విషయసూచిక
- సారాంశం
- రచయితని గురించిన పరిచయం
- వచన వ్యాఖ్యానం
1:1,2, 1:3, 1:4, 1:5, 1:6, 1:7, 1:8, 1:9, 1:10, 1:11, 1:12, 1:13, 1:14, 1:15,16, 1:17, 1:18, 1:19, 1:20, 1:21, 1:122, 1:23,24, 1:25
సారాంశం
ఈ పత్రిక ఒనేసిమును, ఫిలేమోనుతో సమాధానపర్చడానికి రాయబడింది. ఇది వ్యక్తిగత లేఖ అని చెప్పుకోవచ్చు. ఒనేసిము, ఫిలేమోను యొక్క బానిస. ఇతను (ఒనేసిము) క్రైస్తవుడు కాదు. ఫిలేమోను క్రైస్తవుడు, అతని ఇంట్లో ఒక సంఘం కూడుకునేది. ఆ సంఘం పేరు కొలొస్సి సంఘం. ఫిలేమోనుకు కనీసం ఒక బానిస ఉన్నాడు అని ఈ పత్రికని బట్టి మనం గ్రహించగలం, ఒకరి కంటే ఎక్కువ కూడా ఉండి ఉండొచ్చు. రోమా సామ్రాజ్యంలో ధనవంతులైనవారు మాత్రమే బానిసలని కలిగి ఉండేవారు, గనుక ఫిలేమోను ధనవంతుడని మనం తెలుసుకోవచ్చు.
ఈ బానిస అయిన ఒనేసిము, తన యజమాని (ఫిలేమోను) దగ్గర నుండి పారిపోయి రోమా పట్ణణాన్ని చేరుకున్నాడు. ఒనేసిము పారిపోయే సమయంలో తన యజమాని దగ్గర ధనాన్ని దొంగిలించి ఉండొచ్చు, అందుకే పౌలు "అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము; పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును" అని ఫిలేమోనుతో చెప్పాడు. రోమా పట్టణానికి వెళ్లిన తరువాత ఒనేసిము, చెరసాలలో ఉన్న పౌలును ఎలా కలుసుకున్నాడో మనకు తెలీదు. ఒనేసిముకు పౌలు ముందే పరిచయం ఉండి ఉండొచ్చు, ఎందుకంటే పౌలుకు ఫిలేమోను చాలా సన్నిహితుడు, గతంలో ఫిలేమోను మరియు పౌలు వ్యక్తిగతంగా కలుసుకొని ఉండొచ్చు. ఒనేసిము, ఫిలేమోను బానిస గనుక పౌలు పరిచయం ఉండే అవకాశం ఉంది. ఏమైనప్పటికి, ఒనేసిము మనకు తెలియని కారణాల వలన పౌలును రోమా చెరలో కలుసుకున్నాడు. పౌలు సువార్త ద్వారా ఒనేసిమును యేసు క్రీస్తు దగ్గరికి నడిపించాడు, అది దేవుని కృపే, పౌలు దేవుని సువార్తను తెలియజేసే ఒక సువార్తికుడు మాత్రమే, ఒనేసిముకు రక్షణ దేవుని నుండి కలిగినదే. ఒనేసిము రక్షణ పొందుకున్న తరువాత పౌలుకు సహాయకుడిగా ఉన్నాడు. పౌలు ఒనేసిమును చాలా ప్రేమించాడు, తన సొంత కుమారునిగా సంబోధించాడు.
ఫిలేమోను పత్రిక చివరిలో అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఫిలేమోను ఒనేసిమును క్షమించాడా? ఒకవేళ క్షమిస్తే ఒనేసిము దేవుని కోసం ఏంచేసాడు? ఫిలేమోను, ఒనేసిమును క్షమించాడా? ఆలా అయితే ఒనేసిముకు ఏమైంది? పౌలు అనుకున్న విధంగా ఫిలేమోనును కలుసుకోగలిగాడు? ఈ ప్రశ్నలకి బైబిల్ సమాధానం ఇవ్వట్లేదు. చరిత్రలో కూడా చాలా కొంచెం సమాచారం మాత్రమే ఉంది. అయితే ఫిలేమోను కచ్చితంగా ఒనేసిమును క్షమించాడు అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ క్షమించకపోయి ఉంటె ఈ పత్రిక కొత్త నిబంధనలో ఉండటంలో ఏ అర్థం ఉండకపోయేది.
రచయితని గురించిన పరిచయం
ఈ పత్రికని రచించింది అపొస్తలుడైన పౌలు. తాను, యేసు క్రీస్తు సువార్తను బట్టి అనేకసార్లు చెరసాలలో బందించబడ్డాడు. పౌలు ఈ విధంగా చెప్పాడు "వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని" - 2 కొరింథీ 11:23. ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు చెరసాలలో బందీగా ఉన్నాడు అనే విషయం కచ్చితమైనప్పటికీ, ఏ ప్రాంతంలో (ఏ పట్టణంలో) బందీగా ఉన్నాడు అనే విషయం మీద అనేక అభిప్రాయాలూ ఉన్నాయి. పౌలు కనీసం మూడుసార్లు చెరసాలలో ఉన్నాడని బైబిల్ పండితులు అభిప్రాయపడుతుంటారు.
1) ఎఫెసులో (A.D. 54-55) లో పౌలు అనేక శ్రమలు అనుభవించాడని చూడగలం, ఇందులో పౌలు చెరసాల పాలయ్యే అవకాశం లేకపోలేదు. "సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు" - 2 కొరింథీ 1:8
2) కైసరియా (Caesarea)లో పౌలు కనీసం రెండు సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు అని అపొస్తలుల కార్యములలో చెప్పబడింది (అపొ. కార్య. 23:33–26:32)
3) రోమా (A.D. 60 ప్రారంభంలో) పౌలు చెరసాలలో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం (అపొ. కార్య. 28:16,30)
అనేకమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు, కొలొస్సి మరియు ఫిలేమోను పత్రికలు పౌలు రోమాలో బందీగా ఉన్నప్పుడు రాసాడు అని అభిప్రాయపడుతుంటారు. అందుకు కారణం, ఈ రెండు పత్రికలలో పౌలు ప్రస్తావించినవారు, ఉదాహరణకు: మార్కు, తిమోతి, దేమా; వీరందరిని కొత్త నిబంధనలో పౌలు అనేకమార్లు రోమాలో ఉన్నవారిగా సంభోదించాడు, ఇందును బట్టి ఈ పత్రిక పౌలు రోమాలో ఉన్నప్పుడు రాయబడింది అని గ్రహించొచ్చు.
వచన వ్యాఖ్యానం
“క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది" - ఫిలేమోనుకు 1:1, 2
పౌలు ఈ ఉత్తరాన్ని ఫిలేమోనుకు రాసాడు. ఏ స్థితిలో తాను ఈ ఉత్తరాన్ని రాశాడో తెలియజెప్పడానికి "క్రీస్తు యేసు ఖైదీయైన పౌలును" అని తనను తాను సంబోధించుకున్నాడు (స్పష్టత కొరకు 'రచయితని గురించిన పరిచయం చదవండి'). తనని మాత్రమే కాకుండా, తిమోతిని కూడా పౌలు ప్రస్తావించాడు. దీనిని బట్టి తిమోతి పౌలుతో పాటు రోమాలో ఉన్నాడని మనం గ్రహించొచ్చు. ఇక్కడ పౌలు "సహోదరుడైన తిమోతి" అని అంటున్నాడు. ఏ విధంగా తిమోతి పౌలుకి సహోదరుడు? భౌతికంగా పౌలు మరియు తిమోతి సహోదరులు కాదు. అంత మాత్రమే కాకుండా పలుచోట్ల పౌలు తిమోతిని "నా కుమారుడైన తిమోతి" అని సంబోధించాడు (1 తిమోతి 1:2; 1 కొరింథీ 4:17). పౌలు తిమోతిని ఈ విధంగా ఎందుకు సంబోధించాడో తన సొంత మాటల్లో ఇలా చెప్పాడు "తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను" (ఫిలిప్పీ 2:22). ఆలా సువార్త సేవలో తన తోటివాడు గనుక సందర్భాన్ని బట్టి కుమారుడని, సహోదరుడని పౌలు, తిమోతిని సంబోధించాడు.
“మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును" అనగా, తనలాగానే సువార్త పరిచర్య చేస్తూ, చాలా సన్నిహితుడిగా, లేక స్నేహితుడు వంటివాడిగా ఉన్న ఫిలేమోనుకు, “ మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును"; ఈ అప్ఫియ ఫిలేమోను భార్య అని, అర్ఖిప్పు వీరి కుమారుడని కొందరు వ్యాఖ్యానకర్తల అభిప్రాయం. దీనిని బట్టి పౌలుకి ఫిలేమోనుతో మాత్రమే కాకుండా అతని కుటుంబంతో కూడా చాలా సన్నిహిత సంబంధం ఉందని చెప్పొచ్చు. పౌలు చెప్పబోయే విషయాలను బహుశా ఫిలేమోను భార్య గాని, అతని కుమారుడు గాని వ్యతిరేకించకూడదని భావించి వారిని కూడా ఈ ఉత్తరంలో జతచేసి ఫిలేమోనుకు మాత్రమే అన్నట్టు కాకుండా మొత్తం కుటుంబాన్ని ఉద్దేశిస్తూ పౌలు ఈ ఉత్తరం రాసాడు. పౌలు అర్ఖిప్పునకు ఈ పత్రికలో మాత్రమే కాకుండా, కొలొస్సి పత్రికలో కూడా తనకు (అర్ఖిప్పుకు) అప్పగించబడిన పరిచర్య నిమిత్తం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రోత్సహించాడు (కొలొస్సి 4:17). నీ యింట ఉన్న సంఘమునకును కూడా నేను (పౌలు) శుభాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబము మరియు మీ ఇంట కూడుకుంటున్న కొలొస్సి సంఘము రందరు నాకు ప్రియులు, మీరందరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు వారికి తెలియజేస్తున్నాడు. సంఘం అనే పదాన్ని ఇంగ్లీష్ లో చర్చి (Church) అని సంబోధిస్తారు. అనేకులు చర్చి అంటే ఒక భవనం అని భావిస్తున్నారు. ఉదాహరణకు: మా ఊరిలో ఐదు చర్చిలు ఉన్నాయి అని ఎవరైనా చెప్పినప్పుడు, వారు సంఘం కూడుకుంటున్న భవనం గురించి మాట్లాడుతున్నారు. అయితే సంఘం/Church అనే పదాన్ని ekklesia అనే గ్రీకుపదం నుండి అనువదించారు. ఈ పదం యొక్క అర్థం, "సమావేశమవుటకు పిలువబడిన సమాజం", అయితే క్రైస్తవ సమాజంలో ఈ పదం యొక్క అర్థం "దేవుని ఆరాధించడానికి క్రైస్తవ విశ్వాసుల కూడుకోవడం". కాబట్టి సంఘం లేదా Church అంటే కనబడే ఒక భవనం కాదు కానీ విశ్వాసుల సమూహం లేదా విశ్వాసుల సమావేశం అని మనం అర్థం చేసుకోవాలి.
“మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక " - ఫిలేమోనుకు 1:3
ఇక్కడ పౌలు తండ్రియైన దేవునినుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప మరియు సమాధానం మీకు కలుగునుగాక అని ఆశీర్వదిస్తున్నాడు. అయితే, ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఈ కృపను మరియు సమాధానాన్ని తండ్రియైన దేవుని దగ్గరనుండి పొందుకోవడం అసాధ్యం. మనం నిత్యజీవాన్ని పొందుకోవడానికి అనర్హులం, దేవునితో సమాధాన స్థితిలో ఉండడానికి అనర్హులం, దేవుని ప్రేమ మరియు ఆయన వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి అనర్హులం, అయినప్పటికీ దేవుడు వీటినన్నిటిని మనకు అనుగ్రహించాడు, ఇదే “కృప”. ఈ పుష్కలమైన దేవుని కృప దినదినము మనల్ని అభివృద్ధిపరుస్తూ యేసుక్రీస్తు స్వరూపములోకి మారటానికి సహాయం చేస్తుంది.
అలానే దేవుని "సమాధానం" మీకు కలుగును గాక అని ఆశీర్వదిస్తున్నాడు. దేవునితో వైరం ఉన్న మనం, క్రీస్తు కృపను బట్టి సమాధానపరచబడ్డాం. ఈ సమాధాన స్థితిని బట్టి అనుభవపూర్వకమైన సమాధానాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. మనకు కలిగిన సమాధాన స్థితిని మనం కోల్పోనప్పటికీ, పాపం చేసినప్పుడు అనుభవపూర్వకమైన సమాధానాన్ని కోల్పోతుంటాం. దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపుతున్న కొలది అనుభవపూర్వకమైన దేవుని సమాధానం మన హృదయాలలో విస్తరిస్తూ ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇలా ఉండునుగాక అని పౌలు ఆశీర్వదిస్తున్నాడు. దేవునితో మనకు సమాధాన స్థితి కలగడానికి కారణం దేవుని ప్రేమ. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోదు. అటువంటి దేవుని ప్రేమ మన జీవితంలో విస్తరించాలి, అనగా దేవుని ప్రేమను గ్రహించే విషయంలో మనం దినదినం ఎదగాలి.
“నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని" - ఫిలేమోనుకు 1:4
ఈ వాక్యాన్ని అక్షరాలా ఇలా అనువదించవచ్చు "నీకు ప్రభువు యెడలను మరియు పరిశుద్ధులయెడలను కలిగియున్న ప్రేమనుగూర్చియు, విశ్వాసమును గూర్చియు నేను విని". ఆంగ్ల సాహిత్యంలో (English literature) ఇలాంటి వాక్యాలను (sentences) ఖైయాసం (chiasm) అంటారు. అంటే, ఆలోచనల శ్రేణిని ప్రదర్శించి, ఆపై వాటిని వ్యతిరేక క్రమంలో పునరావృత్తం చేయడం. దీనిని ఈ క్రింది ఉదాహరణలతో అర్థం చేసుకుందాం:
ఆలోచన a మరియు ఆలోచన b, ఆలోచన A మరియు ఆలోచన Bను అనుకరిస్తుంది (Idea A & Idea B followed by Idea a & b). ఇక్కడ A మరియు Bలను వ్యతిరేక క్రమంలో అమరిస్తే b మరియు aలు ఉత్పన్నమవుతాయి. మత్తయి సువార్తలోని ఒక వచనాన్ని ఇక్కడ ఉదాహరించుకుందాం:
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మత్తయి 6:24
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు (A)
అతడు ఒకని ద్వేషించి (B)
యొకని ప్రేమించును (C)
లేదా యొకని పక్షముగానుండి (c)
యొకని తృణీకరించును (b)
మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు (a)
పై వాక్యభాగంలో మనం గమనిస్తే cba అనేవి ABCలను వ్యతిరేక క్రమంలో చెప్పడం అని గ్రహించగలం.
అదే విధంగా, ఫిలేమోను 1:4లో పౌలు ఇలాంటి క్రమాన్నే అనుసరించి రాసాడు (chiastic sentence). అది ఎలానో చూద్దాం:
నీకు ప్రభువు యెడలను (A)
మరియు పరిశుద్ధులయెడలను (B)
కలిగియున్న ప్రేమనుగూర్చియు (b)
విశ్వాసమును గూర్చియు నేను విని (a)
ఇక్కడ Aaలను పక్కపక్కనే పెట్టి చూస్తే : "నీకు ప్రభువు యెడలను (A)", "విశ్వాసమును గూర్చియు నేను విని (a); అలానే Bbలను పక్కపక్కనే పెట్టి చూస్తే: "మరియు పరిశుద్ధులయెడలను (B)", "కలిగియున్న ప్రేమనుగూర్చియు (b)"అనే అర్థం వస్తునట్టు గ్రహించగలం. ఇలా అర్థం చేసుకోవటానికి భిన్నంగా మనం సాధారణంగా ఫిలేమోను 1:4ను చదివితే, విశ్వాసము మరియు ప్రేమ అనేవి ప్రభువుకు మరియు సమస్త పరిశుద్ధులకు ఒకేసారి ఆపాదించబడినట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ పౌలు ఫిలేమోనుకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని, ఆ విశ్వాసం ద్వారం పరిశుద్ధుల పట్ల తనకి (ఫిలేమోనుకు) ఉత్పన్నమైన ప్రేమని ఎత్తి చూపిస్తున్నాడు. దీనిని మరి స్పష్టంగా పౌలు కొలొస్సి సంఘానికి రాసిన పత్రికలో సంబోధించాడు :
"క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు," - కొలొస్సి 1:3
“నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు" - ఫిలేమోనుకు 1:5
ఫిలేమోనుకు ఉన్న విశ్వాసాన్ని మరియు ప్రేమని పౌలు తెలుసుకొని, తన ప్రార్థనలలో ఫిలేమోను నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇందు కోసం ఈ వాక్యభాగాన్ని పరిశీలిద్దాం:
సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది - 2 థెస్సలొనీకయులకు 1:3
ఇక్కడ పౌలు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో మనకి తెలియజేస్తున్నాడు. ఆ కారణాలు ఇవే "ప్రభువు పట్ల ఒకరి విశ్వాసం అభివృద్ధి చెందడం", "ఎదుటివారిని (ముఖ్యంగా సహోదరులని) ప్రేమించడం". ఈ రెండు విషయాలని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే, ఈ రెండు గుణలక్షణాలు మన సొంత శక్తిని బట్టి కలగవు అని సులభంగా గ్రహించగలం. మనలోని విశ్వాసానికి కర్త దేవుడు, మన రక్షణకి కర్త దేవుడు, మనలో ఉన్న సహోదరప్రేమకు కర్త దేవుడు. ఈ గుణలక్షణాలు మనలో ఉండేలా చేసింది దేవుడే గనుక ఆయన స్తుతికి అర్హుడు. ఫిలేమోనులో ఉన్న విశ్వాసానికి, మరియు సహోదరప్రేమకి కారణం దేవుని కృప మాత్రమే గనుక పౌలు దేవునికి ఎల్లపుడు (ఫిలేమోను తరుపున) కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇక్కడ కృతజ్ఞతస్తుతులు చెల్లించడం మాత్రమే కాకుండా, పౌలు విజ్ఞాపన కూడా చేస్తున్నట్టు చూడగలం. ఏ విషయాన్ని బట్టి పౌలు విజ్ఞాపనలు చేస్తున్నాడో తర్వాతి వచనంలో చూడొచ్చు.
“క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. " ఫిలేమోనుకు 1:6
పౌలు ఇక్కడ "నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన" అని అంటున్నాడు. ఏ విషయం అనుభవపూర్వకంగా ఎరగాలి అంటే "క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై" అని అర్థంచేసుకోవచ్చు . ఇలా ఉండటం వలన ఇతరులు నీ విశ్వాసంలో పాలివారవుతారు అని పౌలు ఫిలేమోనుకు చెప్తున్నాడు. "ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట" అని పౌలు చెప్పినప్పుడు, ఇందులో దాగి ఉన్న ఉద్దేశం మనం గ్రహించాలి.
మొదటిగా, క్రియలు కలిగిన విశ్వాసిగా ఫిలేమోను ఉండాలి అని పౌలు దేవుని వేడుకుంటున్నాడు. రెండవదిగా, పౌలు ఫిలేమోనును తన మనవి అంగీకరించాలని కోరుతున్నాడు, ఆలా చేయడం వలన ఫిలేమోను ఇంట్లో ఉన్న సంఘంవారు ఫిలేమోను విశ్వాసాన్ని అనుసరిస్తారు అని చెపుతున్నాడు. ఇంతకి పౌలు ఫిలేమోనును ఏమి చేయాలని కోరుతున్నాడు? ఈ విషయం తర్వాత వచనాలలో చూస్తాం (అక్కడ వివరించుకుందాం).
నిజానికి నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు, విశ్వాసిగా ఉండటం అంటే "మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది" అని మొదటిగా గ్రహించాలి. రెండవదిగా "మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండాలి" (paraphrase added). ఆలా వాక్యప్రకారం మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఇతర విశ్వాసులు మనల్ని చూసి నేర్చుకుంటారు, మనలాగానే ప్రవర్తించడానికి /మనల్ని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అనేకమంది క్రీస్తులో ఉన్నప్పటికి ఎటువంటి ఆత్మఫలం లేకుండా ఉంటున్నారు. నువ్వు నిజమైన విశ్వాసివి అయితే ఆత్మఫలం అనగా "ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము" అనేవాటిని నీ జీవితంలో చూడగలుగుతున్నావా? నువ్వు గనుక ఎటువంటి ఆత్మఫలం లేకుండా జీవిస్తుంటే, నీ వలన సంఘానికి/తోటి విశ్వాసులకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. నువ్వు ఇతర విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటే నువ్వు సిద్ధాంతపరంగా విన్న విషయాలను ఆచరణలో పెట్టాలి. నువ్వు ఆలా ఉన్నప్పుడు "ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను" అని పౌలు ఏ విధంగా అయితే ఫిలేమోను నుండి ఆశించాడో అదే నీ జీవితంలో కూడా నెరవేరుతుంది అని అర్థం చేసుకో.
“సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను." ఫిలేమోనుకు 1:7
ఈ వాక్యభాగం పౌలు ఫిలేమోను నిమిత్తము ఎందుకు విజ్ఞాపనలు మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనకు తెలియజేస్తుంది. ఫిలేమోనుకు పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన వారి హృదయాలకు విశ్రాంతి కలుగజేసాడు. అనగా పరిశుద్ధుల అవసరాలలో వారిని ఆదుకొని, తనవంతు తాను చేయగలిగిన సహాయాన్ని ప్రేమతో అందించాడు. ఇది నిజమైన విశ్వాసులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణం.
“దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు" - 1 యోహాను 3:10
ఫిలేమోను తన సహోదరులను ప్రేమించాడు, తాను నిజమైన దేవుని సంబంధి అని తన క్రియల ద్వారా దానిని నిరూపించుకున్నాడు గనుక (సహోదరులకు సహాయము చేయడం ద్వారా) పౌలు ఫిలేమోనును బట్టి అధికంగా ఆనందించాడు. ఈ వచనంలో విశ్రాంతి అనే పదాన్ని 'అనపేపాటై' (anapepautai) అనే గ్రీకు పదం నుండి అనువదించారు. ఈ పదం యొక్క అర్థం విశ్రాంతి పొందడం అని మాత్రమే కాకుండా "తిరిగి శక్తిని పొందడం" అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పౌలు శారీరకమైన శక్తిని పొందడం గురించి వివరించట్లేదు కానీ, ఆంతరంగికమైన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఫిలేమోను తోటి పరిశుద్దులకు తన మాటలద్వారా, తన క్రియల ద్వారా అంతరంగికమైన శక్తిని వారిలో నింపేవాడిగా, శారీరకమైన అవసరాలలో (పరిశుద్ధుల పట్ల) సహాయకునిగా ఉన్నాడు.
“నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. " యాకోబు 2:14 - 17
దీనిని బట్టి ఫిలేమోను విశ్వాసం క్రియలులేనిది కాదని, తద్వారా తనది నిజమైన విశ్వాసమని రుజువవుతోంది. మరి ఇదే కొలమానంతో నిన్ను కొలిస్తే, నీ విశ్వాసం నిజమైనదని, మృతమైనది కాదని రుజువు పరచబడుతుందా? నువ్వు కూడా పరిశుద్దులను ప్రేమించి వారి ఆత్మీయ అవసరాలలో గాని శారీరక అవసరాలలో గాని నీవంతు ప్రేమని చూపించగలుగుతున్నావా?
“కావున యుక్తమైనదానిని గూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను" - ఫిలేమోనుకు 1:8
సంఘాన్ని ఆజ్ఞాపించే అధికారం అపొస్తలులందరూ దేవుని నుండి పొందుకున్నారు. ఈ అధికారం సంఘక్షేమాభివృద్ధి కోసం అనుగ్రహించబడింది.
“పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను" - 2 కొరింథీయులకు 10:8
అపొస్తలుడైన పౌలు తరచు సంఘాలని దేవుని అధికారాన్ని బట్టి ఆజ్ఞాపించడం మనం గమనిస్తాం. ఉదాహరణకు: థెస్సలొనీకయ సంఘానికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు.“సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము" - 2 థెస్సలొనీకయులకు 3:6
అవసరమైన ప్రతిసారి సంఘాన్ని ఆజ్ఞాపించే విషయంలో పౌలు వెనకడుగు వేయలేదు కానీ బహు ధైర్యం కలిగి ప్రవర్తించాడు. ఏ విషయాలను గూర్చి పౌలు తరచుగా సంఘాలను ఆజ్ఞాపించేవాడు అని ఆలోచించేస్తే, ఇదే వచనంలో "యుక్తమైనదానిని" అని వివరించబడింది. అంటే పౌలు తనకున్న అపోస్తలియ అధికారాన్ని బట్టి అనవసరమైన విషయాలను అనుసరించమని సంఘాలకు ఆజ్ఞాపించలేదు కానీ యుక్తమైనదానిని మాత్రమే చేయమని ఆజ్ఞాపించాడు.
అయితే ఈ వచనంలో మనం ఒక విషయాన్ని గమనించగలం, యుక్తమైనదానిని గూర్చి ఫిలేమోనును ఆజ్ఞాపించే అధికారం పౌలుకు ఉన్నా, ఆ విధంగా పౌలు చేయలేదు అని తరవాత వచనంలో గమనించగలం.
“వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని" ఫిలేమోనుకు 1:9
'యుక్తమైనదానిని గూర్చి ఫిలేమోనును ఆజ్ఞాపించడానికి పౌలుకు అధికారం ఉన్నా', 'ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదని పౌలు ఎంచుకున్నాడు.' ఈ వచనంలో చాలా స్పష్టంగా, ఒక విషయాన్ని గురించి పౌలు, ఫిలేమోనును వేడుకుంటున్నాడు. తాను వేడుకునే విషయాన్ని ఫిలేమోను అంగీకరించాలని పౌలు రెండు కారణాలను ఇక్కడ సంబోధించాడు.
1) నేను వృద్ధుడను
2) నేను క్రీస్తుయేసు ఖైదీని
ఈ రెండు లక్షణాలు పౌలు చేసే అభ్యర్థనకు ఎలా దోహదపడతాయో తెలుసుకుందాం:
వృద్ధులను గౌరవించాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, "తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను ( లేవీయ 19:32)." తలనెరిసిన వారి ఎదుట లేవడం, ముసలివారి ముఖాన్ని ఘనపరచడం అంటే ఇవి బాహ్యరూపమైన క్రియలు మాత్రమే కాదు, వారి మాట వినడం, వారు చెప్పింది దేవునికి యూగ్యకరమైన పద్దతిలో ఉన్నప్పుడు ఆ మాటలను పాటించడం కూడా ఈ ఆజ్ఞలో ఇమిడి ఉన్న అర్థం. హెబ్రీయులు దేవుని ఆదేశాలను బట్టి పెద్దలను గౌరవించి వారి మాట వినేవారు. ఉదాహరణకు: పాత నిబంధనలో మోషేకు తన మామగారైన జెత్రో, న్యాయాధిపతుల విషయంలో ఇచ్చిన సలహాని మోషే గౌరవించి పాటించాడు (నిర్గమ 18:17-19). ఫిలేమోనుకు పెద్దలను గౌరవించాలని, దేవునికి భయపడే వృద్ధుల మాటలు మరియు సలహాలు విని పాటించాలని తెలుసు. అందుకే పౌలు —'నేను వృద్ధుడను నేను ఒక అభ్యర్థన చేస్తే కారణం లేకుండా చేయను' అని చెప్తూ, 'నువ్వు దేవుని బిడ్డవి గనుక నా వయసుకు గౌరవమిచ్చి నేను అడిగే విషయాన్ని చేస్తావని నేను నమ్ముతున్నాను' అనే నమ్మకాన్ని ఫిలేమోను పట్ల కనబరిచాడు.
పౌలు, తాను వృద్ధుడను అని మాత్రమే కాకుండా, క్రీస్తు యేసు ఖైదీనని కూడా ఫిలేమోనుకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని సువార్త విషయమై పౌలు రోమాలో బందీగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. తాను ప్రేమను బట్టి చేస్తున్న అభ్యర్థన ఎలా విలువైనదో లేదా అవసరమైనదో పౌలు ఫిలేమోనుకు "నేను క్రీస్తు ఖైదీని" అని చెప్పడం ద్వారా తెలియజేస్తున్నాడు. నేను అపొస్తలుడను, దేవుని జ్ఞానం కలిగినవాడను, క్రీస్తు సువార్త విషయమై బంధకంలో (జైలులో) ఉంటున్నవాడను గనుక నేను చేసే అభ్యర్థన జ్ఞానం లేకుండా, అవివేకంగా చెయ్యట్లేదు అని నువ్వు తెలుసుకొని, నేను వేడుకునే విషయం యొక్క విశిష్టత గ్రహిస్తావని భావిస్తున్నాను అని పౌలు ఫిలేమోనుకు బోధించినట్టు ఈ వచనం మనకు తెలియజేస్తుంది.
ఈ వచనంలో "ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని" అని పౌలు చెప్తున్నాడు, అయితే "వేడుకొనుట" అనే పదాన్ని పరిశీలన చేద్దాం. ఈ పదాన్ని (వేడుకొనుట) ఇంగ్లీష్ బైబిల్ లో "Appeal" అని parakaleō అనే గ్రీకు పదం నుండి అనువదించారు (తెలుగులో "వేడుకొనుట" అని కూడా ఈ గ్రీకు పదాన్నే అనువదించారు). Parakaleō అనే ఈ గ్రీకు పదం కొత్త నిబంధనలో దాదాపు 108 సార్లు ఉపయోగించబడింది. ఈ పదాన్ని రెండు భాగాలుగా విడదీసి మనం అర్థం చేసుకోవచ్చు Para అంటే నా పక్షాన, నా పక్కన (నిలబడడం), నాతో కలిసి అనే అర్థం వస్తుంది (Para = side of, alongside, beside) Kaleo అంటే "పిలవడం"( Kaleo = call). ఈ పదాన్ని అక్షరాలా తీసుకుంటే "తన పక్షాన నిలబడమని పిలవడం" (call one alongside, to call someone to oneself, to call for, to summon). దీనిని బట్టి చూస్తే పౌలు, తాను అడుగుతున్న (అభ్యర్థన చేస్తున్న) విషయానికి, ఫిలేమోనును తన పక్షాన నిలబడాలని కోరుతున్నాడు.
“నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను" - ఫిలేమోనుకు 1:10
ఈ వచనంలో పౌలు ఏ విషయమై ఫిలేమోనును వేడుకుంటున్నాడో అది తెలియజేస్తున్నాడు. "ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను" అని చెప్తున్నాడు. పౌలు ఒనేసిముని తన కుమారునిగా సంబోధిస్తున్నాడు. ఏ విధంగా ఒనేసిము పౌలుకు కుమారుడు? ఒనేసిము పౌలుకు బాహ్యపరంగా కుమారుడు కాదు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఒనేసిమును 'నా కుమారుడు' అని పౌలు పిలవడానికి గల మూలం ఏంటో చూద్దాం.
“క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను" - 1 కొరింథీయులకు 4:15,16
పై వచనంలో పౌలు కొరింథీ సంఘానికి తాను తండ్రినని చెప్తున్నాడు, ఏ విధంగా పౌలు వారికి తండ్రి అయ్యాడు అని ఆలోచిస్తే, "సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని" అనే సమాధానం ఆ వచనంలోనే వివరించబడింది. అంటే పౌలు ఎవరినైతే సువార్త ద్వారా యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసంలోకి నడిపించాడో వారికి తాను తండ్రినని భావించాడు. అయితే కొందరికి తాను తండ్రినని, సాధారణ శైలిలో కాకుండా, బలంగా చెప్తున్నట్టు మనం గమనించగలం. వీరిలో తిమోతి, తీతు, మరియు ఒనేసిము ఉన్నారు.
“విశ్వాసమునుబట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది" - 1 తిమోతికి 1:2
“నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది" - 1 తీతుకు 1:2
వీరిని (తిమోతి, తీతు, ఒనేసిము) పౌలు తన సువార్త ద్వారా యేసు క్రీస్తు ప్రభువు దగ్గరికి నడిపించాడు. అంతమాత్రమే కాకుండా వీరు పౌలుతో పాటు సువార్త పరిచర్యలో బలంగా వాడబడుతున్నవారు. గనుక వీరిని ప్రత్యేకంగా తన కుమారులని పౌలు సంబోధిస్తున్నాడు. వీరిని కుమారులు అని మాత్రమే కాకుండా సహోదరులు అని కూడా పౌలు సంబోదించాడు, ఉదాహరణకు:
“నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను" - కొలొస్సయులకు 4:9
ఒనేసిమును విశ్వాసము బట్టి కుమారుడు అని సంబోధించినా, పరిచర్యను బట్టి ప్రియసహోదరుడు అని కూడా సంబోధించాడు. ఈ కుమారుడైన ఒనేసిము కోసము పౌలు ఫిలేమోనును వేడుకుంటున్నాడు. అయితే ఒనేసిమును "నా బంధకాలలో నేను కనిన కుమారుడు" అని పౌలు ఎందుకు ప్రత్యేకంగా సంభోదించాడు అనే సమాచారం కోసం పుస్తక పరిచయం అనే భాగాన్ని చదవండి.
“అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను" - ఫిలేమోనుకు 1:11
ఒనేసిము ఇంతకముందు (మునుపు) నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు అని పౌలు చెప్తున్నాడు. దీనిని మనం ఈ విధంగా అర్ధం చేసుకోవచ్చు; ఫిలేమోను దగ్గర ఒనేసిము పనిచేసినప్పుడు క్రీస్తు దాసునివలే కాక మనుష్యులను సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు (ఎఫెసీ 6:6), నిజాయితీగా పనిచేయాలనే స్వభావం తనలో లేదు, మరియు ఫిలేమోను దగ్గర ధనాన్ని బహుశ దొంగతనం చేసి రోమా పట్టణానికి పారిపోయాడు. ఇలాంటివాడు మంచి బానిస కాదు. అందుకే పౌలు ఒనేసిముని సంభోదించి "మునుపు నీకు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు" అని చెపుతున్నాడు. ఒనేసిము ఎలా తన యజమాని అయిన ఫిలేమోనుకు నిష్ప్రయోజకుడో, అలానే మనం పరమదేవునికి నిష్ప్రయోజకులుగా ఉన్నవారము.
“అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు." రోమా 3:12
పై వచనంలో "పనికిమాలినవారైరి" అని అనువదించిన పదం గ్రీకులో EchreiOthEsan అని ఉంది. ఈ పదాన్ని "పనికిరానివారు/నిష్ప్రయోజకులు" అని కూడా అనువదించవచ్చు. ఇక్కడ ఒనేసిము ఫిలేమోనుకు నిష్ప్రయోజకుడుగా ఉండడం అనేది, ప్రజలు దేవునికి నిష్ప్రయోజకులుగా ఉన్నారు అనేదానిని చిత్రీకరించి చూపిస్తుంది. దేవుణ్ణి వెతికేవారు ఒక్కరూ లేరు, సహజంగా పాపాన్ని ద్వేషించే వారు ఒక్కరూ లేరు, దేవుని ఆజ్ఞలను గైకొనాలని, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలనుకునేవారు ఎవరూ లేరు అని వాక్యం స్పష్టంగా ద్రువీకరిస్తుంది. మనం ఒకప్పుడు ఒనేసిము వలే నిష్ప్రయోజకులం. ఈ స్థితినే పరిశుద్ధ లేఖనం ఈ విధంగా చూపిస్తుంది.
“మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా" - ఎఫెసీ 2:1
“మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు" - ఎఫెసీ 2:5
“మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా" - కొలొస్సి 2:13
మన పూర్వస్థితిని పౌలు పైవచనాలలో చాలా చక్కగా వివరించాడు. అసలు ఎందుకు మనం ఆ స్థితిలో ఉన్నాము అంటే అందుకు వాక్యం ఈ విధంగా బదులిస్తుంది - “వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు" - ఎఫెసీ 4:18
అంధకారసంబంధమైన మనసు మనకుంది, అంటే మనము పుట్టుకతో అంధకార సంబంధులం లేదా సాతాను అనుచరులం, పాపపు బానిసత్వంలోనే మనం పుట్టాము, అలానే జీవిస్తున్నాము. ఒనేసిము మరియు ఫిలేమోను మధ్య ఉన్న బాహ్యమైన సంబంధం, మనకు మరియు దేవునికి ఉన్న ఆత్మీయమైన సంబంధానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఒనేసిము పూర్వపు స్థితి మనుషులకు (ఫిలేమోనుకు) మరియు దేవునికి నిష్ప్రయోజకుడు అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ స్థితిలో ఉన్న ఒనేసిము ఇప్పుడు "ప్రయోజనకరమైనవాడాయెను" అని పౌలు చెప్తున్నాడు. ఒనేసిము మారుమనస్సు గురించి తెలుసుకోవడానికి "పుస్తక పరిచయం" అనే భాగాన్ని చదవండి. ఒనేసిము ఎలాగైతే దేవుని సువార్తను బట్టి మారుమనస్సు పొందాడో, మనం కూడా అదే సువార్త ద్వారా యేసు క్రీస్తు కృపను బట్టి, విశ్వాసమూలంగా రక్షించబడ్డాం. మారుమనస్సు పొందిన ఒనేసిము, ఫిలేమోనుకు మరియు పౌలుకు ప్రయోజనకరమైనవాడయ్యాడు. పౌలుతో పాటు ఉంటూ యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో సహాయకుడిగా తన పాత్రను నిర్వర్తించాడు. "ప్రయోజనకరమైనవాడు" అనే పదం గ్రీకు యూఖరెస్టోస్ (Euchrestos) అనే పదం నుండి అనువదించబడింది. ఈ పదం కొత్త నిబంధనలో 3 సార్లు ఉపయోగించబడింది (ఆ మూడిట్లో ఒకటి మనం ధ్యానిస్తున్న ఈ వచనమే; ఫిలేమోను 1:11). ఆ తక్కిన 2 వచనాలలో ఈ పదం ఏ సందర్భంలో వాడబడిందో చూద్దాం.
“ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై (యూఖరెస్టోస్; Euchrestos) ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును" - 2 తిమోతికి 2:21
“లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు (యూఖరెస్టోస్; Euchrestos). తుకికును ఎఫెసునకు పంపితిని." 2 తిమోతికి 4:11
పై వచనంలో "యజమానుడు వాడుకొనుటకు అర్హమై" అని ఆ పదం అనువదించబడింది, మరియు 2 తిమోతికి 4:11లో మార్కును గురించి సంబోధిస్తూ "ప్రయోజనకరమైనవాడు" అని అదే పదాన్ని పౌలు వాడాడు. ఏ విషయంలో మార్కు ప్రయోజనకరమైనవాడు అంటే "పరిచారము నిమిత్తము" అని అదే వచనంలో చెప్పబడింది. అంటే "euchrestos" అనగా ప్రభువు వాడుకోవడానికి అర్హమైనవాడని, సువార్త సేవలో ఉపయోగించబడేవాడు అనే అర్ధాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఒనేసిము గురించి కూడా "యితడు యూఖరెస్టోస్ (Euchrestos)" అని చెప్పినప్పుడు; ఇతను ప్రభువు వాడుకోవడానికి అర్హమైనవాడని, సువార్త సేవలో పౌలుతో పాటు పని చేస్తున్నవాడని మనం అర్థం చేసుకోవచ్చు.
“నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను" - ఫిలేమోనుకు 1:12
"నా ప్రాణము వంటివాడు" అని ఒనేసిముని గురించి పౌలు చెప్తున్నాడు. ఇది పౌలుకు ఒనేసిము మీద ఉన్న ఆప్యాతను మరియు ప్రేమను తెలియజేస్తుంది. "నీయొద్దకు తిరిగి పంపియున్నాను" అనగా రోమా నుండి ఒనేసిమును మరియు తుకికును కొలొస్సి సంఘానికి పంపిన విషయం గురించి ఇక్కడ సంబోధిస్తున్నాడు. కొలొస్సి పత్రికలో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు: “ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించునట్లును, అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహోదరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు." కొలొస్సి 4:7-9
ఒనేసిము నీ యొద్దనుండి వచ్చాడు గనుక, తిరిగి నీయొద్దకే పంపుతున్నాను అని పౌలు చెప్తున్నాడు. దీనిని బట్టి చూస్తే (ఒనేసిముని తన యజమాని అయిన ఫిలేమోను దగ్గరికి తిరిగి పంపడం) పౌలు బానిసత్వాన్ని ప్రోత్సహిస్తునట్టు అనిపిస్తుంది. మరి నిజంగా పౌలు బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడా? లేకపోతే ఎందుకు బానిస అయిన ఒనేసిముని, తన యజమాని అయిన ఫిలేమోను దగ్గరికి తిరిగి పంపాడు? దీనికి సమాధానంగా "పౌలు బానిసత్వాన్ని ప్రోత్సహించలేదు" అని మనం అర్ధం చేసుకోవాలి. అసలు బానిసలు ఎవరు అంటే, తమని తాము పోషించుకోలేక, ఒక యజమాని దగ్గర పని చేయడానికి అంగీకరించినవారు, లేదా యుద్ధంలో ఓడిపోయిన దేశ ప్రజలు, లేదా తమ అప్పును తీర్చలేక తమ యజమానికి సేవ చేయడానికి ఒప్పుకున్నవారు.
