కొత్త నిబంధన

రచయిత: పి. శ్రావణ్ కుమార్

గ్ర‌ంథపరిచయం;,1:1, 1:2, 1:3 , 1:4, 1:5 , 1:6 ,1:7 , 1:8 , 1:9 , 1:10 , 1:11, 1:12 , 1:13, 1:14, 1:15, 1:16, 1:17, 1:18, 1:19, 1:20, 1:21, 1:22, 1:23, 1:24

 

గలతి పత్రిక మొదటి అధ్యాయ పరిచయం

గలతి పత్రిక మొదటి అధ్యాయంలో నాలుగు భాగాలను మనం గమనించొచ్చు. మొదటి రెండు వచనాలు ఈ పత్రిక రచించిన రచయత ఎవరో తెలియజేస్తున్నాయి (అపొస్తలుడైన పౌలు), తన యొక్క అపొస్తలత్వపు అధికారం ఎవరి నుండి పొందుకున్నాడో తెలియజేస్తున్నాయి (యేసుక్రీస్తు వలనను, తండ్రియైన దేవునివలనను), మరియు తనతో ఉన్న సహోదరుల గురించి తెలియజేస్తున్నాయి.

గలతి 3-5 వచనాలలో పౌలు గలతి సంఘానికి శుభాలు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసం యొక్క మూలాంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు, "మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను."

గలతి 6-10 వచనాలలో పౌలు సువార్త గురించి మాట్లాడుతున్నాడు. గలతి సంఘంవారు నిజ సువార్తను విడిచి భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోవటాన్ని చూసి తన ఆశ్చర్యాన్ని వెల్లడిచేస్తున్నాడు. భిన్నమైన సువార్తను బోధించేవారు ఎవరైనా సరే వారు శాపగ్రస్తులు అని, నాశనానికి గురిచేయబడిన వారని చెప్తున్నాడు.

గలతి 11-23 వరకు ఉన్న వచనాలలో పౌలు తన గత జీవితాన్ని గురించి, ఏ విధంగా దేవునికి మరియు దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడో, ఏ విధంగా దేవుడు తనని అపొస్తలునిగా ఉండడానికి పిలిచాడో చెప్పాడు. అదేవిధంగా తాను బోధిస్తున్న సువార్త వేరే అపొస్తలుల నుండి పొందుకుంది కాదని, వారిని తాను మొదటి మూడు సంవత్త్సరాలు కలవలేదని తెలియజేసాడు (పౌలు రక్షణ పొందిన తర్వాత మూడు సంవత్త్సరాల వరకు ఏ అపొస్తలులని కలవలేదు). క్రీస్తును మరియు సంఘాన్ని హింసించిన వాడు అదే విశ్వాసాన్ని ప్రకటించడాన్ని చూసి ఎంతగానో యూదయ సంఘాల వారు దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పాడు.

వచన వ్యాఖ్యానం

“మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును." గలతి 1:1

మొదటి వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ పౌలు తన అపొస్తలత్వము మనుష్యుల వలన కలిగినది కాదు అని చెప్తున్నాడు. దీనికి ఒక కారణం ఉంది, పౌలు యొక్క అపొస్తలత్వము క్రీస్తు నుండి పొందుకుంది కాదు అని కొందరు అబద్ద బోధకులు గలతి సంఘానికి ప్రచారం చేస్తున్నారు. పౌలు అయితే తాను క్రీస్తు ద్వారా మాత్రమే అపోస్తులునిగా నియమింపబడ్డాను అని చెప్తున్నాడు. ఈ వాదనని బలపరిచే కొన్ని వాక్యభాగాలు చూద్దాము.

“అందుకు ప్రభువు నీవు (అననీయ) వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు (పౌలు) నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు " అపో.కార్య 9:15

“వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను" అపో.కార్య 13:2

ఈ రెండు వచనాలని మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము లో యేసుక్రీస్తు ప్రభువు సౌలుని తన పని నిమిత్తము ఏర్పరచుకొన్నటుగా, మరియు అపోస్తుల కార్యములు 13:2 లో పరిశుద్దాత్మ దేవుడు తన పని నిమిత్తము సౌలుని ప్రత్యేకించినట్టుగా చూడగలము. కాబట్టి పౌలు గలతి సంఘముతో అబద్ధమాడుటలేదు కానీ నిజమే చెప్తున్నాడు. మనుషుల వలన నేను అపోస్తులునిగా నియమించబడలేదు, నన్ను దేవుడే స్వయంగా అన్యజనులకు అపోస్తులునిగా ఉండుటకు పిలిచాడు అనే పౌలు మాట సత్యమైనవి.

ఇదే సత్యాన్ని పౌలు అనేకసార్లు చెప్పాడు:

“క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది" 2 తిమోతికి 1:1

మరికొన్ని వాక్యభాగాలు: I కొరింథీ 1:1, II కొరింథీ 1:1, ఎఫెసీ 1:1, కోలస్సి 1:1-2.

దేవుని చిత్తాని బట్టి పౌలు అపొస్తులుడుగా నియమింపబడ్డాడు. పౌలు తన సొంత కోరికని బట్టో, లేకపోతే ఇతరులు తనని నియమించడాన్ని బట్టో తాను అపొస్తులుడు అవ్వలేదు గాని, "దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు" అని పిలవబడ్డాడు. పౌలుకి అపొస్తులత్వము తండ్రి అయిన దేవుని చిత్తాని బట్టి, కుమారుడైన దేవుని ప్రత్యక్షతను బట్టి, పరిశుద్దాత్మ దేవుడు ప్రత్యేకపరచటాన్ని బట్టి కలిగినదే కానీ, మనుషుల వలన కలిగినది కాదు. ఈ ఒక్క వచనంతో పౌలు గలతి సంఘం వారికి తన అపొస్తులత్వపు అధికారాన్ని ప్రకటిస్తున్నాడు.

“నాతో కూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది." గలతి 1:2

ఇక్కడ పౌలు "నాతో కూడనున్న సహోదరులందరును" అని పిలిచినది తనతో పరిచర్యచేస్తున్న సహోదరులు తిమోతి, సోస్తెనేసు, మరియు సిల్వాను అయ్యుండొచ్చు లేదా తనతోపాటు ఆ సమయంలో పరిచర్య చేస్తున్న సంఘ సహోదరులు అయ్యుండొచ్చు. వీరు ఎవరైనప్పటికీ పౌలు వారిని సహోదరులు అని పిలుస్తున్నాడు, దీనిని బట్టి వారు కూడా పౌలు విశ్వసించే మరియు ప్రకటించే విశ్వాసానికి విధేయత చుపిస్తున్నవారు అని గమనించగలం. పౌలు (మరియు తనతో ఉన్న సహోదరులు) గలతి సంఘానికి శుభములు తెలియచేస్తున్నారు. దీనిని బట్టి పౌలు గలతి సంఘాన్ని ప్రేమిస్తున్నాడని, వారి మంచి లేక దేవుని ఆశీర్వాదం వారిపట్ల కోరుకుంటున్నాడు అని మనకు తెలుస్తుంది.

“తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక." గలతి 1:3

మరికొన్ని పత్రికలలో ఇలాంటి ఆశీర్వాదం: I కొరింథీ 1:3, II కొరింథీ 1:2, ఫిలిప్పి 1:2, కోలస్సి 1:2

ఈ ఆశీర్వాదం పౌలు రచించిన పత్రికలలో తరచుగా కనబడుతుంది. దేవుని నుండి మీకు కృప కలుగును గాక అనే మాటలు, రక్షణ పొందుకునే కృప గురించి మాట్లాడట్లేదు ఎందుకంటె గలతీ సంఘం వారు ఇది వరకే రక్షింపబడ్డారు. మరి ఏ కృప గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టు? ఈ మాటలు దేవుని కృపలో వారు దినదినము ఎదగడము అనే విషయాన్ని సూచిస్తుంది.

ఉదాహరణకు 2 పేతురు 3:18 లో “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి” అని పేతురు చెప్తున్నాడు. రక్షింపబడిన వారు దేవుని కృపలో దినదినం ఎదుగుతూ ఉంటారు. మనకి కృప ఉంది కదా అని మనం ఇంకా ఎక్కువగా పాపమూ చేస్తామా! లేదు. "కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?" (రోమా 6:1,2)

గలతీయులు దేవుని కృపలో ఎదుగాలి అని, వారు పాపం జోలికి పోక తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండాలని, అది దేవుని కృప మరియెక్కువగా విస్తరించడాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది అని పౌలు ఎరిగినవాడై "తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక" అని వారిని ఆశీర్వదిస్తున్నాడు. సమాధానము మనకి క్రీస్తు నుండి మాత్రమే వస్తుంది అని గలతీయులకు మరొక్కసారి పౌలు తెలియజేస్తున్నాడు. క్రీస్తు మనలను తండ్రితో సమాధాన పరిచాడు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి తన శాంతిని మనకు అనుగ్రహించాడు. ఒకవేళ క్రీస్తు మనకి ఆ సమాధానం అనుగ్రహించకుండా ఉంటే మనం ఇంకా దేవునికి శత్రువులముగా ఉండేవాళ్ళం. మీరు పొందుకున్న ఆ సమాధానము ఇంకా ఎక్కువగా మీ మీద ఉండును గాక అని పౌలు ఆశీర్వదిస్తున్నాడు.

“మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను." గలతి 1:4

ఈ వచనంలో పౌలు, క్రీస్తు యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు.

మొదటగా తండ్రి అయిన దేవుని చిత్తప్రకారము క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే మాటలను మనము అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

యోహాను 6:38 లో “నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.” అని ప్రభువు స్వయంగా చెప్తున్నాడు. అయితే తండ్రి చిత్తం ఏంటో ఒకసారి చూద్దాం, "తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు....." (రోమా 8:32). తండ్రి చిత్తం ఏంటి అంటే, పాపుల కోసం తన కుమారుని అనుగ్రహించడం.

మరి కుమారుని చిత్తం ఏంటో ఒకసారి చూద్దాం, "ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను." (యోహాను 10:18). కుమారుని చిత్తం తన ప్రాణాన్ని ఎవరి బలవంతం లేకుండా స్వచ్చందంగా, తన ఇష్టపూర్వకంగా అర్పించడమే.

రెండవదిగా, తండ్రి అయిన దేవుని చిత్తప్రకారము క్రీస్తు "తన్ను తాను అప్పగించుకున్నాడు". యేసు క్రీస్తు ఈ విధంగా చెప్పాడు, "నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను." ఇక్కడ "ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు" అనే మాటను చూస్తున్నాం. ఎందువల్ల అనే ప్రశ్నకు సమాధానం ఈ వచనంలోనే ఉంది. కుమారుడు తండ్రి అయిన దేవుని చిత్తానికి విధేయత చుపుతున్నాడు గనుక తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్నంత కాలం, యేసుక్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలోనే ఉన్నాడు. ఆ తండ్రి చిత్త ప్రకారమే, తన్ను తాను అప్పగించుకున్నాడు.

మూడవదిగా, తండ్రి అయిన దేవుని చిత్తప్రకారము క్రీస్తు "మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని.." ఎందుకు తండ్రి అటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు అంటే (కుమారుణ్ణి మరణానికి అప్పగించడం), పాపులైన మనల్ని, ఈ దుష్టకాలంలో (సాతానుని సామ్రాజ్యంలో) ఉన్న మనల్ని విడిపించడానికి అని పౌలు తెలియజేస్తున్నాడు.

అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, తండ్రి చిత్తం మరియు యేసు క్రీస్తు చిత్తం వేరుగా ఉన్నాయా? మార్కు 10:45 లో ప్రభువు మాటలను మనం గమనిస్తే “నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు” అని చెప్తున్నాడు. అదేవిధంగా, లూకా 22:43 లో, "తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను."

మరి తండ్రి చిత్తం, కుమారుని చిత్తం వేరుగా ఉందా అని మనం ఆలోచన చేద్దాం.

యేసు క్రీస్తు యొక్క చిత్తం ("Will" of Jesus Christ) గురించి అర్ధం చేసుకోవడానికి మనం ఆయన గురించి అర్ధం చేసుకోవాలి. యేసు, అన్ని విషయాలలో తన సహోదరుల వంటివాడు అయినను, ఆయన మానవుడు మాత్రమే కాదు. యేసు, నిజంగా మానవుడు (Truly Man), నిజంగా దేవుడు (Truly God). అందుకే అన్ని విషయాలలో మనలాంటి వాడు అయినా, ఏ పాపము లేని వాడు, పరిశుద్ధుడు.

యేసు మానవుడు గనుక తనకి మానవ స్వభావం ఉంది, మానవ చిత్తం ఉంది (he has a human will). యేసు దేవుడు గనుక తనకి దైవ స్వభావం ఉంది, దైవ చిత్తం ఉంది (he has a divine will). ఈ ద్వంద్వ స్వభావ చిత్తాలు కలిగి ఉండడాన్ని థియోలాజిలో "డియోతెలిటిజం" (dyothelitism) అని అంటారు. అంటే యేసు క్రీస్తులో తన స్వభావాన్ని బట్టి రెండు చిత్తాలు ఇమిడి ఉన్నాయి. అయితే యేసులో ఉన్నా ఈ రెండు చిత్తాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండవు అని మనం అర్ధం చేసుకోవాలి.

దీనిని కొంచెం వివరించి చెప్పాలి అంటే, యేసు క్రీస్తు యొక్క మానవ చిత్తం తండ్రి అధికారానికి విధేయత చూపుతూ, మనుష్యుల దయయందు మరియు దేవుని దయయందు ఎదగడానికి సహాయపడింది. అదేవిదయంగా, తనను సిలువ నుండి విడిపించగల తండ్రికి మొఱపెట్టింది కూడా మానవరీతిగానే (మానవ స్వభావం మరియు చిత్తం) అని మనం అర్ధం చేసుకోవాలి. అయితే యేసులో ఉన్న ఈ మానవ చిత్తం, తన దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. తాను సిలువ మరణం పొందాలి అని యేసుకు నిత్యత్వం నుండి తెలుసు. ఇదే విషయాన్ని ఆయన అనేకసార్లు తన శిష్యులతో చెప్పాడు, అయితే ఆ దైవ చిత్తానికి (యేసులోని దైవ చిత్తం/divine will), ఆయన యొక్క మానవ చిత్తం విధేయత చూపిందే గాని వ్యతిరేకించలేదు.

కొందరు యేసుకు ఒకే చిత్తం ఉంది, రెండు కాదు అని వాదిస్తారు. దీనినే మోనోదెలిటిజం (monothelitism) అంటారు. ఈ వాదన ప్రకారం, యేసుకు మానవ స్వభావం ఉన్నప్పటికీ, మానవ చిత్తం అనేది లేదని, దైవ చిత్తం మాత్రమే ఉందని చెప్తారు. అయితే ఇది వాక్యవిరుద్ధమైన ఆలోచన. మానవ స్వభావం ఉన్నప్పుడు మానవ చిత్తం లేకుండా ఎలా ఉంటుంది?

“దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్‌." గలతి 1:5

మన రక్షణ కార్యాన్ని బట్టి నిత్యం దేవునికి మహిమ ఆపాదించబడుతుంది. రక్షించబడిన వారు తండ్రి అయిన దేవుని ప్రేమను తెలుసుకొని, కుమారుడైన దేవుని అర్పణను గ్రహించి, పరిశుద్దాత్ముని నడిపింపుకి విధేయత చూపుతూ దేవునికి తమ బ్రతుకుద్వారా తమ మాటల ద్వారా మహిమ చెల్లిస్తారు.

“క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది." గలతి 1:6

ఈ వచనంలో అపొస్తలుడైన పౌలు ఆశ్చర్యపడుతున్నట్టుగా మనం గమనించగలం. ఇక్కడ 'ఆశ్చర్యము' అని 'Thaumazo' అనే గ్రీకు పదాన్ని అనువదించడం జరిగింది. ఇదే పదం మార్కు 6:5లో వాడబడింది 'ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను (Thaumazo)'. ఈ పదానికి అర్ధం "అధికముగా ఆశ్చర్యపడుట", లేక "విస్తుపోవుట", ఈ పదం ఇంగ్లీష్ లో marveled మరియు astonished అని అనువదించబడింది. మరి పౌలు ఇక్కడ ఏ విషయాన్ని బట్టి అంతగా ఆశ్చర్యపడుతున్నాడంటే, సువార్త నుండి గలతీయులు తిరిగిపోవుట చూడటాన్ని బట్టి అని మనము విశ్లేషించగలం. అందుకే ఈ వచనంలో 'మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా' అని పౌలు చెప్తున్నాడు.

మరి ఈ గలతీయులు దేని నుండి తిరిగిపోయారు అంటే 'మిమ్మును పిలిచినా వానిని విడిచి' అని పౌలు మాటల్లో చూస్తున్నాం. దేవుడు ఈ సంఘం వారిని తన కృపను బట్టి మరియు తన స్వకీయ సంకల్పాన్ని బట్టి పిలిచాడు (2 Tim 1:9,10) అని వాక్యము బోధిస్తుంది. అయితే ఈ సంఘం వారు 'భిన్నమైన సువార్త తట్టుకు' తిరిగిపోతున్నారు. పౌలు కొరింధీ సంఘానికి చేసిన హెచ్చరికని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం "ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే" (2 Cor 11:4). ఇదే హెచ్చరికని పౌలు తరవాత వచనాలలో ఈ సంఘానికి కూడా ఇస్తున్నాడు. అయితే ఇక్కడ 'తిరిగిపోవుట' అనే పదాన్ని 'metatithesthe' అనే గ్రీకు పదము నుండి అనువదించడం జరిగింది. ఈ పదము యొక్క అర్ధము (leaving one party and joining the other) ఒకరిని లేదా ఒక గుంపును విడిచి వెళ్ళుట. అదే పనిని ఈ సంఘం వారు చేస్తున్నారు.

గలతి సంఘం వారు నిజంగా రక్షణ పొంది ఉంటే క్రీస్తును విడిచి వేరే వైపుకు ఎలా వెళ్లారు లేక వేరే సువార్త వైపుకు ఎలా తిరుగుతారు అనే సందేహం మనకు కలగొచ్చు. 'సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు, గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు' (2 Cor 11:14,15), గనుక సాతాను మరియు వాడి అనుచరులు (అబద్ద బోధ చేస్తున్న పరిచారకులు) నిజమైన క్రైస్తవులని మోసగించాలని అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే గలతీయులను తప్పుదారి పట్టిస్తుండగా, క్రీస్తు దాసుడైన పౌలు వారిని ఖండిస్తూ గలతీయులని హెచ్చరిస్తున్నాడు.

“అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు." గలతి 1:7

‘అది మరియొక సువార్త కాదుగాని’ అని పౌలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో అపోస్తుల కార్యములు 15:1 లో మనం చూడగలం, ‘కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి’. ఈ బోధ మరియొక సువార్త కాదు, ఎందుకనగా ఈ లోకములో ఒకటే సువార్త ఉంది వేరొక సువార్త అనేది లేదు అని పౌలు చెప్తున్నాడు. అయితే ఈ యూదులు ‘క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు’ అని కూడా చెప్తున్నాడు.

గలతి సంఘంలో బోధించబడిన తప్పుడు సువార్తలానే ఈ రోజుల్లో కూడా అనేకమంది అబద్ద సువార్తను బోధిస్తున్నారు, ఉదాహరణకు: సంపద సువార్తగా (Prosperity gospel) ఈ మరియొక సువార్త పిలువబడుతుంది. క్రీస్తు మీ కష్టాలు అన్ని తీర్చేస్తాడు, మీకు అవసరమైన సిరి సంపదలు అనుగ్రహిస్తాడు, సంపద కలిగి ఉండడం దేవుని ఆశీర్వాదం, సంపద లేనివారు పాపం చేసారు గనుక దేవుడు వారిని శపిస్తున్నారు అని బోధిస్తుంటారు. అంతమాత్రమే కాకుండా అనారోగ్యం వస్తే అది దేవుని శాపమని, మన శరీరాలకు ఏ అనారోగ్యం రాకుండా ఒకవేళ వస్తే దానిని తొలగించడమే దేవుని చిత్తమని తప్పుడు బోధలు చేస్తుంటారు. ఇలాంటి వారితో జర భద్రం సుమా. దేవుడు తన ప్రజలను దీవిస్తాడు అనేది సత్యం. మన చేతి పనిని దేవుడు దీవిస్తాడు. మన అనారోగ్యాలను దేవుడు స్వస్థపరచగలడు, ఆయన చిత్తాని బట్టి ఆయన సమయాన్ని బట్టి సమస్తమును సమకూరి నమ్మిన వారి మంచి కోసమే జరిగిస్తాడు. ఇది సత్యమైనంత మాత్రాన సిరి సంపదలు, మరియు బ్రతికినంత కాలము సంపూర్ణ ఆరోగ్యము దయచేయడమే దేవుని చిత్తం అని చెప్పడం వాక్యానుసారము కాదు. ఇలాంటి సువార్తను (health wealth & prosperity gospel) అంగీకరించే వారు అంతరంగిక విషయాలను బట్టి కాక బాహ్యమైన విషయాలను బట్టి దేవుని దగ్గరకు వచ్చేవారు అని తెలుసుకోవాలి.

ఈ అంశానికి సంబంధించి మరింత ఎక్కువగా చర్చించిన ఈ వ్యాసాన్ని చదవగలరు

“మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. " గలతి 1:8

ఇక్కడ పౌలు తాను బోధిస్తున్న సువార్త యొక్క కచ్చితత్వాన్ని గలతీయులకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు అపోస్తులులకి ఇచ్చిన సువార్త కాకుండా వేరొక సువార్త లేనే లేదు. ఆ సువార్త ఇదే “ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు (రోమా 3:23)”, అందరు పాపం చేసినవారే, పాపానికి వచ్చే జీతం మరణం గనుక ప్రతి ఒక్కళ్ళు చావవలసిన స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక తన కుమారుడైన క్రీస్తు యేసుని మన పాపాలనిమిత్తము ఈ లోకానికి పంపించాడు. బైబిల్ మనకి చెప్పే విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు “దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను (పిలిప్పీ 2:6-8).” ఆయన సిలువ మరణం పొందినది పాపులమైన మన కొరకు. ఎవరైతే యేసు ప్రభువని హృదయములో నమ్మి నోటితో ఒప్పుకొంటారో వాళ్ళు రక్షింపబడతారు. ఇందుకు లేఖనం ఏమి చెబుతుందంటే “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను (యోహాను 1:12)”.

అయితే రక్షణ అనేది మన క్రియల వలన మనకు రాదు కానీ, దేవుని కృపను బట్టి యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచడం వలన మాత్రమే లభిస్తుంది. “ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు (అపో కార్య 16:31)” అని లేఖనం సెలవిస్తుంది. ఒకవేళ ఈ సువార్త కాకుండా దీనికి ఎవరైనా ఏదైనా కలిపినా తీసివేసినా వాళ్ళు శాపగ్రస్తులు అని పౌలు గలతీయులకి బోధిస్తున్నాడు. ఇక్కడ "శాపగ్రస్తుడు" అని “anathema” అనే గ్రీకు పదం అనువదించడం జరిగింది. ఆ గ్రీకు పదం యొక్క అర్ధం "నశించుటకు అప్పగించబడుట". గలతి సంఘంలో ఈ స్వచ్ఛమైన సువార్తను కలుషితం చేస్తున్న యూదులను పౌలు నశిస్తున్న వారుగా లేక నిజమైన రక్షణ లేనివారిగా పరిగణిస్తున్నారు (శపిస్తున్నాడు). అటువంటి వారి యొక్క అంతము నాశనమే లేక నిత్య నరకమే.

ఇక్కడ పౌలు సాధ్యపడని ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటంటే క్రీస్తు చేత నిజంగా సువార్త నిమిత్తము నియమించబడిన వారైనా లేక దేవుని ఎదుట ఉండే పరిశుద్ధమైన దేవదూతలైన సరే, ఇంకొక సువార్త ప్రకటిస్తే వారు కూడా శాపగ్రస్తులే అంటున్నాడు. మనకు ఒక్కసారే దేవుని చేత ఇవ్వబడిన సువార్త యొక్క కచ్చితత్వాన్ని తెలియజేయడానికి మాత్రమే ఇలా చెప్పాడు గాని ఇది నిజంగా జరగటం అసాధ్యం. ఎందుకంటే దేవుని మహిమను నిజంగా తెలుసుకొని, రక్షణ యొక్క నిజ మూలమును గ్రహించిన ఎవరైనా వేరొక సువార్త ప్రకటించరు.

“మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. " గలతి 1:9

పౌలు గలతీయలో సువార్త బోధించినప్పుడు చెప్పిన విషయాన్ని మరల గుర్తు చేస్తూ “మేమిది వరకు చెప్పిన ప్రకారము” అని అంటున్నాడు. అదేంటంటే అపొస్తలులు మరియు దేవదూతలలే కాదు, వేరొక సువార్తను ఎవరు చెప్పినా వారందరు శాపగ్రస్తులే అని నిక్కచ్చిగా చెప్తున్నాడు. గలతి సంఘంలో ఉన్న అబద్ధ బోధకులను సంఘం వారు గుర్తించి, వారు క్రీస్తు విరోధులని గమనించాలని పౌలు ఆశపడుతున్నాడు. నిజమైన క్రీస్తు సువార్తను నమ్మినవారికి లేఖనం చెప్పే విషయం ఏంటంటే “కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు” (రోమా 8:1). పౌలు గలతీయులకి చెప్పిన విషయం నేటి సంఘానికి కూడా వర్తిస్తుంది. నిజమైన సువార్త పట్ల ఆసక్తి, ప్రేమ, క్రీస్తు లో నడుచుకోవాలి అనే ఆకాంక్ష ఉన్నవారు మాత్రమే నిజమైన దేవుని పిల్లలు.

“ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును" గలతి 1:10

పౌలు తన అపొస్తలత్వన్ని మరొకసారి నిరూపించుకుంటున్నాడు. నిజమైన విశ్వాసులు దేవుని దుఃఖపరిచి మనుష్యులను సంతోషపెట్టే ప్రయత్నం చేయరు. ఇక్కడ "దయను" అనే పదాన్ని గ్రీకు "pietho" అనే పదం నుంచి అనువదించడం జరిగింది. ఈ పదం యొక్క అర్ధం "ఒకరిని సంతోషపెట్టుటటకు పొరాడుట", "ఒకరి అనుమతి పొందుట" (ఒకరి దయ సంపాదించుకొనుట). పౌలు మనుష్యులను సంతోషపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు, ఒకవేళ అలంటి ఆలోచనే ఉంటే “గలతి 1:8,9” వచనాలలో 'తప్పు సువార్త బోధిస్తున్న వారిని శపించే వాడు కాదు'. దేవుని సంతోషపెట్టాలి అనే ఉద్దేశం ఉన్నవాడు గనుకనే సువార్తను వక్రీకరిస్తే శపించాడు. ఈ వచనంలో ఎవరిని పౌలు "మనుష్యులు" అని సంబోధిస్తున్నాడో మనం అర్ధం చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న అందరి మనుష్యుల గురించి పౌలు ఇక్కడ మాట్లాడట్లేదు. యూదా మతాచారాలు పాటిస్తూ, ధర్మశాస్త్రం రక్షణ కలిగిస్తుంది అని నమ్ముతున్న యూదా మత నాయకుల గురించి మాట్లాడుతున్నాడు. వారినే మనుష్యులు అని సంబోధిస్తున్నాడు. అంతే కానీ నేను ఏ మనిషి సంతోషపెట్టకూడదు అనే ఒక సిద్ధాంతం పౌలు నేర్పించట్లేదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని సంతోషపెట్టడానికి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టె సందర్భంలో ఈ మాటలను అర్ధం చేసుకోవాలి.

ఇతర ఉదాహరణలు

"అందుకు పేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;" అపో కార్య 4:19-20.

యుదులు పేతురును, యోహానును సువార్త ప్రకటించొద్దని (యేసు గురించి బోధించవద్దని) హెచ్చరించారు. అయితే ఈ అపొస్తలులు మనుష్యుల మాట వినుటకంటె దేవుని మాట వినుట శ్రేష్ఠము అని సమాధానం చెప్పారు. అయితే మనుష్యుల మాట వినాలా వద్దా అన్న ప్రశ్నకు, ఆ మాటలు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా అని చూడాలి, అలా లేనంత వరకు మనం మన అధికారుల మాట, మన తల్లిదండ్రుల మాట, మన ఉపాధ్యాయుల మాట, క్రీస్తు సంఘములో ఉన్న బోధకుల మాట వినాలి. ఒక వేళా వీరు (ఎవరైనప్పటికీ) చెప్తున్నా మాట గాని, లేక చేయమంటున్న పనిగాని దేవుని వాక్యానికి విరుద్దమైతే వారి మాట వినటం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం.

దానియేలుని మరియు అతని స్నేహితులని బబులోను రాజు తీసుకొనిపోయి వారి భాషను (కల్దీయుల భాషకు మార్చి), వారి విద్యను, వారి భోజన పదార్ధములను మార్చేప్రయత్నం చేసాడు. అయితే భాషను, మరియు విద్యను మార్చుకోవడం విషయంలో, బబులోను రాజు మాట వినడానికి దానియేలు, అతని స్నేహితులు వెనుకాడలేదు. కానీ వారు ఏ భోజన పదార్ధాలను తినకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ భోజన పదార్ధాలను (విగ్రహాలకు బలిగా అర్పించిన ఆహారమును) తమకు ఇచ్చినప్పుడు మాత్రం, మాకు ఈ భోజనము కాకుండా "శాకధాన్యాదులను" ఇప్పించమని కోరారు. దేవుని వాక్యానికి ఏ విషయాలు విరుద్ధమో అవి రాజు చెప్పినా సరే దానియేలు మరియు అతని స్నేహితులు వినలేదు.

“సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను." గలతి 1:11

పౌలు ఎందుకు మనుష్యులను సంతోషపెట్టడం లేదో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే, పౌలు యొక్క సువార్త మనుష్యుని ఆలోచననుండి పుట్టింది కాదు. పౌలు తాను ప్రకటిస్తున్న సువార్త దేవుని సువార్త అని, ఈ సువార్తను తాను ప్రకటిస్తున్న విధంగా ప్రకటించడమే దేవుని సంతోషపెట్టడమని చెప్తున్నాడు. ఈ సువార్తను మార్చినా, దీనికి ఏదైనా కలిపినా వారు దేవునిని కాక మనుష్యులను సంతోషపెట్టేవారు అని గ్రహించాలి.

పౌలు ఎందుకు "నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని" గలతి సంఘం వారికి ప్రకటించాల్సి వచ్చిందో ఆలోచిస్తే; ఎవరైతే గలతి సంఘానికి వచ్చి పౌలు ప్రకటించిన సువార్తను చెరుపుతున్నారో వారు పౌలు మీద లేని పోనీ అబాండాలు వేస్తున్నారు. పౌలు ప్రకటిస్తున్న సువార్త మనుష్యుని యోచన ప్రకరమైనదని చెప్తున్నారు. అందుకే పౌలు చాల స్పష్టంగా తన సువార్త మనుష్యుల సువార్త కాదని చెప్పాడు.

“మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది." గలతి 1:12

గలతి 1:10-12 వచనాలలో, యూదా మతాచారాలు ప్రకటిస్తున్నవారు పౌలు మీద చేస్తున్న అభియోగాలకు పౌలు ఉత్తరమిస్తూన్నాడు. అవేవనగా

1. పౌలు మనుష్యులను సంతోషపెట్టేవాడు

2. పౌలు ప్రకటిస్తున్న సువార్త మనుష్యుల ఆలోచనల నుండి పుట్టినది

3. పౌలు ఈ సువార్తను ఇతర మనుష్యుల నుండి నేర్చుకున్నాడు

మొదటి రెండు అభియోగాలకు పౌలు 10,11 వ వచనాలలో సమాధానం ఇచ్చాడు. ఇక ఈ మూడో విషయం గురించి ఇక్కడ చెప్తున్నాడు. తాను ప్రకటిస్తున్న సువార్త ఏ మనుస్యుని నుండి నేర్చికున్నది కాదని, అది యేసు క్రీస్తు స్వయంగా బయలుపరచడం ద్వారానే తనకి తెలిసిందని చాలా కచ్చితంగా చెప్తున్నాడు.

1 కొరింథీ 15:3 లో "నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని" అని పౌలే చెప్తున్నాడు. పౌలు తనకి ఇవ్వబడిన సువార్త గ్రహింపు ఏ మనుష్యుని ద్వారా జరగలేదని, తాను అపొస్తలులునిగా పిలువబడింది ఏ మనుస్యుని ద్వారా కాదని చెప్తున్నాడు. అంతే గాని యేసు క్రీస్తు జీవితం అతని బోధలలో వేటిని ఇతరుల నుండి నేర్చుకోలేదు అని చెప్పట్లేదు.

థామస్ ఆర్. శ్చయేన్నర్ (Thomas R. Schreiner) ఈ విషయాన్ని ఈ విధంగా వ్యాఖ్యానించారు, "పౌలు యొక్క సువార్త స్వతంత్రత, అతను ఇతర అపొస్తలుల నుండి ఏమీ నేర్చుకోలేదని లేదా యేసు సంప్రదాయాలు ఏవీ అతనికి ఇతరులచే తెలియజేయబడలేదనే నిర్ధారణకు దారితీయదు. అటువంటి ప్రాతిపదిక పౌలు ఇక్కడ చెప్తున్న అంశం కాదు. సువార్త యొక్క ప్రాథమిక సత్యాలు మరియు అన్యజనులకు అపొస్తలునిగా అతని పిలుపు దమస్కు రహదారిపై జరిగిందని అతను నొక్కి చెప్పాడు."

మరి ఈ సువార్త గ్రహింపు పౌలుకి ఎలా వచ్చింది అంటే "యేసుక్రీస్తు బయలుపరచుటవలననే" అని చెప్తున్నాడు. పౌలుకి యేసు గురించిన విషయాలు తాను సంఘాన్ని హింసిస్తున్న సమయం నుండి తెలుసు, అయితే యేసు మెస్సయ్యా అని పౌలు నమ్మలేదు. ఈ గ్రహింపు, అనగా యేసే లోక రక్షకుడని, యేసు ధర్మశాస్త్ర నెరవేర్పని, పౌలుకి ఈ ప్రత్యక్షత లో తెలిసింది.

“పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు" గలతి 1:13

ఇప్పటివరకు పౌలు తన అపొస్తలత్వన్ని, తనకియ్యబడిన సువార్తను గురించి చెప్తూ వచ్చాడు. ఇప్పుడు తన గత చరిత్ర గురించి, తన స్వభావం గురించి, దేవుని కృప గురించి చెప్పబోతున్నాడు. ఎందుకు పౌలు ఇక్కడ తన గురించి ఇంత వివరంగా చెప్తున్నాడు అంటే, పౌలు గురించి తన వ్యక్తిత్వం/స్వభావం గురించి కొంత మంది (యూదా మతస్థులు కావచ్చు) బహుశా తప్పుగా ప్రచారం చేస్తుండొచ్చు. పౌలు సంఘాన్ని హింసించే వాడని, తన మాటలు నమ్మసత్యం కావని చెప్తున్నారేమో. అందుకే పౌలు తన గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నాడు, తాను చెప్తున్న మాటలు అన్ని సత్యమైనవని, తాను అబద్ధమాడే వాడు కాదని 20వ వచనంలో చెప్తున్నాడు.

పౌలు తార్సు అనే పట్టణంలో పుట్టాడు. అతను బెన్యామీను గోత్రమువాడు, ఎనిమిదవదినమున సున్నతి పొందాడు (ఫిలిప్పీ 3:5). గమలీయేలు అనే గురువు దగ్గర ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షణ పొందాడు (అపొ. కార్య 22:3). ధర్మశాస్త్రం విష్యయంలో పరిసయ్యుడిగా, అనింద్యుడిగా పేరు పొందాడు (ఫిలిప్పీ 3:5). అయితే ధర్మశాస్త్ర భక్తిలో ఇంత నిష్ఠగా ఉన్న పౌలు, యేసు మెస్సయ్య కాదని, క్రైస్తవ్యం ఒక దైవదూషణ అని భావించి, దానిని సమూల నాశనం చెయ్యడానికి పూనుకున్నాడు.

అందుకే తన గురించి తాను అనేకసార్లు, "పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను" (1 తిమోతి 1:12); "దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను" (1 కొరింథీ 15:9) అని చెప్పుకున్నాడు.

పౌలు "దేవుని సంఘమును" హింసిస్తున్నాను అని చెప్తున్నాడు. తాను చేసిన తిరుగుబాటు ఎదో ఒక స్థానిక సంఘం అన్నట్టు పౌలు భావించలేదు, అయితే దేవుని ప్రజలందరి మీద కోపంతో దేవుని సార్వత్రిక సంఘాన్ని హింసించానని భావించాడు. పౌలు యెరూషలేములోని దేవుని ప్రజలను బందించి చెరసాలలో వేయించడం మాత్రమే కాకుండా, యెరూషలేము నుండి ఇతర ప్రాంతాలకు పారిపోయిన వాళ్ళను సహితము వెతికి బందించాలని నాశనం చెయ్యాలనే ఆశతో "ప్రధాన యాజకుడును పెద్దల యొద్ద, పత్రికలు తీసికొని" (అపొ. కార్య 22:5), దమస్కుమార్గంలో ప్రయాణించాడు. అదే సమయంలో యేసు క్రీస్తు ప్రత్యెక్షతను పొందుకున్నాడు.

“నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి." గలతి 1:14

పౌలు ఎందుకు దేవుని సంఘాన్ని హింసిస్తూ నాశనం చేస్తున్నాడో ఇక్కడ కారణం చెప్తున్నాడు. "నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై", ఈ కారణాన్ని బట్టి పౌలు దేవుని ప్రజల మీద కోపంతో విరుచుకుపడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువు మత్తయ్య 23 లో, "అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా" అని వారి వేషధారణని వర్ణించాడు. అయితే పౌలు ఇలాంటి వేషధారమైన పరిసయ్యుడు కాడు. యూదా మతంలో అనేకులకంటే ఎక్కువ నిష్ఠగా తన మతాచారాలని పాటించాడు. అందుకే అగ్రిప్పరాజు ముందు పౌలు మాట్లాడినప్పుడు ఈ విధంగా చెప్పాడు:

"మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు. వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు." అపొ. కార్య 26:4,5

అయితే పౌలు యొక్క విశేషాసక్తి "యూదుల మతములో" అని తానె చెప్తున్నాడు. యూదా మతాచారాలన్నీ దేవుడు పాత నిబంధనలో బయలుపరిచిన సత్యాలతో సరితూగినవి కావు. యేసు క్రీస్తు సమయంలో ఉన్న అనేక యూదా ఆచారాలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పౌలు ఈ ఆచారాలు గురించి మాట్లాడుతున్నాడు. తాను పాటిస్తున్న యూదా మతాచారాలే సరైనవాని, వాటిలో నిష్ఠాకలిగి ఉండడమే దేవుని సంతోషపెట్టడమని పౌలు భావించాడు. అందుకే క్రైస్తవ సంఘం మీద తన దాడిని ప్రారంభించాడు.

ఇశ్రాయేలీయులలో జరిగిన ఒక దారుణమైన విషయానికి ఫీనెహాసు స్పందించినట్టు (ఫీనెహాసు, ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీ తో వ్యభిచారం చేయబోతుంటే వారిద్దరిని యీటెతో పొడిచి చంపాడు - సంఖ్యా 25:6-8), లేకపోతే ఏలీయా బయలు ప్రవక్తల విషయంలో స్పందించి వారిని చంపినట్టు (1 రాజులు 19:10, 14), పౌలు కూడా క్రైస్తవులను హింసించడం, చెరసాలలో వేయించడం, చంపడం నిష్ట గలిగిన దైవభక్తి అని భావించాడు.

“అయినను తల్లిగర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని" గలతి 1:15

దేవుని యొక్క కృప ఎంత విశిష్టమైనదో ఇక్కడ పౌలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని సంఘాన్ని హింసిస్తూ, తనకు వెతిరేకంగా చెలరేగుతున్న పౌలును దేవుడు పిలిచి, హృదయం మర్చి, క్షమించి తన కోసం నిలబడేలా చేసుకున్నాడు. పౌలు జీవితంలో జరిగినట్టే మన జీవితంలో కూడా దేవుని కృప మన కఠిన హృదయాలను ఎలా మార్చిందో మనం గ్రహించగలం. మన పాప స్వభావం నుండి పరిశుద్ధ స్వభావం కలిగి ఉండేలా దేవుడు మనల్ని మార్చాడు.

దేవుని వెతుకుంటూ మనుషులు వెళ్లరని, దేవుడే తాను ప్రేమించే వారిని వెతుకుంటూ వస్తాడని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. దేవుడు కృప చూపకపోతే, అందరు నిత్యనాశనానికి గురి కావలసిన వారే. మంచి వారు ఎవ్వరు లేరు. దేవుని వెతికేవారు ఎవరు లేరు. అందుకే యోహాను భక్తుడు ఇలా చెప్తున్నాడు, "ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము." (1 యోహాను 4:19)

అయితే పౌలు ఇక్కడ చెప్తుంది, సాధారణంగా అందరి జీవితంలో దేవుడు కలుగజేసుకొని తీసుకొచ్చే మార్పు గురించి కాదు. తాను ప్రత్యేకమైన పిలుపు దేవుని నుండి పొందాడని చెప్తున్నాడు. యెషయా మరియు యిర్మీయాను దేవుడు ఎలా ప్రత్యేకపరచుకున్నాడో అదేవిధంగా పౌలును కూడా ప్రత్యేకపరచుకున్నాడు.

దేవుడు తనని ప్రత్యేకపర్చుకున్న విషయాన్నీ యెషయా ఈ విధంగా చెప్పాడు, " గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను." (యెషయా 49:1). యిర్మీయా గురించి దేవుడు ఈ విధంగా చెప్పాడు, "గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని." (యిర్మీయా 1:5). యెషయాని మరియు యిర్మీయాని ప్రవక్తలుగా పిలిచిన దేవుడు పౌలుని కూడా అన్యజనులకు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచాడు.

యేసుని గురించిన వార్తని అన్యజనులకు తెలియజేయడానికి, జగత్తు పునాది వేసినది మొదలుకొని మర్మముగా ఉన్న దేవుని చిత్తాన్ని (అన్యజనులకు కూడా యూదులవలె రక్షణ ఉంది) ప్రకటించడానికి, క్రీస్తు మహిమ కొరకు శ్రమపొందడానికి, విశ్వాసులను బలపరచడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం పౌలు.

“ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు." గలతి 1:16

యేసు క్రీస్తు ప్రత్యేక్షమై తనని పిలిచిన తర్వాత, పౌలు ఆ ప్రత్యక్షతను నిర్ధారించడానికి ఏ మనుష్యుని సంప్రతింపలేదు. తనకు కలిగిన ప్రత్యెక్షత యొక్క కచ్చితత్వాన్ని ఇతరులను సంప్రదించి నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు అని పౌలు భావించాడు. పౌలు యొక్క అపొస్తలత్వన్ని ప్రశ్నిస్తున్న వారికి చాలా సూటిగా ఈ మాటలు చెప్తున్నాడు. తన అపొస్తలత్వం మనుష్యుల నుండి నిర్ధారించుకుంది కాదు అని చెప్తున్నాడు.

“నాకంటె ముందుగా అపొస్తలులైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని;పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని." గలతి 1:17

పౌలు ఇంతక ముందు వచనంలో చెప్పినట్టే, ఇక్కడ కూడా తాను రక్షణ పొందుకున్న మొదటి మూడు సంవత్త్సరాలు ఎవరిని కలవలేదని, తన సువార్త, అపొస్తలత్వపు పరిచర్య ఎవరిని నుండి పొందుకోలేదు/నిర్ధారించుకోలేదు అని చెప్తున్నాడు. తాను బోధిస్తున్న సువార్త నిజంగా క్రీస్తు నుండి పొందుకున్నాడు అని రుజువు పరచడానికి, తన చరిత్రను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. పౌలు దమస్కు మార్గంలో రక్షణ పొందాడు (అనన్య అనే ప్రవక్త ప్రార్ధన చేయడం ద్వారా పౌలు కన్నులు తెరువబడ్డాయి, తర్వాత బాప్తిసం పొందాడు). అదే ప్రాంతంలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు.

"అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్ల నన్ను పంపి యున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను. వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను." అపొ.కార్య 9:17-20

దమస్కు పట్టణంలో కొంత కాలం క్రీస్తును ప్రకటించిన తర్వాత, తాను "అరేబియా దేశములోనికి వెళ్లితిని" అని చెప్తున్నాడు. నిజానికి మారుమనస్సు పొందిన తర్వాత, క్రీస్తును ప్రకటిస్తున్న పౌలు యెరూషలేముకు వెళ్లి అపొస్తలులును కలిస్తే అర్ధవంతంగా ఉండేది అని మనం అనుకోవచ్చు. అయితే దేవుని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. క్రైస్తవుడిగా మారిన పౌలు, యెరూషలేముకు వెళ్లి అపొస్తలులును కలిస్తే, తన అపొస్తలత్వం, పరిచర్య అధికారం వారినుండి పొందుకున్నాడు అని అనిపించే అవకాశం ఉంది, వారిచేత పంపబడ్డాడు గనుక అపొస్తలుల కంటే పౌలు కొంచెం తక్కువ వాడు అని ఆరోపించే అవకాశం కూడా ఉంది. బహుశా అందుకేనేమో దేవుడు, పౌలును యెరూషలేముకు వెళ్లకుండా, అపొస్తలులును కలవకుండా కొంతకాలం ఆపాడు.

"అరేబియా దేశము" అనే ప్రాంతం గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ ప్రాంతాన్నే, "కింగ్డమ్ అఫ్ నాబాటియా" (kingdom of Nabatea) అని అంటారు, తర్వాత దీని పేరు "అరేబియా పేట్రే" (Arabia Petrea) అని మార్చబడింది (రోమీయులు 100 AD లో ఈ ప్రాంతాన్ని స్వాధీనపర్చుకున్న తర్వాత ఈ పేరు పెట్టారు). Ben Witherington III, అనే న్యూ టెస్టమెంట్ స్కాలర్, నాబాటియా అనే ప్రాంతం పౌలు జీవిస్తున్న సమయంలో రోమా ప్రభుత్వ నియంత్రణలో లేదు అని, పౌలు బహుశా పెట్రా (నాబాటియా ప్రాంతంలో ఒక పట్టణం) అనే ప్రాంతంలో నివసించాడు అని అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు పెట్రా అనే ప్రాంతంలో ఎదోమీయులు నివసించేవారు (దేవుడు వారి పాపాలను బట్టి వారిని తమ నివాసం ప్రదేశం నుండి తరిమేస్తానని ఓబద్యా గ్రంధంలో చెప్పాడు - దీని గురించి మరింత వివరణ కోసం ఈ వ్యాఖ్యానాన్ని చదవండి), తర్వాత నాబాటియన్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని దానిని వారి రాజధానిగా చేసుకున్నారు.

పౌలు అరేబియాలో దేవునితో ఏకాంత సమయం గడపడానికి వెళ్ళాడు, దేవుని నుండి అక్కడ నేర్చుకున్నాడు, అక్కడ మూడు సంవత్త్సరాలు గడిపాడు అని కొంతమంది బైబిల్ స్కాలర్స్ (Bible Scholars) అభిప్రాయపడతారు. అయితే సువార్త ప్రకటించడానికి దేవుని చేత పిలువబడిన పౌలు, అరేబియా ప్రాంతంలో కూడా సువార్త ప్రకటనే చేసాడు అని ఇంకొందరు బైబిల్ స్కాలర్స్ (Bible Scholars) చెప్తారు. పౌలు అరేబియాలో చేసిన సువార్త పరిచర్య కారణంగానే, ఆ దేశ రాజుక్రింద ఉన్న అధిపతి, పౌలును పట్టుకోవాలని ప్రయత్నించాడు.

"దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని." 2 కొరింథీ 11:32,33

పౌలు అరేబియా నుండి దమస్కుకి వచ్చిన తర్వాత ("పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని" అని పౌలు ఈ వచనం లో చెప్పాడు) తాను ప్రకటిస్తున్న సువార్త కారణంగా కొందరు "యూదులు అతనిని చంపనాలోచింపగా" (అపొ.కార్య 9:23), "అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి." (అపొ.కార్య 9:25). దీని బట్టి, అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతిని, పౌలును పట్టుకోవాల్సిందిగా యూదులే బలవంతం చేసుంటారు అని గ్రహించొచ్చు. అదే విధంగా నాబాటియుల మతానికి వెతిరేకమైన ఒక మతాన్ని ప్రకటిస్తున్నాడు అని కూడా ఆరోపించి ఉండొచ్చు.

ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పౌలు యొక్క సువార్త గాని, తన అపొస్తలత్వపు అధికారం గాని ఎవరి నుండి పొందుకోలేదు (ఇతర అపొస్తలుల నుండి కూడా పొందుకోలేదు). దానికి రుజువుగా పౌలు తన పరిచర్య ప్రారంభ సమయంలో జరిగిన విషయాలను ప్రస్తావించాడు.

“అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని." గలతి 1:18

ఈ వచనంలో పౌలు, తాను కలిసిన అపొస్తలుల గురించి చెప్తున్నాడు. పౌలు మారుమనస్సు పొందిన తర్వాత, మూడు సంవత్త్సరాల వరకు ఏ అపొస్తలుడని కలవలేదు. "మూడు సంవత్సరములైన తరువాతనే" పౌలు అపొస్తలుడైన పేతురును కలిసాడు. పేతురును "కేఫా" అని పౌలు అనేక సందర్భాలలో సంబోధించడం మనం గమనించగలం (1 కొరింథీ 1:11, 1 కొరింథీ 3:22, 1 కొరింథీ 15:5). "పేతురు" అనే పేరు "పెట్రోస్" అనే గ్రీకు పదం నుండి వచ్చింది. పెట్రోస్ అనగా రాయి అని అర్ధం. అదేవిధంగా ఆరామిక్ భాషలో "కేఫా" అంటే రాయి అని అర్ధం. అందుకే యేసుప్రభువు పేతురుతో, "నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము (యోహాను 1:42).

పౌలు పేతురును మూడు సంవత్త్సరాల తర్వాత కలిసినప్పటికి, కేవలము "పదునయిదు దినములు" మాత్రమే గడిపాడు. దీనిబట్టి పేతురు నుండి సువార్తను నేర్చుకోలేదు అని పౌలు ఖండితంగా రుజువు చేస్తున్నాడు.

