కొత్త నిబంధన

రచయిత: జి. బిబు

ఈ పత్రిక భావాన్ని తెరచే తాళపుచెవి: ఏ వాక్యపు భావాన్నైనా తెరచే తాళపుచెవి ఆ వాక్యం యొక్క ఉద్దేశమే. అందుకే ఈ పత్రికలోని ప్రతీమాటను కూడా దాని ప్రాథమిక ఉద్దేశపు వెలుగులోనే అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదట ఆ ఉద్దేశమేంటో తెలుసుకుని, దాని వెలుగులో వాక్యం వెంబడి వాక్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

"ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యముననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవునిసంబంధి. కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు" (2-11).

ఈ వాక్యమే ఈ పత్రికకు మూలవాక్యమని చెప్పుకోవాలి. ఇక్కడ చెయ్యబడిన హెచ్చరిక, మేలు చెయ్యాలి, కీడును త్యజించాలి అనే సాధారణ హితవాక్కు కాదు. ఈ పత్రికలో ఒక ప్రత్యేక ప్రవర్తనను మేలైనదిగాను అందుకు భిన్నమైన వేరొక ప్రవర్తనను చెడ్డదిగాను గుర్తించడం జరిగింది. ఇక్కడ మేలైనదిగా గుర్తించబడినదాన్ని చేపట్టడంలో నిలకడగా ఉండాలనీ అందుకు వ్యతిరేకమైన ప్రవర్తనను తిరస్కరించి, దానిని చేసేవారి విషయమై అప్రమత్తంగా ఉండాలని నేర్పించడమే ఈ పత్రిక ముఖ్యఉద్దేశం. కాబట్టి ఈ పత్రికను అర్థం చేసుకోవాలంటే ఇది చదువుతున్నప్పుడు, అపోస్తలుడు దేనిని సత్ప్రవర్తనగా గుర్తిస్తున్నాడో దేనిని దుష్ప్రవర్తనగా ఖండిస్తున్నాడో జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించడం కష్టమేమీ కాదు.

ఎందుకంటే అపొస్తలుడు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నాడో ఆ గాయు అనే వ్యక్తి చేసిన క్రియలు మంచివని, అదే సంఘంలో అపొస్తలుల పరిచర్యకు వ్యతిరేకంగా ప్రవర్తించిన దియోత్రేఫె అనే వేరొకని క్రియలు చెడ్డవని చాలా విస్పష్టంగా తారతమ్యపరచినట్టు ఇట్టే గుర్తించగలం. ఇంతకూ ఈ గాయు చేసిన మంచి క్రియలేంటో దియోత్రేఫె చేసిన చెడు క్రియలేంటో తెలుసుకుని, అలా చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి అనే సంగతులు అర్థం చేసుకుని, మేలైనది చేపట్టేవారిగా చెడును విసర్జించేవారిగా మనమున్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవడమే ఈ పత్రిక ద్వారా దేవుడు మనకై దాచియుంచిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి సహాయపడే తాళపు చెవి.

3 యోహాను 1: పెద్దనైన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.

"పెద్దనైన నేను"

ఈ పత్రికను రాసిన అపొస్తలుడైన యోహాను తనను తాను "పెద్ద" అని సంబోధించుకున్నాడు. తన వయస్సు మరియు అనుభవం బట్టి మాత్రమే కాదు, ప్రభువు అపొస్తలులైన పన్నెండుగురిలో సజీవంగా మిగిలిన ఒకే ఒక్కడిగా అప్పటి సంఘాలకు పెద్ద అని పిలవబడడం ఆయనకు సరిగ్గా సరిపోయే పరిచయమే. తన అపొస్తలియ హోదాలో అధికారికంగా రాసిన ఈ లేఖనభాగానికి విశ్వాసులందరూ తక్కిన లేఖనాలకు చూపే అదే విధేయతను కనపరచాలి. అయితే ఇక్కడ అపొస్తలుని తగ్గింపును కూడా మరోసారి చూస్తున్నాము. పెద్దపెద్ద బిరుదులను ఆపాదించుకోవడం, స్వయం హెచ్చింపుకు తావిచ్చే పరిచయాలు ఇవ్వడం క్రీస్తు అపొస్తలులకు తగిన పద్ధతి కాదు. ఈ యోహాను ఐతే సాధ్యమైనంతవరకూ తన పేరును సైతం ప్రస్తావించకుండా ప్రభువుతో తనకున్న సంబంధం లేదా పరిచర్యలో తన పనినిబట్టి పరిచయం చేసుకోవడం సాధారణంగా ఆయన రచనలలో మనం గమనిస్తాం. యోహాను 21:20, యోహాను 23-24 , 2 యోహాను 1:1

అవసరమైనప్పుడు వారు తమ పేర్లనూ పనులనూ పదవులనూ ప్రస్తావించినా అవి కేవలం వారి రచనా ప్రామాణికతను, రాసినవాటికి బాధ్యత తీసుకోడానికి, సంఘంపైన వారి మాటలకున్న అధికారాన్ని గుర్తు చెయ్యడానికి మాత్రమే అలా చేసారు. అయితే గాయుకు నమ్మకస్తులైనవారి చేత నేరుగా తన పత్రికను ఇచ్చి పంపినందుకుగానూ బహుశా ఆ వివరాలు ఇక్కడ అవసరం లేదని అపోస్తలుడు భావించియుండవచ్చు.

"సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు"

అపొస్తలుడు ఈ పత్రికను "గాయు" అనే వ్యక్తికి రాసాడు. ఇతడు పౌలుకు ఆతిథ్యమిచ్చిన గాయు కాదు (రోమా 16:20). ఈ ఇద్దరిలోనూ ఆతిథ్యమిచ్చే సుగుణం ఉందన్నది వాస్తవమే. అయితే వారి కాలాన్ని బట్టీ స్థలాన్ని బట్టీ వేరువేరు వ్యక్తులని మనం తెలుసుకోగలం. పౌలు పేర్కొన్న గాయు కొరింథీ పట్టణస్థుడు కాగా ఇక్కడ యోహాను సంబోధించిన గాయు ఎఫెసుకు దగ్గర ప్రాంతానికి చెందినవాడయ్యుండాలి. ఎందుకంటే తన వృద్దాప్యంలో ఉండి కూడా త్వరలో అతనిని కలిసి మాట్లాడుకోవడానికి అపొస్తలుడు సిద్ధపడుతున్నాడంటే (3 యోహాను 1:14 ) బహుశా గాయు అపొస్తలుడు నివసిస్తున్న ఎఫెసుకు సమీపస్థుడే అయ్యుండాలి. పౌలు సజీవంగా ఉన్న కాలానికి, యోహాను వృద్ధాప్యంలో రాసిన ఈ పత్రిక కాలానికి మధ్య దాదాపు ౩౦ సంవత్సరాల వ్యవధి ఉండవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. పైగా పౌలు ప్రస్తావించిన గాయు పౌలుకు ఆత్మీయ కుమారుడు (1 కొరింథీ 1:17) కాగా ఇక్కడ యోహాను సంబోధిస్తున్న గాయు యోహానుకు ఆత్మీయ కుమారుడు (3 యోహాను 1:4). గాయు అనే పేరున్న ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా మనకు పౌలుతో పరిచర్య చేసిన వారిలో కనిపిస్తారు (అపో. కా 19:29, 20:4). కానీ పైన చెప్పిన స్థల, కాల పరిస్థితుల కారణంగా ఈ గాయు వారిలో ఒకడు అయ్యుండే అవకాశం లేదు. ఇది గ్రీసు సంస్కృతిలో తరచుగా తారసపడే ఒక సాధారణమైన పేరు అయ్యుండవచ్చు.

"సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు"

ఇక్కడ అపొస్తలుడు తనకు గాయుపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ అలా ప్రేమించడానికి కారణం సత్యమే అని తెలియచేస్తున్నాడు. యేసు ప్రభువునకు చెందినవారు సత్యమందు ప్రతిష్ఠింపబడినవారు. దేవుని వాక్యమే ఆ సత్యము (యోహాను 17:17) వారు ఒకరిని ఒకరు ప్రేమించడానికి ఇదే బలమైన కారణం. సాధారణంగా మనం మనుష్యులందరినీ ప్రేమించాలన్నది నిజమే. అయితే విశ్వాసగృహంలో ఒకరిపట్ల మరొకరికున్న ప్రేమకు ఆధారం వారిని విశ్వాసగృహానికి సభ్యులుగా చేసిన సువార్త సత్యమే. అది ప్రత్యేకమైన ప్రేమ (గలతీ 6:10తీతుకు 3:15). ఈ నియమాన్నీ దానిని పాటించిన అపొస్తలుని మాదిరిని మనం గుర్తుపెట్టుకుంటే సంఘంలో ప్రేమ విస్తరించడానికి వేరే కారణమేమీ అవసరం లేదు. వేరే కారణాల వల్ల కలిగే ప్రేమ సత్యాన్ని బట్టి కలిగిన ప్రేమతో ఎప్పుడూ సాటిరాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ సత్యమునందే సంతోషిస్తుంది (1 కొరింథీ 13:6). వారి అలవాట్లు, నేపథ్యాలు, సామర్థ్యాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ అంత భిన్నతలో కుడా క్రీస్తుబిడ్డలు సత్యమును బట్టి ఒకరిని ఒకరు ప్రేమిస్తారు. ఎందుకంటే వారిని దేవునితో మరియు ఒకరిని ఒకరితో ఐక్యపరచింది ఆ సత్యమే.

"శుభమని చెప్పి వ్రాయునది"

దాదాపు ప్రతీ పత్రిక ప్రారంభంలోనూ అపొస్తలులు శుభములు చెప్పటం మనం గమనిస్తాము. వ్యక్తపరిచే శైలి మరియు వినియోగించే మాటలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ శుభవచనాలన్నీ రచయితకు, వాటిని పొందినవారికి మధ్య ఉన్న క్రీస్తునందలి ప్రేమను ప్రస్ఫుటంగా కనపరుస్తాయి. దైవావేశం వల్ల కలిగిన ఈ శుభవచనాలు, సంఘంలో మనం పరస్పర శ్రేయస్సును కోరేవారిగా ఉండాలనే పాఠాన్ని ఎంతో స్పష్టంగా నేర్పిస్తున్నాయి.

3 యోహాను 2: ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

"ప్రియుడా నీ ఆత్మ వర్థిల్లుచున్న ప్రకారం"

ఆత్మ వర్థిల్లడం అనేది ఒకటుందని ఈ మాటలు మనకు గుర్తుచేస్తున్నాయి. అలాగే గాయు ఆత్మీయంగా సజీవుడనీ తిరిగి జన్మించిన కారణాన్ని బట్టి మరణం నుండి జీవంలోనికి దాటినవాడని ఈ మాటలు సూచిస్తున్నాయి. ఎందుకంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన ఒక ఆత్మవర్థిల్లడం అనేది సాధ్యం కాదు. మరణంలో వర్థిల్లడం అనేదేమీ ఉండదు. అంతే కాదు "నీ ఆత్మ వర్థిల్లిన ప్రకారం" అని కాకుండా "నీ ఆత్మ వర్థిల్లుచున్న ప్రకారం" అని అపొస్తలుడు రాసాడు. ఆత్మలో వర్థిల్లడం అనేది విశ్వాసిలో కొనసాగే ఒక ప్రక్రియ అని కూడా ఇక్కడ నేర్చుకోగలం. వాక్యాన్ని పాలవలె అపేక్షించించి దాని చేత పోషించబడుతున్న కొలదీ (1 పేతురు 2:2), వాక్యం చేత ఉపదేశించబడి, దిద్దుబాటు కలిగి, నీతియందు శిక్షణ పొంది, ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడుతున్న కొలదీ (2 తిమోతి 3:16,17), విశ్వాసమునందు సధ్గుణమును, సధ్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోవడానికి పూర్ణ జాగ్రత్త వహిస్తున్న కొలదీ (2 పేతురు 1:5-8) ఒక వ్యక్తి ఆత్మలో వర్థిల్లుతున్నాడని చెప్పగలం. ఇలాంటి శ్రేష్టమైన సాక్ష్యం గాయునకు ఉందని యోహాను సాక్ష్యమిస్తున్నాడు.

ఇలా ఆత్మలో వర్ధిల్లడం కొందరి భక్తుల ధన్యత మాత్రమే కాదు, తిరిగి జన్మించిన దేవుని బిడ్డలందరికీ ఉన్న అనుభవం. అది తమలో చూడలేనివారు వెంటనే మోకరించి "దేవా, పాపినైన నన్ను కరుణించుము, యేసు క్రీస్తులో నన్ను నీతిమంతునిగా చేసి, నాలో నీ ఆత్మఫలమును పుట్టించుము" అని వేడుకోవడానికి తడవు చెయ్యవద్దు.

"నీవు అన్ని విషయములలోను వర్థిల్లుచు, సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను"

మన ప్రియులు ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటుగా భౌతికంగా కూడా వర్థిల్లాలని కోరుకోవడం తప్పుకాదు. పేదరికమే ఆధ్యాత్మికత, దారిద్ర్యమే భక్తి అని భావించేవారు ఈ మాట ఆలోచించాలి. అలా అని, తన బిడ్డలు భౌతిక ఆశీర్వాదాలు తప్పకుండా పొందుతారని దేవుడు ఇక్కడ హామీ ఇస్తున్నట్టు కొందరు ఈ మాటలను తప్పుగా చిత్రీకరిస్తుంటారు. అందుకు ఇక్కడ తావు లేదు. ఎందుకంటే ఇది యోహాను గాయు కొరకు చేస్తున్న ప్రార్థన అని అతను స్పష్టం చేశాడు. అది గాయు విషయమై దేవుని చిత్తం ఐతే మాత్రమే దేవుడు ఆ ప్రార్థన వింటాడని యోహానుకు తెలుసు (1 యోహాను 5:14). అది అలా ఉంచితే గాయు ఆత్మీయస్థితి ఎంత ఆరోగ్యకరంగా ఉందో ఈ మాటలు మరోసారి నొక్కి చెబుతున్నాయి. అందుకే గాయు ఇతర విషయాలలో కూడా ఆ కొలదీ వర్థిల్లాలని అపొస్తలుని భావం. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకునే అనేకుల విషయంలో ఇందుకు పూర్తి వ్యతిరేక పరిస్థితి చూడగలం. అన్ని విషయాలలో వర్థిల్లుతున్న కొలదీ వారు ఆత్మలో కూడా వర్థిల్లితే ఎంత బాగుండును అనుకునేలా ఉంటుంది వారి పరిస్థితి.

3యోహాను 3: నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని.

"నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక"

గాయును సత్యమును బట్టి ప్రేమిస్తున్నాడని అపొస్తలుడు ఇదివరకే ప్రకటించాడు (1 యోహాను 1:1) అయితే ఇక్కడ సత్యాన్ని నమ్మాడని మాత్రమే కాదు, దానికి తగిన నడవడిని కూడా అపోస్తలుడు ప్రశంసిస్తున్నారు. సువార్త సత్యం కేవలం మనస్సులో ఉండే ఒక ఆలోచన, ఉద్రేకం లేదా భావజాలం మాత్రమే కాదు. అది తప్పక క్రియల రూపంలో వ్యక్తపరచబడుతుంది. అలా వ్యక్తపరచబడని నమ్మిక కేవలం మృత విశ్వాసమే (యాకోబు 2:17-18). గాయు నిజానిగా సత్యాన్ని నమ్మాడు అనడానికి అతను దానినిబట్టి నడుచుకోవడమే రుజువు. అయితే గాయు "సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు" అని అపొస్తలునికి ఎలా తెలిసింది?

"సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా"

ఈ సహోదరులు గాయు వద్దనుండి యోహాను వద్దకు వచ్చి గాయు సత్ప్రవర్తనను గురించి సాక్ష్యమిచ్చారు. వారు సంఘం ఎదుట సాక్ష్యమిచ్చారని కూడా తెలుస్తోంది (3 యోహాను 1:6). అంటే వీరు యోహాను సహవాసం చేస్తున్న సంఘం చేతనే సువార్త పని నిమిత్తం గాయు ఉన్న స్థలానికి పంపబడి ఉండవచ్చు. వారు తిరిగి వచ్చి వారిని పంపిన సంఘం ఎదుట వారు పంపబడిన పరిచర్య అనుభవాన్ని పంచుకున్నారు. వారి సాక్ష్యం విని అపొస్తలుడు స్పందించిన తీరు గమనార్హం.

"విని బహుగా సంతోషించితిని"

అపొస్తలుని మాటలలో ప్రేమ, ప్రశంస మరియు ప్రోత్సాహం మనకిక్కడ కనిపిస్తున్నాయి. క్రీస్తును అనుసరించే వారు తమ పరుగుపందెంలో ఒకరిని ఒకరు బలపరచుకుంటారే తప్ప ఒకరితో ఒకరు పోటీపడరు. ఒకరి సాక్ష్యం విని మరొకరు సంతోషిస్తారు తప్ప ఈర్ష్యపడరు. ఇది అపొస్తలుడు ఇక్కడ కనపరిచే గొప్ప ఆదర్శం.

3 యోహాను 4: నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.

ఈ మాటనుబట్టి గాయు అపొస్తలుడైన యోహాను పరిచర్య కారణంగా క్రైస్తవుడయ్యాడని, అందుకే అపొస్తలుడు తన ఆత్మీయ పిల్లలతో గాయును లెక్కిస్తున్నాడని అర్థంఔతుంది. ఈ భావంతోనే తమ ద్వారా సత్యంలోనికి నడిపింపబడిన వారిని అపొస్తలులు తమ స్వంత పిల్లలుగా సంబోధించారు (1 తిమోతీ 1:2,  తీతుకు 1:3ఫిలేమానుకు 1:10) తన ఆత్మీయ పిల్లల నుండి ఒక ఆత్మీయ తండ్రి ఏమి కోరుకుంటాడో ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాయి. వారు నా చెప్పుచేతల్లో ఉన్నప్పుడు నాకు సంతోషం అని కాదు, వారు సత్యాన్ని అనుసరించి నడవడమే నాకు నిజానికి సంతోషాన్ని ఇస్తుంది అంటున్నాడు యోహాను.

కానీ ఈ రోజు చాలా మంది కాపరులు "ఆత్మీయ తండ్రి" "ఆత్మీయ పిల్లలు" అనే ఆలోచనను తమ సంఘాలలో నూరిపోస్తున్నప్పటికీ కేవలం విశ్వాసులు తమ సంఘానికి తమ ఆధిపత్యానికి కట్టుబడి ఉండడానికి మాత్రమే దానిని వినియోగిస్తున్నారు. కానీ ఒక నిజమైన ఆత్మీయ తండ్రి తన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడవాలని తాపత్రయపడతాడు. అందుకే అది చూసినప్పుడు దానికంటే ఎక్కువైన సంతోషం మరేదీ అతనికి ఉండదు. సత్య అనుసరణ కాకుండా తమ స్వీయ అజమాయిషీ కోరుకునే సంఘనాయకులు, కాపరులు "ఆత్మీయ తండ్రులు" అనే గౌరవానికి తగరు.

అయితే సంఘంలో ఇలా "తండ్రి" అని "పిల్లలు" అని సంబోధించుకోవడం "భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవొద్దు" (మత్తయి 23:7-9) అనే ఆజ్ఞకు వ్యతిరేకం కాదా? కానే కాదు. ఎందుకంటే అక్కడ ప్రభువు పదవులనూ పెద్దపీట వేయించుకోవడాన్ని ఎదిరించాడే తప్ప బాంధవ్యాన్ని, బాధ్యతను నిషేధించలేదు. కుటుంబాలలోనూ సంఘాలలోనూ తండ్రి పిల్లల సంబంధం మమకారాన్ని వెదజల్లే దేవుని మనోహరమైన ఏర్పాటు. దానిని పదవి, హోదా, ఆధిపత్యం లాంటి కాలుష్యాలతో కలిపినప్పుడు మాత్రమే అవి నిషిద్ధం.

3 యోహాను 5: ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు.

"ప్రియుడా"

అపొస్తలుడు గాయును సంబోధించడంలో ఎంతో గౌరవం మరియు ప్రేమ కనిపిస్తున్నాయి. గాయు కనపరచిన సత్ప్రవర్తన యోహానంతటి పెద్దలను సైతం ఆకట్టుకునే ఆభరణం.

"వారు పరదేశులైనను"

ఇక్కడ గాయు చేత ఆతిథ్యం పొంది అతని విశ్వాసాన్ని గురించి తెలిపిన సహోదరులు గాయు ఉన్న దేశానికి చెందినవారు కాదని, వారు వేరొక ప్రాంతంనుండి వచ్చారని తెలుస్తోంది. మనం ముందు చెప్పుకున్న విధంగా వారు యోహాను అధ్యక్షత వహిస్తున్న సంఘస్థులు. పరిచర్య నిమిత్తం వారు గాయు ఉన్న ప్రాంతానికి పంపబడిన సేవకులు. వారు సేవ కొరకు వచ్చిన సహోదరులని, అందుకే వారిని పంపిన సంఘానికి తిరిగి వచ్చి తమ పరిచర్య అనుభవాన్ని పంచుకుంటున్నారని తర్వాత వచనాలలో మనకు అర్థం ఔతుంది (3 యోహాను 1:6,7).

"సహోదరులకు నీవు చేసినదెల్లా"

గాయుకు వారు పరదేశులైనప్పటికీ అపరిచితులైనప్పటికీ కేవలం వారు సహోదరులు కాబట్టి అతడు వారిని చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చాడు. వారి వల్ల తిరిగి ఏదైనా పొందుదామని కాదు కానీ కేవలం వారు సహోదరులు కాబట్టి వారిని చేర్చుకున్నాడు. అయితే మనం కూడా ఏ పరిచయం లేకుండా "మేము సహోదరులం, పరిచారకులం" అంటూ మన దగ్గరకు వచ్చిన వారందరిని చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వాలని నేను చెప్పడం లేదు. ఈ సందర్భంలో గాయు యోహానుకు పరిచయస్తుడు. వచ్చిన ఈ అపరిచితులు యోహాను వద్దనుండి పంపబడినవారే అని కూడా అర్థం ఔతుంది. కాబట్టి వచ్చినవారు అపరిచితులైనా నమ్మదగినవారే. గాయు చేసిన పరిచర్య మనం కూడా చెయ్యాలి. కానీ వారు అపరిచితులైతే వారి నేపథ్యం తెలుసుకుని చేర్చుకోవడం మనకూ మన ఇంటివారికి శ్రేయస్కరం.

"విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు"

గాయు వలే సేవకులకు అందుబాటులో ఉండడం విశ్వాసికి తగిన క్రియ అని ఇక్కడ గుర్తించబడింది. అంటే ఇది క్రైస్తవ విశ్వాసం విశ్వాసినుండి కోరే సత్క్రియ, ఇదే విశ్వాసికి తగిన సుగుణం. "విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు" అనే మాటను "నమ్మకంగా చేయుచున్నావు" అని కూడా అనువదించవచ్చు. గాయు ప్రభువు పట్ల తనకున్న నమ్మకత్వాన్ని బట్టి ఈ పరిచర్య చేసాడు. సేవకొరకు వచ్చిన సహోదరులకు అవసరమైన సదుపాయాలు తన ఇంటిలో కల్పించాడు. ఈ మాట ఇక్కడ గాయును అభినందించడానికి మాత్రమే కాదు, మన అనుకరణ కొరకు కూడా రాయబడిందని మరచిపోవొద్దు.

3 యోహాను 6,7: వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును.

"వారు నీ ప్రేమను గూర్చి సంఘము యెదుట సాక్ష్యమిచ్చిరి"

ఈ మాటను బట్టి వీరు యోహాను ఆ సమయంలో సభ్యుడుగానూ అధ్యక్షుడుగానూ ఉన్న ఎఫెసు సంఘానికి వచ్చి వారికి సహాయం చేసిన గాయు ప్రేమను గురించి సాక్ష్యమిచ్చారని అర్థం ఔతుంది. వీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టే గాయు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడని యోహానుకు తెలిసింది (1 యోహాను 1:3). ప్రేమతో కూడిన అదే సత్ప్రవర్తనతో గాయు కొనసాగాలని ప్రోత్సహించడానికి యోహాను ఈ మాట ప్రస్తావిస్తున్నాడు.

"వారు అన్యజనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక"

గాయు చేత సహాయం పొంది, సంఘం ఎదుట అతని ప్రేమను గురించి సాక్ష్యం చెప్పిన సహోదరులు, అన్యజనుల వద్దకు సువార్త నిమిత్తం పంపబడినవారని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. "ఆయన నామం నిమిత్తము" అంటే సువార్త నిమిత్తమే (రోమా 15:20). అయితే సువార్తకు ఆటంకం కలుగకూడదని ఈ సేవకులు వారు పరిచర్య చేస్తున్న అన్యజనుల నుండి ఎలాంటి సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ప్రస్తావించబడిన సహోదరులు బహుశా పౌలు కనబరచిన అలాంటి ఆదర్శాన్ని అనుసరించారు (1 కొరింథి 9:11-122 థెస్సలొనీక 3:6-9) అందుకే గాయు వారిని చేర్చుకుని అవసరమైన సహాయం వారికి చేసాడని అర్థం ఔతుంది.

అయితే ఈనాడు సేవకులుగా చలామణి ఔతున్న చాలామంది ఈ ఆదర్శాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. వీరు విశ్వాసుల దగ్గర మాత్రమే కాకుండా ఇంకా మారుమనస్సు పొందని అన్యజనుల దగ్గర కూడా కానుకలను అర్జిస్తూ పైగా వారు అలా ఇవ్వడం ద్వారా దేవుడు వారిని భౌతికంగా ఆశీర్వదిస్తాడంటూ మభ్యపెడుతున్నారు. ఇలాంటి ధనాపేక్ష కలిగిన సేవకుల వల్ల నమ్మకంగా సేవచేసే భక్తులకు కూడా అన్యజనుల నుండి అవమానం, సువార్త పట్ల అవహేళన ఎదురౌతున్నాయి.

"దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా నుండును"

సేవకులను సాగనంపడం అనే సుగుణాన్ని ఆదిమ సంఘం మనకు నేర్పిస్తుంది (అపొ.కా15:3, 20:38,  21:5రోమా 15:24, 1 కొరింథీ 16:6, 2 కొరింథీ 1:16, తీతుకు 3:13) ఇలా సాగనంపేటప్పుడు వారి సహవాసం మరియు సంరక్షణ కొరకు వారితో సాధ్యమైనంత దూరం వెళ్ళడం మాత్రమే కాదు, వారికి అవసరమైనవి సమకూర్చడం కూడా అందులో భాగం అని ఈ వాక్యభాగాలు తెలియచేస్తున్నాయి. ఇక్కడ సహోదరులకు గాయు చేసింది ఇలాంటి సహాయమే అని, అదే భవిష్యత్తులో కూడా కొనసాగించేలా యోహాను అతనిని ప్రోత్సహిస్తున్నాడని అర్థం ఔతుంది.

గాయు ప్రేమను గురించి సాక్ష్యమిచ్చిన ఈ సహోదరులు, మళ్ళీ గాయు వద్దకు పంపబడుతున్నారని ఇక్కడ మనకు తెలుస్తోంది. అందుకే వారిని సాగనంపే పనిలో జాప్యం జరగకూడదని యోహాను ఈ మాటలు రాస్తున్నాడు. గాయుకు యోహాను పంపిన ఈ పత్రిక కూడా బహుశా వారి ద్వారానే అందచెయ్యబడి ఉండవచ్చు. అయితే గాయు వారిని సాగనంపేటప్పుడు, అది దేవునిపట్ల అతను చేసే పరిచర్యగా గుర్తించి చెయ్యాలని, అదే అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుందని యోహాను హెచ్చరిస్తున్నాడు.

క్రైస్తవులు ఈ నియమాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. ఒక మనిషికి అన్నట్టు వారు చేసే సహాయాలు, అతిశయానికీ తమ వల్ల మేలు పొందినవారు తమకు ఋణస్థులు అనుకోవడానికీ ఇతరుల చేత అది గుర్తించబడాలనే స్వార్థానికీ దారితీస్తాయి. అయితే దేవునికొరకు తన దాసులకు పరిచర్య చేస్తే అది నిజంగా ఆయన యెదుట యుక్తమైన సేవగా అంగీకరించబడుతుంది. అలాంటి సేవను మరచిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాదు (మత్తయి 10:40-42, హెబ్రీ 6:10) కాబట్టి అదే యుక్తమైన సేవ (1 కొరింథీ 15:58).

3 యోహాను 8: మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము.

"మనము"

ఇక్కడ అపొస్తలుడు నేర్పించే నియమాన్ని గాయుతో పాటు తనకు తాను కూడా అన్వయించుకుని "మనము" అంటున్నాడు. అయితే గాయు కానీ అపొస్తలుడు కానీ ఈ నియమాన్ని పాటిస్తున్నవారే కాబట్టి, ఈ మాటలు వారి కొరకే కాకుండా ఈపత్రిక చదివే క్రైస్తవులందరినీ ఉద్దేశించి ప్రస్తావించబడ్డాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ నియమం మనందరికీ అంటే సార్వత్రికంగా సంఘమంతటికీ వర్తించేదిగా చెప్పబడింది.

"సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారము చేయబద్ధులమై యున్నాము"

గాయు ఇచ్చిన ఆతిధ్యాన్నీ చేసిన ఉపకారాలనూ యోహాను అంతగా ప్రశంసించడానికి గల అసలు కారణం ఇక్కడ మనకు స్పష్టం ఔతుంది. నిజానికి గాయు సహాయం చేసింది ఆ సహోదరులకు కాదు. వారు ఏ సువార్త పని నిమిత్తమైతే గాయు వద్ద ఉపకారం పొందవలసిన పరిస్థితి కలిగిందో ఆ సత్యానికే గాయు సహాయం చేసాడు. అంటే అలాంటివారితో సహకరించి, వారికి అవసరమైనవి సమకూర్చడం ద్వారా వారు సత్యసువార్తను ప్రకటించడానికి గాయు అనుకూలత కలిగించాడనీ అలా చెయ్యడం ద్వారా మనం సత్యానికే సహాయకులం ఔతున్నామని దీని అర్థం. అందుకే గాయు సత్యాన్ని బట్టి నడుచుకుంటున్నాడని, ఆత్మీయంగా వర్థిల్లుతున్నాడని చెప్పడానికి దీనిని అపొస్తలుడు నిదర్శనంగా పరిగణించాడు. అవసరతలో ఉన్న అందరికీ సహాయం చెయ్యాలన్నది నిజమే కానీ "అట్టివారికి" అని ఈ వాక్యం చెప్పింది మాత్రం సువార్త పరిచారకులు సందర్భంలోనే అని గ్రహించాలి. వారికి ఉపకారం చెయ్యడం వల్ల మనం సత్యానికి సహాయకులుగా ఉంటాము. సత్యసంబంధులైన వారందరిలో ఇది తప్పనిసరిగా కనబడే లక్షణం.

సువార్త సత్యంలో పాలివారైనవారికి దాని విస్తరణ కొరకు తమవంతు సహాయాన్ని ఇవ్వడం ఎంత ప్రశస్తమైనదో తెలుసు. సువార్త పని చేసేవారికి చేయూతనివ్వడం ద్వారా సత్య వాక్య పురోగతికి తమ వంతు భాగస్వామ్యం కలిగియుండడం వారు గొప్ప ధన్యతగా భావిస్తారు. అవకాశం ఉండి కూడా అలాంటి సహాయం అందించని వారు సత్య వ్యతిరేకులే. గాయుకు భిన్నంగా ప్రవర్తించిన దియొత్రెఫే అనే ఒకని ఉదాహరణ ద్వారా అపొస్తలుడు తరువాత వచనాలలో ఈ వాస్తవాన్ని నొక్కి చెప్పాడు. (సత్యానికి సహాయకులుగా ఉండడం ఎంత అవసరమో, అలా చెయ్యకపోవడం ఎంత తీవ్రమైన అపరాధమో అర్థం చేసుకోవడానికి 3 యోహాను 1:11 వ్యాఖ్యానం చూడండి).

3 యోహాను 9: నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.

"నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని"

గాయు ఉంటున్న ప్రాంతంలోని సంఘానికి అపొస్తలుడైన యోహాను ఇదివరకే తనవద్ద నుండి పంపబడిన సహోదరులకు సంబంధించి ఒక మాట రాసాడు. ఒక సంఘం లేదా ఒక విశ్వాసి, తమ వద్దకు వచ్చిన అపరిచితులను విశ్వాసులుగా గుర్తించి చేర్చుకోవడానికి తగిన సిఫారసు పత్రిక అవసరమే. అదే అపొస్తలుడు వారికి ఇచ్చి పంపించాడు. బహుశా వారి నేపథ్యం, వారు అక్కడికి పంపబడిన ఉద్దేశం, వారి విషయమై స్థానికసంఘం నుండి అవసరమైన సహాయం గురించి యోహాను అందులో రాసి ఉండవచ్చు. నిజానికి ఆ ప్రాంతంలో ఒక స్థానికసంఘం ఉంటే వారే సువార్త పరిచారకులను చేర్చుకుని వారిపట్ల తమ బాధ్యతను నిర్వహించాలి. అయితే, ఇక్కడ సంఘం ఉంది కానీ దేవుని సేవకులను చేర్చుకునే పరిస్థితిలో మాత్రం లేదు. ఎందుకంటే, ఆ సంఘం ఒక స్వార్థపరుడైన నాయకుని చేతిలో చిక్కుబడిపోయింది.

"అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే"

ఈ దియొత్రెఫే ఈ స్థానిక సంఘానికి నాయకుడని తెలుస్తోంది. అయితే ఇతడు అపొస్తలీయ బోధ నిర్ధేశించిన లక్షణాలు కలిగియుండి, సరియైన పద్దతిలో నియమించబడిన నాయకుడు కాదు  (1 తిమోతీ 3 తీతుకు 1:5-11) అతడు సంఘంలో పరిచర్య కాదు, ప్రధానత్వం కోరుకున్నాడు. సంఘాన్ని వాక్యంతో పోషించేవారికి రెట్టింపు ఘనతను దేవుడు నియమించినప్పటికీ (1 తిమోతి 5:17). , వారు తమకు అప్పగింపబడిన వారిపైనా ప్రభువులైనట్టు ఉండకూడదు (1 పేతురు 5:3). ఇది స్వచ్ఛందంగా సంఘస్థులు వారికి ఇవ్వవలసిన ఘనతే తప్ప వారిలో ప్రధానత్వ కాంక్షను ఇది ఆమోదించదు. వాక్యపరిచారకులైన కాపరులకే అలా సంఘం పైన అజమాయిషీ చేసే హక్కు లేనప్పుడు, అపొస్తలీయ అధికారాన్ని ధిక్కరించిన దియొత్రెఫె వంటి స్వార్థపూరిత నాయకులకు ఆ అవకాశం ఎక్కడిది?

"మమ్మును అంగీకరించుట లేదు"

ఇక్కడ మమ్మును అంటే అపొస్తలుడైన యోహానే. అపొస్తలుడు పంపిన పత్రిక ప్రకారం చెయ్యడం తన ప్రధానత్వానికీ స్వార్థపూరిత లక్ష్యాలకూ దియొత్రెఫె భంగపాటుగా భావించాడు. అందుకే దానిని అంగీకరించలేదు. మాట తిరస్కరించడం అంటే మాట చెప్పిన వారిని తిరస్కరించడమే. అలాగే అపొస్తలుడు పంపినవారిని కూడా అతను తిరస్కరించాడు. తన పత్రికను, ప్రతినిధులను అంగీకరించలేదు కాబట్టే ఇక్కడ అపొస్తలుడు "మమ్మును" అంగీకరించడం లేదు" అంటున్నాడు.

ఈ నాటికీ కూడా సంఘంలో దొంగ సేవకులను వివేచించడానికి ఇదిగో ఒక గొప్ప ప్రమాణం! అపొస్తలీయ అధికారాన్ని (2 థెస్సలొనీక 2:15).  అంగీకరించనివారి విషయంలో సంఘం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వాక్యం ద్వారా మనకు అందించబడిన అపొస్తలీయబోధను, పద్దతులను పక్కనపెట్టి, తమకు తోచినట్టు చెప్పే చేసే దియొత్రెఫెలు నేటికీ అనేక సంఘాలను ఏలుతున్నారు. అలాంటి వారికి వారి సరైన స్థానాన్ని చూపించవలసిన బాధ్యత ప్రతి స్థానిక సంఘానికి ఉందని మరచిపోవొద్దు.

కొన్ని ప్రాచీన ప్రతులను ఆధారం చేసుకుని ఈ వచనాన్ని కొందరు "నేను సంఘమునకు ఈ సంగతి వ్రాయదలిచాను కాని వారిలో ప్రధానత్వం కోరే దియొత్రెఫే మమ్మును అంగీకరించడు" అని అనువదించారు. ఉదాహరణకు వల్గేట్ లాటిన్ తర్జుమాలో ఇలాంటి అనువాదమే మనం చదువుతాము. ఒకవేళ ఇదే సరైన అనువాదమైతే అపొస్తలుడు తన దగ్గరనుండి పంపబోతున్న సహోదరుల గురించి సంఘానికి రాయాలనుకున్నప్పటికీ అదే సరైన పద్ధతైనప్పటికీ అలా చెయ్యకుండా వారిని సహాయం నిమిత్తం సంఘం దగ్గరకు కాకుండా గాయు దగ్గరకు పంపించడానికి గల కారణాన్ని వివరిస్తున్నాడు. అయితే ఒకవేళ ఈ అనువాదం సరైనది కాకపోతే మరి అపొస్తలుడు రాసిన ఒక పత్రికను సంఘం నష్టపోయిందని భావించాలా? అలా అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంఘానికి రాసిన సంగతులు అపొస్తలుడు గాయుకు కూడా రాశాడు. వాటితో పాటు అతను గాయుకు కొన్ని అదనపు మాటలు రాసాడే తప్ప సంఘం నుండి పొందలేని సహాయానికి ప్రత్యామ్నాయంగా గాయుకు రాస్తున్నప్పుడు మునుపటి పత్రికలో రాసిందేదో ఇక్కడ రాయలేదనుకోవడం తర్కబద్ధం కాదు. 

ఈనాడు అనేక క్రైస్తవ సంఘాలు, సువార్తకు సహకారులుగా ఉండకపోవడానికీ కొందరి వ్యక్తిగత ప్రధానత్వానికీ ప్రదర్శనలకూ స్వార్థపూరిత ఆశయాలకూ వేదికలుగా మిగిలిపోవడానికి కారణం వేరే వెదకాల్సిన అవసరం లేదు. దియొత్రెఫే వంటి నాయకులు ఉన్నంతవరకూ వారిని మనం సహిస్తున్నంత వరకూ సంఘాలను వారి ప్రభావం నుండి విడిపించనంత వరకూ అక్కడ సువార్త పరిచర్య కుంటుపడుతూనే ఉంటుంది. ఎందుకంటే లేఖనాలు అందచేసే అపొస్తలీయ బోధకు వారు లోబడరు, లోబడనివ్వరు.

3 యోహాను 10 : వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.

"వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు"

దియొత్రెఫె అపొస్తలునికి వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలికాడు. అతడు అపొస్తలుడు పంపిన సందేశాన్ని, సందేశకులనూ అంగీకరించకపోవడాన్ని సమర్థించుకోవడానికే బహుశా ఇలా చేస్తున్నాడు. అపొస్తలుడు చెడ్డవాడని సంఘాన్ని నమ్మించేస్తే అతని తిరస్కారం సంఘాన్ని ఉద్ధరించడానికే అని నమ్మబలకడం సులభం ఔతుంది. అయితే విశ్వాసిగా పరిచారకునిగా చలామణి ఔతూ అపొస్తలులనే ఇలా తప్పుగా చిత్రీకరించే సాహాసం చేసిన వారిలో దియొత్రెఫె మొదటివాడు కానీ కడపటివాడు కానీ కాదు. అంతకు ముందు అపొస్తలుడైన పౌలుకు అడుగడుగునా అడ్డు తగులుతూ అతనినీ అతని బోధలనూ ఎదిరించి, ఇలాగే చెడ్డ మాటలు, అపనిందలు ప్రచారం చేసిన ఎందరో వదరుబోతులను ఆదిమ సంఘం చూసింది. (2 కొరింథీ 10:10, గలతీ 2:4-5, ఫిలిప్పీ 1:15-162 తిమోతి 4:14-15). సువార్త పరిచర్యకు ఎక్కువ ద్రోహం చేసేవారు సంఘం వెలుపల ఉన్న విరోధులు కాదు కానీ సంఘంలో ఉన్న వేషధారులే. ఇందుకు సాక్ష్యం మోషేను ఎదిరించిన దాతాను మొదలుకుని అపొస్తలుడైన యోహానును అంగీకరించని దియొత్రెఫె వరకూ ఉన్న చరిత్ర మాత్రమే కాదు, నేటికి కూడా అది సువార్తికులు మరియు కాపరులు ఎందరో ఎదుర్కొంటున్న చేదు అనుభవం. అలా జరుగుతుందని ముందుగానే ప్రవచించబడింది, ఇప్పుడు అదే నెరవేరుతుంది. (అపొ.కా 20:29-31, 2 పేతురు 2:1-3)

"అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు"

గాయు ఈ సహోదరులను చేర్చుకోవడం ద్వారా, వారికి కాదు సత్యానికే సహాయకుడయ్యాడని ముందు మనం చూసినట్టే (3 యోహాను 1:8) ఇక్కడ దియొత్రెఫె తిరస్కరించింది కూడా వారిని కాదు, వారు బోధించే సత్య సువార్తనే అని వేరే చెప్పనవసరం లేదు. అతడు వారిని చేర్చుకోకపోవడం మాత్రమే కాదు, సంఘంలో ఇతరులనుండి కూడా వారికి ఎలాంటి సహకారం దక్కకుండా పైశాచికంగా ప్రవర్తించాడు. తన మాట కాదని ఎవరైనా ఆ సహోదరులకు సహాయం చేస్తే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారిని సంఘం నుండి వెలివేసాడు. అనైతికత, మరియు అబద్ధబోధను అరికట్టడానికి మాత్రమే అదికూడా సంఘం ద్వారా మాత్రమే వినియోగించబడవలసిన ఈ వెలివేసే అధికారాన్ని, తన చేతులలోకి తీసుకుని, సువార్తకు వ్యతిరేకంగా దానిని ప్రయోగించాడు. అయితే ఇది దియొత్రెఫె అసలు రంగును బయట పెట్టడం మాత్రమే కాదు, గాయు చేసిన సహాయానికి మరింత విలువ సంతరింపజేసింది.

వెలివెయ్యబడతాననే దుష్టుని బెదిరింపులకు, ఎదిరింపులకు భయపడకుండా ధైర్యంగా సువార్త పక్షంగా అతను నిలబడ్డాడు. ఇతను సంఘపెద్ద నిర్ధేశించినంత మాత్రాన ప్రతిదానికీ ఆంబోతులా తలూపడం కాదు, మనుష్యులను సంతోషపెట్టేవాడు క్రీస్తు దాసుడు కాలేదనే నియమానుసారంగా పని చేసాడు. వెలివేసినా పరవాలేదు, సహోదరులను మాత్రం చేర్చుకుని తీరాలి అనే ఇతని తెగువ మనకు ఎంతో ఆదర్శవంతమైంది. పరిచర్యలో ప్రధానత్వానికై పోటీతత్వం ఎంత ప్రమాదకరమైనదో దియొత్రెఫె వృత్తాంతం మనలను హెచ్చరిస్తుంది. అలాంటి వైఖరి పరిచర్య చేసే ఇతరులను సహదాసులుగా కాకుండా ప్రత్యర్థులుగా చూస్తుంది. ఎవరు చేస్తున్నారన్నది కాదు, సువార్త వ్యాప్తి పురోగమించడమే అసలు విషయం అనే దృష్టికోణాన్ని అది బొత్తిగా అణిచివేస్తుంది. "ప్రభువుకు మహిమ కలుగుతుంది కాబట్టి సహకరిద్దాం" అనే క్రైస్తవ సుగుణాన్ని "పలనావాడికి పేరు వస్తే ఎలా అనే అసూయ పూర్తిగా ఆక్రమించేస్తుంది. కలిసి చేస్తే సువార్తకు కలసొస్తే నాకేంటంట అనే స్వార్థం సువార్త సమసిపోయినా సరే నాకు మించి ఎవరూ చెయ్యకూడదు, నాకు మాత్రమే ఘనత రావాలి, వాక్యాన్ని, అపొస్తులల నిర్ధేశాలను పణంగా పెట్టైనా సరే నా ప్రధానత్వం భంగపడకుండా నా ప్రత్యేకతను నిలుపుకోవాలి అనే స్వార్థం ఆవహించినప్పుడు, ఒక సంఘపెద్దను కూడా అది అవిశ్వాసికంటే హీనంగా దిగజారుస్తుంది. అలాంటి నాయకులు లేచినప్పుడు, సంఘం దేవుని రాజ్యవిస్తరణను పక్కకు నెట్టి కేవలం సంఘ రాజకీయాలకు, నరభక్తికి వేదికగా మిగిలిపోతుంది.

గమనిక: దియొత్రెఫె సత్య సువార్తికులను తిరస్కరించినందుకే అపొస్తలుడు అతనిని ఖండిస్తున్నాడు. ఈ ఖండన అబద్ధ బోధకులను ఎదిరించే సందర్భాలలో కొందరు తప్పుగా వినియోగించే ప్రమాదం ఉంది. సత్య సేవకులను తిరస్కరించడం ఎంత పాపమో అసత్య బోధకులను సహించడం కూడా అంతే పాపమని మరచిపోవొద్దు (మత్తయి 7:15, రోమా 16:17, 2 తిమోతీ 3:5, 1 యోహాను 4:1ప్రకటన 2:2).

"అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును"

యోహాను త్వరలో గాయు ఉన్న ప్రాంతానికి రావాలనే ఆలోచన కలిగియున్నాడు (3 యోహాను 1:14). అది గాయును, నమ్మకమైన ఇతర విశ్వాసులను కలుసుకోవడానికి మాత్రమే కాదు, సంఘంలో ఇష్టారాజ్యం చేసే దియొత్రెఫె వంటివారిపై తగిన చర్యలు తీసుకోవడానికి కూడా వస్తున్నాడని పై మాటలు స్పష్టం చేస్తున్నాయి. "వాని (దియొత్రెఫె) క్రియలను జ్ఞాపకం చేసుకుంటాను" అంటే తన అపొస్తలీయ అధికారంతో తగిన విధంగా వానితో వ్యవహరించబోతున్నాడని అర్థం. అపొస్తలులకు ఒక వ్యక్తిని సంఘంనుండి వెలివెయ్యడానికి మాత్రమే కాదు, వానిని సాతానుకు అప్పగించే ప్రత్యేక అపోస్తలీయ సామర్థ్యం కూడా ఉంటుంది (1 కొరింథీ 5:5). దియొత్రెఫె వంటివారికి అదే తగిన శిక్ష. మనకు అలాంటి ప్రత్యేక అపొస్తలీయ సామర్థ్యాలు లేకపోయినప్పటికీ ఈ రోజు సంఘాలను, సువార్త పరిచర్యను ఆటంకపరిచేవారిని బహిర్గతం చేసి, సంఘంనుండి వారిని వెలివెయ్యడం ద్వారా అపొస్తలీయ మాదిరిని మనం అనుసరించాలి.

3యోహాను 11: ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.

"ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము"

మొదటి పది వచనాల వెలుగులో ఆలోచించినప్పుడు, ఇక్కడ "చెడు కార్యం" అని, "మంచి కార్యం" అని అపొస్తలుడు దేనిని పిలుస్తున్నాడో స్పష్టంగా అర్థం ఔతుంది. దేవుని పని చేసేవారితో సహకరించడం ద్వారా సత్యానికి సహాయకులు అవ్వడం మంచి కార్యం. వారిని నిరాకరించి సువార్తను ఆటంకపరచడం చెడు కార్యం. గాయును "ప్రియుడా" అని సంబోధిస్తూ తాను చేస్తూ వచ్చిన అదే మంచి కార్యంలో నిలకడగా ఉండాలని అపొస్తలుడు అతనిని ప్రోత్సహిస్తున్నాడు. ఆదర్శంగా ఉండవలసిన దియొత్రెఫె వంటి నాయకుడు చెడు చేసినంత మాత్రాన దానితో ప్రభావితమై దానిని అనుసరించవద్దని హెచ్చరిస్తున్నాడు. అయితే ఈ ప్రోత్సాహం మరియు హెచ్చరిక కేవలం గాయుకు మాత్రమే పరిమితం కాదు. దేవుని పిల్లలందరికీ దానిని అపొస్తలుడు అన్వయిస్తున్నాడు.

"మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు"

గాయులా దేవునితో జతపనివారిగా సత్యానికి సహాయం చేసేవారు దేవుని సంబంధులు. సేవ చెయ్యడం ద్వారా వారు దేవుని పిల్లలు అయ్యే ఆధిక్యతను సంపాదించుకోలేదు కానీ దేవుని పిల్లలకు ఇలాంటి సమర్పణ ఉంటుందని మనం గమనించాలి. అలాగే తన స్వార్థం కోసం దేవుని పనిని నిర్లక్ష్యం చేసే ఎవ్వరైనా వారు దేవుని సంబంధులు కారు. అలా చేసి వారు రక్షణను కోల్పోయారని కాదు కానీ వారు ఎన్నడునూ దేవునిని చూడలేదు కాబట్టి, అంటే ఎప్పుడూ దేవునితో రక్షణార్థమైన సంబంధంలోకి రాలేదు కాబట్టే వారిలో అలాంటి లక్షణం ఉంటుంది. దీనిని బట్టి వారు దుష్టుని సంబంధులు అని నిరభ్యంతరంగా గుర్తించగలం. దేవుని సంబంధి ఎవరో దుష్టుని సంబంధి ఎవరో తెలుసుకోవడానికి లేఖనాలు చెప్పే అనేక ప్రమాణాలలో ఇది కూడా ఒకటి. సత్యానికి సహాయకులుగా ఉండడం దేవుడు ప్రతీ తరంలోను తన పిల్లలకు నేర్పించిన మంచి కార్యం. అలా చెయ్యకపోవడాన్ని దేవుడు శిక్షార్హమైన పాపంగా పరిగణించాడు. ఈ సత్యాన్ని ధృవీకరించే ఈ క్రింది ఉదాహరణలను గమనించండి

"మీరు అట్లు చేయని యెడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి" (సంఖ్యాకాండము 32:23). ఎట్లు చెయ్యకపోతే యెహోవా దృష్టికి పాపము చేసిన వారౌతారు? ఎందుకు వారి పాపం వారిని పట్టుకుంటుందని హెచ్చరిస్తున్నాడు? ఆ అధ్యాయమంతా చదివినప్పుడు మనకు అర్థమయ్యేదేంటంటే ఇశ్రాయేలీయులు వాగ్దా‌న దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు, యుద్ధం చేస్తూ వారి ప్రత్యర్థులను అధిగమిస్తూ తమ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకుంటూ కొనసాగారు. అయితే రూబేను, గాదు మరియు మనస్సే అర్థగోత్రంవారు, యొర్దాను ఇవతల ఉన్న భూమిని స్వాధీనపరచుకుని అక్కడ స్థిరపడిపోవాలని అనుకున్నారు (సంఖ్యాకాండము 32:1-5). అయితే, మోషే వారిని గద్దిస్తూ "మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యుద్దం చేస్తూ యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మీరు వారితో కూడా వెళ్ళకుండా వారిని నిరుత్సాహపరచి మీ పితరులు చేసిన పాపాన్నే మళ్ళీ చేస్తున్నారు. అలా చేసిన మీ పితరులను దేవుడు అప్పుడు నాశనం చేసిన విధంగానే మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు" అని వారిని హెచ్చరించాడు (సంఖ్యాకాండము 32:6-15) అప్పుడు వారు తమ సహోదరులతో ముందుండి సహకరిస్తామనీ యుద్ధమంతా అయిపోయాకే తిరిగి వచ్చి ఇక్కడ నివాసముంటామనీ అప్పుటి వరకూ కేవలం తమ ఇంటివారు మరియు తమ పశువుల మందలు మాత్రమే ఇక్కడ ఉండిపోవడానికి అనుమతించాలనీ విన్నవించుకున్నారు (సంఖ్యాకాండము 32:16-19) అందుకు మోషే సమ్మతించి, మీరు ఆ విధంగా మీ సహోదరులతో సహకరించకుండా వెనుదిరిగితే అది పాపమని, ఆ పాపం మిమ్మును పట్టుకుంటుందని హెచ్చరించాడు (సంఖ్యాకాండము 32:20-23). దేవుని చిత్తానుసారమైన ఒక పనిలో దేవుని పిల్లలతో సహకారులుగా ఉండటం తప్పనిసరి అని, అలా చెయ్యనివారు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవారే అని మోషే ఇక్కడ చెప్పిన నియమం. ఇది లేఖనాలలో అనేకసార్లు ధృవీకరించబడింది. ఇదే నియమాన్ని బట్టి దెబోరా ఒక విజయగీతం పాడుతూ స్వచ్ఛందంగా యుద్దంలో తనతో సహకరించినవారిని ఆశీర్వదిస్తూ సహకరించనివారిని శపించింది (న్యాయాధిపతులు 5:2,9,19-20,23,24). ఇదే నియమాన్ని బట్టి ఒక సందర్భంలో ఇశ్రాయేలీయులు ఒక న్యాయపోరాటానికి సిద్ధపడినప్పుడు, తమతో యుద్దానికి సహకరించనివారు చావాలని ఒట్టుపెట్టుకున్నారు, అలాగే చంపేశారు (న్యాయాధిపతులు 21:5,8-11). ఇదే నియమాన్ని బట్టి దావీదు తనతో ఉన్నవారికి అత్యవసర భోజనం పెట్టడానికి నిరాకరించిన నాబాలును చంపడానికి పూనుకున్నప్పుడు, నాబాలు భార్య అయిన అబీగయేలు దావీదుకు అవసరమైన సహాయాన్ని అందించి ఖడ్గాన్ని నిలువరించింది  (1 సమూయేలు 25:23-35). ఇదే నియమాన్ని బట్టి తమ స్వంత గృహాలు కట్టుకుంటూ యహోవా మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలీయులను దేవుడు క్రమశిక్షణ చేసి, వారు మారుమనస్సు పొందినప్పుడు వారిని ఆశీర్వదించారు  (హగ్గయి 1:9-13) ఇదే నియమాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభువు 'నా పక్షముననుందని వాడు నాకు విరోధి, నాతో కలసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు' అని సెలవిచ్చాడు (మత్తయి 12:30). ఇదే నియమాన్ని ఇప్పుడు అపొస్తలుడైన యోహాను "మేలు చేయువాడు దేవుని సంబంధి. కీడు చేయు వాడు దేవుని చూచిన వాడు కాదు" అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు

3 యోహాను‌ 12: దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.

"దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు"

దేమేత్రియు బహుశా గాయు మరియు దియొత్రెఫె ఉన్న సంఘంలోనే సభ్యుడైయుండి ఉండవచ్చు. అలా అయితే తనలాంటి సాక్ష్యమే కలిగియున్న మరొకరిని గాయుకు గుర్తు చేస్తూ తన సత్ప్రవర్తనలో కొనసాగడానికి ప్రోత్సహిస్తున్నాడు. లేదా యోహాను ఈ పత్రిక ఇచ్చి గాయు వద్దకు పంపిన సహోదరులలో దేమేత్రియు ఒకడు అయ్యుండవచ్చు. గాయు ఉన్న ప్రాంతానికి ఇతడు బహుశా మొదటిసారి రావడాన్ని బట్టి ఈ పరిచయం అవసరం అయ్యుండవచ్చు. ఏది ఏమైనా అందరివలన మంచి సాక్ష్యము పొందిన దేమేత్రియు, అలాంటి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి గాయుకు మాత్రమే కాదు, మనందరికీ కూడా ప్రోత్సాహంగా ఉన్నాడు. ఇది రాజీపడి, అందరినీ మెప్పించి సంపాదించుకున్న ప్రశంస కాదు. అలా మనుష్యులందరి మన్ననలను సంపాదించుకుంటే మనకు శ్రమ అనీ‌ అది అబధ్ధప్రవక్తల లక్షణమనీ లేఖనం హెచ్చరిస్తుంది  (లూకా 6:26). అయితే దేమేత్రియు సంపాదించుకున్నది అలాంటి మెప్పు కాదు. ఎందుకంటే అతను "సత్యము వలన" మంచి సాక్ష్యము  పొందినవాడు అని అపొస్తలుడు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి, ఇక్కడ "అందరి వలన" అన్నప్పుడు, సత్య సంబంధులైన "అందరూ" అని అర్థం చేసుకోవాలి. మనకు మనుష్యుల మధ్య ఉన్న మంచి పేరు, సత్య సువార్త ఆమోదించే ప్రవర్తన వలన కలిగిందా లేదా దానికి వ్యతిరేకంగా రాజీపడడం వలన కలిగిందా అనేది చాలా జాగ్రతగా పరిశీలించవలసిన విషయం.

"మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము"

అందరి సాక్ష్యాన్ని ధ్రువీకరిస్తూ అపొస్తలుడు కూడా దేమేత్రియు విషయమై మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. దైవావేశం వలన అపోస్తలీయ రచనలో ఇవ్వబడిన ఈ సాక్ష్యం ఎంతో విలువైనది. అదే మంచి సాక్షం కలిగిన అందరి పేర్లు అపోస్తలీయ రచనలలో ఉండడం సాధ్యం కాదు. కానీ అలాంటి సాక్ష్యమున్న మనందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నందుకు విశ్వాసంతో సంతోషించగలం.

"మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు"

ఈమాటలను యోహాను 19:35 పోల్చి చదివినప్పుడు ఈ రచనాశైలి అపొస్తలుడైన యోహానుదే అని గమనించగలం. అపొస్తలీయ రచనలను గుర్తించడానికి వారి రచనాశైలి కూడా కీలక పాత్రవహించిందని లేఖన ప్రామాణికత చరిత్ర మనకు తెలియజేస్తుంది.

3 యోహాను 13: అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు.

ఇది అపొస్తలునికి గాయుతో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. "ఎలాగో త్వరలో కలవబోతున్నాము కాబట్టి (3 యోహాను 1:14) వ్యక్తిగతమైన విషయాలు అప్పుడు మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం సార్వత్రిక సంఘానికి అవసరమైన మాటలతో సరిపెట్టుకుంటాను అని అపొస్తలుని భావం. ప్రత్యక్షత వలన కలిగిన సంగతులు మాత్రమే దేవుడు అపొస్తలీయ రచనలలో రాయించాడని, అయితే లేఖనాలలో లేని అపొస్తలుల వ్యక్తిగత సంభాషణలన్నీ దైవప్రత్యక్షతలు కావని వేరే చెప్పనవసరం లేదు.

3 యోహాను 14: శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.

"శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము"

త్వరలో చూస్తాను అని కాకుండా "త్వరలో చూడాలని నిరీక్షిస్తున్నాను" అని అపొస్తలుడు రాస్తున్నాడు. అలాగే అపొస్తలుడైన పౌలు కూడా తాను రోమీయులను కలవాలన్న కోరికను దేవుని చిత్తానికి విడిచిపెట్టినట్టు చదువుతాము  (రోమా 1:9-11). ప్రతి విషయంలోనూ ఇదే నియమాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి (యాకోబు 4:13-15). తాను నిరీక్షించిన విధంగా గాయును కలిస్తే "మిగితా విషయాలు నేరుగా మాట్లాడుకుందాం" అంటూ ప్రేమపూర్వకంగా అపొస్తలుడు తన పత్రికను ముగించాడు.

"నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము"

అపొస్తలుడు మాత్రమే కాదు, తనతో ఉన్నవారందరూ వందనాలు చెబుతున్నారు. గాయుకు మాత్రమే కాదు, తనతో ఉన్న వారందరికీ చెబుతున్నారు. ఒక నిజ క్రైస్తవుడు కేవలం తనకు పరిచయస్థులుగా ఉన్న విశ్వాసులకు మాత్రమే కాదు, విశ్వాసులందరికి శ్రేయోభిలాషిగా ఉంటాడు. ఇలాంటి ముగింపే చాలా పత్రికలలో మనం గమనిస్తాము. అయితే యాకోబు పత్రిక మరియు ఈ పత్రికలో మాత్రమే ముగింపులో "ఆమెన్" అనే మాట ఉండదు.

దియొత్రెఫె చేసిన చెడు కార్యాన్ని కాకుండా గాయు మరియు దేమెత్రేయు వంటివారి సత్ప్రవర్తనను అనుసరించి నడుచుకోవడానికి, అలా చెయ్యడం ద్వారా మనం దేవుని సంబంధులమనే సాక్ష్యాన్ని దేవుని యెదుటను, సత్యాన్ని ప్రేమించే అందరి ఎదుటను కాపాడుకోవడానికి, అంటే సత్యసువార్త విస్తరణను ఆటంకపరిచేవారిలా కాకుండా సత్యానికి సహాయకులుగా సువార్త సేవకులకు సహకారులుగా దేవునితో జతపనివారిగా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.

BIBLIOGRAPHY

1) 3 యోహాను పత్రికపై Matthew Henry వ్యాఖ్యానం.

2) 3 యోహాను పత్రికపై Dr. John Gill వ్యాఖ్యానం.

3) 3 యోహాను పత్రికపై Adam Clarck వ్యాఖ్యానం.

 

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.