ఆడియో
‘‘దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగును’’( కీర్తన 1:1 - 3).
ఎంతో దీవెనకరమైన ఈ కీర్తనగ్రంథం ఒక ధన్యుడైన వ్యక్తి కనపరిచే లక్షణాలతో ప్రారంభమవ్వటం నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఐనా లోతుగా పరిశీలించినపుడు, ఈ గ్రంథాన్ని ప్రారంభించటానికి ఇంతకంటే సముచితమైన మరో ఇతివృత్తాన్ని కనుక్కోవటం సాధ్యం కాదని గ్రహించగలము. పాఠకులలో అనేకులకు తెలిసిన విధంగా, ‘‘కీర్తనలు’’ అనేవి స్తుతి ఆరాధనకు సంబంధించినవి. ధన్యుడైన వ్యక్తి మాత్రమే స్తుతి చెల్లించటానికి అర్హుడు. అతడర్పించే స్తుతులు మాత్రమే దేవునికి అంగీకారయోగ్యము. అందుచేతనే ఈ స్తుతులగ్రంథం, ‘ధన్యుడు’ అనే ఈ కీలకమైన అంశంతో ప్రారంభించబడింది. మత్తయి 5:3,11 వంటి ఇతర లేఖనభాగాలలో వాడబడినట్లే, ప్రస్తుత సందర్భంలో కూడా, ‘ధన్యుడు’ అనే మాట రెండు అర్థాలతో వాడబడింది. అతనిపై దేవునిఉగ్రతకు మారుగా ఆయన దీవెనలు కుమ్మరించబడతాయని దీనికి మొదటి అర్థము. తద్వారా అతడు దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాడన్న భావము కూడా ఇందులో ఉంది.
ఇక్కడ ‘ధన్యులు’ అని కాక ‘ధన్యుడు’ అను ఏకవచన ప్రయోగం చేయబడటాన్ని ప్రత్యేకంగా గమనించండి. ఆచరణాత్మక పరిశుద్ధత అనేది పూర్తిగా వ్యక్తిగతమైనదని ఇది స్పష్టం చేస్తుంది. ఎటువంటి వ్యక్తి చేసే స్తోత్రార్పణలు దేవునికి అంగీకారమైనవో వివరిస్తూ ఈ కీర్తన గ్రంథం ప్రారంభం చెయ్యబడటం ఎంతో జాగ్రత్తగా గమనించవసిన విషయం. ఈ మొదటి మూడు వచనాల్లో పరిశుద్ధాత్ముడు, మనల్ని మనం యథార్థంగా పొల్చిచూసుకునేలా, దేవుడిచ్చే ధన్యతను పొంది, ఆయన్ని స్తుతించే అర్హతగల వ్యక్తి యొక్క చిత్రపఠాన్ని మనకొరకు గీసియుంచాడు. ఈ చిత్రపఠంలోని ధన్యుడైన వ్యక్తికి ఉండే ప్రాముఖ్యమైన లక్షణాలను మూడు మాటల్లో వివరించవచ్చు ‘అతని వేర్పాటు', ’(1:1) అతని 'వాక్యధ్యానము’, (1:2) ‘ అతని ఫలవంతజీవితము’. (1:3) .
1. అతని వేర్పాటు:
‘‘దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక’’. 'ఈ మాటలు భక్తిహీనుల దిగజార్పుక్రమాన్ని సూచిస్తున్నాయని వివిధ బైబిల్ వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడ్డారు. మొదట, దుష్టత్వంలో నడవటం; తర్వాత, నిలవటం, అంటే దానిలో మరింత స్థిరపడటం; చివరికి కూర్చోవటం, అంటే శాశ్వతంగా దానిలో లీనమైపోవటం; ఈ క్రమం అక్కడ ప్రస్తావించబడిందని వారు వ్యాఖ్యానించారు. ‘‘ఆలోచన’’, ‘‘మార్గము’’, ‘‘కూర్చునే చోటు’’, ఇవి కూడ ఆ క్రమాన్నే సూచిస్తున్నాయని, అలాగే ‘‘ దుష్టులు’’ , ‘‘ పాపులు’’, ‘‘ అపహాసకులు’’ , అని అక్కడ వాడబడిన సంభోదనాక్రమం ఈ ఆలోచననే మరింత దృఢపరుస్తున్నదనీ వారు తమ వ్యాఖ్యానాలను సమర్థించుకున్నారు, కాని ఈ వచనం వ్యక్తపరిచే ఆలోచన అటువంటిది కానేకాదని , అటువంటి వ్యాఖ్యానం ఈ వాక్యసందర్భానికి సరిపోయినట్టుగా లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పరిశుద్ధాత్ముడు, ఇక్కడ ఒక ధన్యుడైన వ్యక్తి కలిగుండే స్వభావాన్ని వర్ణిస్తున్నాడు తప్ప దుష్టుల దిగజార్పును గురించి ప్రస్తావించటం లేదు. పరిశుద్దాత్ముడు, ధన్యుడైన వ్యక్తి యొక్క నడక వైపుకు మన ధ్యానాన్ని ప్రప్రథమంగా ఆకర్షించటాన్ని గమనించండి. ధన్యుడైన వ్యక్తి యొక్క నడక, దుష్టుల నుండి వేర్పరచబడిన నడక. ఇది ఆత్మపరిశీలనకు తోడ్పడే అత్యంత దీవెనకరమైన తలంపు. ప్రియచదువరీ, వ్యక్తిగత పవిత్రత ప్రారంభమయ్యేది ఇక్కడే, మరింకెక్కడోకాదు ! లోకం నుండి మనల్ని మనం వేర్పరచుకుని, పాపమార్గము నుండి వైదొలగి, ఆ దూరదేశం నుండి వెనుతిరుగనిదే, దేవునితో నడవటం, క్రీస్తును వెంబడించటం, ఆ సమాధానపథంలో కాలిడటం మనకు అసాధ్యం.
దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు ధన్యుడు. ఈ తలంపు ఏ విధంగా వ్యక్తపరచబడిందో గమనించండి. ‘బహిరంగంగా దౌష్ట్యంలో మసలనివాడు’ అని కానీ, ‘మూర్ఖత్వంలో మెలగనివాడు’ అని కాని ఇక్కడ చెప్పబడలేదు కాని, ‘‘దుష్టుల ఆలోచన చొప్పున నడవనివాడు’’ అని చెప్పబడింది. ఇది ఆత్మపరిశీలనని ప్రేరేపించే మాట. ఒక ప్రత్యేకమైన సంగతిని గురించి ఇది మనల్ని హెచ్చరిస్తుంది.
‘‘దుష్టులు’’, విశ్వాసికి ఆలోచన చెప్పటానికి ఎల్లప్పుడూ సంసిద్దత కనపరచటాన్ని మనం తరచుగా చూస్తుంటాము. అతని శ్రేయోభిలాషులుగానే అలా చెస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. భక్తి విషయంలో అంత మితిమీరటం పనికిరాదని వారతనికి సలహా ఇస్తుంటారు. కాని దేవుడు వారి జీవితంలో లేడు కాబట్టి దేవునిభయం వారికి లేదు కాబట్టి వారి పద్దతులన్నీ స్వీయచిత్తం మరియు స్వీయతృప్తి అనే వాటిచేతనే నిర్ణయించబడి ‘ఇంగితజ్ఞానం’ అని వారు పిలిచేదాని చేత నిర్దేశించబడతాయి. అయ్యో, క్రైస్తవులమని చెప్పుకునేవారు ఎందరో ఇంకా తమ భక్తిహీనులైన బంధుమిత్రుల సలహాసంప్రదింపుల చొప్పునే తమ జీవితాల్ని క్రమపరుచుకుంటున్నారు. వారి వ్యాపారవిషయాలలో, వారి సాంఘికజీవిత విధుల్లో, వారి గృహాలంకార విధానాలలో, వస్త్రధారణ మరియు ఆహారపు అలవాట్లలో, తమ పిల్లలను పంపటానికి పాఠశాల ఎంపిక మొదలైన నిర్ణయాలలో వారు దేవుని ఎరుగనివారి ఆలోచన చొప్పున నడవటాన్ని మనము తరచుగా చూస్తుంటాము. కాని ఒక 'ధన్యుని' విషయం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అతడు వారి ఆలోచనను అనుసరించటానికి భయపడతాడు. అతడు దానిని తృణీకరించి, ‘‘సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు నాకు అభ్యంతరకారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కాని దేవుని సంగతులను తలంపకయున్నావ’’ని అంటాడు.
‘ఎందుకు?’ ఎందుకంటే తనకు దిశానిర్దేశం చేయటానికి లెక్కలేనన్ని రెట్లు మెరుగైనది మరొకటి ఉందని దేవునికృప అతనికి నేర్పింది. పొరబడని దేవుని వివేకం చేత రాయబడి, తన ప్రతీ అవసరానికి మరియు పరిస్థితికి తగిన విధంగా తన పాదాలకు దీపంగాను తన త్రోవకు వెలుగుగాను ఉండేలా రూపొందించబడిన దేవునివాక్యం అతనికి ఇవ్వబడింది. భ్రష్టమైన దుష్టుల ఆలోచన చొప్పున కాక దేవుని హితవాక్యం చొప్పున నడవాలన్నదే అతని హృదయవాంఛ మరియు తీర్మానం. పాపభూయిష్టమైన ఈ లోకంలో నీతిమార్గాన్ని అనుసరించటానికి మన మార్గదర్శిగా ఉండమని మన హృదయాన్ని ఆయనకు సమర్పించి లోబర్చుకోవటమే మారుమనస్సుకు సరైన నిర్వచనం. ఈ లోకం నుండి ధన్యుడైన వ్యక్తి యొక్క వేర్పాటు మూడు విధాలుగా వ్యక్తపరచబడింది. మొదటిగా, అతడు ‘‘దుష్టుల ఆలోచన చొప్పున నడువడు’’ ; అంటే ఈ లోకమర్యాదని అనుసరించి నడవడు. హవ్వ, హేరొదియ కుమార్తె మొదలైనవారు దుష్టుల ఆలోచన చొప్పున నడిచినవారికి ఉదాహరణలుగా ఉన్నారు. ఇందుకు విరుద్ధంగా, పోతిఫరుభార్య యొక్క దురాలోచనని యోసేపు తోసిపుచ్చటం, గొల్యాతును ఎదుర్కోవటానికి కవచాన్ని ధరించాలన్న సౌలు సలహాను దావీదు నిరాకరించటం, దేవుని దూషించి మరణము కమ్మనిన తన భార్య మాటను యోబు వ్యతిరేకించటం, దుష్టుల ఆలోచన చొప్పున నడవకపోవటానికి ఉదాహరణలుగా ఉన్నాయి.
రెండవదిగా, అతడు పాపుల మార్గాన నిలువడు. ఇక్కడ ధన్యుడైన వ్యక్తి కలిగుండే సాంగత్యము ఎటువంటిదో చెప్పబడింది. అతడు పాపులతో కాక నీతిమంతులతో సహవాసాన్ని కోరుకుంటాడు. అబ్రాహాము కల్దీయుల ఉర్ అనే పట్టణాన్ని విడిచి వెళ్ళటం, మోషే ఐగుప్తు ధనఘనతల్ని త్యజించటం, రూతు మోయాబు దేశాన్ని విడిచి నయోమి వెంట వెళ్ళటం మొదలైనవి ఇందుకు ప్రశస్తమైన ఉదాహరణలు.
మూడవదిగా, అతడు అపహాసకులు కూర్చునే చోటున కూర్చోడు. ఇక్కడ ‘‘ కూర్చుండు చోటు’’ అనే మాట విశ్రమించటం లేక నిమగ్నమవ్వటానికి నిదర్శనం. అందుకే అపహాసకులు అంటే నిజమైన విశ్రాంతినిచ్చేవానిని తృణీకరించి తమ పాపమార్గంలో విశ్రాంతిని అన్వేషించేవారని అర్థం. కాబట్టి అపహాసకులు కూర్చుండుచోట కూర్చోకపోవటం అంటే ధన్యుడైన వ్యక్తి లోకస్తులు అనుభవించే వినోదవిలాసాలలో తన విశ్రాంతిని వెదకడు అని అర్థం. అల్పకాలపు పాపభోగాలు అతనిని తృప్తిపరచవు. ‘‘నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు’’ అంటూ మరియవలె అతడు ప్రభువు పాదాల చెంత కూర్చోవటానికి ఆకాంక్షిస్తాడు.
2. అతని వాక్యధ్యానము:
ధన్యుడైన వ్యక్తిజీవితం ప్రధానంగా వాక్యధ్యానంతో నిండి ఉంటుంది. అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు. ఆధ్యాత్మిక సంగతుల్ని హేళన చేసేవారు అందించే వినోదాలలో లోకస్తుడు ఆనందిస్తాడు. కాని ధన్యుని విషయం ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతడు ఈ లోకము అందించలేని అత్యుత్తమమైనదాని నుండి అంటే దేవునివాక్యం నుండి తన ఆనందాన్ని పొందుతాడు. దేవునివాక్యానికి పర్యాయపదంగా దావీదు ‘‘యెహోవా ధర్మశాస్త్రం’’ అన్న మాటను తరచుగా వాడటాన్ని మనం గమనిస్తాము ( కీర్తన 19 మరియు 119 చూడండి). యెహోవా ధర్మశాస్త్రం అన్న మాట ఆ ధర్మశాస్త్రానికి అధికారం సంతరింపజేసింది దేవుని చిత్తమేనని మనకు జ్ఞాపకం చేస్తుంది. దానియందు ఆనందించటం తిరిగి జన్మించినవారికి ఉండే ఖచ్చితమైన లక్షణం. ‘‘ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు’’ రోమా 8:7. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించటం మనం క్రీస్తు ఆత్మను పొందామనటానికి ఖచ్చితమైన రుజువు. ఎందుకంటే ఆయన ‘‘ నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నద’’ని అంటున్నాడు - కీర్తన 40:8. దేవునివాక్యము ధన్యుడైన వ్యక్తికి అనుదిన ఆహారము. ప్రియ చదువరీ నీ విషయంలో కూడా ఇది వాస్తవమా? తిరిగి జన్మించనివాడు స్వయాన్ని తృప్తిపరచుకోవటంలో ఆనందిస్తాడు; కాని ఒక నిజక్రైస్తవుడు మాత్రం దేవుని తృప్తిపరచటంలోనే ఆనందిస్తాడు. అతడు యెహొవా ధర్మశాస్త్రమునందు కేవలం ఉత్సాహం చూపిస్తాడని ఇక్కడ చెప్పబడలేదు గాని అతడు దానియందు ఆనందిస్తాడని వ్రాయబడింది. యెహోవా సాక్ష్యులు, క్రిస్టడెల్పియన్లు మొదలైన అవాంతరశాఖలకు చెందిన వేలాదిమందితో సహా వాక్యానుసారభావాలు గల కొందరు సహితం లేఖనాలలోని ప్రవచనాలు, సాదృశ్యాలు, మర్మాలు, వాగ్దానాలు మొదలైనవాటిని నిశితంగా పఠించటంలో ఆనందిస్తారు. అయినా వాటిని రాసినవాని అధికారానికి లోబడి ఉండటంలో కానీ వాటిలో బయలుపరచబడిన ఆయన చిత్తానికి లోబడటంలో కానీ వారు ఆనందించట్లేదు. ధన్యుడైన వ్యక్తి దేవుని ఆజ్ఞయందు ఆనందిస్తాడు. ఇంకెక్కడా లభించని విధంగా పవిత్రమైన, స్థిరమైన ఆధ్యాత్మిక సంతోషం, సమాధానం మరియు సంతృప్తి దేవుని ఆజ్ఞను గైకొనటంలో లభిస్తాయి. యోహాను చెప్పిన విధంగా ‘‘ఆయన ఆజ్ఞలు భారమైనవికావు’’ ( 1 యోహాను 5:3 ) మరియు దావీదు ప్రకటించినట్లు ‘‘వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును’’ (కీర్తన 19 : 11).
అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ‘‘దివారాత్రము’’ ఆనందిస్తాడు. ఒకని ధనమెక్కడ ఉండునో అక్కడనే వాని హృదయము కూడా ఉండును. కాబట్టి ధన్యుడైన వ్యక్తి ‘‘దివారాత్రము’’ దేవునివాక్యము చేతనే ఆక్రమితుడైయుంటాడు. విలాసవంతుడైన వ్యక్తి ఇంద్రియసుఖాలను పొందుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. చపలబుద్ధిగల యవ్వనుస్తుడికి ఆటపాటల మీద మాత్రమే మనస్సుంటుంది. లోకస్తుడు తన శక్తిసామర్థ్యాలన్నీ,ఐశ్వర్యాన్ని మరియు ఘనతని సంపాదించుకోవటానికే వెచ్చిస్తాడు. కాని అన్ని సమయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ దేవునిని తృప్తిపరచాలన్నదే ధన్యుడైన వ్యక్తి యొక్క యథార్థమైన కోరిక. కాబట్టి దేవునిచిత్తాన్ని తెలుసుకోవటానికి అతడు దివారాత్రము ఆయన పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తాడు. తద్వారా అతడు దాని వెలుగును పొంది, దాని మాధుర్యాన్ని అనుభవించి దాని చేత పోషింపబడతాడు. అతని వాక్యధ్యానం కొన్నికొన్ని సందర్భాల్లో అడపాదడపా జరిగేది కాదు; అది క్రమంగా ఎడతెగకుండా జరుగుతుంది. కలిమి యొక్క వెలుతురులోనే కాక లేమి యొక్క చీకటిలో కూడా, బలమైన యవ్వనదినాల్లో మాత్రమే గాక బలహీనమైన వృద్ధాప్యదినాల్లో కూడా అతను యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తాడు.
