మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
1 కొరింథీయులకు 8:1

విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

1 కొరింథీయులకు 12:31

కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

1 కొరింథీయులకు 13:1-13
1

మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.

2

ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

3

బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

4

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;

5

అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

6

దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.

7

అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

8

ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;

9

మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని

10

పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.

11

నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.

12

ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.

13

కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

1 కొరింథీయులకు 14:1

ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.

యోహాను 13:34

మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.

యోహాను 13:35

మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

యోహాను 15:17

మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.

రోమీయులకు 13:8-10
8

ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు . పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు .

9

ఏలాగనగా వ్యభిచరింప వద్దు , నరహత్య చేయవద్దు , దొంగిల వద్దు , ఆశింప వద్దు అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలె నను వాక్యము లో సంక్షేపముగా ఇమిడియున్నవి .

10

ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే .

రోమీయులకు 14:15
నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖంచిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొనువాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడు చేయకుము .
గలతీయులకు 5:13

సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

గలతీయులకు 5:14

ధర్మశాస్త్రమంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.

గలతీయులకు 5:22

అయితే ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

ఎఫెసీయులకు 4:1-3
1

కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

3

ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

ఫిలిప్పీయులకు 2:1-3
1

కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల

2

మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

3

కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు

1 థెస్సలొనీకయులకు 3:6

తిమోతియు ఇప్పుడు మీ యొద్దనుండి మాయొద్దకు వచ్చి,మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను.

1 థెస్సలొనీకయులకు 3:12

మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,

1 థెస్సలొనీకయులకు 4:9

సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.

1 థెస్సలొనీకయులకు 4:10

ఆలాగుననే మాసిదోనియ యందంతట ఉన్న సహోదరులందరిని మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరియొక్కువగా అభివృద్ధినొందుచుండవలెననియు,

2 థెస్సలొనీకయులకు 1:3

సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.

1 తిమోతికి 1:5

ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.

హెబ్రీయులకు 13:4

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

1 పేతురు 4:8

ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.

2 పేతురు 1:7

భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.

1 యోహాను 4:7

ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.

1 యోహాను 4:8

దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.