పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

సంఖ్యాకాండము 2:1,2 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్రాయేలీయుల గోత్రాలు తమ తమ టెక్కెములను పట్టుకొని ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. గత అధ్యాయంలో రాయబడినట్టు మొదట ప్రత్యక్షగుడారం ఉండాలి. దాని చుట్టూ లేవీయులు ఉండాలి. ఆ లేవీయుల చుట్టూ మిగిలిన 11 గోత్రాలూ ఉండాలి. "టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను" అంటే ప్రతీ గోత్రానికీ ఒకో చిహ్నం ఉంటుంది ఉదాహరణకు ప్రాచీన యూదుల సాంప్రదాయం ప్రకారం యూదా గోత్రపు చిహ్నం సింహం (ఆదికాండము 49:9). ఆ చిహ్నాలను (జెండాలను) బట్టి వాటికి చెందిన గోత్రాలు అక్కడ గుడారాలు వేసుకోవాలి. ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే;

1. దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలీయులను ఒక క్రమం చొప్పున నివసింపచేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రమానికే దేవుడు. ఈ నియమాన్ని బట్టి సంఘం కూడా క్రమబద్ధంగా నడుచుకోవాలి.‌ దేవుడు గందరగోళానికి కర్త కాడు (1 కొరింథీ 14:33).

2. ప్రత్యక్షగుడారం చుట్టూ లేవీయులు ఉండి వారు దానిని కాపాడాలి, వారి చుట్టూ మిగిలిన గోత్రాలు ఉండి వారిని కాపాడాలి. ఈ నియమాన్ని బట్టి సంఘంలో ఒకరికి ఒకరు సహాయంగా ఉంటూ పరిచర్య ఫలవంతంగా ముందుకు సాగాలే తోడ్పడాలి.

3. ఈ క్రమాన్ని బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రాలూ ఆయా దిక్కుల చొప్పున ప్రత్యక్షగుడారం చుట్టూ ఉంటాయి. అంటే దేవుని సన్నిదే వారికి కేంద్రంగా ఆ క్రమం నియమించబడింది. మన జీవితాలకు కూడా దేవుడే కేంద్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయన తన‌ వాక్యంలో నియమించిన క్రమం చొప్పున నడుచుకోవాలి.‌

సంఖ్యాకాండము 2:3,4 సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీమనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.

ఈ వచనాలలో దేవుడు యూదా గోత్రం సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున దిగాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ గోత్రానికి నాయకుడు అమ్మీమనాదాబు కుమారుడైన నయస్సోను. ఇతని ప్రస్తావన యేసుక్రీస్తు వంశావళిలో కూడా మనం చూస్తాం (మత్తయి 1:4). గమనించండి; ప్రత్యక్షగుడారం చుట్టూ సేనల చొప్పున దిగవలసిన గోత్రాలలో ఆయన మొదటిగా ఈ యూదా గోత్రం గురించే ప్రస్తావిస్తున్నాడు, అలాగే వారు ప్రారంభదిక్కుయైన తూర్పు దిక్కున దిగాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రత్యక్షగుడారపు ద్వారం కూడా తూర్పు దిక్కునే‌ ఉంటుంది (నిర్గమకాండము 27:13-16). ఎందుకంటే ఈ యూదా గోత్రంలోనే నీతి సూర్యుడైన మెస్సీయ జన్మించబోతున్నాడు, కాబట్టి ఆ గోత్రం మొదటినుండీ ఇలా ప్రాముఖ్యత సంతరించుకుంది (1 దినవృత్తాంతములు 5:2). ‌దానికి తగ్గట్టుగానే వారి సంఖ్య కూడా మిగిలిన గోత్రాల కంటే ఎక్కువ. అది యాకోబు పలికిన "యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు" (ఆదికాండము 49:8) అనే ప్రవచనం యొక్క నెరవేర్పు.

సంఖ్యాకాండము 2:5-9 అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది. యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.

ఈ వచనాలలో దేవుడు ఇశ్శాఖారు మరియు జెబులూను గోత్రాలు ఎక్కడ దిగాలో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారు తూర్పు దిక్కున యూదా గోత్రానికి సమీపంగా దిగాలి. అందుకే వారు యూదా పాళెం‌గా ప్రస్తావించబడ్డారు. ఆవిధంగా ఈ మూడు గోత్రాల సైన్యమూ లక్షయెనబై యారు వేల నాలుగువందల మందీ (74600+74400+57400) తూర్పు ప్రత్యక్షగుడారానికి తూర్పుదిక్కుగా నివసిస్తారు‌, అరణ్య ప్రయాణంలో కూడా ఆ వరుస క్రమంలోనే ప్రయాణిస్తారు. ఈ ఇశ్శాఖారు గురించి మనం పరిశీలిస్తే; యాకోబు ఇశ్శాఖారును బలమైన గార్దబం (గాడిద) గా ప్రస్తావించాడు (ఆదికాండము 49:14,15). అంటే వీరు సహనం కలిగి శ్రమించేవారు. అంతేకాదు వీరు సమోచితమైన జ్ఞానం కలిగినవారు కూడా (1 దినవృత్తాంతములు 12:32). అందుకే రాజవంశమైన యూదా ప్రక్కనే వీరికి స్థానం దక్కింది. కాబట్టి దేవుని సైన్యంలో లేక శిబిరంలో సహనం కలిగి శ్రమించేవారికీ సమోయోచితమైన జ్ఞానం కలిగినవారికీ ప్రాముఖ్యమైన స్థానం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక జెబులూనీయులు యుద్ధంలో చపలచిత్తం లేకుండా పోరాడే యోధులు (1 దినవృత్తాంతములు 12:33). అందుకే వారికి కూడా తూర్పు దిక్కున యూదాపాళెంలో చోటు కల్పించబడింది.

సంఖ్యాకాండము 2:10-16 రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది. అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది. అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది. రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారానికి దక్షిణ దిక్కున దిగవలసిన వారెవరో ఆజ్ఞాపించడం మనం చూస్తాం. రూబేను, షిమ్యోను, గాదు గోత్రికులు దక్షిణదిక్కుగా దిగాలి. వీరు లక్షా యేబై ఒక్క వేల నాలుగువందల ఏబదిమంది. గమనించండి; రూబేను యాకోబుకు జ్యేష్ఠకుమారుడు. కానీ అతను తన పాపం కారణంగా జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు (ఆదికాండము 49:3,4, 1 దినవృత్తాంతములు 5:1). అయినప్పటికీ కృపకలిగిన దేవుడు అతని సంతానానికి ఆయన శిబిరంలో స్థానం‌ కల్పిస్తున్నాడు. కానీ అది రెండవ స్థానంగానే ఉంది. దీనిని‌బట్టి ఆయన మన పాపాల కారణంగా మనల్ని పూర్తిగా నశింపచెయ్యనప్పటికీ దాని పర్యవసానమైతే అనుభవింపచేస్తాడని నేర్చుకుంటున్నాం. అందుకే ఆయన సంఘంలోనూ సైన్యంలోనూ మన స్థాయిని దిగజార్చే సమస్త పాపాలకూ మనం దూరంగా జీవించాలి.‌ సొలొమోను, సంసోను, దావీదు వంటి గొప్ప భక్తులు తమ పాపాల కారణంగానేగా ఈనాటికీ వారి చరిత్రలు చదువుతున్నప్పుడు నిందించబడుతున్నారు.

సంఖ్యాకాండము 2:17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

ప్రారంభ వచనాలలో వివరించినట్టుగా మొదటిగా ప్రత్యక్షగుడారం ఉంటుంది, దాని చుట్టూ లేవీయులు ఉండాలి, వారి చుట్టూ మిగిలిన 11 గోత్రాలూ ఉండాలి. వీరంతా ఆ వరుసక్రమంలో గుడారాలు వేసుకుని నివసించడమే కాదు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ వరుసలోనే ప్రయాణించాలి. ఇది అరణ్యంలో కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమశిక్షణతో కూడిన క్రమం. అంటే అరణ్యంలో కూడా ఆయన తన పిల్లలు కుడికైనా ఎడమకైనా చెదిరిపోకుండా గజిబిజిగా కాకుండా ఒక వరుసక్రమంలో నడిపిస్తున్నాడు. దీనిని బట్టి మన జీవితాలు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యక్రమం నుండి అరణ్యం వంటి శోధనలలోనైనా వేదనలలోనైనా కుడికైనా యెడమకైనా తొలగకుండా ఆ వాక్యక్రమం చొప్పునే నివసించాలని, నడుచుకోవాలని నేర్చుకుంటున్నాం.

సంఖ్యాకాండము 2:18-24 ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది. అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది. అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది. ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారానికి పడమటి దిక్కుగా దిగలవలసిన గోత్రాల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఎఫ్రాయీము, మనష్షే, బెన్యామీను గోత్ర సైనికులు లక్షా యెనిమిదివేల వందమందీ పడమటి దిక్కుగా నివసించాలి, ప్రయాణించాలి. దేవుడు నిర్ణయించిన ఈ క్రమాన్ని బట్టి మనష్షే కంటే ఎఫ్రాయీమే‌ బలమైనవాడు ఔతాడని యాకోబు చేసిన ప్రవచనం (ఆదికాండము 48:13-19) నెరవేరింది, ఎందుకంటే ఈ క్రమంలో యోసేపు కుమారులలో పెద్దవాడైన మనష్షే చిన్నవాడైన ఎఫ్రాయీము పాళెంగా అతని పేరుతో ప్రస్తావించబడ్డాడు. అలాగే శత్రువు ప్రధానంగా తూర్పునుండీ పడమటినుండీ దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.‌ అందుకే ఆయన తూర్పు దిక్కున కొదమసింహమైన యూదా గోత్రాన్నీ సమయోచిత జ్ఞానంతో సహనం కలిగి శ్రమించే ఇశ్శాఖారు గోత్రాన్నీ చపలచిత్తం లేకుండా పోరాడే జెబులూను గోత్రాన్నీ ఉంచాడు.‌ ఈ పడమటి దిక్కునైతే యాకోబు చేత బలమైన జనంగా ప్రవచించబడిన ఎఫ్రాయీము గోత్రాన్నీ అతని సహోదరుడైన మనష్షే గోత్రాన్నీ చీల్చునట్టి తోడేలుయైన బెన్యామీను గోత్రాన్నీ (ఆదికాండము 49:27) ఉంచాడు. ఈ క్రమాన్ని‌ బట్టి సంఘంలో కొందరిని ప్రధానమైన బాధ్యతల్లో నియమించేముందు దేవుడు వారికి అనుగ్రహించిన సామర్ధ్యం ఏంటో గుర్తించి దానిని బట్టే ఆ బాధ్యతల్లో నియమించాలి.‌

సంఖ్యాకాండము 2:25-31 దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమా రులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది. దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

ఈ వచనాలలో దేవుడు ప్రత్యక్షగుడారానికి ఉత్తరదిక్కుగా దిగవలసిన గోత్రాల గురించి ఆజ్ఞాపించడం మనం చూస్తాం‌. దాను, ఆషేరు, నఫ్తాలి అనే మూడుగోత్రాల సైన్యం లక్ష యేబై యేడువేల ఆరువందలమందీ ఉత్తరదిక్కుగా దిగాలి. యాకోబు దాను గురించి "దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును" (ఆదికాండము 49:17) అని ప్రవచించాడు. ఇవి అతని యుద్ధనైపుణ్యాన్ని సూచించే మాటలు. అందుకే దేవుడు ఈ ఉత్తరదిక్కు గోత్రాల సమూహాన్ని దాను పాళెం అని ప్రస్తావించాడు.

సంఖ్యాకాండము 2:32 వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.

గత అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలలో లెక్కించబడిన సైనికులు వీరే. అయితే లెక్కించబడిన ఈ గోత్రాల సైన్యం ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో కాలేబు, యెహోషువాలు తప్ప మరెవ్వరూ కనానులో ప్రవేశించలేదు. తిరుగుబాటును బట్టి వీరంతా అరణ్యంలోనే నశించిపోయారు (సంఖ్యాకాండము 14:29,30, ద్వితీయోపదేశకాండము 2:14,15). కాబట్టి ఇక్కడ దేవుని సైన్యపు లెక్కలో ఉంటే సరిపోదు, ఆయన ప్రత్యక్షగుడారానికి నలుదిక్కులా నివసించినా సరిపోదు ఆయనకు విధేయత చూపించడం ప్రాముఖ్యం అని నేర్చుకుంటున్నాం. ఆయన సైన్యపు లెక్కలో ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్షగుడారపు సన్నిధి చుట్టూ నివసించినప్పటికీ చివరికి ఆయన సంఘ సభ్యుల జాబీతాలో ఉన్నప్పటికీ కూడా అవిధేయులకు నాశనం తప్పదు.

సంఖ్యాకాండము 2:33 అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.

లేవీయులు దేవుని ప్రత్యక్షగుడారపు సేవకు ప్రత్యేకించబడినవారు కాబట్టి వారిని మిగిలిన గోత్రాల యద్ధసైన్యంతో కలిపి లెక్కించకూడదని గత అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపించాడు (సంఖ్యాకాండము 1:48-51). అందుకే మోషే వారిని లెక్కించలేదు. వారి ప్రత్యేక లెక్కింపు 3వ అధ్యాయంలో రాయబడింది.

సంఖ్యాకాండము 2:34‌ అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.

ఈ వచనంలో ఇశ్రాయేలీయులు తమకు దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే వారివారి దిక్కుల చొప్పున ధ్వజాలను బట్టి నివసిస్తున్నట్టు ముందుకు సాగుతున్నట్టు మనం చూస్తాం. ఆవిధంగా దేవుడు భీకరమైన ఆ అరణ్యంలో కూడా వారికి ఒక క్రమం చొప్పున నడిపించుకుంటూ ఉన్నాడు. ఆయన తన పిల్లలను ఏ పరిస్థితుల్లోనైనా క్రమం చొప్పున నడిపించగలవాడని దీనిని బట్టి గ్రహించాలి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.