కొత్త నిబంధన

రచయిత: పి. శ్రావణ్ కుమార్

 

ఆడియో

యూదా పత్రిక, మతభ్రష్టుల/నీతివిరోధుల గురించి వివరిస్తూ రాయబడింది. వారు ఎలాంటివారు, వారి క్రియలు ఎలాంటివి, వారికి సంభవించబోయే శిక్ష ఏమిటి, అనే కోణాన్ని రచయిత(యూదా) వివరించారు.

విషయసూచిక

  1. రచయితని గురించిన పరిచయం
  2. వచన వ్యాఖ్యానం
  3. 1:1, 1:2, 1:3, 1:4, 1:5, 1:6, 1:7, 1:8, 1:9, 1:10, 1:11, 1:12,13, 1:14-16, 1:17-18, 1:19, 1:20,21, 1:22,23, 1:24,25

  4. ఈ పత్రికకి సంబంధించిన అభ్యంతరాలు
  5. ఆధార సూచిక (Cross-References)
  6. సారాంశం

యూదా పత్రిక, మతభ్రష్టుల/నీతివిరోధుల గురించి వివరిస్తూ రాయబడింది. వారు ఎలాంటివారు, వారి క్రియలు ఎలాంటివి, వారికి సంభవించబోయే శిక్ష ఏమిటి, అనే కోణాన్ని రచయిత(యూదా) వివరించారు. వీరు సంఘంలో కలహాలు రేపుతూ, యేసు క్రీస్తు ప్రభువుని, ఆయన మాటలని విసర్జించిన స్థితిలో ఉన్నారు. పైకి మంచి క్రైస్తవులుగా కనబడినా వీరు సంఘక్షేమాభివృద్ధిని కాక సంఘనాశనాన్ని కోరుకుంటారు.

ఇలాంటివారి గురించి తెలుసుకొని, వారి బోధనుండి మనల్ని మనం కాపాడుకోవాలని, మన విశ్వాసాన్ని వారిలాగా పరిత్యజించకుండా, మనకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలని రచయిత ఆకాంక్షించాడు.

ఒకవేళ మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు బోధను మరచి, విశ్వాసాన్ని పరిత్యజించితే మనకి కూడా వీరికి నియమించబడిన శిక్ష విధించబడుతుంది, మనం కూడా ప్రభువుని పరిత్యజించిన మతభ్రష్టుల గుంపులో చేరినవారమౌతాము. మనవిశ్వాస జీవితంలో మనం ఎదుగుతూ, ప్రభువుని ప్రేమిస్తూ, ఆయన వాక్యానికి విధేయత చూపుతూ, అన్యబోధలను వ్యతిరేకించి, సంఘాన్ని కాపాడే స్థితిలో మనం ఉండాలన్నదే యూదా ఆకాంక్ష.

ఈ వ్యాఖ్యానాన్ని కేవలం వాక్యపు జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా, ఆ పొందిన జ్ఞానంతో దేవునికి మరి ఎక్కువ విధేయత చూపేలాగా, ప్రార్థనా పూర్వకంగా చదవండి.

 

రచయితని గురించిన పరిచయం

ఈ పత్రికని రచించిన యూదా (అపొస్తలుడైన యూదా కాదు) తనని తాను పరిచయం చేసుకుంటూ "యాకోబు సహోదరుడునైన యూదా" అని చెప్తున్నాడు. ఈ యాకోబు (అపొస్తలుడు కాదు) యెరూషలేము సంఘానికి 30 సంవత్సరాలు పెద్దగా ఉన్నాడు, ఇతనే యాకోబు పత్రికని రచించాడు. వీరిద్దరూ మాత్రమే కాకుండా, క్రీస్తుకి ఇంకొంతమంది సోదరులు, సోదరీమణులు ఉన్నారు.

“ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతోనున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.” మార్కు 6:3

ఈ యాకోబు మరియు యూదా; యేసుక్రీస్తు సోదరులైనప్పటికీ వీరు క్రీస్తు పరిచర్య ప్రారంభంలో ఆయనను విశ్వసించలేదు.

“ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు." యోహాను 7:5

క్రీస్తు జీవించి ఉన్నంత కాలము ఆయన సోదరులు ఆయనయందు విశ్వాసముంచినట్టు వాక్యంలో ఎక్కడ వివరించలేదు. కానీ, క్రీస్తు మరణించి పునరుత్తానుడై తిరిగిలేచిన తరువాత, ఆయన నామమును బట్టి ప్రార్ధించిన గుంపులో ఆయన (యేసు) సోదరులు కనబడతారు.

“వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.” అపో. కార్య 1:13

కనుక, యూదా కూడా యేసు క్రీస్తు జీవించి ఉన్నప్పుడు ఆయనయందు విశ్వాసముంచలేదు, అయితే క్రీస్తు తిరిగిలేచిన తరువాత మారుమనస్సు పొంది ఆయన నామంలో విశ్వసముంచాడు. అటుతరువాత తనని తాను (యూదా), క్రీస్తు సోదరునిగా ఎంచుకోలేదు కానీ, క్రీస్తు దాసునిగా పరిచయం చేసుకున్నాడు.

వచన వ్యాఖ్యానం

“యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది." యూదా 1:1

యేసుక్రీస్తు దాసుడను అని యూదా ఇక్కడ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. దాసుడు అని తెలుగులోకి అనువదించబడిన పదం గ్రీకుభాషలో “DOULOS" అని ఉంది. ఈ పదం యొక్క అర్థం "bond servant” లేదా “బానిస”. యూదా తనను తాను క్రీస్తుకి జీవితాంతం బానిసగా ఎంచుకుంటున్నాడు.

అపొస్తలులు అందరు తమని తాము క్రీస్తుకు దాసులుగా ఎంచుకున్నారు. ఇది వారికి సొంతజ్ఞానంతో వచ్చిన ఆలోచన కాదు. క్రీస్తు మాదిరిని వాళ్ళు గమనించారు, క్రీస్తు తమకొరకు చేసిన కార్యం యొక్క విలువని గ్రహించారు గనుక తమని తాము క్రీస్తుకు దాసులుగా (బానిసలుగా) ఎంచుకోగలిగారు.

“యేసు క్రీస్తు దాసుడును (doulos), అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును..." రోమా 1:1

“యేసుక్రీస్తు దాసుడును (doulos) అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.” 2 పేతురు 1:1

అసలు బానిసలు అంటే ఎవరు? 'బానిస, చట్టపరంగా ఒకని (యజమానుని) ఆస్తి. యజమానులు చెప్పిన పనిని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత బానిసది. బానిసకి పౌరహక్కులు గాని, వేతనాలు గాని ఇవ్వబడవు. కొన్నిసార్లు వీరు, యజమానుల చేత తీవ్రంగా హింసించబడతారు. వీరు సేవచేయటమే తప్ప, సేవించబడటం అనేది తెలియనివారు.'

ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వములో ఎన్నో శ్రమలు అనుభవించారు. అందులోనుండి విడిపించాలని దేవునికి ప్రార్థించారు. దేవుడు వారి మొర విని, మోషే ద్వారా ఇశ్రాయేలీయులని బానిసత్వము నుండి విడిపించాడు. అయితే బానిసత్వము నుండి విడిపించినవానికి (దేవునికి) వీరు ఇక మీదట విధేయులైయుండకపోతే వారిమీదికి శిక్ష వస్తుంది అని దేవుడు హెచ్చరించాడు. ఈ ఇశ్రాయేలీయులు ఎలా అయితే దేవునిచేత విడిపించబడ్డారో (కొనబడ్డారో), అలానే క్రీస్తులో ఉన్న మనం కూడా విడిపించబడినవారము/విలువపెట్టి కొనబడినవారము. ఈ విషయాన్ని గ్రహించారు గనుకనే క్రీస్తు శిష్యులు తమని తాము "క్రీస్తుకి బానిసలుగా" ఎంచుకున్నారు.

ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.” కొలస్సి 1:13

“మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” 1 కొరింథీ 6:19,20

 అయితే క్రీస్తుకు బానిసలుగా ఉండటం, ఈ లోకంలో బానిసలుగా ఉండటానికి విరుద్ధమైనది. ఎందుకంటే క్రీస్తు సత్యవంతుడు, నీతిమంతుడు, ప్రేమాస్వరూపి. ఈ లోకయజమానులు బలవంతముగా స్వాధీనపరచుకొని, బానిసలుగా చేసుకుంటారు, అయితే క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని బానిసలుగా కొన్నాడు. మన బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి మన ప్రభువు, దాసుడుగా/బానిసగా (doulos) ఈ లోకానికి వచ్చాడు. "ఆయన సేవించబటానికి కాకుండా, సేవ చేయడానికి వచ్చాడు.” ఆ అద్వితీయుడు, అత్యున్నతుడు మన నిమిత్తం "దాసుని స్వరూపాన్ని ధరించి, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు." ఇటువంటి యజమానునికి బానిసలుగా ఉండటం మనకి ఒక గొప్ప భాగ్యం. మనం ఒక విధంగా క్రీస్తుకు బానిసలమైనప్పటికీ, అయన కుమారులము/కుమార్తెలము కూడా.

“ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని (doulos) స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” ఫిలిప్పి 2:6,7

యూదా ఇక్కడ అదే చెప్తున్నాడు - నేను క్రీస్తుకి బానిసని, ఆయన కొరకే పనిచేసేవాడిని, ఆయనను మాత్రమే సంతోషపెట్టేవాడిని. నేను క్రీస్తుకు బానిసని గనుక నేను మీతో చెప్పబోయే విషయాలు సత్యాలు, ఎందుకంటే నేను క్రీస్తుని సంతోషపెట్టడానికి, మీ క్షేమాభివృద్ధి కొరకు ఈ విషయాలు రాస్తున్నాను.

యాకోబు సహోదరుడను అని తన గురించి తానూ ఎందుకు పరిచయం చేసుకున్నాడు అనే సందేహం మనకు రావచ్చు. యూదా (Jude/Judas) అనే పేరు యూదులలో చాలా సామాన్యమైన పేరు. బైబిల్లో అనేకులు "యూదా" అనే పేరుగలవారు ఉన్నారు, వీరిలో ఇస్కరియోతు యూదా ఒకడు. ఏ యూదా ఈ పత్రిక రాస్తున్నాడో ఈ పత్రిక స్వీకరించేవారికి అర్ధం అవ్వాలని తనని తాను ఆలా పరిచయం చేసుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఇంతకముందు చెప్పుకున్నట్టు "యాకోబు" యెరూషలేము సంఘములో పెద్ద, కనుక రాసేది "యాకోబు తమ్ముడు" అని తెలిసినప్పుడు ఆ పత్రికని చదివినవారు, తాను (యూదా) చెప్పే విషయాలకు చెవియొగ్గి అంగీకరిస్తారు అని కూడా తనని తాను అలా పరిచయం చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యూదా "యాకోబు సహోదరుడు" అని మొదటిగా పరిచయం చేసుకోలేదు, "యేసుక్రీస్తు దాసుడును" అనే పరిచయం చేసుకున్నాడు.

ఈ పత్రికని స్వీకరించినవారు ఎవరు అనే విషయం, అనగా ఏ ప్రాంతానికి చెందివారు అనే విషయం ఈ పత్రికలో చెప్పబడలేదు, అయినప్పటికీ వారు ఎలాంటివారో చెప్పబడ్డారు.

1. తండ్రియైన దేవునియందు ప్రేమించబడినవారు (పరిశుద్ధపరచబడినవారు)

2. యేసుక్రీస్తునందు భద్రము చేయబడినవారు

3. పిలువబడినవారు

ఈ పత్రికని అందుకున్నవారు నిజమైన రక్షణ కలిగినవారు. వీరిలో యూదులు మాత్రమే కాక అన్యులు కూడా ఉన్నారు. వీరు “పిలువబడినవారు”, అనగా వాక్యం ఇలా సెలవిస్తోంది - “మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.” 2 తిమోతి 1:9,10

అంటే దేవుడు మనలను అనగా, తన అనాది సంకల్పముచొప్పున ఎన్నుకొన్నవారిని, పరిశుద్ధమైన పిలుపుతో సువార్త ద్వారా పిలిచి, మనకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తు పట్ల విశ్వాసాన్ని బహుమానంగా ఇచ్చి, మన పాపాలపట్ల పశ్చాత్తాపాన్ని పరిశుద్దాత్మ ప్రేరేపణ ద్వారా కలగజేసాడు. ఇలాంటి పిలుపుతో దేవుడు మనలని ఎందుకు పిలిచాడు అంటే, అందుకు వాక్యం ఇచ్చే సమాధానం: “మనము తన యెదుట పరిశుద్దులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను." ఎఫెసీ 1:6

ఆయన మనల్ని రక్షణలోకి పిలవటం మాత్రమే కాకుండా, మనల్ని యేసుక్రీస్తునందు భద్రపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ మన రక్షణ యొక్క కొనసాగింపు మనచేతిలో ఉంటే మనం ఆ రక్షణను ఎప్పుడో కోల్పోయేవారం. కానీ మనల్ని పిలిచిన దేవుడు, అంతము వరకు లేక చివరివరకు (అన్నిరకాల పరిస్థితులలో) మనల్ని భద్రపరుస్తూ నడిపిస్తాడు. మనం దారి తప్పినపుడు తండ్రిగా మనల్ని శిక్షించి, సరైన మార్గంలోకి తీసుకొస్తాడు. అలానే మనల్ని పరిశుద్దపరుస్తూ, క్రీస్తు స్వరూపంలోనికి మారుస్తాడు. ఈ విషయాన్నే యూదా, తన పత్రికని అందుకునే వారికి మరొకసారి గుర్తుచేస్తున్నాడు.

“మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.'' యూదా 1:2

ఇక్కడ, రచయిత "కనికరము" "సమాధానము" "ప్రేమ" అనేవి దేవుని నుండి మాత్రమే కలుగుతాయి, ఇవి మీకు మరి ఎక్కువుగా కలుగునుగాక అని ప్రార్ధిస్తున్నాడు. అయితే పౌలు రచించిన పత్రికలలో "కృప" అనే పదాన్ని ఆశీర్వచనముగా వాడతాడు, యూదా “కనికరము" అనే పదాన్ని వాడాడు. కృప మరియు కనికరము ఒకేలా అనిపించినా అవి ఒకటికావు. కృప అంటే "మనకు అర్హత లేనిది పొందుకోవడం", కనికరం అంటే "మనకు రావాల్సింది రాకుండా ఆపడం”.

మనకు సహజంగా మన పాపాన్ని బట్టి ఉగ్రత రావాలి, పాపం వలన వచ్చే జీతం మరణం గనుక మరణం రావాలి, దేవుడు పాపులకు న్యాయమైన తీర్పు తీరుస్తాడు గనుక నిత్యనరకానికి మనం వెళ్ళాలి. అయితే ఇవేవి మనకు రాకుండా ఆపడమే “కనికరం”. మనం నిత్యజీవాన్ని పొందుకోవడానికి అనర్హులం, దేవునితో సమాధాన స్థితిలో ఉండడానికి అనర్హులం, దేవుని ప్రేమ మరియు ఆయన వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి అనర్హులం, అయినప్పటికీ దేవుడు వీటినన్నిటిని మనకు అనుగ్రహించాడు ఇదే “కృప”. ఈ పుష్కలమైన దేవుని కృప దినదినము మనల్ని అభివృద్ధిపరుస్తూ యేసుక్రీస్తు స్వరూపములోకి మారటానికి సహాయం చేస్తుంది.

అలానే దేవుని "సమాధానం", "ప్రేమ" విస్తరించును గాక అని ఆశీర్వదిస్తున్నాడు. దేవునితో వైరం కలిగి ఉన్న మనం, క్రీస్తు కృపను బట్టి సమాధానపరచబడ్డాం. ఈ సమాధాన స్థితిని బట్టి అనుభవపూర్వకమైన సమాధానాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. మనకు కలిగిన సమాధాన స్థితిని మనం కోల్పోనప్పటికీ, పాపం చేసినప్పుడు అనుభవపూర్వకమైన సమాధానాన్ని కోల్పోతుంటాం. దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపుతున్న కొలదీ అనుభవపూర్వకమైన దేవుని సమాధానం మన హృదయాలలో విస్తరిస్తూ ఉంటుంది. మీ జీవితంలో కూడా ఇలా ఉండునుగాక అని యూదా ఆశీర్వదిస్తున్నాడు. దేవునితో మనకు సమాధాన స్థితి కలగడానికి కారణం దేవుని ప్రేమ. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. అటువంటి దేవుని ప్రేమ మన జీవితంలో విస్తరించాలి అని, అనగా దేవుని ప్రేమను గ్రహించే విషయంలో మనం దినదినం ఎదగాలి అని యూదా ఆశీర్వదిస్తున్నాడు.

“ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్దులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.” యూదా 1:3

యూదా "మనకందరికీ కలిగెడు రక్షణ (దేవుడు అనుగ్రహించిన రక్షణ)" గురించి రాయాలనుకున్నాడు, అయినప్పటికీ పరిశుద్దాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా తాను రాయాలనుకున్న ఉద్దేశాన్ని మార్చుకొని "విశ్వాసులకి (మీకు) అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలని" రాసాడు. యూదా, తన ప్రియ సోదరులైన ఆ సంఘంవారిని బలపరచడానికి విశేషాసక్తి కలిగినవాడై వారిని ఈ విశ్వాసం నుంచి తొలిగిపోవద్దని, దాని నిమిత్తం పోరాడాలని వేడుకున్నాడు.

ఇక్కడ "ఒక్కసారే అప్పగింపబడిన బోధ" అన్న వాక్యాన్ని "ఒక్కసారే అప్పగించబడిన విశ్వాసము" అని అక్షరాలా అనువదించవచ్చు. 'ఒక్కసారే అప్పగించబడటం' అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథాలు దాదాపు 1500 BC నుండి 400 BC కాలంలో రాయబడ్డాయి. అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు దేవుడు తన వాక్య సత్యాలని అనేకమందికి బయలుపరుస్తూ వచ్చాడు. అయితే కొత్త నిబంధన గ్రంథాలన్నీ మొదటి శతాబ్దపు కాలంలోనే రాయబడ్డాయి. మన చేతులో ఉన్న బైబిల్ గ్రంథంలో మొదటి శతాబ్దం తరవాత కలపబడిన గ్రంథాలు గాని, వాక్యాలు గాని ఏమి లేవు. అంటే కొత్త నిబంధన గ్రంథములోని బోధ ఒక్కసారే అప్పగించబడింది, అది దేవుని అపొస్తలుల ద్వారా ఆయన సంఘానికి అప్పగించబడింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు అపోస్తలీయ అధికారం కింద మనకు ఇవ్వబడిన కొత్త, పాత నిబంధన గ్రంథాలే 'ఒక్కసారే అప్పగించబడిన బోధగా' పరిగణించబడాలి. ఇలా దేవుడు బైబిల్ గ్రంథంలో తన వాక్యాన్ని పరిపూర్ణంగా బయలుపరిచాడు, దానికి కలపడానికి గాని అందులోనుండి తీసివేయడానికి గాని ఏమి లేదు. అయితే ఈ కాలంలో అనేకులు దర్శనాలు కలిగాయని, దేవుడు కలలో చెప్పాడని ఇంకా మరెన్నో విధాలుగా మాట్లాడాడని చెప్తుంటారు. ఇవే నిజమైతే దేవుడు తన వాక్యాన్ని "ఒక్కసారే అప్పగించలేదు" అని మనం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది; అయితే అందుకు భిన్నంగా యూదా "ఒక్కసారే అప్పగించబడిన బోధ/విశ్వాసము" అని చెప్తున్నాడు. యూదా చెప్పేది నిజమా లేక ఈ కాలంలో దర్శనాల ద్వారా, కలల ద్వారా దేవుడు అనేకమైన విషయాలను ఇంకా బయలుపరుస్తున్నాడు అని చెప్పే బోధకుల మాటలు నిజమా? కొంచెం ఆలోచన చేయండి.

ఈ విశ్వాసం క్రీస్తు మరియు తన అపొస్తలులు ఇచ్చిన సిద్దాంతపరమైన సత్యాల మీద ఆధారపడి ఉంటుంది. బైబిలును నాకు నచ్చిన విధంగా నేను అర్ధం చేసుకుంటాను అంటే వీలుకాదు. వాక్యాన్ని అపొస్తలులు ఏ అర్థంతో బోధించారో అదే అర్ధంతో మనం గ్రహించాలి. అపొస్తలులు బోధించిన సిద్ధాంతాలను (ఉదాహరణకు: 'పాప సిద్దాంతము'. 'రక్షణ సిద్దాంతము', 'దేవుని ఎన్నిక సిద్దాంతము', 'పరిశుద్దాత్మ సిద్దాంతము', 'క్రీస్తు సిద్ధాంతము' మొదలైనవి) మనం సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

ఉదాహరణకు: క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపము నుండి విడిపించాడు, అనగా మనం పాపులమై ఉండగా మన పాపపు శిక్షను క్రీస్తు భరించి, తన నీతిని (తాను ఈ లోకంలో ఎలా నీతిమంతుడుగా బ్రతికాడో) మనకు ఇచ్చి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. రక్షణ, విశ్వాసము మూలంగానే వస్తుంది కాని, మన క్రియల వలన కాదు. అయితే రోమన్ కాథలిక్కులు 'యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే కాకుండా మన మంచి పనులు కూడా మన రక్షణకు దోహదపడతాయి' అని చెప్తారు. అయితే వాక్యం చాలా స్పష్టంగా "ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు” అని నిర్ధారిస్తుంది. ఎవరైతే ఈ తప్పు బోధకు (రక్షణకు క్రియలు అవసరం) అనుగుణంగా బ్రతుకుతారో వారు నిజమైన రక్షణలో ఉన్నారు అని చెప్పే వీలు లేదు. ఎందుకంటే వాళ్ళు వారి నైతిక ప్రవర్తనను బట్టి రక్షణను పొందొచ్చు అనుకుంటున్నారు. అందుకే మనం విశ్వసిస్తున్నాం అనే విషయాన్ని పక్కనపెడితే, దేనిని (ఏమి) విశ్వసిస్తున్నాం అనేది మరి ముఖ్యమైన అంశము. అలానే అనేకులు పరిశుద్దాత్మ, వ్యక్తి కాదు శక్తి అని చెపుతుంటారు. కానీ వాక్యం స్పష్టంగా పరిశుద్దాత్ముడు త్రిత్వములో ఒకడు, ఆయన ఒక వ్యక్తి అని రుజువుపరుస్తుంది. ఇంకా క్రీస్తు దేవుడు కాదు, దేవునికి మానవునికి మధ్యవర్తి మాత్రమే, ఆయన కూడా దేవుని చేత సృష్టించబడినవాడు అని చెప్తారు, కానీ వాక్యం క్రీస్తు 'దేవుడు' అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇలా మనకు అపొస్తలుల ద్వారా అప్పగించబడిన బోధను సరిగా అర్ధం చేసుకొని, అబద్ధబోధకు ధీటుగా ఎదురు నిలిచేలాగా మనం పోరాడాలి. ఇది చేయాలంటే మనం సత్యంలో స్థాపించబడి, అందులో నిలిచి ఉండాలి. మనం బైబిలును క్రమబద్ధంగా చదవకపోతే ఇది సాధ్యపడదు.

అయితే మనకు ఒక ప్రశ్న రావొచ్చు, మొదటి వచనంలో దేవుడే మనల్ని భద్రము చేస్తాడు అని వాగ్దానము చేసినప్పుడు, మనం ఎందుకు పోరాడాలి? దేవుడు విజయాన్ని ఇస్తాను అని ప్రమాణం చేసాడు కదా? ఇంకా నేను చేయవలసినది ఏముంది? అని మనం అనుకోవచ్చు. నిజమే దేవుడే మన రక్షణను కాపాడుతాడు, అయినంత మాత్రాన మనం పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్పే బోధ బైబిల్ లోనిది కాదు. ఇందుకు భిన్నంగా క్రీస్తు మరియు అపొస్తలులు, తప్పుడు బోధకు వ్యతిరేకంగా పోరాడాలని, అవసరమైతే సత్యం కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టాలని బోధించారు. అయితే మన పోరాటం ఈర్ష్యతో, ద్వేషంతో కాకుండా "నిర్మలమైన మనస్సాక్షి కలిగి, సాత్వికముతోను భయముతోను" ఈ బోధ నిమిత్తము పోరాడాలి.

ఈ వాక్యభాగాలను జాగ్రత్తగా గమనించండి

“నేను (యేసు) రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.” మత్తయి 16:11,12

“ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ది పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.” 2 పేతురు 3:14-18

“ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.” 1 యోహాను 4:1

“అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునైయున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.” తీతుకు 1:10,11

ఇలాంటి అబద్ధ బోధకులు ఎందరో ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. వీరు చెప్పే తప్పుబోధలను వ్యతిరేకించి, సంఘములో ఉన్నవారిని సత్యములో నడిపించాల్సిన బాధ్యత సంఘకాపరిది. అలానే సత్యాన్ని తెలుసుకొని, క్రీస్తువిరోధులు చెప్పే అబద్ధాలను నిరసించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసిది.

 “ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.” యూదా 1:4

పైవచనాలలో "మీరు విశ్వాసము నిమిత్తము పోరాడాలి" అని ఎందుకు యూదా హెచ్చరించాడో, ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఎందుకనగా "కొందరు రహస్యముగా చొరబడియున్నారు". వీరు క్రైస్తవులు అని చెప్పుకొంటూ, సంఘంలో బోధ చేస్తున్నారు. అయితే వీరు నిజమైన బోధకులు కారు, వీరు చెప్పే విషయాలకి, అపొస్తలులు బోధించిన విషయాలకి పొంతన లేదు. వీరు తీర్పు పొందటానికి నియమించబడినవారు, అనగా వీరు క్రీస్తు ప్రభువుని తృణీకరించి పూర్వము నుండి అవిశ్వాసులకు దేవుడు నియమించిన శిక్షకు పాత్రులుగా తమను తామే ఎంచుకున్నారు. అందుకు, పూర్వము నుండి వారి కొరకు నియమించబడిన శిక్ష ఆలస్యము చేయకుండా వారిమీదికి వస్తుంది.

యూదా, ఇలాంటి మతభ్రష్టులు ఉన్నారు అని చెప్పడం మాత్రమే కాక, వారికి ఉండే గుణలక్షణాలను కూడా వివరించాడు. మొదటిగా వీరు “భక్తిహీనులు”. తమకి తాము భక్తులము అని చెప్పుకుంటున్నా, వీరిలో ఎలాంటి భక్తి లేదు. యేసు చెప్పినట్టు "మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమానము. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగానగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు" (మత్తయి 23:27).

వీరు భక్తిహీనులు మాత్రమే కాకుండా, "దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నారు" అనగా, దేవుడు కృపగలవాడు అని బోధిస్తూ, తమ విచ్చలవిడి కామవికార చేష్టలను విడువకుండా వాటిలోనే కొనసాగుతూ, దేవుని కృపను అవమానపరుస్తున్నారు. ఇక్కడ కామాతురత్వము అని అనువదించబడిన పదం గ్రీకు లో “aselgia/అసల్గాయ'. ఈ పదం యొక్క అర్థం "హద్దులేని కామం", "జారత్వము", "శృంగారం”. ఆ సంఘంలో ఉన్న మతభ్రష్టులు ఇలాంటి చేష్టలతో నిండియున్నారు. వీరు 'నీతిమంతులుగా తీర్చబడటం' (DOCTINE OF JUSTIFICATION) అనే సిద్దాంతాన్ని, తమ పాపాన్ని సమర్ధించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. "పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను” అని పౌలు చెప్పిన మాటలను అపార్ధం చేసుకొని, పాపం ఉన్న దగ్గర కృప ఉంది గనుక, మనం పాపం చేసినా దేవుని కృప మన మీద ఉంటుంది అని ఆత్మ చేత శరీరక్రియలను చంపకుండా, అదే పాపంలో జీవిస్తూ అదే బోధను ఈ అబద్ధ బోధకులు చేస్తున్నారు. దేవుని కృప, పాపం చేయడానికి ఒక అనుమతి అన్న భావంలో వీరు బ్రతుకుతూ అనేకులను ఆ వైపు నడిపిస్తున్నారు. అయితే "ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము” (రోమా 6:1,2) అని పౌలు చెప్పిన మాటలు వీరి చెవికి వినబడలేదేమో. కనుక వీరు పౌలు బోధను అపార్థం చేసుకొని అందులో లేని తప్పుడు అర్థాన్ని తమ జీవితాలకు అన్వయించుకుని నడుస్తున్నారు. ఇలా ఉన్న వీరు "పాపము విషయమై చనిపోయిన వారి గుంపులో (రక్షించబడిన గుంపులో)” లేరు అని గ్రహించాలి.

వీరు దేవుని కృపను నిరర్ధకం చేయడం మాత్రమే కాకుండా "ప్రభువైన యేసు క్రీస్తును విసర్జిస్తున్నారు” అని కూడా చెప్పబడింది. అనగా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన బోధలని నోటిమాటలతో విసర్జించకపోయినా, వారి ప్రవర్తనను బట్టి యేసు క్రీస్తును విసర్జిస్తున్నారు. వీరిని బట్టి లేఖనం ఇలా సెలవిస్తోంది, “దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.” తీతుకు 1:16

“ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.” యూదా 1:5

"ఈ సంగతులు మీరు ముందే ఎరిగినను" అని యూదా చెప్తున్నాడు, అనగా ఆ సంఘంవారికి, అబద్ధ బోధకులకి పడే శిక్ష గురించి ముందే తెలుసు. అయినప్పటికి రచయిత అదే విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి తెలిసిన విషయం వారు మరిచిపోకూడదని, వారు తమని తాము జాగ్రత్తపర్చుకోవాలని, అంత మాత్రమే కాకుండా అది వారికి క్షేమకరం అని భావించి యూదా అదే విషయాన్ని రాసాడు. అపొస్తలుడైన పౌలు, పేతురు మరియు ఇతరులు ఇదే చేసారు. సంఘానికి తెలిసిన విషయాన్నే వారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు. అపొస్తలులు, విశ్వాసులు ఎలావుండాలి, క్రీస్తు వారిని ఎలా ప్రేమిస్తున్నాడు, వారికి ఉన్న నిరీక్షణ ఎలాంటిది అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తే (ఫిలిప్పీ 4:4, 2 పేతురు 1:12), ఇక్కడ యూదా, విశ్వాసులు అని చెప్పుకుంటూ క్రీస్తుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవారికి వచ్చే శిక్ష ఏమిటో మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్నాడు.

ఇశ్రాయేలీయులను ప్రభువు (క్రీస్తు) తన బలమైన హస్తంతో ఐగుప్తు నుండి విడిపించాడు. తమ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు ప్రమాణము చేసిన ఆ వాగ్దానదేశాన్ని వీరికి (విడిపించబడిన ఇశ్రాయేలీయులకు) ఇస్తాను అని చెప్పాడు. అయితే వారిలో అవిశ్వాసులను, దేవుని మీద సణిగినవారిని, ఆయన చూపించిన పరాక్రమ క్రియలయందు నిత్యం అనుమానించినవారిని దేవుడు ఏంచేసాడు? పౌలు ఈ విధంగా ఇశ్రాయేలీయులకు జరిగిన సంఘటనలను వివరించాడు: “సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరు మేఘము క్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి; అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; అందరు ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపకయుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.” 1 కొరింథీ.10:1-11

వారి అవిశ్వాసాన్ని బట్టి వారి తరములో కాలేబు, యెహోషువా, మరియు తర్వాతి తరమువారు (అనగా ఐగుప్తులో నుండి బయటకు వచ్చినవారి సంతానము) మాత్రమే వాగ్దానదేశాన్ని స్వతంత్రించుకున్నారు. మిగిలినవారందరు అవిశ్వాసాన్ని బట్టి దేవునికి అయిష్టులుగా ఉంటూ, వ్యభిచరిస్తూ, శోధిస్తూ, సణుగుతూ ఉన్నందున దేవుని చేత నాశనం చేయబడ్డారు. అందుకే యూదా "వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను" అని చెప్తున్నాడు.

వీరికి భిన్నంగా నిజమైన విశ్వాసులు దేవుణ్ణి సంతోషపెట్టాలనే భావం కలిగినవారై, ఆయన చెప్పిన మార్గాలను అనుసరిస్తారు. విశ్వాసం అనేది మన మనసులో మనం ఏర్పరచుకున్న భావం కాదు కానీ, మన జీవితాన్ని మార్చే ఒక సిద్ధాంతం. అనేకులు ఈనాడు, 'యేసుని నమ్మము' అని చెప్పుకుంటున్నప్పటికీ, నిజమైన రక్షణకు సంబంధించిన గుణాలక్షణాలు వారిలో కనపడటంలేదు. నిజమైన విశ్వాసులు 'నమ్మాను' అని నోటిమాటలతో చెప్పడం మాత్రమే కాదు గాని, క్రీస్తు కొరకు వారు శ్రమపడుతూ, పాపాన్ని ద్వేషిస్తూ, సహోదరులని ప్రేమిస్తూ, అబద్ద బోధకులని వ్యతిరేకిస్తూ, "తమ క్రియలని బట్టి క్రీస్తు సంబంధులుగా తమని తాము రుజువుపరచుకుంటారు".

ఆ సంఘంలో ఉన్న మతభ్రష్టులకు ఈ లక్షణాలు ఏవీ లేకపోయినా, 'మేము రక్షణ పొందుకున్నాము' అని చెప్పుకుంటున్నారు గనుక అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులవలె నశిస్తారు అని యూదా హెచ్చరించాడు. ఈ కపట విశ్వాసులు, 'క్రీస్తుని నమ్మామని' చెప్పి, సంఘములో బోధించే స్థానాన్ని తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ అధికారం దేవుని నుండే పొందుకున్నాము అని చెప్పి, అపొస్తలుల సత్యబోధను తృణీకరిస్తూ, వారు చెప్పేదే సత్యమని సంఘాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ తమ మీదకి తామే నిత్యనాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఇశ్రాయేలీయులని విడిచిపెట్టని దేవుడు, “దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఆయనను విసర్జిస్తున్నవారిని కూడా విడిచిపెట్టడు.”

“మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.” యూదా 1:6

ఇక్కడ యూదా, ఆయన (దేవుడు) విడిపించిన ఇశ్రాయేలీయులనే కాదు, ఆయన పరిశుద్ధముగా సృష్టించిన దేవదూతలు సైతం పాపం చేసినప్పుడు విడిచిపెట్టలేదు అని చెప్తున్నాడు. ఇది దేవుని పరిశుద్ధతకు ఒక చిహ్నం. మేము నిజమైన క్రైస్తవులం అనుకుంటూ, క్రైస్తవులకు ఉండాల్సిన గుణాలక్షణాలు ఏవీ లేకుండా బ్రతికేవాళ్లు ఈ ఉదాహరణలను బట్టి భయపడాలి. ఇశ్రాయేలీయులను, దేవదూతలను, ఆ సంఘంలో మతభ్రష్టులను దేవుడు విడిచిపెట్టలేదు; తన కృపలో నిలువకపోతే నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు.

అయితే దేవదూతలు చేసిన పాపం ఏంటి అని మనం కొంచెం ఆలోచన చేద్దాం. అనేకమంది ఈ వాక్యభాగాన్ని ఆదికాండము 6:2 తో కలిపి, దేవదూతలు స్త్రీలతో తమని తాము అపవిత్రపరచుకొన్నారు అని చెప్తుంటారు.“దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” ఆదికాండము 6:2

వారు (కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు) ఇలాంటి వివరణ ఇవ్వడానికి రెండు ముఖ్యకారణాలు ఉన్నాయి.

1. "దేవుని కుమారులు" అని దేవదూతలను బైబిల్ లో వివరించారు (యోబు 1:6),

దేవదూతలు ఈ భూమి మీద స్త్రీలను వివాహం చేసుకున్నారు, అందుకు దేవుడు వారిని శపించాడు అనే వివరణ అనేకమైన ప్రాచీన ప్రతులని బట్టి అంగీకరించటానికి యోగ్యముగా ఉన్నా, ఇది పరిపూర్ణ సత్యం అని చెప్పటానికి వాక్యం నుండి ఎటువంటి సహకారం లేదు. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనంలో "దేవదూతలు" అని తెలుగులోకి అనువదించబడిన పదం, గ్రీకులో "దేవుని కుమారులు" అని ఉంది. అయితే ఈ రకమైన వివరణకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దేవదూతలు ఆత్మలని దేవునివాక్యం సెలవిస్తోంది (కీర్తన 104:4, హెబ్రీ 1:14), ). ఈ రెండు వచనాలను (కీర్తన, హెబ్రీ) తెలుగులో "వాయువులు" అని అనువదించబడినప్పటికీ గ్రీకు పదం యొక్క అసలు అర్థం “ఆత్మలు.” మనుషులను అభివృద్ది చెంది ఈ భూమిని పాలించండి అని దేవుడు ఆశీర్వదించాడు. ఆలా ఆశీర్వదించినప్పుడు, సంతానం కలగడానికి అవసరమైన శారీరక ప్రక్రియను కూడా దేవుడు స్త్రీ, పురుషులలో ఉంచాడు. పిల్లలు పుట్టటానికి, శుక్ర కణాలు (sperms), అండంతో (ovum) కలవాలి. అయితే దేవుడు ఇలాంటి జీవసంబంధమైన ప్రక్రియ దేవదూతలకి కూడా ఇచ్చాడు అనడానికి వాక్యాధారాలు లేవు. దేవదూతలు శుక్రకణాలని విడుదల చేయలేరు, ఎందుకంటే వారు అభివృద్ధి చెందటానికి (పెళ్లి చేసుకొని పిల్లలని కనటానికి) దేవుడు వారిని సృష్టించలేదు.

దేవుని వాక్యంలో మనుషులు కూడా "దేవుని కుమారులు" అనబడ్డారు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు "దేవుని కుమారులు" అని పిలువబడ్డారు ( యిర్మీయా 31:20), , (ద్వితీయో 14:1), , కీర్తన 82:6, ). కనుక దేవదూతలు పాపం చేసారు అనటం కన్నా, దేవుని పిల్లలైనా ఎనోషు సంతానమువారు, దేవునికి విరుద్దంగా అన్యస్త్రీలని వివాహమాడారు అనే వివరణ సమంజసంగా ఉంటుంది.

2. సుడిపిగ్రాఫా (pseudepigrapha) గా పిలువబడే కొన్ని గ్రంథాలు, అనగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడినవి అని నమ్మించడానికి కొంతమంది పాతనిబంధన వ్యక్తుల పేర్లు ఉపయోగించుకొని రాసిన గ్రంథాలైన 1 హనోకు (1 Enoch) జుబిలీస్ (Jubilees) అనేవి దేవదూతల గురించి ఇలాంటి వివరణ ఇస్తుంది (ఇలాంటివి మరెన్నో పుస్తకాలు ఉన్నాయి)

• ఈ గ్రంథాలు 3 BC నుండి 1 AD కాలంలో రాయబడ్డాయి

• ఇవి దేవుని వాక్యంగా యూదులచేత పరిగణించబడలేదు

• ఆ గ్రంథాల రచయితలు చెప్పబడినట్టు వారు కారు (ఉదాహరణకు: హనోకు గ్రంధం హనోకు రాయలేదు)

హనోకు ప్రవచించాడు అని యూదా చెప్పిన మాటలు (యూదా 1:14, 15) .సుడిపిగ్రాఫా (pseudepigrapha) అయిన 1 హనోకు గ్రంథంలో ఉన్నాయి, అయినంతమాత్రాన యూదా ఆ గ్రంథాన్ని చదివి అందులోనుంచి ఈ మాటలు తీసుకున్నాడు అని చెప్పటానికి ఏ రుజువు లేదు. అందుకు భిన్నంగా “ORAL TRADITION” ని బట్టి యూదాకి ఈ ప్రవచనం తెలిసుండాలి అని మనం అర్ధం చేసుకోవచ్చు, పరిశుద్దాత్మ దేవుడే యూదా చేత ఈ మాటలు రాయించాడు అనేది సత్యం. అలానే దేవదూతలు భూమిమీద స్త్రీలను వివాహం చేసుకున్నారు అనే మాటలు హనోకు గ్రంథంలో ఉన్నంత మాత్రాన, యూదా ఆ మాటలనే ఆధారం చేసుకొని దేవదూతల గురించి రాసాడు అని అనుకోకూడదు.

మరి తమ నివాసస్థలాన్ని దేవదూతలు విడిచారు అంటే అర్థం ఏంటి? మనకి సాతాను పాపం చేసాడని, వాడితో పాటు సహకరించిన అనేక దేవదూతలు తోసివేయబడ్డారని తెలుసు. వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది “నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి” (యెహెజ్కేలు 28:15). "నీవు గర్వించినవాడవై, ........... నీ జ్ఞానమును చెరుపుకొంటివి" (యెహెజ్కేలు 28:17). “నేను ఆకాశమునకెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలము మీదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే” (యెషయా 14:12-15). ఇలా గర్వించిన సాతానుతో పాటు, వానికి సహకరించిన దూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. పేతురు తన పత్రికలో ఈ విధంగా రాసాడు "దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటీగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను” (2 పేతురు 2:4).

ఇలా దేవుడు తమకి ఇచ్చిన ఆ గొప్ప నివాసస్థలాన్ని, అనగా పరలోకములో, ఆయన (దేవుని) సముఖములో నివసించే భాగ్యాన్ని వారి పాపాన్ని బట్టి కోల్పోయారు. దేవుని చేత త్రోసివేయబడి, "మహాదినమున జరుగు తీర్పువరకు బందించబడ్డారు," అనగా సాతాను వాని దూతల కోసం దేవుడు సిద్దపరచిన "అగ్ని గంధకములుగల గుండము" లోనికి ఒక రోజున వారు నెట్టివేయబడతారు. ఆ రోజున సాతాను వాడి అనుచరులు (దూతలు, మనుషులు) నిత్యనాశనాన్ని పొందుకుంటారు. యూదా ఆ విషయాన్నే చెప్తున్నాడు. ఈ అబద్దబోధకులకి , అవిశ్వాసులకి, వాక్యాన్ని వక్రీకరించి తమ సొంతలాభానికి వాడుకునేవారికి కూడా ఇదే గతి పడుతుంది. పాపం చేసిన ఇశ్రాయేలీయులను విడువలేదు, మానవాతీతులైన దేవదూతలను కూడా విడువలేదు, మరి నువ్వు ఆ పాపమార్గంలోనే ఉంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా?

“ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.” యూదా 1:7

సొదొమ, గొమొఱ్ఱ ప్రజలను దేవుడు సర్వనాశనం చేసాడు. అదేవిధంగా ఈ అవిశ్వాసులైన అబద్దప్రవక్తలు కూడా సర్వనాశం పొందుతారు. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, మొదటిగా వారి పాపం బహుభారమైనదిగా మరియు వారి పాపం సంపూర్ణమైనదిగా ఉంది (ఆది 18:20) . రెండవదిగా భక్తిహీనులకు దృష్టాంతముగా ఉంచటానికి నాశనం చేసాడు (2 పేతురు 2:6). అయితే వారు చేసిన పాపం ఏంటి అంటే, "వ్యభిచారము" “కామ వికారయుక్తమైన నడవడి (2 పేతురు 2:7)” అని చెప్పబడింది. ఇది ఎలాంటి "వ్యభిచారము" అంటే "పరశరీర సంబంధమైనది" అని యూదా చెప్తున్నాడు. ఈ సొదొమ గొమొఱ్ఱవాళ్ళు స్త్రీలని విడిచి, పురుషులతో వ్యభిచరిస్తున్నారు.

“ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్దులును ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా” (ఆది 19:5). ఆ పట్టణం వారు లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు. అనగా "పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి” (రోమా 1:27).

వీరు కామవికారమైన చేష్టలు మాత్రమే కాకుండా అనేకమైన పాపాలు చేయిచు దేవునికి విరుద్ధంగా ఉన్నవారు. వారు "తినుచు త్రాగుచు, కొనుచు అమ్ముచు, నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి” (లూకా 17:29). ఇవన్నీ చేయడం తప్పు కాదు కానీ వారు దేవునిని లక్ష్యపెట్టక, తిని తాగడం మరియు ఇతర శారీరకమైన అవసరాలను మాత్రమే తీర్చుకునేవారు. అంతమాత్రమే కాకుండా గర్వం, తిండిపోతుతనం, నిర్విచారమైన సుఖస్థితి, మరియు దీనులకు దరిద్రులకు సహాయం చేయకపోవడం వీరి అలవాట్లు (యెహెజ్కేలు 16:48-50). వీరు దేవుడు నియమించిన సహజ స్థితికి (natural order) వ్యతిరేకమైన స్థితిలో జీవించారు.

యూదా ఈ పత్రిక రాస్తున్న సంఘాన్ని సంబోధిస్తూ, మీలో కూడా ఇలాంటివారు, అనగా ఇలాంటి అలవాట్లు, ఇలాంటి నడవడి కలిగినవారు ఉన్నారు, వారికి సొదొమ గొమోర్రా ఒక దృష్టాంతామని, ఆ పట్టణానికి పట్టిన గతే వీరికి కూడా పడుతుంది అని హెచ్చరించాడు. ఈనాడు అనేకులు, దేవుని సేవకులుగా ఉంటూ, సంఘంలో స్త్రీలతో వ్యభిచరిస్తున్న స్థితిలో ఉన్నారు. ఉదాహరణకు: సౌత్ కొరియా దేశంలో జెరోక్ లీ, మన్మిన్ సెంట్రల్ చర్చికి నాయకుడుగా ఉంటున్నాడు. ఆయన తన సంఘంలో ఎనిమిది మంది స్త్రీలతో వ్యభిచారం చేస్తూ వారికి 'దేవుని ఆదేశాన్ని బట్టే ఇది చేస్తున్నాను' అని చెప్పేవాడు. సౌత్ కొరియా పోలీసులు ఆయనని పట్టుకొని 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇలాంటి వారు అనేకులు మనలో కూడా ఉన్నారు. ఈ మాటలు వినటానికి కఠినంగా ఉన్నా, మన ప్రభువు చెప్పిన కొలమానం ప్రకారం "ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును”. దీనిని బట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అనేకులు వ్యభిచరిస్తున్న స్థితిలో ఉన్నారు.

సొదొమ గొమోర్రా పట్టణంవారు ఈ లోకంలో నాశనం చేయబడటమే కాకుండా, నిత్యానాశనానికి (నరకానికి) పాత్రులయ్యారు. అయితే ఈ కాలంలో అనేకమంది అబద్ద ప్రవక్తలు ఈ లోకంలో శిక్ష పొందట్లేదు. దానిని బట్టి నిజవిశ్వాసులు, 'దేవుణ్ణి తృణీకరించి బ్రతికేవారు బాగున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు' అని అనుకోకూడదు. ఈ లోకంలో వారికి శిక్ష పడినా పడకపోయినా, నిత్యనాశనాన్ని మాత్రం వారు తప్పించుకోలేరు. దేవుణ్ణి ప్రేమించే నీవు నిత్యజీవాన్ని పొందుకుంటావు.

అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.” యూదా 1:8

"వీరును" అనగా, ఎవరి గురించి ఈ పత్రిక రాయబడిందో (మతభ్రష్టులు) వారు "కలలు కంటున్నారు". ఈ కలలు కనుట అనేది రెండర్థాలుగా చెప్పబడింది. మొదటిది వీరు దేవుని దర్శనం/ప్రవచనం కలలో కలిగిందని సంఘాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు (అపో. కార్య. 2:17). రెండవదిగా దేవుని అధికారానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని దగ్గర నుండి తమ సొంత లాభానికి అవసరమైన వాటిని ఆశిస్తున్నారు (సామెతలు 10:28).

“మీ వృద్దులు కలలు కందురు” (అపో. కార్య. 2:17) అని చెప్పబడిన వాక్యాన్ని చూపించి మాకు కూడా దైవ దర్శనాలు కలుగుతున్నాయి అని బహుశా చెప్పుకొనియుంటారు. ఈ కలలు కంటున్నవారి ప్రవర్తన ఎలా ఉంది అంటే, మొదటిగా వీరు శరీరాన్ని అపవిత్రపరచుకొంటున్నారు. ఎలా అయితే సొదొమ గొమొఱ్ఱ పట్టణపు వారు వారి శరీరాల్ని అపవిత్ర పరచుకున్నారో అలానే వీరు కూడా "సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొన్నారు” (paraphrase added) (ఎఫెసీ 4:19). ఇదే విషయాన్ని యూదా 4వ వచనంలో, వీరు “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచున్నారు” అని చెప్పారు.

రెండవదిగా వీరు "ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు”, అనగా, ఈ లోక ప్రభుత్వాన్ని వీరు నిరాకరిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న యజమానులకు మరియు ప్రభువులకు వీరు విధేయత చూపకుండా, ఇలా ఉండటమే వాక్యానుసారమని వారి అపవిత్ర ప్రవర్తనను సమర్థించుకుంటున్నారు. వీరు ప్రభువును నిరాకరిస్తున్నారు అని 4వ వచనంలో చెప్పిన యూదా, ఇక్కడ వీరు ఈ లోక ప్రభుత్వాన్ని కూడా నిరాకరిస్తున్నారు అని చెప్తున్నాడు. అయితే ఈ లోక యజమానులకు విధేయత చూపించే స్వభావం క్రీస్తు మరియు ఆయన అపొస్తలులు, సంఘానికి నేర్పించారు. "నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు” (రోమా 13:3). దీనిని బట్టి ఈ లోక ప్రభుత్వాన్ని నిరాకరించేవారు దేవుని అధికారాన్ని నిరాకరిస్తున్నారు అని తెలుసుకోవాలి. దీని ఉద్దేశం నిజమైన విశ్వాసులు దేవునికి వ్యతిరేకమైన విషయాలలో ప్రభుత్వానికి విధేయత చూపాలి అని కాదు కానీ, దేవునివాక్యానికి విరుద్ధంగా లేనంతవరకు విశ్వాసులు ఈ లోకఅధికారులకు విధేయత చూపాలి.

మూడవదిగా వీరు “మహాత్ములను దూషిస్తున్నారు”, ఇక్కడ మహాత్ములు అని "doxa" అనే గ్రీకు పదాన్ని అనువదించడం జరిగింది. ఈ పదం కొత్తనిబంధనలో కనీసం 150 సార్లు వాడబడింది. ఈ పదానికి సందర్భాన్ని బట్టి వివిధ అర్ధాలు ఉన్నాయి, అయితే ఈ పదం యొక్క ప్రాథమిక అర్ధము "శోభ", "ప్రకాశం". ఇది (ఈ పదం) సందర్భాన్ని బట్టి దేవునిని, దేవదూతలను, మరియు మనుషులను గురించి వర్ణించడానికి వాడబడింది. అయితే ఈ వచనంలో యూదా ఈ పదాన్ని వాడిన అర్ధం "ప్రకాశమానమైన దేవదూతలను" వర్ణిస్తుంది అని కొందరు వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడుతుంటారు. మరి కొందరు వ్యాఖ్యానకర్తలు "మహాత్ములు" అంటే దేవుడు సంఘం మీద నియమించిన అధికారులు అని వ్యాఖ్యానిస్తారు. వీరు దేవదూతలను దూషిస్తున్నారు అనే భావం ఎంతవరకు సమంజసమో తెలియదు కానీ, వీరు దేవుడు నియమించిన అధికారానికి (సంఘంలో అధికారులు) వ్యతిరేకంగా ఉన్నారు అనే వివరణ అంగీకరించబద్దంగా ఉంది. యూదా 11వ వచనంలో చెప్పబడినట్టు “కోరహు, మోషే మరియు అహరోను మీద ఎలా తిరగబడ్డాడో", వీరు కూడా అపొస్తలులు మరియు అపొస్తలులు నియమించిన అధికారులను అదే విధంగా ఎదిరిస్తున్నారు (మహాత్ములను దూషిస్తున్నారు) అని చెప్పొచ్చు.

“అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.” యూదా 1:9

ఇక్కడ “మిఖాయేలు", "అపవాది" వాదనలో ఉన్నట్టు మనం చూడగలం. ఈ మిఖాయేలు ఎవరు? అందుకు యూదా ఇలా చెపున్నాడు "ప్రధానదూతయైన మిఖాయేలు". అంటే మిఖాయేలు అధికారంలో ఉన్నవాడు (ఇతర దేవదూతలకి అధికారిగా ఉన్నాడు). దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు "పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను” (దానియేలు 10:13). దానియేలు 12వ అధ్యాయంలో “ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును.” (దానియేలు 12:1). ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా” (ప్రకటన 12:7). ఈ వచనాలను బట్టి మిఖాయేలు అధికార స్థానంలో ఉన్న దేవదూత అని మనం నిర్ధారించవచ్చు.ఇదే విషయాన్ని అపొస్తలుడైన పేతురు కూడా చెప్తున్నాడు. “దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోపవెరతురు” 2 పేతురు 2:11.

అధికార స్థానంలో ఉన్న మిఖాయేలు, మరియు ఒకప్పుడు అభిషేకమునొందిన కెరూబు అయిన అపవాది, “మోషేయొక్క శరీరమునుగూర్చి" వాదించుకొంటున్నారు. ఈ సంఘటన ఏ పాతనిబంధన గ్రంథములోను రచించబడలేదు. మరి యూదాకి ఈ సంఘటన ఎలా తెలుసు అనే ప్రశ్న మనకు రావచ్చు? పరిశుద్దాత్మ దేవుని చేత ప్రేరేపించబడినవాడు గనుక, దేవుడే ఒక ప్రవచన రూపకంగా ఈ విషయాన్ని యూదాకి తెలియపరచి ఉండొచ్చు. అయితే యూదుల చరిత్ర పుస్తకాలలో ఒకటైన “The Testament of Moses” అనే గ్రంథంలో మోషే శరీరాన్ని గురించిన వాగ్వివాదం (మిఖాయేలు, అపవాది) కనబడుతుంది. యూదా ఈ గ్రంథం నుంచే ఆ సమాచారాన్ని తీసుకున్నాడు అని అనేకమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడుతుంటారు.

అయితే ఇక్కడ యూదా ఈ వచనాన్ని ఒక చారిత్రాత్మక సత్యాన్ని తెలియజేయడానికి (మోషే శరీరం ఎక్కడ పాతిపెట్టబడింది) చెప్పట్లేదు గాని, 'మహాత్ములను దూషిస్తున్న'వారికి మరియు 'మిఖాయేలుకి' మధ్య గల వ్యత్యాసాన్ని నిరూపించడానికి చెప్తున్నాడు. మిఖాయేలు దూషించి తీర్పు తీర్చే విషయంలో తెగించలేదు, తీర్పరి దేవుడే గనుక "ప్రభువు నిన్ను గద్దించును గాక" అని చెప్పాడు.

“వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనముచేసికొనుచున్నారు.” యూదా 1:10

“వీరైతే" (అబద్ధ బోధకులకి, మిఖాయేలుకి మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ), గ్రహించలేని, అర్ధం కాని విషయాలను గురించి దూషిస్తున్నారు అని చెప్తున్నాడు. ఎందుకు మిఖాయేలుకి, వీరికి వ్యత్యాసాన్ని చూపుతున్నాడు అంటే, మిఖాయేలుకి అపవాది గురించి అన్ని విషయాలు తెలిసినప్పటికీ, దేవుని స్థానాన్ని తీసుకొని తీర్పు తీర్చకుండా, ప్రభువు గద్దింపునకు ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. అయితే వీరికి తెలియని విషయాలను బట్టికూడా వీరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ, దుర్భాషలాడుతున్నారు. ఏంటి ఆ గ్రహించలేని విషయాలు అంటే అవి దేవదూతల గురించిన విషయాలు అయియుండొచ్పు, దేవుని అపొస్తలుల గురించిన విషయాలు లేదా వాక్యానికి సంబంధించిన విషయాలు అయియుండొచ్చు. వీరు ఎందుకు ఈ విషయాలని గ్రహించలేకపోతున్నారు అంటే వీరు "ప్రకృతి సంబంధమైన మనుషులు" అని విశ్లేషించవచ్చు. "ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు" (1 కొరింథీ 2:14). వీరు అపొస్తలులని దుర్భాషలాడుతూ, వారి బోధను తృణీకరిస్తూ, వాక్యానికి విధేయత చూపించే విషయంలో దూషకులుగా ఉన్నారు. వీరు చేసే పనులను "దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా?" (కీర్తన 73:11) అని అనుకొనే స్థితిలో బ్రతుకుతున్నారు.

వీరిని గురించి పేతురు ఇలా చెప్తున్నాడు "వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు” (2 పేతురు 2:12). వీరు ఆత్మీయ గ్రహింపు లేనివారై, "వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభితమందు సాధకము చేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునైయుండి, తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.” (2 పేతురు 2:14)

వీరు "నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోయి,.........కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టు"(2 పేతురు 2:21,22) వీరి ప్రవర్తన ఉంది. వీరు ఏ విషయాన్నీ  వివేచించకుండా, తమ స్వాభావికమైన మనసుకు ఏదీ తోస్తే దానిని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు "సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగరహితులును, నిర్దయులునై"యున్నారు (రోమా 1:29-31). వీరిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు గనుక, వీరు స్వభావసిద్దంగా ప్రవర్తిస్తూ ఆత్మ వివేచన లేకుండా సమస్తమైన దుర్నీతితో నిండుకొని శరీరక్రియలయందు ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి కపట విశ్వాసులు/బోధకులు "తమ్మునుతాము నాశనము చేసుకుంటున్నారు" అని యూదా చెప్తున్నాడు. “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్చలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును” (గలతి 6:7). వీరు దేవుని అపొస్తలులును దూషిస్తూ, శరీరాన్ని బట్టి శరీరేచ్ఛేలను మృగాలవలె విత్తుతున్నారు గనుక, నాశనమనే పంటని కోస్తారు.

