
నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.
విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచు దురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.
మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.
సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.
నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.
కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?
వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.
నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.
భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?
దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.
నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.
నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యె మాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాప క్రియలే వారు బలాత్కారము చేయువారే.
వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
శాంత వర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకర త్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచు వాడెవడును శాంతి నొందడు.
అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణ హానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి
దీనులను దరిద్రులను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లిం పకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,
అప్పి చ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదు కడు, ఈ హేయక్రియ లన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.
కాబట్టి వారికీ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా రక్తము ఓడ్చి వేయక మాంసము భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టి యుంచు మీరు, నరహత్యచేయు మీరు, ఈ దేశమును స్వతంత్రించుకొందురా?
మీరు ఖడ్గము నాధారము చేసికొనువారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు; మీవంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవీలాగున వారికి చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసుల తో వ్యాజ్యెమాడుచున్నాడు.
అబద్ధసాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్యచేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు.
కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశ పక్షులును కాపురస్థు లందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి.
నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను.
యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీ యుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.
జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానే రదని యనుకొందురు.
కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.
అందుకతడు నాతో ఇట్లనెను - ఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు - నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
తీర్పు తీర్చుటకై నేను మీయొద్ద కు రాగా, చిల్లంగివాండ్రమీదను వ్యభిచారులమీదను అప్రమాణికులమీదను, నాకు భయ పడక వారి కూలివిషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
అట్టి కార్యములు చేయు వారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.
నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా?
ఆయన చిత్త మెరిగి, ధర్మశాస్త్ర మందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?
జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి -నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,
చీకటి లో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?
ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?
వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?
ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా?
వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియేగదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?
నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.
కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?
బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీర మందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును.
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను
దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.
ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు
అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.
మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.
మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.
ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమంతట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.
ఈ పట్టణము మీద యుద్ధముచేయు కల్దీయులు వచ్చి, యీ పట్టణమునకు అగ్ని ముట్టించి, యే మిద్దెలమీద జనులు బయలునకు ధూపార్పణచేసి అన్యదేవతలకు పానార్పణములనర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసెదరు.
ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి.
పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల
అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు.
మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.