prophesied
లేవీయకాండము 26:14-46
14

మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక

15

నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,

16

నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

17

నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

18

ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

19

మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

20

మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును.

21

మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.

22

మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతానరహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

23

శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

24

నేనుకూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.

25

మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.

26

నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తిపొందరు.

27

నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల

28

నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.

29

మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

30

నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

31

నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడుచేసెదను; మీ సువాసనగలవాటి సువాసనను ఆఘ్రాణింపను.

32

నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

33

జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.

34

మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.

35

అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.

36

మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

37

తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేకపోయెదరు.

38

మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.

39

మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

40

వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

41

నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,

42

నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

43

వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు.

44

అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

45

నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

46

యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

ద్వితీయోపదేశకాండమ 4:26

మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.

ద్వితీయోపదేశకాండమ 4:27

మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.

ద్వితీయోపదేశకాండమ 28:15-68
15

నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

16

పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;

17

నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;

18

నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱ మేకల మందలు శపింపబడును;

19

నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.

20

నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.

21

నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింపజేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.

22

యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.

23

నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.

24

యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.

25

యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.

26

నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.

27

యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్టుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.

28

వెఱ్ఱితనముచేతను గ్రుడ్డితనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.

29

అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించువాడెవడును లేకపోవును,

30

స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.

31

నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱ మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు.

32

నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్ల చూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

33

నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.

34

నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.

35

యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడలమీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును.

36

యెహోవా నిన్నును నీవు నీమీద నియమించుకొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమునకప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు

37

యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.

38

విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చుకొందువు; ఏలయనగా మిడతలుదాని తినివేయును.

39

ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.

40

ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.

41

కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.

42

మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.

43

నీ మధ్యనున్న పరదేశి నీ కంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.

44

అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.

45

నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.

46

మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.

47

నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు

48

గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.

49

యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,

50

క్రూరముఖము కలిగి వృద్ధులను ¸యౌవనస్థులను కటాక్షింపని జనమును గద్ద యెగిరి వచ్చునట్లు నీమీదికి రప్పించును.

51

నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునే గాని పశువుల మందలనేగాని గొఱ్ఱ మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.

52

మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడివేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడివేయుదురు.

53

అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.

54

మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్యయెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున

55

అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలినదేమియు ఉండదు.

56

నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును

57

అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమారముచేతను నేలమీద తన అరకాలు మోపతెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటియెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తెయెడలనైనను కటాక్షము చూపకపోవును.

58

నీవు జాగ్రత్తపడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల

59

యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునైయుండును.

60

నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.

61

మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.

62

నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు.

63

కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు.

64

దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.

65

ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

66

నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.

67

నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.

68

మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.

ద్వితీయోపదేశకాండమ 29:18-28
18

ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను.

19

అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.

20

అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.

21

ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపరచును.

22

కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి

23

వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకముచేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి

24

యెహోవా దేనిబట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

25

మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి

26

తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్కరించిరి

27

గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.

28

యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.

ద్వితీయోపదేశకాండమ 31:16

యెహోవా మోషేతో యిట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.

ద్వితీయోపదేశకాండమ 31:17

కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.

ద్వితీయోపదేశకాండమ 32:15-44
15

యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.

16

వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి

17

వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.

18

నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.

19

యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.

20

ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.

21

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

22

నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.

23

వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.

24

వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.

25

బయట ఖడ్గమును లోపట భయమును ¸యవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలుగలవారిని నశింపజేయును.

26

వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో

27

ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.

28

వారు ఆలోచనలేని జనము వారిలో వివేచనలేదు.

29

వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.

30

తమ ఆశ్రయదుర్గము వారిని అమి్మవేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?

31

వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు.

32

వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి.

33

వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము.

34

ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా? నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?

35

వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.

36

వారి కాధారము లేకపోవును.

37

నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును యెహోవా చూచును తన సేవకులనుగూర్చి సంతాపపడును.

38

నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవతలేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.

39

ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

40

నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను

41

నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.

42

చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.

43

జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.

44

మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.

1 సమూయేలు 2:27-32
27

అంతట దైవజను డొకడు ఏలీ యొద్దకు వచ్చి యిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా , నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని .

28

అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రము లలోనుండి నే నతని ఏర్పరచుకొంటిని . ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని యింటివారి కిచ్చితిని .

29

నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు ? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.

30

నీ యింటివారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదు రని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయె నని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు . కావున యెహోవా వాక్కు ఏదనగా-నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును . నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు .

31

ఆలకించుము ; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును . నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును .

32

యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు . ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉం డడు .

1 సమూయేలు 3:11-14
11

అంతట యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను -ఇశ్రాయేలులో నే నొకకార్యము చేయబోవుచున్నాను ; దానిని విను వారందరి చెవులు గింగురుమనును .

12

ఆ దినమున ఏలీ యొక్క యింటి వారినిగురించి నేను చెప్పిన దంతయు వారిమీదికి రప్పింతును . దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును .

13

తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించ లేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను .

14

కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని.

1 రాజులు 14:7-15
7

నీవు వెళ్లి యరొబాముతో చెప్పవలసినదేమనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలోనుండి తీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి

8

దావీదు సంతతి వారియొద్దనుండి రాజ్యమును తీసి నీకిచ్చి యుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక

9

నీ కంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి యున్నావు.

10

కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలము చేసి,పెంటఅంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును.

11

పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చి యున్నాడు.

12

కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చనిపోవును;

13

అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.

14

ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింపబోవుచున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.

15

ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదరగొట్టును.

1 రాజులు 17:1

అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీయుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.

1 రాజులు 21:18-24
18

నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలురాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము, అతడు నాబోతుయొక్క ద్రాక్షతోటలో ఉన్నాడు; అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను.

19

నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.

20

అంతట అహాబు ఏలీయాను చూచి నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి.

21

అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతును.

22

ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

23

మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.

24

పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను

1 రాజులు 22:8

అందుకు ఇశ్రాయేలు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతు రాజైన మీరు ఆలాగనవద్దనెను.

యెషయా 5:1-8
1
నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను
2
ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను.ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను
3
కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.
4
నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?
5
ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను
6
అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.
7
ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.
8
స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.
యెషయా 6:9-12
9
ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.
10
వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
11
ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును
12
యెహోవా మనుష్యులను దూరముగా తీసికొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.
యెషయా 13:18
వారి విండ్లు ¸యవనస్థులను నలుగగొట్టును గర్భఫలమందు వారు జాలిపడరు పిల్లలను చూచి కరుణింపరు.
యెషయా 24:1-23
1
ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.
2
ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలు గును.
3
దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు
4
దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.
5
లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.
6
శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.
7
క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను
8
ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.
9
పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను
10
నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది.
11
ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.
12
పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.
13
ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.
14
శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్న వారు కేకలువేయుదురు.
15
అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహో వాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.
16
నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీత ములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.
17
భూనివాసీ, నీమీదికి భయము వచ్చెను గుంటయు ఉరియు నీకు తటస్థించెను
18
తూములు పైకి తీయబడియున్నవి భూమి పునాదులు కంపించుచున్నవి
19
భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది భూమి కేవలము తునకలై పోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది
20
భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది పాకవలె ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి యికను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును.
21
ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమిమీదనున్న భూరాజులను దండించును
22
చెరపట్టపడినవారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు.
23
చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యములకధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును.
యోవేలు 1:2-20
2

పెద్దలారా , ఆలకించుడి దేశపు కాపురస్థులారా , మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా ?

3

ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి . వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు .

4

గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి .పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి .

5

మత్తులారా , మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారస పానము చేయువారలారా , రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను ,

6

లెక్క లేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది .

7

అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసి యున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను

8

పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము .

9

నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను . యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు .

10

పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను .

11

భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా , సిగ్గునొందుడి .ద్రాక్షతోట కాపరులారా , రోదనము చేయుడి .

12

ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడిపోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్ల న్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను .

13

యాజకులారా , గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి . బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా , రోదనము చేయుడి . నా దేవుని పరిచారకులారా , గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండ నిలిచిపోయెను .

14

ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి . యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జను లందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి .

15

ఆహా , యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము ! అది ప్రళయమువలెనే సర్వశక్తుని యొద్దనుండి వచ్చును .

16

మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను .

17

విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది పైరు మాడిపోయి నందున ధాన్యపుకొట్లు వట్టి వాయెను కళ్లపుకొట్లు నేలపడియున్నవి .

18

మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱ మందలు చెడిపోవుచున్నవి .

19

అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోట చెట్ల న్నిటిని కాల్చివేసెను యెహోవా , నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.

20

నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి .

యోవేలు 3:1-11
1

ఆ దినములలో, అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున

2

అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆ యా దేశముల లోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.

3

వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?

4

తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి ? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా ? మీరు నా కేమైన చేయుదురా ?

5

నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి

6

యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.

7

ఇదిగో మీరు చేసినదానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును

8

మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును ; వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు ; యెహోవా సెలవిచ్చిన మాట యిదే .

9

అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి , బలాఢ్యులను రేపుడి , యోధు లందరు సిద్ధపడి రావలెను .

10

మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి , మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి ; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొన వలెను .

11

చుట్టుపట్లనున్న అన్యజనులారా , త్వరపడి రండి ; సమకూడి రండి . యెహోవా , నీ పరాక్రమ శాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము .

మీకా 3:8-12
8

నేనైతే యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై , యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను .

9

యాకోబు సంతతివారి ప్రధానులారా , ఇశ్రాయేలీ యుల యధిపతులారా , న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి .

10

నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు . దుష్టత్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.

11

జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు , ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా , యే కీడును మనకు రానే రదని యనుకొందురు .

12

కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును , మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.

నహూము 1:1-3
1

నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూ మునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

2

యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.

3

యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.

ఆమోసు 1:2

అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు , యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు ; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి , కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది .