ఇతర అంశాలు

రచయిత: కె. విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు
 
 

400year1

పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబిల్ గ్రంథంలో (2 పేతురు 1:20,20) పరస్పర వైరుధ్యాలు ఉండడం అసాధ్యం. దేవుని‌వాక్యం సత్యం (యోహాను17:17, కీర్తనలు 119:160). అయితే ప్రవక్తలూ అపోస్తలులూ రాసినటువంటి ఆ లేఖనాలను భద్రపరచడానికి అనగా భవిష్యత్తు తరాలకు వాటిని అందించడానికి కొందరు ప్రతులు రాయడం ప్రారంభించినప్పుడు వాటిలో చిన్నచిన్న పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆ సమయంలో ముద్రణాయంత్రాలు లేవు. చాలా కష్టమైన పద్ధతిలో అనగా దీపపు కాంతిలో చేతులతోనే ప్రతులు రాయవలసియుండేది. పైగా వారు దానికి ఉపయోగించింది మనలాంటి పెన్నులనూ పేపర్లనూ కాదు. అందుకే కొన్ని పొరపాట్లు జరిగేవి. ప్రస్తుత మనం బైబిల్ గ్రంథంలో కొన్నిచోట్ల సంఖ్యాపరమైన, పేర్లకు సంబంధించిన వైరుధ్యాలు, కనిపించడానికి ఆ పొరపాట్లే కారణం. అలాంటి సమయంలో మనం మన ప్రస్తుత బైబిళ్ళు తర్జుమా చెయ్యబడిన వ్రాతప్రతుల కంటే పురాతనమైన వ్రాతప్రతులనూ యూదులు మొట్టమొదటిసారిగా హీబ్రూ భాషనుండి గ్రీకు లోనికి తర్జుమా చేసిన పాతనిబంధన "Septuagint" (LXX) ను పరిశీలించడం ద్వారా పరిష్కరించవచ్చు. Dead see scrolls తో పాటు అవన్నీ అందుబాటులో ఉన్నాయి. అలానే అదే సందర్భం రాయబడిన మిగిలిన లేఖనాలను శ్రద్ధగా పరిశీలించినప్పుడు కూడా అవి చాలామట్టుకు పరిష్కరించబడతాయి.

గమనించండి; దేవుడు ఆత్మప్రేరణతో రాయించిన లేఖనాలలో మొదట ఎలాంటి పొరపాటూ జరగలేదు. ప్రతులు రాసేటప్పుడు జరిగిన పొరపాట్లను కూడా మనం పరిశీలించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఆవిధంగా ఆయన ప్రవక్తల ద్వారా ఆపోస్తలుల ద్వారా ఏదైతే రాయించాడో దానిలో ఏదీకూడా మనం కోల్పోవడం లేదు, పేతురు బోధించినట్టుగా ఆ మాటలు శాశ్వతంగా ఉన్నాయి (1పేతురు 1:24). పైగా ప్రతులు రాసేటప్పుడు జరిగిన ఆ పొరపాట్లు కేవలం సంఖ్యాపరమైనవీ పేర్లకు సంబంధించినవే తప్ప సందేశానికి సంబంధించినవి కావు. ఇక అంశంలోనికి వెళ్తున్నాను.

ఆదికాండము 15:13-16 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. 

ఈ వాక్యభాగంలో దేవుడు అబ్రాహాముకు రెండు విషయాలను తెలియచేస్తున్నాడు.
మొదటిగా; అతని సంతానం పరాయి దేశంలో 400 సంవత్సరాల పాటు శ్రమ అనుభవిస్తుంది. 
రెండవదిగా; ఆ సంతానం యొక్క నాలుగవతరం‌ ఆ శ్రమనుండి విడిపించబడి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు మొదటిగా అబ్రాహాము సంతానం 400 సంవత్సరాల పాటు పరాయి దేశంలో శ్రమ అనుభవించడం గురించి తెలుసుకుందాం. దీనిగురించి స్తెఫను కూడా ప్రస్తావించాడు (అపొ. కా 7:6). చాలామంది "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను" (నిర్గమకాండము 12:40,41) అని రాయబడడాన్ని బట్టి, దేవుడు అబ్రాహాముతో చెబుతున్న ఆ 400 సంవత్సరాలూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో శ్రమ అనుభవించిన కాలంగా భావిస్తుంటారు. కానీ ఈ వాక్యభాగంలో 400 అని కాదు 430 సంవత్సరాలు అని రాయబడింది. నిజానికి ఈ రెండు సందర్భాలలోనూ రాయబడినటువంటి 400, 430 సంవత్సరాలు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివశించిన కాలం మాత్రమే కాదు.

ఎందుకంటే; యాకోబు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళడానికీ (ఆదికాండము 46) వారు మోషే నాయకత్వంలో అక్కడినుండి విడుదల కావడానికి మధ్య ఉన్న సమయాన్ని మనం పరిశీలిస్తే;

నిర్గమాకాండం 6:16-20 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను. మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తయైన యోకె బెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

ఈ వాక్యభాగం ప్రకారం ఐగుప్తులో ప్రవేశించిన యాకోబు కుమారుల్లో ఒక కుమారుడైన లేవీ కహాతును కన్నాడు, కహాతు అమ్రామును కన్నాడు, అమ్రాము మోషేను కన్నాడు. ఈ మోషే నాయకత్వంలోనే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుండి స్వతంత్రులయ్యారు. వాదనకోసం వీరందరూ ఐగుప్తులో తమ 100వ యేటన కుమారుడిని కన్నారని అనుకున్నప్పటికీ ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల పాటు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారని రుజువు చెయ్యడం అసాధ్యం.  ఎందుకంటే; లేవి ఐగుప్తులో 100 సంవత్సరాలు బ్రతికి కహాతును కన్నప్పటికీ కహాతు ఐగుప్తులో 100 సంవత్సరాలు బ్రతికి అమ్రామును‌ కన్నప్పటికీ అమ్రాము ఐగుప్తులో 100 సంవత్సరాలు బ్రతికి మోషేను కన్నప్పటికీ అక్కడికి 300 సవత్సరాలే ఔతుంది. మోషే తన 80వ యేట ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు (నిర్గమకాండము 7:7). ఇదంతా కలిపిచూస్తే కేవలం 380 సంవత్సరాలే ఔతున్నాయి. ఈ లెక్కలన్నీ మనం వాదనకోసమే చూస్తున్నాం తప్ప, వాస్తవానికి వారంతా ఐగుప్తులో తమ 100వ యేట కుమారులను కనలేదు. ఉదాహరణకు; లేవి ఐగుప్తుకు రాకముందే కహాతును‌ కన్నాడు (ఆదికాండము 46:11). వారికాలంలో పితరులవలే 100వ యేట కుమారులను కనే పరిస్థితి లేదు. అందుకే అబ్రాహాము కూడా 99 సవత్సరాలకే సంతానం విషయంలో ఆందోళన చెందాడు (ఆదికాండము 17:17). కాబట్టి వారంతా ఆ వయస్సుకు ముందే పిల్లలను కన్నారు. దీనిప్రకారం మనం వాదన కోసం చూసినటువంటి 380 సంవత్సరాలకు చాలా ముందుగానే వారు ఐగుప్తు దాసత్వం నుండి విడుదలయ్యారు.

అదెలాగో చూద్దాం; మనం పైన నిర్గమకాండము 12:40 వాక్యభాగంలో "ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు" అని రాయబడడం చూసాం.  ప్రస్తుతం మనం వాడే బైబిల్ గ్రంథాలు అన్నీ‌ క్రీస్తుశకం 10/11వ శతాబ్దానికి చెందిన "Leningrad codex, Aleppo codex" అనే ప్రతులనుండి తర్జుమా చెయ్యబడ్డాయి. వీటిని "Masoretic" అనే గుంపువారు (క్రీస్తుశకం 8వ శతాబ్దం) ప్రతులుగా చెయ్యడం వల్ల వీటిని "Masoretic Texts" అని కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథాన్ని మిగిలిన భాషల్లోకి ముద్రించడానికి ఈ "Leningrad codex, Aleppo codex" ప్రతులు మాత్రమే పూర్తి వాక్యంతో అనగా పాతనిబంధనను కలిగియున్నటువంటి పురాతన వ్రాతప్రతులు. మిగిలిన ప్రతుల్లో పూర్తి పాతనిబంధన వాక్యాలన్నీ అందుబాటులో లేకుండా పాడైపోయాయి. ఈ రెండు వ్రాతప్రతుల్లో కూడా "Aleppo codex" పూర్తిగా లేకుండా కొంతమట్టుకు పాడైపోయింది. అందుకే ఎక్కువశాతం పాతనిబంధనను "Leningrad codex" నుంచి తీసుకుంటూ వారికేదైనా confusion నెలకొన్నప్పుడు "Aleppo codex" లోని అందుబాటులో ఉన్న వాక్యంతో పోల్చుకునేవారు‌. అప్పటికి ఇంకా "dead see scrolls" లభ్యంకాలేదు‌.

అంతకు ముందున్న క్రైస్తవ సంఘం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోకి అనువదించబడిన పాతనిబంధన Septuagint (LXX) నూ జెరోమ్ భక్తుడు గ్రీకు భాషనుండి లాటిని బాషలోకి అనువదించిన బైబిల్ నూ ధ్యానించేవారు. దానినే "Vulgate" అంటారు. మొట్టమొదట గ్రీకు బాషనుండి లాటిన్ బాషలోకి అనువదించబడిన పాతక్రొత్తనిబంధల సంపూర్ణ బైబిల్ గ్రంథం అదే. అయితే జెరోమ్ అందులో యూదుల చరిత్రకు సంబంధించిన అపోగ్రిఫా పుస్తకాలను కూడా చేర్చడం జరిగింది.

విషయానికి వస్తే; ఈవిధంగా మన బైబిళ్ళు తర్జుమా చెయ్యడానికి ఆధారమైన "Leningrad codex, Aleppo codex" వ్రాతప్రతుల్లో మనం పైన చూసినటువంటి "నిర్గమకాండము 12:40 వాక్యభాగంలో" ఒక పొరపాటు చోటుచేసుకుంది.  వాస్తవానికి ఈ రాతప్రతులు రాయబడడానికంటే ముందునుండీ ఉన్నటువంటి "Samaritan Pentateuch" అనే పూరాతన హీబ్రూ వ్రాతప్రతిలో (క్రీస్తుపూర్వం 100) ఆ వాక్యభాగం "ఇశ్రాయేలీయులూ వారి పితరులూ కానానులోనూ ఐగుప్తులోనూ నివసించినకాలం 430 సంవత్సరాలని ఉంటుంది". కాబట్టి మనం నిర్గమకాండము 12:40 లో చూసినటువంటి 430 సంవత్సరాలూ కేవలం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం మాత్రమే కాదు కానీ దేవునిపిలుపు మేరకు అబ్రాహాము కనానులో ప్రవేశించి, అక్కడ ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యాకోబు యోసేపును కని ఆ యోసేపు ద్వారా యాకోబు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళి విస్తరించి, ఆ విస్తరించిన ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విడుదలయ్యేంతవరకూ గడిచిన కాలమే ఆ 430 సంవత్సరాలు. ఇది కేవలం "Samaritan Pentateuch" వ్రాతప్రతిలో మాత్రమే కాదు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో హీబ్రూ నుండి గ్రీకులోకి తర్జుమా చెయ్యబడిన పాతనిబంధన Septuagint (LXX) లో కూడా అలానే అనగా "ఇశ్రాయేలీయులూ వారి పితరులూ కనానులోనూ ఐగుప్తులోనూ నివసించిన కాలం‌ 430 సంవత్సరాలు" అని తర్జుమా చెయ్యబడింది (నిర్గమకాండము 12:40). మొదటి శతాబ్దపు యూదాచరిత్రకారుడూ యెరుషలేము దేవాలయంలో యాజకుడిగా పనిచేసిన "ప్లేవియస్ జోసెఫెస్" కూడా ఆయన రచించినటువంటి "The Antiqueties of the Jews" అనే పుస్తకం రెండవభాగం,15 వ అధ్యాయంలో తమ పితరుడైన అబ్రాహాము కనాను దేశంలో ప్రవేశించిన 430 యేళ్ళ తర్వాత ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడిపించబడ్డారని స్పష్టంగా రాసాడు. దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ తండ్రి ఇంటిని విడచి కనానుకు వెళ్ళు నీ సంతానాన్ని ఆకాశనక్షత్రాలవలే ఇసుకరేణువులవలే విస్తరింపచేస్తానని చెప్పినప్పుడు అబ్రాహాము ఆయన చెప్పినట్టుగానే కనానుకు వచ్చాడు (ఆదికాండము 12:1-5). అప్పటినుండి (దేవుడు వాగ్దానం చేసినప్పటినుండీ) ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో  ఐగుప్తునుండి బయటకు వచ్చి సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందేవరకూ మధ్యఉన్న సమయం 430 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు వచ్చిన అదే సంవత్సరంలోనే (430 వ యేట) సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. నిర్గమకాండము 19వ అధ్యాయం నుండి ఆ వివరాలు మనం చదువుతాం. దీనిగురించి పౌలు కూడా ధర్మశాస్త్రం అనేది అబ్రాహాముకు దేవుడు అతని సంతానం గురించి వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత వచ్చిందని తెలియచేస్తున్నాడు (గలతీ 3:17). ఇంతటితో నిర్గమకాండము 12:40 వాక్యభాగంలో 430 సంవత్సరాలని దేనిగురించి రాయబడిందో మనకు స్పష్టం అయ్యింది.

ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు ఎక్కడ? ఎలా? శ్రమపడిందో చూద్దాం;

ఆదికాండము 15:13,14 ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

అపొస్తలుల కార్యములు 7:6 అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను.

ఈ వాక్యభాగాల ప్రకారం అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు తమది కాని దేశంలో పరదేశులుగా శ్రమలు అనుభవిస్తారు. ఈ 400 సంవత్సరాల విషయంలో కూడా అవి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో అనుభవించిన శ్రమలుగా మాత్రమే కాదు కానీ అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు, అతని కుమారుడైన యాకోబులతో సహా వారు కనాను దేశంలో అనుభవించిన శ్రమలతో కలిపి అర్థం చేసుకోవాలి. గమనించండి. దేవుడు అబ్రహాముకు కనాను దేశం నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసాడే తప్ప అది అతనికి కానీ అతని కుమారునికి కానీ ఆ కుమారుని కుమారునికి కానీ స్వాధీనపరచలేదు. ఆయన ఐగుప్తు నుండి తిరిగివచ్చిన అబ్రాహాము సంతానానికి అనగా ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆ దేశాన్ని స్వదేశంగా పంచాడు. ఆ వివరాలన్నీ మనం యెహోషువ గ్రంథంలో చదువుతాం. అంతకుముందు అదే కనాను దేశంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు పరదేశులుగానే జీవించారు (ఆదికాండము 12:6,7, అపొ. కా 7:4,5, ఆదికాండము 26:1-4, 37:1, హెబ్రీ 11:8,9). అబ్రహాము తన తండ్రి ఇంటినుండి‌ కనానుకు వచ్చేసరికి అతనికి 75 సంవత్సరాలు (ఆదికాండము 12:4). ఆ సమయం నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదలయ్యేవరకూ 430 సంవత్సరాలు (ఇది పైన వివరించాను). అబ్రహాము తన 100 వ యేటన ఇస్సాకును కన్నాడు (ఆదికాండము 21:5). అంటే అబ్రాహాముకు ఇస్సాకు అతను కనానులో ప్రవేశించిన 25 సంవత్సరాల తర్వాత జన్మించాడు. అంటే ఇస్సాకు జన్మించి‌నప్పటినుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు‌ నుండి విడుదలయ్యేసరికి 405 సంవత్సరాలు. సాధారణంగా ఆ ప్రజలు తమ పిల్లవాడికి 5వ సంవత్సరంలో పాలు పూర్తిగా మానిపించి, ఆరోజున గొప్ప విందును చేస్తారు.‌ ఇది ఇస్సాకు విషయంలో కూడా జరిగింది (ఆదికాండము 21:8). దీనిప్రకారం అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకుకు 5వ సంవత్సరంలో పాలు మానిపించి విందుచేసాడు.

నేను పైన వివరించినట్టుగా ఇస్సాకు పుట్టినప్పటినుండి ఇశ్రాయేలీయులు‌ ఐగుప్తు నుండి విడుదల అయ్యేవరకూ ఉన్న మధ్య సమయం 405 సంవత్సరాలు ఐతే అబ్రాహాము ఇస్సాకు చేత పాలు మానిపించి విందుచేసిన సమయం నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల అయ్యేవరకూ ఉన్న మధ్య సమయం 400 సంవత్సరాలు. అదే రోజున ఇస్సాకుకు హాగరు కుమారుడైన ఇస్మాయేలునుండి శ్రమ సంభవించినట్టు రాయబడింది (ఆదికాండము 21:8-10, గలతీ 4:28-30). ఇది ఇస్సాకు జీవితంలో అతనికి సంభవించినటువంటి మొదటి శ్రమ. అప్పటినుండి ఇస్సాకు జీవితాన్నీ యాకోబు జీవితాన్నీ మనం పరిశీలిస్తే వారు పరదేశులుగా జీవించిన ఆ దేశంలో రాజులనుండీ ప్రజలనుండీ వారు ఎన్నో శ్రమలను అనుభవించినట్టుగా గమనిస్తాం. తర్వాత యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు అమ్మివెయ్యబడ్డాడు (ఆదికాండము 37). అతనిని బట్టి యాకోబు సంతానమంతా ఐగుప్తులో ప్రవేశించి (ఆదికాండము 46) కొంతకాలం‌ తర్వాత వారికి దాసులుగా మారి ఎంతో శ్రమపడ్డారు (నిర్గమకాండము 1). ఆ తర్వాత దేవుడు వారిని మోషే ద్వారా అక్కడినుండి విడిపించాడు (నిర్గమకాండము 12). ఈ ప్రకారంగా ఇస్సాకు తాను పాలు విడిచిన 5వ సంవత్సరంలో శ్రమపడినప్పటినుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు శ్రమల నుండి బయటకు వచ్చేంతవరకూ 400 సంవత్సరాలు. అబ్రాహాముతో దేవుడు నీ సంతానం 400 యేళ్ళు తమది‌కాని పరదేశంలో శ్రమపడతారని చెప్పింది దీని గురించే. ఇంతటితో అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు తమది కాని దేశంలో దాసులుగా శ్రమపడతారనే దాని గురించి కూడా మనకి స్పష్టత లభించింది.

