విషయసూచిక:- 2:1 , 2:2, 2:3 , 2:4, 2:5 , 2:6 ,2:7 , 2:8 , 2:9 , 2:10 , 2:11 , 2:12 , 2:13 , 2:14 , 2:15 , 2:16 , 2:17 , 2:18
గలతీ పత్రిక రెండవ అధ్యయ పరిచయం
గలతీ పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు
1. మొదటిగా, తన సువార్త దేవుని నుండి పొందుకుంది అని, యెరూషలేములో ఉంటున్న అపొస్తలులు దానిని ఆమోదించారు అని చెప్పాడు
2. రెండవదిగా, పేతురు సువార్త సత్యాన్ని బట్టి నడవకపోవడం తాను చూసినప్పుడు, తనని బహిరంగంగా ఖండించి, తాను మనుష్యులను సంతోషపెట్టేవాడు కాదు, దేవునిని మాత్రమే సంతోషపెట్టేవాడు అని చూపించాడు.
ఈ కారణాలను బట్టి తాను అపొస్తలుడను అని తెలియజేయడం మాత్రమే కాకుండా, తన అపొస్తలత్వం యెరూషలేములోనివారి అపొస్తలత్వానికంటే తక్కువైనదేమీ కాదు అని నిరూపించాడు.
వచన వ్యాఖ్యానం
“అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని." గలతీ 2:1
"అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన" అనే మాటతో ఈ అధ్యాయం మొదలవుతుంది. వ్యాఖ్యానకర్తలలో ఈ కాలక్రమం గురించి ఒకే అభిప్రాయం లేదు.
1) దక్షిణ గలతీ సిద్ధాంతం (South Galatian Theory) ప్రకారం పౌలు రక్షణ పొందిన పదునాలుగు సంవత్సరాల తర్వాత యెరూషలేముకు వెళ్ళాడు (మొదటిసారి, రక్షణ పొందిన మూడు సంవత్సరాల తర్వాత పేతురును కలిసాడు, V18) అని వాదించొచ్చు
2) ఉత్తర గలతీ సిద్ధాంతం (North Galatian Theory) ప్రకారం పౌలు పేతురును మరియు యాకోబును మొదటిసారి కలిశాక ( గలతీ 1:18), అటుపిమ్మట పదునాలుగు సంవత్సరాల తర్వాత యెరూషలేముకు వెళ్ళాడు అని చెప్పొచ్చు
ఇక్కడ మనం మాట్లాడుతున్న పదునాలుగు సంవత్సరాల సమయం విషయంలో ఈ రెండు ఆలోచనలలో దేనిని తీసుకున్నా అది ఇక్కడ చెప్తున్న విషయసారాంశాన్ని ఏమీ మార్చదు. అయితే అది పౌలు యొక్క కాలక్రమం మీద ప్రభావం చూపిస్తుంది (దీని గురించిన మరింత వివరణ కోసం 'గలతీ పత్రిక పరిచయం' అనే వ్యాసాన్ని చదవండి).
పౌలు యెరూషలేముకు వస్తూ, బర్నబాను మరియు తీతును తనతో పాటు తీసుకొచ్చాడు. బర్నబా గురించి మనం ఆలోచన చేస్తే:
a) బర్నబా (హెచ్చరిక పుత్రుడు అని అర్థం) ఆదిమ సంఘంలో సభ్యుడు, అతని అసలు పేరు 'యోసేపు'. అతనికి ఉన్న భూమిని అమ్మి దానిని అపొస్తలుల పాదాలయొద్ద పెట్టాడు ( అపొ.కార్య. 4:36,37)
b) సౌలు మారుమనస్సు పొందిన తర్వాత, అపొస్తలుల దగ్గరికి అతనిని తీసుకొచ్చాడు (అపొ.కార్య. 9:27)
c) పౌలుతో పాటు పరిచర్య కోసం పరిశుద్ధాత్ముని చేత ప్రత్యేకించబడ్డాడు (అపొ.కార్య. 12:25)
d) పౌలు యొక్క మొదటి మిషినరీ ప్రయాణంలో కలిసి పరిచర్య చేసాడు (అపొ.కార్య. 13:4-5)
మొదటి మిషినరీ ప్రయాణం తర్వాత వీరి మధ్య విబేధం కలిగి, బర్నబా మార్కును, పౌలు సీలను వెంటబెట్టుకొని వేరే వేరే ప్రాంతాలలో పరిచర్య జరిగించారు. తీతు పౌలుతో పాటు పరిచర్య చేసాడు. ఇతను కొరింథీ సంఘంలో ఒక కీలక పాత్రను పోషించాడు (2 కొరింథీ 2:13; 7:6, 13, 14; 8:6, 16, 23; 12:18).
“దేవదర్శన ప్రకారమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని." గలతీ 2:2
ఇక్కడ పౌలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు, తన సొంత నిర్ణయాన్ని బట్టో లేక బర్నబా నిర్ణయాన్ని బట్టో పౌలు యెరూషలేముకు వెళ్ళలేదు, అయితే "దేవదర్శన ప్రకారమే వెళ్లితిని" అని చెప్తున్నాడు. దేవుడు ఈ దర్శనాన్ని పౌలుకు ప్రత్యక్షంగా చూపించాడా? లేక అగబు అనే ప్రవక్త చేత పౌలుకి బయలుపరిచాడా? అనే విషయంలో స్పష్టత లేనప్పటికీ, కచ్చితంగా తన సొంత నిర్ణయం కాదు దేవుని బయలుపాటే అని తెలుస్తుంది. ఇక్కడ పౌలు తాను ప్రకటిస్తున్న సువార్తను "వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని" అని చెప్తున్నాడు. దీనిని బట్టి ఇది బహిరంగ సమావేశం కాదని (Not a public meeting) అపొస్తలులు మరియు పెద్దలతో మాత్రమే జరిగిన సమావేశం అని అర్థం అవుతుంది.
ఇక్కడ పౌలు "నా ప్రయాసము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో" అని అంటున్నాడు. దీనిని బట్టి తాను ఇన్ని సంవత్సరాలు ప్రకటించిన సువార్త విషయంలో పౌలుకు నిశ్చయత లేదు అని మనం అర్థం చేసుకోవాలా? లేదు, అలా అర్థం చేసుకోకూడదు. మరి ఈ మాటలకు అర్థం ఏంటి? పౌలు "అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త" ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ వచనాన్ని గమనించాలి, "మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక" (అపొ.కార్య. 13:39). అంటే ధర్మశాస్త్రం వలన రక్షణ అనేది లేదు అని, యేసు నామంలో మాత్రమే రక్షణ ఉంది అని పౌలు ధైర్యంగా ప్రకటించాడు. ఇలా తాను ప్రకటిస్తున్న సువార్తకు విరుద్ధంగా ధర్మశాస్త్రం రక్షణకు అవసరం అని చెప్పే యూదులు, జనుల మనస్సులను నిజమైన సువార్త తట్టు నుండి దూరంగా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు గనుక, వారి విషయంలో సువార్త వ్యర్థమైపోతుందేమో అని పౌలు అపొస్తలులను కలిసి తన సువార్తను వారికి తెలియజేసాడు.
మార్టిన్ లూథర్ ఈ విషయాన్ని గురించి ఈ విధంగా మాట్లాడాడు, "పౌలు, తాను వ్యర్థంగా పరుగెత్తాడని ఎప్పుడూ అనుకోలేదు. అయినప్పటికి, పౌలు అన్యజనులను ధర్మశాస్త్రపు కాడి నుండి విముక్తులను చేసినందున, పౌలు సువార్తను వ్యర్థంగా బోధించాడని చాలామంది భావించారు. రక్షణ కోసం ధర్మశాస్త్రానికి విధేయత తప్పనిసరి అనే అభిప్రాయం వారిలో బలంగా ఉంది. పౌలు ఈ దురాచారాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించాడు. పౌలు ఈ సమావేశం ద్వారా తన సువార్త యొక్క గుర్తింపును ఇతర అపొస్తలులతో స్థాపించాలని ఆశించాడు, అతను వ్యర్థంగా తిరుగుతున్నాడన్న తన ప్రత్యర్థుల చర్చను ఆపడానికి ఈ విధంగా చేసాడు."
“అయినను నాతోకూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు." గలతీ 2:3
ఇక్కడ పౌలు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. గలతీ సంఘంలో ఉన్న సమస్యకు ఇది సరైన రుజువుగా ఈ వచనం కనబడుతుంది. పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు బర్నబాతో పాటు తీతును వెంటబెట్టుకొని వచ్చాడు. బర్నబా అంటే యెరూషలేములో అపొస్తలులకు బాగా తెలిసిన వ్యక్తి, అతను పౌలుతో పాటు పరిచర్య చేస్తున్న సహోదరుడు, గనుక బర్నబా మరియు పౌలు ఇద్దరూ కలిసి యెరూషలేముకు వచ్చారు అంటే అది అర్థవంతంగానే ఉంది. మరి తీతు ఎందుకు? ఆయనను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచిస్తే, ఆ విషయమై ఇక్కడ ఒక సూచన ఇవ్వబడింది. "తీతు గ్రీసు దేశస్థుడు" అనే మాటను ఈ వచనంలో చూస్తాం.
గ్రీసు దేశస్థుడు అని తెలుగులోకి అనువదించబడినప్పటికీ, ఈ మాట ఇంగ్లీషులో 'గ్రీక్' (Greek) అని ఉంది (Titus.....being a Greek). ఇక్కడ వాడబడిన గ్రీకు పదం మనం చూస్తే, "hellēn" (Ἕλλην) అని ఉంది. ఈ పదం కొత్త నిబంధనలో దాదాపు 27 సార్లు వాడబడింది, ఇందులో 20 సార్లు గ్రీకు దేశానికి చెందినవాడు (అనగా గ్రీకు దేశ స్థానికుడు) అనే అర్థముంది, మిగతా 7 సార్లు అన్యుడు అనే పదానికి పర్యాయపదంగా ఇది వాడబడింది. కొంతమంది వ్యాకరణకర్తలు ఈ వచనంలో పౌలు ఉద్దేశం తీతు గ్రీకు దేశ వాస్తవ్యుడు అని కాదు గాని, అతను ఒక అన్యుడు అని చెప్పడం అని వ్యాఖ్యానించారు. ఇదే సరైన భావమని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నాను.
ఈ అన్యుడైన తీతు, "సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు" అని పౌలు చెప్తున్నాడు. పౌలు యెరూషలేములోని పెద్దలకు (పేతురు, యోహాను, యాకోబు) తన సువార్తను తెలియజేసినప్పుడు ఆ పెద్దలు - నువ్వు తీతును తీసుకొచ్చావు కదా, అతను సున్నతి పొందాలి లేకపోతే ఆయనకు పరిశుద్ధ సహవాసంలో ప్రవేశం లేదు అని చెప్పలేదు. అందుకు భిన్నంగా వారు కూడా పౌలు చెప్తున్న సువార్తను అంగీకరించి, తీతు సున్నతి పొందాల్సిన అవసరం లేదు అనే తీర్పునే ఇచ్చారు.
కొందరు వ్యాఖ్యానకర్తలు, తీతు "సున్నతి పొందుటకు బలవంతపెట్టబడలేదు" అనే మాటను "తీతును సున్నతి పొందమని అపొస్తలులు బలవంతపెట్టలేదు గాని, అతనే స్వచ్ఛందంగా సున్నతి పొందాడు" అని వ్యాఖ్యానించారు. పౌలు చెప్తున్న మాటకి ఇలాంటి అర్థం ఎందుకు వచ్చింది అంటే, గ్రీకులో ఈ భాగ వ్యాకరణము (the grammar of this passage) చాలా క్లిష్టమైనదిగా ఉంది, స్పష్టమైన వ్యాకరణ శైలిలో ఈ మాటలు రాయబడలేదు (not written in clear grammatical format), ఈ కారణంగా పౌలు యొక్క మాటలకు వేరు వేరు అర్థాలు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే మనం పౌలు యొక్క ఉద్దేశం అర్థం చేసుకుంటే, అనగా సువార్త సత్యం కోసం పౌలు పోరాడుతున్నాడని, క్రీస్తులో సున్నతి పొందాల్సిన అవసరం లేదు అని వాదిస్తున్నాడని గ్రహిస్తే ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు "తీతు సున్నతి పొందాల్సిందిగా బలవంత పెట్టబడలేదు, అతను సున్నతి పొందలేదు" అనే భావాన్నే ఇస్తుంది. ఒక వేళ తీతు సున్నతి పొందివుంటే, దీనిని గలతీయులకు ఒక ఉదాహరణగా పౌలు చూపించగలిగేవాడు కాదు, ఎందుకంటే గలతీయులలో కూడా బలవంతం లేకపోతే సున్నతి పొందొచ్చు అనే భావం కలిగేది. కానీ పౌలు మాటలు దానికి భిన్నంగా ఉన్నాయి.
ఇంకొంత మంది తిమోతి యొక్క ఉదాహరణకు తీసుకొస్తారు. తిమోతికి పౌలు సున్నతి చేయించాడు, తీతుకు మాత్రం చేయించలేదు, అది ఆదిమ సంఘంలో ఒక పెద్ద వివాదానికి దారి తీసిందని చెప్తారు. అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. తిమోతి యొక్క తల్లి విశ్వాసి అయిన యూదురాలు, అతని తండ్రి అన్యుడు. ఈ విషయం తిమోతి నివసిస్తున్న ప్రదేశంలోని యూదులకందరికీ తెలుసు. తిమోతి యూదురాలి కుమారుడు గనుక (అతనికి యూదుల మూలాలు ఉన్నాయి - he has jewish roots) , సున్నతి చేయిస్తే సమాజమందిరాలలోకి తిమోతి వెళ్ళినప్పుడు ఏ యూదుడూ అడ్డు చెప్పడు అనే కారణాన్ని బట్టి పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. తీతు విషయంలో పరిస్థితి వేరు, ఇతను అన్యుడు, ఇతనికి యూదుల మూలాలు లేవు. ఇతనికి సున్నతి చేయిస్తే, అన్యులు దేవుని సంఘంలో చేర్చబడాలి అంటే సున్నతి అవసరం అనే బోధకు తానే తావిచ్చినట్టు ఉంటుంది. అది నిజమైన సువార్త సత్యం కాదు గనుక పౌలు తీతుకు సున్నతి చేయించలేదు, చేయించమని యెరూషలేములోని పెద్దలు కోరలేదు.
“మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్య్రమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది." గలతీ 2:4
ఇక్కడ పౌలు, "కపట సహోదరుల" గురించి మాట్లాడుతున్నాడు. వీరు ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఆ లక్ష్యం ఏంటి అంటే, "క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్య్రమును వేగు చూచుటకు" అని పౌలు చెప్తున్నాడు. అంటే, క్రీస్తు యేసులో విశ్వాసులకు ఉన్న స్వాతంత్య్రాన్ని హరించి, వారిని తిరిగి ధర్మశాస్త్రమనే కాడి కిందకి తీసుకురావడానికి వీరు ప్రయత్నిస్తున్నారు.
యెరూషలేములో ఉన్న కపట సహోదరుల గురించి మాట్లాడుతూ అలాంటివారే గలతీ సంఘంలో కూడా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. వీరు నిజమైన సహోదరులు కారు, మేము కూడా క్రీస్తును నమ్మాము అని చెప్పుకొని సంఘంలోకి ప్రవేశించి తమ కపటత్వాన్ని చూపిస్తున్నారు. సంఘంలో తోటివారిగా ఉంటూ, నిజమైన రక్షణ పొందినవారిగా ప్రవర్తిస్తూ, ధర్మశాస్త్ర భారాన్ని తిరిగి విశ్వాసులమీదకు తీసుకొస్తున్నారు. మరొక సువార్తను ప్రకటించినవారు శాపగ్రస్తులు అనే మాట పౌలు మొదటి అధ్యాయంలో చెప్పాడు. ఈ కపట సహోదరులు శాపగ్రస్తులు, సువార్త సత్యం నుండి జనాలను పక్కకు తీసుకుపోయేవారు.
సహోదరులారా జాగ్రత్త, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ నిజమైన విశ్వాసులు కారు, నీతో సన్నిహితంగానే ఉంటూ నిన్ను క్రీస్తు నుండి పక్కదారి పట్టిచ్చేవారు, వాక్యసత్యం నుండి వేరు చేయడానికి ప్రయత్నించేవారు, కపట సహోదరులు కూడా ఉంటారు. వారు సాతాను సంబంధులు. వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని ప్రేరేపించే (లేదా వాక్య వ్యతిరేక విషయాలను విశ్వసించమని ప్రవర్తించే)వారితో అప్రమతంగా ఉండు, వారి చేత ప్రభావితం కాకుండా చూసుకో.
“సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు" గలతీ 2:5
పౌలు సువార్త సత్యం కోసం నిలబడ్డాడు, ఇది తన సొంత ప్రయోజనం కోసం మాత్రమే కాదు, తాను ఆ విధంగా నిలబడడం సంఘానికి కూడా (తన బోధను విశ్వసించి క్రీస్తును నమ్మినవారికి) చాలా అవసరం. సువార్త సత్యం కోసం నిలబడడం అంటే ఏంటో ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు, "మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు" అంటున్నాడు. క్రీస్తుకు సంబందించినవారు అసత్యాన్ని సత్యంగా ఒక్క క్షణం కూడా అంగీకరించరు. రోమా 1:25 ప్రకారం, " దేవుని సత్యమును అసత్యమునకు" మార్చేవారు దేవుని పిల్లలు కారు, వారు సాతాను సంబంధులు, దేవుడంటే ఎరుగనివారు, దేవుని ఉగ్రతకు పాత్రులు.
రక్షణకు సున్నతి అవసరం లేదు అనే వాదనని ఇక్కడ మనం చూడొచ్చు. యూదులు ఎంత ఒత్తిడి తెచ్చినా తీతుకు పౌలు సున్నతి చేయించలేదు, తద్వారా రక్షణకు సున్నతి అవసరం లేదు అనే దేవుని నియమానికి (పౌలుకు యేసు బయలుపరిచిన విధంగా) విధేయత చూపాడు.
“ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరుని వేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు" గలతీ 2:6
పౌలు ఇక్కడ "వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు" అంటున్నాడు. ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నాడు అంటే, "ఎన్నికైన వారుగా ఎంచబడినవారు" అని ఈ వచనంలో చూస్తున్నాం.
దీనిని బట్టి మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి -
1) అపొస్తలులలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే బేధమేమీ లేదు, పౌలు "ఎన్నికైనవారు" అని అనట్లేదు, "ఎన్నికైనవారుగా ఎంచబడినవారు" అని అంటున్నాడు. ఈ ఎన్నికైనవారుగా ఎంచబడినవారు అని పౌలు ఎవరిని అంటున్నాడో వారి పేర్లు ఇక్కడ చెప్పలేదు. అయితే 9వ వచనంలో "యాకోబు కేఫా యోహాను" గురించిన ప్రస్తావన ఉంది గనుక, పౌలు వీరి గురించే మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. అపొస్తలులు అందరికీ ఒకటే అధికారం ఉంది, అయితే "యాకోబు కేఫా యోహాను" ఎన్నికైనవారుగా అనగా "స్తంభములుగా ఎంచబడ్డారు".
2) పౌలు "ఎన్నికైనవారుగా ఎంచబడిన" అపొస్తలులను తక్కువ చేసి మాట్లాడట్లేదు. "వారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు", "వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు", "ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు" అని పౌలు చెప్పినప్పుడు, అది పౌలు అహంకారంతో అపొస్తలులను లెక్కచేయకుండా మాట్లాడిన మాటలు అని నిర్ధారించకూడదు. అందుకు భిన్నంగా, సువార్తను మార్చడానికి ఎవరికీ (వారు ఎన్నికైనవారిగా ఎంచబడిన అపొస్తలులు అయినప్పటికీ) అధికారం లేదు అని చెప్తున్నాడు. ప్రభువు పౌలుకు తెలియజేసిన సువార్తే అపొస్తలులు అందరూ బోధిస్తున్నారు అని, పౌలు వీరి నుండి కొత్తగా నేర్చుకుంది ఏమీ లేదు అని అర్థం చేసుకోవాలి.
లియోన్ మోరిస్ ఈ విధంగా చెప్పాడు, "అపొస్తలులు యేసుతో దీర్ఘకాలంగా సహవాసం చేయడం ప్రాముఖ్యత లేని విషయం అని పౌలు భావించలేదు; అందుకు భిన్నంగా దానిని ఒక భాగ్యంగా భావించాడు. అయితే, అపొస్తలులకు ఉన్న ఈ భాగ్యం దేవుని కృపకు పరిమితి విధించలేదు అని, యూదుల అవగాహన ఈ విషయంలో తప్పు అని పౌలు చెప్తున్నాడు" (అపొస్తలులను ఎన్నుకున్న అదే దేవుడు, తన కృపను బట్టి పౌలును కూడా ఎన్నుకున్నాడు - దేవుడు ఆదిమ అపొస్తలుల ద్వారా ఎంత బలంగా పనిచేసాడో అంతే శక్తితో నా ద్వారా కూడా పనిచేయగలడు అనేది పౌలు వాదన).
“అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నాకప్పగింపబడెనని వారు చూచినప్పుడు" గలతీ 2:7
"అయితే" అనే పదంతో ఈ వచనం మొదలవుతుంది, మనం గమనిస్తే ఇప్పటివరకు దేవుడు తనకు బయలుపరిచిన సువార్త విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని, తన అపొస్తలత్వం ఇతర అపొస్తలులకంటే తక్కువ కాదు అని మాట్లాడిన పౌలు ఇప్పుడు అదే విషయాన్ని వేరే విధంగా చెప్తున్నాడు.
దేవుడు "సున్నతి పొందినవారికి సువార్త బోధించడానికి" పేతురుని ఎన్నుకున్నాడనీ, తనని "సున్నతి పొందనివారికి సువార్త బోధించడానికి" ఎన్నుకున్నాడనీ చెప్తున్నాడు. దీనిని బట్టి రెండు వేరువేరు సువార్తలు ఉన్నాయి అనే వివరణ ఇవ్వకూడదు (ఇంకొక సువార్త ప్రకటిస్తే వారు శాపగ్రస్తులు అని గలతీ 1:8,9లో పౌలే చెప్పాడు). 'సున్నతి పొందినవారికి' అనే అలంకారం యూదా ప్రజల గురించి, 'సున్నతి పొందనివారికి' అనే అలంకారం అన్యజనుల గురించి అని అర్థం చేసుకోవాలి. పేతురు యూదులకు సువార్త చెప్పడానికి దేవుని చేత ఎలా ఎన్నుకోబడ్డాడో అదేవిధంగా అన్యజనులకు సువార్త చెప్పడానికి దేవుడు పౌలును ఎన్నుకున్నాడు అని దీని భావం.
పౌలు అన్యజనులకు అపొస్తలుడు అని చెప్పడానికి వాక్యంలో చాలా వచనాలు ఉన్నాయి -
“నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక" - రోమా 11:13
“ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాససత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని" - 1 తిమోతి 2:7
పౌలు అన్యజనులకు సువార్తికుడు అని చెప్పినప్పుడు దాని ఉద్దేశం పౌలు ఎప్పుడూ, ఏ యూదునికీ సువార్త ప్రకటించలేదు అని కాదు, అదే విధంగా పేతురు యూదులకు సువార్తికుడు అంటే దాని ఉద్దేశం అతను ఎప్పుడూ అన్యజనులకు సువార్త ప్రకటించలేదు అని కూడా కాదు. అయితే వారి ప్రధాన బాధ్యత మరియు పరిచర్య ఆయా ప్రజల మధ్య ఉంది అని అర్థం. పౌలు అనేకసార్లు సమాజమందిరాల్లో యూదులకు సువార్త బోధించాడు (అయితే వారు దానిని తృణీకరించినప్పుడు నేను అన్యజనులకు ప్రకటించడానికి వెళ్తున్నాడు అని వారికి చెప్పాడు - అపొ.కార్య. 18:6, 28:28), అదేవిధంగా పేతురు కొర్నెలి అనే అన్యజనుని కుటుంబానికి సువార్త ప్రకటించి బాప్తీస్మం ఇచ్చాడు (అపొ.కార్య. 10).
"వారు చూచినప్పుడు" అనే మాటను ఈ వచనం చివరిలో చూస్తున్నాం. దేవుడు పౌలుకు అప్పగించబడిన అపొస్తలత్వన్ని తాను చేసిన సువార్త పరిచర్యను యెరూషలేములోని అపొస్తలులు చూసారు. ఇక్కడ చూడడం అంటే అక్షరాలా అపొస్తలులు దమస్కుకు మరియు సిరియాకు వెళ్లి పౌలు చేస్తున్న పరిచర్యను చూసారు అని అర్థం కాదు, అయితే తాను చేసిన ఆ పరిచర్య గురించిన విషయాలు అనీ వారికి చూసినట్టుగా వివరించబడ్డాయి అని అర్థం.
“అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసినవాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు," గలతీ 2:8
ముందు వచనానికి కొనసాగింపుగా ఈ వచనాన్ని చూస్తాం (7-9 వచనాలు ఒకే ఆలోచన కొనసాగింపు). ఇక్కడ కొన్ని విషయాలను పరిశీలిద్దాం:
1) ఈ వచనం మన తెలుగు బైబిల్లో అనువదించినవారు "అపొస్తలుడవుటకు" అనే మాటను పేతురుకు మరియు పౌలుకు, ఇద్దరికీ ఉపయోగించారు (సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు.....అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును....). అయితే గ్రీకు భాషలో (మరియు ఇంగ్లీష్ బైబిల్ తర్జమాలో) 'అపొస్తలుడవుటకు' అనే మాట పేతురుకు మాత్రమే ఉపయోగించబడింది. ఈ వచనం అక్షరాలా తెలుగులోకి అనువదిస్తే "అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసినవాడే అన్యజనుల విషయంలో నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు" అని వస్తుంది. దీనిని బట్టి కొందరు వ్యాఖ్యానకర్తలు పౌలు తాను అపొస్తలుడను అని చెప్పుకోవట్లేదు అని వాదించారు. నిజానికి ఈ సందర్భంలో పౌలు యొక్క ఉద్దేశం తాను అపొస్తలుడు అని నిరూపించడం కంటే తాను ప్రకటిస్తున్న సువార్త కచ్చితమైనదని నిరూపించడం. యెరూషలేములోని అపొస్తలులు పౌలు ఎన్నుకోబడిన విధానాన్ని, పౌలు యొక్క సువార్తను అంగీకరించారు, అంటే పౌలు యొక్క అపోస్తలీయ అధికారాన్ని కూడా అంగీకరించారు అని అర్థం. పేతురు ద్వారా ప్రకటించబడిన సువార్త ఏ విధంగా అయితే అనేక సూచక క్రియల ద్వారా ధృవీకరించబడిందో అదేవిధంగా పౌలు ద్వారా ప్రకటించబడిన సువార్త కూడా అనేక సూచక క్రియల ద్వారా ధృవీకరించబడింది.
2) "వారు గ్రహించినప్పుడు" అనే ఈ మాట 7వ వచనంలో "వారు చూచినప్పుడు" అనే మాటకు వివరణ. యెరూషలేములో ఉన్న అపొస్తలులు (ఎన్నికైనవారుగా ఎంచబడినవారు) ఎలా తెలుసుకున్నారు అంటే, వారు పౌలు యొక్క పరిచర్య గురించిన విషయాలు విని, గ్రహించారు
3) యెరూషలేములో ఉన్న అపొస్తలులు ఎలాగైతే ప్రభువు చేత ఎన్నుకోబడ్డారో అదే విధంగా పౌలు కూడా ప్రభువు చేత ఎన్నుకోబడ్డాడు, "అందుకు ప్రభువు నీవు (అననీయ) వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు" (అపొ.కార్య. 9:15)
ఈ కాలంలో ప్రభువు చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ అపొస్తలులు ఎవరూ లేరు. అపోస్తలీయ అధికారం వారికి తప్ప ఇంకెవరికీ ఇవ్వబడలేదు. ఈ కాలంలో అనేకులు మేము కూడా అపొస్తలులమే మమ్మల్ని ప్రభువే ప్రత్యక్షంగా ఎన్నుకున్నాడు అని చెప్పేవారు అబద్ధికులే తప్ప సత్యం చెప్పేవారు కాదు. అపోస్తలీయ వరం, అపోస్తలీయ అధికారం ఆదిమ అపొస్తలులకే పరిమితం, దానిని దేవుడు ఆ విధంగానే నియమించాడు.
ఈ విషయం గురించి మరింత వివరణ కొరకు క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా "నేటికీ అపొస్తలులు ఉన్నారా" అనే వ్యాసం చదవండి.
“స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి" గలతీ 2:9
"స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను", వీరు యెరూషలేము సంఘంలో, యూదుల మధ్య పరిచర్యలో, మరియు మిగతా అపొస్తలుల మధ్య ముఖ్యమైనవారిగా లేదా స్తంభాలుగా ఎంచబడ్డారు. పాత నిబంధనలో, అబ్రాహాము, యాకోబు, ఇస్సాకు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులకు మూలపురుషులు అని ఎంచబడ్డారో, అదేవిధంగా ఇక్కడ యాకోబు కేఫా యోహానును ఇతరులు (క్రీస్తును నమ్మినవారు, మరియు యూదులు) క్రైస్తవ్యానికి మూలపురుషులుగా ఎంచారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యమైనదే అని మనం గ్రహించాలి.
"నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని" ఈ మాటకు ముందు వచనంలో వివరణ ఇవ్వడం జరిగింది (పై వచన వ్యాఖ్యానాన్ని చదవండి).
"అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి" ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కనీసం రెండు ముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోగలం. మొదటిగా, దేవుడు వారికి అప్పగించిన పనిని, వారి బాధ్యతను వారు చాలా స్పష్టంగా గ్రహించారు. యాకోబు, పేతురు, యోహాను పౌలుతో ఏమీ వాదించలేదు. మేమే గొప్ప, యూదులకైనా అన్యజనులకైనా మేమే సువార్త పరిచర్య చేస్తాము, మమ్మల్నే ప్రభువు ఎన్నుకున్నాడు అని మాట్లాడలేదు. వారు యూదులకు అపొస్తలులు అనే విషయాన్ని వారే చెప్పారు. రెండవదిగా, దేవుడు పౌలుకు అప్పగించిన బాధ్యతను, తన పరిచర్యను తెలుసుకొని వారిని అంగీకరించి ధ్రువీకరించారు. "అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి" అనే మాటను గమనిస్తే, పౌలు అన్యజనులకు అపొస్తలుడు అని యెరూషలేము అపొస్తలులు ఒప్పుకుంటున్నారు అని అర్థమౌతుంది.
ఈ కాలంలో అనేకమంది పరిచారకులు (మేము దేవుని సేవకులం అని చెప్పుకునేవారు) వేరే ఎవరో ఎంతో కష్టపడి సువార్త పరిచర్య చేసి కట్టిన సంఘాలను చిన్నాభిన్నం చేసి, ఆ సంఘస్తులను తమ సంఘానికి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపొస్తలులు పౌలు పట్ల కనబరిచిన వైఖరి నేటి కాలంలో అనేకులు అనుసరించడం లేదు. ఇతరులను అంగీకరించడం, నిజంగా క్రీస్తుకొరకు నిలబడ్డవారిని బలపరచడం, ఆమోదం తెలపడం అనే అపోస్తలీయ విధానాలు నేడు మరుగవుతున్నాయి. ఎంతకూ నేనే వాక్యం చెప్పాలి, ప్రజలందరూ నన్నే గొప్పగా చూడాలి అనే వైఖరే తప్ప నిజమైన అపోస్తలీయ వైఖరి కనబడడం లేదు.
"తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి", మీరు అన్యజనులకు అపొస్తలులుగా ఉండండి అని చెప్పడం మాత్రమే కాకుండా "తమతో పాలివారమనుటకు సూచనగా......కుడిచేతిని ఇచ్చిరి" అనే మాటను చూస్తున్నాం. కుడిచేతిని ఇవ్వడం అనేది వారిని అంగీకరించడం, మరియు ఆమోదం తెలపడం అనే మాటకు నిదర్శనం. ఈ కాలంలో కూడా ఇతరులతో మనం ఏకీభవించినప్పుడు కరచాలనం చేస్తాం (shake hand), అదే విధంగా పౌలు చెప్పిన విషయాలను అంగీకరిస్తూ యాకోబు, పేతురు, యోహాను పౌలుకు తమ కుడిచేతిని ఇచ్చారు.
“మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని" గలతీ 2:10
"మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి", బీదలు అని తర్జుమా చేయబడ్డ గ్రీకు పదం "ptōchos" (ప్టోకోస్), దీని అర్థం - పేదలు, బిచ్చగాడు, అవసరాలలో ఉన్న వ్యక్తులు, సాంస్కృతికంగా అణచివేయబడిన, తృణీకరించబడిన మరియు దయనీయంగా పరిగణించబడ్డవారు. పౌలుకు ఆమోదం తెలిపిన తర్వాత యెరూషలేములో ఉన్న అపొస్తలులు తన సువార్తకు ఏమీ కలపలేదు కానీ, దేవుడు ఇతరులపట్ల చూపించమన్న ప్రేమ, క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు ఆయన జనుల పట్ల కనబరిచిన వైఖరి మీరు కలిగి ఉండండి అని మాత్రమే పౌలును మరియు బర్నబాను కోరారు. "జ్ఞాపకము చేసుకోవడం" అంటే వారి గురించి ఆలోచించడం మరియు ప్రార్ధన చేయడం మాత్రమే కాదు, వారికి సహాయం చేయడం. అందుకే యాకోబు తన పత్రికలో "సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆనాటికి భోజనములేక యున్నప్పుడు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?" అని అంటున్నాడు.
"ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని" ఇది పౌలు యొక్క సమాధానం. ఇతరులకు సహాయం చేయడానికి పౌలు ఎప్పుడూ వెనకాడేవాడు కాదు. మాటల్లో మాత్రమే కాక క్రియల్లో కూడా తన విశ్వాసాన్ని చూపించిన మాదిరి పౌలుది.
కొందరు, ఇక్కడ "బీదలు" అని ప్రస్తావించబడింది యెరూషలేములోని సంఘాన్ని సూచిస్తుంది అని చెప్తారు. అక్కడ కరువు పరిస్థితులు ఉన్నాయి గనుక, వారిని జ్ఞాపకం చేసుకోమని యెరూషలేములో ఉన్న అపొస్తలులు పౌలును అడిగారు అని వివరిస్తారు. పౌలు పేదల పక్షాన కచ్చితంగా మాట్లాడాడు, ముఖ్యంగా సంఘం ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటే తాను పరిచర్య చేస్తున్న ఇతర సంఘాలకు ఆ విషయం చెప్పి వారి సామర్థ్యం కొలది సహోదరులకు ఇవ్వాలని, కష్టాలలో పాలుపంచుకోవాలని ప్రేరేపించాడు.
"హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను." 2 కొరింథీ 8:14,15
"ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది." 2 కొరింథీ 9:12
“అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;" గలతీ 2:11
అంతియొకయ పౌలు యొక్క స్థానిక సంఘం. కేఫా అక్కడికి వచ్చినట్టు చూస్తున్నాం. పౌలు తన పత్రికల్లో పేతురును, కేఫా అని సంబోధించడం మనం చూస్తాం (1 కొరింథీ 1:12, 3:22, 9:5, 15:5; గలతీ 2:9). కేఫా అనే మాట ఆరామిక్ భాషలో "బండ" అని అర్థం (పేతురు అనేది గ్రీకు పదం, ఈ మాటకి అర్థం "బండ"). ఇక్కడ పౌలు పేతురు పేరును ఆరామిక్ భాషలో సంబోధిస్తున్నాడు అని తెలుస్తుంది.
ఒక విషయంలో పేతురు అపరాధిగా తీర్చబడ్డాడు, అందుకు పౌలు అతనిని ముఖాముఖిగా ఎదిరించాడు. పేతురు చేసిన తప్పేంటో తర్వాత వచనాలలో చూస్తాం, అయితే ఇక్కడ పౌలు పేతురును అందరి సమక్షంలో గద్దించి తప్పుచేసాడా? యేసు ప్రభువు, మత్తయి 18:15లో "నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి" అని చెప్పాడు కదా. అలాంటప్పుడు, పౌలు పేతురును ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి కదా! అనే సందేహం రావచ్చు. ఒక విషయం గమనించాలి, యేసు ప్రభువు చెప్పిన నియమం "నీ సహోదరుడు నీయెడల తప్పిదము" చేసినప్పుడు అనే సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. తోటి విశ్వాసి నీపట్ల వ్యక్తిగతంగా తప్పు చేస్తే అప్పుడు నువ్వు ఆ విషయాల్లో మొదట వ్యక్తిగతంగానే గద్దించాలి. ఒక విశ్వాసి లేదా ఒక సంఘపెద్ద లేదా ఒక పాస్టర్ బహిరంగంగా తప్పుచేసి అది ఇతర విశ్వాసులని తప్పుదారి పట్టిస్తుంది అని తెలిసినప్పుడు, ఆ విషయంలో గద్ధింపు బహిరంగంగానే ఉండాలి, ఇలాంటి సందర్భంలో యేసు ప్రభువు చెప్పిన నియమాలను సందర్భరహితంగా ఇక్కడ వాడకూడదు.
ఈ కారణాన్ని బట్టి పౌలు చేసింది తప్పు కాదు అని, తాను పేతురు కంటే గొప్ప అని చూపించుకోవడానికో, లేదా పేతురును తక్కువ చేయడానికో ఈ పని చేయలేదు గాని, పేతురు సువార్త సత్యానికి వ్యతిరేకంగా నడిచాడు గనుకనే ఆలా గద్దించాడు అని తెలుస్తుంది. ఒకవేళ పౌలు తన సువార్తను యెరూషలేము అపొస్తలులు నుండి నేర్చుకొని ఉంటే పేతురును గద్దించేవాడు కాదేమో. కానీ అది తనకి యేసు క్రీస్తు బయలుపర్చడం ద్వారానే తెలుసుకున్నాడు గనుక ఆ సువార్త సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన పేతురును కూడా ఎదిరించాడు.
ఎంతటి భక్తులైనా పొరపాట్లు చేసే వీలు లేకపోలేదు (అపొస్తలులు సహితం పొరపాట్లు చేసారు అని ఇక్కడ చూస్తున్నాం). ఆలా ఒక గొప్ప దైవజనుడు పొరపాటు చేసినప్పుడు, అది ఇతర విశ్వాసుల మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పుడు ఆ దైవజనుణ్ణి కచ్చితంగా సరిచేయాల్సిన బాధ్యత ఇతర విశ్వాసులకు ఉంది.
“ఏలయనగా యాకోబునొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను." గలతీ 2:12
పౌలు పేతురును గద్దించడానికిగల కారణాన్ని ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా, పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అన్యజనులతో భోజనము చేయడానికి వెనకాడలేదు. అపొ. కార్యములు 10వ అధ్యాయంలో, పేతురుకు కలిగిన దర్శనం మనకు తెలుసు, ఆ దర్శనం ద్వారా ప్రభువు పరిశుద్ధపరిచినవాటిని నిషిద్ధమని ఎంచకూడదు అని పేతురు తెలుసుకున్నాడు. అన్యజనులకు మరియు యూదులకు మధ్య దేవుడు రక్షణ విషయంలో ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు అని కొర్నెలి కుటుంబం రక్షణ పొందటాన్ని బట్టి గ్రహించాడు. అప్పటినుండి పేతురు అన్యజనులతో సహవాసంలో ఉన్నాడు అని చెప్పడంలో పెద్ద సమస్య ఏమీ లేదు. పేతురుకు అన్యజనులతో భోజనం చేయడం ఇదే మొదటి అనుభవం కాదు (అపొ. కార్యములు 11:2 చూడండి).
పాత నిబంధనలో దేవుడు పెట్టిన ఆహారనియమాల పట్ల యూదులు చాలా నిబద్ధత చూపించేవారు. ఉదాహరణకి, దానియేలూ, అతని స్నేహితులూ తాము అపవిత్రపరచబడకుండా ఉండడానికి కూరగాయలు తినడానికి ఇష్టపడ్డారు (రాజు ఇచ్చిన ఆహారాన్ని తినలేదు - దానియేలు 1:12 ). ఆహారనియమాలు తప్పడం అంటే యూదుడు అన్యులలో కలిసిపోవడం అనే భావం ఉండేది. అది యేసుక్రీస్తు మరణ పునరుత్తానాల వరకూ సరైన విషయమే, ఎవరూ ఆ విషయమై అభ్యంతరం చెప్పేవారు కాదు. సహజంగా ఏ యూదుడూ అన్యజనులతో కలిసి భోజనం చేసేవాడు కాదు. అయితే కొందరు వ్యాఖ్యానకర్తలు, "యూదుల ఆహారనియమాలు ఉల్లంఘించనంతవరకూ యూదులు కొన్నిసార్లు అన్యజనులతో భోజనం చేసేవారనీ, అలాంటప్పుడు వారి భోజనపాత్రలు వేరుగా ఉంచుకునేవారనీ" అభిప్రాయపడతారు. ఏదేమైనప్పటికీ నిషిద్ధమైన ఆహారం తినడం అనేది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే అని యూదులు భావిస్తారు. పేతురు తనకు కలిగిన గ్రహింపును బట్టి, దేవుని దర్శనాన్ని బట్టి యూదులతో సహవాసం చేయడం మరియు భోజనం చేయడం తప్పుకాదు అని నమ్మాడు.
రెండవదిగా, "యాకోబునొద్దనుండి కొందరు వచ్చారు" అని ఈ వచనంలో చూస్తున్నాం. వీరు ఎందుకు వచ్చారో కారణం చెప్పబడలేదు. వీరిని పౌలు "సున్నతి పొందినవారు" అని ఇదే వచనంలో సంబోధించాడు. సున్నతి పొందినవారు అనే మాట వివిధ సందర్భాలలో వివిధ రకాల జనాలను సంబోధించడానికి ఉపయోగించబడింది. రోమా 4:12 లో యూదులను వర్ణించడానికి ఈ మాట వాడారు, అదేవిధంగా అపో.కార్య. 10:45, 11:2లో యూదులైన క్రైస్తవులను వర్ణించడానికి వాడారు, అదే విధంగా తీతుకు రాసిన పత్రికలో, అబద్ధ బోధకులను వర్ణించడానికి ఈ మాటను వాడారు. ఈ సందర్భంలో యూదా క్రైస్తవుల గురించి పౌలు ఈ మాటను వాడాడు అని తెలుస్తుంది.
మూడవదిగా, "వారు రాగానే పేతురు వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను" అని చూస్తున్నాం. ఇక్కడ పేతురు చేసిన ఒక పెద్ద తప్పును మనం గమనించొచ్చు. దేవుడు రక్షణ విషయంలో అన్యజనులకు మరియు యూదులకు ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు అని పేతురుకు ముందే తెలుసు. అన్యులతో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఇంతకముందు పేతురు జీవితంలో ఉన్నాయి. అయితే ఇక్కడ పేతురు దేవుని మాట పట్ల లేదా ఆయన చిత్తం పట్ల ఉన్న గౌరవానికంటే, యాకోబు దగ్గర నుండి వచ్చినవారి పట్ల భయంతో ఈ విధంగా ప్రవర్తించాడు అని గమనించాలి. అందుకే ముందు వచనంలో, పేతురు అపరాధిగా తీర్చబడ్డాడు అని పౌలు చెప్పాడు. యాకోబు దగ్గర నుండి వచ్చినవారు, ఈవిధంగా ప్రవర్తించమని పేతురును బలవంతపెట్టలేదు, ఒకవేళ ఇదే జరిగుంటే పౌలు యాకోబును మరియు ఆయన దగ్గర నుండి వచ్చినవారిని కూడా నిందించేవాడు (ఎదిరించేవాడు).
మరి పేతురు ఎందుకు భయపడ్డాడు? పేతురు యాకోబుకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇంతక ముందు ఎప్పుడూ ఈ విధంగా భయపడినట్టు మనం చూడలేదు. సున్నతి పొందిన యూదా క్రైస్తవులకు కూడా పేతురు ఎప్పుడు భయపడలేదు. కొందరు వ్యాఖ్యానకర్తలు దీని గురించి ఈ విధంగా వ్యాఖ్యానించాడు, "యూదులు అన్యులతో కలిసి యూదా మతాచారాలను మంటిపాలు చూస్తున్నారు అని యూదా అధికారులకు కోపం ఉండేది, వారు ఈ విషయాన్ని బట్టి యెరూషలేములో ఉన్న యూదా క్రైస్తవులను హింసించేవారు. క్రీస్తును వెంబడించేవారిలో ముఖ్యుడైన పేతురు, క్రీస్తును ప్రకటించడం మాత్రమే కాకుండా అన్యులతో కలిసి భోజనం చేయడం అనే విషయం తెలిస్తే ఆ యూదా మతాధికారుల నుండి సంఘానికి ఎలాంటి శ్రమలు ఎదురవుతాయో అనే భయంతో ఈ విధంగా చేసుంటాడు." యాకోబు దగ్గర నుండి వచ్చినవారు, సంఘంలో హింసలు జరుగుతున్నాయి అని బహుశా చెప్పి ఉంటారు, అది పేతురు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అయ్యుండొచ్చు. ఇక్కడ, "వెనుకతీసి వేరైపోయెను" అనే మాటను గమనిస్తే, అది వెంటనే జరిగిన ఒక విషయం గురించి మాట్లాడుతుంది అని చెప్పొచ్చు. యాకోబు దగ్గర నుండి కొందరు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరగలేదు, వారు వచ్చినప్పుడు పేతురు మరియు ఇతర యూదులు అన్యులతో కలిసి భోజనం చూస్తున్నారు, సున్నతి పొందినవారు వచ్చారు అని తెలియగానే, భోజనం అకస్మాత్తుగా ఆపేసి పక్కకెళ్ళిపోయారు.
“తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడ వారి వేషధారణము చేత మోసపోయెను. " గలతీ 2:13
పేతురు చేసిన పని యొక్క పర్యవసానం ఇక్కడ చూస్తున్నాం. తక్కిన యూదులు కూడా పేతురు పక్షాన చేరి భోజనం చేయడం ఆపేసి పక్కకి వెళ్లిపోయారు, దీన్ని చూసి బర్నబా కూడా ఏమీ ఆలోచించకుండా వారి "వేషధారణముచేత మోసపోయాడు" అని పౌలు చెప్తున్నాడు. పెద్ద పరిచారకులు పెద్ద తప్పులు చేసే అవకాశం లేకపోలేదు. పేతురు ఒక ప్రథమ అపొస్తలుడు, అయినప్పటికీ ఆయన ఇక్కడ క్రీస్తు నామాన్ని అవమానపరిచినవాడిగా చూస్తున్నాం. సహోదరులను ప్రేమించాలని, క్రీస్తునందు ఏ బేధమూ లేదని పేతురుకు తెలుసు, అయినప్పటికీ తన బలహీనత చేత పడిపోయినట్టు అర్థమవుతుంది. కానీ ఈనాడు అనేకమంది, దేవుని పేరు చెప్పుకుంటూ, వారు పెద్ద దైవసేవకులమని వారి జీవితంలో ఏ పాపమూ లేనట్టు, వారు ఎప్పుడూ ఏ బలహీనతకూ లొంగిపోనట్టు ప్రవర్తిస్తుంటారు. ఇతరులను సరిచేసే ముందు మనం సరిగ్గా ఉండాలి అనే మాటను వారు జ్ఞాపకం చేసుకోరు.
వేషధారణ అనే పాపంలో మనం కూడా పడిపోతూ ఉంటాం. ఒకరిని సంతోషపెట్టాలని దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి, దేవుని ఎదుట దోషులుగా మారుతాం. ఇక్కడ పేతురు చేసిన తప్పు భయంవల్ల చేసిందే గాని, క్రీస్తునూ, ఆయన బోధలనూ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మాత్రం కాదు అని గమనించాలి. ఈ రోజు కొంతమంది నిజంగా పేతురులాగ వారి బలహీనతను బట్టి పాపంలో పడిపోతుంటే కొందరు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వక్రీకరించి పాపంలో పడిపోతున్నారు.
నీ జీవితం ఎలా ఉంది? నేను గొప్ప విశ్వాసిని, నేను ఎప్పుడూ పాపంలో పడను అని అనుకుంటున్నావా? నేను వెంబడిస్తున్న నా పాస్టరుగారు లేదా నా నాయకుడు గొప్ప విశ్వాసి, ఆయన పాపం / తప్పు చేసే అవకాశమే లేదు అని భావిస్తున్నావా? గుర్తు పెట్టుకో, మనం అపొస్తలుడైన పేతురు కంటే గొప్పవాళ్ళం కాదు, ఆయన పాపం చేసిన ఆధారాలు ఉన్నప్పుడు మనం కూడా పాపంలో పడిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది అని తెలుసుకొని జాగ్రత్త పడాలి. నీ పాపం నిన్ను మాత్రమే కాకుండా నిన్ను చూస్తున్న అనేకులను ప్రభావితం చేస్తుంది.
“వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?" గలతీ 2:14
పౌలు, పేతురును బహిరంగంగా గద్దించిన సందర్భం ఇక్కడ చూస్తున్నాం. పౌలు ఇలా చేయడానికి కారణం, "వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు" అని అంటున్నాడు. సువార్త సత్యం ఏమిటో పేతురుకు మరియు అక్కడ ఉన్న యూదులకు తెలుసు, దేవుడు యూదులకు మరియు అన్యులకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించాడు అనే విషయంలో వారికి సందేహం ఏమీ లేదు. యూదులకైనా అన్యులకైనా రక్షకుడు ఒక్కడే అనే విషయంలో పేతురు మరియు ఇతర అపొస్తలులు అంగీకారం తెలుపుతారు. అయితే పేతురు సువార్త సత్యానికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రవర్తించాడో ఆలోచిద్దాం.
• పేతురు అన్యజనులతో భోజనం చేసే విషయంలో వెనుక తీసినప్పుడు, రక్షణ ధర్మశాస్త్ర క్రియల మూలంగా అనే ఆలోచనను తాను సమర్థిస్తునట్టుగా కనబడుతుంది
• క్రీస్తుయెడల విశ్వాసం రక్షణకు చాలినది కాదు అని, ఆహార నియమాలలో అన్యులు కూడా యూదుల వలె ప్రవర్తించాలి అనేలా ఉంది పేతురు ప్రవర్తన
• యూదులు, అన్యజనులకంటే ఉన్నతమైనవారు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డవారు అని, క్రీస్తు వ్యత్యాసం చూపకుండా రక్షణ ఇచ్చినప్పటికీ, యూదులు మొదటి నుండి దేవునికి చెందినవారు అనే వేర్పాటును పేతురు చూపిస్తున్నాడు
• పేతురు ప్రవర్తన అన్య విశ్వాసుల పట్ల సహోదర ప్రేమరాహిత్యాన్ని చూపిస్తుంది
పేతురు యొక్క ప్రవర్తనను చూసిన పౌలు "అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా" అని అంటున్నాడు. పౌలు పేతురును ఎందుకు బహిరంగంగా ఖండించాడో మనకు తెలుసు (ఈ వివరణ కోసం 11వ వచన వ్యాఖ్యానాన్ని చదవండి). పేతురు తనకంటే ముందు నుండి క్రీస్తును ఎరిగినవాడు, యెరూషలేము పెద్దలలో ఒకడు గనుక, "పేతురును నేనేమి అననులే, అతను తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడు, నేనెందుకు తీర్పు తీర్చాలి" అని పౌలు అనుకోలేదు. అవతలివారు ఎవరైనా పౌలు మనుష్యులను సంతోషపెట్టే స్వభావం కలిగినవాడు కాదు అని ఈ మాటలు నిరూపిస్తున్నాయి. మనుష్యుల దగ్గర మంచోడు అనిపించుకోవాలంటే పౌలు మౌనంగా ఉండేవాడేమో, అయితే, దేవుని సువార్త సత్యం కోసం నిలబడ్డాడు గనుకనే పేతురును ఎదిరించాడు.
"నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా" అని పౌలు అంటున్నాడు. పేతురు ఒకప్పుడు నిష్ఠ కలిగిన యూదుడు, యూదామతాచారాలు అన్నిటినీ ఆచరించేవాడు, అయితే క్రీస్తును నమ్మిన తర్వాత, దేవుడు తనకు సీమోను ఇంటి మీద ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత (అపొ.కార్య. 10) పేతురు అన్యులతో సహవాసం చేయడం, భోజనం చేయడం (అపొ.కార్య. 11:3) ప్రారంభించాడు. ఒక యూదుడు అన్యునితో సహవాసం చేయడు, అతనితో కలిసి భోజనం చేయడం అపవిత్రమైనదిగా భావించేవాడు. కానీ పేతురు నిష్ఠ కలిగిన యూదుడిలా ప్రవర్తించట్లేదు, అదే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు.
"అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు" అనేది అసలు సమస్య. పేతురు చేసిన పని, 'నేను యూదుడను, మీరు అన్యులు' అనే వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించింది. ఆహార నియమాలు, సున్నతి, సబ్బాతు అనే యూదుల ఆచారాలు పాటిస్తేనే రక్షణ వస్తుంది అని చెప్తున్నట్టు ఉంది పేతురు ప్రవర్తన. తీతును సున్నతి చేసుకోవాలి అని చెప్పిన కపట సహోదరుల ప్రవర్తన (గలతీ 2:4), ఆహార నియమాలు పాటించాలి అనే విధంగా ఉన్న పేతురు ప్రవర్త ఒకేలాగ ఉన్నట్టు గమనించగలం. ఇది సువార్తను దాని సత్యం నుండి వేరు చేసి, వేరొక సువార్తను స్థిరపరిచేదిగా ఉంది.
పౌలు మాటలను జాగ్రత్తగా గమనించండి, పేతురు తన ప్రవర్తన ద్వారా రక్షింపబడిన అన్యజనులను యుదాచారాలు పాటించేలా "బలవంతము చేయుచున్నావు" అని నిందిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన నీ ప్రవర్తన, ఇతరులను వారి విశ్వాసంలో అస్థిరులునుగా చేసి సువార్తకు వ్యతిరేకమైన ప్రవర్తన వైపు వెళ్లే విధంగా వారిని బలవంతపెడుతుంది అని నువ్వు గ్రహించు.
“మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము" గలతీ 2:15
ఈ వచనాన్ని వ్యాఖ్యానించే ముందు ఒక విషయం ఆలోచిద్దాం. "నేను చెప్పినదేమనగా" అనే పౌలు మాటలు 14వ వచనంలో చూస్తాం. అయితే పౌలు పేతురుతో మాట్లాడింది ఆ 14వ వచనంలోని మాటలు మాత్రమేనా లేక మిగతా వచనాలు కూడా (గలతీ 2:14-21) ఆ సంభాషణలో భాగమేనా? ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, పౌలు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తన మాటలు ఎక్కడ ముగించాడో తెలియజేసే గుర్తులు ఏవీ ఇవ్వబడలేదు. ఈ విషయంలో కనీసం రెండు ఆలోచనలు ఉన్నాయి:
1) కొందరు వ్యాఖ్యానకర్తలు V14-21 వరకు ఉన్న భాగమంతా పౌలు పేతురుతో మాట్లాడిన మాటలే అని చెప్తారు. అయితే ఆ మాటలు సారాంశరూపకంగా పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అని అభిప్రాయపడతారు
2) మరి కొందరు వ్యాఖ్యానకర్తలు V14 మాత్రమే పౌలు పేతురుతో మాట్లాడిన మాటలని, V15-21 వరకు ఉన్న భాగం గలతీ సంఘానికి రాస్తున్న మాటలు అని అభిప్రాయపడతారు
నేనైతే, V14-21 వరకు ఉన్న వచనాలు పౌలు పేతురుతో మాట్లాడిన మాటలు అని నమ్ముతున్నాను. అయినప్పటికీ ఆ మాటలు సంభాషణాశైలిలో మాత్రమే కాకుండా గలతీయులకు కూడా వర్తించేలా సారాంశపద్ధతిలో పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
"మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము". ఇక్కడ "మనము" అంటే, పౌలు తన మాటలు కొనసాగిస్తున్నాడు అని అర్థమవుతుంది. పౌలు, పేతురును సంబోధిస్తూ "మనము" అని అంటున్నాడు. పౌలు ఇలా మాట్లాడడంలో ఉన్న ఉద్దేశం అన్యజనులను తక్కువ చేయడమో లేదా యూదులను కొద్దిగా గొప్ప చేసి చూపించడమో కాదు. యూదులు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, వారు వాగ్దానసంబంధులు అని చెప్పడం మాత్రమే.
"కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడినవారి చేత సున్నతిలేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి." (ఎఫెసీ 2:11,12)
పై వచనంలో చాలా స్పష్టంగా అన్యులు దేవునికి దూరస్థులు అని చూస్తున్నాం. వాగ్దాన సంబంధులైన యూదులకైనా, వాగ్దాన నిబంధనలు లేని అన్యులకైనా రక్షణ మార్గం ఒక్కటే, "మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి" అని పౌలు చెప్తున్నాడు. రక్షణకు మూలం విశ్వాసమే గాని, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కావు. ఏ మనుష్యుడూ ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలాన నీతిమంతుడు కాలేడు అని పౌలు రోమా పత్రికలో స్పష్టంగా నిరూపించాడు (రోమా 2-4).
"ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది." (రోమా 3:21-23)
"ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము". ధర్మశాస్త్ర క్రియలు ఎవరినీ రక్షించలేవు, దానిని బట్టి ఎవరూ నీతిమంతులుగా తీర్చబడలేరు, క్రీస్తునందు విశ్వాసమే రక్షణకు ఆధారం మరియు మూలం. పౌలు ఇక్కడ తాను చేస్తున్న ప్రతిపాదన యొక్క నిరూపణ 3వ అధ్యాయంలో చూస్తాం.
పౌలు పేతురుతో చెప్తున్న సారాంశం ఇదే - 'పేతురూ, మనం యూదులమే అయినప్పటికీ ధర్మశాస్త్రం వలన మనం రక్షింపబడలేదు అని, దాని ద్వారా ఎవరూ రక్షణ పొందలేరు అని నీకు తెలుసు. క్రీస్తునందు విశ్వాసం మాత్రమే ఎవర్నైనా రక్షిస్తుంది, ఆ క్రీస్తును నమ్మే మనం రక్షింపబడ్డాము.'
“ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా." గలతీ 2:16
V 15లో చెప్పిన విషయాన్ని పౌలు మళ్ళీ ఒకసారి స్పష్టంగా, అందరికీ వర్తించేలా సూటిగా చెప్తున్నాడు. పౌలైనా, పేతురైనా (యూదులైనా, అన్యులైనా) "ఏ శరీరియు" ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున నీతిమంతులు అవ్వలేరు. 'ఏ శరీరియు' అనే మాట, మనుషులందరి యొక్క పతనస్వభావాన్ని చూపిస్తుంది. పౌలు ఈ వచనాన్ని కీర్తన 143:2 నుండి తీసుకున్నాడు.
"నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు" (కీర్తన 143:2)
ఈ రెండు వచనాలు (V15, 16) గలతీ పత్రికలో చాలా ప్రాముఖ్యమైన వచనాలు. పౌలు చెప్పలనుకున్న సారాంశం మొత్తం ఈ రెండు వచనాలలోనే ఉంది.
“కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు." గలతీ 2:17
V17 నుండి 21 వరకు పౌలు, యూదులు తన మీద చేస్తున్న (లేదా విశ్వాసమూలముగానే రక్షణ, క్రియల మూలముగా కాదు) ఆరోపణలకు సమాధానం ఇస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. పౌలు V17లో , 'క్రీస్తునందు విశ్వాసమూలముగా మాత్రమే రక్షణ అయితే, ఆయన పాపానికి పరిచారకుడు ఎందుకు కాడు' అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. "కాగా" అని ఈ వచనాన్ని మొదలుపెట్టడంలో, ముందు వచానికీ, ఈ వచనానికీ ఉన్న కొనసాగింపు చూస్తున్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడకపోతే, ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి మరియు అన్యులకు ఏమీ తేడా లేదు కదా అనేది యూదుల అభియోగం.
ఇంకొద్దిగా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు యూదులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వీరు వాగ్దాన సంబంధులు, యూదులు కానివారు అందరూ దేవునికి దూరస్తులు, పాపులు, దేవునితో ఎటువంటి సంబంధం లేనివారు. క్లుప్తంగా చెప్పాలంటే అన్యులు పాపులు, యూదులు దేవుని ప్రత్యక్షత కలిగిన ప్రజలు. రక్షణ క్రీస్తునందు విశ్వాసమూలంగానే కలిగితే, ధర్మశాస్త్రం వలన రక్షణ రాదు అని యూదులు ఒప్పుకోవాల్సి వస్తుంది. దీనిని బట్టి 'యూదులైనా లేక అన్యులైనా ఎటువంటి తేడా లేదు, అందరూ పాపులే' అనే భావన కనబడుతుంది. రక్షణ విశ్వాసమూలంగానే అనే ఆలోచన, అందరూ పాపులు అనే తీర్పు ఇస్తుంది. దీనిని బట్టి దేవుని చేత ఎన్నుకోబడ్డ ప్రజలు (ఇశ్రాయేలీయులు/యూదులు) కూడా పాపులే అని ఈ సిద్ధాంతం నిర్దారిస్తుంది.
"మనము పాపులముగా కనబడినయెడల" అనే ఈ వాక్యంలో పౌలు "మనము" అనే మాటను వాడుతున్నాడు. అది పేతురును తనను కలుపుకొని మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి, ఇది యూదా క్రైస్తవులందరికీ వర్తించే మాట.
"మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా" అనే మాటను గమనించండి, ఎందుకు క్రీస్తునందు నీతిమంతులవ్వాలి అని పౌలు పేతురు మరియు ఇతర యూదా క్రైస్తవులు వెతుకుతున్నారు (ఇది వారి రక్షణకు ముందు స్థితి అని గుర్తుంచుకోవాలి). ఎందుకంటే రక్షణ ధర్మశాస్త్రం వలన రాదు క్రీస్తునందు మాత్రమే అని వారు తెలుసుకున్నారు గనుక. క్రీస్తు నందు విశ్వాసమూలముగా రక్షింపబడి ధర్మశాస్త్ర నియమాలు రక్షణకు అవసరం లేదు అని చెప్తే, రక్షింపబడినవారు పాపం చేస్తుంటే ఆ పాపానికి క్రీస్తు కారకుడా? అనేది యూదుల ప్రశ్న. ఏ మాత్రం కాదు అనేది పౌలు సమాధానం. ఎందుకంటే, "ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?" (రోమా 6:1,2). ఈ విషయాన్ని తరవాత వచనంలో పౌలు చక్కగా వివరిస్తున్నాడు.
“నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా." గలతీ 2:18
"నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల" అంటే, పౌలు ఇంతకముందు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు ఏవైతే ఆచరించాడో అవి తన జీవితంలో పడగొట్టబడినవి అని చెప్తున్నాడు. తాను పడగొట్టిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను (సున్నతి, ఆహార నియమాలు మొదలగునవి) తిరిగి తానే కడితే - అంటే ఆ క్రియలు అవసరము అని మళ్ళీ వాటిని ఆచరిస్తుంటే "నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా" అని అంటున్నాడు. ధర్మశాస్త్ర క్రియలు రక్షణకు అవసరం లేదు అని నమ్మి క్రీస్తునందు విశ్వాసముంచి అదే రక్షణ సువార్త అని ఇతరులు ప్రకటించి, తర్వాత ధర్మశాస్త్ర క్రియలు కూడా అవసరమే అని చెప్తే పౌలు ఆ విషయంలో అపరాధిగా పరిగణించబడతాడు కదా.
ఇది పేతురు చేసిన పని యొక్క పర్యవసానాన్ని చూపించడానికి పౌలు చెప్తున్న మాటలు. పేతురు యేసుక్రీస్తునందు విశ్వాసమూలముగానే రక్షణ అని నమ్మాడు, అయితే యాకోబు దగ్గర నుండి కొందరు యూదులు రాకముందు, "అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను" అని ఇంతక ముందు చూసాం. ఆ పని చేయడాన్ని బట్టి పేతురు రక్షణకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవసరం అని పరోక్షంగా చెప్పి తనను తానే అపరాధినిగా కనపరచుకొన్నాడు.
“నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని." గలతీ 2:19
V18 నుండి V21 వరకు "నేను" అనే మాటను పౌలు ప్రత్యేకంగా వాడుతున్నాడు. "నేను" అనే మాట క్రైస్తవులను సూచించే విధంగా ఉపయోగిస్తున్నాడు (ముఖ్యంగా యూదా క్రైస్తవులను సూచించే విధంగా ఉపయోగిస్తున్నాడు). తన జీవితం వ్యక్తిగతంగా ప్రత్యేకంగా తాను అనుభవించిన దేవుని కృపను బట్టి విస్మయమొందుతున్నాడు.
"నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము" దేవుని విషయమై జీవించాలి అంటే ఒకటి జరగాలి అని చెప్తున్నాడు, దాని గురించి మనం మాట్లాడే ముందు ఒక విషయం ఆలోచిద్దాం. దేవుని విషయమై జీవించాల్సిన అవసరం ఉంది. నేను దేవుని విషయంలో చనిపోయాను అని పౌలు చెప్తున్నాడు. మనందరి పరిస్థితి కూడా అదే.
"అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా" - ఎఫెసీ 2:1
"ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను" - రోమా7:11
పాపంలో ఉన్నవారు జీవించాల్సిన అవసరం ఉంది, అది ఎలా సాధ్యపడుతుంది అంటే "ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని" అని పౌలు సమాధానం ఇస్తున్నాడు. ధర్మశాస్త్ర విషయమై చావడం అంటే ఏంటి? మనం పాపంలో ఉన్నప్పుడు శరీరసంబంధమైన క్రియలు చేస్తూ మరణార్థమైన ఫలమును ఫలిస్తూ ఉండేవారం. ధర్మశాస్త్ర విషయమై చావడం అంటే, ధర్మశాస్త్ర భారం నుండి విడిపించబడడం, పాపపర్యవసానమైన దేవుని ఉగ్రత నుండి విడిపించబడడం, దేవుని ముందు మన క్రియలను బట్టి కాక తన కృపను బట్టి నిలబడడం.
ధర్మశాస్త్ర విషయమై చావవలసిన అవసరం ప్రతి పాపికీ ఉంది, అయితే "ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై" ఎలా చనిపోతాం? ఏంటి పౌలు ఉద్దేశం? కొంచెం ఆలోచిస్తే, క్రీస్తు పాపుల కోసం ఈ లోకంలో జన్మించి, ధర్మశాస్త్రం క్రింద జీవించాడు, ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞనునూ నెరవేర్చాడు. "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు" (మత్తయి 5:17) అని చెప్పాడు. పాపుల కోసం తన ప్రాణాన్ని క్రయదానంగా పెట్టి తన దగ్గరికి వచ్చినవారిని ధర్మశాస్త్ర కాడి నుండి విడిపించాడు. అది సరే గాని"ధర్మశాస్త్రమువలన" మనం ఎలా విడిపించబడ్డాం? అనే సందేహం మనకు రావచ్చు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు (రోమా 10:4) అని మనకు తెలుసు, మనం క్రీస్తు ద్వారా మరణం నుండి జీవంలోకి దాటుతున్నాం అనే విషయాన్ని, పౌలు ఇంకొక విధంగా "ధర్మశాస్త్రమువలన" అనగా "క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరచడం ద్వారా" మనం ధర్మశాస్త్ర విషయమై చనిపోయాము అని చెప్తున్నాడు.
పౌలు తన జీవితంలో దేవుని కృపను చూసాడు, దేవుడు తనలాంటి పాపిని క్షమించినందుకు తన అనర్హతను తెలియజేస్తున్నాడు, "పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునైయున్నది. అట్టివారిలో నేను ప్రధానుడను" (1 తిమోతి 1:15) అంటున్నాడు. పౌలు ధర్మశాస్త్రం క్రింద చాలా నిష్ఠగా జీవించాడు కానీ దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు, ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవరూ నీతిమంతులు అవ్వరు అని దేవుని బయలుపాటును బట్టి తెలుసుకొని, క్రీస్తు జీవించింది, మరణించింది మన విమోచన కోసమే అని గ్రహించి (క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు), దానినే తాను ఎంతో ఆసక్తితో ఇతరులకు బోధించాడు. క్రీస్తు సిలువ కార్యాన్ని బట్టి తాను ఏవిధంగా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాడో ప్రకటించాడు.
“నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. " గలతీ 2:20
ధర్మశాస్త్రం కాదు క్రీస్తే నాకు సర్వం అని పౌలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మంచిదే కానీ నన్ను బ్రతికించగల శక్తి దానికి లేదు, క్రీస్తే నన్ను జీవింపజేయగలడు. నేను క్రీస్తులో జీవించే ముందు, క్రీస్తుతో పాటు మరణించాలి.
"మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమైయుందుము." (రోమా 6:4,5).
"మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి. మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందకయుండుటవలనను, మీరు మృతులైయుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను" (కొలొస్సి 2:11-14).
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను గనుక, బాప్తిస్మము అనే సాదృశ్యం ద్వారా దానిని తెలియజేశాను గనుక, ఇకను నేను కాదు జీవిస్తుంది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను పాప స్వభావం నుండి విడిపించబడి క్రీస్తులో నూతన స్వభావాన్ని సంతరించుకున్నాను. ఇప్పుడు నేను కాదు జీవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడే నాలో జీవిస్తున్నాడు. శరీరంగా నేను జీవించినట్టు అనిపించొచ్చు గాని నన్ను నడిపిస్తుంది క్రీస్తే, తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన కృపను బట్టి నన్ను నడిపిస్తున్నాడు. రక్షించబడిన నా జీవితం ఇక మీద నాది కాదు, నేను ఆయనయందు విశ్వాసము వలన జీవించుచున్నాను. నా రక్షణ క్రీస్తునందు విశ్వాసమూలముగానే, నా నూతన జీవితం క్రీస్తునందు విశ్వాసమూలముగానే.
“నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. " గలతీ 2:21
ధర్మశాస్త్రం వలన ఎవరైనా నీతిమంతులు అవుతారు అనుకుంటే వారు దేవుని కృపను నిరర్థకం చేస్తున్నారు. దేవుడు తన కృపను బట్టి రక్షణ అని బయలుపరచడం అనవసరం, తండ్రి తన భవిష్యత్ ప్రణాళికను బట్టి తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపడం, క్రీస్తు మన కోసం తనను తాను అప్పగించుకోవడం అంతా వృథా.
పేతురు చేసిన పని ఎలా ఉంది అంటే, ధర్మశాస్త్రం ద్వారా రక్షణ వస్తుంది అనే భావాన్ని సూచిస్తుంది. రక్షణ కృప ద్వారా అయినా రావాలి లేదా ధర్మశాస్త్రం ద్వారా అయినా రావాలి ఇంకొక మార్గమేదీ లేదు. రక్షణ కృప ద్వారా మాత్రమే అని పౌలు చెప్తున్నాడు, పేతురు తన క్రియను బట్టి రక్షణకు ధర్మశాస్త్ర క్రియలు అవసరం అని చెప్పకనే చెప్తున్నాడు. పౌలు చెప్పిన ఈ భావాన్నే పేతురు విశ్వసించాడని, యూదులు వచ్చినప్పుడు భయంతోనే ఆవిధంగా ప్రవర్తించాడు గాని, నిజంగా అన్యులను, ధర్మశాస్త్ర క్రియలు పాటించమని చెప్పడం పేతురు ఉద్దేశం కాదు అని ఈ ముగింపును బట్టి మనకు అర్థమవుతుంది. లేకపోతే పౌలు, పేతురు తప్పుడు సువార్త బోధిస్తున్నాడు అని కచ్చితంగా చెప్పేవాడు. అయితే పౌలు పేతురు గురించి నిజమైన సహోదరుడుగా అనేకసార్లు ప్రస్తావించడం, పేతురు, పౌలు మన సహోదరుడు అని సంబోధించడం, పేతురు తన తప్పును తెలుసుకున్నాడని సూచిస్తుంది.
క్రైస్తవులలో ఉండవలసిన గొప్ప లక్షణాలు మనం ఇక్కడ ఈ ఇద్దరి అపొస్తలులలో చూస్తున్నాం. సువార్త విషయంలో రాజీపడకూడదు అని పౌలు మనకు నేర్పిస్తుంటే, తప్పు చేస్తే దానిని సమర్థించుకోకుండా సరిచేసుకోవాలి అని పేతురు మనకు నేర్పిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? సువార్త కోసం పోరాడుతున్నావా? తప్పు చేసినప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకోకుండా నిన్ను ఎదురుకొన్న సహోదరుల మాటలను గ్రహించి సరిచేసుకుంటున్నావా?
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
గలతీ పత్రిక 2వ అధ్యాయంపై వ్యాఖ్యానం

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"