పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

సంఖ్యాకాండము 8:1,2‌ యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.

ఈ వచనాలలో దేవుడు మోషేకు ప్రధానయాజకుడైన అహరోను దీపవృక్షాన్ని ఎలా వెలిగించాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఈ దీపవృక్షం గురించిన వివరణ నిర్గమకాండము 25:31-40 వచనాలలో రాయబడింది. దాని వెలుగు ముందు పడేటట్టుగా వెలిగించడం అంటే దాని ఏడు కొమ్మలకూ ఉండే దీపాల ప్రమిదలు ముందు వైపుగా ఉంచి వెలిగించాలని అర్థం. ఆ వెలిగింపు పరిచారకులు సంఘంలో వాక్యపరిచర్య చెయ్యడానికి సాదృష్యంగా ఉంది (నిర్గమకాండము 25:31-40 వ్యాఖ్యానం చూడండి).

సంఖ్యాకాండము 8:3 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.

ఈ వచనంలో అహరోను దేవుడు ఆజ్ఞాపించినట్టే దీపవృక్షాన్ని వెలిగించడం మనం చూస్తాం. అంటే అతను తనంతట తానుగా కాదు, దేవుని ఆజ్ఞాపించినట్టుగా దానిని వెలిగించాడు (ముందుకు వెలుగు పడేలా). ఈ నియమాన్ని బట్టి సంఘ పరిచారకులు దేవుడు ఆజ్ఞాపించిన క్రమంలోనే సంఘాన్ని వెలిగించాలని నేర్చుకుంటున్నాం. తమకు తాముగా చెయ్యడానికి ఎవరికీ హక్కు లేదు, దేవుడు ఆజ్ఞాపించినట్టే సంఘానికి బోధించాలి.

సంఖ్యాకాండము 8:4 ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.

"నకిషిపనిగలది" అంటే అది ఒకే బంగారు ముద్దతో సాగగొట్టబడి తయారు చెయ్యబడింది, విడివిడి భాగాలుగా అతికించబడింది కాదు. దాని తయారీతనం నిర్గమకాండము 25:31-40 వచనాలలో వివరించబడింది.

"యెహోవా కనుపరచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను"

ప్రత్యక్షగుడారం కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ ఏదీ మోషే స్వంతంగా తయారు చేసింది కాదు, సీనాయి పర్వతంపై దేవుడు ఆజ్ఞాపించి చూపించినట్టుగానే అతను వాటన్నిటినీ తయారు చేయించాడు. అందుకే వాటి విషయంలో అతను "కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము" (నిర్గమకాండము 25:40) అని హెచ్చరించబడ్డాడు. అంటే ఆయన సన్నిధి దానికి సంబంధించిన వస్తువుల విషయంలో ఆయన మానవస్వేచ్చకు ఎలాంటి అనుమతీ కల్పించలేదు. ఈ నియమాన్ని బట్టి మనం కూడా సంఘంలో మన ఇష్టానుసారంగా నడుచుకోకూడదు, దేవుని వాక్యాన్ని బట్టే సమస్తమూ జరగాలి.

సంఖ్యాకాండము 8:5-8 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహారార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొనిరావలెను.

ఈ వచనాలలో దేవుడు లేవీయుల ప్రతిష్ట‌ గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. గత అధ్యాయాల్లో వివరించబడినట్టు ప్రత్యక్షగుడారపు పరిచర్య కోసమే ఈ ప్రతిష్ట. అందుకై వారు మొదటిగా పాపపరిహారార్థ జలంతో (సంఖ్యాకాండము 19:9) శుద్ధిచెయ్యబడాలి. తర్వాత శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ గొరికించుకోవాలి. ఇది పాతజీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి సాదృష్యంగా ఉంది. తర్వాత తమ వస్త్రాలను ఉదుకుకొని దేవునికి బలిగా ఒక దూడను, గోధుమపిండి నైవేద్యాన్ని తీసుకురావాలి.

సంఖ్యాకాండము 8:9-13 అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయ వలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడు కొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.

ఈ వచనాలలో లేవీయుల ప్రతిష్ట కొనసాగింపును మనం చూస్తాం. దానిప్రకారం; ఇశ్రాయేలీయులంతా లేవీయులపై తమ‌ చేతులు ఉంచాలి. అది తమ సేవను లేవీయులకు అప్పగించడానికి సాదృష్యం. తర్వాత లేవీయులు రెండు దూడలపై తమ చేతులు ఉంచాలి. అది తమ పాపాలను ఆ దూడలపై మోపడానికి సాదృష్యం. ఆ తర్వాత ఆ దూడలు పాపపరిహారార్థబలిగా దహనబలిగా అర్పించబడతాయి. ఆవిధంగా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యబడినాక పరిశుద్ధస్థల సంబంధమైన సేవకు అర్హులుగా ఎంచబడతారు. అప్పటినుంనిషిద్ధంకి 50 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకూ వారి జీవితం ప్రత్యక్షగుడారపు సేవకే అంకితం. ఈ నియమాన్ని బట్టి దేవుని పరిచర్యలో పాల్గొనేవారు ముందుగా తమ పాపాలకు శుద్ధి చేసుకోవాలని, వాటిని పూర్తిగా విడిచిపెట్టాలని నేర్చుకుంటున్నాం.

సంఖ్యాకాండము 8:14,15 అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.

లేవీయులు కూడా అందరివంటి పాపులే. వారు ముందటి వచనాలలో రాయబడినట్టు పవిత్రపరచబడకుండా పరిశుద్ధస్థలపు సేవ చెయ్యడానికి అనర్హులు. అందుకే అదంతా జరిగిన తర్వాతే వారు సేవకు అనుమతించబడ్డారు. ఈ నియమాన్ని బట్టి దేవుని సేవకు ప్రత్యేకించబడినవారు మొదట ఆయన వాక్యాన్ని బట్టి పరిశుద్ధపరచబడాలని నేర్చుకుంటున్నాం. ఆ నిజమైన మారుమనస్సు, దినదినం పరిశుద్ధపరచబడడంలో ఎదగడం అనే అనుభవాలు లేనివారు దేవుని సేవకు అనర్హులు.

"ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును"

ఈ మాటలకు లేవీయులు అందరూ ప్రత్యక్షగుడారంలోకి వెళ్ళవచ్చు అని అర్థం కాదు, అది అహరోను వంశమైన యాజకులకు తప్ప మిగిలినవారికి నిషిద్ధం (సంఖ్యాకాండము 18:3,7). ఆ మాటలకు అర్థమేంటంటే; గుడారం విప్పబడినప్పుడు తమకు అప్పగించబడిన వస్తువులను తెరలను మొయ్యడానికి అమర్చడానికి (సంఖ్యాకాండము 4) వెళ్ళవచ్చును అని అర్థం. అలాగే ఆ ప్రాంగణంలోకి వారు వెళ్ళవచ్చు.

సంఖ్యాకాండము 8:16-18 ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయు లలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను. ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని. ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.

ఈ వచనాలలో దేవుడు లేవీయులను ఇశ్రాయేలీయుల తొలిచూలులకు మారుగా ప్రతిష్టించుకోవడం మనం చూస్తాం. అంటే ఐగుప్తు తొలిచూలుల వధను బట్టి ఇశ్రాయేలీయుల తొలిచూలులంతా ఆయనకు ప్రతిష్టించబడ్డారు (నిర్గమకాండము 12). కానీ వారంతా ఆయన సేవకు రావడం సాధ్యపడదు కాబట్టి వారికి మారుగా ఆయన లేవీగోత్రాన్ని తన సేవకు ప్రత్యేకించుకున్నాడు.

సంఖ్యాకాండము 8:19 మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.

ప్రజలలో తొలిచూలులకు మారుగా దేవుడు లేవీగోత్రాన్ని తన సేవకు నిర్ణయించుకున్నాడు‌. అలా నిర్ణయించుకున్నవారిని యాజకవంశమైన అహరోనుకూ అతని కుమారులకూ ఆయన సహకారులుగా ఇచ్చాడు. ఈవిధంగా సేవ జరుగుతుండడాన్ని బట్టి పాపులైన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరానికి వచ్చినప్పుడు ఆయన వారిపైకి ఏ తెగులు పంపకుండా కాపాడతాడు. ఎందుకంటే ఆ సేవ వారికి ప్రాయశ్చిత్తంగా ఉంటుంది.

సంఖ్యాకాండము 8:20,21 అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీ యులు వారికి అట్లేచేసిరి. లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

ఈ వచనాలలో మోషే అహరోనులు లేవీయుల విషయంలో దేవుడు ఆజ్ఞాపించినట్టు చెయ్యడం, లేవీయులు కూడా దానికి విధేయత చూపించడం మనం చూస్తాం. ఆవిధంగా లేవీయుల పరిచర్య దేవుడు ఆజ్ఞాపించినట్టు నియమించబడింది. ఈ నియమాన్ని బట్టి సంఘంలో మన పరిచర్యలు దేవుని వాక్యానుసారంగా ఉండేలా చుసుకోవాలి.

సంఖ్యాకాండము 8:22 తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.

లేవీయులు ప్రత్యక్షగుడారంలో సేవ చెయ్యడానికి వెళ్ళిరి అంటే యాజకులు తప్ప మరెవ్వరూ ప్రవేశింపకూడదని గుడారంలోకి వెళ్ళారని కాదు (సంఖ్యాకాండము 18:3,7), ఆ ప్రాంగణంలోకి వెళ్ళారని అర్థం. దేవుని మహిమ నివసించే ప్రత్యక్షగుడారంలోకి యాజకులు తప్ప మరెవ్వరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. తెగించి ఎవరైనా ప్రవేశిస్తే మరణం తథ్యం.

సంఖ్యాకాండము 8:23-25 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనుఇది లేవీయులనుగూర్చిన విధి. ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.

వాస్తవానికి లేవీయులు ప్రత్యక్షగుడారంలో సేవ చేసే వయస్సు 30-50 సంవత్సరాలు. అందుకే లేవీయులు 30 సంవత్సరాల నుండే లెక్కించబడ్డారు (సంఖ్యాకాండము 4:3). అయితే ఈ వచనాలలో 25 యేళ్ళ నుండే సేవకు రావాలని రాయబడడం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ఐదేళ్ళు వారి శిక్షణకు సంబంధించినవి.

"ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను"

ఈ మాటలు దేవుని పనిలో విశ్రాంతిని సూచిస్తున్నాయి. యాభై యేళ్ళు దాటినవారు భారమైన ప్రత్యక్షగుడారపు సేవను సరిగ్గా నిర్వహించలేరు కాబట్టి ఆ వయస్సు దాటినవారికి ఆయన విశ్రాంతి కలుగచేస్తున్నాడు. ఈ నియమాన్ని‌ బట్టి పరిచర్యను సరిగ్గా నిర్వహించలేని వయస్సుకు చేరినవారు ఆ పని నుండి విశ్రాంతి తీసుకోవాలని నేర్చుకుంటున్నాం. ఆపై వారు పెద్దలుగా ఉంటూ పరిచర్యలను పర్యవేక్షించవచ్చు. పరిచర్యలోనే ఉండి దానిని సరిగ్గా నిర్వహించకుండడం కంటే దానిని యోగ్యులకు అప్పగించి విశ్రాంతి తీసుకోవడం మేలు కదా. దానివల్ల ఆ పరిచర్య విజయవంతంగా ముందుకు సాగుతుంది.

సంఖ్యాకాండము 8:26 వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితో కూడ పరిచర్య చేయవలెను గాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.

ఈ మాటలు యాభై యేళ్ళు దాటినవారికి సంబంధించినవి. వారు తమ గోత్రంతో కలసి తమ పనులను పర్యవేక్షించవచ్చు కానీ పని చెయ్యకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే ముందటి వచనాలలో‌ వివరించినట్టు భారమైన పనులను వారు సరిగ్గా చెయ్యలేరు. అందుకే పని చెయ్యకుండా తమ గోత్రపు పరిచర్య చొప్పున పర్యవేక్షణలో కొనసాగవచ్చు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.