నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము.
ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించు చున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు
ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకముచేతను మహా రౌద్రముచేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను.
నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.
మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పించును.
నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచుకొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింపజేయును.
కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి , మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి , ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను .
ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
తప్పిపోయిన దానిని నేను వెదకుదును , తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును , దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును ; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను .
నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.
విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా ?
మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలకలు చేయుట మీకుచాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా ? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా ?
కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱెలకును చిక్కిపోయిన గొఱ్ఱెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.
మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదరగొట్టెదరు.
నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.
వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.
యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.
మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును.
వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను,దీవెనకరమగు వర్షములు కురియును,
ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయము లేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.
మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.
అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలునగు మీరు మనుష్యులు , నేను మీ దేవుడను ; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు .
నేను అన్యజనుల లోనుండి మిమ్మును తోడుకొని , ఆ యా దేశములలో నుండి సమకూర్చి , మీ స్వదేశము లోనికి మిమ్మును రప్పించెదను .
ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణ చేయనిత్తును , గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను .
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి
వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద
వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతిక్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును.
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు.
మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.
నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.
నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.
వారియందు అన్యజనులనేకముల యెదుట నన్ను పరిశుద్ధ పరచుకొందును.
అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియ్యక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతినిబట్టి నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును , పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు , ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు , వనములు వేసి వాటి పండ్లను తిందురు .
వారి దేశ మందు నేను వారిని నాటుదును , నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు .
ఆ దినమందు అష్షూరుదేశము నుండియు , ఐగుప్తుదేశపు పట్టణములనుండియు , ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసునది వరకు ఉన్న ప్రదేశమునుండియు, ఆ యా సముద్రముల మధ్యదేశములనుండియు, ఆ యా పర్వతముల మధ్యదేశములనుండియు జనులు నీయొద్దకు వత్తురు .
ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,
ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను , మునుపు విస్తరించి నట్లు వారు విస్తరించుదురు .
అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసికొందురు, వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు ,
ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి , యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశము లోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.
యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచి వేయును, నైలునది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును , అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేబడును ,ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు .
నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు .