What does the Bible teach about Circumcision?
సున్నతి అంటే ముందోలుని లేదా పురుషాంగానికి ముందు ఉండే చర్మాన్ని తొలగించడం. 'సున్నతి' అనే పదానికి అక్షరార్థంగా "చుట్టూ కత్తిరించడం" అనే అర్థం వస్తుంది. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనకు గుర్తుగా అబ్రాహాము వారసులందరూ సున్నతి చేసుకోవాలి (ఆది 17:9-14; అపొ.కార్య. 7:8). మోషే ధర్మశాస్త్రంలో కూడా దీని గురించి ప్రస్తావించబడింది (లేవీ 12:2-3). యూదులు శతాబ్దాలుగా దీనిని ఆచరిస్తూ వచ్చారు (యెహోషువ 5:2-3; లూకా 1:59; అపొ.కార్య. 16:3; ఫిలిప్పీ 3:5). అయితే, నేడు క్రైస్తవ పురుషులు సున్నతి చేసుకోవాలా వద్దా అన్న విషయం గురించి బైబిలు ఏం బోధిస్తుంది?
కొత్త నిబంధన క్రైస్తవులు ఆచారసంబంధమైన ధర్మశాస్త్రం కింద లేరు అని వాక్యం స్పష్టంగా చెబుతోంది కాబట్టి సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అనేక కొత్తనిబంధన వాక్యభాగాలలో ఈ సత్యం స్పష్టంగా తెలియజేయబడింది. ఉదాహరణకు అపొ.కార్య. 15; గలతీ 2:1-3; 5:1-11; 6:11-16; 1 కొరింథీ 7:17-20; కోలస్సీ 2:8-12 & ఫిలిప్పీ 3:1-3. ఏదైనా ఒక 'బాహ్య' ఆచారాన్ని పాటించడం ద్వారా ఏ వ్యక్తీ రక్షించబడడు అని ఈ వాక్యభాగాలు ప్రకటిస్తున్నాయి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం మన పాపాల నుండి విమోచించబడగలం. సిలువపై క్రీస్తు చేసిన బల్యర్పణే మనల్ని రక్షిస్తుంది. దేవుణ్ణి సంతోషపెట్టడానికి సున్నతి మాత్రమే సరిపోదని ధర్మశాస్త్రం కూడా అంగీకరించింది. 'కాబట్టి మీరు సున్నతిలేని మీ హృదయమునకు సున్నతి చేసికొని యికమీదట ముష్కరులు కాకుండుడి' అని దేవుడు ద్వితీయో 10:16లో చెబుతాడు. 'ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు (రక్షించబడడు)' అన్న పౌలు మాటలను గలతీ 2:16లో చదువుతాము.
మరి పౌలు, తన మిషనరీ పరిచర్యలో తనకు సహాయకుడైన తిమోతికి సున్నతి చేయించినట్లు అపొ.కార్య. 16:3లో చదువుతున్నాం కదా! దాని సంగతి ఏంటి? తిమోతి తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. యూదులు సున్నతి పొందినవారిని అంగీకరించినట్లు, సున్నతి పొందనివారిని అంగీకరించరు. సువార్త ప్రకటించడానికి పౌలుతో పాటు వెళ్లే తిమోతీని అవిశ్వాసులైన యూదులు చేర్చుకోవాలి అంటే అతను కూడా సున్నతి పొందినవాడయ్యుండాలి. అందుకే పౌలు అతనికి సున్నతి చేయించాడు. సున్నతి చేయించుకోవాలని బైబిలు కోరనప్పటికీ, యూదులు అతన్ని చేర్చుకోవడం కోసం ఇలా చెయ్యాల్సొచ్చింది. అంతేగానీ పౌలు తిమోతీకి సున్నతి చేయించింది అతను రక్షించబడాలని కాదు. సున్నతి వంటి బాహ్యాచారాలను పాటించడం ద్వారా రక్షణ వస్తుందని బోధించేవారిని పౌలు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఉదాహరణకు అపొ.కార్య.15:1-2 - "కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును" కలిగెను. గలతీ పత్రికలో పౌలు నిస్సందేహంగా చెప్పిందేంటంటే ఒక వ్యక్తి రక్షించబడటానికి గానీ, పరిశుద్ధపరచబడటానికి గానీ సున్నతి ఏ రకంగానూ దోహదపడదు. "చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను" (గలతీ 5:2).
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.