"అయ్యో, వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తపుత్రోవలో ఆతురముగా పరుగెత్తారి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి." యూదా 1:11

ఈ కపట బోధకులకి "శ్రమ" అని యూదా చెప్తున్నాడు. ఎందుకు వీరికి శ్రమ అంటే వీరు దేవుడు నియమించిన మార్గాలను చెరిపేసి, ఆయనకు విరుద్ధమైన మార్గాలలో నడుస్తున్నారు. ఇక్కడ వీరి మార్గాల గురించి ఈ విధంగా చెప్పబడింది.

• కయీను నడిచిన మార్గంలో వీళ్ళు నడుస్తున్నారు

• బిలాము నడిచిన తప్పు త్రోవలో వీళ్ళు పరుగెడుతున్నారు

• కోరహు వలే తిరస్కారము చేసి నశిస్తున్నారు

కయీను నడిచిన మార్గం ఏంటి? వాక్యం ఇలా సెలవిస్తోంది “మనము కయీనువంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను గనుకనే గదా?” (1 యోహాను 3:12). కయీను అసూయ, నరహత్య, అహంకారము, అన్యాయము అనే పాపములతో నిండియున్నవాడు. అలానే ఈ అబద్ధబోధకులు ఇతరుల ఆత్మీయవరాలను చూసి తట్టుకోలేక, అసూయపడుతూ, తమ తప్పుడుబోధల ద్వారా అనేక ఆత్మలను నిత్యనాశనానికి నడిపిస్తున్నారు. ఇలా కయీను నడిచిన మార్గంలో నడుస్తున్న వీరికి శ్రమ.

బిలాము, దేవుడు ఆశీర్వదించిన ఇశ్రాయేలు జనాన్ని శపించడానికి బాలాకు అనే మోయాబు రాజు చేత పిలిపించబడినప్పుడు, దేవుడు వెళ్లొద్దు అని చెప్పాడు. మొదటిసారి బిలాము వెళ్ళలేదు. రెండవసారి రాజైన బాలాకు దగ్గర నుండి మనుషులు వచ్చినప్పుడు, దేవుడు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ తన ధనాపేక్షను బట్టి మీరు ఈ రాత్రి ఇక్కడ బస చేయండి (బాలాకు రాజు దగ్గర నుండి వచ్చిన మనుషులని) నేను దేవునిని అడుగుతాను అని అన్నాడు. దేవుడు బిలాము యొక్క తప్పుడు ఉద్దేశాన్ని బట్టి బాలాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి అనుమతించాడు. అయితే బిలాము యొక్క తప్పు ఏమిటో తనకు తెలిసేలా చేయడానికే దేవుడు వెళ్ళడానికి అనుమతించాడుగాని ఇశ్రాయేలీయులను శపించటానికి కాదు. దేవుడు ఏ మాటలైతే ఇశ్రాయేలీయులను గురించి బిలాముకు చెప్పాడో, అవే మాటలు బిలాము రాజైన బాలకుకు చెప్తాడు. అప్పుడు బాలాకు, నేను ఇశ్రాయేలీయులను శపించటానికి నిన్ను పిలిస్తే నువ్వు వారిని ఆశీర్వదిస్తున్నావు, ఇదేంటి అని అడుగుతాడు. అందుకు బిలాము, దేవుడు చెప్పమన్న మాటలు తప్ప నా సొంతంగా ఏమి చెప్పలేను అని అంటాడు. దేవుడు ఆశీర్వదించిన ప్రజలను నేను శపించలేను అని కూడా రాజుకు బదులిస్తాడు. ఈ కథ అంతా విన్న తరువాత, బిలాము దేవుడు చెప్పమన్నదే చెప్పాడు కదా? దేవుని మాట విన్నాడు కదా? మరి ఎందుకు యూదా "బిలాము నడిచిన తప్పుమార్గం" అని అంటున్నాడు అని మనం అనుకోవచ్చు (సంఖ్యాకాండము 22-24).

అయితే బిలాము, ఇశ్రాయేలీయులను దేవుడు శపించడు అని ఎరిగినవాడై, రాజైన బాలాకుకు ఒక సలహా ఇస్తాడు అదేమిటంటే, 'మోయాబీయుల స్త్రీలను ఇశ్రాయేలీయులతో వ్యభిచారం చేయమను, అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షిస్తాడు' అని. మోయాబు రాజు అలానే చేసి ఇశ్రాయేలీయులలో అనేకులు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసేట్లు చేస్తాడు. అందును బట్టి దేవుడు ఇశ్రాయేలీయులలో 24,000 మందిని తెగులు ద్వారా సంహరించాడు.“అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించినవారు నీలో ఉన్నారు.” ప్రకటన 2:14

ధనాపేక్ష, లేక బహుమానం పొందుకోవాలని దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుని ప్రజలను విగ్రహారాధనలోకి, జారత్వములోకి నెట్టినవాడు బిలాము. అలానే ఈ కపట బోధకులు దేవుని ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వ్యభిచారంలోకి, విగ్రహారాధనలోకి నడిపిస్తున్నారు. బిలామును ఎలా అయితే దేవుడు, యెహోషువ చేతిలో మరణం పొందేలా చేసాడో, అలానే వీరు క్రీస్తు చేత శిక్షకు నియమించబడ్డారు.

కోరహు, దేవుడు అధికారంలో ఉంచిన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి తనతో పాటు 250 మంది సభికులును సమాజప్రధానులు తీసుకొని వెళ్ళాడు.“మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్దుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా, మోషే..................తనవాడు ఎవడో పరిశుద్దుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచు కొనినవానిని తన యొద్దకు చేర్చుకొనును.” సంఖ్యా 16:3-5

ఆ విధంగా దేవుడు నియమించిన అధికారాన్ని త్రోసిపుచ్చి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందున, దేవుడు వారిని (కోరహు, అతనితో ఉన్నవారు) నాశనం చేసాడు.“భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.” సంఖ్యా 16:32,33

అలానే ఈ అబద్ద ప్రవక్తలు, అపొస్తలుల బోధకు విరుద్ధమైన బోధ చేస్తూ తమని తాము దేవుడు నియమించిన అధికారం కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ పాపం చేస్తున్నారు గనుక వారికి శ్రమ, దేవుడు వారిని నాశనం చేస్తాడు అని యూదా చెప్తున్నాడు. కయీను నడిచిన మార్గం, బిలాము మరియు కోరహు నడిచిన మార్గం దేవుడు నియమించిన మార్గానికి వ్యతిరేకమైనది అని తెలిసి కూడా ఈ అబద్ద ప్రవక్తలు అదే మార్గంలో నడుస్తున్నారు. మరి నీ సంగతేంటి, నువ్వు కూడా క్రైస్తవుడవని చెప్పుకుంటూ అదే మార్గంలో (దేవునికి వ్యతిరేకమైన) నడుస్తున్నావా, లేక నిజమైన క్రైస్తవుడిగా ప్రభువుని సంతోషపెట్టేలా జీవిస్తున్నావా?

“వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు గాడాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది." యూదా 1:12,13

వీరు "మీ ప్రేమవిందులలో దొంగమెట్టలుగా ఉన్నారు" అని యూదా చెప్తున్నాడు. ఎందుకు వీరిని ఆలా వర్ణిస్తున్నాడు అంటే, "తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు" అని సమాధానము ఇస్తున్నాడు. వీళ్ళు ఇతరుల అవసరాలకన్నా తమ సొంత లాభానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వీళ్ళకి సంఘం పట్ల ఎటువంటి ప్రేమ లేదు. సంఘాన్ని అభివృద్ధి చేయడం, సంఘానికి సహకారంగా ఉండడం వీరి ఉద్దేశం కాదు. వీరు ఎంత సంపాదించామా అని మాత్రమే ఆలోచిస్తారు, సంఘాన్ని అడ్డుపెట్టుకొని ధనార్జన చేస్తారు. వీళ్ళు "మీతో సుభోజనము" చేస్తూ, అనగా మీలో ఒకరిలా కనబడుతూ, తమని తామే మోసం చేసుకుంటున్నారు. వీరు అతి భయంకరులు. వీరికి ఇంత పెద్ద శిక్ష ఉంది అని తెలిసినప్పటికీ వీరు నిర్భయముగా తమని తాము పోషించుకుంటున్నారు. ఈ కాలంలో కూడా ఇలాంటివారు అనేకులు ఉన్నారు. క్రీస్తుసేవ లక్ష్యంగా కాకుండా, ధనాపేక్షే లక్ష్యంగా దేవుని సేవలోకి వస్తున్నారు. వీరు గొర్రెలకాపరులు కాదు కానీ, గొర్రెల వేషంలో ఉన్న తోడేళ్ళు. వీళ్ళు వాక్యాన్ని తమకు అనుకూలమైనట్టుగా మలుచుకొని, మీరు దేవుడికి డబ్బిస్తే దేవుడు మీకు తిరిగిస్తాడని, మీరు పాపంలో బ్రతికినా దేవుని కృప మీకు తోడుగా ఉంది గనుక భయపడాల్సిన అవసరమే లేదని, అనగా దేవుడు కృపామయుడు గనుక మిమ్మల్ని క్షమిస్తాడని చెప్తుంటారు. వీరు అనేకులకు అడ్డుబండల్లా ఉంటూ, అనేకులు పాపంలో మునిగిపోవడానికి కారణం అవుతున్నారు.

ఈ కాలంలో అనేకులు నిజమైన సువార్తను విడిచిపెట్టి “సంక్షేమ సువార్త (Prosperity Gospel)” మరియు “ఆరోగ్య మరియు సంపద సువార్త (Health and wealth Gospel)” అనే వాటిని ప్రకటిస్తున్నారు. అనేకులు దురదచెవులుగలవారై తమకు నచ్చిన ఇలాంటి బోధకు మొగ్గుచూపుతున్నారు. వీళ్ళు చెప్పేదేంటంటే, దేవుని చిత్తం నీకు సిరిసంపదలు ఇవ్వడమే అని, దేవుడు నిన్ను ఇబ్బందిపరచడు, నీకు అనారోగ్యం రావడం దేవుని చిత్తం కాదు అని చెప్తుంటారు. నేటి సంఘంలో అనేకులు ఎంతోకాలం నుండి సంఘానికి వెళుతున్నా వారికి వాక్యం గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ఒక పత్రిక (పౌలు గాని పేతురు మరెవరైనా రచించినది) యొక్క సారాంశం ఏంటి అంటే చెప్పలేకపోతున్నారు, ఆ పత్రిక ద్వారా దేవుడు ఆనాటి సంఘముతో ఏమి మాట్లాడాడు, ఇప్పుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడు అని అడిగితే ఏమి సమాధానం చెప్పే స్థితిలో లేరు. నేను పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయములో దాచుకున్నాను అని చెప్పిన దావీదు మాటలకి నేటి సంఘంలో అనేకుల పద్దతి వ్యతిరేకంగా ఉంది. వీళ్ళ హృదయాలలోకి ఎంత తొంగిచూసినా అక్కడ వాక్యం ఉండదు. ఇలా ఆ అబద్ధబోధకుల బోధకి చెవియొగ్గి దేవుని నుండి దూరమైపోయిన వీరికి (తిరిగి పశ్చాత్తాపపడి మనసు మార్చుకోకపోతే), వారితో పాటు "గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది”.

అంతమాత్రమే కాకుండా యూదా, వీరిని అనేకరకాలుగా పోలుస్తూ వీరు ఎంత నిష్ప్రయోజకులో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. వీరు "నిర్జల మేఘములు" అనగా, నీళ్లు లేని మేఘాలు. వర్షం పడాలంటే మేఘంలో నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది, అలానే సంఘానికి ఆత్మీయ మేలు జరగాలంటే మేఘాలలాగ, ఉన్నతస్థానంలో కూర్చున్నవారిలో జీవిస్తున్న దేవుని వాక్యం ఉండాలి. ఆలా లేనప్పుడు వారి బోధ నీరులేని మేఘం లాంటిది, దాని వలన ఎటువంటి చిగురు చిగురించదు.వీళ్ళు "రెండు మార్లు చచ్చిన చెట్లగాను" ఉన్నారు. కొత్త ఫలాలు రాకపోగా ఉన్న ఫలాలు కూడా ఊడిపోయి, వేర్లతో సహా ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, అనగా దేవునికి ఇష్టమైన క్రియలు తమ జీవితంలో చూపించలేని స్థితిలో ఉన్నారు. ఎలా అయితే సముద్రములో అలలు ఆగ్రహముగా లేచి ఒడ్డున్న తుస్సుమని ఆగిపోతాయో వీరు కూడా గర్విష్టులై సముద్రపు అలలులాగ ప్రవర్తించినా, ఒక రోజు దేవుని చేతిలో తగిన శిక్ష అనుభవిస్తారు. ఈనాటి అనేక బోధకులు కూడా దేవునిని వేడుకోవడం మానేసి, దేవునికే ఆజ్ఞ ఇవ్వడం మొదలుపెట్టారు. వీరు 'దేవా నువ్వు ఇప్పుడు దిగిరావాల్సిందే', 'నీ ఆత్మ వీరి మీద కుమ్మరించు', 'దేవా ఇప్పుడే, నేను అడుగుతున్నాను ఈ క్షణములోనే వీరిని ఆశీర్వదించు' అని చెప్తుంటారు. వీరందరూ చివరిలో "ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొండని వారితో చెప్పుదును" (మత్తయి 7:21-23).

"ఆదాము మొదలుకొని యేడవవాడైన హనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు,లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునైయున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును." యూదా 1:14-16

హనోకు, ఆదాము నుండి యేడవ వాడు, "ఆదాము షేతు ఎనోషు కేయినాను మహలలేలు యెరెదు హనోకు" (1 దినవృత్తాంతములు 1:1-3). హనోకు గురించి ఈ విధంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆదాము నుండి ఏడోవాడైన హనోకును, కయీను కుమారుడైన హనోకుకు (కయీను కుమారుడి పేరు కూడా హనోకే) మధ్య వ్యత్యాసం చూపడానికి, దేవుని చిత్తానుసారముగా నడిచిందీ ఏ హనోకో తెలియజెప్పడానికి యూదా ఈ విధంగా రాసాడు.

