మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.
తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.
ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.
మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,
నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
మనము పిల్లల మైతే వారసులము , అనగా దేవుని వారసులము ; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల , క్రీస్తుతోడి వారసులము .
అంతే కాదు ; శ్రమ ఓర్పును , ఓర్పు పరీక్షను , పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
శ్రమల యందును అతిశయపడుదము .
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు . మనకు అనుగ్రహింపబడిన పరిశు ద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయము లలో కుమ్మరింపబడియున్నది .
నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
ఇవ న్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి , నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసికొనిపోయి , సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు .
ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును .
కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి .
మీ విరోధు లందరు ఎదురాడుటకును , కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును .
తలిదండ్రుల చేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు ; వారు మీలో కొందరిని చంపింతురు ;
నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు .
గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశిం పదు .
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.
మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.
మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక
శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,
పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.
మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము;
దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియులేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువదిదెబ్బలు తింటిని;
ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.
ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.
ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమి్మనవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు , అందరు నన్ను విడిచిపోయిరి ; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక.
అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజను లందరును దాని విను నిమిత్తమును , ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని .
ప్రభువు ప్రతి దుష్కా ర్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును . యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్ .
మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.
మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.
మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము
ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.
మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారి యందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?
వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.
మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.
క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను -వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.