ఇక దేవుడు అక్కడ అబ్రాహాముతో చెప్పినట్టుగా అతని నాలుగవ తరం కనానులో ప్రవేశించిందా అనేదానికి కూడా వివరణ చూద్దాం;

చాలామంది అబ్రాహాము నాలుగవ తరం అనగానే అబ్రాహాము నుండి ‌లెక్కవేసి యాకోబు కుమారులతో నాలుగవ తరం ఔతుంది కాబట్టి వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదని సందేహపడుతుంటారు. అసలు అబ్రాహాము సంతానం‌ కనానును విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిందే యాకోబు కుమారుల కాలంలో (ఆదికాండము 46:2-7). అలాంటప్పుడు వారెలా కనానును స్వాధీనం చేసుకోగలరు?. కాబట్టి దేవుడు ఆ సందర్భంలో "అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుము" (ఆదికాండము 15:16) అనంటే నీ సంతానంలోని నాలుగవ తరంవారు ఇక్కడికి వస్తారని అర్థం. మొదటినుండీ ఆయన ఆ భూమిని నీ సంతానానికి స్వాధీనం చేస్తాననే వాగ్దానం చేసాడు. గమనించండి. అబ్రహాముకు పుట్టిన కుమారులలో దేవుడు ఇస్సాకును మాత్రమే ఏర్పరచుకున్నాడు, ఇస్సాకుకు పుట్టిన కుమారులలో దేవుడు యాకోబును మాత్రమే ఏర్పరచుకొన్నాడు. యాకోబుకు పుట్టిన కుమారులు మాత్రమే అందరూ అబ్రాహాము సంతానంగా గుర్తించబడ్డారు. అప్పటినుండి మనం‌ లెక్కిస్తే అబ్రాహాము సంతానంలో నాలుగవ తరం వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు.

నిర్గమకాండము 6:16,18,20 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. 

ఈ వాక్యభాగం ఆధారంగా అబ్రాహాము సంతానంలో లేవి నుంచి, నాలుగవ తరమైన మోషే తరంలోని వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే ఇక్కడ మీకు ఐగుప్తునుండి బయటకు వచ్చిన తరంలోని వారంతా కనానులో ప్రవేశించకుండానే నాశనం చెయ్యబడ్డారుగా మోషే అహరోనులు కూడా ఐగుప్తులో ప్రవేశించలేదుగా అనే సందేహం రావొచ్చు. కానీ ఆ తరంలో అందరినీ దేవుడు నాశనం చెయ్యలేదు, యపున్నె కుమారుడైన కాలేబు కనానులో ప్రవేశించాడు (సంఖ్యాకాండము 14:23,24). యెహోషువా కూడా. ఈవిధంగా దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగానే అతని సంతానపు నాలుగవ తరం వారు కనానును స్వాధీనం చేసుకున్నారు. ఇంతకూ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివసించారు?

అబ్రాహాము తన 75వ యేట కనానుకు వచ్చి (ఆదికాండము 12:4) 100వ యేట ఇస్సాకును కన్నాడు (ఆదికాండము 21:5) ఆమధ్యలో అతను 25 సంవత్సరాలు అక్కడే నివసించాడు. ఇస్సాకు అదే కనానులో 60వ యేట యాకోబును కన్నాడు (ఆదికాండము25:26). యాకోబు 130వ యేట ఐగుప్తుకు వెళ్ళాడు (ఆదికాండము 47:9). దీనిప్రకారం అబ్రాహాము కనానుకు వచ్చి‌నప్పటినుంచీ యాకోబు ఐగుప్తుకు వెళ్ళేంతవరకూ 25+60+130 = 215 సంవత్సరాలు. మనం పైన చూసిన 430 సంవత్సరాల నుండీ యాకోబు ఐగుప్తుకు వెళ్ళేంతవరకూ ఉన్న ఈ 215 తీసివేస్తే మరో 215 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది 215 సంవత్సరాలు.

యూదా చరిత్రకారుడైన "ప్లేవియస్ జోసెఫెస్" కూడా తన "The antiquities of the Jews" అనే పుస్తకం రెండవభాగం 15 వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 215 సంవత్సరాలని వెల్లడించాడు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.