ప్రశ్నోత్తరాలు

Was the name of God known as Jehovah before Moses?

 నిర్గమకాండము 6:2,3 మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యెహోవాను; "నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు".

ఈ సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఆయన - సర్వశక్తిగల దేవుడనే పేరుతోనే వారికి (పితరులకు) ప్రత్యక్షమయ్యాను తప్ప, యెహోవా అనే నా నామాన్ని వారికి తెలియచెయ్యలేదని చెబుతున్నాడు. కానీ, పితరులంతా యెహోవా అనే నామంలోనే దేవుణ్ణి సంబోధించి ఆయనకు ప్రార్థన చేసినట్టు లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి.

ఆదికాండము 4:26  మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు "యెహోవా నామమున" ప్రార్థన చేయుట ఆరంభమైనది.

ఆదికాండము 9: 26  మరియు అతడు "షేము దేవుడైన యెహోవా" స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.

ఆదికాండము 12:8 అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి "యెహోవా నామమున" ప్రార్ధన చేసెను.

ఆదికాండము 26: 25‌  అక్కడ అతడొక (ఇస్సాకు) బలిపీఠము కట్టించి "యెహోవా నామమున ప్రార్థన చేసి" అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.

ఆదికాండము 28: 16 యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియక పోయెననుకొని-

ఈ వచనాలను బట్టి, మోషేకంటే ముందున్న పితరులకు యెహోవా అనే నామం ఖచ్చితంగా తెలుసు. మరి నిర్గమకాండము 6:2,3 వచనాలలో ఆయన యెహోవా అనే నా నామం పితరులకు తెలియదని ఎందుకు చెబుతున్నట్టు? కొందరు ఈ ప్రశ్నకు సమాధానంగా, వాస్తవానికి పితరులెవ్వరికీ యెహోవా అనే నామం తెలియదనీ, మోషే ఆదికాండాన్ని రాస్తున్నపుడు తానే పితరుల విషయంలో ఆ పేరును  ప్రస్తావించాడని చెబుతుంటారు, (ఎందుకంటే అప్పటికి మోషేకు ఆ పేరు తెలిసిందిగా) కానీ ఈ సమాధానం సరైనది‌ కాదు. ఎందుకంటే మనం చూసిన సందర్భాలలో పితరులు ఖచ్చితంగా యెహోవా అనే నామంలో ప్రార్థన చేస్తున్నారు, ఆ పేరుతోనే ఆయనను సంబోధిస్తున్నారు.

కాబట్టి ఈ ప్రశ్నకు అసలైన సమాధానం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం "యెహోవా నామము" అన్నపుడు, దానిని అన్ని సందర్భాలలోనూ పేరు (శబ్దం)గా భావించకూడదు.

ఉదాహరణకు:
నిర్గమకాండము 34:5  మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.

ఈ సందర్భంలో, దేవుడు మేఘములో దిగి మోషేకు యెహోవా అనే తన నామాన్ని ప్రకటించినట్టు రాయబడింది. అయితే అప్పటికే మోషేకు యెహోవా అనే నామం తెలుసు. మరి తెలిసిన నామాన్నే ఆయన ఎందుకు మరలా ప్రకటిస్తున్నట్టు? అందుకే ఆ క్రింది వచనాలను మనం పరిశీలించినపుడు, దేవుడు తన గుణలక్షణాలను అతనికి ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది.

నిర్గమకాండము 34:6,7  అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.

మరొక సందర్భాన్ని చూడండి -

యోహాను 17: 26  నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి "నీ నామమును తెలియజేసితిని", ఇంకను తెలియజేసెదనని చెప్పెను.

ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు దేవుని నామాన్ని తెలియచేసానని ప్రార్థిస్తున్నాడు, పైగా ఇంకా తెలియచేస్తాను అంటున్నాడు.

యేసుక్రీస్తు గురించి బైబిల్లో రాయబడినంతమట్టుకు ఆయన ఎక్కడా కూడా యెహోవా అనే పేరును ప్రకటించలేదు. ఎందుకంటే ఆయన కాలానికి యూదులు "యెహోవా అనే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదన్న ఆజ్ఞను దృష్టిలో పెట్టుకుని (ద్వితీయోపదేశకాండము 5:11)" ఆ పేరును ఉపయోగించడం మానేసారు. దానికి బదులు వారు దేవుణ్ణి "ఏలోహీం, అదోనాయ్" (ప్రభువు) అని పిలిచేవారు. శిష్యులకు ఈ చరిత్ర గురించీ యెహోవా అనే పేరు గురించీ బాగా తెలుసు. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రకటించిన తండ్రి నామం ఏంటి?  ఆయన తన పరిచర్యలో తండ్రియొక్క గుణలక్షణాలను తన శిష్యులకూ, ప్రజలకూ నిర్విరామంగా ప్రకటించాడు. ఆ గుణలక్షణాలనే ఆయన తన ప్రార్థనలో తండ్రి నామంగా ప్రస్తావించాడు.

మనం చూసిన ఈ రెండు ఆధారాలను బట్టి, దేవుని నామము అన్నపుడు ఆయన గుణలక్షణాలను కూడా తెలియచేస్తుందని అర్థమౌతుంది. ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆయన మోషేతో "నీ పితరులకు యెహోవా అనే నా నామం తెలియబడలేదని" పలికిన మాటలను ఆలోచిస్తే, యెహోవా అనే నామానికి ఉన్నవాడని మరియు మాట ఇచ్చి నెరవేర్చేవాడని అర్థం.

యిర్మీయా 33:2 - "మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు."

ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనపుడు సర్వశక్తిమంతుడిగా వారికి అగుపించి, వారి సంతానానికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసాడు. కానీ ఆ నెరవేర్పును (మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా) వారు చూడలేదు. దానిని కేవలం మోషే/అతని తరంవారు‌ మాత్రమే చూస్తున్నారు. దీని గురించే ఆయన మోషేతో, యెహోవా అనే నా నామం (మాట ఇచ్చి నెరవేర్చువాడను) వారికి తెలియబడలేదని ఆ సందర్భంలో  చెబుతున్నాడు.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.