Did Jesus come only for the nation of Israel?
మత్తయి సువార్త 15:24
ఆయన - ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను.
కొందరు ఈ వాక్యభాగంలోని మాటలను ఆధారం చేసుకుని, యేసుక్రీస్తు వచ్చింది కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే అని ఆయనే స్వయంగా చెబుతుంటే, ఆయన గురించి మాకెందుకు సువార్త ప్రకటిస్తున్నారని మనల్ని ప్రశ్నిస్తుంటారు.
యేసుక్రీస్తు పలికిన ఈ మాటలను అపార్థం చేసుకుని, లేక అడ్డుపెట్టుకుని ఈ దేశంలో సువార్త ప్రకటనను నిషేధించాలని చూస్తున్న వీరు, ఆయన ఇశ్రాయేలీయుల దేశంలోనే కాకుండా సమరయ పట్టణంలోనూ (యోహాను 4:4),
గెరాసేనుల దేశంలోనూ (మార్కు 5:1) పరిచర్య చేసిన సందర్భాలను చదివుంటే బాగుండేది.
అదేవిధంగా యేసుక్రీస్తు గురించి పలకబడిన ఈ ప్రవచనాలు చూడండి
లూకా సువార్త 2:29-32 నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.
యెషయా 49: 6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను.
ఈ ప్రవచనాల ప్రకారం, యేసుక్రీస్తు అన్యజనులందరికీ వెలుగుగానూ, రక్షకునిగానూ ఈలోకంలో జన్మించారని మనకు అర్థమౌతుంది.
ఆయన ఏ బేధం లేకుండా ప్రపంచంలోని అన్నిజాతుల ప్రజలకూ రక్షకుడు, విమోచకుడు, ప్రధానయాజకుడు. లేఖనాల ప్రకారం ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. మరి యేసుక్రీస్తు ఆ సందర్భంలో, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు మాత్రమే పంపబడ్డానని ఎందుకు చెప్పారు? ఎందుకో తెలియాలంటే ఆయన గురించి మోషే చెప్పిన ప్రవచనం దగ్గరకు వెళ్ళాలి.
ద్వితియోపదేశకాండము 18:16 నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.
యేసుక్రీస్తు గురించి మోషే చెబుతున్న ఈ ప్రవచనంలో ఆయన ఇశ్రాయేలీయుల కొరకు ఆ మోషేవంటి ప్రవక్తగా కూడా పుట్టబోతున్నట్టు ప్రకటించబడింది. ఇది యేసుక్రీస్తు గురించే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు (అపొ.కార్యములు 3:22). యేసుక్రీస్తు యూదులతో తానొక ప్రవక్తనని సాక్ష్యమిచ్చింది కూడా ఈ ప్రవచనాన్ని బట్టే.
లూకా 13:33 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు.
దీని ప్రకారం, నేను ప్రారంభంలో చెప్పినట్టుగా, యేసుక్రీస్తు లోకంలోని అన్నిజాతుల ప్రజలకూ వెలుగుగా, రక్షకునిగా, విమోచకునిగా, ప్రధానయాజకునిగా పంపబడితే, ఇశ్రాయేలీయులకు మాత్రం మోషే ద్వారా ప్రవచించబడిన మోషేవంటి ప్రవక్తగా కూడా పంపబడ్డానని ఆ సందర్భంలో ఆయన తెలియచేస్తున్నాడు. ఈవిధంగా "ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేద"ని ఆయన చెప్పింది, ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా చెయ్యబడిన ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చెయ్యడానికే తప్ప, మతోన్మాదులు చెబుతున్న భావం అక్కడ లేదు.
ఒకవేళ యేసుక్రీస్తు వచ్చింది ఇశ్రాయేలీయులకు మాత్రమే రక్షకుడిగా ఐతే, తన శిష్యులను పిలిచి భూదిగంతముల వరకూ సువార్త ప్రకటించమని ఎందుకు ఆజ్ఞాపిస్తాడు?
మార్కు సువార్త 16:15,16 మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
అపొ. కార్యములు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.