అయితే పాత నిబంధనలో హెబ్రీయులు అయిన తన ప్రజలకు దేవుడు బానిసలను ఇచ్చాడు. అయితే వారిని సేవకులుగా మాత్రమే ఇచ్చాడు కానీ, వారిని హింసించడానికి దేవుడు వారి యజమానులకు అనుమతి ఇవ్వలేదు. పాత నిబంధన గ్రంథంలో హెబ్రీయులు తమ బానిసలతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయంలో దేవుడు అనేకమైన ఆజ్ఞలను వారికి ఇచ్చినట్టు గమనించగలం. ఉదాహరణకు: “నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును" - నిర్గమ 21:2
దీనిని బట్టి దేవుడే బానిసలు ఉండేలా నియమించాడు అని ఒకరకంగా అర్థం వచ్చినప్పటికి, దేవుడు అనుమతించింది దాసులనే గాని, రోమా సామ్రాజ్యంలో మనం చుసిన క్రూరత్వపు బానిసత్వాన్ని కాదు అని అర్ధం చేసుకోవాలి. అందుకు పౌలు యేసుక్రీస్తులో అందరు ఒకటే అని, ఏ భేదము వ్యత్యాసము లేదని బోధించాడు.
అయితే పౌలు ఇప్పుడు వ్యవహరిస్తున్నది బానిసలు ఉన్న హెబ్రీ యజమానులతో కాదు, బానిసలు ఉన్న రోమా యజమానులతో. రోమా బానిసత్వం (ఇది రోమా సామ్రాజ్యం కింద ఉన్న అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది) చాలా కఠినమైనది. చాలా కాలం వరకు రోమా బానిసలకు పౌరహక్కులు ఉండేవి కాదు. అనేకమంది రోమా యజమానులు వారి బానిసలతో చాలా కఠినంగా వ్యవహరించేవారు. పౌలుని దేవుడు అన్యజనులకు సువార్తికునిగా చేసాడు గనుక, బానిసలు మరియు యజమానులు ఒకరిపట్ల ఒకరు ఎలా ప్రవర్తించాలి, అనగా వారి విషయంలో పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏంటి అనే విషయాన్ని కూడా బోధించే బాధ్యత పౌలుకు ఉంది. అందుకే పౌలు కొలొస్సి సంఘానికి ఈ విధంగా రాసాడు: “దాసులారా (బానిసలారా), మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి." కొలొస్సి 3:22
“యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి" కొలొస్సి 4:1
అయితే మీరు నన్ను ఇంకొక ప్రశ్న అడగొచ్చు, 'పౌలు ధర్మశాస్త్రమంతా తెలిసినవాడు కదా మరి దేవుడు చెప్పిన ఈ కీలకమైన విషయాన్ని ఎలా మర్చిపోయి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు?' ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో అర్ధం చేసుకోవడానికి క్రింది వచనాన్ని చదవండి.
“తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు." ద్వితీయో 23:15
పై వచనం చాలా స్పష్టంగా పారిపోయి తన దగ్గరికి వచ్చిన దాసుని/బానిసని తిరిగి తన యజమానికి అప్పగించకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి పారిపోయి వచ్చిన ఒనేసిముని పౌలు తిరిగి తన యజమాని అయిన ఫిలేమోను దగ్గరికి పంపడం దేవుని మాటకు విరుద్ధమైనది కదా? అయితే ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండంలోని వాక్యభాగం కఠినులైన తమ యజమానుల నుండి తమను తాము రక్షించుకోవడానికి పారిపోయి వచ్చిన బానిసల గురించి మాట్లాడుతుంది. ఆ వాక్య సందర్భానికి, ఒనేసిము సందర్భానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒనేసిము కఠినమైన, హింసించే తన యజమాని నుండి పారిపోలేదు గాని, తన సొంత మూర్ఖత్వంతో, తన యజమానుని మోసగించి, తప్పించుకుపోవాలని పారిపోయాడు. అందుకే పౌలు ఒనేసిమును తిరిగి ఫిలేమోను దగ్గరికి పంపాడు. ఒనేసిము చేసినది సరైనది కాదు కాబట్టి, ఈ తప్పును తన యజమాని అయిన ఫిలేమోను క్షమించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఒనేసిమును పౌలు తిరిగి పంపించాడు.
“నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని;" ఫిలేమోనుకు 1:13
"నేను సువార్తకొరకు బంధకములో ఉండగా" అనగా పౌలు, రోమాలో బందీగా ఉన్నప్పుడు "నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని" అనగా నీకు (ఫిలేమోను) బదులుగా, నీ స్థానంలో ఒనేసిము నాకు పరిచారం చేస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడు. ఒనేసిము పౌలు యొక్క శారీరకమైన అవసరాలలో మరియు సువార్త పరిచర్యలో సహాయపడుతున్నాడు. బందీగా ఉన్న పౌలుకి ఇటువంటి సహాయం చాలా అవసరం. అయినప్పటికీ పౌలు ఒనేసిముని, తన యజమాని అయిన ఫిలేమోను దగ్గరికి తిరిగి పంపించాడు.
ఈ వచనంలో "అతని నుంచుకొనవలెనని యుంటిని" అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ "యుంటిని" అని తెలుగులోకి అనువదించబడింది పదం ఆంగ్లములో "I would have been glad" అని అనువదించబడింది. ఈ అనువాదాలకి మూలమైన గ్రీకు పదం boulomai. ఈ పదం కొత్త నిబంధనలో దాదాపు 37 సార్లు ఉపయోగించబడింది. ఈ పదాన్ని దేవునికి ఆపాదించి వాడబడినప్పుడు ఇది దేవుని "నిర్ణయాత్మక సంకల్పాన్ని (Decretive will of God) సూచిస్తుంది. నిర్ణయాత్మక సంకల్పం అనగా దేవుడు, తాను అనుకున్నది అనుకున్నట్టు జరగాలని ఇచ్చే ఆజ్ఞ. ఉదాహరణకి:
"తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను." (లూకా 22:43)
పై వచనంలో "నీ చితమైతే" అని అనువదించబడింది పదం "boulomai" అనే గ్రీకు పదం. ఇంతక ముందు చెప్పుకున్నట్టు ఇది దేవుని నిర్ణయాత్మకమైన సంకల్పాన్ని సూచిస్తుంది. ఈ వచనం యొక్క అర్ధం, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించడం నీ యొక్క నిర్ణయాత్మక సంకల్పం అయితే, దీనిని తొలగించు. ఒకవేళ ఆ గిన్నెని తండి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు నుండి తొలగించడం తన నిర్ణయాత్మక సంకల్పం కాకపోతే, ఆ గిన్నెని (సిలువ శ్రమలను) క్రీస్తు నుండి తొలగించక పోవడమే తన నిర్ణయాత్మక సంకల్పం అని గ్రహించొచ్చు.
ఇదే గ్రీకు పదం మనుషులకు ఆపాదించి వాడబడినప్పుడు దీని అర్ధం "to will or desire that springs from reason not from emotion", అనగా "కారణాన్ని బట్టి కలిగిన ఆశ (కోరిక/ఇష్టం), ఉద్రేకం వలన కలిగినది కాదు". ఇక్కడ పౌలు ఒనేసిముని తన యొద్ద ఉంచుకోవడం అనేది, ఎదో ఉద్రేకపూర్వమైన ఆలోచన కాదు, అది "కారణాన్ని బట్టి కలిగిన ఆశ' (కోరిక/ఇష్టం). పౌలు తన సొంత ప్రయోజనం కోసం ఒనేసిమును తన దగ్గర ఉంచుకోవాలి అనుకోలేదు కానీ, దేవుని పరిచర్య కోసం, తనకి సహాయకుడిగా ఉండడానికి పౌలు, ఒనేసిమును తనతో ఉంచుకోవాలని ఇష్టపడ్డాడు.
“నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.;" ఫిలేమోనుకు 1:14
పౌలు ఒనేసిమును తన దగ్గర ఉంచుకోవాలి అని ఇష్టపడినప్పటికీ, ఫిలేమోను అనుమతి లేకుండా ఒనేసిమును తన దగ్గర ఉంచుకోవడం న్యాయమైనది కాదు అని భావించాడు. అందుకే "నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు" అని పౌలు ఫిలేమోనుకు చెప్తున్నాడు. ఇది పౌలు యొక్క వినయాన్ని, తగ్గింపు గుణాన్ని మనకి తెలియజేస్తుంది. పౌలు, ఫిలేమోను యొక్క ఉపకారము (ఒనేసిమును పౌలుకు సహాయకునిగా ఇవ్వడం) అనేది స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని ఆశించాడు. బలవంతముచేతనైనట్టు, మొక్కుబడిగా చేసే ఏ పని అయినా దేవునికి అంగీకరమైనది కాదు. అది దేవునికి అంగీకరమైనది కాదు గనుక, అపొస్తలుడైన పౌలు "బలవంతపు" అర్పణలను ప్రోత్సహించలేదు.
ఉదాహరణకు: "సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును." 2 కొరింథీ 9:7
పై వాక్యభాగంలో "సణుగుకొంటూ, బలవంతముగా" ఇచ్చే అర్పణలు దేవునికి అంగీకారం కాదు అని చూడగలం. అయితే దేవుడు "ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును". ఇదే కొలమానం ప్రకారం ఫిలేమోను తన బానిస అయిన ఒనేసిమును "ఇష్టపూర్వకంగా, ఉత్సాహంతో అంగీకరించి" పరిచర్య నిమిత్తం పౌలుకు సహాయకుడిగా ఉండడానికి అర్పిస్తే అది దేవునికి అంగీకారమైనది. అందుకు పౌలు "నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెను" అని చెప్తున్నాడు.
“అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.;" ఫిలేమోనుకు 1:15,16
ఇక్కడ పౌలు 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు:
1) అతడు కొద్దీ కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు
2) ఒనేసిము చేసిన తప్పును, దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నాడు
3) దాసుడిగా కాక ప్రియ సహోదరుడిగా ఉండటానికి తిరిగి నీ యొద్దకు పంపబడ్డాడు (పౌలు పంపాడు)
ఒనేసిము తన యజమాని అయిన ఫిలేమోనును మోసం చేసి, పారిపోయాడు. ఇది ఒనేసిము చేసిన తప్పు. ఇక్కడ పౌలు ఫిలేమోనుతో - ఒనేసిము నీ యొద్దనుండి పారిపోయాడు అని చెప్పకుండా "నిన్ను ఎడబాసాడు/విడిచి వెళ్ళాడు" అని చెప్తున్నాడు. ఇది ఒనేసిము పక్షాన, తన తప్పుని తీవ్రంగా ఎత్తి చూపకుండా, ఒనేసిమును మరియు ఫిలేమోనును కలపడానికి పౌలు వాడిన సున్నితమైన పదం. ఎడబాసి యుండెను అని తెలుగులోకి అనువదించబడిన గ్రీకు పదం "Chorizo". ఈ పదం కొత్త నిబంధనలో 13 సార్లు వాడబడింది. ఈ పదానికి సందర్భాన్ని బట్టి వేరువేరు అర్ధాలు ఉన్నా, దాని యొక్క ప్రాథమిక అర్ధం 'విడిచి వెళ్ళుట' లేక 'వేరుగా ఉండుట'. ఫిలేమోనుకు ఒనేసిము మీద ఉన్న కోపాన్ని తగ్గించే విధంగా, కొద్దికాలం నిన్ను ఎడబాసి ఉండటం (ఒనేసిము) దేవుని ప్రణాళికలో భాగమే అని వివరించడానికి పౌలు ప్రయత్నించాడు.
ఒనేసిము చేసిన తప్పుకు దేవుడు బాధ్యుడు కాదు, తన తప్పుకు తానే బాధ్యుడు. ఒనేసిము తన చిత్తప్రకారం, తన ఇష్టపూర్వకంగా ఫిలేమోను దగ్గర నుంచి పారిపోయాడు. దేవుడు ఎవరిని తప్పు లేదా పాపం చేయమని ప్రేరేపించడు, ప్రేరేపించలేడు.
“దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును" యాకోబు 1:13,14
విశ్వాసులకు వచ్చే శోధనలను దేవుడు అనుమతిస్తాడు, అంతే కానీ దేవుడు ఎవరిని శోధించడు. అంతమాత్రాన 'నేను దేవుని చేత శోధింపబడుచున్నానని' అనుకోవడం సరికాదు. విశ్వాసులైనా, అవిశ్వాసులైనా చేసే తప్పులకు దేవుడు బాధ్యుడు కాడు. వారు వారి సొంత కోరికలను బట్టి, దుష్టత్వాన్ని బట్టి పాపం చేస్తున్నారు. అయితే ఒకరు చేసిన తప్పు నుండి మంచిని జరిగించి, తద్వారా తనకు మహిమ తెచ్చుకోగల సమర్థుడు మన దేవుడు.
ఒక ఉదాహరణని చూద్దాం: “అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను............ మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు." ఆది 45:5-8
ఇక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడుతూ, 'మీరు నన్ను ఐగుప్తీయులకు అమ్మేశాము అనుకున్నారు గాని, దేవుడు తన చిత్తప్రకారము, ఒక ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు' అని చెప్తున్నాడు.
“యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి – ఒకవేళ యోసేపు మనయందు పగపెట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని." ఆది 50:15
యాకోబు (తమ తండ్రి) చనిపోయిన తరువాత, యోసేపు మనకేమైనా కీడు చేస్తాడేమో అని, అతని సహోదరులందరూ భయపడ్డారు. అయితే యోసేపు ఈ విధంగా తన సహోదరులకు సమాధానం ఇచ్చాడు - "మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను." ఆది 50:20. దీనిని బట్టి చూస్తే, ఒకరి తప్పుని/ పాపాన్ని దేవుడు తనకు మహిమ కలుగునట్లుగా ఉపయోగించుకోగలడు అని నిర్ధారించవచ్చు.
అదేవిధంగా ఒనేసిము చేసిన తప్పుకు దేవుడు బాధ్యుడు కాడు, అయితే ఆ తప్పు ద్వారా తనకు మహిమ కలుగునట్లుగా దేవుడు ఒక ప్రణాలికను ఉంచాడు (ఒనేసిము రక్షించబడుట).
పౌలు ఫిలేమోనుతో "ఒనేసిమును క్షమించి అంగీకరించమని అడుగుతున్నాడు." అతడు నీకు దాసుడే, అయితే ఇప్పుడు యేసు క్రీస్తు నామంలో రక్షించబడ్డాడు గనుక, ఒక దాసునిగా కాకుండా, ఒక సహోదరునిగా స్వీకరించమని (పౌలు ఫిలేమోనుకు) సూచిస్తున్నాడు. అయితే బానిసని, సహోదరునిగా స్వీకరించడం అనేది రోమా సంస్కృతిని బట్టి కష్టమైన పని అని పౌలుకి తెలుసు. అంత మాత్రమే కాకుండా, పౌలు తన అధికారాన్ని (అపోస్తలత్వాన్ని) దుర్వినియోగం చేస్తున్నాడు అని ఫిలేమోను పొరబడే అవకాశం కూడా ఉంది. అందుకే పౌలు "అతడు (ఒనేసిము) విశేషముగా నాకు ప్రియ సహోదరుడు అని అంటున్నాడు." పౌలు ఒక బానిసను/దాసుని, నా ప్రియ కుమారుడని, నా ప్రాణంవంటివాడని, నా ప్రియ సహోదరుడని సంభోదించాడు; దీనిని బట్టి ఫిలేమోను, ఒనేసిమును ప్రియ సహోదరునిగా అంగీకరిస్తాడని పౌలు భావించాడు.
"శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను" అని అంటున్నాడు. దీని ఉద్దేశం, ఒనేసిము నీవాడు, నీ దాసుడు, నీ కుటుంబంలో ఒకడు, నువ్వు శరీరరీత్యా ఎరిగినవాడు; ఇప్పుడు నీ విశ్వాసంలో పాలివాడు, గనుక ఒనేసిము పౌలు కంటే ఫిలేమోనుకు అత్యంత ప్రియుడుగా, ప్రియసహోదరుడుగా ఉండదగినవాడు. ప్రియ సహోదరుడు అని చెప్పడానికి పౌలు వాడిన గ్రీకు పదం "adelphos" దీని అర్ధం "తన మూలం (పుట్టుక) ఆధారంగా ఏర్పడిన సహవాసము (a fellowship of life based on identity of origin)." ఈ పదం సహజంగా ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు సహోదరులు అని, ఒకే తెగకు చెందినవారు అని, ఒకే దేశపురుషులని అర్ధమిస్తుంది. క్రైస్తవులు ఆత్మీయంగా ఒకే కుటుంబానికి చెందినవారు గనుక (దేవుని కుమారులు/కుమార్తెలు) వారు ఒకరికి ఒకరు సహోదరులు అని చెప్పుకోవచ్చు. ఆత్మీయ సహోదరులు అని అర్ధం వచ్చేలా "adelphos" అనే పదం కొత్త నిబంధనలో దాదాపు 160 సార్లు వాడబడింది.
“కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము;" ఫిలేమోనుకు 1:17
"నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల" అని పౌలు ఫిలేమోనుతో అంటున్నాడు. ఎందుకు ఈ మాట వాడాడు అని మనం కొంచెం ఆలోచన చేస్తే, ఫిలేమోను 4వ వచనం లో "నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని" అని పౌలు ఫిలేమోను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దీనిని బట్టి ఫిలేమోను దేవుని పట్ల విశ్వాసం కలిగినవాడు అని, సహోదరులను ప్రేమించే స్వభావం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అయితే వాక్యం ఇలా సెలవిస్తోంది "మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము." హెబ్రీ 3:14. అంటే దేవుని విశ్వసించినవారు క్రీస్తులో పాలివారు, మరియు వారు అపొస్తలులతో కూడా పాలివారు లేదా సహవాసము కలిగినవారు (1 యోహాను 5:13). పౌలును, ఫిలేమోను పాలివానిగా ఎంచకపోతే అతను "యేసుక్రీస్తు లో పాలివాడు అని చెప్పే రుజువు ఏ మాత్రము లేదు." ఫిలేమోను యొక్క నిజమైన విశ్వాసాన్ని నిరూపించుకోమని, తాను పౌలును పాలివానిగా లేదా సహోదరునిగా ఎంచేవాడు అని కనబరుచుకోమని పౌలు ఫిలేమోనుకు చెప్తున్నాడు.
ఇక్కడ పౌలు ఫిలేమోనుతో చెప్తున్న మాటను గమనిస్తే english లో 'if' అనే పదాన్ని వాడారు; ఇదే పదం గ్రీకులో "ei" అని ఉంది. ఈ వచనాన్ని "నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినట్లైతే (if you consider me your partner)" అని కూడా అనువదించొచ్చు. మత్తయి 4:3 లో "నీవు దేవుని కుమారుడవైతే (If you are the Son of God) ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనెను" అని సాతానుడు యేసును శోధించాడు. ఈ "if" అనే మాట ఒక సవాలుకి నిదర్శనగా ఉంది. సాతానుడు యేసును శోధించడానికి "నీవు దేవుని కుమారుడువైతే" అని ప్రారంభించాడు; అక్కడ యేసు నిజమైన దేవుని కుమారుడు గనుక సాతానుని శొధనలకు లొంగలేదు. ఇక్కడ ఫిలేమోను నిజమైన విశ్వాసి గనుక, పౌలును తనతో పాలివానిగా ఎంచాడు గనుక, ఒనేసిమును చేర్చుకున్నాడు.
“అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము;" ఫిలేమోనుకు 1:18
"అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను" అనగా నీ దగ్గర నుండి పారిపోయి (నిన్ను విడిచిపోయి), లేదా నీకు సేవ చేసే విషయంలో అలక్ష్యంగా ఉండి, లేదా నీ నమ్మకాన్ని వమ్ముచేసి, లేదా మరే విషయంలో అయినా నీకు నష్టం కలుగజేసి ఉన్న యెడల, "నీకు ఏమైన ఋణమున్న యెడలను" అంత మాత్రమే కాక తనకు అప్పగించిన బాధ్యతలో అనగా వాణిజ్య-వ్యాపార విషయాలలో, లేక నీ డబ్బుతో వ్యవహరించే విషయంలో నిన్ను మోసం చేసి, నీ సొమ్మును దొంగతనం చేసి ఉంటె, "అది నా లెక్కలో చేర్చుము" నేను దానికి బాధ్యత వహిస్తాను అని పౌలు చెప్తున్నాడు. తప్పు చేసింది ఒనేసిము అయినా పౌలు దానిని తన లెక్కలో లేక తన బాధ్యతగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు.
ఇక్కడ పౌలు ఊహాత్మకంగా (hypothetical) చెప్పినట్టు ఫిలేమోనుతో మాట్లాడుతున్నాడు "అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను" అని అంటున్నాడు. పౌలుకు, ఒనేసిము చేసిన తప్పులు తెలిసే ఉండొచ్చు (మారుమనసు పొందిన తరువాత, ఒనేసిము పౌలు ముందు తాను చేసిన తప్పులు చెప్పుండొచ్చు/ఒప్పుకొని ఉండొచ్చు). అయితే ఇక్కడ పౌలు ఒనేసిము యొక్క ప్రతి తప్పును పేరుపేరున చెప్పకుండా, సున్నితంగా 'ఒక వేళ ఒనేసిము నీకేమైనా నష్టం చేసుంటే' అంటున్నాడు. ఈ సున్నితమైన మాట, ఫిలేమోనుకు తన దాసుని (ఒనేసిము) క్షమించగలిగినదిగా అనిపించడానికి, ఇద్దరి మధ్య సంధి/శాంతి కుదర్చడానికి (ఫిలేమోను, తన దాసుని అంగీకరించడానికి) దోహదపడేదిగా ఉంది.
ఇక్కడ పౌలు, ఒనేసిము చేసిన తప్పును తన లెక్కలో వెయ్యమని చెప్తున్నాడు, మరి కొలొస్సి సంఘానికి ఇలా చెప్పడేంటి?
“అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు;" కొలొస్సి 3:25
పై వచనాన్ని ఆ వాక్య సందర్భంలో చదివితే, అక్కడ పౌలు బానిసలు మరియు యజమానుల గురించి మాట్లాడుతున్నాడు. యెజమానులైనవారిని సంబోధిస్తూ, మీరు న్యాయమైనది మరియు ధర్మమైనది మీ దాసుల యెడల చేయుడి అంటున్నాడు. పౌలు అక్కడ అవిశ్వాసులను సంబోధించటం లేదు, విశ్వాసులైన కొలొస్సి సంఘంవారిని సంబోధిస్తున్నాడు అని మనం గ్రహించాలి. గనుక కొలొస్సి సంఘానికి చెప్పిన విషయం క్రైస్తవ నైతిక ప్రవర్తనకు సంబంధించింది, అయితే పౌలు ఒనేసిము చేసిన నష్టాన్ని లేదా రుణాన్ని తన లెక్కలో చేర్చు అని చెప్పడం ప్రభువుని నమ్మినవాళ్ళ పట్ల క్రైస్తవ క్షమాపణ ధోరణిని చూపిస్తుంది.
ఇక్కడ మనం ఒక క్రమాన్ని గమనించగలం:
1) తప్పు చేసింది ఒనేసిము (ఒనేసిము పాపులందరికి సాదృశ్యంగా ఉన్నాడు)
2)ఒనేసిముకు న్యాయంగా శిక్ష పడాలి (పాపం వలన వచ్చే జీతం మరణం గనుక, పాపులకు మరణం రావాలి)
3)పౌలుకి ఒనేసిము చేసిన తప్పులను తన బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరం లేదు (క్రీస్తుకు పాపుల నిమిత్తం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు)
4)పౌలు ఒనేసిము యొక్క రుణాన్ని, తన లెక్కలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు (క్రీస్తు పాపుల నిమిత్తం, వారి విమోచన కోసము, పాపపు శిక్షని భరించాడు)
పై క్రమాన్ని బట్టి పౌలుకు, ఒనేసిముకు మధ్య ఉన్న సంబంధం; ప్రభువుకు మరియు మనకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.
“పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?" ఫిలేమోనుకు 1:19
ఇక్కడ "పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను" అని అంటున్నాడు. అయితే "ఈ మాట" అనే పదం ఆదిమ గ్రీకు భాషలో "ఇది" అని ఉంది. "పౌలను నేను దీనిని నా స్వహస్తముతో వ్రాయుచున్నాను" అని మనం ఆదిమ గ్రీకు భాషలో గమనించగలం. దీనినే ఇంగ్లీష్ లో "I, Paul, write this with my own hand" అని ఇంగ్లీష్ లో అనువదించారు. "నా స్వహస్తములతో రాసాను" అనేది ఈ మొత్తం పత్రికకి సంబందించినదైనా అయ్యుండొచ్చు, లేదా ప్రత్యేకించి పౌలు ఒక పూచికత్తు (surety bill/promisory note) ఒనేసిముకు ఇచ్చి పంపి ఉండొచ్చు.
పౌలు ఇక్కడ "అది నేనే తీర్తును" అని చెప్తున్నాడు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? పైన 18వ వచనంలో గమనించినట్లయితే, ఒనేసిము ఫిలేమోనుకు ఉన్న రుణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ రుణాన్ని నేనే తీరుస్తాను అని పౌలు చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు రోమాలో బందీగా ఉన్నాడు, మరి పౌలు దగ్గర ఒనేసిము రుణాన్ని తీర్చేంత ధనం ఎక్కడుంది? పౌలు ఏమైనా ధనాన్ని తన దగ్గర కూడబెట్టుకున్నాడా? లేకపోతే పౌలు "నేను తీరుస్తాను" అని చెప్పిన మాట, ఏదో మాటవరసకి చెప్పాడా?
పౌలు, ఒనేసిము రుణాన్ని తీరుస్తాను అని ఫిలేమోనుకు తన సొంత చేత్తో రాసి పంపించినప్పుడు, పౌలు ఆ మాట ఏదో ఊరకనే చెప్పాడు అని అనుకోవడం సమంజసం కాదు. నిజానికి తాను చెప్పింది ఖచ్చితంగా చేస్తాను అనే నమ్మకం ఉంది గనుకనే ఫిలేమోనుకు పౌలు అలాంటి వాగ్దానం చేసాడు (paul meant what he said).
పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ: “పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును" 1 కొరింథీ 16:1-3
ఇక్కడ యెరూషలేములో హింసించబడుతున్న పరిశుద్దులకొరకు పౌలు ఉపకారద్రవ్యాన్ని సేకరించాడు. అదే విధంగా, ఒనేసిము కోసం తాను స్థాపించిన సంఘాల నుండి ఉపకారద్రవ్యాన్ని సేకరించగలడు, అందుకే పౌలు నమ్మకంగా "నేను తీరుస్తాను" అని చెప్పాడు.
"అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల" ఇక్కడ పౌలు, ఫిలేమోనుకు ఒకసారి తన రక్షణను గుర్తు చేసుకోమని చెప్తున్నాడు. ఫిలేమోను రక్షణకు కారణమైన క్రీస్తు సువార్తను పంచింది పౌలుయే గనుక (ఫిలేమోనును బాహ్యంగా కలుసుకొని పౌలు సువార్త ప్రకటించలేదు కానీ, ఎపఫ్రా పౌలు చెప్పిన సువార్తను విని దానికి కొలొస్సి లో ఉన్న ఫిలేమోనుకు మరియు ఇతరులకు ప్రకటించాడు; ఆ విధంగా ఫిలేమోను రక్షణకు పరోక్షంగా పౌలే కారణం), నీ రక్షణ నిమిత్తం, నీ ఆత్మవిషయంలో నువ్వు నాకు రుణపడి ఉన్నావు అని వేరే చెప్పాలా అని అంటున్నాడు.
“అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము" ఫిలేమోనుకు 1:20
"అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము", ఇక్కడ పౌలు ఫిలేమోనును సహోదరుడు అని సంబోధిస్తున్నాడు, సువార్త పరిచర్యలో తనతోటి వాడు (అని పౌలు ఫిలేమోనును నమ్మాడు) గనుక ఆ విధంగా సంబోధించాడు. పౌలు ఫిలేమోనును 'నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము' అని అంటున్నాడు. ఏ విషయం గురించి పౌలు మాట్లాడుతున్నాడు? ఒనేసిమును అంగీకరించే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఒనేసిమును, ప్రభువులో ఫిలేమోను క్షమించి అంగీకరించడం ద్వారా, తనకు ఆనందం కలుగుతుందని పౌలు తెలియజేస్తున్నాడు.
ఈ పత్రిక 7వ వచనంలో "పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను" అని పౌలు ఫిలేమోను గురించి సాక్ష్యమిచ్చాడు. ఆలా పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతి కలుగజేసిన ఫిలేమోనును పౌలు తనకు కూడా ఆనందమును, విశ్రాంతిని కలగజేయమని కోరుతున్నాడు. ఇక్కడ "ప్రభువునందు", "క్రీస్తునందు" అనే రెండు పదాలు పౌలు ఉపయోగించాడు. ఇక్కడ పౌలు ఉద్దేశం, ఎదో బాహ్యమైన అవసరాలలో (లోకపరమైన అవసరాలలో) సహాయపడమని కాదు గాని, ఒనేసిమును క్షమించి అంగీకరించడం ద్వారా తనకు (పౌలుకు) ఆత్మీయమైన ఆనందం మరియు శాంతి కలుగుతుందని చెప్తున్నాడు. ఆలా చేయడం ద్వారా ఫిలేమోను యేసుక్రీస్తులో తన సత్ప్రవర్తనను చూపిస్తున్నాడు అని గమనించొచ్చు.
సహోదరుడా, సహోదరి, మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు క్రీస్తులో సత్ప్రవర్తన కలిగి ఉన్నావా? నీకు వ్యతిరేకంగా పాపం చేసినవారు నిన్ను క్షమాపణ అడిగితే క్షమించే హృదయం కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు క్రీస్తు దాసుడను, దాసురాలను అని చెప్పుకుంటూ దేవుడు ఆశించే సత్ప్రవర్తన నీలో లేకపోతే నీ భక్తి వల్లన ఏమి ఉపయోగం?
“నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను." ఫిలేమోనుకు 1:21
"నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి" అని పౌలు ఫిలేమోనుతో అంటున్నాడు. పౌలు, ఒనేసిమును క్షమించి, తనని సహోదరునిగా అంగీకరించమని ఫిలేమోనును కోరాడు. ఫిలేమోను ఖచ్చింతంగా ఈ విషయంలో తాను అడిగిన దానికంటే ఎక్కువగా (అనగా ఒనేసిముని క్షేమించి అంగీకరించే విషయంలో) చేస్తాడు అనే నమ్మకాన్ని పౌలు ఫిలేమోను పట్ల కనబరిచాడు. "నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను" అనగా, పౌలు ఫిలేమోను పట్ల కలిగి ఉన్న నమ్మకాన్ని, మరియు ఫిలేమోను దేవునికి మహిమ తెచ్చే ఏ పనినైనా చేయడానికి వెనుకాడడని, ఇలా దేవుని చిత్తాని చేయడానికి ప్రేరేపించే తన మాటలను ఫిలేమోను వింటాడు అని పౌలు ఆశించాడు.
పౌలు ఇలాంటి నమ్మకాన్ని (తాను చెప్పిన విషయాలను చేస్తారు అని) కొరింథీయుల పట్ల, గలతీయుల పట్ల, మరియు థెస్సలొనీకయుల పట్ల కనబరిచాడు. ఉదాహరణకు: "మేము మీకు ఆజ్ఞాపించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము." 2 థెస్సలొనీకయు 3:4. పౌలుకు వీరి పట్ల ఇంత నమ్మకం ఎలా ఉంది అని మనం అనుకోవచ్చు. అందుకు సమాధానంగా పౌలు నమ్మింది శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని అని చెప్పుకోవచ్చు. దేవుని వాక్యం, దేవుడు ఎన్నుకున్న ప్రజలను రక్షణలోకి నడిపిస్తుందని, ఆలా రక్షించబడినవారు దేవునిని సంతోషపెట్టే పనులను చేయడానికే ఇష్టపడతారు (మనుషులను సంతోషపెట్టాలి అని అనుకోరు), పౌలు వీరికి బోధించేది, ఆజ్ఞాపించేది దేవుని మాటలు మరియు దేవుని ఆజ్ఞలే గనుక, వాటిని నిజంగా రక్షించబడిన వీరు చేస్తారు అని పౌలు చాలా దృఢంగా నమ్మాడు.
దేవుని సార్వభౌమత్వాన్ని పౌలు నమ్మాడు, దేవుని చేత రక్షించబడిన ప్రజలు దేవుని సంతోషపెడతారు అని పౌలు నమ్మాడు. ఫిలేమోను దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి రక్షించబడ్డాడు గనుక, దేవుని సంతోషపెడతాడు. ప్రియసహోదరుడు/సహోదరి నిజంగా రక్షించబడ్డాను అని అనుకునే నువ్వు దేవుని సంతోషపెడుతున్నావా? లేక పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా?
“అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము." ఫిలేమోనుకు 1:22
ఈ వచనంలో పౌలు, ఫిలేమోను మరియు ఇతరుల ప్రార్ధనల మూలంగా తాను చెరసాలలో నుండి విడిపించబడి, ప్రభువు చిత్తాని బట్టి ఫిలేమోనును మరియు కొలొస్సి సంఘంవారిని కలుసుకుంటాననే ఆశను వ్యక్తపరుస్తున్నాడు. "నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను" ఈ మాటను మనం కొంచెం అధ్యయనం చేద్దాం. ఇక్కడ "నీ ప్రార్ధనల" మరియు "నీకు" అనే రెండు పదాల గురించి మూలభాష అయిన గ్రీకులో అధ్యయనం చేస్తే ఆ పదాలు "ὑμῶν (hymōn; of you)" "ὑμῖν (hymin; to you)" అని చూడొచ్చు. ఈ పదాలను "నీ" మరియు "నీకు" అని తెలుగులోకి అనువదించబడినప్పటికీ, ఇవి ఏకవచన సర్వనామాలు కాదు (not singular pronouns). అందుకే ఈ పదాలను ఇంగ్లీషులో "you" అని అనువదించారు. "you" అంటే ఏకవచన సర్వనామమైనా లేక బహువచన సర్వనామమైనా అయ్యుండొచ్చు. మూలభాష అయిన గ్రీకులో ఈ పదాలు hymōn & hymin బహువచన సర్వనామాలను సూచిస్తుంది.
దీనిని బట్టి ఈ వచనాన్ని ఈ విధంగా అనువదించొచ్చు "మీ ప్రార్థనల మూలముగా నేను మీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను." అంటే పౌలు ఇక్కడ ఒక్క ఫిలేమోను ప్రార్ధన గురించే మాట్లాడట్లేదు గాని, మొత్తం సంఘ ప్రార్థనలను గురించి మాట్లాడుతున్నాడు. ఫిలేమోను పత్రికలో మాత్రమే కాకుండా అనేక పత్రికలలో పౌలు సంఘప్రార్ధనలు అపేక్షించాడు. ఉదాహరణకు: “నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను." రోమా 15:31,32
“అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును." 2 కొరింథీ 1:11
ఈ పత్రిక పౌలు ఫిలేమోనుకు వ్యక్తిగతంగా రాసినప్పటికీ, ఇందులో అనేకమార్లు సంఘాన్ని లేదా సంఘస్థులను సంబోధిస్తూ పౌలు మాట్లాడాడు. మనం చూసినట్లయితే 2వ వచనంలో "అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని" చెప్పాడు; 3వ వచనంలో ఆశీర్వాదం మొత్తం సంఘానికి నిర్దేశిస్తూ చెప్పాడు; అలానే ఇక్కడ 22వ వచనంలో సంఘ ప్రార్ధనల గురించి పౌలు మాట్లాడాడు; అలానే 25వ వచనంలో మొత్తం సంఘానికి ముగింపు ఆశీర్వాదాన్ని పౌలు తెలియజేసాడు. దీనిని బట్టి ఈ పత్రిక ఫిలేమోనుకు మాత్రమే కాకుండా సంఘానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని మనం గ్రహించగలం. "నా నిమిత్తము బస సిద్ధము చేయుము" అని పౌలు ఫిలేమోనుకు చెప్తున్నాడు. అయితే ఎందుకు పౌలు ఫిలేమోను దగ్గరకు లేదా ఫిలేమోను ఇంట జరుగుతున్నా సంఘానికి రావాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, ఫిలేమోను ఇంట కూడుకుంటున్న సంఘం కోలోస్సి సంఘం అని మనకు తెలుసు. పౌలు ఈ రెండు పత్రికలను ( కోలోస్సి & ఫిలేమోను) ఒకేసారి రాసి పంపించాడు. అందుకే అర్చిప్పును, మరియు ఒనేసిము గురించి కోలోస్సి పత్రిక చివర్లో మాట్లాడాడు (కోలోస్సి 4:7-9). అయితే కోలోస్సి సంఘానికి పౌలు పత్రిక రాయడానికి కారణం అక్కడ జరుగుతున్న దుర్బోధ. గనుక పౌలు కోలోస్సి సంఘానికి (ఫిలేమోను ఇంట కూడుకుంటున్న సంఘానికి) రావడానికి ఇష్టపడ్డాడు.
“క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు." ఫిలేమోనుకు 1:23,24
పౌలు ప్రతి పత్రిక చివరిలో తనతో ఉన్నవారిని గుర్తు చేస్తూ, వారు పత్రిక రాయబడుతున్న సంఘానికి తెలియజేసే శుభాలని సంబోధిస్తాడు. అదే విధంగా ఇక్కడ ఐదుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు "ఎపఫ్రా", "మార్కు", "అరిస్తార్కు", "దేమా", మరియు "లూకా". ఎపఫ్రాను, "నా తోటి ఖైదీ" అని సంబోధించాడు. ఈ ఎపఫ్రా కొలొస్సి సంఘానికి బోధకుడిగా ఉన్నాడు, తాను కొలొస్సి సంఘంలో ప్రబలుతున్న దుర్బోధలను పౌలుకు చేరవేసి, వాక్యానుసారమైన సమాధానం కోసం రోమా వరకు ప్రయాణించి పౌలును కలుసుకున్నాడు. ఇతను పౌలుకు రోమాలో సువార్త విషయంలో సహాయకునిగా ఉండి ఉండవచ్చు, మరియు అదే సమయంలో రోమా సామ్రాజ్యపు రాజు అయిన నీరో క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు గనుక ఎపఫ్రాను కూడా పౌలుతో పాటు చెరసాలలో బంధించి ఉండొచ్చు.
ఇక్కడ మనం "దేమా" గురించి ప్రత్యేకంగా ఆలోచన చేద్దాం. అతని గురించి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ విధంగా చెప్పాడు "దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను" 2 తిమోతి 4:10. దేమా నిజమైన క్రైస్తవుడిలా అనిపిస్తూ పౌలుతో పాటు సువార్త సేవలో పాలుపంచుకున్నప్పటికీ, అతను దేవునిసంబంధి కాదని, పరలోకం కంటే ఇహలోకాన్నే ఎక్కువ ప్రేమించాడని తెలుస్తుంది, ఇలాంటివారి గురించే యేసు ప్రభువు ఉపమానం చెప్తూ "ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును." దేమా ఇలాంటివాడే అని మనం గ్రహించొచ్చు. ప్రియ చదువరి మరి నీ పరిస్థితి ఏంటి, నువ్వు దేమాలాగ ఉన్నావా లేక ఎపఫ్రాలాగ ఉన్నావా? కొంచెం ఆలోచన చేయి.
“మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్." ఫిలేమోనుకు 1:25
ఈ ఆశీర్వాదం సాధారణంగా పౌలు ప్రతి పత్రిక చివర ఆ సంఘాన్ని సంబోధిస్తూ ఇస్తాడు. ఇక్కడ ఇంతక ముందు మనం చెప్పుకున్నట్టు, ఫిలేమోనుకు మాత్రమే ఆశీర్వాదాన్ని ఇవ్వటంలేదు కానీ, "యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక" అంటున్నాడు, అంటే మొత్తం సంఘాన్ని పౌలు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని కృప నిజమైన విశ్వాసులకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఫిలేమోనుకు రాసిన పత్రిక అధ్యాయము 1

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment