Why is the Book of Enoch not in the Canon?
ఆదాము నుండీ ఏడవ తరమువాడైన హనోకు గురించి ఆది. 5:1-24లో చదువుతాము. ఈ హనోకు చెప్పిన ఒకానొక ప్రవచనం గురించి యూదా 1:14-15లో చదువుతాము - “ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను."
ఇక హనోకు గ్రంథం విషయానికొస్తే, ఈ ప్రవచనం హనోకు గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న మాట వాస్తవమే గానీ ఆ గ్రంథం గురించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ గ్రంథాన్ని బైబిల్లోని హనోకు రాయలేదని పండితులు చెప్తారు. హనోకు గ్రంథాన్ని బైబిల్లోని హనోకు రాసుండకపోవచ్చు; కానీ ఈ యూదా పత్రికలో ప్రస్తావించబడిన ప్రవచనం మాత్రం బైబిల్లోని హనోకు చెప్పిందే, లేకపోతే బైబిల్లో “ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను" అని రాయబడి ఉండేది కాదు. హనోకు చెప్పిన ఈ ప్రవచనం ఒక తరంవారు తమ తరువాతి తరంలోని తమ పిల్లలకు చెప్పడం ద్వారా కొన్ని తరాల వరకూ మనుషుల ఆలోచనల్లో మాత్రమే భద్రం చెయ్యబడుతూ వచ్చి, కొంత కాలానికి హనోకు గ్రంథంలో నమోదు చెయ్యబడింది. కాబట్టి యూదా అసలు హనోకు గ్రంథంలో నుండే ఈ ప్రవచనాన్ని ఉటంకించి రాసాడని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు.
కాసేపు అదే నిజం అనుకుందాం. యూదా హనోకు గ్రంథం నుండే ఈ మాటలను ఉటంకించి రాసాడు అనుకుందాం. అంతమాత్రాన ఆ గ్రంథమంతా దైవప్రేరిత గ్రంథం అయిపోతుందా? అవ్వదు. అలా అవ్వాలి అన్న నియమం ఏమీ లేదు. యూదా ఒక్కడే ఇలా బైబిలేతర పుస్తకాల నుండి కొన్ని మాటలను ఉటంకించాడు అనుకుంటే పొరపాటే. అపొస్తలుడైన పౌలు కూడా తీతుకు 1:12లో ఎపిమెనిడెస్ రచనలలోని కొన్ని మాటలను ఉటంకించాడు. అంతమాత్రాన ఎపిమెనిడెస్ రచనలన్నీ అధికారం కలిగిన లేఖనాలని చెబుతామా? కాదు కదా. మరో రెండు సందర్భాల్లో కూడా (అపో.కార్య. 17:28; 1 కొరింథీ 15:33) విగ్రహారాధకులైన కవీశ్వరుల మాటలను పౌలు ఉటంకిస్తాడు. అంత మాత్రాన వాళ్ళు రాసిన కవిత్వాలన్నీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాసినవైపోతాయా? అవ్వవు కదా. అలాగే యూదా 1:14-15లో హనోకు గ్రంథం నుండి కొన్ని మాటలు ఉటంకించబడ్డాయి అనుకున్నప్పటికీ, ఆ గ్రంథమంత దైవప్రేరితమని అనుకోకూడదు. చివరిగా ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని సూచిస్తాను, దీన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి - 'బైబిల్లో ఏ మాటలైతే ఉటంకించబడ్డాయో, అవి బైబిల్ గ్రంథకర్తల చేత ఉటంకించబడిన కారణాన్ని బట్టి అవి మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరితమైన దేవుని వాక్యం’. పైన ఉదహరించిన అన్ని సందర్భాలకూ ఈ నియమం వర్తిస్తుంది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.