‘‘ నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతియగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి’’( యిర్మియా 15:16).
‘‘వాటిని భుజించితిని’’ అనగా అర్థమేమిటి? అన్వయించుకోవడం, నెమరువేయడం, జీర్ణింపజేసుకోవడం. ఆహర విషయంలో 'నమలటం' ఎలాంటిదో , వాక్యాన్ని పఠించే విషయములో 'ధ్యానించటం' కూడా అలాంటిదే. దేవునివాక్యాన్ని మనసులో ధ్యానించుకుంటూ, పదేపదే దానిని గురించి ఆలోచిస్తూ విశ్వాసంతో దానిని సొంతం చేసుకున్నప్పుడు అది మనలో జీర్ణింపబడుతుంది. మన మనస్సు దేనిచేత ఆక్రమితమైయుంటుందో, మన తలంపులు దేని చేత పట్టబడియుంటాయో దానియందే మనం ఆనందిస్తాము. ఒంటరితనానికి ఇదే చక్కటి చికిత్స; (ఇది అనేకసార్లు రచయిత యొక్క స్వీయానుభవమైయున్నది) ; అనగా యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించుట. ఐతే నిజంగా ధ్యానించడం అంటే విధేయత చూపడమే. ‘‘ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత పడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల.............’’ (యెహోషువా.1:8) ‘‘ యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము’’( కీర్తను 5:1) అని కీర్తనాకారుడు విన్నవించుకున్నట్లు నీవు చేయగలవా?
3. అతని ఫలవంతజీవితం
‘‘ అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును.’’ (కీర్తన 1:3). ఇక్కడ మనము ధన్యుడైన వ్యక్తి యొక్క ఫలవంతజీవితం గురించి చదువుతాము. కాని దీనిని కలిగుండటానికి ముందు జరగవలసినదేమిటో శ్రద్ధగా గమనించండి. లోకముతో తెగదెంపులు; దాని ఆలోచనావిధాలనుండి, దాని మర్యాదనుండి వేర్పాటు; దానిని సమర్థించేవారితో సహవాసం చేయకపోవటం, దాని విలాసాన్ని విసర్జించటం; దేవుని అధికారానికి తలొగ్గి, మన:పూర్వకంగా ఆయన ఆజ్ఞలను శిరసావహించటం; మొదట ఇవి సంభవించకుండా ఆయన కొరకు ఫలించటం అనేది అసంభవం. ‘‘చెట్టు వలె ఉండును’’ అన్న ఈ సాదృశ్యం అనేక వాక్యభాగాలలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దేవునిబిడ్డకు మరియు వృక్షమునకు ఎన్నో పొలికలున్నాయి. అతడు గాలికి కొట్టుకొనిపోవు రెల్లువంటివాడు కాదు; నేలపై ప్రాకు తీగవంటివాడూ కాదు. చెట్టు నిటారుగా ఆకాశం దిశగా ఎదుగుతుంది, పైగా ఇది ‘‘నాటబడిన’’ చెట్టు. అనేక వృక్షములు నాటబడవు కానీ వాటంతట అవే ఏపుగా ఎదుగుతాయి. నాటబడిన చెట్టు దాని యజమాని యొక్క శ్రద్ధ, సాగుబడి క్రింద ఎదుగుతుంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు దేవునికి చెందినవారనీ, వారు ఆయన కాపుదల మరియు పొషణ క్రింద ఉన్నారనీ ఆ సాదృశ్యం హమీ ఇస్తుంది.
