I. లూకా సువార్త పరిచయము (1:1-4)
II.యోహాను పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:5-25)
III. యేసు పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:26-38)
IV. మరియ ఎలీసబెతును దర్శించుట (1: 39-45)
V. మరియ పాడిన పాట ( 1: 46 – 56)
VI. యోహాను పుట్టుకను గురించిన వృత్తాంతము ( 1: 57 – 66)
VII. జెకర్యా పాడిన పాట ( 1: 67 – 80)
I. లూకా సువార్త పరిచయము (1:1-4)
1. ఘనతవహించిన థెయొఫిలా,
2. ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు.
3. గనుక నీకు ఉపదేశింపబడిన ;సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
4. వాటినిగూర్చివరుసగా రచించుట యుక్తమని యెంచితిని."
పాత కొత్త నిబంధనలంతటికీ కేంద్రము - యేసు క్రీస్తు.
పాత నిబంధనలో యేసు గురించి ప్రవచించారు. కొత్త నిబంధన పత్రికలలో పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పుని, రక్షణ ప్రణాళికను మరి తేటగా, స్పష్టంగా తెలియజేశారు. ప్రకటన గ్రంథములో- ఆయన మహిమతో తిరిగి రానైయున్నసంగతులను తెలియజేశారు. కానీ పాత నిబంధనకీ, కొత్త నిబంధన పత్రికలకీ మధ్యనున్న 4 సువార్త గ్రంథాలు మాత్రం యేసు క్రీస్తు యొక్క జీవితము & పరిచర్య మీద దృష్టి సారిస్తాయి.
లూకా తాను తెరవెనుక ఉండి, క్రీస్తు యొక్క మహిమ మాత్రమే ప్రజలు చూడాలని కోరుకున్నాడు అందుకే కేవలం మూడుసార్లు మాత్రమే అతని పేరు బైబిల్ లో ప్రస్తావించబడింది. తను రచించిన గ్రంథాల్లో అయితే ఒక్కసారి కూడా లేదు.
"వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు" -
అనేకులు రాసినట్లు లూకా కూడా యేసు క్రీస్తు జీవిత చరిత్ర రాసెయ్యాలని అనుకున్నాడా? అనేకులు వివరంగా రాసినప్పటికీ మళ్ళీ రాయడంలో లూకా ఉద్దేశం ఏంటి? కొన్ని ప్రశ్నల రూపంలో లూకా యొక్క ఉద్దేశ్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాము.
1. లూకా అసలు ఏం రాయాలనుకున్నాడు?
"మనమధ్య నెరవేరిన కార్యములను గూర్చి".
"నెరవేరిన" అనే పదానికి అర్థం - "దేవుని విమోచన ప్రణాళిక" నెరవేర్పును సూచిస్తోంది. అంటే దేవుని విమోచన ప్రణాళిక యేసు క్రీస్తు రూపంలో ఎలా నెరవేరిందో, ఆ కార్యముల గురించి రాయాలనుకున్నాడు.
అయితే అప్పటికే ఉన్న రచనలలో వీటి గురించి ప్రస్తావించలేదనో లేక వాటిలో తప్పులు ఉంటే వాటిని ఖండించాలనో లూకా ఈ గ్రంథాన్ని రచించలేదు. అతనికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశ్యాన్ని కింది వచనాలు సాయంతో మరింత లోతుగా గ్రహించగలం. ఆ స్పష్టమైన ఉద్దేశ్యం నెరవేరడం కొరకే దేవుడు లూకాను ప్రేరేపించాడు, లూకా ఈ గ్రంథాన్ని రాయడానికి పూనుకున్నాడు.
అనేకులు రాసిన రచనలు ఉన్నాయని లూకానే చెబుతున్నాడు, కానీ అవేంటో చెప్పలేదు. బహుశా మత్తయి, మార్కు కూడా ఆ జాబితాలో ఉండి ఉండొచ్చు. 'ఉండి ఉండొచ్చు' అని ఎందుకు అంటున్నాము అంటే ఆ రెండు గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయో మనకు తెలియదు.
2. ఎక్కడి నుంచీ వచ్చిన సమాచారం?
"ఆరంభం నుండి చూచి, వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము" - ఈ వాక్యసేవకులు యేసు యొక్క పరిచర్యను కళ్లారా చూసారు. కళ్లారా చూసినవాటిని, చెవులారా విన్న సువార్తను నమ్మకంగా ప్రకటించారు. ఆ సత్యము నలుగురు రచయితల ద్వారా గ్రంథస్థం చెయ్యబడే వరకూ దేవుడు దానిని వాక్యసేవకులైనవారి ద్వారా భద్రపరిచాడు.
ఈ కన్నులారా చూచినవారు చెప్పిన వాటి ఆధారంగానే లూకా ఈ సువార్తను రచించాడు.
మార్కు లాగానే లూకా కూడా నేరుగా / కన్నులారా వాటన్నిటినీ చూడలేదు కానీ వారు అపొస్తలులతో పాటు ప్రయాణిస్తూ పరిచర్య చేశారు కాబట్టి ఆ అపొస్తలుల దగ్గరి నుంచే లూకా గానీ, మార్కు గానీ తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవడం సాధ్యపడింది.
3. ఎందుకు రాయాలనుకున్నాడు?
"వాటన్నింటిని తరచి పరిష్కారంగా తెలిసికొనియున్న నేను" అంటే యేసు క్రీస్తుని, ఆయన చేసిన అద్భుత కార్యాలను కళ్ళారా చూసి, ఆయన బోధను చెవులారా విన్న ప్రత్యక్షసాక్షులు చెప్పిన సమాచారం (ప్రశస్తమైన సత్యం) తన దగ్గర ఉంది కాబట్టి, "వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచాడు" లూకా.
అంటే తన పాఠకులు ఒక వరుస క్రమములో స్పష్టముగా సత్యాన్ని అర్థం చేసుకోవాలని అనుకున్నాడు లూకా. అంత మాత్రమే కాదు తన పాఠకులకు "ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని వారు తెలిసికోవాలని" అతని కోరిక.
4. ఎవరికి రాసాడు?
"ఘనతవహించిన థెయొఫిలా" - ఇతని గురించి పెద్దగా వివరాలేమీ తెలియజేయబడలేదు.
"ఘనతవహించిన" అనే ఇదే పదాన్ని లూకా అపో. కార్య. 23:26; 24:3; 26:25 లో ఫేలిక్సు, ఫేస్తూ గవర్నర్ల గురించి వాడాడు.
అంటే థెయొఫిలా కూడా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినవాడు అయ్యుండొచ్చు.
5. ఎందుకు లూకా ఈ సువార్తని బాప్తిస్మమిచ్చు యోహాను గురించిన కథ చెప్తూ ప్రారంభించాడు?
1) అలా చేయడం ద్వారా, లూకా పాత, కొత్త నిబంధలు వేరు వేరు కాదు, కొత్తది పాతదాని యొక్క కొనసాగింపే అని చెప్తున్నాడు.
2) బాప్తిస్మమిచ్చు యోహాను - పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. ఆ ప్రవచనాలు సరిగ్గా నెరవేరతున్నాయని తెలియజేస్తూనే, వాటికీ కొత్త నిబంధనకీ ఉన్న సంబంధం ఏంటో తెలియజేస్తున్నాడు.
3) 400 సంవత్సరాల పాటు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ 400 సంవత్సరాల తరువాత, మొట్టమొదటిసారి అద్భుతరీతిన గబ్రియేలు దూత ప్రత్యక్షమై బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడడం జరిగింది.
జెకర్యా ఎలీసబెతులకు పిల్లల్ని కనే వయస్సు దాటిపోయిన తరువాత యోహాను జన్మించడం - ఒక అద్భుతం. ఇంతకంటే గొప్ప అద్భుతం "కన్యకకు యేసు క్రీస్తు జన్మించడం" - దానికి 'యోహాను పుట్టుక' ముంగుర్తుగా ఉంది.
4) బాప్తిస్మమిచ్చు యోహానే మెస్సీయాకి ముందుగా నడిచేవాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. యోహాను మెస్సీయాకు ముందుగా నడిచేవాడు అనేది సత్యం కాబట్టి ఆ తరువాతి కాలంలో యేసే మెస్సీయా అని యోహాను ఇచ్చిన సాక్ష్యం కూడా సత్యమేనని ఈ కథ ధృవీకరిస్తుంది.
5) వారిద్దరి జనన వృత్తాంతాలనూ, వాటిని లూకా వివరించిన విధానాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో కొన్ని పోలికలున్నాయని గ్రహించగలం. అవేంటంటే -
మొదటిది - వారి పుట్టుక గురించి గబ్రియేలు దూత ప్రకటిస్తాడు.
రెండవది - ఇద్దరి పుట్టుక అద్భుతరీతిన సంభవిస్తుంది - ఒకరు వృద్ధదంపతులకు పుడితే, మరొకరు కన్యకకు పుడతారు.
మూడవది - ఇద్దరికీ సున్నతి చేయబడుతుంది.
నాలుగవది - వారు పుట్టిన తరువాత వారి గురించి ప్రవచనాలు చెప్పబడతాయి.

మొదటి నాలుగు వచనాల్లో - పరిచయపు మాటలు చదువుతాం.
5-25 వచనాల్లో జెకర్యా ఎలీసబెతుల వృత్తాంతము, దూత బాప్తీస్మమిచ్చు యోహాను గురించి ప్రవచించడము & దాని నెరవేర్పు గురించి చూస్తాము.
"5. యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.”
"యూదయదేశపు రాజైన హేరోదు దినములలో" -
హేరోదు గురించిన ప్రస్తావన రెండుసార్లు మాత్రమే ఉంది. ఒకటి ఇక్కడ, రెండవది మత్తయి 2:1-22 లో. అయినప్పటికీ, యేసు క్రీస్తు పుట్టుక గురించిన విషయాలలో హేరోదు కీలకమైన పాత్ర పోషించాడు. అతని గురించి ఎక్కువగా మత్తయి సువార్తలోనే చదువుతాం. (హేరోదు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మత్తయి సువార్త 2 వ అధ్యాయం యొక్క వ్యాఖ్యానాన్ని చూడండి.)
చారిత్రక వివరాల తరువాత జెకర్యా యొక్క వ్యక్తిగత వివరాలను తెలియజేస్తున్నాడు లూకా.
"అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను."
జెకర్యా ఒక యాజకుడు.
1 దిన 24:4-19 లో దావీదు, సాదోకు, అహీమెలెకు కలిసి యాజకధర్మం చేసేవారినందరినీ 24 గుంపులుగా విభజించారు. అందులో ఎనిమిదవది - అబీయా.
బబులోను చెర తరువాత - 4 గుంపులవారే యూదాకి తిరిగి వచ్చారు.
అయితే 24 అనే సంప్రదాయం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది కాబట్టి అప్పటి యూదులు చెర నుండి తిరిగివచ్చిన ఆ 4 గుంపులవారినే మళ్ళీ 24 గుంపులుగా విభజించారు. తిరిగివచ్చిన నాలుగు గుంపులలో "అబీయా" గుంపు లేనప్పటికీ ఆ నాలుగునే 24 గుంపులు చేసి వారికి మళ్ళీ పాత పేర్లే పెట్టడం వల్ల జెకర్యా అబీయా గుంపుకి చెందినవాడయ్యాడు.
"అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు." జెకర్యా భార్య గురించి ఈ వివరాలు మాత్రమే తెలియజేశాడు లూకా.
“6. వీరిద్దరు ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.”
"వీరిద్దరు.......దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి."
యూదులు దేవుణ్ణి యథార్ధంగా ఆరాధించడం మానేశారు. వేషధారులుగా జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని దృష్టికి జెకర్యా ఎలీసబెతులు నీతిమంతులుగా జీవించారు.
ఆది 15:6 లో అబ్రాహాము ఎలాగైతే నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అలాగే వీరు కూడా నీతిమంతులయ్యారు.
కేవలం నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాదు, వారు పరిశుద్ధపరచబడుతూ వచ్చారు.
"ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొన్నారు" అని వారి గురించి తెలియజేయబడింది.
నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధపరచబడటం - ఈ రెండూ విడదీయరానివి. ఒకదానికి వేరుగా మరొకటి ఉండనేరదు. నీతిమంతునిగా తీర్చబడిన ప్రతి వ్యక్తి తప్పక పరిశుద్ధపరచబడే ప్రక్రియలో కొనసాగుతాడు. అనుదిన జీవితంలో పరిశుద్ధపరచబడే అనుభవం లేనివాడు అసలు నీతిమంతునిగా తీర్చబడలేదు. కాబట్టి ఉంటే రెండూ ఉంటాయి, లేకపోతే రెండూ ఉండవు. ఒకటి జరిగి మరొకటి జరగకుండా ఉండటం సాధ్యపడదు అని బైబిల్ బోధిస్తుంది.
"నిరపరాధులుగా నడుచుకొన్నారు"
అంటే వారి గురించి చెడుగా చెప్పడానికేమీ లేదని అర్థం. వారు అసలు అటువంటి అవకాశమే ఎవరికీ ఇవ్వలేదేమో. క్రైస్తవులం అని చెప్పుకునే మనం కూడా వీరికి లాగా సవాలుకరమైన జీవితాలను జీవించబద్ధులమైయున్నాము.
- ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)"
నీతిమంతులైనప్పటికీ ఎలీసబెతు గొడ్రాలైనందున ఆ వృద్ధ దంపతులకు పిల్లలు లేకపోయెను.
యూదుల సమాజంలో - "పిల్లలు లేకపోవడం" అనేది ఎంతో వేదనతో కూడిన పరిస్థితి.
ఉదా: యూదులలో గొడ్రాలైనటువంటి స్త్రీ ఎంత వేదనకు గురి అవుతుందో రాహేలు హన్నాల గురించి చదివితే అర్థం అవుతుంది.
రాహేలు - ఆది 30:1-2, 23 ; హన్నా - 1 సమూ 1:4-11 .
పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని కీర్తన 113:9; 127:3; ఆది 33:5 చెప్తున్నాయి.
కాబట్టి పిల్లలు కలగకపోతే, తల్లిదండ్రుల పాపమే అందుకు కారణం అనుకునేవారు.
కానీ ఈ అభిప్రాయం తప్పు. పిల్లల్ని కన్నవారు అందరూ పరిశుద్ధులూ కాదు, పిల్లల్ని కనలేనివారందరూ పాపాత్ములూ కాదు. దేవుడు మనకు ఇహసంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో పాపం కూడా ఒక కారణం. అంతేగానీ ప్రతీసారి పాపమే కారణం అయ్యుండదని గమనించాలి. ఉదాహరణకు, ఇందాక మనం చూసిన హన్నా విషయంలో హన్నా పాపం చేసినట్లు, దానిని ఆమె ఒప్పుకొని విడిచిపెట్టిన కారణాన్ని బట్టే దేవుడు ఆమెకు సమూయేలును దయచేసినట్లు చెప్పబడలేదు. హన్నా దేవుణ్ణి ప్రార్థిస్తూ, తనకు పిల్లల్ని అనుగ్రహించమని మొరపెడుతూ దేవుని సమయం కోసం కనిపెట్టింది. దేవుడు తన సమయంలో ఆమెకు బిడ్డల్ని అనుగ్రహించాడు. అలాగే చాలా మంది ఎంత ప్రార్ధించినా, ఎంత నీతియుక్తమైన జీవితాలు జీవించినా పిల్లల్ని పొందుకోలేదు. అంటే దేవుడు వారికి బిడ్డల్ని ఇవ్వాలనుకోలేదు అని గ్రహించాలి. కాబట్టి చాలాసార్లు మన క్రియలతో నిమిత్తం లేకుండా కూడా దేవుడు తన రహస్య చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయన మనతో ఇలా వ్యవహరిస్తుంటాడని గ్రహించాలి.
నిరాశతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ జెకర్యా ఎలీసబెతులు వృద్ధాప్యం వరకూ నీతిమంతులుగా కొనసాగారు.
సవాలుకరమైన పరిస్థితులలో సైతం సాతాను గురించి దేవునికి ఫిర్యాదు చెయ్యడం, పరిస్థితులను బట్టి సణగడం వంటివి చెయ్యకుండా, తమ పరిస్థితులన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయని విశ్వసించారు - జెకర్యా ఎలీసబెతులు. ఈ విషయంలో వారు మనకు మాదిరిగానున్నారు.
దేవుడు తన సమయంలో తన కృప చొప్పున జెకర్యా ఎలీసబెతులకు కుమారుణ్ణి దయచేసాడు.
అంత మాత్రమే కాదు, దేవుడు వారికి అనుగ్రహించింది సాధారణ కుమారుణ్ణి కాదు. అతని గురించి వాక్యంలో ఎం చెప్పబడింది అంటే 'అతను మెస్సీయాకి ముందు నడిచేవాడు'.
నీతిమంతులను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, ఎలా, ఎప్పుడు అనేది ఆయన ఇష్టం. అయితే నీ బాధ్యతేంటి?
‘ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను........ నడుచుకోవడం’.
"8. జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా"
యెరూషలేము ఆలయంలోకి ప్రవేశించి యాజకధర్మం జరిగించడానికి (ధూపం వెయ్యడానికి) ఒక యాజకుడికి ఉండే రెండే రెండు అవకాశాలలో ఇదొకటి. ఒక యాజకుడుకి జీవితం మొత్తంలో రెండు సార్లే ఈ అవకాశం వచ్చేది ఎందుకంటే చాలా మంది యాజకులు ఉండేవారు, వారందరూ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. వారందరికీ అవకాశం ఇవ్వడం కోసం ఇటువంటి పద్ధతిని అవలంభించేవారు.
సంవత్సరానికి రెండు సార్లు వారమేసి రోజులు, ఒక్కో తరగతికి చెందినవారు ఆలయములో యాజక ధర్మం చేసేవారు.
"9. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను."
ఆలయంలో ధూపం వెయ్యడం అనేది అనునిత్యం జరుగుతూ ఉండేది. ఒక్కో తరగతికీ ఉండే వారం వారాల వ్యవధిలో ప్రతి యాజకుడికీ ధూపం వేసే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే యాజకులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అయితే ఏ రోజు ఎవరు ఆలయంలోకి వెళ్లి ధూపం వేస్తారు అన్నది ఎలా నిర్ణయించబడేది? ఈ విషయాన్ని గురించిన వివరాలేవీ ఇక్కడ తెలియజేయబడలేదు. చీట్లు వేసి వంతులను నిర్ణయించేవారని బైబిల్ పండితుల అభిప్రాయపడతారు.
ఒకరోజు ఆ అవకాశం జెకర్యాకి వచ్చింది . అటువంటి అవకాశం రావడం ఒక యాజకుడు 'గొప్ప ధన్యతగా' భావిస్తాడు. చాలామంది యాజకులకు వారి జీవితకాలమంతటిలో అటువంటి అవకాశం అసలు లభించకుండానే చనిపోతుండేవారు.
యాజకులు ఈ ధూపం వేసే పని ప్రతినిత్యం చేస్తూ ఉండేవారు. అయితే ఇదంతా ఎక్కడ చేసేవారంటే - పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తూ తెర ఉండేది, ఆ తెర ఎదుట ధూప వేదిక ఉండేది, అక్కడ చేసేవారు.
"10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా"
ఒక యాజకుడు ప్రతి రోజు ఉదయము, సాయంత్రము ధూపం వేసేవాడు. మిగతా యాజకులు, ప్రజలు ప్రార్థన చేస్తూ బయట నిలబడేవారు.
యాజకుడు సాధ్యమైనంత త్వరగా తన పనులన్నీ ముగించుకొని బయటకు వచ్చేసేవాడు ఎందుకంటే అతను అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉన్నందున భయపడేవాడు - ఏదైనా పొరపాటు చేసి దేవుని ఉగ్రతకు గురై చనిపోతామేమోనని.
ప్రాయశ్చిత్త బలిని అర్పించడానికి, సంవత్సరానికి ఒక రోజు, ప్రధానయాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు.
అయితే ఈ సందర్భంలో జెకర్యా ప్రధానయాజకుడు కాదు, ఇది ప్రాయశ్చిత్తార్థదినము కాదు. సాధారణంగా అనునిత్యం జరిగే కార్యక్రమం. యాజకులు చేసే పని.
పైకి లేగుస్తూ ఉండే ధూపము - ప్రజల యొక్క ఒప్పుకోలు ప్రార్థనలకూ, పశ్చాత్తాపడుతూ చేసే ప్రార్థనలకూ, కృతజ్ఞతార్పణలకూ సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు ప్రజలు దేవునిపై ఆధారపడుతున్నారు అనడానికీ, ఆయనకు లోబడుతున్నారు అనడానికీ, ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి నడుచుకుంటున్నారు అనడానికీ పైకి లేచే ధూపం గుర్తుగా ఉంది.
దూత మాట్లాడ్డం ప్రారంభించినప్పుడు, 400 సంవత్సరాల నిశ్శబ్దం ఛేదించబడింది. నిశ్శబ్దం ఎందుకంటే దేవుడు ఆ 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ద్వారానూ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదు. మలాకీ ఎక్కడ వదిలేసాడో, లూకా అక్కడి నుండి కొనసాగిస్తున్నాడు అనమాట.
"11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా”
ఒక దూత ప్రత్యక్షమవ్వడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఎందుకంటే అంతకముందు చివరిసారిగా దూత ప్రత్యక్షమయింది పాత నిబంధనలో జెకర్యా ప్రవక్తకు. దాదాపు 500 సంవత్సరాల క్రితం. ఆ జెకర్యాకు దూత దర్శనాలలో కనబడితే (జెకర్యా 1:9; 2:3; 4:1) ఈ జెకర్యాకు నేరుగా ప్రత్యక్షమయ్యాడు. "దూత ధూపవేదిక కుడివైపున నిలిచి" అన్న మాటల నుండి ఈ పై సంగతులు అర్థం చేసుకోవచ్చు. అది కేవలం జెకర్యా ఊహ అనడానికి వీలు లేదు.
వ. 12,13 లో జెకర్యా ఎలా స్పందించాడో చూస్తాము –
“12. జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడినవాడాయెను.”
"తొందరపడి" అన్న మాటని ఇలా కూడా తర్జుమా చెయ్యొచ్చు - "వణికిపోయాడు", "చాలా ఎక్కువగా భయపడ్డాడు" (terrified).
సాధారణంగా పరిశుద్ధ దూతలు ప్రత్యక్షమైనప్పుడు, ప్రజలకు వారి పాపములను జ్ఞాపకం చేయడమూ, దేవుని తీర్పు వారి మీదికి రాబోతోందని హెచ్చరించడమూ లాంటివి జరిగేవి.
తన విషయంలో కూడా అటువంటిదేదైనా జరుగుతుందేమోనని జెకర్యా భయపడుతున్నాడు. అలా జెకర్యా భయపడడాన్ని గమనించిన దూత, ముందు ఆదరణకరమైన మాటలు పలికాడు –
“13. అప్పుడా దూత అతనితో - జెకర్యా, భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.”
"జెకర్యా భయపడకుము" - ఇలా ఎందుకు అంటున్నాడు అంటే దూత తీసుకొచ్చింది తీర్పుకు/ శిక్షకు సంబంధించిన వర్తమానం కాదు గానీ ఆశీర్వాదానికి సంబంధించిన వర్తమానం.
"భయపడకుము" అన్న మాట వేరు వేరు సందర్భాలలో అబ్రాహాము, హాగరు, దానియేలులతో కూడా చెప్పబడింది. ఆ మాటకు అర్థం -
మొదటిది, భయపడొద్దు,
రెండవది, దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు, ఒక అద్భుతం జరగబోతోందని సూచిస్తోంది.
ఈ సందర్భంలో ఆ అద్భుతం ఏంటంటే వృద్ధ దంపతులైనవారు కుమారుణ్ణి కనడం – “నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును”.
"నీ ప్రార్థన వినబడినది" - జెకర్యా ఎలీసబెతులు సంతానం గురించి ఎన్నో ఏళ్ల నుండి ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు. దూత ప్రత్యక్షమైననాటికి వారు వృద్ధులయ్యున్నారు గనుక మానవ కోణంలో నుంచి ఆలోచిస్తే ఆశలన్నీ వదులుకొని ఉంటారు. కానీ దేవుడు తన దైవికమైన ఉద్దేశాలకు అనుగుణంగా ఈ సమయంలో వారి ప్రార్థనకు ఈ విధంగా జవాబిచ్చాడు.
కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా జవాబిస్తాడు. అంతమాత్రాన మన ప్రార్థన వినలేదని కాదు. ఆలస్యం అవుతోందని మనం అనుకుంటాము. సరియైన సమయంలో సరియైన దానిని ఇవ్వక మానడు ఆయన. ఆ ఆలస్యం మన విశ్వాససహితమైన ప్రార్థనను నిరుత్సాహపరచనివ్వొద్దు.
మరికొన్ని సందర్భాలలో దేవుడు మనకు కావాల్సినవి ఎప్పటికీ అనుగ్రహించకపోవచ్చు. అప్పుడు కూడా ఆయన మన ప్రార్థన వినలేదు అనలేము. ఎందుకంటే ఆయన మన ప్రతి ప్రార్థన వింటాడు అని బైబిల్ బోధిస్తుంది. ఆయన ప్రతి ప్రార్థన వింటాడు కానీ మనకు మేలైనది మాత్రమే మనకు దయచేస్తాడు. ఒకవేళ మనం దేని గురించైతే ప్రార్దించామో, అది ఆయన రహస్య చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆయన దానిని మనకు అనుగ్రహించడు. అది కూడా మన మేలు కొరకే అనిగ్రహించాలి.
"యోహాను అను పేరు పెట్టుదువు” - యోహాను(గ్రీకు.) అంటే "దేవుడు కృపగలవాడు"
మెస్సీయాకు ముందుగా నడిచేవానికి ఆ పేరు పెట్టాలనుకోవడంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు?
బహుశా తన కుమారుడైన యేసు క్రీస్తుని మనకు బహుమానంగా అనుగ్రహించడం ద్వారా దేవుడు మనపై తన కృపను కుమ్మరించబోతున్నాడన్న విషయాన్ని ఈ పేరు సూచిస్తూ ఉండవచ్చు. (యోహాను 1:14).
"14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,”
"అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై"
ప్రభువు ఘనంగా/ గొప్పగా ఎంచేవి, ఈ లోకం ఘనహీనమైనవాటిగా చూస్తుంది. ప్రభువుకు హేయమైనవాటిని ఈ లోకం ఘనమైనవాటిగా ఎంచుతుంది.
ఇక్కడ యోహాను గొప్పతనము తనకు కలగబోయే సిరిసంపదలను బట్టో, జ్ఞానాన్ని బట్టో కాదు గానీ దేవుడు అతన్ని పిలిచిన పిలుపును బట్టి, అతని పట్ల దేవుడు చూపిన కృపను బట్టి మాత్రమే.
బాప్తీస్మమిచ్చు యోహాను గొప్పతనాన్ని గురించి యేసు ప్రభువు ఇచ్చిన సాక్ష్యం చూడండి - మత్తయి 11:11 -
‘11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.’
పాత నిబంధన భక్తులందరికంటే యోహాను గొప్పవాడు అని ఈ వచనాన్ని బట్టి గ్రహించవచ్చు.
అబ్రాహాము, దావీదు, నోవాహు, హానోకు వంటి ప్రవక్తలందరికంటే కూడా యోహాను గొప్పవాడు.
"ప్రభువు దృష్టికి" - ఈ మాట దేవుని ఏర్పాటు/ఎన్నిక గురించి తెలియజేస్తోంది. యోహాను ఇంకా పుట్టక మునుపే అతను ఏర్పాటు చేయబడడం గురించి దూత ద్వారా దేవుడు సెలవిస్తున్న ఈ మాటలు, దేవుడు అతన్ని ఎనుకున్నాడు అన్న సత్యాన్ని ధ్రువీకరిస్తున్నాయి.యోహాను 15:16
యిర్మీయా 1:4-5 - యిర్మియా; గలతీ 1:15-16 - పౌలు -
యిర్మియా గురించి, పౌలు గురించి తెలియజేసే ఈ లేఖన భాగాలను పరిశీలించినప్పుడు కూడా దేవుడు ముందుగానే ఎన్నుకుంటాడు అన్న సత్యాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు.
"ద్రాక్షారసమైనను, మద్యమైనను త్రాగక"
“మద్యము” అని తర్జుమా చేయబడిన పదం - షేకర్ (హీబ్రూ). దీనినే గ్రీకులో ‘సికెర’ అని అంటారు. ఇది చాలా ఘాటుగా ఉండే పానీయం. ఇది తాగిన వెంటనే మత్తు ఎక్కేది.
“ద్రాక్షారసము” గురించి హీబ్రూ గ్రీకు బాషలలో రెండు వేరు వేరు పదాలు బైబిల్ లో వాడబడ్డాయి.
- టిరోష్(హెబ్రూ) - దీనినే గ్రీకులో ‘గ్లూకోజ్’ అని అంటారు, ఇది కొత్త ద్రాక్షారసము, తియ్యగా ఉండేది. ఎక్కువ రోజులు పులియబెట్టకపోయినా అప్పుడే తయారుచేసిన ద్రాక్షారసం వేగంగా పులియడం మొదలయ్యేది కాబట్టి కాస్త మత్తుగానే ఉండేది. అందుకనే దీనిని తాగేటప్పుడు కూడా నీళ్లు కలుపుకొని తాగేవారు.
- యాయీన్(హీబ్రూ) - కొత్త ద్రాక్షారసాన్ని ఉడకపెడితే అది దగ్గరకు వచ్చేసి చిక్కటి గుజ్జులాగా తయారయ్యేది. ఆ గుజ్జిని నిల్వ చేసుకునేవారు. దానిని ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని నీరంతా ఆవిరైపోయి, హానికరమైన క్రీములు కూడా చనిపోయేవి. ఈ గుజ్జు పులిసేది కాదు. దీన్ని నీళ్ళల్లో కలుపుకొని పానీయంలాగా సేవించేవారు. ఒక వేళ నీళ్లు కలిపి పులియబెట్టినా అది ఎక్కువ మత్తుగా ఏమీ ఉండేది కాదు. దీనిని గ్రీకులో ‘ఓయినోస్’ అని అంటారు. ఇది కేవలం ద్రాక్షాపళ్ళరసాన్ని సూచిస్తుంది. ఇది మత్తు కలిగించే పానీయం కానే కాదు. కాబట్టి ఈ రోజుల్లో దొరికే మత్తెక్కించే వైన్ లకీ బైబిల్ లో చెప్పబడిన ద్రాక్షారసానికీ చాలా తేడా ఉంది. అవి రెండు ఒకటి కాదు అని అర్థం అవుతోంది.
అలాగే ఆ రోజుల్లో స్వచ్ఛమైన నీరు దొరికేది కాదు. ద్రాక్షారసం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉండేది మరియు దానికి క్రిములను సంహరించే గుణం కూడా ఉండేది కాబట్టి నీళ్లని ద్రాక్షారసంతో కలిపి తాగేవారు (1 తిమోతి 5:23). కానీ అటువంటి పరిస్థితి గానీ అవసరం గానీ ఈ రోజుల్లో లేదు.
సాధారణంగా ఈ నీళ్లతో కలిపిన ద్రాక్షారసాన్నే యూదులు తాగేవారు, యేసు కూడా దీన్నే త్రాగాడు. కానా విందులో యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కదా, దానిని తాగిన అతిధులు దానిని ‘ఓయినోస్’ అని అన్నారు, అంటే అది నీళ్లు కలిపిన ద్రాక్షారసం లాగ ఉండింది అనమాట.
సంఖ్యా 6: 1-4 ప్రకారం నాజీరు చేయబడిన వ్యక్తి 'ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.'
అందుకే యోహాను "ద్రాక్షారసమైనను, మద్యమైనను త్రాగక" యుండెను.
అయితే నాజీరు చేయబడని వాళ్ళందరూ తాగుబోతుల్లవ్వొచ్చా అంటే కాదు. సాధారణంగా అందరూ నీళ్లు చాలా ఎక్కువ పాళ్లల్లో కలిపి బాగా పలచగా చేసిన ద్రాక్షారసాన్నే తాగేవారు అని ఇందాక చూసాము. అయితే మత్తు కలిగించే పానీయాలు సేవించడాన్ని, తాగుబోతుతనాన్ని మాత్రం పా.ని. మరియు కొ. ని. తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాగుబోతుతనం వల్ల ఎదుర్కోవాల్సిన దుష్పరిణామాల గురించి సామెతల గ్రంధంలోనూ ఇంకా అనేక పాత, కొత్త నిబంధన గంధాల్లోనూ వివరంగా తెలియజేయబడింది.(సామెతలు 20:1)
కొత్త నిబంధన విశ్వాసులమైన మనం కూడా దేవుని చేత ప్రత్యేకించబడిన వారమై మత్తు కలిగించేటువంటి పానీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. (ఎఫెసీ 5:18)
“15. తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,”
పుట్టినది మొదలుకొని, యోహాను పరిశుద్దాత్మ చేత నియంత్రించబడుతూ, పరిశుద్దాత్మ యొక్క ఆధీనంలో ఉంటాడన్నమాట.
"ఆత్మ చేత నింపబడడం" - పరిశుద్ధపరచబడటానికి ఇది చాలా ముఖ్యమైనది.
1 కొరింథీ 6:11; 2 థెస్స 2:13; 1 పేతురు 1:2; అపో. కార్య. 1:8; ఎఫెసీ 5:18
యోహాను విషయంలో పరిశుద్దాత్మ పరిచర్య, అతనింకా తన తల్లి గర్భంలో ఉండగానే మొదలయ్యింది. లూకా 1:41
గర్భములో ఉన్న పిండము - పరిశుద్దాత్మ చేత నింపబడినట్లు చదువాము. అంటే ఆ పిండములో జీవమున్నదని గ్రహించవచ్చు. కాబట్టి గర్భధారణ తోటే జీవము ఆవిర్భవించింది అని అర్థం చేసుకోవాలి. అందుకనే బైబిల్ అబార్షన్ కు (భ్రూణహత్య) వ్యతిరేకం. బైబిల్ ప్రకారం అబార్షన్ అంటే ఒక శిశువుని హత్య చెయ్యడమే.
“16. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.”
తరువాతి కాలంలో యోహాను పెరిగి పెద్దవాడై దేవుని చేత పంపబడినవాడై అనేకులకు దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు. మారుమనస్సు గురించీ, బాప్తీస్మము గురించి యోహాను బోధిస్తాడు. అనేకులు (అందరు కాదు) ఆ బోధకు విధేయత చూపి, బాప్తీస్మము పొందుతారు (యోహాను చేతనే). ఆ విధంగా దూత చెప్పిన ఈ సంగతులు నెరవేరాయి.
"దేవుని వైపునకు త్రిప్పును" - ఈ పదం మారు మనస్సు గురించిన సందర్భాలలో ఎక్కువగా వాడబడింది. అయితే ఎవరైనా మారుమనస్సు పొందేలా చెయ్యడం మన పని కాదు, దేవుని పని. యోహాను కేవలం సాధనం మాత్రమే. పశ్చాత్తాపం గురించి బోధించడం ద్వారా, యేసునందు విశ్వాసముంచమని ప్రకటించడం ద్వారా యోహాను దేవుని చేతిలో పనిముట్టులాగా వాడబడ్డాడు. (మత్తయి 3:1-6, మార్కు 1:4 )
"ప్రభువైన వారి దేవుని వైపుకు" - యేసుని దేవుడు అంటున్నాడు. 14 వ వచనంలో తండ్రియైన దేవుడి గురించి కూడా ప్రభువు అనే బిరుదు వాడబడింది. కాబట్టి యేసు కూడా దేవుడే అని లూకా చెప్పకనే చెప్తున్నాడు.
“17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకైఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను."
"ఆయనకు ముందుగా వెళ్ళును.." యెషయా 40:3; మలాకీ 3:1; 4:5,6
ఎందుకు?
"మార్గము సిద్ధపరచడం ...." కోసం - పశ్చాత్తాపాన్ని గురించి బోధించడం ద్వారా, బాప్తీస్మము తీసుకోమని ప్రకటించడం ద్వారా యోహాను మెస్సీయా కొరకు మార్గాన్ని సిద్దపరిచాడు.
ఈ క్రింది వాక్యభాగాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడండి.
1 రాజులు 18: 17-18 = మత్తయి 3:7-11
1 రాజులు 21: 17-24 = మత్తయి 14:14
పోల్చి చూసినప్పుడు ఏలీయాకీ యోహానుకీ కొన్ని పోలికలున్నట్లు అర్ధమవుతోంది.
యోహానే ఎలియానా అన్న సంగతి నిర్దారించుకోవడానికి యూదులు యెరూషలేము నుండి యాజకులనూ లేవీయులనూ పంపిస్తారు. వారు వచ్చి యోహానుని అడుగగా యోహాను ఇలా బదులిస్తాడు.
యోహాను 1:21 -
"21. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను."
మత్తయి 11: 13-14; మత్తయి 17: 10 - 13
యోహాను ఏలీయా కాదు కానీ "ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు ....".
"అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పి ..."
తర్జుమాలో ఇలా అర్థం చేసుకోవచ్చు – ‘తండ్రుల హృదయము, పిల్లలతో కూడా దేవుని వైపుకు త్రిప్పి’.
"అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకు త్రిప్పి” - ఈ మాటలు బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య గురించి తెలియజేస్తున్నాయి.
చివరిగా యోహాను పరిచర్య యొక్క ప్రతిఫలం ఏంటంటే-
"ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై " దీని కొరకే యోహాను నియమించబడ్డాడు.
18 - 25 వరకూ ఉన్న వచనాల్లో జెకర్యా తన అవిశ్వాసాన్ని బట్టి మందలించబడతాడు.
అప్పటి వరకూ భయపడ్డాడు, అంతలోనే అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు, అనుమానాలతో కూడిన ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు.
“18. జెకర్యా - యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా”
అపో. కార్య. 12:12-16 లోని విశ్వాసులు కూడా జెకర్యా వలె ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మలేక పోయారు.
పైన ఉన్న వచనాల్లో జెకర్యా గురించి "నీతిమంతుడు" అని చెప్పినట్లు చూసాం, అయితే ఈ సందర్భాన్ని బట్టి అతను పాపం లేనివాడైతే కాదని అర్ధమవుతోంది.
ఈ సందర్భంలో అబ్రాహాము సంగతి అతనికి జ్ఞాపకం వచ్చి ఉండాలి. రోమా 4:19,20 లో అబ్రాహాము గురించి చెప్పబడింది. జెకర్యాను అబ్రాహాముతో పోల్చి చూడండి.
దేవుని మాటలను అనుమానించడం లేదా ఆయన వాగ్దానాలను నమ్మకపోవడం అంటే దేవుణ్ణే నమ్మునట్లు, ఆయన్నే తిరస్కరించినట్లు.
ఏ సందర్భంలోనైనా మన స్పందించే తీరు మన విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
జెకర్యా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, గబ్రియేలు దూత అతన్ని మందలించవలసి వచ్చింది/ క్రమశిక్షణ చెయ్యవలసివచ్చింది.
“19. దూత - నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.”
"నేను….. గబ్రియేలును" - "దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును" అంటే నేను సాధారణ దూతను కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే - "నీకు దానియేలు తెలుసా? అతనికి ప్రవచనం చెప్పింది ఎవరో తెలుసా? నేనే" అని చెప్తున్నాడు దూత.
బైబిల్ లో ఇద్దరి దూతల పేర్లు మాత్రమే తెలియజేయబడ్డాయి. మిఖాయేలు మరియు గబ్రియేలు.
గబ్రియేలు దేవుని యొక్క ప్రధాన దూత, కొన్ని అతి ప్రాముఖ్యమైన ప్రకటనలు చెయ్యడానికి పంపబడేవాడు.
గబ్రియేలును చూసినప్పుడు మెస్సీయా గురించి దానియేలుతో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరబోతున్నాయని అర్థం చేసుకోవాలి.
ఎందుకు పంపబడ్డాడు?
"నీతో మాట్లాడుటకును" – జెకర్యాతో.
"ఈ సువర్తమానము నీకు తెలుపుటకు". సువర్తమానము అనే పదం అన్యజనులకు చాలా సుపరిచితమైన పదం. ఎలాగంటే ముఖ్యమైన కార్యక్రమాల (శుభవార్తలు) గురించిన ప్రకటన ఏదైనా చేసేటప్పుడు ప్రకటన చేసేవారు ముందు ఈ మాటను పలుకుతూ (అరుస్తూ) ప్రజల దృష్టిని వారి వైపుకు తిప్పుకునేవారు.
ఉదా - సీజర్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవ్వడం గురించిన ప్రకటన చేసేటప్పుడు ముందు ‘యూ అంగలిజో’ (శుభవార్త) అని అరిచి, అందరి దృష్టిని వారి వైపుకు తిప్పుకున్న తరువాత ప్రకటన చేస్తారు.
ఈ పదం నాలుగు సువార్తల్లో 11 సార్లు కనబడుతుంది. అందులో 10 సార్లు లూకా సువార్తలోనే కనబడుతుంది.
"పంపబడితిని" - నా అంతట నేను రాలేదు అని చెప్తున్నాడు దూత.
"నీతో మాట్లాడుటకును" - అందరి గురించీ కాదు గానీ కేవలం జెకర్యాతో మాట్లాడ్డానికే దూత వచ్చాడు.
“20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.”
జెకర్యా యొక్క పాపసహితమైన అవిశ్వాసం కారణంగా గబ్రియేలు దూత జెకర్యాను ఇలా శిక్షిస్తాడు -
"ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువు".
మాట్లాడలేడు కాబట్టి ఆలయంలో జరిగిన అనుభవాన్ని ఎవరికీ చెప్పలేడు, ఆ దర్శనానికీ తమకు కుమారుడు పుట్టడానికీ సంబంధం ఉందనీ చెప్పలేడు. అంతమాత్రమే కాదు - వాళ్ళ ఊరిలో తన యాజక ధర్మాన్ని కూడా నిర్వర్తించలేడు ఎందుకంటే యాజకుడి బాధ్యత ధర్మశాస్త్రాన్ని "బోధించాలి". అలా చేయలేకపోవడం దేవుని తీర్పును సూచిస్తోంది. ఇది జెకర్యా సిగ్గుపడేటువంటి విషయం ఎందుకంటే "నా (దూత) మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు (జెకర్యా)వాటిని నమ్మలేదు”
గబ్రియేలు దూత యొక్క ఈ ముగింపు మాటలు జెకర్యా అవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. అందులో దేవుని సార్వభౌమత్వాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జెకర్యా అవిశ్వాసం దేవుని అనాధికాల ప్రణాళికను కాలరాయడం లేదు. ఏది ఏమైనా గానీ ఆయన నిర్దేశించినవి, అలాగే తప్పక జరుగుతాయి. అయితే జెకర్యా తనకు దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప ధన్యతను, బహుమానాన్నీ(అటువంటి చారిత్రక సంఘటనలో పాలు పొందులు పొందడం) నలుగురితో చెప్పుకొని, నోరారాదేవుణ్ణి స్తుతించే అవకాశాన్ని తన అవిశ్వాసం ద్వారా కాలదన్నుకొని, క్రమశిక్షణ చేయబడ్డాడు.
ఆ తొమ్మిది నెలల జెకర్యా, తన అవిశ్వాసాన్ని బట్టి సిగ్గుపడుతూ ఉండి ఉండవచ్చు. మంచి గుణపాఠం నేర్చుకొని ఉండవచ్చు. ఎంత చెప్పినా వినకపోతే, దేవుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను అనుమతించడం ద్వారా మనకు బుద్ది చెప్తాడు. (హెబ్రీ 3:19 )
అంతమాత్రమే కాదు రానున్న రోజుల్లో తనకు వాగ్దానం చెయ్యబడిన అద్భుతం ఖచ్చితంగ నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఇంకా తొమ్మిది నెలలు పడుతుంది కానీ అతను మాట్లాడలేకుండా అతని నోరు పడిపోవడం అనేది అతనికివ్వబడిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుందనడానికి వెంటనే ఇవ్వబడిన సూచనగా ఉంది.
అలాగే తరువాత జెకర్యా సైగ చెయ్యడం ద్వారానో లేక వ్రాతపలక పైన వ్రాసో జరిగింది చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినా వారు నమ్మే వారో లేదో తెలియదు కానీ జెకర్యా మాట్లాడలేక మూగవాడయ్యాడు కాబట్టి అలా మూగవాడవ్వడం అతని చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఒక సూచనగా ఉంది.
“21. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.”
ఈ సంభాషణ అంతా జరుగుతుండగా "ప్రజలు జెకర్యా కొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి".
యాజకుడు కేవలం ధూపం వేసేసి బయటికి వచ్చి చివరి ఆశీర్వాదం పలకాలి (సంఖ్యా 6:23-27). కానీ జెకర్యా గబ్రియేలు దూతతో మాట్లాడుతూ ఉండడం వల్ల, బయటికి రావడం ఆలస్యం అయ్యింది. ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటే, ఏదైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించినా, అవిధేయతతో నడుచుకున్నా దేవుడు వారిని కఠినంగా శిక్షించిన సందర్భాలు కలవు, అలాంటిదేమైనా జెకర్యా విషయంలో జరిగిందేమోనని ప్రజలు కంగారు పడుతున్నారు. (లేవి 10: 1-7).
అయితే ఈ సందర్భంలో దేవుడు జెకర్యాను చంపలేదు కానీ తాత్కాలికంగా అతను మాట్లాడలేకుండా చేసాడు.
“22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸”
చివరికి అతను బయటికి వెళ్ళినప్పుడు, "వారితో మాటలాడలేకపోయెను".
జెకర్యా ముఖాన్ని చూసి, ప్రవర్తనను బట్టి "ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి". దాని. 10
ఆ తర్వాత అతను "సంజ్ఞలు చేయుచూ" జరిగిన సంగతులు ఇతరులతో చెప్పాలని ప్రయత్నిస్తూ, "మౌనంగా ఉండెను".
“23. అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.”
అయితే, ఎలీసబెతు జరిగిన సంగతులు తెలుసుకొని, ఎలా స్పందించిందో తదితర విషయాలు తెలియజేయబడలేదు.
లూకా వెంటనే ఆ దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి చెప్తున్నాడు.
“24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
- నన్నుకటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.”
"ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై"
ఆమె లేని పోని నిందలతో అవమానించబడకుండా లూకా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ముందు జెకర్యా ఇంటికి వెళ్ళాడు అని, ఆ తరువాత ఆమె గర్భవతి ఆయెను అని, చెప్పాడు.
యేసు క్రీస్తు మరియు అపొస్తలుల కాలమంతటిలో జరిగిన మొట్టమొదటి అద్భుతం ఇది.
ఈ వృద్ధ దంపతులకు ఒక బిడ్డ అనుగ్రహించబడటం.
“మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని”
పిల్లలు పుట్టకపోవడం అనేది కొన్ని సందర్భాలలో దేవుని తీర్పును సూచిస్తూ ఉంది (లెవీ 20: 19-20), కానీ ప్రతి ఒక్కరి విషయంలోనూ పిల్లలు పుట్టకపోవడానికి అదే కారణమని చెప్పటానికి వాక్యంలో ఆధారమేమీ లేదు.
ఎలీసబెతు కూడా తనకు పిల్లలు పుట్టకపోవడాన్ని అవమానంగా భావించింది కాబట్టే ఇప్పుడు దేవుడు తనను కటాక్షించాడు అని చెప్పి హన్నా (1 సమూ 1: 19, 2:10) వలె ఆయనను స్తుతిస్తూ ఉంది.
అలాగే “(ఆమె) అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను”.
ఆమె ఒక వృద్ధురాలు అలాగే ఎన్నో ఏళ్లుగా గొడ్రాలిగా ఉండింది కాబట్టి ఇప్పుడు తాను గర్భవతినయ్యానని ఎవరితోనైనా చెప్పినా వాళ్ళు నమ్మకపోవచ్చు కాబట్టే ఆమె అయిదు నెలలు ఎవరి కంట పడకుండా ఉండింది అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తారు కానీ ఆమె అలా చెయ్యడానికి గల స్పష్టమైన కారణం ఇక్కడే గానీ బైబిల్ లో మరే ఇతర సందర్భంలోనే గానీ తెలియజేయబడలేదు.
III. యేసు పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:26-38)
“26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో”
"ఆరవ నెలలో" అంటే?
గబ్రియేలు దూత మొదటి సారి జెకర్యాకు ప్రత్యక్షమైనప్పటి నుండి ఈ రెండవ సారికి ఆరు నెలలు అవుతోంది అని అర్థం.
ఇంకొక వర్తమానం అందించడానికి “గబ్రియేలను దేవదూత” మరల పంపబడ్డాడు.
తన పాఠకులకు అక్కడి భౌగోళిక సంగతులు తెలిసుండకపోవచ్చు గనుక “గలిలయలోని నజరేతను ఊరిలో” అని వివరంగా చెప్తున్నాడు లూకా.
ఆంగ్ల తర్జుమాలో పట్టణం అనే అర్థం వచ్చేలా తర్జుమా చేశారు కానీ వాస్తవానికి తెలుగు తర్జుమానే సరిగ్గా ఉంది. కొన్ని వందల మంది జనాభా కలిగిన ఒక చిన్న ఊరు - నజరేతు.
నజరేతులో వ్యాపార కార్యకలాపాలు పెద్దగా జరిగేవి కావు. మన భాషలో చెప్పాలంటే అన్ని రహదారులూ నజరేతు చుట్టూ తిరిగి వెళ్లిపోయేవి కానీ నజరేతు మీదుగా ఒక్క రహదారి కూడా వెళ్ళేది కాదు. యూదుల మాతాచారాలను ఎక్కువగా నిర్వహించే ప్రాముఖ్యమైన ప్రదేశాలకు కూడా ఈ ఊరు చాలా దూరంగా ఉండేది.
నజరేతు గురించీ గలిలయ గురించీ ప్రజలకు ఎంత చిన్న చూపు ఉండేదో ఈ వాక్య భాగాలు చదివితే అర్థం అవుతుంది.
గలిలయ గురించి - యోహాను 7:52
నజరేతు గురించి - యోహాను 1:46
యెషయా 9:1 , మత్తయి 4:15 - "అన్యజనుల గలిలయ దేశము ....". కొంత మంది అన్యజనులు నివసించే ప్రాంతాలకు గలిలయ దగ్గరగా ఉండేది.
ఇటువంటి ఊరిని దేవుడు ఎన్నుకోవడంలో కారణం ఏమైఉండొచ్చు?
క్రీస్తు లోకమంతటికీ రక్షకుడు. ఫలానా జాతి/రాజ్యం/దేశానికి చెందినవాడనో లేదా ఒక నిర్దిష్టమైన గొప్ప జ్ఞానుల గుంపుకి/ధనికుల గుంపుకి చెందినవాడనో అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు ఈ ఊరిని ఎన్నుకొని ఉండొచ్చు.
1 కొరింథీ 1:24 - "యూదులకేమీ, గ్రీసుదేశస్థులకేమీ, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియు, జ్ఞానమునైయున్నాడు"
500 సంవత్సరాల క్రితం గబ్రియేలు దూత దానియేలుకు ప్రత్యక్షమై, మెస్సీయా రాకడ సమయం గురించి తెలియజేశాడు, ఆరు నెలల క్రితం అదే గబ్రియేలు దూత జెకర్యాకు ప్రత్యక్షమై మెస్సీయాకు ముందుగా నడిచే వాని గురించి తెలియజేశాడు. ఆ ముందుగా నడిచేవాడు - బాప్తీస్మమిచ్చు యోహాను.
మొదట దేవాలయములో యాజక ధర్మము నెరవేర్చే ఒక పెద్దవాడైన యాజకుని వద్దకు వచ్చాడు. ఇప్పుడైతే యేసు అద్భుతరీతిన జన్మించబోతున్నాడన్న వర్తమానంతో ఒక చిన్న, మారుమూల ఊరిలోని ఒక యవ్వనస్థురాలి వద్దకు వచ్చాడు.
“27. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.”
"కన్యకయొద్దకు" అంటే ఆమె అంతవరకూ ఏ పురుషుని ఎరుగనిది.
ఆమె గురించి ఇంకా ఎం చెప్పబడింది అంటే -
ఆమె "ఒక పురుషునికి ప్రధానము చేయబడినది".
యూదుల ఆచారం ప్రకారం - ఒక అమ్మాయికి 12 లేదా 13 సంవత్సరాల వయస్సు వచ్చాక ప్రధానం చేయబడుతుంది. ప్రధానం చేయబడిన సంవత్సరానికి పెళ్లి చేస్తారు. ప్రధానం అంటే ఈ రోజుల్లో మనం చేసుకునే నిశ్చితార్థం లాంటిది కాదు. యూదుల దృష్టిలో ప్రధానం అంటే చట్టపరంగా కూడా చాలా శక్తివంతమైనది. ప్రధానం చేయబడిన వారిని భార్యా, భర్తలుగా పరిగణించేవారు. చట్టరీత్య ఏర్పడిన ఆ బంధాన్ని కాదనుకోవాలి అంటే వారిరువురిలో ఒకరు చనిపోవడమైనా జరగాలి లేక విడాకులు అయినా తీసుకోవాలి. ఒక వేళ ప్రధానము చేయబడిన తరువాత పురుషుడు చనిపోతే ఆ స్త్రీని విధవగా పరిగణించేవారు. అయితే ఆ సంవత్సర కాలంలో వారు ఎటువంటి శారీరక సంబంధాలు కలిగి ఉండటానికి గానీ కలిసి ఒకే దగ్గర నివసించడానికి గానీ వీలు లేదు. ఆ సమయంలో స్త్రీ తన నమ్మకత్వాన్ని రుజువు పరుచుకోవాలి. పురుషుడు తన భార్యతో కలిసి నివసించడానికి ఇంటిని సిద్ధపరచాలి. ఆ సంవత్సర కాలం అయిపోయిన తరువాత ఒక వారం రోజులు పెళ్లి విందు జరుగుతుంది. ఆ తరువాత వారిద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవించడం ప్రారంభిస్తారు. అప్పుడే వారి వివాహం పూర్తయినట్లు.
"దావీదు వంశస్థుడైన యోసేపు" - యోసేపు దావీదు వంశస్థుడు అని మాత్రమే ఇక్కడ తెలియజేయబడింది గానీ మత్తయి 1:19; 13:55 లో అతను నీతిమంతుడనీ, వడ్రంగి పని చేసుకునే వాడనీ తెలియజేయబడింది.
ఆ యోసేపుకి ఈ కన్యక ప్రధానం చేయబడింది.
యోసేపు వడ్రంగి పని చేసేవాడు అయినప్పటికీ వంశాన్ని బట్టి, దావీదు వంశానికి చెందినవాడు.
యోసేపు శరీరరీత్యా యేసుకు తండ్రి కానప్పటికీ, చట్టరీత్యా మాత్రం ఆయనే యేసుకు తండ్రి అని మత్తయి 1:1-17 లోని ఆయన వంశావళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. (మత్తయి 1:1)
లూకా 3:23-28 లో మరియ వంశావళి గురించి చెప్పబడింది. అలా చూసినా యేసు దావీదు వంశానికి చెందినవాడే అని అర్థం చేసుకోవచ్చు.
జెకర్యా ఎలీసబెతులు ఒక యాజక కుటుంబం - ఆ కుటుంబంలో యోహాను పుడితే, మరియ యోసేపుల రాజ వంశములో యేసు పుట్టాడు.
“ఆ కన్యక పేరు మరియ". ఆమె పేరు మాత్రమే తెలియజేయబడింది. ఇతరత్రా వివరాలేవీ తెలియజేయబడలేదు. ఏమీ తెలియజేయకుండానే, నేడు మనం చూస్తూ ఉన్నట్లు రోమన్ కథోలిక సంఘము మరియను ప్రత్యేకమైన దానిగా, పూజ్యనీయురాలిగా చేసి, ఆమెను ఆరాధించడం, ఆమెకు ప్రార్థన చెయ్యడం వంటివి చేస్తోంది. ఒక వేళ ఆమె గురించి ఇంకా ఏమైనా చెప్పబడి ఉంటె, ఇక ఊహించుకోండి. పరిశుద్దాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన లేఖనాలు కాబట్టి ఎంతవరకూ అవసరమో దేవుడు అంత మాత్రమే వ్రాయించాడు.
“28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.”
నిజంగా దూత రాలేదు, ఇదంతా ఒక దర్శనంలో జరిగింది అని చెప్తారు కొందరు. ఒకవేళ దైవిక దర్శనమే అయితే ఇతర సందర్భాలలో లాగా ఆ విషయం స్పష్టంగా తెలియజేయబడేది.
" ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి " అంటున్నారంటే ఇది దర్శనం కాదు అని అర్ధమవుతోంది. మరియ ఇంటి లోపల ఉన్నదని కూడా తెలుస్తోంది. బహుశా ఒంటరిగా కూడా ఉండి ఉండవచ్చు.
"నీకు శుభము" ఈ రోజుల్లో మనం హలో అని ఎలా చెప్పుకుంటామో, అలాంటి ఒక సాధారణ పలకరింపు.
"దయాప్రాప్తురాలా" అని సంబోదించడంలోని ఉద్దేశ్యం - భయపడాల్సిందేమీ లేదు కానీ దేవుని యొక్క దయకు, కృపకు నోచుకున్నావు అని తెలియజేస్తోంది. ఈ భూమిపై ఇప్పటివరకూ పుట్టిన, ఇకపై పుట్టబోయే స్త్రీలందరిలో ఎవరికీ దొరకని ఆధిక్యత - మెస్సీయాకు తల్లి అవ్వడం. ఆ ప్రత్యేకమైన కృపను ఉద్దేశించి దూత ఇలా అన్నాడు.
అంతే కానీ ఆమెదో ప్రత్యేకమైనదీ కాదు, పాపం లేని సంపూర్ణ పరిశుద్ధురాలూ కాదు. ఆమె కూడా అందరి వంటి పాపే. అందుకే ఆమెకు దేవుని దయ లేదా కృప అవసరమయ్యింది.
దీన్ని కొంత మంది కాథలిక్ పోపులు వక్రీకరించి ఇలా చెప్పారు - మరియ కృపను పొందుకునేది కాదు, కృప చేత నింపడినది. ఆమె మధ్యవర్తిగా ఉండి మానవులకు దేవుని కృపను, దయను అనుగ్రహిస్తుంది అని చెప్పారు. ఆ కృపను పంచి పెట్టే పనికి ఆమె అధిపతి అని వారు చెప్తారు. సెయింట్. లూయిస్. బి. హెర్దార్డ్ అనే వ్యక్తి ఇలా అన్నాడు – “మరియ పరమునకు చేరుకొనబడిన దినము నుండి ఇంతవరకూ ఆమె మధ్యవర్తిత్వం లేకుండా దేవుని కృపను పొందుకున్న మనిషే లేడు".
ఇటువంటి అబద్ద బోధ వల్ల కాథలిక్స్ అంతా మరియను ఆరాధించే పాపంలోకి తోయబడ్డారు. మరియ కూడా ఒక విమోచించబడిన పాపి. ఆమె శరీరంతో ఆరోహణమైపోయింది అని కాథలిక్స్ నమ్ముతారు - అది వేరే విషయం. దేవుడు తప్ప ఏ మనిషీ మంచివాడు కాదు, అందరూ పాపులే అని మాత్రం వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది.
ఇక రెండవది - యేసుతో పాటు మానవులను విమోచించడానికి ఆమె చేసిందేమీ లేదు. రోమా 3:24; ఎఫెసీ 1:7
మూడవది, ఆమె మన ప్రార్థనలు విని, వాటి విషయమై దేవునికి మొరపెట్టే పని కూడా చెయ్యదు. "మానవునికి దేవునికి మధ్య మధ్యవర్తి ఒక్కడే ......ఆయన యేసు క్రీస్తే" అని 1 తిమోతి 2:5 తెలియజేస్తోంది.
మరియ ద్వారా తప్ప దేవునికి మనం దత్తపుత్రులమయ్యే అవకాశమే లేదన్న రోమన్ కాథలిక్స్ యొక్క బోధ - అబద్ద బోధ. అలా అనడం దైవదూషణతో సమానం.
నాలుగవది, తరువాత వచ్చిన పోపులు ఇలాంటి బోధనలు సృష్టించారు కానీ ఈ వచనాలను ఒకసారి పరిశీలించండి.
"ప్రభువు నీకు తోడైయున్నాడని (దూత) చెప్పెను" - అంటే దేవుని తోడు, దేవుని బలము, రక్షణ ఆమెకు అవసరమవుతున్నాయని మరో సారి రుజువయ్యింది. అందుకే దూత - భయపడాల్సిన అవసరం లేదని మరియకు చెప్తున్నాడు. 47, 48 వచనాలలో కూడా మరియ ‘తాను పాపినేనని గ్రహించింది’ కాబట్టే దేవుడు తన రక్షకుడని చెబుతుంది. పాపులకు మాత్రమే రక్షకుడు అవసరం.
"29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా"
కేవలం దూత ప్రత్యక్షమవ్వడాన్ని బట్టి మాత్రమే ఆమె కలవరపడడం లేదు గానీ ఆ దూత ఆమెతో చెప్పిన మాటలను బట్టి ఆమె భయాందోళనకు గురి అయ్యింది. ఇలాగ ఏ యూదుడు ఏ స్త్రీతోనూ చెప్పడు. సొంత భర్త కూడా ఇటువంటి పదాలు వాడి పలకరించడు. అందుకని ఆమె ఆలోచనలో పడింది.
దూత ప్రత్యక్షమైనప్పడు జెకర్యా కూడా ఇలాగే స్పందించినట్లు 12 వ వచనంలో చూస్తాము. ఎందుకంటే ఇటువంటి ప్రత్యక్షతలు కలుగుతాయని వారు ఊహించలేదు. దూతలు ప్రత్యక్షమైతే వారిని ఎలా ఎదుర్కోవాలో, ఎం మాట్లాడాలో వారికి తెలియదు, అందుకు సిద్ధంగా లేరు.
తాను పాపిని అన్న సంగతి మరియకు తెలుసు కాబట్టి దయాప్రాప్తురాలా అనగానే నేను దేవుని కృపను దయను పొందుకోవాడానికి ఏమాత్రము అర్హురాలిని కానప్పటికీ దూత ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆమె కలవర పడుతూ ఆలోచనలో పడింది.
ఇది నిజమైన తగ్గింపు మనస్సు, ఆమె మనస్సు ఆమె నీతుయుక్తమైన జీవితాన్ని ప్రతిబింబిస్తోంది.
నిజముగా నీతిమంతులైన వారందరి స్పందన ఇలాగే ఉంటుంది ఎందుకంటే వారి పాపం గురించి వారికి తెలుసు.
ఉదా: యెషయా 6:5; లూకా 5:8
“30. దూత - మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.”
ఆమెను శాంతపరిచే ఉద్దేశ్యంతో “దూత - మరియా, భయపడకుము" అని చెప్తూ, ఎందుకు భయపడోద్దో వెంటనే వివరిస్తున్నాడు.
"దేవుని వలన నీవు కృపపొందితివి" కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
గబ్రియేలు దూత ఒక శుభ సమాచారం తీసుకు వచ్చాడు గానీ తీర్పు గురించి ప్రకటించడానికి రాలేదని ఆ మాటలను బట్టి మరియ అర్థం చేసుకోనుండొచ్చు.
“31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;”
ఇంతకీ ఆ దూత తెచ్చిన సమాచారం ఏంటంటే "నీవు గర్భము ధరించి కుమారుని కంటావు". దూత మాటలను మరియ అర్థం చేసుకోలేకపోయింది, గ్రహించడం కష్టమయ్యింది ఎందుకంటే ఆమెకు తెలిసి ఒక స్త్రీ ఒక పురుషుడు కలవడం ద్వారా మాత్రమే పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. అందుకే 34 వ వచనంలో ఆమె ఒక ప్రశ్న వేసింది. ఏమని - "నేను పురుషుని ఎరుగని దాననే; యిదేలాగు జరుగును?" - అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది?
ఈ ప్రకటన ఎవరు విన్నా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే కానీ అక్షరార్ధంగా మెస్సీయా గురించి చెప్పబడిన ప్రవచనం అలాగే నెరవేరింది. (యెషయా 7:14; మత్తయి 1:23 పోల్చి చూడండి)
ఆ తరువాత మొత్తం యేసు క్రీస్తు పరిచర్యనంతటినీ ప్రతిబింబించే విధంగా ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది - "ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు". ఈ మాటకు హీబ్రూ భాషలోని అర్థం, అసలు యేసు ఈ లోకానికి రావడానికి గల కారణాన్ని తెలియజేస్తుంది. యేసు అనగా రక్షకుడు.
దూత ఇచ్చిన ఆజ్ఞకు మరియ యోసేపులు విధేయత చూపినట్లు 2:21 లో చూస్తాము.
తన విమోచన ప్రణాళికని నెరవేర్చుకునే పనిలో మరియను వాడుకోవాలని దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె యోగ్యమైనదనో లేదా ఆమె గొప్పతనాన్ని బట్టో కాదు కానీ కేవలం తన కృపను బట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు.
మనం నీతిమంతులుగా తీర్చబడడానికో లేక పరిశుద్ధపరచబడడానికో దేవుడు చూపే కృప కాదిది. ఇది ప్రత్యేకమైన కృప. లోకంలో ఏ స్త్రీకి దక్కని గొప్ప భాగ్యం - మిస్సీయాకు తల్లి అవ్వడం. ఆ ప్రత్యేకమైన కృప గురించి దూత మాట్లాడుతున్నాడు.
“32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.”
"ఆయన గొప్పవాడై" - ఆయన గొప్పవాడని చెప్పడానికి ఏవో బయటినుండి కారణాలు చూపించాల్సిన అవసరం లేదు కానీ ఆయన స్వభావసిద్ధంగానే గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని వివరించడానికి మాటలు/ పదాలు కూడా సరిపోవు.
"సర్వోన్నతుని కుమారుడనబడును" - యేసు కూడా తండ్రి కలిగినయున్న మహిమనే కలిగియున్నాడు.
వేరే సందర్భంలో ఇటువంటి పదాలే యోహాను గురించి కూడా వాడబడ్డాయి కానీ ఆ తరువాతి బిరుదు వారిద్దరి మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది (వ. 76 ).
"సర్వోన్నతుని" అనే పదము పాత నిబంధనలో ఆది 14:18-20 లాంటి అనేక సందర్భాలలో తరచుగా వాడబడింది. అది దేవుని యొక్క స్థానాన్ని సూచిస్తోంది. ఆయనే అన్నింటికీ పైగా సార్వభౌమ అధికారం కలిగిన పరిపాలకుడు అనితెలియజేస్తుంది.
యేసును గురించి మాట్లాడుతూ అదే పదాన్ని వాడడాన్ని బట్టి - యేసు కూడా అటువంటి మహిమనే, స్వభావాన్నే కలిగియున్నాడని తెలియజేస్తుంది. (హెబ్రీ 1:3)
"ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును" - చట్టరీత్య తన తండ్రియైన యోసేపు ద్వారా యేసు దావీదుకు నిజమైన వారసుడెనని మనం చూశాం.
సింహాసనము; ఏలును - అన్న పదాలు ఒక రాజ్యాన్ని సూచిస్తున్నాయి.
“33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.”
ఆ రాజ్యములో ఆయన యాకోబు వంశస్థులను ఏలుతాడు అని చెప్పబడింది (యెషయా 2:5-6; 8:17; 48:1 ). ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పబడినవి కానీ క్రైస్తవులనుద్దేశించి చెప్పబడినవి కావు.
అయితే దాని 7:14,27 ప్రకారం ఆయన సమస్త మానవాళిని ఏలుతాడనీ అర్థం చేసుకోవచ్చు. వాక్యమంతటా తారస పడే సత్యం కూడా ఇదే.
ఆ రాజ్యం లేదా పరిపాలన ఎప్పటి వరకూ?
"ఆయన రాజ్యము అంతములేనిదై యుండును" అన్న మాటని చదువుతున్నాం.
వ. 34 - 38
బైబిల్ లో అద్భుత రీతిన జన్మించిన వారున్నారు. ఉదా: ఇస్సాకు జననం - వంద ఏళ్ల అబ్రాహాము, తొంభై ఏళ్ల శారమ్మలకు ఇస్సాకు జన్మించాడు. మనోహ భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు, ఆమె సమ్సోనును కనింది. గొడ్రాలైనటువంటి హన్నాకుమారుణ్ణి కనునట్లు దేవుడు కృప చూపించాడు. ఆ కుమారుని పేరు సమూయేలు. గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షం అయిన కొన్ని నెలల క్రితమే జెకర్యా ఎలీజబెతు అను వృద్ధ దంపతులను దేవుడు కరుణించగా ఎలీజబెతు గర్భవతి అయ్యింది.
అయితే వీటన్నింటి కంటే గొప్ప అద్భుతం - యేసు క్రీస్తు పుట్టుక. ఆయన కుమారుడైన దేవుడు, త్రిత్వంలో రెండవ వ్యక్తి, నరరూపధారిగా వచ్చినవాడు. శరీరరీత్యా తండ్రి లేకుండానే మరియ అనే కన్యక పరిశుద్దాత్మ ద్వారా గర్భము ధరించినదైయేసు క్రీస్తుకు జన్మనిచ్చింది.
యేసు కన్యకకు జన్మించడము - ఈ సిద్ధాంతము క్రైస్తవ్యానికి పునాది లాంటిది, ఎందుకంటే ఆయన పుట్టుకే ఆయన దైవ మానవుడు ఎలా అయ్యాడో తెలియజేస్తుంది. ఆయన కన్యకకు పుట్టడాన్ని తృణీకరిస్తున్నారంటే - ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అన్న బైబిల్ సత్యాన్ని కూడా వారు తృణీకరిస్తున్నారు. అంత మాత్రమే కాదు పౌలు 2 కొరింథీ 11:4 లో చెప్పినట్లు వారు "మరియొక యేసును" ప్రకటిస్తున్నట్లు.
2 కొరింథీ 11:4 - "ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీ కరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే."
ఒక వేళ యేసుకి శరీరరీత్యా తండ్రి ఉంటె మనలాంటి మామూలు మనిషి అయ్యుండేవాడు. ఒక వేళ ఆయన కేవలం మనిషే అయితే ఆయన రక్షకుడు కాలేడు. పాపియైన ఒక మనిషి మరో మనిషిని రక్షించడం సాధ్యపడదు కదా. ఒక వేళ ఆయన రక్షకుడు కాలేక పోతే సువార్త లేదు, రక్షణ లేదు, నిత్యత్వాన్ని గురించిన నిరీక్షణే లేదు.
అందుకే అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:17,19 లో ఇలా అంటాడు.
1 కొరింథీ 15:17,19 -
"17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
- ఈజీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము."
ఈ విషయాన్ని పౌలు ఎంత ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు అనేది గలతీ 1:8-9 వచనాలు చదివితే అర్థం అవుతుంది.
గలతీ 1:8-9 - "8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
- మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక."
ఈ సంగతులు మనకు కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా ప్రత్యక్షపరచబడినప్పటికీ పాత నిబంధనలో కూడా ఆయన గురించి కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి.
ఆది 3:15 - " మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది (ఆయన) నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను."
అయితే అది ఎలా జరుగుతుంది అని యెషయా 7:14 లో చదువుతాము.
యెషయా 7:14 - "కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును."
హీబ్రూ లో కన్యక అనే పదానికి ‘ఆల్మ’ అనే పదం వాడబడింది. కొంత మంది ఈ పదాన్ని ఒక యవ్వన స్త్రీ అని తర్జుమా చేశారు, యేసు కన్యకకు పుట్టలేదని తప్పుగా వ్యాఖ్యానించారు.
- సాధారణంగా ఒక యవ్వన స్త్రీకి గర్భం రావడం సూచన ఎలా అవుతుంది?యవ్వనంలో ఉన్న స్త్రీలే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటారు, అది అద్భుతం ఎలా అవుతుంది?
- పైపెచ్చుకన్యక కాని ఒక యవ్వన స్త్రీ గురించి 'ఆల్మ' అనే పదం వాడబడినట్లు ఆధారాలేమీ లేవు.
- అన్నింటికంటే ప్రాముఖ్యమైన ఆధారంఏంటంటే హీబ్రూ భాషలో ఉన్న యెషయా 7:14 గ్రీకులోకి తర్జుమా చేయబడినప్పుడు మత్తయి 1:23 లో ‘పార్థేనోస్’ అనే పదం వాడబడింది. ఈ పదానికి ‘కన్యక’ అని అర్థం. కాబట్టి ఆ పదం కన్యక అనే భావంతోనే రాయబడినట్లు రుజువవుతోంది.
ఈ ప్రాధమిక సత్యం వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినప్పటికీ, చాలా మంది అబద్ద బోధకులు ఈ సిద్ధాంతాన్ని తప్పుగా బోధిస్తూ వచ్చారు. ఇటువంటి బోధలనే పౌలు 1 తిమోతి 4:1 లో "దయ్యముల బోధలు" అంటున్నాడు.
1 తిమోతి 4:1,2 - "అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
- దయ్యములబోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు."
ఆ తరువాతి కాలంలో రాయబడిన కొన్ని యూదుల పుస్తకాలు చదివితే వాటిలో ఇలా రాశారు - మరియ ఒక రోమా సైనికుడి వల్ల గర్భవతి అయ్యింది అని. మరి కొందరు యోసేపు వల్లనే మరియ తల్లి అయ్యింది అన్నారు.
అయితే ఈ విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది -
మత్తయి 1:25 - "ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను."
ఇటువంటి తప్పుడు బోధలను బైబిల్ ఆధారం చేసుకొని తేలిగ్గా కొట్టి పారెయ్యొచ్చు.
ఇంకో ప్రాముఖ్యమైన సంగతి - తాను 'పురుషుని ఎరుగని దానను' అని మరియ తన మాటల్లో తనే చెప్పడాన్ని ఈ వచనాల్లో మనం గమనిస్తాం.
మరియ ప్రశ్న
“34. అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా”
దూత వచ్చి చెప్పిన మాటలు వినగానే ఆమె నిర్ఘాంతపోయింది. అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది అని ఆశ్చర్యపోతూ దూతను ఇలా ప్రశ్నించింది - "అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా". మరియ యొక్క ప్రశ్న న్యాయమైనదే. ఆమె దూత మాటలను సంపూర్ణంగా నమ్మింది కానీ "ఇది అసంభవం" అనిపించేటువంటి ప్రవచనం ఎలా నెరవేరబోతోందో ఆ ప్రక్రియ(మ్యానర్) గురించి మాత్రమే ప్రశ్నిస్తుంది కానీ అనుమానంతో కాదు. అలా అనుమానంతో అవిశ్వాసంతో ప్రశ్నించింది జెకర్యా. వ. 18-20 లో ఆ సంగతులు మనం చూసాము. మరియ అలా చెయ్యలేదని మనం ఎలా నిర్ధారించుకోగలము? ఎలాగంటే దూత స్పందించిన తీరుని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ మరియ కూడా అవిశ్వాసంతో ప్రశ్నించి ఉంటే జెకర్యా వలే ఆమె కూడా క్రమ శిక్షణ చేయబడేది కదా.
నాలుగు దశాబ్దాల తరువాత దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ నాలుగు వందల సంవత్సరాలు దూత ఎవ్వరికీ ప్రత్యక్షం కాలేదు. కొన్ని నెలల క్రితమే జెకర్యాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ సంగతి మరియకు తెలిసుండక పోవచ్చు. అందుకే వ. 36 లో దూత ఆ సంగతులన్నీ మరియకు తెలియజేస్తున్నాడు. అప్పుడు దూత చెప్పిన మాటలు మరియ సరిగ్గానే అర్థం చేసుకుంది. పెళ్లి అయిన తరువాత సహజంగానే నువ్వు గర్భం ధరిస్తావు అని దూత చెప్పట్లేదు కానీ ఆమె ఇంకా కన్యకగా ఉండగానే గర్భవతి అవుతుందని దూత చెప్తున్నట్లు ఆమె గ్రహించింది. అందుకే నేను "పురుషుని ఎరుగని దానినే" అని ప్రశ్నించింది.
దూత సమాధానం
"35. దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును"
మరియ అడిగిన ప్రశ్నకు జవాబుగా దూత ఇలా వివరణ ఇస్తున్నాడు.
"పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును" - యేసు క్రీస్తు పుట్టుకలోనూ, పరిచర్యలోనూ పరిశుద్దాత్మ చాలా కీలకమైన పాత్ర పోషించినట్లుగా చూస్తాము. పరిశుద్దాత్మ ద్వారానే మరియ గర్భం ధరించింది అని ఈ వచనం ద్వారా చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. "లైంగిక సంబంధం" ద్వారా ఆమె గర్భవతి అయ్యింది అనడానికి వాక్యంలో ఎటువంటి ఆధారాలూ లేవు.
పరిశుద్దాత్మ పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి మళ్ళీ దూత ఇలా అంటున్నాడు - "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును".
"సర్వోన్నతుడు" అనే మాట పాత నిబంధలో దేవుడికి ఇవ్వబడిన బిరుదులతో ఒకటిగా చూస్తాము. వ. 31-33 ను ధ్యానించేటప్పుడు ఈ బిరుదు గురించి చూసాము. దేవుడు సార్వభౌముడనీ, సర్వశక్తిమంతుడు అయిన పరిపాలకుడనీ, భూమినీపరలోకాన్ని పరిపాలిస్తున్నాడనీ ఆ మాట యొక్క అర్థం. ఈ విశ్వాన్నంతటినీ చేసిన వాడు ఆయనేనని, దానిని ఉనికిలో ఉంచుతున్నవాడు ఆయనేనని అర్థం. అటువంటి సృష్టికర్తా సర్వోన్నతుడూ అయిన దేవుడు తన పరిశుద్దాత్మ ద్వారా మరియ గర్భవతి అయ్యేలా, యేసు క్రీస్తుకి జన్మనిచ్చేలా చేశాడు.
"కమ్ముకొనును" - మామూలుగానే ఆ పదాన్ని అర్థం చేసుకోవచ్చు. మరో అర్థం - ప్రభావితం చేసింది. మరియ గర్భంలో ఒక శిశువు జన్మించేలా ఆ శక్తి మరియను ప్రభావితం చేసింది అని అర్థం చేసుకోవచ్చు.
ఇంతటితో మరియ ప్రశ్నకు సమాధానం పూర్తి అయ్యింది కానీ దూత అంతటితో ఆగకుండా మరికొన్ని వివరాలు తెలియజేస్తున్నాడు. ఆమె గర్భం ధరించడం, దేవుడు చేసే కార్యం అని చెప్పాడు. దేవుని శక్తి వలన అది సాధ్యపడుతుంది అనిచెప్పాడు. యేసు పుట్టడం ఎలాగ ఆయన శక్తిని బట్టి జరుగుతుందో, అలాగే ఆయనకు పాపం అంటుకోకుండా పరిశుద్దునిగా పుట్టడానికి కూడా అదే దేవుని శక్తి కారణం.
"పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును" - మరియకు జన్మించే కుమారుడి గురించి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. మొదటిది, ఆయన పరిశుద్ధ శిశువు. రెండవది ఆయన దేవుని కుమారుడు.
“శిశువు పరిశుద్ధుడై” అన్న మాట గురించి ఆలోచిద్దాం. సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకుంది కాబట్టే పుట్టబోయే శిశువు పరిశుద్దుడు అవుతాడు అని చెప్తున్నాడు దూత. "గనుక" అనే మాటను బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు.
అటువంటి శిశువు ఎప్పుడూ ఎవరికీ పుట్టలేదు. యేసు తప్ప అందరూ పాపంలోనే జన్మించారు అని వేరు వేరు వచనాల్లో మనం చదువుతాము. చాలా సుపరిచితమైన వాక్య భాగం
కీర్తన 51:5 - "నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను."
అంటే దావీదు తానేదో అక్రమ సంతానంగా జన్మించాను అని చెప్పట్లేదు కానీ తన తల్లి తనను గర్భాన ధరించినది మొదలుకొని తాను పాపినని చెబుతున్నాడు.
కానీ దేవుని కుమారుడైన క్రీస్తు నందు మాత్రం ఎప్పుడూ ఏ పాపమూ లేదు.
కొంత మంది ఆయనకు శరీరరీత్యా తండ్రి లేడు కాబట్టి అతనిలో పాపం లేదు అని వాక్యాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తుంటారు. అది తప్పు. తండ్రి ద్వారా మాత్రమే పాపానికి సంబంధించిన జీన్స్ పిల్లలకు సంక్రమిస్తాయి అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు.
1 కొరింథీ 15:22 - "ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు."
రోమా 5:18 ,19 - "కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకుకారణమాయెను.
- ఏలయనగాఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు."
మునుపటి వచనంలో దేవుని శక్తే దానికి కారణం అనీ, అది ఆయన చేసిన కార్యమని చూసాము అయినప్పటికీ పరిశుద్దుడైన దేవుడు పాపియైన మరియ గర్భాన పుట్టి యే పాపము సోకకుండా ఎలా ఉన్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే - మనకు అర్థం కాని, మనం గ్రహించలేని అద్భుత రీతిలో యేసు సంపూర్ణ మానవుడుగా పుట్టినప్పటికీ తన పుట్టుకలో పాపం లేని వాడుగా ఉన్నాడు. ఇదొక మర్మము. మనం మన తల్లి గర్భములో ఊపిరి పోసుకున్నది మొదలుకొని మనం రూపుదిద్దుకున్న తీరు అంతటి గురించి ఆలోచిస్తే మన పుట్టుకే ఒక మర్మము లాగా అనిపిస్తోంది. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క పుట్టుక ఇంకా గొప్ప మర్మము అవ్వడంలో ఆశ్చర్యం ఏముంది. దాన్ని మనం ఛేదించాల్సిన అవసరమూ లేదు,ఛేదించలేము కూడా.
"దేవుని కుమారుడనబడును"
ఆ పుట్టబోయే శిశువు దేవుని కుమారుడనబడటానికి గల ఒకానొక కారణాన్ని ఈ వచనంలోనే తెలియజేశాడు దూత. ఈ వచనంలో "గనుక" అనే పదానికి ముందు ఆ కారణాన్ని చూడగలము - "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక". అంత మాత్రాన అప్పటి నుండే (అంటే ఆయన పుట్టినప్పటి నుండే) ఆయన దేవుని కుమారుడని దాని అర్థం కాదు. నిత్యత్వం నుండీ ఆయన దేవుని కుమారుడే. ఆయన నిత్యత్వం నుండీ దేవుని కుమారుడిగా ఉన్నాడా (ఎటర్నల్ సన్ షిప్) లేక ఆయన మనిషిగా పుట్టినప్పటి నుండే దేవుని కుమారుడయ్యాడా (ఇంకార్నేషనల్ సన్ షిప్) అనేది వేరే సందర్భంలో వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ వచనాన్ని బట్టి యేసు మనిషిగా పుట్టినప్పటి నుండే దేవుని కుమారుడు అయ్యాడు అని మాత్రం చెప్పలేము. ఆయన నిత్యత్వం నుండీ దేవుని కుమారుడే.
దేవుడిచ్చిన గుర్తు
“36. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము"
దూత మాటలు అతను చెప్పినట్లుగానే జరుగుతాయో లేదో అన్న అనుమానంతో మరియ తనకొక సూచననిమ్మని అడగలేదు కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని బలపరిచే ఉద్దేశ్యంతో ఆయనే ఒక గుర్తును అనుగ్రహించాడు. ఆమె బంధువులలో ఒకరిని చూపించి దేవుడు మరియను బలపరుస్తున్నాడు. ఆ గుర్తు మరెవరో కాదు, ఎలీజబెతు. ఎలీజబెతు మరియకి బంధువు. వాళ్ళు ఎలాగ బంధువులో ఆ వివరాలు తెలియజేయబడలేదు. వ. 31 - ప్రకారం మరియ దావీదు వంశానికి చెందినది. వ. 5ప్రకారం ఎలీజబెతు అహరోను వంశానికి చెందినది. కాబట్టి ఎలీజబెతు, మరియ వాళ్ళ తల్లి గారి తరుపు బంధువు అయ్యుండొచ్చు లేక మరియ, ఎలీజబెతు వాళ్ళ తల్లి తరుపు బంధువు అయ్యుండొచ్చు.
"మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది" అన్న మాటలు వినగానే మరియకు ఒక పక్క ఆశ్చర్యమూ మరో పక్క గొప్ప సంతోషమూ కలిగి ఉండవచ్చు. ఎందుకంటే బంధువు కాబట్టి మరియకు ఎలీసబెతు గురించి బాగా తెలిసి ఉండవచ్చు- ఆమె గొడ్రాలనీ, బిడ్డలను కనే వయస్సు దాటిపోయిన వృద్ధురాలనీ.
"గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము".
మనుషులకు అసాధ్యమైన వాటిని చెయ్యడానికి దేవుడు ఇంకా సమర్దుడేనని మరియకు తెలియజేయడానికి దేవుడు ఈ గుర్తును మరియకు అనుగ్రహించాడు.
దేవుని సార్వభౌమత్వము
“37. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను".
మానవరీత్యా అసంభవం అనిపించే సంగతులు విన్న తరువాత దేవుని యొక్క అంతులేని శక్తిని గురించి గబ్రియేలు దూత జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ సంగతులు ఇలాగే జరుగుతాయి అనేదానికి రుజువు ఎలీజబెతు గర్భవతి అవ్వడం.
కానీ ఇటువంటి మాటలే దేవుడు శారాతో చెప్పినట్లు చూస్తాం.
ఆది 18:12-14 - "శారా-నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
- అంతటయెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?
- యెహోవాకుఅసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను."
ఒకవేళ దేవుడికి అసాధ్యమైనదేదీ లేకపోతే, ఆయనకు సమస్తమూ సాధ్యమనేగా అర్థం. ఆ విధంగా దేవుడు ఎలీజబెతు విషయంలో చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా తాను చెప్పిన ఈ మాటలు మరి నిశ్చయముగా నెరవేరుతాయనిగబ్రియేలు మరియకు తెలియజేస్తున్నాడు.
మరియ జీవితంలో జరిగినట్లుగా దేవుని వాగ్దానాలు మన విషయంలో కూడా తప్పక నెరవేరుతాయని అర్థం చేసుకోవచ్చు.
మరియ యొక్క తగ్గింపు
“38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను"
హన్నా కూడా ఇటువంటి మాటలే పలికినట్లు 1 సమూయేలు 1:10-11 లో చూస్తాము.
1 సమూయేలు 1:10-11 -
"బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు
- సైన్యములకధిపతివగుయెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికిరానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను."
హన్నా యే రీతిన తగ్గించుకుందో, అలాగే మరియ కూడా తగ్గించుకుంది. మరియ మాటలు, దేవుని ఉద్దేశ్యాలకు ఆమె విధేయత చూపుతున్నట్లు తెలియజేస్తున్నాయి.
'దాసురాలు' తనకు నచ్చినట్లు తాను జీవించడానికి వీలు లేదు కానీ తన యజమాని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆ భావంతోటె మరియ తన గురించి తాను “ప్రభువు దాసురాలను” అని చెప్పుకుంటోంది.
ఒక నిజమైన దాసురాలిలాగా ఎంతో తగ్గింపుతో - "నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అంటోంది. మరో విధంగా చెప్పాలంటే దూత మాటలకు స్పందిస్తూ సింపుల్ గా ఆమెన్ అంటోంది.
మనం కూడా దేవుని మాటలకు విధేయత చూపించడానికి, దేవుడు ఆజ్ఞాపించిన పనులు చెయ్యడానికి సిద్ద మనస్సు కలిగి ఉండాలి. మనము మన సొంతం కాదనీ, మనకు యేసు అనే యజమాని ఉన్నాడనీ, మనము ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలనీ మరిచిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తుంటాము. నా చితమూ, నా ఇష్టమూ, నా ఉద్దేశ్యాలు కాదు దేవుని చితమేమిటో తెలుసుకొని, ఆయన ఉద్దేశ్యాలను ఎరిగి వాటికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతి విశ్వాసితీర్మానించుకోవాలి.
"నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అని అనేసింది మరియ, మరి యోసేపు సంగతి ఏంటి అని దూతను అడగలేదు. తాను గర్భవతినయ్యాను అన్న సంగతి ఈ రోజు కాకపోతే రేపైనా యోసేపుకు తెలియకుండా పోదు. ఆ బిడ్డ తన ద్వారా కలిగినవాడు కాదు కాబట్టి వ్యభిచారం వల్ల గర్భవతి అయ్యింది అనే కారణాన్ని బట్టి యోసేపు ఆమెకు విడాకులు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
మత్తయి 1:19 - "ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను."
ఆ తరువాత ప్రజలంతా ఆమెను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి ఉంది.
లెవీ 20 :10 - "పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను."
ద్వితీయో 22:23,24 -
"23. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల
- ఆ ఊరిగవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండిపరిహరించుదురు."
కానీ మరియ ఎంతో తగ్గింపుతో, దేవుని మాటకు విధేయత చూపుతూ తన మీద పడబోయే నింద నుండి ఆయనే తనను రక్షిస్తాడని నమ్మింది.
దేవుని చిత్తానికి లోబడే విషయంలో మరియ ఇటువంటి నిందలు భరించడానికి సిద్దపడింది. వాటి గురించి ఆమె ప్రశ్నించలేదు.
దేవుని చిత్తం స్పష్టంగా అర్థం అయిన తరువాత, నడువవలసిన త్రోవ కనుగొన్న తరువాత, ఇప్పుడు కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో సమస్యలు తలైతే అవకాశం ఉందని అనిపించినప్పటికీ ఆయన చిత్తాన్ని మాత్రమే చెయ్యడం కోసం ఎక్కడికైనా వీళ్ళడానికీ ఏదైనా చెయ్యడానికీ ప్రతి విశ్వాసి సిద్ధంగా ఉండాలి.
ఈ విషయంలో మరియ మనకు మాదిరిగా ఉంది.
ఇటువంటి మరియను రోమన్ కాథోలిక్స్ పరలోకపు రాణీని చేశారు. బొమ్మలేవీ పెట్టకపోయినా ఆమెను ఆరాధించడం విగ్రాహారాధనతో సమానం. అటువంటిది విగ్రహాలు పెట్టి మరీ ఆమెను పూజిస్తుంటారు. పరలోకంలో రాణీ ఎవరూ లేరు, యుగయుగాలు పరిపాలించే రాజు ఒక్కడే అక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తుంది.
మరియకూ దూతకూ మధ్య జరిగిన సంభాషణ ఈ మాటలతో ముగుస్తుంది - "అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను".
దూత వచ్చిన పని అయిపొయింది కాబట్టి అతను తిరిగి దేవుని సమక్షంలోకి వెళ్ళిపోయాడు.
దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చుకోవడం కోసం తనకు విధేయత చూపిస్తూ, సేవ చెయ్యాలన్న ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరినీ తన పనిలో వాడుకుంటాడు అని అర్థం చేసుకోవాలి - మరియను వాడుకున్నట్లు. దేవుని చేత వాడబడే పాత్రగా నీవు ఉండాలనుకుంటున్నావా? ఒక వేళ అలాంటి ఆశ నీవు కలిగి ఉంటే, ఇటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి.
IV. మరియ ఎలీసబెతును దర్శించుట (లూకా 1: 39-45)
లూకా సువార్త రెండు అద్భుతాలను గురించిన వృత్తాంతాలతో ప్రారంభమవుతుంది. ఒకటి వృద్ధురాలైన స్త్రీ గర్భవతి కావడం. రెండవది కన్యకయైన స్త్రీ గర్భవతి కావడం. మొదటి స్త్రీకి జన్మించబోయే కుమారుడు మెస్సియాకి ముందు నడిచేవాడు, మార్గమును సరాళము చేయువాడు లేదా సిద్ధపరచువాడు. రెండవ స్త్రీకి జన్మించబోయే కుమారుడు స్వయానా మెస్సియానే, యేసు క్రీస్తే.
ఇంత వరకూ వీరిరువురి కథలు విడివిడిగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు రెండు కథలు ఈ వాక్యభాగంలో కలుస్తున్నట్లు చూస్తున్నాం.
మరియ తాను కన్యక అయినప్పటికీ దేవుని వాగ్దానం తన విషయంలో కూడా తప్పక నెరవేరుతుందని తాను దూత మాటలయందు ఎక్కువగా విశ్వాసముంచగలగడానికి ఈ గుర్తు ఎంతగానో దోహదపడింది.
“39. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి”
"ఆ దినములయందు ..... త్వరగా వెళ్లి"
'ఆ దినములు' అంటే దూత వచ్చి మరియతో మాట్లాడిన "ఆ దినములు" అని అర్థం. అంటే "మరియ" ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే తనకు వాగ్దానం చెయ్యబడిన గుర్తుని తన కళ్ళతో తాను చూడ్డానికి ఎలీసబెతు దగ్గరికిప్రయాణమై వెళ్ళిపోయింది. అప్పటికే ఎలీసబెతుకి ఆరవ నెల అని 36 వ వచనంలో దూత మరియతో చెప్పినట్లు చూసాం.
"యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి"
బహుశా అక్కడికి చేరుకోవడానికి మరియకు దాదాపు మూడు లేదా నాలుగు రోజులు పట్టి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతారు. పెద్దవారు ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, భద్రపరుస్తూ ఉండే సమాజమూ సంస్కృతీ వారిది. అటువంటి నేపథ్యంలో మరియ ఇటువంటి ప్రయాణం చెయ్యడం అసాధారణ విషయం. మరియ ఖచ్చితంగా ఎప్పుడు గర్భవతి అయ్యిందో బైబిల్ లో ఎక్కడా ప్రస్తావించబడకపోయినా, బహుశా ఈ ప్రయాణం చేసే సమయానికి ఆమె గర్భవతి అయ్యుంటుంది. కొందరు ఆమె తాను గర్బవతినయ్యానన్న సంగతిని దాచిపెట్టే ఉద్దేశ్యంతోనే ఊరు విడిచి వెళ్ళిపోయింది అంటారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే మరియ మూడు నెలలకు తిరిగి వచ్చినట్లు 56 వ వచనంలో చూస్తాం.
"అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతో (ఎలీసబెతుతో) కూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను."
ఒక వేళ దాచిపెట్టే ఉద్దేశ్యమే ఉంటె మూడవ నెలలో ఎందుకు తిరిగి వస్తుంది. మూడవ నెల అంటే అప్పుడు మరియ ఎవ్వరికీ చెప్పకుండానే ఆమె గర్భవతి అయ్యిందని చూసేవారందరికీ అర్థమయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎందుకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆమెకు అటువంటి ఉద్దేశ్యం లేదని అర్ధమవుతోంది.
ఆ కొండసీమలలోని ఒక ఊరు అని వ్రాయబడింది కానీ ఖచ్చితంగా ఏ ఊరు అనేది తెలియజేయబడలేదు.
"40. జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను."
అక్కడికి వెళ్లిన తరువాత మరియ "జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను."
జెకర్యా అప్పటికి మూగవాడైయున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత 'ఎలీసబెతుకు వందనము చేసెను' అని చదువుతాము. అంటే ఈ రోజుల్లో లాగా హలో అని కాదు, వారు వందనాలు చెప్పుకునేటప్పుడే కుశల ప్రశ్నలు, ప్రాముఖ్యమైన సంగతులన్నీ మాట్లాడుకునేవారు. బహుశా మరియ ఎలీసబెతులూ వారికి సంభవించిన సంఘటనలను ఒకరితో ఒకరు చెప్పుకొని ఉంటారు. అంత మాత్రమే కాదు, జెకర్యాకు దూత ప్రత్యక్షమైన సంఘటనకీ, మరియకు దూత ప్రత్యక్షమైనసంఘటనకీ చాలా దగ్గర పోలికలున్నాయని గ్రహించి మరియ ఎలీసబెతులు ఆశ్చర్యానికి గురయ్యుంటారు. కొన్ని పోలికలు ఏంటంటే -
జెకర్యాకీ మరియకీ ఇద్దరికీ గబ్రియేలు దూతే ప్రత్యక్షమవుతాడు
దూత ప్రత్యక్షమవ్వగానే ఇద్దరూ భయపడతారు
దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాడు అన్న వర్తమానాన్నే ఇద్దరికీ దూత తెలియజేస్తాడు
కుమారుడికి ఏ పేరు పెట్టాలో కూడా దూత తెలియజేస్తాడు
కుమారుడి గురించి దూత వివరిస్తాడు
ఇద్దరూ దూతను ప్రశ్నిస్తారు
వారిద్దరికీ ఒక గుర్తు అనుగ్రహించబడింది
ఇలా ఈ దగ్గర పోలికలని బట్టి ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా, ఎన్నో సంవత్సరాల నుండీ ఎదురు చూస్తున్న మెస్సీయా ఈ లోకానికి రావడమూ, దానికి అల్పులైన తమ వంటి వారిని దేవుడు వాడుకుంటున్నందుకు చాలా సంతోషించియుంటారు.
మరియ తనకు సంభవించిన సంగతులన్నీ ఎలీసబెతుతో మాత్రమే ధైర్యంగా చెప్పుకోగలదు ఎందుకంటే ఆమె విషయంలో కూడా అటువంటి అద్భుతమే జరిగింది కాబట్టి. ఆమె మాత్రమే మరియ మాటలను నమ్మగలదు. ఇంకెవరైనా అయితే తప్పు చేసి, అంటే చేయకూడని పనిదో చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కథలు చెప్తుందనుకుంటారు. ఎవరి దాకో ఎందుకు సత్యం ఏంటో దూత వచ్చి చెప్పక ముందు యోసేపు కూడా మరియను విడనాడాలనుకున్నట్లు మత్తయి 1:19 లో చూస్తాం.
"ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను."
కాబట్టి మరియ ఈ సంగతులను తన కుటుంబసభ్యులతోనో స్నేహితురాళ్ళతోనో చెప్పినట్లు ఎక్కడ లేదు కానీ ఆమె ఎలీసబెతుతో ఈ సంగతులన్నీ చెప్పుకొని ఉండొచ్చు.
అంత మాత్రమే కాదు ఎలీసబెతు మాటలు విన్న తరువాత, ఆమె ఎటువంటి స్థితిలో ఉందో కళ్లారా చూసాక, తన విషయంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడన్న నిశ్చయత కలిగియుండవచ్చు మరియకు.
దేవుడు మనందరినీ కూడా వేరు వేరు పరిస్థుతులగుండా తీసుకెళ్తుంటాడు. కొన్ని సార్లు మన విశ్వాసంలో మనం బలపడు నిమిత్తం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన అనుభవం కలవారి యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తాడు, లేక వారిని మన యొద్దకు తీసుకొని వస్తాడు. లేక దేవుని వాక్యంలో నుంచే ఆ పరిస్థితికి తగ్గట్లుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో తప్పకుండా ఉంటాయి. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఇతరులతో పంచుకున్నప్పుడు, మరియ ఎలా బలపరచబడిందో, అలా అనేకులు బలపరచబడతారు. అవిశ్వాసులు రక్షించబడవచ్చు, విశ్వాసంలో సన్నగిల్లిన వారు బలపరచబడతారు. నువ్వు కూడా దేవుని చేత వాడబడతావు.
41 వ వచనంలో మొదటి భాగాన్ని, 44 వ వచనాన్ని కలిపి చూద్దాం.
“41. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను....
- ఇదిగో నీశుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను."
కేవలం ఎలీసబెతుతో మాట్లాడ్డం ద్వారా మాత్రమే కాకుండా, మరో అద్భుతమైన రీతిలో మరియకు నిశ్చయత లభించింది.
మరియ వందన వచనంలో ఎక్కడో ఏ మాటల ప్రస్తావనలోనో ఎలీసబెతు గర్భములోని శిశువు గంతులు వేసినట్లు వ్రాయబడింది.
44 వ వచనం చూస్తే ‘శిశువు ఆనందముతో గంతులు వేసినట్లు’ ఎలీసబెతు చెప్తుంది.
మామూలుగా కడుపులో బిడ్డ కదులుతుంటుంది కానీ ఎలీసబెతు ఆ కదలికలలో తేడా ఉందని గ్రహించినట్లు ఆమె మాటల్లో తెలుస్తుంది. బహుశా మెస్సీయ గురించిన వార్త వినగానే ఆనందంతో తన గర్భంలోని శిశువు గంతులు వేసివుండొచ్చు.
కాబట్టి శిశువు గంతులు వేయడం ద్వారా కూడా మరియకివ్వబడిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని మరియకు నిశ్చయత లభించింది.
44 వ వచనాన్ని ఇంతక ముందే ధ్యానించాము కాబట్టి 41 వ వచనం రెండవ భాగం నుండీ మిగిలిన వచనాలను వరుసగా చూద్దాము.
"41. …… అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
పాత నిబంధలోగానీ, సువార్తల్లో గానీ చూసినట్లయితే - పరిశుద్దాత్మ చేత నింపబడిన వెంటనే దేవుని సందేశం తెలియజేయబడేది. అంటే ఎవరు ఎప్పుడు పరిశుద్దాత్మతో నింపబడినా, దాదాపు అన్ని సందర్భాల్లో దేవుని మాటలను దేవుని ప్రజలకు తెలియజేసేవారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం -
2 సమూయేలు 23:2 - "యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది."
లూకా 1:67 - "మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను"
లూకా 2:26-32
అపో కార్య. 2:4 - "అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి."
- మనలో ప్రతివాడు తాను పుట్టినదేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?"
అపో కార్య. 4:8-12
అపో కార్య. 4:31 - "వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి."
2 పేతురు 1:21 - "ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి."
అదే విధంగా ఎలీసబెతు కూడా "పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను"
ఇలా బిగ్గరగా మాట్లాడటం అనేది దైవ సందేశాలు ప్రకటించబడే సందర్భాల్లో జరిగినట్లు మనం చూడొచ్చు. ఉదాహరణకి
యోహాను 1:15 - "యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను."
యోహాను 7:28,29 -
"28. కాగా యేసు దేవాలయములో బోధించుచు - మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.
- నేను ఆయనయొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను."
రోమా 9:27,28 -
"27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని
- యెషయాయుఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు."
అలా బిగ్గరగా ఎలీసబెతు కూడా కొన్ని మాటలు పలికింది.ఇంతకీ ఆమె పలికిన మాటలేంటంటే -
“42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును”
"స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు"
ఇటువంటి మాటలే 28 వ వచనంలో దూత మరియతో అంటాడు.
యూదుల సంస్కృతిలోనూ మన సంస్కృతిలోనూ సమాజంలో ఒక స్త్రీ యొక్క స్థాయి చాలా వరకూ ఆమె కన్న పిల్లలపై ఆధారపడియుంటుంది. అందుకే ఒక స్త్రీ మరియను గొప్ప చేస్తూ ఇలా అంది -
లూకా 11:27 -
"ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా"
గబ్రియేలు దూత వారికి పుట్టబోయే బిడ్డ గొప్పవాడు అని వారితో చెప్పినప్పటికీ, ఎలీసబెతు ఎంతో తగ్గింపుతో మరియ కుమారుడు మరి గొప్పవాడని గ్రహించింది. తన కుమారుడు కేవలం మెస్సీయాకి ముందు నడిచేవాడు మాత్రమే, కానీ మరియకుమారుడు మెస్సీయానే కాబట్టి మరియ ఎక్కువ ఘనతకు, ధన్యతకు నోచుకుందని ఎలీసబెతు గ్రహించింది.అందుకే ఎలీసబెతు మెస్సీయాకి ముందుగా నడిచేవానికి తల్లిని అయ్యానని మాత్రమే కాక మెస్సీయ యొక్క రాకడ గురించి తెలుసుకొని మరి ఎక్కువగా సంతోషించింది.
"నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును"
ఈ మాటలు పాత నిబంధనలో తరచూ వేరు వేరు సందర్భాల్లో రాయబడ్డాయి కానీ కొత్త నిబంధనలో మాత్రం ఈ ఒక్క చోటే కనబడతాయి. అదీ యేసు క్రీస్తు గురించి. మెస్సీయా గురించి. లోక రక్షకుడి గురించీ.
- నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?
ఆమె పొందుకున్న ధన్యతను బట్టి ఆమె ఆశ్చర్యానికి గురయినట్లు ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. ఆమె నిజమైన తగ్గింపుతో, మరియ వంటి ధన్యురాలి సహవాసంలో ఉండటానికి తాను అనర్హురాలినని భావిస్తూ ఆమె పలికిన మాటలు ఇవి. అందుకే ఆమె మరియ కుమారుణ్ణి "నా ప్రభువు" అని సంబోధిస్తుంది. అలా సంబోధించడం ఆయన దైవత్వాన్ని సూచిస్తోంది. ఈ పదము లూకా సువార్త మొదటి రెండు అధ్యాయాల్లో 12 కంటే ఎక్కువ సార్లు దేవుణ్ణి సూచిస్తూ వాడబడింది. అదే పదము ఇక్కడ కూడా వాడబడడాన్ని బట్టి యేసు దేవుడు అని లూకా చెప్పకనే చెప్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
# ఎలీసబెతు తన కంటే వయసులో చిన్నది, తన తరువాత పుట్టిన ఒక చిన్న పిల్లకి తన కంటే గొప్ప ఆధిక్యత లభించడాన్ని బట్టి ఈర్ష్య పడట్లేదు కానీ సంతోషిస్తుంది. పైపెచ్చు దేవుడు తనపై అంత కృప చూపించడానికి తాను పాత్రురాలనుకాను అని అంటోంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే - మనం దేనికి అర్హులము కామో అటువంటివి అనేకము దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే దాన్ని కృప అన్నారు. కానీ మనం ఎం చేస్తాం అంటే ఇతరులకు దేవుడు ఇచ్చిన ధన్యతలను చూసి ఈర్ష్య పడుతుంటాము. ఎవరికి, ఎప్పుడు, ఎంత కృప చూపించాలో అది దేవుని ఇష్టం. దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి తృప్తి చెందుతూ ఎలీసబెతు వలె స్తుతించేవారంగాఉండాలి కానీ కృపను కృప కాదన్నట్లు మనం పొందుకున్న దానికి మనం పాత్రులమే అన్నట్లు ఇతరులతో పోల్చుకొని ఈర్ష్యపడడం, అసంతృప్తితో ఉండడం విశ్వాసుల లక్షణం కాదు.
# ఎలీసబెతు ఎలా స్పందించిందో ఆమె కుమారుడు కూడా అలాగే స్పందించినట్లు మనం చూస్తాము.
మత్తయి 3:14 - "అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని"
తల్లి తండ్రులైనటువంటి వారు ఈ మాటను జాగ్రత్తగా గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. యోహాను జీవితంపై తన తల్లి ప్రభావం ఎంత వరకూ ఉందొ తెలియదు కానీ ఆమె మాత్రం ఈ విషయంలో మంచి మాదిరినే కనపరచియుండవచ్చనిఅర్ధమవుతోంది. పిల్లలు మిమ్మల్నే చూస్తున్నారు జాగ్రత్త. మీరు దేవుని యందలి భయభక్తులతో జీవిస్తూ, అలా జీవించడం మీ పిల్లలకు నేర్పించవలసిన వారు. మీకున్న చెడ్డ అలవాట్లు, తప్పుడు చేష్టలు మీ పిల్లలు చేస్తుంటే మురిసిపోకండి,సిగ్గుపడండి. మీ పిల్లల విషయమై దేవునికి మీరు లెక్క అప్పజెప్పవలసిన వారు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం అలవాట్లు, ప్రవర్తన మాత్రమే కాదు మిమ్మల్ని బట్టి మీ పిల్లల వ్యక్తిత్వం కూడా రూపుదిద్దుకుంటుంది. మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి. మీ జీవితాలు మీ పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయా లేక దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయా?
ఈ వాక్యభాగంలోని మాటలు చదివి రోమన్ కాథలిక్స్ మరియను 'దేవుని తల్లి' అంటారు. అది తప్పు. దేవుడు నిత్యత్వము నుండీ నిత్యత్వము వరకూ ఉనికిలో ఉన్నవాడు. ఆయనకు ప్రారంభమనేది లేదు. దేవుడు పుట్టడం జరగదు. ఈ వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవ శరీరంలో ఉన్న యేసుకు మాత్రమే మరియ తల్లి, ఆయన నిత్యత్వపు దైవత్వానికి కాదు.
ఎలీసబెతు ముగింపు మాటలు
"45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను."
మరియ కేవలం మెస్సీయకు తల్లి కావడాన్ని బట్టి మాత్రమే కాక "ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను".
అయితే ఎలీసబెతు మరియ అనకుండా "ఆమె" అని అనింది. అంటే మరియ మాత్రమే కాదు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ ఆశీర్వదించబడతారని అర్థం చేసుకోవచ్చు.
మరియ దేవుని తల్లీ కాదు, మానవుల పాప విమోచనలో ఆమె ఎటువంటి పాత్ర పోషించలేదు, మన ప్రార్థనలేమీ ఆమె విని మన పక్షముగా విజ్ఞాపన చెయ్యదు, కానీ విశ్వాసం విషయంలోనూ దేవుని చిత్తానికి లోబడే విషయంలోనూ మంచి మాదిరినికనపరచింది. దేవుని మాటలకు విధేయతతో, సంతోషంతో స్పందించే విషయంలో కూడా ఆమె మంచి మాదిరి కనపరచింది.
# ఒక భక్తుడు ఇలా అన్నాడు - నిజదేవుని యందు విశ్వాసమే నిజమైన సంతోషానికి పునాది. ఎందుకంటే మన విశ్వాసం వల్లనే దేవుని వాగ్దానాలు మన విషయంలో నెరవేరుతాయి. అవి మన రక్షణకు సంబంధించినవి కావొచ్చు, ఈ లోకంలో మనం జీవించే జీవితానికి సంబంధించినవి కావొచ్చు, లేక మన నిత్య జీవానికి సంబంధించినవి కావొచ్చు. ఏవైనా సరే వాటి నెరవేర్పే మనకు నిజమైన సంతోషం. నిజ దేవుని యందు మనకున్న విశ్వాసం మాత్రమే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. దేవుని మాటలను సంపూర్ణంగా విశ్వసించడమే నిజమైన ఆశీర్వాదం.
పాత నిబంధనలో హేబేలు దగ్గర మొదలు పెడితే కొత్త నిబంధనలోని విశ్వాసుల వరకూ విశ్వాసం ద్వారా ఏమేం పొందుకున్నారో మనకు తెలుసు.
విశ్వాసంతో వారు వాగ్దానాలను హత్తుకున్నారు, వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు.
విశ్వాసం తో జీవించారు.
విశ్వాసం తో నడిచారు
విశ్వాసంతో ఎన్నో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు
విశ్వాసంతో కనబడని రక్షకుని చూడగలిగారు
విశ్వాసంతోనే ఈ లోకంతోటీ, శరీరంతోటీ, సాతాను తోటీ యుద్ధం చేశారు.
మరియ కూడా తన విశ్వాసాన్ని బట్టి తాను కూడా ఆ భక్తుల గుంపుకు చెందిన దాననని నిరూపించింది.
నీ విశ్వాసం పరిస్థితి ఏంటి?
నీ మాట, నీ నడక, నీ జీవితం నీ విశ్వాసం గురించి ఏమైనా తెలియజేస్తున్నాయా? అన్ని పరిస్థితుల్లో ఆయనయందు విశ్వాసముంచగలుగుతున్నావా?
విశ్వాసం కూడా దేవుని వరమే. అటువంటి విశ్వాసంలో మనమందరమూ ఎదగ వలసిన వారము. దాని నిమిత్తమై ప్రార్థన చేయవలసినటువంటి వారము.
V. మరియపాడిన పాట (లూకా 1: 46 – 56)
మరియ ఎలా ఆరాధిస్తుంది?
హన్నాకు లాగానే మరియ కూడా ఒక పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తోంది.
మన ఆరాధన ఎలా ఉండాలి అన్న దాని గురించి ఒక నాలుగు సంగతులు ఈ మూడు వచనాలు నుండి మనం గ్రహించవచ్చు.
46 & 48 వచనాలను కలిపి చూద్దాం.
"46. అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది."
"48. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను."
మొదటిది, మన ఆరాధన అంతర్గతమైనదయుండాలి (ఇంటర్నల్). ఈ వచనాల్లో చూస్తే మరియ తన "ప్రాణము" తోనూ, "ఆత్మ" తోనూ ఆరాధిస్తుంది. ఈ రెండు పదాలు మనలో ఉండే అంతర్గత వ్యక్తిని సూచిస్తూ ఉన్నాయి. అంటే మన మనస్సు, భావోద్వేగాలు, చిత్తము. నిజమైన ఆరాధన గురించి యోహాను 4:24 -
"24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను."
ఇందుకు విరుద్ధమైన ఆరాధన ఏంటంటే పైపైన చేసేటువంటిది, వేషధారణతో కూడుకున్నది. ఇటువంటి ఆరాధనకు దేవుడు విముఖుడు.
యెషయా 29:13 -
"13. ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులుమానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి."
ఈ వచనాన్ని యేసు ప్రభువు వారు కూడా ఉల్లేఖించారు.
మత్తయి 15:7-9 -
"7. వేషధారులారా
- ఈ ప్రజలు తమ పెదవులతో నన్నుఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;
- మనుష్యులు కల్పించిన పద్ధతులుదైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి"
యెహెఙ్కేలు 33:31 -
"31. నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది."
# ఆరాధన అనేది మన నిత్య జీవన విధానం అయ్యుండాలి, కానీ మరీ ముఖ్యంగా మనం తరచూ ఆదివారాలు సమూహంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అటువంటప్పుడు మనం కూడా ఏదో మొక్కుబడిగా వెళ్లి కూర్చోని టైం పాస్ చేసేసి, హమ్మయ్య, పని అయిపోయింది అనుకుంటే అటువంటి వారినే దేవుడు వేషధారులు అంటున్నాడు. మీరు చర్చికి వెళ్లినప్పటికీ, క్రమం తప్పకుండా వెళ్లినప్పటికీ మీరు నిజముగా మీ ఆత్మతో ఆరాధన చేస్తుండకపోవచ్చు. ఈ విషయమై మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మొక్కుబడిగానో, అలవాటుగానో ఏదీ చెయ్యొద్దు. మనమందరూ హృదయపూర్వకంగా ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుకుంటున్నాడని గ్రహించాలి.
రెండవది నిజమైన ఆరాధన అత్యంత తీవ్రమైనదిగా లోతైనదిగా ఉంటుంది - (ఇంటెన్స్).
"ఘనపరచుచున్నది" - ఆ మాటకు అర్థం ఆయనను గొప్ప చెయ్యడం, ఆయన ఔన్నత్యాన్నీ, విశిష్టతను మెచ్చుకోవడం, పొగడడం, మహిమ పరచడం.
48 వ వచనంలో "ఆనందించెను" అనే మాటను కూడా చదువుతాము. ఆ మాటకు అర్థం - చాలా విపరీతమైన సంతోషం, గొప్ప సంతోషం అని అర్థం.
అటువంటి సంతోషముతో, ఆత్మయందు తీవ్రత కలిగి మనము ప్రభువును ఆరాధించవలసినవారము.
మూడవది, అలవాటుగా ఉండాలి. అది నీ జీవన శైలి అయ్యుండాలి. నీ జీవన విధానం అయ్యుండాలి. మరియ మాటల్ని గమనిస్తే ఆమె సహజంగానే ఆరాధన చేస్తూ ఉంది. అంటే అది ఆరాధన కోసం నిర్దేశించిన సమయమూ కాదు, స్థలమూ కాదు, అటువంటివేమీ లేవు కానీ ఆమె సహజంగానే దేవుణ్ణి స్తుతిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ మారుతున్న పరిస్థితులు మన ఆరాధనను ఏ విధంగానూ ప్రభావితం చెయ్యకూడదు.
ఎందుకంటే
దేవుడు మారడు
ఆయన వాక్యం మారదు
ఆయన ఉద్దేశ్యాలు మారవు
ఆయన వాగ్దానాలు తప్పిపోవు
ఆయన మనకనుగ్రహించిన రక్షణ ఎన్నటికీ కోల్పోము.
# మన బాధ్యత ఏంటంటే - ఆయనకు అన్ని విషయములలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే -
ఎఫెసీ 5:20 -
"20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,"
1 థెస్స 5:18 -
"18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము."
"సమస్తమును గూర్చి", "ప్రతి విషయములో" అని చదివాము కదా.
ఇదే విషయాన్ని దావీదు ఎలా చెప్పాడో తెలుసా -
కీర్తన 16:8 -
"8. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను."
అలాగే పౌలు మాటల్లో కూడా చూద్దాం.
ఫిలిప్పి 1:20 -
"19. మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు"
కాబట్టి ఆయనకు మనము ఋణస్థులము అన్న సంగతి ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని, మనం అర్హులము కాని ఎన్నో మేళ్లను ఆయన తన కృప చొప్పున ప్రతి రోజూ మనకు అనుగ్రహిస్తున్న కారణాన్ని బట్టి ఆయన్ని స్తుతించడం నేర్చుకోవాలి.
చివరిగా, ఆరాధన తగ్గింపుతో కూడినదై ఉండాలి. మనం దేవుణ్ణి ఆరాధించకుండా చేసే రెండు అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, అజ్ఞానము (ఇగ్నోరెన్స్). సాధారణంగా దేవుని గురించిన జ్ఞానం అసలు లేకుండా ఉండదు కానీ తక్కువగా ఉండటం అనమాట. అంటే దేవుణ్ణి ఆరాధించేటంతగా దేవుణ్ణి ఇంకా వారు ఎరుగలేదు అని అర్థం. అటువంటి వారు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎటువంటి దేవుడో ఇంకా సరిగ్గా గ్రహించలేదు గనుక వారు సరిగ్గా ఆరాధించలేరు. అస్సలు ఆరాధించలేరు అనడంలేదు.
రెండవది, గర్వము. ఈ సమస్య ఉన్నవారు, అస్సలు ఆరాధించలేరు. వారు వేషధారులవుతారు. గర్వము అంటే మనల్ని మనం ఆరాధించుకోవడమే. అయితే దేవుడు దానిని ఏ మాత్రము సహించడు. పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ -
నిర్గమ 20:3 -
"3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు."
యాకోబు 4:6 -
"6. కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది."
సామెతలు 16:5 -
"5. గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు."
కాబట్టి గర్విష్ఠులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం చాలా కష్టం. ఎందుకంటే తాము పొందుకునే ప్రతిదానికి తాము అర్హులమే అనీ, యోగ్యులమే అనీ వారు అనుకుంటారు.
మరో వైపు దీనులు మాత్రము, తాము పొందుకున్న దేనికీ తాము అర్హులము, యోగ్యులము కాదని గుర్తెరిగి, వారి పాపముల విషయమై పశ్చాతాపపడుతూ, దేవుని నీతి విషయమై ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన పట్ల విపరీతమైన కృతజ్ఞతా భావం దీనులకు ఉంటుంది, తత్ఫలితంగా వారు దేవుణ్ణి స్తుతించగలుగుతారు, ఆరాధించగలుగుతారు.
మరియ కూడా అటువంటి వ్యక్తే.
"47. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను"
"తన దాసురాలి" అన్న మాటలు చూడండి. దేవుడు తనపై చూపిస్తున్న దయను బట్టి కృపను బట్టి ఆమె సంతోషిస్తోంది. తానేదో గొప్పదాన్నని అనుకోలేదు (రోమన్ కాథోలిసిజం బోధించే విధంగా). ఎంతో తగ్గింపుతో "దాసురాలి"ని అంటోంది.
38 వ వచనంలో కూడా ఈ మాటను చదువుతాము.
"38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను."
కొత్త నిబంధనలో ఇలా తమను తాము పిలుచుకున్న వారిలో ఈమె మొదటిది. తరువాత ఎంతో మంది భక్తులు ఈ మాదిరిని అనుసరించారు.
"దీనస్థితిని కటాక్షించెను"
సాంఘికంగా చూస్తే - గలిలయ ప్రాంతంలో నజరేతు అనే ఊరిలో నివసించే ఒక సాధారణ అమ్మాయి మరియ. ఆమె మెస్సీయాకు తల్లి అయిన తరువాత కూడా ఆమె ఏ విధంగానూ ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. యేసు క్రీస్తు కూడా ఆమెను అత్యధికంగా గౌరవించడం కానీ ప్రత్యేకమైన దాని వలె ఆమెను హెచ్చించడం గానీ చెయ్యలేదు. ఆదిమ సంఘం కూడా ఆమెకు ప్రత్యేకమైన విలువ, స్థానము ఇచ్చి ఆమెను హెచ్చించింది అనడానికి ఆధారాలు లేవు. ఈ సాధారణ అమ్మాయికి మరో సాధారణ అబ్బాయితో నిశ్చితార్థం అయ్యింది. వారిద్దరూ అంత మామూలు ఊరి నుండి వచ్చారు కాబట్టే తరువాతి కాలంలో తమ కుమారుడైన యేసు బోధలను ప్రజలు అంగీకరించడం కష్టమయ్యింది.
సాంఘీకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చూస్తే, ఆమె అందరిలాగే తాను కూడా పాపిని అని గుర్తెరిగి, తనకు కూడా రక్షకుడు అవసరం అని తేలుసుకుంది. నిజముగా ఆరాధించేవారి మాదిరిగానే మరియ కూడా ప్రభువుని ఎంతో గొప్పగా ఎంచుతూ, తనను తాను ఎంతో తక్కువగా ఎంచుకుంది. ఇటువంటి దీన స్థితినే దేవుడు ఆశించేది, అటువంటి వారినే దేవుడు ఆశీర్వదించేది.
#మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని, దేవుణ్ణి హెచ్చుగా చూడటం నేర్చుకోవాలి. అప్పడు ఈ ఈగో సమస్యలు ఉండవు. దీన మనస్సు అనేది దేవుడు అనుగ్రహించే కృప. అందరు ధనవంతులు కాలేరు, అందరూ జ్ఞానవంతులు కాలేరు, అందరూ వరాలను పొందుకోలేరు, అందరూ బోధకులు కారు. కానీ దేవుని పిల్లలందరూ తమను తాము ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని కప్పుకొనవచ్చు. ఈ కృప మనకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని గ్రహించాలి.
మరియ ఎవరిని ఆరాధిస్తుంది?
46 వ వచనంలో "ప్రభువును" అనే మాటను చదువుతున్నాం.
48 వ వచనంలో "నా రక్షకుడైన దేవునియందు" అనే మాట చూస్తున్నాం.
అయితే యేసే మెస్సీయా అని, లోక రక్షకుడు అని మరియకు తెలుసా?
తన ద్వారా జన్మించబోతున్నవాడు లోక రక్షకుడని మరియకు ఖచ్చితంగా తెలుసు.
30 - 33 వచనాలలో పుట్టబోయే బిడ్డ గురించి దూత చెప్పిన మాటలను బట్టి ఎవరైనా యిట్టె గ్రహించవచ్చు.
కాబట్టి మెస్సీయా తన ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడన్న సంగతి ఆమె "తన రక్షకుడైన దేవుణ్ణి స్తుతించేలా, ఆరాధించేలాగా చేసింది."
దేవుడు తన రక్షకుడిగా ఉన్నాడు అనే దాన్ని బట్టే ప్రధానంగా మరియ దేవుణ్ణి ఆరాధిస్తుంది.
# విశ్వాసులమైన మన విషయంలో కూడా, మన ఆరాధన యొక్క ప్రధాన అంశం ఏమయ్యుండాలి అంటే ‘దేవుడు మనలను మన పాపము నుండీ రక్షించాడు, మనం పొందుకోవాల్సిన శిక్ష నుండీ తప్పించాడు.’
అలా కాని పక్షంలో దేవుణ్ణి ఆరాధించడం సాధ్యపడదు.
మరియ ఎందుకు ఆరాధిస్తుంది? కారణాలేంటి?
49 – 55 వరకూ ఉన్న వచనాలను చదవగానే ఆమె పాత నిబంధన లేఖనాలను ఎంత బాగా విని, గుర్తుపెట్టుకుందో అర్ధమవుతుంది. ఆ రోజుల్లో ఎవరి బైబిల్ కాపీ వాళ్ళకి ఉండేది కాదు, మనకు లాగా. సమాజమందిరాలలో మాత్రమే తరచూ ధర్మశాస్త్రమూ ఇతర పాత నిబంధన లేఖనాలూ బోధించబడేవి. అప్పుడు విని గుర్తుపెట్టుకోవలసిందే. బహుశా ఓ పదమూడు ఏళ్ళు ఉండి ఉండవచ్చు మరియకి. అంత చిన్న అమ్మాయి మనసులో లేఖనాలు ఇంతలా నాటుకుపోయి, ఆమెఆరాధనలోనుండి ఆ సంగతులే పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా సంఘంలోని యవ్వనస్థులందరూ ఇలా ఉంటె ఎంత బాగుండు.
# మనం ఎం చెయ్యాలంటే - మనస్సు పెట్టి లేఖనాలను పరిశోధిస్తూ, లోతుగా వాటిని త్రవ్వి, ధ్యానించే పనిని అనుదినము చేస్తామని తీర్మానించుకోవాలి.
కొలస్సీ 3:16 -
"16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలోసమృద్ధిగా నివసింపనియ్యుడి".
అందులో భాగంగానే, ఓక నిజమైన క్రైస్తవుడు బైబిల్ చరిత్రను పరిశీలనగానూ, క్రమంగానూ నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. తద్వారా దేవుడు పరిశుద్ధుల జీవితాల్లో ఎలా పనిచేస్తూ వచ్చాడో నేర్చుకోవచ్చు. దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి వారితో దేవుడు ఎలా వ్యవహరించాడో మనతో కూడా అలాగే వ్యవహరిస్తాడు, రాబోయే తరాల వారితో కూడా అలాగే వ్యవహరిస్తాడు. అసలు మనం దేవుడి దగ్గరి నుండి ఎం ఆశించాలో, ఏవి ఆశించకూడదో నేర్చుకుంటాము. కృంగిపోయినసందర్భాలలో భక్తుల జీవితాలు మనల్ని ప్రోత్సహిస్తాయి, బలపరుస్తాయి. దేవుని వాక్య జ్ఞానాన్ని తన మదిలో సమకూర్చుకునేవాడు ధన్యుడు. ఆ జ్ఞానం అతన్ని సహనశీలిగానూ, నిరీక్షణ కలిగిన వానిగాను చేస్తుందని గుర్తుంచుకోండి.
మరియ ఆరాధనకు మూడు ప్రధాన కారణాలు:
మొదటిది,
"49. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము"
“సర్వశక్తిమంతుడైన” దేవుడు ఆమె జీవితంలో “గొప్పకార్యములు చేసెను”. అవి ఎంత గొప్పవి, అద్భుతమైనవి అంటే తరువాత వచ్చే తరాలన్నీ ఆమెను “ధన్యురాలని” అంటాయి. మెస్సీయాకు తల్లి అవ్వడమంటే, అటువంటి గొప్ప ఆధిక్యత మరి ఏ ఇతర స్త్రీ కి అంతవరకూ లభించలేదు, ఇక లభించదు కూడా. అంత కంటే ప్రాముఖ్యంగా ఎందుకు పనికిరాని పాపాత్మురాలైన ఆమెకు, కేవలం దేవుని కృపను బట్టి రక్షణ పొందిన ఆమెకు, దేవుని కుమారుని కనే అవకాశం లభించడాన్ని బట్టి ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది.
"ఆయన నామము పరిశుద్ధము" - విశ్వాసులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యత్వములో ఆయనను స్తుతిస్తూ ఉంటారని ప్రకటన గ్రంథంలో చదువుతాము.
రెండవది, భవిష్యత్తులో దేవుడు ఇతరులకు ఎం చెయ్యబోతున్నాడో, అందును బట్టి ఆమె దేవుణ్ణి స్తుతిస్తోంది.
"50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును."
కీర్తన 103:17,18 -
"17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
- ఆయన కృపయుగయుగములు నిలుచును..."
యూదా 3 -
"3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను."
ఆ "అందరికీ కలిగేడు రక్షణ" గురించే మరియ కూడా దేవుణ్ణి స్తుతిస్తోంది.
చివరిగా, దేవుడు గతంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తుంది. అది యూదుల పద్ధతి - దేవుని గుణగణాలను బట్టి మాత్రమే కాకుండా, దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. మరియ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాటిని తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తోంది.
“51 . ఆయన తన బాహువుతో తన పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను."
ఆ పరాక్రమ కార్యములలో మొదటిది, దేవుడు "వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను"
బహుశా ఫరోనీ అతని సైన్యాన్నీ దేవుడు ఎలా చెదర గొట్టాడో అదే మరియ మనస్సులో ఉండి ఉండవచ్చు.
నిర్గమ 5:2 -
"2. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను."
ఆ తరువాత ఫరో సైన్యానికి ఏమైందో నిర్గమ 15 వ అధ్యాయంలో చదువుతాము.
బహుశా నెబుకద్నెజరు గురించి కూడా ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు.
దానియేలు 5:20 -
"20. అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను"
దేవుని చేత క్రమశిక్షణ చేయబడిన తరువాత అతను ఏమంటాడు అంటే -
దానియేలు 4:37 -
"37. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచుకొనియాడుచు ఘన పరచుచు నున్నాను."
"52. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను"
బహుశా యెహోషువా కాలంలో ఇశ్రాయేలీయులు కనానీయులపై యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేసిన దాని గురించి ఆలోచిస్తూ మరియ ఈ మాటలు పలికి యుండవచ్చు. అప్పుడు గానీ ఆ తరువాత న్యాయాధిపతుల కాలంలోనే గానీ, రాజుల కాలంలోనే గానీ ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి వారిని రక్షించాడు.
“53. ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.”
ఆయన తన దయను బట్టి, కృపను బట్టి "ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి" తీర్పులో ఆయన "ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను."
“54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు
- ఆయన తన సేవకుడైనఇశ్రాయేలునకు సహాయము చేసెను."
ఇశ్రాయేలు చరిత్రను పరిశీలిస్తే దేవుడు “తన కనికరము”ను బట్టి “తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసినట్లు” చూస్తాము.
ఆది 12 వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసినట్లు చదువుతాము. అబ్రాహాముకీ ఆ తరువాతి పితరులకీ దేవుడు ఏదైతే వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే ఆ తరువాతి చరిత్రంతా అని మరియ గ్రహించినట్లుంది. అందుకే “అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చి” ఆ ప్రకారమే వారికి సహాయం చేసాడు అని చెప్పి ఆ అబ్రాహాము నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ మరియ తన స్తుతికీర్తనని ముగిస్తుంది.
# మరియ చేసిన విధంగా దేవుడు బైబిల్ లో మనకు అనుగ్రహించిన వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. మనం శాంతంగా ఉండటానికి ఇది ఎంతో ప్రాముఖ్యం. అరణ్యం వంటి ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం ప్రతి రోజూ తినవలసిన ఆహారమూ, మన్నా - దేవుని వాగ్దానాలు, అనునిత్యం త్రాగవలసిన పానీయం - దేవుని వాగ్దానాలు. మనము క్రీస్తును చూడలేదు, పరలోకాన్నీ చూడలేదు కానీ మనం విశ్వాసం చేత జీవించే వారము. అయితే మన విశ్వాసము దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఉంది. మనము ధైర్యంగా నిశ్చయంగా ఆ వాగ్దానాలపై ఆనుకోవచ్చు. దేవుడు ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడం మనం కూడా చూస్తాము. అందునుబట్టి మరియకు లాగ దేవుణ్ణి స్తుతిస్తాము కూడా.
"56. అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను."
ఇంత వరకూ మనం మరియ దేవుణ్ణి స్తుతించడం చూసాం ఇక ఇక్కడి నుండీ యోహాను యొక్క పుట్టుకకు సంబంధించిన వృతాంతాన్ని చోడబోతున్నాం. ఎలిజబెతు ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మరియ ఎలిజబెతు జెకర్యాలతోఉండటానికి వాళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పటికి ఎలీజబేతు ఆరు నెలల నుండీ గర్భవతిగా ఉంది.
"26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో".
ఇక ఇప్పుడు అంటే “మూడు నెలల” తరువాత ఆమె తిరిగి వెళ్ళిపోతోంది. ఎలిజబెతుకి ఆరు నెలలు ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి సరిగ్గా యోహాను పుట్టబోయే సమయానికి కాస్త ముందు ఆమె తిరిగి వెళ్ళిపోయుండొచ్చు. ఎలిజబెతు వృద్ధాప్యమందు గర్భం ధరించడాన్ని గుర్తుగా దూత చెప్పినప్పటికీ అప్పటికే మూడు నెలలు కాబట్టి ఆమె స్వయంగా తానే గర్బవతినని గ్రహించి ఉండవచ్చు. కాబట్టి ఇక గుర్తుతో పని లేదు. తనకు ఇంకా యోసేపుతో వివాహం కాలేదు కాబట్టి తన ఇంటికి (అంటే తన తల్లి దండ్రుల దగ్గరికి) తిరిగి వెళ్ళిపోయింది. తిరిగి వెళ్లిన తరువాత యోసేపు ఎం చేసాడు, ఆ సంగతులన్నీ మత్తయి 1: 18 -20 వచనాల్లో చదువుతాము.
ఇలా ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పులను చూస్తుంటే, దేవుని వాగ్దానాలు ఎంత సత్యమైనవో, ఎంత ఖచ్చితంగా అవి నెరవేర్పులోనికి వచ్చి తీరతాయో అర్థం చేసుకోవచ్చు.
దేవుని వాగ్దానాల గురించి, వాటి నెరవేర్పు గురించి బైబిల్ ఇంకా ఎం చెప్తుందో కొన్ని వచనాలను చదివి తెలుసుకుందాం.
యెహోషువ 21:45 -
"45. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను."
1 రాజులు 8:56 -
"56. ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు"
2 కొరింథీ 1:20 -
"20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి."
హెబ్రీ 10:23 -
"23. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము."
సంఖ్యా 23:19 -
"19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?"
# అటువంటి వాగ్దానాల పై అనుకోవడం మనం నేర్చుకోవాలి. వాటిని ఎత్తి పట్టి ప్రార్ధించడం అలవాటు చేసుకోవాలి, వాటిని మన హృదయాల్లో పదిలంగా భద్రపరచుకోవాలి.
VI. యోహానుపుట్టుకను గురించిన వృత్తాంతము (లూకా 1: 57 – 66)
దేవుడు తన దూతయైన గబ్రియేలు ద్వారా జెకర్యాకు వాగ్దానం చేసాడు.
"13. అప్పుడా దూత అతనితో - జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు."
ఆ వాగ్దానానికి నెరవేర్పుగా -
"57. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.
- అప్పుడు ప్రభువుఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి."
ఎంతో కాలం నుండీ ఎదురు చూస్తూ ఉన్న ఎలిజబెతుకి కుమారుడు పుట్టడం తద్వారా తాను గొడ్రాలు అన్న అవమానం నుండి తొలగించబడటాన్ని బట్టి ఆమె సంతోషించింది. అంత మాత్రమే కాదు "ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి."
# ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు, ఒక క్రైస్తవుడు సహజంగానే వారితో కూడా సంతోషిస్తాడు. దేవుడు నీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఇతరులకు చేసిన మేళ్లను బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. ఈర్ష్య పడకూడదు.
సరే ఈర్ష్య పడకూడదు, మరేం చెయ్యాలి అని వాక్యం చెబుతుంది -
రోమా 12:15, 16 -
"15. సంతోషించు వారితో సంతోషించుడి;
- ఏడ్చువారితోఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి....."
మన ప్రభువే ఈ విషయంలో మనకు మాదిరిగానున్నారు.
యోహాను 2:1 -
"1. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.
- యేసుతల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి."
యోహాను 11: 35 -
"35. యేసు కన్నీళ్లు విడిచెను."
ఎలిజబెతు, ఆమెతో కూడా ఉన్నవారు "ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని" చెప్పి దేవుణ్ణి స్తుతించారు.
వృద్దాప్యంలో పిల్లలు లేకుండా ఉన్న ఆ వృద్ధ దంపతుల వేదనను చూసిన దేవుడు, వారు దేనికీ యోగ్యులు కానప్పటికీ తన ప్రేమను బట్టి ఇలా వారికి కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా తన మహాకనికరమును కనపరిచాడు.
"59. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా"
"ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి"
సున్నతి చెయ్యడం వల్ల భార్యాభర్తలిద్దరికీ ఆరోగ్య రీత్యా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇలా సున్నతి చేయడం ద్వారా చాలా అనారోగ్యాల నుంచీ వారు తప్పించబడ్డారు.
అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది - దేవుడు అబ్రాహాముకి చేసిన నిబంధనకు ‘సున్నతి’ గుర్తుగా ఉంది.
ఆది 17: 10, 11 -
"10. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
- మీరు మీగోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును."
కాబట్టి సున్నతి ఫలానా వారు ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వారు అని తెలియజేసే గుర్తుగా ఉండింది.
సాధారణంగా ఈ సున్నతి చేయడం అనేది తండ్రి చేస్తాడు లేదా ఆ పని చేయడం కోసం నియమించబడిన వ్యక్తి చేస్తాడు. బైబిల్ లో ఒకే ఒక్క సందర్భంలో మాత్రం ఒక స్త్రీ ఆ పని చేసినట్లుగా చదువుతాము.(నిర్గమ 4:25 )
ఈ ఒక్క సందర్భం మినహాయిస్తే, ఈ పనిని పురుషులే చేసేవారు.
అయితే తరువాత యూదుల ఆచారంలో వచ్చిన మార్పు ఏంటంటే, సున్నతి చేసేటప్పుడు కనీసం ఓ పది మంది సాక్ష్యులు ఉండాలి అని, అవసరమైతే తరువాత వారు సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.
ఈ సున్నతి చేసే రోజే పేరు పెట్టాలి అనే ఆచారం పాత నిబంధనలో లేదు కానీ మొదటి శతాబ్ద కాలంలో చాలా సర్వ సాధారణంగా యూదులు దీనిని ఆచరించారు. మోషే తాను పుట్టిన తరువాత ఎనిమిదవ రోజే సున్నతి చేయబడ్డాడు, పేరు కూడా పెట్టబడింది అలాగే అబ్రాహాము విషయంలో కూడా తనకు సున్నతి చేయబడిన రోజే అతనికి ఒక కొత్త పేరు కూడా అనుగ్రహించబడింది. వీరిని బట్టి ఎనిమిదవ రోజు పేరు పెట్టడమనేది ఒక ఆచారంగా అవతరించి ఉండొచ్చు.
ఆది 17: 5, 23, 24 -
"5. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.
- అప్పుడుఅబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను
- అబ్రాహాముగోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు."
ఏది ఏమైనా అక్కడ సాక్ష్యులుగా ఉండటానికి పోగైన వారు మాత్రం ఆ పుట్టిన వాడికి పేరు పెట్టడంలో నిమగ్నం అయ్యారు. ఇలా పేరు పెట్టడంలో ఇరుగు పొరుగువారు పాల్గొనడం వింతేమీ కాదు.
రూతు 4:17 -
"17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి."
పిల్లలు లేకుండా ఎంతో వేదన అనుభవించిన తమ నమ్మకమైన యాజకుడి గౌరవార్థం, ఆ బిడ్డకు "తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా" అని చదువుతున్నాము.
పుట్టిన మొదటి కొడుకుకి తండ్రి పేరు పెట్టడం ఆ రోజుల్లో మామూలే, తాతల పేర్లు పెట్టడం ఇంకా సర్వసాధారణం.
రూతు 4:17 -
"17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి."
యూదుల సంస్కృతిలో పేర్లకు అర్ధాలు ఉండేవి.
కొన్ని సార్లు బిడ్డ చూడటానికి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి పేరు పెట్టేవారు.
ఆది 25: 26 -
"25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి."
కొన్ని సార్లు తల్లి తండ్రుల యొక్క సంతోషాన్ని సూచిస్తుంటాయి ఉదాహరణకు "అడిగిన వాటిని పొందుకున్నాము" అని అర్థమొచ్చేలా ఉండేవి పేర్లు. సౌలు, సమూయేలు పేర్లు అదే అర్దానిస్తాయి.
ఏలీయా అనే పేరు తన తల్లి తండ్రుల యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఆ పేరుకి "యెహోవాయే దేవుడు" అని అర్థం వస్తుంది.
"60. తల్లి - ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను."
"తల్లి - ఆలాగు వద్దు" అని తన తండ్రి పేరే బిడ్డకు కూడా పెట్టాలని చూస్తున్న వారిని ఆపింది తల్లియైన ఎలీసబెతు. ఆమె మాటలకు ఎలాంటి అర్థం వస్తుంది అంటే - అస్సలు వద్దు, అలా ఎట్టి పరిస్థితుల్లో జరక్కూడదు, అలా జరగడానికి వీల్లేదు. యోహాను అని ఆ బిడ్డకు పేరు పెట్టమని గబ్రియేలు దూత జెకర్యాతో చెప్పాడు. ఈ విషయం జెకర్యా ఎలీసబెతుతో చెప్పాడో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం ఆ పేరే పెట్టాలని అంటోంది.
"వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను." అని చదువుతున్నాము.
1:13 -
"13. అప్పుడా దూత అతనితో - జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు."
దేవుడే పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలో ముందుగానే నిర్ణయించేసినట్లు చదువుతున్నాము. అలా దేవుడు కొందరి విషయంలో జోక్యం చేసుకొని పేర్లు పెట్టడం మనం చూస్తాం
ఆది 17:19 -
"19. దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు....."
యెషయా 8:3 -
"3. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము."
హోషేయా 1:4, 6 , 9
"4. యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము...."
- పిమ్మట ఆమె మరలగర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము;"
- యెహోవాప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము."
మత్తయి 1:21 -
"21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను."
యోహాను కుటుంబంలోని అందరి పేర్లు భలే అర్ధవంతంగా ఉంటాయి.
యోహాను అంటే దేవుడు కృపగలవాడు అని అర్థం. మెస్సీయా లేదా రక్షకుడికి ముందు నడిచే వాడు, మార్గం సిద్ద పరిచే వాడు అయిన ఇతని పేరు కాబట్టి రాబోయే రక్షణ రూపంలో వెల్లడవ్వబోయే కృపనే ఆ పేరు సూచిస్తూ ఉండవచ్చు.
దేవుని యొక్క ఈ లక్షణాన్ని గురించి వాక్యం ఎం చెబుతుందంటే -
ఆయన పాపులను కరుణించడం ద్వారా సంతోషించేవాడు. తన ప్రజలైన వారు ఏ శిక్షకైతే పాత్రులో ఆ శిక్ష వారిమీదికి రాకుండా నిలిపివేసి, వారిని ఆశీర్వదించే వాడు, అలా ఆశీర్వదింలో ఆయనకు ఎంతో సంతోషం ఉంది.
ఎఫెసీ 1:9 -
"9. మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను."
ఎఫెసీ 2:8 -
"8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే."
1 పేతురు 5:10 -
"10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును."
హెబ్రీ 4:16 -
"16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము."
ఇంకా బైబిల్ లోని అనేక వచనాలు దేవుని కృపను వివరిస్తున్నాయి .
అతని తల్లి తండ్రుల పేర్లు జకర్యా , ఎలీసబెతు. ఈ పేర్లు కూడా దేవుని యొక్క విమోచనా ప్రణాళికను సూచిస్తూ ఉన్నాయి.
జెకర్యా అంటే "దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు" (గాడ్ రెమెంబెర్స్) అని అర్థం. అంటే దేవుడు తన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉంటాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఎలీజబెతు అంటే "నా దేవుడు ఒక వాగ్దానం". మరో విధంగా చెప్పాలంటే - "దేవుడు ఆనుకొనదగినవాడు, నమ్మదగిన వాడు" అని అర్థం.
వీరిద్దరి పేర్లు దేవుని యొక్క నమ్మకత్వాన్నే సూచిస్తున్నాయి.
అయితే అక్కడున్న వారు వెనక్కి తగ్గి ఇలా అన్నారు -
"61. అందుకు వారు - నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి"
ఎలిజబెతు తమ బంధువులలో ఎవరికీ లేని ఆ పేరుని పెట్టమని అనడం ద్వారా యూదుల అలవాటుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు వారి మాటల్ని బట్టి అర్థం అవుతోంది. ఒకవేళ ఆమె తన పరిధి దాటి మాట్లాడుతున్నదని వారనుకున్నారో ఏమో, ఆమెతో కాదని ఆమె భర్త దగ్గరికి అంటే ఆ పిల్లవాడి తండ్రి దగ్గరికి వెళ్లి అడిగారు.
అయితే దేవుని మాటలయందు విశ్వాసముంచకపోవడాన్ని బట్టి జెకర్యా క్రమశిక్షణ చేయబడ్డాడు కాబట్టి అతను మాట్లాడలేని, వినలేని స్థితిలో ఉన్నాడు.
1:22 -
"22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸"
ఈ వచనంలో వాడిన "మూగవాడైన" అనే పదానికి చెవిటివాడు అని కూడా అర్థం వచ్చేలా ఇతర వాక్యభాగాల్లో ఇదే పదం వాడబడింది ( 7:22; మత్తయి 11:5; మార్కు 7:32,37; 9:25 ).
"62. వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి."
ఈ మాటల్ని బట్టి కూడా అతను మూగవాడు మరియు చెవిటివాడు కూడా అని అర్ధమవుతోంది. ఎందుకంటే ఒక వేళ అతను వినగలిగే వాడైతే సైగ చేసి మాట్లాడాల్సిన అవసరమేముంది, మామూలుగా మాట్లాడితే సరిపోయేదిగా.
ఇక వారు అడిగిన దానికి జవాబుగా జెకర్యా -
"63. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి."
"అతడు వ్రాతపలక తెమ్మని" చెప్పాడు. బహుశా జెకర్యా కొన్ని నెలలుగా ఇలాగే ఇతరులతో సంభాషిస్తూ ఉండి ఉంటాడు.
"వాని పేరు యోహానని వ్రాసెను;"
ఎలిజబెతు అయితే "వానికి యోహానను పేరు పెట్టవలెనని" చెప్పింది కానీ జెకర్యా మాత్రం "వాని పేరు యోహాను" అని ఖచ్చితంగా తేల్చి చెప్పేసాడు.
దూత అతనికే స్వయంగా చెప్పాడు కాబట్టి ఇక దేవుని నిర్ణయమే తుది నిర్ణయం అయ్యింది. "అందుకు వారందరు ఆశ్చర్యపడిరి."
ఆ పిల్లవాడి పేరు విషయంలోనే ఆశ్చర్యపోతే ఇక ముందు జరిగేది చూసి ఇంకెంత ఆశ్చర్య పోతారో.
"64. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను."
వారి ఆశ్చర్యానికి తోడు, దేవుని శక్తి వారికి బయలుపరచబడింది. తొమ్మిది నెలల నుండి జెకర్యా చెవిటివాడిగా, మూగవాడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు "వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచుమాటలాడసాగెను." అని చదువుతున్నాము.
"వెంటనే" అని చాలా తరచుగా ఈ సువార్త అంతటిలో కనిపిస్తూ ఉండే ఈ మాట ఎప్పుడూ దేవుడు చేసే అద్భుతాలతో ముడిపడి ఉంది. (4:39; 5:25; 8:44, 47, 55; 13:13; 18:43)
ఈ రోజుల్లో స్వస్తత మహా సభల్లో జరిగే మోసాల్లాగా కాకుండా కొత్త నిబంధలో స్వస్థతలు వెంటనే జరిగేవి.
# నూనె, డబ్బాలు డబ్బాలు అయిపోతుంది కానీ స్వస్థత మాత్రం జరగదు. విశ్వాసి విశ్వాసాన్నే శంకిస్తారు. కానీ కొత్త నిబంధన చరిత్రలో అలా జరగలేదు.
గబ్రియేలు చెప్పిన విధంగానే -
1:20 -
"20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను."
ఈ మాటలు నెరవేరతాయి.
"వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను."
అప్పటి వరకూ తన మనసులో దాచుకున్నదంతా వెళ్ళగక్కాడేమో జెకర్యా. అతను మాట్లాడిన వాటిని ఇంకా వివరంగా 67-79 వరకూ ఉన్న వచనాల్లో చదువుతాము.
ఇక ఆ అద్భుతం చూసిన తరువాత, దేవుని శక్తిని రుచి చూచిన వారై
"65. అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను."
"ఆ సంగతులన్నియు" అంటే జెకర్యాకు దూత ప్రత్యక్షమయిన దగ్గరి నుండీ మొదలుకొని అన్ని సంగతులూ. కేవలం వాళ్ళ ఊరిలో మాత్రమే కాదు, "యూదయ కొండసీమాయందంతట ప్రచారమాయెను".
"వారందరికీ భయము కలిగెను" అన్న మాట చూస్తున్నాము.
# దేవుడు చేసిన మహత్తరమైన కార్యాలు విన్నప్పుడు, మనకు కూడా దేవుని పట్ల భక్తితో కూడిన భయమూ గౌరవమూ పెరగాలి.
అలా విన్నవారు అందరూ -
"66. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి."
కాబట్టి అతని గురించిన సంగతులన్నీ విన్నవారికి యోహాను భవిష్యత్తుని గురించి ఉత్కంఠగా ఉండి ఉండవచ్చు. మెస్సీయాకి ముందు నడిచే వాడు పుట్టాడు అంటే మెస్సీయా వచ్చే సమయం కూడా ఆసన్నమయిందని అనుకొని ఉండవచ్చు. ఎవ్వరూ తృణీకరించని, త్రోసిపుచ్చని అభిప్రాయం ఏంటంటే - "ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను" అన్నది.
VII. జెకర్యా పాడిన పాట (లూకా 1: 67 – 80)
67 - 80 వరకూ ఉన్న వచనాల్లో జెకర్యా పాడిన పాట చూస్తాము.
పాటలు పాడటం గురించి చెప్పబడిన కొన్ని కొత్త నిబంధన వచనాలు ఇవి -
ఎఫెసీ 5: 19 -
"19. ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
- మన ప్రభువైనయేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,"
కోలస్సీ 3:16 -
"16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలోసమృద్ధిగా నివసింపనియ్యుడి."
కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాట ద్వారా దేవుణ్ణి స్తుతించడం అనేది ఎప్పటి నుండో ఉన్న అలవాటే.
నిర్గమకాండం 15 లో ఎర్ర సముద్రం దాటిన తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు సైన్యం చేతుల్లోనుండీ రక్షించాడు కాబట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడినట్లు మనం చూస్తాము.
అలాగే న్యాయాధిపతుల గ్రంధం 5 వ అధ్యాయంలో దెబోరా బారాకులు దేవుడు వారిని విమోచించినందుకు గానూ పాట పాడతారు.
సమూయేలు పుట్టినప్పుడు హన్నా పాట పాడుతుంది.
కీర్తన గ్రంథం నిండా పాటలే. యూదులు కీర్తన గ్రంథాన్ని పాటల పుస్తకం లాగా వాడేవారు.
ఇక ప్రకటన గ్రంథంలో పరలోకంలో పాడే పాటల గురించి రాయబడింది.
అంత మాత్రమే కాదు ఈ లూకా సువార్తలోనే మొదటి రెండు అధ్యాయాల్లో అయిదు స్తుతి పాటల్ని మనం చూడొచ్చు -
మొదటిది, ఎలీసబెతు పాడిన పాట 1: 41 - 45
రెండవది మరియ పాడిన పాట 1: 46 - 55
మూడవది జెకర్యా పాడిన పాట 1: 67 - 79
నాలుగవది యేసు పుట్టినప్పుడు దూతలు పాడినది 2 : 13 - 14
అయిదవది షిమ్యోను పాడినది 2: 25 - 32
మరియ పాడిన పాటను మనం ధ్యానించాము కదా, అందులో పాత నిబంధనకు సంబంధించిన అంశాలు ఎన్నో వినిపించకనే విన్పించాయి. ఆమె మాటలు లేదా వాడిన పదాలను బట్టి పాత నిబంధనలో ఏ సన్నివేశాన్ని ఆధారం చేసుకొని ఆమె అలా అంటుందో యిట్టె చెప్పగలం. అదే విధంగా జెకర్యా ఒక యాజకుడు కాబట్టి ఇతని పాటలో కూడా పాత నిబంధనకు సంబంధించిన విషయాలు ఎక్కువగానే వినబడుతుంటాయి.
మొత్తం పాత నిబంధనలో 6 నిబంధనలు కనబడతాయి. నోవాహు, మోషే, యాజకులతో దేవుడు చేసిన నిబంధన, ఇవి రక్షణకి సంబందించినవి కాదు, వాటిని నాన్ - సాల్విఫిక్ నిబంధనలు అంటారు. అంటే వాటిలో నిత్యత్వానికీ, ఆత్మ యొక్క రక్షణకు సంబంధించిన విషయాలు ఉండవు. మిగిలిన మూడు నిబంధనలు మన రక్షణకు సంబంధించినవి. కాబట్టే వీటిని సాల్విఫిక్ నిబంధనలూ అంటారు. జెకర్యా యొక్క ఈ పాటలో మనం ఆ మూడు నిబంధనలు చూడొచ్చు.
అవేంటంటే దావీదు నిబంధన, అబ్రాహాము నిబంధన మరియు కొత్త నిబంధన.
అయితే ఈ కొత్త నిబంధనకు వేరుగా ఎవరూ ఇతర రెండు నిబంధనల్లోని వాగ్దానాలను సొంతం చేసుకోలేరు.
ఈ మూడు నిబంధనలు, వాటి నెరవేర్పు గురించి ఇలా ఒకే చోట ప్రస్తావించబడటాన్ని బట్టి క్రెస్తవ్యం ఏదో కొత్త మతం కాదు, అది పాత నిబంధన యొక్క కనసాగింపు, నెరవేర్పు మాత్రమే అని గ్రహించగలము. ఆ నెరవేర్పు యేసు క్రీస్తులో జరిగింది.
ఇంతకీ జెకర్యా ఎందుకు పాట పాడుతున్నాడు అంటే -
అప్పటి వరకూ అంటే ఆ తొమ్మిది నెలలు జరిగిన సంగతులన్నీ తలపోసుకుంటూ సంతోషం పట్టలేక అది ఈ పాట రూపంలో పొంగి పొర్లుతుంది. అతని హృదయం బద్దలై ఈ స్తుతి పాట బయటికి తన్నుకొస్తోంది.
జెకర్యా పాటను బట్టి మరో సంగతి మనకు అర్థం కావాలి. జెకర్యా కేవలం తండ్రి అయ్యాడని మాత్రమే సంతోషించడం లేదు. అతని సంతోషానికి కారణమైన మరో ప్రాముఖ్యమైన సంగతి ఉంది. తన హృదయమంతా నిండిన సంతోషానికి కారమైనఆ సంగతి చేతనే తన పాట, మాట అంత నిండిపోయి ఉంది.
మత్తయి 12: 34 -
"...........హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా."
ఇక ఆ పాటను సంగతికొస్తే -
“67. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను”
ముందు వచనాల్లో జెకర్యా యొక్క భార్య(1:41), కుమారుడు(1:15) పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చదివుతాము. ఇప్పుడు "జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై"నాడని చదువుతున్నాము.
దేవుని ఆత్మ శక్తి జెకర్యా మీదకి దిగి వచ్చింది. జెకర్యా "ప్రవచించెను" అని చదువుతున్నాము.
"ప్రవచించెను" అనే మాటకి అర్థం ఏంటంటే - "మాట్లాడుట", "దేవుని వాక్యాన్ని ప్రకటించుట, బోధించుట, వివరించుట". జెకర్యా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి నిజంగా దేవుని మాటలనే పలికాడు.
“68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక”
జెకర్యా తన పాటను ప్రారంభిస్తూ ఇలా అన్నాడు - " ప్రభువైన ..... దేవుడు స్తుతింపబడునుగాక"
సాధారణంగా పాత నిబంధనలో పాటల ప్రారంభాలు ఇలాగే ఉండేవి.
పౌలు కూడా తన పత్రికల ప్రారంభంలో దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం గమనించవచ్చు. జెకర్యా కూడా తన నోరు తెరవబడిన వెంటనే మొదటి మాటతోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు (మనకి ఇక్కడ రాయబడి ఉన్న వివరణ ఆధారంగా).
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ప్రతి క్రైస్తవుడు దేవుడు తన కిచ్చిన ఆధిక్యతలను క్రమంగా మర్చిపోతుంటాడు, వాటిని గురించిన ఆలోచనలు మెల్లిగా మసకబారిపోతుంటాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను హృదయంలో భద్రపరచుకొని, అనుదినం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ జెకర్యా వలె దేవుణ్ణి స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి.
"ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక"
యోహాను 4:22 - "....రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది." అని యేసు క్రీస్తు అన్నాడు.
పౌలు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ -
రోమా 9:4,5 -
"4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
- పితరులువీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్."
దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాల నెరవేర్పే దేవుని విమోచనా ప్రణాళిక.
“69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను”
"ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి".
దేవుడు దర్శించడము అనే మాట పాత నిబంధనలో తరచూ వినబడుతూ ఉంటుంది. అయితే దేవుని తీర్పుకు సంబంధించిన సందర్భాల్లో కానీ లేదా దేవుడు ఆశీర్వదించిన సందర్భాల్లో కానీ ఈ మాట వినబడుతుంది. ఇక్కడ మాత్రం రక్షణ/ విమోచన అనే ఆశీర్వాదాన్ని గురించి ఆ మాట వాడినట్లు చూస్తున్నాం.
"ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను". ఈ విమోచన మన ఆత్మల రక్షణకు సంబంధించినది. కొంత వెల చెల్లించి లేదా మూల్యం చెల్లించి ఎవరినైనా బానిసత్వంలో నుండీ, చెరలో నుండీ విడిపించే సందర్భంలో ఈ పదాన్ని వాడేవారు. మరో విధంగా చెప్పాలంటే, ‘కొనుక్కోవడం’ అనమాట. అంటే ఆ విమోచించబడిన వ్యక్తికి ఈ కొనుక్కున్న వ్యక్తే యజమాని అనే కోణంలో కూడా ఈ పదాన్ని అర్థం చేసుకోవచ్చు.
పాపులు దేని నుండీ విమోచించబడతారు అని వాక్యం చెబుతుంది అంటే -
యోహాను 8:34 -
"34. అందుకు యేసు - పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
ఈ వచనం ఆధారంగా విమోచన అంటే పాపపు దాస్యత్వం నుండీ విడిపించబడటం అని అర్థం చేసుకోవచ్చు.
గలతీ 3:13 -
"13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను;"
ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి
సాతాను యొక్క బంధకాల నుండి విడిపించుటకు,
దేవుని చేత ఎన్నుకోబడిన వారు విమోచించబడటానికి చెల్లించబడిన మూల్యం ప్రభువైన యేసు క్రీస్తు చేసిన బలి అర్పణ. మరణానికి తనని తానే అప్పగించుకొన్నాడు యేసు క్రీస్తు.
రోమా 3:24 -
"24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు."
ఎఫెసీ 1:7 -
"7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది."
ఈ విమోచన ఎప్పుడో వాగ్దానం చెయ్యబడింది, ఆదికాండములోనే, కానీ జెకర్యా నాటికి ఇంకా కార్యరూపంలోకి రాలేదు. జెకర్యా ఈ పాట పాడినప్పుడు అతని కుమారుడైన యోహాను ఎనిమిది రోజుల బాలుడు. యేసు ఇంకా పుట్టనేలేదు కానీ "ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను" అని అంటున్నాడు జెకర్యా.
దేవుడు వాగ్దానం చేస్తే దానిని తప్పక నెరవేరుస్తాడన్న సత్యాన్ని జెకర్యా ఎంత రూఢీగా నమ్ముతున్నాడు అంటే ఆ విమోచన అప్పటికే వారికి అనుగ్రహించబడినట్లుగా పాడుతున్నాడు.
పాత నిబంధన భక్తులు దేవుని వాగ్దానాలపై ఎలా ఆధారపడేవారో, ఎలా వాటి యందు విశ్వాసం ఉంచేవారో జెకర్యాను చూస్తే అర్థం అవుతోంది. మనం కూడా దేవుని వాగ్దానాల పై ఆనుకోవడం నేర్చుకోవాలి.
దూత మాటలను జెకర్యా స్వయంగా విన్నాడు, ఎదురుగా అద్భుత రీతిన పుట్టిన తన కుమారుడైన యోహాను ఉన్నాడు, యోహాను విషయంలోనూ మరియ విషయంలోనూ పాత నిబంధన వాగ్దానాలు నెరవేరుతున్నాయి. దేవుడు తన ప్రజలను దర్శించబోతున్నాడు, వారు రక్షించబడటానికి కావాల్సిన ఏర్పాటేదో చెయ్యడం ప్రారంభించాడు అని జెకర్యాకు అర్థం అయ్యింది.
అయితే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఐగుప్తు చెరలో నుంచీ విడిపించాడో అలాగే ఇప్పుడు కూడా రోమా సామ్రాజ్యపు చెరలో నుండీ విడిపించాలని యూదులు ఆశపడ్డారు. మెస్సీయా వచ్చి తమను విడిపిస్తాడని ఎంతో కాలం ఎదురుచూసారు. దేవుడు తమను అలా విమోచించి, ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకున్నారు. నూతన నిబంధన ద్వారా అనుగ్రహించబడే పాప క్షమాపణకు వేరుగా వారు రక్షించబడటం సాధ్యపడదని వారు గ్రహించలేదు.
“70. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా”
"తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును.....కలుగజేసెను".
విమోచన గురించి మాట్లాడుతూ జెకర్యా దేవుడు మన కొరకు “రక్షణశృంగమును” కలుగజేసాడు అని అంటున్నాడు.
పాత నిబంధనలో ఈ మాట అనేక చోట్ల కనబడుతుంది. కీర్తనలలో ఎక్కువ సార్లు కనబడుతుంది.
కీర్తన 18:2 -
"2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము."
1 సమూ 2 సమూ గ్రంథాల్లో కూడా ఈ మాటను చూస్తాము.
ఈ మాట శక్తిని సూచిస్తోంది, ఎవరినైనా జయించి వారిని పరిపాలించే శక్తిని సూచిస్తోంది. ఇక్కడ జెకర్యా ఆ మాటను మెస్సీయా గురించి వాడాడు. ఒక బలిష్టమైన, శక్తివంతమైన మృగమువలె ఆయన కూడా తన కొమ్ములతో శత్రువులను తరిమి, తన ప్రజలను విమోచిస్తాడు అనే భావంతో జెకర్యా ఈ మాటను వాడాడు.
ఒక పాత నిబంధన యాజకుడైన జెకర్యా తన స్తుతి పాటలో దావీదు నిబంధన (అంటే దావీదు చేసింది కాదు, దావీదుతో దేవుడు చేసిన నిబంధన) యొక్క నేపధ్యాన్ని, దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని మరియు దాని యొక్క నెరవేర్పు గురించి చూస్తాము.
ముందుగా నేపథ్యం గురించి చూద్దాం.
"తన సేవకుడైన దావీదు వంశమునందు...." అనే మాటను చదువుతున్నాము.
మెస్సీయా దావీదు వంశములో నుండీ వస్తాడు అని పాత నిబంధనలో స్పష్టంగా చెప్పబడింది.
యిర్మీయా 35:5 -
"5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును."
ఇదే వాగ్దానం యిర్మీయా 33:15 లో కూడా కనిపిస్తుంది.
"15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును."
కీర్తన 132: 17 - "17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను."
యెషయా 11: 1,10 -
- "1.యెష్షయిమొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును"
- "10.ఆదినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును."
మరియ దావీదు వంశానికి చెందినది అన్న సంగతి జెకర్యాకు తెలిసే ఉండవచ్చు. ఆమె జెకర్యా ఎలీజబేతులతో మూడు నెలలు ఉండింది, ఖచ్చితంగా గబ్రియేలు దూత ప్రత్యక్షమై ఆమెతో ఎం చెప్పాడో ఆ విషయాలన్నీ జెకర్యా ఎలీసబెతులతోచెప్పే ఉంటుంది.
ఇంతకీ మరియతో దూత ఎం చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము -
1: 31, 32 -
"31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
- ఆయన గొప్పవాడైసర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును."
మరియ దావీదు వంశములో పుట్టిన స్త్రీ (రక్తసంబంధం) కాబట్టి దావీదు యొక్క వారసత్వం యేసు క్రీస్తుకి మరియ ద్వారా సంక్రమించింది.
"తన సేవకుడైన దావీదు". దావీదు గురించి సేవకుడు అనే మాట వాడబడింది.
"సేవకుడు" అనే మాట దావీదు గురించి అనేక మార్లు వాడబడింది.
సేవకుడు అని మాత్రమే కాదు -
1 సమూ 13:14 -
"14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. ......"
ఈ మాట దావీదు గురించే చెప్పబడింది.
దేవుడు మెస్సీయా ద్వారా ఇశ్రాయేలు రాజ్యం యొక్క వైభవాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడనీ తద్వారా ఆయన దావీదుతో చేసిన నిబంధన నెరవేరుస్తాడని యూదులు ఎదురుచూసారు.
ఇప్పుడు అసలు ఆ నిబంధన ఏంటో చూద్దాము.
చేయబడిన ఆ వాగ్దానం గురించి జెకర్యా మాటల్లో విందాము.
“71. మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
- దీనినిగూర్చిఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను."
"దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను."
2 సమూయేలు 7: 1-11 -
"1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజుతన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి
- నేనుదేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా
- నాతానుయెహోవానీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను.
- అయితే ఆ రాత్రియెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
- నీవు పోయి నాసేవకుడగు దావీదుతో ఇట్లనుముయెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగానాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా?
- ఐగుప్తులోనుండినేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని.
- ఇశ్రాయేలీయులతోకూడనేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవ దారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైననుఅనియుంటినా?
- కాబట్టి నీవు నాసేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.
- నీవు పోవుచోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.
- మరియుఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి
- నీ శత్రువుల మీద నీకుజయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగానేను నీకు సంతానము కలుగజేయుదును."
దావీదుకు అతని సంతానానికి ఇవ్వబడిన వాగ్దానం గురించి ఈ వచనాల్లో మనం చదివాము.
దేవుడు పాత నిబంధనలో అనేక సార్లు "తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన" నిబంధన ఇదే - దావీదు నిబంధన. సుమారు 40 కంటే ఎక్కువ చోట్ల ఈ నిబంధన గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. యెషయా ప్రవక్త అయితే భవిష్యత్తులో దేవుడు స్థాపించబోయే ఆ దావీదు రాజ్యం గురించీ మెస్సీయా పరిపాలన గురించీ చాలా విషయాలు ప్రస్తావిస్తాడు.
దావీదు నిబంధన యొక్క నెరవేర్పు
"మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను."
పాత నిబంధనలోని అనేక ఇతర ప్రవచనాలకు లాగ దావీదు నిబంధనకు కూడా రెండు నెరవేర్పులు ఉంటాయి - ఒకసారి వెంటనే జరుగుతుంది, మరొకటి భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరుతుంది.
2 సమూ 7 : 12-14 –
“12. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
- అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును;అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;”
ఈ విధంగా అతని కుమారుడైన సొలొమోను విషయంలో ఆ నెరవేర్పు జరిగిపోయింది. కానీ ఆ రాజ్యము ఎంతో కాలము నిలిచియుండలేదు.
లూకా 11:31 -
".......ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు."
దేవుడు తన నిబంధన విషయంలో విఫలమవ్వడం అసంభవం. సొలొమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ద్వారా అది నెరవేరుతుంది. యేసు క్రీస్తు రాజ్యాన్ని గురించి
2 సమూ 7: 13, 16 లో వాగ్దానం చేయబడింది.
- ".....అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగాస్థిరపరచెదను;...."
- "నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యముస్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను."
యేసు ఒక రోజు తప్పక తిరిగి రానైయున్నాడు, వచ్చినప్పుడు ఆయన ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు.
యెషయా 9:6, 7 -
"6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
- ఇది మొదలుకొనిమితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడైరాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును."
ఆ మెస్సీయా స్థాపించే రాజ్యము, దాని గురించిన ఆశ, నిరీక్షణ కలిగివాడై, "మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను." అన్న మాటలు పలుకుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడుజెకర్యా.
శిష్యులకు కూడా ఇటువంటి నిరీక్షణే ఉండింది. దాని గురించే పునరుర్ధానుడైన యేసును అడుగారు.
అపో. కార్య. 1: 6 -
"6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా"
జెకర్యా ఊహకు కూడా అందని విషయం ఏంటంటే - యూదులు మెస్సీయాను అంగీకరించకుండా, ఆయనకు తిరస్కరించి, వాళ్ళ రాజుని వాళ్ళు సిలువకు అప్పగిస్తారని.
అయితే యూదుల అవిధేయత దేవుని వాగ్దానాలను నిరర్ధకం చేస్తుందా? కానే కాదు.
రోమా 3: 3 -
"3. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు."
యూదుల అవిధేయత దేవుని మాటలను నిరర్ధకం చెయ్యదు కానీ వాటిని నెరవేరుస్తుంది. ఎలాగంటే దాని 9:26 ప్రకారం అభిషిక్తుడు నిర్మూలము చేయబడతాడు. అంటే యేసు తన మొదటి రాకడలో తిరస్కారము నొందుతాడు, నిర్మూలముచేయబడుతాడు. ఇది జరిగిన తరువాతే రెండవ రాకడ, నిత్య రాజ్య స్థాపన జరుగుతుంది. ఇదే దేవుని చిత్తం. కాబట్టి యూదుల అవిధేయత దేవుని ఉద్దేశ్యాలను/ వాగ్దానాలను నిరర్ధకం చెయ్యలేదు సరికదా నెరవేర్చాయి అని అర్ధమవుతోంది.
మన రాజు ఒక రోజు తప్పక తిరిగి రాబోతున్నాడు. ఆ గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది.
మనందరి నిరీక్షణ తప్పక నిజమవుతుంది.
దేవుడు దావీదుతో తాను చేసిన నిబంధనను మర్చిపోయేవాడు కాదు. వెయ్యేండ్ల పాలనలో ఆ రాజును సేవిస్తూ ఆయనను ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని, నిత్య రాజ్య వారసులుగా ఆయనతో కూడా ఎప్పటికీ ఉండే ఆధిక్యతను ఆయన చేత విమోచించబడిన మనము పొందుకున్నాము.
అప్పుడు మాత్రమే ఈ నిబంధన సంపూర్ణంగా నెరవేరుతుంది.
వ. 73-76
పాత నిబంధన అంతా మనం చూస్తే మెస్సీయా రాబోతున్నాడు అని, ఆయన మనకు విమోచన అనుగ్రహించబోతున్నాడు అని ప్రవచనాలు చెప్పబడ్డాయి. యూదులు ఎంతో ఆశతో ఆయన కోసం కనిపెట్టేవారు. అలా ఎదురు చూసిన వారిలో జెకర్యా కూడా ఒకడు. అయితే జెకర్యా దినాల్లో ఆ ఎదురు చూపుకు తెర పడింది. దేవుడు అతనికి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ పుట్టబోయే కుమారుడి గురించి గబ్రియేలు దూత ఏమన్నాడు అంటే -
"17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను."
జెకర్యాకు అర్థం అయ్యుంటుంది - ముందుగా నడిచేవాడు పుట్టాడంటే ఇక మెస్సీయా కూడా రాబోతున్నాడు అని. ఆ అవగాహనే అతను ఇటువంటి ఒక స్తుతి పాట పాడేలా పురిగొల్పి ఉంటుంది.
ఒక యాజకుడు కాబట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి బోధించడానికి కట్టుబడియున్న వ్యక్తిగా, అతనికి తగినట్లుగానే పాత నిబంధనలోని నిబంధనలతో అతని స్తుతి పాట నిండి పోయింది. మరీ ముఖ్యంగా అతను మూడు నిబంధనలపై దృష్టి సారిస్తాడు. దావీదు, అబ్రాహాము మరియు నూతన నిబంధన.
67 - 72 వరకు ఉన్న వచనాల్లో దావీదు నిబంధన గురించి చూసాము.
ఇప్పుడు జెకర్యా అబ్రాహాము నిబంధన గురించి పాడుతుంటాడు.
“73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
- అబ్రాహాముతోతాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును”
అబ్రాహాము నిబంధన యొక్క నేపధ్యము.
"మన పితరులను కరుణించుటకును"
ఇశ్రాయేలు జనాంగం యొక్క "పితరులైన" అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం.
ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఈ నిబంధనలో ఉంటాయి. అన్యులు కూడా విశ్వాసం ద్వారా ఆ ఆశీర్వాదాలు పొందే వీలు ఉన్నప్పటికీ, ప్రాధమికంగా దేవుడు వాటిని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.
అబ్రాహాము నిబంధన ఒక కరుణ నిబంధన/ కృపా నిబంధన. దేవుడు యోగ్యులు కాని వారి పట్ల కనికరం చూపే వాడు, కృప చూపించేవాడు అని తెలియజేస్తుంది - ఆ నిబంధన. ఆ కరుణ నిబంధన అబ్రాహామును ఆశీర్వదించడంతో ప్రారంభమై ఆ తరువాతి కాలంలో కూడా వందలవేల సంవత్సరాల పాటు ఎవరైతే మెస్సీయా యైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుతారో వారికి క్షమాపణను విమోచనను నిత్యత్వపు ఆశిర్వాదాలను అనుగ్రహిస్తోంది.
ఇదంతా కేవలం ఆయన కరుణను బట్టి, మన యోగ్యతను బట్టి కాదు, మన నీతి క్రియలను బట్టి కాదు.
ఆదికాండము మొదటి పదకొండు అధ్యాయాలలో వేరు వేరు సంఘటనల గురించి చదువుతాము. సృష్టి నిర్మించబడిన క్రమము. పాపము ఈ లోకంలోకి ప్రవేశించడము, నోవహు రోజుల్లో వచ్చిన ప్రళయము, ఇక వెంటనే 11 వ అధ్యాయం చివరిలోఅబ్రాహాము పరిచయం చేయబడతాడు. ఆ తరువాతి అధ్యాయాలన్నింట్లో అతని గురించి అతని సంతానం గురించీ చెప్పబడింది. అతను ఒక విగ్రహారాధికుడిగా (యెహోషువా 24:2) ఊరు అనే కల్దీయుల పట్టణంలో (ఆది 11:31) ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు.
అపో. కార్య . 7:3 -
"3. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను."
తరువాత అబ్రాహాము తన తండ్రియైన తెరాహుతో పాటు తన ఊరిని విడిచి బయటికి వచ్చి హారానులో స్థిర పడిన తరువాత దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేస్తాడు.
ఆది 12: 1-3 -
"1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
- నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును,నీవు ఆశీర్వాదముగా నుందువు.
- నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను;నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా"
దేవుని మాటలకు విధేయత చూపిస్తూ
ఆది 12: 4,5 -
"4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
- అబ్రాముతన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి."
ఇది ఆ అబ్రాహాము నిబంధన యొక్క నేపధ్యం
అసలు అబ్రాహాము నిబంధనలో ఎం వాగ్దానం చెయ్యబడింది.
"తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును"
దేవుడు అబ్రాహామును గొప్ప జనముగా చేస్తాను అని చెప్తాడు కానీ అబ్రాహాము భార్యయైన శారా గొడ్రాలు. అయితే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు వారికి ఇస్సాకు జన్మించడంతో ప్రారంభమవుతుంది.
"భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని"
ఇది ఆత్మీయ ఆశీర్వాదం.
రోమా 9:5 -
"5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్."
యేసు క్రీస్తు కూడా ఇలాగే అన్నారు -
యోహాను 4:22 -
"రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది." అని యేసు తనను ఉద్దేశించే పలికిన మాటలివి.
ఈ ప్రపంచానికి యూదుల ద్వారానే దేవుని ప్రత్యక్షత, ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి.
అబ్రాహాము నిబంధన గురించి ఆదికాండములో దాదాపు 8 సార్లు ప్రస్తావించబడడాన్ని బట్టి ఆ నిబంధన యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. (12,13,15,17,22,26,28,35).
12 వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన గురించి చదువుతాము కానీ అది 15 వ అధ్యాయంలో అది ఒక నిబంధన రూపంలోకి వస్తుంది.
ఆది 15: 18 - 21 -
" ఆ దినమందే ....................................అబ్రాముతో నిబంధన చేసెను."
12 వ అధ్యాయంలో చేసిన ఆ నిబంధనను 15: 7 లో దేవుడు మరల జ్ఞాపకం చేస్తాడు.
"7. మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు"
అయితే ఈ సంగతులు ఇలాగే నెరవేరుతాయని నేనెట్లా తెలుసుకోవాలి అని అడుగుతాడు అబ్రాహాము.
"8. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా"
"9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
- అతడుఅవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
- గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడుఅబ్రాము వాటిని తోలివేసెను.
- ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
- ఆయన నీ సంతతివారుతమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
- వారు నాలుగు వందలయేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
- నీవు క్షేమముగా నీపితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
- అమోరీయులఅక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
- మరియుప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను."
జంతువులను చంపడం ఆ నిబంధన యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. నిబంధన చేసుకున్న వారు ఇద్దరూ ఆ జంతు కళేబరాల మధ్య నుండీ నడుస్తారు. ఒక వేళ వారు ఆ నిబంధన నుండీ తప్పిపోయినట్లైతే వారు కూడా ఆ జంతువులవలె అవుతారు అని చెప్పడం కోసం నిబంధన చేసుకున్న ఇరువురు అలా చేసేవారు ఆ రోజుల్లో.
అయితే ఈ నిబంధన ఏక పక్ష నిబంధన, మార్చలేనటువంటి నిబంధన. దేవుడు మాత్రమే చేసిన నిబంధన. అబ్రాహాము చేసే క్రియల పై ఆధారపడి ఉండదు.
అయితే ఆది 17: 18 - 21 వచనాల్లో చెప్పబడిన భూమిని ఇశ్రాయేలు ఇప్పటివరకూ పొందుకోలేదు.
అయితే అది ఎప్పుడు నెరవేరుతుందంటే యేసు క్రీస్తు దావీదు సింహాసనంపై కూర్చొని ఈ భూమిపై తన భౌతిక రాజ్యాన్ని స్థాపించినప్పుడు మాత్రమే ఆ అబ్రాహాము నిబంధన యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు నెరవేర్పులోనికి వస్తాయి.
ఆది 17 లో ఆ నిబంధనకు సంబంధించి మరి కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి.
"2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను."
4 వ వచనంలో మళ్ళీ ఇదే విషయం ప్రస్తావించబడింది.
"4. నీవు అనేక జనములకు తండ్రివగుదువు."
ఈ విషయాన్ని ఇంకా నొక్కి చెప్పడం కోసం దేవుడు అబ్రాహాము పేరుని అబ్రాము నుండీ అబ్రాహాముగా మార్చాడు.
అబ్రాము అంటే "ఘనుడైన / ఉన్నతుడైన తండ్రి" అని అర్థం.
అబ్రాహాము అంటే "అనేక జనములకు తండ్రి" అని అర్థం.
మూడు సార్లు ఈ అధ్యాయంలో దేవుడు చేసిన నిబంధన ఒక నిత్య నిబంధన అని చెప్పబడింది.
ఆది 17: 7, 13 , 19 -
"7. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
- నీయింట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.
- దేవుడు నీభార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను."
ఆ నిబంధన ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో నెరవేరుతుంది.
అబ్రాహాము నిబంధన బేషరతు నిబంధన అయినప్పటికీ, దాని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకు విశ్వాసం ఉండాలి.
అబ్రాహాముకు అటువంటి విశ్వాసం కలదు అని ఆది 22 వ అధ్యాయంలో జరిగిన సంఘటన బట్టి అర్ధమవుతుంది.
దేవుడు వాగ్దానం చేసిన విధంగానే అబ్రాహాము శారాలకు ఇస్సాకుని అనుగ్రహించాడు. (ఆది 21:1-3)
కొన్ని సంవత్సరాల తరువాత, ఇస్సాకు ఇంకా యవ్వనస్థుడిగా ఉన్నప్పుడు, దేవుడు అబ్రాహాముకి ఒక ఆశ్చర్యమైన ఆజ్ఞ ఇచ్చాడు.
ఆది 22:2 -
"2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను"
మామూలుగా ఇది గ్రహింప శక్యముగాని విషయం. ఎందుకంటే దేవుడు ఇస్సాకు ద్వారానే కదా గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని చెప్పింది. మరి ఇప్పుడు ఆ ఇస్సాకునే బలి ఇమ్మంటున్నాడు ఏంటి? అప్పుడు దేవుడు తన నిబంధనకు కట్టుబడి దానిని నెరవేర్చే అవకాశం ఉండదు కదా ?
కానీ అబ్రాహాము తన విశ్వాసంలో చెదిరిపోలేదు.
హెబ్రీ 11:18, 19 -
"18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
- తనయేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను."
అబ్రాహాము తన కొడుకుని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు
ఆది 22: 11,12 -
"11. యెహోవా దూత పరలోకమునుండి - అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలి చెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
- అప్పుడు ఆయన - ఆ చిన్నవాని మీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను"
దేవుడు తన వాగ్దానాలపై నిలబడి తీరతాడు అని ఆయనపై విశ్వాసం ఉంచే విషయంలో అబ్రాహాము మనకి మాదిరిగా నున్నాడు. (గలతీ 3:9)
కాబట్టి మనకి విశ్వాసం ఉంటె ఆ నిబంధన యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవచ్చు.
అబ్రాహాము నిబంధన యొక్క నెరవేర్పు
"75. మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
- పరిశుద్ధముగానునీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను."
కేవలం వెయ్యేండ్ల పాలనలో మాత్రమే ఇవి సంపూర్ణంగా నెరవేర్పులోనికి వస్తాయి.
అప్పుడు మాత్రమే జెకర్యా యొక్క ఈ నిరీక్షణ నేరవేరుతుంది.
అన్యులయ్యుండీ రక్షణ పొందిన విశ్వాసులు కూడా దావీదు నిబంధన లాగే అబ్రాహాము నిబంధన యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలరు. ఆత్మీయ కోణంలో నుండీ చూస్తే ఈ నిబంధనలో రక్షణ గురించి ఏదైతే వాగ్దానం చెయ్యబడిందో ఆ ఆశీర్వాదం అందరు క్రైస్తవులకీ వర్తిస్తుంది. తద్వారా అపొస్తలుడైన పౌలు గలతీ 3: 7,8,9 లో చెప్పినట్లుగా మనం అబ్రాహాముకి పిల్లలమవుతాము.
"7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.
- దేవుడు విశ్వాస మూలముగాఅన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను."
అబ్రాహాము ఎలాగ రక్షించబడ్డాడో అలాగే మనం కూడా రక్షణ పొందాము.
"9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు."
ఎవరైతే సువార్త విని, విశ్వసించి, యేసు క్రీస్తును హత్తుకుంటారో వారు అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు.
అబ్రాహాముకి పుట్టిన పిల్లలం కాకపోయినా విశ్వాసము విషయంలో మనం ఆయనకు ఆత్మీయ వారసులం.
అబ్రాహాము నిబంధనలో రక్షణ వాగ్దానం ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరికీ చెందినది.
రోమా 4: 11-12 -
"11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
- మరియుసున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను."
అయితే యేసు తన మొదటి రాకడలో ఈ భూమి పై ఒక భౌతిక రాజ్యాన్ని స్థాపించకపోయిన సువార్త ప్రకటన ద్వారా తన రాజ్యానికి పునాది మాత్రం వేసాడు. అప్పటి నుంచీ ఆయన తాను ఎన్నుకున్న వారిని ఈ పాపము లోకంలోనుండీ వేరు చేసి తన రాజ్య సభ్యులుగా చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలోకి రక్షణ పొందిన విశ్వాసులంతా చేర్చబడ్డారు, ఈ రోజుకీ రక్షించబడుతున్నవారు అందులోకి చేర్చబడుతున్నారు. అయితే ఒక భౌతిక రాజ్యం స్థాపించబడినప్పుడే ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేరినట్లు.
వ. 77 – 80 -
దేవుడు చేసిన నిబంధనలన్నింటిలో కొత్త నిబంధన ప్రత్యేకమైనది.
మన రక్షణకు సంబంధించిన నిబంధనలు మొత్తం మూడు - అబ్రాహాము, దావీదు మరియు కొత్త నిబంధన.
అబ్రాహాము మరియు దావీదు నిబంధనల ఆశీర్వాదాలను మనం పొందుకోకుండా మనకు అడ్డుగానున్నది ఒకటుంది. అదే పాపము.
అయితే అబ్రాహాము దావీదు నిబంధనలలో వాగ్దనాలను మనం పొందుకోవాలంటే - రక్షణ ఉండాలి, ఆ రక్షణను పొందుకోవడం గురించి ఆ నిబంధనలు ఏమీ చెప్పట్లేదు.
హెబ్రీ 8: 7-13 -
"7. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.
- అయితే ఆయన ఆక్షేపించి వారితోఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చు చున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును.
- అది నేనుఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకైవారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.ఏమనగావారు-వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
- ఆ దినములైన తరువాతఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.
- వారిలోఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
- నేను వారి దోషముల విషయమైదయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
- ఆయనక్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది."
అందరమూ పాపులమే అని వాక్యం సెలవిస్తోంది. రోమా 3:23
మనిషి యొక్క పాపపు స్వభావాన్ని గురించి పౌలు ఇలా చెప్పాడు.
రోమా 3:10 - 18 -
"10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
- గ్రహించువాడెవడునులేడు దేవుని వెదకువాడెవడును లేడు
- అందరునుత్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
- వారి గొంతుక తెరచిన సమాధి,తమ నాలుకతో మోసము చేయుదురు;వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది
- వారినోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
- రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.
- నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
- శాంతిమార్గమువారెరుగరు.
- వారి కన్నులయెదుట దేవుని భయము లేదు."
దావీదు అబ్రాహాము నిబంధనలలోని వాగ్దానాలే గానీ, మోషే ధర్మశాస్త్రం యొక్క శాపాలు, కట్టడలే కానీ మనిషి పాపాన్ని జయించడానికి సహకరించలేదు.
ధర్మశాస్త్రము మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే - దేవునికి విధేయత చూపించే విషయంలో మన అసమర్ధతను తెలియజేస్తుంది. మరియు దేవుని కనికరము మరియు కృప, క్షమాపణ యొక్క అవసరతను తెలియజేస్తుంది.
గలతీ 3:24 -
"24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను."
మెస్సీయా రావడం ద్వారా ఆ పాత నిబంధనలోని నిబంధనల ఆశీర్వాదాలు నెరవేరబోతున్నాయని ఎరిగిన వాడై, జెకర్యా దేవుణ్ణి స్తుతిస్తూ వాటి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ముందు దావీదు అబ్రాహాము నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు కొత్త నిబంధన గురించి జ్ఞాపకం చేస్తున్నాడు.
"77. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన
- తన ప్రజలకురక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు."
కొత్త నిబంధన గురించి మాట్లాడే ముందు జెకర్యా తన కుమారుడి గురించి కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు.
"మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు............"
అప్పటి వరకూ నాలుగు వందల సంవత్సరాల నుండీ ఏ ప్రవక్త దేవుని మాటల్ని పలకలేదు. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ యోహాను ఒక ప్రవక్తగా దేవుని మాటలను బోధించబోతున్నాడు. సర్వోన్నతుడు అని ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసు గురించి. ఆయన తండ్రియైన దేవునితో సమానుడు. బాప్తీస్మమిచ్చు యోహాను ఆయన ప్రవక్త.
యోహాను పరిచర్య ఏంటి అంటే -
"78. ................ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు."
ఇది మలాకీ 3:1 లో దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు.
"1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; ........."
మత్తయి 3:3 -
"3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే."
కాబట్టి యోహానూ అతని పరిచర్యా యెషయా చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు కూడానూ.
కాబట్టి యోహాను పని ఏంటంటే మెస్సీయా యొక్క రాక కొరకు ప్రజలను సిద్ధపరచటం.
అందులో భాగంగానే లూకా 3:3 -
"3. అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను."
అస్సలు రాజీ పడకుండా అతను ప్రకటించిన సత్యం ఏంటంటే -
మత్తయి 3:2 -
"2. పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని........"
అయితే యోహాను ప్రకటించిన విషయాలు యూదుల ఆలోచనలకు చాలా భిన్నముగా ఉన్నాయి. ఎందుకంటే మెస్సీయా వచ్చి తమ శత్రువులను నాశనం చేసి తన రాజ్యాన్ని స్థాపించి అబ్రాహాము నిబంధన, దావీదు నిబంధనలోని ఆశీర్వాదాలు తమపై కుమ్మరిస్తాడు అని యూదులు అనుకున్నారు. అందుకే యేసును రాజు చెయ్యాలనుకున్నట్లు యోహాను సువార్తలో చదువుతాము.
యోహాను 6:14 - 15 -
"14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
- రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగాపట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను."
అయితే ఆ నిబంధనల ఆశీర్వాదాలు పొందుకునే ముందు పాపంతో వ్యవహరించవలసి ఉంది. కొత్త నిబంధనలో అనుగ్రహించబడిన పాప క్షమాపణ పొందుకోవాలి.
యోహాను ఆ పాప క్షమాపణ గురించే బోధించాడు. మరి యోహాను బోధిస్తున్న సమయానికి యేసు క్రీస్తు ఇంకా సిలువలో చనిపోలేదు కదా. మరి తన శ్రోతలు పాప క్షమాపణ పొందే వీలుందా?
ఆ మాట కొస్తే అసలు జెకర్యా రక్షణ పొందాడా?
ఇంకా ఆలోచిస్తే అసలు పాత నిబంధన భక్తులు ఎలా రక్షణ పొందారు?
రాబోతున్న మెస్సీయాను ముందుకు చూస్తూ ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ పొందారు. పాత నిబంధన భక్తులందరూ ఇలాగే రక్షణ పొందారు. మనం 2000 సంవత్సరాల క్రితం వచ్చి సిలువలో చనిపోయి, పరలోకానికిఆరోహణమైపోయిన క్రీస్తును వెనక్కి చూసి ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా రక్షణ పొందుతున్నాము. అందరూ విశ్వాసం ద్వారానే రక్షణ పొందుతున్నారని గ్రహించాలి.
కొత్త నిబంధన యొక్క వాగ్దానం
"77. ...........వారి పాపములను క్షమించుటవలన
- తన ప్రజలకురక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు......."
ఇంతక ముందే చూసిన విధంగా అబ్రాహాము దావీదు నిబంధనలలో వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ముందు దేవుడు తన సార్వభౌమత్వములో అనుగ్రహించే ఈ రక్షణ జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానం అంటే జ్ఞానం కాదు, పాప క్షమాపణ పొందిన అనుభవంలోకి రావాలి అని అర్థం.
మోషే ఈ కొత్త నిబంధన యొక్క ఆవశ్యకతను గురించి ప్రస్తావిస్తాడు. తన తరువాత వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోయే కొత్త తరానికి మోషేతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తూ వేరొక నిబంధన గురించి ప్రస్తావిస్తాడు.
అయితే ఇశ్రాయేలు ప్రజలు మోషే నిబంధనకు కట్టుబడి ఉండరు అని ద్వీతీయో 30: 1- 3 చదివితే స్పష్టంగా అర్ధమవుతుంది.
"1. నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన
- సమస్త జనములమధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల
- నీ దేవుడైనయెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును."
ఈ 'తిరిగి రప్పించడం' అనేది ఇంకా జరగలేదు.
అయితే వారు దేవుని వైపు తిరిగి, రక్షించబడాలంటే, ముందుగా దేవుడు వారి హృదయాలను సున్నతి చెయ్యాలి అని ద్వితీయో 30: 6 లో చదువుతాము.
"6. మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును."
ఇది కొత్త నిబంధనకు సంబంధించిన విషయం. పాపియైన మనిషి హృదయం మార్పు చెందడం.
మోషే, అబ్రాహాము, దావీదు నిబంధనలకు హృదయాన్ని మార్చే శక్తి లేదు, అందుకే దేవుడు కొత్త నిబంధనను అనుగ్రహించాడు.
కొత్త నిబంధన గురించి ఇంకా స్పష్టంగా యిర్మీయా గ్రంథంలో చెప్పబడింది.
యిర్మీయా 31: 31 - 34 -
"31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
- అదిఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.
- ఈ దినములైన తరువాత నేనుఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
- నేను వారికిదేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు."
యిర్మీయా ఈ మాటలు పలుకుతున్న నాటికి ఉత్తర దేశమైన ఇశ్రాయేలు చెరపట్టబడింది. దక్షిణ దేశం అయిన యూదా వారి వంతు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంది. మారు మనస్సు పొందమని చేసిన హెచ్చరికలను ప్రజలు త్రోసిపుచ్చారు. కొంత కాలానికే మోషే నిబంధనను విడిచిపెట్టినందుకుగానూ వారి పరిస్థితి దయనీయంగా మారింది. అప్పుడు యిర్మీయా ద్వారా దేవుడు మోషే ద్వితీయోపదేశకాండములో పలికిన ఆ మాటలనే జ్ఞాపకం చేస్తున్నాడు, వారిని బలపరచడానికి.
- "...........వారిపితరులతోనేను చేసిన నిబంధనవంటిది కాదు..........."
అయితే ఇందుకు భిన్నంగా దేవుడు కొత్త నిబంధనలో
- "........వారి మనస్సులలో నాధర్మవిధిఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను..."
తద్వారా వారికి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు.
యెహేజ్కెలు 36:26 -
"26. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను."
ఈ కొత్త నిబంధనలో అతి ప్రాముఖమైన విషయం మనిషి పాపం నుండీ విడిపించబడటం, పాప క్షమాపణ పొందుకోగలగడం.
యోహాను 6:44 ప్రకారం దేవుడు పాపులను తన దగ్గరకు ఆకర్షిస్తాడు, అలా ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే -
యిర్మీయా 31:34 -
"34. ...........నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను.........."
యెహేజ్కెలు 36:25 -
"25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను."
అంత మాత్రమే కాదు వారికి పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడతాడు.
యెహేజ్కెలు 36:27 -
"నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను."
కాబట్టి ఇతర నిబంధనలు అనుగ్రహించలేని వాటిని కొత్త నిబంధన మనకు అనుగ్రహించింది. అవేంటంటే - నూతన హృదయం, దేవుడికి విధేయత చూపించగలిగే శక్తి, పరిశుద్ధ ఆత్మ, పాప క్షమాపణ.
ధర్మశాస్త్రము లేదా మోషే నిబంధన మనలను శిక్షకు గురిచేసింది. మనము పాపులమని తీర్మానించింది. కానీ ఈ కొత్త నిబంధన ద్వారా ఆ శిక్ష నుండీ మనం తప్పించబడ్డాము.
రోమా 8: 1-4 -
"1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
- క్రీస్తుయేసునందుజీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను.
- శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము
- దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను."
ఈ కొత్త నిబంధన వ్యక్తిగతమైనది, వ్యక్తిగతంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపులకు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఎవరు రక్షణ పొందినా ఈ కొత్త నిబంధనకు అనుగుణంగానే పొందాలి.
ముందు చెప్పుకున్న విధంగా అబ్రాహాము, దావీదు నిబంధనలలోని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈ కొత్త నిబంధన ద్వారా పాప క్షమాపణ పొందుకోవడం అత్యంత కీలకం.
అయితే ఈ కొత్త నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం, మెస్సీయా రాజ్యం స్థాపించబడటం, చెదిరిపోయిన వారందరు తిరిగి సమకూర్చబడటం.
ఈ కొత్త నిబంధన మనకి ఎవరు అనుగ్రహించారు?
"77. ...........మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి.........."
పాపులైనటువంటివారి మీద కనికరించేలా ఆయనను కదిలించింది ఆయన "మహా వాత్సల్యం" గల హృదయం.
"మహా" అంటే చాలా తీవ్రమైన అని అర్థం.
పాపుల గురించిన ఆయన ఎంతో కనికరం కలిగినవాడు.
కనికరము లేదా వాత్సల్యము అనేది దేవుని గొప్ప గుణ లక్షణాలలో ఒకటి.
కీర్తన 86: 15 -
"15. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు"
యెషయా 63: 9 -
"9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను."
అణచివేయబడిన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు.
యిర్మీయా 33:26 -
"26. ...................... నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను."
మరియ దేవుని కనికరమును బట్టి ఆనందించింది, తన ఆనందాన్ని తన పాటలో ఇలా వ్యక్తపరచింది.
"50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును."
"54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు"
ఈ స్తుతి పాట ప్రారంభంలో ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎలా కనికరించాడో జెకర్యా జ్ఞాపకం చేసాడు.
"73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను,"
ఎఫెసీ 2:4 -
"4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను."
1 తిమోతీ 1:13,16 లో రక్షణపొందునట్లు "నేను కనికరించబడితిని" అని పౌలు అంటాడు.
తీతుకు 3:5 -
"5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను."
దర్శాస్త్రము మనలను శిక్షకు గురి చేసింది అని అనుకున్నాము ఇందాక. అయితే ధర్మశాస్త్రము చెడ్డది కాదు.
రోమా 7:12
"12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది."
అది దేవుని నీతి స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. దేవుడు ఆ ధర్మశాస్త్రం యొక్క నియమాలను కట్టడలను అనుసరించి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకుగానూ మనల్ని నిత్య శిక్షకు గురి చేసి న్యాయాన్ని జరిగించుట ద్వారా మహిమ పొందగలడు. కానీ దేవుడు నిరాశతో ఉన్న, నిస్సాహాయులైన పాపులపై కనికరించాడు, పాప క్షమాపణను మనకు అనుగ్రహించే కొత్త నిబంధనను స్థాపించాడు.
కొత్త నిబంధన వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి?
"79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయదర్శనమనుగ్రహించెను."
జెకర్యా మెస్సీయా ఆగమనాన్ని అరుణోదయ దర్శనంతో పోల్చుతున్నాడు. "పై నుండి" అంటే పరలోకము నుండీ. కాబట్టి మెస్సీయా ఎవరు అని జెకర్యా చెప్తున్నాడు అంటే పరలోకం నుండీ వచ్చిన గొప్ప వెలుగుగా అభివర్ణిస్తూ ఆ రక్షణ అనే వెలుగు చీకటిలోనూ మరణాఛాయలోను కూర్చుండువారి మీద ప్రసరించబోతోంది అని అంటున్నాడు.
ఈ సమయం గురించి 2 పేతురు 1:19 లో ఇలా చెప్పబడింది.
"............ తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది.........."
యేసు ప్రభువు తన గురించి తాను చెప్తూ
ప్రకటన 22:16 -
".............నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను."
"చీకటి" వాక్యంలో పాపానికి సూచనగా ఉంది. దేవుడు వెలుగుగా చెప్పబడ్డాడు
1 యోహాను 1: 5 -
"5. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు."
యెషయా 42: 6-7 -
"6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
- యెహోవానగునేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను."
యెషయా 59: 9-10 -
"9. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము
- గోడ కొరకుగ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము."
మానవులు వద్ద ఏ పరిష్కారము లేదని తెలిసి దేవుడే
యెషయా 59: 16, 20, 21 -
"16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
- .......మళ్లుకొనినవారియొద్దకునువిమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.
- నేను వారితో చేయు నిబంధనయిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అనియెహోవా సెలవిచ్చుచున్నాడు."
భవిష్యత్తు నిత్యత్వములో కూడా ఆయనే తన ప్రజలకు వెలుగుగా ఉంటాడు. (ప్రకటన 21: 23).
మెస్సీయా తన ప్రజలకు రక్షణ వెలుగుగా మాత్రమే కాక
"79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు............."
కొత్త నిబంధనలో సమాధానము లేదా శాంతి అనేది కూడా భాగమే.
రోమా 3:17 -
"17. శాంతిమార్గము వారెరుగరు."
యెషయా 54:10 -
"10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు."
యోహాను 14:27 -
"27. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి."
సమాధానము రక్షణతోటే ప్రారంభమవుతుంది.
రోమా 5:1 -
"1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము"
దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ
రోమా 14: 17 -
"17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది."
సమాధానము ఆత్మ ఫలములలో ఒకటిగా ఉన్నది. గలతీ 5:22
ఫిలిప్పీ 4:7 -
"7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును."
జెకర్యా తన పాటను ముగిస్తూ మరో సారి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఇక 3 వ అధ్యాయంలో ప్రజలకు బోధిస్తున్న యోహానుని మనం చూస్తాము. యేసు క్రీస్తు బాల్యం లాగానే యోహాను బాల్యం గురించిన సంగతులు బైబిల్ లో తెలియజేయబడలేదు.
మనకు తెలియ జేసినదల్లా ఏంటంటే అతను సున్నతి చేయబడిన తరువాత పరిచర్య ప్రారంభించడానికి మధ్యలో 80 వ వచనంలో చప్పబడినట్లుగా
"80. శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను."
అలా జెకర్యా యోహాను యొక్క పాత్రను గురించి ముందుగానే చెప్పాడు. అతను ఇశ్రాయేలీయులకు కొత్త నిబంధన గురించి ప్రకటించబోదుతున్నాడని తన పాట ద్వారా ప్రవచించాడు.
లూకా సువార్త అధ్యాయం 1
గ్రంథపరిచయం;,1:1,1:2,1:3, 1:4, 1:5 , 1:6 , 1:7, 1:8 , 1:9 , 1:10 ,1:11 , 1:12, 1:13, 1:14, 1:15, 1:16, 1:17 , 1:18 , 1:19 , 1:20, 1:21 , 1:22, 1:23, 1:24, 1:25, 1:26, 1:27, 1:28, 1:29, 1:30, 1:31, 1:32, 1:33, 1:34, 1:35, 1:36, 1:37, 1:38, 1:39, 1:40, 1:41, 1:42, 1:43, 1:44, 1:45, 1:46, 1:47, 1:48, 1:49, 1:50, 1:51, 1:52, 1:53, 1:54, 1:55, 1:56, 1:57, 1:58, 1:59, 1:60, 1:61, 1:62, 1:63, 1:64, 1:65, 1:66, 1:67, 1:68, 1:69, 1:70, 1:71, 1:72, 1:73, 1:74, 1:75, 1:76, 1:77, 1:78, 1:79, 1:80
విషయసూచిక
I. లూకా సువార్త పరిచయము (1:1-4)
II.యోహాను పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:5-25)
III. యేసు పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:26-38)
IV. మరియ ఎలీసబెతును దర్శించుట (1: 39-45)
V. మరియ పాడిన పాట ( 1: 46 – 56)
VI. యోహాను పుట్టుకను గురించిన వృత్తాంతము ( 1: 57 – 66)
VII. జెకర్యా పాడిన పాట ( 1: 67 – 80)
I. లూకా సువార్త పరిచయము (1:1-4)
1. ఘనతవహించిన థెయొఫిలా,
2. ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు.
3. గనుక నీకు ఉపదేశింపబడిన ;సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట
4. వాటినిగూర్చివరుసగా రచించుట యుక్తమని యెంచితిని."
పాత కొత్త నిబంధనలంతటికీ కేంద్రము - యేసు క్రీస్తు.
పాత నిబంధనలో యేసు గురించి ప్రవచించారు. కొత్త నిబంధన పత్రికలలో పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పుని, రక్షణ ప్రణాళికను మరి తేటగా, స్పష్టంగా తెలియజేశారు. ప్రకటన గ్రంథములో- ఆయన మహిమతో తిరిగి రానైయున్నసంగతులను తెలియజేశారు. కానీ పాత నిబంధనకీ, కొత్త నిబంధన పత్రికలకీ మధ్యనున్న 4 సువార్త గ్రంథాలు మాత్రం యేసు క్రీస్తు యొక్క జీవితము & పరిచర్య మీద దృష్టి సారిస్తాయి.
లూకా తాను తెరవెనుక ఉండి, క్రీస్తు యొక్క మహిమ మాత్రమే ప్రజలు చూడాలని కోరుకున్నాడు అందుకే కేవలం మూడుసార్లు మాత్రమే అతని పేరు బైబిల్ లో ప్రస్తావించబడింది. తను రచించిన గ్రంథాల్లో అయితే ఒక్కసారి కూడా లేదు.
"వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు" -
అనేకులు రాసినట్లు లూకా కూడా యేసు క్రీస్తు జీవిత చరిత్ర రాసెయ్యాలని అనుకున్నాడా? అనేకులు వివరంగా రాసినప్పటికీ మళ్ళీ రాయడంలో లూకా ఉద్దేశం ఏంటి? కొన్ని ప్రశ్నల రూపంలో లూకా యొక్క ఉద్దేశ్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాము.
1. లూకా అసలు ఏం రాయాలనుకున్నాడు?
"మనమధ్య నెరవేరిన కార్యములను గూర్చి".
"నెరవేరిన" అనే పదానికి అర్థం - "దేవుని విమోచన ప్రణాళిక" నెరవేర్పును సూచిస్తోంది. అంటే దేవుని విమోచన ప్రణాళిక యేసు క్రీస్తు రూపంలో ఎలా నెరవేరిందో, ఆ కార్యముల గురించి రాయాలనుకున్నాడు.
అయితే అప్పటికే ఉన్న రచనలలో వీటి గురించి ప్రస్తావించలేదనో లేక వాటిలో తప్పులు ఉంటే వాటిని ఖండించాలనో లూకా ఈ గ్రంథాన్ని రచించలేదు. అతనికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశ్యాన్ని కింది వచనాలు సాయంతో మరింత లోతుగా గ్రహించగలం. ఆ స్పష్టమైన ఉద్దేశ్యం నెరవేరడం కొరకే దేవుడు లూకాను ప్రేరేపించాడు, లూకా ఈ గ్రంథాన్ని రాయడానికి పూనుకున్నాడు.
అనేకులు రాసిన రచనలు ఉన్నాయని లూకానే చెబుతున్నాడు, కానీ అవేంటో చెప్పలేదు. బహుశా మత్తయి, మార్కు కూడా ఆ జాబితాలో ఉండి ఉండొచ్చు. 'ఉండి ఉండొచ్చు' అని ఎందుకు అంటున్నాము అంటే ఆ రెండు గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయో మనకు తెలియదు.
2. ఎక్కడి నుంచీ వచ్చిన సమాచారం?
"ఆరంభం నుండి చూచి, వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము" - ఈ వాక్యసేవకులు యేసు యొక్క పరిచర్యను కళ్లారా చూసారు. కళ్లారా చూసినవాటిని, చెవులారా విన్న సువార్తను నమ్మకంగా ప్రకటించారు. ఆ సత్యము నలుగురు రచయితల ద్వారా గ్రంథస్థం చెయ్యబడే వరకూ దేవుడు దానిని వాక్యసేవకులైనవారి ద్వారా భద్రపరిచాడు.
ఈ కన్నులారా చూచినవారు చెప్పిన వాటి ఆధారంగానే లూకా ఈ సువార్తను రచించాడు.
మార్కు లాగానే లూకా కూడా నేరుగా / కన్నులారా వాటన్నిటినీ చూడలేదు కానీ వారు అపొస్తలులతో పాటు ప్రయాణిస్తూ పరిచర్య చేశారు కాబట్టి ఆ అపొస్తలుల దగ్గరి నుంచే లూకా గానీ, మార్కు గానీ తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవడం సాధ్యపడింది.
3. ఎందుకు రాయాలనుకున్నాడు?
"వాటన్నింటిని తరచి పరిష్కారంగా తెలిసికొనియున్న నేను" అంటే యేసు క్రీస్తుని, ఆయన చేసిన అద్భుత కార్యాలను కళ్ళారా చూసి, ఆయన బోధను చెవులారా విన్న ప్రత్యక్షసాక్షులు చెప్పిన సమాచారం (ప్రశస్తమైన సత్యం) తన దగ్గర ఉంది కాబట్టి, "వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచాడు" లూకా.
అంటే తన పాఠకులు ఒక వరుస క్రమములో స్పష్టముగా సత్యాన్ని అర్థం చేసుకోవాలని అనుకున్నాడు లూకా. అంత మాత్రమే కాదు తన పాఠకులకు "ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని వారు తెలిసికోవాలని" అతని కోరిక.
4. ఎవరికి రాసాడు?
"ఘనతవహించిన థెయొఫిలా" - ఇతని గురించి పెద్దగా వివరాలేమీ తెలియజేయబడలేదు.
"ఘనతవహించిన" అనే ఇదే పదాన్ని లూకా అపో. కార్య. 23:26; 24:3; 26:25 లో ఫేలిక్సు, ఫేస్తూ గవర్నర్ల గురించి వాడాడు.
అంటే థెయొఫిలా కూడా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినవాడు అయ్యుండొచ్చు.
5. ఎందుకు లూకా ఈ సువార్తని బాప్తిస్మమిచ్చు యోహాను గురించిన కథ చెప్తూ ప్రారంభించాడు?
1) అలా చేయడం ద్వారా, లూకా పాత, కొత్త నిబంధలు వేరు వేరు కాదు, కొత్తది పాతదాని యొక్క కొనసాగింపే అని చెప్తున్నాడు.
2) బాప్తిస్మమిచ్చు యోహాను - పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. ఆ ప్రవచనాలు సరిగ్గా నెరవేరతున్నాయని తెలియజేస్తూనే, వాటికీ కొత్త నిబంధనకీ ఉన్న సంబంధం ఏంటో తెలియజేస్తున్నాడు.
3) 400 సంవత్సరాల పాటు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ 400 సంవత్సరాల తరువాత, మొట్టమొదటిసారి అద్భుతరీతిన గబ్రియేలు దూత ప్రత్యక్షమై బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడడం జరిగింది.
జెకర్యా ఎలీసబెతులకు పిల్లల్ని కనే వయస్సు దాటిపోయిన తరువాత యోహాను జన్మించడం - ఒక అద్భుతం. ఇంతకంటే గొప్ప అద్భుతం "కన్యకకు యేసు క్రీస్తు జన్మించడం" - దానికి 'యోహాను పుట్టుక' ముంగుర్తుగా ఉంది.
4) బాప్తిస్మమిచ్చు యోహానే మెస్సీయాకి ముందుగా నడిచేవాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. యోహాను మెస్సీయాకు ముందుగా నడిచేవాడు అనేది సత్యం కాబట్టి ఆ తరువాతి కాలంలో యేసే మెస్సీయా అని యోహాను ఇచ్చిన సాక్ష్యం కూడా సత్యమేనని ఈ కథ ధృవీకరిస్తుంది.
5) వారిద్దరి జనన వృత్తాంతాలనూ, వాటిని లూకా వివరించిన విధానాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో కొన్ని పోలికలున్నాయని గ్రహించగలం. అవేంటంటే -
మొదటిది - వారి పుట్టుక గురించి గబ్రియేలు దూత ప్రకటిస్తాడు.
రెండవది - ఇద్దరి పుట్టుక అద్భుతరీతిన సంభవిస్తుంది - ఒకరు వృద్ధదంపతులకు పుడితే, మరొకరు కన్యకకు పుడతారు.
మూడవది - ఇద్దరికీ సున్నతి చేయబడుతుంది.
నాలుగవది - వారు పుట్టిన తరువాత వారి గురించి ప్రవచనాలు చెప్పబడతాయి.
II.యోహాను పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:5-25)
మొదటి నాలుగు వచనాల్లో - పరిచయపు మాటలు చదువుతాం.
5-25 వచనాల్లో జెకర్యా ఎలీసబెతుల వృత్తాంతము, దూత బాప్తీస్మమిచ్చు యోహాను గురించి ప్రవచించడము & దాని నెరవేర్పు గురించి చూస్తాము.
"5. యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.”
"యూదయదేశపు రాజైన హేరోదు దినములలో" -
హేరోదు గురించిన ప్రస్తావన రెండుసార్లు మాత్రమే ఉంది. ఒకటి ఇక్కడ, రెండవది మత్తయి 2:1-22 లో. అయినప్పటికీ, యేసు క్రీస్తు పుట్టుక గురించిన విషయాలలో హేరోదు కీలకమైన పాత్ర పోషించాడు. అతని గురించి ఎక్కువగా మత్తయి సువార్తలోనే చదువుతాం. (హేరోదు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మత్తయి సువార్త 2 వ అధ్యాయం యొక్క వ్యాఖ్యానాన్ని చూడండి.)
చారిత్రక వివరాల తరువాత జెకర్యా యొక్క వ్యక్తిగత వివరాలను తెలియజేస్తున్నాడు లూకా.
"అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను."
జెకర్యా ఒక యాజకుడు.
1 దిన 24:4-19 లో దావీదు, సాదోకు, అహీమెలెకు కలిసి యాజకధర్మం చేసేవారినందరినీ 24 గుంపులుగా విభజించారు. అందులో ఎనిమిదవది - అబీయా.
బబులోను చెర తరువాత - 4 గుంపులవారే యూదాకి తిరిగి వచ్చారు.
అయితే 24 అనే సంప్రదాయం ఎప్పటి నుంచో వాడుకలో ఉంది కాబట్టి అప్పటి యూదులు చెర నుండి తిరిగివచ్చిన ఆ 4 గుంపులవారినే మళ్ళీ 24 గుంపులుగా విభజించారు. తిరిగివచ్చిన నాలుగు గుంపులలో "అబీయా" గుంపు లేనప్పటికీ ఆ నాలుగునే 24 గుంపులు చేసి వారికి మళ్ళీ పాత పేర్లే పెట్టడం వల్ల జెకర్యా అబీయా గుంపుకి చెందినవాడయ్యాడు.
"అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు." జెకర్యా భార్య గురించి ఈ వివరాలు మాత్రమే తెలియజేశాడు లూకా.
“6. వీరిద్దరు ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.”
"వీరిద్దరు.......దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి."
యూదులు దేవుణ్ణి యథార్ధంగా ఆరాధించడం మానేశారు. వేషధారులుగా జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని దృష్టికి జెకర్యా ఎలీసబెతులు నీతిమంతులుగా జీవించారు.
ఆది 15:6 లో అబ్రాహాము ఎలాగైతే నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అలాగే వీరు కూడా నీతిమంతులయ్యారు.
కేవలం నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాదు, వారు పరిశుద్ధపరచబడుతూ వచ్చారు.
"ప్రభువుయొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొన్నారు" అని వారి గురించి తెలియజేయబడింది.
నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధపరచబడటం - ఈ రెండూ విడదీయరానివి. ఒకదానికి వేరుగా మరొకటి ఉండనేరదు. నీతిమంతునిగా తీర్చబడిన ప్రతి వ్యక్తి తప్పక పరిశుద్ధపరచబడే ప్రక్రియలో కొనసాగుతాడు. అనుదిన జీవితంలో పరిశుద్ధపరచబడే అనుభవం లేనివాడు అసలు నీతిమంతునిగా తీర్చబడలేదు. కాబట్టి ఉంటే రెండూ ఉంటాయి, లేకపోతే రెండూ ఉండవు. ఒకటి జరిగి మరొకటి జరగకుండా ఉండటం సాధ్యపడదు అని బైబిల్ బోధిస్తుంది.
"నిరపరాధులుగా నడుచుకొన్నారు"
అంటే వారి గురించి చెడుగా చెప్పడానికేమీ లేదని అర్థం. వారు అసలు అటువంటి అవకాశమే ఎవరికీ ఇవ్వలేదేమో. క్రైస్తవులం అని చెప్పుకునే మనం కూడా వీరికి లాగా సవాలుకరమైన జీవితాలను జీవించబద్ధులమైయున్నాము.
నీతిమంతులైనప్పటికీ ఎలీసబెతు గొడ్రాలైనందున ఆ వృద్ధ దంపతులకు పిల్లలు లేకపోయెను.
యూదుల సమాజంలో - "పిల్లలు లేకపోవడం" అనేది ఎంతో వేదనతో కూడిన పరిస్థితి.
ఉదా: యూదులలో గొడ్రాలైనటువంటి స్త్రీ ఎంత వేదనకు గురి అవుతుందో రాహేలు హన్నాల గురించి చదివితే అర్థం అవుతుంది.
రాహేలు - ఆది 30:1-2, 23 ; హన్నా - 1 సమూ 1:4-11 .
పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని కీర్తన 113:9; 127:3; ఆది 33:5 చెప్తున్నాయి.
కాబట్టి పిల్లలు కలగకపోతే, తల్లిదండ్రుల పాపమే అందుకు కారణం అనుకునేవారు.
కానీ ఈ అభిప్రాయం తప్పు. పిల్లల్ని కన్నవారు అందరూ పరిశుద్ధులూ కాదు, పిల్లల్ని కనలేనివారందరూ పాపాత్ములూ కాదు. దేవుడు మనకు ఇహసంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో పాపం కూడా ఒక కారణం. అంతేగానీ ప్రతీసారి పాపమే కారణం అయ్యుండదని గమనించాలి. ఉదాహరణకు, ఇందాక మనం చూసిన హన్నా విషయంలో హన్నా పాపం చేసినట్లు, దానిని ఆమె ఒప్పుకొని విడిచిపెట్టిన కారణాన్ని బట్టే దేవుడు ఆమెకు సమూయేలును దయచేసినట్లు చెప్పబడలేదు. హన్నా దేవుణ్ణి ప్రార్థిస్తూ, తనకు పిల్లల్ని అనుగ్రహించమని మొరపెడుతూ దేవుని సమయం కోసం కనిపెట్టింది. దేవుడు తన సమయంలో ఆమెకు బిడ్డల్ని అనుగ్రహించాడు. అలాగే చాలా మంది ఎంత ప్రార్ధించినా, ఎంత నీతియుక్తమైన జీవితాలు జీవించినా పిల్లల్ని పొందుకోలేదు. అంటే దేవుడు వారికి బిడ్డల్ని ఇవ్వాలనుకోలేదు అని గ్రహించాలి. కాబట్టి చాలాసార్లు మన క్రియలతో నిమిత్తం లేకుండా కూడా దేవుడు తన రహస్య చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయన మనతో ఇలా వ్యవహరిస్తుంటాడని గ్రహించాలి.
నిరాశతో ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ జెకర్యా ఎలీసబెతులు వృద్ధాప్యం వరకూ నీతిమంతులుగా కొనసాగారు.
సవాలుకరమైన పరిస్థితులలో సైతం సాతాను గురించి దేవునికి ఫిర్యాదు చెయ్యడం, పరిస్థితులను బట్టి సణగడం వంటివి చెయ్యకుండా, తమ పరిస్థితులన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయని విశ్వసించారు - జెకర్యా ఎలీసబెతులు. ఈ విషయంలో వారు మనకు మాదిరిగానున్నారు.
దేవుడు తన సమయంలో తన కృప చొప్పున జెకర్యా ఎలీసబెతులకు కుమారుణ్ణి దయచేసాడు.
అంత మాత్రమే కాదు, దేవుడు వారికి అనుగ్రహించింది సాధారణ కుమారుణ్ణి కాదు. అతని గురించి వాక్యంలో ఎం చెప్పబడింది అంటే 'అతను మెస్సీయాకి ముందు నడిచేవాడు'.
నీతిమంతులను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, ఎలా, ఎప్పుడు అనేది ఆయన ఇష్టం. అయితే నీ బాధ్యతేంటి?
‘ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను........ నడుచుకోవడం’.
"8. జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా"
యెరూషలేము ఆలయంలోకి ప్రవేశించి యాజకధర్మం జరిగించడానికి (ధూపం వెయ్యడానికి) ఒక యాజకుడికి ఉండే రెండే రెండు అవకాశాలలో ఇదొకటి. ఒక యాజకుడుకి జీవితం మొత్తంలో రెండు సార్లే ఈ అవకాశం వచ్చేది ఎందుకంటే చాలా మంది యాజకులు ఉండేవారు, వారందరూ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. వారందరికీ అవకాశం ఇవ్వడం కోసం ఇటువంటి పద్ధతిని అవలంభించేవారు.
సంవత్సరానికి రెండు సార్లు వారమేసి రోజులు, ఒక్కో తరగతికి చెందినవారు ఆలయములో యాజక ధర్మం చేసేవారు.
"9. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను."
ఆలయంలో ధూపం వెయ్యడం అనేది అనునిత్యం జరుగుతూ ఉండేది. ఒక్కో తరగతికీ ఉండే వారం వారాల వ్యవధిలో ప్రతి యాజకుడికీ ధూపం వేసే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే యాజకులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అయితే ఏ రోజు ఎవరు ఆలయంలోకి వెళ్లి ధూపం వేస్తారు అన్నది ఎలా నిర్ణయించబడేది? ఈ విషయాన్ని గురించిన వివరాలేవీ ఇక్కడ తెలియజేయబడలేదు. చీట్లు వేసి వంతులను నిర్ణయించేవారని బైబిల్ పండితుల అభిప్రాయపడతారు.
ఒకరోజు ఆ అవకాశం జెకర్యాకి వచ్చింది . అటువంటి అవకాశం రావడం ఒక యాజకుడు 'గొప్ప ధన్యతగా' భావిస్తాడు. చాలామంది యాజకులకు వారి జీవితకాలమంతటిలో అటువంటి అవకాశం అసలు లభించకుండానే చనిపోతుండేవారు.
యాజకులు ఈ ధూపం వేసే పని ప్రతినిత్యం చేస్తూ ఉండేవారు. అయితే ఇదంతా ఎక్కడ చేసేవారంటే - పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తూ తెర ఉండేది, ఆ తెర ఎదుట ధూప వేదిక ఉండేది, అక్కడ చేసేవారు.
"10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా"
ఒక యాజకుడు ప్రతి రోజు ఉదయము, సాయంత్రము ధూపం వేసేవాడు. మిగతా యాజకులు, ప్రజలు ప్రార్థన చేస్తూ బయట నిలబడేవారు.
యాజకుడు సాధ్యమైనంత త్వరగా తన పనులన్నీ ముగించుకొని బయటకు వచ్చేసేవాడు ఎందుకంటే అతను అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉన్నందున భయపడేవాడు - ఏదైనా పొరపాటు చేసి దేవుని ఉగ్రతకు గురై చనిపోతామేమోనని.
ప్రాయశ్చిత్త బలిని అర్పించడానికి, సంవత్సరానికి ఒక రోజు, ప్రధానయాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు.
అయితే ఈ సందర్భంలో జెకర్యా ప్రధానయాజకుడు కాదు, ఇది ప్రాయశ్చిత్తార్థదినము కాదు. సాధారణంగా అనునిత్యం జరిగే కార్యక్రమం. యాజకులు చేసే పని.
పైకి లేగుస్తూ ఉండే ధూపము - ప్రజల యొక్క ఒప్పుకోలు ప్రార్థనలకూ, పశ్చాత్తాపడుతూ చేసే ప్రార్థనలకూ, కృతజ్ఞతార్పణలకూ సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు ప్రజలు దేవునిపై ఆధారపడుతున్నారు అనడానికీ, ఆయనకు లోబడుతున్నారు అనడానికీ, ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి నడుచుకుంటున్నారు అనడానికీ పైకి లేచే ధూపం గుర్తుగా ఉంది.
దూత మాట్లాడ్డం ప్రారంభించినప్పుడు, 400 సంవత్సరాల నిశ్శబ్దం ఛేదించబడింది. నిశ్శబ్దం ఎందుకంటే దేవుడు ఆ 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ద్వారానూ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదు. మలాకీ ఎక్కడ వదిలేసాడో, లూకా అక్కడి నుండి కొనసాగిస్తున్నాడు అనమాట.
"11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా”
ఒక దూత ప్రత్యక్షమవ్వడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఎందుకంటే అంతకముందు చివరిసారిగా దూత ప్రత్యక్షమయింది పాత నిబంధనలో జెకర్యా ప్రవక్తకు. దాదాపు 500 సంవత్సరాల క్రితం. ఆ జెకర్యాకు దూత దర్శనాలలో కనబడితే (జెకర్యా 1:9; 2:3; 4:1) ఈ జెకర్యాకు నేరుగా ప్రత్యక్షమయ్యాడు. "దూత ధూపవేదిక కుడివైపున నిలిచి" అన్న మాటల నుండి ఈ పై సంగతులు అర్థం చేసుకోవచ్చు. అది కేవలం జెకర్యా ఊహ అనడానికి వీలు లేదు.
వ. 12,13 లో జెకర్యా ఎలా స్పందించాడో చూస్తాము –
“12. జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడినవాడాయెను.”
"తొందరపడి" అన్న మాటని ఇలా కూడా తర్జుమా చెయ్యొచ్చు - "వణికిపోయాడు", "చాలా ఎక్కువగా భయపడ్డాడు" (terrified).
సాధారణంగా పరిశుద్ధ దూతలు ప్రత్యక్షమైనప్పుడు, ప్రజలకు వారి పాపములను జ్ఞాపకం చేయడమూ, దేవుని తీర్పు వారి మీదికి రాబోతోందని హెచ్చరించడమూ లాంటివి జరిగేవి.
తన విషయంలో కూడా అటువంటిదేదైనా జరుగుతుందేమోనని జెకర్యా భయపడుతున్నాడు. అలా జెకర్యా భయపడడాన్ని గమనించిన దూత, ముందు ఆదరణకరమైన మాటలు పలికాడు –
“13. అప్పుడా దూత అతనితో - జెకర్యా, భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.”
"జెకర్యా భయపడకుము" - ఇలా ఎందుకు అంటున్నాడు అంటే దూత తీసుకొచ్చింది తీర్పుకు/ శిక్షకు సంబంధించిన వర్తమానం కాదు గానీ ఆశీర్వాదానికి సంబంధించిన వర్తమానం.
"భయపడకుము" అన్న మాట వేరు వేరు సందర్భాలలో అబ్రాహాము, హాగరు, దానియేలులతో కూడా చెప్పబడింది. ఆ మాటకు అర్థం -
మొదటిది, భయపడొద్దు,
రెండవది, దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు, ఒక అద్భుతం జరగబోతోందని సూచిస్తోంది.
ఈ సందర్భంలో ఆ అద్భుతం ఏంటంటే వృద్ధ దంపతులైనవారు కుమారుణ్ణి కనడం – “నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును”.
"నీ ప్రార్థన వినబడినది" - జెకర్యా ఎలీసబెతులు సంతానం గురించి ఎన్నో ఏళ్ల నుండి ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు. దూత ప్రత్యక్షమైననాటికి వారు వృద్ధులయ్యున్నారు గనుక మానవ కోణంలో నుంచి ఆలోచిస్తే ఆశలన్నీ వదులుకొని ఉంటారు. కానీ దేవుడు తన దైవికమైన ఉద్దేశాలకు అనుగుణంగా ఈ సమయంలో వారి ప్రార్థనకు ఈ విధంగా జవాబిచ్చాడు.
కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా జవాబిస్తాడు. అంతమాత్రాన మన ప్రార్థన వినలేదని కాదు. ఆలస్యం అవుతోందని మనం అనుకుంటాము. సరియైన సమయంలో సరియైన దానిని ఇవ్వక మానడు ఆయన. ఆ ఆలస్యం మన విశ్వాససహితమైన ప్రార్థనను నిరుత్సాహపరచనివ్వొద్దు.
మరికొన్ని సందర్భాలలో దేవుడు మనకు కావాల్సినవి ఎప్పటికీ అనుగ్రహించకపోవచ్చు. అప్పుడు కూడా ఆయన మన ప్రార్థన వినలేదు అనలేము. ఎందుకంటే ఆయన మన ప్రతి ప్రార్థన వింటాడు అని బైబిల్ బోధిస్తుంది. ఆయన ప్రతి ప్రార్థన వింటాడు కానీ మనకు మేలైనది మాత్రమే మనకు దయచేస్తాడు. ఒకవేళ మనం దేని గురించైతే ప్రార్దించామో, అది ఆయన రహస్య చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆయన దానిని మనకు అనుగ్రహించడు. అది కూడా మన మేలు కొరకే అనిగ్రహించాలి.
"యోహాను అను పేరు పెట్టుదువు” - యోహాను(గ్రీకు.) అంటే "దేవుడు కృపగలవాడు"
మెస్సీయాకు ముందుగా నడిచేవానికి ఆ పేరు పెట్టాలనుకోవడంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు?
బహుశా తన కుమారుడైన యేసు క్రీస్తుని మనకు బహుమానంగా అనుగ్రహించడం ద్వారా దేవుడు మనపై తన కృపను కుమ్మరించబోతున్నాడన్న విషయాన్ని ఈ పేరు సూచిస్తూ ఉండవచ్చు. (యోహాను 1:14).
"14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,”
"అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై"
ప్రభువు ఘనంగా/ గొప్పగా ఎంచేవి, ఈ లోకం ఘనహీనమైనవాటిగా చూస్తుంది. ప్రభువుకు హేయమైనవాటిని ఈ లోకం ఘనమైనవాటిగా ఎంచుతుంది.
ఇక్కడ యోహాను గొప్పతనము తనకు కలగబోయే సిరిసంపదలను బట్టో, జ్ఞానాన్ని బట్టో కాదు గానీ దేవుడు అతన్ని పిలిచిన పిలుపును బట్టి, అతని పట్ల దేవుడు చూపిన కృపను బట్టి మాత్రమే.
బాప్తీస్మమిచ్చు యోహాను గొప్పతనాన్ని గురించి యేసు ప్రభువు ఇచ్చిన సాక్ష్యం చూడండి - మత్తయి 11:11 -
‘11. స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.’
పాత నిబంధన భక్తులందరికంటే యోహాను గొప్పవాడు అని ఈ వచనాన్ని బట్టి గ్రహించవచ్చు.
అబ్రాహాము, దావీదు, నోవాహు, హానోకు వంటి ప్రవక్తలందరికంటే కూడా యోహాను గొప్పవాడు.
"ప్రభువు దృష్టికి" - ఈ మాట దేవుని ఏర్పాటు/ఎన్నిక గురించి తెలియజేస్తోంది. యోహాను ఇంకా పుట్టక మునుపే అతను ఏర్పాటు చేయబడడం గురించి దూత ద్వారా దేవుడు సెలవిస్తున్న ఈ మాటలు, దేవుడు అతన్ని ఎనుకున్నాడు అన్న సత్యాన్ని ధ్రువీకరిస్తున్నాయి.యోహాను 15:16
యిర్మీయా 1:4-5 - యిర్మియా; గలతీ 1:15-16 - పౌలు -
యిర్మియా గురించి, పౌలు గురించి తెలియజేసే ఈ లేఖన భాగాలను పరిశీలించినప్పుడు కూడా దేవుడు ముందుగానే ఎన్నుకుంటాడు అన్న సత్యాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు.
"ద్రాక్షారసమైనను, మద్యమైనను త్రాగక"
“మద్యము” అని తర్జుమా చేయబడిన పదం - షేకర్ (హీబ్రూ). దీనినే గ్రీకులో ‘సికెర’ అని అంటారు. ఇది చాలా ఘాటుగా ఉండే పానీయం. ఇది తాగిన వెంటనే మత్తు ఎక్కేది.
“ద్రాక్షారసము” గురించి హీబ్రూ గ్రీకు బాషలలో రెండు వేరు వేరు పదాలు బైబిల్ లో వాడబడ్డాయి.
అలాగే ఆ రోజుల్లో స్వచ్ఛమైన నీరు దొరికేది కాదు. ద్రాక్షారసం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉండేది మరియు దానికి క్రిములను సంహరించే గుణం కూడా ఉండేది కాబట్టి నీళ్లని ద్రాక్షారసంతో కలిపి తాగేవారు (1 తిమోతి 5:23). కానీ అటువంటి పరిస్థితి గానీ అవసరం గానీ ఈ రోజుల్లో లేదు.
సాధారణంగా ఈ నీళ్లతో కలిపిన ద్రాక్షారసాన్నే యూదులు తాగేవారు, యేసు కూడా దీన్నే త్రాగాడు. కానా విందులో యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కదా, దానిని తాగిన అతిధులు దానిని ‘ఓయినోస్’ అని అన్నారు, అంటే అది నీళ్లు కలిపిన ద్రాక్షారసం లాగ ఉండింది అనమాట.
సంఖ్యా 6: 1-4 ప్రకారం నాజీరు చేయబడిన వ్యక్తి 'ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.'
అందుకే యోహాను "ద్రాక్షారసమైనను, మద్యమైనను త్రాగక" యుండెను.
అయితే నాజీరు చేయబడని వాళ్ళందరూ తాగుబోతుల్లవ్వొచ్చా అంటే కాదు. సాధారణంగా అందరూ నీళ్లు చాలా ఎక్కువ పాళ్లల్లో కలిపి బాగా పలచగా చేసిన ద్రాక్షారసాన్నే తాగేవారు అని ఇందాక చూసాము. అయితే మత్తు కలిగించే పానీయాలు సేవించడాన్ని, తాగుబోతుతనాన్ని మాత్రం పా.ని. మరియు కొ. ని. తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాగుబోతుతనం వల్ల ఎదుర్కోవాల్సిన దుష్పరిణామాల గురించి సామెతల గ్రంధంలోనూ ఇంకా అనేక పాత, కొత్త నిబంధన గంధాల్లోనూ వివరంగా తెలియజేయబడింది.(సామెతలు 20:1)
కొత్త నిబంధన విశ్వాసులమైన మనం కూడా దేవుని చేత ప్రత్యేకించబడిన వారమై మత్తు కలిగించేటువంటి పానీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. (ఎఫెసీ 5:18)
“15. తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,”
పుట్టినది మొదలుకొని, యోహాను పరిశుద్దాత్మ చేత నియంత్రించబడుతూ, పరిశుద్దాత్మ యొక్క ఆధీనంలో ఉంటాడన్నమాట.
"ఆత్మ చేత నింపబడడం" - పరిశుద్ధపరచబడటానికి ఇది చాలా ముఖ్యమైనది.
1 కొరింథీ 6:11; 2 థెస్స 2:13; 1 పేతురు 1:2; అపో. కార్య. 1:8; ఎఫెసీ 5:18
యోహాను విషయంలో పరిశుద్దాత్మ పరిచర్య, అతనింకా తన తల్లి గర్భంలో ఉండగానే మొదలయ్యింది. లూకా 1:41
గర్భములో ఉన్న పిండము - పరిశుద్దాత్మ చేత నింపబడినట్లు చదువాము. అంటే ఆ పిండములో జీవమున్నదని గ్రహించవచ్చు. కాబట్టి గర్భధారణ తోటే జీవము ఆవిర్భవించింది అని అర్థం చేసుకోవాలి. అందుకనే బైబిల్ అబార్షన్ కు (భ్రూణహత్య) వ్యతిరేకం. బైబిల్ ప్రకారం అబార్షన్ అంటే ఒక శిశువుని హత్య చెయ్యడమే.
“16. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.”
తరువాతి కాలంలో యోహాను పెరిగి పెద్దవాడై దేవుని చేత పంపబడినవాడై అనేకులకు దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు. మారుమనస్సు గురించీ, బాప్తీస్మము గురించి యోహాను బోధిస్తాడు. అనేకులు (అందరు కాదు) ఆ బోధకు విధేయత చూపి, బాప్తీస్మము పొందుతారు (యోహాను చేతనే). ఆ విధంగా దూత చెప్పిన ఈ సంగతులు నెరవేరాయి.
"దేవుని వైపునకు త్రిప్పును" - ఈ పదం మారు మనస్సు గురించిన సందర్భాలలో ఎక్కువగా వాడబడింది. అయితే ఎవరైనా మారుమనస్సు పొందేలా చెయ్యడం మన పని కాదు, దేవుని పని. యోహాను కేవలం సాధనం మాత్రమే. పశ్చాత్తాపం గురించి బోధించడం ద్వారా, యేసునందు విశ్వాసముంచమని ప్రకటించడం ద్వారా యోహాను దేవుని చేతిలో పనిముట్టులాగా వాడబడ్డాడు. (మత్తయి 3:1-6, మార్కు 1:4 )
"ప్రభువైన వారి దేవుని వైపుకు" - యేసుని దేవుడు అంటున్నాడు. 14 వ వచనంలో తండ్రియైన దేవుడి గురించి కూడా ప్రభువు అనే బిరుదు వాడబడింది. కాబట్టి యేసు కూడా దేవుడే అని లూకా చెప్పకనే చెప్తున్నాడు.
“17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకైఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను."
"ఆయనకు ముందుగా వెళ్ళును.." యెషయా 40:3; మలాకీ 3:1; 4:5,6
ఎందుకు?
"మార్గము సిద్ధపరచడం ...." కోసం - పశ్చాత్తాపాన్ని గురించి బోధించడం ద్వారా, బాప్తీస్మము తీసుకోమని ప్రకటించడం ద్వారా యోహాను మెస్సీయా కొరకు మార్గాన్ని సిద్దపరిచాడు.
ఈ క్రింది వాక్యభాగాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడండి.
1 రాజులు 18: 17-18 = మత్తయి 3:7-11
1 రాజులు 21: 17-24 = మత్తయి 14:14
పోల్చి చూసినప్పుడు ఏలీయాకీ యోహానుకీ కొన్ని పోలికలున్నట్లు అర్ధమవుతోంది.
యోహానే ఎలియానా అన్న సంగతి నిర్దారించుకోవడానికి యూదులు యెరూషలేము నుండి యాజకులనూ లేవీయులనూ పంపిస్తారు. వారు వచ్చి యోహానుని అడుగగా యోహాను ఇలా బదులిస్తాడు.
యోహాను 1:21 -
"21. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను."
మత్తయి 11: 13-14; మత్తయి 17: 10 - 13
యోహాను ఏలీయా కాదు కానీ "ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు ....".
"అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పి ..."
తర్జుమాలో ఇలా అర్థం చేసుకోవచ్చు – ‘తండ్రుల హృదయము, పిల్లలతో కూడా దేవుని వైపుకు త్రిప్పి’.
"అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకు త్రిప్పి” - ఈ మాటలు బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య గురించి తెలియజేస్తున్నాయి.
చివరిగా యోహాను పరిచర్య యొక్క ప్రతిఫలం ఏంటంటే-
"ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై " దీని కొరకే యోహాను నియమించబడ్డాడు.
18 - 25 వరకూ ఉన్న వచనాల్లో జెకర్యా తన అవిశ్వాసాన్ని బట్టి మందలించబడతాడు.
అప్పటి వరకూ భయపడ్డాడు, అంతలోనే అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు, అనుమానాలతో కూడిన ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు.
“18. జెకర్యా - యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా”
అపో. కార్య. 12:12-16 లోని విశ్వాసులు కూడా జెకర్యా వలె ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మలేక పోయారు.
పైన ఉన్న వచనాల్లో జెకర్యా గురించి "నీతిమంతుడు" అని చెప్పినట్లు చూసాం, అయితే ఈ సందర్భాన్ని బట్టి అతను పాపం లేనివాడైతే కాదని అర్ధమవుతోంది.
ఈ సందర్భంలో అబ్రాహాము సంగతి అతనికి జ్ఞాపకం వచ్చి ఉండాలి. రోమా 4:19,20 లో అబ్రాహాము గురించి చెప్పబడింది. జెకర్యాను అబ్రాహాముతో పోల్చి చూడండి.
దేవుని మాటలను అనుమానించడం లేదా ఆయన వాగ్దానాలను నమ్మకపోవడం అంటే దేవుణ్ణే నమ్మునట్లు, ఆయన్నే తిరస్కరించినట్లు.
ఏ సందర్భంలోనైనా మన స్పందించే తీరు మన విశ్వాసాన్ని తెలియజేస్తుంది.
జెకర్యా యొక్క అవిశ్వాసాన్ని బట్టి, గబ్రియేలు దూత అతన్ని మందలించవలసి వచ్చింది/ క్రమశిక్షణ చెయ్యవలసివచ్చింది.
“19. దూత - నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.”
"నేను….. గబ్రియేలును" - "దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును" అంటే నేను సాధారణ దూతను కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరో విధంగా చెప్పాలంటే - "నీకు దానియేలు తెలుసా? అతనికి ప్రవచనం చెప్పింది ఎవరో తెలుసా? నేనే" అని చెప్తున్నాడు దూత.
బైబిల్ లో ఇద్దరి దూతల పేర్లు మాత్రమే తెలియజేయబడ్డాయి. మిఖాయేలు మరియు గబ్రియేలు.
గబ్రియేలు దేవుని యొక్క ప్రధాన దూత, కొన్ని అతి ప్రాముఖ్యమైన ప్రకటనలు చెయ్యడానికి పంపబడేవాడు.
గబ్రియేలును చూసినప్పుడు మెస్సీయా గురించి దానియేలుతో చెప్పబడిన ప్రవచనాలు నెరవేరబోతున్నాయని అర్థం చేసుకోవాలి.
ఎందుకు పంపబడ్డాడు?
"నీతో మాట్లాడుటకును" – జెకర్యాతో.
"ఈ సువర్తమానము నీకు తెలుపుటకు". సువర్తమానము అనే పదం అన్యజనులకు చాలా సుపరిచితమైన పదం. ఎలాగంటే ముఖ్యమైన కార్యక్రమాల (శుభవార్తలు) గురించిన ప్రకటన ఏదైనా చేసేటప్పుడు ప్రకటన చేసేవారు ముందు ఈ మాటను పలుకుతూ (అరుస్తూ) ప్రజల దృష్టిని వారి వైపుకు తిప్పుకునేవారు.
ఉదా - సీజర్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవ్వడం గురించిన ప్రకటన చేసేటప్పుడు ముందు ‘యూ అంగలిజో’ (శుభవార్త) అని అరిచి, అందరి దృష్టిని వారి వైపుకు తిప్పుకున్న తరువాత ప్రకటన చేస్తారు.
ఈ పదం నాలుగు సువార్తల్లో 11 సార్లు కనబడుతుంది. అందులో 10 సార్లు లూకా సువార్తలోనే కనబడుతుంది.
"పంపబడితిని" - నా అంతట నేను రాలేదు అని చెప్తున్నాడు దూత.
"నీతో మాట్లాడుటకును" - అందరి గురించీ కాదు గానీ కేవలం జెకర్యాతో మాట్లాడ్డానికే దూత వచ్చాడు.
“20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.”
జెకర్యా యొక్క పాపసహితమైన అవిశ్వాసం కారణంగా గబ్రియేలు దూత జెకర్యాను ఇలా శిక్షిస్తాడు -
"ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువు".
మాట్లాడలేడు కాబట్టి ఆలయంలో జరిగిన అనుభవాన్ని ఎవరికీ చెప్పలేడు, ఆ దర్శనానికీ తమకు కుమారుడు పుట్టడానికీ సంబంధం ఉందనీ చెప్పలేడు. అంతమాత్రమే కాదు - వాళ్ళ ఊరిలో తన యాజక ధర్మాన్ని కూడా నిర్వర్తించలేడు ఎందుకంటే యాజకుడి బాధ్యత ధర్మశాస్త్రాన్ని "బోధించాలి". అలా చేయలేకపోవడం దేవుని తీర్పును సూచిస్తోంది. ఇది జెకర్యా సిగ్గుపడేటువంటి విషయం ఎందుకంటే "నా (దూత) మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు (జెకర్యా)వాటిని నమ్మలేదు”
గబ్రియేలు దూత యొక్క ఈ ముగింపు మాటలు జెకర్యా అవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. అందులో దేవుని సార్వభౌమత్వాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జెకర్యా అవిశ్వాసం దేవుని అనాధికాల ప్రణాళికను కాలరాయడం లేదు. ఏది ఏమైనా గానీ ఆయన నిర్దేశించినవి, అలాగే తప్పక జరుగుతాయి. అయితే జెకర్యా తనకు దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప ధన్యతను, బహుమానాన్నీ(అటువంటి చారిత్రక సంఘటనలో పాలు పొందులు పొందడం) నలుగురితో చెప్పుకొని, నోరారాదేవుణ్ణి స్తుతించే అవకాశాన్ని తన అవిశ్వాసం ద్వారా కాలదన్నుకొని, క్రమశిక్షణ చేయబడ్డాడు.
ఆ తొమ్మిది నెలల జెకర్యా, తన అవిశ్వాసాన్ని బట్టి సిగ్గుపడుతూ ఉండి ఉండవచ్చు. మంచి గుణపాఠం నేర్చుకొని ఉండవచ్చు. ఎంత చెప్పినా వినకపోతే, దేవుడు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను అనుమతించడం ద్వారా మనకు బుద్ది చెప్తాడు. (హెబ్రీ 3:19 )
అంతమాత్రమే కాదు రానున్న రోజుల్లో తనకు వాగ్దానం చెయ్యబడిన అద్భుతం ఖచ్చితంగ నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఇంకా తొమ్మిది నెలలు పడుతుంది కానీ అతను మాట్లాడలేకుండా అతని నోరు పడిపోవడం అనేది అతనికివ్వబడిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుందనడానికి వెంటనే ఇవ్వబడిన సూచనగా ఉంది.
అలాగే తరువాత జెకర్యా సైగ చెయ్యడం ద్వారానో లేక వ్రాతపలక పైన వ్రాసో జరిగింది చుట్టూ ఉన్న ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినా వారు నమ్మే వారో లేదో తెలియదు కానీ జెకర్యా మాట్లాడలేక మూగవాడయ్యాడు కాబట్టి అలా మూగవాడవ్వడం అతని చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఒక సూచనగా ఉంది.
“21. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.”
ఈ సంభాషణ అంతా జరుగుతుండగా "ప్రజలు జెకర్యా కొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి".
యాజకుడు కేవలం ధూపం వేసేసి బయటికి వచ్చి చివరి ఆశీర్వాదం పలకాలి (సంఖ్యా 6:23-27). కానీ జెకర్యా గబ్రియేలు దూతతో మాట్లాడుతూ ఉండడం వల్ల, బయటికి రావడం ఆలస్యం అయ్యింది. ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటే, ఏదైనా నిర్లక్ష్యంగా ప్రవర్తించినా, అవిధేయతతో నడుచుకున్నా దేవుడు వారిని కఠినంగా శిక్షించిన సందర్భాలు కలవు, అలాంటిదేమైనా జెకర్యా విషయంలో జరిగిందేమోనని ప్రజలు కంగారు పడుతున్నారు. (లేవి 10: 1-7).
అయితే ఈ సందర్భంలో దేవుడు జెకర్యాను చంపలేదు కానీ తాత్కాలికంగా అతను మాట్లాడలేకుండా చేసాడు.
“22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸”
చివరికి అతను బయటికి వెళ్ళినప్పుడు, "వారితో మాటలాడలేకపోయెను".
జెకర్యా ముఖాన్ని చూసి, ప్రవర్తనను బట్టి "ఆలయము నందు అతనికి దర్శనము కలిగిన దని వారు గ్రహించిరి". దాని. 10
ఆ తర్వాత అతను "సంజ్ఞలు చేయుచూ" జరిగిన సంగతులు ఇతరులతో చెప్పాలని ప్రయత్నిస్తూ, "మౌనంగా ఉండెను".
“23. అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.”
అయితే, ఎలీసబెతు జరిగిన సంగతులు తెలుసుకొని, ఎలా స్పందించిందో తదితర విషయాలు తెలియజేయబడలేదు.
లూకా వెంటనే ఆ దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు గురించి చెప్తున్నాడు.
“24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు
"ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై"
ఆమె లేని పోని నిందలతో అవమానించబడకుండా లూకా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ముందు జెకర్యా ఇంటికి వెళ్ళాడు అని, ఆ తరువాత ఆమె గర్భవతి ఆయెను అని, చెప్పాడు.
యేసు క్రీస్తు మరియు అపొస్తలుల కాలమంతటిలో జరిగిన మొట్టమొదటి అద్భుతం ఇది.
ఈ వృద్ధ దంపతులకు ఒక బిడ్డ అనుగ్రహించబడటం.
“మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని”
పిల్లలు పుట్టకపోవడం అనేది కొన్ని సందర్భాలలో దేవుని తీర్పును సూచిస్తూ ఉంది (లెవీ 20: 19-20), కానీ ప్రతి ఒక్కరి విషయంలోనూ పిల్లలు పుట్టకపోవడానికి అదే కారణమని చెప్పటానికి వాక్యంలో ఆధారమేమీ లేదు.
ఎలీసబెతు కూడా తనకు పిల్లలు పుట్టకపోవడాన్ని అవమానంగా భావించింది కాబట్టే ఇప్పుడు దేవుడు తనను కటాక్షించాడు అని చెప్పి హన్నా (1 సమూ 1: 19, 2:10) వలె ఆయనను స్తుతిస్తూ ఉంది.
అలాగే “(ఆమె) అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను”.
ఆమె ఒక వృద్ధురాలు అలాగే ఎన్నో ఏళ్లుగా గొడ్రాలిగా ఉండింది కాబట్టి ఇప్పుడు తాను గర్భవతినయ్యానని ఎవరితోనైనా చెప్పినా వాళ్ళు నమ్మకపోవచ్చు కాబట్టే ఆమె అయిదు నెలలు ఎవరి కంట పడకుండా ఉండింది అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తారు కానీ ఆమె అలా చెయ్యడానికి గల స్పష్టమైన కారణం ఇక్కడే గానీ బైబిల్ లో మరే ఇతర సందర్భంలోనే గానీ తెలియజేయబడలేదు.
III. యేసు పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:26-38)
“26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో”
"ఆరవ నెలలో" అంటే?
గబ్రియేలు దూత మొదటి సారి జెకర్యాకు ప్రత్యక్షమైనప్పటి నుండి ఈ రెండవ సారికి ఆరు నెలలు అవుతోంది అని అర్థం.
ఇంకొక వర్తమానం అందించడానికి “గబ్రియేలను దేవదూత” మరల పంపబడ్డాడు.
తన పాఠకులకు అక్కడి భౌగోళిక సంగతులు తెలిసుండకపోవచ్చు గనుక “గలిలయలోని నజరేతను ఊరిలో” అని వివరంగా చెప్తున్నాడు లూకా.
ఆంగ్ల తర్జుమాలో పట్టణం అనే అర్థం వచ్చేలా తర్జుమా చేశారు కానీ వాస్తవానికి తెలుగు తర్జుమానే సరిగ్గా ఉంది. కొన్ని వందల మంది జనాభా కలిగిన ఒక చిన్న ఊరు - నజరేతు.
నజరేతులో వ్యాపార కార్యకలాపాలు పెద్దగా జరిగేవి కావు. మన భాషలో చెప్పాలంటే అన్ని రహదారులూ నజరేతు చుట్టూ తిరిగి వెళ్లిపోయేవి కానీ నజరేతు మీదుగా ఒక్క రహదారి కూడా వెళ్ళేది కాదు. యూదుల మాతాచారాలను ఎక్కువగా నిర్వహించే ప్రాముఖ్యమైన ప్రదేశాలకు కూడా ఈ ఊరు చాలా దూరంగా ఉండేది.
నజరేతు గురించీ గలిలయ గురించీ ప్రజలకు ఎంత చిన్న చూపు ఉండేదో ఈ వాక్య భాగాలు చదివితే అర్థం అవుతుంది.
గలిలయ గురించి - యోహాను 7:52
నజరేతు గురించి - యోహాను 1:46
యెషయా 9:1 , మత్తయి 4:15 - "అన్యజనుల గలిలయ దేశము ....". కొంత మంది అన్యజనులు నివసించే ప్రాంతాలకు గలిలయ దగ్గరగా ఉండేది.
ఇటువంటి ఊరిని దేవుడు ఎన్నుకోవడంలో కారణం ఏమైఉండొచ్చు?
క్రీస్తు లోకమంతటికీ రక్షకుడు. ఫలానా జాతి/రాజ్యం/దేశానికి చెందినవాడనో లేదా ఒక నిర్దిష్టమైన గొప్ప జ్ఞానుల గుంపుకి/ధనికుల గుంపుకి చెందినవాడనో అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు ఈ ఊరిని ఎన్నుకొని ఉండొచ్చు.
1 కొరింథీ 1:24 - "యూదులకేమీ, గ్రీసుదేశస్థులకేమీ, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియు, జ్ఞానమునైయున్నాడు"
500 సంవత్సరాల క్రితం గబ్రియేలు దూత దానియేలుకు ప్రత్యక్షమై, మెస్సీయా రాకడ సమయం గురించి తెలియజేశాడు, ఆరు నెలల క్రితం అదే గబ్రియేలు దూత జెకర్యాకు ప్రత్యక్షమై మెస్సీయాకు ముందుగా నడిచే వాని గురించి తెలియజేశాడు. ఆ ముందుగా నడిచేవాడు - బాప్తీస్మమిచ్చు యోహాను.
మొదట దేవాలయములో యాజక ధర్మము నెరవేర్చే ఒక పెద్దవాడైన యాజకుని వద్దకు వచ్చాడు. ఇప్పుడైతే యేసు అద్భుతరీతిన జన్మించబోతున్నాడన్న వర్తమానంతో ఒక చిన్న, మారుమూల ఊరిలోని ఒక యవ్వనస్థురాలి వద్దకు వచ్చాడు.
“27. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.”
"కన్యకయొద్దకు" అంటే ఆమె అంతవరకూ ఏ పురుషుని ఎరుగనిది.
ఆమె గురించి ఇంకా ఎం చెప్పబడింది అంటే -
ఆమె "ఒక పురుషునికి ప్రధానము చేయబడినది".
యూదుల ఆచారం ప్రకారం - ఒక అమ్మాయికి 12 లేదా 13 సంవత్సరాల వయస్సు వచ్చాక ప్రధానం చేయబడుతుంది. ప్రధానం చేయబడిన సంవత్సరానికి పెళ్లి చేస్తారు. ప్రధానం అంటే ఈ రోజుల్లో మనం చేసుకునే నిశ్చితార్థం లాంటిది కాదు. యూదుల దృష్టిలో ప్రధానం అంటే చట్టపరంగా కూడా చాలా శక్తివంతమైనది. ప్రధానం చేయబడిన వారిని భార్యా, భర్తలుగా పరిగణించేవారు. చట్టరీత్య ఏర్పడిన ఆ బంధాన్ని కాదనుకోవాలి అంటే వారిరువురిలో ఒకరు చనిపోవడమైనా జరగాలి లేక విడాకులు అయినా తీసుకోవాలి. ఒక వేళ ప్రధానము చేయబడిన తరువాత పురుషుడు చనిపోతే ఆ స్త్రీని విధవగా పరిగణించేవారు. అయితే ఆ సంవత్సర కాలంలో వారు ఎటువంటి శారీరక సంబంధాలు కలిగి ఉండటానికి గానీ కలిసి ఒకే దగ్గర నివసించడానికి గానీ వీలు లేదు. ఆ సమయంలో స్త్రీ తన నమ్మకత్వాన్ని రుజువు పరుచుకోవాలి. పురుషుడు తన భార్యతో కలిసి నివసించడానికి ఇంటిని సిద్ధపరచాలి. ఆ సంవత్సర కాలం అయిపోయిన తరువాత ఒక వారం రోజులు పెళ్లి విందు జరుగుతుంది. ఆ తరువాత వారిద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవించడం ప్రారంభిస్తారు. అప్పుడే వారి వివాహం పూర్తయినట్లు.
"దావీదు వంశస్థుడైన యోసేపు" - యోసేపు దావీదు వంశస్థుడు అని మాత్రమే ఇక్కడ తెలియజేయబడింది గానీ మత్తయి 1:19; 13:55 లో అతను నీతిమంతుడనీ, వడ్రంగి పని చేసుకునే వాడనీ తెలియజేయబడింది.
ఆ యోసేపుకి ఈ కన్యక ప్రధానం చేయబడింది.
యోసేపు వడ్రంగి పని చేసేవాడు అయినప్పటికీ వంశాన్ని బట్టి, దావీదు వంశానికి చెందినవాడు.
యోసేపు శరీరరీత్యా యేసుకు తండ్రి కానప్పటికీ, చట్టరీత్యా మాత్రం ఆయనే యేసుకు తండ్రి అని మత్తయి 1:1-17 లోని ఆయన వంశావళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. (మత్తయి 1:1)
లూకా 3:23-28 లో మరియ వంశావళి గురించి చెప్పబడింది. అలా చూసినా యేసు దావీదు వంశానికి చెందినవాడే అని అర్థం చేసుకోవచ్చు.
జెకర్యా ఎలీసబెతులు ఒక యాజక కుటుంబం - ఆ కుటుంబంలో యోహాను పుడితే, మరియ యోసేపుల రాజ వంశములో యేసు పుట్టాడు.
“ఆ కన్యక పేరు మరియ". ఆమె పేరు మాత్రమే తెలియజేయబడింది. ఇతరత్రా వివరాలేవీ తెలియజేయబడలేదు. ఏమీ తెలియజేయకుండానే, నేడు మనం చూస్తూ ఉన్నట్లు రోమన్ కథోలిక సంఘము మరియను ప్రత్యేకమైన దానిగా, పూజ్యనీయురాలిగా చేసి, ఆమెను ఆరాధించడం, ఆమెకు ప్రార్థన చెయ్యడం వంటివి చేస్తోంది. ఒక వేళ ఆమె గురించి ఇంకా ఏమైనా చెప్పబడి ఉంటె, ఇక ఊహించుకోండి. పరిశుద్దాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన లేఖనాలు కాబట్టి ఎంతవరకూ అవసరమో దేవుడు అంత మాత్రమే వ్రాయించాడు.
“28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.”
నిజంగా దూత రాలేదు, ఇదంతా ఒక దర్శనంలో జరిగింది అని చెప్తారు కొందరు. ఒకవేళ దైవిక దర్శనమే అయితే ఇతర సందర్భాలలో లాగా ఆ విషయం స్పష్టంగా తెలియజేయబడేది.
" ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి " అంటున్నారంటే ఇది దర్శనం కాదు అని అర్ధమవుతోంది. మరియ ఇంటి లోపల ఉన్నదని కూడా తెలుస్తోంది. బహుశా ఒంటరిగా కూడా ఉండి ఉండవచ్చు.
"నీకు శుభము" ఈ రోజుల్లో మనం హలో అని ఎలా చెప్పుకుంటామో, అలాంటి ఒక సాధారణ పలకరింపు.
"దయాప్రాప్తురాలా" అని సంబోదించడంలోని ఉద్దేశ్యం - భయపడాల్సిందేమీ లేదు కానీ దేవుని యొక్క దయకు, కృపకు నోచుకున్నావు అని తెలియజేస్తోంది. ఈ భూమిపై ఇప్పటివరకూ పుట్టిన, ఇకపై పుట్టబోయే స్త్రీలందరిలో ఎవరికీ దొరకని ఆధిక్యత - మెస్సీయాకు తల్లి అవ్వడం. ఆ ప్రత్యేకమైన కృపను ఉద్దేశించి దూత ఇలా అన్నాడు.
అంతే కానీ ఆమెదో ప్రత్యేకమైనదీ కాదు, పాపం లేని సంపూర్ణ పరిశుద్ధురాలూ కాదు. ఆమె కూడా అందరి వంటి పాపే. అందుకే ఆమెకు దేవుని దయ లేదా కృప అవసరమయ్యింది.
దీన్ని కొంత మంది కాథలిక్ పోపులు వక్రీకరించి ఇలా చెప్పారు - మరియ కృపను పొందుకునేది కాదు, కృప చేత నింపడినది. ఆమె మధ్యవర్తిగా ఉండి మానవులకు దేవుని కృపను, దయను అనుగ్రహిస్తుంది అని చెప్పారు. ఆ కృపను పంచి పెట్టే పనికి ఆమె అధిపతి అని వారు చెప్తారు. సెయింట్. లూయిస్. బి. హెర్దార్డ్ అనే వ్యక్తి ఇలా అన్నాడు – “మరియ పరమునకు చేరుకొనబడిన దినము నుండి ఇంతవరకూ ఆమె మధ్యవర్తిత్వం లేకుండా దేవుని కృపను పొందుకున్న మనిషే లేడు".
ఇటువంటి అబద్ద బోధ వల్ల కాథలిక్స్ అంతా మరియను ఆరాధించే పాపంలోకి తోయబడ్డారు. మరియ కూడా ఒక విమోచించబడిన పాపి. ఆమె శరీరంతో ఆరోహణమైపోయింది అని కాథలిక్స్ నమ్ముతారు - అది వేరే విషయం. దేవుడు తప్ప ఏ మనిషీ మంచివాడు కాదు, అందరూ పాపులే అని మాత్రం వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది.
ఇక రెండవది - యేసుతో పాటు మానవులను విమోచించడానికి ఆమె చేసిందేమీ లేదు. రోమా 3:24; ఎఫెసీ 1:7
మూడవది, ఆమె మన ప్రార్థనలు విని, వాటి విషయమై దేవునికి మొరపెట్టే పని కూడా చెయ్యదు. "మానవునికి దేవునికి మధ్య మధ్యవర్తి ఒక్కడే ......ఆయన యేసు క్రీస్తే" అని 1 తిమోతి 2:5 తెలియజేస్తోంది.
మరియ ద్వారా తప్ప దేవునికి మనం దత్తపుత్రులమయ్యే అవకాశమే లేదన్న రోమన్ కాథలిక్స్ యొక్క బోధ - అబద్ద బోధ. అలా అనడం దైవదూషణతో సమానం.
నాలుగవది, తరువాత వచ్చిన పోపులు ఇలాంటి బోధనలు సృష్టించారు కానీ ఈ వచనాలను ఒకసారి పరిశీలించండి.
"ప్రభువు నీకు తోడైయున్నాడని (దూత) చెప్పెను" - అంటే దేవుని తోడు, దేవుని బలము, రక్షణ ఆమెకు అవసరమవుతున్నాయని మరో సారి రుజువయ్యింది. అందుకే దూత - భయపడాల్సిన అవసరం లేదని మరియకు చెప్తున్నాడు. 47, 48 వచనాలలో కూడా మరియ ‘తాను పాపినేనని గ్రహించింది’ కాబట్టే దేవుడు తన రక్షకుడని చెబుతుంది. పాపులకు మాత్రమే రక్షకుడు అవసరం.
"29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా"
కేవలం దూత ప్రత్యక్షమవ్వడాన్ని బట్టి మాత్రమే ఆమె కలవరపడడం లేదు గానీ ఆ దూత ఆమెతో చెప్పిన మాటలను బట్టి ఆమె భయాందోళనకు గురి అయ్యింది. ఇలాగ ఏ యూదుడు ఏ స్త్రీతోనూ చెప్పడు. సొంత భర్త కూడా ఇటువంటి పదాలు వాడి పలకరించడు. అందుకని ఆమె ఆలోచనలో పడింది.
దూత ప్రత్యక్షమైనప్పడు జెకర్యా కూడా ఇలాగే స్పందించినట్లు 12 వ వచనంలో చూస్తాము. ఎందుకంటే ఇటువంటి ప్రత్యక్షతలు కలుగుతాయని వారు ఊహించలేదు. దూతలు ప్రత్యక్షమైతే వారిని ఎలా ఎదుర్కోవాలో, ఎం మాట్లాడాలో వారికి తెలియదు, అందుకు సిద్ధంగా లేరు.
తాను పాపిని అన్న సంగతి మరియకు తెలుసు కాబట్టి దయాప్రాప్తురాలా అనగానే నేను దేవుని కృపను దయను పొందుకోవాడానికి ఏమాత్రము అర్హురాలిని కానప్పటికీ దూత ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆమె కలవర పడుతూ ఆలోచనలో పడింది.
ఇది నిజమైన తగ్గింపు మనస్సు, ఆమె మనస్సు ఆమె నీతుయుక్తమైన జీవితాన్ని ప్రతిబింబిస్తోంది.
నిజముగా నీతిమంతులైన వారందరి స్పందన ఇలాగే ఉంటుంది ఎందుకంటే వారి పాపం గురించి వారికి తెలుసు.
ఉదా: యెషయా 6:5; లూకా 5:8
“30. దూత - మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.”
ఆమెను శాంతపరిచే ఉద్దేశ్యంతో “దూత - మరియా, భయపడకుము" అని చెప్తూ, ఎందుకు భయపడోద్దో వెంటనే వివరిస్తున్నాడు.
"దేవుని వలన నీవు కృపపొందితివి" కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
గబ్రియేలు దూత ఒక శుభ సమాచారం తీసుకు వచ్చాడు గానీ తీర్పు గురించి ప్రకటించడానికి రాలేదని ఆ మాటలను బట్టి మరియ అర్థం చేసుకోనుండొచ్చు.
“31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;”
ఇంతకీ ఆ దూత తెచ్చిన సమాచారం ఏంటంటే "నీవు గర్భము ధరించి కుమారుని కంటావు". దూత మాటలను మరియ అర్థం చేసుకోలేకపోయింది, గ్రహించడం కష్టమయ్యింది ఎందుకంటే ఆమెకు తెలిసి ఒక స్త్రీ ఒక పురుషుడు కలవడం ద్వారా మాత్రమే పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. అందుకే 34 వ వచనంలో ఆమె ఒక ప్రశ్న వేసింది. ఏమని - "నేను పురుషుని ఎరుగని దాననే; యిదేలాగు జరుగును?" - అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది?
ఈ ప్రకటన ఎవరు విన్నా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే కానీ అక్షరార్ధంగా మెస్సీయా గురించి చెప్పబడిన ప్రవచనం అలాగే నెరవేరింది. (యెషయా 7:14; మత్తయి 1:23 పోల్చి చూడండి)
ఆ తరువాత మొత్తం యేసు క్రీస్తు పరిచర్యనంతటినీ ప్రతిబింబించే విధంగా ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది - "ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు". ఈ మాటకు హీబ్రూ భాషలోని అర్థం, అసలు యేసు ఈ లోకానికి రావడానికి గల కారణాన్ని తెలియజేస్తుంది. యేసు అనగా రక్షకుడు.
దూత ఇచ్చిన ఆజ్ఞకు మరియ యోసేపులు విధేయత చూపినట్లు 2:21 లో చూస్తాము.
తన విమోచన ప్రణాళికని నెరవేర్చుకునే పనిలో మరియను వాడుకోవాలని దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె యోగ్యమైనదనో లేదా ఆమె గొప్పతనాన్ని బట్టో కాదు కానీ కేవలం తన కృపను బట్టే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు.
మనం నీతిమంతులుగా తీర్చబడడానికో లేక పరిశుద్ధపరచబడడానికో దేవుడు చూపే కృప కాదిది. ఇది ప్రత్యేకమైన కృప. లోకంలో ఏ స్త్రీకి దక్కని గొప్ప భాగ్యం - మిస్సీయాకు తల్లి అవ్వడం. ఆ ప్రత్యేకమైన కృప గురించి దూత మాట్లాడుతున్నాడు.
“32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.”
"ఆయన గొప్పవాడై" - ఆయన గొప్పవాడని చెప్పడానికి ఏవో బయటినుండి కారణాలు చూపించాల్సిన అవసరం లేదు కానీ ఆయన స్వభావసిద్ధంగానే గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని వివరించడానికి మాటలు/ పదాలు కూడా సరిపోవు.
"సర్వోన్నతుని కుమారుడనబడును" - యేసు కూడా తండ్రి కలిగినయున్న మహిమనే కలిగియున్నాడు.
వేరే సందర్భంలో ఇటువంటి పదాలే యోహాను గురించి కూడా వాడబడ్డాయి కానీ ఆ తరువాతి బిరుదు వారిద్దరి మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది (వ. 76 ).
"సర్వోన్నతుని" అనే పదము పాత నిబంధనలో ఆది 14:18-20 లాంటి అనేక సందర్భాలలో తరచుగా వాడబడింది. అది దేవుని యొక్క స్థానాన్ని సూచిస్తోంది. ఆయనే అన్నింటికీ పైగా సార్వభౌమ అధికారం కలిగిన పరిపాలకుడు అనితెలియజేస్తుంది.
యేసును గురించి మాట్లాడుతూ అదే పదాన్ని వాడడాన్ని బట్టి - యేసు కూడా అటువంటి మహిమనే, స్వభావాన్నే కలిగియున్నాడని తెలియజేస్తుంది. (హెబ్రీ 1:3)
"ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును" - చట్టరీత్య తన తండ్రియైన యోసేపు ద్వారా యేసు దావీదుకు నిజమైన వారసుడెనని మనం చూశాం.
సింహాసనము; ఏలును - అన్న పదాలు ఒక రాజ్యాన్ని సూచిస్తున్నాయి.
“33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.”
ఆ రాజ్యములో ఆయన యాకోబు వంశస్థులను ఏలుతాడు అని చెప్పబడింది (యెషయా 2:5-6; 8:17; 48:1 ). ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పబడినవి కానీ క్రైస్తవులనుద్దేశించి చెప్పబడినవి కావు.
అయితే దాని 7:14,27 ప్రకారం ఆయన సమస్త మానవాళిని ఏలుతాడనీ అర్థం చేసుకోవచ్చు. వాక్యమంతటా తారస పడే సత్యం కూడా ఇదే.
ఆ రాజ్యం లేదా పరిపాలన ఎప్పటి వరకూ?
"ఆయన రాజ్యము అంతములేనిదై యుండును" అన్న మాటని చదువుతున్నాం.
వ. 34 - 38
బైబిల్ లో అద్భుత రీతిన జన్మించిన వారున్నారు. ఉదా: ఇస్సాకు జననం - వంద ఏళ్ల అబ్రాహాము, తొంభై ఏళ్ల శారమ్మలకు ఇస్సాకు జన్మించాడు. మనోహ భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు, ఆమె సమ్సోనును కనింది. గొడ్రాలైనటువంటి హన్నాకుమారుణ్ణి కనునట్లు దేవుడు కృప చూపించాడు. ఆ కుమారుని పేరు సమూయేలు. గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షం అయిన కొన్ని నెలల క్రితమే జెకర్యా ఎలీజబెతు అను వృద్ధ దంపతులను దేవుడు కరుణించగా ఎలీజబెతు గర్భవతి అయ్యింది.
అయితే వీటన్నింటి కంటే గొప్ప అద్భుతం - యేసు క్రీస్తు పుట్టుక. ఆయన కుమారుడైన దేవుడు, త్రిత్వంలో రెండవ వ్యక్తి, నరరూపధారిగా వచ్చినవాడు. శరీరరీత్యా తండ్రి లేకుండానే మరియ అనే కన్యక పరిశుద్దాత్మ ద్వారా గర్భము ధరించినదైయేసు క్రీస్తుకు జన్మనిచ్చింది.
యేసు కన్యకకు జన్మించడము - ఈ సిద్ధాంతము క్రైస్తవ్యానికి పునాది లాంటిది, ఎందుకంటే ఆయన పుట్టుకే ఆయన దైవ మానవుడు ఎలా అయ్యాడో తెలియజేస్తుంది. ఆయన కన్యకకు పుట్టడాన్ని తృణీకరిస్తున్నారంటే - ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అన్న బైబిల్ సత్యాన్ని కూడా వారు తృణీకరిస్తున్నారు. అంత మాత్రమే కాదు పౌలు 2 కొరింథీ 11:4 లో చెప్పినట్లు వారు "మరియొక యేసును" ప్రకటిస్తున్నట్లు.
2 కొరింథీ 11:4 - "ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీ కరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే."
ఒక వేళ యేసుకి శరీరరీత్యా తండ్రి ఉంటె మనలాంటి మామూలు మనిషి అయ్యుండేవాడు. ఒక వేళ ఆయన కేవలం మనిషే అయితే ఆయన రక్షకుడు కాలేడు. పాపియైన ఒక మనిషి మరో మనిషిని రక్షించడం సాధ్యపడదు కదా. ఒక వేళ ఆయన రక్షకుడు కాలేక పోతే సువార్త లేదు, రక్షణ లేదు, నిత్యత్వాన్ని గురించిన నిరీక్షణే లేదు.
అందుకే అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:17,19 లో ఇలా అంటాడు.
1 కొరింథీ 15:17,19 -
"17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.
ఈ విషయాన్ని పౌలు ఎంత ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు అనేది గలతీ 1:8-9 వచనాలు చదివితే అర్థం అవుతుంది.
గలతీ 1:8-9 - "8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
ఈ సంగతులు మనకు కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా ప్రత్యక్షపరచబడినప్పటికీ పాత నిబంధనలో కూడా ఆయన గురించి కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి.
ఆది 3:15 - " మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది (ఆయన) నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను."
అయితే అది ఎలా జరుగుతుంది అని యెషయా 7:14 లో చదువుతాము.
యెషయా 7:14 - "కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును."
హీబ్రూ లో కన్యక అనే పదానికి ‘ఆల్మ’ అనే పదం వాడబడింది. కొంత మంది ఈ పదాన్ని ఒక యవ్వన స్త్రీ అని తర్జుమా చేశారు, యేసు కన్యకకు పుట్టలేదని తప్పుగా వ్యాఖ్యానించారు.
ఈ ప్రాధమిక సత్యం వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినప్పటికీ, చాలా మంది అబద్ద బోధకులు ఈ సిద్ధాంతాన్ని తప్పుగా బోధిస్తూ వచ్చారు. ఇటువంటి బోధలనే పౌలు 1 తిమోతి 4:1 లో "దయ్యముల బోధలు" అంటున్నాడు.
1 తిమోతి 4:1,2 - "అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
ఆ తరువాతి కాలంలో రాయబడిన కొన్ని యూదుల పుస్తకాలు చదివితే వాటిలో ఇలా రాశారు - మరియ ఒక రోమా సైనికుడి వల్ల గర్భవతి అయ్యింది అని. మరి కొందరు యోసేపు వల్లనే మరియ తల్లి అయ్యింది అన్నారు.
అయితే ఈ విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది -
మత్తయి 1:25 - "ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను."
ఇటువంటి తప్పుడు బోధలను బైబిల్ ఆధారం చేసుకొని తేలిగ్గా కొట్టి పారెయ్యొచ్చు.
ఇంకో ప్రాముఖ్యమైన సంగతి - తాను 'పురుషుని ఎరుగని దానను' అని మరియ తన మాటల్లో తనే చెప్పడాన్ని ఈ వచనాల్లో మనం గమనిస్తాం.
మరియ ప్రశ్న
“34. అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా”
దూత వచ్చి చెప్పిన మాటలు వినగానే ఆమె నిర్ఘాంతపోయింది. అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది అని ఆశ్చర్యపోతూ దూతను ఇలా ప్రశ్నించింది - "అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా". మరియ యొక్క ప్రశ్న న్యాయమైనదే. ఆమె దూత మాటలను సంపూర్ణంగా నమ్మింది కానీ "ఇది అసంభవం" అనిపించేటువంటి ప్రవచనం ఎలా నెరవేరబోతోందో ఆ ప్రక్రియ(మ్యానర్) గురించి మాత్రమే ప్రశ్నిస్తుంది కానీ అనుమానంతో కాదు. అలా అనుమానంతో అవిశ్వాసంతో ప్రశ్నించింది జెకర్యా. వ. 18-20 లో ఆ సంగతులు మనం చూసాము. మరియ అలా చెయ్యలేదని మనం ఎలా నిర్ధారించుకోగలము? ఎలాగంటే దూత స్పందించిన తీరుని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ మరియ కూడా అవిశ్వాసంతో ప్రశ్నించి ఉంటే జెకర్యా వలే ఆమె కూడా క్రమ శిక్షణ చేయబడేది కదా.
నాలుగు దశాబ్దాల తరువాత దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ నాలుగు వందల సంవత్సరాలు దూత ఎవ్వరికీ ప్రత్యక్షం కాలేదు. కొన్ని నెలల క్రితమే జెకర్యాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ సంగతి మరియకు తెలిసుండక పోవచ్చు. అందుకే వ. 36 లో దూత ఆ సంగతులన్నీ మరియకు తెలియజేస్తున్నాడు. అప్పుడు దూత చెప్పిన మాటలు మరియ సరిగ్గానే అర్థం చేసుకుంది. పెళ్లి అయిన తరువాత సహజంగానే నువ్వు గర్భం ధరిస్తావు అని దూత చెప్పట్లేదు కానీ ఆమె ఇంకా కన్యకగా ఉండగానే గర్భవతి అవుతుందని దూత చెప్తున్నట్లు ఆమె గ్రహించింది. అందుకే నేను "పురుషుని ఎరుగని దానినే" అని ప్రశ్నించింది.
దూత సమాధానం
"35. దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును"
మరియ అడిగిన ప్రశ్నకు జవాబుగా దూత ఇలా వివరణ ఇస్తున్నాడు.
"పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును" - యేసు క్రీస్తు పుట్టుకలోనూ, పరిచర్యలోనూ పరిశుద్దాత్మ చాలా కీలకమైన పాత్ర పోషించినట్లుగా చూస్తాము. పరిశుద్దాత్మ ద్వారానే మరియ గర్భం ధరించింది అని ఈ వచనం ద్వారా చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. "లైంగిక సంబంధం" ద్వారా ఆమె గర్భవతి అయ్యింది అనడానికి వాక్యంలో ఎటువంటి ఆధారాలూ లేవు.
పరిశుద్దాత్మ పాత్ర యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి మళ్ళీ దూత ఇలా అంటున్నాడు - "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును".
"సర్వోన్నతుడు" అనే మాట పాత నిబంధలో దేవుడికి ఇవ్వబడిన బిరుదులతో ఒకటిగా చూస్తాము. వ. 31-33 ను ధ్యానించేటప్పుడు ఈ బిరుదు గురించి చూసాము. దేవుడు సార్వభౌముడనీ, సర్వశక్తిమంతుడు అయిన పరిపాలకుడనీ, భూమినీపరలోకాన్ని పరిపాలిస్తున్నాడనీ ఆ మాట యొక్క అర్థం. ఈ విశ్వాన్నంతటినీ చేసిన వాడు ఆయనేనని, దానిని ఉనికిలో ఉంచుతున్నవాడు ఆయనేనని అర్థం. అటువంటి సృష్టికర్తా సర్వోన్నతుడూ అయిన దేవుడు తన పరిశుద్దాత్మ ద్వారా మరియ గర్భవతి అయ్యేలా, యేసు క్రీస్తుకి జన్మనిచ్చేలా చేశాడు.
"కమ్ముకొనును" - మామూలుగానే ఆ పదాన్ని అర్థం చేసుకోవచ్చు. మరో అర్థం - ప్రభావితం చేసింది. మరియ గర్భంలో ఒక శిశువు జన్మించేలా ఆ శక్తి మరియను ప్రభావితం చేసింది అని అర్థం చేసుకోవచ్చు.
ఇంతటితో మరియ ప్రశ్నకు సమాధానం పూర్తి అయ్యింది కానీ దూత అంతటితో ఆగకుండా మరికొన్ని వివరాలు తెలియజేస్తున్నాడు. ఆమె గర్భం ధరించడం, దేవుడు చేసే కార్యం అని చెప్పాడు. దేవుని శక్తి వలన అది సాధ్యపడుతుంది అనిచెప్పాడు. యేసు పుట్టడం ఎలాగ ఆయన శక్తిని బట్టి జరుగుతుందో, అలాగే ఆయనకు పాపం అంటుకోకుండా పరిశుద్దునిగా పుట్టడానికి కూడా అదే దేవుని శక్తి కారణం.
"పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును" - మరియకు జన్మించే కుమారుడి గురించి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. మొదటిది, ఆయన పరిశుద్ధ శిశువు. రెండవది ఆయన దేవుని కుమారుడు.
“శిశువు పరిశుద్ధుడై” అన్న మాట గురించి ఆలోచిద్దాం. సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకుంది కాబట్టే పుట్టబోయే శిశువు పరిశుద్దుడు అవుతాడు అని చెప్తున్నాడు దూత. "గనుక" అనే మాటను బట్టి ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు.
అటువంటి శిశువు ఎప్పుడూ ఎవరికీ పుట్టలేదు. యేసు తప్ప అందరూ పాపంలోనే జన్మించారు అని వేరు వేరు వచనాల్లో మనం చదువుతాము. చాలా సుపరిచితమైన వాక్య భాగం
కీర్తన 51:5 - "నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను."
అంటే దావీదు తానేదో అక్రమ సంతానంగా జన్మించాను అని చెప్పట్లేదు కానీ తన తల్లి తనను గర్భాన ధరించినది మొదలుకొని తాను పాపినని చెబుతున్నాడు.
కానీ దేవుని కుమారుడైన క్రీస్తు నందు మాత్రం ఎప్పుడూ ఏ పాపమూ లేదు.
కొంత మంది ఆయనకు శరీరరీత్యా తండ్రి లేడు కాబట్టి అతనిలో పాపం లేదు అని వాక్యాన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తుంటారు. అది తప్పు. తండ్రి ద్వారా మాత్రమే పాపానికి సంబంధించిన జీన్స్ పిల్లలకు సంక్రమిస్తాయి అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు.
1 కొరింథీ 15:22 - "ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు."
రోమా 5:18 ,19 - "కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకుకారణమాయెను.
మునుపటి వచనంలో దేవుని శక్తే దానికి కారణం అనీ, అది ఆయన చేసిన కార్యమని చూసాము అయినప్పటికీ పరిశుద్దుడైన దేవుడు పాపియైన మరియ గర్భాన పుట్టి యే పాపము సోకకుండా ఎలా ఉన్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే - మనకు అర్థం కాని, మనం గ్రహించలేని అద్భుత రీతిలో యేసు సంపూర్ణ మానవుడుగా పుట్టినప్పటికీ తన పుట్టుకలో పాపం లేని వాడుగా ఉన్నాడు. ఇదొక మర్మము. మనం మన తల్లి గర్భములో ఊపిరి పోసుకున్నది మొదలుకొని మనం రూపుదిద్దుకున్న తీరు అంతటి గురించి ఆలోచిస్తే మన పుట్టుకే ఒక మర్మము లాగా అనిపిస్తోంది. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క పుట్టుక ఇంకా గొప్ప మర్మము అవ్వడంలో ఆశ్చర్యం ఏముంది. దాన్ని మనం ఛేదించాల్సిన అవసరమూ లేదు,ఛేదించలేము కూడా.
"దేవుని కుమారుడనబడును"
ఆ పుట్టబోయే శిశువు దేవుని కుమారుడనబడటానికి గల ఒకానొక కారణాన్ని ఈ వచనంలోనే తెలియజేశాడు దూత. ఈ వచనంలో "గనుక" అనే పదానికి ముందు ఆ కారణాన్ని చూడగలము - "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక". అంత మాత్రాన అప్పటి నుండే (అంటే ఆయన పుట్టినప్పటి నుండే) ఆయన దేవుని కుమారుడని దాని అర్థం కాదు. నిత్యత్వం నుండీ ఆయన దేవుని కుమారుడే. ఆయన నిత్యత్వం నుండీ దేవుని కుమారుడిగా ఉన్నాడా (ఎటర్నల్ సన్ షిప్) లేక ఆయన మనిషిగా పుట్టినప్పటి నుండే దేవుని కుమారుడయ్యాడా (ఇంకార్నేషనల్ సన్ షిప్) అనేది వేరే సందర్భంలో వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈ వచనాన్ని బట్టి యేసు మనిషిగా పుట్టినప్పటి నుండే దేవుని కుమారుడు అయ్యాడు అని మాత్రం చెప్పలేము. ఆయన నిత్యత్వం నుండీ దేవుని కుమారుడే.
దేవుడిచ్చిన గుర్తు
“36. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము"
దూత మాటలు అతను చెప్పినట్లుగానే జరుగుతాయో లేదో అన్న అనుమానంతో మరియ తనకొక సూచననిమ్మని అడగలేదు కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని బలపరిచే ఉద్దేశ్యంతో ఆయనే ఒక గుర్తును అనుగ్రహించాడు. ఆమె బంధువులలో ఒకరిని చూపించి దేవుడు మరియను బలపరుస్తున్నాడు. ఆ గుర్తు మరెవరో కాదు, ఎలీజబెతు. ఎలీజబెతు మరియకి బంధువు. వాళ్ళు ఎలాగ బంధువులో ఆ వివరాలు తెలియజేయబడలేదు. వ. 31 - ప్రకారం మరియ దావీదు వంశానికి చెందినది. వ. 5ప్రకారం ఎలీజబెతు అహరోను వంశానికి చెందినది. కాబట్టి ఎలీజబెతు, మరియ వాళ్ళ తల్లి గారి తరుపు బంధువు అయ్యుండొచ్చు లేక మరియ, ఎలీజబెతు వాళ్ళ తల్లి తరుపు బంధువు అయ్యుండొచ్చు.
"మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది" అన్న మాటలు వినగానే మరియకు ఒక పక్క ఆశ్చర్యమూ మరో పక్క గొప్ప సంతోషమూ కలిగి ఉండవచ్చు. ఎందుకంటే బంధువు కాబట్టి మరియకు ఎలీసబెతు గురించి బాగా తెలిసి ఉండవచ్చు- ఆమె గొడ్రాలనీ, బిడ్డలను కనే వయస్సు దాటిపోయిన వృద్ధురాలనీ.
"గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము".
మనుషులకు అసాధ్యమైన వాటిని చెయ్యడానికి దేవుడు ఇంకా సమర్దుడేనని మరియకు తెలియజేయడానికి దేవుడు ఈ గుర్తును మరియకు అనుగ్రహించాడు.
దేవుని సార్వభౌమత్వము
“37. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను".
మానవరీత్యా అసంభవం అనిపించే సంగతులు విన్న తరువాత దేవుని యొక్క అంతులేని శక్తిని గురించి గబ్రియేలు దూత జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ సంగతులు ఇలాగే జరుగుతాయి అనేదానికి రుజువు ఎలీజబెతు గర్భవతి అవ్వడం.
కానీ ఇటువంటి మాటలే దేవుడు శారాతో చెప్పినట్లు చూస్తాం.
ఆది 18:12-14 - "శారా-నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
ఒకవేళ దేవుడికి అసాధ్యమైనదేదీ లేకపోతే, ఆయనకు సమస్తమూ సాధ్యమనేగా అర్థం. ఆ విధంగా దేవుడు ఎలీజబెతు విషయంలో చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేయడం ద్వారా తాను చెప్పిన ఈ మాటలు మరి నిశ్చయముగా నెరవేరుతాయనిగబ్రియేలు మరియకు తెలియజేస్తున్నాడు.
మరియ జీవితంలో జరిగినట్లుగా దేవుని వాగ్దానాలు మన విషయంలో కూడా తప్పక నెరవేరుతాయని అర్థం చేసుకోవచ్చు.
మరియ యొక్క తగ్గింపు
“38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను"
హన్నా కూడా ఇటువంటి మాటలే పలికినట్లు 1 సమూయేలు 1:10-11 లో చూస్తాము.
1 సమూయేలు 1:10-11 -
"బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు
హన్నా యే రీతిన తగ్గించుకుందో, అలాగే మరియ కూడా తగ్గించుకుంది. మరియ మాటలు, దేవుని ఉద్దేశ్యాలకు ఆమె విధేయత చూపుతున్నట్లు తెలియజేస్తున్నాయి.
'దాసురాలు' తనకు నచ్చినట్లు తాను జీవించడానికి వీలు లేదు కానీ తన యజమాని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆ భావంతోటె మరియ తన గురించి తాను “ప్రభువు దాసురాలను” అని చెప్పుకుంటోంది.
ఒక నిజమైన దాసురాలిలాగా ఎంతో తగ్గింపుతో - "నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అంటోంది. మరో విధంగా చెప్పాలంటే దూత మాటలకు స్పందిస్తూ సింపుల్ గా ఆమెన్ అంటోంది.
మనం కూడా దేవుని మాటలకు విధేయత చూపించడానికి, దేవుడు ఆజ్ఞాపించిన పనులు చెయ్యడానికి సిద్ద మనస్సు కలిగి ఉండాలి. మనము మన సొంతం కాదనీ, మనకు యేసు అనే యజమాని ఉన్నాడనీ, మనము ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలనీ మరిచిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తుంటాము. నా చితమూ, నా ఇష్టమూ, నా ఉద్దేశ్యాలు కాదు దేవుని చితమేమిటో తెలుసుకొని, ఆయన ఉద్దేశ్యాలను ఎరిగి వాటికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతి విశ్వాసితీర్మానించుకోవాలి.
"నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అని అనేసింది మరియ, మరి యోసేపు సంగతి ఏంటి అని దూతను అడగలేదు. తాను గర్భవతినయ్యాను అన్న సంగతి ఈ రోజు కాకపోతే రేపైనా యోసేపుకు తెలియకుండా పోదు. ఆ బిడ్డ తన ద్వారా కలిగినవాడు కాదు కాబట్టి వ్యభిచారం వల్ల గర్భవతి అయ్యింది అనే కారణాన్ని బట్టి యోసేపు ఆమెకు విడాకులు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
మత్తయి 1:19 - "ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను."
ఆ తరువాత ప్రజలంతా ఆమెను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితిని ఆమె ఎదుర్కోవాల్సి ఉంది.
లెవీ 20 :10 - "పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను."
ద్వితీయో 22:23,24 -
"23. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల
కానీ మరియ ఎంతో తగ్గింపుతో, దేవుని మాటకు విధేయత చూపుతూ తన మీద పడబోయే నింద నుండి ఆయనే తనను రక్షిస్తాడని నమ్మింది.
దేవుని చిత్తానికి లోబడే విషయంలో మరియ ఇటువంటి నిందలు భరించడానికి సిద్దపడింది. వాటి గురించి ఆమె ప్రశ్నించలేదు.
దేవుని చిత్తం స్పష్టంగా అర్థం అయిన తరువాత, నడువవలసిన త్రోవ కనుగొన్న తరువాత, ఇప్పుడు కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో సమస్యలు తలైతే అవకాశం ఉందని అనిపించినప్పటికీ ఆయన చిత్తాన్ని మాత్రమే చెయ్యడం కోసం ఎక్కడికైనా వీళ్ళడానికీ ఏదైనా చెయ్యడానికీ ప్రతి విశ్వాసి సిద్ధంగా ఉండాలి.
ఈ విషయంలో మరియ మనకు మాదిరిగా ఉంది.
ఇటువంటి మరియను రోమన్ కాథోలిక్స్ పరలోకపు రాణీని చేశారు. బొమ్మలేవీ పెట్టకపోయినా ఆమెను ఆరాధించడం విగ్రాహారాధనతో సమానం. అటువంటిది విగ్రహాలు పెట్టి మరీ ఆమెను పూజిస్తుంటారు. పరలోకంలో రాణీ ఎవరూ లేరు, యుగయుగాలు పరిపాలించే రాజు ఒక్కడే అక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తుంది.
మరియకూ దూతకూ మధ్య జరిగిన సంభాషణ ఈ మాటలతో ముగుస్తుంది - "అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను".
దూత వచ్చిన పని అయిపొయింది కాబట్టి అతను తిరిగి దేవుని సమక్షంలోకి వెళ్ళిపోయాడు.
దేవుడు తన ఉద్దేశ్యాలను నెరవేర్చుకోవడం కోసం తనకు విధేయత చూపిస్తూ, సేవ చెయ్యాలన్న ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరినీ తన పనిలో వాడుకుంటాడు అని అర్థం చేసుకోవాలి - మరియను వాడుకున్నట్లు. దేవుని చేత వాడబడే పాత్రగా నీవు ఉండాలనుకుంటున్నావా? ఒక వేళ అలాంటి ఆశ నీవు కలిగి ఉంటే, ఇటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి.
IV. మరియ ఎలీసబెతును దర్శించుట (లూకా 1: 39-45)
లూకా సువార్త రెండు అద్భుతాలను గురించిన వృత్తాంతాలతో ప్రారంభమవుతుంది. ఒకటి వృద్ధురాలైన స్త్రీ గర్భవతి కావడం. రెండవది కన్యకయైన స్త్రీ గర్భవతి కావడం. మొదటి స్త్రీకి జన్మించబోయే కుమారుడు మెస్సియాకి ముందు నడిచేవాడు, మార్గమును సరాళము చేయువాడు లేదా సిద్ధపరచువాడు. రెండవ స్త్రీకి జన్మించబోయే కుమారుడు స్వయానా మెస్సియానే, యేసు క్రీస్తే.
ఇంత వరకూ వీరిరువురి కథలు విడివిడిగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు రెండు కథలు ఈ వాక్యభాగంలో కలుస్తున్నట్లు చూస్తున్నాం.
మరియ తాను కన్యక అయినప్పటికీ దేవుని వాగ్దానం తన విషయంలో కూడా తప్పక నెరవేరుతుందని తాను దూత మాటలయందు ఎక్కువగా విశ్వాసముంచగలగడానికి ఈ గుర్తు ఎంతగానో దోహదపడింది.
“39. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి”
"ఆ దినములయందు ..... త్వరగా వెళ్లి"
'ఆ దినములు' అంటే దూత వచ్చి మరియతో మాట్లాడిన "ఆ దినములు" అని అర్థం. అంటే "మరియ" ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే తనకు వాగ్దానం చెయ్యబడిన గుర్తుని తన కళ్ళతో తాను చూడ్డానికి ఎలీసబెతు దగ్గరికిప్రయాణమై వెళ్ళిపోయింది. అప్పటికే ఎలీసబెతుకి ఆరవ నెల అని 36 వ వచనంలో దూత మరియతో చెప్పినట్లు చూసాం.
"యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి"
బహుశా అక్కడికి చేరుకోవడానికి మరియకు దాదాపు మూడు లేదా నాలుగు రోజులు పట్టి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతారు. పెద్దవారు ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, భద్రపరుస్తూ ఉండే సమాజమూ సంస్కృతీ వారిది. అటువంటి నేపథ్యంలో మరియ ఇటువంటి ప్రయాణం చెయ్యడం అసాధారణ విషయం. మరియ ఖచ్చితంగా ఎప్పుడు గర్భవతి అయ్యిందో బైబిల్ లో ఎక్కడా ప్రస్తావించబడకపోయినా, బహుశా ఈ ప్రయాణం చేసే సమయానికి ఆమె గర్భవతి అయ్యుంటుంది. కొందరు ఆమె తాను గర్బవతినయ్యానన్న సంగతిని దాచిపెట్టే ఉద్దేశ్యంతోనే ఊరు విడిచి వెళ్ళిపోయింది అంటారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే మరియ మూడు నెలలకు తిరిగి వచ్చినట్లు 56 వ వచనంలో చూస్తాం.
"అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతో (ఎలీసబెతుతో) కూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను."
ఒక వేళ దాచిపెట్టే ఉద్దేశ్యమే ఉంటె మూడవ నెలలో ఎందుకు తిరిగి వస్తుంది. మూడవ నెల అంటే అప్పుడు మరియ ఎవ్వరికీ చెప్పకుండానే ఆమె గర్భవతి అయ్యిందని చూసేవారందరికీ అర్థమయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఎందుకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆమెకు అటువంటి ఉద్దేశ్యం లేదని అర్ధమవుతోంది.
ఆ కొండసీమలలోని ఒక ఊరు అని వ్రాయబడింది కానీ ఖచ్చితంగా ఏ ఊరు అనేది తెలియజేయబడలేదు.
"40. జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను."
అక్కడికి వెళ్లిన తరువాత మరియ "జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను."
జెకర్యా అప్పటికి మూగవాడైయున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత 'ఎలీసబెతుకు వందనము చేసెను' అని చదువుతాము. అంటే ఈ రోజుల్లో లాగా హలో అని కాదు, వారు వందనాలు చెప్పుకునేటప్పుడే కుశల ప్రశ్నలు, ప్రాముఖ్యమైన సంగతులన్నీ మాట్లాడుకునేవారు. బహుశా మరియ ఎలీసబెతులూ వారికి సంభవించిన సంఘటనలను ఒకరితో ఒకరు చెప్పుకొని ఉంటారు. అంత మాత్రమే కాదు, జెకర్యాకు దూత ప్రత్యక్షమైన సంఘటనకీ, మరియకు దూత ప్రత్యక్షమైనసంఘటనకీ చాలా దగ్గర పోలికలున్నాయని గ్రహించి మరియ ఎలీసబెతులు ఆశ్చర్యానికి గురయ్యుంటారు. కొన్ని పోలికలు ఏంటంటే -
జెకర్యాకీ మరియకీ ఇద్దరికీ గబ్రియేలు దూతే ప్రత్యక్షమవుతాడు
దూత ప్రత్యక్షమవ్వగానే ఇద్దరూ భయపడతారు
దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాడు అన్న వర్తమానాన్నే ఇద్దరికీ దూత తెలియజేస్తాడు
కుమారుడికి ఏ పేరు పెట్టాలో కూడా దూత తెలియజేస్తాడు
కుమారుడి గురించి దూత వివరిస్తాడు
ఇద్దరూ దూతను ప్రశ్నిస్తారు
వారిద్దరికీ ఒక గుర్తు అనుగ్రహించబడింది
ఇలా ఈ దగ్గర పోలికలని బట్టి ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా, ఎన్నో సంవత్సరాల నుండీ ఎదురు చూస్తున్న మెస్సీయా ఈ లోకానికి రావడమూ, దానికి అల్పులైన తమ వంటి వారిని దేవుడు వాడుకుంటున్నందుకు చాలా సంతోషించియుంటారు.
మరియ తనకు సంభవించిన సంగతులన్నీ ఎలీసబెతుతో మాత్రమే ధైర్యంగా చెప్పుకోగలదు ఎందుకంటే ఆమె విషయంలో కూడా అటువంటి అద్భుతమే జరిగింది కాబట్టి. ఆమె మాత్రమే మరియ మాటలను నమ్మగలదు. ఇంకెవరైనా అయితే తప్పు చేసి, అంటే చేయకూడని పనిదో చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కథలు చెప్తుందనుకుంటారు. ఎవరి దాకో ఎందుకు సత్యం ఏంటో దూత వచ్చి చెప్పక ముందు యోసేపు కూడా మరియను విడనాడాలనుకున్నట్లు మత్తయి 1:19 లో చూస్తాం.
"ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను."
కాబట్టి మరియ ఈ సంగతులను తన కుటుంబసభ్యులతోనో స్నేహితురాళ్ళతోనో చెప్పినట్లు ఎక్కడ లేదు కానీ ఆమె ఎలీసబెతుతో ఈ సంగతులన్నీ చెప్పుకొని ఉండొచ్చు.
అంత మాత్రమే కాదు ఎలీసబెతు మాటలు విన్న తరువాత, ఆమె ఎటువంటి స్థితిలో ఉందో కళ్లారా చూసాక, తన విషయంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడన్న నిశ్చయత కలిగియుండవచ్చు మరియకు.
దేవుడు మనందరినీ కూడా వేరు వేరు పరిస్థుతులగుండా తీసుకెళ్తుంటాడు. కొన్ని సార్లు మన విశ్వాసంలో మనం బలపడు నిమిత్తం, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన అనుభవం కలవారి యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తాడు, లేక వారిని మన యొద్దకు తీసుకొని వస్తాడు. లేక దేవుని వాక్యంలో నుంచే ఆ పరిస్థితికి తగ్గట్లుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో తప్పకుండా ఉంటాయి. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఇతరులతో పంచుకున్నప్పుడు, మరియ ఎలా బలపరచబడిందో, అలా అనేకులు బలపరచబడతారు. అవిశ్వాసులు రక్షించబడవచ్చు, విశ్వాసంలో సన్నగిల్లిన వారు బలపరచబడతారు. నువ్వు కూడా దేవుని చేత వాడబడతావు.
41 వ వచనంలో మొదటి భాగాన్ని, 44 వ వచనాన్ని కలిపి చూద్దాం.
“41. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను....
కేవలం ఎలీసబెతుతో మాట్లాడ్డం ద్వారా మాత్రమే కాకుండా, మరో అద్భుతమైన రీతిలో మరియకు నిశ్చయత లభించింది.
మరియ వందన వచనంలో ఎక్కడో ఏ మాటల ప్రస్తావనలోనో ఎలీసబెతు గర్భములోని శిశువు గంతులు వేసినట్లు వ్రాయబడింది.
44 వ వచనం చూస్తే ‘శిశువు ఆనందముతో గంతులు వేసినట్లు’ ఎలీసబెతు చెప్తుంది.
మామూలుగా కడుపులో బిడ్డ కదులుతుంటుంది కానీ ఎలీసబెతు ఆ కదలికలలో తేడా ఉందని గ్రహించినట్లు ఆమె మాటల్లో తెలుస్తుంది. బహుశా మెస్సీయ గురించిన వార్త వినగానే ఆనందంతో తన గర్భంలోని శిశువు గంతులు వేసివుండొచ్చు.
కాబట్టి శిశువు గంతులు వేయడం ద్వారా కూడా మరియకివ్వబడిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని మరియకు నిశ్చయత లభించింది.
44 వ వచనాన్ని ఇంతక ముందే ధ్యానించాము కాబట్టి 41 వ వచనం రెండవ భాగం నుండీ మిగిలిన వచనాలను వరుసగా చూద్దాము.
"41. …… అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
పాత నిబంధలోగానీ, సువార్తల్లో గానీ చూసినట్లయితే - పరిశుద్దాత్మ చేత నింపబడిన వెంటనే దేవుని సందేశం తెలియజేయబడేది. అంటే ఎవరు ఎప్పుడు పరిశుద్దాత్మతో నింపబడినా, దాదాపు అన్ని సందర్భాల్లో దేవుని మాటలను దేవుని ప్రజలకు తెలియజేసేవారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం -
2 సమూయేలు 23:2 - "యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది."
లూకా 1:67 - "మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను"
లూకా 2:26-32
అపో కార్య. 2:4 - "అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి."
అపో కార్య. 4:8-12
అపో కార్య. 4:31 - "వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి."
2 పేతురు 1:21 - "ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి."
అదే విధంగా ఎలీసబెతు కూడా "పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను"
ఇలా బిగ్గరగా మాట్లాడటం అనేది దైవ సందేశాలు ప్రకటించబడే సందర్భాల్లో జరిగినట్లు మనం చూడొచ్చు. ఉదాహరణకి
యోహాను 1:15 - "యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను."
యోహాను 7:28,29 -
"28. కాగా యేసు దేవాలయములో బోధించుచు - మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.
రోమా 9:27,28 -
"27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని
అలా బిగ్గరగా ఎలీసబెతు కూడా కొన్ని మాటలు పలికింది.ఇంతకీ ఆమె పలికిన మాటలేంటంటే -
“42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును”
"స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు"
ఇటువంటి మాటలే 28 వ వచనంలో దూత మరియతో అంటాడు.
యూదుల సంస్కృతిలోనూ మన సంస్కృతిలోనూ సమాజంలో ఒక స్త్రీ యొక్క స్థాయి చాలా వరకూ ఆమె కన్న పిల్లలపై ఆధారపడియుంటుంది. అందుకే ఒక స్త్రీ మరియను గొప్ప చేస్తూ ఇలా అంది -
లూకా 11:27 -
"ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా"
గబ్రియేలు దూత వారికి పుట్టబోయే బిడ్డ గొప్పవాడు అని వారితో చెప్పినప్పటికీ, ఎలీసబెతు ఎంతో తగ్గింపుతో మరియ కుమారుడు మరి గొప్పవాడని గ్రహించింది. తన కుమారుడు కేవలం మెస్సీయాకి ముందు నడిచేవాడు మాత్రమే, కానీ మరియకుమారుడు మెస్సీయానే కాబట్టి మరియ ఎక్కువ ఘనతకు, ధన్యతకు నోచుకుందని ఎలీసబెతు గ్రహించింది.అందుకే ఎలీసబెతు మెస్సీయాకి ముందుగా నడిచేవానికి తల్లిని అయ్యానని మాత్రమే కాక మెస్సీయ యొక్క రాకడ గురించి తెలుసుకొని మరి ఎక్కువగా సంతోషించింది.
"నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును"
ఈ మాటలు పాత నిబంధనలో తరచూ వేరు వేరు సందర్భాల్లో రాయబడ్డాయి కానీ కొత్త నిబంధనలో మాత్రం ఈ ఒక్క చోటే కనబడతాయి. అదీ యేసు క్రీస్తు గురించి. మెస్సీయా గురించి. లోక రక్షకుడి గురించీ.
ఆమె పొందుకున్న ధన్యతను బట్టి ఆమె ఆశ్చర్యానికి గురయినట్లు ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. ఆమె నిజమైన తగ్గింపుతో, మరియ వంటి ధన్యురాలి సహవాసంలో ఉండటానికి తాను అనర్హురాలినని భావిస్తూ ఆమె పలికిన మాటలు ఇవి. అందుకే ఆమె మరియ కుమారుణ్ణి "నా ప్రభువు" అని సంబోధిస్తుంది. అలా సంబోధించడం ఆయన దైవత్వాన్ని సూచిస్తోంది. ఈ పదము లూకా సువార్త మొదటి రెండు అధ్యాయాల్లో 12 కంటే ఎక్కువ సార్లు దేవుణ్ణి సూచిస్తూ వాడబడింది. అదే పదము ఇక్కడ కూడా వాడబడడాన్ని బట్టి యేసు దేవుడు అని లూకా చెప్పకనే చెప్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
# ఎలీసబెతు తన కంటే వయసులో చిన్నది, తన తరువాత పుట్టిన ఒక చిన్న పిల్లకి తన కంటే గొప్ప ఆధిక్యత లభించడాన్ని బట్టి ఈర్ష్య పడట్లేదు కానీ సంతోషిస్తుంది. పైపెచ్చు దేవుడు తనపై అంత కృప చూపించడానికి తాను పాత్రురాలనుకాను అని అంటోంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే - మనం దేనికి అర్హులము కామో అటువంటివి అనేకము దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే దాన్ని కృప అన్నారు. కానీ మనం ఎం చేస్తాం అంటే ఇతరులకు దేవుడు ఇచ్చిన ధన్యతలను చూసి ఈర్ష్య పడుతుంటాము. ఎవరికి, ఎప్పుడు, ఎంత కృప చూపించాలో అది దేవుని ఇష్టం. దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి తృప్తి చెందుతూ ఎలీసబెతు వలె స్తుతించేవారంగాఉండాలి కానీ కృపను కృప కాదన్నట్లు మనం పొందుకున్న దానికి మనం పాత్రులమే అన్నట్లు ఇతరులతో పోల్చుకొని ఈర్ష్యపడడం, అసంతృప్తితో ఉండడం విశ్వాసుల లక్షణం కాదు.
# ఎలీసబెతు ఎలా స్పందించిందో ఆమె కుమారుడు కూడా అలాగే స్పందించినట్లు మనం చూస్తాము.
మత్తయి 3:14 - "అందుకు యోహాను - నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని"
తల్లి తండ్రులైనటువంటి వారు ఈ మాటను జాగ్రత్తగా గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. యోహాను జీవితంపై తన తల్లి ప్రభావం ఎంత వరకూ ఉందొ తెలియదు కానీ ఆమె మాత్రం ఈ విషయంలో మంచి మాదిరినే కనపరచియుండవచ్చనిఅర్ధమవుతోంది. పిల్లలు మిమ్మల్నే చూస్తున్నారు జాగ్రత్త. మీరు దేవుని యందలి భయభక్తులతో జీవిస్తూ, అలా జీవించడం మీ పిల్లలకు నేర్పించవలసిన వారు. మీకున్న చెడ్డ అలవాట్లు, తప్పుడు చేష్టలు మీ పిల్లలు చేస్తుంటే మురిసిపోకండి,సిగ్గుపడండి. మీ పిల్లల విషయమై దేవునికి మీరు లెక్క అప్పజెప్పవలసిన వారు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం అలవాట్లు, ప్రవర్తన మాత్రమే కాదు మిమ్మల్ని బట్టి మీ పిల్లల వ్యక్తిత్వం కూడా రూపుదిద్దుకుంటుంది. మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి. మీ జీవితాలు మీ పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయా లేక దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయా?
ఈ వాక్యభాగంలోని మాటలు చదివి రోమన్ కాథలిక్స్ మరియను 'దేవుని తల్లి' అంటారు. అది తప్పు. దేవుడు నిత్యత్వము నుండీ నిత్యత్వము వరకూ ఉనికిలో ఉన్నవాడు. ఆయనకు ప్రారంభమనేది లేదు. దేవుడు పుట్టడం జరగదు. ఈ వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవ శరీరంలో ఉన్న యేసుకు మాత్రమే మరియ తల్లి, ఆయన నిత్యత్వపు దైవత్వానికి కాదు.
ఎలీసబెతు ముగింపు మాటలు
"45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను."
మరియ కేవలం మెస్సీయకు తల్లి కావడాన్ని బట్టి మాత్రమే కాక "ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను".
అయితే ఎలీసబెతు మరియ అనకుండా "ఆమె" అని అనింది. అంటే మరియ మాత్రమే కాదు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ ఆశీర్వదించబడతారని అర్థం చేసుకోవచ్చు.
మరియ దేవుని తల్లీ కాదు, మానవుల పాప విమోచనలో ఆమె ఎటువంటి పాత్ర పోషించలేదు, మన ప్రార్థనలేమీ ఆమె విని మన పక్షముగా విజ్ఞాపన చెయ్యదు, కానీ విశ్వాసం విషయంలోనూ దేవుని చిత్తానికి లోబడే విషయంలోనూ మంచి మాదిరినికనపరచింది. దేవుని మాటలకు విధేయతతో, సంతోషంతో స్పందించే విషయంలో కూడా ఆమె మంచి మాదిరి కనపరచింది.
# ఒక భక్తుడు ఇలా అన్నాడు - నిజదేవుని యందు విశ్వాసమే నిజమైన సంతోషానికి పునాది. ఎందుకంటే మన విశ్వాసం వల్లనే దేవుని వాగ్దానాలు మన విషయంలో నెరవేరుతాయి. అవి మన రక్షణకు సంబంధించినవి కావొచ్చు, ఈ లోకంలో మనం జీవించే జీవితానికి సంబంధించినవి కావొచ్చు, లేక మన నిత్య జీవానికి సంబంధించినవి కావొచ్చు. ఏవైనా సరే వాటి నెరవేర్పే మనకు నిజమైన సంతోషం. నిజ దేవుని యందు మనకున్న విశ్వాసం మాత్రమే మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. దేవుని మాటలను సంపూర్ణంగా విశ్వసించడమే నిజమైన ఆశీర్వాదం.
పాత నిబంధనలో హేబేలు దగ్గర మొదలు పెడితే కొత్త నిబంధనలోని విశ్వాసుల వరకూ విశ్వాసం ద్వారా ఏమేం పొందుకున్నారో మనకు తెలుసు.
విశ్వాసంతో వారు వాగ్దానాలను హత్తుకున్నారు, వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు.
విశ్వాసం తో జీవించారు.
విశ్వాసం తో నడిచారు
విశ్వాసంతో ఎన్నో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు
విశ్వాసంతో కనబడని రక్షకుని చూడగలిగారు
విశ్వాసంతోనే ఈ లోకంతోటీ, శరీరంతోటీ, సాతాను తోటీ యుద్ధం చేశారు.
మరియ కూడా తన విశ్వాసాన్ని బట్టి తాను కూడా ఆ భక్తుల గుంపుకు చెందిన దాననని నిరూపించింది.
నీ విశ్వాసం పరిస్థితి ఏంటి?
నీ మాట, నీ నడక, నీ జీవితం నీ విశ్వాసం గురించి ఏమైనా తెలియజేస్తున్నాయా? అన్ని పరిస్థితుల్లో ఆయనయందు విశ్వాసముంచగలుగుతున్నావా?
విశ్వాసం కూడా దేవుని వరమే. అటువంటి విశ్వాసంలో మనమందరమూ ఎదగ వలసిన వారము. దాని నిమిత్తమై ప్రార్థన చేయవలసినటువంటి వారము.
V. మరియపాడిన పాట (లూకా 1: 46 – 56)
మరియ ఎలా ఆరాధిస్తుంది?
హన్నాకు లాగానే మరియ కూడా ఒక పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తోంది.
మన ఆరాధన ఎలా ఉండాలి అన్న దాని గురించి ఒక నాలుగు సంగతులు ఈ మూడు వచనాలు నుండి మనం గ్రహించవచ్చు.
46 & 48 వచనాలను కలిపి చూద్దాం.
"46. అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది."
"48. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను."
మొదటిది, మన ఆరాధన అంతర్గతమైనదయుండాలి (ఇంటర్నల్). ఈ వచనాల్లో చూస్తే మరియ తన "ప్రాణము" తోనూ, "ఆత్మ" తోనూ ఆరాధిస్తుంది. ఈ రెండు పదాలు మనలో ఉండే అంతర్గత వ్యక్తిని సూచిస్తూ ఉన్నాయి. అంటే మన మనస్సు, భావోద్వేగాలు, చిత్తము. నిజమైన ఆరాధన గురించి యోహాను 4:24 -
"24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను."
ఇందుకు విరుద్ధమైన ఆరాధన ఏంటంటే పైపైన చేసేటువంటిది, వేషధారణతో కూడుకున్నది. ఇటువంటి ఆరాధనకు దేవుడు విముఖుడు.
యెషయా 29:13 -
"13. ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులుమానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి."
ఈ వచనాన్ని యేసు ప్రభువు వారు కూడా ఉల్లేఖించారు.
మత్తయి 15:7-9 -
"7. వేషధారులారా
యెహెఙ్కేలు 33:31 -
"31. నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది."
# ఆరాధన అనేది మన నిత్య జీవన విధానం అయ్యుండాలి, కానీ మరీ ముఖ్యంగా మనం తరచూ ఆదివారాలు సమూహంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అటువంటప్పుడు మనం కూడా ఏదో మొక్కుబడిగా వెళ్లి కూర్చోని టైం పాస్ చేసేసి, హమ్మయ్య, పని అయిపోయింది అనుకుంటే అటువంటి వారినే దేవుడు వేషధారులు అంటున్నాడు. మీరు చర్చికి వెళ్లినప్పటికీ, క్రమం తప్పకుండా వెళ్లినప్పటికీ మీరు నిజముగా మీ ఆత్మతో ఆరాధన చేస్తుండకపోవచ్చు. ఈ విషయమై మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మొక్కుబడిగానో, అలవాటుగానో ఏదీ చెయ్యొద్దు. మనమందరూ హృదయపూర్వకంగా ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుకుంటున్నాడని గ్రహించాలి.
రెండవది నిజమైన ఆరాధన అత్యంత తీవ్రమైనదిగా లోతైనదిగా ఉంటుంది - (ఇంటెన్స్).
"ఘనపరచుచున్నది" - ఆ మాటకు అర్థం ఆయనను గొప్ప చెయ్యడం, ఆయన ఔన్నత్యాన్నీ, విశిష్టతను మెచ్చుకోవడం, పొగడడం, మహిమ పరచడం.
48 వ వచనంలో "ఆనందించెను" అనే మాటను కూడా చదువుతాము. ఆ మాటకు అర్థం - చాలా విపరీతమైన సంతోషం, గొప్ప సంతోషం అని అర్థం.
అటువంటి సంతోషముతో, ఆత్మయందు తీవ్రత కలిగి మనము ప్రభువును ఆరాధించవలసినవారము.
మూడవది, అలవాటుగా ఉండాలి. అది నీ జీవన శైలి అయ్యుండాలి. నీ జీవన విధానం అయ్యుండాలి. మరియ మాటల్ని గమనిస్తే ఆమె సహజంగానే ఆరాధన చేస్తూ ఉంది. అంటే అది ఆరాధన కోసం నిర్దేశించిన సమయమూ కాదు, స్థలమూ కాదు, అటువంటివేమీ లేవు కానీ ఆమె సహజంగానే దేవుణ్ణి స్తుతిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ మారుతున్న పరిస్థితులు మన ఆరాధనను ఏ విధంగానూ ప్రభావితం చెయ్యకూడదు.
ఎందుకంటే
దేవుడు మారడు
ఆయన వాక్యం మారదు
ఆయన ఉద్దేశ్యాలు మారవు
ఆయన వాగ్దానాలు తప్పిపోవు
ఆయన మనకనుగ్రహించిన రక్షణ ఎన్నటికీ కోల్పోము.
# మన బాధ్యత ఏంటంటే - ఆయనకు అన్ని విషయములలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే -
ఎఫెసీ 5:20 -
"20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,"
1 థెస్స 5:18 -
"18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము."
"సమస్తమును గూర్చి", "ప్రతి విషయములో" అని చదివాము కదా.
ఇదే విషయాన్ని దావీదు ఎలా చెప్పాడో తెలుసా -
కీర్తన 16:8 -
"8. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను."
అలాగే పౌలు మాటల్లో కూడా చూద్దాం.
ఫిలిప్పి 1:20 -
"19. మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు"
కాబట్టి ఆయనకు మనము ఋణస్థులము అన్న సంగతి ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని, మనం అర్హులము కాని ఎన్నో మేళ్లను ఆయన తన కృప చొప్పున ప్రతి రోజూ మనకు అనుగ్రహిస్తున్న కారణాన్ని బట్టి ఆయన్ని స్తుతించడం నేర్చుకోవాలి.
చివరిగా, ఆరాధన తగ్గింపుతో కూడినదై ఉండాలి. మనం దేవుణ్ణి ఆరాధించకుండా చేసే రెండు అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, అజ్ఞానము (ఇగ్నోరెన్స్). సాధారణంగా దేవుని గురించిన జ్ఞానం అసలు లేకుండా ఉండదు కానీ తక్కువగా ఉండటం అనమాట. అంటే దేవుణ్ణి ఆరాధించేటంతగా దేవుణ్ణి ఇంకా వారు ఎరుగలేదు అని అర్థం. అటువంటి వారు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎటువంటి దేవుడో ఇంకా సరిగ్గా గ్రహించలేదు గనుక వారు సరిగ్గా ఆరాధించలేరు. అస్సలు ఆరాధించలేరు అనడంలేదు.
రెండవది, గర్వము. ఈ సమస్య ఉన్నవారు, అస్సలు ఆరాధించలేరు. వారు వేషధారులవుతారు. గర్వము అంటే మనల్ని మనం ఆరాధించుకోవడమే. అయితే దేవుడు దానిని ఏ మాత్రము సహించడు. పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ -
నిర్గమ 20:3 -
"3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు."
యాకోబు 4:6 -
"6. కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది."
సామెతలు 16:5 -
"5. గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు."
కాబట్టి గర్విష్ఠులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం చాలా కష్టం. ఎందుకంటే తాము పొందుకునే ప్రతిదానికి తాము అర్హులమే అనీ, యోగ్యులమే అనీ వారు అనుకుంటారు.
మరో వైపు దీనులు మాత్రము, తాము పొందుకున్న దేనికీ తాము అర్హులము, యోగ్యులము కాదని గుర్తెరిగి, వారి పాపముల విషయమై పశ్చాతాపపడుతూ, దేవుని నీతి విషయమై ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన పట్ల విపరీతమైన కృతజ్ఞతా భావం దీనులకు ఉంటుంది, తత్ఫలితంగా వారు దేవుణ్ణి స్తుతించగలుగుతారు, ఆరాధించగలుగుతారు.
మరియ కూడా అటువంటి వ్యక్తే.
"47. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను"
"తన దాసురాలి" అన్న మాటలు చూడండి. దేవుడు తనపై చూపిస్తున్న దయను బట్టి కృపను బట్టి ఆమె సంతోషిస్తోంది. తానేదో గొప్పదాన్నని అనుకోలేదు (రోమన్ కాథోలిసిజం బోధించే విధంగా). ఎంతో తగ్గింపుతో "దాసురాలి"ని అంటోంది.
38 వ వచనంలో కూడా ఈ మాటను చదువుతాము.
"38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను."
కొత్త నిబంధనలో ఇలా తమను తాము పిలుచుకున్న వారిలో ఈమె మొదటిది. తరువాత ఎంతో మంది భక్తులు ఈ మాదిరిని అనుసరించారు.
"దీనస్థితిని కటాక్షించెను"
సాంఘికంగా చూస్తే - గలిలయ ప్రాంతంలో నజరేతు అనే ఊరిలో నివసించే ఒక సాధారణ అమ్మాయి మరియ. ఆమె మెస్సీయాకు తల్లి అయిన తరువాత కూడా ఆమె ఏ విధంగానూ ఎటువంటి ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. యేసు క్రీస్తు కూడా ఆమెను అత్యధికంగా గౌరవించడం కానీ ప్రత్యేకమైన దాని వలె ఆమెను హెచ్చించడం గానీ చెయ్యలేదు. ఆదిమ సంఘం కూడా ఆమెకు ప్రత్యేకమైన విలువ, స్థానము ఇచ్చి ఆమెను హెచ్చించింది అనడానికి ఆధారాలు లేవు. ఈ సాధారణ అమ్మాయికి మరో సాధారణ అబ్బాయితో నిశ్చితార్థం అయ్యింది. వారిద్దరూ అంత మామూలు ఊరి నుండి వచ్చారు కాబట్టే తరువాతి కాలంలో తమ కుమారుడైన యేసు బోధలను ప్రజలు అంగీకరించడం కష్టమయ్యింది.
సాంఘీకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చూస్తే, ఆమె అందరిలాగే తాను కూడా పాపిని అని గుర్తెరిగి, తనకు కూడా రక్షకుడు అవసరం అని తేలుసుకుంది. నిజముగా ఆరాధించేవారి మాదిరిగానే మరియ కూడా ప్రభువుని ఎంతో గొప్పగా ఎంచుతూ, తనను తాను ఎంతో తక్కువగా ఎంచుకుంది. ఇటువంటి దీన స్థితినే దేవుడు ఆశించేది, అటువంటి వారినే దేవుడు ఆశీర్వదించేది.
#మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని, దేవుణ్ణి హెచ్చుగా చూడటం నేర్చుకోవాలి. అప్పడు ఈ ఈగో సమస్యలు ఉండవు. దీన మనస్సు అనేది దేవుడు అనుగ్రహించే కృప. అందరు ధనవంతులు కాలేరు, అందరూ జ్ఞానవంతులు కాలేరు, అందరూ వరాలను పొందుకోలేరు, అందరూ బోధకులు కారు. కానీ దేవుని పిల్లలందరూ తమను తాము ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని కప్పుకొనవచ్చు. ఈ కృప మనకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని గ్రహించాలి.
మరియ ఎవరిని ఆరాధిస్తుంది?
46 వ వచనంలో "ప్రభువును" అనే మాటను చదువుతున్నాం.
48 వ వచనంలో "నా రక్షకుడైన దేవునియందు" అనే మాట చూస్తున్నాం.
అయితే యేసే మెస్సీయా అని, లోక రక్షకుడు అని మరియకు తెలుసా?
తన ద్వారా జన్మించబోతున్నవాడు లోక రక్షకుడని మరియకు ఖచ్చితంగా తెలుసు.
30 - 33 వచనాలలో పుట్టబోయే బిడ్డ గురించి దూత చెప్పిన మాటలను బట్టి ఎవరైనా యిట్టె గ్రహించవచ్చు.
కాబట్టి మెస్సీయా తన ద్వారా ఈ లోకానికి రాబోతున్నాడన్న సంగతి ఆమె "తన రక్షకుడైన దేవుణ్ణి స్తుతించేలా, ఆరాధించేలాగా చేసింది."
దేవుడు తన రక్షకుడిగా ఉన్నాడు అనే దాన్ని బట్టే ప్రధానంగా మరియ దేవుణ్ణి ఆరాధిస్తుంది.
# విశ్వాసులమైన మన విషయంలో కూడా, మన ఆరాధన యొక్క ప్రధాన అంశం ఏమయ్యుండాలి అంటే ‘దేవుడు మనలను మన పాపము నుండీ రక్షించాడు, మనం పొందుకోవాల్సిన శిక్ష నుండీ తప్పించాడు.’
అలా కాని పక్షంలో దేవుణ్ణి ఆరాధించడం సాధ్యపడదు.
మరియ ఎందుకు ఆరాధిస్తుంది? కారణాలేంటి?
49 – 55 వరకూ ఉన్న వచనాలను చదవగానే ఆమె పాత నిబంధన లేఖనాలను ఎంత బాగా విని, గుర్తుపెట్టుకుందో అర్ధమవుతుంది. ఆ రోజుల్లో ఎవరి బైబిల్ కాపీ వాళ్ళకి ఉండేది కాదు, మనకు లాగా. సమాజమందిరాలలో మాత్రమే తరచూ ధర్మశాస్త్రమూ ఇతర పాత నిబంధన లేఖనాలూ బోధించబడేవి. అప్పుడు విని గుర్తుపెట్టుకోవలసిందే. బహుశా ఓ పదమూడు ఏళ్ళు ఉండి ఉండవచ్చు మరియకి. అంత చిన్న అమ్మాయి మనసులో లేఖనాలు ఇంతలా నాటుకుపోయి, ఆమెఆరాధనలోనుండి ఆ సంగతులే పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా సంఘంలోని యవ్వనస్థులందరూ ఇలా ఉంటె ఎంత బాగుండు.
# మనం ఎం చెయ్యాలంటే - మనస్సు పెట్టి లేఖనాలను పరిశోధిస్తూ, లోతుగా వాటిని త్రవ్వి, ధ్యానించే పనిని అనుదినము చేస్తామని తీర్మానించుకోవాలి.
కొలస్సీ 3:16 -
"16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలోసమృద్ధిగా నివసింపనియ్యుడి".
అందులో భాగంగానే, ఓక నిజమైన క్రైస్తవుడు బైబిల్ చరిత్రను పరిశీలనగానూ, క్రమంగానూ నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. తద్వారా దేవుడు పరిశుద్ధుల జీవితాల్లో ఎలా పనిచేస్తూ వచ్చాడో నేర్చుకోవచ్చు. దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి వారితో దేవుడు ఎలా వ్యవహరించాడో మనతో కూడా అలాగే వ్యవహరిస్తాడు, రాబోయే తరాల వారితో కూడా అలాగే వ్యవహరిస్తాడు. అసలు మనం దేవుడి దగ్గరి నుండి ఎం ఆశించాలో, ఏవి ఆశించకూడదో నేర్చుకుంటాము. కృంగిపోయినసందర్భాలలో భక్తుల జీవితాలు మనల్ని ప్రోత్సహిస్తాయి, బలపరుస్తాయి. దేవుని వాక్య జ్ఞానాన్ని తన మదిలో సమకూర్చుకునేవాడు ధన్యుడు. ఆ జ్ఞానం అతన్ని సహనశీలిగానూ, నిరీక్షణ కలిగిన వానిగాను చేస్తుందని గుర్తుంచుకోండి.
మరియ ఆరాధనకు మూడు ప్రధాన కారణాలు:
మొదటిది,
"49. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము"
“సర్వశక్తిమంతుడైన” దేవుడు ఆమె జీవితంలో “గొప్పకార్యములు చేసెను”. అవి ఎంత గొప్పవి, అద్భుతమైనవి అంటే తరువాత వచ్చే తరాలన్నీ ఆమెను “ధన్యురాలని” అంటాయి. మెస్సీయాకు తల్లి అవ్వడమంటే, అటువంటి గొప్ప ఆధిక్యత మరి ఏ ఇతర స్త్రీ కి అంతవరకూ లభించలేదు, ఇక లభించదు కూడా. అంత కంటే ప్రాముఖ్యంగా ఎందుకు పనికిరాని పాపాత్మురాలైన ఆమెకు, కేవలం దేవుని కృపను బట్టి రక్షణ పొందిన ఆమెకు, దేవుని కుమారుని కనే అవకాశం లభించడాన్ని బట్టి ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది.
"ఆయన నామము పరిశుద్ధము" - విశ్వాసులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యత్వములో ఆయనను స్తుతిస్తూ ఉంటారని ప్రకటన గ్రంథంలో చదువుతాము.
రెండవది, భవిష్యత్తులో దేవుడు ఇతరులకు ఎం చెయ్యబోతున్నాడో, అందును బట్టి ఆమె దేవుణ్ణి స్తుతిస్తోంది.
"50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును."
కీర్తన 103:17,18 -
"17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
యూదా 3 -
"3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను."
ఆ "అందరికీ కలిగేడు రక్షణ" గురించే మరియ కూడా దేవుణ్ణి స్తుతిస్తోంది.
చివరిగా, దేవుడు గతంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తుంది. అది యూదుల పద్ధతి - దేవుని గుణగణాలను బట్టి మాత్రమే కాకుండా, దేవుని యొక్క గొప్ప కార్యాలను బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. మరియ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాటిని తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తోంది.
“51 . ఆయన తన బాహువుతో తన పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను."
ఆ పరాక్రమ కార్యములలో మొదటిది, దేవుడు "వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను"
బహుశా ఫరోనీ అతని సైన్యాన్నీ దేవుడు ఎలా చెదర గొట్టాడో అదే మరియ మనస్సులో ఉండి ఉండవచ్చు.
నిర్గమ 5:2 -
"2. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను."
ఆ తరువాత ఫరో సైన్యానికి ఏమైందో నిర్గమ 15 వ అధ్యాయంలో చదువుతాము.
బహుశా నెబుకద్నెజరు గురించి కూడా ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు.
దానియేలు 5:20 -
"20. అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను"
దేవుని చేత క్రమశిక్షణ చేయబడిన తరువాత అతను ఏమంటాడు అంటే -
దానియేలు 4:37 -
"37. ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచుకొనియాడుచు ఘన పరచుచు నున్నాను."
"52. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను"
బహుశా యెహోషువా కాలంలో ఇశ్రాయేలీయులు కనానీయులపై యుద్ధం చేసి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేసిన దాని గురించి ఆలోచిస్తూ మరియ ఈ మాటలు పలికి యుండవచ్చు. అప్పుడు గానీ ఆ తరువాత న్యాయాధిపతుల కాలంలోనే గానీ, రాజుల కాలంలోనే గానీ ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి వారిని రక్షించాడు.
“53. ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.”
ఆయన తన దయను బట్టి, కృపను బట్టి "ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి" తీర్పులో ఆయన "ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను."
“54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు
ఇశ్రాయేలు చరిత్రను పరిశీలిస్తే దేవుడు “తన కనికరము”ను బట్టి “తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసినట్లు” చూస్తాము.
ఆది 12 వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసినట్లు చదువుతాము. అబ్రాహాముకీ ఆ తరువాతి పితరులకీ దేవుడు ఏదైతే వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే ఆ తరువాతి చరిత్రంతా అని మరియ గ్రహించినట్లుంది. అందుకే “అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చి” ఆ ప్రకారమే వారికి సహాయం చేసాడు అని చెప్పి ఆ అబ్రాహాము నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ మరియ తన స్తుతికీర్తనని ముగిస్తుంది.
# మరియ చేసిన విధంగా దేవుడు బైబిల్ లో మనకు అనుగ్రహించిన వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. మనం శాంతంగా ఉండటానికి ఇది ఎంతో ప్రాముఖ్యం. అరణ్యం వంటి ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనం ప్రతి రోజూ తినవలసిన ఆహారమూ, మన్నా - దేవుని వాగ్దానాలు, అనునిత్యం త్రాగవలసిన పానీయం - దేవుని వాగ్దానాలు. మనము క్రీస్తును చూడలేదు, పరలోకాన్నీ చూడలేదు కానీ మనం విశ్వాసం చేత జీవించే వారము. అయితే మన విశ్వాసము దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఉంది. మనము ధైర్యంగా నిశ్చయంగా ఆ వాగ్దానాలపై ఆనుకోవచ్చు. దేవుడు ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడం మనం కూడా చూస్తాము. అందునుబట్టి మరియకు లాగ దేవుణ్ణి స్తుతిస్తాము కూడా.
"56. అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను."
ఇంత వరకూ మనం మరియ దేవుణ్ణి స్తుతించడం చూసాం ఇక ఇక్కడి నుండీ యోహాను యొక్క పుట్టుకకు సంబంధించిన వృతాంతాన్ని చోడబోతున్నాం. ఎలిజబెతు ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మరియ ఎలిజబెతు జెకర్యాలతోఉండటానికి వాళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పటికి ఎలీజబేతు ఆరు నెలల నుండీ గర్భవతిగా ఉంది.
"26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో".
ఇక ఇప్పుడు అంటే “మూడు నెలల” తరువాత ఆమె తిరిగి వెళ్ళిపోతోంది. ఎలిజబెతుకి ఆరు నెలలు ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి సరిగ్గా యోహాను పుట్టబోయే సమయానికి కాస్త ముందు ఆమె తిరిగి వెళ్ళిపోయుండొచ్చు. ఎలిజబెతు వృద్ధాప్యమందు గర్భం ధరించడాన్ని గుర్తుగా దూత చెప్పినప్పటికీ అప్పటికే మూడు నెలలు కాబట్టి ఆమె స్వయంగా తానే గర్బవతినని గ్రహించి ఉండవచ్చు. కాబట్టి ఇక గుర్తుతో పని లేదు. తనకు ఇంకా యోసేపుతో వివాహం కాలేదు కాబట్టి తన ఇంటికి (అంటే తన తల్లి దండ్రుల దగ్గరికి) తిరిగి వెళ్ళిపోయింది. తిరిగి వెళ్లిన తరువాత యోసేపు ఎం చేసాడు, ఆ సంగతులన్నీ మత్తయి 1: 18 -20 వచనాల్లో చదువుతాము.
ఇలా ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పులను చూస్తుంటే, దేవుని వాగ్దానాలు ఎంత సత్యమైనవో, ఎంత ఖచ్చితంగా అవి నెరవేర్పులోనికి వచ్చి తీరతాయో అర్థం చేసుకోవచ్చు.
దేవుని వాగ్దానాల గురించి, వాటి నెరవేర్పు గురించి బైబిల్ ఇంకా ఎం చెప్తుందో కొన్ని వచనాలను చదివి తెలుసుకుందాం.
యెహోషువ 21:45 -
"45. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను."
1 రాజులు 8:56 -
"56. ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినదికాదు"
2 కొరింథీ 1:20 -
"20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి."
హెబ్రీ 10:23 -
"23. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము."
సంఖ్యా 23:19 -
"19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?"
# అటువంటి వాగ్దానాల పై అనుకోవడం మనం నేర్చుకోవాలి. వాటిని ఎత్తి పట్టి ప్రార్ధించడం అలవాటు చేసుకోవాలి, వాటిని మన హృదయాల్లో పదిలంగా భద్రపరచుకోవాలి.
VI. యోహానుపుట్టుకను గురించిన వృత్తాంతము (లూకా 1: 57 – 66)
దేవుడు తన దూతయైన గబ్రియేలు ద్వారా జెకర్యాకు వాగ్దానం చేసాడు.
"13. అప్పుడా దూత అతనితో - జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు."
ఆ వాగ్దానానికి నెరవేర్పుగా -
"57. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.
ఎంతో కాలం నుండీ ఎదురు చూస్తూ ఉన్న ఎలిజబెతుకి కుమారుడు పుట్టడం తద్వారా తాను గొడ్రాలు అన్న అవమానం నుండి తొలగించబడటాన్ని బట్టి ఆమె సంతోషించింది. అంత మాత్రమే కాదు "ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి."
# ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు, ఒక క్రైస్తవుడు సహజంగానే వారితో కూడా సంతోషిస్తాడు. దేవుడు నీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఇతరులకు చేసిన మేళ్లను బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. ఈర్ష్య పడకూడదు.
సరే ఈర్ష్య పడకూడదు, మరేం చెయ్యాలి అని వాక్యం చెబుతుంది -
రోమా 12:15, 16 -
"15. సంతోషించు వారితో సంతోషించుడి;
మన ప్రభువే ఈ విషయంలో మనకు మాదిరిగానున్నారు.
యోహాను 2:1 -
"1. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.
యోహాను 11: 35 -
"35. యేసు కన్నీళ్లు విడిచెను."
ఎలిజబెతు, ఆమెతో కూడా ఉన్నవారు "ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని" చెప్పి దేవుణ్ణి స్తుతించారు.
వృద్దాప్యంలో పిల్లలు లేకుండా ఉన్న ఆ వృద్ధ దంపతుల వేదనను చూసిన దేవుడు, వారు దేనికీ యోగ్యులు కానప్పటికీ తన ప్రేమను బట్టి ఇలా వారికి కుమారుణ్ణి అనుగ్రహించడం ద్వారా తన మహాకనికరమును కనపరిచాడు.
"59. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా"
"ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి"
సున్నతి చెయ్యడం వల్ల భార్యాభర్తలిద్దరికీ ఆరోగ్య రీత్యా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇలా సున్నతి చేయడం ద్వారా చాలా అనారోగ్యాల నుంచీ వారు తప్పించబడ్డారు.
అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది - దేవుడు అబ్రాహాముకి చేసిన నిబంధనకు ‘సున్నతి’ గుర్తుగా ఉంది.
ఆది 17: 10, 11 -
"10. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.
కాబట్టి సున్నతి ఫలానా వారు ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వారు అని తెలియజేసే గుర్తుగా ఉండింది.
సాధారణంగా ఈ సున్నతి చేయడం అనేది తండ్రి చేస్తాడు లేదా ఆ పని చేయడం కోసం నియమించబడిన వ్యక్తి చేస్తాడు. బైబిల్ లో ఒకే ఒక్క సందర్భంలో మాత్రం ఒక స్త్రీ ఆ పని చేసినట్లుగా చదువుతాము.(నిర్గమ 4:25 )
ఈ ఒక్క సందర్భం మినహాయిస్తే, ఈ పనిని పురుషులే చేసేవారు.
అయితే తరువాత యూదుల ఆచారంలో వచ్చిన మార్పు ఏంటంటే, సున్నతి చేసేటప్పుడు కనీసం ఓ పది మంది సాక్ష్యులు ఉండాలి అని, అవసరమైతే తరువాత వారు సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.
ఈ సున్నతి చేసే రోజే పేరు పెట్టాలి అనే ఆచారం పాత నిబంధనలో లేదు కానీ మొదటి శతాబ్ద కాలంలో చాలా సర్వ సాధారణంగా యూదులు దీనిని ఆచరించారు. మోషే తాను పుట్టిన తరువాత ఎనిమిదవ రోజే సున్నతి చేయబడ్డాడు, పేరు కూడా పెట్టబడింది అలాగే అబ్రాహాము విషయంలో కూడా తనకు సున్నతి చేయబడిన రోజే అతనికి ఒక కొత్త పేరు కూడా అనుగ్రహించబడింది. వీరిని బట్టి ఎనిమిదవ రోజు పేరు పెట్టడమనేది ఒక ఆచారంగా అవతరించి ఉండొచ్చు.
ఆది 17: 5, 23, 24 -
"5. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.
ఏది ఏమైనా అక్కడ సాక్ష్యులుగా ఉండటానికి పోగైన వారు మాత్రం ఆ పుట్టిన వాడికి పేరు పెట్టడంలో నిమగ్నం అయ్యారు. ఇలా పేరు పెట్టడంలో ఇరుగు పొరుగువారు పాల్గొనడం వింతేమీ కాదు.
రూతు 4:17 -
"17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి."
పిల్లలు లేకుండా ఎంతో వేదన అనుభవించిన తమ నమ్మకమైన యాజకుడి గౌరవార్థం, ఆ బిడ్డకు "తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా" అని చదువుతున్నాము.
పుట్టిన మొదటి కొడుకుకి తండ్రి పేరు పెట్టడం ఆ రోజుల్లో మామూలే, తాతల పేర్లు పెట్టడం ఇంకా సర్వసాధారణం.
రూతు 4:17 -
"17. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి."
యూదుల సంస్కృతిలో పేర్లకు అర్ధాలు ఉండేవి.
కొన్ని సార్లు బిడ్డ చూడటానికి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి పేరు పెట్టేవారు.
ఆది 25: 26 -
"25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి."
కొన్ని సార్లు తల్లి తండ్రుల యొక్క సంతోషాన్ని సూచిస్తుంటాయి ఉదాహరణకు "అడిగిన వాటిని పొందుకున్నాము" అని అర్థమొచ్చేలా ఉండేవి పేర్లు. సౌలు, సమూయేలు పేర్లు అదే అర్దానిస్తాయి.
ఏలీయా అనే పేరు తన తల్లి తండ్రుల యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఆ పేరుకి "యెహోవాయే దేవుడు" అని అర్థం వస్తుంది.
"60. తల్లి - ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను."
"తల్లి - ఆలాగు వద్దు" అని తన తండ్రి పేరే బిడ్డకు కూడా పెట్టాలని చూస్తున్న వారిని ఆపింది తల్లియైన ఎలీసబెతు. ఆమె మాటలకు ఎలాంటి అర్థం వస్తుంది అంటే - అస్సలు వద్దు, అలా ఎట్టి పరిస్థితుల్లో జరక్కూడదు, అలా జరగడానికి వీల్లేదు. యోహాను అని ఆ బిడ్డకు పేరు పెట్టమని గబ్రియేలు దూత జెకర్యాతో చెప్పాడు. ఈ విషయం జెకర్యా ఎలీసబెతుతో చెప్పాడో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం ఆ పేరే పెట్టాలని అంటోంది.
"వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను." అని చదువుతున్నాము.
1:13 -
"13. అప్పుడా దూత అతనితో - జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు."
దేవుడే పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలో ముందుగానే నిర్ణయించేసినట్లు చదువుతున్నాము. అలా దేవుడు కొందరి విషయంలో జోక్యం చేసుకొని పేర్లు పెట్టడం మనం చూస్తాం
ఆది 17:19 -
"19. దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు....."
యెషయా 8:3 -
"3. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము."
హోషేయా 1:4, 6 , 9
"4. యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము...."
మత్తయి 1:21 -
"21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను."
యోహాను కుటుంబంలోని అందరి పేర్లు భలే అర్ధవంతంగా ఉంటాయి.
యోహాను అంటే దేవుడు కృపగలవాడు అని అర్థం. మెస్సీయా లేదా రక్షకుడికి ముందు నడిచే వాడు, మార్గం సిద్ద పరిచే వాడు అయిన ఇతని పేరు కాబట్టి రాబోయే రక్షణ రూపంలో వెల్లడవ్వబోయే కృపనే ఆ పేరు సూచిస్తూ ఉండవచ్చు.
దేవుని యొక్క ఈ లక్షణాన్ని గురించి వాక్యం ఎం చెబుతుందంటే -
ఆయన పాపులను కరుణించడం ద్వారా సంతోషించేవాడు. తన ప్రజలైన వారు ఏ శిక్షకైతే పాత్రులో ఆ శిక్ష వారిమీదికి రాకుండా నిలిపివేసి, వారిని ఆశీర్వదించే వాడు, అలా ఆశీర్వదింలో ఆయనకు ఎంతో సంతోషం ఉంది.
ఎఫెసీ 1:9 -
"9. మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను."
ఎఫెసీ 2:8 -
"8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే."
1 పేతురు 5:10 -
"10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును."
హెబ్రీ 4:16 -
"16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము."
ఇంకా బైబిల్ లోని అనేక వచనాలు దేవుని కృపను వివరిస్తున్నాయి .
అతని తల్లి తండ్రుల పేర్లు జకర్యా , ఎలీసబెతు. ఈ పేర్లు కూడా దేవుని యొక్క విమోచనా ప్రణాళికను సూచిస్తూ ఉన్నాయి.
జెకర్యా అంటే "దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు" (గాడ్ రెమెంబెర్స్) అని అర్థం. అంటే దేవుడు తన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉంటాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఎలీజబెతు అంటే "నా దేవుడు ఒక వాగ్దానం". మరో విధంగా చెప్పాలంటే - "దేవుడు ఆనుకొనదగినవాడు, నమ్మదగిన వాడు" అని అర్థం.
వీరిద్దరి పేర్లు దేవుని యొక్క నమ్మకత్వాన్నే సూచిస్తున్నాయి.
అయితే అక్కడున్న వారు వెనక్కి తగ్గి ఇలా అన్నారు -
"61. అందుకు వారు - నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి"
ఎలిజబెతు తమ బంధువులలో ఎవరికీ లేని ఆ పేరుని పెట్టమని అనడం ద్వారా యూదుల అలవాటుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు వారి మాటల్ని బట్టి అర్థం అవుతోంది. ఒకవేళ ఆమె తన పరిధి దాటి మాట్లాడుతున్నదని వారనుకున్నారో ఏమో, ఆమెతో కాదని ఆమె భర్త దగ్గరికి అంటే ఆ పిల్లవాడి తండ్రి దగ్గరికి వెళ్లి అడిగారు.
అయితే దేవుని మాటలయందు విశ్వాసముంచకపోవడాన్ని బట్టి జెకర్యా క్రమశిక్షణ చేయబడ్డాడు కాబట్టి అతను మాట్లాడలేని, వినలేని స్థితిలో ఉన్నాడు.
1:22 -
"22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయము నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై ¸"
ఈ వచనంలో వాడిన "మూగవాడైన" అనే పదానికి చెవిటివాడు అని కూడా అర్థం వచ్చేలా ఇతర వాక్యభాగాల్లో ఇదే పదం వాడబడింది ( 7:22; మత్తయి 11:5; మార్కు 7:32,37; 9:25 ).
"62. వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి."
ఈ మాటల్ని బట్టి కూడా అతను మూగవాడు మరియు చెవిటివాడు కూడా అని అర్ధమవుతోంది. ఎందుకంటే ఒక వేళ అతను వినగలిగే వాడైతే సైగ చేసి మాట్లాడాల్సిన అవసరమేముంది, మామూలుగా మాట్లాడితే సరిపోయేదిగా.
ఇక వారు అడిగిన దానికి జవాబుగా జెకర్యా -
"63. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి."
"అతడు వ్రాతపలక తెమ్మని" చెప్పాడు. బహుశా జెకర్యా కొన్ని నెలలుగా ఇలాగే ఇతరులతో సంభాషిస్తూ ఉండి ఉంటాడు.
"వాని పేరు యోహానని వ్రాసెను;"
ఎలిజబెతు అయితే "వానికి యోహానను పేరు పెట్టవలెనని" చెప్పింది కానీ జెకర్యా మాత్రం "వాని పేరు యోహాను" అని ఖచ్చితంగా తేల్చి చెప్పేసాడు.
దూత అతనికే స్వయంగా చెప్పాడు కాబట్టి ఇక దేవుని నిర్ణయమే తుది నిర్ణయం అయ్యింది. "అందుకు వారందరు ఆశ్చర్యపడిరి."
ఆ పిల్లవాడి పేరు విషయంలోనే ఆశ్చర్యపోతే ఇక ముందు జరిగేది చూసి ఇంకెంత ఆశ్చర్య పోతారో.
"64. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను."
వారి ఆశ్చర్యానికి తోడు, దేవుని శక్తి వారికి బయలుపరచబడింది. తొమ్మిది నెలల నుండి జెకర్యా చెవిటివాడిగా, మూగవాడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు "వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచుమాటలాడసాగెను." అని చదువుతున్నాము.
"వెంటనే" అని చాలా తరచుగా ఈ సువార్త అంతటిలో కనిపిస్తూ ఉండే ఈ మాట ఎప్పుడూ దేవుడు చేసే అద్భుతాలతో ముడిపడి ఉంది. (4:39; 5:25; 8:44, 47, 55; 13:13; 18:43)
ఈ రోజుల్లో స్వస్తత మహా సభల్లో జరిగే మోసాల్లాగా కాకుండా కొత్త నిబంధలో స్వస్థతలు వెంటనే జరిగేవి.
# నూనె, డబ్బాలు డబ్బాలు అయిపోతుంది కానీ స్వస్థత మాత్రం జరగదు. విశ్వాసి విశ్వాసాన్నే శంకిస్తారు. కానీ కొత్త నిబంధన చరిత్రలో అలా జరగలేదు.
గబ్రియేలు చెప్పిన విధంగానే -
1:20 -
"20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను."
ఈ మాటలు నెరవేరతాయి.
"వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను."
అప్పటి వరకూ తన మనసులో దాచుకున్నదంతా వెళ్ళగక్కాడేమో జెకర్యా. అతను మాట్లాడిన వాటిని ఇంకా వివరంగా 67-79 వరకూ ఉన్న వచనాల్లో చదువుతాము.
ఇక ఆ అద్భుతం చూసిన తరువాత, దేవుని శక్తిని రుచి చూచిన వారై
"65. అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను."
"ఆ సంగతులన్నియు" అంటే జెకర్యాకు దూత ప్రత్యక్షమయిన దగ్గరి నుండీ మొదలుకొని అన్ని సంగతులూ. కేవలం వాళ్ళ ఊరిలో మాత్రమే కాదు, "యూదయ కొండసీమాయందంతట ప్రచారమాయెను".
