Is the Old Testament abolished?
జవాబు: పాత నిబంధనకీ మరియు పాత నిబంధన గ్రంథానికీ మధ్య ఉన్న భేదాన్ని మొదట గ్రహించాలి. పాతనిబంధన గ్రంథం కొట్టివేయబడలేదు కానీ సీనాయి పర్వతం వద్ద దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కొట్టివేయబడింది. "ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండ ప్రతిష్టింపబడలేదు. ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.” (హెబ్రీ 9:18-20). క్రీస్తు తన సంఘంతో చేయనైయున్న నూతన నిబంధనకు ఛాయగా ఉన్నందుకు క్రీస్తు రాకతో ఆ పాత నిబంధన ఉద్దేశ్యం నెరవేరింది. కనుక ఈ భావంలో క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది. అయితే, ఆ నిబంధన మాటలను చదువుతున్న యూదులు, దాని ఆంతర్యాన్నీ, నేరవేర్పునూ, కొట్టివేతనూ గ్రహించలేకపోయారని 2 కొరింథీ 3:14లోని భావం. "మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది."
పైగా హెబ్రీ పత్రికలో స్పష్టం చేయబడిన విధంగా పాత నిబంధన క్రొత్తనిబంధనకు కేవలం ఛాయగా ఉంది (హెబ్రీ 10:1). వాస్తవికత యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం ఛాయకు సాధ్యపడదు కాబట్టి, పాత నిబంధన తారతమ్యరీత్యా లోపభూయిష్టమైనదే. ఇందులో సమస్యేమీ లేదు. హెబ్రీ 8: 7 - 'ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. అందుకే దాని విషయమై "ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది" అని చెప్పబడింది (హెబ్రీ 8:13). ఇకపోతే మత్తయి 5:17, పాతనిబంధన గురించి కాదు, పాత నిబంధన గ్రంథాన్ని గురించి ప్రస్తావిస్తుంది. అదెన్నటికీ కొట్టివేయబడదు. అది లోపభూయిష్టమైనది కాదు. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని క్రొత్తనిబంధన గ్రంథంతో కలిపి చదవాలి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.