‘‘నీటి కాలువ యోరను నాటబడినదై’’ అది సేదదీర్చుకొనే, కృపానదులు పారే సహవాసమందించే నూతనపరిచే స్థలం, మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే బహుశా ఇది యెషయా 32:2లోని వృత్తాంతాన్ని సూచిస్తుందేమో. ‘‘మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును’’ ( యెషయా 32:2). ఇది క్రీస్తుని సూచిస్తుంది. నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు ఆ కాలువ నుండి పొషణను ఎలా అందుకుంటుందో అదే విధముగా విశ్వాసి క్రీస్తుకు సన్నిహితంగా ఉండి ఆయన నుండి తన ఎదుగుదలకు కావసినదంతా పొందుకుంటాడు. ‘‘తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును ’’` కృపాపాత్రునిగా తీర్చిదిద్దబడినవానిలో ఈ లక్షణం తప్పనిసరి. ఎందుకంటే నిజమైన ద్రాక్షవల్లిలో, ఫలించని తీగె ఉండటం సాధ్యంకాదు.
‘‘తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును’’; అన్ని ఫలాలు ఒకే కాలంలో ఫలించవు. అదే విధంగా ఆత్మఫలం ఒకే కాలంలో ఉత్పన్నం చేయబడదు. శ్రమలు విశ్వాసానికి, బాధలు ఓర్పునకు, నిరాశలు సాత్వికతకును, అపాయములు ధైర్యానికి, ఆశీర్వాదము స్తుతికి, మేలులు సంతోషానికి పిలుపునిస్తాయి. ఈ సమయోచితమైన మాట సమయానుకూలమైనది. క్రొత్తగా జన్మించిన శిశువుల్లో పరిపక్వత యొక్క ఫలాలు ఉండాలని ఆశించరాదు. ‘‘ఆకు వాడక...................’’ అన్న మాటకు అతని క్రైస్తవవిశ్వాసము తేజోవంతమూ, సజీవసత్యమునునై ఉందని తెలుపుతుంది. అతడు జీవించుచున్నాడను పేరు మాత్రమే ఉండి మృతుడైయున్నవాడు కాదు. అతని క్రియలు అతని విశ్వాసాన్ని ఋజువుపరుస్తాయి. అందుచేతనే అతడు ఆకువాడని చెట్టు మాత్రమే కాదు ఫలమిచ్చు చెట్టు కూడా. దేవుని మహిమార్థమై ఫలించకపోతే మనము విశ్వాసులమని ప్రకటించుకోవటం కేవలం అపహాస్యమే. ‘‘అతడు క్రియలోను వాక్యములోను శక్తిగలవాడైయుండెను’’ (లూకా 24:19) అని క్రీస్తుని గురించి చెప్పబడినది గమనించండి. ‘‘ఆయన చేయుటకును, బోధించుటకును ఆరంభించిన..............’’(అ.పొ 1:2) అన్న మాటలో కూడా ఇదే క్రమాన్ని చూడగలము.
‘‘అతడు చేయునదంతయు సఫలమగును’’ - ఇది ధన్యుడైన వ్యక్తికి అవశ్యముగా కలుగుతుంది. అయినా అది ఎల్లప్పుడూ బాహ్యనేత్రాలకు కనిపించే సాఫల్యం కాకపోవచ్చు. క్రీస్తునామంలో గిన్నెడునీళ్ళు మాత్రం త్రాగనిచ్చువానికి సహితం ప్రతిఫలం లభించకపోదు; ఇక్కడ కాకపోతే రానున్న జీవితంలో అతడు తప్పక దానిని పొందుతాడు.
ప్రియచదువరీ! నువ్వు ఎంతమేరకు ఈ ధన్యుడైన వ్యక్తిని పోలియున్నావు! ఈ మూడు వచనాల క్రమాన్ని మరోసారి శ్రధ్ధగా గమనిద్దాము. మొదటి వచనంలో పేర్కొనబడిన పాపాలకు మనము స్థానమిచ్చే కొద్దీ యెహోవా ధర్మశాస్త్రమునందలి ఆనందము మనలో క్షీణిస్తుంది. ఆయన వాక్యానుసారమైన చిత్తానికి మనము లొబడనికొద్దీ మనము నిష్ఫలమౌతాము. అయితే లోకంలో సంపూర్ణంగా వేర్పడి, హృదయపూర్వకంగా దేవునిలో నిలిచుండటం ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఫలమివ్వటానికి దారితీస్తుంది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments