1 పరిచయం
“విశ్రాంతి దినం క్రైస్తవులు పాటించాలా?” అనే ప్రశ్న క్రైస్తవ లోకంలో శతాబ్దాలుగా చర్చలకు, భిన్నాభిప్రాయాలకు, మరియు కొన్నిసార్లు గందరగోళానికీ కారణమవుతోంది. కొందరు దీనిని దేవుడు ఇచ్చిన శాశ్వత ఆజ్ఞగా భావించి, ఒక నిర్దిష్ట దినాన్ని తప్పనిసరిగా పాటించాలని నమ్ముతారు. మరికొందరు క్రీస్తులో ధర్మశాస్త్రం నెరవేరినందున, దినాల విషయంలో ఇకపై ప్రత్యేక ఆజ్ఞ లేదని భావిస్తారు. ఇంకొందరు ఈ అంశాన్ని క్రైస్తవ స్వేచ్ఛ పరిధిలో ఉంచి, ఆరాధనకు ఏ రోజు అయినా సరిపోతుందని చూస్తారు.
ఈవిధంగా విశ్రాంతి దినం ప్రశ్న కేవలం ఒక దినానికి సంబంధించింది మాత్రమే కాదు; ఇది ధర్మశాస్త్రం, క్రీస్తులో నెరవేర్పు, మరియు క్రైస్తవ స్వేచ్ఛ వంటి ప్రధాన బైబిల్ సిద్ధాంతాలతో సన్నిహితంగా సంబంధం కలిగి ఉంది. శనివారం తప్పనిసరి అని బోధించే వాదనలు, ఆదివారం ఆరాధనను ధర్మశాస్త్ర విరుద్ధమని చెప్పే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ అంశాన్ని రక్షణతో అనుసంధానించే బోధలు కూడా సంఘాలలో భిన్న దృక్పథాలకు, అపోహలకు దారి తీస్తున్నాయి. ఫలితంగా కొందరు విశ్వాసులు అనవసరమైన భారాలను మోస్తూ ఉండగా మరికొందరు క్రైస్తవ స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదంలో పడుతున్నారు.
ఈ అంశాన్ని సంప్రదాయాలు, భావోద్వేగాలు లేదా మానవ బోధల ఆధారంగా కాకుండా కేవలం దేవుని వాక్య సత్యం వెలుగులో పరిశీలించడం అత్యంత అవసరం. ఈ వ్యాసం ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని సమర్థించడానికి కాదు. బదులుగా సంపూర్ణ బైబిల్ సాక్ష్యాన్ని పరిశీలించి, విశ్రాంతి దినం విషయంలో క్రైస్తవుడు ఎలా ఆలోచించాలి అనే ప్రశ్నకు స్పష్టమైన దైవిక దృక్పథాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
2. సృష్టి సందర్భంలో విశ్రాంతి దినం
ఆదికాండము మొదటి రెండు అధ్యాయాలలో “విశ్రాంతి దినం” అనే పదం ప్రత్యక్షంగా కనిపించదు. అయినప్పటికీ ఏడవ దినమున దేవుడు తన సృష్టి పనిని ముగించి విశ్రమించిన వర్ణన, తర్వాత ధర్మశాస్త్రంలో “విశ్రాంతి దినం” గా పిలువబడిన భావానికి పునాది వేస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా సృష్టి సందర్భంలో బైబిల్ ఏమి బోధిస్తుందో జాగ్రత్తగా పరిశీలించాలి.
ఈ సందర్భంలో ఒక కీలకమైన ప్రశ్న ఎదురుపడుతుంది: దేవుడు సృష్టి సమయంలోనే మనుష్యులకు విశ్రాంతి దినాన్ని ఆజ్ఞగా ఇచ్చాడా? లేక ఇది కేవలం దేవుడు చేసిన కార్యాన్ని వివరించే వర్ణన మాత్రమేనా?
బైబిల్‌లో ఏడవ దినము మరియు దేవుని విశ్రాంతి గురించి మొదటిసారి ప్రస్తావన ఆదికాండము 2:1–3 లో కనిపిస్తుంది: “ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని అంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.” (ఆదికాండము 2:1–3)
ఈ వచనాలలో మూడు ముఖ్యమైన విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి:
* దేవుడు తన సృష్టి పనిని ముగించాడు.
* ఏడవ దినమున విశ్రమించాడు.
* ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచాడు.
అయితే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దినాన్ని మనుష్యులు పాటించాలని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వబడలేదు. ఆదాముకు కూడా విశ్రాంతి దినాన్ని పాటించమనే ఆదేశం ఈ సందర్భంలో కనిపించదు. “ఏడవ దినమున పని చేయకూడదు” అనే ఆజ్ఞ కానీ దానిని అతిక్రమించినపుడు శిక్ష కానీ ఎక్కడా పేర్కోబడలేదు. దేవుడు ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచినప్పటికీ దానిని మనుష్యులు ఎలా ఆచరించాలనే విషయంపై ఎలాంటి స్పష్టమైన ఆజ్ఞ కానీ ఆచరణకు సంబంధించిన మార్గదర్శకం కానీ ఇవ్వబడలేదు.
ఇదే సమయంలో సృష్టి వర్ణనలో ఆదాముకు ఇచ్చిన ఇతర ఆజ్ఞలు మాత్రం స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. ఉదాహరణకు:
* “ఫలించుడి, విస్తరించుడి” అనే ఆజ్ఞ (ఆదికాండము 1:28)
* తోటను సేద్యపరచి కాపాడవలెననే ఆజ్ఞ (ఆదికాండము 2:15)
* మంచి–చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదనే ఆజ్ఞ (ఆదికాండము 2:16–17)
కానీ ఈ ఆజ్ఞల మధ్య ఎక్కడా ఏడవ దినాన్ని పాటించమనే ఆదేశం కనిపించదు. అలాగే ఆదాము కాని అతని సంతానం కాని ఏడవ దినాన్ని ప్రత్యేకంగా ఆచరించినట్లు బైబిల్‌లో ఎక్కడా నమోదు చెయ్యబడలేదు. ఇది ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది: సృష్టి సందర్భంలో విశ్రాంతి దినం అనే భావం ఉన్నప్పటికీ అది ఆ దశలో మనుష్యులకు సార్వత్రిక ఆజ్ఞగా ఇవ్వబడలేదు.
“దేవుడు విశ్రమించెను” అని చెప్పబడినప్పుడు, ఆయన అలసిపోయి శారీరక విశ్రాంతి తీసుకున్నాడని అర్థం కాదు. యెషయా 40:28 ప్రకారం, “భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు; ఆయన సొమ్మసిల్లడు, అలయడు.” కాబట్టి దేవుని విశ్రాంతి అనేది ఆయన అలసటను సూచించేది కాదు; ఆయన సృష్టి పని సంపూర్ణంగా పూర్తయినదని, దాని పరిపూర్ణతను తెలియచేసేది అని అర్థం చేసుకోవాలి. అందువల్ల సృష్టి సందర్భంలో మనం స్పష్టంగా గ్రహించగలిగేది ఏంటంటే దేవుడు తన పనిని ముగించి విశ్రమించిన వాస్తవం మాత్రమే. అయితే ఆ దశలో ఈ దినాన్ని మనుష్యులు పాటించవలసిందిగా ప్రత్యక్ష ఆజ్ఞ ఇవ్వబడినట్లు బైబిల్‌లో ఎక్కడా నమోదు చెయ్యబడలేదు.
3. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం
బైబిల్ కథనం ప్రకారం, విశ్రాంతి దినం ఎప్పుడు, ఎవరికి ఏ ఉద్దేశంతో దేవుని ఆజ్ఞగా ఇవ్వబడిందో సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనలో స్పష్టంగా వెల్లడించబడుతుంది.
సీనాయి వద్ద ధర్మశాస్త్రం అధికారికంగా ప్రకటించబడకముందే నిర్గమకాండము 16లో మన్నా సంఘటన ద్వారా ఈ దినం ఇశ్రాయేలు ప్రజలకు ఆచరణాత్మకంగా పరిచయం చెయ్యబడింది. వారు ఆరవ దినమున రెండింతలు ఏరుకొని, ఏడవ దినమున ఏరుకోకూడదని ఆదేశించబడ్డారు. ఈవిధంగా ఈ ఆజ్ఞ వారి విధేయతను పరీక్షించడమే కాకుండా సీనాయి నిబంధనకు ముందస్తు సిద్ధతగా కూడా పనిచేసింది.
తర్వాత విశ్రాంతి దినం నిర్గమకాండము 20:8–11లో పది ఆజ్ఞలలో ఒకటిగా స్పష్టంగా మరియు అధికారికంగా ప్రకటించబడింది. దేవుడు తన స్వరంతో ఈ ఆజ్ఞను ప్రకటించి, రాతఫలకాలపై లిఖింపజేశాడు. ఈ ఆజ్ఞ ప్రకారం, వారు ఆరు దినాలు పని చేసి, ఏడవ దినమున విశ్రాంతి తీసుకుని, దానిని యెహోవాకు అంకితమైన పరిశుద్ధ దినంగా ఆచరించవలసి ఉంది. ఈ ఆజ్ఞ కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, దాసులు, వారి మధ్యనున్న పరదేశులు, మరియు పశువుల వరకు విస్తరించింది. ఈవిధంగా ఇది ఇశ్రాయేలు సమాజంలో విశ్రాంతి, సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన ఆజ్ఞగా నిలిచింది. ఈ ఆజ్ఞకు కారణంగా సృష్టి పనియే చూపబడింది - “ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమిని సృష్టించి, ఏడవ దినమున విశ్రమించెను.”
అదే ఆజ్ఞ ద్వితీయోపదేశకాండము 5:12–15లో మళ్ళీ వివరించబడుతుంది. అక్కడ విశ్రాంతి దినానికి మరో ముఖ్యమైన కారణం ఇవ్వబడుతుంది - ఇశ్రాయేలు ప్రజల విమోచన చరిత్ర. “నీవు ఐగుప్తు దేశములో దాసుడవై యుండినావని జ్ఞాపకము చేసుకొనుము” అనే మాటల ద్వారా ఈ దినం కేవలం సృష్టిని మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలను దాసత్వం నుండి విడిపించిన విమోచన కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసే నిబంధన ఆజ్ఞగా స్థాపించబడింది.
విశ్రాంతి దినం యొక్క ప్రత్యేక స్వభావం నిర్గమకాండము 31:13–17లో మరింత స్పష్టంగా వెల్లడించబడుతుంది. ఇక్కడ దేవుడు దీనిని “నాకు మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య తరతరముల వరకు ఒక గురుతు” అని పేర్కొంటాడు. ఈ ప్రకటన ద్వారా ఇది సాధారణ ఆజ్ఞగా కాకుండా దేవుడు మరియు ఆయన నిబంధన ప్రజల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని సూచించే గుర్తుగా స్థిరపరచబడింది. ఇది కేవలం పని చెయ్యకపోవడమే కాకుండా పరిశుద్ధ సంఘముగా యెహోవాను ఆరాధించే ప్రత్యేక దినంగా కూడా స్థాపించబడింది (లేవీయకాండము 23:3). అంతేకాకుండా ఇది పండుగలు మరియు నూతన చంద్ర దినాలతో కలిసి ఒక సమగ్ర ఆరాధనా వ్యవస్థలో భాగంగా ప్రస్తావించబడింది (లేవీయకాండము 23; సంఖ్యాకాండము 28–29). ఈ విధంగా విశ్రాంతి దినం ఇశ్రాయేలు సమూహ జీవనంలో కేంద్రీయ స్థానాన్ని పొందింది.
ఈ ఆజ్ఞ యొక్క గంభీరతను సంఖ్యాకాండము 15:32–36లోని సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. విశ్రాంతి దినమున కట్టెలు ఏరిన ఒక మనిషికి మరణశిక్ష విధించబడిన ఈ సంఘటన, ఈ దినం నిబంధన విధేయతకు సంబంధించిన అత్యంత గంభీరమైన ఆజ్ఞగా ఉన్నదని తెలియజేస్తుంది.
ఈ సమస్తాన్ని సమగ్రంగా పరిశీలించినప్పుడు, ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం సర్వమానవాళికి ఇవ్వబడిన సాధారణ ఆజ్ఞగా కాకుండా సీనాయి నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక నిబంధన ఆజ్ఞగా స్పష్టంగా స్థాపించబడింది.
4. ప్రవక్తల కాలంలో విశ్రాంతి దినం
ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన ఆజ్ఞగా స్థాపించబడిన తర్వాత, ప్రవక్తల కాలంలో దాని ఆచరణ, ఆత్మీయ అర్థం, మరియు ప్రజల వైఖరి గురించి దేవుడు పలుమార్లు తన సందేశాన్ని ప్రకటించాడు. ఈ కాలంలో విశ్రాంతి దినం కేవలం ఒక ఆచార నియమం మాత్రమే కాదు; అది దేవునితో ఉన్న నిబంధన సంబంధానికి సూచికగా విధేయతకు ప్రమాణంగా నిలిచింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు ఈ దినాన్ని బాహ్య ఆచారంగా మాత్రమే పాటిస్తూ దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవించారు. అందువల్ల ప్రవక్తలు విశ్రాంతి దినం గురించి మాట్లాడినప్పుడు, కేవలం బాహ్య ఆచరణనే కాదు, దాని వెనుక ఉన్న హృదయ స్థితినే ప్రధానంగా ప్రస్తావించారు.
యిర్మియా ప్రవక్త ద్వారా దేవుడు యూదా ప్రజలకు స్పష్టమైన హెచ్చరికను ఇచ్చాడు. వారు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా గౌరవించి, ఆ దినమున బరువులు మోసుకొని రాకపోతే యెరూషలేము పట్టణం నిలిచి ఉంటుందని; కానీ వారు వినకపోతే పట్టణ ద్వారాలలో అగ్ని రగులుకొని దానిని నాశనం చేస్తుందని దేవుడు ప్రకటించాడు (యిర్మియా 17:19–27). ఈ సందేశం విశ్రాంతి దినం నిబంధన విధేయతకు సంబంధించిన గంభీరమైన ఆజ్ఞగా కొనసాగుతుందని స్పష్టంగా తెలియజేస్తుంది.
నెహెమ్యా కాలంలో కూడా ఇదే సమస్య కనిపించింది. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత, ప్రజలు మళ్ళీ విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తూ వ్యాపారం చెయ్యడం ప్రారంభించారు. అప్పుడు నెహెమ్యా వారిని గట్టిగా హెచ్చరించి, వారి పితరులు ఇదే కారణంగా శిక్ష అనుభవించారని గుర్తు చేశాడు. అందువల్ల పట్టణ ద్వారాలను మూసివేసి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా కాపాడే చర్యలు తీసుకున్నాడు (నెహెమ్యా 13:15–22). ఇది విశ్రాంతి దినం ఇశ్రాయేలు జాతీయ జీవనంలో ఎంత ముఖ్యమైన నిబంధన ఆజ్ఞగా ఉన్నదో స్పష్టంగా చూపిస్తుంది.
అయితే ప్రవక్తలు కేవలం బాహ్య ఆచరణను మాత్రమే ప్రాముఖ్యంగా చూపలేదు. దేవుని దృష్టిలో విశ్రాంతి దినం యొక్క అసలు ఉద్దేశ్యం హృదయ విధేయతతో కూడిన ఆరాధన అని వారు బోధించారు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇలా చెప్పాడు: “నీవు విశ్రాంతి దినమును నా పరిశుద్ధ దినమని పిలిచి, దానిని ఘనపరచి, నీ ఇష్టప్రకారముగా నడచక, నీ స్వార్థమును వెదకక, వ్యర్థమైన మాటలు పలుకక, దానిని గౌరవించినయెడల, నీవు యెహోవాలో సంతోషించెదవు” (యెషయా 58:13–14).
ఇక్కడ విశ్రాంతి దినం కేవలం పని చెయ్యకపోవడం మాత్రమే కాదు; అది దేవునిలో ఆనందించడానికి ఆయనతో సంబంధాన్ని లోతుగా అనుభవించడానికి ఇవ్వబడిన దినమని స్పష్టంగా తెలుస్తుంది.
అదేవిధంగా ప్రవక్తలు బాహ్య ఆచారాలు ఉన్నప్పటికీ హృదయ విధేయత లేకపోతే దేవుడు వాటిని అంగీకరించడని హెచ్చరించారు. ఆమోసు ప్రవక్త కాలంలో ప్రజలు విశ్రాంతి దినం ముగియగానే మళ్ళీ అన్యాయ వ్యాపారాల్లో నిమగ్నమవ్వడానికి ఎదురుచూస్తున్నారని దేవుడు గద్దించాడు (ఆమోసు 8:4–6). ఇది వారు విశ్రాంతి దినాన్ని దేవుని ఆజ్ఞగా గౌరవించకుండా భారంగా అనిపించే ఆచార దినంగా మాత్రమే చూసినట్టు చూపిస్తుంది.
ఈ విధంగా ప్రవక్తల కాలంలో విశ్రాంతి దినం రెండు ప్రధాన కోణాలలో ప్రస్తావించబడింది:
మొదటిగా అది దేవుడు మరియు ఇశ్రాయేలు మధ్య ఉన్న నిబంధనకు సంబంధించిన గంభీరమైన ఆజ్ఞగా కొనసాగింది.
రెండవదిగా అది కేవలం బాహ్య ఆచారంగా కాకుండా హృదయ విధేయతతో కూడిన నిజమైన ఆరాధనను కోరిన దినంగా చూపించబడింది.
కాబట్టి ప్రవక్తల బోధలలో విశ్రాంతి దినం ప్రధానంగా నిబంధన విధేయత, హృదయ స్థితి, మరియు దేవునితో సంబంధం అనే ఆత్మీయ విషయాలతో అనుసంధానించబడింది. అందువల్ల ఈ కాలంలో విశ్రాంతి దినం ఉల్లంఘన కేవలం ఒక ఆజ్ఞను అతిక్రమించడం మాత్రమే కాకుండా దేవునితో ఉన్న నిబంధన సంబంధాన్ని నిర్లక్ష్యం చెయ్యడంగా పరిగణించబడింది.
5. క్రీస్తు మరియు విశ్రాంతి దినం
ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల కాలమంతట ఇశ్రాయేలు నిబంధనలో విశ్రాంతి దినం ఒక ప్రధాన ఆజ్ఞగా కొనసాగింది. అయితే క్రీస్తు సేవాకాలానికి వచ్చేసరికి, యూదుల మతనాయకులు అనేక సంప్రదాయ నియమాలను జోడించి ఈ దినాన్ని భారమైన ఆచారంగా మార్చివేశారు. దాని ఫలితంగా దేవుడు మనుష్యుని మేలుకోసము ఇచ్చిన ఆజ్ఞ ప్రజలపై భారం మోపే విధానంగా మారింది.
ఇలాంటి పరిస్థితిలో యేసు చేసిన కార్యాలు మరియు బోధలు విశ్రాంతి దినంపై ఏర్పడిన అపార్థాలను సరిచేసి, దాని అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వెలుగులోనికి తెచ్చాయి. సువార్తలలో యేసు విశ్రాంతి దినమున చేసిన అనేక కార్యాలు నమోదు చెయ్యబడ్డాయి. ఒక సందర్భంలో ఆయన శిష్యులు విశ్రాంతి దినమున పంటచేలలో వెన్నులు త్రుంచి తిన్నప్పుడు పరిసయ్యులు వారిని నిందించారు. అప్పుడు యేసు దావీదు మరియు అతని సహచరుల సంఘటనను ఉదాహరణగా చూపిస్తూ అవసర సమయంలో కఠిన ఆచార నియమాలకన్నా కనికరమూ మానవ అవసరమూ ముఖ్యమని బోధించాడు (మత్తయి 12:1–8, మార్కు 2:23–26, లూకా 6:1–5). ఆ సందర్భంలో ఆయన ఇలా ప్రకటించాడు:
“విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడు.”
(మార్కు 2:27–28).
ఈ ప్రకటన ద్వారా యేసు రెండు ప్రధాన సత్యాలను వెల్లడించాడు.
మొదటిగా విశ్రాంతి దినం మనుష్యుని మేలుకోసమే ఇవ్వబడింది; అది భారంగా మారడం దేవుని ఉద్దేశ్యం కాదు.
రెండవదిగా తాను విశ్రాంతి దినానికి ప్రభువునని ప్రకటించడం ద్వారా ఆ ఆజ్ఞపై తన అధికారాన్ని స్పష్టంగా తెలియచేశాడు.
మరొక సందర్భంలో యేసు విశ్రాంతి దినమున ఊచచెయ్యి గల మనిషిని స్వస్థపరచినప్పుడు పరిసయ్యులు ఆయనను నిందించడానికి ప్రయత్నించారు. అప్పుడు యేసు వారిని ప్రశ్నించాడు:
“విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా, కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా?”
(మత్తయి 12:9–14, మార్కు 3:1–6, లూకా 6:6–11) ఈ ప్రశ్న ద్వారా విశ్రాంతి దినం మేలుచెయ్యడానికి విరోధం కాదని ఆయన స్పష్టంగా బోధించాడు.
అదేవిధంగా పద్దెనిమిదేళ్లు సాతాను బంధించి యుండిన ఒక స్త్రీని స్వస్థపరచినప్పుడు ఆయన ఇలా ప్రశ్నించాడు:
“మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దు గాని గాడిద గాని గాడి నుండి విప్పి నీళ్లు పెట్టును గదా? అయితే సాతాను పద్ధెనిమిదేళ్లు బంధించి యుండిన ఈ అబ్రాహాము కుమార్తెను ఈ బంధకమునుండి విడిపింపదగదా?”
(లూకా 13:10–17)
మరో సందర్భంలో జలోదర రోగము గల మనిషిని స్వస్థపరచినప్పుడు ఆయన ఇలా అన్నాడు:
“మీలో ఎవని ఎద్దు గాని గాడిద గాని గుంటలో పడినయెడల వెంటనే దానిని బయటకు తీయడా?”
(లూకా 14:1–6)
ఈ సంఘటనలన్నింటి ద్వారా యేసు స్పష్టపరిచింది ఏంటంటే - విశ్రాంతి దినం మానవుని మేలుకోసమే ఉద్దేశించబడింది; కనికరముతో అవసరాన్ని బట్టి చెయ్యబడిన కార్యాలు దానికి విరోధములు కావు. పరిసయ్యులు తమ సంప్రదాయ నియమాలతో భారంగా మార్చిన విశ్రాంతి దినాన్ని, ఆయన దేవుడు ఇచ్చిన అసలు ఉద్దేశానికి తిరిగి తీసుకొచ్చాడు.
అంతేకాకుండా “మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు” అని ప్రకటించినప్పుడు, యేసు కేవలం దాని సరైన అర్థాన్ని బోధించినవాడిగానే కాకుండా ఆ ఆజ్ఞపై తుదాధికారమున్నవాడిగా తనను ప్రకటించాడు. అందువల్ల క్రీస్తు బోధలలో విశ్రాంతి దినం యొక్క అసలు ఉద్దేశం, దాని నిజమైన ఆత్మ, దాని పరిమితులు, మరియు దానిపై తుదాధికారము అన్నీ ఆయనలోనే కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టమౌతుంది.
6. క్రీస్తులో నెరవేరిన విశ్రాంతి
సువార్తలలో క్రీస్తు విశ్రాంతి దినం యొక్క అసలు ఉద్దేశాన్ని వెల్లడించి, దానిపై తన అధికారాన్ని ప్రకటించిన తర్వాత, నూతన నిబంధన బోధనలో ఒక మరింత లోతైన సత్యం వెలుగులోకి వస్తుంది. అదే - విశ్రాంతి యొక్క పరిపూర్ణత క్రీస్తులోనే నెరవేరింది. పాత నిబంధనలో విశ్రాంతి దినం ఒక నిర్దిష్ట దినంగా ఇశ్రాయేలు నిబంధనకు చెందిన ఆజ్ఞగా ఇవ్వబడినప్పటికీ అది మరింత గొప్ప ఆత్మీయ విశ్రాంతిని సూచించే ఛాయగా కూడా పనిచేసింది.
నిజమైన విశ్రాంతి గురించి యేసు ఈ విధంగా ప్రకటించాడు:
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్తయి 11:28).
ఇక్కడ ఆయన ఇచ్చే విశ్రాంతి కేవలం శారీరక విరామం మాత్రమే కాదు; పాపభారం నుండి, ధర్మశాస్త్ర తీర్పు నుండి, ఆత్మీయ అలసట నుండి విముక్తి కలిగించే లోతైన విశ్రాంతి. ఇది ఒక దినంతో పరిమితమైనది కాదు; క్రీస్తుతో ఉన్న జీవ సంబంధంలో అనుభవించబడే విశ్రాంతి.
హెబ్రీయులకు పత్రికలో ఈ సత్యం మరింత విస్తృతంగా వివరించబడింది. రచయిత దేవుని విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో అవిశ్వాసం వల్ల ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయిన విషయాన్ని గుర్తుచేస్తాడు (హెబ్రీయులకు 3–4 అధ్యాయాలు). తర్వాత ఆయన ఇలా చెబుతాడు:
“కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది” (హెబ్రీ 4:9).
ఈ వచనం ద్వారా పాత నిబంధన విశ్రాంతి దినం కంటే గొప్పదైన ఒక ఆత్మీయ విశ్రాంతి ఉన్నదని స్పష్టమౌతుంది - అది దేవుడు సిద్ధం చేసిన విశ్రాంతిలో విశ్వాసముతో ప్రవేశించడం. దేవుడు తన సృష్టి పని ముగించి విశ్రమించినట్లే విశ్వాసి కూడా తన స్వకార్యాలపై ఆధారపడకుండా క్రీస్తు పూర్తిచేసిన విమోచన కార్యంలో విశ్రాంతి పొందుతాడు (హెబ్రీ 4:10).
అపొస్తలుడైన పౌలు కూడా ఈ అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు:
“కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది” (కొలస్సీ 2:16–17).
ఇక్కడ విశ్రాంతి దినం సహా పాత నిబంధనలోని నియమిత ఆచారాలు “ఛాయలు”గా వర్ణించబడగా వాటి పరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నదని స్పష్టమౌతుంది.
అందువల్ల క్రీస్తులో విశ్రాంతి అనే భావం మూడు ప్రధాన కోణాలలో అర్థమౌతుంది.
మొదటిగా అది పాపభారం మరియు ధర్మశాస్త్ర తీర్పు నుండి విముక్తి.
రెండవదిగా అది విశ్వాసముతో దేవుడు పూర్తిచేసిన కార్యంలో విశ్రాంతి పొందడం
మూడవదిగా అది ఒక నిర్దిష్ట దినంతో పరిమితమైన ఆచారం కాకుండా క్రీస్తుతో ఉన్న జీవ సంబంధం ద్వారా అనుభవించబడే నిరంతర ఆత్మీయ వాస్తవం.
కాబట్టి పాత నిబంధనలో విశ్రాంతి దినం సూచించిన గొప్ప ఆత్మీయ సత్యం క్రీస్తులో నెరవేరింది. ఆయనలో విశ్వాసముంచినవారు దేవుని నిజమైన విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఈ సత్యం తర్వాత అపోస్తలుల బోధలోను మరియు ఆదిమ సంఘ ఆచరణలోను విశ్రాంతి దినం గురించి వచ్చిన దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన పునాదిగా నిలుస్తుంది.
7. అపోస్తలులు మరియు ఆదిమ సంఘం
క్రీస్తులో విశ్రాంతి యొక్క ఆత్మీయ నెరవేర్పు స్పష్టమైన తర్వాత అపోస్తలుల సేవాకాలంలో విశ్రాంతి దినం గురించి క్రైస్తవ సంఘం ఎలా ఆలోచించిందో ఎలా ఆచరించిందో పరిశీలించడం అవసరం. ఈ సందర్భంలో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే - అపోస్తలులు విశ్రాంతి దినాన్ని క్రైస్తవులకు ఆజ్ఞగా విధించలేదు; అలాగే సంఘ ఆరాధనను ఒక నిర్దిష్ట యూద దినానికి పరిమితం చెయ్యలేదు.
అపొస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు మరియు ఇతర అపోస్తలులు యూదుల మధ్య సువార్త ప్రకటించడానికి సమాజ మందిరాలకు తరచుగా వెళ్ళినట్లు కనిపిస్తుంది. ఆ సమావేశాలు సాధారణంగా విశ్రాంతి దినమున జరిగేవి (అపొ. కార్యములు 13:14–44, 16:13–15, 17:1–3, 17, 18:4, 19). అయితే ఈ సందర్భాలలో అపోస్తలులు విశ్రాంతి దినాన్ని క్రైస్తవులకు ఆజ్ఞగా పాటించారని ఎక్కడా చెప్పబడలేదు. యూదులు ఆ దినమున కూడుకునే కారణంగా ఆ అవకాశాన్ని ఉపయోగించి వారితో తర్కించుచు సువార్త ప్రకటించినట్లు స్పష్టమౌతుంది.
ఇదే సమయంలో నూతన నిబంధనలో విశ్వాసులు వారంలో మొదటి దినమున కూడినట్లు కూడా సూచనలు కనిపిస్తాయి. “ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు…” అని అపొ. కార్యములు 20:7లో చెప్పబడింది. అలాగే పౌలు కొరింథీయులకు “...ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను” అని సూచించాడు (1 కొరింథీయులకు 16:2). ఈ ఉదాహరణలు ఆదిమ సంఘ ఆరాధన ఒక నిర్దిష్ట ధర్మశాస్త్ర దినానికి పరిమితం కాకుండా క్రీస్తు పునరుత్థానంతో సంబంధమున్న కొత్త ఆచరణగా కనిపిస్తుందని సూచిస్తున్నాయి.
ఇంకా ముఖ్యంగా యెరూషలేము సభలో అన్యజనవిశ్వాసులకు ఇవ్వబడిన మార్గదర్శకాల్లో కూడా విశ్రాంతి దినాన్ని పాటించవలెనని ఎక్కడా ఆజ్ఞ ఇవ్వబడలేదు (అపొ. కార్యములు 15:28–29). ఇది క్రైస్తవ సంఘంలో విశ్రాంతి దినం ధర్మశాస్త్ర నిబంధనగా విధించబడలేదని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. అపొస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలో ధర్మశాస్త్ర సంబంధిత దినాలను మళ్ళీ ఆచరించడంపై తీవ్రమైన హెచ్చరికను ఇస్తాడు: “మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.” (గలతీయులకు 4:10–11).
ఇక్కడ దినాలను ఆత్మీయ అవసరంగా మళ్ళీ ఆచరించడం క్రీస్తులో ఉన్న స్వేచ్ఛకు విరుద్ధమైన దృక్పథమని ఆయన సూచిస్తున్నాడు.
అదేవిధంగా కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో పౌలు ఇలా చెప్పాడు: “కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి.” (కొలస్సీ 2:16).
ఈ వచనం విశ్రాంతి దినం సహా పాత నిబంధనలోని దినాలను క్రైస్తవులపై తీర్పు విధించే ప్రమాణాలుగా ఉపయోగించకూడదని స్పష్టంగా తెలియచేస్తుంది.
ఈ విధంగా అపొస్తలుల బోధ మరియు ఆదిమ సంఘ ఆచరణను పరిశీలించినప్పుడు ఒక ముఖ్యమైన సత్యం స్పష్టమౌతుంది. విశ్రాంతి దినం పాత నిబంధనలో ఇశ్రాయేలు నిబంధనకు సంబంధించిన ఆజ్ఞగా ఉన్నప్పటికీ క్రీస్తులో నెరవేర్పు తర్వాత అది క్రైస్తవులకు ఆజ్ఞగా విధించబడలేదు. సంఘ ఆరాధన ధర్మశాస్త్రంలోని ఒక నిర్దిష్ట దిన ఆజ్ఞకు పరిమితం కాకుండా క్రీస్తు కేంద్రిత జీవన విధానంలో కొనసాగింది; అయితే ఆదిమ సంఘం వారంలోని మొదటి దినమైన ఆదివారమున కూడినట్లు నూతన నిబంధనలో సూచనలు కనిపిస్తాయి. అయితే విశ్రాంతి యొక్క ఆత్మీయ సత్యం క్రీస్తులో నిత్యంగా కొనసాగుతూనే ఉంది.
8. నేటి క్రైస్తవులకు అన్వయం
పాత నిబంధనలో విశ్రాంతి దినం ఇశ్రాయేలు నిబంధనకు సంబంధించిన ఆజ్ఞగా స్థాపించబడింది. క్రీస్తులో అది తన ఆత్మీయ నెరవేర్పును పొందింది. అపోస్తలుల బోధలో అది క్రైస్తవులకు ఆజ్ఞగా విధించబడలేదని స్పష్టమౌతుంది. ఈ నేపథ్యంలో నేటి క్రైస్తవుడు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా జీవించాలి? అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమౌతుంది.
మొదటిగా క్రైస్తవుడు ధర్మశాస్త్ర నిబంధన కింద లేడు; అతడు క్రీస్తులో కృప కింద ఉన్నాడు. అందువల్ల విశ్రాంతి దినాన్ని రక్షణకు అవసరమైన ఆజ్ఞగా కానీ దేవుని ముందు నీతిని సంపాదించుకునే మార్గంగా కానీ చూడకూడదు. మన నీతి ఒక దినాన్ని పాటించడం ద్వారా కాకుండా క్రీస్తులో ఉన్న విశ్వాసంపై ఆధారపడి ఉంది.
రెండవదిగా క్రైస్తవునికి లభించిన నిజమైన విశ్రాంతి ఒక నిర్దిష్ట దినంతో పరిమితమైనది కాదు; అది క్రీస్తులో నిరంతరం అనుభవించబడే ఆత్మీయ వాస్తవం. కాబట్టి విశ్రాంతి అనేది వారంలో ఒక దినానికి మాత్రమే పరిమితమైన ఆచారం కాదు; అది దేవునితో ఉన్న జీవ సంబంధంలో నడిచే జీవన విధానం.
మూడవదిగా క్రైస్తవులకు ఏ దినానైనా సంఘంగా కూడి దేవునిని ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నది. అయితే నూతన నిబంధనలో అపోస్తలుల ఆచరణను గమనించినప్పుడు, వారు ప్రత్యేకంగా వారంలోని మొదటి దినమైన ఆదివారమున కూడుకొనినట్లు కనిపిస్తుంది (అపొ.కార్యములు 20:7, 1 కోరింథీ 16:2). ఈ దినానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇదే ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్థానమైన దినము (మత్తయి 28:1). కాబట్టి ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినమున సంఘంగా కూడడం ఆత్మీయంగా అర్థవంతమైనదియు, వాక్యానికి అనుగుణమైనదియు ఔతుంది.
ఆదివారమున కూడడం అనేది స్పష్టమైన ఆజ్ఞగా నమోదు చెయ్యబడకపోయినప్పటికీ ప్రభువు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించెనో వాటినే అపోస్తలులు బోధించి ఆచరించారు (మత్తయి 28:20). కాబట్టి అపోస్తలులు బోధించి ఆచరించిన విధులను (2 థెస్సలోనీక 2:15) అనుసరించడం క్రైస్తవ సంఘానికి సముచితమైన మరియు క్రమబద్ధమైన ఆచారంగా పరిగణించబడుతుంది.
నాలుగవదిగా క్రైస్తవ స్వేచ్ఛ నిర్లక్ష్యానికి కారణం కాకూడదు. సంఘంగా కూడి దేవునిని ఆరాధించడం వాక్యాన్ని వినడం సహవాసంలో ఉండడం క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు. అందువల్ల విశ్వాసులు క్రమంగా కూడడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి (హెబ్రీ 10:24–25). ఒక నిర్దిష్ట దినాన్ని ఆరాధనకు కేటాయించడం జ్ఞానసంబంధమైన మరియు ప్రయోజనకరమైన ఆచరణగా పరిగణించవచ్చు.
అయితే క్రైస్తవ స్వేచ్ఛను కారణంగా చూపించి అపోస్తలీయ ఆచరణగా నిర్ధారించబడిన ఆదివార కూడికను విస్మరించడం బైబిల్ బోధకు అనుగుణం కాదు. ఈ స్వేచ్ఛ ఆ ఆచరణను విడిచిపెట్టడానికి కాదు, బాధ్యతతో ఆచరించడానికి ఇవ్వబడింది.
ఐదవదిగా విశ్రాంతి దినం అనేది ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిన నిబంధన ఆజ్ఞ అయినప్పటికీ వారంలో ఒక దినాన్ని కేటాయించి దేవునిని ఆరాధించడం మరియు శారీరక విశ్రాంతి తీసుకోవడం అనేది ఆత్మీయంగా మరియు ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైన నైతిక సూత్రంగా గుర్తించాలి.
ఆరవదిగా ఈ విషయంలో ఇతర విశ్వాసులపై తీర్పు చెయ్యకూడదు. ఎవరు ఏ దినాన్ని పాటించినా అది ప్రభువునిమిత్తమే ఐతే క్రైస్తవ ఐక్యత ఒకే విధమైన ఆచరణలో కాకుండా క్రీస్తులో ఉన్న విశ్వాసంలోనే నిలుస్తుంది. కాబట్టి నేటి క్రైస్తవుడు విశ్రాంతి దినాన్ని ఒక ఆజ్ఞగా కాకుండా క్రీస్తులో పొందిన విశ్రాంతి వెలుగులో గ్రహించాలి. అపోస్తలుల ఆచరణను అనుసరించి ఆదివారమున సంఘంగా కూడడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం సముచితం. అవసరమైతే ఆరాధనకు ఒక దినాన్ని ప్రత్యేకంగా కేటాయించవచ్చు; అయితే తన నీతి లేదా రక్షణను ఏ దినంపైనను ఆధారపరచకూడదు. ఈ సమతుల్య దృక్పథం అపోస్తలీయ ఆచరణను గౌరవిస్తూ క్రైస్తవ స్వేచ్ఛను కాపాడుతుంది. ఈ సత్యాలను సరిగ్గా గ్రహించనప్పుడు, విశ్రాంతి దినం విషయములో అనేక తప్పుడు బోధలు మరియు అపోహలు ఉద్భవిస్తాయి.
9. తప్పుడు బోధలు మరియు హెచ్చరికలు
విశ్రాంతి దినం గురించి బైబిల్ బోధనను సరిగా అర్థం చేసుకోనప్పుడు, క్రైస్తవ లోకంలో అనేక తప్పుడు అభిప్రాయాలు మరియు అపోహలు ఉద్భవిస్తాయి. ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని తప్పుగా వర్తింపచెయ్యడం లేదా క్రైస్తవ స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ బోధలు ఏర్పడతాయి. అందువల్ల ఈ విషయానికి సంబంధించిన కొన్ని సాధారణమైన తప్పుడు బోధలను పరిశీలించి, వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం.
మొదటిగా విశ్రాంతి దినాన్ని రక్షణకు అవసరమైన ఆజ్ఞగా బోధించడం ఒక తీవ్రమైన తప్పు. పాత నిబంధనలో ఇది ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనకు సంబంధించిన ఆజ్ఞ. అయితే క్రీస్తులో నెరవేర్పు తర్వాత అది రక్షణకు ప్రమాణంగా ఉండదు. రక్షణ కేవలం క్రీస్తులో విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది; ఒక నిర్దిష్ట దినాన్ని పాటించడం ద్వారా కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అపొస్తలుడైన పౌలు గలతీయులకు ఇచ్చిన హెచ్చరికను గుర్తు పెట్టుకోవాలి: సువార్తకు భిన్నమైన బోధను స్వీకరించడం ప్రమాదకరం (గలతీ 1:6–9).
రెండవదిగా ఆదివారమున సంఘంగా కూడి ఆరాధించడాన్ని పాపమని లేదా ధర్మశాస్త్రానికి విరుద్ధమని ప్రకటించే బోధ స్పష్టంగా తప్పుడు దృక్పథం. నూతన నిబంధనలో సంఘం వారంలోని మొదటి దినమైన ఆదివారమున కూడినట్లు నమోదు చేయబడినది (అపొ.కార్యములు 20:7, 1 కోరింథీ 16:2); కాబట్టి ఆ దినమున ఆరాధించడాన్ని తప్పు అని పేర్కోవడానికి ఎలాంటి బైబిల్ ఆధారం లేదు. ఈ విషయంలో ఒక నిర్దిష్ట దినాన్ని తప్పు అని తీర్పు చెయ్యడం క్రైస్తవ స్వేచ్ఛకు విరుద్ధమే కాకుండా అపోస్తలుల బోధకు కూడా అననుగుణమైనది.
మూడవదిగా క్రైస్తవులను తిరిగి ధర్మశాస్త్ర నిబంధన కిందకు తీసుకురావడానికి ప్రయత్నించే బోధలను కూడా జాగ్రత్తగా గుర్తించాలి. దినములు, ఆచారములు, నియమములను ఆత్మీయ అవసరాలుగా బలవంతంగా విధించడం క్రీస్తులో లభించిన స్వేచ్ఛను తగ్గిస్తుంది. పౌలు చెప్పినట్లుగా ఈవిధమైన నియమాలు బయటికి భక్తిగా కనిపించినా అవి నిజమైన ఆత్మీయ జీవితానికి సహాయపడవు (కొలస్సీ 2:20–23).
నాలుగవదిగా క్రైస్తవ స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకొని, సంఘంగా కూడడాన్ని లేదా ఆరాధనను నిర్లక్ష్యం చెయ్యడం కూడా ఒక ప్రమాదకరమైన దృక్పథం. “మనకు దినములపై ఆజ్ఞ లేదు” అనే కారణంతో సంఘంగా కూడడాన్ని తక్కువగా చూడటం లేదా పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం బైబిల్ బోధనకు విరుద్ధం. క్రైస్తవ స్వేచ్ఛ ఎప్పుడూ దేవునితో ఉన్న సంబంధాన్ని బలపరచడానికి ఉపయోగపడాలి, కానీ ఆధ్యాత్మిక అలసత్వానికి కాదు. ఐదవదిగా ఈ విషయంలో ఇతర విశ్వాసులపై తీర్పు చెయ్యడం కూడా ఒక సాధారణమైన తప్పు. ఎవరు ఏ దినాన్ని పాటించినా అది ప్రభువు నిమిత్తమే ఐతే వారిని తప్పుగా నిర్ణయించడం సరికాదు. అందువల్ల విశ్రాంతి దినం గురించి ఏ బోధ వచ్చినా అది సువార్త సత్యానికి, క్రీస్తులో నెరవేర్పుకు, మరియు అపొస్తలుల బోధనకు అనుగుణంగా ఉందో లేదో జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ విధమైన జాగ్రత్త మనలను తప్పుదారి పట్టించే బోధల నుండి కాపాడి, క్రీస్తులో ఉన్న నిజమైన స్వేచ్ఛలో నిలుపుతుంది.
ఈవిధంగా ఒకవైపు ధర్మశాస్త్ర నిబంధన కిందకు తీసుకువెళ్ళే బోధలను, మరోవైపు క్రైస్తవ స్వేచ్ఛను నిర్లక్ష్యంగా మార్చే దృక్పథాలను తప్పించుకుని, క్రీస్తులో ఉన్న సత్యంలో నిలబడడం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత.
10. ముగింపు
“విశ్రాంతి దినం – క్రైస్తవులు పాటించాలా?” అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ అధ్యయనంలో బైబిల్ బోధనను సృష్టి నుండి ప్రారంభించి, ధర్మశాస్త్రం, ప్రవక్తలు, క్రీస్తు బోధ, అపోస్తలుల ఉపదేశం వరకు క్రమంగా పరిశీలించాము. ఈ సమగ్ర పరిశీలన ద్వారా విశ్రాంతి దినం యొక్క స్వభావం, ఉద్దేశం, మరియు క్రైస్తవ జీవితంలో దాని స్థానం గురించి స్పష్టమైన అవగాహన పొందుతున్నాము.
సృష్టి సందర్భంలో దేవుడు ఏడవ దినమున విశ్రమించినప్పటికీ ఆ దశలో మనుష్యులకు ఆ దినాన్ని పాటించాలని ఎలాంటి ప్రత్యక్ష ఆజ్ఞ ఇవ్వబడలేదు. తర్వాత ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన ఆజ్ఞగా ఇవ్వబడింది. ప్రవక్తల కాలంలో ఈ ఆజ్ఞ కేవలం బాహ్య ఆచారంగా మాత్రమే కాకుండా హృదయ విధేయతతో కూడిన ఆరాధనగా ఉండాలని దేవుడు కోరినట్టు వెల్లడించబడింది.
సువార్తలలో క్రీస్తు విశ్రాంతి దినం యొక్క అసలు ఉద్దేశాన్ని వెల్లడించి, దానిపై తన అధికారాన్ని ప్రకటించాడు. నూతన నిబంధన బోధనలో ఈ విశ్రాంతి తన పరిపూర్ణతను క్రీస్తులోనే పొందిందని స్పష్టమౌతుంది. అపోస్తలుల బోధలోను, ఆదిమ సంఘ ఆచరణలోను, విశ్రాంతి దినం క్రైస్తవులకు ఆజ్ఞగా విధించబడలేదు. అయితే ఆదివారమున సంఘంగా కూడిన ఆచరణ కనిపిస్తుంది. కాబట్టి ఆ దినమున సంఘంగా కూడి క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడం వాక్యానికి అనుగుణమైన ఆచరణగా పరిగణించబడుతుంది. అలాగే దినాల విషయంలో విశ్వాసులకు స్వేచ్ఛ ఉన్నది.
ఈ సమగ్ర బైబిల్ నేపథ్యం ఆధారంగా విశ్రాంతి దినాన్ని క్రైస్తవులు పాటించవలసిన అవసరం లేదని స్పష్టమౌతుంది. పాత నిబంధనలోని విశ్రాంతి దినం, క్రీస్తులో లభించే ఆత్మీయ విశ్రాంతికి సూచికగా నిలుస్తుంది. కాబట్టి నేటి క్రైస్తవుడు, విశ్రాంతి దినాన్ని ఆజ్ఞగా కాకుండా క్రీస్తులో నెరవేరిన సత్యం వెలుగులో అర్థం చేసుకోవాలి.
అవసరమైతే ఒక దినాన్ని ఆరాధన కోసం ప్రత్యేకంగా కేటాయించవచ్చు; అయితే దానిని రక్షణకు సంబంధించిన ఆజ్ఞగా కానీ ఇతరులపై తీర్పు విధించే ప్రమాణంగా కానీ ఉపయోగించరాదు. అందువల్ల, విశ్రాంతి దినం విషయంలో క్రైస్తవుని దృష్టి ఒక నిర్దిష్ట దినంపై కాకుండా క్రీస్తుపైనే ఉండాలి. ఆయనలోనే మనకు నిజమైన విశ్రాంతి, సంపూర్ణత, మరియు దేవునితో సమాధానం లభిస్తాయి.
క్రైస్తవ జీవితం ఒక దినాన్ని పాటించడం ద్వారా కాదు, ప్రతి దినాన్ని ప్రభువుకు అంకితంగా జీవించడం ద్వారా వ్యక్తమౌతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి బైబిల్ సత్యానికి అనుగుణంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ధర్మశాస్త్రం కిందకు తిరిగి వెళ్ళకుండా అలాగే నిర్లక్ష్య స్వేచ్ఛకు లోబడకుండా క్రీస్తులో ఉన్న సత్యం మరియు స్వేచ్ఛలో నిలిచి జీవించవలెను. విశ్రాంతి దినం ఒక ఛాయగా ఉండగా క్రీస్తే ఆ ఛాయకు నెరవేర్పు మరియు సత్యము.
ప్రశ్నలు మరియు జవాబులు
ప్రశ్న1: విశ్రాంతి దినం పది ఆజ్ఞలలో ఒకటి కాబట్టి, క్రైస్తవులు దానిని పాటించాలా?
జవాబు: విశ్రాంతి దినం పది ఆజ్ఞలలో ఒకటి అయినప్పటికీ క్రైస్తవులు దానిని పాటించాల్సిన ఆజ్ఞగా చెప్పబడలేదు.
పది ఆజ్ఞలు సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనలో భాగంగా ఇవ్వబడ్డాయి. అందులో విశ్రాంతి దినం ప్రత్యేకంగా దేవుడు మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న నిబంధనకు గుర్తుగా (sign) పేర్కొనబడింది.
నైతిక సూత్రాలు (ఉదాహరణకు: హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు) ధర్మశాస్త్రానికి ముందే మనుష్యులకు తెలిసినవే. అయితే అవి ధర్మశాస్త్రంలో స్పష్టంగా ప్రకటించబడి, నూతన నిబంధనలో క్రీస్తు మరియు అపోస్తలుల ద్వారా మరింతగా ధృవీకరించబడ్డాయి. కానీ విశ్రాంతి దినం మాత్రం అదే విధంగా క్రైస్తవులకు ఆజ్ఞగా పునరుద్ధరించబడలేదు. అందువల్ల విశ్రాంతి దినం పది ఆజ్ఞలలో ఉన్నప్పటికీ అది సర్వమానవులకు వర్తించే శాశ్వత నైతిక ఆజ్ఞగా కాకుండా ఇశ్రాయేలు నిబంధనకు సంబంధించిన ప్రత్యేక ఆజ్ఞగా అర్థం చేసుకోవాలి. అయితే వారంలో ఒక దినాన్ని కేటాయించి దేవునిని ఆరాధించడం మరియు శారీరక విశ్రాంతి తీసుకోవడం అనేది ఆత్మీయంగా మరియు ఆరోగ్యపరంగా ప్రయోజనకరమైన నైతిక సూత్రంగా గుర్తించాలి.
ప్రశ్న2: బైబిల్‌లో విశ్రాంతి దినం “తరతరములకు నిత్య నిబంధన” (నిర్గమకాండము 31:16–17) అని చెప్పబడింది. అప్పుడు అది క్రైస్తవులకు కూడా శాశ్వతంగా వర్తించదా?
జవాబు: “నిత్య నిబంధన” అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. నిర్గమకాండము 31:16–17లో విశ్రాంతి దినం గురించి చెప్పినప్పుడు, అది దేవుడు మరియు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న ఒక గుర్తుగా పేర్కొనబడింది. కాబట్టి ఇది సర్వమానవులకు ఇవ్వబడిన సాధారణ ఆజ్ఞ కాదు; ఇశ్రాయేలు నిబంధనకు సంబంధించిన ప్రత్యేక గుర్తు.
బైబిల్‌లో “నిత్యము” లేదా “తరతరములకు” అనే పదాలు ప్రతీసారి అంతులేని కాలాన్ని సూచించవు; చాలాసార్లు అవి ఒక నిర్దిష్ట నిబంధన లేదా వ్యవస్థ కొనసాగినంతకాలాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు, లేవీయ యాజకత్వం “నిత్య యాజకత్వము”గా చెప్పబడినప్పటికీ (నిర్గమకాండము 40:15, సంఖ్యాకాండము 25:13), అది క్రీస్తులో మార్పు పొందింది (హెబ్రీ 7:11–12). అలాగే బలులు “నిత్య కట్టడ” గా చెప్పబడినా (లేవీయకాండము 16:29–34), అవి క్రీస్తు యొక్క ఒకే బలిలో నెరవేర్పు పొందాయి (హెబ్రీ 10:10–14). పస్కా పండుగ కూడా “తరతరములకు నిత్య కట్టడ”గా చెప్పబడింది (నిర్గమకాండము 12:14), అయితే అది క్రీస్తులో నెరవేర్పు పొందింది (1 కొరింథీయులకు 5:7).
అంతేకాకుండా నిర్గమకాండము 21:6లో ఒక దాసుడు “నిత్యము సేవ చేయును” అని చెప్పబడినప్పుడు, అది అతని జీవితకాలాన్ని మాత్రమే సూచిస్తుంది. కాబట్టి “నిత్యము” అనే పదం యొక్క అర్థం ఎల్లప్పుడూ సందర్భాన్ని బట్టి నిర్ణయించబడాలి. ఈ సూత్రాన్ని విశ్రాంతి దినానికి వర్తింపచేస్తే అది సీనాయి నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన గుర్తుగా ఆ నిబంధన కొనసాగినంతకాలం వరకే ఉండే ఆజ్ఞగా అర్థమౌతుంది. అందువల్ల “నిత్య నిబంధన” అనే మాటను అన్ని కాలాలకు, అన్ని ప్రజలకు వర్తించే శాశ్వత ఆజ్ఞగా కాకుండా ఇశ్రాయేలు నిబంధన వ్యవస్థ కొనసాగినంతకాలం వరకే ఉన్న ఆజ్ఞగా అర్థం చేసుకోవాలి. క్రీస్తులో ఆ నిబంధన నెరవేర్పు పొందిన తర్వాత, విశ్రాంతి దినం సూచించిన ఆత్మీయ సత్యమే ప్రధానమైంది (కొలస్సీ 2:16–17).
ప్రశ్న3: యేసు క్రీస్తు స్వయంగా విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు, క్రైస్తవులు కూడా అదే విధంగా పాటించాలి కాదా?
జవాబు: యేసు విశ్రాంతి దినాన్ని పాటించినది నిజమే; అయితే ఆయన ఎందుకు, ఏ సందర్భంలో దానిని పాటించాడో సరిగ్గా గ్రహించాలి. ఆయన భూమిపై ఉన్నప్పుడు ధర్మశాస్త్రం క్రింద జన్మించి, అదే నిబంధన పరిధిలో జీవించాడు (గలతీ 4:4). కాబట్టి యూదుడిగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించడం ఆయనకు సహజమైనది. ఇది ఆయన సంపూర్ణ విధేయతను మరియు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన విషయాన్ని తెలియజేస్తుంది (మత్తయి 5:17).
అయితే ఆయన విశ్రాంతి దినాన్ని కేవలం ఆచారంగా కాకుండా దాని అసలు ఉద్దేశాన్ని వెల్లడించాడు. “విశ్రాంతి దినము మనుష్యుని కొరకు ఏర్పరచబడినది” (మార్కు 2:27) అని బోధించి, ఆ దినమున మేలు చెయ్యడం, స్వస్థపరచడం దానికి విరోధం కాదని చూపించాడు (మార్కు 3:4).
కానీ క్రీస్తు మరణం మరియు పునరుత్థానంతో నూతన నిబంధన ప్రారంభమైన తర్వాత, అపోస్తలుల బోధలో విశ్రాంతి దినం క్రైస్తవులకు ఆజ్ఞగా విధించబడలేదని స్పష్టమౌతుంది.
కాబట్టి యేసు విశ్రాంతి దినాన్ని పాటించింది ఆయన ధర్మశాస్త్రం క్రింద జీవించినందుకే కాని, క్రైస్తవులు తప్పనిసరిగా అదే విధంగా పాటించాలనే అర్థం కాదు. క్రైస్తవులు ఆయనను అనుసరించేది ధర్మశాస్త్ర ఆచారాలలో కాదు, ఆయన ద్వారా నెరవేర్చబడిన కృప మరియు సత్యంలోనే.
ప్రశ్న4: యెషయా 66:22–23 ప్రకారం క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో సమస్త శరీరులు “ప్రతి విశ్రాంతి దినమున” యెహోవాను ఆరాధించుదురు అని చెప్పబడింది. ఈ వచనం ఆధారంగా విశ్రాంతి దినం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని భావిస్తే అది క్రైస్తవులకు ప్రస్తుత కాలంలో ఎందుకు వర్తించకూడదు?
జవాబు: యెషయా 66:22–23 వచనం భవిష్యత్తులో దేవుని ప్రజల ఆరాధనను ప్రవచనాత్మక (prophetic) భాషలో వివరిస్తుంది. ఇందులో “ప్రతి అమావాస్య” మరియు “ప్రతి విశ్రాంతి దినము” అనే కాల సూచికలు ఉపయోగించబడడం గమనించాలి. ఇవి పాత నిబంధనలో ఇశ్రాయేలు ఆరాధనా వ్యవస్థకు చెందిన సమయ సూచనలు.
ఈ వచనాన్ని పూర్తిగా అక్షరార్థంగా తీసుకుంటే విశ్రాంతి దినముతో పాటు అమావాస్య ఆచారాలు కూడా నూతన సృష్టిలో కొనసాగాలని అంగీకరించవలసి వస్తుంది. అయితే నూతన నిబంధన బోధ ప్రకారం, ఈ విధమైన కాలపరమైన ఆచారాలు “ఛాయలు” మాత్రమే (కొలొస్సయులకు 2:16–17); అవి క్రీస్తులో నెరవేరిన ఆత్మీయ వాస్తవాన్ని సూచించేవి.
అదేవిధంగా యెషయా ప్రవచన భాష సాధారణంగా తన కాలంలోని ఆరాధనా వ్యవస్థకు చెందిన పదజాలాన్ని ఉపయోగించి భవిష్యత్తులోని ఆత్మీయ వాస్తవాన్ని వ్యక్తపరుస్తుంది. అందువల్ల ఇక్కడ “ప్రతి విశ్రాంతి దినము” అనే భావం, ఒక నిర్దిష్ట దినాన్ని విధిగా ఆచరించవలసిన ఆజ్ఞగా కాకుండా దేవుని సమక్షంలో నిరంతర ఆరాధనను సూచించే విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రవచనంలో చూపబడిన భవిష్యత్తు ఆరాధనను ప్రస్తుత కాలానికి నేరుగా ఆజ్ఞగా వర్తింపచెయ్యడం సరైన వ్యాఖ్యాన పద్ధతి కాదు. కాబట్టి ఈ వచనాన్ని ఆధారంగా తీసుకుని క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని తప్పనిసరిగా పాటించాలి అని నిర్ణయించడం బైబిల్ సమగ్ర బోధకు అనుగుణంగా ఉండదు. బదులుగా ఇది దేవుని ప్రజలు ఆయనను నిరంతరం ఆరాధించే భవిష్యత్తు మహిమను సూచించే ప్రవచన చిత్రంగా అర్థం చేసుకోవాలి.
ప్రశ్న5: విశ్రాంతి దినాన్ని పాటించడం పూర్తిగా అవసరం కాకపోతే దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు: విశ్రాంతి దినం క్రైస్తవులకు ఆజ్ఞగా విధించబడకపోయినప్పటికీ దాని వెనుక ఉన్న సూత్రం ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగినదే.
మొదటిగా అది దేవునితో సమయం గడపడం మరియు ఆరాధనకు ప్రత్యేక సమయాన్ని కేటాయించడం అనే ఆత్మీయ అవసరాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి క్రమబద్ధమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆత్మీయంగా ఎంతో సహాయకరం.
రెండవదిగా శారీరక విశ్రాంతి కూడా మనిషికి అవసరం. నిరంతరంగా పని చెయ్యడం మనిషిని అలసటకు గురి చేస్తుంది; కాబట్టి ఒక దినాన్ని విశ్రాంతికి కేటాయించడం ఆరోగ్యపరంగా ప్రయోజనకరం.
మూడవదిగా సంఘంగా కూడి ఆరాధించడం క్రైస్తవ జీవితంలో కీలకం. ఒక నిర్దిష్ట దినాన్ని కేటాయించడం ద్వారా సహవాసం, బోధ, ఆరాధన వంటి అంశాలు క్రమబద్ధంగా జరుగుతాయి.
అందువల్ల విశ్రాంతి దినం రక్షణకు సంబంధించిన ఆజ్ఞ కాకపోయినప్పటికీ ఆరాధన, విశ్రాంతి, మరియు క్రమశిక్షణ కోసం ఉపయోగకరమైన నైతిక సూత్రంగా గుర్తించాలి.
ప్రశ్న6: ఒక స్థానిక సంఘానికి ఆదివారం సంఘంగా కూడడానికి సమయం లేదా అనుకూల పరిస్థితులు లేకపోతే ఆ సంఘం ఎలా స్పందించాలి?
జవాబు: ఒకవేళ స్థానిక సంఘానికి ఆదివారమున సంఘంగా విస్తృతమైన ఆరాధనకు అవసరమైన సమయం లేదా అనుకూల పరిస్థితులు లేకపోతే ఆ దినమున కనీసం కొంత సమయాన్ని కేటాయించి ప్రభు బల్ల ఆరాధన ద్వారా క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడం సముచితమైనది.
అదేవిధంగా ఆ సంఘానికి అనుకూలమైన మరొక దినమున సమయాన్ని నిర్ణయించి సంఘంగా కూడి దేవునిని సమగ్రంగా ఆరాధించడం మరింత శ్రేయస్కరమైన ఆచరణగా పరిగణించవచ్చు; ఎందుకంటే సంఘంగా కూడి ఆరాధించడం వాక్యాన్ని వినడం, సహవాసంలో ఉండడం క్రైస్తవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలు (హెబ్రీయులకు 10:24–25).
కాబట్టి, ఆదివారమున క్రీస్తు పునరుత్థానాన్ని గౌరవిస్తూ సంఘానికి అనుకూలమైన మరొక దినమున సంఘంగా కూడి ఆరాధనను క్రమబద్ధంగా కొనసాగించడం క్రైస్తవ సంఘం యొక్క సమతుల్యమైన బాధ్యతగా భావించవచ్చు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
