
ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు .
మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమైయుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను.
యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు వచ్చెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను.
దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా.)
భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను.
నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది .
యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి .
కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేసెను .
కొండలారా , మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా , మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?
గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.
నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక.
పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును , లోయలు విడిపోవును , వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,
ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను;
మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథమువలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలెనుండెను.
ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి
వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.
మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశముచేసెను.
నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే
పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను.
యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.
ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరు తెలిసికొనుటకును,
మీరు ఎల్లప్పుడును మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.
మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.
యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితివిు.
నీ బలముచేత సముద్రమును పాయలుగాచేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి.
మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి
దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.
మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
నీ మార్గము సముద్రములోనుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడకయుండెను.
సముద్రము దానని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను .
కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేసెను .
సముద్రమా , నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దానూ , నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది?
కొండలారా , మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా , మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?
భూమీ , ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము
ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు .
ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను ఆయన కృప నిరంతరముండును.
ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసికొనెను. తన మంద కాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చిన వాడేడి ?
తమలో తన పరిశు ద్ధాత్మను ఉంచిన వాడేడి ? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి ?
తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి ? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి
విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండిపోయెను.
పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి.
వరదలు ఎలుగెత్తెను యెహోవా , వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక .
పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక . వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.
భూజనులకు తీర్పుతీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతనుబట్టి జనములకు ఆయన తీర్పుతీర్చును .
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులును కేకలువేయుదురు గాక.
ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక.
నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.