"వారందరికీ భయము కలిగెను" అన్న మాట చూస్తున్నాము.
# దేవుడు చేసిన మహత్తరమైన కార్యాలు విన్నప్పుడు, మనకు కూడా దేవుని పట్ల భక్తితో కూడిన భయమూ గౌరవమూ పెరగాలి.
అలా విన్నవారు అందరూ -
"66. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి."
కాబట్టి అతని గురించిన సంగతులన్నీ విన్నవారికి యోహాను భవిష్యత్తుని గురించి ఉత్కంఠగా ఉండి ఉండవచ్చు. మెస్సీయాకి ముందు నడిచే వాడు పుట్టాడు అంటే మెస్సీయా వచ్చే సమయం కూడా ఆసన్నమయిందని అనుకొని ఉండవచ్చు. ఎవ్వరూ తృణీకరించని, త్రోసిపుచ్చని అభిప్రాయం ఏంటంటే - "ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను" అన్నది.
VII. జెకర్యా పాడిన పాట (లూకా 1: 67 – 80)
67 - 80 వరకూ ఉన్న వచనాల్లో జెకర్యా పాడిన పాట చూస్తాము.
పాటలు పాడటం గురించి చెప్పబడిన కొన్ని కొత్త నిబంధన వచనాలు ఇవి -
ఎఫెసీ 5: 19 -
"19. ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
కోలస్సీ 3:16 -
"16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలోసమృద్ధిగా నివసింపనియ్యుడి."
కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాట ద్వారా దేవుణ్ణి స్తుతించడం అనేది ఎప్పటి నుండో ఉన్న అలవాటే.
నిర్గమకాండం 15 లో ఎర్ర సముద్రం దాటిన తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు సైన్యం చేతుల్లోనుండీ రక్షించాడు కాబట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ పాట పాడినట్లు మనం చూస్తాము.
అలాగే న్యాయాధిపతుల గ్రంధం 5 వ అధ్యాయంలో దెబోరా బారాకులు దేవుడు వారిని విమోచించినందుకు గానూ పాట పాడతారు.
సమూయేలు పుట్టినప్పుడు హన్నా పాట పాడుతుంది.
కీర్తన గ్రంథం నిండా పాటలే. యూదులు కీర్తన గ్రంథాన్ని పాటల పుస్తకం లాగా వాడేవారు.
ఇక ప్రకటన గ్రంథంలో పరలోకంలో పాడే పాటల గురించి రాయబడింది.
అంత మాత్రమే కాదు ఈ లూకా సువార్తలోనే మొదటి రెండు అధ్యాయాల్లో అయిదు స్తుతి పాటల్ని మనం చూడొచ్చు -
మొదటిది, ఎలీసబెతు పాడిన పాట 1: 41 - 45
రెండవది మరియ పాడిన పాట 1: 46 - 55
మూడవది జెకర్యా పాడిన పాట 1: 67 - 79
నాలుగవది యేసు పుట్టినప్పుడు దూతలు పాడినది 2 : 13 - 14
అయిదవది షిమ్యోను పాడినది 2: 25 - 32
మరియ పాడిన పాటను మనం ధ్యానించాము కదా, అందులో పాత నిబంధనకు సంబంధించిన అంశాలు ఎన్నో వినిపించకనే విన్పించాయి. ఆమె మాటలు లేదా వాడిన పదాలను బట్టి పాత నిబంధనలో ఏ సన్నివేశాన్ని ఆధారం చేసుకొని ఆమె అలా అంటుందో యిట్టె చెప్పగలం. అదే విధంగా జెకర్యా ఒక యాజకుడు కాబట్టి ఇతని పాటలో కూడా పాత నిబంధనకు సంబంధించిన విషయాలు ఎక్కువగానే వినబడుతుంటాయి.
మొత్తం పాత నిబంధనలో 6 నిబంధనలు కనబడతాయి. నోవాహు, మోషే, యాజకులతో దేవుడు చేసిన నిబంధన, ఇవి రక్షణకి సంబందించినవి కాదు, వాటిని నాన్ - సాల్విఫిక్ నిబంధనలు అంటారు. అంటే వాటిలో నిత్యత్వానికీ, ఆత్మ యొక్క రక్షణకు సంబంధించిన విషయాలు ఉండవు. మిగిలిన మూడు నిబంధనలు మన రక్షణకు సంబంధించినవి. కాబట్టే వీటిని సాల్విఫిక్ నిబంధనలూ అంటారు. జెకర్యా యొక్క ఈ పాటలో మనం ఆ మూడు నిబంధనలు చూడొచ్చు.
అవేంటంటే దావీదు నిబంధన, అబ్రాహాము నిబంధన మరియు కొత్త నిబంధన.
అయితే ఈ కొత్త నిబంధనకు వేరుగా ఎవరూ ఇతర రెండు నిబంధనల్లోని వాగ్దానాలను సొంతం చేసుకోలేరు.
ఈ మూడు నిబంధనలు, వాటి నెరవేర్పు గురించి ఇలా ఒకే చోట ప్రస్తావించబడటాన్ని బట్టి క్రెస్తవ్యం ఏదో కొత్త మతం కాదు, అది పాత నిబంధన యొక్క కనసాగింపు, నెరవేర్పు మాత్రమే అని గ్రహించగలము. ఆ నెరవేర్పు యేసు క్రీస్తులో జరిగింది.
ఇంతకీ జెకర్యా ఎందుకు పాట పాడుతున్నాడు అంటే -
అప్పటి వరకూ అంటే ఆ తొమ్మిది నెలలు జరిగిన సంగతులన్నీ తలపోసుకుంటూ సంతోషం పట్టలేక అది ఈ పాట రూపంలో పొంగి పొర్లుతుంది. అతని హృదయం బద్దలై ఈ స్తుతి పాట బయటికి తన్నుకొస్తోంది.
జెకర్యా పాటను బట్టి మరో సంగతి మనకు అర్థం కావాలి. జెకర్యా కేవలం తండ్రి అయ్యాడని మాత్రమే సంతోషించడం లేదు. అతని సంతోషానికి కారణమైన మరో ప్రాముఖ్యమైన సంగతి ఉంది. తన హృదయమంతా నిండిన సంతోషానికి కారమైనఆ సంగతి చేతనే తన పాట, మాట అంత నిండిపోయి ఉంది.
మత్తయి 12: 34 -
"...........హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా."
ఇక ఆ పాటను సంగతికొస్తే -
“67. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను”
ముందు వచనాల్లో జెకర్యా యొక్క భార్య(1:41), కుమారుడు(1:15) పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చదివుతాము. ఇప్పుడు "జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై"నాడని చదువుతున్నాము.
దేవుని ఆత్మ శక్తి జెకర్యా మీదకి దిగి వచ్చింది. జెకర్యా "ప్రవచించెను" అని చదువుతున్నాము.
"ప్రవచించెను" అనే మాటకి అర్థం ఏంటంటే - "మాట్లాడుట", "దేవుని వాక్యాన్ని ప్రకటించుట, బోధించుట, వివరించుట". జెకర్యా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి నిజంగా దేవుని మాటలనే పలికాడు.
“68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక”
జెకర్యా తన పాటను ప్రారంభిస్తూ ఇలా అన్నాడు - " ప్రభువైన ..... దేవుడు స్తుతింపబడునుగాక"
సాధారణంగా పాత నిబంధనలో పాటల ప్రారంభాలు ఇలాగే ఉండేవి.
పౌలు కూడా తన పత్రికల ప్రారంభంలో దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం గమనించవచ్చు. జెకర్యా కూడా తన నోరు తెరవబడిన వెంటనే మొదటి మాటతోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు (మనకి ఇక్కడ రాయబడి ఉన్న వివరణ ఆధారంగా).
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ప్రతి క్రైస్తవుడు దేవుడు తన కిచ్చిన ఆధిక్యతలను క్రమంగా మర్చిపోతుంటాడు, వాటిని గురించిన ఆలోచనలు మెల్లిగా మసకబారిపోతుంటాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను హృదయంలో భద్రపరచుకొని, అనుదినం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ జెకర్యా వలె దేవుణ్ణి స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి.
"ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక"
యోహాను 4:22 - "....రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది." అని యేసు క్రీస్తు అన్నాడు.
పౌలు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ -
రోమా 9:4,5 -
"4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాల నెరవేర్పే దేవుని విమోచనా ప్రణాళిక.
“69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను”
"ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి".
దేవుడు దర్శించడము అనే మాట పాత నిబంధనలో తరచూ వినబడుతూ ఉంటుంది. అయితే దేవుని తీర్పుకు సంబంధించిన సందర్భాల్లో కానీ లేదా దేవుడు ఆశీర్వదించిన సందర్భాల్లో కానీ ఈ మాట వినబడుతుంది. ఇక్కడ మాత్రం రక్షణ/ విమోచన అనే ఆశీర్వాదాన్ని గురించి ఆ మాట వాడినట్లు చూస్తున్నాం.
"ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను". ఈ విమోచన మన ఆత్మల రక్షణకు సంబంధించినది. కొంత వెల చెల్లించి లేదా మూల్యం చెల్లించి ఎవరినైనా బానిసత్వంలో నుండీ, చెరలో నుండీ విడిపించే సందర్భంలో ఈ పదాన్ని వాడేవారు. మరో విధంగా చెప్పాలంటే, ‘కొనుక్కోవడం’ అనమాట. అంటే ఆ విమోచించబడిన వ్యక్తికి ఈ కొనుక్కున్న వ్యక్తే యజమాని అనే కోణంలో కూడా ఈ పదాన్ని అర్థం చేసుకోవచ్చు.
పాపులు దేని నుండీ విమోచించబడతారు అని వాక్యం చెబుతుంది అంటే -
యోహాను 8:34 -
"34. అందుకు యేసు - పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
ఈ వచనం ఆధారంగా విమోచన అంటే పాపపు దాస్యత్వం నుండీ విడిపించబడటం అని అర్థం చేసుకోవచ్చు.
గలతీ 3:13 -
"13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను;"
ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి
సాతాను యొక్క బంధకాల నుండి విడిపించుటకు,
దేవుని చేత ఎన్నుకోబడిన వారు విమోచించబడటానికి చెల్లించబడిన మూల్యం ప్రభువైన యేసు క్రీస్తు చేసిన బలి అర్పణ. మరణానికి తనని తానే అప్పగించుకొన్నాడు యేసు క్రీస్తు.
రోమా 3:24 -
"24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు."
ఎఫెసీ 1:7 -
"7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది."
ఈ విమోచన ఎప్పుడో వాగ్దానం చెయ్యబడింది, ఆదికాండములోనే, కానీ జెకర్యా నాటికి ఇంకా కార్యరూపంలోకి రాలేదు. జెకర్యా ఈ పాట పాడినప్పుడు అతని కుమారుడైన యోహాను ఎనిమిది రోజుల బాలుడు. యేసు ఇంకా పుట్టనేలేదు కానీ "ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను" అని అంటున్నాడు జెకర్యా.
దేవుడు వాగ్దానం చేస్తే దానిని తప్పక నెరవేరుస్తాడన్న సత్యాన్ని జెకర్యా ఎంత రూఢీగా నమ్ముతున్నాడు అంటే ఆ విమోచన అప్పటికే వారికి అనుగ్రహించబడినట్లుగా పాడుతున్నాడు.
పాత నిబంధన భక్తులు దేవుని వాగ్దానాలపై ఎలా ఆధారపడేవారో, ఎలా వాటి యందు విశ్వాసం ఉంచేవారో జెకర్యాను చూస్తే అర్థం అవుతోంది. మనం కూడా దేవుని వాగ్దానాల పై ఆనుకోవడం నేర్చుకోవాలి.
దూత మాటలను జెకర్యా స్వయంగా విన్నాడు, ఎదురుగా అద్భుత రీతిన పుట్టిన తన కుమారుడైన యోహాను ఉన్నాడు, యోహాను విషయంలోనూ మరియ విషయంలోనూ పాత నిబంధన వాగ్దానాలు నెరవేరుతున్నాయి. దేవుడు తన ప్రజలను దర్శించబోతున్నాడు, వారు రక్షించబడటానికి కావాల్సిన ఏర్పాటేదో చెయ్యడం ప్రారంభించాడు అని జెకర్యాకు అర్థం అయ్యింది.
అయితే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఐగుప్తు చెరలో నుంచీ విడిపించాడో అలాగే ఇప్పుడు కూడా రోమా సామ్రాజ్యపు చెరలో నుండీ విడిపించాలని యూదులు ఆశపడ్డారు. మెస్సీయా వచ్చి తమను విడిపిస్తాడని ఎంతో కాలం ఎదురుచూసారు. దేవుడు తమను అలా విమోచించి, ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకున్నారు. నూతన నిబంధన ద్వారా అనుగ్రహించబడే పాప క్షమాపణకు వేరుగా వారు రక్షించబడటం సాధ్యపడదని వారు గ్రహించలేదు.
“70. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా”
"తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును.....కలుగజేసెను".
విమోచన గురించి మాట్లాడుతూ జెకర్యా దేవుడు మన కొరకు “రక్షణశృంగమును” కలుగజేసాడు అని అంటున్నాడు.
పాత నిబంధనలో ఈ మాట అనేక చోట్ల కనబడుతుంది. కీర్తనలలో ఎక్కువ సార్లు కనబడుతుంది.
కీర్తన 18:2 -
"2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము."
1 సమూ 2 సమూ గ్రంథాల్లో కూడా ఈ మాటను చూస్తాము.
ఈ మాట శక్తిని సూచిస్తోంది, ఎవరినైనా జయించి వారిని పరిపాలించే శక్తిని సూచిస్తోంది. ఇక్కడ జెకర్యా ఆ మాటను మెస్సీయా గురించి వాడాడు. ఒక బలిష్టమైన, శక్తివంతమైన మృగమువలె ఆయన కూడా తన కొమ్ములతో శత్రువులను తరిమి, తన ప్రజలను విమోచిస్తాడు అనే భావంతో జెకర్యా ఈ మాటను వాడాడు.
ఒక పాత నిబంధన యాజకుడైన జెకర్యా తన స్తుతి పాటలో దావీదు నిబంధన (అంటే దావీదు చేసింది కాదు, దావీదుతో దేవుడు చేసిన నిబంధన) యొక్క నేపధ్యాన్ని, దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని మరియు దాని యొక్క నెరవేర్పు గురించి చూస్తాము.
ముందుగా నేపథ్యం గురించి చూద్దాం.
"తన సేవకుడైన దావీదు వంశమునందు...." అనే మాటను చదువుతున్నాము.
మెస్సీయా దావీదు వంశములో నుండీ వస్తాడు అని పాత నిబంధనలో స్పష్టంగా చెప్పబడింది.
యిర్మీయా 35:5 -
"5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును."
ఇదే వాగ్దానం యిర్మీయా 33:15 లో కూడా కనిపిస్తుంది.
"15. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును."
కీర్తన 132: 17 - "17. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను."
యెషయా 11: 1,10 -
మరియ దావీదు వంశానికి చెందినది అన్న సంగతి జెకర్యాకు తెలిసే ఉండవచ్చు. ఆమె జెకర్యా ఎలీజబేతులతో మూడు నెలలు ఉండింది, ఖచ్చితంగా గబ్రియేలు దూత ప్రత్యక్షమై ఆమెతో ఎం చెప్పాడో ఆ విషయాలన్నీ జెకర్యా ఎలీసబెతులతోచెప్పే ఉంటుంది.
ఇంతకీ మరియతో దూత ఎం చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము -
1: 31, 32 -
"31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
మరియ దావీదు వంశములో పుట్టిన స్త్రీ (రక్తసంబంధం) కాబట్టి దావీదు యొక్క వారసత్వం యేసు క్రీస్తుకి మరియ ద్వారా సంక్రమించింది.
"తన సేవకుడైన దావీదు". దావీదు గురించి సేవకుడు అనే మాట వాడబడింది.
"సేవకుడు" అనే మాట దావీదు గురించి అనేక మార్లు వాడబడింది.
సేవకుడు అని మాత్రమే కాదు -
1 సమూ 13:14 -
"14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. ......"
ఈ మాట దావీదు గురించే చెప్పబడింది.
దేవుడు మెస్సీయా ద్వారా ఇశ్రాయేలు రాజ్యం యొక్క వైభవాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడనీ తద్వారా ఆయన దావీదుతో చేసిన నిబంధన నెరవేరుస్తాడని యూదులు ఎదురుచూసారు.
ఇప్పుడు అసలు ఆ నిబంధన ఏంటో చూద్దాము.
చేయబడిన ఆ వాగ్దానం గురించి జెకర్యా మాటల్లో విందాము.
“71. మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
"దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను."
2 సమూయేలు 7: 1-11 -
"1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజుతన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి
దావీదుకు అతని సంతానానికి ఇవ్వబడిన వాగ్దానం గురించి ఈ వచనాల్లో మనం చదివాము.
దేవుడు పాత నిబంధనలో అనేక సార్లు "తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన" నిబంధన ఇదే - దావీదు నిబంధన. సుమారు 40 కంటే ఎక్కువ చోట్ల ఈ నిబంధన గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. యెషయా ప్రవక్త అయితే భవిష్యత్తులో దేవుడు స్థాపించబోయే ఆ దావీదు రాజ్యం గురించీ మెస్సీయా పరిపాలన గురించీ చాలా విషయాలు ప్రస్తావిస్తాడు.
దావీదు నిబంధన యొక్క నెరవేర్పు
"మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను."
పాత నిబంధనలోని అనేక ఇతర ప్రవచనాలకు లాగ దావీదు నిబంధనకు కూడా రెండు నెరవేర్పులు ఉంటాయి - ఒకసారి వెంటనే జరుగుతుంది, మరొకటి భవిష్యత్తులో ఎప్పుడో నెరవేరుతుంది.
2 సమూ 7 : 12-14 –
“12. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
ఈ విధంగా అతని కుమారుడైన సొలొమోను విషయంలో ఆ నెరవేర్పు జరిగిపోయింది. కానీ ఆ రాజ్యము ఎంతో కాలము నిలిచియుండలేదు.
లూకా 11:31 -
".......ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు."
దేవుడు తన నిబంధన విషయంలో విఫలమవ్వడం అసంభవం. సొలొమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ద్వారా అది నెరవేరుతుంది. యేసు క్రీస్తు రాజ్యాన్ని గురించి
2 సమూ 7: 13, 16 లో వాగ్దానం చేయబడింది.
యేసు ఒక రోజు తప్పక తిరిగి రానైయున్నాడు, వచ్చినప్పుడు ఆయన ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు.
యెషయా 9:6, 7 -
"6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఆ మెస్సీయా స్థాపించే రాజ్యము, దాని గురించిన ఆశ, నిరీక్షణ కలిగివాడై, "మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను." అన్న మాటలు పలుకుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడుజెకర్యా.
శిష్యులకు కూడా ఇటువంటి నిరీక్షణే ఉండింది. దాని గురించే పునరుర్ధానుడైన యేసును అడుగారు.
అపో. కార్య. 1: 6 -
"6. కాబట్టి వారు కూడివచ్చినప్పుడు ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా"
జెకర్యా ఊహకు కూడా అందని విషయం ఏంటంటే - యూదులు మెస్సీయాను అంగీకరించకుండా, ఆయనకు తిరస్కరించి, వాళ్ళ రాజుని వాళ్ళు సిలువకు అప్పగిస్తారని.
అయితే యూదుల అవిధేయత దేవుని వాగ్దానాలను నిరర్ధకం చేస్తుందా? కానే కాదు.
రోమా 3: 3 -
"3. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు."
యూదుల అవిధేయత దేవుని మాటలను నిరర్ధకం చెయ్యదు కానీ వాటిని నెరవేరుస్తుంది. ఎలాగంటే దాని 9:26 ప్రకారం అభిషిక్తుడు నిర్మూలము చేయబడతాడు. అంటే యేసు తన మొదటి రాకడలో తిరస్కారము నొందుతాడు, నిర్మూలముచేయబడుతాడు. ఇది జరిగిన తరువాతే రెండవ రాకడ, నిత్య రాజ్య స్థాపన జరుగుతుంది. ఇదే దేవుని చిత్తం. కాబట్టి యూదుల అవిధేయత దేవుని ఉద్దేశ్యాలను/ వాగ్దానాలను నిరర్ధకం చెయ్యలేదు సరికదా నెరవేర్చాయి అని అర్ధమవుతోంది.
మన రాజు ఒక రోజు తప్పక తిరిగి రాబోతున్నాడు. ఆ గొప్ప నిరీక్షణ మనకు ఉన్నది.
మనందరి నిరీక్షణ తప్పక నిజమవుతుంది.
దేవుడు దావీదుతో తాను చేసిన నిబంధనను మర్చిపోయేవాడు కాదు. వెయ్యేండ్ల పాలనలో ఆ రాజును సేవిస్తూ ఆయనను ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని, నిత్య రాజ్య వారసులుగా ఆయనతో కూడా ఎప్పటికీ ఉండే ఆధిక్యతను ఆయన చేత విమోచించబడిన మనము పొందుకున్నాము.
అప్పుడు మాత్రమే ఈ నిబంధన సంపూర్ణంగా నెరవేరుతుంది.
వ. 73-76
పాత నిబంధన అంతా మనం చూస్తే మెస్సీయా రాబోతున్నాడు అని, ఆయన మనకు విమోచన అనుగ్రహించబోతున్నాడు అని ప్రవచనాలు చెప్పబడ్డాయి. యూదులు ఎంతో ఆశతో ఆయన కోసం కనిపెట్టేవారు. అలా ఎదురు చూసిన వారిలో జెకర్యా కూడా ఒకడు. అయితే జెకర్యా దినాల్లో ఆ ఎదురు చూపుకు తెర పడింది. దేవుడు అతనికి కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ పుట్టబోయే కుమారుడి గురించి గబ్రియేలు దూత ఏమన్నాడు అంటే -
"17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను."
జెకర్యాకు అర్థం అయ్యుంటుంది - ముందుగా నడిచేవాడు పుట్టాడంటే ఇక మెస్సీయా కూడా రాబోతున్నాడు అని. ఆ అవగాహనే అతను ఇటువంటి ఒక స్తుతి పాట పాడేలా పురిగొల్పి ఉంటుంది.
ఒక యాజకుడు కాబట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి బోధించడానికి కట్టుబడియున్న వ్యక్తిగా, అతనికి తగినట్లుగానే పాత నిబంధనలోని నిబంధనలతో అతని స్తుతి పాట నిండి పోయింది. మరీ ముఖ్యంగా అతను మూడు నిబంధనలపై దృష్టి సారిస్తాడు. దావీదు, అబ్రాహాము మరియు నూతన నిబంధన.
67 - 72 వరకు ఉన్న వచనాల్లో దావీదు నిబంధన గురించి చూసాము.
ఇప్పుడు జెకర్యా అబ్రాహాము నిబంధన గురించి పాడుతుంటాడు.
“73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
అబ్రాహాము నిబంధన యొక్క నేపధ్యము.
"మన పితరులను కరుణించుటకును"
ఇశ్రాయేలు జనాంగం యొక్క "పితరులైన" అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం.
ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఈ నిబంధనలో ఉంటాయి. అన్యులు కూడా విశ్వాసం ద్వారా ఆ ఆశీర్వాదాలు పొందే వీలు ఉన్నప్పటికీ, ప్రాధమికంగా దేవుడు వాటిని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.
అబ్రాహాము నిబంధన ఒక కరుణ నిబంధన/ కృపా నిబంధన. దేవుడు యోగ్యులు కాని వారి పట్ల కనికరం చూపే వాడు, కృప చూపించేవాడు అని తెలియజేస్తుంది - ఆ నిబంధన. ఆ కరుణ నిబంధన అబ్రాహామును ఆశీర్వదించడంతో ప్రారంభమై ఆ తరువాతి కాలంలో కూడా వందలవేల సంవత్సరాల పాటు ఎవరైతే మెస్సీయా యైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుతారో వారికి క్షమాపణను విమోచనను నిత్యత్వపు ఆశిర్వాదాలను అనుగ్రహిస్తోంది.
ఇదంతా కేవలం ఆయన కరుణను బట్టి, మన యోగ్యతను బట్టి కాదు, మన నీతి క్రియలను బట్టి కాదు.
ఆదికాండము మొదటి పదకొండు అధ్యాయాలలో వేరు వేరు సంఘటనల గురించి చదువుతాము. సృష్టి నిర్మించబడిన క్రమము. పాపము ఈ లోకంలోకి ప్రవేశించడము, నోవహు రోజుల్లో వచ్చిన ప్రళయము, ఇక వెంటనే 11 వ అధ్యాయం చివరిలోఅబ్రాహాము పరిచయం చేయబడతాడు. ఆ తరువాతి అధ్యాయాలన్నింట్లో అతని గురించి అతని సంతానం గురించీ చెప్పబడింది. అతను ఒక విగ్రహారాధికుడిగా (యెహోషువా 24:2) ఊరు అనే కల్దీయుల పట్టణంలో (ఆది 11:31) ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు.
అపో. కార్య . 7:3 -
"3. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను."
తరువాత అబ్రాహాము తన తండ్రియైన తెరాహుతో పాటు తన ఊరిని విడిచి బయటికి వచ్చి హారానులో స్థిర పడిన తరువాత దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేస్తాడు.
ఆది 12: 1-3 -
"1. యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
దేవుని మాటలకు విధేయత చూపిస్తూ
ఆది 12: 4,5 -
"4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.
ఇది ఆ అబ్రాహాము నిబంధన యొక్క నేపధ్యం
అసలు అబ్రాహాము నిబంధనలో ఎం వాగ్దానం చెయ్యబడింది.
"తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును"
దేవుడు అబ్రాహామును గొప్ప జనముగా చేస్తాను అని చెప్తాడు కానీ అబ్రాహాము భార్యయైన శారా గొడ్రాలు. అయితే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు వారికి ఇస్సాకు జన్మించడంతో ప్రారంభమవుతుంది.
"భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని"
ఇది ఆత్మీయ ఆశీర్వాదం.
రోమా 9:5 -
"5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్."
యేసు క్రీస్తు కూడా ఇలాగే అన్నారు -
యోహాను 4:22 -
"రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది." అని యేసు తనను ఉద్దేశించే పలికిన మాటలివి.
ఈ ప్రపంచానికి యూదుల ద్వారానే దేవుని ప్రత్యక్షత, ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి.
అబ్రాహాము నిబంధన గురించి ఆదికాండములో దాదాపు 8 సార్లు ప్రస్తావించబడడాన్ని బట్టి ఆ నిబంధన యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. (12,13,15,17,22,26,28,35).
12 వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన గురించి చదువుతాము కానీ అది 15 వ అధ్యాయంలో అది ఒక నిబంధన రూపంలోకి వస్తుంది.
ఆది 15: 18 - 21 -
" ఆ దినమందే ....................................అబ్రాముతో నిబంధన చేసెను."
12 వ అధ్యాయంలో చేసిన ఆ నిబంధనను 15: 7 లో దేవుడు మరల జ్ఞాపకం చేస్తాడు.
"7. మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు"
అయితే ఈ సంగతులు ఇలాగే నెరవేరుతాయని నేనెట్లా తెలుసుకోవాలి అని అడుగుతాడు అబ్రాహాము.
"8. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా"
"9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
జంతువులను చంపడం ఆ నిబంధన యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. నిబంధన చేసుకున్న వారు ఇద్దరూ ఆ జంతు కళేబరాల మధ్య నుండీ నడుస్తారు. ఒక వేళ వారు ఆ నిబంధన నుండీ తప్పిపోయినట్లైతే వారు కూడా ఆ జంతువులవలె అవుతారు అని చెప్పడం కోసం నిబంధన చేసుకున్న ఇరువురు అలా చేసేవారు ఆ రోజుల్లో.
అయితే ఈ నిబంధన ఏక పక్ష నిబంధన, మార్చలేనటువంటి నిబంధన. దేవుడు మాత్రమే చేసిన నిబంధన. అబ్రాహాము చేసే క్రియల పై ఆధారపడి ఉండదు.
అయితే ఆది 17: 18 - 21 వచనాల్లో చెప్పబడిన భూమిని ఇశ్రాయేలు ఇప్పటివరకూ పొందుకోలేదు.
అయితే అది ఎప్పుడు నెరవేరుతుందంటే యేసు క్రీస్తు దావీదు సింహాసనంపై కూర్చొని ఈ భూమిపై తన భౌతిక రాజ్యాన్ని స్థాపించినప్పుడు మాత్రమే ఆ అబ్రాహాము నిబంధన యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు నెరవేర్పులోనికి వస్తాయి.
ఆది 17 లో ఆ నిబంధనకు సంబంధించి మరి కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి.
"2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను."
4 వ వచనంలో మళ్ళీ ఇదే విషయం ప్రస్తావించబడింది.
"4. నీవు అనేక జనములకు తండ్రివగుదువు."
ఈ విషయాన్ని ఇంకా నొక్కి చెప్పడం కోసం దేవుడు అబ్రాహాము పేరుని అబ్రాము నుండీ అబ్రాహాముగా మార్చాడు.
అబ్రాము అంటే "ఘనుడైన / ఉన్నతుడైన తండ్రి" అని అర్థం.
అబ్రాహాము అంటే "అనేక జనములకు తండ్రి" అని అర్థం.
మూడు సార్లు ఈ అధ్యాయంలో దేవుడు చేసిన నిబంధన ఒక నిత్య నిబంధన అని చెప్పబడింది.
ఆది 17: 7, 13 , 19 -
"7. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
ఆ నిబంధన ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో నెరవేరుతుంది.
అబ్రాహాము నిబంధన బేషరతు నిబంధన అయినప్పటికీ, దాని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనకు విశ్వాసం ఉండాలి.
అబ్రాహాముకు అటువంటి విశ్వాసం కలదు అని ఆది 22 వ అధ్యాయంలో జరిగిన సంఘటన బట్టి అర్ధమవుతుంది.
దేవుడు వాగ్దానం చేసిన విధంగానే అబ్రాహాము శారాలకు ఇస్సాకుని అనుగ్రహించాడు. (ఆది 21:1-3)
కొన్ని సంవత్సరాల తరువాత, ఇస్సాకు ఇంకా యవ్వనస్థుడిగా ఉన్నప్పుడు, దేవుడు అబ్రాహాముకి ఒక ఆశ్చర్యమైన ఆజ్ఞ ఇచ్చాడు.
ఆది 22:2 -
"2. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను"
మామూలుగా ఇది గ్రహింప శక్యముగాని విషయం. ఎందుకంటే దేవుడు ఇస్సాకు ద్వారానే కదా గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని చెప్పింది. మరి ఇప్పుడు ఆ ఇస్సాకునే బలి ఇమ్మంటున్నాడు ఏంటి? అప్పుడు దేవుడు తన నిబంధనకు కట్టుబడి దానిని నెరవేర్చే అవకాశం ఉండదు కదా ?
కానీ అబ్రాహాము తన విశ్వాసంలో చెదిరిపోలేదు.
హెబ్రీ 11:18, 19 -
"18. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
అబ్రాహాము తన కొడుకుని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు
ఆది 22: 11,12 -
"11. యెహోవా దూత పరలోకమునుండి - అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలి చెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
దేవుడు తన వాగ్దానాలపై నిలబడి తీరతాడు అని ఆయనపై విశ్వాసం ఉంచే విషయంలో అబ్రాహాము మనకి మాదిరిగా నున్నాడు. (గలతీ 3:9)
కాబట్టి మనకి విశ్వాసం ఉంటె ఆ నిబంధన యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవచ్చు.
అబ్రాహాము నిబంధన యొక్క నెరవేర్పు
"75. మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
కేవలం వెయ్యేండ్ల పాలనలో మాత్రమే ఇవి సంపూర్ణంగా నెరవేర్పులోనికి వస్తాయి.
అప్పుడు మాత్రమే జెకర్యా యొక్క ఈ నిరీక్షణ నేరవేరుతుంది.
అన్యులయ్యుండీ రక్షణ పొందిన విశ్వాసులు కూడా దావీదు నిబంధన లాగే అబ్రాహాము నిబంధన యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలరు. ఆత్మీయ కోణంలో నుండీ చూస్తే ఈ నిబంధనలో రక్షణ గురించి ఏదైతే వాగ్దానం చెయ్యబడిందో ఆ ఆశీర్వాదం అందరు క్రైస్తవులకీ వర్తిస్తుంది. తద్వారా అపొస్తలుడైన పౌలు గలతీ 3: 7,8,9 లో చెప్పినట్లుగా మనం అబ్రాహాముకి పిల్లలమవుతాము.
"7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.
అబ్రాహాము ఎలాగ రక్షించబడ్డాడో అలాగే మనం కూడా రక్షణ పొందాము.
"9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు."
ఎవరైతే సువార్త విని, విశ్వసించి, యేసు క్రీస్తును హత్తుకుంటారో వారు అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు.
అబ్రాహాముకి పుట్టిన పిల్లలం కాకపోయినా విశ్వాసము విషయంలో మనం ఆయనకు ఆత్మీయ వారసులం.
అబ్రాహాము నిబంధనలో రక్షణ వాగ్దానం ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరికీ చెందినది.
రోమా 4: 11-12 -
"11. మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
అయితే యేసు తన మొదటి రాకడలో ఈ భూమి పై ఒక భౌతిక రాజ్యాన్ని స్థాపించకపోయిన సువార్త ప్రకటన ద్వారా తన రాజ్యానికి పునాది మాత్రం వేసాడు. అప్పటి నుంచీ ఆయన తాను ఎన్నుకున్న వారిని ఈ పాపము లోకంలోనుండీ వేరు చేసి తన రాజ్య సభ్యులుగా చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలోకి రక్షణ పొందిన విశ్వాసులంతా చేర్చబడ్డారు, ఈ రోజుకీ రక్షించబడుతున్నవారు అందులోకి చేర్చబడుతున్నారు. అయితే ఒక భౌతిక రాజ్యం స్థాపించబడినప్పుడే ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేరినట్లు.
వ. 77 – 80 -
దేవుడు చేసిన నిబంధనలన్నింటిలో కొత్త నిబంధన ప్రత్యేకమైనది.
మన రక్షణకు సంబంధించిన నిబంధనలు మొత్తం మూడు - అబ్రాహాము, దావీదు మరియు కొత్త నిబంధన.
అబ్రాహాము మరియు దావీదు నిబంధనల ఆశీర్వాదాలను మనం పొందుకోకుండా మనకు అడ్డుగానున్నది ఒకటుంది. అదే పాపము.
అయితే అబ్రాహాము దావీదు నిబంధనలలో వాగ్దనాలను మనం పొందుకోవాలంటే - రక్షణ ఉండాలి, ఆ రక్షణను పొందుకోవడం గురించి ఆ నిబంధనలు ఏమీ చెప్పట్లేదు.
హెబ్రీ 8: 7-13 -
"7. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.
అందరమూ పాపులమే అని వాక్యం సెలవిస్తోంది. రోమా 3:23
మనిషి యొక్క పాపపు స్వభావాన్ని గురించి పౌలు ఇలా చెప్పాడు.
రోమా 3:10 - 18 -
"10. ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
దావీదు అబ్రాహాము నిబంధనలలోని వాగ్దానాలే గానీ, మోషే ధర్మశాస్త్రం యొక్క శాపాలు, కట్టడలే కానీ మనిషి పాపాన్ని జయించడానికి సహకరించలేదు.
ధర్మశాస్త్రము మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే - దేవునికి విధేయత చూపించే విషయంలో మన అసమర్ధతను తెలియజేస్తుంది. మరియు దేవుని కనికరము మరియు కృప, క్షమాపణ యొక్క అవసరతను తెలియజేస్తుంది.
గలతీ 3:24 -
"24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను."
మెస్సీయా రావడం ద్వారా ఆ పాత నిబంధనలోని నిబంధనల ఆశీర్వాదాలు నెరవేరబోతున్నాయని ఎరిగిన వాడై, జెకర్యా దేవుణ్ణి స్తుతిస్తూ వాటి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ముందు దావీదు అబ్రాహాము నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు కొత్త నిబంధన గురించి జ్ఞాపకం చేస్తున్నాడు.
"77. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన
కొత్త నిబంధన గురించి మాట్లాడే ముందు జెకర్యా తన కుమారుడి గురించి కొన్ని మాటలు పలుకుతూ ఉన్నాడు.
"మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు............"
అప్పటి వరకూ నాలుగు వందల సంవత్సరాల నుండీ ఏ ప్రవక్త దేవుని మాటల్ని పలకలేదు. ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ యోహాను ఒక ప్రవక్తగా దేవుని మాటలను బోధించబోతున్నాడు. సర్వోన్నతుడు అని ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసు గురించి. ఆయన తండ్రియైన దేవునితో సమానుడు. బాప్తీస్మమిచ్చు యోహాను ఆయన ప్రవక్త.
యోహాను పరిచర్య ఏంటి అంటే -
"78. ................ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు."
ఇది మలాకీ 3:1 లో దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు.
"1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; ........."
మత్తయి 3:3 -
"3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే."
కాబట్టి యోహానూ అతని పరిచర్యా యెషయా చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు కూడానూ.
కాబట్టి యోహాను పని ఏంటంటే మెస్సీయా యొక్క రాక కొరకు ప్రజలను సిద్ధపరచటం.
అందులో భాగంగానే లూకా 3:3 -
"3. అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను."
అస్సలు రాజీ పడకుండా అతను ప్రకటించిన సత్యం ఏంటంటే -
మత్తయి 3:2 -
"2. పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని........"
అయితే యోహాను ప్రకటించిన విషయాలు యూదుల ఆలోచనలకు చాలా భిన్నముగా ఉన్నాయి. ఎందుకంటే మెస్సీయా వచ్చి తమ శత్రువులను నాశనం చేసి తన రాజ్యాన్ని స్థాపించి అబ్రాహాము నిబంధన, దావీదు నిబంధనలోని ఆశీర్వాదాలు తమపై కుమ్మరిస్తాడు అని యూదులు అనుకున్నారు. అందుకే యేసును రాజు చెయ్యాలనుకున్నట్లు యోహాను సువార్తలో చదువుతాము.
యోహాను 6:14 - 15 -
"14. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
అయితే ఆ నిబంధనల ఆశీర్వాదాలు పొందుకునే ముందు పాపంతో వ్యవహరించవలసి ఉంది. కొత్త నిబంధనలో అనుగ్రహించబడిన పాప క్షమాపణ పొందుకోవాలి.
యోహాను ఆ పాప క్షమాపణ గురించే బోధించాడు. మరి యోహాను బోధిస్తున్న సమయానికి యేసు క్రీస్తు ఇంకా సిలువలో చనిపోలేదు కదా. మరి తన శ్రోతలు పాప క్షమాపణ పొందే వీలుందా?
ఆ మాట కొస్తే అసలు జెకర్యా రక్షణ పొందాడా?
ఇంకా ఆలోచిస్తే అసలు పాత నిబంధన భక్తులు ఎలా రక్షణ పొందారు?
రాబోతున్న మెస్సీయాను ముందుకు చూస్తూ ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ పొందారు. పాత నిబంధన భక్తులందరూ ఇలాగే రక్షణ పొందారు. మనం 2000 సంవత్సరాల క్రితం వచ్చి సిలువలో చనిపోయి, పరలోకానికిఆరోహణమైపోయిన క్రీస్తును వెనక్కి చూసి ఆయన యందు విశ్వాసముంచడం ద్వారా రక్షణ పొందుతున్నాము. అందరూ విశ్వాసం ద్వారానే రక్షణ పొందుతున్నారని గ్రహించాలి.
కొత్త నిబంధన యొక్క వాగ్దానం
"77. ...........వారి పాపములను క్షమించుటవలన
ఇంతక ముందే చూసిన విధంగా అబ్రాహాము దావీదు నిబంధనలలో వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ముందు దేవుడు తన సార్వభౌమత్వములో అనుగ్రహించే ఈ రక్షణ జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానం అంటే జ్ఞానం కాదు, పాప క్షమాపణ పొందిన అనుభవంలోకి రావాలి అని అర్థం.
మోషే ఈ కొత్త నిబంధన యొక్క ఆవశ్యకతను గురించి ప్రస్తావిస్తాడు. తన తరువాత వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోయే కొత్త తరానికి మోషేతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తూ వేరొక నిబంధన గురించి ప్రస్తావిస్తాడు.
అయితే ఇశ్రాయేలు ప్రజలు మోషే నిబంధనకు కట్టుబడి ఉండరు అని ద్వీతీయో 30: 1- 3 చదివితే స్పష్టంగా అర్ధమవుతుంది.
"1. నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన
ఈ 'తిరిగి రప్పించడం' అనేది ఇంకా జరగలేదు.
అయితే వారు దేవుని వైపు తిరిగి, రక్షించబడాలంటే, ముందుగా దేవుడు వారి హృదయాలను సున్నతి చెయ్యాలి అని ద్వితీయో 30: 6 లో చదువుతాము.
"6. మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును."
ఇది కొత్త నిబంధనకు సంబంధించిన విషయం. పాపియైన మనిషి హృదయం మార్పు చెందడం.
మోషే, అబ్రాహాము, దావీదు నిబంధనలకు హృదయాన్ని మార్చే శక్తి లేదు, అందుకే దేవుడు కొత్త నిబంధనను అనుగ్రహించాడు.
కొత్త నిబంధన గురించి ఇంకా స్పష్టంగా యిర్మీయా గ్రంథంలో చెప్పబడింది.
యిర్మీయా 31: 31 - 34 -
"31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా ఈ మాటలు పలుకుతున్న నాటికి ఉత్తర దేశమైన ఇశ్రాయేలు చెరపట్టబడింది. దక్షిణ దేశం అయిన యూదా వారి వంతు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంది. మారు మనస్సు పొందమని చేసిన హెచ్చరికలను ప్రజలు త్రోసిపుచ్చారు. కొంత కాలానికే మోషే నిబంధనను విడిచిపెట్టినందుకుగానూ వారి పరిస్థితి దయనీయంగా మారింది. అప్పుడు యిర్మీయా ద్వారా దేవుడు మోషే ద్వితీయోపదేశకాండములో పలికిన ఆ మాటలనే జ్ఞాపకం చేస్తున్నాడు, వారిని బలపరచడానికి.
అయితే ఇందుకు భిన్నంగా దేవుడు కొత్త నిబంధనలో
తద్వారా వారికి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు.
యెహేజ్కెలు 36:26 -
"26. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను."
ఈ కొత్త నిబంధనలో అతి ప్రాముఖమైన విషయం మనిషి పాపం నుండీ విడిపించబడటం, పాప క్షమాపణ పొందుకోగలగడం.
యోహాను 6:44 ప్రకారం దేవుడు పాపులను తన దగ్గరకు ఆకర్షిస్తాడు, అలా ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే -
యిర్మీయా 31:34 -
"34. ...........నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసికొనను.........."
యెహేజ్కెలు 36:25 -
"25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను."
అంత మాత్రమే కాదు వారికి పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడతాడు.
యెహేజ్కెలు 36:27 -
"నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను."
కాబట్టి ఇతర నిబంధనలు అనుగ్రహించలేని వాటిని కొత్త నిబంధన మనకు అనుగ్రహించింది. అవేంటంటే - నూతన హృదయం, దేవుడికి విధేయత చూపించగలిగే శక్తి, పరిశుద్ధ ఆత్మ, పాప క్షమాపణ.
ధర్మశాస్త్రము లేదా మోషే నిబంధన మనలను శిక్షకు గురిచేసింది. మనము పాపులమని తీర్మానించింది. కానీ ఈ కొత్త నిబంధన ద్వారా ఆ శిక్ష నుండీ మనం తప్పించబడ్డాము.
రోమా 8: 1-4 -
"1. కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
ఈ కొత్త నిబంధన వ్యక్తిగతమైనది, వ్యక్తిగతంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపులకు రక్షణ అనుగ్రహించబడుతుంది. ఎవరు రక్షణ పొందినా ఈ కొత్త నిబంధనకు అనుగుణంగానే పొందాలి.
ముందు చెప్పుకున్న విధంగా అబ్రాహాము, దావీదు నిబంధనలలోని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈ కొత్త నిబంధన ద్వారా పాప క్షమాపణ పొందుకోవడం అత్యంత కీలకం.
అయితే ఈ కొత్త నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడిన వాగ్దానాలు కూడా ఉన్నాయి. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం, మెస్సీయా రాజ్యం స్థాపించబడటం, చెదిరిపోయిన వారందరు తిరిగి సమకూర్చబడటం.
ఈ కొత్త నిబంధన మనకి ఎవరు అనుగ్రహించారు?
"77. ...........మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి.........."
పాపులైనటువంటివారి మీద కనికరించేలా ఆయనను కదిలించింది ఆయన "మహా వాత్సల్యం" గల హృదయం.
"మహా" అంటే చాలా తీవ్రమైన అని అర్థం.
పాపుల గురించిన ఆయన ఎంతో కనికరం కలిగినవాడు.
కనికరము లేదా వాత్సల్యము అనేది దేవుని గొప్ప గుణ లక్షణాలలో ఒకటి.
కీర్తన 86: 15 -
"15. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు"
యెషయా 63: 9 -
"9. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను."
అణచివేయబడిన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఇలా అంటున్నాడు.
యిర్మీయా 33:26 -
"26. ...................... నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను."
మరియ దేవుని కనికరమును బట్టి ఆనందించింది, తన ఆనందాన్ని తన పాటలో ఇలా వ్యక్తపరచింది.
"50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును."
"54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు"
ఈ స్తుతి పాట ప్రారంభంలో ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎలా కనికరించాడో జెకర్యా జ్ఞాపకం చేసాడు.
"73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను,"
ఎఫెసీ 2:4 -
"4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను."
1 తిమోతీ 1:13,16 లో రక్షణపొందునట్లు "నేను కనికరించబడితిని" అని పౌలు అంటాడు.
తీతుకు 3:5 -
"5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను."
దర్శాస్త్రము మనలను శిక్షకు గురి చేసింది అని అనుకున్నాము ఇందాక. అయితే ధర్మశాస్త్రము చెడ్డది కాదు.
రోమా 7:12
"12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది."
అది దేవుని నీతి స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. దేవుడు ఆ ధర్మశాస్త్రం యొక్క నియమాలను కట్టడలను అనుసరించి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకుగానూ మనల్ని నిత్య శిక్షకు గురి చేసి న్యాయాన్ని జరిగించుట ద్వారా మహిమ పొందగలడు. కానీ దేవుడు నిరాశతో ఉన్న, నిస్సాహాయులైన పాపులపై కనికరించాడు, పాప క్షమాపణను మనకు అనుగ్రహించే కొత్త నిబంధనను స్థాపించాడు.
కొత్త నిబంధన వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి?
"79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయదర్శనమనుగ్రహించెను."
జెకర్యా మెస్సీయా ఆగమనాన్ని అరుణోదయ దర్శనంతో పోల్చుతున్నాడు. "పై నుండి" అంటే పరలోకము నుండీ. కాబట్టి మెస్సీయా ఎవరు అని జెకర్యా చెప్తున్నాడు అంటే పరలోకం నుండీ వచ్చిన గొప్ప వెలుగుగా అభివర్ణిస్తూ ఆ రక్షణ అనే వెలుగు చీకటిలోనూ మరణాఛాయలోను కూర్చుండువారి మీద ప్రసరించబోతోంది అని అంటున్నాడు.
ఈ సమయం గురించి 2 పేతురు 1:19 లో ఇలా చెప్పబడింది.
"............ తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది.........."
యేసు ప్రభువు తన గురించి తాను చెప్తూ
ప్రకటన 22:16 -
".............నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను."
"చీకటి" వాక్యంలో పాపానికి సూచనగా ఉంది. దేవుడు వెలుగుగా చెప్పబడ్డాడు
1 యోహాను 1: 5 -
"5. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు."
యెషయా 42: 6-7 -
"6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
యెషయా 59: 9-10 -
"9. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము
మానవులు వద్ద ఏ పరిష్కారము లేదని తెలిసి దేవుడే
యెషయా 59: 16, 20, 21 -
"16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
భవిష్యత్తు నిత్యత్వములో కూడా ఆయనే తన ప్రజలకు వెలుగుగా ఉంటాడు. (ప్రకటన 21: 23).
మెస్సీయా తన ప్రజలకు రక్షణ వెలుగుగా మాత్రమే కాక
"79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు............."
కొత్త నిబంధనలో సమాధానము లేదా శాంతి అనేది కూడా భాగమే.
రోమా 3:17 -
"17. శాంతిమార్గము వారెరుగరు."
యెషయా 54:10 -
"10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు."
యోహాను 14:27 -
"27. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి."
సమాధానము రక్షణతోటే ప్రారంభమవుతుంది.
రోమా 5:1 -
"1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము"
దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ
రోమా 14: 17 -
"17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది."
సమాధానము ఆత్మ ఫలములలో ఒకటిగా ఉన్నది. గలతీ 5:22
ఫిలిప్పీ 4:7 -
"7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును."
జెకర్యా తన పాటను ముగిస్తూ మరో సారి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఇక 3 వ అధ్యాయంలో ప్రజలకు బోధిస్తున్న యోహానుని మనం చూస్తాము. యేసు క్రీస్తు బాల్యం లాగానే యోహాను బాల్యం గురించిన సంగతులు బైబిల్ లో తెలియజేయబడలేదు.
మనకు తెలియ జేసినదల్లా ఏంటంటే అతను సున్నతి చేయబడిన తరువాత పరిచర్య ప్రారంభించడానికి మధ్యలో 80 వ వచనంలో చప్పబడినట్లుగా
"80. శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను."
అలా జెకర్యా యోహాను యొక్క పాత్రను గురించి ముందుగానే చెప్పాడు. అతను ఇశ్రాయేలీయులకు కొత్త నిబంధన గురించి ప్రకటించబోదుతున్నాడని తన పాట ద్వారా ప్రవచించాడు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.