యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శచేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.
నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని ; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను ;
ఇంక పది హేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను . మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండ విడిపించెదను .
హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.
ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.
మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱలమందలను పసులమందలను అతడు సంపాదించెను.
సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.
అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును
జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.
తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.
జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.
వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము
మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు.
దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములు గలవారిచేత దాని అధికారము స్థిరపరచబడును.
బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.
వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.
న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.
జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.
పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.
ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి; దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను;
అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
బుద్ధిహీనులలో ఏలువాని కేకలకంటె మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు.
యుద్ధా యుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము; ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును.
నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?
అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.
యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?
నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి
యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.
ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.
రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా
యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.
యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు .
వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
కలిమియు సంపదయు వాని యింటనుండును వాని నీతి నిత్యము నిలుచును .
నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.
దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియులేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానము తో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును .
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.