ఫ్ ఫ్ బ్రూస్ (F.F. Bruce) అనే బైబిల్ పండితుడు ఈ విధంగా చెప్పాడు, "పౌలు తాను మారు మనస్సు పొందిన తర్వాత నుండి తన మొదటి యెరూషలేము ప్రయాణం మధ్య ఉన్న వ్యవధిని నొక్కి చెప్తున్నాడు. ఈ వ్యవధిలో (3 సంవత్త్సరాలు, paraphrase added) పౌలు యెరూషలేము నాయకుల నుండి (అనగా అపొస్తలుల నుండి) తన పరిచర్యకు సంబంధించి ఎటువంటి అధికారాన్ని గాని గుర్తింపును గాని పొందుకోకుండానే తన పరిచర్యను ప్రారంభించాను అని సూచిస్తున్నాడు."

అయితే పౌలు, పేతురు నుండి యేసును గురించిన అనేకమైన చారిత్రిక విషయాలు తెలుసుకునట్టు, పౌలు మాటల్లోనే మనం చూస్తాం. ఉదాహరణకు, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత "కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను" (1 కొరింథీ 15:5); "అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను." (1 కొరింథీ 15:6) అని పౌలు తన పత్రికల్లో రాసిన ఈ విషయాలు పేతురు నుండి తెలుకొన్నవే అని బైబిల్ పండితులు అభిప్రాయపడతారు.

అయితే, పేతురు నుండి తెలుసుకున్న విషయాలు ఏవి అపొస్తలుడైన పౌలు సువార్తను మార్చలేదు. మరో విధంగా చెప్పాలంటే, పౌలు పేతురు నుండి సువార్తను నేర్చుకోలేదు, మరెవరి నుండి సువార్తను నేర్చుకోలేదు (యేసు క్రీస్తు ప్రభువే పౌలుకు ఆ సువార్తను బయలుపరిచాడు).

రిచర్డ్ లొంగేనెక్కెర్ (Richard Longenecker), అనే బైబిల్ పండితుడు (he is a new testament bible scholar) పౌలు మరియు పేతురు గడిపిన పదిహేను రోజుల గురించి ఇలా వ్యాఖ్యానించారు, "ఖచ్చితంగా వారి పదిహేను రోజులు "వాతావరణం గురించి మాట్లాడటానికి" గడపలేదు. వారు నిస్సందేహంగా, క్రీస్తు పట్ల వారి ఉమ్మడి నిబద్ధతకు సంబంధించిన విషయాలను చర్చించారు. అలాంటి చర్చలో యేసు పరిచర్యకు సంబందించిన పేతురు వృత్తాంతాలు ఉన్నాయని మరియు అలాంటి వృత్తాంతాల నుండి పౌలు చాలా నేర్చుకున్నాడని నమ్మడం సహేతుకమైన సంభావ్యత పరిధికి మించినది కాదు. కానీ పేతురు నుండి యేసు గురించిన భూసంబంధమైన జీవిత వివరాలను తెలుసుకోవడం మరియు పౌలు తన అపొస్తలత్వం మరియు అనజనుల పరిచర్య కోసం పేతురు మీద ఆధారపడడం అనే ఈ రెండు, భిన్నమైన విషయాలు. పౌలు ఈ రెంటిలో మొదటి విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ రెండోదాన్ని దృడంగా తిరస్కరిస్తున్నాడు."

“అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని." గలతి 1:19

పేతురును చూసాను అని చెప్పిన పౌలు, "ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును" కూడా చూసాను అని చెప్తున్నాడు. ఈ సంఘటన, అపొ.కార్య 9:26,27 లో ప్రస్తావించబడినదే అని అర్ధం చేసుకోవచ్చు.

"అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను." అపొ.కార్య 9:26,27

అయితే అపొస్తలుల కార్యములు పత్రిక లో పౌలు అనేక అపొస్తలులను కలిసాడు అని చెప్తున్నట్టు చూస్తున్నాం, మరి పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా, "పేతురు" మరియు "యాకోబును" మాత్రమే చూసాను అని చెప్తున్నాడు. దీనిని బట్టి ఇదేదో ఒక వైరుధ్యమని నిర్ధారించకూడదు. పౌలు కచ్చితంగా చెప్తున్న మాటలనే ఆధారంగా తీసుకొని, ఆ వెలుగులో లూకా మాటలను వ్యక్యనించాలి. నిజానికి లూకా మాటలు, పౌలు చెప్తున్నా మాటలకు వైరుధ్యంగా ఏమి లేవు, ఇది ఎలానో ఆలోచన చేద్దాం. నేను ఇద్దరు అపొస్తలులనే కలిసాను అని పౌలు చెప్పి, లేదు పౌలు పండ్రెండు మంది అపొస్తలులను కలిసాడు అని లూకా చెప్తే అది వైరుద్యమవుతుంది, అయితే లూకా ఆలా చెప్పట్లేదు, "బర్నబా అతనిని (పౌలును) దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చాడు" అని మాత్రమే చెప్తున్నాడు. ఈ అపొస్తలులు, పేతురు మరియు యాకోబు మాత్రమే అని పౌలు నిర్ధారిస్తున్నాడు.

అయితే ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది

1. పౌలు, యాకోబును అపొస్తలులలో ఒకడిగా పరిగణిస్తున్నాడా?

2. యాకోబు ప్రభువుకు ఏ విధంగా సహోదరుడు

ఖచ్చింతంగా పౌలు యాకోబును అపొస్తలులలో ఒకడిగా పరిగణించాడు. యాకోబు పండ్రెండు మంది అపొస్తలులలో ఒకడు కాకపోవచ్చు, అయితే పౌలు ఎలా అపొస్తలుడో, యాకోబు కూడా అలానే అపొస్తలుడు. పౌలు యేసు క్రీస్తు పునరుద్ధాన ప్రత్యెక్షతల గురించి మాట్లాడుతూ, "ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను" (1 కొరింథీ 15:5), అని చెప్పాడు. అంటే కేఫాకు (అనగా పేతురుకు) యేసు ప్రత్యేకంగా కనబడ్డాడు అని చెప్తున్నాడు, అదే విధంగా, "తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కనబడెను" (1 కొరింథీ 15:7). అంటే పేతురుకు కనబడిన యేసు, అపొస్తలులకు కనబడిన యేసు, యాకోబుకు కూడా కనబడ్డాడు. అంత మాత్రమే కాకుండా, యాకోబు యెరూషలేము సంఘానికి పెద్దగా వ్యవహరించే స్థితిలో ఉన్నాడు. పౌలు, యాకోబును యెరూషలేము సంఘానికి ఒక ముఖ్యమైన స్తంభము అంటున్నాడు, "స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను" (గలతీ 2:9), అదే విధంగా అన్యజనులు ధర్మశాస్త్రాన్ని పాటించాలా? అనే విషయాన్ని నిర్ధారించడానికి జరిగిన యెరూషలేము కూటమిలో, యాకోబు ఒక అధికార పాత్రను పోషించాడు (అపొ. కార్య 15:13). వీటిని బట్టి యాకోబు పండ్రెండు మందిలో ఒకడు కాకపోయినప్పటికి తాను కూడా అపొస్తలుడే అని నిర్ధారించొచ్చు.

యాకోబు ప్రభువుకు సొంత సహోదరుడా కాదా అనే విషయం మీద కనీసం మూడు ఆలోచనలు ఉన్నాయి. వీటినే ఈ క్రింది విధంగా సంబోధిస్తారు

a. ఎపిఫనీయన్ (Epiphanian)

b. హెల్విడియన్ (Helvidian)

c. హిరానీమియాన్ (Hieronymian)

ఎపిఫనీయన్ దృక్పథం ప్రకారం. యోసేపుకు మరియ కంటే ముందు వేరొక వివాహమైంది అని, యాకోబు ఆ మొదటి భార్య కుమారుడని వాదిస్తారు.

హెల్విడియన్ దృక్పథం ప్రకారం, యాకోబు, యోసేపుకు మరియు మరియకు పుట్టిన కుమారుడు (యేసు తర్వాత యోసేపుకు మరియు మరియకు కలిగిన సంతానం). రెండొవ శతాబ్దానికి చెందిన టెర్టులియాన్ (Tertulian) ఈ దృక్పధాన్ని ఆమోదించాడు.

హిరానీమియాన్ దృక్పథం ప్రకారం. యాకోబు, యోసేపుకు మరియకు పుట్టిన కుమారుడు కాదు. యోహాను 19:25 లో "క్లోపా భార్యయైన మరియయు" అన్న వచనాన్ని తీసుకొని, యాకోబు క్లోపా మరియు మరియకు పుట్టిన వాడు అని చెప్తారు.

వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు, యాకోబు, యేసు తర్వాత యోసేపుకు మరియకు పుట్టిన కుమారుడే అని నిర్దారించొచ్చు (యేసు కన్య మరియకు జన్మించాడు). ఏదేమైనప్పటికి, పేతురును మరియు యాకోబును ప్రస్తావించడంతో పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం తాను రక్షింబడిన తర్వాత ఏ అపొస్తలుడుని కలవలేదని, ఏ మనుష్యుని నుండి తన అపొస్తలత్వపు అధికారాన్ని పొందలేదని, తాను ప్రకటించే సువార్త క్రీస్తు ప్రభువు ప్రత్యెక్షత వలెనే కలిగింది అని రుజువు చెయ్యడానికే.

“నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు." గలతి 1:20

రిచర్డ్ లొంగేనెక్కెర్ (Richard Longenecker) ఈ వచనానికి చాలా చక్కని వివరణని ఇచ్చాడు. ఆయన మాటల్లో, "పౌలు యెరూషలేములోని అపొస్తలులపై ఆధారపడి, వారికి లోబడి వారు అందించిన సువార్తను ప్రకటిస్తున్నాడు అనే ఆరోపణకు వ్యతిరేకంగా, పౌలు VV 15-19లో రెండు వరుసల సాక్ష్యాధారాలను అందించాడు: 1) అతని అధికారం మరియు సందేశం దేవుని ప్రవచనాత్మక నియామకం నుండి మరియు క్రీస్తుతో కలిగిన ప్రత్యెక్షత నుండి ఉద్భవించిందని, మరియు 2) తన మారుమనస్సు తర్వాత జరిగించిన కార్యకలాపాలకు తాను యెరూషలేము నుండి ఎటువంటి అనుమతిపై ఆధారపడలేదని చూపిస్తుంది. ఇక్కడ V20లో పౌలు తాను చెప్పింది సత్యమే అని ప్రమాణం ద్వారా బలపరుస్తున్నాడు."

పౌలు అనేక చోట్ల, "దేవుడే సాక్షి" అనే సంబోదించాడు (1 కొరింథీ 1:23, 1 థెస్సలొ 2:5). అయితే ఇక్కడ ఒక ప్రమాణ రీతిగా పౌలు మాట్లాడుతున్నాడు. తాను చెప్పిన వాటిలో ఏదైనా అబద్దం ఉంటె చూపించండి అని సవాలు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తనకు ఇవ్వబడిన సువార్త, మరియు అపొస్తలత్వపు అధికారం దేవుని నుండే కలిగాయని నిరూపించడానికి పౌలు చాలా కచ్చితంగా మాట్లాడుతున్నాడు.

“పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని." గలతి 1:21

"పిమ్మట" అనే పదంతో ఈ వచనం మొదలైంది, దీనిని బట్టి పౌలు ఇప్పటి వరకు చెప్పిన విషయాలకు (పేతురును కలుసుకోవడం, పదిహేను రోజులు యెరూషలేములో ఉండడం) ఇప్పుడు చెప్పబోయే విషయానికి మధ్య ఇంకేమి జరగలేదు అని గ్రహించాలి. అంటే పౌలు పేతురును మరియు యాకోబును కలుసుకొని అక్కడ పదిహేను రోజులు గడిపిన తర్వాత అక్కడ నుండి సరాసరి, ' సిరియ, కిలికియ' అనే ప్రదేశానికి వచ్చాడు. అపొ. కార్య 9:30 లో, పౌలు యెరూషలేములో పరిచర్య చేస్తున్నప్పుడు, యూదులు తనని చంపాలనుకున్నారు, "వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి." గలతి పత్రికలో పౌలు యెరూషలేము నుండి సిరియ, కిలికియ ప్రాంతానికి వెళ్ళాను అని చెప్తున్నాడు, దీనినే అపొస్తలుల కార్యములో కూడా మనం చూస్తున్నాం, ( అపొ. కార్య 9:30) పౌలును తార్సు అనే పట్టణానికి సహోదరులు పంపారు, తార్సు అనే పట్టణం కిలికియ ప్రాంతానికి రాజధాని పట్టణం.

ఇక్కడ "ప్రాంతములలోనికి" అని బహువచన రూపాన్ని వాడడం మనం చూస్తున్నాం, దీనిని బట్టి 'సిరియ' మరియు 'కిలికియ' వేరు వేరు ప్రాంతాలు అని అర్ధం చేసుకోకూడదు. 'సిరియ' మరియు 'కిలికియ' అనే ప్రాంతాలు రోమా సామ్రాజ్యంలో ఒకే పరిపాలన పరిధికి చెందినవి (belonged to same province). W. M. రంసయ్ (William Mitchell Ramsay) అనే కొత్త నిబంధన బైబిల్ పండితుడు (New Testament Bible Scholar) మరియు పురావస్తు శాస్త్రవేత్త (Archeologist), ఈ వచనంలో వాడబడిన బహువచన రూపకం గురించి మాట్లాడుతూ, అవి వేరు వేరు ప్రాంతాలు కాదు అని, ఒకే పరిపాలన పరిధికి చెందిన ఉపవిభాగాలు (subdivisions) మాత్రమే అని చెప్పాడు. ఇలా ఒకే పరిపాలన పరిధిలో ఉన్న ప్రాంతాన్ని బహువచన రూపకంగా పౌలు ఇతర పత్రికలలో కూడా మాట్లాడాడు. ఉదాహరణకు "క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయ పడకుండ" (2 కొరింథీ 11:10). ఇక్కడ పౌలు అకయ ప్రాంతములు అంటున్నాడు, నిజానికి అకయ అనేది ఒకే ప్రాంతం, ఇది అకయలో ఉన్న ఉపవిభాగాల గురించి మాట్లాడుతున్నాడు అని అర్ధం చేసుకోవాలి.

ఇక్కడ పౌలు చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తన మొదటి యెరూషలేము పర్యటనకు (గలతీ 1:18) మరియు రెండొవ యెరూషలేము పర్యటనకు (గలతీ 2:1-10) మధ్య పౌలు 'సిరియ, కిలికియ' ప్రాంతాలలో తన పరిచర్య ప్రారంభించాడు.

“క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయము లేకుండెను గాని" గలతి 1:22

ఈ వచనాన్ని బట్టి పౌలు యూదయ ప్రాంతంలో ఎంత తక్కువ సమయం గడిపాడో అర్ధం చేసుకోగలం. ఇక్కడ 'యూదయ ప్రాంతం' అని పౌలు చెప్పినప్పుడు రోమా సామ్రాజ్యంలో ఈ ప్రాంతం క్రింద, "యూదయ, గలిలయ, మరియు సమారియా" ఉన్నాయి అని గ్రహించాలి.

“మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని," గలతి 1:23

యూదయ ప్రాంతం వారు పౌలును చూడనప్పటికి, తన గురించి అనగా తన మారుమనస్సు, తన పరిచర్య విషయం తెలుసుకున్నారు (పౌలు క్రీస్తును నమ్మిన సందర్భాన్ని గ్రహించడానికి అపొ. కార్య 9:1-9; 26:12-17 చదవండి).

"పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు", ఇక్కడ 'మతము' అనే మాటను చూస్తున్నాం, నిజానికి గ్రీకులో ఈ పదం "పిస్టిస్" (pistis) అని ఉంది, ఈ పదానికి అర్ధం విశ్వాసం/విశ్వసించడం. అయితే ఇక్కడ పౌలు పిస్టిస్" (pistis) అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, యేసు క్రీస్తు నందు వ్యక్తిగతంగా విశ్వసించడం అనే విషయం గురించి మాట్లాడట్లేదు గాని, క్రైస్తవ విశ్వాసం అనగా క్రైస్తవ సువార్త, క్రైస్తవ సారాంశం, క్రైస్తవ భక్తి అనే విషయాన్ని ఉద్దేశిస్తున్నాడు (అందుకే ఈ పదాన్ని మతము అని తెలుగులోకి అనువదించారు). ఇదే భావంలో ఫిలిప్పీ 1:27 లో "సువార్త విశ్వాసపక్షమున" అనే మాటను వాడాడు.

“వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి." గలతి 1:24

"వారు" యూదయ సంఘాల విశ్వాసులు

"నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి" అనగా పౌలు యొక్క మారుమనస్సు, దేవుని పిలుపును, మరియు తన పరిచర్యను యూదయ సంఘాల వారు అనుమానించలేదు గాని, ఆ విషయాన్ని బట్టి దేవుని మహిమ పరిచారు. పౌలు యొక్క మరుమనస్సును బట్టి అనేకులు దేవుని మహిమ పరిచారు, ప్రియా సహోదరుడా, సహోదరి నీ మారు మనస్సు వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా, క్రైస్తవ సంఘం నిన్ను బట్టి దేవుని మహిమ పరచగలుగుతుందా?

 

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.