మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి .
తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయ పడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును .
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయ మొందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు
నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.
నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.
శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా , ఉత్సాహధ్వని చేయుము భూమీ , సంతోషించుము పర్వతములారా , ఆనందధ్వని చేయుడి.
అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది .
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను .
చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట విను వాడెవడు ? వెలుగు లేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను .
యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును
నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు ?
మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.
వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రవ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.
ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.
నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు?
నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును.
నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
నీవు విసర్జింపబడుటనుబట్టియు ద్వేషింపబడుటనుబట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహు తరములకు సంతోషకారణముగాను చేసెదను.
యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.
నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.
ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.
ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును.
నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.
నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.
ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును
యెహోవా హిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతు లందరిని ఓదార్చుటకును
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు . యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును .
ఆలకించుడి, భూ దిగంతములవరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు ఇదిగో రక్షణ నీయొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనే యున్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసికొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడి .
పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును . యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింప బడని పట్టణమనియు నీకు పేరు కలుగును .
కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు
నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.
యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి
ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.
ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
మరియు అతడు వారితోనిట్లనెను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానముచేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధముచేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవినిబెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.
జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడిఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
యెహోవా యాకోబు వంశస్థులను విమోచించు చున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు
వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.
క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.
సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.
తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;
నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.
సీయోను నివాసులారా , బహుగా సంతోషించుడి ; యెరూషలేము నివాసులారా , ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై , గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు .
దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.
కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి.
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,
మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.