
ఆ దినమున మీరీలాగందురు యెహోవా, నీవు నామీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించియున్నావు.
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు
యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి.
యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.
యెహోవా, నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించెదను నీ నామమును స్తుతించెదను నీవు అద్భుతములు చేసితివి, సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి
ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.
ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.
అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును .
వారి తలల మీద నిత్యా నందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును .
సీయోనూ , సువార్త ప్రటించుచున్నదానా , ఉన్నత పర్వతము ఎక్కుము యెరూషలేమూ , సువార్త ప్రకటించుచున్నదానా , బలముగా ప్రకటించుము భయ పడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము .
సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా , ద్వీపములారా , ద్వీప నివాసులారా , యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూ దిగంతములనుండి ఆయనను స్తుతించుడి .
అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.
ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక
యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా , ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా , ఆర్భాటము చేయుడి పర్వతములారా , అరణ్యమా , అందులోని ప్రతి వృక్షమా , సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషా నందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును .
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.
యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి యెహోవా తన జనులను ఆదరించెను యెరూషలేమును విమోచించెను.
గొడ్రాలా, పిల్లలు కననిదానా , జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.
వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమునుయెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతర ముండును, సైన్యములకధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరల వినబడును; యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసికొని వచ్చువారి స్వరమును మరల వినబడును; మునుపటివలె ఉండుటకై చెరలోనున్న యీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు
సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.
తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;
నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.
ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,
ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.