పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

సంఖ్యాకాండము 10:1,2 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము; నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.

ఈ వచనాలలో దేవుడు మోషేకు రెండు వెండిబూరలు చేయించమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వాటి ఉద్దేశం : అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను. "నకిషిపనిగా వాటిని చేయింపవలెను" అంటే ఒకే వెండి కడ్డీని సాగగొట్టి వాటిని చేయించాలని అర్థం. ముక్కలను అతికించకూడదు.

సంఖ్యాకాండము 10:3-7 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు.

ఈ వచనాలలో దేవుడు వెండి‌బూరల ఉద్దేశం తెలియచెయ్యడం మనం చూస్తాం. రెండు‌ బూరలూ ఊదితే ఇశ్రాయేలీయుల ప్రజలంతా ప్రత్యక్షగుడారం యొద్దకు చేరుకోవాలి. ఒకటే ఊదితే ప్రజల్లో ప్రముఖులు మాత్రమే మోషే యొద్దకు రావాలి. రెండు బూరలనూ ఆర్భాటంగా ఊదితే తూర్పుదిక్కునున్న సైన్యం (యూదా శిబిరం) ముందుకు సాగాలి, రెండవమారు ఆర్భాటంగా ఊదితే దక్షిణదిక్కునున్న సైన్యం ముందుకు సాగాలి. ఇశ్రాయేలీయుల సమాజమంతా ప్రత్యక్షగుడారం దగ్గరకు రావాలనుకున్నప్పుడు ఆ బూరలు ఊదాలి కానీ ఆర్భాటం చెయ్యకూడదు. ఎందుకంటే సైన్యాలు ముందుకు సాగాలి అన్నప్పుడే ఆర్భాటంగా ఊదాలి. ఈవిధంగా ఆ బూరలు ఊదబడే విధానాన్ని బట్టి వేర్వేరు సందేశాలు ప్రజలకు చేరుతుంది. అరణ్యంలో లక్షలమంది ప్రజలను క్రమబద్ధంగా నడిపించడానికి అవి సాధనాలుగా ఉన్నాయి.

సంఖ్యాకాండము 10:8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.

ఈ వచనంలో దేవుడు ఆ బూరలు ఎవరు ఊదాలో తెలియచెయ్యడం మనం చూస్తాం. అహరోను కుమారులైన యాజకులు మాత్రమే ఆ బూరలు ఊదాలి. వారి తర్వాత వారికి‌ బదులుగా యాజకులయ్యే వారి సంతానానికి అవి చెందుతాయి. ఆవిధంగా యాజకులు ఆ బూరలను వేరు వేరు విధాలుగా ఊదుతూ ప్రజలను నడిపిస్తారు. ఇవి సంఘంలో పరిచారకులు వాక్యాన్ని ప్రకటించడానికి సాదృష్యంగా ఉన్నాయి. యాజకులు బూర శబ్దాన్ని బట్టి ప్రజలను నడిపించినట్టే పరిచారకులు వాక్యప్రకటన ద్వారా విశ్వాసులను నడిపించాలి.

సంఖ్యాకాండము 10:9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల పైకి ఎవరైనా యుద్దానికి వచ్చినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదాలని అప్పుడు వారు ఆయన సన్నిధికి జ్ఞాపకం వచ్చి రక్షించబడతారని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. "యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి" అంటే అంతవరకూ ఆయన వారిని మర్చిపోయాడని కాదు, అది‌ ప్రార్థనకు సంబంధించిన అలంకార బాష. దానికి వారు ఆ బూరలు ఊదడం ద్వారా ఆయన్ను సహాయం వేడుకోగా ఆయన వారిని రక్షిస్తాడని అర్థం.

సంఖ్యాకాండము 10:10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

ఈ వచనంలో దేవుడు ఆ బూరలను మరెప్పుడెప్పుడు ఊదాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం‌. ఇశ్రాయేలీయులకు ఆయన ఆజ్ఞాపించిన పండుగలప్పుడూ విశ్రాంతి దినాలప్పుడూ నెలల ప్రారంభంలో‌ బలులు అర్పించేటప్పుడూ వాటిని ఊదాలి. ఆ శబ్దం "దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా ఉంటుంది". జ్ఞాపకార్థముగా అంటే ప్రజల విశ్వాసానికి గుర్తుగా ఉంటుందని అర్థం.

సంఖ్యాకాండము 10:11-13 రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.

ఈ వచనాలలో దేవుని మాట ప్రకారం ఆయన మేఘం యొక్క నిర్దేశం ప్రకారం ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి పారాను అరణ్యంలో ప్రవేశించినట్టు మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన మూడవనెల మొదటిరోజుకు సీనాయి అరణ్యంలో ప్రవేశించారు (నిర్గమకాండము 19:1).‌ అప్పటినుండి రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవైఐదవ తేదీవరకూ ఆ అరణ్యంలోనే నివసించారు. ఆ మధ్యకాలంలో వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, ప్రత్యక్షగుడారం నిర్మించబడింది, యాజకవ్యవస్థ ఏర్పాటు చెయ్యబడింది. అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన వారిని ముందుకు నడిపిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన పాపమనే బానిసత్వం నుండి విడిపించి, ఆయన ఆజ్ఞలను మనకు నేర్పించి, ముందుకు నడిపిస్తున్నాడు.

సంఖ్యాకాండము 10:14-16 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీమనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్రసైన్య మునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.

యూదా, ఇశ్శాఖారు, జెబులూను గోత్రాలు తూర్పు దిక్కున నియమించబడిన గోత్రాలు. మందిరం విప్పబడి ఇశ్రాయేలీయులు ముందుకు సాగుతున్నప్పుడు వీరే మొదటిగా క్రమం‌ చొప్పున ముందుకు సాగాలి.

సంఖ్యాకాండము 10:17 మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.

లేవీగోత్రంలో గెర్షోనీయులకూ మొరారీయులకూ మందిరాన్ని విప్పి దాని పలకలనూ స్థంభాలనూ త్రాళ్ళనూ‌ తెరలనూ దిమ్మలనూ ఎడ్లబండ్లపై ముందుకు తరలించే బాధ్యత అప్పగించబడింది (సంఖ్యాకాండము 4). ఈ వచనంలో వారు అదే చేస్తున్నారు.

సంఖ్యాకాండము 10:18-20 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదే యూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. గాదీయుల గోత్రసైన్యమునకు దెయువేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.

ఈ వచనాలాలో దక్షిణదిక్కు శిబిరమైన రూబేను, షిమ్యోను, గాదు గోత్రికులు కూడా ముందుకు సాగడం మనం చూస్తాం. దేవుడు సంఖ్యాకాండము 2వ అధ్యాయంలో ఆజ్ఞాపించినట్టే వీరు ముందుకు సాగుతున్నారు.

సంఖ్యాకాండము 10:21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.

లేవీగోత్రంలో కహతీయులకు మందిరంలోని పరిశుద్ధ వస్తువులను భుజాలపై మోసే బాధ్యత అప్పగించబడింది (సంఖ్యాకాండము 4). ఈ వచనంలో వారు అదే చేస్తున్నారు, అలాగే మిగిలిన గెర్షోనీయులు, మొరారీయులతో కలసి ప్రజలు వచ్చేలోపే పారాను అరణ్యంలో మేఘం నిలిచిన చోట మందిరాన్ని నిలబెట్టారు.

సంఖ్యాకాండము 10:22-27 ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి. దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్య మునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్య మునకు అధిపతి.

ఈ వచనాలలో పడమర దిక్కు, ఉత్తరదిక్కు గోత్రాలు కూడా ముందుకు సాగడం మనం చూస్తాం. సంఖ్యాకాండము 2 వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించినట్టే వీరు ముందుకు సాగుతున్నారు‌.

సంఖ్యాకాండము 10:28 ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయు నప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి.

ఇది ఇశ్రాయేలీయులకు అరణ్యప్రయాణంలోనూ నివాసంలోనూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమం (సంఖ్యాకాండము 2) ఆ క్రమం చొప్పునే వారు ముందుకు సాగుతున్నారు. ఈ నియమాన్ని బట్టి వాక్యక్రమం చొప్పునే సంఘం ముందుకు సాగాలని నేర్చుకుంటున్నాం.

సంఖ్యాకాండము 10:29-32 మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను. అందుకు మోషే నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు. మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలు చేయుదుమనెను.

ఈ వచనాల్లో మోషే తనమామయైన రెవూయేలు కుమారుడు హోబాబును తనతో పాటు కనానుకు రమ్మనడం మొదట అతను తిరస్కరించడం అయినప్పటికీ మోషే అతన్ని రమ్మని పట్టుపట్టడం మనం చూస్తాం. యిత్రోకు మరో పేరే రెవూయేలు, ఇతనికి కెయీను అనే పేరు కూడా ఉంది (న్యాయాధిపతులు 1:16). ఇక దేవుడు ఇశ్రాయేలీయులను మేఘస్థంబం ద్వారా నడిపిస్తున్నప్పటికీ మోషే హోబాబు సహాయం ఎందుకు కోరాడంటే అది మానవబాధ్యతను సూచిస్తుంది. అంటే మోషే సహజంగా తెలుసుకోవలసినవి సహజంగా తెలుసుకోవడానికి అతని సహాయం కోరాడు.

"నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలు చేయుదుమనెను"

ఇక్కడ మోషే పలికిన మాట ప్రకారమే హోబాబు వంశస్థులకు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం లభించింది (న్యాయాధిపతులు 1:16).

సంఖ్యాకాండము 10:33 వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.

ఈ వచనంలో నిబంధన మందసం ప్రజలకు విశ్రాంతి స్థలం చూడడానికి ముందుగా సాగడం మనం చూస్తాం. ఈవిధంగా వారి ప్రతీ ప్రయాణంలోనూ దేవుని మహిమ నిలిచే నిబంధన మందసమే వారికి ముందుగా సాగి వారికి దిశానిర్దేశం చేసింది.

సంఖ్యాకాండము 10:34 వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.

ఈ వచనం ప్రకారం ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి ముందుకు సాగినప్పుడు పగటివేళ వారికి ఎండదెబ్బ తగలకుండా మేఘం వారిని కాపాడుతూ వచ్చింది.

సంఖ్యాకాండము 10:35,36 ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుట నుండి పారిపోవుదురు గాక యనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.

ఈ వచనాలలో మందసం ముందుకు సాగుతున్నప్పుడూ నిలిచినప్పుడు మోషే పలుకుతున్న మాటలు మనం చూస్తాం. "యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుట నుండి పారిపోవుదురు గాక యనెను" ఈ మాటలు యుద్ధప్రార్థనను సూచిస్తున్నాయి. కీర్తనాకారుడు కూడా ఇలాంటి ప్రార్థనే చేసినట్టు మనం గమనిస్తాం (కీర్తనలు 68:1). "యెహోవా లెమ్ము" అంటే తమ పక్షంగా యుద్ధం చెయ్యమని అర్థం. "నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుట నుండి పారిపోవుదురు గాక" ఇక్కడ మోషే మా శత్రువులు అనడం లేదు నీ శత్రువులు అంటున్నాడు. అంటే దేవుని ప్రజల శత్రువులు మొదట దేవునికే శత్రువులు.

"అది నిలిచినప్పుడు అతడు యెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను"

ఈ మాటలు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యకు దేవుని సన్నిధిని ఆహ్వానించడాన్ని సూచిస్తున్నాయి. దేవుని ప్రజల మధ్య దేవుడు నివసించడమే వారికి అన్నిటికంటే ప్రాముఖ్యం కాబట్టి మోషే ఈ ప్రార్థన చేస్తున్నాడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.