సువార్త

రచయిత: ఆర్థర్ డబ్ల్యు పింక్
అనువాదం: పి. జోయెల్ సామ్యేల్ సెరాఫ్

(ఇది 1920 లలో ఆర్థర్ డబ్ల్యు పింక్ గారు ఆస్ట్రేలియాలో చేసిన పరిచర్యలో భాగంగా, సిడ్నీ నగరంలో చేసిన ఒక ప్రసంగం)

ఈ రాత్రి ఇక్కడ నా కుటుంబంతో కలిసి టీ తాగడానికి నా టేబుల్ వద్ద కూర్చున్నాను. ఇది చల్లని శీతాకాలపు రాత్రి, బయట వీధిలో ఆకలితో అలమటిస్తున్న కొంతమంది నిరాశ్రయులూ పిల్లలూ ఉన్నారు, వారు వచ్చి నా తలుపు తట్టి, "మేము చాలా ఆకలితో ఉన్నాము సర్, మేము చాలా ఆకలితో ఉన్నాము, చలిలో ఉన్నాము, మేము పస్తులున్నాము: మీరు మాకు తినడానికి ఏమైనా ఇస్తారా?". "మీరు తినడానికి ఏమైనా ఇవ్వాలా? లేదు, మీరు ఇక్కడకు చెందినవాళ్ళు కాదు, పొండి”. దేవుడు సువార్త అనే విందును ఏర్పాటు చేసాడనీ ఐతే కొంతమంది పాపులు తమ లోతైన అవసరాన్ని గ్రహించి ప్రభువు వద్దకు వచ్చి,"నన్ను కరుణించమని వేడుకున్నప్పుడు, ఆయన, లేదు, లేదు, మీరు నేను ఎన్నుకున్నవారిలో లేరు" అని చెబుతాడని ‘దేవుని ఎన్నిక’ సిద్ధాంతాన్ని తప్పుగా చిత్రీకరించే కొందరు విమర్శిస్తున్నారు.

కానీ నా స్నేహితులారా బైబిల్ చేసే బోధ అది కాదు, అలాంటిదేమీ కాదు. అది దేవుని సత్యాన్ని పూర్తిగా తప్పుగా చిత్రీకరించడమే. నా స్నేహితులారా నేను అలాంటిదేమీ నమ్మను, ప్రతీ రాత్రీ ఇక్కడికి వచ్చి అలాంటిదేదైనా వినమని అడిగి మిమ్మల్ని అవమానించను.

1. “లోపలికి వచ్చుటకు బలవంతం చేయుము

ఇదీ అసలు విషయం. దేవుడు విందును ఏర్పాటు చేశాడు, కానీ వాస్తవం ఏంటంటే ఎవరూ ఆకలితో లేరు, ఎవరూ విందుకు రావడానికి ఇష్టపడడం లేదు. విందుకు దూరంగా తప్పించుకోవడానికి ప్రతీ ఒక్కరూ సాకులు చెబుతారు, వారిని రండని పిలిచినప్పుడు వారు, "లేదు, మాకు రావాలని లేదు" లేదా "మేమింకా సిద్ధంగా లేము" అని చెబుతారు. అయితే దేవునికి ఇదంతా మొదటి నుండి తెలుసు, కాబట్టి, దేవుడు విందును సిద్ధపరచడం తప్ప ఇంకేమీ చెయ్యకుండా ఉండుంటే తన బల్ల వద్ద ఉన్న ప్రతి కుర్చీ శాశ్వతంగా ఖాళీగానే మిగిలిపోయేది! ఈ రాత్రి ఈ సంఘంలో ఉన్న ప్రతీ పురుషుడూ స్త్రీ క్రీస్తు దగ్గరకు రాక ముందు మాటిమాటికీ కాలానుగుణంగా ఈవిధంగానే సాకులు చెప్పుంటారని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరూ మిగతావారిలాగే ఉన్నారు. మీరూ సాకులు చెప్పారు, నేను కూడా చెప్పాను. అయితే దేవుడు కేవలం విందును ఏర్పాటు చెయ్యడం తప్ప మరేమీ చెయ్యకపోతే ప్రతి కుర్చీ ఖాళీగానే ఉండేది; కాబట్టి, లూకా 14లోని ఆ ఉపమానంలో మీరేమి చదువుతారు?