హనోకు ప్రవచనం రాయబడింది అని చెప్పలేదు కానీ, ప్రవచించబడింది (హనోకు ప్రవచించెను) అని యూదా చెప్తున్నాడు. పాతనిబంధన గ్రంథంలో ఈ ప్రవచనం రాయబడి లేనప్పుడు యూదాకు ఈ ప్రవచనం ఎలా తెలిసింది అని మనకు అనుమానం రావచ్చు? యూదులు “ORAL TRADITION” ని అనుసరించేవారు. అంటే, ఏదైనా ఒక విషయాన్ని వాక్కు ద్వారా ప్రచారం చేయడం. ఉదాహరణకు మా తాత గారు చెప్పిన ఏదైనా విషయాన్ని, మా నాన్న గారు నాకు చెప్తారు, నేను నా పిల్లలకి చెప్తాను. ఇలా లిఖిత పూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారా వ్యాపించే సమాచారాన్ని “ORAL TRADITION” అంటారు. ఇదే విధంగా హనోకు చెప్పిన ప్రవచనం కూడా “ORAL TRADITION” ద్వారా యూదాకు తెలిసుండాలి. ఇశ్రాయేలీయులు ఈ సాంప్రదాయాన్ని, దేవుని మాటలను వేరే తరాలకు తెలియజేయటానికి ఉపయోగించేవారు. ఈ మాటలు (ప్రవచనం) హనోకు గ్రంథంలో కనబడినంత మాత్రాన, హనోకు గ్రంథం దైవవాక్యమని చెప్పకూడదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు హనోకు గ్రంథం “PSEUDEPIGRAPHA” కోవకు చెందింది.

అలానే “ORAL TRADITION” ద్వారా ఈ విషయం మోషేకు మరియు దావీదుకు కూడా తెలిసుండాలి, దీనిని బట్టే వారు ఇలా రాయగలిగారు: “దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది.......... ఆయన (దేవుడు) పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను” (ద్వితీయో 33:2). “దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు” (కీర్తన 68:17)

దేవుడు ఈ భక్తిహీనులకు రెండు విషయాలను బట్టి తీర్పుతీరుస్తాడు అని హనోకు చెప్తున్నాడు. అవేంటంటే "వారి భక్తిహీనమైన క్రియలు", "వారు ప్రభువుకు వ్యతిరేకంగా పలికిన కఠినమైన మాటలు" అని వివరిస్తున్నాడు. వారి భక్తిహీనమైన క్రియలు ఏంటి అంటే, దేవుని మార్గంలో కాకుండా వాళ్ళ దురాశలు చొప్పున నడుస్తూ, దేవునిని కాకుండా మనుష్యులను సంతోషపెడుతున్నారు. అలానే ప్రభువు పట్ల కఠినమైన మాటలు అనగా అన్ని విషయాలలో సణుగుతూ, తమని తాము హెచ్చించుకొనునట్లు డంబపు మాటలు పలుకుతున్నారు. వీరికి ప్రభువు తప్పక తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చటానికి "ప్రభువు తన వేవేల పరిశుద్దుల పరివారముతో వచ్చెను" అని యూదా చెపుతున్నాడు. అయితే వచ్చెను అనగా, జరిగిపోయిన విషయము అని అర్ధం కదా, మరి హనోకు ఎందుకు ఈ ప్రవచనం జరిగిపోయినట్టు భూతకాలంలో చెప్పాడు. దీనినే “aorist active indicative” అని అంటారు. దీని అర్థం ఏంటంటే, ఇది ఖచ్ఛితంగా భవిష్యత్ కాలంలో జరుగుతుంది గనుక, దీనిని జరిగినట్టే భావించి భూతకాలంలో చెప్పడం. ప్రభువు వీళ్ళకి తీర్పు తీర్చడానికి ఖచ్ఛితంగా వస్తాడు గనుక, "ప్రభువు......వచ్చెను" అని ప్రవచించబడింది. ఇక్కడ "వేవేల పరిశుద్దుల పరివారము" అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? “పరిశుద్ధ" అని అనువదించబడిన పదం గ్రీకు భాషలో “hagios” అని ఉంది. అయితే “hagios” అనే పదము యొక్క అర్థము వాక్య సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు: పరిశుద్ధ (hagios) ఆత్మ, పరిశుద్ధ (hagios) స్థలం, పరిశుద్ధ (hagios) దూతలు, దేవుని పరిశుద్ధ (hagios) ప్రజలు. అయితే ఇక్కడ వాక్య సందర్భాన్ని బట్టి "పరిశుద్ధ దూతల" గురించి మాట్లాడుతున్నారు అని అర్ధం చేసుకోవచ్చు. ఇందుకు కొన్ని వాక్యభాగాలు చూద్దాం:

“తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.” మత్తయి 25:31

“వ్యభిచారమును పాపమును చేయు ఈ తరమువారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ (hagios) దూతలతో కూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను” మార్కు 8:38.

“నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద (hagios) దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.” లూకా 9:26

 “అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.” యూదా 1:17-18

 ఇక్కడ యూదా తాను రాస్తున్న సంఘానికి, అపొస్తలులు ఇదివరకే చెప్పిన ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. అదేంటంటే "అంత్యకాలమునందు...... పరిహాసకులుందురు" అనే మాట.

“అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.” 2 పేతురు 3:3,4.

“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.” 2 తిమోతి 3:1-7

ఈ అపహాసకులు భక్తిహీనమైన దురాశలు చొప్పున నడుస్తారు కనుక, వారిని వెంబడించేవారు కూడా అలానే తయారవుతారు. ఈ పరిహాసకులు, "మేము దేవుని ప్రజలము" అని సంఘాన్ని నమ్మిస్తున్నారు, అయితే వీరు పరిశుద్దతను బట్టి కాక తమ దురాశల చొప్పున నడుచుకుంటారు. ఇది ఈ అబద్ధ బోధకులను గ్రహించటానికి/ కనిపెట్టడానికి ఒక చిహ్నం. అపహాసకులు ఉండకూడదు అని కాదు కానీ, తన ప్రజలను అపహాసకుల/అబద్ద బోధకుల బోధనుండి కాపాడమని దేవుని వేడుకోవాలి.

“అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.” యూదా 1:19

"అట్టివారు" అనగా "భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే పరిహాసకులు" అని యూదా చెప్తున్నాడు. వీరు ప్రకృతిసంబంధులు, అనగా పరిశుద్ధాత్మ లేనివారు అని కూడా వివరిస్తున్నాడు. ఈ అబద్ధ బోధకులకు రక్షణ లేదు. ప్రకృతి సంబంధులు అని అనువదించబడిన గ్రీకు పదం “psuchikoi (సుచికోయ్)”. దీని అర్థం “స్వాభావికమైన”, “ఇంద్రియ నిగ్రహం లేని”, “పశువులు". ఇలాంటివారి యొక్క ముఖ్య ఉద్దేశం, సంఘంలో సాధ్యమైనంతమందిని విడదీయాలని లేదా బేధాలు కలగజేయాలని. ఇలాంటివారు, సంఘంలో ఉన్నవారి మీద నిందలు మోపడం, సహోదరులని అవమానపరిచే మాటలు మాట్లాడడం, కించపరచడం, సత్యానికి వ్యతిరేకంగా ఇతరులని తయారుచేయడం చేస్తుంటారు. గుర్తుంచుకోండి మీరు సంఘములో బేధాలు పుట్టించేవారిగా ఉంటే మీరు సత్యసంబంధులు కారు.

“ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి." యూదా 1:20, 21

"ప్రియులారా" అనగా ఆ సంఘంలో ఉన్న నిజమైన విశ్వాసులను ఉద్దేశిస్తూ, యూదా నాలుగు ప్రోత్సాహకరమైన విషయాలు రాసాడు. మొదటిది "మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు" అని చెపుతున్నాడు. దీనిని అక్షరాలా అనువదిస్తే "అతిపరిశుద్ధమైన మీ విశ్వాసము మీద మిమ్మును మీరు కట్టుకొనుచు” అని చెప్పొచ్చు. ఇందును గురించి అపొస్తలులు ఇలా చెప్తున్నారు: “దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్పు మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.” 1 కొరింథీ 3:10-13

“క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది." ఎఫెసీ 2:20,21

“సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” 1 పేతురు 2:2,3

పై వాక్యభాగాలలో చెప్పబడిన విధంగా యేసుక్రీస్తు మరణ పునరుత్తానాలయందు విశ్వాసం ఉంచటం వలన రక్షణ పొందిన మనం, ఆ విశ్వసాన్ని కొనసాగించడానికి అపొస్తలులు చేసిన బోధలో నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉండాలి అంటే ఆ బోధ ఏంటో మనం తెలుసుకొని ఉండాలి, లేని యెడల "గాలికి చెదరగొట్టు పొట్టు వలె” (కీర్తన 1:4) ఉంటాము.

రెండవదిగా “పరిశుద్దాత్మలో ప్రార్థనచేయుచు", అని చెప్తున్నాడు. వాక్యాన్ని మాత్రమే చదివి ప్రార్ధనను నిర్లక్షపెట్టేవారిని నిరుత్సాహపరుస్తూ, క్రైస్తవ విశ్వాసంలో సత్య వాక్యాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ప్రార్ధన చేయడం కూడా అంతే ముఖ్యం అని వివరిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయడం అంటే ఏంటి? కొంతమంది "భాషలలో దేవుని స్తుతించడం" అనే అర్థాన్ని చెప్తున్నారు. మరి నిజంగా ఇక్కడ యూదా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇంతక ముందు వచనంలో ఆ అబద్ధ బోధకులను "ఆత్మ లేనివారు" అని అంటున్నాడు. ఇక్కడ "ప్రియులు" అయిన క్రైస్తవ సోదరులని "పరిశుద్ధాత్మలో ప్రార్ధన" చేయండి అంటున్నాడు, అనగా ఈ "ప్రియులు" పరిశుద్ధాత్మను కలిగినవారు.

అయితే కొందరు ఎందుకు ఈ ప్రార్ధనకు 'భాషలలో దేవుని స్తుతించడం' అనే అర్థం చెప్తున్నారు? ఎందుకంటే 1 కొరింథీ 14:12-13, వచనాలలో భాషలు ఆత్మసంబంధమైన ఒక వరమని, దానిని మీరు అపేక్షించండి అని పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అలానే 15వ వచనంలో "నేను ఆత్మతో ప్రార్ధన చేతును” అని పౌలుచెపుతున్నాడు. యూదా చెప్పిన ఈ "పరిశుదాత్మలో ప్రార్థన చేయుడి" అనే మాటలను, పౌలు చెప్పిన "నేను ఆత్మతో ప్రార్ధన చేతును " అనే మాటతో కలిపి, పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయటం అంటే, భాషలలో మాట్లాడటం అనే విశ్లేషణను ఇస్తున్నారు. అయితే పౌలు ఈ విధంగా చెప్పాడు “నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును (1 కొరింథీ 14:14-15)”

పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయటం అనగా, దేవుని సన్నిధికి, క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధాత్ముని సహాయంతో రాగలం అని గ్రహించి, ఆ దేవుడు మన తండ్రని, ఆ తండ్రికి ప్రార్ధన చేయటానికి మన సహాయకుడు పరిశుద్ధాత్ముడే అని తెలుసుకొని, తనని దుఃఖపరచకుండా, విధేయత చూపుతూ ప్రతి సమయంలో ఆత్మసహాయం ప్రార్ధన నిమిత్తం పొందుకోవాలి అనేదే.

అయితే ప్రార్థన అనేది మన సొంత శక్తితో చేసేది కాదు, మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్ధన చేస్తాము. మరి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే ప్రార్ధనలో నావంతు ఏంటి అని మీరు అడగొచ్చు? పరిశుద్ధాత్మ దేవుడు ఏవి సరైనవో, ఏది వాక్యానుసారమైన ప్రార్ధనో అది మనకు నేర్పించి, ఆ ప్రేరేపణ ద్వారా మనం తండ్రి దగ్గర ప్రాధేయపడేలా, కృతజ్ఞత చెల్లించేలా సహాయం చేస్తాడు. అంతే కానీ మన ప్రమేయం ఏమి లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన తరుపున ప్రార్థన చేయడు. అయితే మన సహజ స్వభావం ప్రార్థనని వ్యతిరేకిస్తూ, మనల్ని ప్రార్థన చేయకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది.

ప్రార్ధన చేయటానికి బలమైన ప్రయత్నం ఎంతో అవసరం. జాన్ బన్యన్ గారు ప్రార్థనకి సంబందించిన తన శాస్త్రీయమైన చర్చలో ఈ విధంగా చెప్పాడు: నిశ్చయంగా నేను నా సొంత అనుభవాన్ని బట్టి దేవునికి ప్రార్ధించే విషయంలో ఉన్న కష్టాన్ని చెప్పగలను, నా గురించి వింతగా ఆలోచించటానికి నీ పేద, అంధత్వపు, శారీరక మనుష్యునికి ఇది సరిపోతుంది. నా హృదయానికి సంబంధించినంత వరకు, ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు, నేను దేవుని దగ్గరకి వెళ్ళటానికి విముఖత చూపిస్తున్నట్టు కనుగొన్నాను, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో ఉండడానికి విముఖుడనై, నా ప్రార్ధనలో అనేకసార్లు బలవంతముగా, మొదట, నా హృదయాన్ని తీసుకోమని దేవుణ్ణి యాచించి, దానిని క్రీస్తు మీద నిలపమని, అది అక్కడ ఉన్నప్పుడు, దానిని ఆ స్థానం లోనే స్థిరపరచమని అడుగుతాను ( కీర్తన 86:11) . లేదు, అనేకసార్లు ఏ విషయమై ప్రార్ధన చేయాలో తెలియని నేను గ్రుడ్డివాడిని, ఎలా ప్రార్ధన చేయాలో తెలియని అజ్ఞానిని, కేవలము (భాగ్యమైన కృప) ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ప్రార్ధనా సమయంలో నా హృదయానికి ఉన్న శరణార్థ ప్రదేశం! హృదయానికి ఎన్ని చుట్టుత్రోవలు ఉన్నాయో, దేవుని సన్నిధి నుంచి జారుకోటానికి ఎన్ని వెనక మార్గాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. భావోద్వేగాలతో రేకేత్తించబడిన గర్వం ఎంత? ఇతరుల ముందు ఉన్న వేషధారణ ఎంతో? ఒకవేళ విజ్ఞాపన చేసే ఆత్మ మనకు తోడై ఉండకపోతే రహస్యమందు దేవునికి, మన ఆత్మకి మధ్య జరిగే ప్రార్ధనలో ఎంత తక్కువ ఆలోచనతో వ్యవహరిస్తామో? (THE DOCTRINE OF THE LAW & GRACE UNFOLDED and I WILL PRAY WITH THE SPIRIT, ed Richard L Greaves, Oxford, 1976, p 256-257)

మూడవదిగా, నిత్యజీవార్థమైన యేసుప్రభువు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు, అనగా మన అనుదిన బలహీనతలను, మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొంటూ, ఆయన కనికరం మన జీవితంలో అనుదినం పెరుగుతూ ఉండటాన్ని గ్రహిస్తూ, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా, మనం దేవుని ప్రేమలో నిలకడగా ఉండేలాగా మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే మనం దేవుని ఆజ్ఞలకు (క్రీస్తు ఆజ్ఞలకు) విధేయత చూపుతూ ఉండాలి.

“తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.” యోహాను 15:9,10

“సందేహపడువారిమీద కనికరము చూపుడి. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమునొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి." యూదా 1:22,23

ఇక్కడ యూదా రెండు వర్గాలకు సంబంధించిన జనుల గురించి మాట్లాడుతున్నాడు. వీరు “సందేహపడువారు", మరియు "అగ్నిలో ఉన్నవారు". వీరు ఎవరు అంటే, ఈ మతభ్రష్టుల (అబద్ధ బోధకుల) బోధ విని వారిని వెంబడిస్తున్వారు. అయితే వారిని వెంబడించేవారిలో కూడా రెండు వర్గాలు ఉన్నాయా అనే అనుమానం మనకు రావచ్చు? అయితే ఇక్కడ ఒకే వర్గం గురించి చెప్పబడింది (తప్పు బోధను విని దానిని అనుసరిస్తున్వారు) అని మనం అర్ధం చేసుకోవాలి. మరి యూదా ఎందుకు కొందరిని కరుణించండి, మరి కొందరిని అగ్నిలోనుండి లాగండి అంటున్నాడు?

దీనిని ఇలా అర్ధం చేసుకోవచ్చు. అబద్ధబోధను ప్రేమిస్తున్నవారిలో కొందరు సాత్వికము కలిగి, చెప్పింది వినే మనసు కలిగినవారు, మరికొందరు సత్యం చెప్పినా వినకుండా అహంకారంతో తమదే సత్యమని డంబముగా ఉండేవారు.ఆ సాత్వికమైన మనసుకలిగినవారి పట్ల కనికరము చూపుతూ సువార్త ప్రకటించాలి. వారిని కనికరముతో సత్యములోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అయితే ఆ రెండో కోవకు చెందినవారు, అనగా అహంకారంతో, డంబముతో ప్రవర్తిస్తున్వారి పట్ల కఠినంగా వారికి రాబోయే తీర్పుని గురించి చెప్పి, సాధ్యమైతే కొందరినైనా ఆ అగ్నిలో నుండి లాగినట్టు, బలంగా, తొందరగా సత్యంలోకి లాగాలి. ఈ పనిని సంఘం మొత్తం కలిసి చేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు.

నేటి క్రైస్తవులు అనేకులు, సువార్త ప్రకటించాల్సిన పని నాది కాదు, సంఘంలో పాస్టరుగారిది, లేకపోతే పెద్దలది అని అనుకుంటున్నారు. నిజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడిది. ఈ సువార్త పరిచర్య అనేది సంఘం లోపల నుండి మొదలై, బయటకు వ్యాపించాలి. అదే విషయాన్ని యూదా చెప్తున్నాడు, సంఘంలో అసత్య బోధలను నమ్ముతూ, అవిశ్వాసంగా, రక్షణ లేకుండా ఉన్నవారికి సత్యం బోధించడం ఒక్కరి బాధ్యత కాదు, సంఘం మొత్తానిది. ఎందుకు ప్రత్యేకించి అబద్ధ బోధలలో ఉన్నవారికి సత్యం బోధించాలి అంటే, 'ఈ మతభ్రష్టుల వేదాంతాన్ని మరియు ఆచరణని అనుకరిస్తున్నవారికి భ్రష్టులైపోయే అవకాశం ఎంత సత్యమో, మనసు మార్చుకొని సత్యంలోకి వస్తే రక్షించబడతారు అనే నిరీక్షణ కూడా అంతే సత్యం.'

ఈ సువార్త ప్రకటించేటప్పుడు, ప్రత్యేకంగా అసత్య బోధలలో ఉన్వారికి బోధిస్తున్నపుడు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఇక్కడ యూదా వివరించాడు. మొదటిగా "శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమునొప్పుకొనక..." అని చెప్తున్నాడు. శరీరసంబంధమైన క్రియలు అనగా "కామాతురత్వము" అని 4వ వచనంలో "వ్యభిచారం" అని 7వ వచనంలో చెప్పబడింది. వాళ్ళు చేసే ఈ శరీరసంబంధమైన క్రియలను బట్టి మీరు అస్సలు ప్రేరేపించబడకూడదు. మీరు, వారు చేసే క్రియలకు ఆకర్షితులు అయ్యే ప్రమాదం ఉంది గనుక, వారి ప్రవర్తనను ఏ మాత్రము ఆమోదించకుండా "అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి".

ఇక్కడ "శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన" అని అనువదించబడింది - ఆంగ్లంలో "hating even the garment spotted by the flesh"; గ్రీకులో “misountes kai ton apo tEs sarko espilOmenon chitona”. ఇక్కడ misountes అనగా ద్వేషించటం, sarko అనగా శరీరం, espilomenon అనగా మరకతో ఉన్నట్టు గుర్తిచడం, chitOna అనగా లోదుస్తులు. దీని భావం ఏంటో చూద్దాం. ఆ కాలంలో ఉన్న యూదులు, మరియు రోమీయులు, పైన వేసుకునే వస్త్రం కాకుండా, లోదుస్తులు కూడా వేసుకునేవారు. కొన్నిసార్లు ఒకటికంటే ఎక్కువ లోదుస్తులు వేసుకునేవారు. లోదుస్తులు శరీరానికున్న మురికి, పైవస్త్రానికి అంటకుండా కాపాడతాయి. ఈ లోదుస్తులు మురికితో నిండి ఉంటాయి. అయితే యూదా, శరీరాన్ని అంటుకున్న లోదుస్తులు ఏ విధంగా మురికిగా ఉంటాయో, వీరి శరీర సంబంధమైన క్రియలు (పాపాలు) అంటుకున్న దుస్తులు కూడా మీరు ద్వేషించండి అని చెప్తున్నాడు. నిజంగా పాపం అంటుకున్న దుస్తులు ఉన్నాయి అని కాదు, ఇది అలంకారంగా చెప్పబడింది. ఆ మురికి దుస్తుల్ని పట్టుకుంటే మనకి ఎలా మురికి అంటుకుంటుందో, అలానే పాపానికి కారణమైన ఉపకరణాలని కూడా మీరు ద్వేషించాలి అని చెప్తున్నాడు. అంతగా వారి పాపాన్ని ద్వేషిస్తూ కొందరినైనా సత్యం వైపు నడిపించండి అని చెబుతున్నాడు.

“తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” యూదా 1:24,25

"తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకు" శక్తి గల దేవుడు యేసు క్రీస్తు. ఒక వేళ ప్రభువు మనలను కాపాడకపోతే, మనము తొట్రిల్లిపోతాము అని ఈ వచనం సెలవిస్తోంది. దేవుడు ఎలా మనలను కాపాడతాడు అంటే "సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును (1 కొరింథీ 10:13)", "సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక". అంటే దేవుడు మనకు శోధనని తప్పించుకునే మార్గాన్ని చూపించి దానిని జయించే శక్తి ఇస్తాడు. పాపాన్ని జయించడం మాత్రమే కాకుండా, పరిశుద్దతలో అనగా ఆత్మపూర్ణులై ప్రభువుని సేవించి సంతోషపెట్టేలా ఉంచుతూ మనలను భద్రం చేస్తాడు. ఈ అబద్ధబోధకుల నుంచి మనలను రక్షించేది దేవుడే. ఒకవేళ ప్రభువు మనలను ఈ విధంగా భద్రం చేయకపోతే మనం నశించిపోతాం.

"మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక" ఎందుకు యూదా ఇక్కడ దేవునికి ఇలా మహిమ చెల్లిస్తున్నాడు అంటే "తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువ బెట్టుటకును, శక్తిగలవాడు " అని సమాధానం ఇస్తున్నాడు. మన రక్షణ మరియు దాని కొనసాగింపు సర్వయుగములు నివసించే ఆ మహిమగల దేవుని కృప అని అర్ధం చేసుకోవాలి. మనల్ని రక్షించాల్సిన అవసరం దేవునికి లేకపోయినప్పటికీ, తన నిత్యమైన ప్రేమని బట్టి మనల్ని సర్వసత్యములోనికి నడిపించి, పాపం నుండి బయటకి తీసుకొచ్చి, తన కుమారులు/కుమార్తెలుగా మనల్ని చేసుకొని నిత్యజీవాన్ని ప్రసాదించిన దేవుణ్ణి యుదాతో పాటు మనం కూడా స్తుతిద్దాం.

 

ఈ పత్రికకి సంబంధించిన అభ్యంతరాలు

ఈ పత్రికని రచించిన యూదా ఎవరు?

యూదా తనని తాను, యాకోబు సహోదరుడు అని పరిచయం చేసుకున్నాడు. ఈ యాకోబు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బైబిలులో కొంతమంది "యాకోబు" అనే పేరు ఉన్నవారు మనకు తెలుసు. వీరిలో ఇద్దరు అపొస్తలులు, "అల్ఫయి కుమారుడగు యాకోబు", "జెబెదయి కుమారుడగు యాకోబు” (మత్తయి 10:2,3). వీరిద్దరూ యేసుక్రీస్తు ఈ భూలోకంలో పరిచర్య చేస్తున్న సమయంలో ఆయనను వెంబడించారు. జెబెదయి కుమారుడగు యాకోబు మరియు యోహాను సహోదరులు. యేసుకు, "యాకోబు" అనే పేరుగలిగిన సహోదరుడు ఒకడు ఉన్నాడు. ఇతను "యేసునందు విశ్వసముంచలేదు" అని యోహాను సువార్తలో (యోహాను 7:5) సాక్ష్యం ఇవ్వబడింది.

యోహాను సహోదరుడైన యాకోబు (జెబెదయి కుమారుడగు యాకోబు), అపొస్తలులలో ప్రాముఖ్యమైన ముగ్గురిలో ఒకడు (పేతురు, యాకోబు, యోహాను). ( అపొస్తలుల కార్యములు 12:2వ వచనం ప్రకారం రాజైన హేరోదు ఆజ్ఞను బట్టి ఈ యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు (క్రీ.శ. 44వ సంవత్సరం). యూదా చెపుతున్న యాకోబు ఇతను కాదు, ఎందుకంటే, యూదా తన పత్రికని అంగీకరిస్తున్న వారికి బాగా పరిచయం ఉన్న యాకోబు గురించి చెప్తున్నాడు. ఈ యాకోబు సంఘానికి పెద్ద లేక పాలించే స్థానంలో ఉన్నాడు అనే అర్ధాన్ని యూదా తెలియజేస్తున్నాడు. జెబెదయి కుమారుడగు యాకోబు సంఘం స్థాపించబడే కొత్తలోనే చనిపోయాడు గనుక, ఇతడు యెరూషలేము సంఘానికి బాగా పరిచయం అయిన వ్యక్తి అయ్యే అవకాశం లేదు.

రెండవ అపొస్తలుడు "అల్ఫయి కుమారుడగు యాకోబు". ఇతనికి సహోదరులు ఉన్నారని వాక్యంలో ఎక్కడా వివరించబడలేదు. మూడవ వ్యక్తి "యేసు సహోదరుడైన యాకోబు”. వాక్యంలో కొన్ని వచనాలను బట్టి యూదా మరియు యాకోబు (యేసు సహోదరుడు) సహోదరులు అని గమనించవచ్చు (మత్తయి 13:55,56). ఈ సహోదరులు, అపొస్తలులతో కలిసి మేడ గదిలో ప్రార్ధన చేస్తున్నట్టు చూడొచ్చు (అపో. కార్య. 1:13,14). ఈ యాకోబు అన్యజనుల సున్నతి విషయంలో, పౌలు, బర్నబా, పేతురుతో కలిసి ఆలోచన చేసినవారిలో ఒకడు. ఇతను యెరూషలేము సంఘానికి పెద్ద (అపో. కార్య. 15:13).

పౌలు కూడా యెరూషలేముకు వెళ్ళినప్పుడు "నేను పేతురుని, యేసు సహోదరుడైన యాకోబుని" తప్ప మరి ఎవరిని చూడలేదు అని చెప్పాడు (గలతి 1:19). ఈ యాకోబు యెరూషలేము సంఘానికి పెద్దగా వ్యవహరిస్తూ, "యాకోబు" అనగానే ఇతనే అనే అంతగా పరిచయం ఉన్నవాడు. దీనిని బట్టి, యూదా చెపుతున్న "యాకోబు" ఇతనేనని నిర్ధారించవచ్చు. ఈ నిర్ధారణకు వచ్చిన తరువాత, యూదా యాకోబు సహోదరుడే గనుక, యేసు సహోదరుడు కూడా అని సునాయాసంగా నిర్ధారించవచ్చు.

యూదా "యేసు క్రీస్తు దాసుడను" అని చెప్తున్నాడు. ఇది అపొస్తలులు వారి స్థానాన్ని తెలియజేయడానికి ఉపయోగించుకునే బిరుదు? దీనిని బట్టి ఈ యూదా అపొస్తలులలో ఒకడు అని అనుకోవచ్చా?

"యేసు క్రీస్తు దాసుడు" అనే ఈ బిరుదు అపొస్తలులు వినియోగించుకున్నారు అనేది సత్యమైనప్పటికీ, ఈ బిరుదు ఇంకెవరికీ ఆపాదించబడలేదు అని నిర్ధారణ చేయలేము. అందుకు భిన్నంగా "క్రీస్తుయేసు దాసులైన పౌలును తిమోతియును" అని ఫిలిప్పి 1:1లో పౌలు చెప్తున్నాడు. అంటే ఆ బిరుదుని పౌలు, తిమోతికి కూడా ఆపాదించాడు అని అర్ధం చేసుకోవచ్చు.

ఒక వేళ ఆ బిరుదు అపొస్తలులు మరియు వారి అధికారం కింద పరిచర్య చేస్తున్నవారికి మాత్రమే ఆపాదించబడింది అనుకున్నా సరే, యూదా ఆ బిరుదుకు సరిపోతాడు. ఎందుకంటే, యేసుక్రీస్తు జీవించి ఉన్నప్పుడు మరియు సిలువ మీద చనిపోయినప్పుడు యూదా ఆయనను చూసాడు. అంత మాత్రమే కాకుండా యేసు స్వర్గారోహణ అయిన తరువాత మేడగదిలో అపొస్తలులతో కలిసి ప్రార్ధించిన గుంపులో ఆయన ఉన్నాడు. అపొస్తలులతో పాటు పరిచర్య కూడా కొనసాగించాడు. ఈ కారణాలు పరిగణలోకి తీసుకొంటే, "యేసుక్రీస్తు దాసుడు" అనే బిరుదు ఉపయోగించుకోడానికి యూదా ఖచ్ఛితంగా అర్హుడే అని చెప్పొచ్చు.

యూదా చూపిస్తున్న అబద్ధబోధకులు “జ్ఞానవాదులు” (గ్నోస్టిక్స్, gnostics) గనుక, గ్నోస్టిసిజం (gnosticism) 2వ శతాబ్దంలోనిది గనుక, ఈ పత్రిక 2వ శతాబ్దంలో రాయబడిందా?

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకముందు, గ్నోస్టిసిజం అంటే ఏంటో తెలుసుకుందాం. గ్నోస్టిసిజం ఒక భావజాలం లేక మౌలిక సిద్దాంతం (Ideology). వీటిలో కొన్ని:

• భౌతిక పదార్ధమైన ఈ ప్రపంచం చెడ్డది, ఆత్మీయ ప్రపంచం మంచిది. ఈ భౌతిక ప్రపంచం దుష్టుని నియంత్రణలో, అజ్ఞానంలో, శూన్యంలో ఉంది

• దైవసంబంధమైన వెలుగు కొంతమంది మనుష్యులలో ఉంది, కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో బ్రతుకుతున్నవారిలో ఆ వెలుగు ఉన్నవారే రక్షింపబడతారు.

• రక్షణ అనేది ఒక రహస్యమైన జ్ఞానాన్ని బట్టి, తాము తమ గురించి, తమ మూలం గురించి, తమ గమ్యం గురించి తెలుసుకోవడం వలననే లభిస్తుంది.

• దేవుడు ఎలా నిత్యమైనవాడో అలానే దుష్టుడు నిత్యమైనవాడు. దేవుడు మంచివాడు గనుక ఈ లోకంలో ఉన్న కీడుని సృష్టించలేదు, దుష్టుడు ఈ లోకంలో ఉన్న కీడుని సృష్టించాడు

ఇలాంటి మౌలిక సిద్ధాంతాలని, వాలెంటినుస్ (Valentinus) అనే వ్యక్తి క్రైస్తవ్యంలోకి ప్రవేశపెట్టాడు. ఇతను 100వ సంవత్సరంలో పుట్టి 160వ సంవత్సరంలో మరణించాడు. కాబట్టి క్రిస్టియన్ గ్నోస్టిసిజం అనేది 2వ శతాబ్దంలో క్రైస్తవ సమాజంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ గ్నోస్టిక్స్, క్రైస్తవ సమాజాలలో కాకుండా వేరుగా జీవించేవారు. అయితే యూదా తన పత్రికలో ఉద్దేశించిన క్రైస్తవ మతభ్రష్టులు, ఈ గ్నోస్టిసిజం అనే మౌలిక సిద్ధాంతాన్ని పాటించేవారు అని చెప్పటానికి ఏ రుజువూ లేదు. అందుకు భిన్నంగా యూదా వివరించిన ఈ మతభ్రష్టులు క్రైస్తవసమాజంలో జీవిస్తూ, క్రైస్తవ విశ్వాసులమే అని చెప్పుకుంటూ అబద్ధబోధ చేస్తున్నారు. యూదా వివరించిన ఈ మతభ్రష్టులు గ్నోస్టిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు గనుక, ఈ పత్రిక 2వ శతాబ్దంలో రాయబడింది అని చూపించటానికి రుజువు లేదు. అందుకు భిన్నంగా యూదా ఈ గ్రంథాన్ని మొదటి శతాబ్దంలోనే రాసాడు అనటానికి ఉన్న ఆధారాలని పరిశీలిద్దాం.

యూదా యేసు ప్రభువువారు పుట్టిన 10 సంవత్సరాల తర్వాత పుట్టాడు అనుకుందాం (మత్తయి 13:55ను బట్టి యాకోబు, యోసేపు, సీమోను అనేవారు యూదా కంటే పెద్దవారు). అతను ఎప్పుడు చనిపోయాడో చెప్పడానికి చారిత్రాత్మక ఆధారాలు లేవు. యూదా 70 సంవత్సరాలు బ్రతికుండొచ్చు (ఎందుకంటే 70 ADలో నాశనం చేయబడిన యెరూషలేము దేవాలయం గురించిన ప్రస్తావన యూదా తీసుకురాలేదు, ఒకవేళ అప్పటికే యెరూషలేము దేవాలయం నాశనం అయ్యుంటే యూదా ఆ విషయాన్ని ప్రస్తావించేవాడు). ఈ ఆధారాలను బట్టి యూదా పత్రిక క్రీ.శ 55-65 మధ్యలో రాసి ఉండొచ్చు. అంత మాత్రమే కాకుండా దేవుని కృపను దూషించేవాళ్ళు, అనగా రక్షణకి కృప మాత్రమే చాలదు అని బోధించినవాళ్ళను బట్టే రోమీయులకు ఒక పత్రిక రాయడం జరిగింది (పౌలు రాసాడు). అదే విధమైన అబద్ధ బోధా ధోరణిని యూదా ప్రస్తావించిన ఆ అబద్ధబోధకులు కనపరిచారు. రోమా పత్రిక క్రీ.శ 55-58 మధ్యకాలంలో రాయబడింది గనుక యూదా పత్రిక కూడా ఇంచుమించు అదే సమయంలో రాయబడింది అనే అభిప్రాయం యోగ్యమైనదే.

యూదా నిజంగానే అనుమానాస్పదమైన (APOCRYPHA) రచనల నుంచి కొన్ని వచనాలని తీసుకున్నాడా?

ఈ విషయం గురించి ఈ వ్యాఖ్యానంలో 6 మరియు 14-16 వచనాలలో వివరించాము. స్పష్టత కొరకు ఆ వచనాలు మళ్ళీ చదవండి. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం చర్చించుకుందాం.

చారిత్రాత్మకంగా 66 పుస్తకాలను నిజమైన దేవుని వాక్యంగా దేవుని ప్రజలు పరిగణించారు. అందులో 27 కొత్త నిబంధనకు సంబందించిన పుస్తకాలు. ఇప్పుడు మన కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు అవే. ఈ 27 పుస్తకాలు కాకుండా అనేకమైన నమ్మదగని అప్రామాణికమైన గ్రంథాలు కూడా ఉండేవి. వీటిని దేవుని వాక్యంగా ఎప్పుడూ పరిగణించేవారు కాదు. అయితే సత్యవిరోధులు బైబిల్ తప్పు అని నిరూపించాలని, 'క్రైస్తవులు కొన్ని పుస్తకాలను బైబిలులోనుండి తీసివేసి, వారికి అవసరమైన, అనుకూలమైనవాటినే ఎంచుకుని, బైబిలులో పెట్టుకున్నారు' అనే నిందారోపణ చేస్తుంటారు. ఇందుకు ఆధారంగా వారు ఉపయోగించుకునే ఒక పత్రిక యూదా పత్రిక. యూదా అనేకమైన ప్రాచీన గ్రంథాలైన “THE BOOK OF ENOCH”, “THE ASSUMPTIONS OF MOSES” అనే గ్రంథాలనుండి కొన్ని వచనాలను తీసుకొని వాటిని తన పత్రికలో ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆ రెండు గ్రంథాలు  కూడా దేవుని వాక్యమే అని చెప్తారు.

అయితే, యూదా “THE ASSUMPTIONS OF MOSES” (మోషే శరీరాన్ని గురించిన వాదన) అనే గ్రంథాన్ని ఉపయోగించారు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. అందుకు భిన్నంగా “THE ASSUMPTIONS OF MOSES” అనే గ్రంథాన్ని రాసిన వారు జెకర్యా 3:1-2 వచనాలను ఉపయోగించారు అని చెప్పొచ్చు. ఎందుకంటే "యెహోవా నిన్ను గద్దించును" అనే మాటను జెకర్యా గ్రంథంలో చూడగలం. ఇందునుబట్టి జెకర్యా గ్రంథం, “THE ASSUMPTIONS OF MOSES” కంటే ముందే రాయబడిన గ్రంథమని, “THE ASSUMPTIONS OF MOSES' అనే గ్రంథం చెప్పబడినట్టు అంత పురాతనమైనది కాదని అర్ధం చేసుకోవచ్చు. కనుక “THE ASSUMPTIONS OF MOSES” దైవావేశపూరులైన దేవుని ప్రవక్తలు రాసారు అని చెప్పలేము.

రెండవదిగా “THE BOOK OF ENOCH” అనే గ్రంథం నుంచి యూదా, హనోకు ప్రవచనాన్ని తీసుకున్నాడు అనే ఆరోపణను విశ్లేషిద్దాం. గై ఎన్ వుడ్స్ (GUY N WOODS) అనే ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త ఈ విధంగా చెప్పాడు: “BOOK OF ENOCH”లో ఉన్న మాటలకి యూదా పత్రికలో కనబడే మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. యూదా పత్రిక, హనోకు గ్రంథం (BOOK OF ENOCH) కన్నా పురాతనమైనది అని చెప్పడానికి మరియు హనోకు గ్రంథకర్త, యూదా పత్రిక నుంచి ఆ మాటలు తీసుకున్నాడు అని చెప్పడానికే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. నోవహు పరిచారకుడని (పరిచర్య చేసాడని), లోతు సొదొమ ప్రజలతో విసిగిపోయాడని (వేదించబడ్డాడని) పేతురుకు తెలుసు, అలానే పౌలుకు కూడా ఐగుప్తు మాంత్రికులు పేర్లు (యన్నే, యంబ్రే) తెలుసు, అదే తరహాలో యూదాకి కూడా హనోకు ప్రవచనం దైవావేశం వలన లభించింది.”

ఒకవేళ హనోకు గ్రంథం యూదా పత్రిక రాయబడటానికి ముందు నుండే ఉనికిలో ఉన్నా, యూదా ఆ గ్రంథం నుండే ఆ వచనాన్ని తీసుకున్నా, హనోకు గ్రంథం మొత్తం దైవవాక్యమని అది నిరూపించదు. యూదా ఏ మాటలైతే ఆ గ్రంథం నుండి తీసుకున్నాడో అవి మాత్రము చారిత్రాత్మకంగా సత్యాలని అంగీకరించవచ్చు. అంతకు మించి యూదా, హనోకు గ్రంథం నుండి కొన్ని వచనాలు తీసుకున్నాడు గనుక ఆ గ్రంథం మొత్తం దైవవాక్యమని చెప్పకూడదు. యూదా అలా చెప్పలేదు, మనం కూడా ఆ విశ్లేషణకు రాకూడదు. అయితే యూదా, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఆ మాటలు తెలుసుకున్నాడా, “ORAL TRADITION” ద్వారా ఆ మాటలు తెలుసుకున్నాడా, లేక హనోకు గ్రంధంథం నుండి తీసుకున్నాడా అక్షరాలా చెప్పడం అసాధ్యం. కాని దైవావేశం వల్ల యూదా దానిని ప్రస్తావించటం వలననే ఆ వచనం లేఖనాలలో భాగమైంది.

 

ఆధార సూచిక (Cross-References)

యూదా 1: మత్తయి 13:55, మార్కు 6:3, అపో. కార్య. 12:17, కొలస్సి 1:13, 1 కొరింథీ 6:19,20

యూదా 2: 1 తిమోతి 1:2, 2 పేతురు 1:2

యూదా 3: 2 పేతురు 3: 14-18, 1 యోహాను 4:1, 1 తిమోతి 6:12

యూదా 4: గలతి 2:4, 2 తిమోతి 3:4,5, 2 పేతురు 2:1

యూదా 5: సంఖ్యా.14:35, 1 కొరింథీ 10:5, హెబ్రీ 3:16

యూదా 6: 2 పేతురు 2:4, యెహెజ్కేలు 28:15-17, యెషయా 14:12-15

యూదా 7: ఆది. 18:20, ఆది. 19:5, 2 పేతురు 2:6-7

యూదా 8: ఎఫెసీ 4:19, రోమా 13:7

యూదా 9 : దానియేలు 10:21; 12:1

యూదా 10 : 2 పేతురు 2:12, 1 కొరింథీ 2:14, కీర్తన 73:11

యూదా 11: 1 యోహాను 3:12, సంఖ్యా. 31:15-16

యూదా 12: 2 పేతురు 2:13, 17

యూదా 13: మత్తయి 7:21-23,

యూదా 14-15: మత్తయి 16:27,

యూదా 16 : 1 కొరింథీ 10:10, 2 పేతురు 2:10

యూదా 17: హెబ్రీ 2:3, 2 పేతురు 3:2

యూదా 18: 1 తిమోతి 4:1, 2 తిమోతి 3:1-5, 2 పేతురు 3:3

యూదా 19 : 1 కొరింథీ 2:14

యూదా 20 : ఎఫెసీ 6:18, కొలస్సీ 2:7

యూదా 21 : తీతు 2:13,

యూదా 22: గలతి 6:1, యాకోబు 5:19-20

యూదా 23 : 2 కొరింథీ 5:11

యూదా 24: 2 కొరింథీ 4:14, 1 పేతురు 4:13

యూదా 25 : రోమా 11:36, 1 తిమోతి 1:17

 

Add comment

Security code
Refresh

Comments  

# RE: యూదా పత్రిక వ్యాఖ్యానంBalakrishna 2019-10-25 07:46
Chala bagundhi brother
Meku Prabhu perita na Vandhanamulu teliya jeyuchunananu
Meku avakasham vunte enka pathrikala gurunchi teliyajeya galaxy
Praise the Lord brother
Reply
# nice bookvijay 2019-10-29 22:36
This book is Very useful book
Reply
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.