కొత్త నిబంధన

రచయిత: జి. బిబు

విషయసూచిక:- 4:1 , 4:2 , 4:3 , 4:4 , 4:5 , 4:6 , 4:7 , 4:8 , 4:9 , 4:10 , 4:11 , 4:12 , 4:13 , 4:14 , 4:15 , 4:16 , 4:17 , 4:18 , 4:19 , 4:20 ,4:21,22 , 4:23 , 4:24 , 4:25 .

 

మత్తయి 4:1‌ అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.

"అప్పుడు యేసు"

ప్రభువు బాప్తీస్మ సందర్భంలో ఆయనపై గొప్ప పరలోక ఘనత ఉంచబడిందని గత అధ్యాయం చివరిలో చూసాం. వెంటనే ఆయన శోధించబడడానికి కొనిపోబడ్డాడని ఇక్కడ చదువుతున్నాము. గొప్ప ఆశీర్వాదాలు పొందిన వెనువెంటనే శోధనలు కూడా ఎదుర్కోవలసి ఉంటుందని ఇక్కడ నేర్చుకుంటున్నాము. పౌలు కూడా మూడవ ఆకాశానికి కొనిపోబడిన అనుభవం తర్వాత, తనను నలుగగొట్టడానికి పంపబడిన అపవాది దూత గురించి ప్రస్తావించాడు (2 కొరింథీ 12:1-7). అంటే ప్రతీ ఆశీర్వాదంతో పాటుగా శోధనలు తప్పకుండా వస్తాయి అనడం నా ఉద్దేశం కాదు కానీ మనల్ని శోధనలకు అతీతం చేసే ఆధ్యాత్మిక ఆధిక్యతలేవీ ఈ జీవితంలో పొందేసామని ఎవ్వరూ పొరబడకూడదు. దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు (యోహాను 15:20) ప్రభువే శోధించబడవలసి వస్తే, అవి మినహాయించబడడానికి మనం ఏ పాటివారం?

యోహాను తప్ప మిగిలిన ముగ్గురు సువార్తికులూ బాప్తీస్మం తరువాత యేసు అరణ్యంలో ఉపవాసం చేసిన ఈ సందర్బాన్ని ప్రస్తావించారు. మార్కు మరియు లూకా ఇది బాప్తీస్మం తర్వాత వెనువెంటనే జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు (మార్కు 1:12, లూకా 4:1). అయితే ఇది కొందరిని ఒక అనవసరమైన కలవరానికి గురి చేసింది. ఎందుకంటే యోహాను సువార్తలో యేసు బాప్తిస్మం పొందిన ప్రస్తావన తర్వాత, ఆయనకు కొందరు శిష్యులవ్వడం, ఈ క్రమంలో ఆయన నతనయేలును కలుసుకోవడం, అప్పటినుండి మూడవ రోజు కానా విందుకు వెళ్ళి మొదటి అద్భుతం చెయ్యడం గురించిన కథనాలు వివరించబడ్డాయి (యోహాను 1:31, 2:1). కాబట్టి బాప్తీస్మం తర్వాత ఆయన అరణ్యంలో ఉపవాసం చెయ్యడానికి వెళ్ళాడా లేక కానాలో పెళ్ళి విందుకు వెళ్ళాడా అన్నది ఇక్కడ వారికి వచ్చిన చిక్కుముడి.

అయితే నాలుగు సువార్తల్లో ప్రస్తావించబడిన సంఘటనలన్నిటినీ ఒక సరైన వరుసక్రమంలో అమర్చడమే వాటిలో పరస్పర వైరుధ్యాలుగా కనిపించే ఇలాంటి ఎన్నో సందర్భాలకు చక్కని పరిష్కారం. ప్రస్తుత సందర్భంలో మార్కు-లూకాలు చెప్పిన విధంగా బాప్తీస్మం తీసుకున్న తర్వాత యేసు అరణ్యంలో నలబై రోజులు ఉపవాసముండి శోధన ఎదుర్కొన్నాడు. కానీ యోహాను సువార్తలో యేసు బాప్తీస్మమిచ్చు యోహాను వద్ధకు వచ్చిన సంఘటన ఆయన బాప్తిస్మం నాటిది కాదు. నిజానికది బాప్తీస్మం నాడు ఏం జరిగిందో దాని ఆధారంగా యోహాను ఆయన గురించి ఏం తెలుసుకున్నాడో సాక్ష్యమిస్తున్న సందర్భం (యోహాను 1:29-33). ఈ సాక్ష్యం చెప్పిన సంఘటన ఆ నలబై రోజులు ఉపవాసం తర్వాత జరగకూడదని ఏమీ లేదు కాబట్టి ఇక్కడ పరస్పర వైరుధ్యమేమీ నిరూపించబడలేదు. ఏదోవంక బైబిలును నిందించాలని వైరుధ్యాలు కల్పించే కర్మాగారాలకు ఇది మరో తీరని నిరాశ.

"అపవాది చేత"

యేసును శోధించింది దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు ఎవ్వరినీ శోధించడు (యాకోబు 1:13). యేసును శోధించింది తన స్వకీయ దురాశ కాదు. ఎందుకంటే అలాంటిదేదీ ఆయనలో లేదు (హెబ్రీ 7:26). యేసును శోధించింది అపవాది అని ఈ వచనం స్పష్టం చేస్తుంది. యేసు అపవాది క్రియలను లయం చెయ్యడానికి వచ్చిన అభిషిక్తుడు (హెబ్రీ 2:13, 1యోహాను 3:8, సర్పము తల చితకగొట్టడానికి వాగ్దానం చెయ్యబడిన స్త్రీ సంతానం (ఆదికాండము 3:15). అందుకే యేసు అపవాదితో తలపడి, అడుగడుగునా వానిని ఓడించవలసిన అవసరత ఉండింది. ఈ పోరాటం సాతానును సిగ్గుపరచి దేవునికి గొప్ప మహిమ తెచ్చింది.

"శోధింపబడుటకు"

దేవుడు శోధించబడటం సాధ్యం కాదు (యాకోబు 1:13). యేసు శరీరధారియైన సంపూర్ణదేవుడైతే ఆయన ఎలా శోధించబడగలడు? యాకోబు చెప్పిన శోధనకూ యేసు ఇక్కడ ఎదుర్కొన్న శోధనకూ తేడా తెలుసుకోవడమే ఈ ప్రశ్నకు తగిన జవాబు. యాకోబు మాట్లాడేది ఒకని స్వకీయ దురాశ వలన కలిగే శోధన గురించైతే ఇక్కడ యేసు ఎదుర్కొన్నది దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలీయుల నుండి ఎదుర్కొన్నటువంటి శోధన (కీర్తనలు 78: 18, 41, 106:14, హెబ్రీ 3:9). అంతరంగం నుండి కీడుకు మొగ్గే ప్రవృత్తి దేవునిలో లేదు కాబట్టి యాకోబు చెప్పే శోధన దేవునికి రావడం అసాధ్యం. కానీ శోధించడానికి పరీక్షించడం అనే భావం కూడా ఉంది. ఈ భావంలో దేవునిని శోధించటం సాధ్యం కాకపోతే యెహోవాను శోధించకూడదనే ఆజ్ఞ అర్థరహితం ఔతుంది (ద్వితీయోపదేశకాండము 6:16). ఈ భావంలోనే యేసు అపవాది చేత శోధించబడ్డాడు. అయితే వాని శోధనలకు లోంగే లేదా మొగ్గే ప్రవృత్తి యేసులో లేదు. "ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమియు లేదు" (యోహాను 14:30) అని ప్రభువు చెప్పిన మాట ఈ పరిస్థితికి ఎంతో చక్కటి వివరణ. వాడితో అనుకూలించేదేదీ ప్రభువులో లేదు. వాడు అగ్గిపుల్ల గీస్తే రగిలే ఇంధనం ప్రభువులో లేనేలేదు. వాడి శోధనకు ఆజ్యం పొయ్యగల దురాశ ప్రభువు అంతరంగంలో లేశ మాత్రమైనా లేదు. కాబట్టి ఆయన ఎదుర్కొన్న శోధన ఆయన దైవత్వాన్ని ప్రశ్నించడానికి చాలిన అభ్యంతరం కాదు.

శోధించబడటం పాపం కాదు. ఇది మనకు గొప్ప ఆదరణను ఇచ్చే మాట. ప్రభువు శోధించబడ్డాడు. అయినా ఆయనలో ఏ పాపమూ లేదు. పాపం శోధన ఎదుర్కోవడంలో కాదు శోధనకు లొంగడంలోనే ఉందని ఇక్కడ నేర్పించబడింది. నా తలపై నుండి పక్షులు ఎగరకుండా చెయ్యలేను, కాని అవి నా తలపై గూళ్ళు కట్టుకోకుండా మాత్రం తప్పకుండా ఆపగలను. అంతే కాదు, మన ప్రధానయాజకుడు శోధన ఎదుర్కొని జయించినవాడు కాబట్టి, మనం అనుభవించే ప్రతి శోధనకూ ఆయన చాలిన సహాయకుడు (హెబ్రీ 4:15,16). మనలను శోధించే అపవాది మన ప్రభువు ఓడించిన శత్రువే అని, ఎదిరిస్తే వాడు మననుండి కూడా అలాగే పారిపోతాడని (యాకోబు 4:7) ఈ సందర్భం మనకు బోధిస్తోంది.

"ఆత్మవలన"

యేసును శోధించింది పరిశుద్ధాత్మ కాదు. కానీ ఆ రణ రంగానికి ఆయనను నడిపించినవాడు పరిశుద్ధాత్ముడే. సాతానుపై యేసు విజయాన్ని ప్రదర్శించే వేదికను దేవుడే సిద్ధం చేసాడు. ఇది యేసు తన అజాగ్రత్త వల్లనో అత్యాసక్తి వల్లనో కొని తెచ్చుకున్న శోధన కాదు. ఇది తమను శోధించేలా సాతానును శోధించే మానవ మూర్ఖత్వం వల్ల కలిగే శోధన వంటిది కాదు. ఇది యేసు విజయానికి దేవుడే అనుమతించిన శోధన. శోధనను సవాలు చేసి ఆహ్వానించమని, లేదా అపవాదితో చెలగాటమాడమని ఈ వాక్యం నేర్పించదు కానీ దేవుడే శోధనను అనుమతించినప్పుడు ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడని భరోసా ఇస్తోంది (1 కొరింథీ 10:13).

"అరణ్యమునకు"

ఇది యేసు బాప్తిస్మం పొందిన యొర్దాను యొద్ద ఉన్న యూదయా అరణ్యం కాదు. ఎందుకంటే అది జననివాసం ఉన్న నాగరిక అరణ్యమని ఇదివరకే చెప్పుకున్నాం (మత్తయి 3:1 వ్యాఖ్యానం చూడండి).
కానీ ఇక్కడ ప్రస్తావించబడింది అడవి జంతువులు నివసించే దట్టమైన అరణ్య ప్రాంతం (మార్కు 1:13). అది మోషే నలభై రోజులు ఉపవాసం చేసిన అరణ్యమే అయ్యుండవచ్చని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా యేసు ఏకాంతంలో ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కొని జయించాడు.

"కొనిపోబడెను"

ఇక్కడ పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యానికి కొనిపోయాడని చెప్పబడింది. అయితే మార్కు సువార్తలో ఆయనను "త్రోసుకొనిపోయెను" అని చదువుతున్నాము. అంటే పరిశుద్ధాత్మ ఆ పని కొరకు ఆయనను త్వరపెట్టినట్టు అర్థం చేసుకోగలం. దీనిని ఆధారం చేసుకుని కొందరు తమకు అంతరంగంలో ఏదైనా చెయ్యాలని బలంగా అనిపించే విషయాలను పరిశుద్ధాత్మ త్వరపెడుతున్నాడని పొరబడుతుంటారు. అయితే యేసు ప్రభువు తండ్రితో కానీ పరిశుద్ధాత్మతో కానీ కలిగియున్న ప్రత్యేక సంప్రదింపులు మనకు కలిగే మానసిక ఒత్తిళ్ళతో పోల్చడం సరికాదు. అలాగే రోమా 8వ అధ్యాయంలో చెప్పబడిన పరిశుద్ధాత్మ నడిపింపుకూ ఇక్కడ మనం చూస్తున్న యేసును త్వరపెట్టే సన్నివేశానికి సంబంధం లేదు. రోమా 8లో ఉన్నది పరిశుద్ధపరచబడే ప్రక్రియలో భాగంగా చెప్పబడిన సార్వత్రిక విశ్వాసుల అనుభవం కాబట్టి, ప్రభువు విషయంలో ప్రత్యేకంగా చెప్పబడిన ఈ నడిపింపుతో దానిని కలిపి కలవరపడకుండా మనం జాగ్రత్తపడాలి. ప్రభువులా పరిశుద్ధాత్మ నడిపింపును శోధకుని ప్రేరణలనుండి వివేచించే సామర్థ్యం లేని మనకు అలాంటి నడిపింపు ఒక అనిశ్చిత మాధ్యమం ఔతుంది. అందుకే సంఘానికి పరిశుద్ధాత్మ తన నడిపింపును కచ్చితమైన తన వాక్యం ద్వారానే అనుగ్రహిస్తాడు.

మత్తయి 4:2‌ నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా-

"నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట"

ధర్మశాస్త్రం అనుగ్రహించబడే ముందు మోషే చేసిన విధంగా (నిర్గమకాండం 34:28), సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షముగా మాట్లాడే ముందు ఏలీయా చేసిన విధంగా (1 రాజులు 19:8), ఇక్కడ ప్రభువు తన పరిచర్య ప్రారంభించే ముందు నలువది రాత్రింబగళ్లు ఉపవాసం చేసాడు. మన భక్తి జీవితంలో ఉపవాస ప్రార్థనలకు లేఖనాలు కల్పించిన పవిత్రమైన ఉన్నతమైన స్థానాన్ని ప్రభువు చూపించిన మాదిరి మరింత ఘనంగా హెచ్చించింది. అయితే ఇది ప్రతి సంవత్సరం ఆయన ఒక ఆచారంగా చెయ్యలేదు. తన శిష్యులకు అలా చెయ్యమని బోధించనూ లేదు. శ్రమదినాల ఆచారంగా ఈ రోజు సంఘం పాటించే పద్ధతి అపోస్తలీయ సాంప్రదాయం కాదు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలకు సంవత్సరీకాలు జరిపే ఆచారాన్ని ప్రవేశపెట్టిన రోమన్ కాథలిక్ సంఘమే 589‌A.D లో జరిగిన ఒరిలియా సమావేశంలో ఈస్టర్ కు ముందు తప్పనిసరిగా పాటించవలసిన సాంప్రదాయంగా నలబై రోజుల శ్రమదినాలను సంఘంపై రుద్దింది. అయితే ప్రభువు ఉపవాసానికీ ఆయన మరణ పునరుత్థానాలకూ మధ్య ఉన్న మూడున్నర సంవత్సరాల వ్యవధి, ఆ రెండింటిని జతచేసే సాంప్రదాయం లేఖనాలకు భిన్నమైనది అని రుజువు చేస్తోంది. అవసరం మరియు అనుకూలతను బట్టి ఎవ్వరైనా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చెయ్యవచ్చు, చెయ్యాలి కూడా. కానీ దానినుండి మానవ కల్పిత కృత్రిమ భక్తిని వివేచించి దానిని విసర్జించడం కూడా మనం నేర్చుకోవాలి.

"ఆయన ఆకలిగొనగా"

నలభై రోజుల ఉపవాసం తర్వాత ఆయన ఆకలిగొన్నాడు‌‌. లూకా కూడా దీనిని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు (లూకా 4:2). ఆయన సంపూర్ణ మానవుడే అయినప్పటికి దేవుని కృప మరియు దేవుని ప్రత్యేక సన్నిధి, ఆ ఉపవాస సమయమంతటిలో ఆయన ఆకలిదప్పులను అదుపులో ఉంచాయని చెప్పవచ్చు. ఇది దేవుని ప్రత్యక్ష సన్నిధిలో నలువది రాత్రింబగళ్ళు గడిపిన మోషే అనుభవం వంటిది (నిర్గమకాండము 34:28, ద్వితీయోపదేశకాండము 9:9). నలభై దినాలు, నలభై రాత్రులు గడచిన తరువాత ఆయనకు‌ ఆకలి వేసింది ఇలాంటి ఉపవాసం అందరూ అనుకరించవలసింది కాదనడానికి ఇది కూడా మరో కారణం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది సహజాతీత అనుభవం. మీరు కూడా పోయి అలాగున చేయుడని దేవుని వాక్యం ఎక్కడా ఆజ్ఞాపించలేదు.

మత్తయి 4:3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చినీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను

"ఆ శోధకుడు"

ఆది నుండి మానవాళిని దేవుని నుండి తొలగిపోయే విధంగా శోధిస్తూ వచ్చిన ఆ సాతాను మొదటి ఆదాము పతనానికి దోహదపడిన ప్రయోగాన్నే రెండవ ఆదామైన క్రీస్తుపై కూడా ప్రయత్నించబోతున్నాడు. వాడి క్రియలను బట్టి లేఖనాలు వాడిని వివిధ పేర్లతో సంబోధించాయి. అపనిందలు మోపేవాడిగా "అపవాది" అని (ప్రకటన 12:10, 20:2, జెకర్యా 3:1-2, మత్తయి 4:1), మొదట అబద్ధమాడినవాడిగా "అబద్ధానికి జనకుడు" అని (యోహాను 8:44, ఆదికాండము 3:4-5), ప్రస్తుత సందర్భంలో పాపానికి ప్రలోభపెట్టేవాడిగా "శోధకుడు" అని వాడి కుతంత్రాలను బహిర్గతం చేసే పేర్లు లేఖనాలు వాడికి ఆపాదించాయి (2 కొరింథీ 2:11).

"ఆయన వద్దకు వచ్చి"

నలభై రోజుల తర్వాత ఆయనకు ఆకలి వేసినప్పుడు శోధకుడు ఆయనను సమీపించి ఇక్కడ చెప్పబోయే మూడు విధాలుగా ఆయనను శోధించాడు. అయితే ఈ మూడు విధాలుగా మాత్రమే ఆయనను శోధించాడని దీని అర్థం కాదు ఎందుకంటే ఈ నలభై రోజుల ఉపవాస సమయమంతటిలో కూడా అపవాది ఆయనను శోధిస్తూనే ఉన్నాడని మార్కు తెలియచేస్తున్నాడు (మార్కు 1:13) అయితే ఇప్పుడు మాత్రం ఆయనవద్దకు వచ్చి మరింత నేరుగా ఉధృతంగా శోధిస్తున్నాడు

"నీవు దేవుని కుమారుడవైతే "

"ఈయన నా ప్రియకుమారుడు" (మత్తయి 3:17) అని తండ్రి చెప్పిన సాక్ష్యాన్ని నేరుగా సవాలు చేస్తూ "ఇది నిజమా?" అని అడిగిన ఏదెను ప్రయోగాన్ని అపవాది తిరిగి ప్రస్తావిస్తున్నాడు.

మొదటినుండి నేటివరకూ దేవుని మార్గం నుండి మనుషులను తొలగించడానికి ఈ అనుమానమనే అస్త్రాన్నే సాతాను ప్రతి ధ్వనిస్తున్నాడు. అందుకే విశ్వాసులు ధరించవలసిన సర్వాంగ కవచంలో ఆపవాది అగ్ని బాణాలను అణచివేసేది విశ్వాసపు డాలు అని చెప్పబడింది (ఎఫెసీ 6:16). సాతాను వేసేది ఆవిశ్వాసానికి దారితేసే అనుమానపు ఆగ్నిబాణాలు కాబట్టి విశ్వాసంలో నిలకడగా ఉండడమే దానిని అణచివేసే డాలు అని ఇది మనకు నేర్పిస్తుంది. అపవాది చెప్పినట్టు ప్రభువు చేస్తే అది తన తండ్రి మాటలపై అపనమ్మకమే ఔతుంది. తండ్రి మాట నిజమో కాదో పరీక్షించే విధంగా ప్రవర్తించమని వాడు ప్రభువును శోధిస్తున్నాడు.

"ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించమనెను "

ప్రభువు తన తండ్రి మాటలను శంకించడంతో పాటుగా తండ్రి నమ్మకత్వాన్ని కూడా ప్రశ్నించే విధంగా ప్రవర్తించాలన్నది ఈ శోధన వెనక ఉన్న ప్రయత్నం. "ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా" అంటూ అలనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి శోధించినట్టుగా ఇక్కడ ప్రభువు కూడా దేవునిపై ఆధారపడకుండా తిరుగుబాటు చేసేలా వాడు ప్రేరేపిస్తున్నాడు. దేవుని కుమారుడిగా ఆయనకు శక్తి ఉన్నప్పటికీ ఇక్కడ దానిని ఉపయోగించడం దుష్టుని ఆలోచన చొప్పున నడవడమే ఔతుంది (కీర్తనలు 1:1). తండ్రి చిత్తాన్ని మాత్రమే చెయ్యాలని వచ్చిన కుమారునిని తన స్వంతచిత్తం లేదా ఇంకా చెప్పాలంటే సాతాను చిత్తం చేసేలా తిప్పడమే ఈ పన్నాగంలోని అంతరార్థం. కానీ "నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయూ ఆయన పని తుద ముట్టించుటయూ నాకు ఆహారమైయున్నది" (యోహాను 4:34) అని తీర్మానించుకున్నవానిని ఈ "రాళ్ళ రొట్టెల పథకం" ఎలా ఎందుకు ఆకర్షిస్తుంది? ఐదు రొట్టెలు రెండు చేపలతో వేలమంది గిన్నెలు పొంగిపొరలేలా చేసినవానికి ఇది పెద్ద విషయమేమీ కాదు. కానీ తన దైవిక సామర్థ్యాలు తన తండ్రి మహిమ మరియు ఇతరుల మేలుకొరకే తప్ప ఆయన తన స్వార్థం కొరకు వినియోగించిన దాఖలాలు ఈ నాలుగు సువార్తల్లో ఒక్కటి కూడా కనిపించదు. తన కొరకే వాడని సామర్థ్యాన్ని సాతాను చెప్పింది చేసి పాపం చెయ్యడానికి వినియోగిస్తాడని భ్రమపడిన శోధకుడు అమాయకుడా? మూర్ఖుడా?

మత్తయి 4:4 అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.

"అందుకాయన"

అపవాది ఆయన ముందు ఉంచిన ఈ శోధనను ఎదిరిస్తూ ఆయన ఇలా సమాధానం చెప్పాడు.

"మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును"

ఆహారం లేకపోయినా దేవుని మాటలు చదువుతూ లేక ధ్యానిస్తూ బ్రతికేయ్యొచ్చు అని ఇక్కడ ప్రభువు మాటల భావం కాదు. తినడానికి లేనప్పుడు వాక్యం చదివితే సరిపోతుందని దేవుడు సూచనప్రాయంగా కూడా ఎక్కడా సెలవియ్యలేదు. వాక్యధ్యానం భౌతిక ఆకలి తీర్చే రొట్టెకు ప్రత్యామ్నాయంగా నియమించబడలేదు. మరి ప్రభువు ఇలా బదులివ్వడంలో అర్థం ఏమయ్యుంటుంది? అది తెలియాలంటే ఆయన ఆ మాటలు ఉదహరించిన పాతనిబంధన లేఖన సందర్భాన్ని గ్రహించాలి. ప్రభువు పలికిన ఈ మాట ద్వితీయోపదేశకాండము 8:3 నుండి ఉదహరించబడింది. అక్కడ ఇలా చదువుతాము - "ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను". ఇక్కడ భావం స్పష్టంగా అర్థమౌతుంది. అరణ్యంలో ఆహారం తీర్చడానికి రొట్టెలు అందుబాటులో లేవు. కానీ దేవుడు తన మాట సెలవిచ్చి ఎవ్వరూ ఎన్నడూ కనీవినీ ఎరుగని ప్రత్యామ్నాయాన్ని కలుగచేసాడు. దేవుని నోటినుండి వచ్చిన మాటద్వారా ఆహారం సిద్ధపరచబడింది. ఆకలిగా ఉన్నావు, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పిన అపవాదికి ఇదే తగిన జవాబు. దేవుడు మాట సెలవిస్తే చాలు రొట్టెల లేమి తీర్చడానికి ఏ ప్రత్యామ్నాయమైనా ఆయన పుట్టించగలడు. దేవుని నోటి నుండి వచ్చిన మాట అరణ్యంలో మన్నాను కురిపించింది. దేవుని నోటి నుండి వచ్చిన మాట భక్తుల ఆకలి తీర్చడానికి కాకులు మొదలుకొని దేవదూతలను సైతం శాసించింది. (1 రాజులు 17:4, 19:5). దేవుని నోటనుండి వచ్చిన మాట వలన సారెపతు విధవరాలి తొట్టెలోని పిండి మరియు బుడ్డిలోని నూనె అయిపోకుండా నిలుపబడ్డాయి (1 రాజులు 17:14) కాబట్టి రొట్టెలు లేని పరిస్థితిలో దేవుడు సెలవిచ్చే ఏ మాటైనా మనిషిని బ్రతికించే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదు అన్నది లేఖనాలలో ఎప్పుడో ధృవీకరించబడిన నియమం.

"ఈయన నా ప్రియ కుమారుడు" అని దేవుడు సెలవిచ్చిన మాటను శంకించమని సాతాను ప్రభువును శోధించాడు. ప్రభువు తన శక్తి వినియోగించి రాళ్ళను రొట్టెలుగా చేస్తే నిజంగానే దేవుని మాటను పరీక్షించి ఆ శోధనకు లొంగినవాడు అయ్యుండేవాడు. కానీ దానిని ధీటుగా ఎదురిస్తూ "నేను దేవుని కుమారుడనని సెలవిచ్చినవాడే నా పోషణకు కావలసినది కూడా సెలవియ్యగలడు" అంటూ దేవుని మాటపై ఆయన తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు.

"అని వ్రాయబడియున్నదనెను"

సాతాను శోధించిన ఈ మూడుసార్లూ కూడా ప్రభువు రాయబడియున్న మాటలను, అంటే లేఖనాలను మాత్రమే ఆధారం చేసుకుని వానిని ఎదిరించినట్టు చదువుతున్నాము. "అపవాదిని ఎదిరించుడి" (యాకోబు 4:7) అనే అజ్ఞకు ఎలా విధేయత చూపించారో ఈ ఆదర్శమే మనకు మార్గదర్శిగా ఉంది. ప్రభువుగా ఆయన ఏం సెలవిచ్చినా అది సమంజసంగానే ఉండేది. కానీ ఆయన ఆ స్వేచ్ఛనూ ఇచ్ఛనూ వినియోగించకుండా కేవలం లేఖనాలు మాత్రమే ఉపయోగించి వాటిని ఎలా ఆచరించాలో ఎలా వాటిపై ఆధారపడాలో మనకి మాదిరి ఉంచిపోయాడు.

అయితే ప్రభువు లేఖనాలను మంత్రప్రయోగంలా వాడలేదని గమనించాలి. శోధనను
వ్యతిరేకించడానికి అవసరమైన నీతిసూత్రాన్ని అందులోనుండి వెలికి తీసి దానిపట్ల తన సమర్పణను వ్యక్తపరచడం ద్వారా అపవాదిని ఎదిరించాడు. కేవలం వాక్యాలు వల్లించడం ఎలాంటి అతీతశక్తులనూ పుట్టించదని ఇక్కడ గమనించాలి. బైబిల్ గ్రంథం పట్టుకోవడం, దానిని దిండు క్రింద పెట్టుకోవడం, ఇవేవీ సాతాను శోధనలను అరికట్టజాలవు. ముద్రించబడిన మాటలలోనే తప్ప, ముద్రించబడిన పుస్తకంలో ఎలాంటి శక్తి ప్రభావాలూ ఉండవు. ప్రతి శోధనకు తగిన సమాధానం లేఖనాలు మనకు అందిస్తున్నాయి. వల్లించడం కాదు, వాటిపై మన విశ్వాసం మరియు సమర్పణ మనల్ని శోధనలనుండి కాపాడతాయి. అలాగే ఇక్కడ ప్రభువు "యేసు రక్తమే జయం సాతాను శక్తి లయం" లాంటి మంత్రాలను వాడి ఆపవాదిని ఎదిరించలేదు. ఆ మాటలు చెబితే చాలు సాతాను పలాయనం చిత్తగిస్తాడని నమ్మేవారు ఇది గుర్తుపెట్టుకోవడం మంచిది, చిందించబడబోయే ఆయన రక్తానికి ధర్మశాస్త్ర బలులు సాదృశ్యాలుగా ఉన్నాయి. అయినా ప్రభువు అలాంటి మంత్రాలు జపించలేదు. నామస్మరణం, రక్తస్తుతి, పవిత్రజలం చల్లడం, అపవాదిని నానా మాటలు తిట్టడం ఇవేవీ ప్రభువు ఇక్కడ కనపరిచిన మాదిరికి ప్రత్యమ్నాయాలు కాజాలవు.

మత్తయి 4:5‌ అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి-

"అంతట ఆపవాది"

మొదటి ప్రయత్నంలో పరాభవం పొందిన తర్వాత అపవాది చేసిన రెండవ ప్రయోగాన్ని గమనించాలి.

"పరిశుద్ధ పట్టణమునకు"

ఇక్కడ పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము పట్టణమే (లూకా 4:9). అప్పటికి ఇంకా ఆలయం యెరూషలేములో నిలిచి ఉండడం కారణంగా అది పరిశుద్ధ పట్టణమే. క్రొత్త నిబంధన స్థాపించబడే వరకూ ఆ స్థలానికి ఆ ప్రాధాన్యత ఉండేది.

"ఆయనను తీసుకొనిపోయి"

ప్రభువును అపవాది అక్కడికి తీసుకునిపోయాడు. దీని అర్థం సాతానుకు ఆయన లోబడ్డాడని, లేదా వాని చేత నడిపించబడ్డాడని కాదు. ఇదొక యుద్ధరంగం, ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్ళి ఓడించే సత్తా ఉంది కాబట్టి వాడి సవాలు స్వీకరించి ప్రభువు వాడితో వెళ్ళాడు. ప్రభువు సమ్మతించకపోతే తీసుకునిపోవడం కాదు కదా, కనీసం ప్రభువు యెదుట నిలబడియుండడం కూడా వాడికి సాధ్యమయ్యేది కాదని వాక్యం స్పష్టం చేస్తుంది (మత్తయి 4:10,11).

"దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి"

పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించడం మాత్రమే కాదు, నేరుగా ఆలయ శిఖరానికి అపవాది వెళ్ళాడు. భూమి మీద అపవాదిని రాకుండా ఆపే స్థలమంటూ ఏదీ లేదు. ఇప్పుడు వాడు ప్రయోగించబోయే శోధనకు ఇదే తగిన స్థలం అని భావించి ప్రభువును ఇక్కడికి తీసుకువచ్చాడు.

మత్తయి 4:6‌ నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుముఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును,నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.

"నీవు దేవుని కుమారుడవైతే"

ఈ మాటలను ఇప్పటికే వివరించాను (మత్తయి 4:3 వ్యాఖ్యానం చూడండి).

"క్రిందికి దుముకుము"

ఆయన దేవుని కుమారుడైతే ఆ ఆలయ శిఖరం నుండి క్రిందకు దూకాలని, అలా దూకినప్పుడు ఆయనకు ఏలాంటి గాయం తగలకుండా ఏ హాని జరగకుండా‌ దేవుడు కాపాడితే ఈవిధంగా ఆయన దేవుని కుమారుడే అని నిరుపించబడుతుందని ఇక్కడ అపవాది మాటల భావం. మొదటి శోధనను ఎదిరించినప్పుడు ప్రభువు దేవుని నోటి నుండే వచ్చే ప్రతీ మాటపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు. కాబట్టి కాపుదల విషయమై దేవుడు సెలవిచ్చిన ఒక వాగ్దానాన్ని ఆధారం చేసుకుని అపవాది తన శోధనకు బలం చేకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి, కిందకు దూకమని ప్రేరేపించే ప్రయత్నమే తప్ప సాతానే యేసును కిందకు పడవేసే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే అది వాడి శక్తికీ వాడికి ఇవ్వబడిన అనుమతికీ మించిన పని. అంతేకాకుండా ఒకవేళ అలా చేస్తే అది తన పాపమే ఔతుంది తప్ప యేసులో ఏ పొరపాటుకు తావివ్వదు. కాబట్టి వాడి ఉద్దేశానికి అది పనికి రాదు. సాధారణంగా సాతాను ఎవరినైనా నాశనం చెయ్యాలని అనుకున్నపుడు ‌అది వాడే చెయ్యకుండా వారి స్వంత చేతులతో ఆ పని చేసుకునేలా ప్రేరేపిస్తాడు. అందుకే ఆత్మహత్యకూ స్వీయశారీరక హానికీ కలిగే ప్రేరేపణలన్నీ అపవాది తంత్రంలో భాగమే అని జ్ఞాపకం ఉంచుకుందాం, అప్రమత్తంగా ఉందాం. ప్రభువుకే ఆ ఆలోచన చెప్పాలని చూసినవాడు మనకెందుకు చెప్పడు?

 "ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు"

పాతనిబంధనలో "అభిషిక్తుని" (మెస్సీయకు) సంబంధించిన అనేక వాగ్దానలలో ఇది కూడా ఒకటి (కీర్తనలు 91:11-12). "ఈయన నా ప్రియకుమారుడు" అని దేవుడు సెలవిచ్చిన మాటను శంకించే విధంగా ప్రవర్తించడానికి అపవాది‌ ఇక్కడ ప్రభువును శోధిస్తున్నాడు. ఇలా శోధించే క్రమంలో‌ అపవాది లేఖనాన్ని అసందర్భంగా వాడే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు వాడిన లేఖనభాగాన్ని పరిశీలించినప్పుడు, అక్కడ ఉన్న ప్రారంభమాటలను కావాలనే మింగేసినట్టు అనిపిస్తుంది. "నీమార్గములలో నిన్ను కాపాడుటకు" (కీర్తనలు 91:11) అని ప్రారంభమయ్యే ఈ వాగ్దానంలోని ఎంతో కీలకమైన మాటలను మరుగు చేసి, ఇక్కడ అపవాది తన శోధనకు దోహదపడేలా మిగిలిన వాక్యాన్ని మాత్రమే వాడడాన్ని లేదా వక్రీకరించడాన్ని గమనించండి. "నీమార్గములలో నిన్ను కాపాడుటకు" ఇవ్వబడిన వాగ్దానం, మార్గం తప్పి ఆత్మహత్యకు యత్నించే సమయంలో నీకు ఎలా వర్తిస్తుంది? దేవుని కాపుదల ఆయన ఆమోదించని మార్గంలో నడిచేవారికి ఎందుకు చెందుతుంది? అయితే అలాంటి తప్పుడు భావం స్ఫురించేలా వాక్యాన్ని వక్రీకరించడం అపవాది కుతంత్రానికి మరొక తార్కాణం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మొదటి శోధనలో దేవునిపై కాకుండా తన స్వీయశక్తిపై ఆధారపడమని‌ శోధించిన అపవాది ఇప్పుడేమో దేవునిపై ఆధారపడి తన స్వీయ బాధ్యతను విస్మరించేలా శోధిస్తున్నాడు. నేటికీ దేవుని ఏర్పాటుకూ మానవబాధ్యతకూ మధ్య ఇలాంటి కలవరాన్నే సంఘంలో కూడా సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా దూకితే దూతలు పట్టుకుంటారని ప్రభువుకు చెప్పినవాడే పాపం‌ చెయ్యి, దేవుడు క్షమిస్తాడులే అంటూ కృపను‌ కామాతురత్వానికి మారుస్తున్నాడు. వాని ఎత్తుగడలను వివేచించి, లయపరచడానికి వాక్యసమతుల్యతను నేర్చుకోవడం ఎంత అవసరమో ఇక్కడ నేర్చుకుందాం.

"అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను"

మొదటి శోధనకు ప్రతిస్పందనగా ప్రభువు వాక్యాన్ని వాడి "అని వ్రాయబడియున్నది" అన్నాడు. ఇదిగో ఇప్పుడు ప్రభువును అనుకరిస్తూ సాతాను కూడా వాక్యాన్ని వాడి "అని వ్రాయబడియున్నది" అంటున్నాడు. ప్రభువునే అనుకరించి దైవిక ముసుగులో మోసగించడం అత్యంత ప్రాణాంతకమైన ఆపవాది కుతంత్రం. ఆపవాది వాక్యాన్ని వాడిన ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి.

1) వాక్యజ్ఞానం ఉన్నంతమాత్రాన అది దైవికతకూ లేదా భయభక్తులకూ సూచన కానక్కర్లేదు. సాతానే లేఖనాలను‌ వాడినప్పుడు, వాని అనుచరులు అలా చెయ్యడం ఆశ్చర్యం కాదు (2కొరింథీ 11:14-15).

2) దేవుని మార్గం నుండి, మనం తొలగిపోయేలా అపవాది వాడే కుతంత్రాల్లో లేఖనాల వక్రీకరణ ఒక ప్రధానమైన ప్రయోగం. సాతాను లేఖనాలను వాడుకుంటాడని మనం మర్చిపోవద్దు.

3) బైబిల్ నుండే కదా చెబుతున్నారు అంటూ అవాంతర శాఖలు లేదా తప్పుడుబోధకుల వెంట వెళ్ళిపోయేవారు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యంలోని ప్రతీ తలంపూ సత్యమే కానీ వాక్యంలో ఉన్న మాటలను‌ వాడుకుని, వ్యక్తపరిచే ప్రతీ తలంపూ సత్యం కానక్కర్లేదు. తన స్వంత ఉద్దేశాన్ని మనపై రుద్దడానికి కూడా ఒకడు వాక్యాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది కాబట్టి, ఎవ్వరు బోధించినా సరే మనం వివేచన కోల్పోకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ప్రభువు చూపించిన మాదిరిని అనుసరించి, ఆచితూచి స్పందించాలి.

4) ఎవరైనా వాక్యాన్ని అసందర్భంగా వాడినప్పుడు, వారు అపవాది చేసిన అదే నేరానికి పాల్పడుతున్నారని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉద్దేశపూర్వకంగా చేసినా అజ్ఞానంతో చేసినా వక్రీకరణ యొక్క ప్రభావం మరియు పర్యవసానం ఒకేవిధంగా ఉంటుంది. అందుకే వాక్యంతో యథార్థంగా వ్యవహరించేవారు తమకు తెలియని సంగతులను తెలిసినట్టు బోధించకూడదు. తప్పుద్రోవ పట్టించే పనిని అపవాదికీ‌ వాని అనుచరులకూ విడిచిపెట్టేద్దాం.

5) సందర్భసహితంగా వాక్యాన్ని అన్వయించాలనే నియమాన్ని చెప్పకనే చెబుతూ ఆ నియమాన్ని తప్పడం ఎంతటి ప్రమాదకరమైన భావాలకూ బోధలకూ దారితీస్తుందో నేర్పించే ఈ సంఘటనను ఎప్పుడూ మన కళ్ళ యెదుట ఉంచుకుందాం.

గమనిక: "అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను" అనేమాట BSI తెలుగు అనువాదంలో 7వ వచన ప్రారంభంలో ఉంచడం అర్థవంతంగా లేదు కాబట్టి, ఆంగ్ల అనువాదంలో మరియు గ్రేస్ మినిస్ట్రీస్ వారి తెలుగు వాడుకభాష అనువాదంలో చేసినవిధంగా ఈ వ్యాఖ్యానంలో కూడా ఆ మాట 6వ వచనం చివరిలోనే ఉంచబడింది.

మత్తయి 4:7 అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.

"అందుకు యేసు"

అపవాది శోధనకూ మరియు వాక్యవక్రీకరణకూ విరుగుడుగా ప్రభువు ఈ విధంగా బదులు చెప్పాడు.

"ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని"

అపవాదిని గద్దించడానికి ప్రభువు వాడిన ఈ మాట ద్వితీయోపదేశకాండము 6:16 లో ఉంటుంది. ప్రభువు ఇక్కడ అపవాది చేసిన వాక్యవక్రీకరణను కానీ తప్పుడు అన్వయింపును కానీ వానికి ఎత్తి చూపించే ప్రయత్నం చెయ్యలేదు. వాడికి కావలసింది గద్దింపే తప్ప వాక్యవివరణ కాదు. దేవుడు కాపాడతాడు కదా అని బుద్ధిపూర్వకంగా ప్రమాదంలో పడడం ఆయనను శోధించడమే ఔతుందని, అలా చెయ్యకూడదని చెప్పిన దేవుని మాటను తాను జవదాటబోనని ప్రభువు వానికి తెగేసి చెప్పేసాడు. విశ్వాసం ముసుగులో దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, వినియోగించకుండా తమ బాధ్యతనూ భద్రతనూ విసర్జించేవారందరూ దేవుణ్ణి శోధించే పాపమే చేస్తున్నారు అని ఇక్కడ ప్రభువు ఇచ్చిన సమాధానం మనకు నేర్పిస్తుంది. మనకు మనమే హాని చేసుకోవడం దైవభక్తి కాదు కానీ సాతాను శోధనకు లొంగడమే కాగలదనే పాఠం ఎప్పుడూ గుర్తుంచుకుందాం. ఆరోగ్యాన్నీ, మానసిక సమతుల్యతనూ నష్టపరిచే విధంగా మానవులు కల్పించుకున్న ఏ కృత్రిమ భక్తివిధానమైనా వాటిని‌ కల్పించి నేర్పించేది ఒకవేళ క్రైస్తవ్యం ముసుగులో జరిగినా అదంతా అపవాది కుతంత్రమే. విశ్వాసం‌ ఉంటే మందులూ మాత్రలూ వాడకూడదు, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు కాబట్టి జీవనోపాధి కొరకు పని చెయ్యకూడదు, ఇల్లు కట్టేది యెహోవాయే కాబట్టి మనం ప్రయాసపడకూడదు లాంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు. విషసర్పాలను పట్టుకున్నా మరణకరమైనవి త్రాగినా విశ్వాసులకు ఏ హానీ జరగదని ఉన్న వాగ్దానాన్ని ఆధారం చేసుకుని (మార్కు 16:17,18) అలాంటి ప్రమాదాలను సవాళ్ళుగా స్వీకరించే అజ్ఞానులు, ఇక్కడ ప్రభువు చూపించిన లేఖనాన్ని మరియు మాదిరిని కూడా విస్మరిస్తున్నారు. కానీ ప్రభువు అడుగుజాడలను అనుసరించేవారు ఇలాంటి శోధనలన్నిటినీ వాక్యానుసారమైన వివేచన ద్వారా తప్పించుకుంటారు.

"మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను"

"అని వ్రాయబడియున్నది" అంటూ అపవాది చూపించిన ఒక వచనానికి సమాధానంగా ఇక్కడ ప్రభువు "మరియొక చోట వ్రాయబడియున్నది" అంటూ మరో వాక్యాన్ని చూపించాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వచనం మరోవచనాన్ని కొట్టివేస్తుందా? వాక్యంలో పరస్పర వైరుధ్యం ఏమైనా ఉందా? కానే కాదు. నిజానికి వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో పాటించవలసిన ఒక కీలకమైన నియమాన్ని ఇది మనకు నేర్పిస్తుంది. ఒక వచనం నుండి మనం గ్రహించే భావం కానీ దాని ఆధారంగా చేసుకునే అన్వయింపు కానీ వాక్యంలో ఉన్న మరే వచనంతోనూ విభేదించకూడదు. ఒకవేళ విభేదిస్తే మనం గ్రహించిన భావం సరైనది కాదు. ఒక వచనాన్ని ఏ పరిధిలో అర్థం చేసుకోవాలో ఎలాంటి పరిమితులతో అన్వయించుకోవాలో వేరొక వచనం నిర్థారిస్తుంది. అందుకే "అని వ్రాయబడియున్నది" అనడంతో అనుకోవడంతో ఆగిపోకుండా "మరొయొక చోట వ్రాయబడియున్నదానిని" కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలా ఏ విషయంలో అయినా వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఒకే వచనం‌ పైన వ్రేలాడే సిద్ధాంతాలు, నీతిపాఠాలు మరియు అన్వయింపులు ఈ లేఖన సమతుల్యతా నియమాన్ని విస్మరిస్తున్నాయి కాబట్టి ఎంతో అపాయకరమైనవిగా పరిణమిల్లుతాయి. అలా కాకుండా మన వాక్య అవగాహన మరియు అన్వయింపు సమగ్రవాక్య విశ్లేషణపై ఆధారపడియుండాలనే నియమాన్ని ఇక్కడ స్వయంగా ప్రభువే నేర్పిస్తున్నాడు. ప్రభువు సాతానుకు చెప్పిన ఈ సమాధానమే ప్రతీ సత్యబోధకూ ఆయువుపట్టు మరియు ప్రతీ దుర్బోధకూ తిరుగులేని విరుగుడు.

మత్తయి 4:8 మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి-

రెండవ శోధనలో కూడా అపజయం పొందిన ఆపవాది, మరో తంత్రాన్నీ ప్రయోగించడానికి ప్రభువును ఆలయ శిఖరం యొద్దనుండి ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకునిపోయాడు. అక్కడనుండి ఈ లోక రాజ్యాలను వాటి మహిమను ప్రభువుకు చూపించాడు. ఆ కొండ పేరు కానీ అది ఉన్న ప్రాంతం పేరు కానీ ఇక్కడ ప్రస్తావించబడలేదు. దానిపేరు తెలుసుకోవడం అంత ముఖ్యమైన విషయం కూడా కాదు. కాకపోతే ఈ లోకరాజ్యాలన్నిటినీ చూడడం ఎంత ఎత్తైన పర్వతశిఖరం నుండి కూడా సాధ్యం కాదు. అలాంటి ఒక శిఖరం ఎక్కడైనా ఉన్నట్టు ఇప్పటివరకూ ఎవ్వరూ కనుక్కోలేదు. అంతేకాకుండా భూమి బల్లపరుపుగా ఉంటే తప్ప ఆందులోని రాజ్యాలన్నీ ఒక్కసారిగా చూడడం ఎలా సాధ్యమనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తే అవకాశం లేకపోలేదు. అయినా మనకు ఉన్న ఆ పరిమితి, ప్రభువుకు కానీ సాతానుకు కానీ ఎందుకు వర్తిస్తుంది అని సరిపెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన దివ్యదృష్టికి ఆ రాజ్యాలు కానీ వాటి మహిమ కానీ ఎప్పుడూ మరుగుకాలేదు. అలా తన దివ్యదృష్టిలో చూసినవి తన మానవస్వభావానికి శోధనలు కూడా కాలేవు. వాటికి మొగ్గినా వాటిని జయించినా ఇవి ఆయన మానవ పరిమితుల్లో చూసిన వాటిని బట్టే జరగాలి. కాబట్టి ఆ పరిమితుల్లోనే ఆపవాది వాటిని ఆయనకు చూపించియుండాలి.

అలా అయితే ఒక పర్వత శిఖరం నుండి ఈ లోక రాజ్యాలన్నిటినీ ఎలా చూపించాడు అనే ప్రశ్నకు రెండు వివరణలు చెప్పుకోవచ్చు. మొదటి వివరణ ఏంటంటే లేఖనాలలో "లోకం" అనేమాట పరిమిత అర్థంలో కూడా వాడబడింది (లూకా 2:1).
ఇక్కడ కూడా ఒకవేళ అలాంటి భావంలోనే ఆ పదం వాడియుంటే బహుశా ఇది మోషేకు దేవుడు కనాను రాజ్యాలన్నిటినీ చూపించిన పిస్గా పర్వతశిఖరం అయ్యుండవచ్చు (ద్వితీయోపదేశకాండము 34:1-4). లేదా "Adam clarck" ఈ వచన వ్యాఖ్యానంలో పేర్కొన్న "the Abbe Mariti" పుస్తకంలో‌ "Cyprus" పర్వతశిఖరాల మీదనుండి అరేబియా కొండలు, గిలాదు దేశము, ఆమోరీయుల దేశము, మోయాబు లోయలు, యెరికో లోయలు, యోర్దాను నది మరియు మృతసముద్రపు వైశాల్యమంతా స్పష్టంగా చూడవచ్చని చదువుతున్నాము. ఇలాంటి ఎదో ఒక శిఖరం పైకి ఆపవాది ప్రభువును తోడుకుని వెళ్లియుండవచ్చు. రెండవ వివరణ ఏంటంటే ఈ లోక రాజ్యాలన్నిటిని, వాటి మహిమను చూడడం ఏ పర్వత శిఖరం మీదనుండి కూడా సాధ్యం కాదు కాబట్టి కేవలం భ్రమపరిచే ఒక ఊహా చిత్రాన్ని మాత్రమే అపవాది ప్రభువు ముందు ఉంచాడని, పర్వతశిఖరం మీదనుండి చూపిస్తున్నాడు కాబట్టి, అది నిజ దృష్యంగా మభ్యపెట్టే అవకాశం ఉంటుందన్నది వాడి పధకమని మరి కొందరి అభిప్రాయం. ఈ రెండూ మంచి వివరణలే. రెండింటినీ కలపి ఆలోచిస్తే అసలు ఏం జరిగుంటుందో కొంతవరవరకూ అంచనా వేసే అవకాశం ఉంటుంది. కళ్ళతో చూడగలిగినంత మేరకు చూపించి మిగిలినవి బహుశా అపవాది తన కల్పిత దృష్యాలతో పూరించియుండవచ్చు. రాజులు వారి రాజభోగాలు, భవనాలు, వస్త్ర భోజనాదులు, సైనిక బలగాలు, గుర్రపు రౌతులు, వెండి బంగారం మరియు ఇతర వెలగల వస్తువులతో కూడిన ఐశ్వర్యం, అందమైన ఉద్యానవనాలు, విస్తారమైన పొలాలు తోటలు, వారికి ఉన్న అధికార వైభవం, వారికి లభించే గౌరవ మర్యాదలు, దాసిదాసుల సేవ సదుపాయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి తన హద్దులు లేని శరీరాశలను, జీవపు డంబాన్ని తృప్తిపరచుకోవడానికి కోరుకునే సమస్తాన్ని తన ఊహా చిత్రంలో ఇమిడ్చి ప్రభువును ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

మత్తయి 4:9‌ నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా-

మొదటి రెండు శోధనలలోను "నీవు దేవుని కుమారుడవైతే" అని సవాలు విసిరిన ఆపవాది, వాడు కోరిన రుజువులేవి ప్రభువు వానికి చూపించలేదు కాబట్టి, దానినే వాడి ఈ ముడవ శోధనకు అనుకూలంగా మలచుకుంటున్నాడు. "నిన్ను ఆకలికి, అభద్రతకు విడిచిపెట్టిన ఆ దేవునికి నువ్వు కుమారుడవు కావు కాబట్టి, నాకు మొక్కి నా పరిపాలనకు విధేయుడవైతే ఈ కష్టాలేవీ లేకుండా హంగు ఆర్భాటంతో లక్షణంగా బ్రతికెయ్యవచ్చు" అన్నట్టుగా అపవాది మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను విడిచిపెట్టేసాడని, ఆయన మనకు సహాయం చెయ్యడని నమ్మ బలకడం అపవాది శోధనలకు ఎంతో బలం చేకూరుస్తుంది.

ఆలా ఆ ఎత్తైన కొండ మీదనుండి ప్రభువుకు శోధకుడు చూపిన ఈ లోకరాజ్యాలు మరియు వాటి మహిమ అంతా ఈ శోధనకు రంగం సిద్ధం చెయ్యడం కోసమే ఉద్దేశించబడ్డాయి. వాడిని ఆరాధిస్తే ఇవన్నీ ఇచ్చేస్తానని ప్రభువును ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అలా వాడి ఇష్టానుసారంగా ఎవరికైనా వాటిని ఇచ్చే అధికారం వాడికి ఉందని ప్రభువును నమ్మించాలని చూస్తున్నాడు. లూకాలో ఉన్న సమంతర వాక్యభాగాన్ని చదివినప్పుడు ఇది మరింత స్పష్టంగా అర్థం ఔతుంది.

"ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను" (లూకా 4:6-7).

కానీ నిజానికి అలాంటి అధికారమేదీ వాడికి లేదని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. పతనమైన మానవుల ఆధ్యాత్మిక జీవితాలను అపవాది ఏలుతున్నాడనేది వాస్తవమే (ఎఫెసీ 2:2, 2తిమోతీ 2:24-26). అందుకే వాడు "ఈలోక అధికారి" (యోహాను 12:31, 14:30), "ఈ యుగసంబంధమైన దేవత" (2 కొరింథీ 4:4) అనే పేర్లతో పిలువబడినప్పటికీ ఈ లోకరాజ్యాలమీద వాడికి ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండడం మాత్రం పచ్చి అబద్ధం. ఈ లోక రాజ్యాలన్నిటిపై ఎల్లప్పుడు రాజ్యమేలేది దేవుడు ఒక్కడే (కీర్తనలు 96:10, 103:19, 2దినవృత్తాంతాలు 20:6, 1 తిమోతీ 6:15). వాటిపై అధికారులను నియమించేది, అధికారం నుండి వారిని తొలగించేది కూడా ఆ సర్వాధికారియైన దేవుడు మాత్రమే (కీర్తనలు 75:6-7‌, దానియేలు 2:21, 4:34-35). కాబట్టి ఎవరికిబడితే వారికి ఈ లోకరాజ్యాలను అప్పగించే అధికారం అపవాదికి ఎంతమాత్రం లేదు. ఈ లోక రాజ్యాలన్నిటి మీద అధికారముందని చెప్పుకున్న వీడి దూతలు, ప్రభువు అనుమతి లేకుండా పందులలోకి కూడా ప్రవేశించలేకపోయాయి (మార్కు 5:12-13). కాబట్టి ఆ ప్రభువుకే అన్నీ ఇచ్చే అధికారం వాడికి ఉందని బొంకడం కేవలం వాడి కుట్రలో భాగం మాత్రమే.

"ఇవన్నీ నీకు‌ ఇస్తానని" చెప్పే అపవాది శోధనలో ఉన్నవి కేవలం గాలిమేడలు మాత్రమే అని, వాడు గీసే ఊహా చిత్రాల వెంటపడి, లేనివాటికోసం ఉన్నవాటిని పనంగా పెట్టడం అనేది ఎంతటి ప్రమాదమో ఇక్కడ నేర్చుకుందాం. దేవుడు తన కుమారునికి ఈ లోకరాజ్యాలన్నీ స్వాస్థ్యంగా ఇస్తానని ఎప్పుడో వాగ్దానం చేసాడు (కీర్తనలు 2:7-9). అవి తన సమయంలో తన పద్దతిలో దేవుడే అయనకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించాడు కూడా (మత్తయి 28:18-20). దేవుడు వాగ్దానం చేసినవాటిని సాతాను చేతుల మీదుగా ఎవ్వరూ ఎన్నడూ పొందలేరు. కానీ అలా పొందవచ్చని వాడు శోధిస్తాడు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమౌతుంది. పాపమార్గంలో సంపాదించుకునే ప్రతి ప్రయోజనం అలాంటి శోధనలకు లొంగడమే కాగలదు. ప్రభువుకు చెందినవారు మాత్రమే ప్రభువు వలె వాడిని ప్రతిఘటిస్తారు.

దేవుడు ఆరాధించబడేవిధంగా తాను కూడా ఆరాధించబడాలని అపవాది ఆరాటపడుతున్నాడు అనేది వాడి ఈమాటల నుండి స్పష్టమౌతుంది. దేవునికి మాత్రమే చెందవలసిన ఆరాధనను దొంగలించనిదే "నేను సర్వోన్నతుని వలె ఉంటాను" (యెషయా 14:12,13) అనే వాడి చిరకాల వాంఛ ఎలా తీరుతుంది! దేవునికి కాకుండా చేసే ప్రతీ ఆరాధననూ ప్రేరేపించేది మరియు దానిని పొందుకునేది సాతానే అని మనం మరచిపోకూడదు (ద్వితియోపదేశకాండము 32:17, 1కొరింథీ 10:19-20). అయితే మనుషుల చేత ఆరాధించబడేది చాలక, ఇప్పుడు దేవుని కుమారుని ఆరాధననే తనకు రాబట్టుకోవాలని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. వాని కుతంత్రాల క్రమాన్ని గమనించండి. అవిశ్వాసానికి మొదట శోధించి విఫలమయ్యాడు. ఆపై అవిధేయతకూ ఆత్మహత్యకూ శోధించి అక్కడ కూడా ఓటమినే చవిచూసాడు. చివరికి దేవునితో పూర్తిగా తెగతెంపులకు ఒడిగట్టే అతి నీచమైన హేయమైన దెయ్యారాధనకు శోధిస్తున్నాడు. సాతాను కలిగించే అతిచిన్న ప్రలోభం వెనుక కూడా దాగియున్న అంతిమ లక్ష్యం మనలను దేవునినుండి వేరు చేసి ఆయన స్థానాన్ని వాడు ఆక్రమించుకోవడమే. ప్రతీశోధననూ ఒక బద్ధశత్రువుగా చూడడానికి ప్రతీపాపాన్నీ ప్రాణాంతకమైన అపవాది తంత్రంగా గుర్తించడానికి ఇది మనకు సహాయపడును గాక! చిన్న-చిన్న శోధనలపై కలిగే ప్రతీవిజయం, మరింత పెద్దవి మరియు ప్రమాదకరమైనవి ముందున్నాయనే గ్రహింపుకూ వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన స్వస్థబుద్ధికీ మనలను ప్రేరేపించును గాక!

చివరిగా ఒక విషయాన్ని మన ఆదరణ కొరకు గమనించాలి. దేవదూషణకు, దైవతిరస్కారానికి సంబంధించిన ఆలోచనలు మన మనస్సులో పెట్టేది, అలనాడు ప్రభువు మనస్సులో దెయ్యారాధన తలంపులను ప్రవేశపెట్టాలని చూసిన అపవాది క్రియమాత్రమే. వాటికి సమ్మతించనంతవరకూ వాటి విషయమై మనం ఏమాత్రం కలత చెందవలసిన అవసరం లేదు.

మత్తయి 4:10 యేసు వానితో సాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.

"యేసు వానితో, సాతానా పొమ్ము"

మునుపటి లాగే ప్రస్తుత శోధనకు కూడా సమాధానంగా ప్రభువు ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యాన్ని వాడుతున్నాడు. అయితే ఈసారి మాత్రం తన దైవిక అధికారాన్ని కూడా వినియోగించి వాడిని పారద్రోలుతున్నాడు. ఎందుకంటే దేవుని స్థానాన్నే ఆక్రమించాలనే వాడి ధిక్కారణ కంటే అసహ్యమైనది మరేదీ లేదు. వాడి తంత్రాలను పరాకాష్టకు వాడనిచ్చి, దిగజారగలిగినంత లోతుకు వాడి నికృష్టతను సహించి "చేసింది చాలు ఇక పో" అన్నట్లు ప్రభువు వాడిని గద్దించాడు. దేవునిని కాకుండా ఇంకెవరినైనా ఆరాధించమనే శోధన ఒకవేళ అత్యంత సన్నిహితులనుండి వచ్చినా వారిని సహించకూడదని రాయబడినప్పుడు (ద్వితీయోపదేశకాండము 13:6-8), అత్యంత దుర్మార్గుడైన సాతాను ఆ ప్రతిపాదన చేస్తే ప్రభువు ఎలా సహించగలడు? ఆయనపై చేసిన దాడులన్నిటినీ ఓపికగా ఎదుర్కొన్న ప్రభువు, దేవుని ఘనతపై దాడి జరగగా చూసి సహించలేకపోయాడు. న్యాయమైన ఆయన ఆగ్రహంతో వాడి స్థానం ఏంటో వాడి హద్దులేంటో ప్రభువు వాడికి చూపించాడు.

"ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను"

ఇక్కడ "ద్వితీయోపదేశకాండము 6:13లో" ఉన్న మాటలను వాడి ప్రభువు ఆపవాదికి బదులిచ్చాడు. అయితే "మాత్రము" అనే మాట ఆ వాక్యంలో లేదు. దానిని ప్రభువే చేర్చాడు. ఎందుకంటే ఆ తర్వాత వచనంలోనే "ఇతర దేవతలను సేవించకూడదు" అనే నిషేధాజ్ఞ చేర్చబడింది (ద్వితీయోపదేశకాండము 6:14). పైగా లేఖనా సమగ్ర బోధను కూడా "మాత్రమే" అని ప్రభువు చేర్చిన ఈ మాట సమర్థవంతంగా వ్యక్తపరుస్తుంది. కాబట్టి అలా "వ్రాయబడియున్నది" అని ప్రభువు చెప్పడంలో పొరపాటు లేదు. అందుకు భిన్నంగా ఈ సమాధానం, లేఖనాలను సమగ్ర భావనలో ఎలా అర్థం చేసుకుని అన్వయించాలో మనకు మాదిరి చూపిస్తుంది.

దేవుడు కాకుండా ఇంకెవ్వరూ మ్రొక్కబడడానికి, ఆరాధించబడడానికి అర్హులు కారు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో సమానంగా దేవుడు అయ్యుండకపోతే ఆయనకు కూడా ఆ అత్యున్నత స్థానం లేఖనాలు ఆపాదించియుండేవి కావు. అయితే స్వయంగా దేవుడయ్యుండి సమస్త ఆరాధనను పొందనర్హుడైన ప్రభువు కూడా తన శరీరధారణలో వ్యక్తిగతంగానూ బహిరంగంగానూ దేవునిని ఆరాధించి ఆయనకు మాత్రమే మ్రొక్కి ఇలా నీతియావత్తునూ ఆయన నెరవేర్చాడు. ఇష్టమైనా కష్టమైనా వాడు కూడా అదే చేసి తీరాలని అపవాదికి కూడా తెగేసి చెప్పేసాడు. ప్రభువుకు వలే దైవారాధనకు సంపూర్ణంగా ఇష్టంగా ప్రేమగా రాజీపడకుండా సమర్పించుకుందాం. అందుకు ప్రత్యమ్నాయంగా నిలిచే ప్రతీదీ దెయ్యారాధన అని వివేచించి, దానిని విసర్జించి, విరోధించి విజయించిన ప్రభువు ఆదర్శాన్ని అనుసరిద్దాం.

మత్తయి 4:11 అంతట అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.

"అంతట అపవాది ఆయనను విడిచిపోగా"

తనకు ఆ అధికారం ఉంది, ఈ అధికారం ఉంది అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికిన సాతానుకు నిజానికి ఉన్న అధికారమంతా ఇదిగో ఈపాటిదే. ప్రభువు ఆజ్ఞాపించగానే క్షణమైనా ఆయన యెదుట నిలువలేక వాడు పలాయనం చిత్తగించాడు. ప్రభువు అధికారానికి సంపూర్ణంగా లోపరచబడ్డాడు. అయితే ఇలా వాడు ప్రభువును విడిచిపోయింది కొంతకాలం మట్టుకే అని లూకా తెలియచేస్తున్నాడు (లూకా 4:13). ఎందుకంటే ప్రభువు రాకడలో ఒకానొక ప్రధాన ఉద్దేశం అపవాది క్రియలను లయపరచడమే (హెబ్రీ 2:13). అది సంపూర్ణంగా నెరవేరేంతవరకూ రణరంగం కొనసాగాలిగా మరి (యోహాను 14:30, లూకా 22:53).

"ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి"

ప్రభువు సాతానును ఒడించి పారద్రోలేంతవరకూ దేవదూతల ప్రమేయం అనుమతించబడలేదు. అందునుబట్టి ఆ విజయానికి సంపూర్ణ మహిమ ప్రభువుదే అని దేవుడు కనపరిచాడు. పోరాటంలో మీఖాయేలును అతని దూతలనూ దేవుడు సాధనంగా వాడుకునేది వారు లేకుండా ఆయన ఆ పని చెయ్యలేడని కాదు అని ఇక్కడ స్పష్టమౌతుంది. అయితే అపవాది వెళ్ళిన తర్వాత దూతలు ఆయనకు పరిచర్య చెయ్యడానికి అంటే ఆయనకు ఆహారం ఇచ్చి, బలపరచడానికి ఆయన వద్దకు వచ్చారు. దేవుని నోటనుండి వచ్చేమాట ద్వారా తాను జీవిస్తానని ప్రభువు సాతాను యెదుట వ్యక్తపరచిన విశ్వాసాన్ని దేవుడు ఈవిధంగా ఘనపరిచాడు. మాట సెలవిచ్చి తన దూతలద్వారా (కీర్తనలు 103:20) ఆయన సేదతీరడానికి అవసరమైనవి ఇచ్చి ఆయనకు పరిచారం చేయించాడు. "నిన్ను కాపాడడానికి దూతలను పంపిస్తాడట కదా!" అని వెటకారమాడిన అపవాదికి చెంపపెట్టుగా ఇదిగో దూతలు వచ్చి ఆయనకు పరిచర్య‌‌ చేసారు.

గమనించండి:

1) క్రీస్తును ఆయన ప్రజలను ఎదిరించే దుష్ట శక్తులు ఉన్నాయి అన్నది నిజం. ఇది మనలను సదా అప్రమత్తులను చెయ్యాలి. అయితే క్రీస్తుకు వలే ఆయనకు చెందిన వారందరి పరిచర్యార్ధమై దేవదూతలు నియమించబడ్డాడు అనేది కూడా అంతే నిజం (హెబ్రీ 1:13,14). ఇది మనకు గొప్ప ఆదరణను కలిగించాలి.

2) క్రీస్తు సాధించే ప్రతీ విజయం వెనుక పరలోక సైన్య సమూహల విజయార్భాట ధ్వనులు మారుమ్రోగుతాయి (ప్రకటన 12:9-10). ఆయన బిడ్డలందరికీ ఆయన అంతిమ విజయమే ఏకైక నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు (రోమా 5:3-5).

3) ఆకలిలోనూ బలహీనతలోనూ శోధించబడిన ప్రభువుకు దేవుడు ఏలియాకు పంపినవిధంగా
(1 రాజులు 19:4-7) దేవదూతల ఆహారం సిద్ధపరచి ఆయనను బలపరచాడు. మనం క్రీస్తుకు చెందిన వారమైతే ఆ దేవుడే మన దేవుడు. ప్రతీ శోధనలోనూ ఆయన అనుగ్రహించే ఉపశమనానికై ఆయనతట్టు చూడడానికి ఇది మనలను ప్రోత్సహించాలి. "సాయం కాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును" (కీర్తనలు 30:5) అనే మాటలు ప్రతీ శోధన ఘడియలలోను, గాఢాంధకారపు లోయలలోను మనలను బలపరిచేవిగా ఉన్నాయి.

4) ఈ విధంగా పరలోకం నుండి తండ్రి స్వరం ఇచ్చిన సాక్ష్యం, పరిశుద్ధాత్మ ఆయనపై నిలిచి నిర్ధారించిన ఆయన పరిచర్య మరియు సాతానుపై ఆయన సాధించిన ఘన విజయం, ఇవన్ని నిజంగా ఆయనే దేవునికి మనకు మధ్య నియమించబడిన మధ్యవర్తి అని నిరూపించి తన బహిరంగ పరిచర్యకు దేవుడు ఆయనను సిద్ధపరచాడు.

మత్తయి 4:12 ​యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి-

"యోహాను చెరపట్టబడెనని యేసు విని"

యోహానును హేరోదు చెరలో పెట్టాడని, హేరోదు పాపజీవితానికి వ్యతిరేఖంగా హెచ్చరిక చేసినందుకు పర్యవసానంగా ఇది జరిగిందని మనం చదువుతున్నాము (మత్తయి 14:3-4). అప్పటినుండి తన మరణం వరకూ యోహాను ఆ చెరలోనే కొనసాగాడు. అక్కడనుండే ఇద్దరు శిష్యులను ఆయన యేసు వద్దకు పంపాడు (మత్తయి 11:2,3).

"గలిలయకు తిరిగి వెళ్ళి"

యోహాను చెరపట్టబడిన సమాచారం విని యేసు గలిలయకు తిరిగివెళ్ళాడని చదువుతున్నాము. అంతమాత్రాన ఇది యేసులో ఉన్న పిరికితనం అని విమర్శకులు చేసే ఆరోపణకు ఇక్కడ తావులేదు. ప్రమాదం ఉన్న చోటనుండి తొలగిపోవడం పిరికితనం కాదు. తన సమయం వచ్చినప్పుడు స్వచ్చందంగా తన ప్రాణం పెట్టిన ప్రభువులో పిరికితనం లేశమాత్రమైనా లేదు. ఆ నిర్ణీత సమయానికి ముందు కలిగే ప్రమాదాలనుండి తప్పించుకోకుండా వాటికి ఎదురువెళ్ళడం దుస్సాహసం, అజ్ఞానం, బాధ్యతారాహిత్యం లేదా అలాంటిదేదైనా ఔతుందే తప్ప అది వివేకం, విశ్వాసం, లేదా ఉపయుక్తం ఎంతమాత్రమూ కాదు. మనం కూడా అపాయకరమైన పరిస్థితులను తప్పించుకోకుండా వాటిని సవాలు చేసి ఆహ్వానించడం ప్రభువు అనేక సందర్భాలలో చూపించిన ఆదర్శాన్ని అలక్ష్యపెట్టడమే కాగలదు.

అయితే యేసు గలిలయకు వెళ్ళింది కేవలం ఏదో అపాయాన్ని తప్పించుకోవడానికి మాత్రమే కాదు. తన పరిచర్య ప్రారంభించడానికి తాను ఏర్పరచుకున్న శిష్యులను పిలవడానికి అక్కడికి వెళ్ళాడని తరువాత వచనాలను ఆధారం చేసుకుని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే సరిగ్గా యోహాను బహిరంగ పరిచర్య ముగియగానే తన పరిచర్య ద్వారా యోహాను ఎవరికొరకు మార్గం సిద్ధపరుస్తూ వచ్చాడో ఆ ప్రభువు తన పరిచర్య ప్రారంభించాడని వారి భావం. కానీ తర్వాత వచనాలలో సందర్భం యేసు పరిచర్య ప్రారంభం కాదు. అంతకుముందే ఆయన కానా విందులో అద్భుతం చెయ్యడం ద్వారా తన పరిచర్య ప్రారంభించాడని (యోహాను 2:1-11) అప్పటికే ఆయనతో యోహాను, ఆంద్రెయ, పేతురు, ఫిలిప్పు, నతనియేలు (బర్తొలొమయి) అనేవారు ఉన్నారని చదువుతున్నాము (యోహాను 1:40-45). కాబట్టి తన పరిచర్య ప్రారంభించడానికి కాదు, దానిని ఆటంకం లేకుండా కొనసాగించడానికి అలాగే తాను ఏర్పరచుకున్న శిష్యులను సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించేలా వారి పిలుపును స్థిరపరచడానికి ఆయన ఈ సమయంలో గలిలయకు వెళ్ళాడని గ్రహించగలము.

మత్తయి 4:13‌ నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను.

"నజరేతు విడిచి"

నజరేతు తన తల్లి మరియ మరియు యోసేపు యొక్క స్వస్థలం. ఆయన కూడా దాదాపు తన రెండవ ఏటనుండి అక్కడే నివసిస్తూ (మత్తయి 2:23), అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు (లూకా 2:40). తన 12వ ఏట తర్వాత కూడా అక్కడే నివాసమున్నాడు (లూకా 2:51). అందుకే ఆ ప్రాంత ప్రజలకు ఆయన సుపరిచితుడు (మార్కు 6:3). ఇక్కడే ఆయన సమాజమందిరంలో మొదట ప్రసంగించినప్పుడు అందరూ ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారని, తర్వాత వారు ఆయనపై ఎంతో ఆగ్రహంతో నిండుకుని ఆయనను పట్టణంలోనుండి వెళ్ళగొట్టి, ఆయనను తలక్రిందులుగా పడద్రోయాలని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకూ ఆయనను తీసుకుని పోయారని చదువుతాము (లూకా 4:16-30). ఆయన ఆ ప్రాంతం విడిచి కపెర్నహూమునకు తన నివాసం మార్చడానికి ఇది కూడా మరొక కారణం అని చెప్పుకోవచ్చు (లూకా 4:31).

ఇలా నజరేతు ప్రభువును తిరస్కరించిన మొదటి గ్రామమయ్యింది. వారికి ప్రభువే స్వయంగా ప్రకటించిన సువార్తకు వారు తమను తాము అపాత్రులుగా ఎంచుకున్నారు. క్రీస్తును తిరస్కరించేవారిని ఆయన కూడా విసర్జిస్తాడు. తన పాదదూళిని దులిపేసుకుని ఆ స్థలాన్ని విడిచిపెట్టేస్తాడు. "అయ్యో నజరేతా! నీవునూ ఈ నీ దినమైందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొనిన యెడల నీకెంత మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చెయ్యబడియున్నవి. నీకు ఇవ్వబడిన అవకాశాన్ని చేజార్చుకున్నావు"

"జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను"

దాదాపు 30 సంవత్సరాల వయస్సు వరకూ నజరేతులోనే ఉండి "నజరేయుడు" అని పిలవబడిన యేసు, ఇప్పుడు తన స్థిర నివాసాన్ని కపెర్నహూమునకు మార్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది "తన పట్టణం" అని పేర్కోబడింది (మత్తయి 9:1). ఇక్కడ "తన పట్టణం" అని చెప్పబడింది కపెర్నహూమే అని మార్కులో ఉన్న సమాంతర వాక్యభాగాన్ని చదివి నిర్థారించుకోవచ్చు (మార్కు 2:1). 12 నెలలపాటు ఒక ప్రాంతంలో నివసిస్తే ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి స్థిర నివాసిగా పరిగణించబడే వాడుక యూదులకు ఉండేది. అక్కడినుండే సదరు వ్యక్తి పన్నులు చెల్లించవలసి ఉండేది. అందుకే ప్రభువు కూడా కపెర్నహూము నుండే అర షెకెలు పన్ను చెల్లించాడని చదువుతాము (మత్తయి 17:24).

కపెర్నహూము జెబులూను నఫ్తాలి గోత్రాలకు చెందిన సముద్ర తీరమందు నిర్మించబడిన పట్టణం అని ప్రస్తుత వచనం నుండే గ్రహించగలము. కొత్త నిబంధనలో ఎంతో ప్రాముఖ్యమైన ఈ స్థలం, పాతనిబంధనలో ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు. బహుశా ఇది యూదులు బబులోను చెరనుండి తిరిగివచ్చిన తర్వాత నిర్మించుకున్న పట్టణం అయ్యుండవచ్చు. ఏదిఏమైనా ప్రభువు కాపురం ఉండడానికి రావడంతో ఇదిగో ఆకాశమంత ఎత్తుకు హెచ్చించబడే ఆధిక్యత కపెర్నహూమునకు తరలివచ్చింది (మత్తయి 11:23). "ఓ కపెర్నహూమా! ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరిగియుంటే నీకు ఎంత మేలు!"

మత్తయి 4:14 ​జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు-

ఇవి ప్రభువు కపెర్నహూముకు రావడం వలన ప్రయోజనం పొందిన ప్రాంతాలు. కపెర్నహూము పట్టణం ఉన్న జెబూలూను దేశం (ఆ గోత్రానికి కేటాయించబడిన ప్రాంతం) గెన్నెసెరతు సరస్సు తీరప్రాంతంలో ఉంది. దాని సరిహద్దులు సీదోను చివార్ల వరకూ విస్తరించియున్నాయి (ఆదికాండము 49:13, ద్వితీయోపదేశకాండము 33:18) నఫ్తాలి దాని పొరుగుదేశం (నఫ్తాలి గోత్రానికి కేటాయించబడిన ప్రాంతం) ఈ రెండు దేశాలూ యోర్దానుకు తూర్పుదిక్కున ఉన్నాయి (యెహోషువ 19:34) ఇవి గలిలయ పైభాగంలో ఉన్న ప్రదేశాలు. ఇక్కడ అధికసంఖ్యలో ఐగుప్తీయులు, అరబ్బులు మరియు గ్రీసు దేశస్తులు నివాసముండేవారు కాబట్టి ఇది "అన్యజనులు" నివసించు గలిలయ అని పిలవబడింది. పాతనిబంధనలో‌ "జనములు" లేదా కొత్తనిబంధనలో "అన్యజనులు" అనేమాటను సాధారణంగా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ చెందని ప్రజలను ఉద్దేశించి వాడబడ్డాయి. యేసు వారియొద్దకు రావడం వల్ల ఈ ప్రజలు ఎలా ఆశీర్వదించబడ్డారో ఇక్కడ మత్తయి వివరిస్తున్నాడు.

మత్తయి 4:15 చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను

"చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి"

ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న అన్యజనులకు దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుడే నిజమైన వెలుగు కాబట్టి ఆయనకు దూరస్తులైన వారందరూ చీకట్లోనే ఉన్నారు. అయితే క్రీస్తు వారియొద్దకు రావడంతో వారు గొప్ప వెలుగు చూసారు. ఎందుకంటే ఆయనే లోకానికి వెలుగైయున్నాడు (యోహాను 1:4-8, 3:19, 8:12, 12:46). పాతనిబంధన ప్రవచనాల్లో కూడా మెస్సీయకు "వెలుగు" అనే పేరు ఆపాదించబడింది (దానియేలు 2:22, కీర్తనలు 43:3). ఆధ్యాత్మిక కనుదృష్టికలిగిన వారందరూ ఆయన దేవుని స్వరూపం యొక్క మహిమ అయ్యున్నాడని చూసేవిధంగా ఆయన ప్రకటించిన సువార్తే వారికి దేవుని జ్ఞానవెలుగు అయ్యింది (2 కొరింథీ 4:4-6).

"మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను"

చీకటిలో కూర్చున్న ఆ ప్రజల గురించే, వారు "మరణప్రదేశంలోనూ మరణచ్ఛాయలోనూ" కూర్చున్నవారని వర్ణన చెయ్యబడింది. ఎందుకంటే ఆధ్యాత్మిక వెలుగు లేని వారికి ఆధ్యాత్మిక జీవం కూడా లేదు. దేవుడే జీవానికి అధిపతి, ఆధారం మరియు సమస్త జీవపు ఊట. దేవుడు లేనివారిలో ఆధ్యాత్మిక జీవం లేదు. వారు పాపముల చేతనూ అపరాధముల చేతనూ చచ్చినవారు (ఎఫెసీ 2:1). అయితే స్వయంగా జీవాధిపతి మరియు నిత్యజీవానికి కర్తయైన యేసు వారిని దర్శించి, వారికి బోధించడం కారణంగా భూమిమీద ఉన్న అనేక జనములకు ఎప్పుడూ ఉదయించని తరహాలో వారికి ఆ జీవపు వెలుగు ఉదయించింది. వారిమధ్య ఆయన జీవించాడు. వారి వ్యాధులను పారద్రోలాడు. సత్య నిర్థారణకు కావలసినన్ని అద్భుతాలు వారిమధ్య ప్రదర్శించాడు. వారికి స్వయంగా బోధించాడు. అడగకుండానే ఆరోగ్యాన్నీ కలుగచేయు రెక్కలతో వారికి నీతి సూర్యుడు ఉదయించాడు (మలాకీ 4:2). అందుకే ఈ వెలుగు "గొప్ప వెలుగు" అని పిలవబడుతుంది. మనుష్యులను మరణం నుండి జీవంలోనికి దాటించి, మరణ ప్రదేశాల్లో కూర్చున్నవారిని తేజావాసులుగా మార్చగల సువార్తవెలుగు నిజంగా ఎంతో గొప్పది. అయితే అది వారు వెదకి కనుగొన్న వెలుగు కాదు. "వారికి వెలుగు ఉదయించెను". "అరుణోదయమునకు దాని స్థలము తెలుపు" (యోబు 38:12). వాని ఏర్పాటును అనుసరించి అది వారికి "ఉదయించెను"

ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నేటికీ చీకటిలో మరణఛ్చాయలలోనూ కూర్చుని ఉన్నారు. దేవుడు తన సువార్త వెలుగుతో వారిని సంధించేలా మనం ప్రార్థన, ప్రయత్నం మరియు ప్రయాస మానకూడదు. అయితే సువార్త వెలుగు కలిగియుండి కూడా చీకట్లోనే జీవించాలని తీర్మానించుకున్నవారి పరిస్థితి ఇంకెంత దారుణమో ఆలోచించండి (యోహాను 3:19,20). చీకటి రాత్రి కారణంగా ఐతే సూర్యుడు ఉదయించే సమయం వస్తుందని నిరీక్షించవచ్చు. కానీ చీకటి గుడ్డితనం‌ వల్ల కలిగిందైతే సూర్యుడు ఉదయిస్తే మాత్రమే సరిపోదు. ఆ చీకటిని అధిగమించగలవారు ధన్యులు.

మత్తయి 4:16 అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు‌ ఈలాగు జరిగెను.

ముందు వచనంలో "చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోనూ మరణచ్ఛాయలోనూ కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను" అని చెప్పబడింది ప్రవక్తయైన యెషయా ద్వారా దేవుడు పూర్వమందే పలికించిన ప్రవచనం (యెషయా 9:1,2). ప్రభువు కపెర్నహూముకు వచ్చి అక్కడ నివసించి ఆ చీకటి ప్రదేశంలో ప్రసరింపచేసిన తన సువార్త వెలుగు వలన ఆ ప్రవచనం నెరవేరిందని మత్తయి తెలియచేస్తున్నాడు. "తిగ్లత్పిలేసెరు" ఇశ్రాయేలీయులను చెరపట్టి ఆ దేశాన్ని పాడుచేసినప్పుడు జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతాల్లో ఉన్నవారే ఎక్కువగా అణగద్రొక్కబడ్డారు (2రాజులు 15:29). అలా ఎంతో అవమానానికి అణచివేతకూ గురిచెయ్యబడిన ఈ ప్రాంతాల్లోని ప్రజలు స్వయంగా మెస్సీయ తమమధ్యకు వచ్చి నివసించబడాన్ని బట్టి ఎంతో ఘనతను ఓదార్పును పొందుతారన్నది ఆ ప్రవచనంలో ఉన్న అంతర్భావం. అదే ఇప్పుడు ప్రభువు వారి మధ్య నివసించడాన్ని బట్టి ఈ ప్రవచనం అక్షరాలా నెరవేర్చబడింది.

మత్తయి 4:17 అప్పటినుండి యేసుపరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

"అప్పటినుండి యేసు"

"అప్పటినుండి" అంటే కపెర్నహూముకు వచ్చినప్పటినుండే యేసు పరిచర్య ప్రారంభించాడు అని అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆయన అంతకుముందే నజరేతులో వాక్యం ప్రకటించాడు (లూకా 4:16-31). యోహాను చెరలో వెయ్యబడినప్పటినుండి అని కూడా దీని భావం కాదు. ఎందుకంటే యోహాను చెరలో వెయ్యబడకముందు నుండే యేసు యూదా ప్రాంతంలో బహిరంగంగా పరిచర్య చేసి అనేకులను శిష్యులనుగా చేసుకున్నాడని చదువుతున్నాము (యోహాను 3:22-26, 4:1-3). కానీ మత్తయి ఆ సందర్భాలను దాటవేస్తూ ఆయన కపెర్నహూములో ప్రారంభించిన పరిచర్య గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. అంటే ఆయన అన్యజనులు నివసించు గలిలయకు మకాం మార్చినప్పటినుండి ఆ ప్రజల మధ్య తన పరిచర్య ప్రారంభించాడని దీని‌ భావం.

"పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక‌ మారుమనస్సు పొందుడని చెప్పుచు"

ఈమాటలను ఇప్పటికే వివరించాను (మత్తయి 3:2 వ్యాఖ్యానం చూడండి).

అయితే ప్రభువు ఎక్కడికి వెళ్ళినా ఆ మాటలనే పదే పదే యథాతథంగా చాటింపు వేస్తూ తిరిగాడని ఈ మాటల భావం కాదు. అప్పటినుండి ఆయన ప్రకటించిన సందేశాల సారాంశమేంటో ఇక్కడ మత్తయి తెలియచేస్తున్నాడు. ఆయన సంభాషణలు సమాధానాలు ఉపదేశాలు ఉపమానాలు అన్నీ పరిశీలించి చూసినప్పుడు మారుమనస్సు మరియు పరలోకరాజ్యమే, ఆయన సందేశాల అసలు సారం‌ అని మనం నిర్థారించుకోగలం. కాబట్టి ఆయన సందేశాల భావాన్ని గ్రహించడానికి ఎంతో కీలకమైన తాళపు చెవి మత్తయి మన చేతుల్లో‌ పెడుతున్నాడు. ఆయన బోధల ఉద్దేశాన్ని మొదట తెలియపరచి ఆపై ఆయన సందేశాలను వరుసగా గ్రంథస్థం చెయ్యడం ద్వారా ఆ బోధలను ఈ మాటల వెలుగులో అర్థం చేసుకోవాలని అప్పుడే వాటి తాత్పర్యాన్ని సరిగ్గా గ్రహించగలమని ఈ మాటలు మనకు దిశానిర్థేశం చేస్తున్నాయి.

బాప్తీస్మమిచ్చు యోహాను ప్రకటించిన అదే సందేశాన్ని బోధించడం ద్వారా యోహాను తన సేవకుడే అని, తనకు ముందుగా వచ్చి తన మాటలనే సెలవిచ్చి, తనకు మార్గం సరాళం చేసాడని ప్రభువు ఇక్కడ చెప్పకనే చెబుతున్నాడు. "యోహాను ప్రకటించిందే మళ్ళీ చెప్పడం ఎందుకు, కొత్తవేవైనా చెబితే ఆకర్షనీయంగా ఉంటుంది కదా" అని ఆయన భావించలేదు‌. అయినా యోహాను మాటలను అరువు తెచ్చుకోవడమేంటని కించబడనూ లేదు. యోహాను ప్రకటించిన సందేశంపై తన ఆమోదముద్ర వేస్తూ ఎంతో తగ్గింపుతో తను కూడా అదే సువార్తను ప్రకటించాడు. కావాలంటే ఆయన ఈలోక పండితులను సైతం అబ్బురపరిచేవిధంగా విచిత్రమైన పరలోకపు సంగతులెన్నో బోధించగలిగి ఉండేవాడు. కానీ మనుష్యుల ఆత్మలకు మొదట కావలసింది అవేవీ కావు. మొదట వారిపై నిలచియున్న దేవుని ఉగ్రత తొలగిపోవడానికి అవసరమైన సువార్త వారికి అందించబడాలి. దేవునితో వారు సమాధానపడి ఆయన రాజ్యవారసులు కావాలి. ఆ తరువాతే పరలోకసంబంధమైన యే సంగతులైనా వారికి ఆశీర్వాదకరం ఔతాయి. ప్రజలను వినోదింపచెయ్యడం, మెప్పించడం, ఆకట్టుకోవడం, వెంట త్రిప్పుకోవడం, ఇవేవీ ప్రభువు పరిచర్య ఉద్దేశాలు కావు. వాటికి భిన్నంగా ఆయన వారికి అత్యవసరమైన మారుమనస్సు సందేశంతోనే ప్రారంభించాడు. అదే సందేశాన్ని ప్రకటించమని తన అపోస్తలులను, సంఘాన్ని ఆజ్ఞాపించాడు. ఈ సందేశమే నిజమైన రక్షణ అనుభవానికి నడిపించగలదు. దానిని విస్మరించే లేదా నిర్లక్ష్యపెట్టే పరిచర్యలను, మరియు పరిచారకులను పంపింది ప్రభువు కాదని గుర్తించాలి. నేటి క్రీస్తు లేని క్రైస్తవ్యానికి, శరీరసంబంధులు సంఘంలోనికి చొరబడడానికి, కృత్రిమ భక్తి క్రైస్తవ్యాన్ని పాడు చెయ్యడానికి మారుమనస్సు బోధలేకపోవడం ఒక ముఖ్యకారణమని మర్చిపోవద్దు.

"ప్రకటింప మొదలు పెట్టెను"

ప్రభువు తన గొప్ప పరిచర్యను ప్రారంభించిన తీరు ఇక్కడ గమనించండి. ఆయన "ప్రకటించడం" మొదలుపెట్టాడు. ఇలా సువార్త ప్రకటించే పనిపై గొప్ప ఘనత ఉంచబడింది. సువార్త ప్రకటించడం కంటే ఘనమైన పని వేరొకటి లేదు. ఆత్మల సంపాదనలో దీనికి ఉన్న స్థానం సాటిలేనిది. ఈ పని చేపట్టడానికి స్వయానా దేవునికుమారుడే సిగ్గుపడలేదు. ఈ పని నిమిత్తమే ఆయన తన అపోస్తలులను నియమించాడు. ఈ పని నమ్మకంగా చెయ్యమనే పౌలు తన చివరిశ్వాస వరకూ తిమోతీని హెచ్చరించాడు (2 తిమోతీ 4:1,2). మనుష్యుల రక్షణ మరియు క్షేమాభివృద్ధి కొరకు ఈ మాధ్యమాన్నే దేవుడు ఎక్కువగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు‌. వాక్యప్రకటన గౌరవించబడిన రోజులే సంఘచరిత్రలో శ్రేయష్కరమైన కాలం. అది విస్మరించబడిన రోజులే సంఘం చూసిన చీకటియుగం. వాక్యం నియమించిన అన్ని పవిత్ర సంస్కారాలను మనం గౌరవించాలి, ఆచరించాలి. కానీ అవేవీ వాక్యప్రకటన కంటే ఎక్కువకావని గుర్తుపెట్టుకోవాలి' (J.C. ryle).

మత్తయి 4:18 యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

"యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా"

గలిలయ లేదా తిబిరియా సముద్రతీరం యేసు నివసించిన కపెర్నెహూముకు సమీపంలో ఉంది. ఇదే గెన్నెసెరెతు సరస్సు అని కూడా పిలవబడింది. ఈ తీరంలో ఒకానొకరోజు ప్రభువు నడిచిన సందర్భాన్ని మత్తయి మనకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆయన విరామం కోసమో వ్యాయామం కోసమో నడచిన ఒక సాధారణ సందర్భం కాదు. ఆయన ఏర్పరచుకున్న తన శిష్యులను (యోహాను 15:16) పిలిచి తనకొరకు వారిని ప్రత్యేకించుకోవడానికి నడచిన సందర్భం.

శిష్యులను ఏర్పరచుకోవడానికి ప్రభువు రాజ భవనానికో ఆలయ ఆవరణకో పండితుల సమాజానికో వెళ్ళలేదు. ఏ ప్రవక్తా పుట్టని గలిలయ నుండి (యోహాను 7:52) అన్యజనులు నివసించే గలిలయ నుండి (మత్తయి 4:14) అదోరకం వ్యాస పలికే గలిలయ నుండి (మత్తయి 26:73) అంటే చెప్పుకోదగ్గ ప్రాధన్యతలేవీ లేని గలిలయ నుండి అందులోనూ విద్య లేదా పలుకుబడి కలిగినవారు నివసించే ప్రాంతాలనుండి కాకుండా పామరులు, పేదవారు ఉండే గలిలయ సముద్ర తీరం నుండి ఆయన తనకు శిష్యులను ఏర్పరచుకున్నాడు. పేతురునూ ఆంద్రెయానూ పిలచి వారిని విధేయులను చేసిన శక్తి హేరోదు అన్న కయప లేదా గమాలియేలును కూడా పిలవడానికి చాలింది కాదనేమీ కాదు. కానీ అపోస్తలుడు వివరించిన విధంగా "జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" (1 కొరింథీ 1:28,29).

"పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు"

వీరిద్దరినీ ప్రభువు తనకు శిష్యులుగా ఉండడానికి మొదట పిలిచాడు. వీరిలో మొదటివాడు సీమోను. ప్రభువు అతనికి "రాయి" అనే భావం వచ్చే "కేఫా" (యోహాను 1:42) లేదా "పేతురు" (మత్తయి 16:18) అనే పేరు పెట్టాడు. అందుకే "పేతురు అనబడిన" అని మత్తయి అతనిని పరిచయం చేస్తున్నాడు. సంచలమనస్సు కలిగిన ఇతనిని స్థిరచిత్తుడిగా మార్చిన ప్రభువు కార్యంలో ఈ పేరు సార్థకం చెయ్యబడింది. ఇతని స్వంత సహోదరుడే ఆంద్రెయ. ఈ సముద్ర తీరమందు ప్రభువు వారిని కలుసుకున్ననాటికి వీరు ఆయనకు అపరిచితులు కారు. మొదట బాప్తీస్మమిచ్చు యోహాను ద్వారా ఆంద్రెయాకూ మరియు శిష్యుడైన యోహానుకూ ప్రభువు పరిచయమయ్యాడు. ఆపై ఆంద్రెయా తన సహోదరునిని ప్రభువు యొద్దకు నడిపించాడు (యోహాను 1:40,41). బహుశా శిష్యుడైన యోహాను కూడా అప్పుడే తన సహోదరుడైన యాకోబును ప్రభువుకు పరిచయం చేసియుండవచ్చు. ఆ సమయంలోనే ఫిలిప్పు మరియు నతనియేలు (బర్తలొమయి) కూడా ఆయనకు పరిచయమయ్యారు. అప్పటినుండే వీరందరూ ఆయనకు శిష్యులుగా ఉన్నారు (యోహాను 2:2). అయితే ప్రస్తుత సందర్భంలో మరో అడుగు ముందుకువేసి సమస్తమూ విడిచిపెట్టి తనకొరకు తమను తాము ప్రత్యేకించుకోవాలని వారిని ఆయన పిలవబోతున్నాడు.

"సముద్రములో వలవేయుట చూచెను"

సముద్రంలో వలవేసి రాత్రంతయూ శ్రమపడి విసిగివేసారిన సీమోనును ఆశ్చర్యపరిచే విధంగా అతని వలలను మాత్రమే కాకుండా అతనితో ఉన్నవారి వలలను పడవలను కూడా చేపలతో నింపిన ఒక అద్భుతం చేసి దాని ఆధారంగా అతనిలో గొప్ప మారుమనస్సు మరియు ఒప్పింపు కలిగించి మరీ అతనిని పిలిచినట్టు వేరొక చోట చదువుతున్నాము (లూకా 5:4-11). మత్తయి ఇక్కడ ఆ వివరాలను దాటవేస్తూ కేవలం ప్రభువు వారిని పిలచిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాడు.

"వారు జాలరులు"

దేవుడు తన పని నిమిత్తం మనుష్యులను పిలచిన దాఖలాలని పరిశీలించండి. ఆయన సోమరులనూ బాధ్యతలేని నిర్లక్ష్యులనూ ఎప్పుడూ పిలవలేదు. తమ వృత్తి లేదా వ్యాపార బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న వారినే ఆయన పిలిచాడు. గొర్రెలను కాస్తుండగా మోషేనూ దావీదునూ పిలిచినవిధంగా మేడిపండ్లు కూర్చుకుంటున్నప్పుడు ఆమోసును పిలిచినవిధంగా‌ ఇక్కడ సీమోను మరియు ఆంద్రెయలు సముద్రంలో వలవేస్తున్నప్పుడు వారిని పిలిచాడు. అంటే వారు శ్రమించి, సేవకు అర్హత సంపాదించుకున్నారని కాదు కానీ మరింత బాధ్యతగా చెయ్యవలసిన సేవలో సమర్పణలో పని చెయ్యడానికి దేవుడు వారిని ముందునుండే సిద్ధపరుస్తూ వచ్చాడని నా భావం. సేవకులమని చెప్పుకుంటూ సోమరులుగా కాలం వెల్లదీసేవారిని పిలిచింది బహుశా ఈ దేవుడు అయ్యుండకపోవచ్చు.

మత్తయి 4:19 ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

"ఆయననా వెంబడి రండి"

ఇక్కడ ప్రభువు తనను వెంబడించమని పేతురు మరియు ఆంద్రెయాను పిలుస్తున్నాడు. నిజానికి ఆయనకు శిష్యులుగా ఉండడం అంటే ఆయనను వెంబడించడమే (లూకా 14:27, ప్రకటన 14:4). ఆయన బోధ గైకొని ఆయన మాదిరిని అనుసరించకుండా ఆయనకు శిష్యులుగా ఉండడం సాధ్యం కాదు. అందుకే పేతురు మొదలుకొని ఆయన పిలుపు పొందిన అపోస్తలులందరూ ఆయనతో సన్నిహిత సహవాసాన్ని కలిగియున్నారు (అపో.కా 1:21). ఇది ఆయన వారికి అప్పగించబోయే గొప్ప పనికి షరతుగానూ సిద్ధపాటుగానూ వచ్చిన పిలుపు. క్రీస్తును నేర్చుకోకుండా క్రీస్తును ప్రకటించడం సాధ్యం కాదు. క్రీస్తును వెంబడించకుండా ఇతరులు ఆయనను వెంబడించేలా నడిపించడం సాధ్యం కాదు. నేటికీ ఇదే నియమం వర్తిస్తుంది. క్రీస్తును వెంబడిస్తున్నాడా లేదా అన్నదే ఒక నిజమైన సేవకుని లేదా శిష్యుని గుర్తింపు.

"నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను"

తన ముందున్న పరిస్థితిని ఒక సాదృష్యంగా లేదా దృష్టాంతంగా మలచుకుని తన ఆలోచనలు వ్యక్తపరిచే పద్ధతి ప్రభువు యొక్క సాధారణ బోధనాశైలి. ఇక్కడ కూడా జాలరులతో మాట్లాడుతూ అదే వృత్తికి తాను కూడా వారిని పిలుస్తున్నాడని అయితే చేపలు పట్టే జాలరులకు బదులు దేవుని రాజ్యంలోనికి మనుష్యులను నడిపించే సౌవార్తిక జాలరులుగా వారిని నియమించబోతున్నాడని ఇక్కడ ప్రభువు భావం. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవుని మందను పరిపాలించే కాపరిగా చెయ్యబడిన విధంగా అంటే రాజుగా దేవుని ప్రజలకు కాపరిగా ఉన్న విధంగా ఇప్పుడు ప్రభువు పిలుస్తున్న ఈ జాలరులు కూడా దేవుడు రక్షించదలచిన ఆత్మలను రాబట్టే జాలరులు అయ్యారు. వారిద్వారా దేవుడు లోకంలోనికి దించిన సువార్త వల నేటికీ ఆ పరమజాలరి ఉద్దేశాన్ని ఏర్పాటును అనుసరించిన ఆయన రక్షణ సంకల్పాన్ని నెరవేరుస్తూనే ఉంది.

ఎంతో సమర్పణ, శ్రద్ధ ఓపిక మరియు నేర్పరితనం లేకుండా జాలరి వృత్తికి ఎవరూ న్యాయం చెయ్యలేరు. శ్రమకూర్చి సమయం వెచ్చించి రాత్రింపగళ్ళు వల వెయ్యనిదే పని జరగదు. అలలను అల్లకల్లోలాలనూ తుఫానులనూ చివరికి ప్రాణనష్టాన్ని సైతం ఎదుర్కోవడానికి తెగించని వాడు ఈ వృత్తికి పనికిరాడు. ప్రభువు పిలిచి నియమించిన ఆత్మల జాలరులెవ్వరూ ఈ లక్షణాలలో లోపించరు.

మత్తయి 4:20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

ఇది ప్రభువు పిలిచిన పిలుపు శక్తిని ప్రదర్శించే గొప్ప సన్నివేశం. ప్రభువు పిలిచిన వెంటనే వారు తమ వృత్తినీ ఇంటినీ బంధువులనూ సమస్తాన్నీ విడిచిపెట్టి, ఆయనను వెంబడించడానికి అంటే ఆయన ఎక్కడికి కొనిపోయినా ఆయనతో వెళ్ళడానికి ఎక్కడికి పంపినా పంపబడడానికి ఏం చెప్పినా విధేయులవ్వడానికి తమను తాము సమర్పించుకున్నారు (మత్తయి 19:27). ప్రభువు పిలుపులో తాను సెలవిచ్చింది నెరవేర్చగల శక్తి ఉందని చూపించబడిన అనేక ఆధారాలలో ఇది కూడా ఒకటి. ఆ పిలుపు పొందిన శిష్యులు వెంటనే లోబడడం, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే కేవలం తనను పిలిచిన వానిపై నమ్మకంతో బయలువెళ్ళిన అబ్రాహాము విశ్వాసాన్ని తలపించేదిగా ఉంది. వారి వృత్తిని కానీ ఇంటి బాధ్యతలను కానీ ప్రభువు పిలుస్తున్న పనేంటో వారికి తెలియదని కానీ ఆయనను సేవించడానికి వారు అయోగ్యులని కానీ ఇలాంటి ఏ సాకులూ చెప్పకుండా ఇష్టపూర్వకంగా వారు ఆయన పిలుపుకు లోబడ్డారు.

అయితే ప్రభువు భూమిమీద పరిచర్య చేస్తున్న సమయంలో స్థానికంగా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనను వెంబడించడానికి ఈవిధమైన పిలుపు అవసరమయ్యింది. అలా అని అందరినీ అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడమే సేవకు పిలుపు అని భావించడం సరికాదు. అనేక వాక్యభాగాలు ఈ సత్యాన్ని బోధిస్తున్నాయి (1 కొరింథీ 9:4-6, 12,15, 2 థెస్సలోనిక 3:6-12) అయితే అవసరాన్ని బట్టి ఏ త్యాగానికైనా పూనుకోవడమే నిజమైన శిష్యత్వమని ప్రభువు కొరకు ఎలాంటి శిష్యరికపు మూల్యం చెల్లించవలసి వచ్చినా అది అధికం కాదని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి (మత్తయి 10:37-39). ఈవిధంగా అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయననే ప్రేమించేవారిగా ప్రభువు మనలను మార్చును గాక!

మత్తయి 4:21,22 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

జెబెదయ కుమారులైన యాకోబు మరియు యోహాను కూడా లూకా 5 నుండి నేను ఇదివరకే ప్రస్తావించిన ఆ చేపల అద్భుతం ద్వారానే ఆయనను వెంబడించడానికి ఒప్పింపబడ్డారు (లూకా 5:10-11). అయితే మత్తయి మాత్రం ఆయన పిలుపు రాగానే వారు ఎలా లోబడి వెంబడించారనే విషయాన్ని మాత్రమే గ్రంథస్థం చేసాడు. జెబెదయ గురించి మనకు ఎక్కువ వివరాలు చెప్పబడలేదు. అయితే ప్రభువు పిలుపుమేరకు సమస్తాన్నీ తనను కూడా విడిచి వెళ్ళడానికి సిద్ధపడిన తన కుమారుల విషయంలో అతను ఎక్కడా అభ్యంతరపడినట్టు చెప్పబడలేదు. తన కుమారులే కాదు, తన భార్య కూడా ప్రభువును వెంబడించిన వారిలో ఒకరు అని మనం చదువుతాము. బహుశా ఇతను కూడా ప్రభువు చేసిన అద్భుతాలు చూసి లేదా వాటిగురించి విని ఆయనయందు విశ్వాసముంచిన వ్యక్తి అయ్యుండవచ్చు. మనం ప్రభువును నమ్మి, వెంబడించడమే గొప్ప ధన్యత. అలాంటిది, మన కుటుంబం కూడా ఆయనను నమ్మి ఆయన మార్గంలో వెళ్ళడానికి మనలను ప్రోత్సహిస్తే అది ఇంకెంత ధన్యత!

ప్రభువు తనకు శిష్యులుగా ఉండడానికి ఏర్పరచుకున్నవారి నేపధ్యాన్ని ఒకసారి ఆలోచించండి. పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను, వీరంతా జాలరులు. అంటే వీరు సమాజంలో గొప్ప స్థాయి లేదా గుర్తింపు లేనివారని తెలుస్తుంది. ప్రభువుకు శిష్యులుగా ఉండడం ప్రపంచంలోని ధనికులు లేదా పండితులకు మాత్రమే పరిమితమైన ధన్యత కాదు. పేదరికం లేదా పామరిత్వం ఎవ్వరినీ ఆయనను వెంబడించడానికి అనర్హులుగా చెయ్యదు. తగ్గింపుతో ఆయన మాట విని ఆయనను వెంబడించే ఎవ్వరైనా ఆయన రాజ్యవారసులే. దేవుని కృప పొందని వారికి ధనముంటే ఏంటి జ్ఞానముంటే ఏంటి? క్రీస్తుకు శిష్యులుగా ఉండడమే మనకు నిజమైన విలువనిస్తుంది.

ప్రభువు స్థాపించిన క్రైస్తవవిశ్వాసం పరసంబంధమైనదే తప్ప ఒక మానవకల్పిత మతం కాదు అనడానికి ఇక్కడే బలమైన ఆధారం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ధనికులకూ బలవంతులకూ విద్యా సంపన్నులకూ పెద్దపీట వెయ్యలేదు. ఆయన మార్గాన్ని బోధించడానికి మొదట నియమించబడిన బోధకులు ఎలాంటి పలుకుబడీ పరపతీ లేదా పాండిత్యం లేని సాధారణ మత్స్యకారులు. కాబట్టి మానవ కల్పిత మతమయ్యుంటే అది లోకాన్ని తలక్రిందులు చెయ్యడం సాధ్యపడియుండేది కాదు. ఒకవైపు రోమా సామ్రాటులనూ బలమైన వారి యాజకవ్యవస్థనూ వారి ఆలయాల వైభవాన్ని చూడండి. మరోవైపు కొందరు విద్యలేని మత్స్యకారులు సువార్త ప్రకటించడం చూడండి. ఇంత ఏకపక్ష రణరంగం ఇంకెక్కడైనా చూసిందా ఈ ప్రపంచం? అయినా ఆ యుద్ధ పర్యవసానమేంటి? బలహీనులే విజేతలయ్యారు. బలవంతులు ఓటమి చవిచూసారు. క్రైస్తవ్యాన్ని రూపుమాపాలనుకున్న శక్తులెన్నో, వ్యక్తులెందరో కాలగర్భంలో కలసిపోయారు. ఆ రాజుల పేర్లు ఆ చక్రవర్తులు పరాక్రమమంతా కేవలం చరిత్రగానే మిగిలిపోయింది. కానీ క్రైస్తవ్యం నేటికీ నిలిచేయుంది. ఇప్పటికీ బలంగా విస్తరిస్తూనే ఉంది. ఇది క్రైస్తవ్యం దేవుడు స్థాపించిందేనని నిరూపిస్తుంది. అవిశ్వాసులు ఈ నిదర్శనాన్ని నిరాకరించగలరేమో కానీ దానిని నిర్వీర్యం చెయ్యలనుకోవడం మాత్రం వృధా ప్రయాసే ఔతుంది. గెలిచేపక్షంలో ఉండడమే ఎవరికైనా శ్రేయష్కరం.‌

మత్తయి 4:23 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.

"యేసు వారి సమాజమందిరములలో బోధించుచు"

యేసు గలిలయ ప్రాంతంలో చేసిన పరిచర్య ఇక్కడ క్లుప్తంగా ప్రస్తావించబడింది. తర్వాత అధ్యాయాల్లో ఆయన చేసిన అద్భుతాలు మరియు చెప్పిన బోధల‌ వివరాలు తెలుపబడ్డాయి. అయితే ఆయన వారి సమాజమందిరాలలో బోధించాడు అని ప్రత్యేకంగా చెప్పబడింది. సమాజమందిరం అంటే భక్తిపరులైన యూదులు సమాజంగా కూడుకునే‌ స్థలం. సమాజమందిరాలు యెరుషలేములో ఉండే ఆలయానికి ప్రత్యమ్నాయాలు కావు. కానీ తప్పనిసరిగా ఆలయంలోనే చెయ్యనవసరం లేని ఆరాధన కార్యక్రమాల కొరకు వినియోగించబడే మందిరాలు. ఉదాహరణకు; బలి అర్పణ తప్పనిసరిగా ఆలయంలోనే జరగాలి. అవి ఇంకెక్కడా చెయ్యడం సాధ్యం కాదు (ద్వితీయోపదేశకాండము 12:13,14). కానీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అనేది ఆలయంలోనే చెయ్యవలసిన అవసరం లేదు. అలాంటి కార్యక్రమాల కోసం యూదులు ఉండే అన్ని ప్రాంతాలలోనూ వారు సమాజంగా కూడి ఆరాధించడానికి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, విశ్రాంతిదిన సహవాసాలు జరుపుకోవడానికి, కల్పించుకున్న సౌకర్యమే ఈ సమాజమందిరాలు. బహుశా బబులోను చెరలోనుండి తిరిగివచ్చిన తరువాత ఇవి యూదుల మధ్య ఎక్కువ వినియోగంలోకి వచ్చాయి. అంతమాత్రాన అవి అప్పుడే ప్రారంభమయ్యాయని, కొందరు అంటున్నట్టుగా పాతనిబంధనలో ఎక్కడా ప్రస్తావించబడలేదని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే కీర్తనాకారుడు ఈ సమాజమందిరాలను ఉద్దేశించే దేవుని మందిరాలు (KJV లో synagogue అని ఉంటుంది) అని పేర్కొన్నాడు (కీర్తనలు 74:8). ఇవి నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా నిర్మించబడ్డాయి. మరిముఖ్యంగా ఇవి వివిధ శుద్ధీకరణాచారలకు అనువుగా ఉండేవిధంగా నదులు లేదా నీళ్ళ సౌకర్యాలు ఉన్న చోట నిర్మించబడేవి. ఆరాధన వ్యవహారాలు బాధ్యతలు చూసుకోవడానికి సమర్ధులైన కనీసం పదిమంది యూదులు ఉన్న ఒక స్థలంలో ఒక సమాజమందిరాన్ని నిర్మించేవారని అంతకు తక్కువ సంఖ్య ఉంటే అది వీలుపడేది కాదని, అయితే ఎక్కువ యూదుల జనాబా ఉన్న ప్రాంతాలలో ఎక్కువ మందిరాలు కూడా నిర్మించుకునేవారని యూదుల రచనలను పరిశీలిస్తే అర్థమౌతుంది. ఒక్క యెరుషలేములోనే 480 సమాజమందిరాలు ఉండేవని "ఆడామ్ క్లార్క్" ఈ వచనంపై తన వ్యాఖ్యానంలో ప్రస్తావించారు.

ఇలా యూదులు బహిరంగంగా కూడుకునే సమాజమందిరాలలో యేసు బోధించాడని ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది. ఎందుకంటే ఆయన తన బోధలను బహిరంగంగా వినిపించాడు. పరిసయ్యుల లాగానో (లూకా 20:47), లేదా‌ తర్వాత అపోస్తలులు ఖండించిన కొందరు దుర్బోధకుల లాగానో (2 తిమోతీ 3:7) ఇళ్ళలోకి చొరబడి రహస్యంగా‌ బోధించలేదు (యోహాను 18:20). ప్రభువులాగే సత్యం ప్రకటించేవారికి దాగుడుమూతలూ ముసుగులో‌ గుద్దులాటలూ అవసరం లేదు. ధైర్యంగా బహిరంగంగా సత్యాన్ని ప్రకటించవచ్చు. అప్పటివరకూ ధైర్యం చాలక దాక్కున్న శిష్యులు కూడా ఆయన అనుగ్రహించిన ఆత్మను పొందినప్పుడు శక్తి మరియు ధైర్యం కలిగి తమ ప్రాణాలను కూడా ఖాతరు చెయ్యకుండా సువార్త ప్రకటించారు. అదే ఆత్మలో పాలివారైన అందరూ అలాగే చేయుదురు గాక!

"(దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు"

ఇక్కడ "దేవునిరాజ్యం" అని చెప్పబడింది కొన్ని ఇతర సందర్భాలలో "పరలోక రాజ్యం" అని చెప్పబడిన మాటకు పర్యాయపదమే. ఎందుకంటే "పరలోక రాజ్యము సమీపించుచున్నది" (మత్తయి 4:17) అని ఆయన ప్రకటించిన అదే సందేశాన్ని ఉద్దేశించి ఇక్కడ ఆయన "దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు" అని చెప్పబడింది (మత్తయి 3:2, మత్తయి 4:19 వ్యాఖ్యానాలు చూడండి). తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని చూడలేరనీ (యోహాను 3:3) అందులోకి ప్రవేశించడానికి శాస్త్రులు మరియు పరిసయ్యులకు మించిన నీతి అవసరమనీ (మత్తయి 5:20) అలా ఆయన రాజ్యవారసులు కానివారికి శాశ్వతంగా మిగిలేది ఏడ్పునూ పండ్లు కొరుకుటయూ మాత్రమే అనీ (మత్తయి 8:11,12) ఇలా మనుషులను దేవునితో సమాధానపరచడానికి అవసరమైన‌ దేవునిరాజ్య సంబంధమైన బోధను ఆయన ప్రకటించాడు.

"ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు"

ఆయన ప్రకటించిన బోధ దేవుని సత్యమని నిర్ధారించడానికి ప్రభువు వారిమధ్య స్వస్థతలూ అద్భుతాలూ ఎన్నో చేసాడు (యోహాను 10:37, 14:11). యే వ్యాధీ యే రోగమూ ఆయన శక్తికి మించింది కాదని నిరూపిస్తూ అందరికీ మేలు చేస్తూ సంచరించాడు (అపో. కా 10:38). స్వస్థపరచడంలో ఆయన కనపరచిన కనికర సంపన్నత మనకు సదా ఆదర్శంగా నిలవాలి. ఆయనలా సహజాతీత సామర్థ్యాలు లేకపోయినా మనకున్న సామర్థ్యం‌ కొలదీ అందరికీ మేలు చేసేవారిగా ఉండాలి. ప్రభువు కనపరచిన ఈ ఆదర్శమే నవభారత నిర్మాణంలో మన మిషనరీలకు స్పూర్తిని అందించింది.‌ విద్యా-వైద్య‌ రంగంలో వారికి చేతనైనది వారు చేస్తూ నిర్మాణాత్మకంగా సువార్త పని‌ కొనసాగించడానికి ఈ ఆదర్శమే వారిని పురికొల్పింది. మనం ప్రభువులా చెయ్యలేము కానీ ఆయన చేసింది చెయ్యగలం. ఎంతోకొంత తప్పక చెయ్యగలం. అది చేయనెరిగియుండియూ చెయ్యకపోవడం పాపమని మర్చిపోవద్దు (యాకోబు 4:17).

"గలిలయయందంతట సంచరించెను"

సమదృక్పథ సువార్తలు (మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలు) ఎక్కువశాతం ప్రభువు గలిలయ ప్రాంతంలో చేసిన బోధలూ‌ మరియు అద్భుతాలపై దృష్టి పెట్టగా యోహాను సువార్తలో ఆయన యెరుషలేము మరియు యూదయలో చేసిన పరిచర్య గురించి ఎక్కువ వివరాలు తెలుపబడ్డాయి.

మత్తయి 4:24 ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగముల చేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

ప్రభువు గలిలయలో చేసిన గొప్ప స్వస్థతల వల్ల ఆయన కీర్తి ప్రక్కనే ఉన్న సిరియా దేశంలో ప్రచురమైంది. అక్కడినుండి అనేక రోగాలతో బాధపడుతున్న ఎందరో ఆయన అద్భుత విడుదల కొరకు ఆయన వద్దకు బారులుతేరి వచ్చారు. ఆయన స్వస్థపరచలేని రోగం విడిపించలేని వేదన వదలగొట్టలేని వ్యాధి అంటూ ఏదీ లేదని నిరూపిస్తూ తనవద్దకు వచ్చిన అందరికీ విడుదల అనుగ్రహించాడు. దెయ్యాలను పారద్రోలడం ద్వారా అన్ని ఆధ్యాత్మికత బంధకాలకూ ఆయనే పరిష్కారమనీ చాంద్రరోగులను నయం చెయ్యడం ద్వారా అన్ని మానసిన రోగాలకూ ఆయనే పరిహారమనీ పక్షవాయువు గలవారిని సైతం బాగుచెయ్యడం ద్వారా అన్ని శరీర రుగ్మతలకూ ఆయనే పరమవైధ్యుడనీ నిరూపించుకున్నాడు. ఈ అద్భుతాలన్నీ ఆయన బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా చేసాడు. ఎలాంటి వైద్యవిధానాలు అవలంబించకుండా ఒక్కమాట లేదా స్వర్శ చేత వెనువెంటనే సంపూర్ణంగా అన్ని వ్యాధులనుండీ తనవద్దకు వచ్చిన అందరికీ విడుదల స్వస్థత అనుగ్రహించాడు. బయటకు కనిపించని తలనొప్పి, కడుపులో‌ గడ్ద వంటివి మాత్రమే కాకుండా అందరూ చూసి నిర్థారించుకోగలిగే విధంగా కుష్టి, కుంటి, గుడ్డి, చెవిటి, మూగ ఇలా అన్ని వైకల్యాలకూ తన మాటనే విరుగుడుగా సెలవియ్యడం మాత్రమే కాకుండా మృతులను సైతం లేపాడు. ఒక డేరాకో ఆశ్రమానికో పరిమితమై టక్కుటమారాలు చేసే బాబాలలా కాకుండా వీధివీధి తిరుగుతూ తనకు తారసపడిన అందరినీ అన్ని రుగ్మతలనుండీ విడిపించాడు.‌ ఈనాడు తాము ప్రభువుకంటే గొప్ప కార్యాలు చెయ్యగలమంటూ స్వస్థత దుకాణాలు పెట్టుకునేవారిలో ఇలా చెయ్యగలిగే వారిని ఒక్కర్ని చూపించండి. ప్రభువు చేసినవి నిజమైన అద్భుతాలు.

దేవునికి మాత్రమే సాధ్యమైన ఈ క్రియలు చేసినవాడు మన పాపాలను క్షమించే అధికారం తనకుందనీ నిత్యజీవం అనుగ్రహించి రక్షించే సామర్థ్యం ఉందనీ తనవద్దకు వచ్చేవారందర్నీ చేర్చుకునే కనికరం తనకుందనీ వచ్చినవారు ఎలాంటివారైనా వారిని కాదనే మనసు ఆయనది కాదనీ సెలవిస్తూ రమ్మని పిలుస్తుండగా ఆ పిలుపును నిరాకరించే అవిశ్వాసానికి మనం మాత్రమే బాధ్యులమౌతామని గమనించండి. ఆయన క్షమించలేని పాపం లేదు. బాగు చెయ్యలేని గాయం లేదు. మార్చలేని జీవితం లేదు. ఇది మనం విశ్వసించే నిమిత్తమే ఆయన చేసిన అద్భుతాలూ స్వస్థతలూ గ్రంథస్థం చెయ్యబడ్డాయి (యోహాను 20:30,31, మత్తయి 9:5,6).

మత్తయి 4:25‌ గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.

ఇశ్రాయేలు దేశమంతా ముడు భాగాలుగా విభాగించబడ్డాయి- యూదయ గలిలయ మరియు యోర్దాను అవతల ఉన్న ప్రాంతం. అంటే ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా ఉన్న యెరుషలేము మొదలుకుని యోర్దాను అవతలవరకూ లేదా ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు దేశమంతటా ఉన్న ప్రజలు ఆయనను‌ వెంబడించారు. అంతేకాకుండా సిరియా మరియు దెకపొలి ప్రాంతాలలో ఉన్నవారు అంటే ఇశ్రాయేలు సమీపంలో ఉన్న‌ ఇతర దేశాలలో ఉన్న ప్రజలు కూడా ఆయనను‌ వెతుక్కుంటూ వచ్చారు. దెకపొలి అంటే పది పట్టణాలు అని‌ అర్థం (దెక అంటే పది). రోమా చరిత్రకారుడైన "ప్లీనీ (Pliny)" ప్రకారం ఆ పది పట్టణాల పేర్లు: Damascus, Opoton, Philadelphia, Raphana, Scythopolis, Gadara, Hippondion, Pella, Galasa, Canatha. ఇలా అనేక ప్రాంతాలనుండి ప్రజలు ప్రభువును‌ వెంబడించడం ప్రారంభించారు. వారిలో అనేకులు ఆయననుండి శాశ్వత మేలు పొందుకున్నారు. ఆయన వద్దకు వెళ్ళడానికి‌ మనం తడవు చెయ్యకుందుము గాక!

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.