Is God unjust in loving Jacob and hating Esau?
రోమీయులకు 9:13
ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది.
ఈ సందర్భంలో దేవుడు యాకోబును ప్రేమించి, ఏశావును ద్వేషించాడని స్పష్టంగా రాయబడింది. సాధారణంగా మనం ఈ వాక్యభాగం చదువుతున్నపుడు ఏశావుపట్ల ఆయన అన్యాయం చూపినట్టు, దేవునిలో కూడా వివక్షలూ, పక్షపాతమూ ఉన్నట్టు అర్థం చేసుకునే అవకాశం ఉంది. మరికొందరు ఈ వాక్యభాగం ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఇటువంటి అర్థమే వస్తుందనే ఆందోళనతో, వారిపట్ల దేవుని ఈ ప్రేమాద్వేషాలు మొదట కలిగినవి కావనీ, ఏశావు సంతానం తరువాత చేసిన భ్రష్టక్రియలను బట్టే దేవుడు వారిని (అతడిని) ద్వేషించాడనీ, పౌలు ఆ మాటలను మలాకీ 1:2,3 వచనాల నుండి తీసుకున్నాడనీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
పౌలు ఆ మాటలను మలాకీ నుండి తీసుకున్నాడనేది వాస్తవమే అయినప్పటికీ ఒకవేళ ఏశావూ, అతని సంతానపు భ్రష్టక్రియలను బట్టే దేవుడతడిని (అతని సంతానాన్ని) ద్వేషిస్తే మరి ఆయన యాకోబునూ, అతని సంతానాన్నీ ప్రేమించడానికి అతని (అతని సంతానపు) నీతిక్రియలు కారణమా? యాకోబు/ఇశ్రాయేలీయుల జీవితాలు అంత యథార్థమైనవా? నాకు తెలిసినంత మట్టుకు, దేవుణ్ణి తమ చెడ్డ క్రియలతో ఇశ్రాయేలీయులు విసిగించినంతగా మరే జనాంగం కూడా విసిగించి ఉండరేమో! పాతనిబంధన సరిగ్గా ఒకసారి చదివినవారికి కూడా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
మలాకీ 1:2,3లో దేవుడు, నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించబట్టే యాకోబు సంతానమైన మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఏశావు సంతానాన్ని పాడుచేసానని చెబుతున్నాడు తప్ప, వారి సంతానపువారి క్రియలకోసమే యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించానని చెప్పడం లేదు. పైన మనం రోమీయులకు రాసిన పత్రిక నుండి చూసిన వాక్యభాగంలో 10వ వచనం నుండీ ఆ సందర్భాన్ని చదివితే అక్కడ పౌలు దేవుని పిలుపు, ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు తప్ప, వారి క్రియల గురించి కాదని స్పష్టమౌతుంది.
రోమీయులకు 9:10-16
అంతేకాదు, రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.
ఇంతకూ దేవుడు యాకోబుని ప్రేమించడం, ఏశావును ద్వేషించడం ఏశావుపట్ల అన్యాయం చూపడమా అనేదానికి సమాధానం చూద్దాం. చార్లెస్ స్పర్జన్ గారిని ఒక స్త్రీ" దేవుడు ఏశావును ద్వేషించడం ఏంటని ఆశ్చర్యంగా అడిగిందంట". దానికి ఆయన "దేవుడు ఏశావును ద్వేషించడంలో నాకేం ఆశ్చర్యం లేదు కానీ యాకోబును ప్రేమించడంలోనే ఉందని" జవాబిచ్చారంట.
నిజమే, ఆదాము నుండి వస్తున్న మానవజాతి స్వభావసిద్ధంగానూ, క్రియలమూలంగానూ, పాపులై దేవునికి శత్రువులుగా, ఆయన ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు.
రోమీయులకు 5:10 ఏలయనగా శత్రువులమై యుండగా-
ఎఫెసీయులకు 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి.
దీనిని బట్టి, ఏశావూ యాకోబులు ఇద్దరూ (ప్రతీ ఒక్కరూ) కూడా న్యాయబద్ధంగా దేవుని ఉగ్రతకు (ద్వేషానికి) అర్హులు. కానీ ఆయన యాకోబును తన కృప చేత ప్రేమించాడు. యాకోబును మాత్రమే కాదు భక్తులందరినీ అలానే ప్రేమించాడు, మనల్ని కూడా అలానే ప్రేమిస్తున్నాడు.
ఎఫెసీయులకు 2: 4 అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.
ఇక్కడ మనం ఆర్చర్యపడాల్సింది దేవుడు ఏశావునో, మిగిలిన ఎవరినో ద్వేషించాడని కాదు, ఆ ద్వేషానికి వారు పాత్రులు. అదే ద్వేషానికి పాత్రులైన యాకోబునూ, మిగిలిన భక్తులనూ, మనల్ని మాత్రం ఆయన కృప చేత ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమకు వారు/మనం అనర్హులం. మనం ఆశ్చర్యపడవలసింది ఈ ప్రేమను గురించే. ఇది దేవుని సార్వభౌమ ఎన్నికనూ, ఆయన సృష్టిపై తనకున్న సర్వాధికారాన్నీ చూపుతుందే తప్ప, అయనలో వివక్షలూ, పక్షపాతమూ ఉన్నాయని కాదు. పతన స్వభావంతో ఉన్న మానవులు, దీనిని గుర్తించలేక, వారికిది మింగుడు పడని కారణం చేత ఇలా అయితే ఆయన పక్షపాతి, వివక్ష చూపేవాడు ఔతాడని భావిస్తుంటారు. దేవుడు ద్వేషానికి పాత్రులైనవారిలో కొందరిని ప్రేమించగానే అది పక్షపాతం, వివక్ష అన్నట్టుగా ఆలోచించేవారు, అందరు మనుష్యులూ ఒకేవిధమైన ఆయుష్షుతో ఎందుకు బ్రతకడం లేదో, కొందరు అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారో, కొందరు తప్పించబడుతున్నట్టు ప్రమాదాల నుండీ, రోగాల నుండీ అందరూ ఎందుకు తప్పించబడడం లేదో కూడా ఆలోచించి, ఇక్కడ కూడా దేవుడు అన్యాయాన్నీ, పక్షపాతాన్నీ, వివక్షనీ బట్టే అలా చేస్తున్నాడంటారా? ఆలోచించండి. దీనికి పౌలు సమాధానం చూడండి.
రోమీయులకు 9:19-21 అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?
రోమీయులకు 9: 15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
కాబట్టి దేవుడు యాకోబు విషయంలో తన కృప చూపించాడు, ఏశావు విషయంలో తన న్యాయాన్ని కనపరిచాడు. మరి అన్యాయం ఎవరికి చేసాడు? ఎవరికీ చెయ్యలేదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.