పాత నిబంధన

రచయిత: పి. శ్రావణ్ కుమార్

విషయసూచిక

  1. పుస్తక పరిచయం
  2. వచన వ్యాఖ్యానం
  3. 1:1 , 1:2 , 1:3 , 1:4, 1:5 , 1:6 ,1:7 , 1:8 , 1:9 , 1:10 , 1:11 , 1:12 , 1:13 , 1:14,1:15,1:16 , 1:17,1:18 , 1:19 , 1:20 , 1:21.

  4. ఈ గ్రంథానికి సంబందించిన అభ్యంతరాలు


పుస్తక పరిచయం

ఈ గ్రంథం యొక్క శీర్షిక (Title) "ఓబద్యా' అని తెలుస్తుంది, అయితే ఈ గ్రంథానికి లాటిన్ బైబిల్ లోను మరియు అరబిక్ బైబిల్ లోను 'ఓబద్యా ప్రవచనం' అనే శీర్షిక ఇవ్వబడింది. హీబ్రూ అనువాదంలో ఇది 'ఓబద్యా గ్రంథం' (The Book of Obadiah) అని పేర్కొనబడింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక ప్రవచనం అనేది ఈ గ్రంథం మొదటి వచనంలోనే మనకు స్పష్టంగా అర్థం అయిపోతుంది.

ఈ ప్రవచనం ఓబద్యాకు దేవుడు తెలియజేసాడు. ఓబద్యా అనే పేరు సర్వసాధారణమైన పేరు గనుక పాత నిబంధనలో ఓబద్యా అని పేరు కలిగినవారు చాలామంది ఉన్నారు. వారిలో ఈ ప్రవక్త అయిన ఓబద్యా ఒకడు కాకపోవచ్చు. ఓబద్యా అని పిలువబడిన వ్యక్తుల జాబితా ఇక్కడ చూద్దాం:

1) అహాబు యొక్క గృహనిర్వాహకుడగు ఓబద్యా (1 రాజులు 18:2)

2) దావీదు వంశస్థుడు (1 దినవృత్తాంతములు 3:21)

3) ఇశ్శాఖారు గోత్రములలో ఒకడు (1 దినవృత్తాంతములు 7:3)

4) బెన్యామీను వంశస్థుడు (1 దినవృత్తాంతములు 8:38)

5) ఒక లేవీయుడు (1 దినవృత్తాంతములు 9:16)

6) పరాక్రమశాలులైన గాదీయులలో ఒకడు (దావీదుతో ఉన్న ఒక యుద్ధవీరుడు) (1 దినవృత్తాంతములు 12:9)

7) దావీదు సమయంలో జెబూలూను గోత్రానికి అధిపతి (1 దినవృత్తాంతములు 27:19)

8) ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక పెద్ద/యూదా గోత్రానికి ఒక నాయకుడు (2 దినవృత్తాంతములు 17:7)

9) యోషీయా రాజు యేలుబడిలో, యెరూషలేము మందిరంలో పనిచేసిన లేవీయుడు ( 2 దినవృత్తాంతములు 17:7)

10) బబులోను చెరలో నుండి ఎజ్రాతో పాటు బయటకు వచ్చిన నాయకులలో ఒకడు (ఎజ్రా 8:9)

11) నెహెమ్యా సమయంలో పనిచేసిన ఒక యాజకుడు (నెహెమ్యా 10:5)

12) నెహెమ్యా సమయంలో ఉన్న ఒక ద్వారపాలకుడు (నెహెమ్యా 12:25)

13) ఈ ప్రవచనాన్ని రచించిన ప్రవక్త (ఓబద్యా 1:1)

ఓబద్యా గ్రంథం, ఎదోము గురించిన ప్రవచనం. ఎదోము అనగా ఏశావు సంతానము, ఏశావు యాకోబు సహోదరులు (ఇస్సాకు కుమారులు). ఎదోము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని, దేవుడు వద్దన్నవారినే వివాహం చేసుకొని (ఇద్దరు కానాను స్త్రీలను), తన ఆశీర్వాదాలు దొంగిలించాడని తన తమ్ముడిని ద్వేషించి, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. అతని సంతానమైన ఎదోమీయులు (అనగా ఇశ్రాయేలీయులకు సహోదరులు), ఈ ప్రవచనంలో మనం చూస్తున్నట్టు, దైవభక్తి మరియు సహోదర ప్రేమ కలిగినవారు కాదు. వారు గర్వము, అహంకారము, దేవుని ప్రజలంటే లెక్కలేనితనం చూపించి, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు.

ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అనే దాని మీద అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటిలో రెండు బలమైనవిగా కనబడుతున్నాయి. ఈ గ్రంథం క్రీ.పూ 9వ శతాబ్దంలో రాయబడింది (849-842 B.C.) అని కొందరు వాదిస్తే, మరికొందరు క్రీ.పూ 6వ శతాబ్దంలో రాయబడింది (586 B.C.) అని వాదిస్తారు.

ఈ విధంగా చెప్పడానికి కారణాలు లేకపోలేదు. ఇది 9వ శతాబ్దంలో రాయబడింది అని చెప్పేవారు నమ్మే కారణాలు:

   a) ఈ గ్రంథం, క్రీ.పూ 9వ శతాబ్దంలో రచించబడిన గ్రంథాల వరుసలో ఉంచబడింది (ఆమోసు, హోషేయా, మీకా)

   b) ధ్వంసమైన ఆలయం గురించి ఓబద్యా ప్రస్తావించలేదు (586 B.C.)

   c) ఈ గ్రంథంలో పేర్కొనబడిన దేశాలు, యూదులు పరదేశులుగా చెదరగొట్టబడిన తర్వాతవి కావు, యూదులు బబులోను చెరలోకి వెళ్లక ముందు ఉన్న దేశాలు

   d) ఈ గ్రంథంలో పేర్కొనబడిన పాపాలు, తన సమకాలీయులైన క్రీ.పూ 9వ శతాబ్దపు ప్రవక్తలు పేర్కొన్న విధముగానే ఉన్నాయి.

అయితే ఈ గ్రంథం 6వ శతాబ్దంలో రాయబడింది అని చెప్పేవారు, ఈ విధంగా వాదిస్తారు

   a) ఈ గ్రంథంలో 11-14 వరకూ ఉన్న వచనాలు, 586 BCలో బబులోను చేత నాశనం చేయబడిన యెరూషలేము అంశానికి సరితూగుతుంది

   b) ఇదే దాడిలో బబులోనుకు సహాయంగా ఎదోము పోరాడింది (యెరూషలేముకు వ్యతిరేకంగా)

            i. యూదా పతనం చూసి సంతోషించడం (కీర్తన 137:7, విలాప 2:15-17; 4:21, యెహెజ్కేలు 36:2-6);

            ii. యూదా పతనంలో సహాయపడడం (యెహెజ్కేలు 25:12-14, యెహెజ్కేలు 35:1-15)

నేనైతే ఈ గ్రంథం 6వ శతాబ్దంలో రాయబడింది అని నమ్ముతాను.

ఆల్లెన్ రచించిన "Joel, Obadiah, Johan, Micah" అనే ది న్యూ ఇంటర్నేషనల్ కామెంటరీలో (The New International Commentary, P 142) ఓబద్యా గ్రంథాన్ని ఈ విధంగా విభాగించారు

A. ఎదోము యొక్క నాశనం (2-9)

  • ఎదోము పతనం (2-4)
  • ఎదోమును సంపూర్ణంగా పడగొట్టడం (5, 6)
  • ఎదోము మిత్రుల ద్రోహం (7)
  • జ్ఞానులను, యోధులను కోల్పోయిన ఎదోము (8, 9) 

B. ఎదోము చేసిన తప్పు (10-14, 15b) 

  • ఎదోము యొక్క క్రూరత్వం (10, 11)
  • ఎదోము చేసిన అపహాస్యం (12)
  • ఎదోము యొక్క అతిక్రమణ (13)
  • ఎదోము సహకారం మరియు ప్రతీకారం (14, 15b)

C. యెహోవా దినాన ఎదోము (15a, 16-21)

  • యెహోవా దినం (15a, 16)
  • శేషించినవారి పాత్ర (17, 21)
  • అగ్నివంటి యూదులు కొయ్యకాలు వంటి ఎదోమీయులు (18)
  • స్వతంత్రించుకున్న దేశం (19, 20)

వచన వ్యాఖ్యానం

“ ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు." ఓబద్యా 1:1

ఈ గ్రంథం ఎవరి ద్వారా రాయబడిందో ఈ వచనంలో మనకు తెలుస్తుంది. "ఓబద్యా" అనగా "యెహోవా సేవకుడు" లేదా "యెహోవా ఆరాధికుడు" అని అర్థం. బైబిల్ లో దాదాపు 13 మంది "ఓబద్యా" అనే పేరు కలిగినవారు ఉన్నారు.ఉదాహరణకు:

“అహాబు తన గృహనిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవాయందు బహు భయభక్తులుగలవాడై," 1 రాజులు 18:3

“జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జెకర్యాను నెతనేలును మీకాయాను .......బంపెను" 2 దినవృత్తా 17:7,8

 “యెహోవా మందిరమునందు పనిచేయువారికిని శిల్పకారులకును దానినిచ్చిరి........వారి మీది పైవిచారణకర్తలు ఎవరనగా, మెరారీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును...." 2 దినవృత్తా 34:11,12

పై వచనాలను బట్టి, ఓబద్యా అనే పేరు యూదులలో సర్వసాధారణంగా ఉండేది అని అర్థం అవుతుంది. అయితే ఈ గ్రంథాన్ని రచించిన ఓబద్యా వీరిలో ఒకడు కాకపోవచ్చు (మరిన్ని వివరాల కొరకు పత్రిక పరిచయం చదవండి). "ఓబద్యాకు కలిగిన దర్శనము chazon (హజోన్)" అనే మాటలతో ఈ ప్రవచన గ్రంథం ప్రారంభమౌతుంది . హీబ్రూ పద అధ్యయనాల ప్రకారం (hebrew word studies) ఈ పదానికి ఉన్న అర్థం, "కల, దృష్టి, కనఁబడునది, చూడగలుగునది" అని వివరించబడింది. ప్రవక్తల దర్శనం అంటే, దృశ్యరూపకంగా దేవుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలను బయలుపరచడం. ప్రవక్తలతో దేవుడు దర్శనాల ద్వారా కలల ద్వారా మాట్లాడేవాడు అని మనకు తెలుసు. ఈ గ్రంథంలో, ఓబద్యాకు దేవుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలియజేసాడు. అయితే దర్శనాలు ఎన్ని రకలుగా ఉన్నాయో చూద్దాం:

దర్శనం అనే పదానికి "చూడడం" అనేది ప్రథమ అర్థం అయినప్పటికీ, బైబిల్ లో మనం రెండు రకాలైన దర్శనాలను చూస్తాం -

1) కనిపించేది

2) వినిపించేది

యెహాజ్కేలు, దానియేలు మరియు ఇతర గ్రంథాలలో దేవుడు ఆ ప్రవక్తలకు దృశ్యరూపకమైన దర్శనాన్ని ఇచ్చాడు అని చూస్తాం. ఉదాహరణకు: యెహెజ్కేలు 12:27లో "నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు బహు కాలము జరిగినతరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు గదా". దీనిని బట్టి జరగబోయే విషయాలను దృశ్యరూపకంగా చూపించడం ఒక రకమైన దర్శనం అని తెలుసుకోవచ్చు.

మొదటి సమూయేలు గ్రంథం ౩వ అధ్యాయంలో, దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడి, ఏలీ కుమారుల దుష్టత్వాన్ని బట్టి ఏలీ యింటికి నిత్యమైన శిక్ష విధిస్తానని చెప్పాడు. ఇది సమూయేలుకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు కదా, ఇది దర్శనం ఎలా అవుతుంది అని మీరు సందేహపడుతున్నారా? అయితే, 1 సమూయేలు 3:15లో "తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను". ఇక్కడ చాలా స్పష్టంగా, సమూయేలు తనకు కలిగినది దర్శనం అని తానే చెప్తున్నాడు. అయితే దేవుడు తనకు దృశ్యరూపకంగా ఏమి చూపించలేదని, దేవుడు చేయాలనుకున్నది సమూయేలుకు వాక్కు రూపంగా బయలుపరిచాడని తెలుస్తుంది. దీనిని బట్టి రెండో రకమైన దర్శనం వాక్కు ద్వారా బయలుపరచడం అని అర్థం చేసుకోవచ్చు.

ఓబద్యాకు కలిగిన దర్శనము వాక్కురూపమైనది అని నా అభిప్రాయం, ఎందుకంటే ఇదే వచనంలో "యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను" అని రాయబడి ఉంది. దేవుని దగ్గర నుండి వచ్చిన సమాచారం ఓబద్యాకు కనబడలేదు గాని వినబడింది (అంటే దృశ్యరూపకంగా కాదు గాని, వాక్కు రూపమైనది).

"ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది", ఇది ఎదోము గురించి అనే విషయం మనకు తెలుస్తుంది. అసలు ఎదోము అంటే ఏంటి, అది ఎవరి పేరు అని ఆలోచిద్దాం. ఎదోము అనగా "ఎరుపు" అని అర్థం. ఇది ఏశావుకు పెట్టబడిన మరొక పేరు.

“ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి, నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్నదానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను" ఆది 25:29,30

ఏశావు ఎవరో మనకు తెలుసు. అతను యాకోబు సహోదరుడు (వీరు ఇస్సాకు కుమారులు). ఈ ఎదోమును గురించి అనగా "ఏశావు సంతతివారి గురించి" ప్రభువు పలుకుతున్న మాటలే ఈ ప్రవచనం.

"ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు" ఈ మాటలు ఎదోము మీదకు రాబోయే దేవుని ఉగ్రతను గురించి తెలియజేస్తున్నాయి. ఎదోమీయులు నమ్మిన రాజకీయమిత్రులే తమను వెన్నుపోటు పొడుస్తారు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడే ఎదోమీయుల మిత్రులని, తమకు శత్రువులుగా మలుస్తున్నాడు. తోటి రాజ్యాలవారినే ఎదోమీయుల మీదకు దండెత్తి వచ్చేలా చేస్తున్నాడు.

“నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు." ఓబద్యా 1:2

ఇక్కడ "నిన్ను అల్పునిగా చేసితిని" అని ఎదోము గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలను దేవుడు ఓబద్యా ద్వారా, ఎదోముకు తెలియజేస్తున్నాడు. ఎదోముని దేవుడు భవిష్యత్తులో నాశనం చేస్తాడు అని చెప్తున్నాడు. అలాంటప్పుడు "నిన్ను అల్పునిగా చేస్తాను" అని చెప్పాలి గాని, భూతకాలంలో జరిగిపోయినట్టుగా "నిన్ను అల్పునిగా చేసితిని" అని ఎందుకు చెప్తున్నాడు. ఇలాంటి భాషా శైలినే "ప్రవచనాత్మక పరిపూర్ణ కాలం" (prophetic perfect tense) అని పిలుస్తారు. అంటే ప్రస్తుత సమయంలో జరగబోయే విషయాల గురించి చెప్పిన ప్రవచనం, దేవుని దగ్గర నుండి వచ్చింది గనుక, అది నెరవేరడం ఎంత ఖచ్చితమో తెలియజేయడానికి, ఆ విషయాన్ని జరిగిపోయినట్టే ప్రవచిస్తారు.

ఎదోముని అల్పునిగా మాత్రమే గాక, "బహుగా తృణీకరించబడిన"వాడిగా చేస్తాను అంటున్నాడు. తమ చుట్టూ ఉన్న దేశాల దృష్టికి "అల్పునిగా" ఎదోముని దేవుడు చేస్తాడు. ఎదోమీయుల బలగాన్ని, సైనిక శక్తిని, దేవుడు బలహీనపరచి, ఇతర దేశాలవారు వీరిని చెరపట్టుకు పోయేలా చేస్తాడు.

దీనిని బట్టి, తమ గురించి తాము గొప్పగా అనుకునేవారు, ఇతరులు కూడా తమ గురించి అలానే అనుకుంటారు అని భావిస్తారు. అయితే ఇతరుల అభిప్రాయాలను విచారించినప్పుడు, తమ గురించి తాము పొరబడ్డామని గ్రహిస్తారు. ఈ విధంగా వారి గర్వం వారిని మోసం చేసి వధిస్తుంది.

“అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి."ఓబద్యా 1:3

ఎదోమీయులు తమ "హృదయపు గర్వము చేత మోసపోయారు" అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు గర్విష్ఠులను అసహ్యించుకుంటాడు అని, వారిని నాశనం చేస్తాడు అని మనకు తెలుసు. ఉదాహరణకు:

“అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యముగల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును."యెషయా 2:12

“యెహోవా ......... గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును."కీర్తన 31

“దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును"1 పేతురు 5:5

పై వచనాలు చాలా స్పష్టంగా దేవుడు గర్విష్ఠులను ఎంతగా అసహ్యించుకుంటాడో మనకు చూపిస్తున్నాయి. ఎందుకు ఎదోమీయులు గర్విష్ఠులుగా ఉన్నారు అని ఆలోచిస్తే, వారు "అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనులై" ఉన్నారు, తమను ఎవరు కిందికి పడద్రోయలేరు అని నిబ్బరంగా ఉన్నారు. ఎదోమీయుల నివాస స్థలాన్ని అర్థం చేసుకుందాం

“ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము." ఆది 36:8

“ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావుకిచ్చితిని." యెహోషువ 24:4

పై వచనాలను బట్టి ఏశావుకు మరొక పేరు ఎదోము అని, అతనే ఎదోమీయులకు తండ్రి అని అర్థమవుతుంది. దేవుడే ఎదోముకు "శేయీరు మన్యములను (mount seir)" స్వాధీనపరచుకొని, అందులో నివసించే కృపను అనుగ్రహించాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా (International Standard Bible Encyclopedia) ప్రకారం, శేయీరు మన్యము అనేది ఒకే పర్వతం కాదు, అది ఒక పర్వత శ్రేణి. ఈ పర్వతాలు దాదాపు, 2,000 నుండి 6,000 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ మన్య ప్రాంతం dead sea (దీనినే ఉప్పు సముద్రమని ఆది 14:3లో మనం చూడొచ్చు) మరియు ఆక్వాబా అగాథము మధ్యలో ఉంది.

ఇలాంటి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎదోమీయులు, వారి స్థితిని బట్టి బహుగా అతిశయించేవారు. దేవుడే ఆ ప్రాంతాన్ని తమ పితరుడైన ఏశావుకు ఇచ్చాడు అనే విషయం మరిచి, వారి బలాన్ని బట్టి అతిశయించేవారు. వారి హృదయపు గర్వం వారిని మోసం చేసింది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి నీ సంగతేంటి? మనల్ని మనం గొప్ప చేసుకున్నపుడు, అటువంటి గర్వం మనలో కలిగినప్పుడు, దేవుడు చాలా సులభంగా గర్వాన్ని అణిచివేస్తాడు. నువ్వు గర్వంతో ఉన్నావా? ఎదోమును గుర్తు తెచ్చుకో, దేవుని సన్నిధిలో తగ్గించుకో.

"నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని" అనుకునే వీరికి దేవుడు ఒక ఖచ్చితమైన సమాధానాన్ని తరవాత వచనంలో ఇస్తున్నట్టు మనం చూడగలం. ​

“పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు." ఓబద్యా 1:4

"ఇదే యెహోవా వాక్కు" అని ఓబద్యా చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అంటే, ఏ ప్రవచనాన్నైతే తానూ చెప్తున్నాడో, అది తన సొంత ఆలోచన కాదు అని, అది దేవుని బయలుపాటు మరియు నిర్ణయమని తెలియజేయడానికి ఇలా చెప్తున్నాడు. ఇది యెహోవా వాక్కు గనుక, ఈ మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని నొక్కి చెప్తున్నాడు. ఇంతకీ యెహోవా వాక్కు ఓబద్యాకు ఏమి బయలుపరిచింది?

"అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును" అని దేవుడు ఎదోమీయుల గురించి చెప్తున్నాడు. వారి నివాసం ఆకాశంలో ఉన్న, పక్షి రాజులాగ ఎంత ఎతైన శేయీరు మన్యములో వారు నివసించినా, దేవుడు వారిని ఖచ్చితంగా క్రింద పడేస్తాను అని తన మాటగా చెప్తున్నాడు. ఎదోముకు ఉన్న భౌగోళిక భద్రతను (geographical security) బట్టి, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటున్న ఎదోము, "యెహోవా నీకు (తన మాట వినేవారికి) ఆధారమగును" సామెతలు 3:26, అనే విషయాన్ని ఎరుగక, తమ సొంత జ్ఞానాన్ని బట్టి, తమ బలాన్ని, భద్రతను చూసుకొని గర్వపడుతున్నారు. వీరికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు.

ప్రియా సహోదరుడా/సహోదరీ, మరి నీ హృదయపు స్థితి ఎలా ఉంది? నీకు కలిగిన దేనినైనా చూసుకొని గర్వపడుతున్నావా? నీ సంపదని గాని, నీ పలుకుబడిని గాని, నీ అందాన్ని గాని, నీ జ్ఞానాన్ని గాని, మరి దేనినైనా చూసుకొని గర్వపడుతున్నావా? అయితే ఎదోమును చూడు, వారి పట్ల దేవుని తీర్పుని చూడు, దేవుడు గర్వాన్ని ద్వేషించే దేవుడు. తనయందు కాకుండా మరి దేనియందైనా నీకు భద్రత ఉంది అని నువ్వు అనుకుంటుంటే, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు.

“జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ............దేవుడు మనకు ఆశ్రయము" కీర్తన 62:8

“చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరుకొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు." ఓబద్యా 1:5

దేవుడు వారిని ఏ విధంగా నాశనం చేస్తాడు అనే విషయాన్ని ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట "నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు" (how are thou cut off-KJV/how you have been destroyed-ESV). దేవుడే ఎదోము మీదకు న్యాయమైన తీర్పును తీసుకొస్తున్నాడు అని మనం గ్రహించాలి. మనుషులు ఒక వేళ దోచుకోవాలంటే, వారు వారికి అవసరమైనంతవరకే దోచుకుంటారు కదా, కానీ దేవుడు తన శత్రువులకు తీర్పు తీర్చినప్పుడు, వారి నాశనం పరిపూర్ణమైనదిగా, దేవుడే ఈ విధంగా చేసాడు అని బాహాటంగా తెలిసే విధంగా ఉంటుంది. సోదోమ గొమొఱ్ఱాలు నాశనమైన తీరు చూస్తే, అలంటి నాశనం దేవుడు మాత్రమే తీసుకురాగలడు అని తెలిసిపోతుంది, అదే విధంగా ఎదోమును చూసినవారు ఎవరైనా ఇలాంటి నాశనం దేవుని శాపాన్ని బట్టే వీరికి సంభవించింది అని అర్థమైపోతుంది.

దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలను మనం పరిశీలిద్దాం, వారు ఏ విధంగా పడద్రోయబడ్డారో, నాశనానికి అప్పగించబడ్డారో ఈ క్రింది వచనాలలో తెలుసుకుందాం.

“తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?"యెషయా 14:12

“సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగగొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను."యిర్మీయా 50:23

“జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను"విలాపవాక్యములు 1:1

పై వచనాలలో "నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి" అని లూసిఫెర్ గురించి "బొత్తిగా పాడైపోయెను" అని బబులోను గురించి, మరియు "జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను?" అని ఇశ్రాయేలు గురించిన ప్రశ్నలను ప్రవక్తలు లేవనెత్తినట్టు చూస్తున్నాం. ఇది దేవుని సంపూర్ణమైన తీర్పుకు నిదర్శనం అని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదే ఎదోముకు కూడా జరిగింది.

జాన్ గిల్ (John Gill) అనే వ్యాఖ్యానకర్త ఈ విధంగా చెప్పాడు, "ఎదోము విషయంలో సంపూర్ణమైన నాశనం ఉంటుంది అని ఈ వచనం సూచిస్తుంది, అనగా ఎదోముని ధ్వంసం చేసే విషయంలో దేవుడు ఏ కోణాన్నీ విడిచిపెట్టలేదు."

“ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును." ఓబద్యా 1:6

ఈ వచనాన్ని బట్టి దేవుడు ఎదోము మీదకు తీసుకొచ్చే తీర్పులో ఒక భాగంగా ఆర్థిక సంక్షోభాన్ని కలగజేయబోతున్నాడు. "The Post-Exilic Prophets: Obadiah, Joel, Haggai and Malachi" అనే కామెంటరీ (Commentary by Dr. Bob Utley) లో "వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును" అనే మాటను ఈ విధంగా వ్యాఖ్యానించారు - వారు దాచిపెట్టిన ధనమంతయు అనే పదం పాత నిబంధనలో ఇక్కడ మాత్రమే వాడబడింది. ఎదోములో రాగి గనులు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉంది, ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. దీనిని బట్టి, దేవుడు ఎదోము యొక్క వాణిజ్య పలుకుబడిని తొలగించబోతున్నాడు అని అర్థం అవుతుంది.

ఎదోము ఈ లోకంలో తమ కోసం ధనాన్ని సమకూర్చుకున్నారు, అయితే తమ ధనం అని అనుకన్నవాటిని అన్నిటినీ దేవుడు తీసేస్తున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోండి "భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడనుండునో అక్కడనే నీ హృదయము ఉండును." (మత్తయి 6:19-21)

ఎదోమీయుల హృదయం తమకు కలిగినవాటి మీద మాత్రమే ఉంది, దేవుని మీద గాని, పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడంలో గాని లేదు. ప్రియ చదువరి, మరి నీ స్థితి ఏంటి? నువ్వు పరలోకంలో నీ కోసం దాన్ని సమకూర్చుకుంటున్నావా? ఈ లోకంలో నీ ధనం పాడైపోతుంది, అయితే ప్రభువు మాటలకు విధేయత చూపించి సంపాదించే ఆత్మీయ ధనం నిరంతరం నిలిచి ఉంటుంది.

“నీతో సంధిచేసిన వారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను." ఓబద్యా 1:7

ఎదోమీయులు పక్క రాజ్యాల రాజులతో సంధి చేసుకొని, తమకు ఎటువంటి అపాయము లేదని, తమ చుట్టూ ఉన్న సరిహద్దులలో ఎంటువంటి ప్రమాదము పొంచిలేదని భ్రమపడ్డారు. వారికి తెలియని విషయాన్ని, లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.

“మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు."కీర్తన 118:8,9

ఎదోమీయులకు వారితో ఉన్న స్నేహాన్ని "వారు నీయన్నము తిని" అనే మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత స్నేహంగా ఉన్నవారు, ఎదోము నుండి లాభాన్ని పొందుకున్నవారు, ఇప్పుడు ఎదోముకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబోతున్నారు. మనుష్యులను మాత్రమే నమ్ముట ఉత్తమమైన విషయం కాదు, యెహోవాను ఆశ్రయించుట మాత్రమే మేలు. ఎవరైనా దేవునిని ఆశ్రయదుర్గంగా చేసుకోకుండా మనుస్యులను లేదా రాజులను మాత్రమే ఆశ్రయిస్తారో వారి ఆశ నాశనం అవుతుంది. వారు నమ్మినవారే విరోధులై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. ఇందుకు భిన్నంగా "ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును" (సామెతలు 16:7)

ఎదోమీయులు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు, మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు, ఎవరిని ఆశ్రయిస్తున్నారు, మనుష్యులనా? రాజులనా? దేవునినా?

సంధి చేసినవారు, సమాధానంగా ఉన్నవారు "నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు" అని ఎదోముకు దేవుడు చెప్తున్నాడు. దేవునిని విసర్జించి, దేవుని ప్రజలకు హాని చేసేవారికి దేవుడు కూడా హాని చేస్తాడు అని చెప్పడానికి, దేవుడు ఎదోము మీదికి తీసుకువచ్చిన తీర్పు ఒక నిదర్శనం.

“ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు." ఓబద్యా 1:8

"ఆ దినమందు" అనే మాట, ఈ ప్రవచన నెరవేర్పు దినంగా, దేవుని ఉగ్రత కనపర్చబడే దినంగా మనం అర్థం చేసుకోవచ్చు. "ఆ దినమందు" ఏమి జరుగుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం, "ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును". ఈ మాటలు చెప్తుంది తానే అని దేవుడు గుర్తు చేస్తూ, ఇది యెహోవా వాక్కు అనే మాటను జోడిస్తున్నాడు. ఇది ఆ మాట నెరవేర్పు యొక్క ఖచ్చితత్వాన్ని మనకు తెలియజేస్తుంది.

ఎదోములోని "జ్ఞానులను" నాశనం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎదోము మీదికి నాశనం వచ్చినప్పుడు, శత్రువులు వీరిపై దండయాత్ర చేసినప్పుడు, సరైన సలహా ఇవ్వడానికి "జ్ఞానులు" ఎవ్వరూ లేకుండా పోతారు. అంటే దేవుడు జ్ఞానులను మరణానికి అప్పగిస్తాడు అని గాని, లేదా, ఎదోములోని జ్ఞానులు ఇచ్చే సలహాలను దేవుడు వ్యర్థపరుస్తాడు అని గాని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ "అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును. (కీర్తన 33:10)", అనే మాటలు అక్షరాలా సత్యమని దేవుడు రుజువు పరుస్తున్నాడు.

"ఏశావు పర్వతము" అనేది, శేయీరు మన్యములు అని మనం అర్థం చేసుకోవాలి. ఏశావు దీనిని స్వాధీనపరచుకోక ముందు హోరీయులు ఆ ప్రాంతంలో నివసించేవారు.

“పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి." ద్వితీయో 2:12

దేవుడు ఏ విధంగా అయితే హోరీయులను, ఎదోమీయుల చేతికి అప్పగించాడో, అదే విధంగా ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసిస్తున్న ఏదోమియులను కూడా దేవుడు శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడు.

యోబు చెప్పిన విధంగా దేవుడు ఎదోములోని "ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును." (యోబు 12:17)

“​తేమానూ, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వతనివాసులందరు హతులై నిర్మూలమగుదురు." ఓబద్యా 1:9

తేమాను ఎలీఫజు కుమారుడు (ఎలీఫజు ఏశావు కుమారుడు; ఆది 36:11). ఈ తేమాను పేరు మీదనే ఎదోములో ఒక పట్టణం ఉంది. bibleatlas.org ప్రకారం, "తేమాను అంటే "కుడి వైపున/దక్షిణపు ప్రాంతము", మరియు ఇది ఎదోము దేశంలోని ఒక పట్టణం పేరు". ఎదోములో కుడివైపు ఉన్న ప్రాంతాన్ని తేమాను అని పిలుస్తారు, అలానే అదే పేరుతో ఎదోములో ఒక పట్టణం కూడా ఉంది.

యోబు స్నేహితుడైన ఎలీఫజు తేమానులో నివసించేవాడు (యోబు 2:11), ఈ తేమాను ఎదోములో ఒక ముఖ్య పట్టణంగా ఉంది. యోబు కూడా ఎదోము ప్రాంతనివాసి అని కొందరు వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడతారు.

తేమానులో బహుశా బలాఢ్యులు ఉండి, ప్రతి యుద్ధానికీ కావలసిన ప్రణాళికల్ని వేసేవారేమో. అయితే దేవుడు వీరి మీదికి తీసుకొని రాబోయే నాశనాన్ని బట్టి ఈ బలాఢ్యులు కూడా విస్మయమొందుతారు అని చెప్తున్నాడు. ఒక్కసారిగా స్నేహితులు అనుకున్నవారు వీరిని మోసం చేసి, వీరి మీదికి వచ్చే శత్రులకు సహాయం చేస్తారు. ఇలాంటి ఒక రోజుని, ఆ దేవుని ఉగ్రత దినాన్ని చూసి తేమానులోని బలాఢ్యులు వ్యాకులపడతారు.

దేవుడు ఎదోము మీద తీసుకు రాబోయే ఉగ్రత ఎలాంటిదో ఈ క్రింది వచనాలలో గమనించండి

“ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైనవారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాసస్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును." యిర్మీయా 49:20

“ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు." యెహెజ్కేలు 25:13

“తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును." ఆమోసు 1:12

జాన్ కాల్విన్ (John Calvin) ఈ విధంగా చెప్పాడు "దేవుడు వారి శక్తిసామర్థ్యాలను నిరర్థకం చేసి, వారి బలాన్ని తొలగిస్తాడు; శారీరకంగానూ మానసికంగానూ బలహీనపరచి, వారి హృదయాలను విచ్ఛిన్నం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు వారికున్న బలాన్ని తీసివేయడం ద్వారా వారి విఫలం అయ్యి ఏమి చేయలేని స్థితిలోకి తీసుకొస్తాడు."

బలవంతులు మరణిస్తున్నప్పుడు, వారిని నమ్మి వారి మీద ఆధారపడినవారు కూడా నశిస్తారు. ఒక వేళ దేవుడు మన పక్షాన లేకపోతే బలవంతుల ఆశ్రయాన్ని కోరుకున్న మనకు ఎటువంటి రక్షణ ఉండదు. ఇక దేవుడు మనకు వ్యతిరేకంగా నిలబడితే, ఆ పరిస్థితి ఎంత దయనీయం.

దేవుని బిడ్డలకు ఉండే నిశ్చయత ఎలాంటిదో ఈ వచనాన్ని బట్టి మనకు తెలుస్తుంది "కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము." కీర్తన 20:7

“​నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు." ఓబద్యా 1:10

ఎదోమీయులు "అవమానము నొందటానికి" గల కారణాన్ని ఇక్కడ చూస్తున్నాం. వారు తమ సహోదరుడైన యాకోబు సంతతిని బలాత్కరించారు, అని ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు, ఎదోమీయుల పట్ల ప్రేమగా ప్రవర్తించమని యాకోబుకు ఆజ్ఞాపించాడు.

“శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవు చున్నారు, వారు మీకు భయపడుదురు; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు; ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్నెము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను." ద్వితీయో 2:4,5

“ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు." ద్వితీయో 23:7

చాలా స్పష్టంగా ఎదోమీయులు, యాకోబు సంతతికి సహోదరులని, వారిని ద్వేషించకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఎదోమీయులు మాత్రం దేవుని ప్రజలైన యాకోబు సంతతిని ద్వేషించారు. ఓబద్యా ఈ ప్రవచనం చేస్తున్న సమయంలో మాత్రమే కాదు, చారిత్రకంగా ఎదోము, ఇశ్రాయేలును ఎప్పుడూ ప్రేమించలేదు.

“ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్ద నుండి తొలగిపోయిరి. ​మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను." దినవృత్తాం 20:10-12

పై వచనంలో "శేయీరు మన్యవాసులతోను" అని ఎదోమీయుల గురించి చెప్పబడింది. మోషే సమయంలో సహితము, ఇశ్రాయేలీయులను ఏదోమీయులు తమ దేశం గుండా ప్రయాణించడానికి అనుమతించలేదు. వీటన్నిటిని పరిశీలిస్తే ఎదోమీయులు దేవుని ప్రజలు మరియు తమ సహోదరులైన ఇశ్రాయేలును ద్వేషించేవారు అని నిర్థారించవచ్చు. "నీవు చేసిన బలాత్కారమును" బట్టి అని ఈ వచనంలో ప్రవచించబడిన మాటను బైబిల్ వ్యాఖ్యానకర్తలు అనేకులు, ఎదోమీయులు బబులోనుకు సహాయపడ్డారు అని అభిప్రాయపడతారు. యూదులను 597BC లో బబులోనీయులు చెరపట్టరు, ఈ యుద్ధంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎదోమీయులు బబులోనుకు సహాయపడ్డారు.

ఎదోమీయులు తమ సహోదరుల పట్ల చూపిన ద్వేషభావానికి మరియు బలాత్కారానికి గాను దేవుడు ఎదోమీయులను "ఇకనెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు" అనే ప్రవచనాన్ని తెలియజేసాడు (దీనికి సంబంధించిన మరింత వివరణను, పుస్తక పరిచయ భాగంలో చూడగలరు).

మరి నీ స్థితి ఏంటి, నువ్వు దేవుని ప్రజలతో ఉన్నావా లేక దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావా. దేవుడు తన ప్రజలను వ్యతిరేకించేవారిని నిర్దోషులుగా ఎంచడు.

“​నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసికొంటివి గదా." ఓబద్యా 1:11

యూదుల మీదకు దేవుని ఉగ్రత వచ్చిన దినం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. బబులోనీయులు యూదావారి సంపదను, జనులను చెరపట్టుకుపోయిన దినం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు.

“ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను." 2 రాజులు 24:10,11

“మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొనిపోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరును లేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొనిపోయెను." 2 రాజులు 24:13,14

పై వచనాలలో నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి "యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును" పట్టుకొనిపోయాడు అని చూస్తున్నాం. ఈ సమయాన్నే ఓబద్యా "పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు" అని వర్ణిస్తున్నాడు.

ఆ దినాన్నే "యెరూషలేము మీద చీట్లువేసిన దినమందు" అని కూడా చెప్తున్నాడు. యూదావారిలో ముఖ్యంగా ఘనురాలైనవారిని పంచుకోవడానికి చీట్లు వేశారు. చెరపట్టబడినవారిని బానిసలుగా పంచుకోవడానికి చీట్లు వేసే పద్ధతి మనకు ప్రాచీన సంస్కృతిలో సాధారణంగా కనబడుతుంది. ఈ విషయాలనే ప్రవక్తల మాటల్లో చూద్దాం:

“అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానులనందరిని సంకెళ్లతో బంధించిరి." నహూము 3:10

“వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?" యోవేలు 3:3

అలాంటి దినాల్లో సహాయంగా ఉండాల్సిన సహోదరులు (ఎదోము) "పగవాడవై నిలిచాడు" అని చెప్తున్నాడు. యూదుల పక్షాన ఉండి పోరాడాల్సినవారు శత్రువులుగా తమని తాము కనబరచుకున్నారు. సహాయం చేయకపోవడం మాత్రమే కాకుండా, శత్రువులతో కలిసి ఆనందించారు, అందుకే ఓబద్యా "చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసికొంటివి గదా" అని అంటున్నాడు. ఎదోము లాగానే మన పరిస్థితి కూడా ఉందా? దేవుని ప్రజలు బాధపడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు వారిని ఎలాంటి దృష్టితో చూస్తున్నావు? నీ చేతనైన సహాయం చేస్తున్నావా?

“​నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశన దినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు; (వారి బాధకాలంలో నీవు గొప్పలు చెప్పుకోవడం అక్రమం) " ఓబద్యా 1:12

మొదటగా ఈ వచనాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్ లో చదివితే "do not boast in the day of distress" అనే మాటను కూడా ఈ వచనంలో చూస్తాం. ఆ మాట మనం సహజంగా వాడే తెలుగు బైబిల్ అనువాదంలో కనబడలేదు గనుక, నేను గ్రేస్ మినిస్ట్రీస్ వారు అనువదించిన తెలుగు బైబిల్ లో నుండి ఆ మాటను ఇక్కడ జత చేసి ( )లో ఉంచాను .

యూదులు దేవునికి అవిధేయులుగా ఉన్న కారణాన్ని బట్టి, దేవుడు వారిని నెబుకద్నెజరుకు అప్పగించాడు. దేవుడు తన ప్రజలుకు తమ పాపాన్ని బట్టి తీర్పు తీర్చినంత మాత్రాన, వారు పొందిన శ్రమను చూసి సంతోషించడాన్ని గాని ఆనందించడాన్ని గాని దేవుడు ఆమోదించడు. ఎదోమీయులు దేవుని తీర్పుకు గురైన యూదులను చూసి, వారి శ్రమలను చూసి, వారి దుస్థితిని చూసి "ఆనందమొందుతూ" "సంతోషిస్తున్నారు". ఇంగ్లీష్ బైబిల్ లో ఇదే వచనంలో మనం ఇంకొక మాటను చూస్తాం "do not boast in the day of distress". నా జనుల దుఃఖదినమందు నువ్వు గొప్పలకు పోవొద్దు.

దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు, వారి పాపాన్ని బట్టి తాత్కాలిక శిక్షను కలగజేసినప్పుడు, అన్యులైన ఇతరులు సంతోషింపవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, సొంత సహోదరుల నాశనాన్ని కోరుకున్నవారిగా ఉన్న ఎదోముకు దేవుని మాటలను ఈ విధంగా అన్వయించుకోవచ్చు:

“నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యెమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాని చూచును. నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును, అది నా కండ్లకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును." మీకా 7:8-10

నీ శత్రువులు నశించినప్పుడు కూడా నువ్వు సంతోషించవద్దు అని చెప్పిన దేవుడు, సొంత సహోదరులు నశించడాన్ని చూసి సంతోషించేవారికి తీర్పు తీర్చకుండా విడిచి పెడతాడా?

“నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సుననుల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వానిమీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో." సామెతలు 24:17,18

“​నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;" ఓబద్యా 1:13

"నా జనుల ఆపద్దినమున/వారి ఆపద్దినమున" అనే మాటను ఈ వచనంలో మూడుసార్లు వాడినట్టు చూస్తున్నాం. చాలా ఖచ్చితంగా అది యూదులకు ఆపద్దినము, యెహోవా యొక్క తీర్పు దినము, వారి అవిధేయతకు ప్రతిఫలము. అయితే ఆ ఆపద్దినములలో, ఎదోము వారు ఇశ్రాయేలీయుల "గుమ్మములలోనికి చొరబడి", "వారి బాధను చూసి సంతోషపడుచు", "వారి ఆస్తిని పట్టుకొన్నారు" అని ప్రవక్త తెలియజేస్తున్నాడు. బబులోనీయులతో పాటు యూదుల ఆస్తి మీద ఎదోమీయులు కూడా చేయి వేశారు అని మనం చూస్తున్నాం. ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నవారికి దేవుడు తీర్పు తీర్చడా?

“​వారిలో తప్పించుకొనినవారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదినమందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు." ఓబద్యా 1:14

ఈ వచనాన్ని మాథ్యూ హెన్రీ (Matthew Henry) ఈ విధంగా వ్యాఖ్యానించారు "యూదుల పైన కల్దీయుల దాడి విజయవంతంగా జరుగుతున్నప్పుడు, అనేకులు తమను తాము రక్షించుకోవడానికి పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు; ఎదోమీయులు నగరాలలోని కూడలిలో (అనేక త్రోవలు కలిసే చోట) నిలిచి, తమను తరిమేవారి (కల్దీయుల) ఉగ్రత నుండి తప్పించుకోవడానికి భయంతోనూ, వణుకుతోను విశ్వప్రయత్నం చేస్తున్న యూదులను పట్టుకునేవారు, కొందరు యూదులు పిరికితనంతోను అనాగరికంగా వారి ప్రాణాలను వారే తీసుకున్నారు, ఇంకొందరిని ఎదోమీయులు బందించి, తరుముతున్న కల్దీయులకు అప్పగించారు, ఎదోమీయుల పట్ల కల్దీయులు కృతజ్ఞత కలిగి ఉండేలా చేసుకోవడానికి ఈ విధంగా చేసారు."

ఎదోమీయుల గురించి దేవుడు ఈ విధంగా ఆమోసు ప్రవక్త ద్వారా పలికించాడు -

“యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను." ఆమోసు 1:11

దుర్మార్గులతో కలిసి, వారి దుర్మార్గపు క్రియలలో సహాయపడేవారు, ఆ దుర్మార్గులలో ఒకరిగా ఎంచబడతారు. అందుకే సొలొమోను "భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము" (సామెతలు 4:14) అని దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్పాడు.

“​యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును." ఓబద్యా 1:15

యెహోవాదినము (Day of the LORD) అనే మాట ప్రవక్తల గ్రంథాలలో చుస్తూ ఉంటాం. యెహోవా దినము అనగా దేవుని తీర్పు దినం, దేవుడు తన ఉగ్రతను చూపించే దినం. పాత నిబంధనలో అనేక రాజ్యాల మీద దేవుడు తన ఉగ్రతను కనబరిచాడు, ఉదాహరణకు ఎదోము, బబులోను, మరియు అస్సిరియా మొదలగునవి. అంతిమంగా యెహోవా దినం అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క "ధవళ వర్ణ సింహాసనపు తీర్పు" దినం అని కూడా అర్థం చేసుకోవాలి.

"యెహోవాదినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది" అని ప్రవక్త చెప్తున్నాడు. అంటే, యూదులను నాశనం చేసిన బబులోను, వారికి సహాయం చేసిన ఎదోము, అంత మాత్రమే కాకుండా అన్యరాజ్యాలైన మోయాబు, అమ్మోను, ఐగుప్తు, సిరియా మొదలగునవి. దేవుని నైతిక విలువలకు వ్యతిరేకంగా జీవిస్తున్న ఎవరైనా సరే వారు దేవుని తీర్పుకు లోనవుతారు. ఇక్కడ అన్యరాజ్యాల మీదకు రాబోయే దేవుని తీర్పుకు యెహోవాదినం నిదర్శనంగా ఉంది.

“ఐగుప్తీయులను........ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు." యిర్మీయా 9:26

ఈ వచనాన్ని జాన్ కాల్విన్ (John Calvin) ఈ విధంగా వ్యాఖ్యానించాడు "దేవుడు అమాయకులను భక్తిహీనుల చేతికి అప్పగించినప్పుడు, వారు దేవుని ప్రతినిధులైనట్టు తమను తాము ఎంచుకొని, తమకు ఇష్టమొచ్చినట్టు జరిగించొచ్చు (తాము చేసేదానికి ప్రతిఫలం పొందకుము అని ఎంచుకొని) అని భావిస్తారు. ప్రభువు వారిని విడిచిపెట్టినప్పుడు వారు దురుసుగా తయారవుతారు. ప్రవక్త ఇక్కడ చెప్పినదానిని పరిశీలిద్దాం - ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం సిద్ధం చేయబడిందని, మరియు భక్తిహీనులు ఏ క్రూరత్వం చేసినా అది తమ తలల మీదికి తిరిగి ఇవ్వబడుతుంది అని తెలుస్తుంది."

"మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును." (మత్తయి 7:2) అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏ కొలతతో అయితే ఎదోము యూదాను కోలిచిందో అదే కొలమానం చొప్పునే ఎదోము కూడా కొలువబడుతుంది. అందుకే యెహాజ్కేలు ఈ విధంగా ప్రవచించాడు.

“ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు." యెహెజ్కేలు 35:15

ప్రియా చదువరి, దేవునికి మరియు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించి, నువ్వు తప్పించుకుంటావు అని అనుకోకు, మారుమనస్సు లేకపోతే, నువ్వు యేసుక్రీస్తు పక్షాన లేకపోతే, దేవుడు ఆ రాజ్యాల మీదకు తీసుకొచ్చిన తీర్పు నీ మీదికి కూడా తీసుకొస్తాడు, ఆలోచించు.

“​మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇకనెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు." ఓబద్యా 1:16

"మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు" అనే మాటలో "మీరు" అని ఎవరిని సంభోదిస్తున్నారు అనే దానిపైన వ్యాఖ్యానకర్తలు రెండు ఉద్దేశాలను చెప్తుంటారు. వీటిని జాన్ గిల్ గారు సేకరించి సంక్లుప్తపరిచారు. కింది మాటలలో వీటిని చూద్దాం -

• కిమిచ్చి (Kimichi) అనే వ్యాఖ్యానకర్త ఈ విధంగా అన్నాడు "మీరు (ఎదోమీయులు) నా పరిశుద్ధ పర్వతం నాశనం అవ్వటాన్ని చూసి సంతోషించి విందు చేసుకున్నట్టు, ఇతర దేశాలు (సామ్రాజ్యాలు) నీ యొక్క భయాన్ని పానీయం చేస్తాయి.

• అబ్నేరు ఎజ్రా (Abner Ezra) అనే వ్యాఖ్యానకర్త ఈ విద్ధంగా అన్నాడు "మీరు (యూదులు) నా ఉగ్రతా పాత్రలోనిది త్రాగినట్టు, అన్ని దేశాలు దానిలోనిది (నా ఉగ్రతా పాత్ర) త్రాగుతారు."

దీనిని బట్టి ఈ వచనంలో ఉపయోగించబడింది "మీరు" అనే పదం "ఎదోము" గురించా, లేక "యూదా" గురించా అనే విషయంలో విబేధాలు ఉన్నాయి. అయితే ఈ క్రింది వచనం మనకు కొంచెం స్పష్టతను ఇస్తుంది.

“నీ ప్రభువగు యెహోవా తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలోనుండి తీసివేసియున్నాను నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారిచేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను." యెషయా 51:22,23

“అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేనివారి వలెనుండు ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యనివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు." యిర్మీయా 9:25,26

పై వచనాలను బట్టి, దేవునికి అవిధేయంగా ఉండడం వలన యూదా ఎలా అయితే దేవుని ఉగ్రత పాత్రలోనిది త్రాగిందో, అదే విధంగా సున్నతి లేను అన్యులు యూదులను హింసించిన కారణాన్ని బట్టి, దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు.

దేవుడు తన ప్రజలను కొంతకాలం వరకే తన ఉగ్రతకు గురిచేశాడు గాని, ఈ అన్యుల విషయంలో అయితే (ముఖ్యంగా బబులోనీయులు, ఎదోమీయులు) "ఇకనెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు".

దేవుని ప్రజలకు హాని చేసినవారికి ఇలాంటి తీర్పు వస్తే ఆయన నామాన్ని దూషించి, ఆయన వాక్యాన్ని ఘనహీనపరిచే నేటి సువార్త ప్రకటికుల మీదకు ఎలాంటి తీర్పు రాబోతుందో మనం ఊహించలేము.

“​అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, (అయితే సీయోను కొండమీద తప్పించుకొన్నవారు నివసిస్తారు. అది పవిత్రమైన కొండగా ఉంటుంది.) యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు." ఓబద్యా 1:17

ఈ వచనంలో కూడా నేను ( )లో పెట్టిన మాటలు గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు బైబిల్ అనువాదం నుండి తీసుకున్నవి. మన బైబిల్ అనువాదంలో ఈ సత్యం సరిగా అనువదించబడలేదు, "తప్పించుకున్నవారు సీయోను కొండ మీద నివసించడం" కాదు, గ్రేస్ మినిస్ట్రీస్ అనువాదంలో చెప్పినట్టు, "సీయోను కొండమీద తప్పించుకొన్నవారు నివసిస్తారు" (Upon mount Zion shall be deliverence).

"సీయోను కొండ" అనే మాటను ఆలోచిద్దాం. ఇది ఎక్కడ ఉంది? దీని విశిష్టత ఏంటి? ఇది దేనిని సూచిస్తుంది?

"సీయోను కొండ/కోట" అనే ప్రాంతంలో యెబూసీయులు నివాసముండేవారు. దావీదు వారితో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించాడు, దానికే "దావీదుపురమ"ని పేరు పెట్టబడింది.

“యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. " 2 సమూయేలు 5:7

“అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను." 1 దినవృ 11:5

"సీయోను కొండ" అనేది దావీదుపురం అని మాత్రమే కాకుండా, యెరూషలేము పట్టణాన్ని, మరియు యూదా సామ్రాజ్యాన్ని వివరించే ఒక పేరుగా చూపించబడుతుంది. ఇక్కడ ఓబద్యా "సీయోను కొండ" అని యూదులను మరియు యెరూషలేము పట్టణాన్ని సంభోదిస్తున్నాడు. "సీయోను కొండ ప్రతిష్ఠితమగును" అనే మాట ఇంగ్లీష్ అనువాదంలో "Upon mount Zion shall be deliverence" అని ఉంది. అంటే ఈ సీయోను కొండ అని సంబోదించబడిన ప్రాంతంలో విమోచన కలుగుతుంది. అంటే విమోచన యూదులకు, యెరూషలేము నివాసులకు కలుగుతుంది; అలానే "రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది" అని చెప్పిన యేసు క్రీస్తు మాటలకు ఈ ప్రవచనం నిదర్శనంగా ఉంది. రక్షణ యూదుల నుండే ఎందుకు వస్తుంది అంటే, రక్షకుడు యూదులలో నుండే వస్తాడు గనుక, అలానే రక్షణ సీయోనులో నుండి ఎందుకు వస్తుంది అంటే రక్షకుడు సీయోనులో నుండి వస్తాడు గనుక, అందుకే పౌలు పాత నిబంధన ప్రవచనాన్ని చూపిస్తూ "విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును" అనే మాటను చెప్పాడు.

"తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు" అనే ఈ మాట, దేవుని కృపకు నిదర్శంగా ఉంది. దేవుడు యూదులకు అనుమతించిన ఈ విపత్తు నుండి (బబులోనీయుల చెర), కొందరు తప్పించుకుంటారు అని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ "సీయోను కొండ" తప్పించుకున్నవారికి నివాసం ప్రాంతంగా, రక్షణ కలిగించే ప్రాంతంగా చూపించబడింది. ఇదే విషయాన్ని మనం ఈ కింది వచనంలో చూస్తున్నాం.

“ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును.........మీరు వచ్చియున్నారు" హెబ్రీ 12:22-24

"యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు" అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. చెరలోకి వెళ్లిన యూదులు బహుశా, మేము నాశనం అయిపోతుంటే ఇతర దేశాల మీదకు దేవుడు తీసుకొని వచ్చే తీర్పు మాకు ఎలా సంతోషాన్ని ఇస్తుంది? అని అనుండొచ్చు. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు ఎదోము మీద బబులోను మీద రాబోయే దేవుని ఉగ్రతను ప్రకటించిన ప్రవక్త, ఇక్కడ దేవుని తీర్పుకు గురైనప్పటికీ, యెరూషలేము, సీయోను పర్వతము సంపూర్ణంగా నాశనం అవ్వదు, తిరిగి దేవుడు తమ స్వస్థలాన్ని స్వతంత్రించుకునే కృపను వారికి అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు.

“​మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు." ఓబద్యా 1:18

ఇక్కడ "యాకోబు సంతతివారు" మరియు "ఏశావు సంతతివారు" అని ప్రవక్త చెప్పడం చూస్తున్నాం. ఇది బహుశా ఇశ్రాయేలువారు మరియు యూదా, బెన్యామీనీయులు అందరూ ఒకటిగా సమకూర్చబడే రోజు గురించి ఈ వచనం చెప్తుంది అని అర్థం చేసుకోవచ్చు. సొలొమోను కుమారుడైన రెహోబోము సమయంలో ఇశ్రాయేలు రెండు భాగాలుగా విడిపోయింది - యూదా మరియు ఇశ్రాయేలు (ఎఫ్రాయిము). ఇలా దాదాపు BC 922లో వేరైపోయిన ఈ 12 గోత్రాలు (10 గోత్రాలు ఇశ్రాయేలుగా, 2 గోత్రాలు యూదాగా) త్వరలో ఏకమవుతాయి అని ఈ ప్రవచనంలో చూస్తున్నాం. ఈ విషయాన్నే యెహాజ్కేలు ప్రవక్త మాటలలో చూద్దాం -

“నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము. అప్పుడది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునకయగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునక మీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారి తోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను. ఇట్లుండగా వారికీలాగు చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. "యెహెజ్కేలు 37:16-23

ఇలా ఏకమైన ఇశ్రాయేలు అగ్నిగాను, మంటగాను ఉంటారు అని ఓబద్యా చెప్తున్నాడు. అగ్ని మరియు మంట అనే మాటలు దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉన్నట్టు బైబిల్ లో అనేక చోట్ల మనం గమనించవచ్చు (ex: యెషయా 66:16, యిర్మీయా 15:14). దీనిని బట్టి ఇశ్రాయేలుని  దేవుడు సాధనంగా వాడుకొని, వేరొక జనాంగానికి తీర్పు తీరుస్తాడు అని తెలుస్తుంది. ఎవరు ఈ వేరే జనాంగం, అంటే "ఏశావు సంతతివారు" అని మనం ఇదే వచనంలో చూస్తున్నాం.

"ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు" అంటే, అగ్ని ముందు ఒక చెక్క లేదా చెక్క పొట్టుని పెడితే ఎలా దహించబడుతుందో, అదేవిధంగా ఇశ్రాయేలు అనే అగ్ని ముందు ఏశావు సంతతి దహించబడుతుంది. దేవుడు ఇశ్రాయేలు చేతికి, ఏశావు సంతతివారిని అప్పగించి వారిలో "ఎవడును తప్పించుకొనకుండ" నాశనం చేస్తాను అని చెప్తున్నాడు.

"ఎవడును తప్పించుకొనకుండ" - ఇదే మాట ఇంగ్లీష్ లో "there shall be no survivor for the house of Esau" అని చూడొచ్చు - అంటే సంపూర్ణంగా నాశనం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు, ఎదోము అనే పేరు లేదా ఎదోమీయులు అని పిలువబడేవారు ఇక ఎవరూ ఉండరు అని చాలా ఖచ్చితంగా ప్రవక్త దేవుని మాటలను తెలియజేస్తున్నాడు. ఈ ప్రవచనం చెరలోకి వెళ్లిన ఇశ్రాయేలుకు ఒక ఆదరణమాటగా కూడా ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులను హింసించినవారిని విడిచిపెట్టడు, తన ప్రజలకు విరోధులుగా ఉన్నవారిని తప్పక నాశనం చేస్తాడు అనే సారాంశాన్ని ఈ వచనం మనకు తెలియజేస్తుంది.

అయితే ఎదోమీయులు ఎలా సర్వనాశనం అయ్యారు, నిజంగా ఎదోమీయులు అని పిలువబడేవారు ఈ భూమి మీద నుండి కొట్టివేయబడ్డారా అని తెలుసుకోవడానికి ఈ పుస్తకం చివరిలో రెండవ ప్రశ్నను చుడండి (ఎదోము గురించి ప్రవచించిన విధంగా అది సర్వనాశనం అయ్యిందా?)

ఈ ప్రవచనానికి ఆత్మీయ నెరవేర్పు కూడా ఉంది, దీనిని జాన్ గిల్ (John Gill) ఇలా వ్యాఖ్యానించారు -

సువార్త ప్రకటన ప్రారంభమైన దినాలలో, యూదులు మరియు ఇశ్రాయేలీయులైన అపొస్తలులు, అన్యరాజ్యాలలోకి ప్రవేశించి, క్రీస్తు శత్రువుల మధ్య వాక్యాన్ని ప్రకటించారు. ఆ వాక్యం అగ్నిలా ఉండి, అందులోని నిజమైన తీర్పును లక్ష్యపెట్టినప్పుడు, అది మనుష్యుల యొక్క మనస్సాక్షిని వెలిగించి, హృదయాలను కరిగించి, వ్యామోహాలను దహించి, ఇంకను అది వారిని శుద్ధి చేసే అగ్నిగా వారిని పరిశుద్ధపరుస్తుంది. ఆలా కానీ పక్షంలో అది (దేవుని వాక్యం) అగ్నిలాగ వారికి కోపం పుట్టించి, పురికొల్పి, వేధించి, వ్యాకులపరుస్తుంది. ఏ కోణంలో అయినా అది నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉంది. దేవుని సువార్త యొక్క సంపూర్ణ నెరవేర్పు అంత్యక్రీస్తు నాశనంతో ముగుస్తుంది. ఇక్కడ అదే ఎదోముగాను ఏశావుగాను సూచించబడింది. మర్మమైన బబులోను...........మృగము మరియి అబద్ద ప్రవక్తలు అగ్నితో కాల్చబడతారు. ఆ రోజున ప్రభువే అగ్నిగా మండి, కొయ్యకాలు లాంటి దుష్టులను వేరుతో సహా దహించి వేస్తాడు గనుక, ఇక ఎవరును మిగలరు (దుష్టులు) (ప్రకటన 17:16, 18:8, 19:20; మలాకీ 4:2).

“​దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు," ఓబద్యా 1:19

దేవుని ప్రజలు, ఎదోమీయులను నాశనం చేయడం మాత్రమే కాకుండా, వారి ప్రదేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ప్రవక్త చెప్తున్నాడు. యూదా దేశం వారు ఏ ప్రాంతాలను స్వాధీనపరచుకుంటారో ఇక్కడ మనం చూస్తున్నాం, అవేవనగా-

  • ఏశావుయొక్క పర్వతము
  • ఫిలిష్తీయుల దేశము
  • ఎఫ్రాయిము మరియు షోమ్రోను భూములు
  • గిలాదు దేశము

    ఈ ప్రాంతాలను ఎవరు స్వతంత్రించుకుంటారో కూడా మనం చూడొచ్చు, వారు ఎవరంటే:

  • దక్షిణదిక్కున నివసించువారు (The Negev)
  • మైదానమందుండువారు (Shephelah)
  • బెన్యామీనీయులు

                                                          బైబిల్ హిస్టరీ ఆర్కియాలజీ ఆన్లైన్ వెబ్సైటు ప్రకారం (bible history archeology website), ఇజ్రాయెల్ దేశం 5 ప్రాంతాలుగా విభజించబడింది: a) తీర మైదానం, b) షెఫెలా (the Shephelah) (తీరానికి సమీపంలో లోతట్టు ప్రాంతాలు), c) నెగెవ్ (the Negev) (దక్షిణ దేశం), d) కొండ ప్రాంతం e) అరణ్యం. ఈ ప్రాంతాల విభజనను బట్టి, ఏ ప్రాంతంవారు ఎవరిని ఆక్రమించబోతున్నారో మనం అర్థం చేసుకోగలం.

    అయితే ఈ వచనం నుండి మనం నేర్చుకుంటున్న సారాంశం ఏంటి అంటే, చెదరగొట్టబడిన 12 గోత్రాలవారిని (ఇశ్రాయేలు మరియు యూదా) దేవుడు తమ దేశానికి తిరిగి తీసుకువస్తాడని, అంత మాత్రమే కాకుండా, చెరలోకి వెళ్లక ముందు ఇశ్రాయేలుకు ఉన్న భౌగోళిక ప్రదేశానికన్నా ఎక్కవ ప్రాంతాన్ని ఆక్రమించుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అని తెలుసుకుంటున్నాం.

    “మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెరపట్టబడినవారు సారెపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు." ఓబద్యా 1:20

    ఈ వచనంలో కూడా, ఇశ్రాయేలు ఆక్రమించుకోబోయే ప్రాంతాల గురించే ప్రవక్త మాట్లాడుతున్నాడు. "ఇశ్రాయేలీయుల దండు" గురించి చెప్తూ ఈ దండు ఎవరో కూడా వర్ణిస్తున్నాడు, "వారిలో చెర పట్టబడినవారు" అంటున్నాడు. ఇది వివిధ సమయాలలో చెరలోకి వెళ్లిన ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతుంది (12 తెగలు/12 tribes). వీరు "సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు" అని చూస్తున్నాం.

    ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడ వరకు ఆక్రమిస్తారు అంటే "సారెపతు వరకు" అనే మాటను చూస్తున్నాం. ఈ మాట వాడిన పద్ధతిని గమనిస్తే (సారెపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు), సారెపతు, కానాను దేశానికి సరిహద్దు పట్టణం (city on the borders of Canaan) అని గ్రహించొచ్చు. ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని ఆక్రమిస్తారు, ఎక్కడివరకు అంటే, సారెపతు వరకు అని ప్రవక్త చెప్తున్నాడు.

    బైబిల్ నుండి మనకు "సారెపతు" అనే ప్రాంతం గురించి తెలిసిన విషయాలను చూద్దాం:

    “అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము; ​నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా...." 1 రాజులు 17:8-10

    “ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు." లూకా 4:26

    అహాబు సమయంలో, మూడున్నర సంవత్సరాలు వర్షం కురవని కాలంలో, ఏలియాని దేవుడు సారెపతు అనే ఊరికి పంపించాడు, ఏలియా ఆ ఊరిలో కొంతకాలం ఉన్నాడు. సారెపతు ప్రాంతపు ప్రజలకి, ఇశ్రాయేలు దేవుని గురించి, ఆయన ప్రవక్తల గురించిన అవగాహన ఉన్నట్టు చూస్తున్నాం. (ఉదారణకు: "అందుకామె (సారెపతు విధవరాలు) నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని...").

    ఆక్స్ఫర్డ్ మరియు కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకారం (according to Oxford and Columbia Encyclopedia) సన్హెరీబు (అష్షురు రాజు), 701 లో b.c.e.లో కానాను మరియు ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సారెపతు అనే ఊరిని స్వాధీనపరచుకున్నాడు. జోసెఫస్ (మొదటి శతాబ్దపు యూదుడు మరియు చరిత్రకారుడు) సారెపతు అనే గ్రామాన్ని, సీదోను మరియు తూరు మధ్య గుర్తించాడు . యూసేబియస్ (క్రైస్తవ చరిత్రకారుడు) దీనిని "అత్యంత ప్రసిద్ధి గాంచిన గ్రామం"గా సూచించాడు. ఈ ప్రాంతానికి ఉన్న అరామిక్ పేరు "పొడవైన గ్రామం" అనే భావాన్ని ఇస్తుంది, బహుశా ఇది సముద్ర తీరం వెంబడి కొంత దూరం వరకు విస్తరించి ఉండవచ్చు.

    యెరూషలేమువారిలో చెరపట్టబడినవారు అనగా, నెబుకద్నెజరు చెరపట్టుకుపోయిన యూదా మరియు బెన్యామీను గోత్రంవారు, "దక్షిణదేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు" అని చూస్తున్నాం. అయితే వీరు ఎక్కడికి చెరపట్టబడి తీసుకుపోబడ్డారో ఇక్కడ చెప్పబడింది, అది "సెఫారాదునకు" అని గమనించగలం. ఈ "సెఫారాదు" గురించి, అనగా ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనే విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి. Bob utley, తాను రాసిన ఓబద్యా వ్యాఖ్యానంలో, ఈ ఆలోచనల సారాంశాన్ని ఈ విధంగా తెలియపరిచారు.

  • పెర్షియాలో ఒక ప్రాంతమైన లిడియా రాజధాని సెఫారాదు అని చెప్తారు, పెర్షియన్ శాసనాల్లో ఈ పదాన్ని(సెఫారాదు) ఉపయోగించారు (బ్లైక్లాక్ మరియు హారిసన్, ది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ ఆర్కియాలజీ, పే. 399)
  • లిబియా దగ్గరలో ఉన్న ఒక ద్వీపం
  • అష్షురు, సర్గోన్, మరియు ఎసార్హాడ్డన్ రాజుల శాసనాలు ఉన్నందున ఇది మెడిస్ (Medes) ప్రాంతానికి చెందింది అని చెప్తారు
  • ఈ ప్రాంతం స్పెయిన్ అని చెప్తారు (ఇది టార్గమ్స్, రబ్బీలు మరియు పెషిట్టా యొక్క వివరణ)
  • ఇది బోస్పోరస్ రాజ్యం (ఇప్పుడు ఇస్తాన్ బుల్) అనేది లాటిన్ వల్గేట్ బైబిల్ వివరణ
  • ప్రాచీన గ్రీకులో, స్పార్టా అనే ఒక పట్టణం (ఇది, 1 మక్కబీస్ ఆధారంగా కైల్ మరియు డెలిట్జ్ తమ వ్యాఖ్యానాలలో ఇచ్చిన వివరణ)

    అయితే స్పష్టముగా "సెఫారాదు" అంటే అక్షరాలా ఇదే ప్రాంతం అనే చెప్పే వీలు లేకుండా అనేక ఆలోచనలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, "సెఫారాదు" అనే ప్రాంతంలో చెరపట్టబడి ఉన్న యెరూషలేమువారు విడిపించబడి, తిరిగి వచ్చి దక్షిణపు ప్రాంతాన్ని స్వాధీనపరచుకుంటారు అని చూస్తున్నాం.

    “మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాదియగును" ఓబద్యా 1:21

    ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ వాడిన రెండు పదాలని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అవి "రక్షకులు", "రాజ్యము". అయితే ఈ పదాలను అర్థం చేసుకునే ముందు, అసలు ఈ వచనం ఏమి చెప్తుందో చూద్దాం. "సీయోను కొండమీద" రక్షకులు పుడతారు, వీరు ఏశావు యొక్క కొండకు తీర్పుతీరుస్తారు అని చూస్తున్నాం. ఇక్కడ "తీర్పుతీర్చడం" అని అనువదించబడిన హీబ్రూ పదం "šāpat" (సాపత్), ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది, చట్టపరమైన విషయాలను బట్టి తీర్పు తీర్చడం. రెండోది, అధికారం కలిగి ఉండడం, పరిపాలన చేయడం. ఈ వచనంలో ప్రవక్త వాడిన భావం, రెండోది అని మనం గమనించాలి. ఈ భావాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు చూద్దాం.

    “అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ("šāpat", సాపత్) ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. " న్యాయాధిపతులు 10:2

    “అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను ("šāpat", సాపత్)."న్యాయాధిపతులు 16:31

    పై వచనాలు మాత్రమే కాకుండా, 1 సమూయేలు 7:15, యెషయా 2:3 లో సహితం ఈ పదం వాడబడిన తీరు "అధికారం కలిగి ఉండడం, పరిపాలన చేయడం" అనే భావాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ 21వ వచనాన్ని మనం 18వ వచన భావంలో అర్థం చేసుకోవాలి. "ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు", "ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ....." అని చూస్తున్నాం. దీనిని బట్టి 18వ వచనంలో వివరించబడిని బాహ్యమైన ఎదోము రాజ్యం గురించి, అయితే 21వ వచనంలో ఏశావుయొక్క కొండ అని చెప్పబడినప్పుడు, ఇది ఏశావు మరియు అన్యజనుల రాజ్యాలకు సాదృశ్యం అన్నట్టుగా ఉంది.

    "అప్పుడు రాజ్యము యెహోవాది యగును" అనే మాటలో, "రాజ్యము" అని అనువదించబడింది హీబ్రూ ప్రదం mĕlūkâ (మేలూక), ఈ పదానికి "రాజ్యము" లేదా "ఆధిపత్యము" అనే అర్థాలు ఉన్నాయి. ఈ వచనంలో, యెహోవా దేవుడు అందరి మీద అన్నిటి మీద తన ఆధిపత్యాన్ని, రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి.

    “యెహోవా నిరంతరము రాజైయున్నాడు ఆయన దేశములోనుండి అన్యజనులు నశించిపోయిరి."కీర్తన10:16

    అయితే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న సమస్య ఏంటి అంటే, ఇది ఏ సమయం గురించి మాట్లాడుతుందో గ్రహించడం. ఈ వచనం భవిష్యత్తు కాలం గురించి మాట్లాడుతుందా, అనగా క్రీస్తు రాబోయే కాలం గురించి మాట్లాడుతుందా?, లేక ఇశ్రాయేలు బాహ్యంగా ఎదోమును నాశనం చేయబోయే సమయం గురించి మాట్లాడుతుందా?

    ఇదే వచనంలో, "రక్షకులు" అనే పదం mōšiʿîm (మోసియమ్) అనే హీబ్రూ పదం యొక్క అనువాదం. ఈ పదానికి, "విమోచకులు" "రక్షకులు" అనే అర్థాలు ఉన్నాయి. ఈ పదం "సహాయం చేయడం" "కాపాడడం" అనే మూలపదాల నుండి వచ్చింది. ఈ పదం Active Tense or Passive Tense లో ఉందా అని అర్థం చేసుకుందాం (ఇది అవసరం). సెప్తువజింట్ లో (Septuagint, అనగా మొదటి శతాబ్దంలో, యూదుల చేత గ్రీకులోకి అనువదించబడింది హీబ్రూ లేఖనాలు), ఈ పదాన్ని Passive Tenseలో అనువదించారు, అనగా ఈ వచనం ఈ విధంగా ఉంది "సీయోను పర్వతం నుండి రక్షించబడిన [లేదా విమోచించబడిన] మనుష్యులు ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి వెళతారు మరియు రాజ్యం ప్రభువుది అవుతుంది.

    అయితే హీబ్రూ బైబిల్ లో ఉన్న పదం Passive Tenseలో ఉపయోగించబడలేదు, అది Active Tenseలోనే ఉపయోగించబడింది అని కొందరు వ్యాఖ్యానకర్తలు వాదిస్తారు. కొన్ని బైబిల్ అనువాదాలు అనగా, NIV, NASB, ESV, KJV లో ఈ పదం "Active Tense" లో ఉన్నట్టు అనువదించారు (హీబ్రూ లేఖనాలలోని హీబ్రూ పదం ఇలానే ఉంది అనేది వీరి వాదన). అయితే NRSV, NET, Septuagint లు ఈ పదం "Passive Tense" లో ఉంది అని చెప్తారు.

  • ఆక్టివ్ టెన్స్ (Active Tense) లో ఈ వచనం "సీయోను కొండ మీద రక్షకులు" అని అనువదించబడింది
  • పాస్సివ్ టెన్స్ (Passive Tense) లో ఈ వచనం "సీయోను పర్వతం నుండి రక్షించబడిన [లేదా విమోచించబడిన] మనుష్యులు" అని అనువదించబడింది
  • ఏది ఏమైనప్పటికీ, ఆక్టివ్ టెన్స్ వాదనని ఉపయోగించేవారు ఈ వచనం యేసు క్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించబడే కాలం గురించి మరియు యేసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడ సమయం గురించి ప్రస్తావిస్తుంది అని చెప్తారు.
  • పాస్సివ్ టెన్స్ వాదనని సమర్థించేవారు, ఇది అక్షరాలా భౌగోళికంగా, ఎదోము గురించి, ఇశ్రాయేలీయుల గురించి మాత్రమే మాట్లాడుతుందిగాని ఎస్కటలాజికల్ (Eschatological) కోణం ఇందులో లేదు అని చెప్తారు.

    నేనైతే, ఓబద్యా గ్రంథం 17-21 వచనాలు, పాక్షికంగా చరిత్రలో నెరవేరాయని, అయితే ఇవి క్రీస్తు సమయంలో అనగా క్రీస్తు రెండవ రాకడలో పరిపూర్ణంగా నెరవేరతాయని నమ్ముతున్నాను (దేవుడు తన ప్రజలకు విమోచకులుగా ఎన్నుకోగల నిర్దిష్ట వ్యక్తులు; జెరుబ్బాబెల్, ఎజ్రా, మరియు నెహెమ్యా వంటివారు). నేను ఈ విధమైన అభిప్రాయానికి రావడానికి కారణం ఏంటి అంటే, ఈ వచనలో ప్రవచించబడినట్టు, ఇశ్రాయేలు చారిత్రకంగా ఎప్పుడూ ఆ ప్రదేశాలను స్వాధీనపరచుకోలేదు (ఉదాహరణకు: ఫిలిష్తీయుల దేశమును, ఎఫ్రామీయుల భూములను, సారెపతు వరకు కనానీయుల దేశమును, దక్షిణదేశపు పట్టణములను)

    చారిత్రకంగా, ఇశ్రాయేలీయులు కొంతవరకు ఎదోమును చెరపట్టారు, స్వాధీనపరచుకున్నారు. అయితే ఈ వచనంలో అనువదించబడిన "రక్షకులు" అనే మాట, అనగా "ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు" అనే వచనం, భవిష్యత్తులో రాబోయే అపొస్తలులు కావచ్చు (ఓబద్యా సమయానికి, క్రీస్తు మొదటి రాక భవిష్యత్తే), లేదా రెండవ రాకడలో క్రీస్తు మరియు తనతో వచ్చే తన అనుచరులు కావచ్చు.

    ఈ గ్రంథానికి సంబందించిన అభ్యంతరాలు

    ఓబద్యా, యిర్మీయా 49వ అధ్యాయాన్ని అనుకరించాడా?

    మనం జాగ్రత్తగా గమనిస్తే యిర్మీయా 49వ అధ్యాయంలో, ఓబద్యా గ్రంథంలో ఉన్నమాటల్లో చాలావాటిని చూడగలం.

    ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా? (యిర్మీయా 49:9)

    చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరుకొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు. (ఓబద్యా 1:5)

    యెహోవా యొద్దనుండి నాకు వర్తమానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడియున్నాడు, కూడికొని ఆమె మీదికి రండి యుద్ధమునకు లేచి రండి. (యిర్మీయా 49:14)

    యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు. (ఓబద్యా 1:1)

    ​జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. (యిర్మీయా 49:15)

    నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. (ఓబద్యా 1:2)

    నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు. (యిర్మీయా 49:16)

    అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు. (ఓబద్యా 1:3,4)

    నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు, అతడును లేకపోవును. (యిర్మీయా 49:10)

    ఏశావు సంతతివారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును. (ఓబద్యా 1:6)

    ​యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. (యిర్మీయా 49:12)

    మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇకనెన్నడునుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు. (ఓబద్యా 1:16)

     

    దీనిని బట్టి వ్యాఖ్యానకర్తలు మూడు రకాల ఆలోచనలు కలిగి ఉన్నారు -

    1. ఓబద్యా, యిర్మీయా గ్రంథం నుండి ఈ మాటలను అనుకరించాడు (Obadiah copied from Jeremiah)

    2. యిర్మీయా, ఓబద్యా గ్రంథం నుండి ఈ మాటలను అనుకరించాడు (Jeremiah copied from Obadiah)

    3. యిర్మీయా మరియు ఓబద్యా వారికి తెలిసిన వేరొక (మనకు తెలియని)ప్రాచీన గ్రంథం నుండి ఈ మాటలను అనుకరించారు (Both of them copied from other source which is unknown to us)

    మొదటిగా, వీరిద్దరూ వేరొక గ్రంథం నుండి అనుకరించారు (copied) అన్న ఆలోచనను విశ్వసించడానికి ఆధారాలు ఏమీ లేవు. ఆ వేరొక గ్రంథం మనకు తెలీదు. ఒకవేళ ఆ విధంగానే అనుకరించినా, ఓబద్యా కేవలము ఒకే అంశం మీద ఎందుకు తన గ్రంథాన్ని రాసాడు? ఇతర ప్రవక్తలలాగా అనేక విషయాలను గురించి ప్రస్తావించి ఉండొచ్చు కదా?

    ఓబద్యా గ్రంథం ఒకే అంశం గురించి మాట్లాడుతూ, ఆ అంశానికి తగిన ప్రతి వివరణను స్పష్టంగా చూపిస్తుంది. తాను వేరొక గ్రంథాన్ని అనుకరించాడు అని అనుకుంటే, మనకు ఒక ఇబ్బంది ఎదురవుతుంది. ఒక గ్రంథకర్త ఇంకొకరిని అనుకరించినప్పుడు, కొన్ని విషయాలను ఆ అసలైన గ్రంథం నుండి తీసుకుంటాడే తప్ప, ఒకే విషయాన్ని క్షుణ్ణంగా అనుకరించరు. (if a prophet copies from other original writings, he does that to incorporate the needed things into his prophesy as relevant, it is inconceivable that the copyist would take an entire section so and so that itself seems to be an entire prophesy).

    ఈ విషయాన్ని గురించి ఏలికట్స్ కామెంటరీలో (according to Ellicott's commentary) చెప్పబడిన రెండు విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించొచ్చు

  • యిర్మీయా అనేక సందర్భాలలో ఇతర ప్రవక్తల మాటలను అవసరాన్ని బట్టి తన తన గ్రంథంలో చేర్చడం జరిగింది (ఉదాహరణకు: యిర్మీయా 49:1-6 మరియు ఆమోసు 1:13-15ను పరీక్షించండి). దీనిని బట్టి, యిర్మీయా, ఓబద్యా గ్రంథం నుండి 49వ అధ్యాయంలో మాటలను తీసుకున్నాడు అనడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.
  • ఈ రెండు గ్రంథాలని పోల్చి చూసినప్పుడు, ఓబద్యా గ్రంథం ప్రాచీనమైనదిగా అనిపిస్తుంది. ఓబద్యా గ్రంథం మరింత సంక్లుప్తమైనది, మరియు భాషాశైలిలో తక్కువ మెరుగుపెట్టబడినది. ఓబద్యా క్రమబద్ధమైన వ్యాకరణ రూపాన్ని (has an irregular grammatical form ) వాడలేదు. అంత మాత్రమే కాకుండా, ఈ గ్రంథంలో వచనాల సమాంతరతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, సులభంగా చదవగలిగే శైలిని అవలంబించకపోవడం ఈ గ్రంథం యిర్మీయా గ్రంథానికంటే ప్రాచీనమైనది అని నిరూపిస్తుంది.
  • ఉదాహరణకు: ఓబద్యా గ్రంథంలో ఈ మాటను చూస్తాం” పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.” ఇదే మాటలను యిర్మీయా ఇలా చెప్పాడు "నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు", ఇక్కడ మనం గమనిస్తే యిర్మీయా భాషాసమాంతరాన్ని వాడుతున్నాడు, (అనగా, ఎదోమీయులు కట్టుకోవడం - దేవుడు పడేయడం). అయితే ఓబద్యా ఈ భాషా సమాంతరానికి తాను చెప్పే మాటలు అడ్డం వచ్చినప్పటికీ, ఈ బలమైన దృశ్యాన్ని ఆ రెండు మాటల మధ్యలో చేర్చాడు "నక్షత్రములలో నీవు దాని కట్టినను"                                                                                 పైన చెప్పిన కారణాలను బట్టి ఓబద్యా గ్రంథమే ప్రాచీనమైనది, యిర్మీయానే ఈ గ్రంథాన్ని అనుకరించాడు అని విశ్వసించే వీలుంది.
  • ఎదోము గురించి ప్రవచించిన విధంగా, అది సర్వనాశనం అయ్యిందా?
  • ఎదోమీయులు ఏమయ్యారు అనేదాని గురించి చారిత్రకంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు:
  • యెరూషలేము పతనం అయిన దాదాపు 5 సంవత్సరాల తరువాత నియో-బాబిలోన్ ద్వారా ఎదోమీయులు నాశనం అయ్యారు, 580 BC. నాబోనిడ్స్ అనే చివరి బబులోను రాజు ఎదోము దేశాన్ని జయించాడు అని చరిత్ర చెబుతుంది.*
  • నాబాటియన్లు అనే అరబ్బు తెగవారు, ఎదోమీయులు నివసిస్తున్న పెట్రా అనే ప్రాంతం నుండి వారిని 550-449 BCలో వెళ్లగొట్టారు
  • నెహెమ్యా, తమ దేశం చుట్టూ ఉన్న శతృవుల జాబితా గురించి ప్రస్తావించినప్పుడు ఎదోము పేరు ప్రస్తావించబడలేదు, దాని స్థానంలో అరబ్ ప్రస్తావించబడింది (నెహెమ్యా 4:7-8). ఈ సమయంలో ఎదోమీయులు, నెగెవు అనే ప్రాంతానికి వెళ్లిపోయారు
  • అలెగ్జాండర్ సైన్యాధిపతి అయిన అంటిగొనున్, ఎదోమును 312 BC లో ఓడించాడు (అని డయోడరస్ సెక్యులస్ అనే గ్రీకు చరిత్రకారుడు రచించిన 'ప్రపంచ చరిత్ర' అనే పుస్తకాలలో పొందుపరచబడింది)
  • క్రీ.పూ. 175లో యూదా మక్కాబెయస్ (మత్తతియాస్ అనే యాజకుని కుమారుడు) ఎదోమును నెగెవ్‌ అనే ప్రాంతంలో ఓడించాడు. (cf. I Maccabees 5:3,15; II Maccabees 10:15; Josephus’ Antiquities of the Jews 12:8:1; 13:9:1)
  • జాన్ హైరికెన్స్ (John Hyrcanus) అనే ప్రధాన యాజకుడు మరియు పరిపాలకుడు (యూదుడు), ఎదోమీయులను యూదా మతం అంగీకరించే విధంగా బలవంతం చేసాడు. అప్పటి నుండి ఎదోమీయులు ఇదూమయులుగా పిలువబడ్డారు (from Edomites to Idumeans)
  • యేసు క్రీస్తు జన్మించిన సమయంలో ఉన్న హేరోదు రాజు ఒక ఎదోమీయుడు (ఈ హేరోదు రాజు అంటిపెటెర్ అనే ఒక అధికారి రెండవ కుమారుడు)
  • తీతు (Titus) అనే రోమన్ జనరల్, AD 70 లో ఇదూమయులు అనేవారిని సంపూర్ణంగా నాశనం చేసాడు, దాని తరువాత ఎదోమీయులు అని పిలువబడేవారు చరిత్రలో ఎక్కడా కనబడలేదు.

                                     దీనిని బట్టి ఎదోమీయుల గురించి ఓబద్యా చేసిన ప్రవచనం సంపూర్ణంగా నెరవేరింది అని గ్రహించవచ్చు. అయితే ఇదే ప్రవచనం యొక్క రెండవ కోణం, అనగా దేవుడు అన్యులను, అన్యరాజ్యాలను సంపూర్ణంగా నాశనం చేయడం, ఆయన రెండవ రాకడ సమయంలో నెరవేరుతుంది.

    *https://www.livius.org/articles/people/nabataeans/

    "రక్షకులు పుట్టుదురు" అని 21వ వచనంలో ఉన్న మాటలకు మోర్మోన్స్ (Mormons) ఇచ్చే వివరణ సరైనదేనా?

    మోర్మోన్స్ (Mormons/Later Day Saints) అనేవారు, బైబిల్ తో పాటు జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తికి దేవుడు మరి కొన్ని విషయాలను వెల్లడిపరిచాడని నమ్ముతారు. దేవుని వాక్యానికి ఏమీ కలపకూడదు, ఏమీ తీసెయ్యకూడదు అనే నియమానికి ఇది విరుద్ధంగా ఉంది. అంత మాత్రమే కాకుండా, ఇతర దేవుళ్ళు మరియు దేవతలు కూడా ఉన్నారు అని వీరు నమ్ముతారు. పరలోకపు తల్లి (Heavenly Mother) తండ్రి అయిన దేవుని భార్య అని నమ్ముతారు. అందుకే వీరు నిజమైన క్రీస్తు విశ్వాసులు అని మనం అంగీకరించలేము.

    ఏదేమైనప్పటికీ, ఓబద్యా 21వ వచనాన్ని వీరు వక్రీకరించి, "రక్షకులు పుట్టుదురు" అనే దేవుని మాటను, 'మృతుల కొరకు బాప్తిస్మము' అనే బోధతో కలిపి ఆ భావంతో వివరిస్తారు. చనిపోయినవారి కోసం బ్రతికి ఉన్నవారు బాప్తిస్మము తీసుకోవాలి అనేది వీరి సంఘ శాసనం. ఇది చేయడం ద్వారా చనిపోయినవారికి పరలోకంలో ప్రవేశం ఉంటుందని భావిస్తారు (ఇది దేవుడు జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తికి బయలుపరిచాడంట).

    ఓబద్యా 21 వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇది ఏ విధంగానూ మోర్మోన్స్ ఇచ్చే వివరణకు సమ్మతంగా లేదు. ఓబద్యా ఎదోము గురించీ , వారికి కలగబోయే నాశనాన్ని గురించీ , దేవుడు ఇశ్రాయేలును విమోచించే విషయం గురించీ (అనగా బబులోను చెరలోనుండి విమోచించే విషయం), ఎలా దేవుడే రాజ్య పరిపాలకుడో, సమస్త రాజ్యాలు దేవునివి అవుతాయో , మొదలైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. గనుక ఇక్కడ బాప్తిస్మము గురించి గాని, "రక్షకులు" అనగానే చనిపోయినవారి పక్షాన బాప్తిస్మము తీసుకొని, చనిపోయినవారిని విమోచించే రక్షకులు అనే భావం కానీ కనపడటం లేదు.

    Bibliography

    1) John Gill Commentary on Obadiah

    2) Matthew Henry Commentary on Obadiah

    3) John Gill Commentary on Obadiah

    4) Greek Interlinear (https://www.scripture4all.org/OnlineInterlinear/Greek_Index.htm)

    5) ALL THE MEN OF THE BIBLE – OBADIAH (https://www.biblegateway.com/resources/all-men-bible/Obadiah)

    6) The Treasury of Scripture Knowledge (https://biblehub.com/obadiah/1-1.htm)

    7) Obadiah Commentaries & Sermons (https://www.preceptaustin.org/obadiah_commentaries)

    8) Meaning of vison from vine’s dictionary (https://www.blueletterbible.org/search/dictionary)

    9) Obadiah Introduction (https://www.ttb.org/resources/study-guides/obadiah-study-guide)

    10) Holman bible dictionary (https://www.studylight.org/dictionaries/eng/hbd/v/vision.html)

    11) Mount Seir: The Importance of Mountains In The Bible (https://www.gantshillurc.co.uk/ministers-blog/mount-seir-the-importance-of-mountains-in-the-bible)

    12) Bible history Maps, Images, Archeology (https://www.bible-history.com/geography/maps/map_northern_negev.html)

    13) Information about Zarephath (https://www.bibleplaces.com/zarephath/)

    14) ESV study bible (esv.org)

    15) The post-exilic prophets’ commentary (http://www.ibiblio.org/freebiblecommentary/pdf/EN/VOL12OT.pdf)

    16) Biblestudytools.com

    17) Bibleatlas.org

    18) Encyclopedia.com

    19) Wordproject.org

    20) Bible Hub Commentaries (https://biblehub.com/commentaries/obadiah/1-19.htm)

    21) Grace Ministries Telugu Bible (https://graceministriesindia.com/org.grace.ministries.telugu.studybible/TSB-31-OBA-001.html)

    22) Universal Version Bible

    23) StudyLight.Org (https://www.studylight.org/commentaries/eng/ebc/obadiah.html)

    24) An Intertextual Study of The Book of Obadiah

     

  •  

    'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

    హితబోధ యాప్ కొరకు Join WhatsApp

    సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

    ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.