విందుకు అతిథులు సమకూరలేదు కాబట్టి, దేవుడు తన "సేవకులను" పంపాడు. మీ కళ్ళద్దాలు ధరించండి. ఇక్కడ "సేవకులు" అని లేదు. దేవుడు తన "సేవకుడిని" పంపి, తన విందును అతిథులతో సమకూర్చమని, వారిని లోపలికి రావడానికి "బలవంతం" చెయ్యమని చెప్పాడు. ఈ రాత్రి ఈ సంఘంలో లేదా మరే ఇతర సంఘంలోనైనా స్త్రీ అయినా పురుషుడైనా సరే మీరు లోపలికి రావడానికి దేవునిచేత బలవంతం చెయ్యబడితేనే తప్ప, గొర్రెపిల్ల వివాహ విందు వద్ద కూర్చునే ఆస్కారం లేనే లేదు.

“బలవంతమా ?” బలవంతమేంటని మీరు నన్ను అడగొచ్చు. దేవుడు, ఎదిరిస్తున్న మీ చిత్తాన్ని అధిగమించాల్సి వచ్చింది, దేవుడు మీ హృదయ అయిష్టతను అధిగమించాల్సి వచ్చింది, దేవుణ్ణి ప్రేమించడం కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించడాన్ని, అలాగే క్రీస్తును ప్రేమించడం కంటే ఈ లోకాన్ని ప్రేమించడాన్నీ దేవుడు అధిగమించాల్సి వచ్చింది. దేవుడు తన శక్తిని ప్రదర్శించి మిమ్మల్ని ఆకర్షించాల్సి వచ్చిందని నేనంటాను; అలాగే మీలో ఎవరికైనా గ్రీకు భాష గురించి ఏదైనా తెలిస్తే లేదా స్ట్రాంగ్స్ కాన్కర్డెన్స్ ఉంటే యోహాను 6:44లోని "ఆకర్షించుట" అనే మాటకు గ్రీకు పదాన్ని చూడండి, "నన్ను పంపిన తండ్రి అతన్ని ఆకర్షిస్తే తప్ప ఎవరూ నా వద్దకు రాలేరు”. "బలాన్ని ప్రయోగించి" అని దీని అర్థం. అంటే బలవంతంగా లాగడం. ఈ అర్థాన్ని సవాలు చేసి రుజువుతో సహా నిరూపించగల గ్రీకు పండితుడు భూమిపై లేడు. ఇది, చేపలతో నిండిన వలను గురించి యోహాను 21లో ఉపయోగించిన అదే గ్రీకు పదం. అది చేపలతో నిండి ఉన్నందున వారు తమ పూర్తి శక్తితో లాగవలసి వచ్చింది. వారు దానిని “లాగవలసి” వచ్చింది.

ఔను, నా స్నేహితుడా ఆ విధంగానే నువ్వు క్రీస్తు వద్దకు తీసుకురాబడ్డావు. నువ్వు దాని గురించిన స్పృహలో ఉండకపోవచ్చు, నీలో ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ మనలో ప్రతి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడి, పరిశుద్ధాత్మను ఎదిరించాము, కాబట్టి, దేవుడు తన సర్వశక్తిని ఉపయోగించి ఆ ఎదిరింపును అధిగమించి, మనల్ని మోకాళ్ళపైకి తీసుకురావాల్సి వచ్చింది; మీలో ఎవరైనా ఈ కఠినమైన మాటలని వ్యతిరేకిస్తే మనిషి యొక్క  సంపూర్ణ పతనం గురించి బైబిల్ చేసే బోధను నువ్వు నమ్మలేదని నేను చెప్పాల్సి వస్తుంది.

