నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమి్మన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చినయెడల తన సహోదరుడు అమి్మనదానిని అతడు విడిపించును.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు.
నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.
దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.
తన పొరుగువాని తిరస్కరించువాడు పాపముచేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు.
బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు.
బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను.
బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే గదా?
దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
మీరైతే ఎట్టి వారిని గూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పుంపుటకు నిశ్చయించుకొనెను.
పరిశుద్ధులకొరకైన యీ పరిచర్యనుగూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.
ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.
ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.
చెప్పశక్యముకాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.
మేము బీదలను జ్ఞాపకముచేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని.
ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులైయుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులైయుంటిరిగదా.
ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.