నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు .
అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని.
యాకోబు వంశస్థులారా , రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను , రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును , నా దేవుడు నా ప్రార్థన నాలకించును .
నా శత్రువా , నామీద అతిశయింప వద్దు , నేను క్రిందపడినను , తిరిగి లేతును ; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.
అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
రక్షణ యెహోవాది నీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?
ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.
ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయైయున్నాడు.
దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడైయున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను .
నీతిమంతుల గుడారములలో రక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును .
నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చియున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమనుతించెదను.
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
ఆకాశమువైపు కన్ను లెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్య ముండును నా నీతి కొట్టివేయ బడదు .
నీతి అనుసరించువారలారా , నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా , ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయ పడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి .
వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తర తరములుండును .
శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.
సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను.
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.
యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.
యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.
నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేల?
యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె
నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను .
యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగవలెననియున్నారు
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.
దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమి్మకయుంచియున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
యెహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ?
అందుకాయనఅల్పవిశ్వాసు లారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
ఇట్లుండగా ఏమందుము ? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు ?
కాబట్టి ప్రభువు నాకుసహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.