ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను.
మరియు యెహోవా మోషే తో ఇట్లనెను నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి , నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణముచేసి నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశము నకు లేచిపొండి .
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగానుండును.
నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;
అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.
ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.
నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.
వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.
మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు
నీవు అహరోనును చూచి నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడవేయుమనుము; అది సర్పమగును.
కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్పమాయెను.
అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.
వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా
యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.
తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను
నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రదికెనా?
మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నులయెదుట చేసినవాటన్నిటిచొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బాహుబలముతోను చాచిన చేతితోను మహా భయంకరకార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములోనుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా?
అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.
నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను; భూమిమీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్యనుండి ఆయన మాటలను నీవు వింటిని.
ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను.
నీవు నీ కుమారునితో ఇట్లనుము మనము ఐగుప్తులో ఫరోకు దాసులమైయుండగా యెహోవా బాహుబలముచేత ఐగుప్తులోనుండి మనలను రప్పించెను.
మరియు యెహోవా ఐగుప్తుమీదను ఫరోమీదను అతని యింటివారందరిమీదను బాధకరములైన గొప్ప సూచకక్రియలను అద్భుతములను మన కన్నులయెదుట కనుపరచి,
ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహుగర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.
మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశముచేసెను.
నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలెనుండెను.
మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.
ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగుకొనగా
అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి,
తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను.
ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా
యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.
మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలైయుండవలెననెను.
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.
యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటివారము? మామీద సణుగనేల అనిరి.
మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
అంతట మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని
నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.
ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలు దేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.
వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి.
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.
అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా
యెహోవా మోషేతో నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని
మూడవనాటికి సిద్ధముగానుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.
నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.
ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలెననెను.
అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి.
అప్పుడతడు మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమైయుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.
యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను
వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.
నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.
ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.
యెహోవా నోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.
ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి.
మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి.
ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.
ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.
యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.
జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.
జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.
యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను.
వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు?
ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.
ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.
ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.
రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.
జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.
కాగా మోషే యెహోవాతో యిట్లనెను నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?
నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.
ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు
ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.
నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియు అధిపతులనియునీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.
నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.
నీవు జనులను చూచి యిట్లనుము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసముపెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.
ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.
ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.
అందుకు మోషే నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.
వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.
మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా
యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.
ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.
అప్పుడు ఒక ¸యవనుడు మోషే యొద్దకు పరుగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా
మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.
అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి.
తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండుమూరల యెత్తున వాటిని పడజేసెను.
కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.
ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.
మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతుహత్తావా అను పేరు పెట్టబడెను.
జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమై పోయి హజేరోతులో దిగిరి.
అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.
మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి.
ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.
వారుమనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా
మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజసంఘము ఎదుట సాగిలపడిరి.
అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని
ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతోమేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.
యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా
ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయుల కందరికి కనబడెను.
యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు?
నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా
మోషే యెహోవాతో ఇట్లనెను ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.
యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.
కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు
ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును
దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక
యెహోవా నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.
అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.
నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు.
నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.
అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను.
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను.
నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.
మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్కమొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు.
యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు;
అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును.
మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు.
మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.
ఇది యెహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను.
ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు,
అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.
అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.
మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.
వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కిచిత్తమండి, మేము పాపము చేసినవారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.
అప్పుడు మోషే ఇది ఏల? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి?
అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.
ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.
అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు.
అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి.
లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను
తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చుకొనును.
ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.
అప్పుడు యెహోవాయే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.
మరియు మోషే కోరహుతో ఇట్లనెను లేవి కుమారులారా వినుడి.
తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా?
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.
అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.
మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.
మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.
జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు
అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?
ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.
అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.
అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నులయెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.
యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను.
తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.
అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.
అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున దేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది;
మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితివిు; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి.
మేము యెహోవాకు మొఱపెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.
మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజ మార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను.
ఎదోమీయులు నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా
ఇశ్రాయేలీయులు మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదనెను.
అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను.
ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్దనుండి తొలగిపోయిరి.
నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీయెదుట వణకి మనోవేదన నొందుదురు.
అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి
నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.
నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.
శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.
అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.
అప్పుడు యెహోవా చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను.
సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా
మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి
ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.
పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.
అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.
అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.
ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి.
సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.
వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.
వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.
వారు ఒక పోతదూడను చేసికొని ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను
వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొనిపోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.
వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.
నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.
ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.