మానవుడు తప్పిపోయి, స్వభావ సిద్ధంగా తన పాపములలోనూ అపరాధములలోనూ చనిపోయాడు. వినండి, మనిషి అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి  అతనికి కొంచెం ఔషధం అవసరమనో లేదా అదేదో అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం బోధ అవసరమనో లేదా బలహీనంగా ఉన్నాడు కాబట్టి కొంచెం నిరీక్షణ అవసరమనో కాదు: మనిషి చనిపోయాడు. ఔను, తన అపరాధముల చేతనూ పాపముల చేతనూ చనిపోయాడు. పరలోకం నుండి సర్వశక్తి మాత్రమే అతన్ని పునర్జీవింపజేసి మరణం నుండి జీవానికి తీసుకురాగలదు. ఇదే నేను విశ్వసించే సువార్త. ఐతే సువార్తకు స్పందించే శక్తి పాపికి ఉందన్న కారణాన్ని బట్టి నేను సువార్త బోధించడం లేదు. మనుష్యులు ఆత్మీయంగా మరణించినవారైతే సువార్త ప్రకటించడం వల్ల ఏం ప్రయోజనం అని మీరు నన్ను అడగొచ్చు. దానిని ప్రకటించడం వల్ల ఏం ఉపయోగం? మీకు సమాధానం చెబుతాను.

వినండి! పక్షవాతానికి గురయ్యి, ఊచ చేయిగల వ్యక్తి ఒకడున్నాడు. క్రీస్తు అతనితో, "నీ చేయి చాపు" అని చెబుతాడు. అది అతను చెయ్యలేని ఒక పని! తనకు అసాధ్యమైన పనిని చెయ్యమని క్రీస్తు చెప్పాడు. అలాంటప్పుడు, క్రీస్తు అతని చేతిని చాపమని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అతన్ని ఆజ్ఞాపించిన మాటతో పాటే దేవుని శక్తి బయలువెళ్ళింది! అతడు అలా చెయ్యడానికి దేవుని శక్తి సాధ్యమయ్యేలా చేసింది. ఆ వ్యక్తి తనంతట తానుగా ఆ పని చెయ్యలేకపోయాడు. అతను చెయ్యగలడని మీరు అనుకుంటే మీరు పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సినవారే మీరెవరైనా నాకు అనవసరం. ఇక్కడ ఆ వ్యక్తి తన సొంత చిత్తాన్ని బట్టి పక్షవాతానికి గురైన తన చేతిని చాచగలిగాడని భావించే ఎవ్వరైనా సరే పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సిందే! పక్షవాతంతో కదలడం ఎలా సాధ్యం?

సరే, నేను మీకు అంతకంటే బలమైనది మరొకటి చెబుతాను. ఈ రోజు మీకు బలమైన ఆహారం అవసరం, మీకు పలచని పాల కంటే ఎక్కువే అవసరం; మీరు ప్రభువులో కట్టబడాలంటే ఎదగాలంటే బలవంతులుగా మారాలనుకుంటే మీకు బలమైన ఆహారం అవసరం. చనిపోయి సమాధి చెయ్యబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని శరీరం అప్పటికే దుర్వాసనతో కుళ్ళిపోవడం ప్రారంభించింది. అతను సమాధిలో పెట్టబడ్డాడు. ఎవరో ఆ సమాధి దగ్గరకు వచ్చి, "లాజరు, బయటకు రా" అని పిలిచారు. అక్కడున్నది దేవుని కంటే తక్కువైన వ్యక్తై ఉండుంటే ఆ వ్యక్తి ఇప్పటికీ అక్కడే నిలబడి, "బయటకు రమ్మని" లాజరును పిలిస్తూ ఉండేవాడు. చనిపోయిన వ్యక్తిని బయటకు రమ్మని పిలవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ మాటను పలికినవానికి ఆ కార్యాన్ని జరిగించే శక్తి ఉంటే తప్ప ఆ పిలుపుకు అర్థం లేదు కదా!

ఇప్పుడు, నా స్నేహితులారా నేను పాపులకు సువార్తను బోధిస్తున్నాను, అయితే ఆ సువార్తకు ప్రతిస్పందించే శక్తి పాపికి ఉందన్న నమ్మకంతో కాదు: ఎలాంటి పాపియైనా సరే తనలో ఎంతో కొంత సామర్థ్యం ఉందనేది నేను నమ్మను. అయితే "నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి" అని క్రీస్తు సెలవిచ్చాడు. కాబట్టి, దేవుని కృప ద్వారా నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ఎందుకంటే ఇది శక్తితో కూడిన వాక్యం, ఆత్మ సెలవిచ్చే వాక్యం, జీవాన్ని ఇచ్చే వాక్యం. శక్తి పాపిలో లేదు, పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఉపయోగించడానికి ఇష్టపడినప్పుడు ఆ శక్తి వాక్యం ద్వారా వెల్లడౌతుంది. నా స్నేహితులారా నేను గౌరవంతో ఈ మాట చెబుతున్నాను; ఒకవేళ దేవుడు ఈ వాక్యంలో వెళ్ళి చెట్లకు ప్రకటించమని నాకు చెప్పినా సరే నేను వెళ్ళుండేవాణ్ణి! ఔను, దేవుడు ఒకసారి తన సేవకులలో ఒకరికి, వెళ్ళి ఎముకలకు ప్రకటించమని చెప్పినప్పుడు అతను వెళ్ళి అలాగే చేశాడు. మీరైతే వెళ్ళుండేవారో లేదో నాకు తెలీదు! ఔను, దానికి భవిష్యత్తులో ప్రవచనాత్మక నెరవేర్పుతో పాటు ప్రస్తుత అన్వయింపు కూడా ఉంది.

2. "సర్వసృష్టికీ సువార్తను ప్రకటించండి"

రక్షించబడడానికి ఒక నిర్దిష్ట సంఖ్యను మాత్రమే దేవుడు ఎన్నుకున్నట్లయితే మనం సర్వసృష్టికి సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఈ ప్రశ్న మళ్ళీ ఇప్పుడు తలెత్తుతుంది. అలా చెయ్యమని దేవుడే మనకు ఆజ్ఞాపించాడు అన్నదే దానికి కారణం. సరే కానీ ఇది నాకు సహేతుకంగా అనిపించడం లేదని మీరు అనొచ్చు. అది ఇక్కడ అప్రస్తుతం; దేవునికి విధేయత చూపించడమే తప్ప ఆయనతో వాదించడం మీ పని కాదు. సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, దాని అర్థం కూడా అదే - “సర్వసృష్టికి ” - ఇది ఒక గంభీరమైన విషయం. ఈ రాత్రి ఈ ఆవరణంలో ఉన్న ప్రతి క్రైస్తవుణ్ణీ ఆ సువార్తను సర్వసృష్టికి పంపడానికి శక్తివంచన లేకుండా ఎందుకు ప్రయాసపడలేదని క్రీస్తుకు సమాధానం ఇవ్వాల్సిన అవసరముంది. ఔను, నేను మిషనరీ పరిచర్యను నమ్ముతాను - బహుశా మీలో కొందరికంటే బలంగానే నమ్ముతాను. నేను మిషనరీ పరిచర్య గురించి మీకు బోధించి ఉంటే బహుశా నేను ఇంతకంటే గట్టిగానే మిమ్మల్ని నిలదీసుండేవాణ్ణి. మిషనరీ పరిచర్యను నమ్మే అనేకమంది క్రైస్తవులు, ఆ మిషనరీ పరిచర్యల్లో కేవలం ఆటలాడుతున్నారు. ఈ రోజు ఇవాంజెలికల్ సంఘాలు మిషనరీ పరిచర్య పేరుతో ఆటలాడుతున్నారని చెప్పడానికి నేను సాహసిస్తాను. నా స్నేహితులారా ఆలోచించండి - ఈ 20వ శతాబ్దంలో ఎంతో సులువుగానూ చవకగానూ ప్రయాణించే రోజుల్లో బైబిల్ దాదాపుగా అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండగా ఇంకా మానవ జాతిలో దాదాపు సగంమంది ఎందుకు తెలియక ఉన్నారు - ఈ రాత్రి ఇక్కడ కూర్చుండగా మానవజాతిలో దాదాపుగా సగం క్రీస్తు గురించి ఇంకా విననివాళ్ళు ఉన్నారు. మీరైనా సరే నేనైనా సరే దీని గురించి మనం ఇంకా క్రీస్తుకు లెక్క చెప్పవలసినవారమే

ఔను, నేను మానవ బాధ్యతను నమ్ముతాను. నేను మానవ "స్వేచ్ఛ"ను నమ్మను, కానీ మానవ బాధ్యతను నమ్ముతాను, ఐతే నేను క్రైస్తవుని బాధ్యతను రెట్టింపుగా నమ్ముతాను; ఈ రాత్రి ఇక్కడున్న మనలో ప్రతి ఒక్కరూ ఇంకా క్రీస్తును ఎదుర్కొని, అగ్నిజ్వాలల వంటి ఆయన కళ్ళలోకి చూడలేదు. నేను నా సువార్తను మీకు అప్పగించాను. ఇది నిన్ను యోగ్యునిగా ఎంచి “బాధ్యత"గా అప్పగించానని ఆయన మనతో చెప్పబోతున్నాడు (1 థెస్స 2:4 చూడండి). గృహనిర్వాహకులలో ప్రతివాడూ నమ్మకమైనవాడై ఉండడం అవశ్యం.

నా స్నేహితులారా మనం ఈ విషయాలతో ఆటలాడుతున్నాము. విశ్వాసాన్ని శ్రద్ధతో పరిగణించడం మనలో ఎవ్వరూ ఇంకా ప్రారంభించలేదు. క్రీస్తు రెండవ రాకడను విశ్వసిస్తున్నామని మనమందరం అంటాము. ఆయన ఇంకా తిరిగి రాకపోవడానికి ఒక కారణం సంఘం ఇంకా సంపూర్ణం కాలేదని కూడా మనమందరం నమ్ముతున్నాము. ఆయన శరీరం సంపూర్ణమైనప్పుడు ఆయన తిరిగి వస్తాడని నమ్ముతాము. నా స్నేహితులారా, ఆయన ఎన్నుకున్న ప్రజలలో చివరి వ్యక్తి పిలవబడేవరకూ ఆయన "శరీరం" ఎప్పటికీ ఎన్నటికీ సంపూర్ణం కాదు; ఐతే ఆయన ఎన్నుకున్నవారు పరిశుద్ధాత్మ శక్తి చేత సువార్త బోధించడం ద్వారా పిలవబడతారు; క్రీస్తు త్వరలో తిరిగి రావాలని మీరు కూడా నిజంగా ఆత్రుతతో ఎదురుచూస్తున్నవారైతే అన్యజనులకు సువార్తను ప్రకటించడం లేదా పంపించే విషయంలో మీరు మీ బాధ్యత గురించి మరింత మెలకువ కలిగి నడుచుకోవాలి! 

"మీరు లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి". ఇది క్రీస్తు మాట, ఇది మనకు క్రీస్తు ఆజ్ఞ. ఆయన "పంపండి" అని అనలేదు, "మీరు వెళ్ళండి" అని అంటున్నాడు, మీరు ఇంకా వెళ్ళలేదంటే క్రీస్తుకు సమాధానం చెప్పాల్సినవారిగా ఉన్నారు! అంటే ఈ రాత్రి ఇక్కడ ఉన్న మనలో ప్రతి ఒక్కరూ మిషనరీ పరిచర్యకు వెళ్ళాల్సిందే అని మీరు అంటున్నారా? అని మీరు నన్ను అడగొచ్చు. అలా అని నేను అనలేదు. నేను ఎవరికీ తీర్పరిని కాదు.

ఈ రాత్రి ఇక్కడ మీలో చాలామందికి, మీరు ఎందుకు వెళ్ళలేదన్న ప్రశ్నకు, క్రీస్తును తృప్తిపరిచే ఒక మంచి కారణం ఉండి ఉండొచ్చు. ఇక్కడ చెయ్యడానికి ఆయన మీకు పని ఇచ్చాడు . ఆయన మిమ్మల్ని ఇక్కడ ఒక స్థానంలో ఉంచాడు. ఇక్కడ నిర్వహించడానికి ఆయన మీకు బాధ్యతలను అప్పగించాడు, కానీ వెళ్ళడానికి అవకాశం ఉండి కూడా వెళ్ళని ప్రతీ క్రైస్తవుడు, దాని విషయమై క్రీస్తుకు సమాధానం ఇవ్వాల్సిందే.

"మీరు లోకమంతటికీ వెళ్ళండి".  "నేను ఎక్కడికి వెళ్ళాలి?" అని మీరు నన్ను అడగొచ్చు. అది తెలుసుకోవడం చాలా సులభం. సులభమా అని మీరు అడగొచ్చు. ఔను అది సులభమే అని నేనుంటున్నాను. మీరు మిషనరీ పరిచర్యను ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవడం కంటే ఈ ప్రపంచంలో సులభమైనది మరొకటి లేదు. అపొస్తలుల కార్యముల మొదటి అధ్యాయంలోని ఎనిమిదవ వచనంలో దీనిని మీరు తెలుసుకోవచ్చు.  "…పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను [అంటే వారు ఉన్న నగరం],  యూదయ [అంటే వారి నగరం ఉన్న దేశం],  సమరయ దేశములయందంతటను [అంటే పక్కనున్న దేశం] భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు…”

మీరు సువార్త పరిచర్య ప్రారంభించాలనుకుంటే మీరుంటున్న ఊరిలో ప్రారంభించాలి. నా స్నేహితులారా సిడ్నీలో ఉంటున్న చైనా దేశస్థుల రక్షణ విషయమై మీకు పట్టింపు లేకపోతే చైనాలో ఉంటున్న చైనీయుల రక్షణ విషయంలోనూ మీకు పట్టింపు లేదు. ఒకవేళ పట్టింపు ఉందని అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు.

ఈ రాత్రి నేను విషయాన్ని ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్నాను. చైనాలోని చైనీయుల రక్షణ  గురించి మీకు నిజంగా పట్టింపు ఉంటే ఇక్కడ సిడ్నీలో ఉన్న చైనీయుల రక్షణ గురించి కూడా మీరు అంతే పట్టింపు కలిగుంటారు; ఈ రాత్రి ఇక్కడ ఉన్నవారిలో సిడ్నీలో ఉన్న చైనీయులను చేరుకోవడానికి నిజంగా ప్రయత్నించినవారు ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఆశ్చర్యమే! ఎవరైనా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాను. ఈ రాత్రి ఇక్కడున్నవారిలో సిడ్నీలోని బైబిల్ హౌసుకు వెళ్ళి, "మీ దగ్గర చైనీస్ భాషలో ఏదైనా కొత్త నిబంధన ఉందా లేదా చైనీస్ భాషలో యోహాను సువార్త ప్రతులు ఉన్నాయా?” అని అక్కడ మేనేజరుని అడిగినవారెవరైనా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాను. వంద ప్రతులకెన్ని, లేదా డజను ప్రతులకెన్ని అని అడిగినవారెవరైనా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాను. వెయ్యి లేదా వంద ప్రతులు కొనుగోలు చేసి చైనీస్ క్వార్టర్లోని వారి ఇళ్ళకు వెళ్ళి, "నా స్నేహితుడా, ఇది ఒక చిన్న బహుమానం, ఇది మీరు చదివితే మీ ఆత్మకు మేలు కలుగుతుంది" అని చెప్పి పంచినవారు మీలో ఎంతమంది?

నా స్నేహితులారా మనం మిషనరీ పరిచర్యను చులకన చేస్తున్నాము, ఇది కేవలం ప్రహసనం, అంతే! "మీరు వెళ్ళండి" అనేది మొదటి ఆజ్ఞ. ఎక్కడికి వెళ్ళాలి? మొదట మీ చుట్టూ ఉన్నవారి మధ్యకు. దేనితో వెళ్ళాలి? సువార్తతో! "నేను ఎందుకు వెళ్ళాలి?" అని మీరు అడగొచ్చు, ఎందుకంటే దేవుడు మీకు ఆజ్ఞాపించాడు! "ఆయన కేవలం కొందరిని ఎన్నుకుంటే అలా చెయ్యడం వల్ల ఉపయోగం ఏంటి?" అని అడిగితే ఆ సువార్త దేవుడు తాను ఎన్నుకున్నవారిని పిలవడానికి ఉపయోగించే సాధనం, అన్నదే జవాబు!. దేవునిచేత ఎవరు ఎన్నుకోబడ్డారో ఎవరు ఎన్నుకోబడలేదో మీకూ తెలియదు, నాకూ తెలియదు, ఇక్కడ భూమి మీదున్న ఎవరికీ తెలియదు. వారు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి ఉన్నారు, ఆయన ఏర్పరచినవారిని చేరుకోడానికి సర్వసృష్టికీ సువార్త ప్రకటించాలి.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.