నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి.
యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.
తమ గొఱ్ఱెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.
జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును.
మీరు గొఱ్ఱలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు.
కొదమ సింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను, అవి అతని దేశము పాడుచేసెను, అతని పట్టణములు నివాసులులేక పాడా యెను.
వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచి యుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.
చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరియేడి?
వారు కూడి సింహములవలె బొబ్బరింతురు సింహముల పిల్లలవలె గుఱ్ఱుపెట్టుదురు.
ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును,నఫ్తాలీ దేశ మంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.
హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి . గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను .
ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో నుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి
తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.
మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని
యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి
తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి
చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి.
అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,
వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.
వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి.
మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.
కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.
అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.
ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగబడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకుడాయెను.
ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక
తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.
రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సరమందు , ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు , అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను .
మూడు సంవత్సరములు పూర్తియైన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా యేలుబడిలో ఆరవ సంవత్సరమందు , ఇశ్రాయేలు రాజైన హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను .
తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విన నివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబ డక అతిక్రమించి యుండిరి.
అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను .
రాజైన హిజ్కియా యేలుబడిలో పదు నాలుగవ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణము లన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా
అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.
రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత... అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొరబడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.
సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధము చేయనుద్దేశించి యున్నాడని హిజ్కియా చూచి
పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి,తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.
బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుకనేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారుచున్న కాలువను అడ్డిరి.
మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.
జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను
మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.
మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమి్మకయుంచిరి.
ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను
అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమి్మ మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు?
కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?
ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసివేసినవాడుకాడా?
నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?
మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?
కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి,యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.
అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.
అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.
అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.
మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.
రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా
యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.
ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున
అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందువలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.
కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.
యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపువారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదానుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్షూరు రాజును నీమీదికి రప్పించును.
ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును.
అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును.
ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజుచేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.
కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లి పారును.
అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును.
అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.
భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.
హిజ్కియా రాజుయొక్క పదు నాలుగవ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణము లన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను .
అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను . వారు చాకి రేవు మార్గమందున్న మెరక కొలను కాలువయొద్ద ప్రవేశింపగా
హిల్కీయా కూమారుడును రాజు గృహ నిర్వాహకుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును , రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి .
అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి మహా రాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?
యుద్ధవిషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే . ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?
నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును . ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికందరికి అట్టివాడే.
మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.
కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండు వేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను .
లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు ? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే .
యెహోవా సెలవు నొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా ? లేదు ఆ దేశము మీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.
ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము , ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట లాడకుమని రబ్షాకేతో అనగా
రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా ? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారము మీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి
గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను మహా రాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి . రాజు సెలవిచ్చునదేమనగా
హిజ్కియాచేత మోస పోకుడి ; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు .
యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును ; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే .
హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింప వలదు ; అష్షూరు రాజు సెలవిచ్చునదేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.
అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు , అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు .
ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా ? హమాతు దేవత లేమాయెను ?
అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవత లేమాయెను ? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా ?
యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.
అయితే అతనికి ప్రత్యుత్తర మియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తర మియ్యక ఊరకొనిరి .
గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును , శాస్త్రియగు షెబ్నాయును , రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి .
యూదారాజైన సిద్కియా యేలుబడియందు తొమి్మదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చిదాని ముట్టడివేయగా
సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమి్మదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.
యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతు లందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.
అయితే కల్దీయుల సేనవారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోనురాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి
బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.
అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.
కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.
బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను, మమ్మును వట్టికుండవలె ఉంచియున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.
నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాకయని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును.
సిద్కియా యేలనారంభించినప్పుడు అతడు ఇరువది... యొక్క సంవత్సరములవాడు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను, అతని తల్లిపేరు హమూటలు; ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె.
యెహోయాకీము దినములలో బబులోనురాజైన నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా
యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.
మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటను బట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.
అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.
యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించినదానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.
బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.
యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.
అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.
వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.
అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజునొద్దకు రాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.
మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.
అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.
అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.
ఏడు వేలమంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.
మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.
సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.
అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయాయొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీముయొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.
యూదావారిమీదను యెరూషలేమువారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమునుబట్టి తన సముఖములోనుండి వారిని తోలివేయుటకై బబులోనురాజు మీద సిద్కియా తిరుగబడెను.
అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.
యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.
ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి
అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారు పేరుపెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొని పోయెను.
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత
అతని మీదికి బబులోనురాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.
మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను.
యెహోయాకీము చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటను గూర్చియు, అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.
యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను
ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను.
సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొక టేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.
అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.
మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.
అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.
వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన
పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి ¸యవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు ¸యవనులయందైనను,యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు.దేవుడు వారినందరిని అతనిచేతి కప్పగించెను.
మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.
అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడుచేసిరి.
ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.
యిర్మీయాద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతి దినముల ననుభవించెను.
పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను
పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక.
నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికర పడక వృద్దుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి .
రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి , వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను .