
ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.
యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.
ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని – నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.
యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత
నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింపకూడదు,
ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను.
దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్టబడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును.
అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.
వీరు, అనగా హీత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులనులేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశముక్రిందనుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.
ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.
శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.
వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.
శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.
ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.
కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.
నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుము–రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు; మీరు దానిని మీ మధ్య నుండకుండ నిర్మూలము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు.
అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా–నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల
నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహనబలిగా దాని నర్పించెదననెను.
అప్పుడు ఇశ్రాయేలీయులు–ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.
మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.
ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి.
నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.
జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను.
జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు.
అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము విన లేదు. గనుక తన చేతి కఱ్ఱ చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.
జనులలో ఒకడు–నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి–ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి యున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.
అందువలన సౌలు–జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.
నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను.
మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.
అప్పుడు సౌలు–ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి.
నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను–నా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.
అందుకు సౌలు–యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
అయితే జనులు సౌలుతో–ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
కాబట్టి నీవు పోయి కనిక రింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను.
మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా
సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి–మరణ శ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా
సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.
అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి–శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.
వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.
పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు
ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథ మందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను;