How could there be light on the first day of Creation if the Sun was not created until the fourth day?
ఆది 1:3-5లో 'దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను .....అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను' అని చదువుతాము. అలాగే ఆది 1:14-19లో "దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు ....... పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. ........ అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను" అని చదువుతాము. ఇదెలా సాధ్యం? సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ లేకుండా మొదటి మూడు రోజులూ అస్తమయమూ, ఉదయమూ ఎలా ఉండింది?
ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు రెండు కార్యాలు చేస్తున్నట్లు చూడగలం. ఒకటి, అప్పటికి ఇంకా ఉనికిలో లేనివాటిని శూన్యంలో నుండి తన మాట ద్వారా ఉనికిలోకి తీసుకొస్తున్నాడు. రెండవది, సృష్టించినదానిని క్రమబద్దీకరిస్తున్నాడు లేదా అందమైన ఆకారంలోకి మలుస్తున్నాడు. మొదటి వచనంలో దేవుడు భూమ్యాకాశాలను సృష్టించినట్లు చదువుతాము. అప్పుడు దాని స్థితి ఎలా ఉందో రెండవ వచనంలో చెప్పబడింది. మొదటి వచనంలో సృష్టించినదానినే మిగిలిన అధ్యాయం అంతటిలో చెప్పబడినట్లుగా, ఆరు దినాల్లో దేవుడు క్రమబద్దీకరిస్తున్నట్లు లేదా ఒక అందమైన ఆకారంలోకి మలుస్తున్నట్లు చూస్తున్నాం. ఉదాహరణకు మొదటి దినాన ఆరిన నెల లేదు. దేవుడు మూడవ దినాన "..ఆకాశము క్రిందనున్న జలములొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టి"నట్లు ఆది 1:9-10లో చదువుతున్నాం.
అలాగే దేవుడు మొదటి రోజున వెలుగును కలగజేసాడు [అనగా మండుతూ వెలుగును ప్రసరించే పదార్థాన్ని(matter) సృష్టించాడు]. నాలగవ రోజున దానినే విభజించి లేదా వేరుపరచి ప్రకాశించే సూర్యచంద్రనక్షత్రాలను కలగజేశాడు. మరో విధంగా చెప్పాలంటే మొదటి రోజున సృష్టించిన వెలుగునే క్రమపరుస్తూ, అది సూర్యచంద్రనక్షత్రాల వంటి వాటి ద్వారా ప్రసరించేలా చేశాడు. పగటిని ఏలటానికి సూర్యుణ్ణీ, రాత్రిని ఏలటానికి చంద్రుణ్ణీ, నక్షత్రాలనూ నియమించాడు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.