
యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.
రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు.
ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్ధమిచ్చుచున్నది.
శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.
మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటుదును.
ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.
వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.
మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
యాకోబు సంతానమున యేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.
నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను
అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.
అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.
తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.
ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరుపెట్టబడును.
నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్యపరిపాలనచేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.
భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును . దాని కెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు ; అది ముందు చెప్పిన రాజ్యము లన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును .
యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము . అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును .
తరువాత ఇశ్రాయే లీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి , ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజను లనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు
పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును ; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.
బేత్లెహేము ఎఫ్రాతా , యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామ మైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును ; పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
అతనితో ఇట్లనుము-సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా-చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
సీయోను నివాసులారా , బహుగా సంతోషించుడి ; యెరూషలేము నివాసులారా , ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై , గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు .
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను ; మీరు వెదకుచున్న ప్రభువు , అనగా మీరు కోరు నిబంధన దూత , తన ఆలయము నకు హఠాత్తుగా వచ్చును ; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .
అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే
గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,
భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.