
యెహోవా , నీ కార్యములు ఎంత దొడ్డవి ! నీ ఆలోచనలు అతిగంభీరములు ,
యెహోవా , నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది .
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.
తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.
ఆయన ఊపిరి విడువగా ఆకాశవిశాలములకు అందము వచ్చును.ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను.
ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలిమెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా.గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు?
అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి?నీకు వివేకముకలిగియున్నయెడల చెప్పుము.
నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
దానిమీద పరిమాణపు కొలవేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
సముద్రము దాని గర్భమునుండి పొర్లిరాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?
దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును
అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును.
దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధదినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా?
జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞఇయ్యగలవా?
మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు?
జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?
ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొనునప్పుడు తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా?
నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?
బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా?
దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకముచేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.
దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.
దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?
నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే గదా
దాని అవయవములను గూర్చియైనను దాని మహాబలమును గూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చియైనను పలుకక మౌనముగానుండను.
ఎవడైన దానిపై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు
దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడియున్నవి.
అవి ఒకదానితో ఒకటి హత్తుకొనియున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.
ఒకదానితో ఒకటి అతకబడియున్నవి భేదింప శక్యముకాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొనియున్నవి.
అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలెనున్నవి
దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును.
ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగుచున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును.
దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.
దాని గుండె రాతివలె గట్టిగానున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.
దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు.
ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.
దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
దాని క్రిందిభాగములు కరుకైనచిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును.
కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును తైలమువలె చేయును.
అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.
అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.
అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.
తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు ? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు ? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు ? తూనికచేత కొండలను తూచినవాడెవడు?
యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
నీవు వేవేలమందికి కృపచూపుచు, తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు.
ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలనుబట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికి ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులార చూచుచున్నావు.
ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి , ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ; ఆయన ఆధిపత్యము తర తరములు నిలుచుచున్నది.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.
వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;
యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును
నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.
యెహోవా , నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది .
ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను .
బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక .
పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను
మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొనునట్లు ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసియున్నాడు.
దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.
మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలనుగూర్చియు,
వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి.
పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
ఎందుకనగా యెహోవా , నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను .
బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?
వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును.
నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను .
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.