Was the death of Christ, the plan of God or the plot of the devil?
అపొస్తలుల కార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
ఈ వచనంలో యేసుక్రీస్తు సిలువ మరణం దేవుని సంకల్పమని స్పష్టంగా రాయబడింది, అదే సమయంలో యేసుక్రీస్తును అప్పగించేందుకు సాతాను యూదాను ప్రేరేపించాడని కూడా రాయబడింది.
యోహాను 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది (అనగా సాతాను) ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక-
ఇంతకూ యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది దేవుడా? సాతానా? చాలామంది క్రైస్తవులు దీని విషయంలో సందేహానికి లోనయ్యే అవకాశం ఉంది. ఐతే లేఖనాలు ప్రకటించే దేవుని సార్వభౌమత్వాన్నీ, సర్వశక్తిమంత్వాన్నీ అర్థం చేసుకున్నవారికి ఇదసలు ప్రశ్నే కాదు. దేవుడు సర్వశక్తిమంతుడనీ, సార్వభౌముడనీ బైబిల్ చెబుతుంది. సర్వశక్తిమంతుండంటే సృష్టిలో ప్రతీదీ ఆయన శక్తి కిందే పనిచేస్తుందని అర్థం. ఆయన శక్తిని అధిగమించి లోకంలో ఏది ప్రవేశించినా దేవునికంటే అదే శక్తిగలది ఔతుంది, అప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు కాలేడు. దీనిప్రకారం సాతాను కూడా దేవుని శక్తి కిందే, ఆయన సార్వభౌమత్వం కిందే తనకున్న శక్తిని కనపరుస్తాడు.
1.మానవాళి రక్షణార్థం యేసుక్రీస్తు మరణం దేవుని సంకల్పం
అపొస్తలుల కార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత (లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.
యెషయా గ్రంథము 53:10 అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
2. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆయన సాతానును అనుమతించాడు. అందుకే సాతాను యూదాను ప్రేరేపించాడు.
యోహాను 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది (అనగా సాతాను) ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక-
అందుకే యేసుక్రీస్తు పిలాతుతో పైనుండి నీకు అనుగ్రహించబడితేనే కానీ నాపై నీకు ఏ అధికారమూ ఉండదని ధైర్యంగా చెబుతాడు. దీనిప్రకారం యేసుక్రీస్తు సిలువ మరణం, దేవుని సంకల్పమనీ, ఆ కార్యంలో సాతానును కూడా దేవుడు వాడుకున్నాడనీ అర్థమౌతుంది.
3. ఇక్కడ మనకు సాతానూ, ఇస్కరియోతు యూదానూ దేవుని సంకల్పాన్నే నెరవేరిస్తే, వారు దోషులు ఎలా ఔతారనే మరో ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సాతాను & యూదా ఆ పనిని దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలనే ఆలోచనతో చేయలేదు. యూదా ధనం సంపాదించాలనే ఆలోచనతో ఆయనను అమ్మివేసాడు అందుకే అతను దోషి అయ్యాడు. సాతాను అతడిని ప్రేరేపించినప్పటికీ ఆ ప్రేరేపణలో యూదా స్వార్థం కూడా ఉంది. ఆ స్వార్థంతోనే తన బోధకుడిని అమ్ముకోకూడదనే నైతిక బాధ్యతను మీరి ఆయనను అమ్మివేసాడు. ఇక సాతాను విషయానికొస్తే, యేసుక్రీస్తును తన స్వంత ప్రజలైన యూదుల చేత సిలువకు అప్పగింపచేసి చివరివరకూ ఆయన దేవుని చిత్తంపట్ల అసహనం చూపేలా చేయాలని యూదాను ప్రేరేపించాడు. సాతాను దేవునిలా భవిష్యత్తు జ్ఞాని కాదు, వాడు దేవుడు తెలియచేసినంతమట్టుకే దేనినైనా గ్రహించగలడు. మానవుడిగా ఉన్న యేసుక్రీస్తు సిలువ మరణం పొందే సమయం వరకూ తాను అనుభవించే శ్రమలను బట్టి, తన స్వంతప్రజలే ఆయన పట్ల అనుసరిస్తున్న తీరును బట్టి ఏమాత్రం అసహనానికి లోనైనా దేవుని చిత్తం నెరవేర్చడంలో ఆయన వైఫల్యం చెందుతాడు. ఈవిధంగా అయనను శోధించి దారి తప్పించాలన్నదే మొదటినుండీ సాతానుకు ఉన్న ఆలోచన.
ఈ కారణాలచేత వారిద్దరూ వారివారి సొంత ఉద్దేశాలతో పనిచేసారు కానీ, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని కాదు. అందుకే వారి సొంత ఉద్దేశాలకు వారే నైతికంగా బాధ్యులవుతారు. ఎందుకంటే ఆ పాపపు ఉద్దేశాలను వారి మనసులో ఉంచింది దేవుడు కాదు. ఆయన బలవంతంగా వారి చేత ఏ పాపమూ చేయించలేదు. అయినప్పటికీ వారి పాపపు ఆలోచనలను సహితం దేవుడు మానవాళి మేలు కోసం, తన మహిమ కోసం తన ప్రణాళిక నెరవేర్చుకునేలా మలుచుకున్నాడు.
ఈ వచనాన్ని కూడా చూడండి -
అపొస్తలుల కార్యములు 4:24-28 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను (అనగా అభిషిక్తునిమీదను) భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
దేవుని సార్వభౌమత్వానికి సంబంధించిన ఈ ఆంశం మానవ జ్ఞానానికీ, తర్కానికీ అతీతమైనదిగా మనకు కనిపిస్తుంది, అయినప్పటికీ ఇది లేఖనాలు చెప్పే సత్యం. దీని గురించి మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి క్రింది లింక్స్ ద్వారా సూచించబడిన వ్యాసాలను చదవండి.
"దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?"
"దేవుని సార్వభౌమత్వం"
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.