మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు.
నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి
ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము.
ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.
బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయులదేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి.
బబులోను దేశములో నివాసివగు సీయోనూ , అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా-మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు.
మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని నా -ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.
మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,
నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.
ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల
నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన
సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల
నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.
మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పించును.
కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.
మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయముచేయవలెనని ఆజ్ఞాపించెను.
అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.
నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు, యెరూషలేమును గూర్చియు నేను వారి నడుగగా
వారుచెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి.
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.
నేను మిగుల భయపడి రాజు చిరంజీవియగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడియుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.
అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థనచేసి
రాజుతో నీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని .
అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి , ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని .
ప్రభువా , మా పాపములను బట్టియు మా పితరుల దోషమునుబట్టియు , యెరూషలేము నీ జనుల చుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పదమైనది . యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ; ఆ పట్టణముమీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతికార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొనుచున్నాను.
ఇప్పుడైతే మా దేవా , దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి , ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము.
నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు . మా దేవా , చెవి యొగ్గి ఆలకింపుము ; నీ కన్నులు తెరచి , నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును , నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము .
ప్రభువా ఆలకింపుము , ప్రభువా క్షమింపుము , ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము . నా దేవా , యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే ; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.