రచయిత: పి. శ్రావణ్ కుమార్

 గలతీయులకు రాసిన పత్రిక పౌలు రచించిన పదమూడు పత్రికలలో మొదటిది. పౌలు రాసిన పత్రికలన్నిటిలో గలతీయులకు రాసిన పత్రికకు ఒక విశిష్ట స్థానం ఉంది. రోమీయులకి రాసిన పత్రికకు ఈ పత్రికలో ఉన్నవిషయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ రెండు పత్రికలలో పౌలు విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనిషి దేవుని ముందు నీతిమంతుడుగా తీర్చబడడు అని స్పష్టం చేస్తున్నాడు. ఉదాహరణకు కొన్ని వాక్యములు:

“ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు" రోమా 3:24

“ నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే" గలతి 2:21

“ అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి." గలతి 3:6,7

ధర్మశాస్త్రం వలన నీతిమంతులు అవుతారు అని ఒకప్పుడు నమ్మిన పౌలు ఇప్పుడు విశ్వాసం వలననే నీతిమంతులు అవుతారు అని బోధిస్తున్నాడు.

ఏదైనా పత్రికని క్షుణ్ణంగా తెలుసుకునే నేపథ్యంలో మనము కొన్ని విషయాలు గమనించాలి. 1) ఎవరు ఈ పత్రికని రచించారు 2) ఎవరికీ ఈ పత్రిక రాయబడింది 3) ఎందుకు ఈ పత్రిక రాయబడింది

1) ఎవరు ఈ పత్రికని రచించారు

ఈ పత్రికని పౌలు రచించాడు

“ మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యునివలననైనను కాక, యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును......." గలతి 1:1

“ నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి." గలతి 6:11

తానే ఈ పత్రికని రాసాను అని చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. అయితే ఈ పౌలు ఎవరో ఏంటో తెలుసుకుందాం.

“ మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి." గలతి 1:23,24

పౌలు ఇశ్రాయేలు వంశస్థుడు, బెన్యామీను గోత్రానికి చెందిన వాడు. పౌలు ఎనిమిదవ రోజున సున్నతి పొందాడు (ఫిలిపీ 3:5). అతను గమలీయేలు అనే గొప్ప ధర్మశాస్త్రోపదేశకుని కింద విద్యాభ్యాసం పొందిన పరిసయ్యుడు (అపో.కార్యా 5:34). యూదా మతస్థులు, యేసు దేవుని మెస్సయ్యా అని గాని, దేవుని కుమారుడు అని కానీ నమ్మేవారు కాదు. యేసు ప్రభువు మీద నిందారోపణ (అతను ఏ తప్పు చేయక పొయినా) చేసి సిలువ వేశారు. క్రైస్తవ సువార్తకు పరిసయ్యులు ఎప్పుడు అడ్డుపడుతూ ఉండేవాళ్ళు. క్రీస్తు శిష్యులను చెరపట్టి, హింసించి, ఈ సువార్తను బోధించకూడదు అని వారిని హెచ్చరించేవారు. సౌలు (పౌలు గారి మునుపటి పేరు) కూడా ఈ పరిసయ్యులలో ఒకడు.

“ సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి, యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను" అపో.కార్యా 9:1,2

సౌలు ప్రధానయాజకుల దగ్గర ప్రభువు యొక్క శిష్యులను హింసించటానికి, బంధించడానికి, మరియు చంపడానికి అధికారం పొందాడు. తాను నమ్మిన ధర్మశాస్త్రం విషయమై అడ్డువచ్చిన వారిని హింసించుటకు కూడా వెనుకాడలేదు. అయినను సౌలు ఇదంతా తన తెలియని స్థితిలో, అవిశ్వాసం లో చేసాడు. దీనిని బట్టి చూస్తే ప్రతి మనిషి తన పూర్వపు స్థితిలో, దేవునికి శత్రువు గాను, దేవుని దూషించే స్వభావము కలిగి ఉన్నట్టు గమనించగలం. మనం కూడా రక్షించబడక మునుపు సౌలు లాగానే దేవుని ప్రజలను మన చేతలతో గాని, మన మాటలతో గాని హింసించే వారము, మరియు దేవుని పని విషయమై ఏ మాత్రమూ ఆసక్తి లేని వారము. మనము చేసేదే సరైనదని సాతాను చెప్పిన అబద్దాన్ని నమ్మిన స్థితి లో ఉన్నవారము.

అయితే దేవుడు పౌలును మార్చాడు, తన రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని అనుగ్రహించాడు. యేసు క్రీస్తు తనని తాను పౌలుకు కనబరచుకొని, పౌలును అన్యులకు అపొస్తలునిగా నియమించాడు.

“ పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. " 1 తిమోతి 1:12,13

పౌలును మార్చిన దేవుడే మనల్ని కూడా మార్చాడు. మన హృదయాన్ని తెరిచి మనం కూడా తన గురించి తెసులుసుకుని, మన పాపాన్ని గ్రహించి, విశ్వాసంతో పశ్చాత్తాపంతో తనవైపు తిరిగేలా చేసాడు.

2) ఎవరికి ఈ పత్రిక రాయబడింది

గలతి పత్రిక గలతీయులకి రాయబడింది. ఇది అర్ధం చేసుకోవడం చాలా సులువే. అయితే ఎవరు ఈ గలతీయులు? అనే విషయం అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం. గలతి ప్రాంతం రెండుగా విభాగించబడింది, ఉత్తర గలతి ప్రాంతం (North Galatia), దక్షిణ గలతి ప్రాంతం (South Galatia). బైబిల్ పండితులు కొందరు ఈ పత్రిక ఉత్తర గలతి ప్రాంతం వారికి రాయబడింది అని చెప్తారు, మరి కొందరు ఈ పత్రిక దక్షిణ గలతి ప్రాంతం వారికి రాయబడింది అని చెప్తారు. థామస్ ఆర్. శ్చయేన్నర్ (Thomas R. Schreiner) అనే న్యూ టెస్టమెంట్ బైబిల్ పండితుడు (American New Testament Bible Scholar) ఈ విధంగా చెప్పాడు:

“ఈ పత్రిక ఏ ప్రాంతం వారికి రాయబడినప్పటికి (ఉత్తర గలతి ప్రాంతం లేదా దక్షిణ గలతి ప్రాంతం) అది ఈ పత్రికలో ఉన్న వ్యాఖ్యానాన్ని (వివరణని) మార్చదు. అయితే ఈ పత్రిక అందుకున్న ప్రాంత ప్రజలను నిర్దేశించడం చారిత్రక వ్యత్యాసాన్ని చూపిస్తుంది. అంటే మనం గలతి పత్రికని, అపొస్తలుల కార్యముల తో పోల్చి చూసినప్పుడు వాటి మధ్య ఉన్న పరస్పర సంబంధం తెలుస్తుంది. ఉదాహరణకు, "పౌలు ముఖాముఖిగా పేతురును ఎదిరించింది అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో అపొస్తలుల కూటమికి ముందు జరిగిందా? (దక్షిణ గలతి సిద్ధాంతానికి మద్దతు ఇచ్చేవారు ఈ విషయాన్ని నమ్ముతారు). పౌలు గలతి పత్రికలో తన యెరూషలేము సందర్శనాలలో వేటినైనా ప్రస్తావించలేదా?"

ఇక్కడ, శ్చయేన్నర్ చెప్తున్న విషయం ఏంటంటే, గలఁతి పత్రిక ఎవరికి రాయబడినప్పటికి, అది ఈ పత్రికలో ఉన్న వివరణని మార్చదు. అయితే గలఁతి పత్రిక అందుకున్న ప్రజలను నిర్ధారించడం వల్ల, కొన్ని చారిత్రక విషయాలలో వ్యత్యాసం కనబడుతుంది. ఉదాహరణకి: గలఁతి పత్రిక 2 వ అధ్యాయంలో పౌలు పేతురును ఎదిరించింది, అపొస్తలుల కార్యములు 15 వ అధ్యాయంలో జరిగిన "యెరూషలేము కూటమికి" ముందు తర్వాతా? దక్షిణ గలతి సిద్ధాంతానికి మద్దతు ఇచ్చేవారు ఈ సంఘటన "యెరూషలేము కూటమికి" ముందే జరిగింది అని నమ్ముతారు. ఉత్తర గలఁతి సిద్ధాంతానికి మద్దతు ఇచ్చేవారు ఈ సంఘటన "యెరూషలేము కూటమికి" తర్వాతా జరిగింది అని నమ్ముతారు. అదే విధంగా, పౌలు గలఁతి మొదటి అధ్యాయంలో తన యెరూషలేము ప్రయాణాలు అన్నిటి గురించి సంబోదించాడా? లేక ముఖ్యమైన వాటినే సంబోదించాడా? ఈ విధంగా గలఁతి పత్రికలో పౌలు చెప్పిన చారిత్రక సంఘటనలు, అపొస్తలుల కార్యములతో పోల్చి చూసినప్పుడు, కొన్ని వైరుధ్యాలుగా కనబడే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలను మనం వచన వ్యాఖ్యానంలో తెలుసుకుందాం.

3) ఎందుకు ఈ పత్రిక రాయబడింది

పౌలు ఈ పత్రికను రాయటానికి గల ముఖ్య ఉద్దేశము:

      a) పౌలు ప్రకటించిన బోధ (సువార్త) సరైనది కాదని కొందరు గలతీయులను తప్పుదారి పట్టిస్తున్నారు (గలతీ 1:8,11,12)

      b) రక్షణకు విశ్వసము మాత్రమే సరిపోదని, క్రియలు కూడా అవసరమనే తప్పు బోధ చేస్తున్నారు (గలతీ 2:21; 3:1,2)

      c) పౌలు నిజమైన అపొస్తలుడు కాడని, అతను మనుషులను సంతోషపెట్టడానికి/గొప్పవాడు అనిపించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని నిందారోపణ చేసారు (గలతీ 1:10;2:14)

ఈ తప్పు బోధ చేస్తున్నది ఎవరు, ఎందుకు ఆలా చేస్తున్నారు, అనే విషయం కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.

      a) కొందరు యూదా మతస్థులు ఈ తప్పు బోధను చేస్తున్నారు (గలతీ 4:17; 5:7,8)

      b) యూదా మత ఆచారాలు అన్యజనుల మీద రుదే ప్రయత్నంగా ఇలా చేస్తున్నారు

      c) విశ్వాసంతో పాటు సున్నతి పొందడం కూడా రక్షణకు అవసరమని సున్నతి పొందని వాళ్ళు దేవుని సంబంధులు కాదని, వారు ధర్మశాస్త్రమును అవమానపరుస్తున్నారని వీరు బోధిస్తున్నారు (గలతి 6:13)

      d) ఈ యూదా మతస్థులు "సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతిపొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు" (గలతి 6:12) అని వీరి గురించి పౌలు చెప్తున్నాడు

4) పత్రిక సారాంశం

ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణత పొందడానికి ప్రయత్నిస్తున్న గలతి సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు (గలతీ 3:1). పౌలు గలతి ప్రాంతంలో సువార్త పరిచర్య చేసినప్పుడు, దేవుని పిలుపును బట్టి అనేకులు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచారు. అయితే ఇప్పుడు, రక్షింపబడినా సరే, ధన్యత లేని వారిగా గలతి సంఘం వారు ప్రవర్తిస్తున్నారు. అందుకే పౌలు "మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది?" (గలతీ 4:15) అని ప్రశ్నిస్తున్నాడు. పౌలు ధర్మశాస్త్ర బోధకులకు వ్యతిరేకంగా రక్షణ ధర్మశాస్త్రం ద్వారా రాదు అని బోధించాడు, దీనినే గలతీయులు విశ్వసించారు. అయితే కొందరు కపట సహోదరులు (యూదా మత ప్రచారకులు) రక్షణకు ధర్మశాస్త్రం అవసరమని, సున్నతి పొందకపోతే రక్షణ లేదని బోధించారు. వీరి గురించే పౌలు గలతి సంఘానికి హెచ్చరిస్తూ, "మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులవలన జరిగినది" (గలతీ 2:4) అని అంటున్నాడు. దొంగతనముగా ప్రవేశించిన ఈ కపట సహోదరులు, క్రీస్తులోని స్వాతంత్రము నుండి సంఘాన్ని తిరిగి దశ్యాత్వము వైపు నడిపిస్తున్నారు. వేరొక సువార్తను సంఘంలోకి తీసుకొని రావడం మాత్రమే కాకుండా, పౌలు తక్కువ అపొస్తలుడని, అతని బోధలు సరైనవి కావని ఆరోపించారు.

అందుకే పౌలు తన అపొస్తలత్వన్ని మరియు తన సువార్త యొక్క కచ్చితత్వాన్ని చాలా స్పష్టంగా ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. దారి తప్పుతున్న గలతీయులను ఎలాగైనా క్రీస్తు యొక్క సత్యం వైపు మరల నడిపించాలని పౌలు ప్రయాసపడ్డాడు. అందుకే "నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది." (గలతీ 4:19) అని అంటున్నాడు. క్రీస్తు మనలను విమోచించాడు అని పౌలు నొక్కి చెప్పాడు, "ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి." (గలతీ 5:1). ధర్మశాస్త్రం రక్షణకు మూలమని అనుకుంటున్న వారిని హెచ్చరిస్తూ, "మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలో నుండి తొలగిపోయి యున్నారు." (గలతీ 5:4) అని ఖండితంగా చెప్పాడు. యేసు క్రీస్తలో ఉన్న వారికి ఏవి ప్రయోజనమో ఏవి కావో పౌలు తెలియజేస్తున్నాడు, "యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును" (గలతీ 5:6). అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం రక్షణ పొందుకోవడానికి ఏమాత్రము సహాయపడదు అని తెలియజేసాడు, "నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే." (గలతీ 2:21).

అబ్రాహాము విశ్వాసమూలంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడని, అబ్రాహాముకు ఇవ్వబడిన వాగ్దానం విశ్వాసమూలమైనదని, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచేవారు "ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులని (paraphrase added)" పౌలు చెప్పాడు. సున్నతి వంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన వచ్చే ప్రయోజం ఏది లేదని పౌలు చెప్పాడు, "క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు." (గలతీ 6:15); "ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా." (గలతీ 2:16).

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.