నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ , నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ , భయ పడకుము .
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.
నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.
మరియు యెహోవా సెలవిచ్చునదే మనగానా సేవకుడవైన యాకోబూ, భయపడకుము; ఇశ్రాయేలూ, విస్మయమొందకుము,నేను దూరముననుండు నిన్నును, చెరలోనికి పోయిన దేశముననుండు నీ సంతానపువారిని రక్షించుచున్నాను; బెదరించువాడు లేకుండ యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును.
యెహోవా వాక్కు ఇదేనిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూలనాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను, అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండనే నిన్ను మితముగా శిక్షించుదును.
యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను .
నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరు గకమునుపే దానిని నీకు ప్రకటించితిని
ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటిపడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.
ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను
హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను
అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను.
అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.
యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.
యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.
రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచముమీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచముమీది కెక్కెను.
షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.
వారికోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.
యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.
ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును.
ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.
అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును.
దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును.
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను.
బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.
విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.
యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను
క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును
నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.
బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.
ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.
మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన... ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను.
మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల
మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,
మీ ద్రాక్షపండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండచేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;
మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.
మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.
మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును.
నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.
నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.
మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక
నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,
నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;
నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.
ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.
మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.
మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును.
మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.
మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతానరహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.
శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల
నేనుకూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.
మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.
నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తిపొందరు.
నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల
నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.
నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.
నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడుచేసెదను; మీ సువాసనగలవాటి సువాసనను ఆఘ్రాణింపను.
నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.
జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.
మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.
అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.
మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.
తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేకపోయెదరు.
మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.
మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.
వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు
నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,
నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.
వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు.
అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.
నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.
యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.
మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని, యే స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల
మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.
అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.
ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల
నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.
నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు;
నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱ మేకల మందలు దీవింపబడును;
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.
నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హతమగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరివచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.
నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును.
భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు.
మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.
యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు
నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి
అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రిందివాడవుగా ఉండవు.
నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.
పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;
నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;
నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱ మేకల మందలు శపింపబడును;
నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.
నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.
నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింపజేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.
యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.
యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.
యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.
నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.
యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.
వెఱ్ఱితనముచేతను గ్రుడ్డితనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.
అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించువాడెవడును లేకపోవును,
స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.
నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱ మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు.
నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.
నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.
నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.
యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడలమీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును.
యెహోవా నిన్నును నీవు నీమీద నియమించుకొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమునకప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు
యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.
విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చుకొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.
ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.
ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.
కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.
మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.
నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.
నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.
మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.
నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు
గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.
యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,
క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటాక్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పించును.
నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.
మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.
అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.
మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్యయెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున
అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలినదేమియు ఉండదు.
నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును
అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారముచేతను నేలమీద తన అరకాలు మోపతెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటియెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తెయెడలనైనను కటాక్షము చూపకపోవును.
నీవు జాగ్రత్తపడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల
యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునైయుండును.
నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.
మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు.
కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు.
దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.
ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.
నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.
నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.
మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.
మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింప బడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు .
ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ; ఇదే యెహోవా వాక్కు .
పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞఇచ్చియున్నాడు.
అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమం దున్నాడు , అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను . తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా
మరియు రాజు -ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే ; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను .
షద్రకును , మేషాకును , అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి -నెబుకద్నెజరూ ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు .
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్ని గుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును ; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను
రాజా , నీ దేవతలను మేము పూజిం పమనియు , నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరిం పమనియు తెలిసికొనుము .
అందుకు నెబుకద్నెజరు అత్యా గ్రహము నొందినందున షద్రకు , మేషాకు , అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.
మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా
వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి.
రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.
షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా
రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి-మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడిగెను. వారురాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి.
అందుకు రాజు-నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.
అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి-షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.
అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.
నెబుకద్నెజరు -షద్రకు , మేషాకు , అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు ; ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను . వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్క రింపకయు , ఏ దేవుని సేవిం పకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి .
తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు , నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు ; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును ; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును .
ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు , చూడ నైనను విన నైనను గ్రహింప నైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచ లేదు .
కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను ; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ .
ఈ వాక్య భావమేమనగా , మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను .
టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి .
ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును .
బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని
మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి .
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను .
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి , సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను . రాజా , నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయ౦దురని వారితొ చెప్పెను.
అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.
మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని,
తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు.
ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
ఇంత గొప్పసాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.
ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు .
నేను యెహోవాను , మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు .
తూర్పుదిక్కునుండి పడమటిదిక్కువరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలిసికొనునట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు
చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు.
అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.
కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు .
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?