ చూస్తాము. కాబట్టి కన్యకను 'అల్మాహ్' (దాచబడినది) అని పిలవడం వెనుక వేరే కారణం ఉండాలి. ఎక్కువ పరిశీలించకుండానే మనకు కనబడే స్పష్టమైన కారణం ఒక స్త్రీ పురుషుని కూడే సందర్భాలను, "మానాచ్ఛాదన తీయడం" అనే మాటతో వర్ణించబడిన ఎన్నో సందర్భాలు మనకు లేఖనాలలోనే కనిపిస్తాయి (ఉదాహరణగా లేవియకాండం 18 అధ్యాయం చూడండి). కాబట్టి ఇంటిలో దాచిపెట్టబడింది అనే భావంతో కాకుండా చాలా ఖచ్చితంగా పురుషుని చేత నిర్వాస్త్రం చెయ్యబడనిది అనే లైంగిక అర్థంలో "దాచబడినది" "అల్మాహ్" అని కన్యకలను పిలిచారు. "నేను పురుషుని ఎరుగనిదానినే" అని ఆశ్చర్యపడిన మరియకు ఈ నిర్వచనం సరిగ్గా సరిపోతుంది (లూకా 1:34). స్త్రీ సంతానంగా పుట్టవలసిన వాగ్దాన శిశువు పురుష ప్రమేయంతో పుడితే "స్త్రీ సంతానం" అవ్వడం సాధ్యం కాదు. పురుషుని ఎరుగని కన్యక నుండి మాత్రమే స్త్రీ సంతానం రాగలదు.

ఈ వాదనలన్నిటి వెలుగులో యెషయా చెప్పిన సూచన ఏంటంటే స్త్రీ సంతానమైన వాగ్దాన శిశువు వచ్చేంతవరకూ యెరుషలేముకూ యూదా దేశానికీ రెజీను మరియు పెకహు నుండి మాత్రమే కాదు, ఏ శత్రువు నుండి కూడా ఎలాంటి నాశనం సంభవించడం సాధ్యం కాదు. సరిగ్గా యేసు పుట్టిన కొన్ని సంవత్సరాలకు దావీదు గృహం దాని ఉనికి కోల్పోయింది. కన్య మరియకు పుట్టిన యేసు ఆ వాగ్దాన శిశువు కాకపోతే ఇప్పటికి దావీదు గృహం నిలిచే ఉండాలి. అది లేదంటే ఈ సూచనైనా నెరవేరియుండాలి. దావీదు గృహం ఇప్పుడు లేదని మనకు తెలుసు కాబట్టి, ఆ సూచన మత్తయి వివరించిన విధంగా యేసులో నెరవేరింది. ఇలా మోషే, యెషయా మరియు మత్తయి మధ్య పూర్తి ఏకీభావం కనిపిస్తుంది. మరియ గర్భవతియై యేసును కనడంలో "కన్యక గర్భవతియై ఒక కుమారుని కనును" అనే సూచన తప్పక నెరవేరింది. ఇదే నిజం కాకపోతే దావీదు సింహాసనాన్ని నిత్యం నిలబెట్టే వాగ్దాన సంతానం రావలసిన వారసత్వం ఇప్పటికి గుర్తించే అవకాశం ఉండాలి. మరి ప్రస్తుత తరంలో ఆ వారాసుడెవరో యూదులైనా ఇంకెవరైనా చూపించగలరా?

"ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు"

ఆయనకు ఇమ్మానుయేలు అని కాకుండా యేసు అని పేరు పెట్టారు కాబట్టి ఈ ప్రవచనం యేసు పుట్టుకకు సంబంధించింది కాదని కొందరు మరో వెర్రి వాదన చేస్తుంటారు. యేసుకు ప్రవచనాత్మకంగా ఎన్నో బిరుదులూ ఆపాదించబడ్డాయి. అవి ఆయన గుణాలక్షణాలను, లేదా ఆయన చేసే కార్యాలను, లేదా ఆయనలో నెరవేరే ప్రణాళికలను సూచించేలా ఆపాదించబడిన నామాలు (యెషయా 7:14) లో లాగే (యెషయా9:6)లో కూడా ఆయనకు అనేక పేర్లు ఆపాదించబడ్డాయి. అయినా ఎవ్వరూ ఆయనను "ఆశ్చర్యకరుడు", "ఆలోచన కర్త" అని పిలువలేదు. అయినంత మాత్రాన అవి ఆయన పేర్లు కాదని అర్థం కాదు. అలాగే ఆయనను వ్యక్తిగతంగా సంబోధించింది యేసు అనే పేరుతో అయినా దేవుడు మానవులతో తన నివాసాన్ని కలిగియుంటాడనే ప్రవచనం నెరవేర్చినవాడిగా "ఇమ్మానుయేలు" అనే నామం ఆయనకు ఆపాదించబడింది. ఆయనకు దూత చెప్పిన విధంగా యేసు అని పేరు పెట్టారని మనకు తెలిపిన అదే రచయిత, ఇది ఇమ్మానుయేలు పుట్టుక ప్రవచన నెరవేర్పు అని నిస్సందేహంగా తేల్చి చెప్పినప్పుడు, అతనికి లేని సంకోచం ఆధునిక విమర్శకులకు రావడం ఎంతో వింత!! ఎంతో చింత !!!

మత్తయి 1:23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.

"అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను"

మత్తయి సువార్తలో ప్రత్యేకంగా గమనించగలిగే ఒక విశేషమేంటంటే యేసు జీవితంలోని ఒక సంఘటనను పేర్కొని, అది పాతనిబంధన ప్రవచనాన్ని ఎలా నెరవేర్చిందో ఎత్తి చూపించబడుతుంది. మెస్సీయా గురించి చెప్పబడినవన్నీ యేసు క్రీస్తులో నెరవేరాయని, రావలసినవాడు ఈయనే అని యూదులకు నిరూపించడానికి మత్తయి వారి లేఖనాల నుండే ఆధారం చూపించాడు. ఒకవేళ వారి లేఖనాలు అన్యాయంగా వాడుంటే మత్తయి తన సువార్తను తానే బలహీనపరచి, దానిని తిరస్కరించే అవకాశాన్ని తన ప్రత్యర్థులకు తానే ఇచ్చినవాడౌతాడు. అలాంటి వ్యర్థ సాహసం చేసి, మత్తయి తన ప్రయాసను తానే నిష్ప్రయోజనం చేసుకోడు. యేసులో నెరవేరినవి ముందే ప్రవచించబడిన సంగతులని గుర్తించడం యూదులు కానీ యూదేతరులు కానీ తిరస్కరించలేని బలమైన ఆధారం. కాబట్టి మత్తయి తన సువార్తలో మూఢవిశ్వాసాలను కాదు, నమ్మడానికి ఏ తర్కమూ నిరాకరించలేని ఆధారసహితమైన సందేశాన్ని మనకు అందించాడు.

"ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము"

దేవుడే స్వయంగా మానవుల మధ్య తన నివాసాన్ని కలిగియుంటాడని ఎన్నో ప్రవచనాలు వాగ్దానం చేశాయి (యెషయా 7:14,  9:6,  మీకా 5:2,6, జెకర్యా2:9-11) వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించడం ద్వారా ఇది అక్షరాలా నెరవేర్చబడింది (యోహాను 1:1,14.) యేసు క్రీస్తు దేవుడు కాకపోతే ఆయన పుట్టుక ద్వారా దేవుడు మనకు తోడుగా నివసించాడనే ఈ ప్రవచన నెరవేర్పును ఆయన జన్మకు ఆపాదించడం అర్థరహితమైయ్యుండేది. ఇది కన్యకగర్భమందు పుట్టిన రక్షకుడు స్వయానా దేవుడని మనకు నిరూపిస్తుంది .

ఈ వచనాలలో మన ప్రభువుకు ఆపాదించబడిన రెండు పేర్లను ప్రత్యేకంగా గమనించండి "యేసు" అనేది ఆయన చెయ్యడానికి వచ్చిన రక్షణ కార్యానికి సంబంధించిన పేరు. "ఇమ్మానుయేలు" అనేది ఆయన ఎవరో తెలిపే పేరు. ఆయన దేవుడు అని ఆయన స్వభావాన్ని ఇది మన ముందుంచే పేరు. దేవుడు శరీరధారి అయ్యాడు. ఆయన స్వభావాన్ని గురించి, ఆయన ఉనికిని గురించి మనం సరైన అవగాహన కలిగియుండాలి. యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడైయున్న సంపూర్ణ మానవుడు. ఇమ్మానుయేలనే పేరులో ఈ మర్మం నిక్షిప్తమైయుంది. పాపం మినహా అన్ని విషయాలలోనూ యేసు మన వలే మానవస్వభావాన్ని ధరించుకున్నాడు. అయితే ఆయన రక్తమాంసాలతో మనమధ్య జీవించిన సంపూర్ణ దేవుడు.

అలసట, ఆకలిదప్పులు, దుఃఖం వేదన అనుభవించడం తదితర లక్షణాలు ఆయనలో ఉన్నాయని సువార్తల్లో మనం చదువుతున్నాము. ఇది ఆయన కన్యక గర్భమందు ధరించిన మానవ స్వభావాన్ని నిరూపించే నిదర్శనాలు. అయితే అంతే స్పష్టంగా అదే సువార్తలో ఆయన మనుష్యుల ఆంతర్యాన్ని ఎరిగినవాడని (యోహాను 2:23-24.) పాపాలు క్షమించే అధికారం గలవాడని (మార్కు 2:5) దేవాలయంకంటే గొప్పవాడని (మత్తయి 12:6,) విశ్రాంతి దినానికి ప్రభువని (మత్తయి 12:8,) ఎవ్వరూ ఎన్నడూ చెయ్యని కార్యాలు చేసాడని, అబ్రాహాముకు ముందే ఉన్నవాడని (యోహాను 8:58, ) సాతాను పరలోకం నుండి పడగా చూసినవాడని (లూకా 10:18, ) సర్వశక్తిమంత్వంలో తండ్రితో ఏకమైయున్నాడని (యోహాను 10:28-30, 33), ) ఇలా దేవునికి మాత్రమే ఆపాదించదగిన ఎన్నో సంగతులు కూడా ఆయనకు ఆపాదించబడినట్టు చదువుతాము. ఆయన మానవుడు కాక ముందు దేవుడిగా తన ఉనికి కలిగియున్నాడు. మానవుడైనప్పుడు తన దైవత్వాన్ని కోల్పోలేదు కానీ తన దైవత్వానికి మానవత్వాన్ని సంతరింపచేసుకున్నాడు. దేవుడు మానవుడిగా మారలేదు కానీ దైవమానవ మిళిత స్వభావాన్ని కలిగి దేవుడు మన మధ్య మనలో ఒకనిగా జీవించాడు. ఆయన సంపూర్ణ దేవుడైన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ మానవుడైన సంపూర్ణ దేవుడు. ఈ రెండు సత్యాలను అపొస్తలులు ప్రకటించారు కాబట్టి వీటిని నమ్మనివాడు వేరొక క్రీస్తును నమ్ముతున్నాడని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి (2 కొరింథీయులకు 11:4. )

"నీ నిరీక్షణ మరియు విశ్వాసానికి నీకు స్థిరమైన పునాది కావాలా? అయితే నీ రక్షకుడు దేవుడని ఎల్లపుడు గుర్తుంచుకో. ఎవరి రక్తమందు విశ్వసించమని నీకు నేర్పించబడిందో ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఆయనదే. ఆయన చేతి నుండి నిన్ను ఎవ్వరూ అపహరించలేరు. యేసునందు నువ్వు నిజ విశ్వాసివైతే నీ హృదయాన్ని కలవరపడనీయకు, భయపడకు . శోధన శ్రమల్లో నీకు మధురమైన ఆదరణ కావాలా? అయితే నీ రక్షకుడు మానవుడని ఎల్లప్పుడూ గుర్తుంచుకో. శిశువుగా మరియ ఒడిలో పరుండిన వాడు, మానవ మనస్సు తెలిసిన క్రీస్తేసను నరుడు. ఆయన నీ బలహీనలతో సహానుభావం కలిగినవాడు. ఆయన స్వయంగా సాతాను శోధనలను ఎదుర్కొన్నాడు. ఆయన ఆకలిగొన్నాడు, దాహముగొన్నాడు, కన్నీరు కార్చాడు, వేదన అనుభవించాడు. అన్ని సమయాల్లోనూ నీ బాధలన్నిటి విషయమై ఆయనను నమ్ముకో. ఆయన నిన్ను త్రోసిపుచ్చడు. ప్రార్థనలో నీ హృదయం ఆయన ముందు కుమ్మరించు. ఆయన తన ప్రజలను అర్థం చేసుకోగలడు".
(జె.సి. రైల్).

మత్తయి 1:24 యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని-

అంటే యోసేపు మరియను పరిత్యజించాలనే ఆలోచనను పూర్తిగా తిరస్కరించి, బహిరంగంగా ఆమెను వివాహం చేసుకున్నాడని, వారు భార్యాభర్తలుగా కలిసి జీవించారని దీని అర్థం. ఇది స్వప్నమందు ప్రభువు దూత యోసేపుకు ఆజ్ఞాపించిన మాట ఫలితంగా జరిగింది. ఒకవేళ మరియ మాత్రమే తాను కన్యకగా గర్భం ధరించిందని, అలా దూత ఆమెతో చెప్పాడని చెప్పుకునుంటే బహుశా అది ఎప్పటికీ అనుమానాస్పదంగానే మిగిలిపోయుండేది. కానీ తనను అనుమానించి విడిచిపెట్టాలనుకున్న తన భర్తకు కూడా అదే పరలోక అనుభవం కలిగించడం ద్వారా దేవుడు అతని మనస్సులోనూ మన మనస్సులలోనూ పుట్టగలిగే అన్ని సంశయాలను నివృత్తి చేసాడు. మోసగించాలనుకున్న స్త్రీ ఎన్నైనా చెప్పుకుంటుంది. అది ఆమెకు అవసరం. కానీ మోసపోయాననుకున్న పురుషుడు కూడా ఆ మాటలు నిర్ధారించి మరీ ఆమెను చేర్చుకోవలసిన అగత్యం ఏముంటుంది? కాబట్టి దేవదూత మరియకు చెప్పడం కంటే యోసేపుకు చెప్పటమే ఇక్కడ ఎంతో కీలకమైన సాక్ష్యం.

మత్తయి 1:25 ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

మరియ నిత్యకన్యకగా మిగిలిపోయిందని చెప్పే రోమన్ కాథలిక్ సిద్ధాంతానికి ఇది గొడ్డలిపెట్టు. ఆమె కుమారుని కనేంతవరకు ఆమెను ఎరుగకుండెను. ఆ తర్వాత కూడా ఎరిగి ఉండకపోతే ఈ మాట అర్థం లేని మాటగానే మిగిలిపోతుంది. యేసు పుట్టిన తర్వాత ఆమెను ఎరుగకుండాల్సిన కారణమేదీ యోసేపుకు లేదు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఆమెతో తప్పక సంసారధర్మం చేసాడు (నిర్గమకాండం 21:10. ) యేసు కన్యకకు పుట్టాడన్నది మన విశ్వాసప్రమాణంలో కీలకమైన ప్రకటన. కానీ మరియ ఆ తర్వాత ఎప్పటికీ కన్యకగానే మిగిలిపోయిందని చెప్పడానికి లేఖనాలలో ఎలాంటి ఆధారం లేదు. అలా మిగిలిపోవలసిన అవసరం కూడా ఏం లేదు.

దేవదూత చెప్పిన విధంగా మరియకు కుమారుడు పుట్టాడు (లూకా 1:31) మరియు యోసేపుకు (మత్తయి 1:21) ఆజ్ఞాపించబడిన విధంగా వారాయనకు "యేసు" అని పేరు పెట్టారు. మన రక్షకునికి పెట్టిన పేరును ఆయన మాత్రమే నిజంగా సార్థకం చేసుకునే సమర్థుడని నిరూపించుకున్నాడు. ఆయన జననానికి సంబంధించిన మరిన్ని విషయాలు లూకా రెండవ అధ్యాయంలో వివరించబడ్డాయి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.