
మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.
దేవుడు మోషేతో మాటలాడెనని యెరుగుదుము గాని వీడెక్కడనుండి వచ్చెనో యెరుగమని చెప్పి వానిని దూషించిరి.
దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
–నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థ ముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.
ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను
ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు.
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
నరహత్య చేయకూడదు.
వ్యభిచరింపకూడదు.
దొంగిలకూడదు.
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.
మోషే ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది.
మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.
మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.
అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
ప్రతి నోరు మూయబడునట్లును , సర్వ లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును , ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము .
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది .
మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను . అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో ,
మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?
శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కలదగును.
అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు . ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథ మందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది .
ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.
ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను;
ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.
అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు -ప్రభువు ఇట్లనెను -ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును.
అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలైయుందురు.
వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవి .
యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను .
కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను .
ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి .
పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు .
అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు
ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.
–ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
తన సేవకుడైన దావీదు వంశము నందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా
మన శత్రువుల నుండియు మనలను ద్వేషించు వారందరి చేతి నుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను.
ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, మన జీవిత కాల మంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటవలన
తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
మన పాదములను సమాధాన మార్గము లోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను.
మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
కాబట్టి వేరొక కీర్తనయందు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవని చెప్పుచున్నాడు.
దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,
తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.
కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించుప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది ; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు .
అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై ,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది .
ఏ భేదమును లేదు ; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే , క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
క్రీస్తుయేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను . దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము , తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
నేను చెప్పునదేమనగా , పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును , అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకు డాయెను .
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములైయున్నవి.
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి.
పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్ఠమైనవికావు.
అప్పుడు నేను గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.
బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్ఠమైనవి కావనియు పైని చెప్పిన తరువాత
ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటిదానిని కొట్టివేయుచున్నాడు.
యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.
వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను. మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము,
దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దానఫలము అనుభవింప లేదు.
ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
ఆ పెద్దలు-నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి.
సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి -ఆమేన్;
యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.
పెద్దలలో ఒకడు -తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను -వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.