అంతట ఆయన మోషే ధర్మశాస్త్రము లోను ప్రవక్తల గ్రంథములలోను , కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర వలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి '' అని వారితో చెప్పెను .
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులైయుందురు.
అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.
కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.
మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.
కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.
హోరేబులో ఆ సమాజదినమున నీవు నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక,
లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.
అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమి్మనట్టయిన నన్నును నమ్ముదురు.
మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.
మోషే యిట్లనెను ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.
నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.
అందుకాయన అవివేకులారా , ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మంద మతులారా ,
అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగానడచుచున్నది .
గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును .
కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొన లేదు
ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.
నిన్ను చూచి యే మనిషిరూపముకంటె అతని ముఖమును, నరరూపముకంటె అతని రూపమును చాల వికారమని చాలమంది యేలాగు విస్మయమొందిరొ
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.
అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు?
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.
ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
తిరుగుబాటును మాన్పుటకును , పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును , అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును , నీ జనము నకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బది వారములు విధింపబడెను .
యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము . అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును .
ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు , వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను .
బేత్లెహేము ఎఫ్రాతా , యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామ మైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును ; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లనుకను వరకు ఆయన వారిని అప్పగించును , అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయు లతో కూడ తిరిగి వత్తురు./p.
ఆయన నిలిచి యెహోవా బలముపొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమునుబట్టి తన మందను మేపును . కాగా వారు నిలుతురు , ఆయన భూ మ్యంతముల వరకు ప్రబలుడగును ,
పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు .
సీయోను నివాసులారా , బహుగా సంతోషించుడి ; యెరూషలేము నివాసులారా , ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై , గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు .
ఖడ్గమా , నా గొఱ్ఱల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు -గొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును ; ఇదే యెహోవా వాక్కు.
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను ; మీరు వెదకుచున్న ప్రభువు , అనగా మీరు కోరు నిబంధన దూత , తన ఆలయము నకు హఠాత్తుగా వచ్చును ; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .
అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ? ఆయన కంసాలి అగ్నివంటివాడు , చాకలివాని సబ్బువంటివాడు ;
వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును .లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
ఫిలిప్పు నతనయేలును కనుగొనిధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను.
యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.
ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.
వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు -వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను.